1

1 మనుష్యుని నుండియైనను, మనుష్యుని ద్వారానైనను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను అపొస్తలుడైన పౌలు నుండియు,

2 మరియు నాతో ఉన్న యితర సోదరుల నుండియు, గలతీయలో ఉన్న సంఘాలకు:

3 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక!

4 ప్రస్తుతం మనము అనుభవిస్తున్న చెడుకాలం నుండి రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్ఛను పూర్తి చేసాడు.

5 దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! ఆమేన్.

6 తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.

7 నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు.

8 నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక.

9 మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!

10 నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు.

11 సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి.

12 నేనా సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.

13 నేను యూదునిగా ఎట్లా జీవించానో మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు.

14 నేను యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరికన్నా చురుకైనవాడను. నా పూర్వీకుల సాంప్రదాయాల విషయంలో నాకు చాలా పట్టుదల ఉంది.

15 కాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కూమారుణ్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు.

16 నేను యూదులు కానివాళ్ళకు తన కుమారుని గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. నేనీ విషయంలో మరొక వ్యక్తిని సంప్రదించ లేదు.

17 నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్న వాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను.

18 మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో పదిహేను రోజులు గడిపాను.

19 ఆ సమయంలో ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపొస్తలులెవరూ నాకు కనిపించలేదు.

20 నేను అబద్ధం వ్రాయటంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను.

21 ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు వెళ్ళాను.

22 యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు.

23 “ఇదివరలో మన వాళ్ళను హింసించిన వ్యక్తి యిప్పుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం చెయ్యాలని చూసాడు” అని యితర్లు అనగా వాళ్ళు విన్నారు. మరియు

24 నా గురించి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.

2

1 పద్నాలుగు సంవత్సరాల తర్వాత బర్నబాతో కలిసి నేను మళ్ళీ యెరూషలేము వెళ్ళాను. తీతు కూడా నా వెంట ఉన్నాడు.

2 దేవుడు ఆదేశించటం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యూదులు కాని వాళ్ళకు నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం చేస్తున్న సేవ, యిదివరకు చేసిన సేవ వ్యర్థంకాకూడదని నా అభిప్రాయం.

3 నా వెంటనున్న తీతు గ్రీకు దేశస్థుడైనా సున్నతి చేయించుకోమని వాళ్ళు బలవంతం చెయ్యలేదు.

4 మాలో కొందరు దొంగ సోదరులు చేరారు. వాళ్ళలో కొందరు తీతు సున్నతి పొందాలని బలవంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్ళు గూఢచారులుగా సంఘంలో మేము యేసుక్రీస్తులో విశ్వాసులముగా అనుభవిస్తున్న స్వాతంత్ర్యాన్ని పరిశీలించాలని వచ్చారు. మమ్మల్ని మళ్ళీ బానిసలుగా చెయ్యాలని వాళ్ళ ఉద్దేశ్యం.

5 సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు.

6 సంఘంలో ముఖ్యమైన వాళ్ళలా కనిపించే వాళ్ళు, వాళ్ళ అంతస్థు ఏదైనా సరే నేను లెక్క చెయ్యను. అంతేకాక అంతస్థును బట్టి దేవుడు తీర్పు చెప్పడు, నేను చెప్పిన సందేశాన్ని మార్చలేదు.

7 పైగా యూదులకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినట్లే, యూదులు కాని వాళ్ళకు బోధించే బాధ్యత నాకివ్వబడిందని వాళ్ళు గమనించారు.

8 పేతురు యూదులకు అపొస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్లే, అపొస్తలుడనుగా యూదులు కాని వాళ్ళ కోసం నేను చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు.

9 ముఖ్యమైన వాళ్ళని పేరు పొందిన యాకోబు, కేఫా, యోహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి నాకు, బర్నబాకు సహాయం చెయ్యటానికి అంగీకరించారు. మేము యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్ళేటట్లు, వాళ్ళు యూదుల దగ్గరకు వెళ్ళేటట్లు నిర్ణయించుకొన్నాము.

10 మేము పేదవాళ్ళకు సహాయం చెయ్యాలని మాత్రం వాళ్ళు కోరారు. మాకును అదే అభిలాష వుంది.

11 పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అతని తప్పు స్పష్టంగా కనిపించటం వల్ల అది నేను అతని ముఖం ముందే చెప్పాను.

12 ఇదివరలో ఏం జరిగిందంటే యాకోబు దగ్గరనుండి కొందరు వ్యక్తులు పేతురు దగ్గరకు వెళ్ళారు. అప్పటి దాకా పేతురు యూదులు కానివాళ్ళతో కలిసి తింటూవుండేవాడు. కాని, వాళ్ళు రాగానే సున్నతి గుంపుకు చెందిన వాళ్ళకు భయపడి వాళ్ళతో కలిసి తినటం మానుకొని వాళ్ళకు దూరంగా వెళ్ళాడు.

13 మిగతా యూదులు కూడా అతడు చేస్తున్న ఈ వంచనలో పాల్గొన్నారు. దీని ప్రభావం వల్ల బర్నబా కూడా తప్పుదారి పట్టాడు.

14 సువార్త బోధించిన విధంగా వాళ్ళు నడుచుకోవటం లేదని నేను గ్రహించి పేతురుతో అందరి ముందు, “నీవు యూదుడుకాని వానివలె జీవిస్తున్నావు. మరి అలాంటప్పుడు యూదులు కాని వాళ్ళను యూదుల సాంప్రదాయాల్ని అనుసరించుమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు?” అని అడిగాను.

15 పుట్టుకతో మనము యూదులము. యూదులు కాని వాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు.

16 ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతిమంతుడు కాడని, యేసుక్రీస్తును విశ్వసించటం వల్ల మాత్రమే ఒకడు నీతిమంతుడౌతాడని మనకు తెలుసు. ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరూ నీతిమంతులుగా కాలేరు. కనుక మనం కూడా ధర్మశాస్త్రం వల్ల కాకుండా యేసుక్రీస్తు పట్ల మనకున్న విశ్వాసం వల్ల నీతిమంతులం కావాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని విశ్వసించాము.

17 మనము క్రీస్తు వల్ల నీతిమంతులం కావాలని ఆయన్ని విశ్వసించామంటే దాని అర్థం మనం పాపులమనే కాదా! అంటే క్రీస్తు పాపానికి తోడ్పడుతున్నాడా? ఎన్నటికీ కాదు.

18 నేను వదిలివేసిన ధర్మశాస్త్రాన్ని నేనే మళ్ళీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాణ్ణవుతాను.

19 నేను దేవుని కోసం జీవించాలని ధర్మశాస్త్రం పట్ల మరణించాను. ధర్మశాస్త్రమే నన్ను చంపింది.

20 నేను క్రీస్తుతో సహా సిలువ వేయబడ్డాను. కాబట్టి నేను జీవించటం లేదు. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఈ దేహంలో నన్ను ప్రేమించి నా కోసం మరణించిన దేవుని కుమారుని పట్ల నాకున్న విశ్వాసంవల్ల నేను జీవిస్తున్నాను.

21 దేవుని దయను నేను కాదనలేను. ధర్మశాస్త్రం వల్ల ఒకడు నీతిమంతుడు కాగలిగితే మరి క్రీస్తు ఎందుకు మరణించినట్లు?

3

1 గలతీయ ప్రజలారా! మీరు అవివేకులు. మిమ్ములను ఎవరు మోసగించారు? యేసు క్రీస్తు సిలువకు వేయబడినదానిలో వున్న అర్థం మీ కళ్ళ ముందు స్పష్టంగా చిత్రించాము.

2 మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగనివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటం వల్ల మీరు పరిశుద్ధాత్మను పొందారా? లేక సువార్త విశ్వసించటం వల్ల పొందారా?

3 మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా?

4 మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను.

5 దేవుడు పరిశుద్ధాత్మను పంపి మీ కోసం మహత్కార్యాలు చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుకా? లేక సువార్తను విశ్వసించినందుకా?

6 అబ్రాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి విశ్వసించాడు. కనుక దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”

7 కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము కుమారులని గ్రహించండి.

8 యూదులు కానివాళ్ళను దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా నిర్ణయిస్తాడని లేఖనాలు వ్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహాముతో, "అన్ని జనముల వారు నీ కారణంగా ధన్యులౌతారు!” అని ముందే చెప్పాడు.

9 కనుక అబ్రాహాము విశ్వసించి ధన్యుడయ్యాడు. అదే విధంగా అతని వలె విశ్వసించిన వాళ్ళు కూడా ధన్యులౌతారు.

10 ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు” అని వ్రాయబడి ఉంది.

11 ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు” అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.

12 ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు" అని వ్రాయబడి ఉంది.

13 చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్థుడు!” అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు.

14 దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.

15 సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడికను మనం రద్దు ెచెయ్యలేము, లేక మార్చలేము. ఈ విషయం కూడా అలాంటిదే.

16 అబ్రాహాముకు, అతని వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు. కాని ధర్మశాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని “అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు.

17 నేను చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు త్రోసి ఆయన చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు.

18 అయితే వారసత్వం ధర్మశాస్త్రంపై ఆధారపడలేక అది వాగ్దానంపై ఆధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు యిచ్చాడు.

19 మరి అలాగైతే ధర్మశాస్త్రం ఉండటంలో ఉద్దేశ్యమేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడిన అబ్రాహాము వంశీయుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అందజేయబడింది.

20 కాని వాగ్దానం విషయంలో దేవుడు ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి.

21 మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరుద్దమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత జీవితాన్నిచ్చే శక్తి వుండి ఉంటే దాని ద్వారా నీతిమంతులం అయ్యేవాళ్ళం.

22 కాని లేఖనాల్లో, ‘ప్రపంచం పాపాల్లో చిక్కుకు పోయింది.’ అని వ్రాయబడి ఉంది. ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్న వాళ్ళకే యివ్వబడుతుంది.

23 విశ్వాసం లేకముందు మనం ధర్మశాస్త్రం యొక్క ఖైదీలము. విశ్వాసం మనకు బయలు పడేదాకా మనము ఖైదీలుగా ఉన్నాము.

24 మనము విశ్వాసం ద్వారా నీతిమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గరకు పిలుచుకు వెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింపబడింది.

25 ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు.

26 యేసుక్రీస్తులో మీకు విశ్వాసం వుండటం వల్ల మీరంతా దేవుని పుత్రులయ్యారు.

27 ఎందుకంటే క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొన్నారు.

28 ఇప్పుడు యేసుక్రీస్తులో యూదుడని, యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ అని, మగ అని, వ్యత్యాసం లేదు. క్రీస్తుయేసులో మీరందరు సమానం.

29 మీరు క్రీస్తుకు చెందితే అబ్రాహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదాలకు మనం వారసులమౌతాం.

4

1 నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడైనా అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు.

2 అతని తండ్రి నియమించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీనంలో ఉండవలసిందే.

3 అదే విధంగా మనము పిల్లలంగా ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బానిసలమై జీవించాము.

4 కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు.

5 మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.

6 మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “అబ్బా! తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు.

7 కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.

8 ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు.

9 కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు?

10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు.

11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.

12 సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు.

13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది.

14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు.

15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.

16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?

17 వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం.

18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి.

19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదనపడ్తూ ఉండవలసిందే.

20 మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.

21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా?

22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది.

23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.

24 ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. ‘హాగరు’ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును.

25 అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా ‘హాగరు’ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు.

26 కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి.

27 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా! ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా! గట్టిగా కేకలు వేయి! ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.” యెషయా 54:1

28 కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు.

29 ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది.

30 కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి” అని వ్రాయబడి ఉంది.

31 సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.

5

1 మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. ‘ధర్మశాస్త్రం’ అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి.

2 నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు ఏ మాత్రమూ ప్రయోజనంలేదని పౌలను నేను చెపుతున్నాను.

3 సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు ధర్మశాస్త్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెపుతున్నాను.

4 ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా కావాలనుకొంటున్న మీరు స్వయంగా క్రీస్తులోనుండి విడిపోయారు. తద్వారా దైవానుగ్రహాన్ని పోగొట్టుకొన్నారు.

5 కాని, మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి, విశ్వాసం ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం నిరీక్షిస్తున్నాము.

6 ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో సున్నతికి విలువ లేదు. సున్నతి చేసుకొన్నా, చేసుకోకపోయినా ఒకటే. ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది.

7 మీరు పందెంలో బాగా పరిగెత్తుచుండిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు?

8 మిమ్మల్ని పిలిచిన వాడు ఆటంక పరచలేదు.

9 “పులుపు కొంచెమైనా, పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు తెలుసు.

10 మీరు మరో విధంగా ఆలోచించరని ప్రభువునందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ విశ్వాసాన్ని కదిలిస్తున్నవాడు, ఎవడైనా సరే వాడు తప్పక శిక్షననుభవిస్తాడు.

11 నా సోదరులారా సున్నతి చేయించుకోవాలని నేనింకా బోధిస్తున్నట్లైతే, నన్ను వాళ్ళెందుకు ఇంకా హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్లయితే నేను సిలువను గురించి బోధించినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.

12 మిమ్మల్ని కలవర పెట్టేవాళ్ళు పూర్తిగా అంగచ్ఛేదన జరిగించుకోవటం మంచిది.

13 నా సోదరులారా! మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉండండి.

14 “నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు” అన్న ఒకే నియమంలో ధర్మశాస్త్రమంతా యిమిడి ఉంది.

15 మీరీ విధంగా కలహములాడుకొంటూ హింసించుకొంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి.

16 కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవించండి. అప్పుడు మీ మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని తీర్చుకోకుండా ఉండగలరు.

17 ఎందుకంటే మానవ స్వభావము పరిశుద్ధాత్మ కోరుకొంటున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం కోరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. తద్వారా మీరు చెయ్యాలనుకుంటున్న దాన్ని చెయ్యలేకపోతున్నారు.

18 కాని పరిశుద్ధాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం మిమ్మల్ని బంధించదు.

19 మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా తెలుసు. అవేవనగా వ్యభిచారము, అపవిత్రత, కామము,

20 విగ్రహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, ఈర్ష్య, కోపము, స్వార్థము, విరోధము, చీలికలు,

21 అసూయ, త్రాగుబోతు తనము, కామకేళీలు మొదలగునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

22 కాని పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఫలాలు, ప్రేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం,

23 వినయం, ఆత్మ నిగ్రహం. వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు.

24 యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు.

25 మనము పరిశుద్ధాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకారము నడుచుకొందాము.

26 ఒకరికొకర్ని రేపకుండా, ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం.

6

1 నా సోదరులారా! మీలో ఎవరైనా పాపం చేస్తే, మీలో ఆత్మీయంగా జీవిస్తున్న వాళ్ళు అతన్ని సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త పడండి.

2 పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే క్రీస్తు ఆజ్ఞను పాటించిన వాళ్ళౌతారు.

3 తనలో ఏ గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే తనను తాను మోసం చేసుకొన్న వాడౌతాడు.

4 ప్రతి ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన నడతను గురించి గర్వించవచ్చు.

5 ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

6 దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన వానికి అన్ని విధాల సహాయం చెయ్యాలి.

7 మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము.

8 శారీరిక వాంఛలు అనే పొలంలో విత్తనం నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్ధాత్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్ధాత్మ నుండి అనంతజీవితం అనే ఫలం పొందుతాడు.

9 [This verse may not be a part of this translation]

10 మనకు మంచి చేసే అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం.

11 ఇది మీకు నేను నా స్వహస్తాలతో వ్రాసాను. మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో చూడండి.

12 నలుగురిలో మంచి పేరు పొందాలనుకొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీ విధంగా చెయ్యటానికి ఒకే ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువను గురించి బోధించటం వల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం.

13 సున్నతి చేసుకొన్నవాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించరు. కాని శారీరకంగా వాళ్ళు గర్వించటానికి మిమ్మల్ని సున్నతి చేయించుకోమంటున్నారు.

14 యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందుకనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు లోకం చచ్చియున్నాము.

15 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోకపోయినా ఒకటే. క్రొత్త జీవితం పొందటం ముఖ్యం.

16 ఈ నియమాల్ని పాటించే వాళ్ళందరికీ, దేవుని ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును గాక.

17 చివరకు, నా దేహంపై యేసును గురించి పొందిన గుర్తులు ఉన్నాయి. కనుక నాకెవ్వరూ ఆటంకం కలిగించకుండా ఉండండి.

18 సోదరులారా! యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక! ఆమేన్.