1

1 [This verse may not be a part of this translation]

2 ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు.

3 ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్ఠింపబడలేదు.

4 ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగు నిచ్చెను.

5 వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.

6 దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను.

7 తన ద్వారా మానవులు విశ్వసించాలని అతడు వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు.

8 అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు.

9 ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి వస్తూ ఉన్నాడు.

10 ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు.

11 ఆయన తన స్వంత వాళ్ళదగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు.

12 అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు.

13 కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరకవాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.

14 ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము.

15 [This verse may not be a part of this translation]

16 ఆయన పరిపూర్ణత వల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము.

17 దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు.

18 ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.

19 యోహాన్ను అడిగి, అతడెవరన్న విషయం కనుక్కురావటానికి, యెరూషలేములోని యూదులు యాజకులను లేవీయులను అతని దగ్గరకు పంపారు.

20 యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించలేదు. పైగా ఏదీ దాచకుండా సృష్టంగా సమాధానం చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును కాదు!” అని సమాధానం చెప్పాడు.

21 వాళ్ళు అతణ్ణి, “మరి నీ వెవరు? ఏలీయావా?” అని అడిగారు. అతడు, “కాదు” అని అన్నాడు. “ప్రవక్తవా?” “కాదు.”

22 చివరకు వాళ్ళు, “మరి నీవెవరవు? మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి మాకో సమాధానం చెప్పండి. మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి నీ గురించి నీవేమని చెప్పుచున్నావు?” అని అడిగారు.

23 యోహాను యిలా సమాధానం చెప్పాడు: “ప్రభువు కోసం చక్కటి మార్గం వేయుమని ఎడారి ప్రాంతాల్లో ఒక స్వరం ఎలుగెత్తి పలికింది.” యెషయా 40:3 ఇవి యెషయా ప్రవక్త అన్న మాటలు.

24 వీళ్ళను పంపింది పరిసయ్యులు.

25 వాళ్ళు మరొక ప్రశ్న వేస్తూ, “నీవు క్రీస్తువు కానంటున్నావు. ఏలీయావుకానంటున్నావు. ప్రవక్తవుకానంటున్నావు. అటువంటప్పుడు నీవు ప్రజలకు బాప్తిస్మము ఎందుకిస్తున్నావు?” అని అడిగారు.

26 యోహాను సమాధానం చెబుతూ,”నేను నీళ్ళ ద్వారా బాప్తిస్మము యిస్తున్నాను. కాని మీరెరుగని వాడొకాయన మీ మధ్య ఉన్నాడు.

27 నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను తగను” అని అన్నాడు.

28 ఈ సంఘటనలన్నీ బేతనియ గ్రామంలో జరిగాయి. అది యోహాను బాప్తిస్మము ఇచ్చిన యొర్దాను నదికి అవతల వైపున ఉంది.

29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱె పిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు.

30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే!

31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూవచ్చాను.”

32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను.

33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు.

34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”

35 మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు.

36 అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱె పిల్లను చూడండి!” అని అన్నాడు.

37 ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు.

38 యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. అంటే గురువు అని అర్థం.

39 యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.

40 యోహాను చెప్పింది. విని, యేసును అనుసరించిన యిద్దరిలో

41 అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోన్ను కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.

42 తర్వాత సీమోన్ను యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం

43 మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు.

44 అంద్రెయ, పేతురుల్లాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు.

45 ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.

46 నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు. “వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.

47 నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.

48 “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు. యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.

49 నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు

50 యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!”అని అన్నాడు.

51 ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.

2

1 మూడవరోజు గలిలయ దేశంలోని “కానా”పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది.

2 యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు.

3 ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది.

4 యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నాసమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు.

5 ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది.

6 ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి.

7 యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!”అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు.

8 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు.

9 ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో,

10 “అందరూ మంచి ద్రాక్షారసంను మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాకమాములు ద్రాక్షారసంను పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసంను యింత దాకా ఎందుకు దాచావు?” అని అన్నాడు.

11 యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.

12 ఇది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు.

13 యూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు యెరూషలేము వెళ్ళాడు.

14 ప్రజలు మందిర ఆవరణంలో ఎద్దుల్ని, గొఱ్ఱెల్ని , పావురాల్ని, అమ్మటం చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు మార్చటం చూసాడు.

15 త్రాళ్ళతో ఒక కొరడా చేసి అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. ఎద్దుల్ని , గొఱ్ఱెల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రిందులుగా చేసివేసాడు.

16 పావురాలు అమ్ముతున్న వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి మీకెన్ని గుండెలు? “అని అన్నాడు.

17 ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయ జ్ఞాపకం చేసుకొన్నారు: “నీ యింటిపై నాకున్న ఆశ నన్ను దహించి వేస్తుంది” కీర్తన 69:9

18 యూదులు యేసుతో,”ఒక అద్భుతాన్ని చేసి చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికార మున్నదని నమ్ముతాము” అని అన్నారు.

19 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు రోజుల్లో మళ్ళీ కడతాను.”

20 యూదులు,”ఈ మందిరం కట్టటానికి నలభై ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తావా?” అని అన్నారు.

21 కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన దేహాన్ని గురించి.

22 ఆయన బ్రతికింపబడ్డాక, ఆయన శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, యేసు చెప్పిన వాటిని విశ్వసించారు.

23 పస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూషలేములో ఉండి చేసిన అద్భుతాల్ని ప్రజలు చూసారు. వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది.

24 కాని ఆయనకు మానవ స్వాభావము తెలుసు. కనుక తనను తాను వాళ్ళకు అప్పగించుకోలేదు.

25 మానవ స్వభావం ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి ఆయనకు ఎవడును ఎడమను చెప్పనవసరం లేదు.

3

1 నీకొదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు.

2 అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు.

3 యేసు జవాబు చెప్పుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు”అని సృష్టంగా చెప్పాడు.

4 నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్దుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోనికి రెండవ సారి ప్రవేశించలేము కాదా!” అని అడిగాడు.

5 యేసు జవాబు చెప్పుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు.

6 మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మకత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది.

7 అందువల్ల నేను, “నీవు మళ్ళీ జన్మించాలి” అనటం విని అశ్చర్యపోవద్దు.

8 గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు.”

9 “అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు.

10 యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా?

11 ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు.

12 నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు?

13 పరము నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.

14 [This verse may not be a part of this translation]

15 [This verse may not be a part of this translation]

16 దేవుడు ఈ ప్రపంచప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని. వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్ధేశ్యం.

17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు.

18 తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మని వానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్నలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు.

19 దేవుడు చెప్పిన తీర్పు యిది: ప్రపంచంలోకి వెలుగు వచ్చింది. ప్రజలు దుర్మార్గపు పనులు చేసారు. కనుక వాళ్ళు వెలుగుకు మారుగా చీకటిని ప్రమించారు.

20 చెడుపనులు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. తన చెడు బయట పడుతుందేమోనని అతడు వెలుగులోకి రాడు.

21 మంచి పనులు చేసేవాడు తాను చేసిన పనులు దేవునివల్ల చేసిన విషయమై ప్రజలు గ్రహించాలని వెలుగులోకి వస్తాడు.

22 ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు.

23 అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు.

24 ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన.

25 పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది.

26 వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ!యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు.

27 యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు.

28 నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం.

29 పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది.

30 ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి.

31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు.

32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకిరించరు.

33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు.

34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు.

35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు.

36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందులేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.

4

1 యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిస్మము నిస్తున్నాడని పరిసయ్యులు విన్నారు.

2 నిజానికి, బాప్తిస్మము నిచ్చింది యేసు కాదు. ఆయన శిష్యులు.

3 యేసు యిది గమనించి, యూదయ వదిలి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయాడు.

4 ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది.

5 ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు.

6 అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు.

7 ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు.

8 ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు.

9 ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు.

10 యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.

11 ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది?

12 మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.

13 యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది!

14 కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవతాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు.

15 ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది.

16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.

17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది.

18 యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.

19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు.

20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని ఆ స్త్రీ అన్నది.

21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది.

22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణయూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము.

23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు.

24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయన ఆరాధించేవారు ఆయన్ని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.

25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అనింది.

26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.

27 అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నారని కాని “ వాళ్ళు అడగలేదు.

28 ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్ళిపోయింది.

29 ప్రజలతో, “రండి! నేను చేసిన వాటన్నిటీని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు అవును గదా” అని అన్నది.

30 వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.

31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు.

32 కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు.

33 ఆయన శిష్యులు,”ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.

34 యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం.

35 ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!” అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది.

36 దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు.

37 ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది.

38 మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.

39 ఆ పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో ఆ స్త్రీ, “నేను చేసినదంతా ఆయన చెప్పాడు” అని చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు.

40 అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్ళి తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్ళతో రెండు రోజులున్నాడు.

41 ఆయన చెప్పిన విషయాల వలన యింకా అనేకులు విశ్వాసులైయ్యారు.

42 ఆ సమరయ ప్రజలు ఆమెతో, “మొదట నీవు చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము. కాని యిప్పుడు మేము ఆయన మాటలు స్వయంగా విన్నాము. కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన వాడని మాకు బాగ తెలిసిపోయింది” అని అన్నారు.

43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్ళాడు.

44 అక్కడ యేసు,”ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు” అని అన్నాడు.

45 ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యోరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటిని చూశారు.

46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని ‘కానా’ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు.

47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు.వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు.

48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.

49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.

50 యేసు,”నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు. అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు.

51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.

52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు. వాళ్ళు,”నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.

53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.

54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.

5

1 కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్ళాడు.

2 అక్కడ యెరూషలేములో గొఱ్ఱెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్ఠ అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి.

3 చాలామంది వికలాంగులు, గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు.

4 “అప్పుడప్పుడు ప్రభువు దూత దిగి వచ్చి ఆ నీళ్ళను కదిలించేవాడు. అలా నీళ్ళు కదిలిన వెంటనే ఆ కోనేరులోకి దిగిన మొదటి వాని రోగాలన్నీ నయమయ్యేవి. అని చెప్పబడింది.

5 అక్కడున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు.

6 యేసు అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు నయం కావాలని ఉందా?” అని అడిగాడు.

7 ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలి నప్పుడు ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు: అయినా వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు”అని అన్నాడు.

8 అప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసుకొని నడుపు!”అని అన్నాడు.

9 అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది.

10 తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక వెళ్ళటానికి వీల్లేదు” అని అన్నారు.

11 కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, ‘నీ చాప పట్టుకొని వెళ్ళు’ అని అన్నాడు” అని సమాధానం చెప్పాడు.

12 వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న వాడెవడు?” అని అడిగారు.

13 ప్రజల గుంపు ఉండటంవల్ల యేసు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేక పోయాడు.

14 ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!”అని అన్నాడు.

15 ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు.

16 యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలు పెట్టారు.

17 యేసు వాళ్ళతో, “నా తండ్రి అన్ని వేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.

18 ఈ కారణంగా యూదులాయన్ని చంపటానికి యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు,”అతడు విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా చేసి తనను దేవునితో సమానం చేసు కొంటున్నాడు” అని అన్నారు.

19 యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు.

20 తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా అశ్చర్యపోతారు.

21 తండ్రి చనిపోయిన వాళ్ళను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన వాళ్ళకు ప్రాణం పోస్తాడు.

22 అంతేకాదు, తండ్రి ఎవరి మీద తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు.

23 తండ్రిని గౌరవించినట్లు, కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు” అని అన్నాడు.

24 యేసు,”ఇది సత్యం. నామాటలు విని నన్ను పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట.

25 ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. ఆ స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు.

26 ఎందుకంటే, జీవానికి తండ్రి ఏ విధంగా మూలపురుషుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూలపురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది తండ్రి!

27 కుమారుడు మానవావతారం పొందాడు కనుక తండ్రి ఆయనకు తీర్పు చెప్పే అధికారంయిచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది.

28 ఆశ్చర్యపడకండి! సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం వినే కాలం రానున్నది.

29 వెలుపలికి రండి! మంచి చేసిన వాళ్ళు నిరంతరం జీవించటానికి బ్రతికి వస్తారు. కీడు చేసిన వాళ్ళు నిరంతరం శిక్షింపబడటానికి బ్రతికివస్తారు.

30 “నేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు చెప్పమన్న తీర్పు చెబుతాను. అందువలన నా తీర్పు న్యాయమైనది. నెరవేర వలసింది నాయిచ్ఛ కాదు. నేను నన్ను పంపిన వాని యిచ్ఛ నెర వేర్చటానికి వచ్చాను.

31 “నా పక్షాన నేను సాక్ష్యం చెబితే దానికి విలువ ఉండదు.

32 కాని నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు మరొకాయన ఉన్నాడు. నా విషయంలో ఆయన చెప్పే సాక్ష్యానికి విలువ ఉందని నాకు తెలుసు.

33 “మీరు మీ వాళ్ళను యెహాను దగ్గరకు పంపారు. అతడు న్యాయం పక్షాన మాట్లాడాడు.

34 మానవుని సాక్ష్యం నాకు కావాలని కాదు. మీరు రక్షింపబడాలని ఈ విషయం చెబుతున్నాను.

35 యోహాను ఒక దీపంలా మండుచూ. వెలుగు నిచ్చాడు. కొంతకాలం మీరా వెలుగు ద్వారా లాభంపొంది ఆనందించారు.

36 “నా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి.

37 నన్ను పంపిన తండ్రి స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు.

38 అంతే కాక ఆయన పంపిన వాణ్ణీ మీరు నమ్మటంలేదు. కనుక, ఆయన బోధనలు మీ మనస్సులో నివసించటంలేదు.

39 లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతున్నాయి.

40 అయినా మీరు నా దగ్గరకు వచ్చి నానుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు.

41 “నాకు మానవుల పొగడ్తలు అవసరం లేదు.

42 కాని మీ గురించి నాకు తెలుసు. మీకు దేవునిపట్ల ప్రేమ లేదని నాకు తెలుసు.

43 నేను నా తండ్రి పేరిటవచ్చాను. నన్ను మీరు అంగీకరించలేదు. కాని ఒక వ్యక్తి స్వయంగా తన పేరిట వస్తే అతణ్ణి మీరు అంగీకరిస్తారు.

44 మీరు పరస్పరం పొగడుకుంటారు. కాని దేవుని మెప్పు పొందాలని ప్రయత్నించరు. అలాంటప్పుడు నన్ను ఎట్లా విశ్వసించగలరు?

45 నేను మిమ్మల్ని నా తండ్రి సమక్షంలో నిందిస్తానని అనుకోకండి. మీరు ఆధారంగా చేసుకొన్న మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడు.

46 మీరు మోషేను నమ్మినట్లైతే, అతడు నన్ను గురించి వ్రాసాడు కనుక మీరు నన్ను కూడా నమ్మేవాళ్ళు.

47 అతడు వ్రాసింది మీరు నమ్మనప్పుడు నేను చెప్పింది ఎట్లా నమ్మగలరు?” అని అన్నాడు.

6

1 ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ సముద్రం (తిబెరియ సముద్రం) దాటి వెళ్ళాడు.

2 ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగుచెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని అనుసరిస్తూవచ్చింది.

3 యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు.

4 అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదల పండుగ.

5 యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం?”అని అడిగాడు.

6 అతణ్ణి పరీక్షించటానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చెయ్యాలో ముందే ఆలోచించుకొన్నాడు.

7 ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా, రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. అయినా అది చాలదు.

8 యేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడున్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు.

9 “ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని యింతమందికి అవి ఎట్లా సరిపోతాయి?”అని అన్నాడు.

10 యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!”అని అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య ఐదువేలు.

11 యేసు ఆ రొట్టెల్ని తీసుకొని, దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు.

12 వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తి పెట్టండి!” అని అన్నాడు.

13 ఐదు బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపలనిండా నింపారు.

14 ప్రజలు యేసు చేసిన ఆ మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.

15 యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును చెయ్యాలనుకుంటున్నారని గ్రహించాడు. కనుక ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపోయ్యాడు.

16 సాయంకాలమైంది. ఆయన శిష్యులు సముద్రం దగ్గరకు వెళ్ళారు.

17 వాళ్ళు ఒక పడవనెక్కి సముద్రంకు అవతలి వైపుననున్న కపెర్నహూము అనే పట్టణం వైపు వెళ్ళసాగారు. అప్పటికే చీకటి పడింది. యేసు వాళ్ళనింకా కలుసుకోలేదు.

18 గాలి తీవ్రంగా వీయటంవల్ల అలలు అధికమయ్యాయి.

19 మూడు నాలుగుమైళ్ళ దూరందాకా తెడ్లు వేసాక, యేసు నీళ్ళ పై నడుస్తూ పడవ దగ్గరకు రావటం వాళ్ళు చూసారు. వాళ్ళకు బాగా భయం వేసింది.

20 కాని, యేసు వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు.

21 ఈమాట అన్న తర్వాత ఆయన పడవలోకి రావటానికి వాళ్ళు అంగీకరించారు. ఆ తదుపరి వాళ్ళు, తాము వెళ్ళ దలచిన తీరాన్ని త్వరలోనే చేరుకున్నారు.

22 తెల్లవారింది. అవతలి ఒడ్డున ఉండి పోయిన ప్రజలకు అక్కడ ఒకే పడవ ఉందని, యేసు శిష్యులతో కలిసి వెళ్ళలేదని, శిష్యులు మాత్రమే వెళ్ళారని, తెలుసు కొన్నారు.

23 [This verse may not be a part of this translation]

24 [This verse may not be a part of this translation]

25 యేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?” అని అడిగారు.

26 యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు.

27 చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.

28 వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు.

29 యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.

30 కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు?

31 మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను తిన్నారు. దీన్ని గురించి గ్రంథల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.”

32 యేసు జవాబు చెప్పుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి.

33 ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు.

34 వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు.

35 యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు.

36 కాని నేను ఇంతకు క్రితం చెప్పినట్లు, నన్ను చూసారు! అయినా మీరు నమ్మలేదు!

37 తండ్రి నాకప్పగించిన వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణెవణ్ణి నేను ఎన్నటికి నెట్టి వేయను.

38 ఎందుకంటే, నేను పరలోకం నుండి నా యిష్టం నెర వెర్చుకోవటానికి దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాను.

39 నన్ను పంపిన వాని కోరిక యిది: నా కప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టు కోరాదు. వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి.

40 కుమారుని వైపు చూసి ఆయన్ని నమ్మినవాడు అనంత జీవితం పొందాలి. ఇది నా తండ్రి కోరిక. అలా నమ్మిన వాణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.”

41 ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు.

42 “ఇతడు యోసేపు కుమారుడైన యేసు కదా! ఇతని తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదమే! మరి యిప్పుడితడు, ‘నేను పరలోకంనుండి దిగి వచ్చానని’ ఎందుకు అంటున్నాడు?” అని వాళ్ళన్నారు.

43 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీలో మీరు గొణుక్కోవడం చాలించండి.

44 నన్ను పంపిన తండ్రి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాణ్ణి చివరి రోజు నేను బ్రతికిస్తాను.

45 ప్రవక్తల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది:’దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు.’ తండ్రి మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరకు వస్తారు.

46 దేవుని నుండి వచ్చినవాడు తప్ప తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని చూసాడు.

47 ఇది నిజం. నమ్మినవానికి అనంత జీవితం లభిస్తుంది.

48 నేను మీ జీవితానికి ఆహారాన్ని.

49 మీ పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు మన్నా తిన్నారు. అయినా చనిపోయారు.

50 కాని ఈయన పరమునుండి వచ్చిన నిజమైన ఆహారం. దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణించడు.

51 పరమునుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఆ ఆహారం నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం యిస్తాను.”

52 ఆ తర్వాత, “మనకు తన శరీరాన్ని తినటానికి ఈయన ఏవిధంగా యిస్తాడు?” అని యూదులు పరస్పరం తీవ్రంగా వాదించుకున్నారు.

53 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మనుష్యకుమారుని శరీరం తిని, ఆయన రక్తం తాగ్రితే తప్ప మీలో జీవం ఉండదు.

54 నా శరీరము తిని, నా రక్తం త్రాగిన వానికి అనంతజీవితం లభిస్తుంది. అతణ్ణి నేను చివరి రోజు బ్రతికిస్తాను.

55 ఎందుకంటే నా శరీరం నిజమైన ఆహారం. నా రక్తం నిజమైన పానీయము.

56 నా శరీరం తిని, నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు.

57 సజీవుడైన నా తండ్రి నన్ను పంపాడు. ఆయన కారణంగానే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నన్ను ఆహారంగా తిన్నవాడు నాకారణంగా జీవిస్తాడు.

58 పర లోకంనుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! ఇది మన పూర్వీకులు తిన్న ఆహారంలాంటిది కాదు. వాళ్ళు అది తిన్నా చని పొయ్యారు. కాని ఈ ఆహారాన్ని తిన్నవాళ్ళు అనంతజీవితం పొందుతారు.”

59 యేసు, కపెర్నహూములోని యూదుల సమాజ మందిరంలో బోధిస్తూ ఈ విషయాలు చెప్పాడు.

60 ఆయన చెప్పినవి విని చాలా మంది శిష్యులు, “ఈ బోధన చాల కష్టమైనది. దీన్ని ఎవరు అంగీకరించ గలరు?” అని అన్నారు.

61 తన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొణుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. ఆయన వాళ్ళతో, “ఇది మీకు కష్టంగా ఉందా?

62 మనుష్యకుమారుడు, తాను ముందున్న చోటికి వెళ్ళటం చూస్తే మీరెమంటారు?

63 ఆత్మ జీవాన్నిస్తాడు. శరీరానికి విలువ లేదు. నామాటలు ఆత్మకు సంబంధించినవి. అవి జీవం.

64 కాని, మీలో కొందరు నమ్మటం లేదు” అని అన్నాడు. తనను నమ్మని వాడెవడో, తనకు ద్రోహం చేసేవాడెవడో యేసుకు ముందునుండి తెలుసు.

65 యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “తండ్రి అనుమతిస్తే తప్ప నా దగ్గరకు ఎవ్వరూ రాలేరని అందుకే అన్నాను.”

66 ఆ రోజు నుండి చాలా మంది శిష్యులు ఆయన్ని అనుసరించటం మానుకొని వెనక్కు మళ్ళి పోయారు.

67 యేసు, “మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా?” అని పన్నెండు మందిని అడిగాడు.

68 సీమోను పేతురు, “ప్రభూ మేము ఎవరి దగ్గరకు వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మాటలు మీ దగ్గర ఉన్నాయి.

69 మీరు దేవునికి సంబంధించిన వారని, పవిత్రులని మాకు తెలుసు. అది మేము నమ్ముతున్నాము” అని సమాధానం చెప్పాడు.

70 అప్పుడు యేసు, “మీ పన్నెండు మందిని ఎన్నుకొన్న వాణ్ణి నేనే కదా! అయినా మీలో ఒకడు సైతాను!” అని అన్నాడు.

71 ఆయన ఉద్దేశ్యం సీమోను కుమారుడైన ఇస్కరి యోతు యూదా అని. యూదా పన్నెండు మందిలో ఒకడైయుండి యేసుకు ద్రోహం చేస్తాడు.

7

1 ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు.

2 యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది.

3 యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు.

4 నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు.

5 అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట!

6 యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే.

7 ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది.

8 మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు.

9 ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు.

10 ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా.

11 అక్కడ పండుగ జరుగే స్థలంలో యూదులు, ‘అతడెక్కడున్నాడు?’ అని అంటూ ఆయన కోసం వెదకసాగారు.

12 ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!”అని అన్నారు.

13 యూదులకు భయపడి ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏమీ అనలేదు.

14 పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించటం మొదలుపెట్టాడు.

15 యూదులు ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు.

16 యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి.

17 దైవేచ్చానుసారం జీవించ దలచిన వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా నా అధికారంతో మాట్లాడుతున్ననా అన్న విషయం తెలుస్తుంది.

18 స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు.

19 మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు” అని అన్నాడు.

20 “నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంపటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు అన్నారు.

21 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు.

22 మోషే మీకు సున్నతి చేయించు కోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు కాని పితరులనుండి ప్రారంభమైనది.

23 కనుక అవసరమైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయంచేసినందుకు మీకు కోపం వస్తోంది?

24 పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”

25 అదే క్షణాన కొందరు యెరుషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా!

26 ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి?

27 కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!”

28 అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు.

29 కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు.

30 ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు.

31 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన్న కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు.

32 ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్లాడు కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని పంపారు.

33 కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను.

34 నా కోసం మీరు వెతుకుతారు. కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు” అని అన్నాడు.

35 యూదులు తమలో తాము, “మనం కనుక్కోకుండా ఉండేటట్లు ఇతడు ఎక్కడికి వెళ్ళదలిచాడు? గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీకులకు బోధిస్తాడా?

36 ‘నా కోసం వెతుకుతారు, కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు’ అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడుకున్నారు.

37 పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు.

38 లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు.

39 అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు.

40 ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు.

41 మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” అని అన్నారు. కాని యితర్లు, “క్రీస్తు గలిలయనుండి ఎట్లావస్తాడు?

42 ఆయన దావీడు వంశంనుండి, దావీదు నివసించిన బేత్లెహేమునుండి వస్తాడని లెఖానాల్లో వ్రాసారు కదా!” అని అన్నారు.

43 యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభిప్రాయం కలిగింది.

44 కనుక ఆయన్ని బంధించాలనుకున్నారు. కాని ఎవ్వరూ ఆయన పై చెయ్యి వెయ్యలేదు.

45 చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళిపొయ్యారు. వాళ్ళు ఆ భటుల్ని, “అతణ్ణెందుకు పిలుచుకొని రాలేదు?” అని అడిగారు.

46 వాళ్ళు, “అతడు మాట్లాడినట్లు ఇంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు.

47 పరిసయ్యులు, “అంటే! మిమ్మల్ని కూడా అతడు మోసం చేసాడా?

48 పాలకుల్లో కాని, పరిసయ్యుల్లో కాని అతణ్ణి నమ్మిన వాళ్ళెవ్వరూ లేరు.

49 ధర్మశాస్త్రాన్ని గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపం ఉందన్నట్లే!” అని అన్నారు.

50 నీకొదేము వాళ్ళలో ఒకడు. ఇతడు ఇదివరలో యేసు దగ్గరకు వెళ్ళి చవ్చాడు.

51 అతడు, “మన ధర్మశాస్త్రం విచారణ చేయకుండా, అతని వాదన వినకుండా, అతడు చేసింది తేలుసుకోకుండా శిక్షవిధిస్తుందా?” అని అడిగాడు.

52 వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మశాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు. (ముఖ్యమైన ప్రాచీన వ్రాతప్రతులు యోహాను 7:53-8:11 లేవు.)

53 ఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు.

8

1 యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు.

2 సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు.

3 వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి

4 యేసుతే, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది.

5 మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు.

6 ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు.

7 వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు.

8 ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు.

9 ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు.

10 యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు.

11 “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది. “నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు.

12 యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.

13 పరిసయ్యులు సవాలు చేస్తూ,”నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.

14 యేసు సమాధానం చెబుతూ,”నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు.

15 మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను.

16 కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు.

17 ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు.

18 నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.

19 అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు.

20 ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!

21 యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నానను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు.

22 యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు.

23 యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు.

24 మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు.

25 వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు. యేసు, “నేను యింతదాకా ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు.

26 “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు.

27 ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు.

28 అందువలన యేసు వాళ్ళతో,”మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు.

29 నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు యిష్టమైనవే చేస్తాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు.

30 ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు.

31 తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు.

32 అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది” అని అన్నాడు.

33 వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు.

34 యేసు జవాబు చెప్పుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు.

35 బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు.

36 కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది.

37 మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయనా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు.

38 నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు.

39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు!

40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు.

41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు. వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.

42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు.

43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు.

44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి ప్రకృతి. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడు తాడు. వాడు అబద్ధానికి తండ్రి.

45 నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు.

46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు.

47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”

48 “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.

49 “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు.

50 నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి.

51 ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.

52 ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు.

53 నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.

54 యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు.

55 ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను.

56 మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.

57 ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.

58 యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు.

59 ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.

9

1 ఆయన వెళ్తూ ఒక పుట్టు గ్రుడ్డి వాణ్ణి చూశాడు.

2 ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు గ్రుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు.

3 యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు.

4 సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు ఎవ్వరూ పని చెయ్యలేరు.

5 ఈ ప్రపంచంలో నేను ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు.

6 ఈ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసాడు. ఆ ఉమ్మితో బురద చేసి, ఆ గ్రుడ్డివాని కళ్ళమీద పూసాడు.

7 అతనితో, “వెళ్ళి, సిలోయం కోనేట్లో కడుక్కో!” అని అన్నాడు. సిలోయం అన్న పదానికి అర్థం ‘పంపబడిన వాడు’. ఆ గ్రుడ్డివాడు వెళ్ళి తన కళ్ళు కడుక్కున్నాడు. అతనికి దృష్టి వచ్చాక తిరిగి వచ్చాడు.

8 అతని ఇరుగు, పొరుగు వాళ్ళు, అతడు భిక్షమెత్తు కుంటుండగా చూసిన వాళ్ళు, “ఈ మనిషి కూర్చొని భిక్షమెత్తు కుంటూవుండే వాడు కదా!”అని అన్నారు.

9 [This verse may not be a part of this translation]

10 “మరి అలాగైతే నీకు దృష్టి ఎట్లా వచ్చింది!” అని వాళ్ళు అడిగారు.

11 అతడు, “యేసు అని పిలుస్తారే ఆయన బురద చేసి నా కళ్ళ మీద పూసాడు. తర్వాత నన్ను వెళ్ళి సిలోయం కొనేరులో కడుక్కోమన్నాడు. నేను అలాగే వెళ్ళి కడుక్కున్నాను. ఆ తర్వాత నాకు దృష్టి వచ్చింది” అని సమాధానం చెప్పాడు.

12 వాళ్ళు, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగారు. ఆయన,”నాకు తెలియదు” అని అన్నాడు.

13 వాళ్ళు యింతకు పూర్వం గ్రుడ్డివానిగా ఉన్న వాణ్ణి పరిసయ్యుల దగ్గరకు పిలుచుకు వచ్చారు.

14 బురద చేసి ఆ గ్రుడ్డివానికి నయం చేసింది విశ్రాంతి రోజు.

15 పరిసయ్యులు దృష్టి ఎట్లా వచ్చిందని అతణ్ణి ప్రశ్నించారు. అతడు,”ఆయన నా కళ్ళమీద బురద పూసాడు. నేను వెళ్ళి కడుక్కొన్నాను. నాకు దృష్టి వచ్చింది” అని అన్నాడు.

16 కొందరు పరిసయ్యులు, “అతడు విశ్రాంతి రోజును పాటించడు. కనుక అతడు దేవుని నుండి రాలేదు!” అని అన్నారు. మరికొందరు, “ఇతడు పాపాత్ముడైతే ఇలాంటి అద్భుతాలు చేయగలడా?” అని అన్నారు. అలా వారిలో వారికి వివాదం కలిగింది.

17 వాళ్ళు మళ్ళీ గ్రుడ్డివానితో, “నీవు అతని గురించి ఏమనుకొంటున్నావు” అని అడిగారు. “ఆయన ఒక ప్రవక్త!” అని ఆ నయమైన వాడు సమాధానం చెప్పాడు.

18 ఇదివరలో గ్రుడ్డివానిగా ఉన్నవాడు యితడేనని; యిప్పుడతనికి దృష్టి వచ్చిందని, అతని తల్లిదండ్రుల్ని పిలువనంపే దాకా యూదులు నమ్మలేదు.

19 అతని తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడా! గ్రుడ్డి వానిగా జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడెట్లా చూడగలుగుతున్నాడు?”అని అడిగాడు.

20 అతని తల్లిదండ్రులు, “అతుడు మా కుమారుడని, గ్రుడ్డివానిగా జన్నించాడని మాకు తెలుసు.

21 కాని అతడు ఇప్పుడేవిధంగా చూడగలుగు తున్నాడో. అతనికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతణ్ణే అడగండి! తనను గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది” అని అన్నారు.

22 యేసే,”క్రీస్తు” అన్న ప్రతి ఒక్కణ్ణి సమాజ మందిరం నుండి బహిష్కరించాలని యూదులు యిది వరకే నిశ్చయించారు. కనుక వాళ్ళకు భయపడి అతని తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం చెప్పారు.

23 అందుకే వాళ్ళు, “అతనికి వయస్సు వచ్చింది. అతణ్ణే అడగండి!” అని అన్నారు.

24 యూదులు గ్రడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో,”దేవుణ్ణి స్తుతించు, అతణ్ణి కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు.

25 “ఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం చెప్పాడు.

26 “అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు.

27 అతుడు, “నేను యిది వరకే చెప్పాను. కాని మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటున్నారా?” అని అన్నాడు.

28 వాళ్ళు అతణ్ణి అవమానపరచారు. అతనితో, “నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము.

29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా మాకు తెలియదు” అని అన్నారు.

30 అతడు, “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు.

31 దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు.

32 పుట్టు గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ వినలేదు.

33 ఇతడు దేవుని నుండి రానట్లైతే ఏమి చెయ్యలేకపొయ్యేవాడు” అని అన్నాడు.

34 ఇది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత ధైర్యం?” అని అంటూ అతణ్ణి వెలివేశారు.

35 అతణ్ణి వెలివేశారని యేసు విన్నాడు. యేసు అతణ్ణి కనుగొని, “నీవు మనుష్యకుమారుణ్ణి నమ్ముచున్నావా?” అని అడిగాడు.

36 ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి ప్రభూ! విశ్వసిస్తాను!” అని అన్నాడు.

37 యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్నవాడాయనే! అని అన్నాడు.

38 అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని అంటూ ఆయన ముందు మోకరిల్లాడు.

39 యేసు,”నేను తీర్పు చెప్పటానికి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఆ తీర్పేదనగా-గ్రుడ్దివాళ్ళు చూడగల గాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గ్రుడ్డి వాళ్ళు కావాలని నేను వచ్చాను” అని అన్నాడు.

40 ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న కొందరు పరిసయ్యులు, “మేము కూడా గ్రుడ్డి వాళ్ళ మంటున్నావా?” అని అన్నారు.

41 యేసు, “మీరు గ్రుడ్డి వాళ్ళైనట్లైతే మిమ్ములను దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని దోషులనవలిసిందే!” అని అన్నాడు.

10

1 “ఇది నిజం. గొఱ్ఱెల దొడ్డిలోకి తలుపు ద్వారా వెళ్ళకుండా గోడనెక్కి వెళ్ళేవాడు దొంగ, దోపిడిగాడు.

2 తలుపు ద్వారా ప్రవేశించేవాడు ఆ గొఱ్ఱెలకు కాపరి.

3 ద్వారా పాలకుడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొఱ్ఱెలు అతని స్వరము గుర్తిస్తాయి. ఆ గొఱ్ఱెలు అతనివి. అతడు ఆ గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు.

4 తన గఱ్ఱెల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు కనుక అవి అతణ్ణి అనుసరిస్తాయి.

5 అవి క్రొత్త వాని వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. కనుక పారిపోతాయి.”

6 యేసు ఈ ఉపమానం ఉపయోగించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతున్నాడో అర్థం కాలేదు.

7 అందువల్ల యేసు మళ్ళీ ఈవిధంగా చెప్పటం మొదలు పెట్టాడు:”నిజంగా నేను గొఱ్ఱెలకు ద్వారాన్ని.

8 నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడి గాళ్ళు. కనుక గఱ్ఱెలు వాళ్ళ మాటలు వినలేదు.

9 నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు స్వేచ్ఛతో లోపలికి వస్తూ పోతూ ఉంటారు. ఆ గొఱ్ఱెలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి.

10 దొంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణమైనది.

11 “మంచి కాపరి గొఱ్ఱెల కోసం చావటానికి కూడా సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని.

12 కూలి కోసం పనిచేసే వాడు కాపరికాడు. గొఱ్ఱెలు అతనివి కావు. కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొఱ్ఱెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళ్ళు వచ్చి మంద మీద పడి వాటిని చెదరగొడతాయి.

13 3అతడు కూలి కొరకు పని చేసేవాడు కాబట్టి గొఱ్ఱెల క్షేమం చూడడు.

14 [This verse may not be a part of this translation]

15 [This verse may not be a part of this translation]

16 ఈ మందకు చెందని గొఱ్ఱెలు కొన్ని ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు.

17 నేను నా ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు.

18 నా ప్రాణాన్ని నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి ఆజ్ఞ.”

19 ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు వచ్చాయి.

20 చాలా మంది, “దయ్యం పట్టి అతనికి బాగా పిచ్చెక్కింది. అతని మాటలెందుకు వినటం?” అని అన్నారు.

21 కాని మరికొందరు, “అవి దయ్యం పట్టినవాని మాటలు కావు. దయ్యం గ్రుడ్డి వాళ్ళకు ఎట్లా దృష్టిని కలిగించగలదు?” అని అన్నారు.

22 ఆలయ ప్రతిష్టిత అనే పండుగ యెరూషలేములో జరుగుతూంది.

23 అది చలికాలం. యేసు మందిరా వరణంలో సొలొమోను మంటపం దగ్గర నడుస్తూవున్నాడు. యూదులు ఆయన చుట్టూ గుమికూడారు.

24 వాళ్ళు, “నీవు మమ్మల్ని ఎంతకాలం సందేహంలో ఉంచుతావు? నీవు క్రీస్తువయినట్లైతే దాచకుండా చెప్పు” అని అన్నారు.

25 యేసు, “ఆ విషయం నేను ఇది వరకే చెప్పాను. కాని మీరు నమ్మటం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న అద్భుతాలే నేను ఎవరన్న దానికి రుజువు.

26 కాని మీరు నా మందకు చెందిన వాళ్ళు కాదు. కాబట్టి నన్ను విశ్వసించటం లేదు.

27 నా గొఱ్ఱెలు నా మాట గుర్తిస్తాయి. నాకు వాటిని గురించి తెలుసు. అవి నన్ను అనుసరిస్తాయి.

28 వాటికి నేను అనంత జీవితం యిస్తాను. అవి ఎక్కటికీ మరణించవు. వాటిని నా అండ నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు.

29 వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరి కన్నా గొప్పవాడు. నా తండ్రి అండనుండి వాటిని ఎవ్వరూ తీసుకొని పోలేరు.

30 నేను, నా తండ్రి ఒకటే!” అని అన్నాడు.

31 యూదులు ఆయన్ని కొట్టాలని మళ్ళీ రాళ్ళెత్తారు.

32 కాని యేసు వాళ్ళతో, “నేను నా తండ్రి చేయుమన్న ఎన్నో మంచి పనులు చేసాను. వీటిలో దేన్ని చేసినందుకు మీరు నన్ను కొట్టాలనుకుంటున్నారు?” అని అన్నాడు.

33 యూదులు, “నీవు మంచి పనులు చేసినందుకు రాళ్ళు రువ్వటం లేదు కాని, నీవు దైవదూషణ చేస్తున్నందుకు. మనిషివై దేవుణ్ణని అంటున్నందుకు నిన్ను చంపదలచాము” అని అన్నారు.

34 యేసు సమాధానంగా, “మీ ధర్మశాస్త్రంలో, ‘మీరు దేవుళ్ళని’ దేవుడు అన్నట్లు వ్రాయబడి ఉంది.

35 మీ ధర్మశాస్త్రం అసత్యం చెప్పదు. దేవుడు తన సందేశం విన్న ప్రజల్ని దేవుళ్ళుగా అన్నాడు.

36 తండ్రి నన్ను ఎన్నుకొని తన కార్యం చెయ్యటానికి ఆ ప్రపంచంలోకి పంపాడు. మరి నేను దేవుని కుమారుణ్ణిని అనటం ఆయన్ని దూషించటం ఎట్లా ఔతుంది?

37 నేను, నా తండ్రి కార్యం చేస్తే తప్ప నన్ను విశ్వసించకండి.

38 నేను నా తండ్రి కార్యాన్ని చేసాను. కనుక మరి నన్ను విశ్వసించకపోయినా కనీసం నా కార్యన్ని విశ్వసించండి. అలా చేస్తే నా తండ్రి నాలో ఉన్నాడని, నేను నా తండ్రిలో ఉన్నానని మీకు స్పష్టంగా తెలిసిపోతుంది.”

39 ఆయన్ని బంధించాలని వాళ్ళు మరొక సారి ప్రయత్నించారు. కాని ఆయన అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

40 యేసు మళ్ళీ యొర్దాను నది యొక్క అవతలి ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండిపొయ్యాడు. ఇదివరలో యోహాను బాప్తిస్మము నిచ్చింది ఇక్కడే.

41 అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. “వాళ్ళు యోహాను ఏ మహాత్యం చెయ్యలేదు. కాని ఈయన్ని గురించి అతను చెప్పిన ప్రతీ విషయం నిజం” అని పరస్పరం మాట్లాడుకున్నారు.

42 అక్కడ అనేకులు యేసును విశ్వసించారు.

11

1 బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియు, ఆమె సోదరి మార్త కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళు.

2 ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు.

3 ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమిస్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త యేసుకు పంపారు.

4 యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. దేవుని కుమారునికి మహిమ కులుగచేసి తద్వారా దేవుని మహిమను ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు.

5 యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్ల, లాజరు పట్ల ప్రేమ ఉంది.

6 లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి,

7 ఆ తర్వాత తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి వెళ్దాం” అని అన్నాడు.

8 వాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నించారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారా?” అని అడిగారు.

9 యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుంటుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు.

10 రాత్రి వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రిందపడతాడు” అని అన్నాడు.

11 ఈ విషయాలు చెప్పాక యేసు యింకా ఈ విధంగా అన్నాడు: “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి వెళ్తున్నాను.”

12 ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటాడు” అని అన్నారు.

13 యేసు మాట్లాడింది అతని చావును గురించి. కాని ఆయన శిష్యులు ఆయన సహజమైన నిద్రను గురించి మాట్లాడుతున్నాడనుకున్నారు.

14 అప్పుడు యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు.

15 నేనక్కడ లేనిది మంచిదైంది. మీ కోసమే అలా జరిగింది. మీరు నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం” అని అన్నాడు.

16 దిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యులతో,”యేసుతో కలిసి చనిపోవటానికి మనం కూడా ఆయన వెంట వెళ్దాం” అని అన్నాడు.

17 యేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు తెలిసింది.

18 బేతనియ, యెరూషలేమునకు సుమారు రెండు మైళ్ళ దూరంలో ఉంటుంది.

19 చాలా మంది యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు.

20 యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది.

21 మార్త యేసుతో, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు కాదు.

22 కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అంది.

23 యేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బ్రతికివస్తాడు” అని అన్నాడు.

24 మార్త, “చివరి రోజున అనగా అందరూ బ్రతికి వచ్చే రోజున అతడూ బ్రతికి వస్తాడని నాకు తెలుసు” అని సమాధానం చెప్పింది.

25 యేసు, “బ్రతికించే వాణ్ణి, బ్రతుకును నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు.

26 జీవిస్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు.

27 ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కుమారుడవని నమ్ముతున్నాను” అని అన్నది.

28 ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళ్ళి తన సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, “బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” అని అంది.

29 మరియ యిది విని వెంటనే లేచి ఆయన దగ్గరకు వెళ్ళింది.

30 యేసు గ్రామంలోకి రాలేదు. ఆయనింకా మార్త కులుసుకొన్న చోటే ఉన్నాడు.

31 మరియ యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్తోందిని ఆమె వెంట వెళ్ళారు.

32 మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరిక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు కాదు!” అని అన్నది.

33 ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన హృదయం కరిగి పోయింది.

34 “అతన్నెక్కడ సమాధిచేసారు?” అని యేసు అడిగాడు. “వచ్చి చూడండి ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

35 యేసు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

36 అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా ప్రేమించాడో చూడండి!” అని అన్నారు.

37 కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా?” అని అన్నారు.

38 యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది.

39 “ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు. చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అంది.

40 అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు.

41 వాళ్ళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి చూసి, “తండ్రి నీవు నా మాటలు విన్నందుకు కృతజ్ఞుణ్ణి.

42 నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, వీళ్ళకు అర్థం కావాలాని అక్కడ నిలుచున్న వాళ్ళ మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు.

43 ఈ విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, “లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు.

44 చినిపోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నయి. అతని ముఖం మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది. యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, అతణ్ణి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు.

45 మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు.

46 కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు.

47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు.

48 అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.

49 వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్స రానికి ప్రధాన యాజకుడు.

50 అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.

51 [This verse may not be a part of this translation]

52 [This verse may not be a part of this translation]

53 ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు.

54 అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.

55 యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేంకు వెళ్ళారు.

56 అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా?రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.

57 ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.

12

1 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు.

2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు.

3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.

4 [This verse may not be a part of this translation]

5 [This verse may not be a part of this translation]

6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.

7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది.

8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.

9 ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు.

10 [This verse may not be a part of this translation]

11 [This verse may not be a part of this translation]

12 మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది.

13 వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని, “హోసన్నా! ప్రభూవు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు ధన్యుడు!” కీర్తన 118:25-26 అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.

14 యేసు ఒక గాడిదపిల్లను కనుగొని దానిపై కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

15 “సీయోను కుమారీ, భయపడకు! గాడిద పిల్లపై కూర్చొని నీ రాజు వస్తున్నాడు చూడు!” జెకర్యా 9:9

16 ఇవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు ఆయన్ను గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు.

17 యేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని పిలవటము, అతణ్ణి బ్రతికించటము చూసిన ప్రజలు ఆవార్త ప్రచారం చేసారు.

18 చాలా మంది ఆయన ఈ అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు కోవటానికి వెళ్ళారు.

19 అందువలన పరి సయ్యులు పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచమంతా అతని వెంట ఎట్లా వెళ్తున్నారో చూడండి!” అని మాట్లాడుకున్నారు.

20 పండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన వాళ్ళల్లో గ్రీకులు కూడా ఉన్నారు.

21 వాళ్ళు ఫిలిప్పును కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు, గలిలయలోని బేత్సయిదా అనే గ్రామానికి చెందిన వాడు.

22 ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ వెళ్ళియేసుతో చెప్పారు.

23 యేసు ఇలా అన్నాడు: “మనుష్యుకుమారుడు మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది.

24 ఇది నిజం. గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని ఉత్పత్తి చేస్తుంది.

25 తన ప్రాణాన్ని ప్రేమించే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవితాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు.

26 నా సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు.

27 “ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే కదా!

28 తండ్రీ నీ పేరుకు మహిమ కలిగించుకో.” అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “నేను యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళ్ళీ దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది.

29 అక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. కొందరు ఉరిమిందన్నారు. మరి కొందరు, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు.

30 యేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా కోసం కాదు.

31 ఈ ప్రపంచంపై తీర్పు చెప్పే సమయం వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే సమయం వచ్చింది.

32 కాని దేవుడు నన్ను ఈ భూమ్మీదినుండి పైకెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించుకుంటాను” అని అన్నాడు.

33 ఇది చెప్పి తాను ఏ విధంగా మరణించనున్నాడో సూచించాడు.

34 ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా ‘క్రీస్తు’చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు మనుష్యకుమారుణ్ణి దేవుడుపై కెత్తుతాడని ఎట్లా అనగలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరు?” అని అన్నారు.

35 అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీ కోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతున్నాడో తెలియదు.

36 వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వసించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా లెక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని దూరంగా వెళ్ళి పోయాడు.

37 యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వసం కలుగలేదు.

38 ప్రవక్త యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి యిలా జరిగింది: “ప్రభూ! మా సందేశం ఎవరు విశ్వసించారు? ప్రభువు తన శక్తిని ఎవరికి చూపాడు?” యెషయా 53:1

39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది నెరవేరునట్లు యిలా జరిగింది:

40 “ప్రభువు వాళ్ళ కళ్ళు కప్పి, వాళ్ళ హృదయాలు మూసి వేశాడు. వాళ్ళు చూడ రాదని, వాళ్ళు అర్థం చేసుకోరాదని ఆయన ఉద్దేశ్యం. అలా చేయకపోతే వాళ్ళు నా వైపు మళ్లుతారు. వాళ్ళకు నేను నయం చేయవలసివస్తుంది.” యెషయా 6:10

41 యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు.

42 ఈ పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు.

43 ఎందుకంటే, వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ యిష్టం.

44 యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు.

45 అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని చూస్తున్నట్లే!

46 నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చాను! ఎందుకంటే నన్ను విశ్వసించేవాడు చీకటిలో ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే.

47 “ఎవడైనను నా మాటలు విని వాటిని అనుసరించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి తీర్పు తీర్చటానికి రాలేదు, కాని నేను రక్షించటానికి వచ్చాను.

48 నన్ను, నా మాటల్ని ఇష్టపడక వ్యతిరేకించేవానిపై ఒక న్యాయాధిపతి ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున వానికి తీర్పుతీరుస్తుంది.

49 నేను నా యిష్ట ప్రకారం మాట్లాడలేదు, గాని నా తండ్రి ఏమి చెప్పుమని నాకు ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను.

50 ఆయన ఆజ్ఞ నిత్య జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను చెప్పే మాటలన్నీ తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే” అని అన్నాడు.

13

1 పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళనెంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్ళకు చూపించాడు.

2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయుటకు కూర్చొని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్యరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చెయ్యమని ప్రేరేపించాడు.

3 తండ్రి తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్లు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము ఆయనకు తెలుసు.

4 అందువల్ల ఆయన భోజన పంక్తి నుండి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి, ఒక కండువాను నడుముకు చుట్టుకున్నాడు.

5 ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు.

6 యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారా?” అని అన్నాడు.

7 యేసు, “నేను చేస్తున్నది నీకు యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని సమాధానం చెప్పాడు.

8 పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కుడగకూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు. యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు సంబంధం ఉండదు!”అని సమాధానం చెప్పాడు.

9 సీమోను పేతురు,”ప్రభూ! అలాగైతే నా పాదాలేకాదు. నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” అని అన్నాడు.

10 యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసినవాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు.

11 తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయనన్నాడు.

12 ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, పై వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు ముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, “నేను చేసింది మీకు అర్థమైందా?

13 మీరు నన్ను ‘బోధకుడా!’అని ‘ప్రభూ!’అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే!

14 మీ బోధకుడను, ప్రభువును అయిన నేను మీ పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి.

15 నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసు కొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం.

16 ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపినవాని కన్నా గొప్ప కాదు.

17 ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు.

18 “నేనిది మీ అందర్ని గురించి చెప్పటం లేదు. నేను ఎన్నుకొన్న వాళ్ళు నాకు తెలుసు. కాని ఈ విషయం జరిగి తీరాలి: నాతో రొట్టె పంచుకొన్న వాడు నాకు ద్రోహం చేస్తాడు.” ఇవి జరుగక ముందే మీకు అన్నీ చెబుతున్నాను.

19 అవి జరిగినప్పుడు నేనే ఆయన్ని అని మీరు విశ్వసించాలని నా ఉద్దేశ్యం.

20 ఇది నిజం. నేను పంపిన వాణ్ణి అంగీకరించిన వాడు నన్ను అంగీకరించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించిన వాడు నన్ను పంపిన వాణ్ణి అంగీకరించినట్లు పరిగణింపబడతాడు” అని అన్నాడు.

21 యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదిన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

22 ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటున్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

23 యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు ప్రక్కనే కూర్చొని ఉన్నాడు.

24 సీమోను పేతురు ఆ శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” అని సంజ్ఞ చేసాడు.

25 అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, “ప్రభూ! ఎవరు!” అని అడిగాడు.

26 యేసు, “నేనీ రొట్టె ముక్కను పాత్రలో ముంచి ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. తదుపరి రొట్టెముక్కను పాత్రలో ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు.

27 రొట్టె తీసుకొన్న వెంటనే సైతాను వానిలోకి ప్రవేశించాడు. యేసు వానితో, “నీవు చేయబోయేదేదో త్వరగా చెయ్యి” అని అన్నాడు.

28 కాని, భోజనానికి కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు కంటున్నాడో అర్థం కాలేదు.

29 డబ్బు యూదా ఆధీనంలో ఉండేది. కాబట్టి పండుగకు కావలసినవి కొని తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరనుకున్నారు.

30 యూదా రొట్టె తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం. మహిమ

31 వాడు వెళ్ళిపోయాక యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో దేవుని మహిమ వ్యక్తమయింది.

32 దేవుడు అయన ద్వారా మహిమ పొందాక తన కుమారుణ్ణి తనలో ఐక్యం చేసికొని మహిమపరుస్తాడు. ఆలస్యం చేయడు.”

33 33యేసు, “బిడ్డలారా! నేను మీతో మరి కొంత కాలం మాత్రమే ఉంటాను. మీరు నా కోసం చూస్తారు. యూదులకు చెప్పిన విషయాన్నే మీకూ చెబుతున్నాను. నేను వెళ్ళే చోటికి మీరు యిప్పుడురారు.

34 “నేను మీకొక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి వుండండి

35 మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకున్నప్పుడే మీరు నాకు శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు.

36 సీమోను పేతురు, “ప్రభూ! మీరెక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాడు. యేసు, “నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నీవు యిప్పుడు నా వెంట రాలేవు. కాని తర్వాత నన్ను అలుసరించగలుగుతావు” అని అన్నాడు.

37 పేతురు, “ప్రభూ! యిప్పుడే ఎందుకు నేను నీ వెంట రాలేను? నేను మీకోసం నా ప్రాణాల్ని అర్పించటానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నాడు.

38 యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణంయిస్తావా? ఇది నిజం. కోడి కూసేలోగా నేనెవరినో తెలియదని మూడుసార్లు అంటావు!” అని సమాధనం చెప్పాడు. ‘మార్గము, సత్యము, జీవము - ఈ మూడు యేసే’

14

1 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి.

2 నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను.

3 నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం.

4 నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.

5 తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.

6 యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే!నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు.

7 నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.

8 ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు.

9 యేసు ఈ విధంగా సమాధనం చెప్పడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు?

10 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు.

11 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.

12 ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు.

13 కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను.

14 నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.

15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు.

16 [This verse may not be a part of this translation]

17 [This verse may not be a part of this translation]

18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను.

19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్ననో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు.

20 ఆరోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు.

21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”

22 అప్పుడు యూదా (యూదా ఇస్కరి యోతు కాదు),”కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.

23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు:”నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము.

24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.

25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను.

26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.

27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి.

28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.

29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.

30 ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు.

31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను. రండి, యిక్కడి నుండి వెళ్దాం!

15

1 “నా తండ్రి తోట యజమాని. నేను నిజమైన ద్రాక్షా తీగను.

2 నాలో ఫలం కాయని కొమ్మలన్నిటిని నా తండ్రి పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు చెయ్యటానికి వాటకొనల్ని కత్తిరిస్తాడు.

3 నేను మీకు బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు మీరిదివరకే కత్తిరింపబడ్డారు.

4 నాలో ఐక్యమై ఉండండి. నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా ఫలమివ్వ లేదు. అది తీగకు అంటుకొని ఉండాలి. అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలమివ్వగలరు.

5 “నేను తీగను. మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి నాలో ఉండి నేను అతనిలో అతడెక్కువ ఫల మివ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమీ చెయ్యలేరు.

6 నాలో ఉండని వాళ్ళు కొమ్మవలే పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని ప్రోగుచేసి ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కాలిపోతాయి.

7 “మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు మీకిష్టమైన దేదైనా అడగండి. అది మీకిస్తాను. కోరింది జరుగుతుంది.

8 మీరు ఎక్కువ ఫలం ఫలించి నా శిష్యులుగా ఉంటే నా తండ్రి మహిమ వ్యక్తం చేసిన వాళ్ళౌతారు.

9 నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి.

10 నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచి యున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు.

11 నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను.

12 నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి.

13 స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు.

14 నేను ఆజ్ఞాపించి నట్లు చేస్తే మీరు నా స్నేహితులు.

15 నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్న దేమితో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.

16 మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు.

17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ.

18 “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి.

19 మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది.

20 ‘యజమాని కంటే సేవకుడు గొప్పకాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు.

21 నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు.

22 నేను రాకుండా, వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుండి తప్పించుకోలేరు.

23 నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింబడతాడు.

24 నేను వాళ్ళ కేసం ఎవరూ చేయని ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినట్లైతే వాళ్ళకు ఈ పాపం అంటి ఉండేది కాదు. కాని యిప్పుడు వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు.

25 కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు, అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది.

26 “నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు.

27 మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్పాలి.

16

1 “మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను.

2 వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది.

3 వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు.

4 ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు.

5 “కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు.

6 నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి.

7 కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను.

8 ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు.

9 ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు.

10 మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు.

11 కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు.

12 “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు.

13 కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు.

14 నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు.

15 తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.

16 “కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.”

17 ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నానని అంటున్నాడే! అంటే ఏమి టి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు.

18 “కొంత కాలం తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు.

19 ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, ‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా?

20 మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది. నిజం.

21 ‘ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది.’

22 అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు.

23 ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు.

24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.

25 “నేను యింత వరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను సృష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి సృష్టంగా చెబుతాను.

26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు.

27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది.

28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”

29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు.

30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.

31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట!

32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.

33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.

17

1 ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రి! సమయం వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు.

2 ప్రజలందరిపై కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని నీ ఉద్దేశ్యం.

3 నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నీవు పంపిన ‘యేసుక్రీస్తు’ను తెలుసుకోవటమే అనంత జీవితం.

4 పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు కీర్తి కలిగించాను.

5 తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయుము.

6 “ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు.

7 నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది.

8 ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది.

9 నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను.

10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది.

11 నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు.

12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు.

13 “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను.

14 నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది.

15 వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను.

16 నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు.

17 సత్యంలో వారిని పవిత్రపర్చు, నీ వాక్యమే సత్యం.

18 నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోని పంపాను.

19 వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం.

20 “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను.

21 తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము.

22 మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను.

23 నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచాని కి తెలుస్తుంది.

24 “తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష.

25 నీతి స్వరూపుడవగు తండ్రీ! ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు.

26 నీవెవరవో వాళ్ళకు తెలియచేసాను. తెలియచేస్తూ ఉంటాను. నాయందు నీకున్న ప్రేమ వాళ్ళయందు కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని నా ఉద్దేశ్యం.”

18

1 యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యులతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా కలిసి కెద్రోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు.

2 యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు ఈ స్థలం తెలుసు.

3 అందువల్ల యూదా ఒక సైనిక దళాన్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు.

4 యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెరు కావాలి?” అని అడిగాడు.

5 “నజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. “ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. ద్రోహం చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు.

6 యేసు, ‘నేనే ఆయన్ని’ అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కు వేసి క్రింద పడిపోయారు.

7 యేసు, “మీ కెవరు కావాలి?” అని మళ్ళీ అడిగాడు. వాళ్ళు, “నజరేతుకు చెందిన యేసు” అని సమాధానం చెప్పారు.

8 యేసు, “ఆయన్ని నేనే అని చెప్పానుగా? మీరు నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి” అని అన్నాడు.

9 ‘నీవు నాకప్పగించిన వాళ్ళలో ఒక్కణ్ణి కూడా నేను పోగొట్టుకో లేదు’ అని ఆయన అన్న మాటలు నిజం కావటానికి యిలా జరిగింది.

10 సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని పేరు ‘మల్కు’.

11 యేసు పేతురుతో,”నీ కత్తి ఒరలో పెట్టు! నా తండ్రి యిచ్చిన పాత్ర నేను త్రాగకుండా ఉంటానా?” అని అన్నాడు.

12 ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు తీసుకు వెళ్ళారు. అన్న’కయప’కు కూమార్తె నిచ్చిన మామ.

13 ‘కయప’ ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు.

14 ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన వాడు ఇతడే!

15 సీమోను పేతురు, అతనితో పాటు యింకొక శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవరణంలోకి వెళ్ళాడు.

16 కాని పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకు వెళ్ళాడు.

17 “నీవు అతని శిష్యుల గుంపుకు చెందిన వాడవు కావా?” అని ద్వారం దగ్గరున్న కాపలాది పేతుర్ని అడిగింది. “లేదు!” అని అతడు జవాబు చెప్పాడు.

18 చలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు వెళ్ళి వారితో సహా చలికాచుకొనుచున్నాడు.

19 ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు.

20 యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు.

21 అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు.

22 యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతు “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు.

23 యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.

24 ఆ తర్వాత అన్న ఆయనకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.

25 సీమోను పేతురు నిలుచొని యింకా చలికాగుతూ ఉన్నాడు. వాళ్ళు “నీవు అతని శిష్యుల్లో ఒకడివి కదూ?” అని అడిగారు. “కాదు” అని పేతురు అన్నాడు.

26 ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికివేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావా?” అని అన్నాడు.

27 పేతురు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి కూసింది.

28 ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు.

29 పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు.

30 “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు.

31 పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు.

32 యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది.

33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.

34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.

35 పిలాతు, “నేను యూదుణ్ణని అను కుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.

36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.

37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు. యేసు జవాబు చెప్పుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”

38 “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు!

39 కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు.

40 వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.

19

1 ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు.

2 భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు.

3 ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా!జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు.

4 పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు.

5 యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో, “ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు.

6 ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకువెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు. కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.

7 కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. తాను, ‘దేవుని కుమారుడను’ అని అన్నాడు కనుక, మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన పొందాలి!” అని అన్నారు.

8 పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు.

9 అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ స్వగ్రామం ఏది?” అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు.

10 పిలాతు”నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?”అని అన్నాడు.

11 యేసు సమాధానంగా, “పైన ఉన్నవాడు యిస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు” అని అన్నాడు.

12 ఆ క్షణ నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు.

13 ఇది విని పిలాతు యేసును వెలుపలిరి పిలుచు కొని వచ్చాడు.’రాళ్ళు పరచిన స్థలంలో’ ఉన్న న్యాయ పీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో’గబ్బతా’ అని అంటారు.

14 అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు.

15 కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు. పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు. ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు.

16 తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.

17 భటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు పుర్రె స్థలాన్ని చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని ‘గొల్గొతా’ అంటారు.

18 ఇక్కడ ఆయన్ని సిలువకు వేసారు. ఆయనకు ఇరువైపు మరొక యిద్దర్ని సిలువకు వేసారు.

19 పిలాతు, ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ఆ ప్రకటనలో, ‘నజరేతు నివాసి యేసు యూదుల రాజు’ అని వ్రాయబడి ఉంది.

20 యేసును సిలువకు వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. కనుక చాలా మంది యూదులు ఈ ప్రకటన చదివారు.

21 యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “‘యూదుల రాజు’ అని వ్రాసారెందుకు?’ఇతడు, తాను యూదుల రజని అన్నాడు’ అని వ్రాయండి” అని అన్నారు.

22 పిలాతు, “ వ్రాసిందేదో వ్రాసాను” అని సమాధానం చెప్పాడు.

23 భటులు యేసును సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రింది దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది.

24 ఆ భటులు, “దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేసారు. “వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు! నా దుస్తుల కోసం చీట్లు వేసారు!” కీర్తన 22:18 అని లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి యిలా జరిగింది.

25 యేసు సిలువదగ్గర ఆయన తల్లి, తల్లి యెక్క సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, నిలుచొని ఉన్నారు.

26 యేసు తన తల్లి, తన ప్రియ శిష్యుడు అక్కడ నిలుచొని ఉండటం చూసాడు. తన తల్లితో, “అమ్మా! ఇదిగో నీ కుమారుడు” అని అన్నాడు.

27 ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి!” అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.

28 ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది.

29 పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు.

30 ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు.

31 అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు.

32 భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు.

33 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు.

34 దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు కారాయి.

35 మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు.

36 [This verse may not be a part of this translation]

37 [This verse may not be a part of this translation]

38 ఆ తర్వతా ‘అరిమతయియ’ గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు.

39 అతని వెంట ‘నీకొదేము’ కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు.

40 వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి, దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల సాంప్రదాయం.

41 యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధిఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు.

42 అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది. కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు.

20

1 ఆ రోజు ఆదివారం. ‘మగ్దలేనే’కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది.

2 అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, ‘యేసు ప్రేమించిన యింకొక శిష్యుని’ దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, ‘ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు’ అని అన్నది.

3 పేతురు, ‘ఆ యింకొక శిష్యుడు’ సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు.

4 వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ‘ఆ యింకొక శిష్యుడు’ పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు.

5 అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు.

6 అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు.

7 వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది.

8 సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు.

9 ‘యేసు బ్రతికి వస్తాడని’ లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.

10 ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు.

11 కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది.

12 తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు.

13 వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు. ఆమె”వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది.

14 అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే ‘యేసు’ అని ఆమె గుర్తించలేదు.

15 ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు. అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అంది.

16 యేసు ఆమెను ‘మరియా’ అని పిలిచాడు. ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో ‘రబ్బూనీ!’ అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.

17 యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువండి వాని దగ్గరకు వెళ్తున్నాని చెప్పు” అని అన్నాడు.

18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.

19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగు గాక!” అని అన్నాడు.

20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.

21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు.

22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు.

23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింప బడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమింతకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.

24 యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి ‘దిదుమ’ అని పిలిచే వాళ్ళు.

25 మిగత శిష్యులు తోమాతో ‘మేము ప్రభువును చుసాము’ అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.

26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు.

27 యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.

28 తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.

29 అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.

30 నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు.

31 యేసు ‘క్రీస్తు’ అని, ‘దేవుని కుమారుడని’ ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.

21

1 ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు మళ్ళీ కనిపించాడు. అది ఈ విధంగా జరిగింది:

2 సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, గలిలయలోని కానా పట్టణానికి చెందిన ‘నతనయేలు’, జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, అంతా కలిసి ఒక చోట ఉన్నారు.

3 సీమోను పేతురు, “నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు. మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము”అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు.

4 తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే ‘యేసు’ అని గ్రహించలేదు.

5 యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. ‘లేదు’ అని వాళ్ళన్నారు.

6 ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళ్ళు ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు.

7 యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, “అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు.

8 మిగతా శష్యులు ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను నడుపుకుంటూ అతణ్ణి అనుసరిస్తూ ఒడ్డును చేరు కున్నారు.

9 వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గల మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొట్టెలు కూడా అక్కడ ఉన్నాయి.

10 యేసు వాళ్ళతో “మీరు పట్టిన కొన్ని చేపలు తీసుకురండీ” అని అన్నాడు.

11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు!

12 యేసు వాళ్ళతో, “రండి! వచ్చి భోజనం చెయ్యండి” అని అన్నాడు. ‘మీరెవరు’ అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ ధైర్యం చాలలేదు.

13 యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొట్టెను తీసుకొని వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా యచ్చాడు.

14 ఆయన బ్రతికింపబడ్డాక తన శిష్యులకు కనిపించడం యిది మూడవసారి.

15 వాళ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. “ఔను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!”అని అన్నాడు

16 యేసు, “యోహాను కుమారుడవైన సీమోనూ! నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా?” అని మళ్ళీ అడిగాడు. అతడు, “ఔను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని మీకు తెలియదా!” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు.

17 మూడవసారి అతనితో, “యోహాను కుమారుడవైన సీమోనూ! నన్ను ప్రేమిస్తున్నావా?” అని అన్నాడు. మూడవసారి, ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని అడిగినందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, “ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కూడా తెలుసు” అని అన్నాడు. యేసు, “నా గొఱ్ఱెల్ని మేపు!

18 ఇది నిజం. వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి తీసుకు వెళ్తారు” అని అన్నాడు.

19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవునికి కీర్తి తెస్తాడో సూచించటానికి యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో “నన్ను అనుసరించు!” అని అన్నాడు

20 పేతురు వెనక్కు తిరిగి చూసాడు. యేసు ప్రేమించిన శిష్యుడు వెంట రావటం గమనించాడు. రాత్రి భోజనాలప్పుడు యేసుకు ఆనుకొని, “ప్రభూ! మీకు ఎవరు ద్రోహం చేస్తారు!” అని ప్రశ్నించిన వాడు యితడే.

21 పేతురు అతణ్ణి చూసి యేసుతో “ప్రభూ! అతని సంగతి ఏమిటి?” అని అడిగాడు.

22 యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలని నాకిష్టమైతే! ఆ సంగతి నీ కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.

23 యేసు ఈ విధంగా అనటంవల్ల ఈ శిష్యుడు చనిపోడనే వదంతి సోదరుల్లో వ్యాపించింది. కాని యేసు అతడు చనిపోడని అనలేదు. అతడు, “నేను తిరిగి వచ్చేవరకు అతడు బ్రతికి ఉండాలని నా ఉద్దేశ్యమైతే ఆ సంగతి నీకెందుకు?” అని అన్నాడు, అంతే.

24 వీటిని గురించి సాక్ష్యం చెప్పిన వాడు, వ్రాసిన వాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు తెలుసు.

25 యేసు యింకా ఎన్నో కార్యాలు చేసాడు. వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ గ్రంథాలకు ఈ ప్రపంచంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేననుకుంటాను. ఇీ ౌ ఆ-ష