1 ప్రియమైన థెయొఫిలాకు, నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజువరకు జరిగినదంతా వ్రాసాను.
2 ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకొన్న అపొస్తలులకు వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు.
3 ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు.
4 ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను.
5 యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”
6 వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా?” అని యేసును అడిగారు.
7 ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని తెలుసుకొనే అవసరం మీకు లేదు.
8 కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.
9 ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది.
10 ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో,
11 “గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీ నుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళి?్ళనట్లే మళ్ళీ తిరిగి వస్తా” అని అన్నారు.
12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.
13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్పయి కుమారుడు యాకోబు, ‘జెలోతే’ అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.
14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండే వాళ్ళు.
15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూటఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు.
16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు.
17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”
18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి.
19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం రక్తపు భూమి.”
20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది: ‘అతని భూమిని పాడు పడనిమ్ము అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’ కీర్తన 69:25 అతని స్థానాన్ని యింకొకడు ‘ఆక్రమించనిమ్ము!’ కీర్తన 109:8
21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్న వాళ్ళలో ఒకడై ఉండాలి.
22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మన నుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”
23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు.
24 [This verse may not be a part of this translation]
25 [This verse may not be a part of this translation]
26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.
1 పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు.
2 తీవ్రమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పరలోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న యింటినంతా నింపివేసింది.
3 అప్పుడు వాళ్ళకు నాలుకల్లా అగ్ని జ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరి మీదా దిగినవి.
4 అందరూ పవిత్రాత్మతో నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్లాడటానికి పవిత్రాత్మ శక్తినిచ్చాడు.
5 అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని దేశాలకు చెందిన దైవభక్తిగల యూదులు ఉండినారు.
6 ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్భ్రాంతి చెందాడు.
7 వాళ్ళు దిగ్భ్రాంతి చెంది, “మాట్లాడుతున్న వాళ్ళందరూ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా?
8 అలాంటప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం ఎలా వింటున్నాడు.
9 మేము, అంటే ‘పార్తి’ దేశం వాళ్ళు, ‘మాదీ’ దేశం వాళ్ళు, ‘ఏలామీ’ దేశం వాళ్ళు, ‘మెసొపొతమియ’ నివాసులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ నివాసులు,
10 ప్రుగియ, పంపులియ, ఈజిప్టు ప్రాంతాల వాళ్ళు, ‘లిబియ’ లోని ‘కురేనే’ దగ్గరున్న ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు, రోము నగరం నుండి వచ్చిన వాళ్ళు,
11 యూదులు, యూద మతంలో చేరిన వాళ్ళు, క్రేతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” అని అన్నారు.
12 దిగ్భ్రాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు అర్థం కాకపోవటం వల్ల, “దీని అర్థమేమిటి” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.
13 ‘బాగా మద్యం త్రాగి మత్తులో ఉన్నారు’ అని కొందరు వాళ్ళనెగతాళి చేసారు.
14 ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజలారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
15 5మీరనుకొన్నట్లు వీళ్ళు త్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది గంటలే కదా!
16 దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి:
17 ‘దేవుడు ఈ విధంగా అంటున్నాడు: ఈ చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై కురిపిస్తాను! మీ కుమారులు, కుమార్తెలు, నా ప్రవచనాలు పలుకుతారు! మీ యువతరం దివ్యదర్శనాలు చూస్తుంది. వయస్సు మళ్ళిన మీ వాళ్ళు కలలుగంటారు.
18 ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు.
19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు చెలరేగుతాయి.
20 సూర్యుణ్ణి చీకటిగా మారుస్తాను. చంద్రుణ్ణి ఎర్రటి రక్తంలా మారుస్తాను. ఉత్కృష్టమైనటువంటి, తేజోవంతమైనటువంటి ప్రభువు యొక్క దినం రాక ముందే యిది జరుగుతుంది.
21 అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు ప్రతి ఒక్కణ్ణి ప్రభువు రక్షిస్తాడు.’ యోవేలు 2:28-32
22 “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని ఆయన ద్వారా మహాత్యాలు, అద్భుతాలు మీకోసం చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహాత్యాలు, అద్భుతాలు చేసినట్లు, సూచనలు చూపినట్లు మీకు ఇదివరకే తెలుసు.
23 దైవ సంకల్పానుసారం ఆయన దివ్య జ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు.
24 కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణ వేదన నుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని బంధించి ఉంచటం చేతకాలేదు.
25 దావీదు యేసును గురించి ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను. నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!
26 అందుకే నా మాటల్లో ఆనందం నిండి యున్నది. అందుకే నా దేహం ఆశతో జీవిస్తోంది.
27 ఎందుకంటే, నా ఆత్మను నీవు చనిపోయిన వాళ్ళతో వదిలివేయవు నీవు నీ భక్తుని దేహాన్ని కుళ్ళనీయవు.
28 నాకు జీవపు దారుల్ని చూపావు! నా వెంటే ఉండి నాకు ఆనందం కలిగించావు!’ కీర్తన 16:8-11
29 “సోదరులారా! మన వంశీయుడైన దావీదును గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చనిపొయ్యాడు. అతణ్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ నాటికీ ఉంది.
30 దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో పుట్టిన వాణ్ణొకణ్ణి సింహాసనంపై కూర్చోబెడ్తానని దేవుడు అతనికి ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. ఇది దావీదుకు తెలుసు.
31 ఈ జరుగనున్న దాన్ని గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు: ‘దేవుడు ఆయన్ని సమాధిలో వదిలివేయ లేదు. ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు.’ క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలాడుచూ ఉన్నాడు.
32 కావున దేవుడు ఈ యేసునే మృత్యువు నుండి బ్రతికించినాడు. దీనికి మేమంతా సాక్ష్యము.
33 యేసు పరలోకానికి ఎత్తబడినాడు. ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిప్రక్కన ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మను యేసుకు ఇచ్చాడు. దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మయే. యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు వింటున్నది, చూస్తున్నదీ.
34 [This verse may not be a part of this translation]
35 [This verse may not be a part of this translation]
36 “అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు.”
37 ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
38 పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది.
39 దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”
40 వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.”
41 అతని సందేశాన్ని అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.
42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై; ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు.
43 దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది.
44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనే వాళ్ళు.
45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు.
46 ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించే వాళ్ళు,
47 దేవుణ్ణి స్తుతించే వాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించిన వాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.
1 ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం.
2 కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించే వాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు.
3 ఈ కుంటివాడు, పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.
4 పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు.
5 ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు.
6 అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్న దాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,
7 అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది.
8 అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు.
9 మందిరంలో ఉన్న వాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు.
10 భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరింగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.
11 ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటి పెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తు కొంటూ వెళ్ళారు.
12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు?
13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు.
14 పవిత్రుడు, నీతిమంతుడు, అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు.
15 మీరు, మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
16 మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు.
18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు.
19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి.
20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.
21 చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. “సర్వం పునః స్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి.
22 మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి.
23 దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళ నుండి దూరం చేసి నాశనం చేస్తాడు’
24 సమూయేలు కాలం నుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు.
25 మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు, మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’ అని అన్నాడు.
26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.
1 యాజకులు, మందిరం యొక్క ద్వార పాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహానులు ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు.
2 ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది.
3 వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు.
4 వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది.
5 మరుసటి రోజు నాయకులు, పెద్దలు పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు.
6 ‘అన్న,’ అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందిన వాళ్ళు అంతా ఆ సమావేశంలో ఉన్నారు.
7 పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు.
8 అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా!
9 ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా?
10 అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు.
11 ‘ఇల్లుకట్టు వాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే! ఇప్పుడది మూలకు తలరాయి అయింది, ఆ రాయి యేసే.’ కీర్తన 118:22
12 రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”
13 పేతురు, యోహానులు చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలిసిపోయింది. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని గ్రహించారు.
14 కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు.
15 వాళ్ళను మహా సభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు:
16 “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం.
17 కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.”
18 వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు.
19 కాని పేతురు, యోహానులు వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి.
20 ఎందుకంటే మేము చూసిన దాన్ని, విన్న దాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు.
21 వాళ్ళు పేతురును, యోహానును, యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు.
22 దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.
23 విడుదలయ్యాక పేతురు, యోహానులు తమ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధాన యాజకులు, పెద్దలు చెప్పినదంతా చెప్పారు.
24 ఇది విన్నాక వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు: “మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు.
25 నీవు పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన దావీదు నోటినుండి యిలా పలికించావు: ‘జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి?
26 ప్రజలెందుకు వృధాగా పన్నాగాలు పన్నుతున్నారు? రాజులు, పాలకులు కలిసి ప్రభువును, ఆయన క్రీస్తును ఎందుకు ఎదిరిస్తున్నారు?’ కీర్తన 2:1-2
27 హేరోదు మరియు పొంతి పిలాతు, ఇశ్రాయేలు ప్రజలతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. అంతా కలిసి పవిత్రతగల నీ సేవుకుణ్ణి, నీవు క్రీస్తుగా నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు.
28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు.
29 ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు!
30 యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. ఆయన పేరిట రోగుల్ని నయం చెయ్యటానికి, అద్భుతాలు, మహాత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని చాపి మాకు శక్తినివ్వు!”
31 వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవ సందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
32 విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ ‘ఇది నాది’ అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనే వాళ్ళు.
33 దైవికమైన శక్తితో అపొస్తలులు ప్రభువు బ్రతికి వచ్చాడని ఋజువు చేసారు. దేవుని అనుగ్రహం వాళ్ళందరిపై సంపూర్ణంగా ఉంది.
34 వాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు ఉండేవి కావు. ఇండ్లు, పొలాలు ఉన్న వాళ్ళు వాటిని అమ్మి,
35 ఆ డబ్బును అపొస్తలుల పాదాల ముందుంచే వాళ్ళు. ఆ అపొస్తలులు అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచేవాళ్ళు.
36 యోసేపు అనే అతడు లేవి వంశీయుడు. ఇతడు సైప్రసు (కుప్ర) ద్వీపానికి చెందినవాడు. ఇతణ్ణి అపొస్తలులు బర్నబా (ప్రోత్సాహపు కుమారుడని ఈ పదానికి అర్థం) అని పిలిచే వాళ్ళు.
37 ఇతడు తన పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల ముందుంచాడు.
1 ‘అననీయ’ అనబడే ఒక వ్యక్తి, అతని భార్య ‘సప్పీరా’ కలిసి తమ భూమి అమ్మేసారు.
2 ‘అననీయ’ తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. ‘అననీయ’ మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.
3 అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా నీ మనస్సులో సైతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు?
4 అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది. నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”
5 ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది.
6 కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.
7 మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు.
8 పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు. “ఔనండి! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.
9 పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసిన వాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు.
10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు.
11 సంఘానికి, ఈ సంఘటనలు విన్న వాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.
12 అపొస్తలులు, విశ్వాసులు, ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు.
13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు.
14 చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు.
15 ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్న వాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం.
16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్న వాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.
17 సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్న వాళ్ళు అసూయతో నిండిపోయారు.
18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు.
19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు.
20 వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు.
21 దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోదించటం మొదలు పెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు.
22 [This verse may not be a part of this translation]
23 [This verse may not be a part of this translation]
24 ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు, వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.
25 ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచిన వాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు.
26 ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.
27 అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ,
28 “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధనలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు.
29 పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు.
30 మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వీకుల దేవుడు బ్రతికించాడు.
31 దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిలా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం.
32 వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.”
33 ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు.
34 కాని ‘గమలీయేలు’ అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు.
35 అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి!
36 ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్ప వాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందల యాభై మంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరి పోయారు. చివరకు ఏమీ మిగల్లేదు.
37 అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు,
38 అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది.
39 అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు.
40 సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు.
41 అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహా సభనుండి వెళ్ళిపోయారు.
42 ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా, “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.
1 యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదులతో, “మా వితంతువుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు” అని తగువు పెట్టుకొన్నారు.
2 అందువల్ల ఆ పన్నెండు మంది అపొస్తలులు అనుచరులందర్ని సమావేశ పరిచి ఈ విధంగా అన్నారు: “అన్నదానాల విషయం చూడటానికోసం మేము దేవుని సందేశం యొక్క బోధన విషయంలో అశ్రద్ధ వహించటం మంచిది కాదు.
3 సోదరులారా! పవిత్రాత్మ సంపూర్ణంగాగల వాళ్ళను, పూర్ణ జ్ఞానం కలవాళ్ళను ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత వాళ్ళకప్పగిస్తాం.
4 మేము మా కాలాన్ని ప్రార్థనలకు, దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.”
5 అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికీ బాగా నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్నుకొన్నారు. స్తెఫను దేవుని పట్ల గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవిత్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతణ్ణే కాక ఫిలిప్పును, ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల మతంలో చేరినవాడు.
6 ప్రజలు వీళ్ళను అపొస్తలుల ముందుకు పిలుచుకొని వచ్చారు. అపొస్తలులు ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు.
7 దేవుని సందేశం ప్రచారమైంది. యెరూషలేములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. చాలా మంది యాజకులు విశ్వసించారు.
8 దేవుని నుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్భుతాలు చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు.
9 కాని స్వతంత్రుల సమాజమని పిలువబడే సమాజానికి చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టుకొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్సంద్రియ పట్టణాలకు చెందిన యూదులు, కిలికియ, ఆసియ ప్రాంతాలకు చెందిన యూదులు కూడా ఉన్నారు.
10 కాని మాట్లాడటానికి పవిత్రాత్మ అతనికి తెలివినిచ్చాడు. కనుక అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు.
11 ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ స్తెఫను, మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం మేము విన్నాము” అని చెప్పమన్నారు.
12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్ని, కూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.
13 [This verse may not be a part of this translation]
14 [This verse may not be a part of this translation]
15 సభలో కూర్చొన్న వాళ్ళంతా స్తెఫను వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక దేవదూత ముఖంలా కనిపించింది.
1 ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు.
2 అతడు సమాధానంగా "అయ్యలారా! సోదరులారా చెప్పేది వినండి, అది, మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట.
3 అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు.
4 అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతణ్ణి స్థిరపర్చాడు.
5 దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్థిగా యివ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా, అతనికి, అతని తర్వాత రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేసాడు.
6 దేవుడతనితో, ‘నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు, నీ వాళ్ళను నాలుగు వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని వాళ్ళను కష్టపెడతారు.
7 వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని, నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు.
8 సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రహాము అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు వంశాలకు మూల పురుషులయ్యారు.
9 “వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి,
10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజ భవనాలకు అధికారిగా నియమించాడు.
11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వీకులకు తినటానికి తిండి కూడా లేకుండింది.
12 ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వీకుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు.
13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది.
14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు.
15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వీకులు అందరూ చనిపోయారు.
16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉన్నాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.
17 “దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది.
18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు.
19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.
20 ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు.
21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది.
22 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరిన వాడయ్యాడు.
23 “మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు.
24 ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలీవానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు.
25 ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు.
26 మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు.
27 ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు?
28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు.
29 ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు.
30 “నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు.
31 ఆ దృశ్యాన్ని చూసి మోషే దిగ్భ్రాంతి చెందాడు. దగ్గరనుండి చూడాలనుకొని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం వినిపించింది.
32 ఆ స్వరం అతనితో ‘నేను మీ పూర్వుల దేవుణ్ణి! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి!’ అని అన్నాడు. మోషే వణికిపోయాడు. తలెత్తి చూడటానికి అతనికి ధైర్యం చాలలేదు.
33 ప్రభువు, “చెప్పులు తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది.
34 నా ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూసాను. వాళ్ళ ఏడుపులు విన్నాను. వాళ్ళకు విముక్తి కలిగించటానికి వచ్చాను. రా! నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను!’ అని అన్నాడు.
35 స్తెఫను ఇంకా ఇలా చెప్పాడు: “నిన్ను పాలకునిగా, న్యాయాధిపతిగా చేసిందెవరు?’ అని వాళ్ళచే తిరస్కరించబడినవాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ళ పాలకునిగా, రక్షకునిగా పంపినట్లు పొదలో కనిపించిన దేవదూత ద్వారా తెలియచేసాడు.
36 మోషే అద్భుతాలు, మహత్యాలు చేసి వాళ్ళను ఈజిప్టు నుండి వెలుపలికి పిలుచుకు వచ్చాడు. ఎఱ్ఱ సముద్రం దగ్గర, ఆ తర్వాత నలభై సంవత్సరాలు ఎడారుల్లో కూడా అద్భుతాలు, మహాత్యాలు చేసాడు.
37 ‘నాలాంటి ప్రవక్తను దేవుడు మీనుండి ఎన్నుకొని మీకందిస్తాడు’ అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే!
38 ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైనప్పుడు, అక్కడున్న మన పూర్వీకులతో కలిసి ఉన్నవాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో మాట్లాడింది మోషేనే. మనకు అందివ్వటానికి సజీవమైన దైవసందేశాన్ని పొందింది మోషేనే.
39 “కాని మన పూర్వీకులు అతని మాటలు వినలేదు. పైగా అతణ్ణి తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్ళాలనుకొన్నారు.
40 అందువల్ల అహరోనుతో, ‘మాకు దారి చూపించగల దేవుళ్ళ విగ్రహాలను సిద్ధం చేయించు. మమ్మల్ని ఈజిప్టు నుండి పిలుచుకు వచ్చిన ఆ మోషేకు ఏమైందో ఏమో!’ అని అన్నారు.
41 వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేసారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతుల్తో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకొన్నారు.
42 కాని దేవుడు విరక్తి చెంది, ‘ఆకాశంలోని మీ దేవుళ్ళను మీరు పూజించుకొండి’ అని అన్నాడు. దీన్ని గురించి ప్రవక్తల గ్రంథంలో యిలా వ్రాయబడి వుంది: ‘ఓ ఇశ్రాయేలు ప్రజలారా! ఎడారుల్లో నలభై సంవత్సరాలు పశువుల్ని బలి యిచ్చింది నా కోసం కాదు!
43 మీరు మీ వెంట మోసుకు వెళ్ళింది, ‘మొలొకు’ యొక్క డేరా! మీరు మోసుకు వెళ్ళింది మీరు దేవుడనుకొంటున్న ‘రొంఫా’ నక్షత్రం యొక్క విగ్రహాన్ని! దాన్ని మీరు పూజించుకోవటానికి సృష్టించుకున్నారు. కనుక మిమ్మల్ని బబులోను నగరానికి దూరంగా పంపుతాను!’ ఆమోసు 5:25-27
44 “మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు.
45 ఆ తర్వాత ఇది మన పూర్వీకులకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది.
46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వుమని దేవున్ని కోరాడు.
47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.
48 “కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు:
49 ‘ఆకాశం నా సింహాసనం! భూమి నా పాద పీఠం! నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది?
50 ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.” యెషయా 66:1-2
51 స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కాని వాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవ సందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు.
52 మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పిన వాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు.
53 దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు.
54 ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు.
55 కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపే చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు.
56 “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.
57 ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు.
58 అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటన చూస్తున్న వాళ్ళు తమ వస్త్రాల్ని ‘సౌలు’ అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు.
59 వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు.
60 ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.
1 అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. సౌలు సంఘాన్ని హింసించటం
2 [This verse may not be a part of this translation]
3 [This verse may not be a part of this translation]
4 ఇలా చెదిరిపోయిన వాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు.
5 ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు.
6 [This verse may not be a part of this translation]
7 [This verse may not be a part of this translation]
8 ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు.
9 సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలం నుండి ఇంద్రజాలం చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్ప వాణ్ణని చెప్పుకొనేవాడు.
10 చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే ఆ దైవికమైన శక్తి అతనిలో మూర్తీభవించి ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు.
11 అతడు వాళ్ళను తన ఇంద్రజాలంతో చాలాకాలం నుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు.
12 కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు.
13 సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహాత్యాల్ని అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.
14 యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు.
15 పేతురు, యోహానులు వచ్చి అక్కడి వాళ్ళకు పవిత్రాత్మ లభించాలని ప్రార్థించారు.
16 ఎందుకంటే అక్కడి వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు.
17 వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు.
18 అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో,
19 “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు.
20 పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ!
21 దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు.
22 నీ దుర్భుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
23 నీలో విషం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అధర్మానికి లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు.
24 ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు.
25 పేతురు, యోహానులు తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు.
26 ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు.
27 అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇథియోపియన్ల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి,
28 తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా,
29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండు” అని అన్నాడు.
30 ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు.
31 “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు.
32 ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతువున్నాడు: “చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు తన బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడ లేదు!
33 ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు. ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు. ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?” యెషయా 53:7-8
34 ఆకోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పండి!” అని అడిగాడు.
35 ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు.
36 ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, మీరు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగాడు.
37 దాన్ని ఆపమని ఆజ్ఞాపించి, ఫిలిప్పు ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు.
38 ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు.
39 వాళ్ళు నీళ్ళ నుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు.
40 ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడి నుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు.
1 సౌలు, ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా బసలు కొడ్తూనే ఉన్నాడు.
2 ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు మార్గాన్ని అనుసరించే వాళ్ళు కనిపిస్తే స్త్రీ, పురుష భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం.
3 అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
4 అతడు నేల కూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది.
5 “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు.
6 “నేను నీవు హింసిస్తున్న యేసును. లేచి పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు.
7 సౌలుతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు.
8 క్రింద పడ్డ సౌలు లేచి నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి నడిపించారు.
9 [This verse may not be a part of this translation]
10 డెమాస్కసులో యేసు భక్తుడొకడుండేవాడు. అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో కనపడి, ‘అననీయా!’ అని పిలిచాడు. “ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు జవాబు చెప్పాడు.
11 ప్రభువతనితో, ‘‘‘తిన్నని వీధి’ అని పిలువబడే వీధిలో ఉన్న ‘యూదా’ యింటికి వెళ్ళు, ‘తార్సు’ అనే పట్టణం నుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. అతడు ప్రార్థిస్తూ ఉంటాడు.
12 అతడొక దివ్యదర్శనంలో ‘అననీయ’ అనే పేరుగలవాడు అతని దగ్గరకు వచ్చినట్లు, అతనికి దృష్టి రావటానికి అతనిపై చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు.
13 అననీయ, “ప్రభూ, అతడు యెరూషలేంలోని పరిశుద్ధులకు చాలా హాని చేసినట్లు చాలా మంది విన్నారు.
14 మిమ్మల్ని శరణుజొచ్చిన ప్రతి ఒక్కణ్ణి బంధించే అధికారం అతడు ప్రధాన యాజకుల దగ్గరనుండి పొందాడు”, అని సమాధానం చెప్పాడు.
15 అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా పేరు యూదులు కాని వాళ్ళకు, వాళ్ళ పాలకులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితణ్ణి నేను ఒక సాధనంగా ఎన్నుకొన్నాను.
16 నా పేరిట అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియచేస్తాను” అని అన్నాడు.
17 ఆ తర్వాత అననీయ అక్కడి నుండి బయలుదేరి సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సౌలు మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నివిక్కడికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని నన్ను పంపాడు” అని అన్నాడు.
18 వెంటనే పొరల్లాంటివి సౌలు కళ్ళనుండి రాలి క్రిందపడ్డాయి. అతడు మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము పొందాడు.
19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది. సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు.
20 ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు.
21 అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపిన వాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు.
22 కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, ‘యేసు ప్రభువే క్రీస్తు’ అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు.
23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు.
24 కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు.
25 కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు.
26 సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు.
27 కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు.
28 స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు.
29 గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు.
30 సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడి నుండి తార్సుకు పంపారు.
31 ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహాంపొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
32 పేతురు దేశమంతా తిరుగుతూ ‘లుద్ద’ అనే పట్టణంలో నివసిస్తున్న విశ్వాసుల్ని కలుసుకోవటానికి వెళ్ళాడు.
33 అక్కడ ఎనిమిదేళ్ళ నుండి పక్షవాతంతో మంచంపట్టిన ‘ఐనెయ’ అనే వాణ్ణి చూసాడు.
34 “ఐనెయా! అని పిలిచి యేసు క్రీస్తు నీకు నయం చేస్తాడు. లేచి నీ పరుపును సర్దుకో!” అని అన్నాడు. ఐనెయ వెంటనే లేచి నిలుచున్నాడు.
35 లుద్ద, షారోను పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళంతా ఐనెయను చూసి ప్రభువునందు విశ్వాసముంచారు.
36 ‘యొప్పే’ అనే పట్టణంలో, తబితా అనే శిష్యురాలు ఉండేది. ఈమెను గ్రీకు భాషలో దొర్కా అని పిలిచే వాళ్ళు. ఈమె పేదలకు సహాయం చేస్తూ ఉండేది. ఎప్పుడూ మంచి పనులు చేసేది.
37 పేతురు అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బు పడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ మీది గదిలో ఉంచారు.
38 లుద్ద యొప్పే పట్టణానికి దగ్గరగా ఉండింది. పేతురు లుద్దలో ఉన్నాడని, శిష్యులు యిద్దరు మనుష్యుల్ని అతని దగ్గరకు పంపి వెంటనే రమ్మని వేడుకున్నారు.
39 పేతురు వాళ్ళ వెంట వెళ్ళాడు. అతడు రాగానే మేడ మీది గదికి తీసుకు వెళ్ళారు. అతని చుట్టూ చేరిన వితంతువులు, దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన రకరకాల దుస్తుల్ని చూపి విలపించారు.
40 పేతురు వాళ్ళందర్ని గదినుండి వెలుపలికి పంపి తన మోకాళ్ళపై ప్రార్థించాడు. శవం వైపు తిరిగి, “లే, తబితా!” అని అన్నాడు. ఆమె కళ్ళు తెరిచింది. పేతురును చూసి లేచి కూర్చుంది.
41 అతడు చేతులందించి ఆమె నిలబడటానికి సహాయం చేసాడు. ఆ తదుపరి పేతురు భక్తుల్ని, వితంతువుల్ని పిలిచి వాళ్ళకు ప్రాణంతో ఉన్న తబితాను చూపాడు.
42 యొప్పే ప్రాంతమంతా యిది తెలిసిపోయింది. అనేకులు ప్రభువు భక్తులయ్యారు.
43 పేతురు యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టే వాని యింట్లో చాలా రోజులు గడిపాడు.
1 కైసరియ అనే పట్టణంలో కొర్నేలీ అనే పేరుగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు, ‘ఇటలీ’ దళంలో శతాధిపతిగా పని చేస్తూ ఉండేవాడు.
2 అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికి దేవుడంటే భయభక్తులుండేవి. అతడు తన డబ్బును ధారాళంగా దానం చేసేవాడు. దేవుణ్ణి ఎల్లప్పుడు ప్రార్థించే వాడు.
3 ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అతనికి ఒక దివ్య దర్శనంలో ఒక దేవదూత తన ముందు ప్రత్యక్షం కావటం స్పష్టంగా చూసాడు. ఆ దేవదూత అతణ్ణి సమీపించి, ‘కొర్నేలీ’ అని పిలిచాడు.
4 కొర్నేలీ అతని వైపు చూసి భయంతో, “ఏమిటి ప్రభూ” అని అడిగాడు. ఆ దేవదూత కొర్నేలీతో, “నీ ప్రార్థనలు, పేదవాళ్ళకు నీవు చేస్తున్న దానాలు దేవుడు గుర్తించాడు.
5 ఇప్పుడు నీవు కొందర్ని సీమోను అని పిలువబడే పేతురును పిలుచుకొని రావటానికి యొప్పేకు పంపు.
6 అతడు ప్రస్తుతం సీమోను అనే చెప్పులు కుట్టే వాని యింట్లో అతిథిగా ఉంటున్నాడు. అతని యిల్లు సముద్రము తీరాన ఉంది” అని అన్నాడు.
7 ఇలా చెప్పి దేవదూత వెళ్ళిపోయాడు. ఆ తదుపరి కొర్నేలీ తన సేవకుల్లో యిద్దర్ని పిలిచాడు. ఇంటి పనులు చేసే భటుల్లో ఒకణ్ణి పిలిచాడు. ఈ భటుడు దైవ భక్తి కలవాడు.
8 జరిగినదంతా వాళ్ళకు చెప్పి వాళ్ళను యొప్పేకు పంపాడు.
9 మరుసటి రోజు వాళ్ళు యొప్పేను సమీపించారు. అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు. అదే నమయంలో పేతురు ప్రార్థించటానికి మిద్దె మీదికి వెళ్ళినాడు.
10 పేతురుకు ఆకలి వేసింది. ఏదైనా తినాలనుకొన్నాడు. అతని కోసం వంట సిద్ధం చేస్తుండగా అతనికి దర్శనం కలిగింది.
11 “ఆ దర్శనంలో ఆకాశం తెరుచుకొని ఏదో క్రిందికి దిగి రావటం చూశాడు. అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు అది భూమ్మీదికి దిగింది.
12 అందులో నాలుగు కాళ్ళున్న అన్ని రకాల జంతువులు, ప్రాకే ప్రాణులు, గాలిలో ఎగిరే పక్షులు ఉన్నాయి.
13 ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది.
14 పేతురు, “ప్రభూ! నేనలా చెయ్యలేను. అధమమైన దాన్ని, పరిశుభ్రంగా లేనిదాన్ని నేను ఎన్నడూ తినలేదు” అని సమాధానం చెప్పాడు.
15 ఆ స్వరం రెండవసారి, “దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రం అనకు” అని అన్నది.
16 ఇలా మూడు సార్లు జరిగిన వెంటనే అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది.
17 పేతురు ఈ దివ్య దర్శనానికి అర్థం తెలియక దాన్ని గురించి ఆశ్చర్యంతో ఆలోచిస్తున్నాడు. ఇంతలో కొర్నేలీ పంపిన మనుష్యులు సీమోను యిల్లు ఎక్కడుందో కనుక్కొని అతని యింటి ముందు ఆగారు.
18 “పేతురు అని పిలుస్తారే ఆ సీమోను యిక్కడ అతిథిగా ఉంటున్నాడా?” అని యింటి వాళ్ళను అడిగారు.
19 దివ్య దర్శనాన్ని గురించి పేతురు యింకా ఆలోచిస్తుండగా దేవుని ఆత్మ అతనితో, “ఇదిగో! ముగ్గురు వ్యక్తులు నీ కోసం వెతుకుతున్నారు.
20 లేచి క్రిందికి వెళ్ళు. వాళ్ళను పంపింది నేనే. కనుక వాళ్ళ వెంట వెళ్ళటానికి కొంచెం కూడా సంకోచపడకు” అని చెప్పాడు.
21 పేతురు క్రిందికి వెళ్ళి వాళ్ళతో, “ఇదిగో! మీరు చూస్తున్నది నా కొరకే! ఎందుకొచ్చారు!” అని అడిగాడు.
22 వాళ్ళు, “మేము కొర్నేలీ అనే శతాధిపతి దగ్గర్నుండి వచ్చాము. అతడు మంచివాడు. దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యూదులందరు అతణ్ణి గౌరవిస్తారు. మిమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మీరు చెప్పింది వినవలెనని పవి త్రమైన దేవదూత అతనితో చెప్పాడు” అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను యింట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రికి అక్కడే ఉండమన్నాడు.
23 మరుసటి రోజు పేతురు వాళ్ళతో ప్రయాణమయ్యాడు. యొప్పేలోని కొందరు సోదరులు కూడా అతని వెంట వెళ్ళారు.
24 ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియ చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి ఆహ్వానించాడు.
25 పేతురు యింట్లోకి అడుగు పెడ్తుండగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు.
26 పేతురు అతనిని లేపుతూ, “లెమ్ము! నేను కూడా ఒక మనిషినే”అని అన్నాడు.
27 పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమావేశమై ఉండటం చూసాడు.
28 పేతురు వాళ్ళతో, “యూదుడు, యూదుడు కాని వానితో కలిసి ఉండరాదనీ, అతని యింటికి వెళ్ళరాదనీ యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీకందరికి తెలుసు. కావున ఏ వ్యక్తినీ అధమంగా భావించరాదు. పరిశుభ్రత లేని వాడని అనకూడదు. ఇది నాకు దేవుడు తెలియజేసాడు.
29 కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేను యిప్పుడు కారణం అడగవచ్చా?” అని అన్నాడు.
30 కొర్నేలీ యిలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం యిదే సమయంలో యింట్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు పగలు మూడు గంటలు. అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు.
31 అతడు నాతో, ‘కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు.
32 పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టే వాని యింట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని యిల్లు సముద్ర తీరాన ఉంది’ అని చెప్పాడు.
33 మిమ్మల్ని పిలుచుకు రావటానికి తక్షణం మనుష్యుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని చేసారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పుమని ప్రభువు మీకాజ్ఞాపించిన వన్నీ వినటానికి సిద్ధంగా ఉన్నాము.”
34 [This verse may not be a part of this translation]
35 [This verse may not be a part of this translation]
36 ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు.
37 యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు.
38 నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సైతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు.
39 యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు.
40 కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం.
41 అందరూ ఆయన్ని చూడలేదు. ఇది వరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం.
42 ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పుమని, సువార్తను ప్రకటించుమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు.
43 యేసును నమ్మిన వాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.
44 పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడి వాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు.
45 పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు.
46 యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కాని వాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కాని వాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు:
47 “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.”
48 యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండుమని అడిగారు.
1 అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కాని వాళ్ళకు కూడా దైవ సందేశం లభించిందని విన్నారు.
2 పేతురు యెరూషలేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించే వాళ్ళ గుంపు అతణ్ణి విమర్శిస్తూ,
3 “నీవు సున్నతి చేసుకోని వాళ్ళ యిళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి తిన్నావు!” అని అన్నారు.
4 పేతురు వాళ్ళకు జరిగింది జరిగినట్లు ఈ విధంగా విడమర్చి చెప్పటం మొదలు పెట్టాడు:
5 “నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక దివ్య సంగతి చూసాను. ఆ దివ్య దర్శనంలో ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశంనుండి ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు చూసాను. అది నేనున్న స్థలంలో దిగింది.
6 నేను అందులో ఏముందోనని జాగ్రత్తగా చూసాను. భూమ్మీద నివసించే నాలుగు కాళ్ళ జంతువులు, క్రూర మృగాలు, ప్రాకే ప్రాణులు, గాల్లో ఎగిరే పక్షులు కనిపించాయి.
7 అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, ‘పేతురూ! లే! వీటిలో ఏ జంతువునైనా చంపి దానిని తిను!’ అని అంది.
8 ‘నేనాపని చేయలేను ప్రభూ! తినకూడదన్న దాన్ని నా నాలుక ఎన్నడూ రుచి చూడలేదు’ అని నేను సమాధానం చెప్పాను.
9 ఆకాశం నుండి ఆ స్వరం రెండవసారి యిలా అంది: ‘దేవుడు తినవచ్చని అన్న వాటిని తినకూడదని అనకు.’
10 ఇలా మూడుసార్లు జరిగాక అది ఆకాశానికి తిసుకు వెళ్ళబడింది.
11 అదే క్షణంలో నన్ను పిలుచుకు వెళ్ళడానికి కైసరియనుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేనున్న యింటి ముందు ఆగారు.
12 వాళ్ళతో వెళ్ళటానికి నేను ఏ మాత్రం వెనకాడరాదని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. అక్కడున్న ఆరుగురు సోదరులు కూడా నాతో వచ్చారు. మేమంతా కలిసి కొర్నేలీ యింటికి వెళ్ళాం.
13 అతడు తన యింట్లో ఒక దేవదూత ప్రత్యక్షమైన విషయము, అతణ్ణి తాను చూసిన విషయము, దేవదూత, ‘పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు,
14 అతడు మాట్లాడే విషయాలు నిన్ను, నీ యింట్లోని వాళ్ళనందరిని రక్షిస్తాయి’ అని తనతో చెప్పిన విషయము మాకు చెప్పాడు.
15 నేను మాట్లాడటం మొదలెడుతుండగా, మొట్టమొదట మన మీదికి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు కూడా వచ్చాడు.
16 ‘యోహాను నీళ్ళతో బాప్తిస్మము యిచ్చాడు కాని నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతావు!’ అని అన్న యేసు ప్రభువు మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి.
17 మనం యేసు క్రీస్తు ప్రభువును నమ్మినందుకు మనకిచ్చిన వరమునే దేవుడు వాళ్ళకు కూడా యిచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎదిరించటానికి నేనెవర్ని?”
18 వాళ్ళీ మాటలు విన్నాక వేరే ఆక్షేపణలు చేయలేదు. దేవుడు యూదులు కాని వాళ్ళకు కూడా మారు మనస్సు కలిగి రక్షణ పొందే అవకాశ మిచ్చాడంటూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
19 స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవ సందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు.
20 సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు.
21 ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులైయ్యారు.
22 యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది.
23 అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండుమని, అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు.
24 బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులైయ్యారు.
25 ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు.
26 సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించే వాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు.
27 ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు.
28 వాళ్ళలో ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో, “తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా రాబోతోంది” అని సూచించాడు. ఈ కరువు క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది. 29ఇది విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనయిన సహాయం వాళ్ళు చెయ్యాలని నిర్ణయించుకొన్నారు.
29 అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు.
30 [This verse may not be a part of this translation]
1 ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందర్ని హింసించటం మొదలు పెట్టాడు.
2 అతడు యోహాను సోదరుడైన యాకోబును కత్తితో నరికి వేయించాడు.
3 ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది.
4 అతణ్ణి బంధించి కారాగారంలో వేసాడు. పూటకు నలుగురి చొప్పున కాపలా కాయుమని చెప్పి పదహారుగురు భటులకు అతణ్ణి అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతణ్ణి ప్రజల ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని ఉద్దేశ్యం.
5 పేతురును అంతదాకా కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందిన వాళ్ళు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు.
6 హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆ నాటి రాత్రి పేతురు యిరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. సైనికులు అతణ్ణి రెండు యినుప గొలుసులతో కట్టివేసి ఉంచారు. మరి కొందరు సైనికులు కారాగారం ముందు కాపలా కాస్తూ ఉన్నారు.
7 అకస్మాత్తుగా ప్రభువు దూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గదియంతా వెలుగుతో నిండిపోయింది. ప్రభువు దూత పేతురు భుజం తట్టి, “త్వరగా లెమ్ము!” అని అంటూ అతణ్ణి నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంకెళ్ళు వూడిపోయాయి.
8 ఆ దూత, “లేచి, నీ దుస్తులు సరిచేసుకొని, చెప్పులు తొడుక్కో!” అని అన్నాడు. పేతురు అలాగే చేసాడు. “నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని నా వెంటరా!” అని దూత అన్నాడు.
9 పేతురు అతణ్ణి అనుసరిస్తూ కారాగారంనుండి వెలుపలికి వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరుగుతుందని అతడు అనుకోలేదు. తానొక కలకంటున్నాననుకొన్నాడు.
10 వాళ్ళు మొదటి కాపలా వాణ్ణి, రెండవ కాపలా వాణ్ణి దాటి పట్టణంలోకి వెళ్ళే యినుప ద్వారం దగ్గరకు వచ్చారు. అది వాళ్ళ కోసం దానంతట అదే తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు. కొంత దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభువు దూత అతణ్ణి వదిలి వెళ్ళిపోయాడు.
11 అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు, “ప్రభువు తన దూతను పంపి హేరోదు బంధం నుండి మరియు కీడు కలగాలని ఎదురు చూస్తున్న యూదుల నుండి, నన్ను రక్షించాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు” అని తనలో తాను అనుకొన్నాడు.
12 జరిగిన వాటిని గ్రహించాక యోహాను తల్లియైన మరియ యింటికి వెళ్ళాడు. యోహాన్ని మార్కు అని కూడా పిలిచే వాళ్ళు. అక్కడ చాలా మంది సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నారు.
13 పేతురు తలుపు తట్టాడు. ‘రొదే’ అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది.
14 ఆమె పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ ఆనందంలో తలుపు కూడా తెరవకుండా లోపలికి పరుగెత్తి, “పేతురు తలుపు ముందున్నాడు” అని కేక వేసింది.
15 వాళ్ళంతా “నీకు మతిపోయింది” అని అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి చెప్పింది. దానికి వాళ్ళు, “అది అతని దూత అయివుంటుంది” అని అన్నారు.
16 పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు.
17 పేతురు వాళ్ళందర్ని నిశ్శబ్దంగా ఉండుమని సంజ్ఞ చేసాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారం నుండి ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో అందరికీ విశదంగా చెప్పాడు. “యాకోబకు, మిగతా సోదరులకు దీన్ని గురించి చెప్పండి” అని చెప్పి, వాళ్ళను వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపొయ్యాడు.
18 ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు.
19 హేరోదు పేతుర్ని వెతకటానికి అంతా గాలించమన్నాడు. కాని పేతురు కనిపించలేదు. హేరోదు కాపలా వాళ్ళను అడ్డు ప్రశ్నలు వేసి విచారించాడు. ఆ తదుపరి ఆ కాపలా వాళ్ళను చంపుమని ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన తదుపరి హేరోదు యూదయ నుండి కైసరియకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపాడు.
20 హేరోదు తూరు, సీదోను ప్రజల పట్ల చాలా కోపంతో ఉన్నాడు. వాళ్ళంతా యిప్పుడు ఒకటై హేరోదుతో మాట్లాడటానికి వెళ్ళారు. రాజుగారి ఆంతరంగిక స్నేహితుడైన ‘బ్లాస్తు’ను తమ వైపు త్రిప్పుకొని శాంతి కావాలని అడిగారు. వీళ్ళ రాజ్యం తమ ఆహారధాన్యాల కోసం హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం.
21 ఒక నియమితమైన రోజు హేరోదు రాజ దుస్తులు ధరించాడు. సింహాసనంపై కూర్చొని ప్రజల్ని సంబోధిస్తూ ఒక ఉపన్యాసం యిచ్చాడు.
22 “ఇది దేవుని కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు వేసారు.
23 దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభువు దూత అతణ్ణి తక్షణమే రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు.
24 దైవ సందేశం విని విశ్వసిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
25 బర్నబా, సౌలు తమ పని ముగించుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. తమ వెంట మార్కు అని పిలువబడే యోహాన్ను కూడా పిలుచుకు వచ్చారు.
1 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, ‘నీగెరు’ అని పిలువబడే ‘సుమెయోను’ కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు.
2 వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.
3 అక్కడున్న వాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.
4 పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు ‘సెలూకయ’ అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు.
5 అక్కడి నుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవ సందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.
6 వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి ‘పాపు’ అనే పట్టణం చేరుకున్నారు. ఇంద్రజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు ‘బర్‌యేసు,’
7 అతడు ‘సెర్గిపౌలు’ అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గిపౌలు తెలివిగలవాడు. దైవ సందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు.
8 ఇంద్రజాలికుడైన ‘ఎలుమ’ గ్రీకు భాషలో ఇది ఇతని పేరు. రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు.
9 అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ,
10 “నీవు సైతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు?
11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు. తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు.
12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధనలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.
13 ‘పాపు’ నుండి పౌలు, అతని స్నేహితులు, పంపూలియాలోని ‘పెర్గే’ అనే పట్టణానికి ఓడలో ప్రయాణం చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు.
14 వాళ్ళు పెర్గే నుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ అనే పట్టణాన్ని చేరుకున్నారు. ఒక విశ్రాంతి రోజు యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చున్నారు.
15 ధర్మశాస్త్రంలోని విషయాలు, ప్రవక్తల గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహపరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి మాట్లాడండి” అని అడగనంపారు.
16 పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి.
17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పరదేశీయులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్ప వాళ్ళుగా చేసాడు. తన అద్భుతమైన శక్తితో ఆ దేశం నుండి వాళ్ళను పిలుచుకెళ్ళి,
18 ఎడారుల్లో వాళ్ళ ప్రవర్తనను నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు.
19 కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు.
20 ఇవి చేయటానికి నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది. “ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలందాకా, నాయకత్వం వహించగల న్యాయాధిపతుల్ని పంపాడు.
21 తమకు ‘రాజు’ కావాలని కోరగా కీషు కుమారుడైన ‘సౌలును’ వాళ్ళకు రాజుగా పంపాడు. ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై సంవత్సరాలు పాలించాడు.
22 సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’
23 దేవుడు తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడైనటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు.
24 యేసు రాకముందు, యోహాను మారుమనస్సును గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు.
25 తన కర్తవ్యం ముగిసే చివరి దశలో అతడు ఇలా అన్నాడు: ‘నేనెవర్ననుకొన్నారు. నేను మీరనుకొంటున్న వాణ్ణి కాదు! కాని నా తర్వాత ఆయన రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్హత కూడా నాకు లేదు.
26 “సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవభీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు.
27 కాని యెరూషలేము ప్రజలు, వాళ్ళ పాలకులు ఈ యేసును గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేసారు.
28 ఆయనకు మరణ దండన విధించటానికి వాళ్ళకు ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయించుమని పిలాతును కోరారు.
29 లేఖనాల్లో ఆయన్ని గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ తర్వాత సిలువనుండి క్రిందికి దింపి సమాధి చేసారు.
30 కాని దేవుడాయన్ని బ్రతికించాడు.
31 ఇదివరలో ఆయనతో కలిసి గలిలయనుండి యోరూషలేమునకు ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజుల దాకా కనిపించాడు.
32 వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు.
33 దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానాన్ని యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి చేసాడు. యేసును బ్రతికించటంతో ఈ వాగ్దానం పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని గురించి కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడివుంది: ‘నీవు నా కుమారుడవు! నేడు నేను నీకు తండ్రినయ్యాను.’ కీర్తన 2:7
34 దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట, ‘నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్రమైన ఆశీస్సులను నీకిస్తాను’ అని అన్నాడు. యెషయా 55:3
35 మరొక చోట యిలా చెప్పబడింది: ‘నీ పవిత్రుడి దేహాన్ని సమాధిలో నీవు క్రుళ్ళిపోనియ్యవు!’ కీర్తన 16:10
36 దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచుకొన్నాడు. అతడు చనిపోగానే అతణ్ణి అతని పూర్వీకులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసిపోయింది.
37 కాని దేవుడు బ్రతికించినవాడు మట్టిలో కలిసిపోలేదు.
38 మీరీ విషయం తెలుసుకోవాలి. యేసు ద్వారా మీ పాపాలు క్షమించబడుతాయని మేము ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని పాపాలనుండి,
39 యేసు తనను నమ్ముకొన్న ప్రతి ఒక్కణ్ణీ క్షమిస్తాడు.
40 ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు మీకు సంభవించకుండా జాగ్రత్త పడండి:
41 ‘పరిహాసం చేసే ప్రజలారా! ఆశ్చర్యం పొందండి! నశించకండి! ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది నేనొకటి చేయబోతున్నాను! మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’’’ హబక్కూకు 1:5
42 పౌలు, బర్నబా యూదుల సమాజ మందిరాన్ని వదిలి వెళ్తుండగా వచ్చే విశ్రాంతి రోజు ఈ విషయాల్ని గురించి యింకా ఎక్కువగా మాట్లాడుమని ప్రజలు అడిగారు.
43 ప్రజలు వెళ్ళిపోయాక చాలామంది యూదులు, యూదుల మతంలో భక్తిగలవాళ్ళు పౌలు, బర్నబా వెంట వెళ్ళారు. పౌలు, బర్నబాలు ప్రజలతో, “దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ యిలాగే జీవిస్తూ ఉండండి!” అని చెప్పారు.
44 మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభువు సందేశాన్ని వినాలని సమావేశం అయ్యింది.
45 సమావేశమయిన ప్రజల్ని చూసి యూదుల్లో ఈర్ష్య నిండిపోయింది. వాళ్ళు పౌలుకు ఎదురు తిరిగి మాట్లాడి అతణ్ణి దూషించారు.
46 పౌలు, బర్నబాలు ధైర్యంగా సమాధానం చెబుతూ, “అందరికన్నా ముందు దైవ సందేశాన్ని మీకు చెప్పటం మా కర్తవ్యం. కాని మీరు నిరాకరించటంవల్ల, నిత్యజీవానికి అనర్హులమని మీలో మీరు అనుకోవటం వల్ల మేము మిమ్మల్ని వదిలి యితరుల దగ్గరకు వెళ్తున్నాము.
47 ప్రభువు యిలా ఆజ్ఞాపించాడు అని అన్నాడు: ‘ప్రపంచానికి రక్షణ కలిగించాలని యితర దేశాలకు నిన్నొక వెలుగుగా చేసాను!’’’ యెషయా 49:6
48 యూదులు కాని వాళ్ళు ఇది విని ఆనందించారు. ప్రభువు సందేశాన్ని అంగీకరించారు. అనేకులు విశ్వాసులయ్యారు. శాశ్వతమైన క్రొత్త జీవితాన్నివ్వటానికి దేవుడు వీళ్ళను ఎన్నుకొన్నాడు.
49 దైవసందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
50 కాని యూదులు పట్టణంలోని పెద్దలతో, దైవభక్తి గల గొప్పింటి స్త్రీలతో మాట్లాడి వాళ్ళకు పౌలు, బర్నబాల పట్ల కోపం కలిగేటట్లు చేసారు. అంతా కలిసి వాళ్ళను హింసించి ఆ తదుపరి వాళ్ళను తమ పట్టణం నుండి తరిమివేసారు.
51 పౌలు, బర్నబా తమ నిరసనకు చిహ్నంగా కాలి ధూళిని దులిపి ‘ఈకొనియ’ అనే పట్టణానికి వెళ్ళిపోయారు. 52కాని విశ్వాసులపై పవిత్రాత్మ ప్రభావం ఉండటంవల్ల వాళ్ళలో ఉన్న ఉత్సాహం తగ్గలేదు.
52 [This verse may not be a part of this translation]
1 ఈకొనియలో పౌలు, బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, యూదులు కానివాళ్ళు విశ్వాసులయ్యారు.
2 వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు.
3 కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి ఋజువు చేసాడు.
4 ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు.
5 యూదులు కాని వాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు.
6 కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
7 ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు.
8 లుస్త్రలో ఒక కుంటివాడుండే వాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు.
9 పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి,
10 “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు.
11 పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు.
12 బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు.
13 వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు.
14 కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు:
15 “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికి రానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు.
16 ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు.
17 కాని ఆకాశం నుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.”
18 ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు.
19 కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళించుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట పారవేసారు.
20 శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు.
21 ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు.
22 శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండుమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి” అని వాళ్ళు అన్నారు.
23 పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించిన వాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు.
24 ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడనుండి పంపూలియ చేరుకొన్నారు.
25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు.
26 అత్తాలియ నుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే.
27 అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్ళు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు.
28 వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.
1 కొందరు యూదయ నుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు” అని బోధించారు.
2 ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది.
3 అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కాని వాళ్లలో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది.
4 వీళ్ళు యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్ళకు చెప్పారు.
5 పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి, “యూదులు కానివాళ్ళు తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి” అని అన్నారు.
6 అపొస్తలులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని పరిశీలించారు.
7 ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కానివాళ్ళు నా నోటి నుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరి నుండి నన్నెన్నుకొన్నట్లు మీకు తెలుసు.
8 మానవుల మనస్సు తెలిసిన దేవుడు, మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్ళకు కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు తెలియ చేసాడు.
9 మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూపలేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయాలను పవిత్రం చేసాడు.
10 మరి అలాంటప్పుడు బరువైన ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక పోయాము కదా! దేవుడు కోప్పడుతాడో లేదో చూడాలని ఉందా?
11 యేసు ప్రభువు దయతో మనము, వీళ్ళు కూడా రక్షింపబడుతామని నమ్ముతున్నాము.”
12 సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు యూదులు కాని వాళ్ళలో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు.
13 పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి!
14 దేవుడు మొదట్లో యూదులు కాని వాళ్ళ పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని తన ప్రజగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు.
15 ఈ సంఘటనను ప్రవక్తలు ఈ వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు:
16 ‘కూలిపోయిన దావీదు యింటిని పునః నిర్మిస్తాను! ఆ శిథిలాలతో క్రొత్త యింటిని నిర్మిస్తాను!
17 మిగతా వాళ్ళంతా ప్రభువును వెతుకుతారు! నేనెన్నుకొన్న యూదులు కాని ప్రజలు కూడా వెతుకుతారు, ఆమోసు 9:11-12
18 అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియచేసాడు.’
19 “దేవుడు యూదులు కాని వాళ్ళను కూడా అంగీకరించాడు కాబట్టి, దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ళ మనస్సుకు కష్టం కలిగించ కూడదని నా అభిప్రాయం.
20 [This verse may not be a part of this translation]
21 [This verse may not be a part of this translation]
22 అపొస్తలులు, పెద్దలు, సంఘసభ్యులు, అంతా కలిసి సంఘం నుండి కొందర్ని ఎన్నుకొని పౌలు, బర్నబాతో సహా వాళ్ళను అంతియొకయకు పంపారు. సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అని పిలువబడే యూదాను, సీలను ఎన్నుకొని
23 వాళ్ళ వెంట ఈ లేఖను పంపారు: మీ సోదరులైన అపొస్తలులనుండి, పెద్దల నుండి, అంతియొకయ, సిరియ, కిలికియ పట్టణాల్లోని యూదులు కాని సోదరులకు, శుభం!
24 మా అనుమతి లేకుండా మాలో కొందరు అక్కడికి వచ్చి తమ మాటల్తో మీలో అశాంతి కలిగించి మీ మనస్సుల్ని పాడుచేసారని విన్నాము.
25 మా ప్రియమిత్రులైన బర్నబాతో, పౌలుతో కొందర్ని మీ వద్దకు పంపాలని మేమంతా కలిసి నిర్ణయించాము.
26 వీళ్ళు మన యేసు క్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని తెగించిన వాళ్ళు.
27 అందువల్ల, మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను, సీలను పంపుతున్నాము.
28 ఈ నియమాల్ని తప్ప మిగతా నియమాల్ని మీపై మోపటం భావ్యంకాదని పవిత్రాత్మకు, మాకు అనిపించింది:
29 విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని, గొంతు నులిమి చంపిన జంతువుల మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్టకండి. పరస్త్రీని వాంఛించకండి. ఇలా వీటికి దూరంగా ఉండటంవల్ల మీలో సత్‌ప్రవర్తన కలుగుతుంది. వీడ్కోలు.
30 వాళ్ళు సెలవు తీసుకొని అంతియొకయకు వెళ్ళారు. యేసు భక్తులందర్ని పిలిచి వాళ్ళకీ లేఖనిచ్చారు.
31 ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు.
32 యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు.
33 వాళ్ళక్కడ కొద్ది రోజులు గడిపారు. ఆ తదుపరి అక్కడి సోదరులు, ‘శాంతి కలుగుగాక’ అని కోరుతూ వాళ్ళకు వీడ్కోలు చెప్పారు. వీళ్ళు తమను పంపిన వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు.
34 “కాని సీల అక్కడే ఉండిపోవాలనుకొన్నాడు.”
35 పౌలు, బర్నబా అంతియొకయలో కొద్ది రోజులు గడిపారు. వీళ్ళు, యింకా అనేకులు కలిసి ప్రభువు సందేశాన్ని ఉపదేశించి బోధించారు.
36 కొంతకాలం తర్వాత పౌలు, బర్నబాతో, “ప్రభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, మనం మళ్ళీ వెళ్దాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం” అని అన్నాడు.
37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు.
38 కాని తమతో పని చెయ్యకుండా తమను పంపూలియలో వదిలి వేసాడు కాబట్టి పౌలు అతణ్ణి పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు.
39 బర్నబా, పౌలు మధ్య తీవ్రమైన స్పర్థ కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రసుకు వెళ్ళాడు.
40 పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు.
41 అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.
1 ఆ తర్వాత పౌలు దెర్బే వెళ్ళి అక్కడి నుండి లుస్త్రకు వెళ్ళాడు. లుస్త్రలో తిమోతి అనే పేరుగల ఒక విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల యూదురాలు; తండ్రి గ్రీసు దేశస్థుడు.
2 లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతణ్ణి తన వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు.
3 తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతంలో నివసించే యూదులందరికి తెలుసు. కాబట్టి అతనికి సున్నతి చేయించాడు.
4 అపొస్తలులు, పెద్దలు యెరూషలేములో నిర్ణయించిన నియమాల్ని, వాళ్ళు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలకు తెలియచేసి, వాటిని పాటించుమని చెప్పారు.
5 తద్వారా సంఘాల్లో భక్తి అభివృద్ధి చెందింది. రోజు రోజుకూ ఆ సంఘాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
6 వాళ్ళు ఆసియ ప్రాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని బోధించాలనుకొన్నారు. కాని పరిశుద్ధాత్మ వాళ్ళను ఆపాడు. కనుక, వాళ్ళు ప్రుగియ, గలతీయలలోని ప్రతి గ్రామానికి వెళ్ళారు.
7 ముసియ పొలిమేరలకు వచ్చాక బితూనియకు వెళ్ళటానికి ప్రయత్నించారు. కాని యేసు ఆత్మ అందుకు అంగీకరించలేదు.
8 ఆ కారణంగా వాళ్ళు ముసియ దాటి త్రోయకు వెళ్ళారు.
9 మాసిదోనియ ప్రాంతం వాడొకడు, “మాసిదోనియకు వచ్చి మమ్మల్ని రక్షించండి” అని వేడుకొన్నట్లు ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగింది.
10 పౌలుకు దర్శనం కలిగాక మాసిదోనియ నివాసులకు సువార్త ప్రకటించటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడని గ్రహించి తక్షణమే మేము అక్కడికి వెళ్ళటానికి సిద్ధం అయ్యాము.
11 ‘త్రోయ’ నుండి సముద్ర ప్రయాణం చేసి నేరుగా సమొత్రాకేకు వెళ్ళి మరుసటి రోజు నెయపొలి చేరుకొన్నాము.
12 అక్కడి నుండి ప్రయాణమై రోము సామ్రాజ్యంలోని ఫిలిప్పీకి వెళ్ళాం. ఫిలిప్పీ మాసిదోనియలోని ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. మేము ఆ పట్టణంలో చాలా రోజులు గడిపాము.
13 ఒక విశ్రాంతి రోజున ప్రార్థనలు చేయటానికి స్థలం దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న నది దగ్గరకు వెళ్ళాము. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాము.
14 మా మాటలు వింటున్న ఒకావిడ పేరు ‘లూదియ.’ ఈవిడ తుయతైర గ్రామానికి చెందింది. ఊదారంగు పొడిని వ్యాపారం చేసే ఈ లూదియ భక్తురాలు. దేవుడు ఆవిడ మనస్సును మార్చి పౌలు సందేశం వినేటట్లు చేసాడు.
15 ఆమె, ఆమె యింట్లో ఉన్న వాళ్ళంతా బాప్తిస్మము పొందాక మమ్మల్ని యింటికి ఆహ్వానించింది. “నేను నిజంగా ప్రభువు భక్తురాలననే నమ్మకం మీలో ఉన్నట్లయితే వచ్చి మా యింట్లో ఉండండి” అని మమ్మల్ని వేడుకొని చాలా బలవంతం చేసింది.
16 ఒకసారి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక బానిస పిల్ల కనిపించింది. ఆమెకు సోదె చెప్పే శక్తిగల ‘పుతోను’ అనే దయ్యము పట్టివుంది. ఆమె సోదె చెప్పటం వల్ల ఆమె యజమానులు చాలా డబ్బు గడించారు.
17 ఆమె పౌలును, మమ్మును అనుసరిస్తూ, “వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. రక్షణకు దారి చూపుతున్నారు” అని బిగ్గరగా కేక పెట్టేది.
18 ఇలా చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుగు చెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు క్రీస్తు పేరిట ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది.
19 ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు చేసుకొనే ఆశ నశించిందని గ్రహించి పౌలును, సీలను బంధించారు.
20 వాళ్ళను బహిరంగంగా రోము సైనికాధికారుల ముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు యూదులు. మన పట్టణంలో అలజడి లేపుతున్నారు.
21 రోము పౌరులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్ళు మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా న్యాయం కాదు” అని అన్నారు.
22 ప్రజల గుంపు పౌలు, సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు.
23 చావకొట్టి, వాళ్ళను చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు.
24 కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేసాడు.
25 అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బందీలు వింటున్నారు.
26 అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి.
27 చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు.
28 కాని పౌలు, ‘హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము’ అని బిగ్గరగా అన్నాడు.
29 ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు.
30 ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.
31 వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు.
32 ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు.
33 ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోని వాళ్ళు బాప్తిస్మము పొందారు.
34 ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోని వాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు.
35 తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయుమని ఆజ్ఞాపించారు.
36 “నిన్ను, సీలను విడుదల చేయుమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి!” అని చెరసాల అధికారి అన్నాడు.
37 కాని పౌలు వాళ్ళతో, “మేము రోము పౌరులమైనా విచారణ జరుపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు. కారాగారంలో పడవేసారు. కాని యిప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయుమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు.
38 భటులు ఈ వార్త అధికారలకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీలలు రోము పౌరులని విని భయపడిపోయారు.
39 అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించుమని వేడుకొన్నారు. వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు.
40 పౌలు, సీలలు కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.
1 వాళ్ళు ‘అంఫిపొలి’, ‘అపోల్లోనియ’, పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజ మందిరం ఉంది.
2 అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు.
3 క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి ఋజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు.
4 తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీలల పక్షము చేరిపోయారు. దైవ భీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.
5 ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేని వాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు.
6 వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు.
7 వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.
8 ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు.
9 ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలి వేసారు.
10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలు, సీలలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చిన వాళ్ళు యూదుల సమాజ మందిరానికి వెళ్ళారు.
11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయ వాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవ సందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతీరోజు పవిత్ర గ్రంథాలు చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించే వాళ్ళు.
12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.
13 పౌలు దైవ సందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు.
14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు.
15 పౌలుతో వెళ్ళిన వాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.
16 పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ క్షోభించింది.
17 అందువల్ల నమాజ మందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవ భీతిగల యూదులు కాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు.
18 ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు. “ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.
19 వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధన ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు.
20 “మీరు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసారు. వాటి అర్థం మాకు చెప్పండి” అని మరి కొందరడిగారు.
21 ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపే వాళ్ళు. మరే పని చేసే వాళ్ళు కాదు.
22 పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్టగా ఉన్నారు. ఇది నేను గమనించాను.
23 నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.
24 ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు; ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు, మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు.
25 మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతీ వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా?
26 ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.
27 మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు:
28 ‘మనం ఆయనలో జీవిస్తున్నాం ఆయనలో కదులుతున్నాం. ఆయన కారణంగా మనం ఉన్నాం’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’
29 మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటి వాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడుకాడు.
30 గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ప్రవర్తించాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారు మనస్సు పొందుమని ఆజ్ఞాపిస్తున్నాడు.
31 ప్రపంచంలో ఉన్న ప్రతీ వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించితాను చేయనున్న దాన్ని ప్రజలందరికీ ఋజువు చేసాడు.”
32 చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు.
33 పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు.
34 కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసియు అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగు వాళ్ళున్నారు.
1 ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు.
2 అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియ యూదులందర్ని రోము నగరం వదిలి వెళ్ళుమని ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీ నుండి తన భార్య ప్రిస్కిల్లతో కలసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు.
3 తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించే వాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు.
4 ప్రతి విశ్రాంతి రోజూ సమాజ మందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు.
5 మాసిదోనియ నుండి సీల, తిమోతిలు వచ్చాక పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించే వాడు.
6 కాని యూదులు ఎదురు తిరిగి అతణ్ణి దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు. ఇక మీదట నేను యూదులు కాని వాళ్ళ దగ్గరకు వెళ్తాను” అని అన్నాడు.
7 పౌలు సమాజ మందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి వెళ్ళాడు.
8 యూదుల సమాజ మందిరంపై అధికారిగా పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తీ అతని యింట్లోని వాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిస్మము పొందారు.
9 [This verse may not be a part of this translation]
10 [This verse may not be a part of this translation]
11 పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవ సందేశాన్ని వాళ్ళకు బోధించాడు.
12 గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి,
13 “ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించుమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు” అని అతణ్ణి నిందించారు.
14 పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను గురించి కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం సమంజసంగా ఉంటుంది.
15 కాని మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాల్ని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి.
16 అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయస్థానం నుండి తరిమి వేసాడు.
17 వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద అయినటువంటి సోస్తెనేసును పట్టుకొని అతణ్ణి న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు వూరుకొన్నాడు.
18 పౌలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, ప్రిస్కిల్లను, అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు.
19 వాళ్ళు ఎఫెసు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను వదిలి తానొక్కడే సమాజ మందిరానికి వెళ్ళి యూదులతో తర్కించాడు.
20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు.
21 కాని వెళ్ళే ముందు, “దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను” అని వాళ్ళతో చెప్పి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసాడు.
22 అతడు కైసరియ తీరాన్ని చేరుకొని అక్కడి నుండి యెరూషలేము వెళ్ళాడు. అక్కడున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుండి అంతియొకయకు వెళ్ళాడు.
23 అంతియొకయలో కొద్ది రోజులు గడిపి అక్కడినుండి ప్రయాణమై గలతియ, ఫ్రుగియ ప్రాంతాల్లో పర్యటన చేసి, ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేసాడు.
24 ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు.
25 ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు.
26 అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల యితని బోధన విని అతణ్ణి తమ యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి యింకా విశదంగా చెప్పారు.
27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి యితనికి స్వాగతం చెప్పుమని అడిగారు. అతడు వెళ్ళి, దైవానుగ్రహంవల్ల యేసును విశ్వసించిన వాళ్ళకు చాలా సహాయం చేసాడు.
28 ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసాడు.
1 అపొల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని కలుసుకొని
2 వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు. వాళ్ళు, “లేదండి! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు” అని సమాధానం చెప్పారు.
3 పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు. “యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.
4 పౌలు, “యోహాను మారుమనస్సుకు సంబంధించిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత రానున్న వాణ్ణి, అంటే యేసును నమ్ముమని ప్రజలకు బోధించాడు కదా!” అని అన్నాడు.
5 ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు.
6 పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరుశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు.
7 అక్కడ మొత్తం పన్నెండు మంది ఉన్నారు.
8 పౌలు యూదుల సమాజ మందిరానికి మూడు నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు.
9 కాని కొందరు నమ్మలేదు. తమ పట్టు వదులుకోలేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. అందువల్ల పౌలు వాళ్ళను వదిలి, శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. అతడు, తురన్ను ఉపన్యాసశాలలో ప్రతి రోజూ తర్కించేవాడు.
10 ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా ఆసియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు అందరూ ప్రభువు సందేశాన్ని విన్నారు.
11 దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహాత్కార్యాలు చేసాడు.
12 ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి.
13 చుట్టూ ఉన్న ప్రాంతాలలో తిరిగి దయ్యాల్ని వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభువు పేరునుపయోగించి దయ్యాలు పట్టిన వాళ్ళకు నయం చెయ్యటానికి ప్రయత్నించారు. వాళ్ళు, “పౌలు ప్రకటిస్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. బయటకు రా!” అని అనే వాళ్ళు.
14 స్కెవ అనే యూదుల ప్రధాన యాజకుడు, అతని ఏడుగురు కుమారులు యిలా చేసే వాళ్ళు.
15 ఒకసారి ఆ దయ్యం, “యేసు ఎవరో నాకు తెలుసు. పౌలు ఎవరో నాకు తెలుసు. కాని మీరెవరు?” అని అడిగింది.
16 ఆ దయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి వాళ్ళను బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కార్చుకొంటూ ఆ యిల్లు వదిలి దిగంబరంగా పారిపోయారు.
17 ఎఫెసులో నివసిస్తున్న యూదులకు, గ్రీకులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభువు నామాన్ని చాలా గౌరవించటం మొదలు పెట్టారు.
18 ఇది జరిగాక చాలా మంది తాము చేసిన వాటిని బహిరంగంగా ఒప్పుకోవటం మొదలు పెట్టారు.
19 మంత్ర విద్య నేర్చిన కొందరు తమ గ్రంథాల్ని తెచ్చి అందరి సమక్షంలో వాటిని కాల్చి వేసారు. ఆ తదుపరి వాళ్ళు తాము కాల్చిన గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు యాభై వేల ద్రాక్మాలని నిర్ణయించారు.
20 ఈ విధంగా ప్రభువు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం అభివృద్ధి చెందుతూ వచ్చింది.
21 ఆ సంఘటనలు జరిగాక పౌలు మాసిదోనియ, అకయ ప్రాంతాల ద్వారా యెరూషలేము వెళ్ళాలని పరిశుద్ధాత్మ సహాయంతో నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రోము నగరాన్ని తప్పక దర్శించాలనుకున్నాడు.
22 తనకు సహాయం చేసే వాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు పంపాడు. వాళ్ళ పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు.
23 ఆ రోజుల్లోనే ప్రభువు చూపిన మార్గాన్ని గురించి పెద్ద గొడవ జరిగింది.
24 ‘దేమేత్రి’ అనే ఒక కంసాలి ఉండేవాడు. ఇతడు అర్తెమి దేవత ఉండే మందిరం యొక్క ప్రతిరూపాలను వెండితో తయారు చేసి అమ్మేవాడు. తద్వారా తన క్రింద పని చేసే వాళ్ళకు చాలినంత పని కల్పించేవాడు.
25 తన పనివాళ్ళను, తనలాంటి వృత్తి చేసే వాళ్ళను సమావేశ పరిచి ఈ విధంగా అన్నాడు: “అయ్యలారా! మనమీ వ్యాపారంలో చాలా ధనం గడిస్తున్న విషయం మీకందరికీ తెలుసు.
26 ఈ పౌలు అనేవాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియ ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు దేవుళ్ళు కాదంటూ చాలా మంది ప్రజల్ని నమ్మించి తప్పుదారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు విన్నారు.
27 ఈ కారణంగా మన వ్యాపారానికున్న మంచి పేరు పోయే ప్రమాదం ఉంది. పైగా అర్తెమి మహాదేవి మందిరానికున్న విలువ పోతుంది. ఆసియ ప్రాంతాల్లోనే కాక ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత యొక్క గొప్పతనము కూడా నశించి పోతుంది.”
28 ఈ మాటలు విన్న వాళ్ళకు చాలా ఉద్రేకం కలిగింది. వాళ్ళు బిగ్గరగా, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత గొప్పది!” అని నినాదం చెయ్యటం మొదలు పెట్టారు.
29 ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించి పోయింది. మాసిదోనియకు చెందిన ‘గాయియు, అరిస్తర్కు’ అనే యిద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. ప్రజలు వీళ్ళను బంధించి త్రోసుకొంటూ ఒక్క గుంపుగా పెద్ద నాటక శాలలోకి ప్రవేశించారు.
30 పౌలు ప్రజల ముందుకు రావాలనుకొన్నాడు. కాని అనుచరులతన్ని వెళ్ళనివ్వలేదు.
31 పౌలు స్నేహితులు కొందరు ఆ ప్రాంతాలకు పాలకులుగా ఉండే వాళ్ళు. నాటక శాలలోకి వెళ్ళ వద్దని వేడుకుంటూ వీళ్ళు పౌలుకు ఒక ఉత్తరం పంపారు.
32 ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు యిదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేసారు. కొందరికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికీ తామక్కడికి ఎందుకు వచ్చింది తెలియదు.
33 యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోసారు. కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా యిచ్చారు. అతడందర్నీ శాంతంగా ఉండుమని సంజ్ఞ చేసి సమాధానంగా ఏదో చెప్పబోయాడు.
34 అతడు కూడా ఒక యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా రెండు గంటల సేపు ఒకే గొంతుతో, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత చాలా గొప్పది” అని నినాదం చేసారు.
35 ఆ గ్రామాధికారి ప్రజల్ని శాంత పరుస్తూ యిలా అన్నాడు: “ఎఫెసు ప్రజలారా! మహా దేవత అర్తెమి యొక్క మందిరాన్ని, స్వర్గంనుండి పడిన శిలా విగ్రహాన్ని చూసుకొనే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. ఇది ప్రపంచానికంతా తెలుసు.
36 దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి!
37 వీళ్ళు మన మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు.
38 దేమేత్రికి లేక అతనితో కలిసి పని చేసే వాళ్ళకు వాళ్ళపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి ఉన్నాయి. వాళ్ళ వాద వివాదాలు వినటానికి న్యాయాధిపతులున్నారు.
39 మీరింకేదైనా చెప్పుకోవాలనుకొంటే చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి.
40 ఈనాడు జరిగిన సంఘటనవల్ల మనం తిరుగుబాటు చేసామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం వుంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు కనుక మనం ఏ సమాధానమూ చెప్పలేము.”
41 ఇలా చెప్పి అందర్నీ అక్కడినుండి వెళ్ళమన్నాడు.
1 అల్లర్లు తగ్గిపొయ్యాక, పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్ళను ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి, వాళ్ళనుండి సెలవు తీసుకొన్నాడు. ఆ తర్వాత మాసిదోనియకు వెళ్ళాడు.
2 ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీసు దేశం చేరుకున్నాడు.
3 అక్కడ మూడు నెలలున్నాడు. అక్కడినుండి సిరియ దేశానికి ఓడలో ప్రయాణం చెయ్యాలనుకొని సిద్ధమయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలని అనుకొంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియకు వెళ్ళి అక్కడినుండి ప్రయాణం చేసాడు.
4 అతని వెంట ఉన్నవాళ్ళు ఎవరనగా: బెరయ పట్టణంనుండి పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణం నుండి అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణం నుండి గాయియు, తిమోతి, ఆసియ నుండి తుకికును, త్రోఫిము.
5 వీళ్ళు ముందే వెళ్ళి మా కోసం త్రోయలో కాచుకొని ఉన్నారు.
6 కాని మేము ఫిలిప్పీనుండి ప్రత్యేకమైన పులియని రొట్టెల పండుగ తర్వాత ఓడలో ప్రయాణమయ్యాము. అయిదు రోజులు ప్రయాణం చేసాక త్రోయలో వాళ్ళను కలుసుకున్నాము. అక్కడ ఏడు రోజులు ఉన్నాము.
7 ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యాము. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్థరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు.
8 మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
9 ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకధాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్ర వచ్చి గాఢంగా నిద్రపొయ్యాడు. ఆ నిద్రలో మూడవ అంతస్తు నుండి క్రింద పడ్డాడు. కొంత మంది వచ్చి చనిపోయిన అతణ్ణి చూసారు.
10 పౌలు క్రిందికి వెళ్ళి ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతణ్ణి తన చేతుల్తో ఎత్తి, “దిగులు పడకండి, ప్రాణం ఉంది” అని అన్నాడు.
11 అతడు మళ్ళీ మేడ మీదికి వెళ్ళి రొట్టె విరిచి సోదరులకు పంచి తాను తిన్నాడు. తెల్లవారే దాకా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపొయ్యాడు.
12 ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనస్సులు ఎంతో నెమ్మది పడ్డాయి.
13 మేము పౌలును వదిలి ఓడనెక్కి ‘అస్సు’కు వెళ్ళాము. తాను కాలి నడకన అస్సుకు చేరుకొని మమ్మల్ని అక్కడ కలుసుకొంటానని చెప్పాడు. అక్కడి నుండి మాతో కలిసి ఓడలో ప్రయాణం చెయ్యాలని అతని ఉద్దేశ్యం.
14 మేము అతణ్ణి అస్సులో కలుసుకొన్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి ‘మితులేనే’ వెళ్ళాము.
15 మితులేనే నుండి మరుసటి రోజు ఓడలో మళ్ళీ ప్రయాణం సాగించి, ‘కీయొసు’ ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేసాము. ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి ‘సమొసు’ ద్వీపానికి దగ్గరగా వచ్చాము. మరొక రోజు ప్రయాణం చేసాక ‘మిలేతు’ చేరుకున్నాము.
16 పౌలు యెరూషలేము త్వరగా వెళ్ళాలని అనుకొన్నాడు. ఆసియ ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చెయ్యటం యిష్టం లేక ఎఫెసులో ఆగకుండా వెళ్ళాడు. వీలైతే పెంతెకొస్తు పండుగనాటికి యెరూషలేంలో ఉండాలని అనుకొన్నాడు.
17 పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.
18 వాళ్ళు వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు.
19 యూదుల పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేసాను.
20 ఆత్మీయ విషయాల్లో మీకు దోహదమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు.
21 మారు మనస్సు పొంది, దేవుని కోసం జీవించుమని, మన యేసు ప్రభువును నమ్ముమని యూదులకు, గ్రీకులకు చెప్పాను.
22 పరిశుద్ధాత్మ చెప్పినట్లు చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు.
23 నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు.
24 నా జీవితాన్ని నేను లెక్కచెయ్యను. కాని ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం.
25 “మళ్ళీమిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను.
26 అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను.
27 ఎందుకంటే, నేను దేవుడు చెయ్యదలచిన దాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను.
28 పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు గొఱ్ఱెల కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
29 నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు.
30 మీలో నుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు.
31 అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంట తడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి.
32 “ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతే కాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించేటట్లు చేస్తుంది.
33 మీ నుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించ లేదు.
34 నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు.
35 కష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ చేసాను. యేసు ప్రభువు, ‘తీసుకోవటంలో కన్నా యివ్వటంలో చాలా దీవెన ఉంది!’ అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేసాను.”
36 ఈ విధంగా చెప్పి, అతడు తన మోకాళ్ళూని అందరితో కలిసి ప్రార్థించాడు.
37 ఆ తర్వాత అందరూ కంట తడిపెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు.
38 ‘మిమ్మల్ని మళ్ళీ చూడటం వీలుపడదు’ అని అతడన్న మాటలు వాళ్ళకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడవరకు వెళ్ళారు.
1 మేము సెలవు పుచ్చుకొని నేరుగా ‘కోసు’కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు ‘రొదు’ చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి ‘పతర’ చేరుకున్నాము.
2 ఒక ఓడ ఫొనీషియ వెళ్ళటం గమనించి అందులో ప్రయాణం చేసాము.
3 సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము.
4 అక్కడ భక్తులుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము.
5 విశ్వాసులు, తమ భార్యా బిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక, అందరమూ మోకరిల్లి ప్రార్థించాము.
6 పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.
7 మేము తూరు నుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము.
8 మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు.
9 అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.
10 అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయ నుండి వచ్చాడు.
11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కాని వాళ్ళకు అప్పగిస్తారు అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.”
12 ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమిలాడాము.
13 పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు.
14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.
15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము.
16 కైసరియ నుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని ‘మ్నాసోను’ అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బసమ్నాసోను, సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు.
17 మేము యెరూషలేము వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు.
18 మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు.
19 పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కాని వాళ్ళతో చేసిన వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు.
20 వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత పౌలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం.
21 కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదులమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కాని వాళ్ళ మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్ళకు ఎవరో చెప్పారు.
22 ఏం చెయ్యాలి? నీవు వచ్చిన విషయం వాళ్ళకు తప్పక తెలుస్తుంది.
23 అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మ్రొక్కుబడి ఉన్న వాళ్ళు నలుగురున్నారు.
24 వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో కలిసి శుద్ధీకరణ చేయి. వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళకు తెలుస్తుంది.
25 ఇక యూదులు కాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము: ‘విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు. రక్తాన్ని, గొంతునులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు. పరస్త్రీని కోరరాదు’’’ అని అన్నారు.
26 మరుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు.
27 [This verse may not be a part of this translation]
28 [This verse may not be a part of this translation]
29 ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూసారు. కనుక పౌలు అతణ్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడనుకున్నారు.
30 పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టుకొని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసి వేసారు.
31 వాళ్ళు, అతణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది.
32 ఆ సైన్యాధిపతి వెంటనే, కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి, పౌలును కొట్టడం మానివేసారు.
33 సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతణ్ణి పట్టుకొని యినుప గొలుసులతో కట్టి వేయుమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు.
34 ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకు వెళ్ళుమని ఆజ్ఞాపించాడు.
35 పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేసారు. అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి తీసుకు వెళ్ళారు.
36 6ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు.
37 సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే ముందు, అతడు సైన్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా?” అని అడిగాడు. సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే!
38 క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు.
39 పౌలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి!” అని అడిగాడు.
40 సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్ల మీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక ‘హెబ్రీ’ భాషలో ఈ విధంగా మాట్లాడాడు:
1 “పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి,”
2 అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు.
3 పౌలు ఈ విధంగా చెప్పుకొంటూ పొయ్యాడు: “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే పట్టణంలో జన్మించాను. ఈ పట్టణంలో పెరిగాను. మన పూర్వులు అప్పగించిన ధర్మశాస్త్రంలో గమలీయేలు వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ల ఏ పద్ధతిననుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే పద్ధతిలో నేనూ ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి.
4 నేను యేసు మార్గాన్ని అనుసరించిన వాళ్ళను ఎన్నో హింసలు పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవించింది. ఆడా, మగా అనే భేదం లేకండా అందర్ని బంధించి కారాగారంలో వేసేవాణ్ణి.
5 ప్రధాన యాజకుడు, మహా సభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. వాళ్ళను, డెమాస్కసులోని వాళ్ళ సోదరులకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకొన్నాను. అక్కడికి వెళ్ళి యేసు మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళను బంధించి యెరూషలేమునకు పట్టుకు వచ్చి వాళ్ళకు శిక్ష ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం.
6 “నేను డెమాస్కసుకు వెళ్ళినప్పుడు, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశం నుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు.
7 నేను నేల కూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.
8 ‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది.
9 నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.
10 ‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లే! లేచి డెమాస్కసు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడుతాయి’ అని ప్రభువు అన్నాడు.
11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్న వాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.
12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని
13 [This verse may not be a part of this translation]
14 ఆ తదుపరి అతడు, ‘మన పూర్వీకులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి, నిన్ను ఎన్నుకొన్నాడు.
15 నీవు చూసిన వాటిని గురించి, విన్న వాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు.
16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది.
18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.
19 నేను, ‘ప్రభూ! నేను ప్రతి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు.
20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్న వాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.
21 అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కాని వాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”
22 ప్రజలు, పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు.
23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు.
24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టుమని ఆజ్ఞాపించాడు.
25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతి, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోము పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.
26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోము పౌరుడట!” అని అన్నాడు.
27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోము పౌరుడివా?” అని అడిగాడు. “ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.
28 సహస్రాధిపతి, “నేను రోము పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు. పౌలు, “నేను పుట్టినప్పటి నుండి రోము పౌరుణ్ణి!” అని అన్నాడు.
29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్న వాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోము పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.
30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధాన యాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.
1 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు.
2 ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్న వాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు.
3 అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టుమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.
4 పౌలు ప్రక్కన నిలుచున్న వాళ్ళు, “దేవుని ప్రధాన యాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.
5 అందుకు పౌలు, “సోదరులారా! ప్రధాన యాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’’’
6 పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.
7 అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు.
8 సద్దుకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు.
9 సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.
10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.
11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోములో కూడా బోధించాలి” అని అన్నాడు.
12 మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పైగా, పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు.
13 నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు.
14 వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళి, “మేము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం.
15 కనుక మీరు మహాసభ పక్షాన అతణ్ణి గురించి, ‘మేము యింకా విశదంగా తెలుసుకోవాలనుకొంటున్నాము’ అని అబద్ధాలు చెప్పి, ఆ సాకుతో పౌలును పంపుమని సహస్రాధిపతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు.
16 పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్ళి పౌలుతో చెప్పాడు.
17 పౌలు శతాధిపతిని పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళు. అతనికి యితడు చెప్పవలసిన విషయం ఒకటుంది” అని అన్నాడు.
18 శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి, “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు పిలుచుకెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్పదలిచాడు!” అని అన్నాడు.
19 సహస్రాధిపతి ఆ యువకుని చేయి పట్టుకొని ప్రక్కకు తీసుకెళ్ళి, “నాకేం చెప్పాలనుకొన్నావు?” అని అడిగాడు.
20 ఆ యువకుడు, “పౌలును గురించి యింకా విశదంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ కలిసి, పౌలును రేపు మహాసభకు పిలుచుకు రమ్మని మీకు విజ్ఞాపన చెయ్యాలనుకొంటున్నారు.
21 వాళ్ళ విజ్ఞాపనను అంగీకరించకండి. నలభై కంటే ఎక్కువ మంది పౌలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. అతణ్ణి చంపే దాకా అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం తీసుకున్నారు” అని అన్నాడు.
22 సహస్రాధిపతి యువకుణ్ణి వెళ్ళుమని చెబుతూ, తనకీవిషయం చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పవద్దని జాగ్రత్త పరిచాడు.
23 తదుపరి తన శతాధిపతుల్ని యిద్దర్ని పిలిచి, “రెండు వందల సైనికుల్ని, డెబ్బైమంది గుఱ్ఱపు రౌతుల్ని, బళ్ళేలు ఉపయోగించే రెండు వందల సైనికుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియకు వెళ్ళండి.
24 పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి” అని ఆజ్ఞాపించాడు.
25 సహస్రాధిపతి యిలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు:
26 “గౌరవనీయులైన ఫేలిక్సు రాష్ట్రాధిపతికి, క్లౌదియ లూసియ అభివందనాలు చెప్పి వ్రాయునది,
27 ఇతణ్ణి యూదులు పట్టుకొని చంపబొయ్యారు. కాని, నేను యితడు రోము పౌరుడు అని తెలుసుకొని నా దళాలతో వెళ్ళి అతణ్ణి రక్షించాను.
28 వాళ్ళెందుకు అతణ్ణి అపరాధి అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ళ మహాసభకు పిలుచుకు వెళ్ళాను.
29 వాళ్ళు, తమ ధర్మశాస్త్రం విషయంలో యితణ్ణి అపరాధి అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో ఉంచవలసిన నేరం కాని, మరణ దండన వేయవలసిన నేరం కాని ఇతడు చేయలేదు.
30 వాళ్ళు ఇతణ్ణి చంపటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపుతున్నాను. ఇతనిపై నేరారోపణ చేసిన వాళ్ళతో ఆ నేరారోపణ మీ సమక్షంలో చెయ్యవచ్చని చెప్పాను.
31 సహస్రాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును రాత్రి వేళ తమతో పిలుచుకు వెళ్ళి అంతిపత్రికి చేరుకున్నారు.
32 మరుసటి రోజు రౌతుల్ని పౌలు వెంట పంపి, సైనికులు కోటకు తిరిగి వచ్చారు.
33 పౌలుతో వెళ్ళిన వాళ్ళు కైసరియ చేరుకొని ఆ ఉత్తరాన్ని, పౌలును, రాష్ట్రాధిపతికి అప్పగించారు.
34 రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ ప్రాంతం వాడవు?” అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసుకొని,
35 “నీపై నేరారోపణ చేసిన వాళ్ళు యిక్కడికి వచ్చాక నీ విషయం విచారిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత పౌలును హేరోదు భవనంలో ఉంచి కాపలా కాయుమని భటులతో చెప్పాడు.
1 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు.
2 తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.
3 “మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు.
4 మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయవుంచి వినుమని విజ్ఞప్తి చేస్తున్నాము.
5 ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు.
6 ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు.
7 [This verse may not be a part of this translation]
8 మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు.
9 న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు.
10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడుమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను.
11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్న దానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు.
12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు.
13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.
14 వాళ్ళు, దేన్ని వేరొక జాతిగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని, నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను.
15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను.
16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.
17 “పేద వాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను.
18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు.
19 కానీ అక్కడికి ఆసియనుండి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది.
20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్న వాళ్ళను చెప్పమనండి.
21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”
22 యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు.
23 శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.
24 కొద్ది రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో వచ్చాడు. ద్రసిల్ల యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించాడు. ‘యేసు క్రీస్తులో విశ్వాసం’ అనే విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు విన్నాడు.
25 పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని అన్నాడు.
26 కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడే వాడు.
27 రెండు సంవత్సరాలు గడిచాక పోర్కియు ఫేస్తు ఫేలిక్సు స్థానంలో వచ్చాడు. ఫేలిక్సు యూదులకు ఒక ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో పౌలును కారాగారంలోనే ఉంచాడు.
1 ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియ నుండి యెరూషలేమునకు వెళ్ళాడు.
2 అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతణ్ణి కలుసుకొని, పౌలును గురించి చెప్పారు.
3 పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారం చెయ్యుమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర.
4 ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను.
5 మీలో ముఖ్యమైన వాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చేయవచ్చు” అని అన్నాడు.
6 అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక కైసరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు.
7 పౌలు కనపడగానే యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక పోయారు.
8 తదుపరి పౌలు, తాను నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.”
9 ఫేస్తు, యూదులకు ఉపకారం చేయాలని, పౌలుతో, “నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా?” అని అడిగాడు.
10 పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు.
11 మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పుమని నేను విన్నవించుకొంటాను.”
12 ఫేస్తు తన సలహాదార్లతో సంప్రదించి యిలా ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.”
13 కొద్ది రోజుల తర్వాత అగ్రిప్పరాజు, బెర్నీకే, ఫేస్తును కలుసుకొందామని కైసరియకు వచ్చారు.
14 వాళ్ళక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ, “ఇక్కడ, ఫేలిక్సు కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు.
15 నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి మరణదండన విధించుమని నన్ను కోరారు.
16 నేను, ‘నేరమారోపింపబడిన వానికి తనపై నేరారోపణ చేసిన వాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకొని, వాళ్ళారోపించిన నేరాలకు ప్రతిగా తన రక్షణార్థం మాట్లాడే అవకాశం కలగాలి. దానికి ముందు అతణ్ణి అప్పగించటం రోమనుల పద్ధతి కాదు’ అని జవాబు చెప్పాను.
17 నాతో కలిసి వాళ్ళిక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చెయ్యకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను.
18 అతనిపై నేరారోపణ చేసిన వాళ్ళు లేచి మాట్లాడారు. కాని నేననుకున్న ఏ నేరాన్నీ అతనిపై ఆరోపించలేదు.
19 దానికి మారుగా తామనుసరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చనిపోయిన యేసును గురించి తర్కించారు. కాని పౌలు యేసు బ్రతికే ఉన్నాడని వాదించాడు.
20 అలాంటి విషయాలు ఏ విధంగా విచారణ చెయ్యాలో నాకు తెలియదు. అందువల్ల నేను అతణ్ణి, ‘విచారణ కోసం నీవు యెరూషలేము వెళ్తావా?’ అని అడిగాను.
21 చక్రవర్తే తీర్పు చెప్పాలని, అంతదాకా తనను కారాగారంలో ఉంచుమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతణ్ణి కైసరు దగ్గరకు పంపేదాకా కారాగారంలో ఉంచుమని ఆజ్ఞాపించాను” అని చెప్పాడు.
22 అగ్రిప్ప ఫేస్తుతో, “అతడు మాట్లాడే విషయాలు వినాలని నాక్కూడా ఉంది” అని అన్నాడు. “రేపు మీరతని మాటలు వింటారు” అని ఫేస్తు జవాబు చెప్పాడు.
23 మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు.
24 ఫేస్తు యిలా అన్నాడు: “అగ్రిప్ప రాజా! సభికులారా! మీరు చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలేములో, ఇక్కడ, ‘ఇతడిక ఎక్కువ రోజులు బ్రతకటానికి వీల్లేదు’ అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు చేసారు.
25 మరణ దండన విధించవలసిన నేరమేదీ అతడు చేయలేదని నాకర్థమైనది. కాని అతడు చక్రవర్తికి విన్నవించుకొంటానని అన్నాడు. కనుక అతణ్ణి చక్రవర్తి దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను.
26 ఇతణ్ణి గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు. అందువల్ల యితణ్ణి మీ ముందుకు పిలుచుకు వచ్చాను. అగ్రిప్ప రాజా! ముఖ్యంగా మీకోసం యితణ్ణి పిలిపించాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కనిపించవచ్చు.
27 ఒక బందీని, అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా అభిప్రాయం.
1 అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పకోవచ్చు!” అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు:
2 “అగ్రిప్ప రాజా! ఈ రోజు మీ ముందు నిలుచొని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని ఋజువు చేసుకోవటానికి అవకాశం కలగటం నా అదృష్టం.
3 మీకు యూదులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకొంటున్నాను.
4 “నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు.
5 వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్టగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు.
6 దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది.
7 ఈ వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాల వాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు.
8 దేవుడు చనిపోయిన వాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు?
9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను.
10 నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధాన యాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను.
11 ఎన్నోసార్లు నేను ఒక సమాజ మందిరమునుండి మరొక నమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ?్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.
12 “ఒక రోజు నేను, ప్రధాన యాజకుల అధికారంతో, అనుమతితో డెమాస్కసుకు వెళ్తున్నాను.
13 సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు, ఓ రాజా! నేను దారిలో ఉండగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు రావటం చూసాను. ఆ వెలుగు సూర్యునికన్నా యింకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద నాతో ఉన్న వాళ్ళ మీద ప్రకాశించింది.
14 మేమంతా నేలపై పడిపొయ్యాము. ఒక స్వరం హెబ్రీ భాషలో నాతో ఈ విధంగా అనటం విన్నాను: ‘సౌలా! సౌలా! నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటంవల్ల నీకే నష్టం కలుగుతుంది.’
15 నేను, ‘మీరెవరు ప్రభూ! అని అడిగాను. ‘నేను నీవు హింసిస్తున్న యేసును’ అని ప్రభువు జవాబు చెప్పాడు.
16 ‘ఇక లేచి నిలబడు, నిన్ను నా సేవకునిగా నియమించుకోవాలని అనుకున్నాను. నన్ను చూసిన ఈ సంఘటనను గురించి, నేను చూపబోయే వాటిని గురించి యితర్లకు చెప్పటానికి నిన్ను నియమించాలని నీకు ప్రత్యక్షమయ్యాను.
17 నిన్ను నీ వాళ్ళనుండి, యూదులుకాని వాళ్ళనుండి రక్షిస్తాను.
18 వాళ?్ళ కళు?్ళ తెరిపించి వాళ?్ళను చీకటినుండి వెలుగులోకి పిలుచుకు రావటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళను సైతాను ఆధీనం నుండి కాపాడి, దేవుని వైపు మళ్ళించటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళతో కలిసి తమ స్థానం పొందాలని యిలా చేస్తున్నాను”
19 “అందువల్ల అగ్రిప్ప రాజా! ఆకాశం నుండి వచ్చిన దివ్య దర్శనము నేను అతిక్రమించలేను.
20 మారు మనస్సు పొంది దేవుని వైపు మళ్ళుమని, తమ నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సు అన్న విషయం పనుల ద్వారా ఋజువు చేయుమని ఉపదేశించాను. ఈ ఉపదేశం డెమాస్కసు ప్రజలతో మొదలు పెట్టి యెరూషలేములోని ప్రజలకు, యూదయలోని యితర ప్రజలకు, యూదులు కాని వాళ్ళకు చెప్పాను.
21 ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు.
22 కాని దేవుని దయ ఈనాటికీ నా మీద ఉంది. కనుక చిన్నా, పెద్దా, అనే భేధం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. మోషే, మరియు ప్రవక్తలు జరుగనున్న వాటిని గురించి ముందే ఈ విధంగా చెప్పారు:
23 ‘క్రీస్తు మరణించవలసి వస్తుంది. కాని బ్రతికి వచ్చిన వాళ్ళలో ఆయన మొదటివాడౌతాడు. తన ప్రజలకు, యూదులుకాని వాళ్ళకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెపుతున్నాను.’ నేను వీళ్ళు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం లేదు.”
24 పౌలు, తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు, పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.
25 పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను.
26 రాజుగారికి యివన్నీ తెలుసు. నేను రాజుగారితో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టి నుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు.
27 అగ్రిప్ప రాజా! మీరు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నారని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.
28 అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.
29 పౌలు, “సులభమో, కష్టమో! మీరే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.
30 రాజు లేవగానే రాష్ట్రాధిపతి, బెర్నీకే, మరియు వాళ్ళతో కూర్చున్న వాళ్ళు లేచి నిలుచున్నారు.
31 వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణ దండన పొందటానికి కాని, కారాగారంలో ఉండ వలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు.
32 అగ్రిప్ప ఫేస్తుతో, “ఇతడు చక్రవర్తికి విన్నపం చేయకుండా ఉండినట్లైతే విడుదల చేసి ఉండేవాణ్ణి!” అని అన్నాడు.
1 మేము ఇటలీకి ఓడలో ప్రయాణం చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీలను ‘యూలి’ అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు.
2 మేము ఆసియ తీరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియ అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియ ప్రాంతంలోని థెస్సలోనీకకు చెందిన అరిస్తార్కు అనేవాడు మా వెంట ఉన్నాడు.
3 మరునటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి, పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు.
4 అక్కడి నుండి మళ్ళీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలి వీచని నీళ్లలో ప్రయాణం సాగించాము.
5 కిలికియ, పంపూలియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ ‘లుకియ’ ప్రాంతంలో ఉన్న ‘మూర’ అనే పట్టణాన్ని చేరుకున్నాము.
6 మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న ‘అలెక్సంద్రియ’ఓడను చూసి, మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు.
7 ఎదురు గాలి వీస్తూవుండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా ‘క్నిదు’ తీరాన్ని చేరుకున్నాము. ఎదురు గాలి వల్ల ముందుకు వెళ్ళలేక పోయ్యాము. అందువల్ల దక్షిణంగా వెళ్ళి ‘క్రేతు’ ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని ‘సల్మోనే’ తీరంగుండా ప్రయాణం సాగించాము.
8 ఆ నీళ్లలో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా ‘మంచి రేవులు’ అనే స్థలాన్ని చేరుకున్నాము. ఈ తీరం లసైయ అనే పట్టణానికి దగ్గరగా ఉంది.
9 అప్పటికే చాలా కాలం వృధా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడుమని చెబతూ,
10 “ప్రజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు.
11 కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు.
12 [This verse may not be a part of this translation]
13 దక్షిణ గాలి వీచగానే తదుకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు.
14 అంతలోనే, ఉరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది.
15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది.
16 ‘కౌద’ అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన వడవను చాలా కష్టంగా కాపాడగలిగాము.
17 [This verse may not be a part of this translation]
18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు.
19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు.
20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.
21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, నా సలహా పాటించి మీరు క్రేతు నుండి ప్రయాణం చేయకుండా ఉండ వలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు.
22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది.
23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు:
24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’
25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది.
26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.
27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్థరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు.
28 బడుదు నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదువైదు బారల లోతుందని తెలుసుకున్నారు.
29 ఓడ, రాళ్ళకు కొట్టుకుంటుం దని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు.
30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్ధేశ్యం.
31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికలు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు.
32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.
33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినుమని చెబతూ, “గడిచిన పదునాలుగు రోజుల నుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు.
34 ఇక మిమ్మల్ని కొంచం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు.
35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు.
36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు.
37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు.
38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.
39 సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు.
40 త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు.
41 కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది.
42 నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించు కున్నారు,
43 కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చెయదలచిన దానిని చెయనివ్యలేదు. ఈద గలిగిన వాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు.
44 మిగతా వాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
1 తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని ‘ మెలితే’ అంటారని తెలుసుకున్నాము.
2 ఆ ద్వీపంలో నివసించే వాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు.
3 పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది.
4 ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు.
5 కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు.
6 వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తను మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు.
7 ఆ ప్రక్కనున్న పొలాలు ‘పొప్లి’ అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కార్యాలు చేసాడు.
8 పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది.
9 ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ?్ళక్కూడా నయమైపోయింది.
10 ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణ మయ్యెముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు.
11 చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండి పోయిన ఒక ఓడలో మూడు నెలల తర్వాత ప్రయాణం చేసాము. అది అలెక్సంద్రియ నగరానికి చెందిన ఓడ. దాని పేరు “కవల దేవతలు.”
12 మేము ‘సురకూసై’ అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము.
13 మేము రేగియ నగరానికి వచ్చాము. మరునటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలు దేరగలిగాము. ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము.
14 అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండుమన్నారు. ఈ విధంగా రోము చేరుకున్నాము.
15 రోములో ఉన్న సోదరులు మేము వస్తున్నామని విన్నారు. మమ్మల్ని కలుసుకోవటానికి వాళ్ళు అప్పీయా ఫోరన్ ట్రెయిన్ టాబెర్న్ అనే గ్రామాల వరకు వచ్చారు. వీళ్ళను చూడగానే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలిగింది.
16 మేము రోము పట్టణం చేరుకున్నాక పౌలును ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సైనికుణ్ణి అతనికి కాపలాగా ఉంచారు.
17 మూడు రోజుల తర్వాత పౌలు యాదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వీకుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏది చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోము అధికారులకు అప్పగించారు.
18 వాళ్ళు విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు.
19 కాని, దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు.
20 ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు.
21 వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు: “యూదయ నుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా మాట్లాడలేదు.
22 కాని అన్ని ప్రాంతల వాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
23 పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతల నుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు.
24 అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు.
25 వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళి పోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వీకులతో ప్రవక్త యెషయా ద్వారా ఈ విధంగా చెప్పి నిజంపలికాడు:
26 ప్రజలతో ఈ విధంగా చెప్పు: మీరెప్పుడూ వింటుంటారు. కాని ఎన్నటికి అర్థం చెసుకోరు! మీరు అన్ని వేళలా చూస్తుంటారు. కాని ఎన్నటికి గ్రహించరు.
27 వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను. కాని అలా జరుగకూడదని ఈ ప్రజల హృదయాలు ముందే మొద్దు బారాయి. వాళ్ళకు బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’ యెషయా 6:9-10
28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కాని వాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!”
29 [This verse may not be a part of this translation]
30 పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు.
31 ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.