1 దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొసైవేసు నుండి.
2 కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగు గాక!
3 మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించుగాక!
4 యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను.
5 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు.
6 క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది.
7 మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు.
8 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు.
9 తన కుమారుడును, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహా వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు.
10 సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.
11 నా సోదరులారా! మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయెకుటుంబం నాకు తెలియ చేసింది.
12 నేను చెప్పేదేమిటంటే మీలో ఒకడు,”పౌలును అనుసరిస్తున్నానని’ ఇంకొకడు, ‘నేను అపొల్లోను అనుసరిస్తున్నానని” మరొకడు, నేను కేఫాను అనుసరిస్తున్నానని” నాలుగో వాడు, ‘నేను క్రీస్తును అనుసరిస్తున్నానని’ అంటున్నారు.
13 అంటే క్రీస్తు భజింపబడ్డాడా?పౌలు మీకోసంసిలువపైచనిపొయ్యాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా?
14 నేను క్రిస్పుకు, గాయియుకు తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.
15 కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవ్వరూ అనలేరు.
16 ఔను, నేను సైఫను కుటుంబానికి చెందిన వాళ్ళకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వరికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు.
17 ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.
18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి.
19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ‘విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను. పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.’ యెషయా 29:14
20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా!
21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు ‘మూర్ఖత్వం’ అని భావిస్తున్న ‘మా సందేశాన్ని’ విశ్వసించిన వాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు.
23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేని దానిగాను కనిపిస్తుంది.
24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకాని వాళ్ళకు ‘క్రీస్తు’ దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము.
25 దేవునికి అవివేకంలా కనిపించేది, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్టమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచ మిమ్నల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు.
27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని, ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు.
28 ప్రపంచం ముఖ్యమైన వాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్న చూపుతో చూడబడే వాళ్ళనూ, ఏవగించుకొనబడే వాళ్ళనూ, లెక్క చెయ్యబడని వాళ్ళను ఎన్నుకొన్నాడు.
29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం.
30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు.
31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. ‘గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”
1 సోదరులారా! నేను మీ దగ్గరకు వచ్చి దేవుని రహస్యాన్ని ప్రకటించినప్పుడు మాటల చాతుర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రకటించలేదు
2 ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు యేసు క్రీస్తునూ ఆయన సిలువ మరణాన్ని తప్ప మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించుకొన్నాను.
3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను.
4 మిమ్నల్ని సమ్మతింప చెయ్యాలని నేను జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయోగించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని ఋజువు చేసాను.
5 మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం.
6 కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా పోతారు.
7 నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య జ్ఞానం. ‘ఇది’ ఇంతదాకా మానవులనుండి రహస్యంగా దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు.
8 ఈనాటి పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన మన ప్రభువును సిలువకు వేసి చంపేవాళ్ళు కాదు.
9 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ‘దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం సిద్ధంగా ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడలేదు. ఎవరి చెవులు వినలేదు. ఎవరూ వాటిని ఊహించలేదు.’ యెషయా 64:4
10 కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ ద్వారా తెలియచేసాడు. ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి ఉన్న వాటిని కూడా పరిశోధిస్తాడు.
11 మానవునిలో ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు. అదేవిధంగా దేవునిలో ఉన్న ఆలోచనలు అయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలియదు.
12 మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం పొందాము. తాను ఉచితంగా యిచ్చిన వాటిని గురించి మనం తెలుసుకోవాలని ఆయన ఉద్ధేశ్యం.
13 మానవులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము.
14 తనలో దేవుని ఆత్మలేని మానవుడు, దేవుని ఆత్మ ఇచ్చే వరాలను అంగీకరించడు. అతనికవి మూర్ఖంగా కనిపిస్తాయి. వాటిని ఆత్మీయంగా మాత్రమే అర్థం చేసుకోగలము కనుక అతడు వాటిని అర్థం చేసుకోలేడు.
15 ఆత్మీయంగా ఉన్నవాడు అందరిపై తీర్పు చెప్పకలడు. కాని అతనిపై ఎవడూ తీర్పు చెప్పలేడు.
16 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ‘ప్రభువులో ఉన్న జ్ఞానం ఎవరు తెలుసుకోగలరు? ప్రభువుకు ఎవరు సలహా యివ్వగలరు?’ యెషయా 40:13 కాని మన విషయం వేరు. మనలో క్రీస్తు మనస్సు ఉంది.
1 సోదరులారా! ఆత్మీయత కలవాళ్ళతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పొయ్యాను. ఆత్మీయత లేనివాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడాను. క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితంలో, మిమ్నల్ని పసిపిల్లలుగా పరిగణించి మాట్లాడాను.
2 మీరు అన్నం తినటానికి సిద్ధంగా లేరు. కనుక పాలు యిచ్చాను. మీరు ఇప్పటికి సిద్దంగా లేరు. మీరింకా ఆత్మీయత లేని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు.
3 మీలో అసూయలు, పోట్లాటలు, ఇంకా ఉన్నాయి. అంటే మీరు ఆత్మీయత లేని వాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! అంటే మీరు మిగతావాళ్ళలా జీవిస్తున్నట్లే కదా!
4 మీలో ఒకడు, ‘నేను పౌలును అనుసరిస్తున్నానని’ మరొకడు, ‘నేను అపొల్లోను అనుసరిస్తున్నానని’ అంటున్నారు. అలా మాములుమనుష్యులు అంటారు.
5 ఇంతకూ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును విశ్వసించారు. అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు.
6 నేను విత్తనం నాటాను. అపొల్లో నీళ్ళుపోసాడు. కాని దాన్ని పెంచుతున్నవాడు దేవుడే.
7 విత్తనం నాటటం, నీళ్ళు పోయటం ముఖ్యంకాదు. దాన్ని పెంచే దేవుడు ముఖ్యమైనవాడు.
8 విత్తనం నాటేవానికి, నీళ్ళు పోసేవానికి ఉద్ధేశ్యం ఒక్కటే. చేనిన పనిని బట్టి ప్రతీఒక్కనికి ప్రతిఫలం లభిస్తుంది.
9 ఎందుకంటే, మేము దేవునితో కలిసి పని చేసేవాళ్ళం. మీరు ఆయన పొలమునూ ఆయన భవనమునై యున్నారు.
10 దేవుని అనుగ్రహం వల్ల నేను నేర్పుగల నిర్మాణకుడుగా పునాదులు వేసాను. ఇతరులు ఆ పునాదిపై కడుతున్నారు. ప్రతి ఒక్కడూ తానేవిధంగా కడుతున్నాడో గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి.
11 ఆ ‘పునాది’ యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు.
12 కొందరు బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి ఈ పునాది మీద కడుతారు. మరికొందరు చెక్కను, గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడుతారు.
13 వాళ్ళ పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క వెలుగులో బయటపడుతుంది. ‘ఆ రోజు’ నిప్పువలె వస్తుంది. ఆ నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది.
14 వాళ్ళు నిర్మించింది నిలిస్తే వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది.
15 అది కాలిపోతే వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాని మంటలనుండి అతనొక్కడే తప్పించు కొన్న విధంగా రక్షింపబడతాడు.
16 మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా?
17 కనుక దేవుని మందిరాన్ని నాశనం చేసిన వాణ్ణి దేవుడు నాశనం చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ మందిరం.
18 మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రాపంచిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట తనను తాను జ్ఞానహీనునిగా ఎంచుకొంటే తర్వాత జ్ఞాని కాగలడు.
19 ఎందుకంటే దేవుడు ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని మూర్ఖమైన దానిగా పరిగణిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో,’తమ చమత్కారము ఉపయోగించే జ్ఞానుల్ని దేవుడు పట్టేస్తాడు’ అని వ్రాయబడివుంది.
20 మరొకచోట, ‘జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు’ అని వ్రాయబడివుంది.
21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి.
22 పౌలు, అపోల్లో, కేఫా, ప్రపంచము, బ్రతుకు, చావు, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ మీవి.
23 మీరు క్రీస్తుకు చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు.
1 అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళుగా పరిగణించండి.
2 బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి.
3 మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను.
4 నా మనస్సు నిర్మలమైనది. అంత మాత్రాన నేను నిర్దోషినికాను. ప్రభువు నాపై తీర్పు చెపుతాడు.
5 అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.
6 సోదరులారా! ‘లేఖనాల్లో వ్రాయబడినవాటిని అతిక్రమించకండి’ అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని వేషించకండి.
7 ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు?
8 ఇప్పటికే మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ధనవంతులైపొయ్యారు. మేము రాజులం కాకపోయినా, మీరు రాజులైపోయ్యారు. మీరు నిజంగా రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము మీతో సహా రాజులమౌతాము.
9 మరణ శిక్ష పొందిన నేరస్థుల్లాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని చివరన ఉంచాడు. లోకమునంతటికీ, దేవదూతలకు, మానవులకు అపొస్తులమైన మేము ప్రదర్శనా వస్తువులయ్యాము.
10 క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం లభిస్తోంది.
11 ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధపడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలు అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు.
12 మేము మా చేతుల్తో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం.
13 అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.
14 మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటంలేదు. నా పుత్రులవలె ప్రేమించి హెచ్చరిస్తున్నాను.
15 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు తండ్రినయ్యాను.
16 కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను.
17 ఈ కారణంగా నాకు ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీ దగ్గరకు పంపుతున్నాను. తిమోతి ప్రభువు ప్రేమించిన కుమారుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను.
18 నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు.
19 కాని ప్రభువు చిత్తమైతే నేను త్వరలోనే వస్తాను. గర్వంతో మాట్లాడుతున్నవాళ్ళు ఏమి చెయ్యకలుగుతారో చూస్తాను.
20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు. అది శక్తితో కూడినది.
21 మీకేమి కావాలి: మిమ్మల్ని శిక్షించటానికి మీ దగ్గరకు రావాలా? లేక దయ, ప్రేమ చూపటానికి రావాలా?
1 మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని నాకు సృష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, క్రైస్తవులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను.
2 ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. ఈ పని చేసిన వాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది.
3 నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మతో మీతోఉన్నాను. నేను మీతోవున్నట్లు భావించి ఈ అపరాధము చేసిన వానిపై తీర్పు చెపుతున్నాను.
4 మీరు యేసు ప్రభువు పేరిట సమావేశమైనప్పుడు నా ఆత్మలో మీతో ఉంటాను. యేసు ప్రభువు శక్తి మీలో ఉంటుంది.
5 అప్పుడు అతణ్ణి సైతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది.
6 ‘మీరు గర్వించటం మంచిది కాదు. పులుపు కొంచెమైనా, పిండినంతా పులుపు చేస్తుందని తెలియదా?’
7 పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన పస్కా గొఱ్ఱెపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు క్రొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని క్రొత్త పిండివంటి వాళ్ళు.
8 కనుక పులియని రొట్టెతో పండుగ చేసుకొందాము. ద్వేషంతో, పాపంతో కూడుకొన్న పాత పులిసిన పిండితో కాక నిష్కపటంతోనూ, సత్యంతోనూ కూడుకొన్న పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము.
9 నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను.
10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది.
11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించే వానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసే వానితో, ఇతరులను దూషించే వానితో, త్రాగుబోతుతో, మోసంచేసే వానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.
12 సంఘానికి చెందని వానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్న వానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది.
13 ‘సంఘానికి చెందని వాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు. కాని ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.’
1 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందని వాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం?
2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా?
3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి?
4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా?
5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా?
6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది.
8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
9 దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు,
10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు.
11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.
12 ‘ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.’ కాని వాటివల్ల లాభం కలుగదు. ‘ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది’ కాని నేను దానికి బానిసను కాను,
13 ‘తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.’ కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు.
14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు.
15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్యదేహంతో కలుపమంటారా? అసంభవము.
16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపిన వాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, ‘రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి’ అని లేఖనాల్లో వ్రాయబడివుంది.
17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.
18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషిచేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది.
19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు.
20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.
1 ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది.
2 కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది.
3 ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి.
4 భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది.
5 భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సైతాను ప్రేరేపణకు లోంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం.
6 ఇలా చెయ్యుమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను.
7 అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.
8 అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది.
9 కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే వెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.
10 వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలి వేయరాదు.
11 అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు.
12 మిగతా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.
13 అలాగే ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవించాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు.
14 అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. అదేవిధంగా అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన భర్తతో కలసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్లయితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే.
15 కాని, విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అనుకొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు.
16 ఓ స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?
17 ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను.
18 సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నంచేయరాదు.
19 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం.
20 ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి.
21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నంచేయి.
22 ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదేవిధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు.
23 మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్నికొన్నాడు. మానవులకు బానిసలు కాకండి.
24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదేవిధంగా ఉండి దేవువునితో కలిసి ఉండండి.
25 ఇక కన్యలను గురించి: ప్రభువు మీకు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. కాని దేవుని అనుగ్రహంవల్ల నేను మీకు చెపుతున్న సలహాలు నమ్మతగినవి.
26 ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల వల్ల మీరు కన్యలుగా ఉండిపోవటం మంచిది.
27 ఇక పురుషులు, మీరు వివాహితులైనట్లయితే విడాకులు ఇవ్వకండి. మీరు అవివాహితులైనట్లయితే భార్యల కోసం వెతక్కండి.
28 అలాగని మీరు వివాహం చేసుకొంటే పాపం కాదు. అదే విధంగా కన్యలు కూడా వివాహం చేసుకొంటే పాపం కాదు. కాని వివాహం చేసుకొన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. మీకా కష్టాలు కలుగరాదని ఇలా చెపుతున్నాను.
29 సోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదటనుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్లు జీవించాలి.
30 దుఃఖించేవాళ్ళు దుఃఖించనట్లు, ఆనందిస్తున్నవాళ్ళు ఆనందించనట్లు, కొనేవాళ్ళు కొన్నవి తమని కానట్లు జీవించాలి.
31 ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.
32 మీరు చింతించరాదని నా కోరిక. ‘వివాహం చేసుకోనివాడు ప్రభువును ఏ విధంగా ఆనంద పరచాలా’ అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
33 కాని వివాహితుడు తన భార్యను ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
34 అందువల్ల అతని మనసు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. పెళ్ళికాని స్త్రీలు, కన్యలు ప్రభువు ఆజ్ఞల్ని పాటించటంలో నిమగ్నులై ఉంటారు. తమ మనస్సును, శరీరాన్ని ప్రభువుకు అర్పించి పని చేస్తుంటారు. కాని పెళ్ళిచేసుకొన్న స్త్రీలు తమ భర్తను ఆనందపరచటానికి, ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు.
35 ఇది నేను మీ మంచి కోసం చెపుతున్నాను. అనవసరమైన కట్టుబాట్లు నియమించాలని కాదు. మీరు సక్రమంగా నడుచుకోవాలని, మనస్ఫూర్తిగా మిమ్నల్ని మీరు ప్రభువుకు అర్పించుకోవాలని నా ఉద్ధేశ్యం.
36 తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు, లేక పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు.
37 కాని పెళ్ళి చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నవాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోగలవాడు కూడా, పెళ్ళిమాని సరియైన పని చేస్తున్నాడు.
38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
39 భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియైఉండాలి.
40 ఆమె విధవరాలుగా ఉండిపోతే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. నాకును దేవుని ఆత్మ సహాయం ఉన్నదని తలస్తున్నాను.
1 ఇక విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని గురించి: మనలో జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం గర్వాన్ని కలిగిస్తుంది. ప్రేమ మనిషిని అభివృద్ధి పరుస్తుంది.
2 తనలో జ్ఞానముందని భావిస్తున్న వానిలో నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు.
3 కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు.
4 ఇక విగ్రహాలకు బలి ఇచ్చిన వాటి విషయం: విగ్రహానికి అర్థం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు తెలుసు.
5 దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు.
6 అయితే నిజానికి మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జీవిస్తున్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయనవల్ల మనము జీవిస్తున్నాము.
7 కాని ఈ విషయం తెలియని వాళ్ళు చాలమంది ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి అర్పించింది అనుకొని తింటారు. వాళ్ళ మనసులు బలహీనమైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు.
8 ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు.
9 కాని మీ నిర్ణయము, దృఢ విశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి.
10 ఈ విషయంపై గట్టి అభిప్రాయంలేని వాడొకడు, ఈ విషయాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం కలుగుతుంది.
11 బలహీనమైన మనస్సుగల మీ సోదరుని కోసం క్రీస్తు మరణించాడు. కాని మీ “అజ్ఞానం” వల్ల ఆ సోదరుడు నశిస్తాడు.
12 అలా చేస్తే మీ సోదరునిపట్ల పాపం చేసి అతని మనస్సును గాయపరచిన వాళ్ళవుతారు. తద్వారా మీరు క్రీస్తుపట్ల పాపం చేసిన వాళ్ళవుతారు.
13 నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం కారణమైతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగానైనా అతని పతనానికి కారకుణ్ణి కాకుండా ఉంటాను.
1 నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుడను కానా? నేను మన యేసు క్రీస్తు ప్రభువును చూడలేదా? ‘మీరే’ ప్రభువు కోసం నేను చేసిన సేవా ఫలితంకదా?
2 నేను ఇతరులకు క్రీస్తు అపొస్తులుడను కాకపోవచ్చు. కాని నేను మీకు క్రీస్తు అపొస్తులుడను. నేను క్రీస్తు అపొస్తులుడనన్న దానికి మీరే నా రుజువు.
3 నాపై తీర్పు చెప్పాలనుకొన్నవాళ?్ళకు నా సమాధానం యిది:
4 అన్న పానాలకు మాకు అధికారం లేదా?
5 ఇతర అపొస్తులవలె, ప్రభువు సోదరులవలె, కేఫావలే, విశ్వాసురాలైన భార్యను వెంట తీసుకెళ?్ళటానికి మాకు అధికారం లేదా?
6 నేనూ, బర్నబా మాత్రమే జీవించటానికి పనిచేయాలా?
7 తన స్వంత డబ్బుతో సైనికునిగా ఎవరు పని చేస్తారు?ద్రాక్షా మొక్కల్ని నాటి వాటి ఫలాన్ని తినకుండా ఎవరుంటారు? పశువుల మందలను కాస్తూ, వాటి పాలు త్రాగకుండా ఎవరుంటారు?
8 నేను దీన్ని మానవ దృష్టిలో చెపుతున్నానా?ధర్మశాస్త్రం కూడా ఈ మాటే చెబుతుంది.
9 [This verse may not be a part of this translation]
10 ఈ మాట మనకోసమే వ్రాయబడిందని నేను గట్టిగా చెప్పగలను. పొలం దున్నేవాడూ, పంట నూర్చేవాడూ, పంట ఫలంలో భాగం లభిస్తుందన్న ఆశతో ఆ పనులు చేస్తారు.
11 మేము మీలో ఆత్మీయ విత్తనాలు చల్లాము. మీనుండి మా అవసరాలు తీర్చుకోవటం తప్పా?
12 మిగతావాళ?్ళకు మీనుండి ఈ సహాయం పొందే హక్కు ఉన్నప్పుడు మాకు వాళ?్ళకంటే ఎక్కువ హక్కుఉందికదా? కానీ, మేమాహక్కు ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తా ప్రచారంలో ఏ ఆటంకం కలుగకుండా ఉండాలని మేము ఎన్నో కష్టాలు అనుభవించాము.
13 మందిరంలో పనిచేసే వాళ?్ళకు మందిరం నుండి ఆహారం లభిస్తుంది. బలిపీఠం దగ్గర పనిచేసేవాళ?్ళకు బలి ఇవ్వబడిన వాటిలో భాగం లభిస్తుందని తెలియదా?
14 అదే విధంగా సువార్త బోధించే వాళ?్ళకు సువార్త ద్వారా జీవితావసరాలు తీరాలని ప్రభువు ఆజ్ఞాపించాడు.
15 కాని నేను ఈ హక్కుల్ని ఉపయోగించుకోలేదు. మీరు నాకు సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను ఇది వ్రాయటం లేదు. అభిమానం దెబ్బతినటం కన్నా నాకు చావటం మేలనిపిస్తుంది.
16 కాని నేను సువార్త ప్రకటిస్తున్నందుకు గొప్పలు చెప్పుకోలేను. సువార్త బోధించటం నా కర్తవ్యం. నేను సువార్త బోధించటం ఆపేస్తే నాకు శాపం కలుగుగాక!
17 స్వయంగా ఈ పని చేస్తే నాకు బహుమానం ఉంది. ఈ పని చెయ్యాలని నేను స్వయంగా కోరలేదు. ఆ బాధ్యతను నాకు దేవుడే అప్పగించాడు.
18 మరి నా ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం పుచ్చుకోకుండా, నా హక్కులు అడగకుండా సువార్తను ప్రకటించటమే నా ప్రతిఫలం.
19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవ్వరికీ బానిసను కాను. కాని చేతనైనంతమందిని గెలవాలని నేను ప్రతి ఒక్కనికీ బానిసనౌతాను.
20 నేను యూదులతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని యూదునిలా జీవించాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు గెలవాలని, నేను ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళకోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు జీవించాను.
21 ధర్మశాస్త్రం లేనివాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని, ధర్మశాస్త్రం లేనివానిగా ప్రవర్తించాను. అంటే నేను దేవుని న్యాయానికి అతీతుడను కాను. నిజానికి నేను క్రీస్తు న్యాయాన్ని అనుసరిస్తున్నారు.
22 బలహీనుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడనయ్యాను. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించగలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధాలుగా మారిపొయ్యాను.
23 నేను ఇవన్నీ సువార్త కోసం చేసాను. అది అందించే దీవెనలు పొందాలని నా అభిలాష.
24 పరుగు పందెంలో అందరూ పాల్గొన్నా ఒక్కనికే బహుమతి లభిస్తుందని మీకు తెలియదా? కనుక ఆ బహుమతి పొందాలనే ఉద్దేశ్యంతో పరుగెత్తండి.
25 పరుగు పందెంలో పాల్గొనదలచిన వాళ్ళందరూ మంచి క్రమశిక్షణ పొందుతారు. విజయకిరీటం పొందాలనే వాళ్ళ ఉద్దేశ్యం. కాని వాళ్ళు పొందే కిరీటం చిరకాలం ఉండదు. మనం చిరకాలం ఉండే కిరీటం కోసం పోరాడుతున్నాం.
26 నేను గమ్యం లేకుండా పరుగెత్తను. గాలితో పోరాడుతున్న వానిలా పోరాడను.
27 నేను నా దేహానికి సరియైన శిక్షణనిచ్చి, అదుపులో ఉంచుకొంటాను. బోధించిన తర్వాత కూడా ఆ బహుమతి పొందే అర్హత పోగొట్టుకోరాదని ప్రయాస పడుచున్నాను.
1 సోదరులారా! ఈ సత్యమును గ్రహించకుండా యుండుట నాకిష్టం లేదు. మన పూర్వీకులు మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచబడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు.
2 వాళ్ళు మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషేలోనికి ఐక్యత పొందారు.
3 అందరూ ఒకే ఆత్మీయ ఆహారం తిన్నారు.
4 అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే.
5 అయినా వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా జీవించారు. మిగతా వాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు.
6 వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు.
7 కొందరు పూజించినట్లు మీరు విగ్రహాలను పూజించకండి. ధర్మశాస్త్రంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొన్నారు. లేచి నృత్యం చేసారు.”
8 మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చెయ్యటం వల్ల ఒక్క రోజులో వాళ్ళలో ఇరవైమూడు వేలమంది మరణించారు.
9 వాళ్ళు ప్రభువును శోధించిన విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను పాములు చంపివేసాయి.
10 వాళ్ళవలె సణగకండి. సణగిన వాళ్ళను మరణదూత చంపివేశాడు.
11 మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి సంభవించాయి. మనల్ని హెచ్చరించాలని అవి ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బ్రతుకుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి.
12 కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్న వాడు క్రింద పడకుండా జాగ్రత్త పడాలి.
13 మానవులకు సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు కలుగలేదు. దేవుడు నమ్మకస్తుడు. భరించగల పరీక్షలకన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు చూపుతాడు.
14 కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండండి.
15 మీరు తెలివిగల వాళ్ళు కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న వాటిని గురించి మీరే నిర్ణయించండి
16 మనము కృతజ్ఞతతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని పంచుకోవటము, కదా? మనము విరిచిన రొట్టెను పంచుకోవటము, క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా?
17 రొట్టె ఒకటే గనుక ఆ ఒకే రొట్టెలో పాలుపొందే మనం అనేకులమైనప్పటికిని ఒకే శరీరమైయున్నాము.
18 ఇశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చిన దాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా?
19 మరి నేను చెపుతున్న దానికి అర్థం ఏమిటి? విగ్రహాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలో కాని, ఏదో ప్రత్యేకత ఉందని చెపుతున్నానా?
20 లేదు. నేను చెపుతున్నది ఏమిటంటే యూదులుకాని వాళ్ళు బలిపీఠాలపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో భాగస్వాములు కారాదని నా విన్నపం.
21 మీరు ప్రభువు పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు.
22 మనం దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం ఆయన కంటే శక్తిగల వాళ్ళమా? ఎన్నటికీ కాదు.
23 “మనకు ఏది చెయ్యటానికైనా స్వేచ్ఛ ఉంది” కాని అన్నీ లాభదాయకం కావు. “మనకు అన్నీ చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు.
24 ఎవరూ తమ మంచి కొరకే చూసుకోరాదు. ఇతరుల మంచి కోసం కూడా చూడాలి.
25 మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని అంగడిలో అమ్మే ఏ మాంసాన్నైనా తినండి.
26 “ఎందుకంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ ప్రభునివే.”
27 క్రీస్తును విశ్వసించని వాడు మిమ్మల్ని భోజనానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది ఉంచితే అది తినండి.
28 కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని మనస్సుకోసం దాన్ని తినకండి
29 అంటే, మీ మనస్సు కోసం అని కాదు, ఆ చెప్పిన వాని మనస్సు కోసం దాన్ని తినకండి. నా స్వాతంత్ర్యం విషయంలో అవతలి వాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి?
30 నేను కృతజ్ఞతలు అర్పించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి ఇతరులు నన్నెందుకు విమర్శించాలి?
31 కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ దేవుని ఘనత కోసం చేయండి.
32 యూదులకు గాని, యూదులుకాని వాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, కష్టం కలిగించకుండా జీవించండి.
33 నేను చేస్తున్నట్లు మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసుకోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింపబడాలని నా ఉద్దేశ్యం.
1 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి.
2 నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నేను చెప్పిన బోధనల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
3 క్రీస్తుకు ప్రతీ మనిషిపై అధికారం ఉంది. ప్రతీ పురుషునికి తన భార్యపై అధికారం ఉంది. దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక.
4 కనుక తన తల కప్పుకొని బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించేవాడు లేక దైవసందేశాన్ని ప్రకటించేవాడు తన తలను అవమానపరచిన వానితో సమానము.
5 తల మీద ముసుగు వేసుకోకుండా బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించే స్త్రీ, లేక దైవ సందేశాన్ని బోధించే స్త్రీ తన తలను అవమానపరచినట్లు అవుతుంది. ఆమె తలగొరిగించుకొన్న దానితో సమానము.
6 స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది. తలవెంట్రుకలు కత్తిరించుకోవటంకాని, లేక తల గొరిగించుకోవటం కాని అవమానంగా అనిపిస్తే ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి.
7 పురుషుడు దేవుని ప్రతిరూపం. దేవునికి కీర్తి కలిగించేవాడు పురుషుడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది.
8 ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది.
9 అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింప బడలేదు స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది.
10 ఈ కారణంగా మరియు దేవదూతల కారణంగా స్త్రీ తనపై ఒకరికి అధికారముందని చూపటానికి తన తలపై ముసుగు వేసుకోవాలి.
11 కాని ప్రభువు దృష్టిలో పురుషుడు లేకుండా స్త్రీ, స్త్రీ లేకుండా పురుషుడు జీవించలేరు.
12 ఎందుకంటే, స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడినట్లే, పురుషుడు కూడా స్త్రీ నుండి సృష్టింపబడ్డాడు. కాని అన్నిటినీ దేవుడే సృష్టించాడు.
13 తలపై ముసుగు వేసుకోకుండా స్త్రీ దేవుణ్ణి ప్రార్థించటం సరియేనా? మీరే నిర్ణయించండి.
14 పురుషునికి పొడుగాటి వెంట్రుకలు ఉండటం వలన అతనికి అవమానమని ప్రకృతే మీకు తెలియచెయ్యటం లేదా?
15 స్త్రీకి తన తల వెంట్రుకలు ముసుగుగా ఉండటానికి పొడుగాటి వెంట్రుకలు ఇవ్వబడ్డాయి. దాని వల్ల ఆమెకు గౌరవం లభిస్తుంది.
16 దీన్ని గురించి ఎవరైనా వాదించాలనుకొంటే మా సమాధానం యిదే తప్ప వేరొకటి లేదు. దేవుని సంఘం కూడా దీన్నే అనుసరిస్తుంది.
17 మీ సంఘ సమావేశాలు మంచికన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు.
18 మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు.
19 సక్రమ మార్గాల్లో నడుచుకొనే వాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం.
20 మీరు సమావేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” చెయ్యటం లేదు.
21 ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు.
22 తినటానికి, త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్ళను అవమానిస్తారు. అంటే, మీరు దేవుని సంఘాన్ని లెక్క చెయ్యనట్లే కదా! మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను.
23 నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని
24 దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి, “ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు.
25 అదే విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి”
26 కనుక మీరు ఈ రొట్టెను తిని, ద్రాక్షా రసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.
27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసిన వాడగును.
28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి.
29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు.
30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు.
31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు.
32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.
33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి.
34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటి వాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.
1 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము.
2 మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు.
3 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.
4 దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు.
5 ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు.
6 దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.
7 దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం.
8 ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు.
9 అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు.
10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు.
11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్చానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.
12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే.
13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.
14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు.
15 5ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు.
16 అదే విధంగా ఒక వేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు.
17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం?
18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు.
19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు.
20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.
21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదేవిధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు.
22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి.
23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగ పరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము.
24 బహిరంగ పరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు.
25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం.
26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక్క భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.
27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు.
28 దేవుడు సంఘంలో ఉన్న వాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహాత్కార్యాలను చేసే వాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసే వాళ్ళను, పరిపాలించే వాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు.
29 వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించే వాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసే వాళ్ళు కారు.
30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు.
31 కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.
1 ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు.
2 నాకు దైవ సందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి.
3 నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము.
4 ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు.
5 దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు.
6 ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది.
7 ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది.
8 దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నిశించి పోదు.
9 ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది.
10 అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది.
11 నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మరిచిపోయాను.
12 ప్రస్తుతం అద్దంలో మసకగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనము చూస్తున్నాము. తదుపరి మనము ఆ ముఖాన్ని స్పష్టంగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది సంపూర్ణం కాదు. కాని తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత సంపూర్ణంగా నాకు ఆయన్ని గురించి తెలుస్తుంది.
13 అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది.
1 కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. ఆత్మీయ శక్తి లభించాలని, ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం లభించాలని ఆశించండి.
2 తనకు తెలియని భాషలో మాట్లాడే వాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మానవులతో కాదు. అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు.
3 కాని దైవసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపరచాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవసందేశం చెపుతాడు.
4 తనకు తెలియని భాషలో మాట్లాడేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. కాని దైవసందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగిస్తాడు.
5 మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లాడితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో మాట్లాడే వాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభవించకపోతే తెలియని భాషల్లో మాట్లాడే వానికన్నా దైవసందేశం చెప్పేవాడే గొప్ప.
6 సోదరులారా! నేను అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు ఒక క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దైవసందేశం తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి?
7 పిల్లన గ్రోవి, వీణ వంటి ప్రాణం లేని వస్తువులు కూడా శబ్దం చేస్తాయి. వాటి స్వరాల్లో భేదం లేకుంటే ఏ రాగం వాయిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది?
8 బాకా సక్రమంగా ఊది పిలవకుంటే యుద్ధానికి ఎవరు సిద్ధమౌతారు?
9 అదే విధంగా మీ నాలుకతో అర్థం అయ్యే పదాలు మాట్లాడితే తప్ప మీరేం మాట్లాడుతున్నారో యితరులకు ఎట్లా అర్థం అవుతుంది. మీరు గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది.
10 ప్రపంచంలో చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని అర్థం లేని భాష ఏదీ లేదు.
11 ఒకడు మాట్లాడే విషయం నేను అర్థం చేసుకోలేకపోతే, నేను అతనికి పరదేశీయునిగా, అతడు నాకు పరదేశీయునిగా ఉంటాము.
12 మీకు ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా కోరుకొండి.
13 కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన వాటికి అర్థం చెప్పగలిగే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి.
14 ఎందుకంటే నేను నాకు తెలియని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని నా బుద్ధి అందులో పాల్గొనదు.
15 మరి నేను ఏం చెయ్యాలి? నేను నా ఆత్మతో మాత్రమే కాక, నా బుద్ధితో కూడా ప్రార్థిస్తాను. నా ఆత్మతోను నా మనస్సుతోను కూడా పాడుతాను.
16 మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది?
17 మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల మేలు కలుగదు.
18 మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి.
19 నేను సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పదివేల పదాలు మాట్లాడటం కన్నా నాకు తెలిసిన భాషల్లో ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని నా అభిప్రాయము.
20 సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్న పిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి.
21 లేఖనాల్లో ఇలా వ్రాయబడి వుంది: “ఇతర భాషలు మాట్లాడే వాళ్ళ ద్వారా, విదేశీయుల పెదాల ద్వారా వీళ్ళతో నేను మాట్లాడుతాను. అయినా వాళ్ళు నా మాటలు వినరు.” యెషయా 28:11-12
22 తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి వుంటే, అది విశ్వాసం లేని వాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్న వాళ్ళకు అవసరం లేదు. అయినా దైవ సందేశం విశ్వాసం ఉన్న వాళ్ళకే గాని, విశ్వాసం లేని వాళ్ళకు కాదు.
23 సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కాని వాళ్ళు లేక విశ్వాసం లేని వాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా?
24 దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట.
25 అతని మనస్సులో ఉన్న ఆలోచనలు బయట పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు” అని అంగీకరిస్తాడు.
26 సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? మీరంతా సమావేశమైనప్పుడు ఒకడు స్తుతిగీతం పాడుతాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడుతాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి.
27 తెలియని భాషల్లో మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే, ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అర్థం విడమర్చి చెప్పగలవాడు ఉండాలి.
28 అర్థం చెప్పేవాడు లేకపోయినట్లయితే తెలియని భాషలో మాట్లాడేవాడు మాట్లాడటంమానెయ్యాలి. అతడు తనలో తాను మాట్లాడుకోవచ్చు. లేదా దేవునితో మాట్లాడవచ్చు.
29 దైవసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడవచ్చు. మిగతావాళ్ళు చెప్పిన దాన్ని జాగ్రత్తగా గమనించాలి.
30 ఒకవేళ అక్కడ కూర్చున్న వాళ్ళకు దేవుడు తన సందేశాన్ని చెప్పమంటే, మాట్లాడుతున్నవాడు మాట్లాడటం ఆపివెయ్యాలి.
31 అలా చేస్తే ఒకరి తర్వాత ఒకరు దైవసందేశం చెప్పవచ్చు. అలా చెయ్యటం వల్ల అందరూ నేర్చుకొంటారు. ప్రతీ ఒక్కరికి ప్రోత్సాహం కలుగుతుంది.
32 దైవసందేశం చెప్పే వాళ్ళు తమ ప్రేరణను అదుపులో పెట్టుకోవచ్చు.
33 దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు.
34 ఇతర సంఘాలలో జరుగుతున్నట్లు స్త్రీలు సమావేశాలలో మౌనం వహించాలి. మాట్లాడటానికి వాళ్ళకు అధికారం లేదు. ధర్మశాస్త్రంలో, “స్త్రీలు అణకువతో ఉండాలి” అని వ్రాయబడి ఉంది.
35 స్త్రీలు సంఘంలో మాట్లాడటం అవమానకరం. కనుక ఒకవేళ స్త్రీ ఒక విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి.
36 దైవసందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు మాత్రమే లభించలేదు.
37 దేవుడు తన ద్వారా సందేశం పంపాడన్నవాడు, లేక తనలో ఆత్మీయ శక్తి ఉందని అనుకొన్నవాడు నేను మీకు వ్రాసినది ప్రభువు ఆజ్ఞ అని గుర్తించాలి.
38 అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తించడు.
39 సోదరులారా! దైవసందేశం చెప్పాలని ఆశించండి. తెలియని భాషలో మాట్లాడే వాళ్ళను ఆపకండి.
40 కాని అన్నిటినీ చక్కగా, సక్రమమైన పద్ధతిలో జరపండి.
1 సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం.
2 నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది.
3 నేను పొందిన దాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు.
4 లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతి పెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు.
5 పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు.
6 ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు.
7 ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు.
8 చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు.
9 ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను.
10 కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృధా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది.
11 నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.
12 కాని మేము, క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయిన వాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు?
13 అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది.
14 క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృధా అయినట్లే కదా!
15 అంతే కాదు దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలాకాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పిన వాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయిన వాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు.
16 ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు.
17 క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట.
18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట.
19 మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది.
20 కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డ వాళ్ళలో ఆయన ప్రథముడు.
21 ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చినట్లు, పునరుత్థానం కూడా ఒక మనుష్యుని ద్వారా వచ్చింది.
22 ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరిణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు.
23 ప్రతీ ఒక్కడు తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించిన వాళ్ళు బ్రతికింపబడతారు.
24 అన్నీ అంతమయ్యే కాలం వస్తుంది. అప్పుడాయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో ఉన్న వాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు.
25 ఎందుకంటే, దేవుడు శత్రువులందరిని తన పాదాల ముందు పడవేసే దాకా ఆయన రాజ్యం చెయ్యాలి.
26 చివరి శతృవైన మృత్యువు నాశనము చేయబడుతుంది.
27 ఎందుకంటే లేఖనాల్లో, “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని వ్రాయబడి ఉంది. ‘అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు’ అని అంటే, వీటిలో దేవుడు కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు.
28 కాని అన్నీ తన పాదాల క్రింద ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ పాలిస్తాడు.
29 పునరుత్థానం లేనట్లయితే, మరి చనిపోయిన వాళ్ళ కోసం, బాప్తిస్మము పొందిన వాళ్ళ సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికి వస్తారు? చనిపోయిన వాళ్ళు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నారు.
30 మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో వేసుకొంటున్నాం?
31 సోదరులారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతున్నాను.
32 ఒకవేళ నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోట్లాడటం, మానవ కారణంగా మాత్రమే అయినట్లయితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకనట్లయితే, “తిని, త్రాగుదాం, ఎలాగో మరణిస్తాంగదా.”
33 మోసపోకండి, “చెడు సహవాసం మంచి వాణ్ణి చెడుపుతుంది.”
34 మేలుకోండి. పాపం చెయ్యటం మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలియదు. అది సిగ్గుచేటు.
35 కొందరు, “చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు.
36 ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు.
37 నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు.
38 దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు.
39 మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం.
40 ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు.
41 సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు.
42 చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు.
43 గౌరవం లేని శరీరంగా నాటబడి మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి శక్తిగల శరీరముగా లేస్తుంది.
44 భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు. భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది.
45 ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.”
46 ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది.
47 మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు.
48 భూమ్మీద ఉన్న వాళ్ళు మట్టితో సృష్టింపబడిన వానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించిన వాళ్ళు పరలోకంనుండి వచ్చిన వానివలె ఉన్నారు.
49 మట్టితో సృష్టింపబడిన వాని పోలికలతో మనము జన్మించినట్లే పరలోకం నుండి వచ్చిన వాని పోలికలను కూడా మనము పొందుతాము.
50 సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు.
51 మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు.
52 చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది.
53 ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి.
54 ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది: “మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.” యెషయా 25:8
55 “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ! ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?” హోషేయ 13:14
56 మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రం నుండి పొందుతుంది.
57 కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.
58 కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృధాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.
1 పరిశుద్ధుల కోసం సేకరించవలసిన చందాల విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదే విధంగా చెయ్యండి.
2 తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే నేను వచ్చిన రోజెల్లా చందానెత్తనవసరం ఉండదు.
3 నేను వచ్చాక మీరెన్నుకొన్న వాళ్ళకు పరిచయ పత్రాలు వ్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును యెరూషలేము పంపుతాను.
4 నేను కూడా వెళ్ళటం ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం.
5 నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను.
6 అలా చేస్తే నేను మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాలమంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7 అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని చూసినట్లు మాత్రమే ఔతుంది. అలా కాక! ప్రభువు చిత్తమైతే మీతో కొంతకాలం గడపాలని ఉంది.
8 నేను ఎఫెసులో పెంతుకొస్తు పండుగ దాకా ఉంటాను.
9 అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
10 తిమోతి మీ దగ్గరకు వస్తే అతనికి ధైర్యం చెప్పండి. ఎందుకంటే, నాలాగే అతడు కూడా ప్రభువు కార్యాన్ని చేస్తున్నాడు.
11 ఎవ్వరూ అతణ్ణి నిరాకరించకండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు చూడండి. అతడు యితర సోదరులతో కలిసి నా దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు చూస్తున్నాను.
12 ఇక మన సోదరుడైన అపొల్లోను గురించి: నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు వెళ్ళుమని చాలా వేడుకొన్నాను. అతనికి ప్రస్తుతం వెళ్ళటానికి కొంచెం కూడా యిష్టం లేదు. కాని తనకు మనస్సున్నప్పుడు అతడు వస్తాడు.
13 మెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి.
14 చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి.
15 అకయ ప్రాంతంలో విశ్వాసులుగా మారిన వాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేసారు.
16 వాళ్ళను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కణ్ణీ మీరు అనుసరించాలి.
17 స్తెఫను, పొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావటం వల్ల నాకు ఆనందం కలిగింది.
18 వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించటం సమంజసం.
19 ఆసియ ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
20 ఇక్కడున్న సోదరులందరు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి.
21 నేను పౌలును ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను.
22 ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అవుతాడు! ప్రభువా రమ్ము!
23 యేసు ప్రభువు యొక్క అనుగ్రహము మీకందరికి లభించుగాక.
24 యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్.