1 బెయేరి కుమారుడైన హోషేయకు వచ్చిన యెహోవా సందేశం ఇది. ఉజ్జీయా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనువారు యూదా దేశపు రాజులుగా ఉన్న కాలంలో ఈ సందేశం వచ్చింది. యెహోవాయాషు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు రాజుగా ఉన్న కాలం అది.
2 ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం.”వెళ్లి ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కనుము. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు - వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.
3 కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది.
4 యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను.
5 ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు.
6 మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో - రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యనికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను.
7 కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలను గాని, సైనికులను గాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తి చేతనే వారిని రక్షిస్తాను.”
8 గోమెరు లో - రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది.
9 అప్పుడు, “అతనికి లో - అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు.
10 “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది.
11 “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.”
1 “అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు”‘ అని చెబుతారు.
2 “మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయుమని ఆమెతో చెప్పండి.
3 ఆమె తన వ్యభిచారం మాను కోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను.
4 ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక.
5 వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది.
6 “అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసు కోలేక పోతుంది.
7 ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని ఆమె అంటుంది.
8 ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడును నేనే అని ఆమెకు (ఇశ్రాయేలు) తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు.
9 కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్దంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్దంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసికొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసికొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను.
10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తి నుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు.
11 నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులు, ఆమె అమావాస్య విందులు, ఆమె విశ్రాంతి దినాలు, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను.
12 ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి.
13 ఆమె బయలు దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి నన్ను మరిచిపోయింది.” యెహోవా ఈ విషయం చెప్పాడు.
14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడుతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి ఆమెతో నేను మృదువుగా మాట్లాడుతాను.
15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు లోయను (శ్రమగల) ఒక నిరీక్షణ ద్వారంగా ఇస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది.”
16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు.
17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.
18 “ఆ సమయంలో పోలంలోని పశువులకు, ఆకాశంలోని పక్షులకు, నేలమీద ప్రాకే ప్రాణులకు ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గు నట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను.
19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను.
20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలిసికొంటావు.
21 ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను.” యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “నేను ఆకాశాలతో మాట్లాడుతాను. అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి.
22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది. అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి.
23 భూమిమీద ఆమెను నేను నాటుతాను. లో - రూహామాకు నేను దయచూపిస్తాను. లో - అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను. ‘నీవు మా దేవుడవు”‘ అని వారు నాతో చెపుతారు.
1 అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల నాతో చెప్పాడు.
2 కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను.
3 కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను.
4 అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని లేక గృహ దవతలు గాని ఉండవు.
5 దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవానూ, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.
1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు .
2 ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు.
3 అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి.
4 ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్ద.
5 మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోబాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.
6 “నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను.
7 వారు గర్విష్టులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారు ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.
8 “యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువాగా కోరుకొన్నారు.
9 కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను.
10 “వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయ్యారయ్యారు.
11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం కొత్త ద్రాక్షారసం, మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి.
12 సలహా కోసం నా ప్రజలు కట్టెముక్కలను అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు.
13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సింధూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తా రు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లు కూడాపాపాలు చేస్తారు.
14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.
15 “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ యూదాను అపరాధిగా ఉండ నియ్యకుము. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు...!’ అని అనవద్దు.
16 ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది.
17 ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి.
18 “వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేయుచు ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు.
19 కాని ఆమెను, ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురు.”
1 “యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ ప్రజలారా తీర్పు మీకోసమే ఉంది. నా మాట వినండి. “మిస్పాలో మీరు ఒక ఉచ్చువలే ఉన్నారు. తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలె మీరు ఉన్నారు.
2 మీరు ఎన్నెన్నో చెడ్డ పనులు చేశారు. కనుక మిమ్మల్నందర్నీ నేను శిక్షిస్తాను!
3 ఎఫ్రాయిము నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు ఎఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్ధమయింది.
4 ఇశ్రాయేలు ప్రజలు చెడ్డపనులు అనేకం చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా ఆ చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలనువెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలుస్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు.
5 ఇశ్రాయేలీయుల గర్వమే వారికి విరోధంగా ఒక సాక్ష్యం అవుతుంది. కనుక ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వారి పాపంలో కాలు జారిపడతారు. కాని యూదా కూడ వారితోపాటేకాలు తప్పిపడిపోతుంది.
6 “ప్రజా నాయకులు యెహోవా కోసం వెదకుటకు వెళ్లారు. వారు, వారి ‘గొర్రెలను’ మరియు ‘ఆవులను’ వారితో కూడ తీసుకొని వెళ్లారు. కాని యెహోవాను వారు కనుగొనలేదు. ఎందుచేతనంటే ఆయన వారిని విడచిపెట్టాడు.
7 వారు యెహోవాకు విశ్వాస పాత్రులుగా ఉండలేదు. వారి పిల్లలు పరాయి వాని పిల్లలుగా పుట్టిరి. కాని ఇప్పుడు వారు, వారి పొలాలతో బాటు అమావాస్యనాటికి నాశన మవుతారు.”
8 “గిబియాలో కొమ్ము ఊదండి. రామాలో బాకా ఊదండి. బేతావెను వద్ద హెచ్చరిక చేయండి. బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు.
9 శిక్షా సమయంలో ఎఫ్రాయిము పాడై పోతాడు. ఆ విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు) ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.
10 యూదా నాయుకులు మరొక మనిషి ఆస్తిని దొంగిలించుటకు ప్రయత్నించే దొంగల్లాగ తయారయ్యారు. కనుక నేను (దేవుడు) వారి మీద నా కోపాన్ని నీళ్లలాగ పోస్తాను.
11 ఎఫ్రాయిము శిక్షించబడతాడు. అతడు ద్రాక్షా పళ్లలాగ చితుకగొట్టబడి అణగదొక్కబడతాడు. ఎందుచేతనంటే, అతడు దుష్టత్వాన్ని చెయ్యాలని కోరుకున్నాడు.
12 చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును నేను నాశనం చేస్తాను. చెక్కముక్కను చెదలపురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడుచేస్తాను.
13 ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు. కనుక వారు సహాయంకోసం ఆష్షూరు వెళ్లారు. తమ సమస్యలను గూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు. కాని ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.
14 ఎఫ్రాయిముకు నేను ఒక సింహంవలె ఉంటాను. యూదా రాజ్యానికి నేను ఒక కొదమ సింహంలాగ ఉంటాను. గనుక నేను, అవును యెహోవానైన నేనే వారిని ముక్కలుగా చీల్చివేస్తాను. నేను వారిని తీసుకొని వెళ్ళిపోతాను. నానుండి వారిని ఎవ్వరూ రక్షించలేరు.
15 ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు నాకోసం వారు వెదకుతూ వచ్చేంత వరకు నేను నా స్థలానికి వెళ్లిపోతాను. అవును తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”
1 “రండి, మనం తరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం. ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు. ఆయన మనలను గయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
2 తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
3 మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము. ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం. సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే ఆయన వస్తున్నాడని మనకు తెలుసు. యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు. నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”
4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి? యూదా, నిన్ను నేను ఏమి చేయాలి? నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది. వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.
5 నేను ప్రవక్తలను ఉపయోగించి ప్రజల కోసం న్యాయచట్టం చేశాను. నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు. కానీ ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
6 ఎందుచేతనంటే నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే. అంతేగాని బలిఅర్పణకాదు. ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
7 అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
8 గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం. ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
9 బందిపోటు దొంగలు దాగుకొని, ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు. అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు. వారు దుర్మార్గపు పనులు చేశారు.
10 ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను. ఎఫ్రాయిము దేవునకి అపనమ్మకస్తుడు. ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
11 యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది. బానిసత్వం నుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”
1 “ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను! ఎఫ్రాయిము యొక్క పాపం గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు. ఆ పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
2 ఆ ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచుకొంటానని వారు నమ్మరు. వారు చేసిన చెడ్డపనులు చుట్టూరా ఉన్నాయి. వారి పాపాలను నేను తేటగా చూడగలను.
3 ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి. వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి.
4 రొట్టెలు చేయువాడు రొట్టె చేయుటకు పిండి పిసుకుతాడు. అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు. రొట్టె పొంగుతున్నప్పుడు అతడు మంట ఎక్కువ చేయడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు. ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
5 మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు. ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు. కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.
6 ప్రజలు రహస్య పథకాలు వేస్తారు. వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకముతో మండుతాయి. వారి కోపం రాత్రి అంతా మండుతుంది. మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది.
7 వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు. వారు వారి పాలకులను నాశనం చేశారు. వారి రాజులంతా పతనం అయ్యారు. వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”
8 “ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది. ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది.
9 పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు. కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు. ఎఫ్రాయిము తలమీద తెల్లవెంట్రుకలు ఉన్నాయి, కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
10 ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది. ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి. అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు. ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు.
11 కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజీప్టును పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.
12 సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు. కానీ నేను వారిని వలలో పడవేస్తాను. వారి మీద నేను నా వల విసిరి ఆకాశ పక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను. వారి ఒడంబడిక విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
13 అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు. నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు. ఆ ప్రజలను నేను రక్షించాను. కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
14 అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు. వారు ఇతరుల భూములలో ధాన్యం, కొత్త ద్రాక్షారసం కోసం తరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు. కానీ వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.
15 నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారు చేతులను బలపర్చాను. కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు.
16 దేవుళ్లుకాని వారివైపు (బయలు దేవత) వారు తిరిగారు. వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు. కానీ వారు కత్తులతో చంపబడతారు. అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు. విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.
1 “బూర నీ నోట పెట్టుకొని, హెచ్చరిక చేయుము. యెహోవా ఆలయం మీద పక్షి రాజువలె ఉండు. ఇశ్రాయేలీయులు నా ఒడంబడికను ఉల్లఘించారు. వారు నా న్యాయ చట్టానికి విధేయులు కాలేదు.”
2 ‘నా దేవా, ఇశ్రాయేలులో ఉన్న మాకు నీవు తెలుసు’ అని వారు అరచి నాకు చెపుతారు.
3 కానీ ఇశ్రాయేలు మంచివాటిని తిరస్కరించింది. అందుచేత శత్రువు అతన్ని తరుముతున్నాడు.
4 ఇశ్రాయేలీయులు తమ రాజులను ఏర్పరచుకొన్నారు. కానీ సలహా కోసం వారు నా దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలీయులు నాయకులను ఏర్పరచుకున్నారు. కానీ నేను ఎరిగిన మనుష్యులను వారు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీయులు తమ వెండి, బంగారం ఉపయోగించి వారికోసం విగ్రహాలు చేసుకొన్నారు. కనుక వారు నాశనం చేయబడతారు.
5 (షోమ్రోనూ) నీ దూడను (విగ్రహాన్ని) యెహోవా నిరాకరించాడు. దేవుడు అంటున్నాడు, ‘ఇశ్రాయేలీయుల మీద నేను చాలా కోపంగా ఉన్నాను’ ఇశ్రాయేలు ప్రజలు వారి పాపం విషయంలో శిక్షించబడతారు.
6 ఆ విగ్రహాలను ఒక పనివాడు చేశాడు. అవి దేవుళ్లు కావు. సమరయ దూడ ముక్కలుగా విరుగగొట్ట బడుతుంది.
7 ఇశ్రాయేలీయులు ఒక మూర్ఖమైన పని చేశారు అది గాలిని నాటుటకు ప్రయత్నించినట్టు ఉంది. కానీ వారికి కష్టాలు మాత్రమే కలుగుతాయి. వారు సుడిగాలిని పంటగా కోస్తారు. పొలంలో ధాన్యం పండుతుంది. కానీ అది ఆహారాన్ని ఇవ్వదు. ఒకవేళ దానిలో ఏమైనా పండినా పరాయివాళ్లు దాన్ని తినేస్తారు.
8 ఇశ్రాయేలు మింగివేయబడింది (నాశనం చేయబడింది). ఇశ్రాయేలు ఎవరికీ పనికిరాని ఒక పనిముట్టులాగ తయారయ్యింది. ఇశ్రాయేలు విసిరి వేయబడింది వారు యితర రాజ్యాలలో చెదరగొట్టబడ్డారు.
9 ఎఫ్రాయిము తన విటుల దగ్గరకు వెళ్లాడు. అడవి గాడిదలా అతడు తిరుగుతూ అష్షూరు వెళ్లాడు.
10 ఆయా రాజ్యాలలో తన విటుల దగ్గరకు ఇశ్రాయేలు వెళ్లింది. కానీ ఇప్పుడు నేను ఇశ్రాయేలీయులను సమకూరుస్తాను. ఆ మహాశక్తిగల రాజు వారి మీద భారాన్ని వేస్తాడు. మరియు వాళ్లు ఆ భారంవల్ల కొద్దిగా బాధపడాలి.
11 ఎఫ్రాయిము ఎన్నెన్నో బలిపీఠాలు కట్టింది. అవి అతను పాపాలు చేయడానికి అధారమయ్యాయి
12 ఎఫ్రాయిము కోసం నేను నా న్యాయచట్టాలు సంపూర్ణముగా వ్రాసినా అవి ఎవరో పరాయి వాడికోసం అన్నట్టు అతడు వాటిని గూర్చి అనుకొంటాడు.
13 బలులు అంటే ఇశ్రాయేలీయులకు ఇష్టం. వారు మాంసం అర్పించి, దాన్ని తినేస్తారు. యెహోవా వారి బలులు స్వీకరించడు. ఆయనకు వారి పాపాలు జ్ఞాపకమే. ఆయన వారిని శిక్షిస్తాడు. వారు ఈజిప్టుకు బందీలుగా కొనిపోబడుతారు.
14 ఇశ్రాయేలీయులు నివాసాలు నిర్మించారు. కానీ వారు తమను చేసిన సృష్టికర్తను మరచిపోయారు. ఇప్పుడు యూదా కోటలు కట్టింది. కానీ యూదా పట్టణాల మీదకి నేను అగ్నిని పంపిస్తాను. ఆ అగ్ని దాని రాజభవనాలను నాశనం చేస్తుంది.
1 ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు.
2 కానీ ఆ కళ్లములనుండి వచ్చే ధాన్యం, ఇశ్రాయేలీయులకు సరిపడినంత ఆహారం ఇవ్వదు. ఇశ్రాయేలుకు సరిపడినంత ద్రాక్షారసం ఉండదు.
3 ఇశ్రాయేలీయులు యెహోవా దేశంలో నివసించరు. ఎఫ్రాయిము తిరిగి ఈజిప్టుకు వెళ్తుంది. వారు తినకూడని ఆహారం వారు అష్షూరులో తింటారు.
4 ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారము వద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు - అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి.
5 వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు.
6 ఇశ్రాయేలీయులకు కలిగినదంతా శత్రువు తీసుకొన్నందువల్ల ఇశ్రాయేలు వదిలిపెట్టబడింది. కాని ఈజిప్టు ఆ ప్రజలను తీసుకొంటుంది. వారిని మెంఫెసు పట్టణం పాతిపెడ్తుంది. వారి వెండి ఐశ్వర్యాల మీద పిచ్చిమొక్కలు మొలుస్తాయి. ఇశ్రాయేలీయులు నివసించినచోట ముళ్లకంపలు పెరుగుతాయి.
7 “ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో; శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు ప్రతిఫలం నీవు చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చేపుతున్నాడు.
8 దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కానీ మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించు కొంటున్నారు.
9 [This verse may not be a part of this translation]
10 నా మట్టు కైతే ఇశ్రాయేలు ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు - వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు.
11 ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టుకలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు.
12 కానీ ఒకవేళ ఇశ్రాయేలీయులు పిల్లలను పెంచినా, అది సహాయ పడదు. పిల్లలను వారి దగ్గర్నుండి నేను తీసివేస్తాను. నేను వారిని విడిచిపెట్టేస్తాను. వారికి కష్టాలు తప్ప మరేవి ఉండవు.
13 ఎఫ్రాయిము తన పిల్లలను బోను లోనికి నడిపిస్తూ ఉండటం నేను చూడగలను. ఎఫ్రాయిము తన పిల్లలను హంతకుని దగ్గరకు తీసికొని వస్తాడు.
14 యెహోవా, నీ ఇష్టం వచ్చిన దాన్ని వారికి చేయుము. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇమ్ము, పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇమ్ము.
15 వారి దుర్మార్గం అంతా గిల్గాలులో ఉంది. అక్కడే నేను వారిని అసహ్యించుకోవటం మొదలు బెట్టాను. వారు చేసే దుర్మార్గపు పనుల మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల గొట్టేస్తాను. ఇంకెంతమాత్రం నేను వారిని ప్రేమించను. వారి నాయకులు తిరుగుబాటు దారులు. వారు నాకు విరోధంగా తిరిగారు.
16 ఎఫ్రాయిము శిక్షించబడుతుంది. వారి వేరుచస్తుంది. వారికి ఇక పిల్లలు ఉండరు. వారు పిల్లల్ని కనవచ్చును. కానీ వారి శరీరాలనుండి పుట్టే ఆ ప్రశస్త శిశువులను నేను చంపేస్తాను.
17 ఆ ప్రజలు నా దేవుని మాట వినలేదు. కనుక ఆయన వారిని నిరాకరించాడు. వారు ఇల్లులేని వారుగా, రాజ్యాలలో సంచారం చేస్తారు.
1 విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి. కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు. అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది. కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్థంభాలను నిలిపాడు.
2 ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని చూశారు కానీ ఇప్పుడు వారు తమ దోషాన్ని అంగీకరించాలి. వారి బలిపీఠాలను యెహోవా విరుగగొడ్తాడు. వారి స్మారక శిలలను ఆయన నాశనం చేస్తాడు.
3 ఇప్పుడు, “మాకు రాజు లేడు. మేము యెహోవాను గౌరవించము! ఆయన రాజు మాకు ఏమి చేయలేడు!” అని ఇశ్రాయేలీయులు చెపుతారు.
4 వారు వాగ్దానాలు చేస్తారు కానీ వారు వట్టి అబద్ధాలు మాత్రమే చేపుతున్నారు. వారి వాగ్దానాలను వారు నిల బెట్టుకోరు. ఇతర దేశాలతో వారు ఒప్పందాలు చేస్తారు. ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు. ఆ న్యాయ మూర్తులు, దున్నబడిన పొలంలో విషపుకలుపు మొక్కల్లాంటివారు.
5 సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకునిపోబడింది.
6 అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది.
7 సమరయ బూటకపు దేవుడు నాశనం చేయబడతాడు. అది నీటిమీద తేలిపోతున్న చెక్క ముక్కలాగ ఉంటుంది.
8 ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపులు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు.
9 ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేశావు. (మరియు ఆ ప్రజలు అక్కడ పాపం చేస్తూనే ఉన్నారు). ఆ దుర్మార్గులను గిబియాలో యుద్దం నిజంగా పట్టుకొంటుంది.
10 వారిని శిక్షించటానికి నేను వస్తాను. వారికి విరోధంగా సైన్యాలు కలిసి ఉమ్మడిగా వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి రెండు పాపాల నిమిత్తం ఆ సైన్యాలు శిక్షిస్తాయి.
11 ఎఫ్రాయిము నూర్పిడి కళ్లంలో ధన్యం మీద నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను నేను ఎఫ్రాయిము మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు తానే భూమిని చదును చేస్తాడు.
12 నీవు మంచితనాన్ని నాటితే సత్య ప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని యెహోవాతో కలిసి పంటకోస్తావు. ఆయన వచ్చి, మంచితనాన్ని వర్షంలాగ నీమీద కురిపిస్తాడు!
13 కానీ మీరు దుర్మార్గం నాటారు. కష్టాన్ని పంటగా కోశారు. మీ అబద్ధాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేతనంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకొన్నారు.
14 కనుక మీ సైన్యాలు యుద్ధ ధ్వనులు వింటాయి. మరియు మీ కోటలన్నీ నాశనం చేయబడతాయి. అది షల్మాను బేతర్బేలును నాశనం చేసిన సమయంలాగా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో తల్లులు వారి పిల్లలతో పాటు చంపబడ్డారు.
15 మీకు కూడ బేతేలు వద్ద అలాగే జరుగుతుంది. ఎందుచేత నంటే, మీరు చాలా దుర్మార్గపు పనులు చేశారు గనుక. ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలు రాజు సర్వ నాశనం చేయబడతాడు.
1 “ఇశ్రాయేలు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను. మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.
2 కాని ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు. బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు. విగ్రహాలకు వారు ధూపం వేశారు.
3 “అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే! ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తు కొన్నాను! నేను వారిని స్వస్థపరిచాను. కాని అది వారికి తెలియదు.
4 తాళ్లతో నేను వారిని నడిపించాను. కాని అవి ప్రేమ బంధాలు. నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను. నేను వంగి వారికి భోజనం పెట్టాను.
5 ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు.
6 వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.
7 “నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”
8 “ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకులేదు. ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె. నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు! నిన్ను జెబొయీములాగ చెయ్యాలనీ లేదు! నేను నా మనసు మార్చు కుంటున్నాను, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
9 నేను నా కోపాగ్నిని అణచుకొంటాను. నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను. నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి. నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.
10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే, నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు. భయంతో కంపిస్తూ నా బిడ్డలు పశ్చిమ దిశ నుంచి వస్తారు.
11 వాళ్లు ఈజిప్టు నుంచి పక్షుల్లా వణుకుతూ వస్తారు. వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు.
12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టు ముట్టాడు. ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు! కాని, యూదా యింకా ఎల్ - తోనే నడుస్తున్నాడు. యూదా అపవిత్రలకు నమ్మ కస్తుడుగా ఉన్నాడు.”
1 ఎఫ్రాయిము వాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, “ఇశ్రాయేలీయులు రోజంతా “గాలిని తరుముతున్నారు.” వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.
2 యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకు గాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి.
3 యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్టడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు.
4 యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయుమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు.
5 ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. అయన పేరు యెహోవా (ప్రభువు).
6 అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి.
7 “యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన మిత్రుణ్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు కూడా సరైననవి కావు.
8 ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు: ‘నేను ఐశ్వర్యవంతుణ్ణి! నాకు ధనరాశులు దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. నా పాపాలు గురించి ఎవడూ తెలుకోడు.’
9 “మీరు ఈజిప్టు దేశంలో ఉన్ననాటినుంచి యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను.
10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్లకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను.
11 కాని, గిల్గాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు గిల్గాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో బురద చాళ్లు ఉన్నట్లే వాళ్లకి బారులు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి.
12 “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమచేశాడు. మరో భార్యకోసం గొర్రెల్ని మేపాడు.
13 కాని, యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టునుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు.
14 కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకిగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”
1 ఇశ్రాయేలులో ఎఫ్రాయిము చాలా ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు. ఎఫ్రాయిము మాట్లడితే చాలు ప్రజలు భయంతో కంపించి పోయేవారు. కాని ఎఫ్రాయిము పాపకార్యాలు చేశాడు. అతను బయలు దేవతని ఆరాధించాడు.
2 ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను చేసుకుంటారు. పనివాళ్లు వెండితో ఆ విగ్రహాలను చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తామ ఆ విగ్రహాలతో మాట్లాడతారు. వాళ్లు ఆ విగ్రహాలకు బలులు సమర్పిస్తారు. వాళ్లు ఆ బంగారు దూడలను ముద్దు పెట్టుకొంటారు.
3 అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. ఆ పొగ మంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యపు పోత పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.
4 “మీరు ఈజిప్టులో ఉన్ననాటినుంచీ యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప మీరు మరో దేవుడెవరినీ ఎరుగరు. మిమ్మల్ని రక్షించినది నేనే.
5 మీరు ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట ప్రాంతంలో ఉన్నప్పుడూ కూడా మీరు నాకు తెలుసు.
6 ఇశ్రాయేలీయులకు నేను ఆహారమిచ్చాను. వాళ్లా ఆహారం తిన్నారు. వాళ్లు కడుపులు నింపుకుని తృప్తిచెందారు. వాళ్లు గర్విష్ఠులై నన్ను మరచారు!
7 “అందుకే నేను వాళ్ల పాలిటికి సింహంలాగ ఉంటాను. దారిప్రక్కన పొంచివున్న చిరుత పులిలాగా ఉంటాను.
8 తన కూనల్ని కోల్పోయిన ఎలుగు బంటి లాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక కృర మృగంలాగ ఉంటాను”
9 “ఇశ్రాయేలూ, నేను నీకు సహాయం చేశాను. కానీ, నాకు నీవు ఎదురు తిరిగావు. అందుకు, నిన్ను నేనిప్పుడు నాశనం చేస్తాను.
10 నీ రాజు ఎక్కడున్నాడు? నీ నగరాలన్నింటిలోనూ అతను నిన్ను రక్షించలేడు! నీ న్యాయాధిపతులు ఎక్కడ? నీవొకప్పుడు ‘నాకొక రాజునీ, కొందరు నాయకుల్నీ ఇవ్వండి’ అని అడిగావు.
11 నాకు కోపం వచ్చి, నేను నీకొక రాజును ఇచ్చాను. నా కోపం మితిమీరినప్పుడు నేనా రాజుని వెనక్కి తీసేసుకున్నాను.
12 “ఎఫ్రాయిము తన దోషాన్ని కప్పుకొన ప్రయత్నించాడు. తన పాపాలు గుప్తంగా ఉన్నాయనుకున్నాడు. (కాని, అతను శిక్షంపబడతాడు.)
13 అతని శిక్ష ఎలా ఉంటుందంటే, స్త్రీ ప్రసవ బాధలా ఉంటుంది. అతను వివేకి అయిన పుత్రుడుగా ఉండడు. అతని పుట్టుకకి సమయం ఆసన్నమవుతుంది, కాని అతను బతికి బయటపడడు.
14 “నేను వాళ్లనా సమాధినుంచి కాపాడుతాను! నేను వాళ్లని మృత్యుముఖంనుంచి కాపాడుతాను! మరణమా, నీ వ్యాధులు ఎక్కడున్నాయి? సమాధీ నీ శక్తి ఎక్కడ? నేను పగ సాధించాలని చూడటం లేదు!
15 ఇశ్రాయేలు తన సోదరుల మద్య పెరుగుతాడు. కాని, శక్తివంతమైన తూర్పుగాలి వీస్తుంది. యెహోవా గాలి ఎడారినుంచి వస్తుంది. అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది. అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది. (ఇశ్రాయేలు) సంపదలో విలువైన వాటన్నింటినీ గాలి ఎగరే సుకుపోతుంది.
16 షోమ్రోను శిక్షింపబడాలి. ఎందుకంటే, అది తన దేవునికి వ్యతిరేకమైంది. ఇశ్రాయేలీయులు కత్తులతో చంపబడతారు. వాళ్ల పిల్లలు తునాతునకలు చేయబడతారు. వాళ్ల గర్భిణీస్త్రీల కడుపులు చీల్చబడతాయి.”
1 ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరమ్ము.
2 నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరిమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము, “మా పాపాన్ని తీసివేయుము. మా మంచి పనులను అంగీకరించుము. మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
3 “అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధ గుర్రాల పైన స్వారీ చేయుము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.”
4 అందుకు యెహోవా ఇలా అంటాడు: “ నా కోపం చల్లారింది, కనుక, నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను. నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
5 నేను ఇశ్రాయేలీయులకు మంచువలెవుంటాను. ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు. అతడు లెబానోను, దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
6 అతని శాఖలు విస్తరిస్తాయి, అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు. అతను లెబానోనులోని దేవదారు చెట్లు వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
7 ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు. గోధుమ కంకుల్లాగ పెరుగుతారు. ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు. వారు లెబానోను ద్రాక్షారసం వలె ఉంటారు.”
8 “ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు. నీ ప్రార్థనలు ఆలకించేది నేనే నిన్ను కాపాడేది నేనే. నేను నిరంతరం పచ్చగానుండే మీ ఫలము నానుండి వస్తుంది.”
9 వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు. చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి. యెహోవా మార్గాలు సరైనవి. మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు. పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.