1

1 బబులోను రాజైన, నెబుకద్నెజరు తన సైన్యంతో యెరూషలేముకు వచ్చి దానిని చుట్టుముట్టాడు. ఇది యెహోయాకీము యూదాకు రాజుగానున్న మూడవ సంవత్సరంలో జరిగింది.

2 ప్రభువు యూదా రాజైన యెహోయాకీమును ఓడించడానికి, దేవుని ఆలయం నుంచి అన్ని వస్తువులను తీసుకొని వెళ్ళడానికి నెబుకద్నెజరును అనుమతించాడు. అతడు ఆ వస్తువులను తన విగ్రహ దేవతలున్న ఆలయములో ఉంటాడు.

3 తర్వాత నెబుకద్నెజరు అష్పెనజుకు (అష్పెనజు రాజుకొలువులోని నపుంసకులలో ప్రముఖుడు), “కొందరు యూదులను తన ఇంటికి తీసుకు రమ్మని” చెప్పాడు. కొన్ని ప్రసిద్ధ కుటుంబాల నుంచి, ఇశ్రాయేలీయుల రాజకుటుంబం నుంచి ఆరోగ్యవంతులైన యౌవ్వన యూదులను తీసుకు రమ్మని ఆజ్ఞాపించాడు.

4 ఎలాంటి లోపము తమ దేహాలమీద లేనివారు, అందమైన, చురుకైన వారు, తేలికగా విషయాలు నేర్చుకునే వారు, రాజగృహములో సేవ చేయ సామర్థ్యముగల యువకులను ఎన్నుకోమన్నాడు. ఆ ఇశ్రాయేలు యువకులకు కల్దీయుల భాషను, వ్రాతలను నేర్పుమని రాజు అష్పెనజుకు ఆజ్ఞాపించాడు.

5 నెబుకద్నెజరు ఆ యువకులకు ప్రతీరోజు రాజుతిని, త్రాగే ఆహారము, ద్రాక్షామద్యం ఇప్పించాడు. ఇశ్రాయేలుకు చెందిన ఆ యువకులు మూడేళ్లపాటు తర్ఫీదు పొందాలని రాజు ఆదేశించాడు. మూడేళ్ల తర్వాత, వారు బబులోను రాజ నగరులో ప్రవీణులుగా ఉంటారు.

6 ఆ యువకులలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు, యూదా దేశానికి చెందిన వారు.

7 తర్వాత అష్పెనజు యూదా నుంచి వచ్చిన ఆ యువకులకు బబులోను పేర్లు పెట్టాడు. దానియేలుకు బెల్తెషాజరు, మిషాయేలుకు మేషాకు, అజర్యాకు అబేద్నెగో, హనన్యాకు షద్రకు, అని పేర్లు పెట్టాడు.

8 రాజు భుజించే విలువైన ఆహారం, ద్రాక్షామద్యం తీసుకోడానికి వారు ఇష్టపడలేదు. ఆ ఆహారం, మత్తు ద్రాక్షామద్యం తమను తాము అపవిత్రం చేసుకోవటం దానియేలుకు ఇష్టము లేక దానిని తప్పించుమని అష్పెనజు అనుమతి కోరాడు.

9 దానియేలు పట్ల అష్పెనజు మంచిగాను, దయతోను ఉండేటట్లు దేవుడు చేసాడు.

10 కాని అష్పెనజు దానియేలుతో, “రాజైన నా యజమానికి భయపడుతున్నాను. ఈ ఆహారము, ద్రాక్షామద్యం మీ కిమ్మని రాజు నాకాజ్ఞాపించాడు. మీరు ఈ ఆహారం భుజించక పోతే, జబ్బుగాను బలహీనంగాను కనబడతారు. మీ వయసు వారైన ఇతర యువకులతో పోల్చితే మీరు తక్కువగా కనిపిస్తారు. రాజు ఇది చూచి నా మీద కోపగిస్తాడు. ఒకవేళ నా తలను కూడా తీసివేస్తాడు” అని అన్నాడు.

11 దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలపై అష్పెనజుచే నియమించబడిన సంరక్షకునితో దానియేలు ఇలా అన్నాడు:

12 “పది రోజులపాటు మాకు ఈ పరీక్ష విధించు. తినడానికి కాయగూరలు, త్రాగడానికి మంచినీళ్లు తప్ప మరేమీ ఇవ్వవద్దు.

13 పది రోజుల తర్వాత, రాజు నియమించిన ఆహారంతిన్న ఇతర యువకులతో మమ్మల్ని పోల్చి చూడు. ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో నీవే ఆలోచించి నీ సేవకులమైన మాకు ఏమి చేయాలని నీ నిరయమో అలాగే చెయ్యి” అని అన్నాడు.

14 అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్షకుడు సమ్మతించాడు.

15 పదిరోజుల తర్వాత, దానియేలు మరియు అతని మిత్రులు రాజు ఆహారంతిన్న ఇతర యువకులకంటె ఆరోగ్యంగా కనిపించారు.

16 అందువల్ల రాజు నియమించిన ప్రత్యేక ఆహారానికి బదులుగా, కాయగూరలు, మంచినీళ్లు దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు, ఆ సంరక్షకుడు ఇస్తూ వచ్చాడు.

17 దానియేలుకు, హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు వివేకం, పలు విధాలైన వ్రాతలు, శాస్తాలు నేర్చుకునే జ్ఞానము, సామర్థ్యము దేవుడు ప్రసాదించాడు. అన్ని విధాలైన దర్శనాలు, స్వప్నాలు దానియేలు గ్రహించుకోగలిగాడు.

18 ఆ యువకులందరూ మూడేళ్లపాటు మంచి శిక్షణ పొందాలని రాజు ఆదేశించాడు. ఆ గడువు తీరిన తర్వాత, అష్పెనజు ఆ యువకుల్ని రాజైన నెబుకద్నెజరు వద్దకు తీసుకు వెళ్లాడు.

19 రాజు వారితో మాట్లాడాడు. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలకంటె ఇతర యువకులెవ్వరూ గొప్పగా లేకపోవడాన్ని రాజు కనుగొన్నాడు. అందువల్ల ఈ నలుగురు యువకులు రాజు ఆస్థానంలో నిలువగలిగారు.

20 ప్రతీసారి రాజు వారిని యేదో ఒక ముఖ్య విషయం అడుగగానే, వారు మంచి గ్రహింపు, వివేకం ప్రదర్షించేవారు. తన రాజ్యంలో ఉన్న జ్ఞాన వంతులంగరికంటెను, ఇంద్ర జాలికులందరికంటెను, వారు నలుగురు పదిరెట్లు ఎక్కువగా ఉన్నారని రాజు గ్రహించాడు.

21 అందువల్ల దానియేలు, కోరెషు రాజయిన మొదటి సంవత్సరంవరకు రాజు ఆస్థానంలో కొనసాగాడు.

2

1 నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్సరంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద్ర పట్టలేదు.

2 అప్పుడు రాజు తన కలను చెప్పటానికి మాంత్రికులను, గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, కల్దీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగన్నాడో చెప్పామని రాజు వారిని అడిగాడు.

3 అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలతబెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి”

4 తర్వాత కల్దీయులు రాడుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు.

5 అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా చేయిస్తాను.

6 కానీ మీరు నా కలను, దాని అర్థాన్ని వివరించినట్లయితే, అప్పుడు మీకు నేను కానుకలు, బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి అని అన్నాడు.

7 మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు.

8 అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి చెప్పానో, అది నా నిర్థారణ చెప్పకపోతే, నేను మిమ్మల్ని శిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతానాతో వ్యర్థమైన మాటలు అబద్ధాలు చెప్పటానికి కాలయాపన చేస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలను గురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కల యొక్క అర్థము కూడా మీరు చెప్పగలరని నాకు తెలుస్తుంది.”

9 [This verse may not be a part of this translation]

10 [This verse may not be a part of this translation]

11 చేయటానికి బహు కఠినమైన దానిని రాజు అడుగుచున్నాడు. దేవుళ్లు మాత్రమే రాజైన తమకు వచ్చిన కలనుగాని, ఆ కల అర్థముగాని చెప్పగలుగుతారు. కాని దేవుళ్లు మనుష్యులతో ఉండరు.”

12 ఇది వినగానే, రాజు చాలా ఉగ్రుడై బబులోనులోని జ్ఞానవంతులందరిని చంపుమని ఆజ్ఞాపించాడు.

13 నెబుకద్నెజరు వివేకవంతులందరు చంపబడాలని ఆజ్ఞ ప్రకటించగా రాజు మనుష్యులు దానియేలు మరియు అతని మిత్రుల్ని చంపడానికి వెళ్లారు.

14 అర్యోకు రాజరక్షకభటుల అధిపతి. బబులోనులోని వివేకవంతుల్ని చంపడానికి అతడు బయలు దేరాడు. కాని దానియేలు అతనితో తెలివిగా మాట్లాడాడు.

15 దానియేలు రాజరక్షకభటుల అధిపతియైన అర్యోకుని ఇలా అడిగాడు: “రాజు ఎందుకు ఇంత కఠినమైన శిక్షను విధించాడు?” అప్పుడు అర్యోకు రాజు కలయొక్క వృత్తాంతము నంతటిని దానియేలుకు వివరించాడు. దానియేలు అదివిని సంగతి తెలుసుకొన్నాడు.

16 అతను నెబుకద్నెజరు రాజు వద్దకు వెళ్లి, తనకు మరికొంత సమయం ఇమ్మని అప్పుడతను కలను, కలయొక్క అర్థాన్ని చెప్పగలనని అడిగాడు.

17 దానియేలు తన ఇంటికి వెళ్లి మిత్రులైన హనన్యా, మిషాయేలు, అజర్యాలకు పూర్తి సంగతిని వివరించాడు.

18 తమ పాలిట దేవుడు దయకలిగి ఆ రహస్యమును తెలుపుటకు పరలోకమందున్న దేవుని ప్రార్థించుమని దానియేలు తన మిత్రుల్ని కోరాడు. ఎందుకనగా దానియేలు మరియు అతని మిత్రులు బబులోనులోనియితర వివేకవంతులతో కలిసి నాశనమవ్వకూడదు.

19 ఆ రాత్రి, దేవుడు ఆ రహస్యమును దానియేలుకి దర్శనములో వివరించెను. అప్పుడు పరలోక మందున్న దేవున్ని దానియేలు స్తుతించాడు.

20 “నిరంతరం దేవుని పేరు కీర్తించబడాలి; శక్తియు వివేకము ఆయనకే చెందాలని దానియేలు దేవున్ని స్తుతించాడు.

21 దేవుడే కాలాల్ని సమయాల్ని మార్చుతాడు. ఆయనే రాజుల్ని వారి అధికారాల్ని మార్చుతాడు. ఆయనే మనుష్యలకు వివేకమిస్తాడు. కనుక, వారు వివేకవంతు లౌతారు. జ్ఞానమిస్తాడు, కనుక జ్ఞానవంతుల వుతారు.

22 గ్రహించటానికి కష్టమైన రహస్యాలు ఆయనకు తెలుసు. చీకటిలో మరుగైన సంగతులు ఆయనకు తెలుసు. వెలుగు ఆయనలో నివసిస్తుంది.

23 మా పూర్వీకుల దేవా! నీకు కృతజ్ఞుణ్ణి, నిన్ను కీర్తిస్తున్నాను. నీవు నాకు వివేకము, బలము ప్రసాదించావు. నీవు రాజు కన్న కలను దాని అర్థాన్ని తెలియజేశావు. మేమడిగిన విషయాల్ని నీవు మాకు చెప్పావు” అని దానియేలు అన్నాడు.

24 తర్వాత దానియేలు అర్యోకు వద్దకు వెళ్లాడు. బబులోను వివేకవంతుల్ని చంపటానికి రాజు అర్యోకును ఎంపిక చేశాడు. “బబులోను వివేకవంతుల్ని చంపవద్దు. నన్ను రాజు వద్దకు తీసుకుని వెళ్లు. కలను గురించి దాని అర్థాన్ని గురించి నేను చెప్తాను” అని దానియేలు అన్నాడు.

25 దానియేలును అర్యోకు తక్షణం రాజువద్దకు తీసుకొని వెళ్లాడు. అర్యోకు రాజుతో, “యూదానుంచి బందీలుగా వచ్చిన మనుష్యులలో నేనొక వ్యక్తిని చూశాను. కలయొక్క అర్థాన్ని రాజైన తమకు అతను వివరించగలడు” అని చెప్పాడు.

26 రాజు దానియేలుకు (బెల్తెషాజరు) ఒక ప్రశ్న వేశాడు. “నీవు నా కలను గూర్చి, దాని అర్థాన్ని గూర్చి చెప్పగలవా?”

27 దానియేలు, “నెబుకద్నెజరు రాజా! వివేక వంతుడుగాని, ఇంద్రజాలికుడుగాని, కల్దీయుడుగాని రాజు అడిగిన రహాస్య విషయాల గురించి చెప్పలేడు.

28 కాని పరలోకమందున్న దేవుడు మరుగైన విషయాలగురించి చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూపించడానికి దేవుడు రాజుకు ఒక కలను ఇచ్చాడు. నీవు నీ పడకమీద పడుకుని ఉండగా చూచిన విషయాలు ఇవి.

29 రాజా! నీ పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరుగునో అని తలంచుచూ నీవు నిద్రించావు. గప్త విషయాలు గురించి దేవుడే చెప్పగలడు. భవిష్యత్తులో ఏమి జరుగునో దేవుడే నీకు చూపాడు.

30 దేవుడు ఈ రహస్యం నాకు కూడా తెలిపాడు. ఎందుకంటే ఇతర వివేకవంతులకంటే నాకు ఎక్కువ వివేకం కలదనే కారణం కాదు. రాజువైన నీవు దాని అర్థమేమిటో గ్రహించాలని తలంచి దేవుడు ఈ రహాస్య విషయం నాకు తెలిపాడు. ఆ విధంగా నీ మనుస్సులోని ఆలోచన ల్ని నీవు గ్రహించగలవు” అని అన్నాడు.

31 “రాజా, నీవు నీ కలలో ఒక పెద్ద విగ్రహం నీ ముందునిలిచి యుండటం చూశావు. అది తళతళ మెరుస్తూ భయంకరంగా ఉండినది.

32 విగ్రహం యొక్కతల స్వచ్చమైన బంగారంతోను, రొమ్ము చేతులు వెండితోను, పొట్ట, తొడలు కంచుతోను

33 మోకాళ్ల క్రింది భాగం ఇనుముతోను, పాదాలు, మట్టి, ఇనుముతోను కలిసి చేయబడినని.

34 నీవు ఆ విగ్రహంవైపు చూస్తూ ఉండగా, ఒక రాయి మానవుని చేతిలో తీయ బడకుండా గాలిలో ఎగిరి, దానంతట అదే వెళ్లి ఇనుముతోను, బంకమట్టితోను చేయబడిన విగ్రహంపాదాల మీదపడి దానిని పొడిపొడి చేసింది.

35 తర్వాత ఇనుము, బంకమట్టి, కంచు, వెండి, బంగారం పొడిపొడి అయ్యాయి. ఆ పొడి గాలికి కొట్టుకొనిపొయి కనబడకుండా పోయింది. తర్వాత విగ్రహాన్ని పొడి చేసిన ఆ రాయి పెద్ద కొండగా మారిపోయి భూమి అంతటా వ్యాపించింది.

36 “అదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్థమేమిటో మేము రాజుకు వివరిస్తాము.

37 రాజా, నీవు చాలా ముఖ్యుడైన రాజువి. పరలోకమందున్న దేవుడు నీకు అధికారం, బలం, రాజ్యం, ప్రఖ్యాతిని, ప్రసాదించాడు.

38 “నీవు ప్రజల్ని, భూజంతువుల్ని, ఆకాశ పక్షుల్ని లోబరచుకొని, పరిపాలించే శక్తిని ఆయన నీకు ఇచ్చాడు. వాళ్లందరూ, అవన్నీ ఎక్కడున్నా, దేవుడు నీవు పరిపాలించేటట్లు చేశాడు. ఓ నెబుకద్నెజరు రాజా! ఆ విగ్రహపు బంగారు తల నీవే.

39 “మరో రాజ్యం నీ తర్వాత వస్తుంది. అది వెండి లాంటిది. కాని ఆ రాజ్యం నీ రాజ్యంలా అంత గొప్పగా ఉండదు. ఆ తర్వాత మూడవ రాజ్యం భూమిని పరిపాలిస్తుంది. అది కంచు లాంటిది.

40 తర్వాత నాలుగవ రాజ్యం వస్తుంది. అది ఇనుములా శక్తివంతంగా ఉంటుంది. ఇనుము బ్రద్ధలుచేసి ముక్కలు మక్కలుగా విరుగకొడుతుంది. ఆ విధంగానే, ఆ నాలుగవ రాజ్యం ఇతర రాజ్యాల్ని ముక్కలుగా పగులగొడుతుంది.

41 “ఆ విగ్రహం పాదాలు, వ్రేళ్లు కొంత ఇనుముతోను, కొంత బంకమట్టితోను చేయబడినవిగా నీవు చూశావు. అనగా, ఆ రాజ్యం భాగాలైన రాజ్యంగా ఉంటుంది. నీవు ఇనుమూ బంకమట్టి కలిసినట్టుగా చూసితివి గనుక ఆ రాజ్యం కొంతవరకు ఇనుమునకున్నంత బలంగానూ, బంకమట్టిలా బలహీనంగానూ ఉంటుందని అర్థం.

42 ఆ విగ్రహంయొక్క పాదాలు, బొటనవ్రేళ్లు ఇనుము బంకమట్టితో కలిసి ఉన్నట్లుగా చూశావు. అలాగే ఆ రాజ్యం కొంత ఇనుమువలె బలంగాను, కొంత బంకమట్టివలై బలహీనంగానూ ఉర టుంది.

43 (నీవు ఇనుమును బంకమన్ను కలిసింది చూశావు.) ఆ విధంగానే, ఆ మనుష్యులు ఒకరితోనొకరు కలసి మెలసివుండలేరు.

44 “ఆ రాజ్యపు పరిపాలకుల కాలంలో పరలోక మందున్న దేవుడు మరొక రాజ్యం స్థాపిస్తాడు. ఈ రాజ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. అది యెన్నటికీ నాశనం కాదు! అది దాన్నపొందేవాళ్లకి తప్ప వేరే వాళ్లకు చెందదు. ఈ రాజ్యం ఇతర రాజ్యాలన్నిటినీ నాశనం చేసి అంతం చేస్తుంది. కాని ఆ రాజ్యం మాత్రమే సదాకాలం కొనసాగుతూ ఉంటుంది.

45 “నెబుకద్నెజరు రాజా, ఒక పర్వతంనుంటి విరిగిన ఒక రాయిని నీవు చూశావు. అది మనిషి చేతులతో తీయబడింది కాదు. ఆ రాయి ఇనుమును, కంచును, బంకమట్టిని, వెండిని, బంగారాన్ని ముక్కలుగా విరుగ గొట్టింది. ఈ విధంగా, దేవుడు భవిష్యత్తులో జరగనున్నదాన్ని నీకు చూపాడు. కల నిజం, దాని అర్థం నమ్మదగినది” అని దానియేలు రాజుతో చెప్పాడు.

46 అప్పుడు రాజైన నెబుకద్నెజరు దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజు దానియేలును గౌరవించాలనకొన్నాడు. కాబట్టి అతనికి అర్పణాన్ని ధూపాన్ని సమర్పించాలని ఆజ్ఞాపించాడు.

47 అప్పుడు దానియేలుతో రాజు, “నీవు దేవుడు గొప్పవాడని, శక్తి మంతుడనీ నేను నిస్సందేహంగా తెలుసుకున్నాను. ఆయన రాజులకు రాజు, దేవుళ్ళకు దేవుడు. ప్రజలకు తెలియని విషయాలు ఆయన చెపుతాడు. ఈ రహస్య విషయాలన్నిటినీ నీవు నాకు చెప్పితివి కాబట్టి, ఇది సత్యమని నేను భావిస్తున్నాను”అని అన్నాడు.

48 అప్పుడు రాజు దానియేలుకు తన రాజ్యంలో అతి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. మరియు రాజు ఖరీదైన కానుకలు ఎన్నో అతనికిచ్చాడు. నెబుకద్నెజరు దానియేలును బబులోను రాజ్య మంతటికీ పరిపాలకునిగా చేశాడు. బబులోనులోని వివేకవంతులందరిమీద దానియేలును అధికారిగా నియమించాడు

49 [This verse may not be a part of this translation]

3

1 నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను రాజ్యంలో దూరాయను మైదాన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించాడు.

2 ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధి కారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు వారందరిని పిలించాడు.

3 రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు.

4 రాజు తరఫున ప్రకటనలు చేసే వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాలనుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ నా మాడలు ఆలకించండి. ఇది మీరు చేయాలని రాజాజ్ఞ.

5 కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల, ధ్వసులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగ పడి పూజించాలి.

6 ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.

7 అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్టించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.

8 తర్వాత కల్దీయులలో కొందరు రాజు వద్దకు వచ్చి యూదులకు విరుద్ధంగా మాటలాడసాగిరి.

9 వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు, ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక!

10 రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫొనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీక వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు.

11 ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు.

12 రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిషించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.”

13 నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు.

14 అందువల్ల వారిని అతని సమక్షమునకు తీసుకు వచ్చారు. నెబుకద్నెగో మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా?

15 కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించ కపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”

16 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు.

17 మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకి ఇష్టం కలిగితే మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు.

18 దేవుడు కూడా మమ్ములను రక్షించని పక్షంలో, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”

19 అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతను చాలా కొపంగా చూశాడు. మామూలుకంటె ఏడు రెట్లు కొలిమి వేడిగా ఉండాలని అతను ఆజ్ఞాపించాడు.

20 తర్వాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహా బలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నె గోలనిబంధించి. వేడి కొలిమిలోకి తోసి వేయుమని ఆజ్ఞా పించాడు.

21 అందువల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలని బంధించి, వారిని వేడి కొలిమిలోకి త్రోసివేశారు. వాళ్లను మంటలో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పైవస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు.

22 రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్లవారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహా బలవంతులయిన సైనికుల్ని కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు ఆ మంటలచేత వెంటనే కాలిచచ్చారు.

23 షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటల్లోకి త్రోసేశారు.

24 తర్వాత నెబుకద్నెజరు జరిగింది చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుల్ని పిలిచి, “మనం ముగ్గురినే బంధించి మంటల్లోకి త్రోసివేశాము గదా!” అని అడిగాడు. “చిత్తం ప్రభూ” అని సలహాదారులు బదులు చెప్పారు.

25 “చూడండి! మంటల్లో నలుగురు నడుస్తున్నట్టు నేను చూస్తున్నాను. వారు బంధించబడినట్లుగా గాని కాలి పోయినట్టుగా గాని లేదు. నాలుగవ వ్యక్తి దైవ కుమారునిగా కనిపిస్తున్నాడు” అని రాజు అన్నాడు.

26 తర్వాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి, “అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా బయటికి రండి” అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటలనుండి వెలుపలికి వచ్చారు.

27 వారు వెలుపలికి రాగానే, పాలనాధికారులు ఉన్నతాధికారులు, రాజుగారి సలహా దారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల వాసనై నా లేదని వారు తెలుసుకొన్నారు.

28 తర్వాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ల దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటలనుండి రక్షించినాడు. ఈ వ్యక్తులు ముగ్గురు తమ దేవుని విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవటానికిష్టపడ్డారు కాని, మరొక దేవుని కొలవడానికి గాని, పూజించుటకు గాని ఇష్టపడలేదు.

29 అందువల్ల నేనిప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను: ఏ దేశానికి చెందిన మనుష్యులుగాని, ఏ భాషకు చెందినవారు గాని, షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్పితే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇళ్ళు పాడుదిబ్బగా నాశానం చేయబడుతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడు గాని తన మనుష్యులను రక్షించలేడు.”

30 ఆ తర్వాత షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలిచ్చాడు.

4

1 రాజైన నెబుకద్నెజరు తన లేఖను ప్రపంచంలో అన్ని జనాంగాలకు, ఇతర భాషలు మాటలాడే దేశాలకు, ప్రజలకు వ్రాయిస్తూ మీ అందరికీ సమాధాన మగుగాక!

2 అత్యున్నతుడైన దేవుడు, నా కోసం చేసిన అద్భుత విషయాలు, అద్భుత సంఘటనల గురించి చెప్పడానికి సంతోసిస్తున్నాను.

3 దేవుని సూచనలు, అద్భుతాలు మహాగొప్పవి, శక్తివంతమైనవి. దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని ప్రభుత్వం అన్ని తరాలు కొనసాగుతుంది.

4 నెబుకద్నెజరు అను నేను నా అంతఃపురాన ఉన్నాను. నేను సుఖంగా సంతోషంగా ఉన్నాను.

5 నన్ను భయంగొలిపే కల ఒకటి వచ్చింది. నేను నా పడకమీద ఉన్నాను. నా మనస్సులోని ఆలోచనలు నన్ను భయపెట్టాయి.

6 అందువల్ల బబులోనులోని వివేకవంతులందరినీ నావద్దకు తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఎందుకంటే వారు నా కలయొక్క అర్థం చెప్పగలరని.

7 ఇంద్ర జాలికులు, కల్దీయులు వచ్చారు. రాగానే వారితో కల వృత్తాంతం చెప్పాను. కాని దాని అర్థమేమిటో వారు చెప్పలేకపోయారు.

8 చివరికి దానియేలు వచ్చాడు. (నా దేవుని గౌరవించే నిమిత్తం నేను దానియేలుకు బెల్తెషాబరు అని పేరుపెడితిని. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ అతనిలో వుంది.) నా కల గురించి దానియేలుతో చెప్పాను.

9 నేను ఈ విధంగా చెప్పాను: “బెలైషాజరూ! ఇంద్ర జాలికులందరిలో నీవు చాలా ముఖ్యుడివి. పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ నీలో ఉన్నట్లు నాకు తెలుసు. ఏ రహస్యమూ నీకు తెలుసుకోవడం కష్టంకాదు. ఇది నేను (కన్నకల) దాని అర్థమేమిటో చెప్పుము.

10 నేను నా పడక మీద ఉండగా ఈ దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది.

11 ఆ చెట్టు ఏపుగా దృఢంగా పెరిగింది. ఆ చెట్టు పైభాగం ఆకాశాన్ని అంటిందా అన్నట్లున్నది. భూమిమీద ఎక్కడినుంచ యినా ఆ చెట్టుని చూడవచ్చు.

12 ఆ చెట్టు ఆకులు చాలా అందమైనవి. దాని మీద చాలా పళ్లు ఉన్నాయి. అవి అందరికీ ఆహారంగా ఉన్నాయి. భూజంతువులకు చెట్టుక్రింద నీడ లభించింది. దాని కొమ్మలలో పక్షులు ఉన్నవి. ప్రతీ జీవి ఆ చెట్టునుండి పోషింటబడింది.

13 నేను నా పడక మీదనే పడుకొని నా దర్శనంలో కావలివానివలె పరలోకంనుంచి ఒక పవిత్రుడు క్రిందికి రావడం చూశాను.

14 అతను చాలా బిగ్గరగా మాట్లాడాడు, ‘చెట్టును నరికి వేయండి. చెట్టుకొమ్మల్ని నరికి వేయండి. దాని ఆకులను, దాని పండ్లని త్రుంచి పారవేయండి. చెట్టుకిందవున్న జంతువుల్ని తోలివేయండి. దాని కొమ్మల మీదవున్న పక్షుల్ని ఎగిరి పోనివ్వండి.

15 కాని దాని మొద్దును వేళ్లతో సహాభూమిలోనే ఉండనివ్వండి. దాని చుట్టూ ఇనుమూ కంచు కలిసిన ఒక బద్దీ వేయండి. చెట్టుమొద్దు, వ్రేళ్లు పొలంలో పెరిగే గడ్డి మధ్యలో భూమిలోనే ఉండినివ్వండి. మంచు చేత దాన్ని తడవ నివ్వండి. అని అతను చెప్పాడు.

16 ఇక మీదట అతను మనిషిలా ఆలోచించడు. అతనికి జంతువుల బుద్ధి వస్తుంది. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతని మీదగా గడుస్తాయి.’

17 కావలి దూత ద్వారా ఈ ఆజ్ఞ జారీ అయింది. పరిశుద్ధుల ద్వారా నిర్ణయం జరిగింది. ఇది అంతం వరకు ఉంటుంది. మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడని భూమి మీద నివసించే మనుష్యులందరు తెలుసుకొనేందుకు వీలవుతుంది. ఆయనకు నచ్చిన ఎవరికైనా దేవుడు ఆ రాజ్యాలను ఇచ్చి వేస్తాడు. ఆ రాజ్యాలను పాలించేందుకు వినయ విధేయతగల వారిని దేవుడు ఎన్నుకుంటాడు!

18 ఇదే నెబుకద్నెజరు రాజునైన నేను కన్నకల. ఇప్పుడు బెలైషాజరూ (దానియేలూ) ఈ కల అర్థం చెప్పుము. నా రాజ్యాంలోని వివేకవంతు లెవ్వరూ నాకు ఆ కల అర్థం చెప్పలేకపోయారు. కాని బెలైషాజరూ, నీవు ఆ కల గురించి చెప్పగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధ దేవతల ఆత్మవుంది.

19 తర్వాత దానియేలు (బెలైషాజరు) కొంచెంసేపు చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆలోచిస్తున్న విషయాలు అతన్ని కలత పరచినవి. అందువల్ల రాజు, “బెల్తెషాజరూ! (దానియేలు) ఆ కలగాని, ఆ కలయొక్క అర్థంగాని, నిన్ను కలత చెందనీయకుండును గాక” అని చెప్పాడు. తర్వాత బెల్తెషాజరు (దానియేలు) రాజుతో ఇలా అన్నాడు: “నా రాజా! ఆ కల నీ విరోధులకు జరుగునుగాక! నీ శత్రువులకు ఆ కలయొక్క అర్థము నెరవేరును గాక!

20 [This verse may not be a part of this translation]

21 [This verse may not be a part of this translation]

22 రాజా. నీవే ఆ వృక్షానివి. నీవు మహా శక్తిమంతుడవయ్యావు. ఆకాశాన్ని అంటిన ఉన్నత వృక్షంవంటి వాడవు నీవు. నీ అధికారం భూమిమీద దూర భాగాలకు కూడా వ్యాపించింది.”

23 “రాజా, పరలోకంనుంచి ఒక పవిత్ర కావలి దేవదూత క్రిందికి రావడం నీవు చూశావు. అతడు ఇలా అన్నాడు:’చెట్టుని నరికివేయుము; నాశనం చేయుము. ఇనుము కంచు బద్దీతో కట్టబడి, పొలంలోని గడ్డి మధ్య నాటబడిన ఆ మొద్దును ప్రేళ్ళతో సహా భూమిలోనే విడిచిపెట్టు. ఏడు కాలాలు (సంవత్సరాలు) అతను మంచుకు తడుస్తూ మృగంవలె జీవస్తాడు.’

24 “రాజా, కలయొక్క అర్థం ఇదే. మహోన్నతుడైన దేవుడు ఇవి జరుగుతాయని నా రాజువైన నీకు ఆజ్ఞాపించాడు.

25 నెబుకద్నెజరు రాజా, నీ ప్రజలనుంచి దూరంగా నీవు తరుమబడుతావు. భూజంతువుల మధ్య నీవు నివసిస్తావు. ఎద్దువలె నీవు పచ్చిక తింటావు. నీవు మంచుచేత తడుస్తావు. అలా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు నీవీపాఠం నేర్చుకుంటావు - మహోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడనియు, తనకు నచ్చిన ఎవనికైనా రాజ్యాలను ఇచ్చివేస్తాడనియు నీవు తెలుసుకుంటావు.

26 “చెట్టు మొద్దు, వ్రేళ్లనీ నేలలోనే ఉంచుము అని ఇవ్వబడిన ఆజ్ఞకు అర్థమిది: మహోన్నతుడైన ఆ దేవుడే మనుష్యుల రాజ్యాలను పరిపాలిస్తున్నాడన్న విషయం నీవు తెలుసుకున్నప్పుడు, నీ రాజ్యం నీకు ఇవ్వ బడుతుంది.

27 అందువల్ల, రాజా, నా సమహాని స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయుము. సరి యైనదేదో అదే జరిగించుము. చెడు విషయాలు చేయడం ఆపివేయుము. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.”

28 నెబుకద్నెజరు రాజుకి ఆ ఘటనలన్నీ జరిగినవి.

29 [This verse may not be a part of this translation]

30 [This verse may not be a part of this translation]

31 అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం వినిపించింది. “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే: నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది.

32 ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనియు, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనియు నీవు తెలుసుకుంటావు.”

33 ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక వేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి.

34 ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ది లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను: ఆయన పరిపాలన శాశ్వతమైనది, తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది.

35 భూమిమీద మనుష్యులు ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము. దేవుడు పరలోకలమందలి సైన్యాలకు, భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు. ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు. ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు.

36 అందువల్ల, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి.

37 ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజుని కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.

5

1 రాజైన బెల్షెస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు.

2 బెల్షెస్సరు ద్రాక్షామద్యం తాగుతుండగా బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకుల్ని ఆజ్ఞాపించాడు. తన తండ్రి అయిన నెబుకద్నెజరు ఆ పాత్రల్ని యెరూషలేము ఆలయం నుంచి తీసుకువచ్చాడు. బెల్షెస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు.

3 కనుక యెరూషలేము ఆలయం నుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు.

4 త్రాగుచూవారు బంగారం వెండి, కంచు, ఇనుము, కర్ర రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు.

5 అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడిగోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు.

6 రాజైన బెల్షెస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంగా ఉండటంవల్ల, అతడు నిలబడలేక పోయాడు.

7 అప్పుడు ఇంద్రజాలకుల్ని, కల్దీయుల్ని, తన సమక్షమునకు తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీద ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహుకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు.

8 అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు.

9 బెల్షెస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్ల బోయింది.

10 విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజు యొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్ఖిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు.

11 నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేక వంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్ర జాలకులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు.

12 నేను మాటలాడుతున్న వ్యక్తి వేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్ధాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది.

13 అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా?

14 నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను.

15 వివేకవంతుల్నీ ఇంద్రజాలకుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుప లేకపోయారు.

16 నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు.

17 తర్వాత దానియేలు రాజుతో, “బెల్షెస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకొనుము. లేకపోతో ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వవచ్చు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు.

18 “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తిమంతమైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు.

19 పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడుచుండిరి. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింప తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచు కుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు.

20 కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయినాడు, మొండి వాడయ్యాడు. అందువల్ల అతని నుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది.

21 అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవిగాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చు కొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించు వాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించ గలడని తెలుసుకొన్నాడు.

22 “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షెస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు,

23 అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరొధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయం నుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజో ద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు.

24 ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు.

25 ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి: మెనే మెనే టెకేల్ ఊఫర్సీన్.

26 “ఈ మాటలకు అర్థం ఇది: మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు.

27 టేకల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు.

28 ఊఫర్సిన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసి వేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.”

29 తర్వాత బెల్షెస్సరు ఊదారంగు బట్టలు దానియేలు ధరించేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు.

30 ఆ రాత్రే బబులోను రాజైన బెల్షెస్సరు హతుడయ్యాడు.

31 దర్యావేషు అనే పేరుగల మాదీయుడు క్రొత్తగా రాజు అయ్యాడు. దర్యావేషు సుమారు అరవై రెండు యేండ్లవాడు.

6

1 తన రాజ్యం అంతటినీ పరిపాలించేందుకు నూట ఇరవైమంది రాజ్యాధికారులను ఎంపిక చేయాలని దర్యావేషు తలంచాడు. అది మంచి ఆలోచన అను కొన్నాడు.

2 మరియు ఆ నూట ఇరవైమంది రాజ్యాధికారుల మీద ఆధిపత్యం గలవారుగా ముగ్గురిని ఎంపిక చేసాడు. ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ఒకడు. ఎవ్వరూ తనను మోసగించ కూడదని ఆ ముగ్గురిపైన, మరి ఆ నూట ఇరవైమంది పైన దానియేల్ని అధికారిగా ఎంపిక చేశాడు. అందువల్ల తన రాజ్యంలో ఏమీ తాను నష్టపడేది ఉండదు.

3 రాజు దానియేలును మెచ్చు కొన్నాడు. తన మంచి ప్రవర్తన వల్లను, తన సామర్థ్యం వల్లను దానియేలుకు రాజు అలా చేయగలిగాడు. రాజు దానియేలు వశుడయ్యాడు. రాజ్యమంతతికీ దానియేలును పరిపాలకునిగా చెయ్యాలని తలంచాడు.

4 కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యధి కారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొన లేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజుని మోసగించలేదు. కష్టించి పని చేసాడు.

5 చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు.

6 అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి.

7 ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు.

8 రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు.

9 అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి కాగితంపై సంతకం పెట్టాడు.

10 దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.

11 అప్పుడు ఆ మనుష్యులు ఒక బృందంగా వెళ్లి దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సహాయం కోరుతున్నట్లు వారు కనుగొన్నారు. అందువల్ల వారు బృందంగా రాజు వదకు వెళ్లి, రాజు చేసిన చట్టం గురించి వారతనితో మాట్లాడారు.

12 వారు, “దర్యావేషు రాజా, మీరొక చట్టం జారీ చేశారు. దాని ప్రకారం వచ్చే ముఫ్పై రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని కాక ఇతర దేవుణ్ణి గాని వ్యక్తిని గాని ప్రార్థించినట్లయితే, అతను సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు. ఆ చట్టం మీద నీవు సంతకం చేశావు. అవును గదా” అని జ్ఞాపకం చేశారు. “అవును, నేను ఆ చట్టం మీద సంతకం చేసి మాదీయుల, పారసీకుల చట్టాలు రద్దు చేయరానివి లేక మార్చరానివి” అని ప్రకటించానని రాజు బదులు చెప్పాడు.

13 అప్పుడు ఆ మనుష్యులు రాజుతో, “యూదా నుంచి తీసుకొని రాబడిన బందీలలో దానియేలు అనబడే ఆ వ్యక్తి మీ మాటలపట్ల శ్రద్ధ వహించ లేదు. మీరు చేసిన చట్టాన్ని పాటించ లేదు. ప్రతిరోజూ అతనింకా మూడుసార్లు తన దేవుని స్తుతిస్తున్నాడు” అని చెప్పారు.

14 ఇది వినగానే రాజు చాలా విచారించి, దానియేలును రక్షించడానికి నిశ్చయించాడు. దానియేలును కాపాడేందుకు సూర్యాస్తమయం వరకు ఒక ఉపాయం కోసం రాజు ప్రయత్నించాడు, కాని ప్రయోజనం లేకపోయింది.

15 తర్వాత ఆ మనుష్యులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు రద్దు చేయుటకు వీలులేదు” అని వారు చెప్పారు.

16 అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొని వచ్చి సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నాను.”

17 ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు.

18 తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని అదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు.

19 ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు.

20 రాజు చింతాక్రాంతుడుగా సింహాల గుహవద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు దేవుని సేవకుడవైన దానియేలూ, నీవెప్పుడూ ఆరాధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడగలిగెనా?”

21 “రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి!

22 నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూకను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాల నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు”అని దానియేలు బదులు చెప్పాడు.

23 దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దానియేలుని పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరగలేదు.

24 తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపడానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసురురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని విరుగగొట్టాయి.

25 తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు మాట్లాడే ఆ మనుష్యులకందరికీ రాజైన దర్వావేషు ఈ క్రింది లేఖను వ్రాశాడు: అందురికి శుభమగు గాక!

26 నేనిప్పుడు క్రొత్త చట్టం చేస్తున్నాను. నా రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తిస్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి భయపడి వణకాలి. దానియేలు దేవుడే సజీవుడు. ఆయన ఎప్పుడూ జీవిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు, ఆయన పరిపాలన అంతం కాదు.

27 దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోక మందునూ, భూమి మీదనూ చేస్తాడు. దేవుడు దానియేలును సింహాలనుండి రక్షించాడు.

28 అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనూ, పారశీకుడైన కోరెషు రాజుగావున్న కాలంలోనూ దానియేలు అభివృద్ధి చెందాడు.

7

1 బెల్షెస్సరు బబులోనుకు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు ఈ దర్శనాలు చూశాడు. అప్పుడతను తన పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విషయాల్ని దానియేలు వ్రాసాడు.

2 దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపుల నుండి గాలి వీచింది. ఆ గాలులక సముద్రం అల్లకల్లోలంగా ఉండింది.

3 నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా వున్నాయి. ఆ నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి.

4 “మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి ఎత్తబడి మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది.

5 ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని చూశాను. ఇది ఎలుగుబంటివలె కనిపించింది. ఒక వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పళ్ల సందున మూడు ప్రక్క ఎముకలున్నాయి. పైకి లేచి, నీకు కావలసినంత మాంసం తిను” అని దానికి చెప్పబడింది.

6 “తర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దానివీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది.

7 “ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కని పించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. ఈ మృగం ముక్కలుగా చీల్చి మ్రింగుచూ మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె ఈ నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి.

8 “ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికి వేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.

9 “నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి. మరియు ప్రాచీన రాజు తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను, ఆయన తల వెంట్రుకలు స్వచ్చమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి. ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను, ఆ సింహాసనపు చక్రాలు మంటల తోను మండుచున్నవి.

10 ఆయన ఎదుట నుండి అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది. కోట్లకొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు. తీర్పుకై ఆయన న్యాయసభకు కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి.

11 “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్ధం విని అటు చూశాను. నేను చూస్తుండగా ఆ నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశలం చేయబడింది.

12 మిగిలిన మృగాల అధికారం వాటినుండి తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి ఉండడానికి అనుమతి ఇవ్వబడింది.

13 “రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు వద్దకు వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు.

14 “మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందును బట్టి ప్రజలందరు, దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది.

15 “దానియేలు అను నేను నా ఆత్మలో చింతించాను. నేను చూసిన దర్శనాలు నన్ను కలవరబెట్టాయి.

16 అక్కడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా ఏమిటని నేను అతన్ని అడిగాను.

17 అందువల్ల, అతను వాటి అర్థాలేమిటో వివరించి చెప్పాడు, ‘నాలుగు మృగాలు నాలుగు రాజ్యాలు. ఆ నాలుగు రాజ్యాలు భూమిమీద ఉద్భవిస్తాయి.

18 కాని మహోన్నతుడైన దేవుని ప్రత్యేక జనులే ఆ రాజ్యాన్ని పొందుతారు. వారా రాజ్యాన్ని ఎల్లప్పుడూ కలిగియుంటారు.’

19 “తర్వాత ఆ నాలుగవ మృగం దాని అర్థం తెలుసుకోదలచాను. మిగిలిన మృగం భిన్నమైంది, మహా భయంకరంగా ఉండిది. దానికి ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల క్రింద త్రొక్కి వేసింది.

20 నాలుగవ మృగం తలమీదవున్న పది కొమ్ములు గురించి తెలుసు కోవాలను కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని చిన్న కొమ్ము పెరికివేసింది. ఇతర కొమ్ముల కంటె చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది మానవ కన్నుల లాంటి కన్నులు కలిగియుండినది. అది డంబములు పలుకుతూనే ఉండినది.

21 నేనది గమనిస్తూండగా, ఈ చిన్న కిమ్ము దేవుని ప్రత్యేక జనుల్ని ఎదిరించి వారితో యుద్ధం చేయసాగింది.

22 మరియు ఆ కొమ్ము వారిని చంపుతూ ఉండెను. ప్రాచీన రాజు వచ్చి, న్యాయవిచారణ చేసేంతవరకు అది దేవుని ప్రత్యేక జనుల్ని చంపుచుండెను. ప్రాచీన రాజు చిన్న కొమ్ముని గురించి తీర్పు ప్రకటించాడు. ఆ తీర్పు దేవుని ప్రత్యేక జనులకు సహాయము చేసింది. మరియు వారు రాజ్యమును స్వీకరించే సమయము వచ్చింది.

23 “అతను నాకిది వివరించాడు: ‘ భూమిమీద అవ తరించి నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణిచివేస్తుంది.

24 ఈ నాలుగవ రాజ్యం నుండి వచ్చే పదిమంది రాజులే పది కొమ్ములు. ఆ పదిమంది రాజులు పొయిన తర్వాత, మరొక రాజు వస్తాడు. తనకు పూర్వం పరిపాలించిన రాజులకంటె ఈ రాజు భిన్నంగా ఉంటాడు. ఇతర ముగ్గరు రాజుల్ని అతను జయిస్తాడు.

25 ఈ ప్రత్యేక రాజు సర్వోన్నతుడైన ఆ దేవునికి విరుద్ధంగా మాట్లాడు తాడు. ఆ రాజు దేవుని ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు పూర్వమే వున్న సమయాలను చట్టాలను మార్చివేయడానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు ఆ రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరాలుంటారు.

26 “కాని ఏమి జరగవలెనో, (దేవుని) న్యాయ స్థానమే నిర్ణయిస్తుంది. మరియు ఆ రాజుయొక్క అధికారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూలంగా నాశనమవుతుంది.

27 తర్వాత దేవుని ప్రత్యేక జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద సర్వరాజ్యాలను పాలిస్తారు. ఈ రాజ్యం ఎన్నటికీ ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని గౌరవిస్తారు, సేవిస్తారు.’

28 [This verse may not be a part of this translation]

8

1 బెల్షస్సరు రాజుగా ఉన్న మూడవ సంవత్సరంలో, నాకు ఈ దర్శనము కనిపించింది. ఇది మొదటి దర్శనానికి తర్వాత వచ్చింది.

2 ఆ దర్శనంలో నేను షూషనులో ఉన్నట్లు చూశాను. ఏలాం రాష్ట్రంలో షూషను ఒక రాజధాని నగరం. నేను ఊలయి నది ప్రక్క నిలబడి ఉన్నాను.

3 నా కన్నులెత్తి ఊలయి నదికి ప్రక్కగా ఒక పొట్టేలు నిలబడి ఉండడం చూశాను. ఆ పొట్టేలుకి రెండు పొడుగాటి కొమ్ములుండెను. కాని ఒకటి మరొకదాని కంటె పొడుగైనది. పొడుగాటి కొమ్ము తర్వాత పుట్టింది.

4 ఆ కొమ్ములతో పొట్టేలు పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. ఏ మృగమూ పొట్టేలుని ఎదురించలేక పోయింది. మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత మయింది.

5 నేను ఆ పొట్టేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మేకపోతు పడమర నుండి రావడం చూశాను. అది భూమి అంతటా చుట్టి వచ్చింది. దాని కాళ్లు భూమిని కూడా తాకలేదు. ఈ వేకపోతుకు ఒక పెద్ద కొమ్ము దాని కళ్ల మధ్యన ఉంది.

6 ఆ మేకపోతు ఊలయి నదికి ప్రక్కగా నిలబడివున్న రెండు కొమ్ములు గల పొట్టేలు వద్దకు వచ్చింది. మేకపోతు చాలా కోపంగా ఉంది.

7 మేకపోతు పొట్టేలువైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొట్టేలు ఎదిరించలేకపోయింది. మేకపోతు పొట్టేలుని నేలకు పడవేసి దాన్ని త్రొక్కివేసింది. ఆ మేకపోతు నుండి పొట్టేలుని కాపాడగలిగిన వారెవ్వరూ లేకపోయిరి.

8 అందువల్ల మేకపోతు చాలా బలంగా పెరిగింది. కాని అది శక్తివంతంగా వున్నప్పుడు, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. తర్వాత ఆ పెద్ద కొమ్ము స్థానంలో నాలుగు వేరే కొమ్ములు మొలిచాయి. ఆ నాలుగు కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులలో పెరిగాయి.

9 తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదాని నుండి ఒక చిన్న కొమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం దిక్కుగా పెరిగింది.

10 ఆ చిన్నకొమ్ము బాగా పెద్దదయి ఆకాశాన్ని అంటేంత వరకు పెరిగింది. అది నక్షత్రాల్ని కూడా క్రిందికి త్రోసి కాళ్ల క్రింద త్రొక్కి వేసింది.

11 ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధి పతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది.

12 తిరుగుబాటు జరిగినందున (పరిశుద్ధుల) సైన్యం మరియు అనుదిన బలి దాని వశం చేయ బడ్డాయి. సత్యం నేలకు అణచి వేయబడింది. చేసిన ప్రతి దానిలో అది బాగా అభివృద్ధి చెందింది.

13 అంతట ఒక పరిశుద్ధుడు మాట్లాడటం విన్నాను. ఇంకొక పరిశుద్ధుడు మొదటి వానిని ఇలా అడిగాడు: “ఈ దర్శనం నెరవేరటానికి ఎంత కాలం పడుతుంది? అనుదిన బలిని గూర్చిన దర్శనం, నాశనం కలిగించు తిరుగుబాటు, పరిశుద్ధ స్థలం మరియు పరిశుద్ధుల సైన్యం కాళ్ల క్రింద త్రొక్కబడటం ఇవన్నియు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?”

14 అతడు నాతో ఇలా అన్నాడు: “దానికి రెండువేల మూడువందల రోజులు పడుతాయి. అప్పుడు పవిత్ర స్థలం తిరిగి పరిశుద్ధం చేయబడుతుంది.”

15 దానియేలు అను నేను ఈ దర్శనం చూశాను. అది యేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూండగా మానవుని వంటి ఒకతను నా ఎదుట నిలిచాడు.

16 తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీది నుంచి వినవచ్చింది, “గాబ్రియేలూ, ఈ దర్శనమును ఈ వ్యక్తికి వివరింపుము.”

17 నేను నిలుచుండిన స్థలానికి గాబ్రియేలు రాగా నేను భయభ్రాంతుడనై నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రియేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం అంత్యకాలానికి సంబంధించిందని తెలుసు కొనుము” అని చెప్పాడు.

18 గాబ్రియేలు దూత నాతో మాటలాడుతూ ఉండగా, నేను నేలమీద సాష్టాంగపడి, గాఢనిద్ర పోయాను. అప్పుడు అతను నన్ను తాకి పైకి లేవనెత్తాడు.

19 గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు:”శ్రమకాలపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు చెపుతాను. ఈ దర్శనం నియమించబడిన అంత్యకాలానికి సంబంధించింది” అని అన్నాడు.

20 “రెండు కొమ్ములు గల పొట్టేలును నీవు చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీన దేశాలు.

21 బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు, దాని కళ్ల మధ్యవున్న పెద్ద కొమ్ము మొదటి రాజు.

22 ఆ కొమ్ము విరిగి పోయింది. ఆ స్థానంలో నాలుగు కొమ్ములు మొలిచాయి. ఆ కొమ్ములు మొదటి రాజు సామ్రాజ్యంనుంచి చీలిన నాలుగు రాజ్యాలు. కాని ఆ నాలుగు రాజ్యాలు మొదటి రాజువలె బలిష్ఠంగా ఉండవు.

23 “ఆ రాజ్యాలకు అంతం సమిపించే సమయాన, వారి దుష్టత్వం నిండినప్పుడు, మొండితనపు ముఖముగలిగి జిత్తులమారి అయిన ఒక రాజు లేస్తాడు. ఈ రాజు తన శక్తి వల్ల కాకుండానే మహా శక్తిమంతుడవుతాడు.

24 ఇతడు భయంకరమైన నాశనాన్ని తెస్తాడు. ఇతడు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. అతను శక్తిమంతులైన మనుష్యుల్ని చివరికి దేవుని ప్రత్యేక జనుల్ని కూడా నాశనం చేస్తాడు.

25 ఈ రాజు చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి ఉపయోగించి, వంచనతో గెలుపొందుతారు. తాను అతి ముఖ్యుడనని భావిస్తాడు. ప్రజలు క్షేమంగా ఉన్నా మని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజధి రాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు.

26 “ఆ కాలాన్ని గురించి నీకివ్వబడిన దర్శనం నిజమైంది. కాని ఆ దర్శనానికి ముద్ర వేయి. ఎందుకనగా అది అంత్యకాల సంబంధమైనది.”

27 దానియేలు అను నేను అలసిపోయి చాలా రోజలు జబ్బు పడ్డాను. రాజుకు పనిచేసే నిమిత్తం నేను మరల లేచి వెళ్ళాను. కాని నేను ఆ దర్శనాన్ని తలంచుకుని కలతచెందాను. కాని దాని అర్థమేమిటో నాకు తెలియలేదు.

9

1 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడగు దర్వావేషు బబులోను రాజ్యానికి రాజైన మొదటి సంవత్సరంలో జరిగిన సంగతి ఇది.

2 దర్వావేషు రాజుగా ఉండిన మొదటి సంవత్సరంలో, దానియేలు అను నేను, దేవుని ప్రవక్త అయిన యిర్మియా ద్వారా వ్రాయించిన సంగతిని గ్రహించాను. ఏమనగా యెరూషలేము డెబ్బై సంవత్సరాలు పాడుబడినదిగా ఉండవలసిన సమయము పూర్తి అవుతూందని గ్రహించాను.

3 తర్వాత నేను గోనెపట్ట ధరించి, బూడిదలో కూర్చుని ఉపవాస ముండి నా ప్రభువైన దేవునికి నా మనవిని ప్రార్థన విజ్ఞాపన ద్వారా తెలియ పర్చుకొన్నాను.

4 నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి నా పాపములన్నిటినీ ఒప్పు కొన్నాను. “ప్రభువా! నీవు భయంకరుడవైన మహా దేవుడవు. నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలకు లోబడే ప్రజల పట్ల నీ ఒడంబడికను నెరవేరుస్తావు.

5 “ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం.

6 ప్రవక్తలు నీ తరపున మా రాజులతోను, నాయకులతోను, మా తండ్రులతోను, దేశంలోని ప్రజలందరితో మాట్లాడారు. మేము నీ సేవకులైన ప్రవక్తల మాటలు వినలేదు.

7 “ప్రభువా, నీపు నీతిమంతుడవు. మేము అనగా యూదా, యెరూషలేము ప్రజలు, మా పితరులు నీకు ద్రోహము చేసిన కారణాన దూర, సమీప దేశాలకు చెదర గొట్టబడిన ఇశ్రాయేలు వారమైన మేము ఈ దినాన సిగ్గు పడవలసిన వారమైయున్నాము.

8 “ప్రభువా! మా రాజులు, నాయకులు, మా పూర్వీకులు నీకు విరోధంగా పాపం చేసినందువల్ల మేము సిగ్గుపడ వలసిన వారమైతిమి.

9 [This verse may not be a part of this translation]

10 మేము మా దేవుడైన యెహోవా మాటలు పాటించలేదు. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా మాకు ప్రసాదించిన ఆ చట్టాలను అతిక్రమించాము.

11 ఇశ్రాయేలు ప్రజలు నీ బోధనలకు విధేయులు కాకుండా వారందరూ నీకు విముఖులయ్యారు. దేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన శాపాలు, ప్రమాణాలు మా మీద క్రుమ్మరించ బడ్డాయి. ఎందుకంటే మేము నీ ఎడల పాపం చేశాము

12 “దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా ఎడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహావిపత్తును యెరూషలేము ఎడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు.

13 ఆ భయంకర విషయములన్నీ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగానే మా మీద జరిగాయి. మేము మా పాపాలు మాని, అయన సత్యాన్ననుసరించి నడుచుకొని, ప్రభువు దయను పొందేటట్లు ప్రయత్నించలేదు.

14 ప్రభువు మా మీద నాశనాన్ని రప్పించటానికి వెను కాడలేదు. ఎందుకంటే మా దేవుడైన ప్రభువు ఈ కార్యాలన్నిటిలో నీతిమంతుడు. కాని మేము ఆయనకు విధేయులం కాలేదు.

15 “మా దేవుడవైన యెహోవా, నీవు నీ మహాశక్తివల్ల నీ ప్రజల్ని ఈజిప్టునుండి వెలుపలికి తెచ్చావు. అందు వలననే నీవీ నాటికినీ నీ నామాన్ని గొప్పదిగా చేశావు. కాని మేము చెడుగా ప్రవర్తించి పాపం చేశాము.

16 దేవా, నీ నీతి క్రియలను దృష్టిలో సుంచుకొని, పరిశుద్ధ పట్టణం పట్ల, యెరూషలేం పట్ల నీ కోపాన్ని మానుము. మా పాపాల వల్ల, మా పూర్వీకుల అపరాధాల వల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి మధ్యలో అవమానం పాలైరి.

17 కాబట్టి మా దేవా! ఇప్పుడు, నీ సేవకుడనైన నా ప్రార్థన, మనవి ఆలకించుము. నీ నామం కొరకు, ప్రభువా! నీ ముఖకాంతి పాడుబడిన పరిశుద్ధ స్థలం మీద ప్రకాశించుగాక!

18 నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన మా పైన, నీ పేరు పెట్టబడిన నగరము పైన నీ దృష్టినుంచుము. మేము నీతి మంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము.

19 ప్రభువా! నా మొర ఆలకింపుము. ప్రభువా మమ్ము మన్నించుము. ప్రభువా, మా ప్రార్థన విని, సహాయం చేయుము. నా దేవా! ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించియున్నారు.”

20 నేనింకా మాట్లాడుచూ, ప్రార్థిస్తూ, నా పాపాన్ని గురించి, ఇశ్రాయేలు పాపాలను గురించి ఒప్పుకుంటూ ఉంటిని. నా దేవుని పరిశుద్ధ పర్వతాన్ని గురించి ప్రభువైన నా దేవునికి ప్రార్థిస్తూ ఉంటిని.

21 నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా దర్శనంలో ఇంతకు ముందు నేను చూసిన గాబ్రియేలు దూత త్వరగా సాయంకాలపు బలియర్పణ సమయాన వచ్చాడు.

22 అతడు వచ్చినాతో ఇలా చెప్పాడు: “దానియేలూ, నేను నీకు వివేకము, గ్రహింపు ఇవ్వడానికి వచ్చాను.

23 నీవు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టినప్పుడు దాని సమాధానం నాకు యివ్వబడింది. దాన్ని నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నీవు దేవునికి ప్రియమైన వాడవు. కాబట్టి నా మాట విని దర్శనాన్ని అర్థము చేసికొనుము.

24 “నీ ప్రరజలకు నీ పవిత్ర నగరానికి డెబ్బై వారాల గడువు ఇవ్వబడింది: అనగా అతిక్రమాన్ని ముగించటానికి, పాపాన్ని అంతం చేయటానికి, అపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి, నీతిని శాశ్వతంగా తేవటానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించటానికి మరియు పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటానికి డెబ్బై వారాలు పడుతుంది.

25 “కాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించు కొనుము - యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం బయలు వెళ్లిన సమయంనుండి, అభిషేకింప బడిన రాజు వచ్చేవరకు ఏడు వారాలు అవుతుంది. అరవైరెండు వారాలలో యెరూషలేము రాజవీధులతోను, కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట సమయాల్లో అది కట్టబడుతుంది.

26 అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు చంప బడుతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి.

27 “ఒక వారంపాటు రాబోయే రాజు చాలామందితో ఒక స్థిరమైన ఒప్పందం చేస్తాడు. అర్దవారం బలి అర్పణలు నిలుపు చేస్తాడు. అసహ్య కార్యాలు జరిగించే (దేవాలయములో) నాశనకారుడు ఒకడు వస్తాడు. ఆజ్ఞా పించబడిన అంతము ఈ నాశనకారుని మీద క్రుమ్మరించ బడేవరకు ఈ విధముగా జరుగుతుంది”

10

1 పారసీక రాజగు కోరషు పాలన మూడవ సంవత్సరంలో, బెల్తెషాజరు అను ఒక విషయం దానియేలుకు తెలియపర్చబడింది. అది యుద్ధమును గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియేలుకు బయలుపడింది గనుక అతడు గ్రహించాడు.

2 “ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను.

3 ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు.

4 “ మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది అయిన టెగ్రిసు (హిద్దెకెలు) నది గట్టుమీద నేను నిలబడి ఉన్నాను.

5 నేనక్కడ నిలబడి కన్నులెత్తి చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టలు ధరించుకొని, నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని యున్నాడు.

6 ఆయన శరీరం గోమేధికం వలె పసుపు గాను, ముఖం మెరుపులవె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాల వలె కనిపించాని. చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్ధం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి.

7 “దానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం చూశాను. నా వెంట నున్న మనుష్యులు ఆ దర్శనం చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారిపోయి దాగుకొన్నారు.

8 అందువల్ల నేను ఒంటరి వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము లేనివాడనయ్యాను. మృతుడైన వాని ముఖంవలె నా ముఖం పాలిపోయి బలం లేని వాడనయ్యాను.

9 దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. ఆయన మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన వాడనె నేలమీద సాష్టాంగ పడ్డాను.

10 “అప్పుడు ఒక చెయ్యి నన్ను తాకి, వణుకుచున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను నిలువ బెట్టింది.

11 అతడు నాతో, ‘బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువ బడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను’ అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను.

12 అప్పుడు అతడు నాతో, ‘దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థింస్తూన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను.

13 పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను.

14 అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది’ అని చెప్పాడు.

15 “ అతడు అలా మాటలాడుతూ ఉండగా, నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉంటిని.

16 మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, ‘అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది బలము లేని వాడనయ్యాను.

17 అయ్యా! నీ సేవకుడనైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలంపోయింది. నాకు ఊపిరి ఆడనట్లయింది’ అని అన్నాను.

18 “మానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను ముట్టి, బలపరిచాడు.

19 అతడు నాతో, ‘బహు ప్రాయుడవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు’ అని అన్నాడు. అతడు మాటలాడగానే నేను బలం పొంది ఇలాగన్నాను: ‘అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.’

20 “అప్పుడు అతను, ‘ దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు.

21 సత్య గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది నేను నీకు చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు.

11

1 మాదీయుడైన దర్యావేషు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, నేను మిఖాయేలుకు తోడుగా నిలుబడ్డాను.

2 “‘ దానియేలూ! ఇప్పుడు నేను నీకు నిజం వివరిస్తాను, మరి ముగ్గురు రాజులు పారసీకలో రాజ్యం చేస్తారు. తర్వాత నాలుగవ రాజు వస్తాడు. తనకంటె ముందున్న ఇతర పారసీక రాజులకంటె, ఆ నాలుగవ రాజు ఐశ్వర్యవంతుడై, గొప్పవాడై వుంటాడు. అతడు గ్రీకు రాజ్యానికి విరోధంగా అందర్ని పురికొల్పుతాడు.

3 తర్వాత శక్తిమంతుడైన గొప్పరాజు ఒకడు వస్తాడు. అతను ఎక్కువ అధికారం కలిగి తన ఇష్టానుసారంగా చేస్తాడు.

4 అతడు అభివృద్ధి పొందుచూ ఉండగా అతని రాజ్యము ముక్కలుగా విరిగి ఆకాశపు నాలుగు దిక్కులకు విభాగమవుతుంది. అతని రాజ్యం అతని పిల్లలకు గాని మనుమలకి గాని విభాగితం కాదు. అతని రాజ్యానికి అతను పాలించిన నాటి శక్తి వుండదు. ఎందుకనగా అతని రాజ్యం లాగివేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.

5 “‘దక్షిణ రాజు బలవంతుడవుతాడు. కాని అతని రాజుల్లో ఒకడు అతనికంటె బలవంతుడౌతాడు, మరియు ఇతని రాజ్యం గొప్పదవుతుంది.

6 “‘కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరు రాజులు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దక్షిణ రాజు యొక్క కుమారై ఉత్తర రాజు యొద్ద ఒప్పందం చేసు కోటానికి వస్తుంది. కాని ఆమె తన బలాన్ని నిలుపుకోదు. అతడు త న మాటను, బలాన్ని నిలుపుకోడు. కాని, ఆమెను, ఆమెను తెచ్చిన వారిని, ఆమెను కన్న వారిని, ఆమెను బలపరచిన వారిని, ఆ సమయాల్లో విడిచిపెడతారు.

7 “‘కాని ఆమె కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దక్షిణ రాజు యొక్క స్థానం ఆక్రమించడానికి వస్తాడు. అతడు ఉత్తర రాజు సైన్యాలను ఎదిరించి ఆ రాజు యొక్క బలమైన దుర్గంలోకి ప్రవేశిస్తాడు. అతను యుద్ధం చేసి జయిస్తాడు.

8 అతను దేవతా ప్రతిమల్ని, లోహ విగ్రహాల్ని, వెండి బంగారాలతో చేయబడిన విలువగల వస్తువుల్ని ఉజిప్టుకి తీసుకు వెళతాడు. ఆ తర్వాత అతను కొన్ని సంవత్సరాల పాటు ఉత్తర రాజును ఎదిరించడు.

9 ఉత్తర రాజు రాజ్యాన్ని ఎదుర్కొని తర్వాత తన దేశానికి మరలిపోతాడు.

10 “‘ ఉత్తర రాజు కుమారులు యుద్ధ సన్నద్ధులై ఒక పెద్ద పైన్యాన్ని సమకూర్చుతారు. ఆ సైన్యం ఆ ప్రదేశంగుండా గొప్ప ప్రవాహంవలె దక్షిణ రాజు యొక్క బలమైన దుర్గం వరకు యుద్ధం సాగిస్తుంది.

11 అప్పుడు దక్షిణ రాజు మహోగ్రడై ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు పెద్ద సైన్యంతో ఎదిరిస్తాడు కాని ఆ సైన్యం దక్షిణ రాజు వశమవుతుంది.

12 ఉత్తర సైన్యం ఓడిపోయి తీసుకొని పోబడుతుంది. దక్షిణ రాజు గర్విష్ఠి అవుతాడు. ఉత్తర సైన్యంలో వేలాది సైనికుల్ని హతమార్చుతాడు. కాని అతని విజయం కొనసాగదు.

13 ఉత్తర రాజు మరో సైన్యం సమకూర్చు కుంటాడు. ఆ సైన్యం మొదటి సైన్యం కంటె చాలా పెద్దది. చాలా సంవత్సరాల తర్వాత, అతను ఈ పెద్ద సైన్యాన్ని చాలా ఆయుధాల్ని సిద్ధం చేసికొని యుద్ధానికి వెళతాడు.

14 “‘ఆ రోజుల్లో దక్షిణ రాజుకి చాలామంది వ్యతిరేకులై ఉంటారు. దర్శన నెరవేర్పుగా నీ ప్రజల్లో తిరుగుబాటుదారులు ఎదురు తిరుగుతారు గాని ఓడి పోతారు.

15 తర్వాత ఉత్తర రాజు వచ్చి గోడలకు ముట్టడి దిబ్బలు కట్టి ఒక దృఢమయిన నగరాన్ని ఆక్రమిస్తాడు. దక్షిణ సైన్యానికి మరల యుద్ధం చేయడానికి శక్తి ఉండదు. దక్షిణ సైన్యానికి చెందిన ఉత్తమ సైనికులు కూడా ఉత్తర సైన్యాన్ని ఆపలేక పోతారు.

16 “‘ తన ఇష్టము వచ్చినట్లు ఉత్తర రాజు చేస్తాడు. ఎవ్వరూ అతనిని విరోధించలేరు. అతను అధికారం పొంది, సుందర దేశాన్ని అదుపులో ఉంచుకొంటాడు. మరిము అతనికి దాన్ని నాశనం చేసే శక్తికూడా ఉంటుంది.

17 ఉత్తర రాజు తన సర్వ సైనిక బలంతో వచ్చి దక్షిణ రాజులో ఒప్పందం చేసుకోటానికి నిర్ణయిస్తాడు. ఉత్తర రాజు దక్షిణ రాజుకు పెళ్లి చేసుకునేందుకు తన కుమార్తెలలో ఒకదానిని అనుమతిస్తాడు, ఎందుకంటే దక్షిణ రాజుని ఓడించాలని. కాని ఆ పథకాలు నెరవేరవు, అతనికి తోడ్పడవు.

18 “‘అప్పుడు ఉత్తర రాజు తన దృష్టిని సముద్ర తీరాననున్న దేశాల మీదికి మరల్చుతాడు, పెక్కు నగరాల్ని జయిస్తాడు. కాని తర్వాత ఒక సైన్యాధిపతి ఉత్తర రాజు యొక్క తిరుగుబాటుని, అతని గర్వాన్ని అణచి అతడు సిగ్గుచెందేలా చేస్తాడు.

19 “‘అది జరిగిన తర్వాత, ఉత్తర రాజు తన స్వదేశంలోని బలమైన దుర్గాలకు తిరిగి వెళతాడు. కాని అతను బలహీనుడై పతనం చెంది మరణము పాలవుతాడు.

20 “‘ ఆ ఉత్తర రాజు తర్వాత మరో క్రొత్త పరిపాలకుడు వస్తాడు. ఆ పరిపాలకుడు పన్నులు వసూలు చేసే అధికారిని రాజ వైభవం కోసం డబ్బు సంపాదించటానికి పంపుతాడు. కాని కొన్ని సంవత్సరాలలోనే, ఆ పరిపాలకుడు కోపము వల్లగాని, యుద్ధమువల్లగాని కాకుండ నాశనం చేయబడతాడు.

21 “‘ఆ పరిపాలకుని తర్వాత అతి క్రూరుడు, ద్వేషింపబడినవాడు అయిన ఒక వ్యక్తి వస్తాడు. రాజ వంశానికి చెందినవాడనే గౌరవం వానికి ఉండదు. మాయోపాయముచేత అతతడు పరిపాలకుడవుతాడు. ప్రజలు నెమ్మదిగా ఉన్న సమయాన, అతడు రాజ్యముమీద దాడి చేస్తాడు.

22 ప్రవాహంలాంటి ఆ సైన్యాలు వాని ఎదుటనుండి తుడిచి వేయబడును. ఒప్పందం కుదుర్చుకున్న రాజు కూడా నశిస్తాడు.

23 ఆ రాజుతో ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత మోసంగా ప్రవర్తించి, కొద్ది మందితోనే అతడు అధికారాన్ని పొందుతాడు.

24 సంవన్న దేశాలు నెమ్మదిగా ఉన్నప్పుడు, అతడు (క్రూరుడూ ద్వేషింపబడినవాడూ అయిన ఆ పరిపాలుకుడు) వాటిమీద దాడి చేస్తాడు. అతని తండ్రులుగాని, అతని పూర్వీకులుగాని చేయలేనిదాన్ని అతడు సాధిస్తాడు. దోపిడి, లూటి చేసి పొందిన సంపత్తును వాని అనుచరుల మధ్య పంచుతాడు. బలమైన కోటల్ని పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, గాని అది ఒక కాలము వరకు మాత్రమే.

25 “‘ దక్షిణ రాజుకు విరోధంగా గొప్ప సైన్యంతో తన బలాన్ని, ధైర్యాన్ని ఎక్కువ చేసుకొంటాడు. గొప్ప బలమైన సేనతో దక్షిణ రాజు యుద్ధానికి దిగుతాడు గాని, అతనికి వ్యతిరేకంగా శత్రువు పన్నిన పన్నాగాల వల్ల దక్షిణ రాజు ఓడిపోతాడు.

26 దక్షిణ రాజు భోజన పదార్థాలనుండి తినేవారే అతన్ని నాశనము చేయాలని ప్రయత్నిస్తారు. అతని సైన్యం ఓడించ బడుతుంది. యుద్ధంలో చాలామంది సైనికులు చంపబడుతారు.

27 ఆ రాజులిద్దరూ దురుద్దేశముతో ఒకే భోజన బల్లవద్ద కూర్చొని ఒకరికొకరు అబద్ధాలు చెప్పు కొంటారు. అందువల్ల వారిలో ఎవరికీ మంచి కలుగదు. ఎందుకంటే దేవుడు వారి అంతానికి ఒక కాలం నిర్ణయించాడు.

28 ఉత్తర రాజు అధిక సంపదతో తన దేశానికి తిరిగి వెళతాడు. కాని, పవిత్ర ఒడంబడికకు విరుద్ధంగా అతను తన హృదయాన్ని మార్చుకొంటాడు. తన ఇష్టానుసారంగా జరిగిస్తూ అతడు స్వదేశానికి మరలి పోతాడు.

29 “‘ నియమిత సమయాన, ఉత్తర రాజు దక్షిణ రాజు మీద మరల దాడి చేస్తాడు, కాని ఈ సారి, పూర్వంవలె అతడు గెలుపొందలేడు.

30 కిత్తీము నుండి ఓడలువచ్చి ఉత్తర రాజును ఎదిరిస్తాయి. ఆ ఓడలు రావటం చూసి. అతడు భయభ్రాంతుడవుతాడు. అప్పుడతను వెనుదిరిగి, పవిత్ర ఒడంబడిక పట్ల తన కోపాన్ని తీర్చుకొంటాడు. అతడు వెనక్కి తిరిగి పవిత్ర ఒడంబడికను విసర్జించే వాళ్ల మాట వింటాడు.

31 వానినుండి వచ్చిన సైన్యాలు కోటను, దేవాలయాన్ని అపవిత్ర పరచి, అనుదిన బలి అర్పణలను నిలుపు చేస్తాయి. వాళ్లు నాశనకరమైన ఆ అసహ్యమైన దాన్ని దేవాలయంలో నిలుపుతారు.

32 “‘ ఉత్తర రాజు పవిత్ర ఒడంబడికను అతిక్రమించిన వాళ్లను (యూదులు) తన ఇచ్ఛకపు మాటలచేత దుష్టత్యానికి మళ్లించుతాడు. కాని తమ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు స్థిరముగా నిలబడి అతనిని ఎదిరిస్తారు.

33 “‘ కొన్ని దినాలపాటు వారు ఖడ్గంతోను, అగ్నితోను, చెరసాల బంధనతోను, దోపుడుతోను హింసించబడ్డ, వారిలో జ్ఞానవంతులైన వారు అనేకులను సంగతులు అర్థము చేసికొనేటట్లు చేస్తారు.

34 జ్ఞాన వంతులైన ఆ యూదులు హింసించబడ్డ తర్వాత, వారికి కొద్దిపాటి సహాయం లభిస్తుంది. అనేకులు వారికి వారే జ్ఞానులైన యూదులతో ముఖస్తుతి చేస్తూ కలిసి పోతారు.

35 నియమితమైన అంత్య కాలం ఇంకను రాలేదు. ఆ అంత్యకాలం వరకు జ్ఞానుల్లో కొందరు కూలుట ద్వారా మిగిలిన వారు శుద్ధిగాను, నిర్మలులుగాను, పరిశుద్ధులుగాను చేయ బడటానికి ఇలాగున జరుగుతుంది.”‘

36 “‘ ఉత్తర రాజు తన ఇష్టానుసారముగా చేస్తాడు. ప్రతి దేవతకు పైగా తనకు తానే హెచ్చించుకొంటూ, ఘన పరచుకొంటాడు. అంతేకాక, దేవాది దేవునికి విరోధంగా విచిత్రమైన విషయాలు మాట్లాడుతాడు. ఉగ్రత తీరే వరకు వాడు వర్ధిల్లుతాడు. ఏది నిర్ణయమైందో అది వానికి జరుగుతుంది.

37 “‘ తన పూర్వీకుల పట్ల ఆ ఉత్తర రాజు శ్రద్ధ వహింపడు. స్త్రీల ఇష్ట దేవతల పట్ల కూడ లక్ష్యపెట్టడు. ఏ దేవుని గురించి అతడు లక్ష్యపెట్టడు. అన్ని దేవుళ్ల దేవతల కంటే తనను తాను హెచ్చించుకొంటాడు.

38 వీటన్నీటికి బదులుగా కోటల దేవతను గౌరవిస్తాడు. తన పూర్వీకులు ఎరుగని దేవతను బంగారు, వెండి, వెలగల రాళ్లు మరియు వెలగల బహుమానాలతో గౌరవిస్తాడు.

39 “‘ఆ ఉత్తర రాజు బలమైన కోటల మీదికి అన్యదేవుని సహాయంతో దాడి చేస్తాడు, తనను గుర్తించే వాళ్లను హెచ్చించి గౌరవిస్తాడు. వాళ్లను చాలా మంది ప్రజల మీద పరిపాలకులుగా ఉంచి, దేశాన్ని వెలకు విభాగిస్తాడు.

40 “‘ అంత్యకాలంలో, దక్షిణ రాజు ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు ఉగ్రుడై సుడిగాలి వలె దక్షిణ రాజు మీద రథాలు, గుర్రపు రౌతులు, అనేక ఓడలతో విరుచుకు పడుతాడు. అదే విధంగా దేశాల మీదికి ప్రవాహం వలె వెళతాడు.

41 అతడు మహిమాదేశం మీద కూడా దాడి చేస్తాడు. అనేక దేశాల్లో వేలాది మందిని పడగొడతాడు, కాని ఎదోము, మోయాబు, అమ్మోనీయల నాయకులు అతని చేతినుండి రక్షింపబడుతారు.

42 చాలా దేశాల్లో ఉత్తర రాజు తన అధికారాన్ని వ్యాపింప జేస్తాడు కాని ఈజిప్టు తప్పించుకోలేదు.

43 ఈజిప్టుకు చెందిన వెండి బంగారం సర్వ సంపదలకు అతడు అధిపతి అవుతాడు. లిబియావాళ్లు, కూషీయులు (ఇతియోపియా వాళ్లు) అతని ఎడల విధేయులై ఉంటారు.

44 కాని ఉత్తర రాజు తూర్పు, ఉత్తర దిశలనుంచి వచ్చిన సమాచారము తెలిసికొని. భయభ్రాంతుడై, మహోగ్రుడై చాలా మందిని సర్వ నాశనం చేయడానికి ముందుకు సాగుతాడు.

45 సుందరమైన పరిశుద్ధ పర్వతానికి సముద్రానికి మధ్య అతను రాజవైభవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి అతడు నిస్సహాయుడై మరణిస్తాడు.”‘

12

1 “ ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారి మీద కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు.

2 సమాధి చేయబడిన పెక్కుమంది మృతులు, మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, కొందరు సిగ్గుపొందటానికి, శాశ్వతంగా తిరస్కారం పొందటానికి మేల్కొంటారు.

3 జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగ ప్రకాశిస్తారు, అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్షత్రాల్లాగ శాశ్వతంగా వెలుగుతారు

4 “ కాని, దానియేలూ, నీవు, ఈ సందేశాన్ని రహస్యంగా ఉంచు. ఈ పుస్తకాన్ని నీవు అంత్యకాలం వరకు మూసి ఉంచు. చాలా మంది అటు ఇటు భూసంచారం చేయటంవల్ల తెలివి పెరుగుతుంది” అని గాబ్రియేలు నాతో చెప్పాడు.

5 “అప్పుడు దానియేలు అను నేను చూస్తూండగా ఇద్దరు మనుష్యులు కనబడ్డారు. నది ఈ ఒడ్డున ఒకడు నది ఆ ఒడ్డున మరియొకడు నిలబడి ఉన్నారు.

6 నార బట్టలు ధరించిన వ్యక్తి నదీ జలాల మీద ఉన్నాడు. ఆ ఇరువురిలో ఒకడు, ‘ఈ ఆశ్చర్య సంగతులు నెరవేరటా నికి ఎంతకాలము పడుతుంది?’ అని నార బట్టలు ధరించిన వాన్ని అడిగాడు.

7 “నార బట్టలు ధరించి నదీ జలాల మీదనున్న వ్యక్తి ఆకాశం వైపుగా తన కుడి, ఎడమ చేతులు ఎత్తి. సజీవుడైన దేవుని నామం మీద ప్రమాణం చేయుట నేను విన్నాను. ఏమనగా “ఒక కాలము, కాలములు, అర్ధకాలము (మూడున్నర సంవత్సరాలు) పడతాయి. పరిశుద్ధ ప్రజల బలం నాశనం చేయబడటం అంతం కాగానే ఈ సంగతులన్నీ నెరవేరుతాయి.

8 “నేను విన్నాను,స కాని అర్థము చేసుకోలేక పోయాను. అందువల్ల, ‘అయ్యా, ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమవుతుంది?” అని అడిగాను.

9 “అందుకతడు, ‘దానియేలూ! నీవు దాటిపొమ్ము. ఈ మాటలు అంత్యకాలం వరకు ముద్ర వేయబడి రహస్యంగా ఉంటాయి.

10 చాలామంది తమ్మును తాము పరిశుద్ధులుగా చేసికొంటారు. తమ్మును తాము తెలుపుగాను, శుద్ధులుగాను చేసికొంటారు. కాని చెడ్డవాళ్లు చెడ్డవాళ్లగానే ఉంటారు. ఆ దుర్జనులు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. కాని జ్ఞానవంతులు అర్థం చేసి కొంటారు.

11 “‘అనుదిన బలులు నిలిపివేసిన కాలం మొదలు కొని నాశనకరమైన అసహ్య వస్తువు నిలబెట్టబడిన కాలం వరకు ఒక వెయ్యి మూడువందల ముప్పయైదు రోడులు వేచియుండి ఆ దినముల అంతము వరకు ఉండువాడు ధన్యుడు.

12 “‘నీవు నీ జీవిత అంతం వరకు బ్రతికి, నీ విశ్రాంతిలో ప్రవేశించు. దినాల అంతమందు నీవు లేవబడి నీ స్థానములో నీవు నిలుస్తావు.”‘

13 [This verse may not be a part of this translation]