1

1 ఇవి యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి పేరు హిల్కీయా. అనాతోతు నగరంలో నివసించే యాజకుల కుటుంబానికి చెందిన వాడు యిర్మీయా. ఆ నగరం బెన్యామీను వంశానికి చెందిన వారి ప్రాంతంలో వుంది.

2 యూదా రాజ్యాన్ని యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీయాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా తండ్రి పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పదమూడవ సంవత్సరం జరుగుతూ ఉండగా యెహోవా యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు.

3 యెహోయాకీము యూదాకు రాజై యున్న కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి పేరు యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పదకొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. సిద్కియా కూడ యోషీయా కుమారుడే. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు బందీలుగా కొనపోబడ్డారు.

4 యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.

5 “నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే నిన్ను నేనెరిగియున్నాను. నీవు పుట్టకముందే నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను. దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”

6 అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడనైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.

7 కాని యెహోవా ఇలా అన్నాడు: “బాలుడనని అనవద్దు. నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.

8 ఎవ్వరికీ భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”. ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.

9 పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.

10 దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబు దారిలో ఉంచుతున్నాను. నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు. నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు. నీవు వాటని కట్టి నాటుతావు.”

11 యెహోవా యొక్క సందేశం నాకు చేరింది యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తూ ఉన్నావు?” అప్పుడు యెహోవాకు నేనిలా సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయబడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.”

12 “నీవు చాలా బాగా కనిపెట్టావు. నేను నీకిచ్చిన సందేశం నిజం కావాలని ఎదురు చూస్తున్నాను” అని యెహోవా అన్నాడు.

13 యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు?” “నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తున్నాను. ఆ కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని నేను యెహోవాకు చెప్పాను.

14 నాతో యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది. ఈ దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ ఆ విపత్తువస్తుంది.

15 అనతి కాలంలోనే ఉత్తర ప్రాంత సామ్రాజ్యాల ప్రజలందరికీ నేను పిలుపు యిస్తాను.” ఇది యెహోవా వాక్కు. “ఆయా రాజ్యాధినేతలు వస్తారు. యెరూషలేము ద్వారాల వద్ద వారు తమ సింహాసనాలను ప్రతిష్ఠించుతారు. యెరూషలేము నగర గోడలమీదికి దండెత్తి వస్తారు. యూదా రాజ్యంలోని అన్ని నగరాలపై వారు దండయాత్రలు చేస్తారు.

16 అప్పుడు నా ప్రజలపై నా తీర్పును ప్రకటిస్తాను. వారు చెడు నడతగల వారగుటచేతను, వారు నాపట్ల విముఖులైనందువల్లను నేనిది చేస్తున్నాను. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు. ఇతర దేవతలకు వారు బలులు అర్పించారు. వారి చేతితో వారు చేసిన బొమ్మలనే వారు ఆరాధించారు.

17 “యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు. ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు. నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి. ప్రజలకు నీవు భయపడవద్దు. నీవు ప్రజలకు భయపడితే, వారిముందు నీవు భయపడటానికి తగిన కారణం కల్పిస్తాను.

18 నేను మాత్రం ఈ రోజు నిన్నొక బలమైన నగరం మాదిరిగాను, ఒక ఇనుప స్థంభం వలెను, ఒక కంచుగోడ వలెను బలపరుస్తాను. దానివల్ల ఈ రాజ్యంలో ప్రతి వాని ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు. యూదా రాజుల ఎదుట, యూదా నాయకుల ఎదుట, యూదా యాజకుల ఎదుట, మరియు యూదా ప్రజల ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు.

19 వారంతా నిన్నెదిరిస్తారు; కాని నిన్ను ఓడించలేరు. ఎందుకంటె నేను నీతో ఉన్నాను; నేను నిన్ను ఆదుకుంటాను.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.

2

1 యెహోవా యొక్క వర్తమానం నాకు వినిపించింది. యెహోవా వాక్కు ఇలా వుంది:

2 “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ప్రజలతో మాట్లాడుము. నీవు ఇలా చెప్పాలి: “‘నీవొక చిన్న రాజ్యంగా ఉన్నప్పుడు నీవు నాకు విశ్వాసంగా ఉన్నావు. ఒక యౌవ్వన వధువులా నీవు నన్ననుసరించావు. ఎడారులలోను, సాగుచేయని బీడు భూములలోను నీవు నన్ను అనుసరించావు.

3 “ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఒక పవిత్రమైన బహుమానము: వారు యెహోవా ఏర్పచుకొన్న ప్రథమ ఫలం. ఇశ్రాయేలుకు హాని చేయబోయిన ప్రజలంతా దోషులుగా నిలిచారు. ఆ దుష్టులు అనేక కష్టనష్టాలకు గురవుతారు.”‘ ఇది యెహోవా వాక్కు.

4 యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి. ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి.

5 యెహోవా ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులపట్ల నేను ఉదారంగా ప్రవర్తించి యుండలేదా? అందుకేనా వారు నాపట్ల విముఖులై నారు? మీ పూర్వీకులు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. తద్వారా వారుకూడ పనికిమాలిన వారైనారు.

6 ‘మమ్మల్ని ఈజిప్టు నుండి విముక్తిచేసి తీసుకుని వచ్చిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మాకు ఎడారులలో మార్గదర్శి అయిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? మమ్మల్ని నిర్జల ప్రాంతాలలోను, కొండల్లో, కోనల్లో సురక్షితంగా నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎవరూ నివసించని గాఢాంధకారములోనూ, ప్రమాదకరమైన భూమియందు యెహోవా మమ్మును నడిపించాడు. ప్రజలు ఆ ప్రదేశం గుండా ప్రయాణించరు. కానీ యెహోవా మమ్మును దాని గుండా నడిపించాడు.’ మీ పూర్వీకులు ఈ విషయాలు మీకు చెప్పలేదు.”

7 ఒక మంచి, మరియు సారవంతమైన అనేక మంచి వస్తువులతో నిండివున్న రాజ్యానికి మిమ్మల్ని తీసుకొనివచ్చాను. మీరు ఆ ఫలాలను తినాలనీ, అక్కడ పండే ధాన్యాలను మీరు ఉత్పత్తి చేయాలనీ నేనలా చేశాను. కాని మీరు వచ్చినా దేశాన్ని అపవిత్ర పర్చారు. ఆ దేశాన్ని మీకు నేనిచ్చాను. అయితే మీరు దానిని చెడ్డ దేశంగా మార్చివేశారు.

8 “యెహోవా ఎక్కడ అని యాజకులు అడగలేదు. నా ఉపదేశాలను అనుసరించేవారు నన్ను తెలుసు కోవటానికి నిరాకరించారు. ఇశ్రాయేలు ప్రజానాయకులు నాకు వ్యతిరేకులయ్యారు. బూటకపు దేవతైన బయలు పేరిట ప్రవక్తలు ప్రవచనాలు చేశారు. వారు పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”

9 కావున మిమ్మల్ని, మీ పుత్ర పౌత్రులను నేను నిందిస్తున్నాను.

10 సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి వెళ్లి చూడండి. ఒకనిని కేదారు రాజ్యానికి పంపిశ్రద్ధగా పరిశీలించమనండి. అక్కడ ఎవరైనా ఈ రకంగా ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.

11 ఏ దేశవాసులైనా తమ పాత దేవుళ్లను కొత్త దేవుళ్లతో మార్చుకున్నారు? లేదు! (నిజానికి వారి దేవుళ్లు వాస్తవ దేవుళ్లు కానేకారు అయినను నా ప్రజలు తమ మహిమాన్వితుడైన దేవుని ఆరాధించటం మానుకొని పనికిమాలిన విగ్రహాలను పూజించటం ప్రారంభించారు అని యెహోవా అన్నాడు.

12 ఆకాశములారా, జరిగిన విషయాలకు విస్మయము చెందండి. భయకంపితులుకండి!” యెహోవా ఇలా చెప్పాడు.

13 నా ప్రజలు రెండు చెడు కార్యాలు చేశారు : వారు జీవజల (ఊటనైన) నన్ను విడిచేసారు పైగా వారు వారివారి తొట్లను తవ్వుకున్నారు. (వారు ఇతర దేవుళ్ళవైపు మొగ్గారు.) కాని వారి తొట్లు పగిలి పోయాయి. అవి నీటిని పట్టజాలవు.

14 “ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారు? వారు పుట్టుకతో బానిసలుగా తయారైనారా? ఇశ్రాయేలు ప్రజలను ఇతరులు ఎందుకు కొల్లగొడుతున్నారు?

15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి. సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ప్రజలు దేశాన్ని సింహాలు నాశనం చేశాయి. ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి. అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు.

16 మెమ్‌ఫిస్, తహపనేసు వీటినుండి వచ్చిన యోధులు నీ తల చితుకగొట్టారు.

17 ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం! చక్కని మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న మీ దేవుడైన యెహోవా నుండి మీరు తొలగిపోయారు

18 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి: ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా? నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది? లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది? యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.

19 మీరు చెడు పనులు చేశారు. మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి. మీకు కష్టాలు సంభవిస్తాయి. ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది. దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని! ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది.

20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు. నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు. ‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు. నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుకింద పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు .

21 యూదా, నిన్నొక మేలు రకం ద్రాక్షపాదువలెనాటాను. మీరంతా మేలురకం విత్తనాల్లా ఉన్నారు. కాని నాసిరకం పండ్లనిచ్చే వేరొక రకం ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు?

22 క్షారజలంతో స్నానం చేసుకున్నా, నీవు విస్తరించి సబ్బు వినియోగించినా నేను నీ దోష కళంకాన్ని చూడగలను.” ఈ వర్తమానం దేవుడైన యెహోవాది.

23 యూదా, ‘నేను దోషినికానని, బయలు విగ్రహాలను ఆరాధించలేదని’ నీ వెలా నాకు చెప్పగలవు? లోయలో నీవు చేసిన పనులు గూర్చి ఒకసారి ఆలోచించుకో. నీవు ఏమిచేశావో గుర్తుకు తెచ్చుకో. నీవొక వడిగల ఆడ ఒంటివలె ఒక చోటినుండి మరో చోటికి పరుగెత్తావు.

24 ఎడారిలో తిరిగే ఒక అడవి గాడిదలా నీవున్నావు. సంగమ సమయంలో అది గాలిని వాసనచూస్తూ తిరుగుతుంది. మిక్కిలి ఎదగొన్నప్పుడు దానిని ఎవ్వరూ వెనుకకు మరల్చలేరు. ఎదకాలంలో దానిని కోరే ప్రతీ మగజంతువూ దానిని పొందగలదు. అప్పుడు దానిని కనుగొనటం తేలిక.

25 యూదా, ఇక నీవు విగ్రహాలను అనుసరించటం మానాలి. ఇతర దేవుళ్ల కొరకు దాహాన్ని వదిలి పెట్టు. కానీ, ‘ లాభం లేదు! నేను వదల్లేను! నేను పరదేవుళ్లనే ప్రేమిస్తాను. నేను వాటినే ఆరాధిస్తాను’ అని నీవంటావు.

26 “ప్రజలు పట్టుకున్నప్పుడు దొంగ సిగ్గుపడతాడు అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలు అవమానం పాలవుతారు. ఇశ్రాయేలు రాజులు, ప్రజానాయకులు, యాజకులు, ప్రవక్తలు అందరూ సిగ్గుతో తలవంచుకుంటారు.

27 ఈ ప్రజలు కర్రముక్కలతో మాట్లాడతారు! దానితో ‘నీవే నా తండ్రివి’ అంటారు. ఈ ప్రజలు ఒక రాతి బండతో మాట్లాడతారు. దానితో, ‘నీవేమాకు జన్మనిచ్చావు’ అంటారు. ఆ ప్రజలంతా అవమానం పొందుతారు. ఆ ప్రజలు నావైపుకు చూడరు. వారు విముఖులైనాకు వెన్ను చూపుతారు. కాని యూదా ప్రజలు కష్టాల పాలైనప్పుడు,’వచ్చి, మమ్మును ఆదుకోమని!’ నన్నడుగుతారు.

28 ఆ విగ్రహాలనే వచ్చి మిమ్మును ఆదుకోనివ్వండి! మీకైమీరు చేసిన ఆ విగ్రహాలు ఎక్కడ వున్నాయి? మీకష్టకాలంలో ఆ విగ్రహాలు వచ్చి మిమ్మును ఆదుకుంటాయేమో చూద్దాము. యూదా ప్రజలారా, మీనగరాలెన్ని వున్నాయో మీ విగ్రహాలు కూడా అన్ని వున్నాయి!

29 “మీరు నాతో ఎందుకు వాదిస్తారు? మీరంతా నాకు వ్యతిరేకులయ్యారు.” ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినది.

30 “యూదా ప్రజలారా, నేను మిమ్మును శిక్షించాను. కాని అది పనిచేయలేదు. మిమ్మల్ని శిక్షించినప్పుడు కూడా మీరు వెనక్కి మరలలేదు. మీ వద్దకు వచ్చిన ప్రవక్తలను మీరు మీకత్తులతో చంపారు. మీరొక భయంకర సింహంలా ప్రవర్తించి వారిని సంహరించారు.”

31 ఈ తరం ప్రజలారా, యెహోవా వర్తమానం పట్ల శ్రద్ధవహించండి. “ఇశ్రాయేలు ప్రజలకు నేనొక ఎడారిలా ఉన్నానా? వారికి నేనొక అంధకారంతో నిండిన ప్రమాదకరమైన దేశంలా ఉన్నానా? ‘మేము మా యిష్టానుసారంగా నడవటానికి మాకు స్వేచ్ఛ ఉంది. యెహోవా, మేము తిరిగి నీ చెంతకు రాము,’ అని నా ప్రజలు అంటారు. కానీ, వారలా ఎందుకు మాట్లాడతారు?

32 ఏ కన్యకగాని తన నగలను మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! ఏ పెండ్లి కుమార్తెగాని తన దుస్తులకు ఒడ్డాణం మర్చిపోతుందా? లేదు. మర్చిపోదు! కాని నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు.

33 యూదా, ప్రేమికులను (బూటకపు దేవుళ్లను) వెంబడించటం నీకు బాగా తెలుసు. కావున దుష్టకార్యాలు చేయుట నీకై నీవే నేర్చుకున్నావు.

34 మీ చేతులు రక్తసిక్తమైనాయి! అది పేదవాళ్ల, అమాయకుల రక్తం. నిష్కారణముగా నీవు ప్రజలను చంపావు. కనీసం వారు నీవు పట్టుకున్న దొంగలైనా కారు. నీవటువంటి చెడ్డ పనులు చేస్తావు.

35 కాని, ‘నేను అమాయకుడను, దేవుడు నా ఎడల కోపంగా లేడు’ అని నీవు చెప్పుకుంటూ ఉంటావు. అందువల్ల నీవు అబద్ధం చెప్పిన నేరానికి కూడా నిన్ను దోషిగా నేను న్యాయ నిర్ణయం చేస్తాను, ఎందుకంటే ‘నేనేమీ పాపం చేయలేదు’ అని నీవంటున్నావు.

36 నీ మనస్సు మార్చుకోవటం నీకు చాలా సులభమైన పని! అష్షూరు నీకు ఆశాభంగం కలిగించింది. అందుచేత అష్షూరును వదిలి ఈజిప్టుకు వెళ్లి సహాయం అర్ధించినావు. ఈజిప్టు కూడా నీకు ఆశాభంగం కల్గిస్తుంది.

37 చివరకు నీవు ఈజిప్టును కూడా వదిలివేస్తావు. అవమానంతో నీవు నెత్తిన చేతులు పెట్టుకుంటావు. నీవు ఆ రాజ్యాలను నమ్మినావు. కాని ఆ రాజ్యాల సహకారంతో నీవేమీ సాధించలేవు. ఎందువల్లనంటే యెహోవా ఆ రాజ్యాలను తిరస్కరించాడు.

3

1 “ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిస్తే, ఆమె అతన్ని వదిలి వెళ్లి మరో వివాహం చేసికొంటే, ఆ వ్యక్తి మళ్లీ ఆమెవద్దకు తిరిగి రాగలడా? లేదు. రాలేడు! ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా ‘మాలిన్య’ మైపోతుంది. యూదా, నీవు అనేకమంది విటులతో (అబద్ధపు దేవుళ్లు) వట్టి వేశ్యవలె ప్రవర్తించావు. మరల నీవిప్పుడు నా వద్దకు రావాలని కోరుతున్నావా?” అని యెహోవా పలికాడు.

2 యూదా, దిశగా ఉన్న కొండ శిఖరాలను చూడు. నీవక్కడ తిరుగని చోటు ఉందా? నీవు బాట పక్కన విటుల (అబద్ధపు దేవుళ్ల) కోసం వేచివున్నావు. ఎడారిలో కూర్చున్న అరబీయునివలె నీవక్కడ కూర్చున్నావు. నీవు దేశాన్ని ‘అపవిత్రం’ చేశావు! ఏమైనంటావా? నీవు చాలా దుష్కార్యాలు చేశావు. నీవు నాకు విశ్వాసపాత్రంగా లేవు.

3 నీవు పాపం చేశావు. అందుచే వర్షాలు లేవు. వసంత కాలపు వానలూ లేవు. అయినా నీ ముఖ లక్షణాలు వేశ్యాలక్షణాల్లా ఉన్నాయి. నీ అకృత్యాలకు సిగ్గుపడటంకూడా మానివేశావు.

4 కాని నీవు నన్నిప్పుడు పిలుస్తున్నావు. ‘నా తండ్రీ’ నా బాల్యంనుండి ‘నీవు నాకు ప్రియ మిత్రునిలా ఉన్నావు.’

5 ‘దేవుడు నా పట్ల ఎల్లప్పుడూ కోపంగా ఉండడు. దేవుని కోపం అల్పమైనది. అది శాశ్వతంగా ఉండదు’ అని అంటున్నావు. “యూదా, నీవీ విషయాలు అంటూనే నీవు ఎంత చెడు చేయగలవో అంతా చేస్తున్నావు.”

6 రాజైన యోషీయా యూదా రాజ్యాన్ని పాలించే కాలంలో యెహోవా నాతో మాట్లాడినాడు. ఆయన ఇలా అన్నాడు: “యిర్మీయా, ఇశ్రాయేలు చేసిన చెడ్డపనులు నీవు చూశావు. నా పట్ల ఆమె ఎలా విశ్వాసరహితంగా ఉన్నదో నీవు చూశావు! ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహాలతో వ్యభిచరించిన పాపానికి ఇశ్రాయేలు పాల్పడింది.

7 ‘ఈ చెడు కార్యాలన్నీ చేయటం పూర్తయిన పిమ్మట ఇశ్రాయేలు తప్పక నావద్దకు తిరిగి వస్తుంది’ అని నేననుకున్నాను. కాని ఆమె నా వద్దకు రాలేదు. విశ్వాస ఘాతకురాలైన ఇశ్రాయేలు సోదరియగు యూదా ఆమె ఏమి చేసిందో చూసింది.

8 ఇశ్రాయేలు విశ్వాసపాత్రంగా లేదు. ఆమెను నేనెందుకు పంపి వేశానో ఇశ్రాయేలుకు తెలుసు. ఆమె వ్యభిచార దోషానికి పాల్పడినందుకే నేనామెకు విడాకులిచ్చానని ఇశ్రాయేలుకు తెలుసు. కాని అది విశ్యాస ఘాతకురాలైన ఆమె సోదరిని భయపెట్టలేదు. యూదా భయపడలేదు. యూదాకూడా తెగించి వ్యభిచారిణిలా ప్రవర్తించింది.

9 తానొక మరుగులేని వ్యభిచారిణిలా ప్రవర్తిస్తున్నాననే చింతన చేయలేదు. అలా ఆమె తన దేశాన్ని ‘మలిన’ (అపవిత్ర) పర్చింది. రాతితోను, చెక్కలతోను చేసిన విగ్రహాలను ఆరాధించి, వ్యభిచార పాపానికి ఒడిగట్టుకుంది.

10 ఇశ్రాయేలు యొక్క విశ్వాస ఘాతకురాలైన సోదరి (యూదా) హృదయ పూర్వకంగా నావద్దకు తిరిగి రాలేదు. నావద్దకు తిరిగి వచ్చినట్లు ఆమె నటించింది.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.

11 యెహోవా నాతో ఇలా చెప్పినాడు “ఇశ్రాయేలు నాకు విశ్వాసపాత్రంగా లేదు. విశ్వాసం లేని యూదా కంటె ఇశ్రాయేలుకు చెప్పుకొనేందుకు ఒక మంచి సాకువుంది.

12 యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఉత్తర దేశంలో చెప్పు: ‘విశ్వాసంలేని ఇశ్రాయేలీయులారా తిరిగి రండి.’ ఇది యెహోవా వాక్కు. ‘నిన్ను చూచి ముఖం తిప్పుకోను. నేను నిండు దయతో ఉన్నాను.’ ఈ వాక్కు యెహోవాది. ‘నీ పట్ల నేను శాశ్వతమైన కోపంతో ఉండను.

13 నీవు నీ పాపాన్ని గుర్తించాలి. నీ యెహోవా దేవునికి నీవు వ్యతిరేకమయ్యావు నీ పాపం అదే. ఇతర దేశాలనుండి వచ్చిన వారి విగ్రహాలను నీవు ఆరాధించినావు నీవు ప్రతి పచ్చని చెట్టు కిందా విగ్రహారాధన చేశావు నీవు నా ఆజ్ఞను మన్నించలేదు.”‘ ఇదే యోహోవా వాక్కు.

14 “విశ్వాసంలేని ప్రజలారా, నావద్దకు రండి” అని యెహోవా అంటున్నాడు “నేను మీ యజమానిని. ప్రతి నగరంనుంచీ ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి కుటుంబంనుంచీ ఇద్దరు మనుష్యులను తీసుకొని మిమ్మల్ని సీయోనుకు తీసుకొని వస్తాను.

15 అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు.

16 ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీర నేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది. “ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు.

17 ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు.

18 ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.

19 “యెహోవానైన నేనిలా అనుకున్నాను, ‘మిమ్మల్ని నా స్వంత బిడ్డలవలె చూసుకోవటం నాకు సంతోషదాయకం. మీకో మంచి రాజ్యాన్నివ్వటం వాకు తృప్తినిస్తుంది. ఆ రాజ్యం ఇతర రాజ్యాలకంటె సుందరంగా ఉంటుంది.’ మీరు నన్ను ‘తండ్రీ’ అని పిలుస్తారనుకున్నాను. మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను.

20 కాని తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీవలె మీరు తయారయ్యారు. ఇశ్రాయేలు వంశమా, నీవు నా పట్ల విశ్వాస పాత్రంగా మెలగ లేదు!” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.

21 నగ్నంగా ఉన్న కొండలమీద రోదన నీవు వినవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు దయాభిక్ష కోరుకుంటూ ఏడుస్తూ ప్రార్ధన చేస్తున్నారు. వారు బహు దుష్టులైనారు! వారు తమ యెహోవా దేవున్ని మర్చిపోయారు.

22 “విశ్వాసఘాతకులగు ఇశ్రాయేలీయులారా నా వద్దకు తిరిగి రండి. నన్నాశ్రయించి రండి. నా పట్ల వంచనతో మెలిగినందుకు క్షమిస్తాను.” “అవును. మేము నీ వద్దకు వస్తాము. నీవు మా యెహోవా దేవుడవు

23 కొండల మీద విగ్రహాలను పూజించుట అవివేకం. కొండలమీద ఆడంబరంగా జరిగే పూజా కార్యక్రమమంతా మోసం. నిజానికి, ఇశ్రాయేలుకు రక్షణ యెహోవా దేవుని వద్దనుండే వస్తుంది.

24 ఆ భయంకరమైన బయలుదేవత మన తండ్రుల ఆస్తిని మ్రింగివేసింది. మనం పిల్లలం కావటంతో ఇదంతా జరిగింది. ఆ భయంకరమైన దేవత మన తండ్రుల గొర్రెలను, పశువులను, వారి కుమారులను, కుమార్తెలను చంపింది.

25 మనం సిగ్గుతో తలవంచుకుందాం. మన అవమానం మనల్ని దుప్పటిలా కప్పివేయనీయండి. మన యెహోవా దేవునిపట్ల మనం తీవ్రమైన పాపం చేశాం. మనం, మన తండ్రులు కూడా పాపానికి ఒడిగట్టాము. మన చిన్నతనం నుండి ఇప్పటివరకు యెహోవా దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు” అని చెప్పాలి.

4

1 ఇదే యెహోవా వాక్కు. “ఇశ్రాయేలూ, నీవు రావాలనుకుంటే, తిరిగి నా వద్దకు రమ్ము నీ విగ్రహాలను విసరివేయి! నానుండి దూరంగా పోవద్దు!

2 నీవు ఆ విధంగా చేస్తే, నీవు ప్రమాణం చేయటానికి ఈ మాటలు చెప్పగలవు ‘నిత్యుడైన యెహోవా తోడు’ అని నీవనగలవు నీవీ మాటలు సత్యమైన, న్యాయమైన, నీతిమార్గాన పలుకగలవు. నీవీ పనులు చేస్తే, యెహోవా రాజ్యాలను దీవిస్తాడు. యెహోవా చేసిన పనులను వారు పొగడుతారు.”

3 యూదా ప్రజలకు, యెరూషలేము నగరవాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడు: “మీ భూములు దున్నబడలేదు. వాటిని దున్నండి! ముండ్లపొదలలో విత్తనాలు చల్లవద్దు.

4 యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి. మీ హృదయాలను మార్చుకోండి . యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీలో పరివర్తన రాకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది. నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది. ఆ అగ్ని జ్వాలల్ని ఎవ్వరూ ఆర్పలేరు! అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు చేసిన పాపకార్యాలవల్లనే ఇదంతా జరుగుతుంది.

5 “ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము: యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము, దేశమంతా బూర వూది బాహాటంగా ఇలా చెప్పుము, ‘మీరంతా కలిసి రండి! రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’

6 సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము. మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఆలస్యం చేయవద్దు! ఇది మీరు త్వరగా చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి నేను విపత్తును తీసుకొని వస్తున్నాను. నేను అతి భయంకరమైన వినాశనాన్ని తీసుకొని వస్తున్నాను.

7 తన గుహనుండి ఒక “సింహం బయటికి వచ్చింది. రాజ్యాలను నాశనం చేసేవాడు కదలి వస్తున్నాడు. నీ రాజ్యాన్ని సర్వ నాశనం చేయటానికి అతడు ఇల్లు వదిలి వస్తున్నాడు. నీ పట్టణాలు ధ్వంసమవుతాయి. వాటిలో నివసించటానికి ఒక్కడూ మిగలడు.

8 కావున నారబట్టలు ధరించండి. మిక్కిలిగా విలపించండి! ఎందువల్లనంటే యెహోవా మీపట్ల చాలా కోపంగా ఉన్నాడు.”

9 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “ఇది జరిగే సమయంలో రాజు, ఇతర నాయకులు తమ ధైర్యాన్ని కోల్పోతారు. యాజకులు బెదరిపోతారు! ప్రవక్తలు భయపడి, విస్మయం పొందుతారు!”

10 అప్పుడు యిర్మీయానైన నేను ఇలా చెప్పాను, “నా ప్రభువగు యెహోవా, నీవు నిజంగా యూదా, యెరూషలేము ప్రజలను మోసపుచ్చావు. ‘మీకు శాంతి కలుగుతుంది’ అని వారికి చెప్పియున్నావు. కాని ఇప్పుడు వారి గొంతులమీద కత్తిఉంది!”

11 అ సమయంలో యూదా, యోరూషలేము ప్రజలకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది: “వట్టి కొండలపై నుండి వేడిగాలి వీస్తుంది. అది ఎడారి నుండి నీ ప్రజల మీదికి వీస్తుంది. అది రైతులు నూర్చిన ధాన్యం పోతపోయటానికి పనికి వచ్చే పైరుగాలిలాంటిది కాదు.

12 ఇది దీనికంటె బలమైన గాలి; పైగా అది నావద్ద నుండి వీస్తుంది. ఇప్పుడు, యూదా ప్రజలపై నా న్యాయనిర్ణయం ప్రకటిస్తాను.”

13 చూడు, శత్రువు మేఘంలా లేచి వస్తాడు! అతని రధాలు సుడిగాలిలా కన్పిస్తాయి! అతని గుర్రాలు గ్రద్దలకంటె వేగం కలవి! అది మనకు హానికరం! మనం సర్వ నాశనమయ్యాము!

14 యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలనుంచి చెడును కడిగి వేయండి. మీరు పరిశుద్ధి హృదయాలు కలిగి ఉండండి; తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. దుష్ట ఆలోచనలు చేయటం మానివేయండి.

15 వినండి! దానునుండి వచ్చిన వార్తాహరుడు మాట్లాడుతున్నాడు. కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము నుండి ఇతడు దుర్వార్త తెస్తున్నాడు.

16 “దానిని ఈ దేశమంతా ప్రకటించండి. ఆ వార్తను యెరూషలేము నగరవాసులకు తెలియజేయండి. బహుదూరపు దేశంనుండి శత్రువు వస్తున్నాడు. యూదా నగరాలపై శత్రువులు యుద్ధ ధ్వని చేస్తున్నారు.

17 చేను చుట్టూ పంటను కాపాడే మనుష్యులున్నట్లు యెరూషలేమును శత్రువులు చుట్టుముడతారు యూదా, నీవు నాకు ఎదురు తిరిగావు! అందువల్లనే శత్రవు నిన్నెదిరించి వస్తున్నాడు!” ఇది యెహోవా వాక్కు.

18 నీవు నివసించిన తీరు, నీవు చేసిన దుష్కార్యాలే ఈ విపత్తును తీసికొని వచ్చాయి. నీ దుష్టజీవితమే నీ గుండెల్ని చీల్చే బాధను తెచ్చింది.”

19 అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను మూలుగుచున్నాను. నేను బాధతో క్రుంగి పోతున్నాను. అయ్యో, నేను భయ భ్రాంతుడనయ్యాను. నాలో నా గుండె దద్దరిల్లుతూ ఉంది. నేను ప్రశాంతంగా ఉండలేను. ఎందువల్లనంటే నేను బూర ధ్వని విన్నాను. అది యుద్ధ నాదం. సైన్యాన్ని అది పిలుస్తోంది!

20 ఒకదాని తరువాత ఒకటి ఆపదల పరంపర! దేశం యావత్తూ సర్వనాశనమయ్యింది. అనుకోని విధంగా నా డేరాలన్నీ నాశనం చేయబడ్డాయి! నా పరదాలు (తెరలు) చించబడ్డాయి!

21 యెహోవా, నేనెంత కాలం యుద్ధ ధ్వజాలను చూడాలి? ఎంతకాలం యుద్ధ నాదం నేను వినాలి?

22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు మూర్ఖులు. వారు నన్నెరుగరు. వారు మంద బుద్ధిగల పిల్లలవలె ఉన్నారు. వారికి అవగాహనే లేదు. కాని వారు చెడు చేయటంలో నేర్పరులు. మంచిపని ఎలా చేయాలో వారికి తెలియనే తెలియదు.”

23 నేను భూమివైపు చూశాను. భూమి ఖాళీగా ఉంది; దానిపై ఏమీ లేదు. నేను అకాశంవైపు చూశాను. వెలుగు పోయింది .

24 నేను పర్వతాల వైపు చూశాను, అవి కదిలిపోతున్నాయి. కొండలన్నీ కంపించి పోతున్నాయి.

25 నేను చూడగా, అక్కడ మనుష్యులు లేరు. ఆకాశంలో పక్షులు లేకుండా పోయాయి.

26 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా కన్పించింది. ఆ రాజ్యంలో నగరాలన్నీ సర్వనాశనమయ్యాయి. ప్రభువే ఇదంతా కలుగజేశాడు. అధికమైన యెహోవా కోపమే దీనిని కలుగచేసింది.

27 యెహోవా ఇలా అన్నాడు: “దేశం యావత్తూ నాశనమవుతుంది. (కానీ దేశాన్ని పూర్తిగా నాశనం చేయను)

28 అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన వారి కొరకు విలపిస్తారు. ఆకాశం చీకటవుతుంది. నా మాటకు తిరుగులేదు. నేనొక నిర్ణయాని కొచ్చాను; మరల నేను మనస్సు మార్చుకోను.”

29 గుర్రపు రౌతుల రవాళింపులు, విలుకాండ్ర శబ్దాలను యూదా ప్రజలు విని పారిపోతారు! కొందరు గుహలలో దాగుకొంటారు. కొంత మంది పొదలలో తలదాచుకుంటారు. మరి కొందరు కొండల మీదికి ఎక్కుతారు. యూదా నగరాలన్నీ నిర్మానుష్యమవుతాయి. అక్కడ ఎవ్వరూ నివసించరు.

30 యూదా, నీవు నాశనం చేయబడ్డావు. నీవేమి చేస్తున్నావు? నీ అందమైన ఎర్రని దుస్తులు ఎందుకు ధరించావు? నిన్ను బంగారు ఆభరణాలతో ఎందుకు అలంకరించుకొన్నావు? నీ కంటికి అలంకరణ ఎందుకు చేసుకున్నావు? నీ అలంకరణ వ్యర్థం. నీ ప్రేమికులు నిన్నసహ్యించుకుంటారు. వారు నిన్ను చంపాలని చూస్తున్నారు.

31 ప్రసవ వేదనలో స్త్రీ అరచినట్లుగా నేనొక రోదనవిన్నాను. అది ప్రథమ కన్పులో స్త్రీ పడిన వేదనవంటిది. అది సీయోను కుమార్తె రోదన. ఆమె చేతులెత్తి ప్రార్థిస్తూ, “అయ్యో, నేను మూర్ఛపోతున్నాను! హంతకులు నన్ను చుట్టుముట్టారు!” అని అంటున్నది.

5

1 “యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ చుట్టు పక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెడకి ఏ ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఏ ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నాడేమో చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, నేను యెరూషలేమును క్షమిస్తాను!

2 ప్రజలు ప్రమాణాలు చేస్తూ ‘నిత్యుడైన యెహోవాతోడు’ అంటారు. కాని అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు.”

3 యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థులకై చూస్తున్నావని నాకు తెలుసు. యూదా వారిని నీవు కొట్టావు. అయినా వారికి నొప్పి కలుగలేదు. వారిని నాశనం చేశావు, అయినా వారొక గుణపాఠం నేర్చుకోటానికి తిరస్కరించారు. వారు మొండి వైఖరి దాల్చారు. వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు.

4 కాని నేను (యిర్మీయా) ఇలా అనుకున్నాను: “కేవలం పేద మరియు సామాన్యా వర్గాల వారే అలా మూర్ఖులైవుండాలి. వారే యెహోవా మార్గాన్ని అనుసరించటం నేర్చుకోలేదు. పేదలు వారి దేవుని బోధనలు తెలుసుకోలేదు.

5 కావున యూదా ప్రజల నాయకుల వద్దకు నేను వెళతాను. నేను వారితో మాట్లాడతాను. నాయకులు తప్పక యెహోవా మార్గాన్ని మరియు ఉపదేశాలను అర్థం చేసికుంటారు. వారి దేవుని న్యాయమార్గం వారికి తెలుస్తుందనే నమ్మిక నాకు ఉంది!”కాని నాయకులంతా యెహోవా సేవను నిరాకరించే నిమిత్తం ఏకమైనారు .

6 వారు దేవునికి వ్యతిరేకులైనారు. అందువల్ల అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది. ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది. వారి నగరాల దాపున ఒక చిరుత పులిపొంచి ఉంది. నగరంలో నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుత పులి చీల్చి చెండాడుతుంది. యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది. అనేక పర్యాయములు వారు యెహోవాకు దూరమైనారు. “

7 దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక కారణం చూపించు. నీ పిల్లలు నన్ను త్యజించారు. దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు. నీ సంతానానికి కావలసిన ప్రతీది నేను యిచ్చి వున్నాను. అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై ఉన్నారు! వారెక్కువ కాలం వ్యభిచార గృహాలలోనే గడిపారు

8 వారు తినటానికి సమృద్ధిగా ఉండి, సంభోగించటానికి సిద్ధంగా ఉన్న గుర్రాలవలె ఉన్నారు. పొరుగువాని భార్య కోసం మదించి సకిలిస్తున్న గుర్రంలా వున్నారు.

9 ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” ఇదే యెహోవా వాక్కు. “అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలిగదా. వారికి తగిన శిక్ష విధించాలి.

10 యూదా వారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు. ద్రాక్ష లతలన్నీ నరికివేయుము. (కాని వాటిని మొద్దులను నరికి నాశనం చేయవద్దు). వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు .

11 ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు ప్రతి విషయంలోనూ నాకు విశ్వాసఘాతుకంగా ఉన్నారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.

12 “యెహోవా విషయంలో ఆ ప్రజలు అబద్ధమాడారు. వారిలా అన్నారు: ‘యెహోవా మమ్మల్ని ఏమీ చేయడు. మాకు ఏ రకమైన కీడూ రాదు. మమ్మల్ని ఏ శత్రు సైన్యం ఎదిరించగా మేము చూడము. మేము ఆకలికి మాడిపోము.’

13 తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకువారు, దేవుని వాక్కు వారియందు లేదు. వారికి కీడు మూడుతుంది.”

14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు తెలియజేసాడు: “నేను వారిని శిక్షించనని ఆ ప్రజలు అన్నారు. కావున యిర్మీయా, నేను నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి. ఆ ప్రజలు కొయ్యలాంటివారు. అగ్ని ఆ కట్టెనంతా దహించివేస్తుంది.

15 ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా చెప్పినాడు: “మీ మీదికి బహు దూరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను. అది ఒక ప్రాచీన రాజ్యం అది ఒక శక్తివంతమైన రాజ్యం. మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడతారు. వారు చెప్పేది మీకు అర్థం కాదు.

16 వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి. వారంతా యోధనా యోధులు.

17 మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు. మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు. మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనంచేస్తారు. వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు. మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు. కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు. మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”

18 యెహోవా ఇలా చెపుతున్నాడు: “కాని ఆ భయంకరమైన రోజులు వచ్చినప్పుడు, ఓ యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను.

19 యూదా ప్రజలు నిన్ను, ‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు. అప్పుడు నీవు, ‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు. మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు. మీరలా ప్రవర్తించారు గనుక ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.’ “

20 యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశస్తులకు ఈ వర్తమానం అందజేయుము. యూదా రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము.

21 బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి: ‘మీకు కళ్లు ఉండికూడా చూడరు! మీకు చెవులు ఉండి కూడా వినరు!”‘

22 నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.’ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది “మీరు నాముందు భయంతో కంపించాలి. సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే. తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను. అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు. అలలు ఘోషిస్తూ తీరాన్ని చేర తాయి, కాని అవి దానిని దాటిపోవు.

23 కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు. వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు. నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు.

24 మనం మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన మనకు శరత్కాల, వసంతకాల వర్షాలు సకాలంలో ఇస్తున్నాడనీ, ఆయన సకాలంలో, సవ్వంగా మనం పంటనూర్పిడి చేసుకొనేలా చేస్తున్నాడనీ’ యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు.

25 యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందువల్ల వర్షాలు లేవు; నూర్పిళ్లు లేవు. నీవు యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు పడుతున్నాయి.

26 నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు. ఆ దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే కిరాతకుల్లా ఉన్నారు. వారు తమ బోనులు సిద్ధంచేసి పొంచి వుంటారు. కాని వాళ్లు పక్షులకు బదులు మనుష్యులను పట్టుకుంటారు.

27 పంజరం నిండా పక్షులున్నట్లుగా, ఈ దుష్టుల ఇండ్ల నిండా అబద్దాలే! వారి అబద్ధాలు వారిని ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి.

28 వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా ఎదిగి, కొవ్వెక్కినారు. వారు చేసే అకృత్యాలకు అంతం లేదు. వారు అనాధ శిశువులు తరఫున వాదించరు. వారు అనాధలను అదుకోరు. వారు పేదవారికి న్యాయం జరిగేలా చూడరు.

29 వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది. “ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు. వారికి తగిన శిక్ష నేను విధించాలి.”

30 యెహోవా ఇలా అన్నాడు, “యూదా రాజ్యంలో ఆశ్చర్య కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే,

31 ప్రవక్తలు అబద్ధం చెప్పటం; యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు . నా ప్రజలు దానినే ఆదరించారు. కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు గురియైన నాడు మీరేమి చేస్తారు?”

6

1 బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి! యెరూషలేము నగరం నుండి పారిపోండి! తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి. బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి! ఉత్తర దిశ నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి. మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!

2 సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి .

3 కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని యెరూషలేముకు వస్తారు. వారు నగరం చుట్టూతమ గుడారాలు నిర్మించుకుంటారు. ప్రతి గొర్రెల కాపరీ తన మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకుంటాడు.

4 వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి. లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం! ఇప్పటికే ఆలస్యమైంది. సాయంకాలపు నీడలు సాగుతున్నాయి.

5 కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం. యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”

6 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షాలను పడగొట్టండి. ఆ కర్రలతో, మట్టితో నగర గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు కల్పించండి. ఈ నగరం శిక్షించబడాలి. ఈ నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు.

7 బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది. అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. ఈ నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను. యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.

8 యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు. మీరు వినకపోతే, మీనుండి నేను వెనుదిరిగి పోతాను. మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా మార్చివేస్తాను. అక్కడ ఎవ్వరూ నివసించలేరు!”

9 సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: “ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ ప్రోగుచేయుము . నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా నీవు ప్రతి తీగను వెదకుము.”

10 నేనెవరితో మాట్లాడగలను?ఎవరిని హెచ్చరించగలను? నా మాట ఎవరు వింటారు? ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా తమ చెవులు మూసుకున్నారు. యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు. కావున నా హెచ్చరికలు వారు వినలేరు. యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు. యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.

11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉండి! దానిని నేను లోపల ఇముడ్చుకో లేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.

12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి. వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు. నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.” ఈ వాక్కు యెహోవా నుండివచ్చినది.

13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు. కింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు! ప్రవక్తలు, యాజకులు అంతా కపటజీవనం సాగిస్తారు.

14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు. అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు. ‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు. కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.

15 ప్రవక్తలు. యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి! కాని వారికి సిగ్గనేది లేదు. వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు. అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు. నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా కిందికి తోయబడతారు.” ఇది యెహోవా వాక్కు.

16 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు: “నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడిచూడుము. పాతబాట ఏదో అడిగి తోలిసికో. ఏది మంచి మార్గమో అడిగి తెలుసుకో. అప్పుడు ఆ మార్గంపై పయనించుము. అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కనుగొంటారు. కాని మీరేమన్నారో తెలుసా? ‘మేము మంచి మార్గంపై పయనించ’మన్నారు.

17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను. నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని. కాని వారన్నారు: ‘మేము వినము.’

18 కావున, సర్వదేశవాసులారా వినండి! ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి . నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!

19 భూలోకవాసులారా, ఇది వినండి: యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను. ఎందుకంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే. వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది. నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”

20 యెహోవా ఇలా అన్నాడు: “మీరు షేబ దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు? దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు? మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు! మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”

21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:”యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను. ప్రజల ఎదుట అడ్డబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి. తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు. స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”

22 యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది. భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.

23 సైనికులు విల్లంబలు, ఈ టెలు పట్టుకొనివస్తారు. వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు. వారు మిక్కిలి శక్తిమంతులు! వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది. ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది. ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”

24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము. భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము. కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము. స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.

25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు! మీరు బాట వెంబడి వెళ్లవద్దు. ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి. పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.

26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి. బూడిదలో పొర్లండి . చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి! మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి. ఇవన్నీ మీరు చేయండి; కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!

27 “యిర్మీయా, నేను (యెహోవా) నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను. నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు, వారిని గమనిస్తూ ఉండుము.

28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు; వారు చాలా మొండివారు. వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు. వారు తుప్పుతో కప్పబడియున్న కంచు, ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.

29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు. కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది. కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది! శుద్ద వెండిని చేయాలను కోవటం వృధా ప్రయాస. వృధా కాలయాపన. అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.

30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు. యెహోవా వారిని ఆమోదించలేదు గనుక వారికాపేరు పెట్టబడింది.”

7

1 యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది:

2 “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము: “ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవా ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి!

3 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను

4 కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం ; ఇదే దేవాలయం; ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు.

5 మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి.

6 కొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి.

7 మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.

8 “‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు ఆప్రయోజనకరమైనవి.

9 మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా?

10 మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా?

11 ఈ ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!”‘ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది!

12 “యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్కడైతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్టకార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా ఆ స్థలానికి నేను ఏమి చేసియున్నానో వెళ్లి చూడండి .

13 ఇశ్రాయేలీయులారా, మీరీ చెడుకార్యాలు చేస్తూ ఉన్నారు.” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! “నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు.

14 అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను.

15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.

16 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు నీవు అడుగవద్దు; వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను ఆలకించను.

17 యూదా పట్టణాలలో ఆ ప్రజలు ఏమి చేస్తున్నారో నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. యెరూషలేము నగర వీధుల్లో వారేమి చేస్తున్నారో నీవు చూడవచ్చు.

18 యూదా ప్రజలు ఏమి చేస్తున్నారనగా: పిల్లలు కట్టెలను పోగుచేయటం; తండ్రులు వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, ఆకాశ రాణికి నివేదించటానికి రొట్టెలు చేయటం, యూదా ప్రజలు ఇతర దేవతా రాధనలో పానీయార్పణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే ఇవన్నీ చేస్తున్నారు.

19 కాని వాస్తవానికి యూదా ప్రజలు బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటున్నారు. వారిని వారే అవమాన పర్చుకుంటున్నారు” ఇది యెహోవా వాక్కు,

20 కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు:”నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”

21 సర్వ శక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నాడు: “మీరు వెళ్లి మీరు కోరినన్ని దహన బలులు, సాధారణ బలులు అర్పించండి. తద్వారా వచ్చిన మాంసాన్ని మీరే తినండి.

22 మీ పూర్వీకులను నేను ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను వారితో మాట్లాడాను. కాని దహన బలుల గురించి, సాధరణ బలుల గురించి నేను వారికి ఏ రకమైన ఆజ్ఞలూ ఇవ్వలేదు.

23 వారికి ఈ ఆజ్ఞ మాత్రమే ఇచ్చియున్నాను, ‘నాకు విధేయులై వుండండి. అప్పుడు నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలైయుంటాను. నేను చెప్పినదంతా చేయండి. మీకు శుభం కలుగుతుంది.’

24 “కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. నన్ను లెక్కచేయలేదు. మొండిగా, వారు చేయదలచుకున్నదంతా చేశారు. వారు సన్మార్గులు కాలేదు. వారు మరింత దుష్టులయ్యారు. ముందుకు సాగక వెనుకకు తిరిగారు.

25 మీ పూర్వీకులు ఈజిప్టును వదలిన నాటినుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపియున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్లు పంపాను.

26 కాని మీ పూర్వికులు వారి మాట వినలేదు. వారు నన్ను లెక్కచేయలేదు. వారు మిక్కిలి మొండివారు. వారి తండ్రుల కంటె వారు ఎక్కువ చెడుకార్యాలు చేశారు.

27 “యిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని పిలుస్తావు. కాని వారు పలుకరు.

28 అందువల్ల వారికి నీవీ మాటలు చెప్పాలి: తన యెహోవా దేవునికి విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు ఎరుగరు.

29 “యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి . కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? యెహోవా ఈ తరం ప్రజలను తిరస్కరించినాడు. ఈ ప్రజలకు యెహోవా విముఖుడైనాడు. కోపంతో ఆయన వారిని శిక్షిస్తాడు.

30 డ్వండి, ఎందుకంటే యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసియున్నాను.” ఇది యెహోవా వాక్కు.”వారు విగ్రహాలను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించుకుంటున్నాను! నా పేరుతో పిలువబడే ఆలయంలో వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు అపవిత్రపర్చారు.

31 దా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు!

32 కావున నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు అనిగాని, బెన్ హిన్నోములోయ అనిగాని పిలవకుండా వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. పైగా వారు దీనిని కసాయి లోయ అని పిలుస్తారు. “వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా చనిపోయిన వారిని పాతిపెడతారు.

33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొనితింటారు. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు.

34 యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేములోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.”

8

1 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్యపాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధులనుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూషలేము ప్రజలు ఎముకలను కూడ వారి సమాధుల నుండి తీస్తారు.

2 ఆ మనుష్యులు ఆ ఎముకలను ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలను కనపడేలా పడవేస్తారు. యోరూషలేము ప్రజలు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్టపడతారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె బయట పారవేయబడును.

3 “యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.

4 యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: యెహోవా ఈ విషయాలు చెప్పినాడు “ఒక వ్యక్తి కింద పడితే తిరిగి లేస్తాడని మీకు తెలుసు. ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.

5 యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు. కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు. వారి అబద్ధాలను వారే నమ్ముతారు. వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.

6 వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను. కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు. ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు. ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు. ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు.

7 ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు. కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ) వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు. కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.

8 “యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము!’ అని మీరు చెప్పుకుంటూ వుంటారు. కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.

9 ఈ ‘తెలివిగలవారు’ యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు. కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు. ఆ ‘జ్ఞానవంతు’ లనబడే వారు మోసంలో పడ్డారు. వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.

10 కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను. వారి పొలాలను కొత్త యజమానులకిచ్చివేస్తాను. ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధనసంపాదనపై ఆసక్తిగలవారు. ప్రాముఖ్యుల ఖ్యంలేని అతి సామాన్యుల నుండి ముఖ్యుల వరకు ప్రజలంతా అలాంటివారే. ప్రవక్తల నుండి యాజకుల వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే.

11 నా ప్రజలు బాగా గాయపడ్డారు. కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు. ‘అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!’ అని వారంటారు. కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!

12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి. కాని వారు సిగ్గుపడనే లేదు. వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వాకిరి తెలియదు. అందరితో పాటు వారూ శిక్షించబడతారు. నేను వారిని శిక్షిస్తాను; వారిని కిందికి పడవేస్తాను.” ఇది యెహోవా వాక్కు.

13 వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను అందుచేత అక్కడ పంటకోత ఉండదు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు. వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి. నేను వారి కిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను .

14 “ మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము? రండి, బలమైన నగరాలకు పారిపోదాం. మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం. మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం. అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.

15 మనం శాంతిని కోరుకున్నాం; కాని శాంతి కలుగలేదు. స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం, కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.

16 దాను వంశీయుల రాజ్యంనుండి శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి. వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది. వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ నాశనం చేయాలని వచ్చియున్నారు. వారీ నగరాన్ని, నగరవాసులను సర్వనాశనం చేయటానికి వచ్చారు.

17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను పంపుతున్నాను. ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు. ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!

18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.

19 నా ప్రజల మొరాలకించుము! దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు. “సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా? సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు. కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు? వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”

20 మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు: “పంటకోత కాలం అయిపోయింది. వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”

21 నా జనులు బాధపడియుండుటచేత బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.

22 వాస్తవానికి గిలియాదులో తగిన ఔషధం ఉంది! వాస్తవానికి గిలియాదులో వైద్యుడు కూడా ఉన్నాడు! అయితే నా ప్రజల గాయాలు ఎందుకు నయం చేయబడలేదు?

9

1 నా తన నీటితో నిండియున్నట్లయితే, నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!

2 ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం ఎడారిలో నాకొకటి ఉంటే అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను. వారినుండి నేను దూరంగా పోగలను! ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు. వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.

3 “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు. వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి. సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది. వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు. వారు నన్నెరుగకున్నారు.” ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.

4 “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి! మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు! ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే. ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.

5 ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును. ఎవ్వడూ సత్యం పలుకడు. యూదా ప్రజలు అబద్ధమాడుటలో తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు. వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!

6 ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది. అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి! ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ విషయాలను యెహోవా చెప్పినాడు!

7 కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెపుతున్నాడు, “లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను! నాకు వేరే మార్గం లేదు. నా ప్రజలు పాపం చేశారు.

8 యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు. వారి నార్లు అబద్ధాలనే మాట్లాడతాయి. ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు. కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.

9 [This verse may not be a part of this translation]

10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను. వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను. ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి. ఎవ్వడూ అక్కడ పయనించడు. ఆ ప్రదేషశాలలో పశువుల అరుపులు వినరావు. పక్షులు ఎగిరి పోయాయి: పశువులు పారిపోయాయి.

11 “నేను (యెహోవా నయిన) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది. నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”

12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా? యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా? యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా? రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది? జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.

13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు. వారికి నా ఉపదేశములు ఇచ్చాను. కాని వారు వినటానికి నిరాకరించారు. వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.

14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు. వారు మొండివారు. వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు. బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”

15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు, “యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను. విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.

16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను. వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది. వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు. కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను. యూదా ప్రజలను వారు చంపివేస్తారు. ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”

17 సర్వాశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము! శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను విలపించుము. కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము.

18 ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి. అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి. కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.

19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన, ‘మేము నిజంగా నాశనమయ్యాము! మేము నిజంగా అవమానం పాలైనాము! మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”

20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి. యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనొగ్గండి. యెహోవా ఇలా అంటున్నాడు, “మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి. ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:

21 ‘మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది. మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది. వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది. బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.’

22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము, పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి. పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.”‘

23 యెహోవా ఇలా చెపుతున్నాడు: “తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి గొప్పలు చెప్పుకోరాదు. బలవంతులు తమ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకోరాదు. శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకోరాదు.

24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము. నన్నతను అర్థం చేసికున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసికున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము. నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనియి. యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము. నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.” ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.

25 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయమాసన్న మవుతూ ఉంది. 26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”

26 [This verse may not be a part of this translation]

10

1 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము!

2 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు! ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు నీవు భయపడవద్దు! అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు. కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.

3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవి కావు. వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు. వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో కొట్టి మలుస్తాడు.

4 వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు. వాటిని పడిపోకుండా సుత్తులతో మేకులు కొట్టి నిలబెడతారు.

5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి. వారి విగ్రహాలు మాట్లాడవు. వారి విగ్రహాలు నడవలేవు. ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి! కావున ఆ విగ్రహాలకు భయపడకు. అవి నిన్ను ఏమీ చేయలేవు. పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”

6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు! నీవు గొప్పవాడవు! నీ నామము గొప్పది మరియు శక్తి గలది.

7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు. వారందరి గౌరవానికి నీవు అర్హుడవు. ప్రపంచ దేశలలో చాలామంది జ్ఞానులున్నారు. కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.

8 అన్యదేశవాసులు మందబద్ధులు, మూర్ఖులు. వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.

9 వారు తర్షీషు నగరంనుండి వెండిని, ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు. విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి. ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు. “జ్ఞానులు” ఆ “దేవుళ్ల”ని చేస్తారు.

10 కాని యెహోవా నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు! శాశ్వతంగా పాలించే రాజు ఆయనే. దేవునికి కోపం వచ్చి నప్పుడు భూమి కంపిస్తుంది. ప్రపంచ రాజ్యాల ప్రజల ఆయన కోపాన్ని భరించలేరు.

11 [This verse may not be a part of this translation]

12 [This verse may not be a part of this translation]

13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు. ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు. భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు. ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు. ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.

14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు! లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు. వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు. అవి జడపదార్థములు .

15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి. అవి హాస్యాస్పదమైనవి. తీర్పు తీర్చే కాలంలో ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.

16 కాని యాకోబు యొక్క దేవుడు ఆ విగ్రహాలవంటి వాడు కాదు. ఆయన సర్వసృష్టికి కారకుడు. ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు. ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”

17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి. యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు. శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు.

18 యెహోవా ఇలా చెప్పాడు, “ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను. వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను. వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను .”

19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను నా గాయం మానరానిది. “ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే” అని నేను తలపోశాను.

20 నా గుడారం పాడైపోయింది. దాని తాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నన్ను వదిలేశారు. వారు వెళ్లిపోయారు. నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు. నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు.

21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు! వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు, వారు జ్ఞాన శూన్యులు. అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదరై తప్పిపోయాయి.

22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము! ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది. అది యూదా నగరాలను నాశనం చేస్తుంది. యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.

23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు. జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు. ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.

24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము! నీవు మమ్ము నశింపజేయవచ్చు కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము! కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!

25 నీకు కోపంవస్తే, అన్యదేశాలను శిక్షించుము. వారు నిన్నెరుగరు; గౌరవించరు. ఆ ప్రజలు నిన్ను పూజించరు. ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి. వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు. వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.

11

1 ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినదిః

2 “యిర్మీయా, ఈ ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా ఈ విషయాలు తెలియజేయుము.

3 ఇశ్రాయేలీయుల దేవుడైన చెప్పినది ఇది: ‘ఈ ఒడంబడికను అను సరించని ప్రతి వానికీ కీడు వాటిల్లుతుంది.’

4 నేను నీ పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్లాడుతున్నాను. వారిని ఈజిప్టునుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసుకొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలాఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను.

5 “నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాధిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమి ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.” నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.

6 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి.

7 ఈజిప్టునుండి విడుదల చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు విధేయులై వుండమని వారికి చెప్పాను.

8 కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారు దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”

9 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా! యూదా ప్రజలు, యెరూషలేము వాసులు రహస్య పథకాలు వేశారని నాకు తెలుసు.

10 ఆ ప్రజలు వారి పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీకులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించినారు.”

11 కావున యెహోవా ఇలా చెప్పినాడు, “త్వరలో యూదా వారికి భయంకర విపత్తు సంభవించేలా చేస్తాను. వారు దానినుండి తప్పించుకోలేరు! వారు దుఃఖపడతారు. వారు నా సహాయంకొరకు రోదిస్తారు. అయినా నేను వారి రోదన వినను.

12 అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.

13 “ యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి.

14 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పుడు సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను.

15 “నా ప్రేయసి (యూదా) నా ఇంట్లో (ఆలయం) ఎందుకు ఉన్నది? అక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. ఆమే చాలా చెడుపనులు చేసింది. యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమాణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని నీవనుకుంటున్నావా? నాకు బలులు అర్పించటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని తలుస్తున్నావా?”

16 యెహోవా నీకొక పేరు ఇచ్చాడు. ‘కంటికింపైన పచ్చని బలివ చెట్టు’ అని నిన్ను పిలిచాడు కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు. దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.

17 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు. ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు. మీరు బూటకపు దేవత బయలుకు బయట బలులు సమర్పించి యెహహోవాకు కోపం తెప్పించారు.

18 అనాతోతు ప్రజలు నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది.

19 వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.”

20 యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి అర్హమైన శిక్ష నీవే యిమ్ము.

21 అనాతోతు మనుష్యులు యిర్మీయాను చంపుటకు పథకం పన్నుచుండిరి. వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు యెహోవా పేరుతో ప్రకటనలు చేయవద్దు. లేనిచో నిన్ను మేము చంపివేస్తాం.” అనాతోతు మనుష్యుల విషయంలో యెహోవా ఒక నిర్ణయానికి వచ్చాడు.

22 సర్వశక్షిమంతుడైన యెహోవా ఇలా చెప్పాడు, “నేను త్వరలో అనాతోతు ప్రజలను శిక్షిస్తాను. వారి యువకులు యుద్ధంలో మరణిస్తారు. వారి కుమారులు, కమార్తెలు ఆకలితో మాడి చనిపోతారు.

23 అనాతోతులో ఒక్కడు కూడా వదిలిపెట్టబడడు. ఎవ్వడూ బతకడు. వారిని నేను శిక్షిస్తాను. వారికి కీడు దాపురించేలా నేను చేస్తాను.”

12

1 యెహోవా, నేను నీతో వాదించినట్లయితే, నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు! కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలను కొంటాన్నాను. దుర్మార్గు లెందుకు విజయవంతులవుతున్నారు? నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?

2 ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి, అభివృద్ధిచెంది కాయలు కాసారు. నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెపుతారు. కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు.

3 ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు. నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు. గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి. సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి.

4 ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి? ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి? దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి. ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం. పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బతకడు” అని ఆ దుర్మార్గులే అంటున్నారు.

5 “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే, మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు? సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే, యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?

6 ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు. నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు. నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు. వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా నీవు వారిని నమ్మవద్దు.

7 “నేను (యెహోవా) నా ఇంటిని వదిలివేశాను. నా స్వంత ఆస్తిని నేను వదిలివేశాను. నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.

8 నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా తయారయ్యింది. అది నన్ను చూచి గర్జిస్తూవుంది. అందుచే దాన్ని నేను అసహ్యించు కుంటున్నాను.

9 నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన చనిపోయే జంతువులా వుంది. ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి. వన్య (అడవి) మృగములారా, రండి. రండి, తినటానికి ఆహారం తీసుకోండి.

10 చాలామంది గొర్రెల కాపరులు (నాయకులు) నా ద్రాక్షా తోటను నాశనం చేసారు. ఆ కాపరులు నా తోటలోని మొక్కలపై నడిచారు. వారు నా అందాల తోటను వట్టి ఎడారిగా మార్చి వేశారు.

11 వారు నా భూమిని ఎడారిలా చేశారు. అది ఎండి చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు. దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది. అక్కడ ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ లేరు.

12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు. యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు. రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు. ఏ ఒక్కరికీ రక్షణ లేదు.

13 ప్రజలు గోధుమ పైరు నాటుతారు. కాని వారు కోసేది ముండ్లను మాత్రమే. వారు బాగా అలసిపోయేటంతగా శ్రమిస్తారు. కాని వారి శ్రమకు ఫలం శూన్యం. వారి పంట విషయంలో వారు సిగ్గు చెందుతారు. యెహోవా కోపకారణంగా ఇదంతా జరిగింది.”

14 యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి త్రోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా పెల్లగించుతాను.

15 నేను వారిని తమ రాజ్యం నుండి భ్రష్టులను చేశాక, వారి విషయంలో నేను బాధపడతాను. తరువాత ప్రతి కుటుంబాన్నీ దాని స్వస్థలానికి, స్వంత ఆస్తికి తీసుకొని వస్తాను.

16 కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా...’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను.

17 “కాని ఏ దేశమైనా మాట వినకపోతే, అప్పుడు నేను వారిని సర్వ నాశనం చేస్తాను. చచ్చిన మొక్కలవలె వారిని లాగి పారవేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

13

1 యెహోవా నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక నడికట్టు బట్టకొని తీసుకురా. దానిని నీవు ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.”

2 కావున యెహోవా చెప్పిన విధంగా నేనొక నడికట్టు వస్త్రం కొని ధరించాను.

3 అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది.

4 ఆ వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు వస్త్రం తీసుకొని ఫరాతుకు వెళ్లుము. అక్కడ ఒకబండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.”

5 అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను.

6 చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు.

7 అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది.

8 అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది.

9 యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, ఎందుకూ పనికిరానిదయి పోయింది. అదే విధంగా, యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టులనందరినీ నాశనం చేస్తాను.

10 యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు.

11 నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”

12 “యిర్మీయా, యూదా ప్రజలకు ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడని తెలియజేయుము: ‘ప్రతి ద్రాక్షరసపు తిత్తియు ద్రాక్షారసముతో నింపాలి. అది విన్న ఆ జనులు నవ్వి, ‘అవును. ప్రతి ద్రాక్షారసపు తిత్తీ ద్రాక్షారసంతోనే నింపాలని మాకు తెలుసు’ అని నీతో అంటారు.

13 అప్పుడు నీవిలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: ఈ రాజ్యంలో నివసించే ప్రతివాని తాగిన వానిలా నిస్సహాయుని చేస్తాను. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను యాజకుల గురించి, ప్రవక్తల గురించి యెరూషలేము వారందరిని గురించి నేను మాట్లాడుతున్నాను.

14 యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.”‘ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది “‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.”‘

15 శ్రద్ధగా ఆలకించండి. యెహోవా మీతో మాట్లాడియున్నాడు. మీరు గర్విష్టులు కావద్దు.

16 మీ యెహోవా దేవుని గౌరవించండి. ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు. మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనను స్తోత్రం చేయండి. యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు. కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు. యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు.

17 యూదా ప్రజలారా, మీరు యెహోవా వాక్కు వినకపోతే నేను దాగుకొని విలపిస్తాను. మీ గర్వం నన్ను విలపించేలా చేస్తోంది. నేను బిగ్గరగా విలపిస్తాను. నా కన్నీరు వరదలై పారుతుంది. ఎందువల్లనంటే, యెహోవా మంద బందీయైపోయింది.

18 ఈ విషయం రాజుకు, ఆయన భార్యకు తెలియ జెప్పండి: “మీ సింహాసనాల నుండి మీరు దిగిరండి. మీ అందాల కిరీటాల మీ తలలనుండి కిందికి పడిపోయాయి.”

19 నెగెవు ఎడారిలో మీ నగరాలు మూసివేయ బడ్డాయి. వాటిని ఎవ్వరూ తెరువలేరు. యూదా ప్రజలంతా చెరపట్టబడ్డారు. వారంతా బందీలుగా కొనిపోబడ్డారు.

20 యెరూషలేమా, పైకి చూడు! ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు. నీ మంద ఎక్కడ? ఆ అందమైన మందను దేవుడు నీకిచ్చాడు. ఆ మంద రక్షణ బాధ్యత నీదై వుంది.

21 ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి చెపుతావు? నీవు దేవుని గురించి ప్రజలకు బోధించవలసివుంది. నీ నాయకులు ప్రజలను నడిపించవలసి ఉంది. కాని వారి పని వారు చేయ లేదు! కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను అనుభవిస్తావు. నీ బాధ స్త్రీ యొక్క ప్రనవవేదనలాంటిది.

22 “నాకెందుకీ చెడు దాపురించింది?” అని నీకు నీవే ప్రశ్నించుకో. నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు. నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది. నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి. నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు.

23 నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు. అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి పనులు చేయలేవు. నీవు ఎల్లప్పుడూ చెడు చేయటానికే అలవాటడ్డానావు.

24 “మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను. మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని వైపులకూ పారిపోతారు. ఎడారి గాలికి కొట్టుకు పోయే పొట్టులాంటి వారు మీరు.

25 ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి. నా ప్రణాళికల్లో నీ పాత్ర ఇదే.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “ఇది ఎందుకు సంభవిస్తుంటే నీవు నన్ను మర్చిపోయావు. నీవు బూటకపు దేవుళ్ల నమ్మావు.

26 యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను. ప్రతివాడూ నిన్ను చూస్తారు నీవు అవమానం పాలవుతావు.

27 నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను . నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను. వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు. నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను. యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది. అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.”

14

1 అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు యెహోవా పంపిన వర్తమానం:

2 “యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు రోధిస్తుంది. యూదా నగరాల ప్రజలు నానాటికీ బలహీనమౌతారు. వారు నేలమీద పడతారు. యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు వెళుతుంది.

3 ప్రజా నాయకులు వారి సేవకుల నీటికొరకు పంపుతారు. సేవకులు జలాశయాల వద్దకు వెళతారు. కాని వారికి నీరు దొరకదు. సేవకులు ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు. దానితో వారు సిగ్గుపడి, కలత చెందుతారు. అవమానంతో వారి తలలు బట్టతో కప్పుకుంటారు.

4 ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు రాజ్యంలో వర్షం కురియదు. రైతులు నిరాశతో కుంగి పోతారు. వారు సిగ్గుతో తమ ముఖాలు కప్పుకుంటారు.

5 పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది. పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది.

6 అడవి గాడిదలు వట్టి కొండలపైన నిలబడతాయి. గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి. వాటి కంటికి ఆహారమే కన్పించదు. ఎందువల్లనంటే వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు లేవు.

7 “నా ప్రజలిలా నాకు మొరపెట్టుకుంటారు: జరిగిన విషయాలన్నిటకీ మా తప్పులే కారణమని మాకు తెలుసు. మా పాపాల ఫలంగా మేమిప్పుడు కష్టాలనుభవిస్తున్నాము. యెహోవా, నీ నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు సహాయపడుము. నిన్ను అనేక సార్లు మేము వదిలిపెట్టినట్లు మేము ఒప్పుకుంటున్నాము. నీ పట్ల మేము పాపం చేశాము.

8 ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి! కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే. అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు. ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.

9 ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు. ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు. అయినా నీవు మాతో ఉన్నావు. యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నావు. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”

10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.”

11 పిమ్మట యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, యూదా ప్రజలకు శుభం కలగాలని ప్రార్థన చేయవద్దు.

12 యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”

13 కాని నేను యెహోవాతో ఇలా అన్నాను: “నా ప్రభువా, ప్రజలకు ప్రవక్తలు వేరొక రకంగా చెపు తున్నారు. ప్రజలు శత్రువు కత్తికి గురికావలసిన గతి పట్టదనీ, వారికి కరువు రాదనీ, యెహోవా ఈ రాజ్యంలోనే వారికి సుఖశాంతులు కలుగజేస్తాడనీ ప్రవక్తలు చెపుతున్నారు.”

14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, ఆ ప్రవక్తలు నా పేరుతో అబద్దాలు బోధిస్తున్నారు. ఆ ప్రవక్తలను నేను పంపలేదు. నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారితో నేను మాట్లాడలేదు. ఆ ప్రవక్తలు బోధించేదంతా అబద్ధపు దర్శనాలు. వట్టి కనికట్టు. అది వారి స్వంత కల్పన.

15 అందువలన నా పేరుతో భవిష్యత్తును చెప్పే ప్రవక్తల విషయంలో నేను చెప్పేదేమంటే వారిని నేను పంపలేదు. ఆ ప్రవక్తలు ‘కత్తిపట్టిన శత్రువెవ్వడూ ఈ రాజ్యంమీదికి రాడు. ఈ రాజ్యంలో కరువనేది ఉండదు,’ అని కదా చెప్పారు. చూడుము; ఆ ప్రవక్తలే ఆకలితో మాడి చనిపోతారు. శత్రువు కత్తికి బలియైపోతారు.

16 ఆ ప్రవక్తలు ఏ ప్రజలతో మాట్లాడినారో, వారు వీధిలోనికి లాగబడతారు. ఆ ప్రజలు ఆకలితో చనిపోతారు. శత్రువుల కత్తి వారిని నరికివేస్తుంది. వారినిగాని, వారి భార్యలను గాని, వారి కుమారులను లేక కుమార్తెలను గాని పాతి పెట్టటానికి ఒక్కడుకూడా మిగలడు! నేను వారిని శిక్షిస్తాను.

17 “యిర్మీయా, యూదా ప్రజలకు ఈ వర్తమానం అందజేయి. ‘నా కండ్లు కన్నీళ్ళతో నిండాయి. రాత్రింబవళ్లు నేను ఎల్లప్పుడూ విలపిస్తాను. కన్యయగు నా కుమార్తె కొరకు విలపిస్తాను. నా ప్రజలకొరకు నేను దుఃఖిస్తాను. ఎందువల్లనంటే అన్యుడొకడు వారిని గాయపర్చినాడు; వారిని అణగద్రొక్కినాడు. వారు తీవ్రంగా గాయపర్చబడినారు.

18 నేను పల్లెపట్టులకు వెళితే, కత్తులతో సంహరింపబడినవారిని చూస్తారు. నేను నగరానికి వెళితే అక్కడ నేను తిండి లేక రోగగ్రస్థులైన వారిని చూస్తాను. యాజకులు, ప్రవక్తలు వారెరుగని అన్యదేశానికి కొనిపోబడ్డారు.”

19 యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా? యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా? నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలే మనిపిస్తున్నది. నీవు ఆ పని ఎందుకు చేశావు? మేము శాంతిని కోరుకుంటున్నాము. కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు. మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము; కాని భయము పుట్టుచున్నది.

20 యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు. మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు. అవును. మేము నీ పట్ల పాపం చేశాము.

21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకై నా మమ్మల్ని తోసివేయవద్దు! దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు. మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి. ఆ నిబంధనను మరువవద్దు.

22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు. ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు. నీవే మాకు దిక్కు నీవే ఈ కార్యములన్నీ జరిపించేది.”

15

1 యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, చివరకు మోషే మరియు సమూయేలు ఇక్కడికి వచ్చి యూదా కొరకు ప్రార్థన చేసినా, ఈ ప్రజలకై నేను విచారపడను. నానుండి యూదా ప్రజలను దూరంగా పంపివేయి! పొమ్మని వారికి చెప్పు!

2 ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగ వచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు: ‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను. వారు మృత్యువు వాతబడతారు. కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను. వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు. కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను. వారు కరువుకు గురవుతారు. మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను. వారు బందీలై పరదేశానికి తీసుకుపో బడతారు.

3 నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి పంపుతాను. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ‘నేను ఖడ్గధారులైన శత్రువులను సంహారానికి పంపుతాను. చనిపోయినవారి శరీరాలను లాగివేయటానికి కుక్కలను పంపుతాను. వారి శవాలను తినివేయటానికి, నాశనం చేయటానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను.

4 ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా యూదా ప్రజలను భయంకరమైన దానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను. మనష్షే రాజు యెరూషలేములో చేసిన దానిని బట్టి యూదా ప్రజలకు నేనీ విధంగా చేస్తాను. మనష్షే యూదా రాజైన హిజ్కియా కుమారుడు. మనష్షే యూదా రాజ్యానికి ఒక రాజు.’

5 “యెరూషలేము నగరమా, నీకొరకు ఒక్కడు కూడా విచారించడు. ఎవ్వరూ నిన్ను గూర్చి విలపించరు. నీ యోగ క్షేమాలు తెలుసుకొనేందుకు కూడా ఎవ్వరూ దగ్గరకు రారు.

6 యెరూషలేమా, నీవు నన్ను వదిలిపెట్టావు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “అనేక పర్యాయములు నీవు నన్ను చేరలేదు! కావున నిన్ను నేను శిక్షించి నాశనం చేస్తాను. మీ శిక్షను మీ మీదకు రాకుండా పట్టుకొని నేను అలసి పోయాను.

7 యూదా ప్రజలను నా కొంకె కర్రతో వేరు చేస్తాను. వారిని రాజ్యంలోగల నగర ద్వారాలవద్ద నిరుపయోగంగా పారవేస్తాను. నా ప్రజలలో మార్పు రాలేదు. అందుచే నేను వారిని నాశనం చేస్తాను. వారి పిల్లలను నేను తీసుకొని పోతాను.

8 అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు. సముద్రతీరాన ఉన్న ఇసుకకంటె ఎక్కువగా విధవ స్త్రీలు వుంటారు. మధ్యాహ్న సమయంలో నేను నాశన కారులను తీసుకొని వస్తాను. యూదా యువకుల తల్లులపై వారు దాడి చేస్తారు. యూదా ప్రజలకు బాధను, భయాన్ని కలుగ జేస్తాను. ఇదంతా అతి త్వరలో సంభవించేలా చేస్తాను.

9 శత్రువు కత్తులతో దాడిచేసి ప్రజలను చంపుతాడు. మిగిలిన యూదా వారిని వారు చంపుతారు. ఒక స్త్రీకి ఏడుగురు కుమారులుండవచ్చు, కాని వారంతా హత్య చేయబడతారు. ఆమె ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది. ఆమె కలవరపడి, తబ్బిబ్బై పోతుంది. దుఃఖంవల్ల పట్టపగలే ఆమెకు చీకటి కలుగుతుంది.”

10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది. నేను దుఃఖపడుతున్నాను. నేను దురదృష్టవంతుడను. ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను. నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు. కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు!

11 యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను. ఆపదకాలం వచ్చినప్పుడు నా శత్రువుల గురించి నేను నిన్ను వేడుకున్నాను.

12 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గుచేయటం ఎవరితరమూ కాదని నీకు తెలుసు. అంటే నా ఉద్దేశ్యం ఉత్తరాన్నుంచి వస్తున్న ఇనుమువలె ఉంటుంది . అలాగే ఇనుప ముక్కను చిదుక గొట్టే వారెవరు?

13 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి. ఆసంపదను పరులకు ఇస్తాను. అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు. నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను. ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది. యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.

14 యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను. ముందెన్నడూ ఎరుగని రాజ్యంలో మీరు బానిసలవుతారు. నేను మిక్కిలి కోపంతో ఉన్నాను. నా కోపం రగులుతున్న అగ్నిలా ఉంది. అందులో మీరు కాలిపోతారు.” యిర్మీయా ఈ విధంగా చెప్పాడు:

15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో. నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో. ప్రజలు నన్ను గాయ పర్చుతున్నారు. వారికి తగిన శిక్ష విధించుము. ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు. వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు. నా గురించి ఆలోచించుము. యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.

16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుకున్నాను. నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది. నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.

17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు. కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, ఎగతాళి చేశారు. నామీద నీ ప్రభావం పడుటవలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను. నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను కోపగించుకొనేలా చేశావు.

18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు. నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు. యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను. నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు. నీవు ఇంకిపోయిన నీటిబగ్గలా ఉన్నావు.

19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే నిన్ను నేను శిక్షించను. నీవు మారి నావద్దకు వస్తే నీవు నన్ను వెంబడించగలవు. వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే నాగురించి నీవు మాట్లాడగలవు. యూదా పజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి. అంతేగాని నీవు వూరి వారిలా వుండకూడదు.

20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను. నిన్ను చూచి వారంతా కంచుగోడలాంటి వాడని అనుకుంటారు. యూదావారు నీతో పోట్లాడుతారు. కాని వారు నిన్ను ఓడించలేరు. ఎందువల్లంటే నేను నీతో వున్నాను. నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను. వారు నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి నిన్ను నేను రక్షిస్తాను.”

16

1 యెహోవా వర్తమానం నాకు వచ్చింది:

2 “యిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి యుండరాదు.”

3 యూదా రాజ్యంలో పుట్టిన కొడుకులు, కూతుళ్లను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మరియు ఆ పిల్లల తల్లిదండ్రులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు:

4 “ఆ ప్రజలు ఒక భయంకరమైన చావు చస్తారు! వారిని గురించి ఒక్కడు కూడా ఏడ్వడు, విచారించడు. వారినెవ్వడూ సమాధిచేయడు. పశువుల పేడవలె వారి శవాలు నేలమీద పడివుంటాయి. వారు శత్రువు కత్తికి బలియైపోతారు. లేదా ఆకలితో మాడి చనిపోతారు. వారి శవాలు ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు ఆహారమవుతాయి.”

5 ‘అందువల్ల యెహోవా ఇలా చెప్పాడు:”యిర్మీయా, ఏ ఇంటిలోనయితే చావు దినపు భోజనాలు జరుగుతూ వుంటాయో, నీవా ఇంటిలోనికి పోవద్దు. చనిపోయిన వారికొరకు విలపించటానికి గాని, నీ సంతాపాన్ని వెలిబచ్చటానికి గాని నీవక్కడికి వెళ్లవద్దు. ఆ పనులు నీవు చేయవద్దు. ఎందువల్లనంటే, నా ఆశీర్వాదాన్ని నేను తిరిగి తీసుకున్నాను. యూదా ప్రజలకు నేను కరుణ చూపను. వారి కొరకు నేను బాధపడను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

6 “యూదా రాజ్యంలో ప్రముఖులు, సామాన్యులు అంతా చనిపోతారు. వారినెవరూ సమాధిచేయరు. లేక వారి కొరకు ఎవ్వరూ దుఃఖించరు. మృతుల కొరకు దుఃఖ సూచకంగా ఎవ్వడూ తన శరీరం చీరుకొనటంగాని, తల గొరిగించుకోవటం గాని చేయడు.

7 చనిపోయిన వారికొరకై విలపించేవారికి ఎవ్వరూ ఆహారం తెచ్చియివ్వరు. తల్లిదండ్రులు చనిపోయి విలపించేవారిని ఎవ్వరూ ఓదార్చరు. మృతుల కొరకు రోదించేవారిని ఆదరించుటకు ఎవ్వరూ తాగటానికి నీరు ఇవ్వరు.

8 “విందు జరుపుకుంటూన్న ఏ ఇంటిలోనికీ నీవు వెళ్లవద్దు. ఆ ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి కూర్చోవద్దు.

9 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెప్పినాడు: ‘వేడుక చేసుకొనే వారు ఆనందమును నేను వెంటనే ఆపివేస్తాను. ఇది నీ జీవితకాలంలోనే జరుగుతుంది. ఇవన్నీ త్వరలోనే చేస్తాను.’

10 “యిర్మీయా, యూదా ప్రజలకు నీవు ఈ విషయాలన్నీ చెపుతావు. తిరిగి వారు నిన్నిలా అడుగుతారు: ‘మా విషయంలో దేవుడు ఆ భయంకర విషయాలు జరుగుతాయని ఎందుకు చెప్పాడు? మేము చేసిన తప్పేమిటి? మా యెహోవా దేవునికి వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’

11 అప్పుడు వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి: ‘ఈ భయంకర పరిణామాలు జరగబోవడానికి కారణం మీ పితరులు నన్ను అనుసరించటం మానివేయటమే’ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది - వారు నన్ను వదిలి అనేక ఇతర దైవముల ననుసరించి ఆరాధించినారు. మీ పితరులు నన్ను వదిలి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించుట మానివేశారు.

12 కాని మీరు మీ పూర్వీకులకంటె నీచంగా పాపం చేశారు. మీరు కఠినాత్ములై చాలా మొండివైఖిరి దాల్చారు. మీరు చేయదలచుకున్నదే మీరు చేస్తున్నారు. మీరు నాకు విధేయులుగా లేరు. మీకు యిష్టమైనదే మీరు చేస్తున్నారు.

13 కావున మిమ్మల్ని ఈ దేశంనుండి బహిష్కరిస్తాను. మిమ్మల్ని అన్యదేశానికి తరిమివేస్తాను. మీరు, మీ పూర్వీకులు ముందెన్నడూ చూడని దేశానికి మీరు వెళతారు. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు బూటకపు దేవతలను వెంబడించవచ్చు. నేను మీకు సహాయం చేయను. ఏ రకమైన ఉపకారమూ చేయను.’

14 “ప్రజలు ప్రమాణాలు చేస్తూ, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చిన నిత్యుడైన దేవునితోడు’ అని వారు అంటారు. కాని ప్రజలు ఈ మాటలు అనకుండా ఉండే సమయం ఆసన్నమవుతూఉంది.” ఇది యెహోవా వాక్కు.

15 ప్రజలు వాగ్దానాలు చేసి అంటారు: ‘నిత్యుడైన దేవుని సాక్షిగా’ అని, ‘ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని వచ్చినది నిత్యుడైన యెహోవాయే!’ అని, ‘ఇశ్రాయేలీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల తీసుకొని వచ్చినది ఆయనే’ అని అంటారు. ప్రజలు ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయేలీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి మరల తీకుకొనివస్తాను.

16 “ఈ రాజ్యానికి చాలామంది జాలరులను త్వరలో పంపిస్తాను” ఇది యెహోవా వాక్కు “ఆ జాలరులు యూదా ప్రజలను పట్టుకుంటారు. అది జరిగిన పిమ్మట ఈ రాజ్యానికి చాలామంది వేట గాండ్రును పిలిపిస్తాను. ఈ వేటగాండ్రు యూదావారిని ప్రతి కొండమీద, పర్వతంమీద, కొండ బొరియల్లోను వేటాడతారు.

17 వారు చేసేదంతా నేను చూస్తాను. యూదా వారు చేసేది దేనినీ నానుండి దాచలేరు. వారి పాపం నానుండి మరుగు పర్చబడలేదు.

18 యూదా ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. వారి ప్రతి పాపానికీ రెండు సార్లు శిక్షిస్తాను. ఇది ఎందుకు చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని ‘అపవిత్ర’ పర్చారు. వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో ‘కలుషితం’ చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించుకుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘోరమైన చెడు విగ్రహాలతో నింపివేశారు.”

19 యెహవా, నీవేనాకు బలం; నీవే నాకు రక్షణ. ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు. ప్రపంచ దేశాలన్నీనీ శరణు వేడివస్తాయి. ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు. వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు. కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేదు.”

20 ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయగలరా? చేయలేరు! వారు విగ్రహాలను మాత్రమే చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే కారు!”

21 “అందుచేత బొమ్మల దేవుళ్లను చేసేవారికి నేను గుణపాఠం నేర్పుతాను. ఇప్పుడే వారికి నా శక్తిని గురించీ, నా బలాన్ని గురించీ తెలియజెబతాను. అప్పుడు నేనే దేవుడననే జ్ఞానం వారికి కలుగుతుంది. నేనే యోహోవా అని వారు తెలుసుకుంటారు.”

17

1 “యూదా ప్రజల పాపం తుడిచి వేయలేని చోట వ్రాయబడింది. వారి పాపాలు ఇనుపకలంతో రాతిలోకి చెక్కబడ్డాయి. వారి పాపాలు వజ్రపు మొనతో రాతిలోకి చెక్కడ్డాయి. వారి గుండెలే ఆ రాతి ఫలకాలు.

2 బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు వారి పిల్లలకు గుర్తున్నాయి. ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ములమీద చెక్కబడినాయి. అషేరా దేవతకు అంకితం చేయబడిన దేవతా చెక్కస్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి. కొండలమీద, పచ్చని చెట్లకింద జరిగిన తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి.

3 మైదాన ప్రదేశాలలోగల పర్వాతాల మీద జరిగిన సంగతులు వారికి గుర్తున్నాయి. యూదా ప్రజలకు నిధి నిక్షేపాలున్నాయి. వాటిని నేను అన్య ప్రజలకు ఇచ్చివేస్తాను! మీ దేశంలోగల ఉన్నత స్థలాలన్నీ (పూజా ప్రదేశాలు) ప్రజలు నాశనం చేస్తారు. ఆ ప్రదేశాలలో ఆరాధనలు చేసి మీరు పాపం చేశారు.

4 నేను మీకిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. మీ విరోధులు మమ్మల్ని బానిసలుగా తీసుకొని పోయేలా చేస్తాను. ఎందువల్లనంటే, నేను చాలా కోపంగా ఉన్నాను. నా కోపం దహించే అగ్నిలా ఉంది. మీరందులో శాశ్వతంగ కాలిపోతారు.”

5 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు: “ఇతర ప్రజలను నమ్మేవారికి కీడు జరుగుతుంది. బలం కొరకు ఇతర ప్రజలపై ఆధారపడేవారికి కష్ట నష్టాలు వస్తాయి. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాను నమ్ముట మాని వేశారు.

6 ఆ ప్రజలు ఎడారిలో పొదలావున్నారు. ఆ పొదవున్న ప్రాంతంలో ఎవ్వరూ నివసించరు. ఆ పొద బోటలు వారిన ఉష్ట ప్రదేశంలో ఉంది. ఆ పొద చవుడు భూమిలో ఉంది. ఆ పొదకు దేవుడు ఇవ్వగల అనేక శుభాలను గురించి తెలియదు.

7 కాని యెహోవాలో నమ్మిక గల వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. ఎందువల్లనంటే తనను నమ్మవచ్చని యెహోవా నిరూపిస్తాడు.

8 నీటి వనరులున్నచోట నాటిన చెట్టువలె ఆ వ్యక్తి ఏపుగా, బలంగా ఉంటాడు. నీటి వనరులున్న చెట్టుకు బలమైన వేర్లుంటాయి. ఆ చెట్టు వేసవి వేడికి తట్టుకుంటుంది. దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి. ఒక సంవత్సరం వర్షాలు కురియకపోయినా దానికీ భయముండదు. ఆ చెట్టు ఎల్లప్పుడు కాయలుకాస్తుంది.

9 “మానవ మనస్సు మిక్కిలి కపటంతో కూడివుండి. మనస్సు చాలా వ్యాధిగ్రస్తమయ్యింది. మానవ మనస్సును ఎవ్వరూ సరిగా అర్థం చేసికోలేరు.

10 కాని యెహోవానైన నేను ఒక వ్యక్తి హృదయంలోకి సూటిగా చూడగలను. వ్యక్తి మనస్సును నేను పరీక్షించగలను. అందువల్ల ఎవ్వరెవ్వరికి ఏమేమి కావాలో నేను నిర్ణయించగలను. ప్రతి వ్యక్తికీ వాని పనికి తగిన జీతభత్యం నేను ఇవ్వగలను.

11 ఒకానొక పక్షి తను గ్రుడ్లు పెట్టకుండానే వేరే పక్షులు పెట్టిన గ్రుడ్లను పొదుగుతుంది. డబ్బుకోసం ఇతరులను మోసం చేసే వాడుకూడా అలాంటి పక్షిలాంటి వాడే. వాని జీవితం సగంగడిచే సరికి వాని ధనం పోతుంది. తన జీవిత ఆఖరి (చివరి) దశలో వాడు పరమ మూర్ఖుడై పోతాడనేది విదితమైన విషయం.”

12 ఆదినుంచీ మన దేవాలయం ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది. అది చాలా ముఖ్యమైన స్థలం.

13 యెహోవా, నీవు ఇశ్రాయేలీయులకు ఆశాజ్యోతివి. దేవా, నీవు జీవజలధారలా ఉన్నావు! ఆయనను విడిచిపెట్టిన వారు అవమానానికి గురవుతారు. వారు అవమానించబడుతారు. జీవిత ప్రమాణం తగ్గిపోతుంది .

14 యెహోవా, నీవు నన్ను బాగుచేస్తే నేను నిజంగా స్వస్థపడతాను! నన్ను రక్షిస్తే, నేను నిజంగా రక్షింపబడతాను. యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.

15 యూదా ప్రజలు నన్ను ప్రశ్నలడుగుతూవుంటారు. “యిర్మీయా, యెహోవా వర్తమానం ఎక్కడ? ఆ వర్తమానం నెరవేరేలా చేయి!” అని వారంటారు.

16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారి పోలేదు. నేను నిన్ను అనుసరించాను. నీవు కోరిన విధంగా నేను గొర్రెలకాపరినయ్యాను. ఆ భయంకరమైన రోజు రావాలని నేను కోరుకోలేదు . యెహోవా, నేను చెప్పిన విషయాలు నీకు తెలుసు. జరుగుతున్నదంతా నీవు చూస్తూనే ఉన్నావు.

17 యెహోవా, నన్ను నాశనం చేయవద్దు. కష్టకాలంలో నేను నిన్నాశ్రయిస్తాను.

18 ప్రజలు నన్ను హింసిస్తున్నారు. వారిని సిగ్గుపడేలాచేయి. కాని నాకు ఆశాభంగం కలుగ చేయకు. ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము. కాని నన్ను మాత్రం పారి పోనీయవద్దు. ఆ భయంకరమైన దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము. వారిని పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా భంగపర్చుము.

19 యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ‘ముఖద్వారం’ వద్ద నిలబడు. అక్కడ యూదా రాజులు లోనికి, బయటకి వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రజలకు నా వర్తమానం అందజేయి. తరువాత అన్ని ద్వారాల వద్దకూ వెళ్లి అలాగే చేయి.

20 “ఆ ప్రజలకు ఇలా చెప్పుము: “యెహోవా వర్తమానం వినండి. యూదా రాజులారా, వినండి. యూదా ప్రజలారా, వినండి. ఈ ద్వారం ద్వారా యెరూషలేములోనికి వచ్చే ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి!’

21 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు ‘సబ్బాతు దినాన మీరేమీ బరువులు ెమోయా కుండా జాగ్రత్త తీసుకోండి. యెరూషలేము నగర ద్వారాల గుండా విశ్రాంతి దినాన ఏమీ బరువులు తేవద్దు.

22 మీ ఇండ్లనుండి కూడా పవిత్ర విశ్రాంతి దినాన బరువులు తేవద్దు. ఆ రోజున మీరు ఏపనీ చేయవద్దు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్ర పర్చాలి. ఇదే రకపు ఆజ్ఞను మీ పూర్వీకులకు కూడ యిచ్చియున్నాను.

23 కాని మీ పూర్వీకులు నా ఆజ్ఞను శిరసావహించలేదు. వారు నేను చెప్పిన దానిని లక్ష్య పెట్టలేదు. మీ పితరులు బహు మొండివారు. నేను వారిని శిక్షించాను. కాని దానివల్ల ఏమీ మంచి జరగలేదు. వారు నేను చెప్పినది వినలేదు.

24 కాని మీరు నా ఆజ్ఞను అనుసరించేలా జాగ్రత్తపడాలి.” ఇది యెహోవా వాక్కు. “మీరు ఎట్టి పరిస్థితిలోనూ విశ్రాంతి దినాన యెరూషలేము నగర ద్వారాలనుండి బరువులు తేరాదు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపర్చాలి. అనగా మీరు ఆ రోజు ఏ పనీ చేయకుండా దాని పవిత్రతను కాపాడవచ్చు.

25 “మీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం గుండా వస్తారు. ఆ రాజులు రధాలమీద, గుర్రాల మీద ఎక్కి వస్తారు. ఆ రాజుల వెంట యూదా, యెరూషలేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూషలేము నగరంలో శాశ్వతంగా ప్రజలు నివసిస్తారు.

26 యూదా పట్టణాలనుండి ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. చుట్టుపట్లవున్న చిన్న చిన్న గ్రామాలనుండి కూడా ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. బెన్యామీను వంశీయులున్న రాజ్యంనుండి కూడా ప్రజలు వస్తారు . పడమట నున్న కొండవాలు ప్రాంతం నుండి, మన్యప్రాంతం నుండి కూడా ప్రజలు వస్తారు. మరియు యూదా దక్షిణ ప్రాంతంనుండి కూడా నెగెవు ప్రజలు వస్తారు. ఆ ప్రజలు కృతజ్ఞతార్పణలు, దహన బలులు, బలులు, ధాన్యార్పణలు, ధూపద్రవ్వాలు, తెస్తారు. వారా అర్పణలను, బలులను యెహోవా ఆలయానికి తెస్తారు.

27 “అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వార ములవద్దు మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.”

18

1 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవానుండి వచ్చినది:

2 “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.”

3 నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కుమ్మరి తన సారె (చక్రం)పై కుండలు చేస్తున్నాడు.

4 బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.

5 అప్పుడు యెహోవా వాక్కు వాకు వినిపించింది:

6 “ఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విషయంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి వానిలా వున్నాను!

7 నేను ఒక దేశాన్ని గురించిగాని, ఒక సామ్రాజ్యాన్ని గురించి గాని మాట్లాడే సమయం రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్పవచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామ్రాజ్యాన్నిగాని కిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను.

8 అయితే ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడవడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు తెచ్చి పెట్టినా పథకాన్ని నేను అమలుపర్చను.

9 ఒక దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయంరావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరుస్తానని అనవచ్చు.

10 కాని ఆ దేశ ప్రజలు నాకు విధేయులుకాకుండా దుష్టకార్యాలు చేస్తూ ఉండవచ్చు. అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది.

11 “కావున యిర్మీయా, యూదా ప్రజలకు, యెరూషలేము నగర వాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడని చెప్పుము: ‘మీకు నేనిప్పుడే కష్టాలు సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్టకార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ మార్పు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు పెట్టాలి!’

12 కాని యూదా ప్రజలు ఇలా సమాధాన మిస్తారు, ‘మార్చుటకు ప్రయత్నం చేయుటవల్ల ఏమీ ప్రయోజనముండదు. మేము చేయదలచుకున్నదేదో అదే చేస్తూపోతాము. మాలో ప్రతివాడూ తన కఠినమైన దుష్టమైన హృదయం ఎలా చెపితే అలా నడుచుకుంటాడు.”‘

13 యెహోవా చెప్పే విషయాలు వినండి: “అన్య దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి: ఇశ్రాయేలు చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తున్నట్లు మీరెప్పుడైనా విన్నారా?’ పైగా ఇశ్రాయేలు దేవుని వధువులా ఉంది!

14 పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు . లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు. అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.

15 కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు. వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్పించారు. నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు పాటు చెందుతారు. వారి పితరులు నడచిన పాత దారిలో నడిచి తడబడతారు. నా ప్రజలు వేరే మార్గాన నడుస్తారు. గతుకుల బాటలపై నడుస్తారు. కాని వారు మంచి మార్గంపై నన్నను సరించరు!

16 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది! ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు. ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!

17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి రానివారిగా పడవేస్తాను. బలమైన తూర్పుగాలి వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని విసరివేస్తాను. నేనా ప్రజలను నాశనం చేస్తాను. ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు నన్ను చూడలేరు. మరియు! నేను వారిని వదిలి పెడుతున్నట్లుగా చూస్తారు!”

18 పిమ్మట యిర్మీయా శత్రువులు ఇలా అన్నారు: “రండి. మనం యిర్మీయా పై కుట్ర పన్నుదాము. నిశ్చయముగా యాజకుడు చెప్పిన ధర్మశాస్త్రము వృధాపోదు, జ్ఞానులు చెప్పిన సలహాలు ఇంకా మనతో ఉంటాయి. ప్రవక్తల మాటలు మనకు ఇంకా ఉంటాయి. అందువల్ల మనం అతనిపై అబద్ధప్రచారం చేద్దాం. అది అతనిని నాశనం చేస్తుంది. అతడి మాటలను మనం వినము.”

19 యెహోవా, నా మనవి ఆలకించుము. నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము.

20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను. వారు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నన్ను చంపే ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు.

21 కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి లేక మాడి పోయేలా జేయి. వారి శత్రువులు వారిని కత్తులతో ఓడించును గాక! వారి భార్యలు తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక! యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవుదురు గాక! వారి భార్యలను వితంతువులుగా చేయి. వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు చనిపోవును గాక.

22 వారి ఇండ్లలో రోదనలు కలుగును గాక! నీవు వారిపైకి ఆకస్మికంగా శత్రువును రప్పించినపుడు వారు మిక్కిలి విలపించేలా చేయి. నా శత్రువులు నన్ను మోసం చేయదలచినందుకు ఇదంతా వారికి సంభవించును గాక! నా అడుగు పడ్డ వెంటనే పట్టడానికి బోనులు అమర్చారు.

23 యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తుగడలన్నీ నీకు తెలుసు. వారి నేరాలను క్షమించవద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు. నా శత్రువులను మట్టు బెట్టు! నీకు కోపం వచ్చినపుడు వారిని శిక్షించు!

19

1 యెహోవా నా తో ఇలా చెప్పినాడు: “యిర్మీయా, నీవు ఒక కుమ్మరి వాని వద్దకు వెళ్లి ఒక మట్టి జాడీ కొనుగోలు చేయి.

2 యెరూషలేము నగర కుమ్మరి ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు నాయకులను, యాజకులను తీసికొని వెళ్లు. ఆ స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని వారికి తెలియజేయుము.

3 నీతో ఉన్న వారితో ఇలా చెప్పు, ‘యూదా రాజా, యెరూషలేము నగర వాసులారా, యెహోవా వాక్కు వినండి! ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: ఈ ప్రదేశానికి త్వరలో నేను ఘోర విపత్తు సంభవించేలా చేస్తాను! దానిని గురించి విన్న ప్రతి ఒక్కరు ఆశ్ఛర్యపడి భయంతో నిండిపోతాడు.

4 నేను ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్నను సరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని వారు పరదేశాల ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనైవేద్యాలు సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదేశాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు.

5 బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు.

6 మరియు బెన్‌హిన్నోములో గల ఈ స్థలాన్ని వారిప్పుడు తోఫెతు అని పిలుస్తారు. కాని నేను మీకీ హెచ్చరిక ఇస్తున్నాను: ప్రజలీ స్థలాన్ని కసాయి లోయ అని పిలిచే రోజులు వస్తున్నాయి. ఇది యెహోవా వాక్కు.

7 యూదా ప్రజల, యెరూషలేము వాసుల పథకాలన్నీ నేనీ ప్రదేశంలో వమ్ము జేస్తాను. శత్రువు ఈ ప్రజలను తరిమికొడతాడు. యూదా ప్రజలు ఈ ప్రదేశంలో శత్రువు కత్తికి ఆహుతై పోయేలా నేను చేస్తాను. వారి శవములను పక్షులకు, అడవి మృగాలకు ఆహారమయ్యేలా చేస్తాను.

8 ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయంచెందుతారు.

9 శత్రు సైన్యాలు నగరాన్ని చుట్టు ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందువల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు ఆకలి భాధను తట్టుకొలేక తమ పిల్లల శరీరాలనే తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు తింటారు.’

10 “యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియచెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని కింద పడవేసి పగుల గొట్టుము.

11 అప్పుడీ మాటలు చెప్పు: ‘ఒకానొకడు మట్టి జాడీని పగులగొట్టినట్లు నేను యూదా రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్నీ విచ్ఛిన్నం చేస్తానని సర్వశక్తిమంతుడగు యెహోవా చెపుతున్నాడు! ఈ ముక్కలను మరల కొత్త జాడీగా కూర్చలేము.

12 యూదా రాజ్యం విషయంలో కూడ అలాగే జరుగుతుంది. చనిపోయిన వారంతా తోఫెతులో, సందు లేకుండా పాతిపెట్టిబడతారు.

13 యెరూషలేము లోని ఇండ్లన్నీ తోఫెతువలె “అపవిత్ర” పర్చబడతాయి. తోఫెతువలె యూదా రాజుల రాజభవనాలన్నీ పాడవుతాయి. ఇది ఎందువల్ల జరుగుతుందంటే ప్రజలు వారి ఇండ్లలో కప్పుల మీద బూటకపు దేవతలను ఆరాధించినారు. నక్షత్రాలను వారు ఆరాధించి, వాటి గౌరవార్థం బలులు సమర్పించేవారు. బూటకపు దేవతలకు పానీయార్పణలు సమర్పించారు.”

14 తోఫెతును వదిలి, దేవుడు తనను బోధించమన్న చోటికి యిర్మీయా వెళ్లాడు. యిర్మీయా దేవాలయానికి వెళ్లి, గుడి ఆవరణలో నిలబడినాడు. అక్కడి ప్రజలనుద్దేశించి యిర్మీయా ఇలా అన్నాడు:

15 “ఇశ్రాయేలు దేవుడు. సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెలవిచ్చినాడు: “యెరూషలేముకు, దాని చుట్టు పట్ల గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పియున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండటానికి నిరాకరిస్తున్నారు.”‘

20

1 ఆ దేవాలయంలో పషూరు అనబడే ఒక యాజకుడున్నాడు. అతడు దేవాలయంలో ప్రధానాధికారి. పషూరు తండ్రి పేరు ఇమ్మేరు. యిర్మీయా ఈ భవిష్యత్ విషయాలు ఆలయ ప్రాంగణంలో చెప్పటం పషూరు విన్నాడు.

2 అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య వేయించాడు.

3 ఆ మరునాడు యిర్మీయాను పషూరు బొండ కొయ్య బంధం నుండి తొలగించాడు. అప్పుడు యిర్మీయా పషూరుతో ఇలా అన్నాడు, “దేవుడు నిన్ను పిలిచే పేరు పషూరు కాదు. ఆయన నీకు మాగోర్ మిస్సాబీబ్ అని పేరు పెడతాడు.

4 ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబలోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబలోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు.

5 యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబలోను దేశానికి పట్టుకు పోతాడు.

6 ఓ పషూరు, నీవు, మరియు నీ ఇంటి వారందరునూ కూడా తీసుకొని పోబడతారు. బబలోనులో నివసించటానికి నీవు బలవంతంగా కొనిపోబడతావు! నీవు బబలోనులోనే చనిపోతావు. నీవా అన్య దేశంలోనే సమాధి చేయబడతావు. నీ స్నేహితులకు నీవు అబద్ధాలు బోధించావు. నేను చెప్పే విషయాలన్నీ జరగవని నీవు చెప్పినావు. నీ సహచరులంతా బబలోనులో చనిపోయి అక్కడే సమాధి చేయబడతారు.”‘

7 యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను. నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు. నేను నవ్వుల పాలయ్యాను. రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.

8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను. దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను. యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను. కాని నా ప్రజలు నన్ను కేవలం అవమాన పర్చి, హేళన చేస్తున్నారు.

9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను. ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!” అని నేను కొన్ని సార్లు అనుకున్నాను. కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది! అది నన్ను లోపల దహించి వేస్తుంది. దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను. ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.

10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను. ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను. నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు. “మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం! లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు1 అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు. తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు. లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు”నని వారంటున్నారు.

11 కాని యెహోవా నాతో వున్నాడు. యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు. కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు. వారు నన్ను ఓడించలేరు. వారి ప్రయత్నం వ్యర్థం. వారు ఆశా భంగం చెందుతారు. వారు అవమానం పాలవుతారు. వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.

12 సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు. మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు. ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.

13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము! యెహోవా పేద వారిని ఆదుకుంటాడు! ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!

14 నేను పుట్టిన రోజు శపింపబడును గాక! నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు.

15 నేను పుట్టినట్లు నా తండ్రికి వర్తమానం యిచ్చిన మనుష్యుని శపించుము “నీకు పుత్ర సంతానం కలిగింది” అని చెప్పి అతడు నా తండ్రిని మిక్కిలి సంతోషపరిచాడు.

16 యెహోవా సర్వనాశనం చేసిన ఆ నగరాల మాదిరిగానే ఆ మనుష్యుడు కూడా దౌర్భాగ్యుడగును గాక! యెహోవా ఆ నగరాలపై ఏమాత్రం కనికరం చూపలేదు వారు ఉదయాన్నే యుద్ధ నినాదాలను విందురుగాక! మధ్యహ్న సమయంలో అతడు యుద్ధశోకాలు వినును గాక!

17 ఎందువల్లననగా అతడు నేను నా తల్లి గర్భంలో ఉండగానే నన్ను చంపలేదు. అతడే గనుక అప్పుడు నన్ను చంపి వుంటే నా తల్లి గర్భమే నాకు నా సమాధి అయివుండేది. నేను పుట్టివుండే వాడినే కాను.

18 నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటికి వచ్చినట్లు? నేను వచ్చి చూచినదంతా కష్టము, దుఃఖమే! నా జీవితం అవమానంతో అంతమవుతుంది.

21

1 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు.

2 యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహవాను అడిగి తెలుసుకొనుము. బబలోను రాజైన నెబకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”

3 అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధాన మిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి:

4 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబలోను రాజు నుండి, కల్దీయుల నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుప యోగమయ్యేలా నేను చేస్తాను. “‘బబలోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాని యెరూషలేము లోనికి రప్పిస్తాను.

5 యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను.

6 యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా వారంతా చనిపోతారు.

7 అదే జరిగిన తరువాత “యూదా రాజైన సిద్కియాను బబలోను రాజైన నెబకద్నెజరుకు అప్పగిస్తాను. ఇదే యెహోవా వాక్కు. అంతేగాదు, సిద్కియా అధికారులను కూడా నెబకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చని పోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపదు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’

8 “యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి!

9 యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగి పోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముటింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు.

10 యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి నేను సంకల్పించాను. ఇదే యెహోవా వాక్కు “బబలోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.”

11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి: యెహోవా వర్తమానాన్ని వినండి!

12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: నీవు ప్రతి రోజా ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి. నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము. నీవది చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం ఎవ్వరూ ఆపలేని దహించు అగ్నిలా ఉంటుంది. మీరు దుష్ట కార్యాలు చేశారు గనుక ఇది జరుగుతుంది.

13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను. నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు. నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు. యెరూషలేము వాసులారా ‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు, ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు. కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.

14 మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు! మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను. ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”

22

1 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు రాజభవనానికి వెళ్లు. అక్కడ యూదా రాజును కలిసి ఈ వర్తమానాన్ని అతనికి చెప్పు.

2 ‘ఓ యూదా రాజా, యెహోవా యొక్క ఈ వర్తమానాన్ని ఆలకించు. నీవు దావీదు సింహాసనంపై కూర్చుని పరిపాలిస్తున్నావు గనుక, ఇది వినుము. ఓ రాజా! నీవును నీ అధికారులును శ్రద్ధగా వినండి. యెరూషలేము ద్వారాల నుండి వచ్చే నీ ప్రజలంతా ఈ యెహోవా వాక్కును తప్పక వినాలి.

3 యెహోవా ఇలా చెపుతున్నాడు: న్యాయమైన, నీతిగల పనులనే చేయండి. దోపిడిగాండ్ర బారినుండి దోచుకోబడిన వారిని ఆదుకోండి. అనాధ పిల్లలను, వితంతువులను బాధించవద్దు. వారిపట్ల మీరు అపచారం చేయవద్దు. అమాయకులను చంపవద్దు.

4 ఈ ఆదేశ సూత్రాలను మీరు పాటిస్తే, మీకు ఈ మంచి పనులు జరుగుతాయి: దావీదు సింహాసనంపై కూర్చున్న రాజులంతా నగర ద్వారాలగుండా యెరూషలేముకు నిరంతరం రాగలుగుతారు. ఆ రాజులు వారు అధికారులతో సహా నగర ద్వారాల నుండి వస్తారు. ఆ రాజులు, వారి అధికారులు, వారి ప్రజలు అందరూ రథాలలోను, గుర్రాల మీదను స్వారీ చేస్తూ వస్తారు.

5 కాని మీరీ ఆదేశాలను పాటించకపోతే యెహోవా ఇలా చెప్పుచున్నాడు: యెహోవానైన నేను ప్రమాణ పూర్వకంగా చెప్పేదేమంటే, ఈ రాజగృహం నాశనం చేయబడుతుంది. ఇది కేవలం ఒక రాళ్ల గుట్టగా మారిపోతుంది”

6 యూదా రాజు నివసించే భవనాన్ని గురించి యెహోవా చెప్పేదేమంటే: “గిలియాదు అడవుల్లా ఈ భవంతి చాలా ఎత్తుగా ఉంది లెబానోను పర్వతాలవలె ఈ భవంతి ఎత్తుగావుంది కాని నేను నిజంగా దీనిని ఎడారిలా మార్చివేస్తాను. నిర్మానుష్యంగా వున్న నగరంవలె ఈ భవంతి ఖాళీగా వుండి పోతుంది.

7 ఈ భవనాన్ని నాశనం చేయటానికి నేను మనుష్యులను పంపుతాను. ఆ రాజగృహ నాశనానికి వచ్చిన ప్రతి వాని చేతిలోను ఒక ఆయుధం ఉంటుంది. అందమైన, బలమైన మీ దేవదారు దూలాలను నరికి వేస్తారు. నరికిన ఆ దూలాలను వారు తగలబెడతారు.

8 “ఇతర దేశాల ప్రజలెందరో ఈ నగరం పక్కగా వెళతారు. వారంతా, ‘యెహోవా యెరూషలేమున కెందుకీ దుర్గతి పట్టించాడు? యెరూషలేము ఒక గొప్ప నగరం’ అని ఒకరి నొకరు అడుగుతారు.

9 దానికి సమాధానమిది: ‘యూదా రాజ్య ప్రజలు వారి యెహోవా దేవుని నిబంధనను అనుసరించటం, మాని వేయటం మూలంగా దేవుడు యెరూషలేమును నాశనం చేశాడు. ఆ ప్రజలు అన్య దేవుళ్ళను కొలిచి ఆరాధించారు.”‘

10 చనిపోయిన రాజు కొరకు దుఃఖించవద్దు . అతని కొరకు విచారించవద్దు. కాని ఇక్కడ నుండి వెళ్లి పోయే రాజు కొరకు మిక్కిలిగా దుఃఖించండి . అతని కొరకు దుఃఖించండి; ఎందువల్లనంటే అతడు మరి తిరిగి రాడు. యెహోయాహాజు తన మాతృ భూమిని మరల చూడడు.

11 యోషీయా కుమారుడైన షల్లూము (యెహోయాహాజు తన తండ్రి మరణానంతరం అతడు రాజయ్యాడు) ను గురించి యెహోవా యిలా అంటున్నాడు: “యెహోయాహాజు యెరూషలేము నుండి దూరంగా వెళ్లిపోయాడు. యెరూషలేముకు అతడు మరల తిరిగి రాడు.

12 ఈజిప్టీయులు యెహోయాహాజును ఎక్కడికి తీసుకొని వెళ్లారో అతనక్కడే చనిపోతాడు. ఈ రాజ్యాన్ని అతడు మరల చూడడు.”

13 రాజైన యెహోయాకీముకు వ్యతిరేకంగా ఇది మిక్కిలి కీడు. తన భవన నిర్మాణానికి అతడు మిక్కిలి చెడ్డ పనులు చేస్తున్నాడు. పై అంతస్తులో గదులు కట్టడానికి అతడు ప్రజలను మోసగిస్తున్నాడు. నా ప్రజలచే అతడు వూరికే పని చేయిస్తూ ఉన్నాడు. వారి పనికి అతడు ప్రతి ఫలం ఇవ్వటం లేదు.

14 “నా కొరకు నేనొక గొప్ప భవంతిని నిర్మిస్తాను. పై అంతస్తులో ఎన్నో గదులు నిర్మిస్తాను,” అని యెహోయాకీము అంటాడు. అలా అని అతడు తన భవంతిని పెద్ద పెద్ద కిటికీలతో నిర్మిస్తాడు. వాటి చట్రాలకు, తలుపులకు దేవదారు కలపను ఉపయోగించాడు. వాటికి అందంగా ఎరువు రంగు వేశాడు.

15 యెహోయాకీమా, నీ ఇంటిలో విశేషించి ఉన్న దేవదారు కలప నిన్ను గొప్ప రాజును చేయదు. నీ తండ్రియగు యోషీయా తనకు కావలసిన ఆహారపానీయాలతో తృప్తి పడ్డాడు. అతడు ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానిని చేశాడు. యోషీయా సత్ప్రవర్తనుడై నందున అతనికి అంతా సవ్యంగా జరిగిపోయింది.

16 యోషీయా పేదవారిని, అవస్థలో ఉన్న వారిని ఆదుకున్నాడు. యోషీయా అలా చేయుటవల్ల అతనికి అంతా సవ్వంగా జరిగి పోయింది. యెహోయాకీమా, “దేవుని తెలుసు కొనుట” అంటే ఏమిటి? దీనులకు దరిద్రులకు సహాయం చేయటం మరియు న్యాయంగా ప్రవర్తించటమే నన్ను తెలుసుకొనే మార్గాలు.” ఇదే యెహోవా వాక్కు.

17 యెహోయాకీమా నీకు ఏది లాభదాయకంగా ఉంటుందా, అని నీ కళ్లు వెదకుతూ ఉంటాయి. ఇంకా, ఇంకా ఎలా సంపాదించాలా అని సదా నీ మనస్సు దానిపై లగ్నమై ఉంటుంది. అందుకు అమాయకులను బలి చేయటానికి కూడా నీవు సిద్ధంగా ఉన్నావు ఇతరుల సొమ్మును దొంగిలించటానికి నీవు ఇష్ట పడుతున్నావు.

18 కావున యోషీయా కుమారుడైన యెహోయాకీము రాజునకు యెహోవా చెప్పుచున్న దేమనగా: “యూదా ప్రజలు యెహోయాకీమును గూర్చి ఏడ్వరు ‘అయ్యో, నా సోదరుడా, నేను యెహోయాకీమును గురించి దుఃఖిస్తున్నాను! అయ్యో, నా సహోదరీ, నేను యెహోయాకీమును గురించి విచారిస్తున్నాను!’ అని ప్రజలు ఒకరి కొకరు చెప్పుకోరు. యూదా ప్రజలు యెహోయాకీమును గిరించి విచారించరు. ‘ఓ యజమానీ, నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను. ఓ రాజా, నేను నీకై విచారిస్తున్నాను!’ అని వారతనిని గురించి చెప్పరు.

19 చచ్చిన గాడిదను పూడ్చి పెట్టినట్లు యెరూషలేము ప్రజలు యెహోయాకీమును పాతిపెడతారు. అతని శవాన్ని వారు ఈడ్చి పార వేస్తారు. వారు అతని శవాన్ని యెరూషలేము తలుపుల బయటికి విసరి వేస్తారు.

20 “యూదా! లెబానోను పర్వతం మీదికి వెళ్లి కేకలువేయి. నీ స్వరము బాషాను పర్వతాలలో వినిపించనియ్యి. అబారీము పర్వతాలలో మిక్కిలి రోదించు. ఎందువల్లనంటే నీవు మోహించిన వారంతా నాశనమవబోతున్నారు.

21 యూదా! నీవు చాలా సురక్షితంగా ఉన్నటు భావించావు. కాని నిన్ను నేను హెచ్చరించాను! నేను నిన్ను హెచ్చరించినా నీవు లక్ష్యపెట్టలేదు! నీవు చిన్న వయస్సులో ఈ విధంగా నివసించావు. యూదా, నీ చిన్న వయస్సు నుండే నీవు నాకు విధేయుడవు కాలేదు

22 యూదా, నేను విధించే శిక్ష తుఫానులా వస్తుంది. అది నీ గొర్రెల కాపరుల నందరినీ (నాయకులను) ఊది వేస్తుంది. ఇతర దేశాలు కొన్ని నీకు సహాయపడతాయని అనుకున్నావు. కాని ఆ రాజ్యాలు కూడ ఓడింపబడతాయి. అప్పుడు నీకు తప్పక అవమానము కలుగుతుంది. నీవు చేసిన దుష్కార్యాలను తలచుకొని నీవు సిగ్గు చెందుతావు.

23 ఓ రాజా, కొండ మీద దేవదారు కలపతో నిర్మించిన భవనంలో నీవు నివసిస్తున్నావు. ఈ కలప తేబడిన లెబానోను దేశంలోనే నీ వున్నట్లుగా వుంది. కొండ మీది ఆ పెద్ద భవంతిలో నీకు నీవు సురక్షితం అనుకుంటున్నావు. కాని నీకు శిక్ష వచ్చినప్పుడు నీవు నిజంగా రోదిస్తావు. స్త్రీ ప్రసవ వేదన అనుభవించినట్లు నీవు బాధపడతావు.”

24 “యెహోయాకీము కుమారుడవు, యూదా రాజువైన యెహోయాకీనూ, “నేను నివసించునంత నిశ్చయముగా” చెపుతున్నాను. ఇది యెహోవా వాక్కు ఇది నీకు చేస్తాను. “నీవు నా చేతి ఉంగరమైనా నిన్ను నేను లాగి పడవేస్తాను!

25 యెహోయాకీనూ, నిన్ను నేను బబలోను రాజైన నెబకద్నెజరుకు, కల్దీయులకు అప్పిగిస్తాను. వారిని గురించే నీవు భయపడుతున్నావు. వారు నిన్ను చంపచూస్తున్నారు.

26 నిన్ను, నీ తల్లినీ మీరు పుట్టని దేశానికి త్రోసి వేస్తారు. నీవు, నీ తల్లి ఆ పరాయి దేశంలో చనిపోతారు.

27 యెహోయాకీనూ, నీ మాతృ భూమికి రావాలని నీవు గాఢంగా కోరుకుంటావు. కాని నీ కోరిక తీరదు.” నీవు వచ్చుటకు నేను అనుమతించను.

28 ఒక వ్యక్తిచే నేలకు విసరి కొట్టబడిన మట్టి కుండ మాదిరి, కొన్యా యొక్క (యోహోయాకీను) స్థితి వున్నది. ఎవ్వరికీ పనికిరాని ఓటి కుండ మాదిరిగా అతడున్నాడు. యెహోయాకీను, అతని పిల్లలు ఎందుకు విసర్జించబడతారు? వారెందుకు అన్య దేశానికి తోయబడతారు?

29 యూదా రాజ్యమా, ఓ రాజ్యమా, ఓ రాజ్యమా! యెహోవా వర్తమానం వినిము!

30 యెహోవా ఇలా అంటున్నాడు: “యెహోయాకీను గురించి ఈ విషయం వ్రాసి పెట్టండి: ‘అతడు పిల్లలు లేని వానితో లెక్క! తన జీవిత కాలంలో యెహోయాకీను ఏమీ సాధించలేడు. అతని పిల్లలలో ఎవ్వడూ దావీదు సింహాసనం మీద కూర్చోడు. అతని సంతానంలో ఎవడూ యూదా రాజ్యాన్ని ఏలడు.”

23

1 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.

2 ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

3 “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి.

4 నా గొర్రెల మందపై నేను కొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.

5 “నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని మొలిపింప జేసే సమయం వస్తూవుంది,” ఇదే యెహోవా వాక్కు. అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు. దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు.

6 శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు. ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది. “యెహోవా మనకు న్యాయం “ అని అతనికి పేరుగా ఉంటుంది.

7 కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు.

8 కాని ఇశ్రాయేలు ప్రజలు కొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. ‘ యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు” అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.”

9 ప్రవక్తలకు పవిత్రమైన మాటలు: నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది. నా ఎముకలు వణుకుతున్నాయి. నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను. యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.

10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది. వారనేక విధాలుగా అనిశ్వాసులై ఉన్నారు. యెహోవా రాజ్యాన్ని శపించాడు. అందుచే అది బీడై పోయింది. పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి. పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి. ప్రవక్తలంతా దుష్టులయ్యారు. ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.

11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు. వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.” ఇదే యెహోవా వాక్కు.

12 “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను. వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచి నట్లుంటుంది. ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది. గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు. వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను. ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.” ఇదే యెహోవా వాక్కు.

13 “సమరయ ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను. బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను. ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.

14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన పనులు చేయటం నేను చూశాను. ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు. వారు అబద్ధాలను వింటారు. వారు తప్పుడు బోధనలను అనుసరించారు. వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు. అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు. వారు సొదొమ నగరంవలె ఉన్నారు. యెరూషలేము ప్రజలు నా దృష్టిలో గొమొర్రా నగరంవలె ఉన్నారు!”

15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు. “ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది. ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన ఒక రుగ్మతను ప్రబలింప చేశారు. ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”

16 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: “ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు. వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు. కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు. వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే.

17 కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు. అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు. ‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు. కొంత మంది ప్రజలు బహు మొండివారు. వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు. కావున వారికి ఆ ప్రవక్తలు, ‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు.

18 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో నిలవలేదు. వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు. వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.

19 ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది! యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది! ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.

20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు ఆయన కోపం చల్లారదు. అంత్యదినాల్లో దీనిని మీరు సరిగా అర్థం చేసికుంటారు.

21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు. కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు. నేను వారితో మాట్లాడలేదు. కాని వారు నా పేరుతో ప్రవచించారు.

22 వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు. ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు. వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.”

23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను. నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను. ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ నేను దూరంలో లేను!

24 ఒక వ్యక్తి నాకు నకపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు. కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!”

25 “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను.

26 ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలో చిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు.

27 యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు.

28 ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి.

29 నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది.

30 “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.”ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు .

31 నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు.

32 అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు

33 “యూదా ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక ఒక యాజకుడు గాని నిన్ను పిలిచి, ‘యిర్మీయా, యెహోవా ఏమి ప్రకటిస్తున్నాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు వారికి సమాధానంగా,’ యెహోవాకు మీరే భారంగా ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని కిందికి విసరి వేస్తాను. ఇదే యెహోవా వాక్కు,’ అని నీవు చెప్పు.

34 “ఒక ప్రవక్తే గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో ఎవ్వరే గాని, ‘ఇది యెహోవా నుండి వచ్చిన ప్రకటన ...’ అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను.

35 మీరొకరికొకరు ఇలా చెప్పుకోండి, ‘యెహోవా ఏమి సమాధానమిచ్చాడు? లేక ‘యెహోవా ఏమి చెప్పాడు?’

36 అంతేగాని మరెన్నడు, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం)’ అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందువల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు మార్చివేశారు! ఆయన నిత్యుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా!’

37 “మీరు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక ప్రవక్తను, ‘యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు” అని గాని; ‘యెహోవా ఏమి చెప్పినాడు? అని గాని అడగండి.

38 కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి? అని అడగవద్దు. మీరామాటలు వాడితే, అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: ‘మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను.

39 కాని నా సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను ఇచ్చియున్నాను. కాని మిమ్మల్ని, మీ నగరాన్నీ నా నుండి దూరంగా పార వేస్తాను.

40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.”

24

1 యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబలోను రాజైన నెబకద్నెజరు యెకోన్యాను బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొని పోబడినారు. వారు బబలోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.)

2 ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి.

3 “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు. “నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అని చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను.

4 పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది.

5 ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారు శత్రువు వారిని బబలోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను.

6 నేను వారిని రక్షిస్తాను. నేను వారిని తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెందటానికి వారిని స్థిరంగా నాటుతాను.

7 వారు నన్ను తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి దేవుడను. బబలోనులో వున్న ఆ బందీలంతా పూర్ణహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు గనుక నేనిదంతా చేస్తున్నాను.

8 “కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు.

9 “నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు.

10 వారి మీదికి కత్తిని, కరువును, రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరులకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము ఉండరు.”

25

1 యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు చేరిన సందేశం ఇది. యెహోయాకీము యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం అయ్యే సరికి నెబకద్నెజరు బబలోనుకు రాజు కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం జరిగింది.

2 ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరికి, యెరూషలేము వాసులందరికి ఈ సందేశం ఇచ్చాడు:

3 యెహోవా నుండి వచ్చిన సందేశాలను గత ఇరవై మూడు సంవత్సరాలలో నేను మీకు పదే పదే ఇచ్చియున్నాను. అమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యాన్ని పదమూడవ సంవత్సరంలో పాలిస్తూ ఉన్నప్పటినుండి నేను ప్రవక్తగా కొనసాగుతున్నాను. ఆనాటి నుండి ఈ నాటి వరకు నేను మీకు యెహోవా సందేశాలను అందజేస్తూ వస్తున్నాను. కాని మీరు వినిపించుకోలేదు.

4 యెహోవా తన సేవకులై ప్రవక్తలను మరల, మరల మీ వద్దకు పంపాడు. కాని వారు చెప్పేది మీరు వినలేదు. మీరసలు వారిని లక్ష్య పెట్టలేదు.

5 ఆ ప్రవక్తలు, “మీ జీవిత విధానం మార్చుకోండి. ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్పు వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పితరులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు శాశ్వాతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన మీకిచ్చాడు.

6 అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు.!”

7 “కాని మీరు నా మాట వినలేదు” ఇది యెహోవా వాక్కు “ఎవడో ఒక వ్యక్తి చేసిన విగ్రహాలను మీరు పూజించారు. అది నన్ను ఆగ్ర హపర్చింది. అదే మిమ్ము బాధ పెట్టింది.”

8 కావున సర్వ శక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు.

9 అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబలోను రాజైన నెబకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు.

10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను.

11 ఆ ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ఆ ప్రజలంతా బబలోను రాజుకింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.

12 “కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను బబలోను రాజును శిక్షిస్తాను. బబలోను రాజ్యాన్ని కూడా శిక్షకు గురి చేస్తాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్దీయుల దేశాన్ని కూడా వారు పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను.

13 బబలోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయిని చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. ఆ హెచ్చరికలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినాయి.

14 అవును. బబలోను ప్రజలు చాలా దేశాలలో ఎక్కుమంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”

15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము.

16 వారీ ద్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్యా వారలా చేస్తారు.”

17 కావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను.

18 యెరూషలేము వాసులకు, యూదా వారికి ఈ ద్రాక్షారసం పోశాను. యూదా రాజులను, నాయకులను ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. వారిని ఎడారిలా మార్చివేయాలని. నేనీ విధంగా ఎందుకు చేశానంటే ఆ ప్రదేశం సర్వనాశనం కావాలని, అది చూచి ప్రజలు కలవర పడిరి. దానిని శపించితిని. చివరికి అలానే జరిగింది. యూదా ఇప్పుడు అలానే తయారయింది.

19 ఈజిప్టు రాజైన ఫరోను కూడా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. అతని అధికారులను, అతని ముఖ్య నాయకులను, మరియు అతని ప్రజలందరినీ యెహోవా కోపపు గిన్నె నుండి తాగేలా చేశాను.

20 అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను. ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా చేశాను. వీరు అష్కెలోను, గాజ, ఎక్రోను నగరాల రాజులు, మరియు అష్డోదులో మిగిలిన రాజ్యానికి అధిపతులు.

21 పిమ్మట ఎదోము, మోయాబు, మరియు అమ్మోను ప్రజలు ఈ గిన్నెతో తాగేలా చేశాను.

22 తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెతో తాగేలా చేశాను. దూరదేశాపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగించాను.

23 దదాను ప్రజలు, తేమానీయులు, బూజీయులందరూ ఈ గిన్నెతో తాగేలా చేశాను. కణతల వద్ద తమ వెంట్రుకలు గొరిగించుకొనే వారందరినీ ఈ గిన్నెతో తాగేలా చేశాను.

24 అరబి రాజులంతా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో నివసిస్తారు.

25 జిమ్రీ రాజులు, ఏలాము రాజులు, మరియు మాదీయుల రాజులు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను.

26 దగ్గరలో ఉన్న, దూరాన ఉన్న ఉత్తర దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఒకరి తరువాత ఒకరు వారంతా తాగేలా చేశాను. యెహోవా కోపపు గిన్నె నుండి భూమిమీద గల రాజ్యాల వారంతా తాగేలా చేశాను. కాని బబలోను రాజు మాత్రం ఇతర రాజ్యాల వారంతా తాగిన పిమ్మట ఆ గిన్నె నుండి ఆఖరికి తాగుతాడు.

27 “యిర్మీయా! ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడని ఆయా రాజ్యాల వారికి తెలియజేయుము: ‘నా కోపపు గిన్నె నుండి తాగండి. మైకం వచ్చేలా తాగి వాంతి చేసుకోండి! కింద పడి మరల లేవకుండా ఉండండి. ఎందువల్లనంటే మిమ్మల్ని చంపటానికి కత్తిని మీమీదికి పంపుతున్నాను!’

28 “ఆ ప్రజలు నీ చేతి నుండి గిన్నెను తీసికోవటానికి నిరాకరిస్తారు. వారు దాని నుండి త్రాగటానికి ఒప్పుకోరు. అయినా నీవు వారిని పిలిచి ఇలా చెప్పాలి: ‘సర్వశక్తిమంతుడైన దేవుడీ సంగతులు తెలియజేస్తున్నాడు. మీరు నిజానికి ఈ గిన్నె నుండి తాగాలి!

29 నా పేరుతో పిలవబడే యోరూషలేము నగరానికి ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడతారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవటానికి నేను కత్తిని పంపుతున్నాను.”‘ ఇదే యెహోవా వాక్కు.

30 “యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి: ‘ఉన్నతమైన, పవిత్రమైన తన ఆలయం నుండి యెహోవా నిలుగెత్తి చాటుతున్నాడు. యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలు)కు వ్యతిరేకంగా చాటుతున్నాడు. ఆయన ద్రాక్షారసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు.

31 ఆ శబ్దం మోత భూమిపై ప్రజలందరికి చేరుతుంది. అసలీ శబ్దం ఎందుకు? యెహోవా అన్ని దేశాల ప్రజలనూ శిక్షిస్తున్నాడు. యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తన వాదన తెలియజెప్పాడు ఆయన ప్రజలపై తీర్పు ఇచ్చాడు. ఆయన కత్తితో దుష్ట సంహారం చేస్తున్నాడు.”‘ ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.

32 సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: “ఒక దేశాన్నుండి మరొక దేశానికి విపత్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి. అవి పెనుతుఫానులా భూమిపై సుదూర తీరాల వరకు వ్యాపిస్తాయి!”

33 ఆ ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండి మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు పశువుల పేడవలె అవి నేలపై పడి ఉంటాయి.

34 కాపరులారా (నాయకులారా), మీరు మందను (ప్రజలను) కాయవలసి ఉంది. కాని ఓ గొప్ప నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి. గొర్రెల కాపరులారా, నేలమీద పడి బాధతో పొర్లండి ఎందువల్లనంటే మీరు సంహరించబడే సమయం సమీపిస్తూ ఉంది. మిమ్ములను కొట్టి చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా మీరు చిందర వందరై పోతారు!

35 గొర్రెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే దొరకదు! ఆ నాయకులు తప్పించుకోలేరు!

36 కాపరులు (నాయకులు) అరవటం నేను వింటున్నాను. మంద (ప్రజలు) కాపరులు రోదించటం నేను వింటున్నాను! యెహోవా వారి పచ్చిక బయళ్లను (దేశం) నాశనం చేస్తున్నాడు!

37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి. యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా ఇది జరిగింది.

38 తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయంకరమైన సింహంలా యెహోవా ఉన్నాడు. యెహోవా కోపంగా ఉన్నాడు! యెహోవా కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది! వారి రాజ్యం వట్టి ఎడారిలా అయిపోయింది.

26

1 యూదా రాజ్యాన్ని యెహోయాకీము పాలిస్తున్న మొదటి సంవత్సరంలో ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు.

2 యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు దేవాలయ ప్రాంగణంలో నిలబడు. దేవుని ఆరాధించుటకై వచ్చే యూదా ప్రజలందరికి ఈ సందేశాన్ని అందజేయుము. నేను నిన్ను మాట్లాడమని చెప్పినదంతా వారికి చెప్పుము. నా సందేశంలో ఏ భాగాన్ని వదిలి పెట్టవద్దు.

3 బహుశః వారు నా సందేశాన్ని విని ఆచరించవచ్చు. బహుశః వారా దుర్మార్గపు జీవితాన్ని విడనాడవచ్చు. వారు గనుక మారితే, నేను వారిని శిక్షించాలనే నా పథకాన్ని కూడా మార్చు కుంటాను. వారు చేసిన అనేక దుష్టకార్యాల దృష్ట్యా నేను వారిని శిక్షించే పథకాన్ని తయారు చేస్తున్నాను.

4 నీ విధి వారికి చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు: నా ఉపదేశాలను అందించాను. వీరు నాకు విధేయులైనా సూక్తులను పాటించాలి!

5 నా సేవకులు (నా ప్రవక్తలు) మీకు చెప్పే విషయాలను మీరు ఆలకించాలి. నా ప్రవక్తలను మీ వద్దకు మరల, పంపియున్నాను. కాని మీరు వారు చెప్పేది ఆలకించలేదు.

6 మీరు నన్ను అనుసరించక పోతే యెరూషలేములో ఉన్న నా ఆలయాన్ని షిలోహులో వున్న నా పవిత్ర గుడారం మాదిరిగా చేసివేస్తాను. ప్రపంచంలోని ప్రజలెవరైనా తమకు గిట్టని నగరాలకు కీడు జరగాలని తలిస్తే, యెరూషలేముకు జరిగినట్లు జరగాలని కోరుకుంటాను.”

7 దేవాలయంలో యిర్మీయా ఈ మాటలు చెప్పటం యాజకులు, ప్రవక్తలు, దేవుని ఆలయానికి వచ్చిన ప్రజలందరూ విన్నారు.

8 ప్రజలకు చెప్పమని యెహోవా ఆజ్ఞ యిచ్చినదంతా యిర్మీయా చెప్పటం ముగించాడు. పిమ్మట యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అంతా యిర్మీయాను పట్టు కున్నారు. “ఈ భయంకరమైన విషయాలు చెప్పి నందుకు నీవు చనిపోవలసినదే! యెహవా పేర అటువంటి విషయాలు చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! షిలోహులోని పవిత్ర గుడారంలా ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పటానికి నీకు ఎంత ధైర్యం! యెరూషలేములో ఎవ్వరూ నివసించని రీతిలో అది ఎడారిలా మారిపోతుందని చెప్పటానికి నీకు ఎన్ని గుండెలు!” అని వారంతా యిర్మీయాను గద్దించారు. యెహోవా గుడిలో వారంతా యిర్మీయాను చుట్టు ముట్టారు.

9 [This verse may not be a part of this translation]

10 [This verse may not be a part of this translation]

11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు కలిసి పాలకులతోను, తదితర ప్రజలతోను మాట్లాడారు. “యిర్మీయా చంపబడాలి. యెరూషలేమును గురించి అతడు చాలా చెడ్డ విషయాలు చెప్పాడు. అతడా విషయాలు చెప్పటం మీరు కూడ విన్నారు” అని వారంతా చెప్పారు.

12 పిమ్మట యిర్మీయా యూదా పాలకులందరితోను, ఇతర ప్రజలతోను మాట్లాడాడు. అతనిలా చెప్పాడు: “ఈ ఆలయాన్ని గురించి, ఈ నగరాన్ని గురించి ఈ విషయాలు చెప్పమని యెహోవా నన్ను పంపాడు. మీరు వినియున్నదంతా యెహోవా తెలియజేసినదే.

13 ఓ ప్రజలారా, మీ జీవిత విధానం మార్చుకోండి! మీరు సత్కార్యాలు చేయుట మొదలుపెట్టండి! మీ దేవుడైన యెహోవాను మీరు అనుసరించాలి. మీరలా చేస్తే యెహోవా తన మనస్సు మార్చుకుంటాడు. యెహోవా మీకు వ్యతిరేకంగా తలపెట్టిన హానికరమైన పనులు చేయడు.

14 ఇక నా విషయానికి వస్తే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీరు ఏది ఉచితమని, న్యాయమని తోస్తే, నాకు అది చేయండి.

15 కాని మీరు నన్ను చంపితే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఖచ్చితంగా ఒక అమాయక వ్యక్తిని చంపిన నేరానికి పాల్పడిన వారవుతారు. అంతే కారు మీరీ నగరాన్ని, అందులోని ప్రతి పౌరుణ్ణి కూడ నేరస్థులుగా చేసిన వారవుతారు. యెహోవా నిజంగా నన్ను మీ వద్దకు పంపియున్నాడు. మీరు విన్న సందేశం వాస్తవంగా యెహోవా నుండే వచ్చనది.”

16 తరువాత పాలకులు, ప్రజలు అందరూ మాట్లాడారు. ఆ ప్రజలు యాజకులతోను “యిర్మీయా చంపబడకూడదు. యిర్మీయా మనకు చెప్పన విషయాలు మన యెహోవా దేవుని నుండి వచ్చినవే” అని అన్నారు.

17 అప్పుడు నగర పెద్దలలో (నాయకులు) కొందరు లేచి ప్రజలతో ఇలా అన్నారు:

18 “ప్రవక్తయైన మీకా మోరష్తీ నగర వాసి. యూదా రాజైన హిజ్కియా పాలనా కాలంలో మీకా ప్రవక్తగా వున్నాడు. యూదా ప్రజలందరికీ మీకా ఈ విషయాలు చెప్పియున్నాడు: “సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే: సీయోను దున్నబడిన పొలంలా అవుతుంది! యెరూషలేము ఒక రాళ్ల గుట్టలా తయారవుతుంది! గుడివున్న పర్వతం, ఒక ఖాళీ కొండ పొదలతో నిండినట్లవుతుంది.

19 “హిజ్కియా యూదాకు రాజుగా వున్నప్పుడు హిజ్కియా మీకాను చంపలేదు. యూదా ప్రజలెవ్వరూ మీకాను చంపలేదు. హిజ్కియా యెహోవా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. అతడు దేవుని సంతోష పరచాలని కోరుకున్నాడు. యూదా రాజ్యానికి కీడు చేస్తానని యెహోవా అన్నాడు. కాని హిజ్కియా యెహోవాను ప్రార్థించాడు. అందువల్ల యెహోవా తన మనస్సు మార్చుకున్నాడు. యెహోవా ముందుగా అన్నట్లు ఏ కీడూ చేయలేదు. ఇప్పుడు మనం యిర్మీయాను గాయపర్చితే, మనం మన మీదికే అనేక కష్టాలు తెచ్చి పెట్టుకుంటాము. ఆ కష్టాలన్నీ మన స్వంత తప్పులు.”

20 గతంలో యెహోవా సందేశాన్ని ప్రవచించిన మరో వ్యక్తి వున్నాడు. అతని పేరు ఊరియా. అతడు షెమయా అనేవాని కుమారుడు. ఊరియా కిర్యత్యారీము నగరవాసి. యిర్మీయా చెప్పిన మాదిరిగానే ఈ నగరాన్ని గురించి, ఈ రాజ్యాన్ని గురించి ఊరియా కూడ చెప్పియున్నాడు.

21 రాజైన యెహోయాకీము, అతని సైన్యాధికారులు, మరియు యూదాలోని ప్రజా నాయకులు ఊరియా బోధించినదంతా విన్నారు. వారికి చాలా కోపం వచ్చింది. రాజైన యెహోయాకీము ఊరియాను చంపగోరాడు. కాని యోహోయాకీము తనను చంపగోరుతున్నట్లు ఊరియా విన్నాడు. ఊరియా భయపడ్డాడు. అందుచే అతడు ఈజిప్టుకు తప్పించుకు పోయాడు.

22 కాని ఎల్నాతాను అనే వ్యక్తిని, మరి కొందరు మనుష్యులను రాజైన యోహోయాకీము ఈజిప్టుకు పంపాడు. ఎల్నాతాను అనేవాడు. అక్బోరు అనేవాని కుమారుడు.

23 ఆ మనుష్యులు ఊరియాను ఈజిప్టు నుండి తీసికొని వచ్చారు. వారు ఊరియాను రాజైన యెహోయాకీము వద్దకు తీసికొని వెళ్లారు. ఊరియాను కత్తితో నరికి చంపమని యెహోయాకీము ఆజ్ఞ యిచ్చాడు. పేద ప్రజల స్మశాన వాటికలో అతని శవం పారవేయబడింది.

24 షాఫాను కుమారుడైన అహీకాము అనే ప్రముఖ వ్యక్తి ఒకడున్నాడు. అహీకాము యిర్మీయాకు అండగావున్నాడు. అందుచే అహీకాము యాజకుల బారి నుండి, ప్రవక్తల బారి నుండి చంపబడకుండా యిర్మీయాను రక్షించాడు.

27

1 యెహోవా నుండి ఒక వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట తన పరిపాలనలో నాలుగవ సంవత్సరం జరుగుతూ ఉండగా ఈ వర్తమానం వచ్చింది. రాజైన సిద్కియా యోషీయా కుమారుడు.

2 యోహోవా నాకు ఈ విధంగా చెప్పాడు. “యిర్మీయా! వారులతోను, నిలువు కట్టెతోను ఒక కాడి తయారు చేయి. ఆ కాడిని నీ మెడపై వేసుకో.

3 తరువాత ఎదోము, మోయబు, అమ్మోను, తూరు, సీదోను రాజుల వద్దకు వర్తమానాలు పంపు. యూదా రాజైన సిద్కియాను చూడటానికి యెరూషలేముకు వచ్చే ఆయా రాజ దూతల ద్వారా వర్తమానాలను పంపు .

4 ఈ వర్తమానాన్ని వారి యజమానులకిమ్మని ఆ దూతలతో ఇలా చెప్పుము. ‘ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పేదేమంటే: మీ యాజమానులతో

5 నేనే భూమండలాన్ని, దానిపై ఉండే మనుష్యులందరినీ సృష్టించానని చెప్పండి. భూమి పైగల జంతుజలాన్ని కూడా నేనే సృష్టించాను. ఇదంతా నా గొప్ప మహిమ చేతను, నా దృఢమైన హస్తముతోను చేసియున్నాను. ఈ భూమిని నా ఇష్టమైన వాని కెవనికైనా ఇచ్చి వేయగలను.

6 ఇప్పుడు మీ దేశాలన్నిటినీ బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇచ్చి వేశాను. అతడు నా సేవకుడు. అడవి జంతువులు కూడ అతనికి లోబడి వుండేలా చేస్తాను.

7 దేశాన్నీ నెబుకద్నెజరుకు, అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవచేస్తాయి. ఆ తరువాత బబులోను పతనానికి సమయం ఆసన్నమౌతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు బబులోనును వశపర్చుకొని దాస్యం చేయించుకుంటారు.

8 “కాని ఇప్పుడు కొన్ని దేశాలు, రాజ్యాలు నెబుకద్నెజరుకు దాస్యం చేయటానికి నిరాకరించవచ్చు. వారు అతని కాడిని తమ మెడపై పెట్టుకోటానికి నిరాకరించవచ్చు. (తమపై అతని ఆధిపత్యాన్ని తిరస్కరించ వచ్చు.) అది గనుక జరిగితే, ఆయా దేశాలను, రాజ్యాలను కత్తితోను, ఆకలితోను, రోగాలతోను శిక్షిస్తాను.’ “ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “ఆ దేశాన్ని నాశనం చేసే వరకు నేనది చేస్తాను. నెబుకద్నెజరును వ్యతిరేకించే రాజ్యం పైకి అతనినే వినియోగించి దానిని నాశనం చేయిస్తాను.

9 కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. మంత్ర విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే వారి మాయలో పడవద్దు. కలల ఆంతర్యాలను చెపుతామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన వారితో మాట్లాడుతామనేవారు, కనికట్టు విద్యలను ఆచరించే వారు చెప్పే మాటలు వినవద్దు. ఆ మనుష్యులు, ‘మీరు బబులోను రాజుకు బానిసలు కానేరరు’ అని చెపుతారు.

10 కాని వారు మీతో అబద్దమాడుతున్నారు. వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూర దేశాలకు తీసుకొని పోబడటానికి కారకులవుతారు. మీరు మీ ఇండ్లు వాకిళ్లు వదిలి పోయేలా నేను వత్తిడిచేస్తాను. పైగా మీరు వేరొక దేశంలో చనిపోతారు.

11 “తమ మెడవంచి బబులోను రాజు కాడిని ధరించి అతనికి విధేయులై ఉన్న దేశాల వారు జీవిస్తారు. అటువంటి వారిని బబులోను రాజును సేవిస్తూ తమ దేశంలోనే ఉండేలా చేస్తాను. “ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “ఆయా దేశాల వారంతా తమ తమ స్వదేశాలలోనే ఉంటూ. తమ భూముల్లో సేద్యం చేసుకుంటూ ఉంటారు.”

12 “యూదా రాజైన సిద్కియాకు కూడ ఇదే సందేశం ఇచ్చాను. నేనిలా చెప్పాను: ‘సిద్కియా, బబులోను రాజు యొక్క కాడి క్రింద నీ మెడ వుంచి అతనికి విధేయుడవై వుండాలి. నీవు బబులోను రాజుకు, అతని ప్రజలకు దాస్యం చేస్తే నీవు బతుకుతావు.

13 నీవు బబులోను రాజుకు దాస్యం చేయటానికి ఒప్పుకొనకపోతే నీవు, నీ ప్రజలు శత్రువు యొక్క కత్తివాత బడి, ఆకలితోను, భయంకర రోగాలతోను చనిపోతారు. ఇవి జరిగి తీరుతాయని యెహోవా చెప్పాడు!

14 కాని అబద్ధ ప్రవక్తలు మాత్రం, ‘నీవు బబులోను రాజుకు బానిసవు కానేరవు’ అని చెపుతున్నారు. “ఆ ప్రవక్తలు చెప్పేది వినవద్దు. ఎందువల్లనంటే వారు నీకు అబద్దాలు చెపుతున్నారు.

15 నేనా ప్రవక్తలను పంపలేదు.” ఇదే యెహోవా వాక్కు “వారు అబద్దాలు బోధిస్తున్నారు. పైగా, ఆ సందేశం నా నుండి వచ్చినదే అని కూడ చెపుతున్నారు. కావున ఓ యూదా ప్రజలారా, మిమ్ముల్ని దూరంగా పంపివేస్తాను. మీరు చని పోతారు! మీకు బోధించే ఆ ప్రవక్తలు కూడా చనిపోతారు.”

16 అప్పుడు యిర్మీయానైన నేను యాజకులతోను, అ ప్రజలందరితోను ఇలా చెప్పాను: “యెహోవా చెప్పేదేమంటే ఆ అబద్ధ ప్రవక్తలు, ‘బబులోనీయులు యెహోవా నుండి ఎన్నో వస్తువులు తీసుకొని పోయారు. అవన్నీ శీఘ్రమే తిరిగి తీసుకొని రాబడుతాయి.’ అని చెపుతున్నారు. వారి మాటలు మీరు నమ్మవద్దు. ఎందువల్లనంటే వారు మీకు అబద్ధ ప్రవచాలను బోధిస్తున్నారు.

17 ఆ ప్రవక్తలు చెప్పే వాటిని మీరు వినవద్దు. బబులోను రాజుకు దాస్యంచేయండి. మీ శిక్షను మీరు ఆమోదించండి. మీరు జీవిస్తారు. ఈ యెరూషలేము నగరం సర్వనాశనం అయ్యేలా మీరు చేయటానికి కారణమే కన్పించటం లేదు.

18 ఈ మనుష్యులు నిజంగానే ప్రవక్తలయితే, వారికి యెహవా సందేశం అందితే వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా దేవునిలో వున్న వస్తువుల గురించి ప్రార్థన చేయనివ్వండి. రాజ భవనంలో యింకా మిగిలివున్న వస్తువుల గురించి వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా యెరూషలేములో వున్న వాటిని గురించి ప్రార్థన చేయ నివ్వండి. ఆయా వస్తుసముదాయాలు బబలోనుకు తీసుకొని పోబడకుండా వుండేలా ఆ ప్రవక్తలను ప్రార్థన చేయనివ్వండి.”

19 సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేములో ఇంకా మిగిలివున్న వస్తువులను గూర్చి ఇది చెపుతున్నాడు. దేవాలయంలో స్తంభాలు, కంచుకోనేరు, కదిలించగల దిమ్మెలు ఇంకా ఇతరమైన వస్తు సామగ్రి ఉంది . బబులోను రాజైన నెబుకద్నెజరు వీటిని యెరూషలేములో వదిలి వేశాడు.

20 యూదా రాజైన యెహోయాకీనును బందీగా కొనిపోయేటప్పుడు నెబుకద్నెజరు వాటన్నిటినీ తీసుకొని పోలేదు. రాజైన యెహోయాకీను యెహోయాకీము కుమారుడు. యూదా నుండి, యెరూషలేము నుండి ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా నెబుకద్నెజరు బందీలుగా పట్టుకుపోయాడు.

21 దేవాలయంలోను, రాజభవనంలోను, మరియు యెరూషలేములోను ఇంకా మిగిలివున్న వస్తువుల విషయంలో ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ఆ వస్తువులన్ని బబులోనుకు తీసుకొని పోబడతాయి.

22 నేను వాటిని తిరిగి తీసుకొని వచ్చే రోజు వరకు అవి అక్కడే వుంచబడతాయి.” ఇది యెహోవా వాక్కు. “పిమ్మట వాటిని నేను తీసుకొని వస్తాను. తిరిగి వాటిని యధాస్థానంలో వుంచుతాను.

28

1 యూదా రాజుగా సిద్కియా పాలన నాలుగు సంవత్సరాలు దాటి ఐదవ నెల గడుస్తూ ఉండగా ప్రవక్త హనన్యా నాతో మాట్లాడాడు. హసన్యా తండ్రి పేరు అజ్జూరు. హనన్యా గిబియోను పట్టణవాసి. హనన్యా నాతో మాట్లాడినప్పుడు అతడు దేవాలయంలో వున్నాడు. యాజకులు, ఇతర ప్రజలు అందరు కూడ అక్కడ చేరి వున్నారు. హనన్యా ఇలా చెప్పాడు.

2 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘యూదా ప్రజల మెడపై బబులోను రాజు వుంచిన కాడిని నేను విరిచి వేస్తాను.

3 రెండు సంవత్సరాలు గడిచేలోగా యెహోవా గుడి నుండి బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొనిపోయిన వస్తువులన్నిటినీ నేను తిరిగి తెస్తాను. నెబుకద్నెజరు ఆ వస్తువులన్నిటినీ బబులోనుకు తీసుకొని పోయాడు. కాని వాటన్నిటినీ నేను తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను.

4 యూదా రాజైన యెహోయాకీమను కూడా ఈ స్థానానికి నేను తీసుకొని వస్తాను. యెకోన్యా యెహోయాకీము కుమారుడు. నెబుకద్నెజరు బలవంతం చేసి తమ ఇండ్ల నుండి బబులోనుకు తీసుకొని పోయిన యూదా ప్రజలందరినీ నేను తిరిగి తీసుకొని వస్తాను. ఇది యెహవా నుంచి వచ్చిన సమాచారం ‘కావున బబులోను రాజు యూదా ప్రజల మెడపై ఉంచిన కాడిని నేను విరుగగొడతాను!’ “

5 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యాకు ఇలా సమాధానం చెప్పాడు. వారు దేవాలయంలో నిలబడి వున్నారు. యాజకులు, మరియు అక్కడ చేరిన ప్రజలు యిర్మీయా సమాధానం వినగలిగారు.

6 హనన్యాతో యిర్మీయా ఇలా అన్నాడు: “తధాస్తు! నిజంగా యెహోవా అలా చేయుగాక! నీవు ప్రవచించిన వర్తమానం యెహోవా నిజం చేయుగాక! బబులోను నుంచి దేవాలయ సంబంధిత వస్తువులన్నీటినీ యెహోవా ఇక్కడికి తీసుకొని వచ్చుగాక! బలవంతంగా తమ ఇండ్లు వదిలి పోయేలా చేయబడిన ప్రజలందరినీ యెహోవా మరల ఇక్కడికి తీసికొని వచ్చుగాక!

7 “కాని హనన్యా! నేను చెప్పేది విను. ప్రజలారా, మీరందరు నేను చెప్పేది వినండి.

8 హనన్యా! నీవు, నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు కాలంలో ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా సామ్రాజ్యాలకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన రోగాలు వస్తాయని వారు చెప్పియున్నారు.

9 కాని మనకు సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని చేప్పే ప్రవక్త నిజంగా యెహోవాచే పంపబడినవాడేనా అని మనం నిర్ధారణ చేయవలసి వుంది. ఆ ప్రవక్త చెప్పినది నిజమయ్యే పక్షంలో, అతడు నిజంగా యెహోవాచే పంపబడిన వాడని ప్రజలు తెలుసుకోవచ్చు.”

10 యిర్మీయా ఒక కాడిని తన మెడకు తగిలించుకుని ఉన్నాడు. ప్రవక్త హనన్యా ఆ కాడిని యిర్మీయా మెడనుండి తీసి విరుగగొట్టాడు.

11 పిమ్మట అక్కడ చేరిన ప్రజలంతా వినేలా హనన్యా ఇలా బిగ్గరగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చినదేమంటే, ఇదే రీతిని బబులోను రాజు నెబుకద్నెజరు వేసిన కాడిని నేను విరిచి వేస్తాను. అతడు ఆ కాడిని ప్రపంచ దేశాలన్నిటిపై వేశాడు. కాని రెండు సంవత్సరాల కాలంలోపల నేనా కాడిని విరిచివేస్తాను.” హనన్యా అలా చెప్పిన పిమ్మట యిర్మీయా దేవాలయం నుండి వెళ్లి పోయాడు.

12 తరువాత యెహోవా సందేశం యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా మెడ నున్న కాడిని తీసి హనన్యా విరచి వేసిన తరువాత ఇది జరిగింది.

13 యెహోవా యిర్మీయాతో ఇలా చెప్పాడు, “నీవు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు, నీవు చెక్కతో చేయబడిన కాడిని విరుగగొట్టావు. కాని దానికి బదులు నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను.’

14 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన అయిన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ దేశాలన్నిటిపైన నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకు వారంతా దాస్యం చేయాలనే ఉద్దేశంతో నేనలా చేస్తున్నాను. వారు అతనికి బానిసలవుతారు. కృ఼రమృగాలను కూడ అదుపులో పెట్టగల శక్తిని నెబుకద్నెజరుకు ప్రసాదిస్తాను.’ “

15 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు, “హనన్యా, వినుము! యెహోవా నిన్ను పంపలేదు. కాని యూదా ప్రజలు అబద్ధాలు నమ్మేలా చేశావు. 16అందువల్ల యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘హనన్యా, త్వరలో నిన్ను ఈ ప్రపంచం నుండి తీసుకొని వెళతాను. ఈ సంవత్సరమే నీవు చనిపోతావు. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా నీవు బోధించావు గనుక.”

16 హనన్యా అదే సంవత్సరం ఏడవ నెలలో చనిపోయాడు. బబులోనులో బందీలుగా ఉన్న యూదులకు లేఖ

17 [This verse may not be a part of this translation]

29

1 బబులోనులో బందీలుగా వున్న యూదులకు యిర్మీయా ఒక లేఖ పంపాడు. బబులోనులో ఉంటున్న పెద్దలకు (నాయకులు), యాజకులకు, ప్రవక్తలకు, తదితర ప్రజలకు అతడు దానిని పంపాడు. వీరంతా నెబుకద్నెజరుచే యెరూషలేము నుండి బబులోనుకు తీసుకొని రాబడినవారే.

2 (రాజైన యెకోన్యా, రాణియగు అతని తల్లి, యూదా, యెరూషలేముల అధికారులు, నాయకులు, వడ్రంగులు, లోహపు పనివారు మొదలైన వారంతా యెరూషలేము నుండి తీసుకొని పోబడీన పిమ్మట ఈ లేఖ పంపబడింది)

3 బబులోనులోని రాజైన నెబుకద్నెజరు వద్దకు ఎల్యాశాను, గెమర్యా అనే వారిని యూదా రాజైన సిద్కియా పంపాడు. ఎల్యాశా అనువాడు షాఫాను కుమారుడు. యిర్మీయా తన లేఖను బబులోనుకు తీసుకొని వెళ్లటానికి వారిద్దరికీ ఇచ్చాడు. ఆ లేఖలో యిలా వ్రాయబడివుంది.

4 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యోహోవా యెరూషలేము నుండి బబులోనుకు తాను బందీలుగా పంపిన ప్రజలందరి నుద్దేశించి ఈ విషయాలు చెపుతున్నాడు.

5 “మీరు ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించండి. ఆ రాజ్యంలో స్థిరపడండీ. తోటలను పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.

6 వివాహాలు చేసుకొని సంతానవంతులై వర్ధిల్లండి. మీ కుమారులకు కూడ వధువులను వెదకండి. మీ కుమార్తెలకు వివాహాది శుభకార్యాలు చేయండి. వారు కూడ తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకొనే నిమిత్తం మీరలా చేయండి. మీ సంతానాన్ని విస్తరింపజేసి పెంచి బబులోనులో మీరు బాగా వ్యాపించండి. మీ సంఖ్యా బలం తగ్గిపోకూడదు.

7 నేను మిమ్ములను పంపిన నగరానికి మీరంతా మంచి పనులు చేయండి. మీరు నివసిస్తున్న నగర శ్రేయస్సుకు మీరు ప్రార్థనలు చేయండి. ఎందువల్లనంటే, ఆ నగరంలో శాంతి నెలకొంటే మీకూ శాంతి లభిస్తుంది.”

8 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్పేదేమనగా “మీ ప్రవక్తల, మంత్ర విద్యలు చేసే వారి యొక్క మోసంలో మీరు పడకండి. వారు కనిన కలలను మీరు వినవద్దు.

9 వారు అబద్ధాలను బోధిస్తున్నారు. వారు చెప్పే వర్తమానం నానుండి వచ్చినదేనని అంటున్నారు! కాని నేను పంపలేదు!” ఇదే యెహోవా వాక్కు.

10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెర వేర్చుతాను.

11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయ టానికి వ్యూహరచన చేస్తాను.

12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను.

13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు.

14 మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”

15 “అయితే యెహోవా మాకు ఇక్కడ బబులోనులో ప్రవక్తలనిచ్చియున్నాడు” అని మీరు చెప్పవచ్చు.

16 కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను.

17 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను.

18 యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభ వించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికీ జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు.

19 యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు.

20 “మీరంతా బందీలు. నేనే మిమ్మల్ని యెరూషలేము వదిలి బబులోనుకు పోవల సిందిగా బలవంతం చేశాను. కావున, యెహోవా సందేశం వినండి.”

21 సర్వశక్తిమంతుడైన యెహోవా కోలాయా కుమారుడైన అహాబును గురించి, మయశేయా కుమారుడైన సిద్కియాను గురించి ఇలా చెపుతున్నాడు: “ఈ ఇద్దరు మనుష్యులు మీకు అబద్దాలు బోధిస్తున్నారు. వారు చెప్పే సందేశం నానుండి వచ్చినదేనని అంటున్నారు. కాని వారు అబద్ధమాడుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలను బబులోను రాజైన నెబుకద్నెజరు అప్పగిస్తారు. అప్పుడు నెబుకద్నెజలుకు బబులోనులో బందీలుగా వున్న మీ అందరి ముందు ఆ ప్రవక్తలను చంపుతాడు.

22 యూదా జాతి బందీలంతా తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన శాస్తి వంటిది జరగాలని కోరుకుంటారు. అనగా శాపగ్రస్తులలో వీరొక ఉదాహరణగా మిగిలి పోతారు. బందీలంతా ఇలా అంటారు: ‘సిద్కియాకు, అహాబుకు పట్టిన గతినే మీకూ యెహోవా పట్టించు గాక! బబులోను రాజు వారిద్దరినీ అగ్నిలో కాల్చివేశాడు!’

23 ఆ ప్రవక్తలిద్దరూ ఇశ్రాయేలు ప్రజలమధ్య బహునీచ కార్యాలు చేశారు. తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచారం చేశారు. వారు అబద్ధాలు కూడ చెప్పారు. పైగా వాటిని యెహోవానైన నానుండి వచ్చిన సందేశంగా చెప్పుకున్నారు. ఈ పనులన్నీ చేయమని వారికి నేనెప్పుడు చెప్పియుండలేదు. వారేమి చేశారో నాకు తెలుసు. వాటికి నేనే సాక్షిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.

24 షెమయాకు కూడ ఒక సందేశం ఇవ్వు. షెమయా నెహెలామీయుడు.

25 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు. “షెమయా, నీవు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, యాజకులందరికీ లేఖలు పంపావు. మయశేయా కుమారుడు, యాజకుడునయిన జెఫన్యాకు నీవు లేఖలు పంపావు. లేఖలన్నీ నీవు నీ పేరుమీదనే పంపావు. అంతేగాని యెహోవా అధికారంతో పంపలేదు.

26 షెమయా, నీ లేఖలో జెఫన్యాకు ఇలా చెప్పావు. ‘జెఫన్యా, యెహోవా నిన్ను యెహోయాదా స్థానంలో యాజకునిగా చేశాడు. దేవాలయ నిర్వాహణాధికారం నీవు కలిగి ఉంటావు. పిచ్చివానిలా ప్రవర్తించే ప్రతి వానినీ లేదా ప్రవక్తలా నటించే ప్రతి వానినీ, నీవు నిర్భందించవచ్చు. వానికి నీవు బొండ కొయ్య దండన విధించవచ్చు. వాని మెడకు ఇనుప చక్రం వేసి దానికి గొలుసులు తగిలించవచ్చు.

27 ఇప్పుడు యిర్మీయా ప్రవక్తలా ప్రవర్తిసున్నాడు. కావున నీవతనిని ఎందువల్ల నిర్భందించలేదు?

28 బబులోనులో వున్న మనకు యిర్మీయా యిలా వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు నుండి తీసుకురాబడి “బబులోనులో వున్న ప్రజలారా, మీరక్కడ బహుకాలం వుంటారు. కావున ఇండ్లు నిర్మించుకొని స్థిరపడండి. తోటలు పెంచి, మీరు పండించిన పండ్లను తినండి.”‘

29 ప్రవక్త యిర్మీయాకు ఈ లేఖను యాజకుడైన జెఫన్యా చదివి వినిపించాడు.

30 పిమ్మట యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది.

31 “యిర్మీయా, ఈ సందేశం బబులోనులో ఉన్న బందీలందరికి పంపించుము ‘నెహెలామీయుడైన షెమయాను గురించి యెహోవా ఇలా అంటున్నాడు. షెమయా మీకు ప్రవచించాడు. కాని నేనతనిని పంపలేదు. షెమయా ఒక అబద్ధాన్ని మీరు నమ్మేలాచేశాడు.

32 షెమయా అలా చేసిన కారణంగా యెహోవా యిలా చెప్పుతున్నాడు. నేను త్వరలో నెహెలామీయుడైన షెమయాను శిక్షిస్తాను. పూర్తిగా అతని వంశం నాశనం గావిస్తాను. నా ప్రజలకు నేను చేసే మేలులో అతను పాలుపంచుకోలేడు.” ఇదే యెహోవా వాక్కు “ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా షెమయా బోధించాడు గనుక నేను షెమయాను శిక్షిస్తాను.”

30

1 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది.

2 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) రాయాలి.

3 ఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యన్ని స్వంతం చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు.

4 యెహోవా సందేశాన్ని ఇశ్రాయేలు, యూదా ప్రజలను గూర్చి చెప్పాడు.

5 యెహోవా చెప్పినది ఇలా ఉంది: “భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం! ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!

6 ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము: ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం! అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను? ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది? ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు!

7 “యూకోబుకు ఇది గొప్ప సంకట సమయం. ఇది బహు కష్ట కాలం. ఇటువంటి కాలం మరి ఉండబోదు. అయినా యాకోబు సంరక్షింపబడతాడు.

8 “అప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా ప్రజల మెడపై కాడిని విరచి వేస్తాను.” ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని బలవంతం చేయరు.

9 ఇశ్రాయేలు, యూదా ప్రజలు విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి రాజైన దావీదుకు వారు సేవచేస్తారు. ఆ రాజును నేను వారివద్దకు పంపుతాను.

10 “కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!” ఇదే యెహవా వాక్కు: “ఇశ్రాయేలూ, భయపడవద్దు! ఆ సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను. ఆ దూర దేశంలో మీరు బందీలైవున్నారు. మీ సంతతివారిని ఆ భూమినుండి తిరిగి తీసుకొస్తాను. యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది. ప్రజలు యాకోబును బాధ పెట్టరు. నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు.

11 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!” ఇదే యెహోవా వాక్కు. “నేను మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను. కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను. కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను. అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి. నేను మిమ్మల్ని బాగ క్రమశిక్షణలోకి తెస్తాను.”

12 యెహోవా ఇలా అంటున్నాడు: “ఓ ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీకు బాగుకాని గాయం ఉంది. మీకు తగిలిన దెబ్బ నయం కానిది.

13 మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు. అందుచేత మీరు స్వస్థపర్చబడరు.

14 మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు. అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు. మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు. ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను! మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను! మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను. మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను.

15 ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు. మీ గాయం బాధాకరమైనది. పైగా దానికి చికిత్స లేదు. ఘోరమైన మీ అపరాధం కారణంగా, యెహోవానైన నేను మీకవన్నీ కలుగజేశాను. మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగజేశాను.

16 ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు. కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు! ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నాను. కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు. ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు. అలాగే యితరులు యుద్ధంలో వారి వాస్తువులు తీసుకుంటారు.

17 అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను. మీ గాయాలన్నీ మాన్పుతాను. “ ఇదే యెహవా వాక్కు. “ఎందవల్లననగా అన్యులు మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు. ‘సీయోనును ఎవ్వరూ లెక్కచేయరు’ అని వారన్నారు!”

18 యెహవా ఇలా చెప్పుచున్నాడు: “యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు. కాని వారు తిరిగివస్తారు. యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను. నగరమంతా కూలిపోయిన భవనాలతో కప్పబడిన కొండలా ఉంది. కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది. రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది.

19 ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు. ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి. వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు. వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను. ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు.

20 “యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను. అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను.

21 వారి స్వజనులలో ఒకడు వారిని నాయకత్వం వహిస్తాడు. ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు. నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు. అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను. అతడు నాకు సన్నిహితుడవుతాడు.

22 మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీ దేవుడనై ఉంటాను.

23 “యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు! ఆయన ప్రజలను శిక్షించినాడు. ఆ శిక్ష తుఫానులా వచ్చిపడింది. ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా వచ్చి పడింది.

24 తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు. ఆ రోజు సంభవించినప్పుడు (అంత్య దినాల్లో) మీరు అర్థం చేసుకుంటారు.”

31

1 “ఆ సమయంలో ఇశ్రాయేలు వంశస్థులందరికి నేను దేవుడనై యుందును. వారు నా ప్రజలైయుందురు” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

2 యెహోవా ఇలా చెపుతున్నాడు: “శత్రువు యొక్క కత్తికి గురికాకుండా కొంతమంది మిగిలిపోతారు. వారికి ఎడారిలో ఆదరణ లభిస్తుంది. ఇశ్రాయేలు విశ్రాంతికొరకు అన్వేషిస్తూ అక్కడికి వెళ్తుంది.” “యెహోవా తన ప్రజలకు దూరము నుండి దర్శనమిస్తాడు.

3 ఆయన ఇలా అన్నాడు: “ప్రజలారా మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూవచ్చాను. నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను.

4 ఓ నా ఇశ్రాయేలు కన్యకా, నిన్ను నేను పునర్నిర్మిస్తాను. నీవు మరల ఒక దేశంలా అవుతావు. నీవు మరలా తంబుర మీటుతావు. వేడుక చేసికొనే ప్రజలందరితో కలిసి నీవు నాట్యం చేస్తావు.

5 ఇశ్రాయేలు రైతులారా, మీరు మళ్లీ పంటలు పండిస్తూ, ద్రాక్షాతోటలు పెంచుతారు. సమరయనగర పరిసరాల్లో వున్న కొండలనిండా మీరు ద్రాక్ష తోటలు పెంచుతారు. ఆ ద్రాక్షా తోటల ఫల సాయాన్ని రైతులంతా అనుభవిస్తారు.

6 కావలి వారు ఈ వర్తమానాన్ని చాటే సమయం వస్తుంది: ‘రండి మనమంతా సీయోనుకు వెళ్లి మన దేవుడైన యెహోవాను ఆరాధించుదాము!’ కొండల ప్రాంతమైన ఎఫ్రాయిములో కూడ కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్పుతారు!”

7 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సంతోషంగా ఉండండి. యాకోబు కొరకు పాటలు పాడండి! రాజ్యాలలో కెల్ల మేటియైన ఇశ్రాయేలు విషయంలో ఎలుగెత్తి చాటండి. మీ స్తుతి గీతాలు పాడండి! ఇలా చాటి చెప్పండి: ‘యెహోవా తన ప్రజలను కాపాడినాడు! ఇశ్రాయేలు దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా రక్షించినాడు!’

8 ఉత్తరాన గల దేశం నుండి ఇశ్రాయేలీయులను తీసికొని వస్తానని తెలిసికొనండి. భూమి మీద వివిధ దూర దేశాలలో చెదరియున్న ఇశ్రాయేలును నేను తిరిగి కూడదీస్తాను. వారిలో చాలా మంది గుడ్డి వారు, కుంటివారు అయ్యారు. కొందరు స్త్రీలు నిండు గర్భిణీలై కనటానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ప్రజలు తిరిగి వస్తారు.

9 వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు. కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల పక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేనా విధంగా వారికి దారి చుపుతాను. కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.

10 “ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి! ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి. ‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లా చెదరు చేసిన ఆ సర్వోన్నతుడే తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు. గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’

11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు. యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు.’

12 ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు. వారు ఆనందంతో కేకలు వేస్తారు. యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. యెహోవా వారికి ఆహార ధాన్యాలను, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు. నీరు పుష్కలంగా లభించే ఒక తోటలా వారు విల్లసిల్లుతారు. ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.

13 ఇశ్రాయేలు యువతులంతా సంతోషంతో నాట్యం చేస్తారు. యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు. వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను. ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను!

14 యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది!

15 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు: “రామాలో రోదన వినవచ్చింది. అది ఒక తీవ్రమైన రోదన; గొప్ప విషాదం. రాహేలు తన పిల్లలు హతులైన కారణంగా ఆమె ఓదార్పు పొందుటకు నిరాకరిస్తుంది.”

16 కాని యెహోవా ఇలా అంటున్నాడు: “విలపించుట ఆపి వేయిము. నీవు కంటి తడి పెట్టవద్దు! నీ పనికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది!” ఇది యెహోవా సందేశం. “ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రు రాజ్యం నుండి తిరిగి వస్తారు.

17 కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడుము.” ఇది యెహోవా వాక్కు. “నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు.

18 ఎఫ్రాయిము విలపిస్తున్నట్లు నేను విన్నాను. ఎఫ్రాయిము ఇలా అంటూవుండగా నేను విన్నాను: ‘యెహోవా, నీవు నిజంగా నన్ను శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను. నేనిక ఎన్నడూ తర్భీతు పొందని కోడెదూడలా ఉన్నాను. దయచేసి నన్ను శిక్షించటం మానివేయుము. నేను తిరిగి నీ యొద్దకు వస్తాను. నీవే నిజమైన నా యెహోవా దేవుడవు.

19 యెహోవా, నేను నీకు దూరమయ్యాను. కాని నేను చేసిన దుష్కార్యాలను నేను గుర్తించాను. కావున నేను నా జీవన విధానాన్ని మార్చుకొని, హృదయ పరివర్తన కలిగియున్నాను. నా చిన్న తనంలో నేను చేసిన మూర్ఖపు పనులకు సిగ్గుపడి కలవరపడియున్నాను.”‘

20 దేవుడు ఇలా చెప్పు చున్నాడు: “ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు. ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను. అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను. అయినా నేను అతనిని జ్ఞాపకం చేసికుంటూ ఉంటాను. నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.” ఇది యెహోవా సందేశం.

21 “ఇశ్రాయేలు ప్రజలారా, రహదారి గుర్తులను నెలకొల్పండి. ఇంటి మార్గాన్ని సూచించే గుర్తులను నిలబెట్టండి. మార్గాన్ని కనిపెట్టుకొని ఉండండి. మీరు పయనించే దారిని శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండండి. ఇశ్రాయేలూ, నా కన్యకా, ఇంటికి రమ్ము! నీ నగరాలకు తిరిగిరా.

22 నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు. కాని ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. ఎప్పుడు ఇంటికి వస్తావు? నీ దేశంలో ఒక నూతనమైన దానిని యెహవా సృష్టించినప్పుడు ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది .”

23 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదా ప్రజలకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. వారిని తిరిగి నేను నిర్బందము నుండి తీసికొస్తాను. ఆ సమయంలో యూదా రాజ్యంలో దాని నగరాల్లోని ప్రజలు మళ్లీ ఇలా అంటారు: ‘ఓ నీతిగల నివాసమా, ఓ పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను దీవించు గాక!’

24 “యూదా పట్టణాలలోని ప్రజలంతా శాంతి యుత సహాజీవనం చేస్తారు. రైతులు, స్థిరంగా లేకుండా తిరిగే పశువుల కాపరులు, అంతా యూదాలో ప్రశాంతంగా కలిసి జీవిస్తారు.

25 బలహీనులకు, అలసిపోయిన ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న వారి కోరికను తీరుస్తాను.”

26 అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర.

27 “ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు అభివృద్ధి చెందేలా నేను సహాయపడే రోజులు వస్తున్నాయి.” ఇది యెహోవా వాక్కు. “వారి సంతానం, వారి పశుసంపద వర్థిల్లేలా కూడా నేను సహాయపడతాను. నేను చేసే ఆ పని ఒక మొక్కను నాటి దానిని పెంచినట్లుగా ఉంటుంది.

28 గతంలో ఇశ్రాయేలు, యూదావారు చేసే కార్యకలాపాలపై నేను నిఘా వేసి ఉన్నాను. వారిని మందలించే సమయం కోసం నేను వేచి ఉన్నాను. సమయం వచ్చింది; వారిని చీల్చి చెండాడాను. వారికి అనేక కష్ట నష్టాలు కలుగ జేశాను. కాని ఇప్పుడు వారిని పైకి తీసికొని రావటానికి, వారిని బలపర్చటానికి నేను వారిని గమనిస్తూ ఉన్నాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.

29 “ఆ సమయంలో ప్రజలు ఈ సామెత చెప్పరు: తండ్రులు పుల్లని ద్రాక్ష తిన్నారు, కాని పిల్లల పళ్లు పులిశాయి .

30 కాని ప్రతివాడు తన పాపాల కారణంగా చని పోతాడు. పుల్లని ద్రాక్షా తిన్న వాని పండ్లే పులుస్తాయి.”

31 “ఇశ్రాయేలు వంశంతోను, యూదా వంశంతోను నేనొక కొత్త ఒడంబడికను కుదుర్చుకునే సమయం ఆసన్న మవుతూ ఉంది.

32 ఇది నేను వారు పూర్వీకులతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను వారి యెహోవాను, కాని వారే ఆ ఒడంబడికను ఉల్లంఘించారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

33 “భవిష్యత్తులో నేను ఇశ్రాయేలుతో ఈ రకమైన ఒడంబడిక చేసికుంటాను.” ఇదే యెహోవా వాక్కు. “నా బోధనలన్నీ వారి మనస్సులో నాటింప చేస్తాను. పైగా వాటిని వారి హృదయాల మీద రాస్తాను. నేను వారి దేవుణ్ణి. వారు నా ప్రజలై ఉందురు.

34 యెహోవాను గురించి తెలిసికొనేందుకు ప్రజలు వారి పొరుగువారికి, బంధువులకు బోధించనక్కరలేదు. ఎందువల్లనంటే అన్ని తరగతుల ప్రజలు తమతమ భేదం లేకుండా నన్ను తెలిసికుంటారు.” ఇదే యెహోవా వాక్కు. “వారు చేసిన చెడ్డ పనులన్నిటినీ నేను క్షమిస్తాను. వారి పాపాలను నేను గుర్తు పెట్టుకోనను.”

35 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సూర్యుడు పగలు ప్రకాశించేలా యెహోవా చేశాడు. చంద్రుడు, నక్షత్రాలు రాత్రి పూట కాంతిని వెద జల్లేలా యెహోవా చేశాడు. సముద్రాలను ఘోషింపజేసి అలలు తీరాన్ని ముంచెత్తేలా చేసిందీ యెహవాయే. ఆయన పేరే సర్వశక్తి మంతుడగు యెహోవా.”

36 యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు సంతతి ఒక రాజ్యంగా జాతిగా ఉండుట ఎప్పుడూ మానరు. సూర్య చంద్ర నక్షత్ర సముద్రాలపై నా అదుపు తప్పిన నాడు మాత్రమే వారు రాజ్యాంగా జాతిగా ఉండలేరు.”

37 యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు సంతతిని నేనెన్నడు తిరస్కరించను. ప్రజలు ఆకాశాన్ని కొలవగలిగిననాడు, వారు భూమి యొక్క సర్వ రహస్యాలను తెలిసికోగలిగిననాడు! నేను ఇశ్రాయేలీయుల సంతతి వారిని తిరస్కరిస్తాను. అప్పుడు మాత్రం వారు చేసిన అకృత్యాల కారణంగా నేను వారిని తిరస్కరిస్తాను” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.

38 “యెహోవా నిమిత్తం యెరూషలేము నగరం తిరిగి నర్మింపబడే రోజులు వస్తున్నాయి. ఇదే యెహోవా వాక్కు. హనన్యేలు బురుజు నుండి మూల ద్వారం వరకు మొత్తం నగరమంతా తిరిగి కట్టబడుతుంది.

39 భూమి కొలత గీత గొలుసు మూల ద్వారం నుండి గారెబు కొండ వరకును, అక్కడ నుండి గోయా అను ప్రదేశం వరకు పరచబడుతుంది.

40 శవాలను, బూడిదను పడవేసిన లోయ అంతా యెహోవాకు పవిత్రమైనదిగా ఉంటుంది. తూర్పున వున్న కిద్రోను లోయకు ఎగువనున్న భూములన్ని గుర్రాల ద్వారం వరకు అన్నీ కలపడుతాయి. యెరూషలేము నగరం మరెన్నడు విచ్చిన్నం చేయబడదు. నాశనం చేయబడదు.”

32

1 యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది.

2 ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. (

3 యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేమునగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబో తున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు.

4 కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు.

5 బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.”‘)

6 యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది:

7 నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు హనమేలు నీ వద్దకు వచ్చి. ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు.

8 “తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.”‘ అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది.

9 అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హ నమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను.

10 క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచ్చాను.

11 మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసికున్నాను.

12 తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యొదట నేనా దస్తావేజులను బారూనకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు.

13 ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను:

14 “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’

15 ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.”‘

16 నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను:

17 “యెహోవా నా దేవా, చాపబడిన నీ బల ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్యమైనది ఏదియు లేదు.

18 యెహోవా, నీవు వేలాది ప్రజలకు దయా మయుడవు, నమ్మకస్తుడవు అయివున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్లలను కూడా శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు, శక్తి సంపన్నుడవు, సర్వశక్తిమంతుడైన యెహోవా అని నీకు పేరు.

19 దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు.

20 యెహోవా, ఈజిప్టు రాజ్యంలో నీవు అమోఘమైన అద్భుతాలు జరిపించినావు. ఈ నాటి వరకు నీవు నీ శక్తివంతమైన కార్యాలు జరిపిస్తూనే ఉన్నావు. ఆ పనులు నీవు ఇశ్రాయేలులో మాత్రమే గాక, నీ ప్రజలు ఎక్కడ వుంటే అక్కడ నీవా అధ్భత కార్యాలు చేశావు. వీటి కారణంగా నీవు మిక్కిలి ఘనత వహించినావు.

21 యెహోవా, నీవు ఎన్నో మహాశక్తిగల అధ్భుతాలు జరిపించి, ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి బయటికి తీసికొని వచ్చావు. నీ శక్తవంతమైన హస్తాన్ని వినియోగించి నీవీ పనులు చేశావు! నీ శక్తి అశ్ఛర్యాన్ని కలుగ జేస్తూఉంది!

22 “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. ఈ దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. ఈ దేశం మిక్కిలి చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది.

23 ఇశ్రాయేలీయులు ఈ దేశంలోనికి వచ్చి దీనిని వారు స్వంతం చేసికున్నారు. కాని ఆ ప్రజలే నీకు విధేయులు కాకుండా పోయారు. వారు నీ బోధనలను అనుసరించ లేదు. నీవు ఆజ్ఞాపించినట్లు వారు నడుచుకోలేదు. అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకర మైనవన్నీ జరిగేటట్టు నీవు చేశావు.

24 “మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.

25 “నా యెహోవా ప్రభువా, ఆపద ముంచుకు వస్తున్నది. కాని, నీవు నాతో, ‘యిర్మీయా, వెండినిచ్చి పొలం కొనమనీ, ఆ కొనుగోలుకు సాక్షులను నియమించ!” మనీ చెపుతున్నాను. కల్దీయుల సైన్యం నగరాన్ని కైవసం చేసికోడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీవు నాకీ విషయం చెపుతున్నావు. నా ధనం అలా ఎందుకు వృధా చేయాలి?”

26 అప్పుడు యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది:

27 “యిర్మీయా, నేనే యెహోవాను, ఈ భూమి మీద ప్రతి వానికి నేనే దైవాన్ని. యిర్మీయా, నాకు అసాధ్యమైనదేదీ లేదని నీకు తెలుసు.”

28 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది.

29 కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని! ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది.

30 ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు.

31 “యెరూషలేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర ప్రజలు నాకు కోపం కల్గిస్తూనే ఉన్నారు. ఈ నగరం నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని నా దృష్టి పథం నుండి తొలగిస్తాను.

32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని నాశనం చేస్తాను. ప్రజలు, రాజులు, నాయకులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదాప్రజలు, యెరూషలేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగజేశారు.

33 “ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవలసింది. కాని వారు నాకు విముఖులైనారు. వారికి నేను పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. అయినా వారు పట్టించుకోలేదు.

34 వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు.

35 “బెన్‌హిన్నోము లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!

36 “మీ ప్రజలిలా అంటున్నారు, ‘బబులోను రాజు యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తని వినియోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగరాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి.’ కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు:

37 ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను.

38 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను.

39 వాస్తవంగా వారంతా ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారిని కలిగిస్తాను. వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించాలనే ధ్యేయ్యం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌరవించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది.

40 “‘ఇశ్రాయేలు, యూదా ప్రజలతో నేనొక ఒడంబడిక కుదుర్చుకుంటాను. ఈ నిబంధన శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి దూరం కాను. నేను వారికెప్పుడు సుముఖంగా ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో ఉండేలా చేస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు కారు.

41 వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా ఎదిగేలా తోడ్పడతాను. ఇది నా పూర్ణ హృదయంతోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.”‘

42 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఈ మహా విపత్తును నేనే సంభవింపజేశాను. అదే మాదిరి నేను వారికి మేలు కూడా చేస్తాను. వారికి శుభం కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను.

43 ప్రజలు, ఈ దేశం వట్టి ఎడారి భూమి. ఇందులో మనుష్యులు, లేరు జంతువులు గాని లేవు. కల్దీయుల సైన్యం ఈ దేశాన్ని నాశనం చేసింది లేదు. అని అనుకుంటాను. కాని భవిష్యత్తులో ప్రజలు మళ్లీ ఇక్కడ పొలాలు కొంటారు.

44 ప్రజలు తమ ధనాన్ని వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ క్రయదస్తావేజులపై సంతకాలు చేసి వాటిపై ముద్రలు వేసి భద్ర పరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. బెన్యామీను వంశస్తులు నివసించే ప్రాంతంలో కూడా ప్రజలు మళ్లీ భూములు కొంటారు వారు యెరూషలేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా పట్టణ ప్రాంతాలలోను, మన్య ప్రాంతాల లోను, పడమటి కొండవాలు ప్రాంతంలోను, మరియు దక్షిణ ఎడారి ప్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజలందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను. గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ సందేశం యెహోవా నుండి వచ్చినది.

33

1 యెహోవా నుండి సందేశం రెండవసారి యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు.

2 యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు:

3 “ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు.

4 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు శత్రువు ఆ ఇండ్లను నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్ములు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.

5 “యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు కార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను. కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి.

6 “కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను.

7 యూదాను, ఇశ్రాయేలును గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను.

8 వారు నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని వారిని క్షమిస్తాను.

9 అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. (ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు.

10 “ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశంవట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది.

11 అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.

12 సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి.

13 గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.”

14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది.

15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది.

16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.”‘

17 యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు.

18 లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”

19 యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది.

20 యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు,

21 నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు.

22 కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.”

23 యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు:

24 “యిర్మీయా, ప్రజలేమను కుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు,”‘

25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను.

26 బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”

34

1 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన కింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.

2 ఆ వర్తమానం ఇలా వుంది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యిలా అంటున్నాడు: యిర్మీయా, యూదా రాజైనా ‘సిద్కియా వద్దకు వెళ్లి ఈ సందేశాన్ని అందజేయి: సిద్కియా, యెహోవా ఈ విధంగా తేలియ జెప్పుచున్నాడు: యెరూషలేము నగరాన్ని అతి త్వరలో నేను బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. అప్పుడతను దానిని తగలబెడతాడు!

3 సిద్కియా, బబులోను రాజు నుండి నీవు తప్పించుకోలేవు. నీవు ఖచ్చితంగా పట్టుబడి అతనికి అప్పగింపబడతావు. బబులోను రాజును నీ కళ్లతో స్వయంగా చూస్తావు.! అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతాడు. నీవు బబులోనుకు వెళతావు.

4 కాని, యూదా రాజువైన సిద్కియా! యెహోవా వాగ్దానం శ్రద్ధగా వినుము. నిన్ను గురించి యెహోవా యిలా చెప్పుచున్నాడు: నీవు కత్తిచేత చంపబడవు.

5 నీవు ప్రశాంతంగా చనిపోతావు. నీ కంటె ముందు ఏలిన రాజులైన నీ పూర్వీకులు చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ప్రజలు దహన సంస్కారాలు జరిపినారు. అదే రీతిగా ప్రజలు నీ గౌరవార్థం కూడా దహన క్రియలు జరుపుతారు. వారు నీ కొరకు విలపిస్తారు. ‘అయ్యో, మా నాయకుడా!’ అని విచారిస్తారు. నాకై నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను.”‘ ఇదే యెహోవా వాక్కు.

6 యెహోవా యొక్క ఈ సమాచారాన్ని యెరూషలేములో వున్న సిద్కియాకు యిర్మీయా ఇచ్చాడు.

7 అది బబులోను సైన్యం యెరూషలేముతో యుద్ధం చేస్తున్న సమయం. కైవసం చేసికొనని యూదా నగరాలతో కూడ బబులోను సైన్యం పోరాడుతూ ఉంది. అవి లాకీషు, అజేకా అనే నగరాలు. చుట్టూ ప్రాకారాలతో పటిష్టం చేయబడిన యూదా రాజ్య నగరాలలో అవి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి.

8 హెబ్రీ బానిసలకు స్వేచ్ఛ నివ్వాలని రాజైన సిద్కియా యెరూషలేము ప్రజలందరితో ఒక ఒడంబడిక చేశాడు. సిద్కియా ఆ ఒడంబడిక చేసిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది.

9 ప్రతి పౌరుడు తనవద్ద ఉన్న హెబ్రీ బానిసలను విడుదల చేయవలసి ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండ హెబ్రీ బానిసలందరూ విడుదల చేయబడాలి. యూదా వంశీయులలో ఎవ్వరినీ ఏ ఒక్కరూ బానిసగా ఉంచుకోరాదు.

10 అందువాల్ల యూదా నాయకులు, ప్రజలు ఈ ఒడంబడికకి అంగీకరించారు. ప్రతి పౌరుడు తన వద్దగల హెబ్రీ స్త్రీ, పురుష బానిసలను విడుదలచేయాలి. వారిని ఎంత మాత్రము బానిసలుగా పని చేయించరాదు. అందుకు ప్రతి పౌరుడు ఒప్పుకున్నాడు. దానితో బానిసలంతా స్వేచ్ఛగా వదిలివేయబడ్డారు.

11 కాని ఆ తరువాత బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.

12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు చేరింది:

13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యిర్మీయా, బానిసలుగా ఉన్న మీ పూర్వీకులకు ఈజిప్టు నుండి నేను తీసుకొని వచ్చాను. నేనా పని చేసినప్పుడు, వారితో నేనొక నిబంధన చేసినాను.

14 మీ పితరులతో నేనిలా చెప్పాను: ‘ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.’ కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు.

15 కొద్ది కాలంకిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది సక్రమమైనదో దానిని చేయటానికి సిద్ధమయ్యారు. బానిసలుగా ఉన్న సాటి హెబ్రీయులకు మీలో ప్రతి ఒక్కడూ స్వేచ్ఛ నిచ్చాడు. నా నామాన్ని పిలువబడే నా ఆలయంలో నా ముందు ఆ మేరకు మీరొక ఒడంబడిక కూడ చేశారు.

16 కాని ఇప్పుడు మీరు మనస్సు మార్చుకున్నారు. మీరు నా పేరును గౌరవించరని నిరూపించుకున్నారు. ఇది మీరెలా చేశారు? వదిలి పెట్టిన ప్రతి స్త్రీ, పురుష బానిసను మీలో ప్రతివాడూ తిరిగి తీసుకున్నారు. వారు తిరిగి బానిసలయ్యేలా ఒత్తిడి చేశారు.

17 “అందుచేత యెహోవా ఇలా అంటున్నాడు: ‘ప్రజలారా, నాకు మీరు విధేయులుగా లేరు. మీరు మీ సాటి హెబ్రీయులకు స్వేచ్ఛ నివ్వలేదు. మీరు నా ఒడంబడికను ఉల్లంఘించిన కారణంగా నేను “స్వేచ్ఛ” నిస్తాను. కత్తికి, కరువుకు, భయంకర రోగాలకు నేను “స్వేచ్ఛ” నిస్తాను. అవి మిమ్మల్ని చంపివేస్తాయి.’ ఇదే యెహోవా వాక్కు.’మిమ్మల్ని గురించి చెప్పగానే ప్రపంచ రాజ్యాలన్నీ ఆశ్చరం చెందేలా మీకు మహా విపత్తు కలుగజేస్తాను.

18 నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే .

19 యూదా, యెరూషలేము నాయకులు, న్యాయస్థాన అధికారులు, మరియు యాజకులూ, రాజ్యంలోను ప్రజలు నా ముందు ఒడంబడిక చేసి కోడెదూడ ముక్కల మధ్య నడచిన వారిలో ఉన్నారు.

20 కావున ఆ ప్రజలను వారి శత్రువులకు అప్పగిస్తారు. వారిని చంప తలపెట్టిన ప్రతివానికి వారిని వదిలి వేస్తాను. వారి శవాలు పక్షులకు, కృ఼ర మృగాలకు ఆహారమవుతాయి.

21 యూదా రాజైన సిద్కియాను, అతని ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సైన్యం యెరూషలేమును వదిలి నప్పటికి, సిద్కియాను, అతని ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.

22 “బబులోను సైన్యాన్ని యెరూషలేముకు పిలిపిస్తాను. ఇదే యెహోవా వాక్కు ‘ఆ సైన్యం యెరూషలేముతో పోరాడుతుంది. వారు నగరాన్ని పట్టుకొని, దానికి నిప్పుపెట్టి తగలబెడతారు. నేను యూదా రాజ్యంలోని నగరాలను నాశనం చేస్తాను. ఆ నగరాలు వట్టి ఎడారులవలె మారి పోతాయి. మనుష్యులెవ్వకూ అక్కడ నివసించరు.”‘

35

1 యెహోయాకీము యూదా రాజ్యాన్ని పరిపాలించే కాలంలో యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. యెహోవా సందేశం ఇలా ఉంది:

2 “యిర్మీయా, రేకాబీయుల వద్దకు వెళ్లుము. యెహోవా దేవాలయపు ప్రక్కగదులలో ఒక దాని లోనికి వారిని ఆహ్వానించుము. వారు తాగటానికి ద్రాక్షారసాన్ని అందించుము.”

3 కావున నేను (యిర్మీయా) యజన్యాను తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా అనువాని కూమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమారుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ ఆహ్యానించాను, రేకాబీయుల కుటుంబం వారినందరినీ పిలువనంపాను.

4 ఆ రేకాబీయుల నందరినీ మందిరంలోనికి తీసికొని వచ్చాను. అందరం హానాను కుమారుల గది అనబడే దానిలోనికి వెళ్లాము. హానాను అనువాడు యిగ్దల్యా కుమారుడు. హానాను ఒక దైవజనుడు. ఈ గది యూదా రాజు ముఖ్యఅధికారులు బసచేసే గది పక్కనే ఉంది, ఇది మయశేయా గదిపైనవుంది. మయశేయా అనేవాడు షల్లూము కుమారుడు. మయశేయా దేవాలయంలో ద్వార పాలకుడు.

5 పిమ్మట నేను (యిర్మీయా) ద్రాక్షారసం పోసిన కొన్ని పాత్రలు, మరికొన్ని గిన్నెలు రేకాబీయుల ముందు ఉంచాను. “కొంచెం ద్రాక్షారసం తీసుకోండి’ అని నేను వారికి చెప్పాను.

6 కాని రేకాబీయులు ఇలా సమాధాన మిచ్చారు: “మేమెన్నడూ ద్రాక్షారసం తాగము. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞ యిచ్చిన కారణంగా మేము దానిని తాగము. ఆయన ఆజ్ఞ ఏమనగా: ‘మీరు మీ సంతతివారు ఎన్నడూ ద్రాక్షారసం త్రాగవద్దు.

7 పైగా మీరు ఎన్నడు ఇండ్లు కట్టవద్దు, విత్తనములు నాటవద్దు. దాక్షా తోటలు పెంచవద్దు. వీటిలో దేనినీ మీరు ఎన్నడూ చేయరాదు. మీరు కేవలం గుడారాలలోనే నివసించాలి. మీరిలా చేస్తే, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతూ మీరీ దేశంలో చిరకాలం జీవించగలుగుతారు. ‘

8 కావున రేకాబీయులమైన మేము మా పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు బద్ధలమైయున్నాము. మేమెన్నడూ ద్రాక్షారసం తాగము. మా భార్యాలు, కుమారులు, కుమార్తెలు కూడా ద్రాక్షారసం తాగరు.

9 నివసించటానికి మేము ఇండ్లను నిర్మించము. ద్రాక్షాతోటలు గాని, పొలాలు గాని మేము కలిగివుండము. మేమెన్నడూ పంటలు పండించము.

10 మేము గుడారాల్లో నివసిస్తూ. మా పూర్వీకుడైన యెహోనాదాబు యొక్క ఆజ్ఞలన్నీ పాలిస్తున్నాము.

11 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని ముట్టడించినప్పుడు, మేము యెరూషలేములో ప్రవేశించాము. అప్పుడు మాలో మేము, ‘రండి, మనమంతా యెరూషలేము నగరానికి వెళద్దాం. అలా వెళ్లి బబులోను సైన్యం నుండి, అరాము దేశ (కల్దీయుల) సైన్యం నుండి మనల్ని మనం రక్షించుకుందాము’ అని అనుకున్నము. ఆ విధంగా మేము యెరూశలేములో ఉండి పోయాము”

12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది:

13 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యిర్మీయా, ఈ వర్తమానం యూదా వారికి, యెరూషలేము ప్రజలకు తెలియ జేయుము. ఓ ప్రజలారా, మీరొక గుణపాఠం నేర్చుకొని, నా సందేశాన్ని పాటించాలి.” ఇదే యెహోవా వాక్కు.

14 “రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షారసం తాగవద్దని తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించబడింది. ఈ రోజు వరకూ యెహోనాదాబు సంతతి వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు ద్రాక్షారసం తాగరు. కాని నేను యెహోవాను. యూదా ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు.

15 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా సేవకులగు ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యాయాలు మీ వద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించవద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించవచ్చు’ అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు తిరస్కరించారు.

16 యెహోనాదాబు సంతతివారు వారి పూర్వీకుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పక పాటించారు. కాని యూదా ప్రజలు మాత్రం నాకు విధేయులు కాలేదు.”

17 కావున ఇశ్రాయేలీయులు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదాకు, యెరూషలేముకు చాలా కష్టాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. త్వరలో ఆ విపత్తులన్నీ సంభవించేలా చేస్తాను. నేను ఆ ప్రజలతో మాట్లాడాను. కాని వారు వినటానికి నిరాకరించారు. నేను వారిని పిలిచాను. కాని వారు సమాధానం మియ్యలేదు.”

18 రేకాబీయులతో యిర్మీయా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీరంతా మీ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞ పాటించినారు. యెహోనాదాబు బోధనలను మీరు అనుసరించారు. ఆయన చెప్పినదంతా మీరు ఆచరించారు.

19 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతిలో ఒకడు సదా నాసేవలో నిమగ్నమై ఉంటాడు.”‘

36

1 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. ఇది యెషీయా కుమారుడైన యెహోయాకీము యూదా రాజ్యాన్ని పాలిస్తున్న నాల్గవ సంవత్సరం. యెహోవా వర్తమానం ఇలా వుంది:

2 “యిర్మీయా, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను యిచ్చే సందేశాలన్నిటినీ గ్రంథస్థం చేయుము. ఇశ్రాయేలు, యూదా రాజ్యాల గురించి, తదితర రాజ్యాల గురించి నేను నీతో మాట్లాడియున్నాను. యోషీయా రాజైనప్పటి నుండి ఈ నాటి వరకు నేను నీతో చెప్పిన మాటలన్నీ వ్రాయుము.

3 యూదా వంశం వారికి నేను చేయాలని ప్రయత్నిస్తున్న కీడు అంతా బహుశః వారు వినవచ్చు. బహుశః వారు దుష్కార్యాలు చేయటం మాని వేయవచ్చు. వారలాచేస్తే గతంలో వారు చేసిన మహా పాపాలన్నిటినీ నేను క్షమిస్తాను.”

4 కావున బారూకు అనే వానిని యిర్మీయా పిలిచాడు. బారూకు తండ్రి పేరు నేరీయా, యెహోవా తనతో చెప్పిన సందేశాలన్నిటిని యిర్మీయా బయటికి పలికాడు. యిర్మీయా మాట్లాడుతూ ఉండగా, బారూకు గ్రంథస్థం చేశాడు.

5 పిమ్మట బారూకుతో యిర్మీయా ఇలా అన్నాడు: “నేను దేవాలయంలోనికి వెళ్లలేను. నేనక్కడికి వెళ్లటానికి అనుమతి లేదు.

6 అందుచేత నీవే దేవాలయానికి వెళ్లాలని నా కోరిక, ఉపవాసాల రోజున నీవక్కడికి వెళ్లి, నీవు రాసిన విషయాలు ప్రజలకు చదివి వినిపించుము. నీవు రాసిన యెహోవా వర్తమానాలను నేను నీకు చెప్పిన విధంగా చదివి వినిపించు. యూదా పట్టణాల నుండి యెరూషలేముకు వచ్చే ప్రజలందరికీ ఆ వర్తమానాలను చదివి వినిపించు.

7 బహుశః ఆ ప్రజలు తమకు సహాయపడమని యెహోవాను వేడు కొనవచ్చు. బహుశః ప్రతి ఒక్కడూ చెడుకార్యాలు చేయటం మానివేయవచ్చు. వారిపట్ల తాను చాలా కోపంగా వున్నట్లు యెహోవా ప్రకటించియున్నాడు.”

8 కావున నేరీయా కుమారుడైన బారూకు ప్రవక్త అయిన యిర్మీయా చెప్పిన ప్రకారం చేశాడు. బారూకు తాను గ్రంథస్థం చేసిన యోహోవా వర్తమానాన్ని బిగ్గరగా చదివాడు. ఆయన దానిని యెహోవా ఆలయంలో చదివాడు.

9 రాజైన యెహోయాకీము పాలన ఐదు సంవత్సరాలు దాటి తొమ్మిదవ నెల జరుగుతూ ఉండగా ఉపవాస దినం ప్రకటించబడింది. యెరూషలేము నగర వాసులు, యూదా పట్టణాల నుంచి యెరూషలేముకు వచ్చి నివసిస్తున్న వారందరం యెహోవా ముందు ఉపవాసము చేయవలసి ఉంది.

10 ఆ సమయంలో యిర్మీయా మాటలన్నిటినీ తాను రాసి ఉంచిన పుస్తకంనుండి బారూకు చదివాడు. దానినతడు దేవాలయంలో చదివాడు. ెదేవాలయంలో చేరిన ప్రజలంతా వినేలా బారూకు తాను రాసిన పుస్తకాన్ని చదివాడు. తన పత్రం (పుస్తకం) చదివినప్పుడు బారూకు పై ఆవరణలో ఉన్న గెమర్యా గదిలో ఉన్నాడు. ఆలయ నూతన ద్వారం వద్ద ఆ గది నిర్మింపబడి ఉంది గెమర్యా తండ్రి పేరు షాఫాను. గెమర్యా అను వ్యక్తి దేవాలయంలో వ్రాయువాడు (లేఖికుడు)

11 పుస్తకం నుండి బారూకు చదివిన యెహోవా వర్తమానాలన్నిటినీ మీకాయా అనువాడు విన్నాడు. మీకాయా తండ్రి పేరు గెమర్యా గెమర్యా తండ్రి పేరు షాఫాను.

12 పుస్తకం నుండి చదవబడిన యెహోవా వర్తమానాలను విన్న మీకాయా రాజభవనంలో ఉన్న కార్యాదర్శి గదికి వెళ్లాడు. రాజభవనంలో ఉన్నతాధి కారులంతా కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్నవారిలో కార్యదర్శి ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా మరియు తదితర రాజోద్యోగులు ఉన్నారు.

13 పుస్తకంలో నుండి బారూకు ప్రజలందరి ముందు చదవగా తాను విన్నదంతా మీకాయా ఆ అధికారులకు తెలియజేశాడు.

14 ఆ అధికారులంతా కలిసి యెహూదియను వానిని బారూకు వద్దకు పంపారు. యెహూది తండ్రి పేరు నెతన్యా. నెతన్యా తండ్రి పేరు షెలెమ్య. షెలెమ్య తండ్రి పేరు కూషి. యెహూది అనేతను బారూకు వద్దకు వెళ్లి, “నీవు చదివిన పుస్తకం తీసికొని నా వెంట రమ్మని” అన్నాడు. నేరీయా కుమారుడైన బారూకు పుస్తకాన్ని తీసికొని యెహూది వెంట అధికారుల వద్దకు వెళ్లాడు.

15 ఆ అధికారులు బారూకును చూచి, “కూర్చో! మాకు ఆ ప్రతాన్ని చదివి వినిపించు” అని అన్నారు. అప్పుడు బారూకు ఆ పత్రాన్ని వారికి చదివి వినిపించాడు.

16 గ్రంథస్థం చేయబడిన ఆ వర్తమానాలనన్నిటినీ అధికారులు విన్నారు. వాటిని విని వారంతా భయపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు బారూకుతో ఇలా అన్నారు, “నీవు గ్రంథస్థం చేసిన వర్తమానాల విషయం మేము రాజైన యెహోయాకీముతో తప్పక చెప్పాలి.”

17 తరువాత ఆ అధికారులు బారూకును ఒక ప్రశ్న అడిగారు. “బారూకూ, నీవు రాసిన ఈ వర్తమానములు నీకెలా లభ్యమైనాయి? యిర్మీయా నీతో మాట్లాడిన విషయాలను నీవు రాసియున్నావా?” అని అడిగారు.

18 అవునని బారూకు చెప్పాడు. “యిర్మీయా మాట్లాడగా, ఆ వర్తమానానన్నిటినీ నేను సిరాతో ఈ పత్రంపై వ్రాసి ఉంచాను” అని అన్నాడు.

19 అది విన్న రాజ్యాధికారులు బారూకుతో, “నీవు, యిర్మీయా పోయి తప్పక దాగుకోవాలి, మీరెక్కడ దాగియున్నారో ఎవ్వరికీ తెలియనీయవద్దు” అని అన్నారు.

20 పిమ్మట రాజ్యాధికారులు ఆ పత్రాన్ని (పుస్తకం) లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచారు. వారు రాజైన యెహోయాకీము వద్దకు వెళ్లి ఆ పుస్తకం గురించి అంతా చెప్పారు.

21 అప్పుడు రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని తేవటానికి యెహూదిని పంపించాడు. లేఖకుడైన ఎలీషామా గదినుండి యెహూది ఆ పుస్తకాన్ని తెచ్చాడు. రాజుకు, ఆయన వద్ద నిలబడి ఉన్న సిబ్బందికి యెహూది ఆ పుస్తకాన్ని చదివి వినిపించాడు.

22 ఇది జరిగే నాటికి సంవత్సరంలో తొమ్మిదవ నెల కావటంతో, రాజైన యెహోయాకీము శితకాలపు గదిలో (వెచ్చని గది) కూర్చుని ఉన్నాడు. రాజు ముందు ఒక చిన్న నిప్పుగూటిలో మంట రగులుతూ వుంది.

23 చుట్టబడిన పత్ర రూపంలో ఉన్న ఆ గ్రంథాన్ని యెహూది చదవటం మొదలు పెట్టాడు. అతడు రెండు మూడు పుటల విషయాలు చదవగానే రాజైన యెహోయాకీము ఆ పత్రాన్ని గుంజుకుని, ఒక చిన్న కత్తితో చదివిన భాగాన్ని కోసి మండే నిప్పులో వేయసాగాడు. ఆ విధంగా మొత్తం పుస్తకమంతా తగులబెట్టాడు.

24 పైగా రాజైన యెహోయాకీము, అతని సిబ్బంది ఆ వర్తమానాన్ని విని భయపడలేదు. వారి పాపాలకు చింతిస్తున్న సూచనగా వారి తమ బట్టలను చించుకొనలేదు.

25 ఎల్నాతాను, దెలాయ్యా మరియు గెమర్యా అనేవారు రాజుతో మాట్లాడి గ్రంథాన్ని తగులబెట్టకుండా చేయాలని ప్రయత్నించారు గాని రాజు వినలేదు.

26 రాజైన యెహోయాకీము లేఖకుడైన బారూకును, ప్రవక్తయైన యిర్మీయాను నిర్బంధించు మని కొందరు మనుష్యులను ఆదేశించాడు. అలా ఆదేశించబడిన మనుష్యులు రాజకుమారుడు యెరహ్మెయేలు, అజీ్రయేలు కుమారుడైన శెరాయా, మరియు అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యా అనువారు. అయితే యెహోవా బారూకును, యిర్మీయాను దాచివేసిన కారణంగా ఆ మనుష్యులు వారిని కనుక్కో లేక పోయారు.

27 యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది. యెహోవా నుండి వచ్చిన సందేశాలన్నీ పొందుపర్చబడిన సుదీర్గ పుస్తకాన్ని. రాజైన యెహోయాకీము తగులబెట్టిన పిమ్మట ఇది జరిగింది. యిర్మీయా ఆ విషయాలు బారూకుతో చెప్పగా, బారూకు వాటన్నిటినీ పుస్తకంగా వ్రాశాడు. యిర్మీయాకు వచ్చిన యెహోవ సందేశం ఇలా ఉంది:

28 “యిర్మీయా, మరో పత్రం తీసికో. దానిమీద మొదటి చుట్టలో వున్న వర్తమానములన్నిటినీ నీవు తిరిగి వ్రాయుము. ఆ మొదటి పుస్తకాన్నే యూదా రాజైన యెహోయాకీము తుగుల బెట్టాడు.

29 యిర్మీయా, యూదా రాజైన యెహోయాకీముకు ఈ విషయం కూడా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీమా, నీవా పుస్తకాన్ని తగులబెట్టావు. “బబులోను రాజు వచ్చి నిశ్చయంగా ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాడని యిర్మీయా ఎందుకు రాశాడు? ఈ దేశంలో గల మనుష్యులను, జంతువులను బబులోను రాజు నాశనం చేస్తాడని ఎందుకు చెప్పాడు?” అని నీవు అన్నావు.

30 కావున, యూదా రాజైన యెహోయాకీము విషయంలో యెహోవా ఇలా అంటున్నాడు: యెహోయాకీము సంతతివారు దావీదు సింహాసనంపై కూర్చోనరు. యెహోయాకీము చనిపోయినప్పుడు రాజ లాంఛనాలతో అంత్యక్రియలు జరగవు. అతని కళేబరం నేలమీద పారవేయబడుతుంది. అతని శవం పగలు ఎండకు ఎండి, రాత్రి మంచుకు నానిపోతుంది.

31 ప్రభువునైన నేను యెహోయాకీమును, అతని సంతానాన్ని శిక్షిస్తాను. అతని అధికారులను కూడ నేను శిక్షిస్తాను. వారు దుర్మార్గులు గనుక నేనలా చేస్తాను. ఆ అధికారులపైకి, యెరూషలేము ప్రజలపైకి, యూదా ప్రజలపైకి మహా విపత్తు తీసికొని వస్తానని నేను అనియున్నాను. నేను చెప్పిన విధంగా వారికి అష్ట కష్టాలను తెచ్చి పెడతాను. కారణమేమంటే, వారు నేను చెప్పినది వినలేదు.”‘

32 యిర్మీయా మరో పత్రాన్ని తీసికొని లేఖకుడు నేరీయా కుమారుడు బారూకుకు ఇచ్చాడు. రాజైన యెహోయాకీము నిప్పులో వేసి తగులబెట్టిన పుస్తకంలో వున్న వర్తమానములన్నిటినీ, యిర్మీయా చెప్పు చుండగా బారూకు ఆ పత్రం మీద మరల వ్రాశాడు. పాత వర్తమానాల వంటివే మరికొన్ని కొత్తగా ఈ రెండవ గ్రంథములో చేర్చబడ్డాయి.

37

1 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా రాజుగా యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను స్థానంలో సిద్కియాను నెబుకద్నెజరు నియమించాడు. సిద్కియా రాజైన యోషీయా కుమారుడు.

2 యెహోవా యిర్మీయాకు బోధననిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య పెట్టలేదు. సిద్కియా సేవకులు, యూదా ప్రజలు కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు.

3 యెహుకలు అనువానిని, యాజకుడైన జెఫన్యాను రాజైన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్ధకు ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండ్రి పేరు షెలెమ్యా. యాజకుడైన జెఫన్యా తండ్రి పేరు మయశేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా దేవుని ప్రార్థించు.”

4 (ఆ సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో నిర్బంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ కలిగియున్నాడు.

5 అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యూదా వైపుకు కదలి వచ్చింది. కల్దీయుల సైన్యం యెరూషలేమును ఓడించటానికి దానిని చుట్టుముట్టింది. అయితే, ఈజిప్టు నుండి పచ్చిన సైన్యం తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం. యెరూషలేమును వదలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది.)

6 యెహోవా నుండి ఒక వర్తమానం ప్రవక్తయైన యిర్మీయాకు వచ్చింది:

7 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది.

8 ఆ తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.

9 యెహోవా ఇలా అంటున్నాడు: ‘యెరూషలేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. “బబులోను సైన్యం మమ్మల్ని వదలి తప్పక వెళ్లి పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు మిమ్మల్ని వదలరు.

10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.”‘

11 కల్దీయుల సైన్యం ఈజిప్టు రాజైన ఫరో సైన్యాన్ని ఎదుర్కొనటానికి యెరూషలేమును వదిలిన సమయంలో

12 యిర్మీయా యెరూషలేము నుండి బెన్యామీను దేశానికి వెళ్లగోరాడు. అక్కడ తన కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు.

13 కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం వద్దకు వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్బంధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రి పేరు షెలెమ్యా. షెలెమ్యో తండ్రి పేరు హనన్యా. రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను నిర్బంధంలోకి తీసుకొని “యిర్మీయా, నీవు మమ్మల్ని వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు”అని అన్నాడు.

14 “అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధి కారుల వద్దకు తీసికొని వెళ్లాడు.

15 ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యెనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యెనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు.

16 యోనాతాను ఇంటి కిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీయాను నిర్బంధించారు. అది ఇంటి కింద భూమిలో కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో చాలాకాలం ఉన్నాడు.

17 పిమ్మట రాజైన సిద్కియా మనుష్యులను పంపగా వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. యిర్మీయాతో సిద్కియా ఏకాంతంగా మాట్లాడ్డాడు. “యెహోవా నుండి ఏమైనా సందేశం వచ్చిందా?” అని యిర్మీయాను అడిగాడు. “అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది సిద్కియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” అని యిర్మీయా సమాధాన మిచ్చాడు.

18 తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు?

19 సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు.

20 కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”

21 కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణలోనే నిర్బందించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపించాడు. వీధిలోని రొట్టెల దుకాణము నుండి రొట్టె తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపించాడు. నగరంలో అమ్మే రొట్టెలు అయిపోయే వరకు యిర్మీయాకు రొట్టెలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా రాజ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నాడు.

38

1 కొంతమంది రాజ్యాధికారులు యిర్మీయా బోధిస్తున్నది విన్నారు. వారు మత్తాను కుమారుడైన షెఫట్య, పషూరు కుమారుడైన గెదల్యా, షెలెమ్యా కుమారుడైన యూకలును మరియు మల్కీయా కుమారుడైన పషూరు. యిర్మీయా ఈ వర్తమానాన్ని ప్రజలందరికి ఇలా చెప్పుచున్నాడు:

2 “యెహోవా సెలవిస్తున్నదేమనగా, ‘యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కడు కత్తివల్లగాని, ఆకలివలనగాని, రోగంతోగాని చనిపోతాడు. కాని బబులోను సైన్యానికి లొంగిపోయిన ప్రతి ఒక్కడూ బతుకుతాడు. వారు వారి ప్రాణాలతో తప్పించుకో గలుగుతారు.’

3 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.”‘

4 ప్రజలకు ఈ విషయాలను యిర్మీయా తెలియపర్చుతూ ఉండగా విన్న రాజ్యాధికారులు రాజైన సిద్కియా వద్దకు వెళ్లారు. వారు వెళ్లి, “యిర్మీయాను చంపివేయాలి. నగరంలో ఇంకా ఉన్న సైనికులను అధైర్యపర్చుస్తున్నాడు. తాను చెప్పే విషయాలతో యిర్మీయా ప్రతి ఒక్కడినీ నిరుత్సాహ పరుస్తున్నాడు. యిర్మీయా యిర్మీయా మనకు శభం కలగాలని కోరుకోవటం లేదు. అతడు యెరూషలేము ప్రజలను నాశనం చేయాలని కోరుకుంటున్నాడు” ఇని చెప్పారు.

5 “యిర్మీయా మీ స్వాధినంలోనే ఉన్నాడు. మిమ్మల్ని ఆపటానికి నేనేమీ చేయను” అని రాజైన సిద్కియా అన్నాడు.

6 దానితో ఆ అధికారులు యిర్మీయాను మల్కీయా యొక్క నీళ్లగోతిలోనికి దించారు. (మల్కీయా రాజు యొక్క కుమారుడు) రాజభటుడు ఉండే ప్రాంగణంలోనే ఆ నీటి గొయ్యి ఉంది. ఆ అధికారులు తాళ్ల సహాయంలో యిర్మీయాను గోతిలోనికి దించారు. గోతిలో నీరు లేదు గాని, అడుగున బురద పేరుకొని ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.

7 కాని ఎబెద్మెలెకు అనేవాడు అధికారులు యిర్మీయాను నీటిగోతిలోకి దించినట్లు విన్నాడు. ఎబెద్మెలెకు కూషీయుడు (ఇతియోపియ అనే దేశపువాడు) అతడు నపుంసకుడు (కొజ్జా) రాజ భవనంలో ఉద్యోగి. రాజైన సిద్కియా బెన్యామీను ద్వారం వద్ద కూర్చుని ఉండగా ఎబెద్మెలెకు రాజభవనం నుండి రాజును కలిసి మాట్లాడటానికి ద్వారం వద్దకు వెళ్లాడు.

8 [This verse may not be a part of this translation]

9 [This verse may not be a part of this translation]

10 అప్పుడు రాజైన సిద్కియా ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఇలా ఉంది: “ఎబెద్మెలెకూ, రాజభవనం నుంచి నీతో ముగ్గురు మనుష్యులను తీసికొని వెళ్లు. యిర్మీయా చనిపోకముందే వారి సహాయంతో అతనిని గోతిలో నుండి పైకి తియ్యి.”

11 తరువాత ఎబెద్మెలెకు తనతో మనుష్యులను తీసుకొని వెళ్లాడు. ముందుగా అతడు రాజభవనంలో సామాను భద్రపరచే గిడ్డంగి కిందవున్న గదిలోనికి వెళ్లాడు. ఆ గదినుండి కొన్ని పాత బట్టలను, చింపిరి గుడ్డలను అతడు తీసికొన్నాడు. కొన్ని తాళ్ల సహాయంతో ఆ బట్టలను గోతిలో ఉన్న యిర్మీయాకు వదిలాడు.

12 ఇతియోపియ వాడగు ఎబెద్మెలెకు యిర్మీయాను పిలిచి ఇలా అన్నాడు: “ఈ గుడ్డ పేలికలను, పాత బట్టలను నీ చంకలలో పెట్టుకో మేము నిన్ను పైకిలాగినప్పుడు ఈ బట్టలు నీ చంకలలో మెత్తలవలె ఉండి తాళ్ల వలన నీకు బాధ కులుగదు.” ఎబెద్మెలెకు చెప్పినట్లుగా యిర్మీయా చేశాడు.

13 ఆ మనుష్యులు యిర్మీయాను తాళ్ల సహాయంతో పైకిలాగి, నీళ్ల గొయ్యి నుండి బయటికి తీశారు. ఆలయ ఆవరణలోనే యిర్మీయా రక్షకభటుల ఆధీనంలోఉన్నాడు.

14 పిమ్మట రాజైన సిద్కియా తన సేవకునితో ప్రవక్తయైన యిర్మీయాను పిలిపించాడు. దేవాలయంలో మూడవ ద్వారం వద్దకు అతడు యిర్మీయాను పిలువనంపాడు. అప్పుడు రాజు “యిర్మీయా, నేను నిన్నొక విషయం అడగదలిచాను. ఏమీ దాయకుండా చిత్త శుద్ధితో అంతా చెప్పు” అని అన్నాడు.

15 “నేను నీకు సమాధానం ఇస్తే నీవు నన్ను చంపివేస్తావు. నేను నీకేదైనా సలహా ఇచ్చినా నీవు దానిని వినిపించుకోవు” అని యిర్మీయా సిద్కియాతో అన్నాడు.

16 కాని రాజైన సిద్కియా యిర్మీయాకు ఒక ప్రమాణం చేశాడు. సిద్కియా ఇది రహస్యంగా చేశాడు. సిద్కియా ఇలా ప్రమాణం చేశాడు”యిర్మీయా, మనందరికీ జీవం పోసిన ప్రాణదాత, నిత్యుడు అయిన యెహోవా సాక్షిగా నిన్ను నేను చంపను. అంతే గాదు. నిన్ను చంపజూచే అధికారులకు నిన్ను అప్పగించనని కూడా నేను నీకు ప్రమాణం చేస్తున్నాను.”

17 అప్పుడు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విధంగా చెప్పాడు, ‘నీవు బబులోను అధికారులకు లొంగిపోతే నీ ప్రాణం కాపాడబడుతుంది. యెరూషలేము నగరం కూడ తగుల బెట్టబడదు. నీవు, నీ కుటుంబం సజీవంగా ఉంటారు.

18 నీవు బబులోను రాజుయొక్క అధికారులకు లొంగి పోవటానికి నిరాకరిస్తే, యెరూషలేము కల్దీయుల సైన్యానికి ఇవ్వబడుతుంది. వారు యెరూషలేమును తగులబెడతారు. నీవు కూడ వారి బారి నుండి తప్పించుకోలేవు.”‘

19 “కాని ఇప్పటికే బబులోను సైన్యపు పక్షం వహించిన యూదా ప్రజల విషయంలో నేను భయపడుతున్నాను. పైగా సైనికులు నన్ను యూదా ప్రజలకు ఇస్తే వారు నన్ను అవమానపర్చి, గాయపర్చుతారని కూడా నేను భయపడతున్నాను.” అని యిర్మీయాకు రాజైన సిద్కియా బదులు చెప్పాడు.

20 అందుకు యిర్మీయా ఇలా అన్నాడు: “సైనికులు నిన్ను ఆ యూదా ప్రజలకు అప్పజెప్పారు. నేను చెప్పినట్లు విని యెహోవాకు విధేయుడవై ఉండుము. అప్పుడు పరిస్థితులు నీకు అనుకూలిస్తాయి. నీ ప్రాణం రక్షింపబడుతుంది.

21 కాని నీవు బబులోను సైన్యానికి లొంగిపోవటానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుందో యెహోవా నాకు చూపించాడు. యెహోవా ఇలా అన్నాడు:

22 యూదా రాజగృహంలో మిగిలివున్న స్త్రీలంతా బయటకు లాగబడతారు. వారు బబులోను రాజు ముఖ్య అధికారుల వద్దకు తేబడుతారు. నీ స్త్రీలే నిన్ను ఒక పాట పాడి ఎగతాళి చేస్తారు. ఆ స్త్రీలు ఇలా అంటారు. నీ మంచి స్నేహితులే నిన్ను తప్పుదోవ పట్టించారు. నీవారు నీకంటె బలవంతులైనారు. అటువంటి స్నేహితులనే నీవు నమ్మావు. నీ కాళ్లు బురదలో కూరుకున్నాయి. నీ స్నేహితులు నిన్ను వదిలి పెట్టారు.

23 “నీ భార్యలు, పిల్లలు అందరూ బయటకు ఈడ్వబడతారు. వారు కల్దీయుల సైన్యానికి అప్పగించబడతారు. నీవు కూడ బబులోను సైన్యం నుండి తప్పించుకోలేవు. నీవు బబులోను రాజుచే పట్టు కొనబడతావు. యెరూషలేము తగులబెట్టబడుతుంది.”

24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నేను నీతో మాట్లాడుతున్నానని ఎవ్వరికీ తెలియనీయవద్దు. చెప్పితే నీవు చనిపోతావు.

25 ఆ అధికారులు నేను నీతో మాట్లాడినట్లు తెలిసికోవచ్చు. అప్పుడు వారు నీ వద్దకు వచ్చి, ‘యిర్మీయా, నీవు రాజైన సిద్కియాకు ఏమి చెప్పావో అది మాకు తెలియజేయుము. రాజైన సిద్కియా నీకు ఏమి చెప్పినాడో కూడ మాకు చెప్పు. మాకు నిజాయితీగా అంతాచెప్పు. లేకుంటే మేము నిన్ను చంపివేస్తాం’ అని అంటారు.

26 వారు నీతో అలా అన్నప్పుడు, ‘నన్ను మరల యెనాతాను ఇంటి కిందగల చెరసాల గదిలోకి పంపవద్దని రాజును వేడుకుంటున్నాను. మళ్లీ నేనా చెరసాల గదికి పంపబడితే చనిపోతాను’ “అని అన్నట్లు చెప్పు.

27 అనుకున్నదంతా జరిగింది. రాజ్యాధికారులు యిర్మీయాను ప్రశ్మించటానికి వచ్చారు. యిర్మీయా మాత్రం రాజు ఆజ్ఞానుసారం ఆయన చెప్పిన రీతిగా వారికి సమాధానమిచ్చాడు. అప్పుడా అధికారులు యిర్మీయాను ఒంటరిగా వదిలారు. యిర్మీయా మరియు రాజు ఏమి మాట్లాడారో ఏ ఒక్కరూ వినలేదు.

28 యెరూషలేము ముట్టడింపబడేనాటి వరకు యిర్మీయా ఆలయ ప్రాంగణంలో బందీగా ఉన్నాడు.

39

1 యెరూషలేము ఈ విధంగా లోబరచు కోబడింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము మీదికి తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు నగరాన్ని ముట్టడించాడు.

2 సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) పగులగొట్టబడింది.

3 దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

4 యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు.

5 కాని కల్దీయుల సైన్యం సిద్కియాను, అతనితో ఉన్న సైనికులను తరుముకుంటూ పోయారు. కల్దీయుల సైన్యం సిద్కియాను యెరికో మైదానాలలో పట్టుకున్నారు. వారు సిద్కియాను పట్టుకుని బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన తీర్పును ఇచ్చాడు.

6 రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు.

7 తరువాత సిద్కియా కండ్లను నెబకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.

8 బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము వాసుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మరియు వారు యెరూషలేము గోడలను పడగొట్టారు.

9 నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు.

10 కాని ప్రత్యేక అంగరక్షకుల దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తి పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజరదాను యూదాలోని పేద ప్రజలకు ద్రాక్షాతోటలను, పొలాలను ఇచ్చాడు.

11 కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు.

12 “యిర్మీయాను వెదకి తెలసికొని అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయపర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ ఇచ్చాడు.

13 ప్రత్యేక అంగరక్షక దళధికారి నెబూజరదాను, బబులోను సైన్యంలో ముఖ్యాధికారియైన నెబూషజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్ షరేజరు మరియు ఇతర బబులోను సైన్యాధికారులు యిర్మీయాను పిలిపించారు.

14 యూదా రాజు రక్షకుల ఆధీనంలో ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను సైన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు అప్పగించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీయాను తిరిగి ఇంటికి తీసికొని పోవటానికి గెదల్యాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల్ల యిర్మీయా తన ఇంటికి తీసికొనిపోబడగా అతడు తన ప్రజలతో కలిసి నివసించాడు.

15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది:

16 “యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబెద్మెలెకునకు అందజేయుము: ‘ఇతశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయిగాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు.

17 కాని ఎబెద్మెలెకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను’ - ఇది యెహోవా సందేశం - ‘నీవు ఎవరిని చూచి భయబడుతున్నావో వారికి నిన్ను అప్పగించను.

18 ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను నమ్మావు. గనుక అలా జరుగుతుంది.’ “ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.

40

1 యిర్మీయా రామా నగరంలో విడుదలైన పిమ్మట యోహోవా వాక్కు అతనికి వినిపించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యిర్మీయాను రామా నగరంలో ఉన్నట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలుసులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీయా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బంధీలుగా బబులోనుకు తీసికొని పోబడుతున్నారు.

2 దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు.

3 యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఈ ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు.

4 కాని యిర్మీయా, నిన్ను నేనిప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి సంకెళ్లను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో బబలోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో నేను తగిన శ్రద్ధ తీసికొంటాను. నీకు నాతో రావటానికి ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లు.

5 లేక షాఫాను పుత్రుడైన ఆహీకాము కుమారుడు గెదల్యావద్దకు తిరిగి వెళ్లు . యూదా పట్టణాల పరిపాలనా నిర్వహణకై బబులోను రాజు గెదల్యాను పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గెదల్యాతో కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా నీ ఇష్టమొచ్చిన మరెక్కడికైనా సరే వెళ్లు.” పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు.

6 కావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వెళ్లాడు. యిర్మీయా గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య నివసించాడు.

7 యెరూషలేము నాశనం చేయబడినప్పుడు యూదా రాజ్య సైన్యంలోని కొంతమంది, సైనికులు అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించటానికి అహీకాము కుమారుడైన గెదల్యాను బబులోను రాజు నియమించినట్లు ఆ సైనికులు విన్నారు. యూదా రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబులోనుకు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని స్త్రీ పురుషులు, పిల్లలు వున్నారు.

8 కావున ఆ సైనికులు మిస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహోనాను మరియు యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీయుని కుమారుడైన యెజన్యా, వారితో ఉన్న మనుష్యులు ఉన్నారు.

9 షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది.

10 నేను కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్దీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడతాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి ద్రాక్షపంట నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.”

11 మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు.

12 ఆ యూదా ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాల ద్రాక్షరసాన్ని తీసి, వేసవి పండ్లను సేకరించారు.

13 బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడైన యోహానాను, ఇతర యూదా సైన్యాధికారులు గెదల్యా యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో ఉన్నాడు.

14 యోహానాను, మరియు అతనితో ఉన్న అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయలీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంపటానికి పంపాడు” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారు మాట నమ్మలేదు.

15 పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదరై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.”

16 కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానానుతో, “ఇష్మాయేలును చంపవద్దు. నీవు ఇష్మాయేలును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” అని అన్నాడు.

41

1 ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడు అగు ఇష్మాయేలు ఏడవ మాసంలో అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చాడు. అతనితో తమ మనుష్యులు పదిమంది ఉన్నారు. వారు మిస్పా పట్టణానికి వచ్చారు. ఇష్మాయేలు రాజ కుటుంబంలో ఒక సభ్యుడు. యూదా రాజు అధికారులలో ఒకడు. ఇష్మాయేలు, అతని మనుష్యులు గెదల్యాతో కలిసి భోజనం చేశారు.

2 వారంతా కలిసి భోజనం చేస్తూవుండగా, ఇష్మాయేలు మరియు అతని పదిమంది మనుష్యులు లేచి అహీకాము కుమారుడైన గెదల్యాను కత్తితో పొడిచి చంపారు. గెదల్యా యూదా పాలకుడుగా బబులోను రాజుచే ఎంపిక చేయబడిన వ్యక్తి.

3 మిస్పా పట్టణంలో గెదల్యాతో ఉన్న యూదా ప్రజలందరిని కూడ ఇష్మాయేలు చంపివేశాడు. అంతేగాదు. గెదల్యాతో వున్న కల్దీయుల సైనికులను కూడ ఇష్మాయేలు చంపివేశాడు.

4 [This verse may not be a part of this translation]

5 [This verse may not be a part of this translation]

6 ఆ ఎనభై మందిని కలవటానికి ఇష్మాయేలు మిస్పా పట్టణం నుండి వారికి ఎదురేగాడు. అతడు వారిని కలవటానికి వెళుతూ రోదించాడు . ఇష్మాయేలు ఆ ఎనభై మంది మనుష్యులనూ కలిసి కొని, “నాతో రండి. మనం అహీకాము కుమారుడైన గెదల్యాను కలుద్దాము” అని చెప్పాడు.

7 ఆ ఎనభై మంది మిస్పా పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు ఇష్మాయేలు, అతని మనుష్యులు కలిసి ఆ వచ్చిన వారిలో డెబ్బయి మందిని చంపివేశారు. వారా శవాలను నీళ్లను నిల్వచేయటానికి నిర్మించిన నూయి వంటి గోతిలో పడవేశారు.

8 కాని మిగిలిన పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపవద్దు! మావద్ద గోధుమ, యవధాన్యాలు ఉన్నాయి. మావద్ద తైలము, తేనె కూడ ఉన్నాయి. వాటిని మేమొక పొలంలో దాచాము (వాటిని మీకు ఇస్తాము)” అని చెప్పారు. అందువల్ల ఇష్మాయేలు ఆ పది మందినీ వదిలి పెట్టాడు. ఇతరులతో పాటు అతడు వారిని చంపలేదు.

9 (ఈ నీటి గొయ్యి చాలా పెద్దది. ఆసా అనే యూదా రాజుచే అది నిర్మించబడింది. యుద్ధ కాలంలో నీటిని నిలువచేయటానికి రాజైన ఆసా దానిని నిర్మింప చేశాడు. ఇశ్రాయేలు రాజైన బయషా నుండి తన పట్టణాన్ని రక్షించుకోవటానికి ఆసా ఇలా చేశాడు. అయితే ఇష్మాయేలు మాత్రం ఆ గొయ్యి నిండేవరకు దానిలో శవాలను పడవేశాడు.)

10 మిస్పా పట్టణంలో ఉన్న ఇతర ప్రజలందరినీ ఇష్మాయేలు పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వారిలో రాజు కుమార్తెలు మరియు అక్కడ మిగిలియున్న ఇతర ప్రజలు వున్నారు. ఎవరినైతే నెబూజరదాను పాలించమని గెదల్యాను నియమించాడో, వారే ఆ ప్రజలు. నెబూజరదాను బబులోను రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి. ఇష్మాయేలు తాను పట్టుకున్న ప్రజలను తీసికొని అమ్మోను దేశానికి పోవటానికి బయలు దేరాడు.

11 కారేహ కుమారుడైన యెహానాను మరియు అతనితో ఉన్న సైన్యాధికారులు ఇష్మాయేలు చేసిన క్రూరమైన పనులన్నిటి గురించి విన్నారు.

12 కావున యోహానాను, అతనితో వున్న సైన్యాధికారులు తమ సైనికులను వెంట తీసికొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎదుర్కోవటానికి వెళ్లారు. గిబియోను వద్ద గల పెద్ద చెరువు దగ్గర వారు ఇష్మాయేలును పట్టుకున్నారు.

13 ఇష్మాయేలును బందీలుగా పట్టుకు పోతున్న యోహానానును, సైన్యాధికారులను చూచి జనులు చాలా సంతోషించారు.

14 అప్పుడు మిస్పా పట్టణంలో ఇష్మాయేలు బందీలుగా తీసికొన్న వారంతా కారేహ కుమారుడైన యోహానాను వద్దకు పరుగెత్తారు.

15 కాని ఇష్మాయేలు మరియు అతనితో ఉన్న వారిలో ఎనిమిది మంది యోహోనాను నుండి తప్పించుకున్నారు. వారు అమ్మోనీయుల వద్దకు పారిపోయారు.

16 ఆ విధంగా కారేహ కుమారుడైన యోహానాను, సైనికాధికారులు బందీలను రక్షించారు. ఇష్మాయేలు గెదల్యాను హత్య చేసి ఆ ప్రజలను మిస్పా పట్టణంలో పట్టుకున్నాడు. బతికి బయటపడిన వారిలో సైనికులు, స్త్రీలు, పిల్లలు మరియు న్యాయాధికారులు వున్నారు, యెహానాను వారిని గిబియోను పట్టణం నుండి తిరిగి తీసికొని వచ్చాడు.

17 [This verse may not be a part of this translation]

18 [This verse may not be a part of this translation]

42

1 వారు గెరూతు కింహాము వద్ద ఉండగానే యోహానాను, హోషేయా కుమారుడైన యెజన్యా అనే మరో వ్యక్తి కలిసి ప్రవక్తయైన యిర్మీయా వద్దకు వెళ్లారు. సైన్యాధికారులంతా యోహానాను, యెజన్యానులతో కలిసి వెళ్లారు. అల్పులు మొదలు ఉన్నతుల వరకు అంతా యిర్మీయా వద్దకు వెళ్లారు.

2 వారంతా ఇలా అన్నారు: “యిర్మీయా, దయచేసి మా అభ్యర్థన ఆలకించు. యూదా సంతతిలో బతికి బయటపడిన ఈ ప్రజలందరిని గురించి నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. యిర్మీయా, మాలో ఎక్కువ మంది మిగలలేదు. ఒకప్పుడు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము.

3 యిర్మీయా, మేము ఎక్కడికి వెళ్లవలెనో, ఏమి చేయవలెనో నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి తెలుసుకో.”

4 అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా ఇలా అన్నాడు: “మీరు నన్ను చేయమని అడిగిన విషయాలను నేను అర్థం చేసికొన్నాను. మీ దేవుడైన యెహోవాకు మీరడిగిన విధంగా నేను ప్రార్థన చేస్తాను. యెహోవా చెప్పినదంతా నేను మీకు తెలియజేస్తాను. మీకు నేనేదీ దాచి పెట్టను.”

5 తరువాత ప్రజలు యిర్మీయాతో ఇలా అన్నారు, “నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా మేము చేయకపోతే దేవుడే మాకు వ్యతిరేకంగా నిజమైన సాక్షి అవుతాడు. నీ దేవుడైన యెహోవా మేము ఏది చేయాలో నీకు తెలియజేస్తాడని మాకు తెలుసు.

6 యెహోవా వర్తమానం మాకు సమ్మతమవుతుందా, సమ్మతం కాదా అనేది సమస్య కాదు. మా యెహోవా దేవుని పట్ల మేము విధేయులపై ఉంటాము. మేము నిన్ను ఒక సందేశం తెచ్చుట కొరకు పంపుచున్నాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. మా దేవుడైన యెహోవాకు మేము విధేయులమైనప్పుడు మాకు మంచి విషయాలు జరుగుతాయని మాకు ఖచ్చితముగా తెలుసు.”

7 పది రోజులు జరిగిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినిపించింది.

8 అప్పుడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధికారులను యిర్మీయా ఒక చోటికి పిలిచాడు. అతి సామాన్యుడి మొదలు అతి ముఖ్యమైన వ్యక్తి వరకు ప్రజలందరినీ కూడ యిర్మీయా ఒక చోటికి పిలిచాడు.

9 అప్పుడు యిర్మీయా వారితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వద్దకు మీరు నన్ను పంపారు. మీరు నన్ను అడగమన్నదంతా నేను యెహోవాను అడిగాను. యెహోవా ఇలా చెపుతున్నాడు:

10 ‘ప్రజలారా మీరు యూదాలో ఉంటే నేను మిమ్మల్ని బలపర్చుతాను - మిమ్మల్ని నాశనం చేయను. మీరు స్థిరపడేలా చేస్తాను. నేను మిమ్మల్ని పెకలించి వేయను. నేనిది ఎందుకు చేయదలచుకున్నానంటే, నేను మీకు కలుగజేసిన భయంకర విషయాల పట్ల నేను విచారిస్తున్నాను.

11 బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు.

12 నేను మీ పట్ల దయగలిగి వుంటాను. బబులోను రాజు కూడ మీ పట్ల కనికరం చూపుతాడు. అతడు మిమ్మల్ని మీ దేశానికి తిరిగి తీసుకొని వస్తాడు. ‘

13 ‘మేము యూదాలో వుండమని’ మీరు అనవచ్చు. అలా అంటే మీరు మీ యెహోవా దేవుని అనుసరించనట్లే.

14 ‘అది కాదు. మేము వెళ్లి ఈజిప్టులో నివసిస్తాము. ఆ దేశంలో మాకు యుద్ధ భయం ఉండదు. మేమక్కడ యుద్ధ భేరీలు వినము. మేము అక్కడ ఆకలితో బాధపడము అని మీరు అనవచ్చు.

15 యూదాలో మిగిలిన ప్రజలారా, మీరలా అంటే యెహోవా వర్తమానం ఏమిటో వినండి. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘మీరు ఈజిప్టునందు నివసింప నిశ్చయిస్తే మీకు ఇలా జరుగుతుంది:

16 మీరు యుద్ధమనే కత్తికి భయపడ్డారు. కాని అది మిమ్మల్ని అక్కడ ఓడిస్తుంది. మీరు ఆకలి విషయంలో భయపడ్డారు. కాని మీరు ఈజిప్టులో క్షామానికి గురియగుతారు. మీరక్కడ చనిపోతారు.

17 ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలనుకునే ప్రతివాడు కత్తివాతబడి గాని, ఆకలిచేగాని, భయంకర వ్యాధులచేగాని చనిపోతాడు. ఈజిప్టుకు వెళ్లే ఏ ఒక్కడు బతకడు. నేను వారికి కలుగజేసే భయంకర పరిస్థితుల నుండి ఏ ఒక్కడూ తప్పించుకోలేడు.’

18 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘యెరూషలేము పట్ల నా కోపాన్ని చూపాను. యెరూషలేములో నివసించే ప్రజలను నేను శక్షించాను. అదేరీతిగా ఈజిప్టుకు వెళ్లే ప్రతివాని పట్లా నా కోపం చూపిస్తాను. ప్రజలు తమ శత్రువులకు కీడు జరగాలని కోరుకున్నప్పుడు మీకు జరిగినట్లు జరగాలని మిమ్మల్ని ఒక ఉదాహరణగా తీసుకుంటారు. మీరు శాపగ్రస్తులౌతారు. మిమ్మల్ని చూచి ప్రజలు సిగ్గు చెందుతారు. ప్రజలు మిమ్మల్ని అవమాన పర్చుతారు. మీరు మళ్లీ యూదా రాజ్యాన్ని చూడరు.’

19 “యూదాలో మిగిలివున్న ప్రజలారా, ‘మీరు ఈజిప్టుకు పోవద్దు’ అని యెహోవా మీకు చెప్పియున్నాడు. ఇప్పుడే మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను.

20 మీకు చావు తీసికొనివచ్చే తప్పు మీరు చేస్తున్నారు. ‘మీరే నన్ను మీ ప్రభువైన ెదేవుని వద్దకు పంపారు. ‘మన ప్రభువైన దేవుణ్ణి మా కొరకు ప్రార్థించు. యెహోవా ఏమి చేయమని చెప్పుచున్నాడో అదంతా మాకు తెలియజేయుము. మేము యెహోవా చెప్పినట్లు నడచుకొంటాము’ అని మీరే నాతో అన్నారు.

21 కావున ఈ రోజు యెహోవా సందేశాన్ని మీకు వినిపించాను. కాని మీరు ప్రభువైన మీ దేవునికి విధేయులు కాలేదు. ఆయన మిమ్మల్ని ఏమి చేయమని చెప్పటానికి నన్ను పంపియున్నాడో అదంతా మీరు చేయలేదు!

22 కావున ఇప్పుడిది బాగా అర్థం చేసికొనండి: మీరు ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించాలని అనుకుంటున్నారు. కాని ఈజిప్టులో మీరు కత్తివేటుకు గురియైగాని, ఆకలిచేగాని, భయంకర రోగాలతో గాని చనిపోతారు.”

43

1 వారి దేవుడైన యెహోవావద్ద నుండి వచ్చిన సందేశాన్ని యిర్మీయా అలా చెప్పి ముగించాడు. యెహోవా తనకు తెలియజేసిన రీతిగా యిర్మీయా ప్రజలందరికి పూర్తిగా చెప్పాడు.

2 కాని హోషేయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకను మరికొంత మంది అహంభావంతో మొండివైఖరి దాల్చారు. వారు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. “ యిర్మీయా నీవు అబద్ధమాడుతున్నావు! ‘ఓ ప్రజలారా, మీరు నివసించటానికి ఈజిప్టుకు వెళ్లరాదు’ అని మాకు చెప్పుమని మా ప్రభువైన దేవుడు నిన్ను పంపలేదు.

3 యిర్మీయా, నేరియా కుమారుడైన బారూకు నిన్ను మాకు వ్యతిరేకంగా పురికొల్పుచున్నాడని మేమనుకుంటున్నాము. నీవు మమ్మల్ని బబులోను వారికి అప్పగించాలని అతడు ఆశిస్తున్నాడు. నీవు ఇది చేస్తే, వారు మమ్మల్ని చంపాలని ఎదురు చూస్తున్నారు. లేదా, నీవిది చేస్తే వారు మమ్మల్ని బందీలుగా బబులోనుకు పట్టుకుపోవాలని అయినా కోరుకొని వుండవచ్చు “ అని అన్నారు.

4 కావున యోహానాను, సైనికాధికారులు, ఇతర ప్రజలు ప్రభువాజ్ఞ తిరస్కరించారు. యెహోవా వారిని యూదాలో వుండమని ఆజ్ఞ ఇచ్చాడు.

5 కాని ప్రభువాజ్ఞ పాటించటానికి బదులు, యోహానాను మరియు సైనికాధికారులు యూదాలో మిగిలిన వారిని ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. గతంలో ఆ మిగిలిన వారిని శత్రువు ఇతర దేశాలకు తీసికొని వెళ్లాడు. కాని వారు మరల యూదా దేశానికి తిరిగి వచ్చారు.

6 ఇప్పుడు యోహానాను మరియు సైనికాధికారులు కలిసి పురుషులను, స్త్రీలను, పిల్లలను అందరినీ ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. ఆ విధంగా తీసికొని వెళ్లబడిన వారిలో రాజు కుమార్తెలు కూడ వున్నారు. (నెబూజరదాను ఆ ప్రజలందరినీ గెదల్యా సంరక్షణలో వుంచాడు. నెబూజరదాను బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతి.) ప్రవక్తయైన యిర్మీయాను, నేరీయా కుమారుడగు బారూకును కూడ యోహానాను వెంట తీసికొని వెళ్లాడు.

7 వారు యెహోవా మాట పెడచెవినిబెట్టి ఈజిప్టుకు వెళ్లారు. వారు తహపనేసు అనే పట్టణానికి వెళ్లారు.

8 తహపనేసు పట్టణంలో యెహోవా యొక్క ఈ వర్తమానం యిర్మీయాకు చేరింది:

9 “యిర్మీయా, కొన్ని పెద్ద రాళ్లను తీసికొనిరా, వాటిని తహపనేసులో ఫరో రాజు అధికార గృహానికి ఎదురుగా మట్టితోను, ఇటుకలతోను నిర్మించిన పక్కబాట కింద పాతిపెట్టు. యూదా వారు చూస్తుండగా నీవీపని చేయ్యి.

10 అప్పుడు నిన్ను చూస్తూవున్న యూదా వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: బబులోను రాజైన నెబుకద్నెజరును ఇక్కడికి పిలుస్తాను. అతడు నా సేవకుడు. నేనిక్కడ పాతిపెట్టిన రాళ్లమీద నేనతని సింహాసనాన్ని నెలకొల్పుతాను. నెబుకద్నెజరు తన రత్నకంబళిని ఈ రాళ్లపై పరుస్తాడు.

11 నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చిన ఈజిప్టును ఎదిరిస్తాడు. మరణించవలసిన వారికి అతడు మరణాన్ని తీసికొనివస్తాడు. బందీలుగా కొనిపోబడే వారికి దాస్యాన్ని తెస్తాడు. కత్తిచే హతము గావింపబడే వారి మీదికి ఖడ్గాన్ని తెస్తాడు

12 ఈజిప్టులోని బూటకపు దేవుళ్ల గుళ్లల్లో నెబుకద్నెజరు అగ్నిని రగుల్చుతాడు. అతడా గుళ్లను తగులబెట్టి, విగ్రహాలను తీసికొని పోతాడు. గొర్రెల కాపరి తమ బట్టలనుండి నల్లులను, ముండ్ల కాయలను ఏరివేయునట్లు నెబుకద్నెజరు ఈజిప్టును శుభ్రపర్చి వశం చేసికొంటాడు. ఆ తరువాత అతడు ఈజిప్టునుండి సురక్షితంగా వెళ్లిపోతాడు.

13 ఈజిప్టులో అతి ముఖ్యమైన సూర్య దేవాలయంలోని పవిత్ర రాతి స్తంభాలను నెబుకద్నెజరు నాశనం చేస్తాడు. పైగా ఈజిప్టులోని బూటకపు దేవతల ఆలయాలన్నిటినీ అతడు తగులబెడతాడు!”‘

44

1 యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ వర్తమానం మిగ్దోలు, తహపనేసు, నొపు పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివసిస్తున్న యూదా వారికై ఇవ్వబడింది. ఆ సందేశం ఇలా ఉంది:

2 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “యెరూషలేము నగరం మీదికి, యూదా పట్టణాలన్నిటి మీదికి నేను రప్పించిన భయంకర విపత్తులను మీరంతా చూశారు. ఆ పట్టణాలన్నీ ఈనాడు వట్టి రాళ్ల గుట్టల్లా వున్నాయి.

3 ప్రజలంతా పాపకార్యాలు చేయుటవల్లనే ఆ ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ఆ ప్రజలు అన్యదేవతలకు బలులు అర్పించారు. అది నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ పూర్వీకులు ఆ అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించలేదు.

4 ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపి యున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. ‘మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు’ వారు ప్రజలకు చెప్పారు.

5 కాని ఆ ప్రజలు నా ప్రవక్తల మాట వినలేదు. ప్రజలసలు ప్రవక్తలను లక్ష్యపెట్టనేలేదు. ఆ ప్రజలు దుష్ట కార్యాలు చేయటం మానలేదు. అన్యదేవతలకు బలులు అర్పించటం వారు మానలేదు.

6 కావున వారి మీద నా కోపాన్నీ చూపించాను. యూదా పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను శిక్షించాను. ఈనాడు అవి వున్నట్లుగా యోరూషలేము నగరాన్ని, యూదా పట్టణాలను పట్టి రాళ్ల గుట్టల్లా నా కోపం మార్చివేసింది.”

7 ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు, “విగ్రహారాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపెట్టుకుంటున్నారు? యూదా కుంటుంబం నుంచి పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను, పసికందులను వేరు చేస్తున్నారు. ఆ విధంగా యూదా వంశంలో ఎవ్వరూ మిగలకుండా మీరు చేసుకుంటున్నారు.

8 విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి.

9 మీ పూర్వీకులు చేసిన చెడుకార్యాలను మీరు మర్చిపోయారా? యూదా రాజులు, రాణులు చేసిన క్రూర కార్యాలు మీరు మర్చిపోయారా? మీరు, మీ భార్యలు కలసి యూదాలోను మరియు యెరూషలేము నగర వీధులలోను చేసిన చెడుకార్యాలు మర్చిపోయారా?

10 ఈనాటికీ యూదా ప్రజలు తమ్ము తాము తగ్గించు కోలేదు. నాపట్ల గౌరవ భావమేమీ చూపలేదు. ఆ ప్రజలు నా బోధనలను అనుసరించలేదు. మీకు, మీ పితరులకు యిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేదు.”

11 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “మీకు భయంకరమైన విపత్తులు కలుగజేయటానికి నేను నిశ్చయించాను. యూదా వంశాన్నంతా నాశనం చేస్తాను!

12 యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు.

13 ఈజిప్టులో నివసించటానికి వచ్చిన వారిని నేను శిక్షిస్తాను. వారిని శిక్షించటానికి నేను కత్తిని, క్షామాన్ని, భయంకర రోగాలను వినియోగిస్తాను. యెరూషలేము నగరాన్ని శిక్షించిన విధంగానే ఆ ప్రజలను కూడ నేను శిక్షిస్తాను.

14 యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.”

15 ఈజిప్టులో నివసిస్తున్న చాలా మంది యూదా స్త్రీలు అన్యదేవతలను ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అది వారి భర్తలకు తెలుసు. అయినా వారు వారిని వారించలేదు. ఆ ప్రజలు పెద్ద గుంపుగా కలుసుకొన్నారు. వారిలో దక్షిణ ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలున్నారు. అన్యదేవతలకు నైవేద్యాలు అర్పిస్తున్న స్త్రీల భర్తలు యిర్మీయాతో ఇలా అన్నారు:

16 “నీవు మాకు చెపుతున్న యెహోవా సందేశాన్ని మేము వినం.

17 ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు.

18 కాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం మానినప్పటి నుండి మాకు అనేక సమస్యలు వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంపబడ్డారు.”

19 తరువాత స్త్రీలు మాట్లాడారు . వారు యిర్మీయాతో యిలా చెప్పారు, “మేము ఏమి చేస్తున్నామో మా భర్తలకు తెలుసు. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు అర్పించుటకు మా భర్తల అనుమతి పొందాము. వారి అనుమతితోనే మేము ఆమెకు పానీయాలు వారబోశాము. ఆమె ప్రతిరూపంగా మేము కుడుములు చేయటం కూడ మా భర్తలకు తెలుసు.”

20 పిమ్మట యిర్మీయా ఆ స్త్రీ పురుషులతో మాట్లాడాడు. ఈ విషయాలన్నీ చెప్పిన ఆ ప్రజలతో అతడు మాట్లాడినాడు.

21 ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు.

22 తరువాత యెహోవా మీపట్ల ఎంతమాత్రం ఓర్పు వహించ లేకపోయాడు. మీరు చేసిన భయంకరమైన పనులను యెహోవా అసహ్యించుకున్నాడు. అందువల్ల యెహోవా మీ దేశాన్ని వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారు.

23 అన్య దేవతలకు మీరు బలులు అర్పించిన కారణంగా మీకు కష్టాలన్నీ వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. మీరు యెహోవాకు విధేయులై వుండలేదు. మీకు అందజేసిన ఆయన ఆదేశాలనుగాని, ఆయన నిర్దేశించిన న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని ఒడంబడికలో మీ బాధ్యతను మీరు విస్మరించారు.”

24 తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి యిర్మీయా ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈజిప్టులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా వాక్కు వినండి:

25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు వారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.

26 కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా యెహోవా సందేశాన్ని వినండి: మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా’ అని వారు చెప్పరు.

27 “‘ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకునివున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. వారలా క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగిసేవరకు చనిపోతారు.

28 కొంతమంది యూదావారు కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిప్టునుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించుకోగలిగే యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే ఆ బహు కొద్ది మంది యూదా వారు ఎవరి మాట నిజమవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యినదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసుకుంటారు.

29 ఇక్కడ ఈజిప్టులో మిమ్మల్ని నేను శిక్షిస్తానని తెలిసేటందుకు ఒక నిదర్శనం ఇస్తాను.’ ఇదే యెహోవా వాక్కు. ‘అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని నేను చేసిన ప్రమాణం నిజమవుతుందని మీకు నిశ్చయంగా తెలుస్తుంది.

30 నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరొహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’ “

45

1 యెహోయాకీము కుమారుడు యోషియా యూదాలో రాజైన యెహోయాకీము పాలన నాల్గవ సంవత్సరం జరుగుతూ ఉండగా ప్రవక్తయైన యిర్మీయా ఈ విషయాలను నేరీయా కుమారుడైన బారూకుతో చెప్పాడు. బారూకు ఈ విషయాలను పుస్తక రూపంలో రాశాడు. యిర్మీయా బారూకుకు చెప్పినది ఇది:

2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమనంటే,

3 ‘బారూకూ, నీవిలా అన్నావు, నాకు కష్టం వచ్చింది. నా బాధకు తోడు యెహోవా నాకు దుఃఖాన్ని యిచ్చాడు. నేను మిక్కిలి అలసిపోయాను. నా బాధలవల్ల నేను మిక్కిలి కృశించిపోయాను. నాకు విశ్రాంతి లేదు.”‘

4 యిర్మీయా, నీవిది బారూకుకు చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిర్మించిన దానిని నేనే పడగొట్టుతున్నాను. నేను దేనినైతే నాటితినో దానిని నేనే పెరికివేస్తున్నాను. యూదాలో ప్రతిచోటా నేనలా చేస్తాను.

5 బారూకూ, నీవు నీ కొరకై గొప్ప విషయాలకై ఎదురు చూస్తున్నావా? నీవు వాటి కొరకు చూడవద్దు. ఎందుకంటే, నేను భయంకర విపత్తును ప్రజలందరి మీదికి కలుగజేస్తున్నాను గనుక నీవు వారి కొరకు చూడవద్దు.’ ఇవి యెహవా చెప్పిన విషయాలు. ‘నీవు చాలా చోట్లకు వెళ్లవలసి వుంటుంది. నీవు ఎక్కడికి వెళ్లినా ప్రాణంతో తప్పించుకునేలా నేను చేస్తాను.”‘

46

1 ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు సంబంధించి ఉన్నాయి.

2 ఈ వర్తమానం ఈజిప్టు దేశాన్ని గురించి చెప్పిబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నది తీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:

3 “మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి. యుద్ధానికి నడవండి.

4 గుర్రాలను సిద్ధం చేయండి. సైనికులారా, మీరు గుర్రాలను ఎక్కండి. యుద్ధానికై మీమీ సంకేత స్థలాలకు వెళ్లండి. మీ శిరస్త్రాణాలను పెట్టుకోండి. మీ ఈటెలకు పదును పెట్టండి. మీ కవచాలను ధరించండి.

5 నేనేమిటి చూస్తున్నాను? ఆ సైన్యం భయపడింది! సైనికులు పారిపోతున్నారు. ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు. వారు తత్తరపడి పారిపోతున్నారు. వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు. ఎటు చూచినా భయం.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

6 “వేగంగా పరుగెత్తేవారు, బలవంతులు కూడా తప్పించుకోలేరు. వారు తూలి పడిపోతారు. ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.

7 నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు? పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?

8 పొంగి ప్రవహించే నైలు నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే. మహా వేగంతో ప్రవహించే మహా నదిలా వచ్చేది. ఈజిప్టు దేశమే. ‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను. నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.

9 గుర్రపు రౌతుల్లారా, యుద్ధానికి కదలండి. సారధుల్లారా, శరవేగంతో రథాలు తోలండి. యోధుల్లారా ముందుకు పదండి. కూషు, పూతు సైనికులారా మీ డాళ్లను చేబూనండి. లూదీయులారా, మీ విల్లంబులు వాడండి.

10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు! ఆ సమయంలో ఆయన శత్రువులకి తగిన శిక్ష ఆయన విధిస్తాడు. యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది. దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది. ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది. ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.

11 “ఈజిప్టు, గిలియాదు వరకు వెళ్లి మందు తెచ్చుకో. నీవు మందులనేకం తయారుచేస్తావు, అయినా అవి నీకు ఉపయోగపడవు. నీ గాయాలు మానవు.

12 నీ రోదనను దేశాలు వింటాయి. నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది. ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు. ఆ యోధులిద్దరూ కలిసి కింద పడతారు.”

13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్తమానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం ఇవ్వబడింది.

14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి. మిగ్దోలు నగరంలో బోధించండి. ఈ సందేశాన్ని నొపు (మెంఫిన్) లోను, తహపనేసులోను ప్రచారం చేయండి: ‘యుద్ధానికి సిద్ధపడండి. ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే చంపబడుతున్నారు.’

15 “ఈజిప్టూ నీ బలమైన యోధులెందుకు చంపబడతారు? వారు నిలువలేరు. ఎందువల్లనంటే యెహోవా వారిని నేలకు పడదోస్తాడు!

16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు. వారొకరి మీద మరొకరు పడతారు. వారు, ‘లేవండి, మనం మన స్వంత ప్రజల వద్దకు వెళదాం. మనం మన మాతృభూమికి వెళ్లిపోదాము. మన శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అంటారు.

17 వారి స్వస్థలాల ఆ సైనికులు, ‘ఈజిప్టు రాజైన ఫరో కేవలం ఆడంబరమైన వాడు; అతని ప్రభావం అయిపోయింది, అని అనుకుంటారు”‘

18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది. సర్వశక్తిమంతుడైన యెహోవాయే ఆ రాజు. “నిత్యుడనగు నా తోడుగా ప్రమాణము చేపుతున్నాను. ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు. తాబోరు కొండలా, సముద్రతీరానగల కర్మెలు పర్వతంలా అతడు గొప్పవాడై ఉంటాడు.

19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి. బందీలై పోవటానికి సిద్ధమవండి. ఎందువల్లనంటే, నొపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది. నగరాలు నాశనమవుతాయి. వాటిలో ఎవరూ నివసించరు!

20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది. కాని ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి వస్తున్నది.

21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు. అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు. శత్రు దాడికి వారు తట్టుకోలేరు. వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది. వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.

22 బసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే పాములా ఈజిప్టు వుంది. శత్రువు మిక్కిలి దరిజేరుతూ వున్నాడు. అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. గొడ్డళ్లు చేబట్టి శత్రవులు ఈజిప్టు మీదికి వస్తున్నారు. వారు “చెట్లను నరికే మనుష్యుల్లా వున్నారు.”

23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, “ఈజిప్టు అరణ్యాన్ని (సైన్యం) శత్రువు నరికివేస్తాడు. అరణ్యంలో (సైన్యం) చెట్లు (సైనికులు) చాలా వున్నాయి. కాని అది నరికివేయబడుతుంది. మిడుతలకంటె ఎక్కువగా శత్రు సైనికులున్నారు. లెక్కకు మించి శత్రు సైనికులున్నారు.

24 ఈజిప్టుకు తలవంపులవుతుంది. ఉత్తరాన్నుండి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది.”

25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనును నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను.

26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను. చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.

27 “నా సేవకుడవైన యాకోబూ , భయపడవద్దు. ఇశ్రాయేలూ, బెదరవద్దు. ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను. యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి. అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.”

28 యెహోవా ఇలా అంటున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, భయపడకు. నేను నీతో వున్నాను. నిన్ను అనేక ఇతల దేశాలకు నేను పంపియున్నాను. ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను. కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను. నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి. కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను. నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”

47

1 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.

2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.

3 “పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు. రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు. తండ్రులు తమ పిల్లలను రక్షణ కల్పించలేరు. ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.

4 “ఫిలిష్తీయులనందరినీ యెహోవా త్వరలో నాశనం చేస్తాడు! తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన వారందరినీ నాశనం చేస్తాడు. ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు. క్రేతు ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.

5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు. ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది. లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?

6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు. నీ ఒరలోనికి నీవు వెళ్లుము! ఆగిపో! శాంతించు’ అని మీరంటారు.

7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగావిశ్రాంతి తీసికుంటుంది? యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”

48

1 మోయాబును గురించిన వర్తమానం ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వ శక్తిమంతుడు అయిన యోహవా ఇలా చెపుతున్నాడు, “నెబో పర్వతానికి చేటు కులుగుతుంది. నెబో పర్వతం నాశనమవుతుంది. కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది. అది పట్టుబడుతుంది. బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది. అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.

2 మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు. మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు. ‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు. మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు. కత్తి నిన్ను వెంటాడుతుంది.

3 హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలువిను. అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.

4 మోయాబు ధ్వంసం చేయబడుతుంది. దాని చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు.

5 మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు. వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు. హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను, బాధతోను కూడిన రోదన వినిపించగలదు.

6 పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఎడారిలో అరుహ వృక్షం వీచినట్లు మీరు పారిపొండి.

7 “మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు. కావున మీరు పట్టుబడతారు. కెమోషు దైవం బందీగా కొనిపోబడతాడు. అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు.

8 వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు. ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు. లోయశిథిలము చేయబడుతుంది. ఉన్నత మైదానం నాశనము చేయబడుతుంది. యెహోవా ఇది జరుగుతుందని చెప్పినాడుగాన ఇది జరిగి తీరుతుంది.

9 మోయాబు పొలాలపైన ఉప్పు చల్లుము. దేశంవట్టి ఎడారి అయిపోతుంది. మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి. వాటిలో ఎవ్వరూ నివసించరు.

10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా, వారిని చంపటానికి తన కత్తిని వినియోగించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది .

11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు. కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది. మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు అది. నిర్బంధించబడి ఇతర దేశానికి కొని పోబడలేదు. పూర్వంవలెనే అది ఇప్పుడూ రుచిగానే వున్నాడు. అతని సువాసన మారలేదు.”

12 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. “కాని మిమ్మల్ని మీ జాడీలలో నుంచి బయట పోయుటకు అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను. ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు. తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.”

13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.

14 “‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’ అని మీరు చెప్పుకోలేరు.

15 శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు. శత్రువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం చేస్తాడు. మోయాబు యువ వీరులంతా నరకబడతారు.” ఈ వర్తమానం రాజునుండి వచ్చినది. ఆ రాజు పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.

16 “మోయాబు అంతం దగ్గర పడింది. మోయాబు త్వరలో నాశనమైపోతుంది.

17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి. మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు. అందువల్ల వానికొరకు మీరు విచారించండి. ‘అధిపతుల అధికారం విరిగిపోయింది. మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’ అని మీరు చెప్పండి.

18 “దీబోను వాసులారా గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి. నేలమీద మట్టిలో కూర్చోండి. ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు. అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.

19 “అరోయేరు నివాసులారా, దారి పక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి. పారిపోయే మనిషిని చూడండి. పారిపోయే స్త్రీని చూడండి. ఏమి జరిగినందో వారిని అడగండి.

20 “మోయాబు పాడుపడి, అవమానముతో నిండి పోతుంది. మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది. మోయాబు పాడుపడిపోయిందని అర్నోను నది వద్ద ప్రకటించండి.

21 ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు. తీర్పు హోలోనుకు వచ్చింది. యాహసు, మేఫాతు,

22 దీబోను, నెబో, బేత్‌ - దిబ్లాతయీము,

23 కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను,

24 కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది. మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది.

25 మోయాబు బలం తగ్గిపోయింది. మోయాబు చేయి విరిగిపోయింది.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది. కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి. మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు. ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.

27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు. ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది. నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి, ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.

28 మోయాబు ప్రజలారా, మీ పట్టణాలను వదిలిపెట్టండి. వెళ్లి గుట్టల్లో నివసించండి. గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”

29 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము. అతడు మిక్కిలి గర్విష్ఠి. తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు. అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు. అతడు మహా గర్విష్ఠి.”

30 యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు. కాని అతని గొప్పలన్నీ అబద్ధాలు. అతను చెప్పేవి చేయలేడు.

31 కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను. మోయాబులో ప్రతి పౌరుని కొరకు విచారిస్తున్నాను. కీర్హరెశు మనుష్యుల నిమిత్తం నేను బాధపడుతున్నాను.

32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను! సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి. అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి. కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు.

33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి. గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను. రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి వారి అలరింతలు అంతమయ్యాయి.

34 “హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది.

35 మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.

36 “మోయాబు కొరకు నేను మిక్కిలి భిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి.

37 ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నాయి . ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు.

38 మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు.

39 “మోయాబు విచ్ఛిన్న మవటంలో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”

40 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు. అతను తన రెక్కలను మోయాబు మీదికి చాపుతున్నాడు.

41 మోయాబు పట్టణాలు పట్టుబడతాయి. బలమైన దుర్గాలు ఓడింపబడతాయి. ఆ సమయంలో మోయాబు సైనికులు ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు.

42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది. ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”

43 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “మోయాబు ప్రజలారా, మీ కొరకై భయం లోతైన గోతులు, ఉరులు పొంచివున్నాయి.

44 ప్రజలు భయపడి పారిపోతారు. పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు. ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే అతడు ఉరిలో చిక్కుకుంటాడు. మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.” ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.

45 “బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు. వారు రక్షణకై హెష్బోను పట్టణానికి పారిపోయారు. అయినా అక్కడ రక్షణ దొరకలేదు. హెష్బోనులో అగ్ని ప్రజ్వరిల్లింది. సీహోను పట్టణంలో నిప్పు చెలరేగింది. అది మోయాబు నాయకులను దహించివేస్తున్నది. అది గర్విష్ఠులను కాల్చివేస్తున్నది.

46 మోయాబూ, నీకు చెడు దాపురించింది. కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు. నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి బందీలుగా కొనిపోబడుతున్నారు.

47 “మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం. ఇంతటితో మోయాబీయులపై తీర్పు సమాప్తం.

49

1 ఈ వర్తమానం అమ్మోనీయులను గురించినది. యెహోవా ఇలా చెపుతున్నాడు, “అమ్మోను ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు లేరని మీరు అనుకొంటున్నారా? తల్లి తండ్రులు చనిపోతే భూమిని స్వతంత్రించుకొనుటకు అక్కడ పిల్లలు లేరని మీరనుకొంటున్నారా? బహుశః అందువల్లనే మల్కోము గాదు రాజ్యాన్ని తీసికొన్నాడా?”

2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు అమ్మోను ప్రజలు యుద్ధనాదాలు వినే సమయం వస్తుంది. రబ్బోతు - అమ్మోను నాశనమవుతుంది. అది కూలిపోయిన భవనాలతో నిండిన ఒక కొండలా ఉంటుంది. దాని చట్టూ ఉన్న పట్టణాలు తగులబడతాయి. ఆ జనం ఇశ్రాయేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని వత్తిడి చేశారు. కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని బలవంతం చేస్తారు.” మరియు వారు భూమిని వారి స్వంతము చేసుకుంటారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

3 “హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది. రబ్బోతు - అమ్మోను మహిళల్లారా, విలపించండి! విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి. రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి. ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు. వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు.

4 నీవు నీ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటావు. కాని నీవు నీ బలాన్ని కోల్పోతున్నావు. నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నీవు నమ్మావు. నిన్ను ఎదిరించటానికి ఏ ఒక్కడూ కనీసం ఆలోచన కూడా చేయడని నీవనుకున్నావు.”

5 కాని సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “ నలుమూలల నుండి నేను మీకు కష్టాలు తెచ్చిపెడతాను. మీరంతా పారిపోతారు. మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయలేరు.”

6 “అమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. కాని అమ్మోనీయులను నేను వెనుకకు తీసికొనివచ్చే సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

7 ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా? ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక పోతున్నారా? వారి జ్ఞానాన్ని వారు కోల్పోయారా?

8 దదానులో నివసించే ప్రజలారా, పారిపోండి! దాగుకోండి! ఎందుకంటే, నేను ఏశావును తాను చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను.

9 మీ ద్రాక్ష తీగల నుండి పనివారు వారికి కావలసినన్ని ద్రాక్షకాయలను కోస్తారు. అయినా వారు కొన్ని కాయలను చెట్లపై వదిలివేస్తారు. రాత్రిళ్లు దొంగలు వచ్చినా వారికి కావలసిన పరిమాణంలోనే తీసికొనిపోతారు.

10 కాని ఏశావు నుండి నేను అంతా తీసికుంటాను. అతడు దాచుకొనే స్థలాలన్నింటినీ నేను కనుగొంటాను. అతడు నానుండి ఏమీయు దాచలేడు. అతని పిల్లలు, బంధువులు, పొరుగువారు అంత చనిపోతారు.

11 అతని పిల్లల పట్ల శ్రద్ధ తీసికొనటానికి ఎవ్వరూ మిగలరు. అతని విధవరాండ్రు ఒంటరిగా విడువబడుతారు (యెహోవానైన) నేను మాత్రమే మీ అనాధుల ప్రాణాల్ని కాపాడుతాను. మరియు మీ విధవరాండ్రు నామీద నమ్మకముంచుతారు.”

12 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంతమంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు శిక్షకు పాత్రుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడతావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. నీవు దండించబడతావు.”

13 యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”

14 యెహోవా నుండి నేనొక సందేశం విన్నాను, దేశాలకు యెహోవా ఒక దూతను పంపాడు. ఆ సందేశం ఇలా వుంది, “మీ సైన్యాలను సమకూర్చుకోండి! యుద్ధానికి సిద్ధపడండీ. ఎదోము దేశం మీదికి కదలి వెళ్లండి!

15 “ఏదోమూ, నేను నీ ప్రాముఖ్యతను, ఘనతను తగ్గించివేస్తాను. ప్రతివాడూ నిన్ను అసహ్యించుకుంటాడు.

16 ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు. అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు. కాని నీవు మోసపోయావు. నీ గర్వం నిన్ను మోసగించింది. ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు. పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు. గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను. అక్కడినుండి నేను నిన్ను కిందికి దింపుతాను,” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

17 “ఎదోము నాశనం చేయబడుతుంది. నాశనమయిన నగరాన్ని చూచి ప్రజలు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఈల వేస్తారు. నాశనమయిన నగరాలను చూచి ప్రజలు ధిగ్భ్రాంతి చెంది సంభ్రమాశ్చర్య పడతారు.

18 సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు. “ ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

19 “యొర్దాను నది దగ్గర దట్టమైన పొదలనుండి కొన్నాసార్లు సింహం వస్తూ ఉంటుంది. పొలాల్లో ప్రజలు మందవేసిన గొర్రెల మీదికి, పశువుల మీదికి వెళుతుంది. నేను ఆ సింహంలాంటివాణ్ణి! నేను ఎదోము మీదికి వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గొర్రెల కాపరులలో (నాయకులు) ఏ ఒక్కడూ నన్నెదిరించి నిలువలేడు.”

20 కావున ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా వేసిన పధకాన్ని వినండి. తేమాను వాసులకు యెహోవా ఏమి చేయ నిశ్చయించినది వినండి ఎదోము మంద (ప్రజలు)లో నుండి చిన్నవాటినన్నిటినీ శత్రువు ఈడ్చుకుపోతాడు. ఎదోము పచ్చిక బయళ్లు వారు చేసిన దాన్ని బట్టి ఆశ్చర్యపోతాయి.

21 ఎదోము పతనంతో పుట్టిన శబ్దానికి భూమి కంపిస్తుంది. వారి ఆక్రందన ఎర్ర సముద్రంవరకు ప్రతిధ్వనిస్తుంది.

22 దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతువుపై తిరుగుతూ ఎగిరే గద్దలా యెహోవా ఉంటాడు. బొస్రా నగరంపై తన రెక్కలు విప్పుతున్న గద్దవలె యెహోవా ఉన్నాడు. ఆ సమయంలో ఎదోము సైనికులు మిక్కిలిగా బెదరిపోతారు. ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు భయాందోళనలతో ఆక్రందిస్తారు.

23 ఈ వర్తమానము దమస్కు నగరాన్ని గురించి నది: “హమాతు, అర్పాదు పట్టణాలు భయపడ్డాయి. దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి. వారు అధైర్యపడ్డారు. వారు వ్యాకులపడి బెదిరారు.

24 దమస్కు నగరం బలహీనమయ్యింది. ప్రజలు పారిపోవాలనుకుంటున్నారు. ప్రజలకు దిగులు పట్టుకున్నది. ప్రసవ స్త్రీ లా ప్రజలు బాధ, వేదన అనుభవిస్తున్నారు.

25 “దమస్కు సుఖసంతోషాలున్న ఒక నగరం. ప్రజలింకా ఆ ‘వేడుక నగరాన్ని’ వదిలి పెట్టలేదు.

26 అందువల్ల యువకులు ఆ నగరంలోని కూడలి స్థలాలలో చనిపోతారు. ఆ సమయంలో దాని సైనికులందరూ చంపబడతారు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయారు చెప్పినాడు.

27 “దమస్కు గోడలన్నిటికీ నేను నిప్పు పెడతాను. బెన్హదదు బలమైన కోటలను అది పూర్తిగా కాల్చివేస్తుంది.”

28 ఈ వర్తమానం కేదారు వంశస్తులను గూర్చియు, మరియు హాసోరు పాలకులను గురించినది. బబులోను రాజైన నెబుకద్నెజరు వారిని ఓడించారు. యెహోవా ఇలా చెపుతున్నాడు, “కేదారు వంశీయుల మీదికి మీరు దండెత్తి వెళ్లండి. తూర్పునవున్న ప్రజలను నాశనం చేయండి.

29 వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి. వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి. వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు. ‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.

30 త్వరగా పారిపొండి! హాసోరు ప్రజలారా, దాగటానికి మంచి స్థలం చూడండి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది “నెబుకద్నెజరు నీవు వ్యతిరేకంగా పధకం పన్నాడు. నిన్ను ఓడించటానికి అతడు ఒక తెలివైన పథకాన్ని ఆలోచించాడు.

31 “నిశ్చంతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా. ఆ దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని ఏమీ లేవు. వారు ఒంటరిగా నివసిస్తారు. ‘ఆ రాజ్యాన్ని ఎదుర్కోండి!’ అని యెహోవా అంటున్నాడు.

32 వారి ఒంటెలను, విస్తారమైన పశుసంపదను శత్రువు దొంగిలిస్తాడు. శత్రువు వారి పెద్ద మందలను దొంగిలిస్తాడు. చెంపలు కత్తిరించుకునే వారిని భూమి నలుదిక్కులకు పంపివేస్తాను. అన్నివైపుల నుండి వారి మీదికి మహా విపత్తులను తీసికొని వస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.

33 “హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవుతుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారిపోతుంది. అక్కడ మనుష్యులెవ్వరూ నివసించరు. ఆ స్థలంలో ఏ ఒక్కడూ నివాసంచేయడు.”

34 యూదా రాజైన సిద్కియా పరిపాలనారంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం ఏలాము దేశానికి సంబంధించినది.

35 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఏలాము యొక్క ధనుస్సును నేను త్వరలో విరచివేస్తాను. విల్లే ఏలాము యొక్క బలమైన ఆయుధం.

36 నాలుగు ప్రచండ వాయువులను ఏలాము మీదికి రప్పిస్తాను. ఆకాశపు నాలుగు మూలల నుండి వాటిని రప్పిసాను. భూమి మీదకు గాలి వీచే నలుమూలలకు ఏలాము ప్రజలను నేను చెదరగొడతాను. ఏలాము ప్రజలు ప్రతి దేశానికి బందీలుగా కొనిపోబడతారు.

37 వారి శత్రువులు చూస్తూవుండగా ఏలామును తునాతునకలు చేస్తాను. వారిని చంపజూచేవారి సమక్షంలో ఏలామును భయపెడతాను. వారికి మహా విపత్తులను తెచ్చిపెడతాను. నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది. “ఏలామును వెంటాడటానికి నేను కత్తిని పంపుతాను. నేను వారందరినీ చంపేవరకు కత్తి వారిని తరుముతుంది.

38 నా సింహాసనం ప్రతిష్ఠించి నేనే అదుపుదారుడనని నిరూపిస్తాను. దాని రాజును, రాజ్యాధికారులను నేను నాశనం చేస్తాను.” ఇదే యెహోవా సందేశం.

39 “కాని ఏలామును వెనక్కు తీసుకొని వచ్చి వారికి మంచి సంభవించేటట్లుగా చేస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.

50

1 బబులోను దేశానికి, కల్దీయులను ఉద్దేశించి యెహోవా ఈ సందేశాన్ని ఇచ్చాడు. యెహోవా ఈ వర్తమానాన్ని యిర్మీయా ద్వారా చెప్పాడు.

2 “అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి! జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి! పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి, ‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది. బేలు దైవం అవమానపర్చబడుతుంది. మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది. బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి. దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’

3 ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది. ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది. ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు. మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”

4 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి ఒక్కరీతిగా రోదిస్తారు. వారంతా కలిసి వారి దేవుడైన యెహోవాను వెతుక్కుంటూ వెళతారు.

5 ఆ ప్రజలు సియోనుకు ఎలా వెళ్లాలి అని దారి అడుగుతారు. వారు ఆ దిశగా వెళ్లటానికి బయలు దేరుతారు. ప్రజలు యిలా అంటారు. ‘రండి, మనల్ని మనము యెహోవాకు కలుపుకొందాం. శాశ్వతమైన ఒక నిబంధన చేసికొందాము. మన మెన్నటికీ మరువలేని ఒక నిబంధన చేసికొందాం.’

6 “నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలవలె ఉన్నారు. వారి కాపరులు (నాయకులు) వారిని తప్పుదారి పట్టించారు. వారి నాయకులు వారిని కొండల్లో, కోనల్లో తిరిగేలా చేశారు. వారి విశ్రాంతి స్థలమెక్కడో వారు మర్చిపోయారు.

7 నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు. పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’ ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం. వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు.

8 “బబులోను నుండి పారిపొండి. కల్దీయుల రాజ్యాన్ని వదిలిపొండి. మందముందు నడిచే మేకలు మాదిరి వుండండి.

9 ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు వస్తాను. ఈ దేశాల కూటమి బబులోను మీదికి యుద్ధానికి సిద్ధమవుతుంది. ఉత్తర దేశాల వారిచేత బబులోను చెరబట్టబడుతుంది. ఆ రాజ్యాలు బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి. యుద్ధం నుండి వట్టి చేతులతో తిరిగిరాని సైనికుల్లా ఈ బాణాలు వుంటాయి.

10 కల్దీయుల భాగ్యాన్నంతా శత్రువు కొల్లగొడతాడు. శత్రు సైనికులు తాము కోరుకున్నవన్నీ పొందగలుగుతారు.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.

11 “బబులోనూ, నీవు ఉద్రేకంతోను, సంతోషంతోను వున్నావు. నీవు నా భూమిని తీసికొన్నావు. ధాన్యంలో చిందులేసే పడుచు ఆవులా నీవు నాట్యం చేస్తున్నావు. గుర్రాలు సంతోషంలో చేసే సకిలింపుల్లా వుంది నీ నవ్వు.

12 “ఇప్పుడు నీ తల్లికి తలవంపులవుతుంది. నినుగన్న తల్లి కలత చెందుతుంది. దేశాలన్నిటిలో బబులోను అతి సామాన్యమైపోతుంది. ఆమె బెట్టయైన వట్టి ఎడారిలా అవుతుంది.

13 యెహోవా తన కోపం చూపటంతో అక్కడ ఎవ్వరూ నివసించరు. బబులోను నగరం పూర్తిగా ఖాళీ అవుతుంది. “బబులోను పక్కగా పోయే ప్రతివాడు భయపడతాడు. అది నాశనం చేయబడిన తీరుచూచి విస్మయంతో వారు తలలు ఆడిస్తారు.

14 “బబులోనుతో యుద్ధానికి సిద్ధమవ్వండి. వింటిని బట్టిన వీరుల్లారా, బబులోనుపై బాణాలు వేయండి. మీ బాణాల్లో వేటినీ మిగల్చవద్దు. బబులోను యెహోవా పట్ల పాపం చేసింది.

15 బబులోను చుట్టూ సైనికులు జయ నినాదాలు చేస్తారు. ఇప్పుడు బబులోను లొంగిపోయింది! దాని ప్రాకారాలు, బురుజులు కూలదోయబడ్డాయి! వారికి అర్హమైన శిక్షను యెహోవా ఆ ప్రజలకు ఇస్తున్నాడు. ప్రజలారా, బబులోనుకు తగిన శిక్షను ఇవ్వండి. అది ఇతర దేశాలకు ఏమి చేసిందో, దానిని ఆ రాజ్యానికి తిరిగి చేయండి.

16 బబులోను ప్రజలను మొక్కలు నాటనివ్వకండి. వారి పంటను సేకరించనీయవద్దు. బబులోను సైనికులు చాలా మందిని తమ నగరానికి బందీలుగా తీసికొనివచ్చారు. ఇప్పుడు శత్రు సైన్యాలువచ్చాయి. కావున ఆ బంధీలంతా ఇండ్లకు తిరిగి వెళ్లుచున్నారు. ఆ బందీలు తిరిగి తమ తమ దేశాలకు పరుగున పోతున్నారు.

17 “పొలాల్లో చెల్లాచెదరైన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది. సింహాలు తరిమిన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది. వానిని తిన్న మొదటి సింహం అష్షూరు రాజు. వాని ఎముకలు నలుగగొట్టిన చివరి సింహం బబులోను రాజైన నెబుకద్నెజరు.”

18 కావున సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను రాజును, అతని దేశాన్ని నేను త్వరలో శిక్షిస్తాను. నేను అష్షూరు రాజును శిక్షించినట్లు అతనిని నేను శిక్షిస్తాను.

19 కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను. అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు. అతడు తిని, తృప్తి పొందుతాడు. ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.”

20 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో ప్రజలు ఇశ్రాయేలు యొక్క తప్పులెదకటానికి గట్టిగా ప్రయత్నిస్తారు. కాని వారికి కన్పించదు. ప్రజలు యూదా పాపాలు వెదక యత్నిస్తారు. కాని ఏ పాపాలూ కనుగొనబడవు. ఎందువల్లనంటే ఇశ్రాయేలు, యూదా రాజ్యాలలో మిగిలిన కొద్దమందిని నేను రక్షిస్తున్నాను. పైగా వారి పాపాలన్నిటినీ నేను క్షమిస్తున్నాను.”

21 యెహోవా యిలా చెపుతున్నాడు, “మెరాతయీయు దేశంపై దండెత్తండి! పెకోదీలో వుంటున్న ప్రజలను ఎదుర్కొనండి! వారిని ఎదుర్కొనండి! వారిని చంపండి. వారిని సర్వ నాశనం చేయండి! నా ఆజ్ఞ ప్రకారం అంతా చేయండి!

22 యుద్ధ ధ్వని దేశమంతా వినిపిస్తుంది. అది తీవ్రవినాశనానికి సంబంధించిన ధ్వని.

23 బబులోను ఒకనాడు సర్వప్రపంచానికి సుత్తివలె వుంది. కాని ఇప్పుడా ‘సుత్తి’ విరిగి ముక్కలై పోయింది. బబులోను సాటి రాజ్యాలన్నిటిలో నిజంగా మిక్కిలి నాశనమైనది.

24 బబులోనూ, నీ కొరకు నేను వల పన్నాను. అది నీవు తెలిసికొనే లోపుగానే నీవు పట్టుబడ్డావు. నీవు యెహోవాకు వ్యతిరేకంగా పోరాడావు. అందువల్ల నీవు చూడబడి, పట్టుబడ్డావు.

25 యెహోవా తన గిడ్డంగిని తెరిచాడు. ఆ గిడ్డంగి నుండి యెహోవా తన కోపమనే ఆయుధాన్ని వెలికి తీశాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు తాను చేయవలసిన పని ఒకటి వుండుటచే ఆ ఆయుధాన్ని వెలికి తీశాడు. ఆయన చేయవలసిన కార్యం కల్దీయుల రాజ్యంలో ఉంది.

26 దూర తీరాల నుండి బబులోను మీదికి రండి. ఆమె ధాన్యాగారాలను పగులగొట్టండి. బబులోనును సర్వనాశనం చేయండి. సజీవంగా ఎవ్వరినీ వదల వద్దు. పెద్ద ధాన్యరాసులవలె వారి శవాలను గుట్టవేయండి.

27 బబులోనులో ఉన్న గిత్తలన్నిటినీ (యువకులు) చంపండి. వారు నరకబడనివ్వండి. వారిని ఓడింపబడే సమయం వచ్చింది. వారికి మిక్కిలి కష్టం వచ్చిపడింది. వారు శిక్షింపబడే సమయంవచ్చింది.

28 బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు. వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు. యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు, బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నారని వారు చెబుతున్నారు. యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.

29 బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి. ఆ నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి. ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు. అది చేసిన దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి. అది ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ దేశానికి కూడా చేయండి. బబులోను యెహోవాను గౌరవించలేదు. పరిశుద్దుడైన ఇశ్రాయేలు దేవునిపట్ల అది మూర్ఖంగా ప్రవర్తించింది. కావున బబులోనును శిక్షించండి.

30 బబులోను యువకులు వీధుల్లో చంపబడతారు. ఆ రోజున దాని సైనికులంతా చనిపోతారు.” యెహోవా ఈ విషయాలు చెపుతున్నారు.

31 “బబులోనూ, నీవు మిక్కిలి గర్విష్ఠివి. అందుచే నేను నీకు వ్యతిరేకినైనాను.” సర్వశక్తమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. “నేను నీకు వ్యతిరేకిని. నీవు శిక్షింపబడే సమయం వచ్చింది.

32 గర్విష్ఠియైన బబులోను తూలిపడి పోయింది. అది లేచుటకు ఎవ్వరూ సహాయపడరు. దాని పట్టణాలలో నేను అగ్ని రగుల్చుతాను. దాని చుట్టూ వున్న వారందరినీ ఆ అగ్ని పూర్తిగా దహించివేస్తుంది.”

33 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నారు. “ఇశ్రాయేలు, యూదా ప్రజలు బానిసలై యున్నారు. శత్రువు వారిని చెరబట్టాడు. శత్రువు ఇశ్రాయేలును వదిలిపెట్టడు.

34 కాని, దేవుడు ఆ ప్రజలను తిరిగి తీసికొని వస్తాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా. ఆ ప్రజలను ఆయన బాగా రక్షిస్తాడు. వారి రాజ్యానికి విశ్రాంతి కల్గించే విధంగా ఆయన వారిని రక్షిస్తాడు. అంతేగాని బబులోనులో నివసించే వారికి ఆయన విశ్రాంతినివ్వడు.”

35 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోనులో నివసించే ప్రజలను ఒక కత్తి చంపుగాక. బబులోను రాజును, అతని అధికారులను, జ్ఞానులను ఒక కత్తి హతము చేయుగాక.

36 బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను కత్తి సంహరించుగాక, ఆ యాజకులు పట్టి మూర్ఖులవుతారు. బబులోను సైనికులను ఒక కత్తి చంపుగాక. ఆ సైనికులు భీతావహులవుతారు.

37 బబులోను గుర్రాలను, రథాలను ఒక కత్తి నరికి వేయుగాక. విదేశ కిరాయి సైనికులను ఒక కత్తి సంహరించుగాక, ఆ సైనికులందరూ భయపడిన స్త్రీ లవలె ఉంటారు. బబులోను ధనాగారాల మీదికి ఒక కత్తి వెళ్లుగాక. ఆ ధనాగారాలు దోచుకోబడతాయి.

38 బబులోను నీటి వనరులపైకి ఒక కత్తి వెళ్లుగాక. ఆ నీటి వనరులన్నీ ఎండిపోతాయి. బబులోను దేశంలో విగ్రహాలు కోకొల్లలు. బబులోను ప్రజలు మూర్ఖులని ఆ విగ్రహాలు చాటి చెపుతున్నాయి. అందుచే ఆ ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తాయి.

39 “బబులోను మరెన్నడూ ప్రజలతో నిండిఉండదు. పిచ్చి కుక్కలు, ఉష్ట్ర పక్షులు, తదితర ఎడారి జంతువులు అక్కడ నివసిస్తాయి. అంతేగాని, మళ్లీ జనం అక్కడ ఎన్నడూ నివసించరు.

40 సొదొము, గొమొర్రా నగరాలను, వాటి చుట్టుపట్ల పట్టణాలను దేవుడు పూర్తిగా నాశనం చేశాడు. ఇప్పుడా పట్టణాలలో ఎవ్వరూ నివసించరు. అదేరీతి, బబులోనులో ఎవ్వరూ నివసించరు. అక్కడ నివసించటానికి ప్రజలు అసలు వెళ్లరు.

41 “చూడండి! ఉత్తరాన్నుండి జనులు వస్తున్నారు. వారొక బలమైన రాజ్యం నుండి వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుండి చాలామంది రాజులు కలిసి వస్తున్నారు.

42 వారి సైన్యాలకు ధనుస్సులు, ఈటెలు ఉన్నాయి. ఆ సైనికులు బహు క్రూరులు వారికి దయలేదు. గుర్రాలపై స్వారి చేస్తూ సైనికులు వస్తారు. అప్పుడు సముద్ర ఘోషలా శబ్దంపుడుతుంది. వారివారి స్థానాలలో యుద్ధానికి సిద్ధంగా నిలబడతారు! బబులోను నగరమా, నీపై దాడికి వారు సిద్ధంగా వున్నారు.

43 ఆ సైన్యాల గురించి బబులోను రాజు విన్నాడు. అతడు బాగా బెదరిపోయాడు! అతని చేతులు బిగుసుకుపోయేటంతగా అతడు భయపడ్డాడు. ప్రసవ స్త్రీ వేదనవలె, అతని భయం అతని కడుపును ఆరాటపెడుతుంది.”

44 యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు యొర్దాను నదీ తీరాన దట్టమైన పొదల నుండి ఒక సింహం వస్తుంది. ప్రజలు పొలాల్లో మందవేసిన పశువులపైకి ఆ సింహం వచ్చిపడుతుంది. అప్పుడా పశువులు చెల్లాచెదరైపోతాయి. నేనా సింహంలా వుంటాను. బబులోనును దాని రాజ్యం నుంచి తరిమిగొడతాను! ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను? నాలాగా మరే వ్యక్తి లేడు. నన్నెదిరించగలవాడు మరొక్కడూ లేడు. కావున నేనే ఆ పని చేస్తాను. నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ రాడు. నేను బబులోను ప్రజలను తరిమిగొడతాను.”

45 బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా పన్నిన పధకాన్ని వినండి. కల్దీయులకు వ్యతిరేకంగా యెహోవా ఏమి చేయ నిర్ణయించాడో వినండి. శత్రువు బబులోనులోని గొర్రె పిల్లలను (ప్రజలను) తిరిగి తీసికొంటాడు. ఆ గొర్రె పిల్లలను ఆయన ఇంటికి తీసికొని వెళతాడు. ఆ పిమ్మట బబులోను పచ్చిక బయళ్లను యెహోవా పూర్తిగా నాశనం చేస్తాడు. జరిగిన దానికి బబులోను విస్మయం చెందుతుంది.

46 బబులోను పడిపోతుంది. ఆ పతనానికి భూమి కంపిస్తుంది. బబులోను పతనాన్ని గురించి ప్రపంచ ప్రజలంతా వింటారు.

51

1 యెహోవా ఇలా చెపుతున్నాడు, “నేనొకపెనుగాలి వీచేలా చేస్తాను. అది బబులోను, కల్దీయ ప్రజల మీదికి వీచేలా చేస్తాను.

2 బబులోనును తూర్పార బట్టటానికి నేను కొత్త వారిని పంపుతాను. వారు బబులోనును తూర్పార బడతారు. వారు బబులోనునుండి ప్రతీది తీసుకొంటారు. సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టుతాయి. భయంకరమైన విధ్వంసకాండ జరుగుతుంది.

3 బబులోను సైనికులు తమ ధనుర్బాణాలను వినియోగించలేరు. ఆ సైనికులు తమ కవచాలను కూడ ధరించలేరు. బబులోను యువకులను గురించి విచారించవద్దు. దాని సైన్యాన్ని సర్వ నాశనం చేయుము.

4 బబులోను సైనికులు కల్దీయుల రాజ్యంలో చంపబడతారు. బబులోను వీధుల్లో వారు తీవ్రంగా గాయపర్చబడతారు.”

5 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును, యూదాను ఒక విధవరాలివలె ఒంటరిగా వదిలి వేయలేదు. దేవుడు ఆ ప్రజలను వదిలిపెట్టలేదు. లేదు! ఆ ప్రజలే ఇశ్రాయేలు పవిత్ర దైవాన్ని వదిలివేసిన పాపానికి ఒడిగట్టారు. వారే ఆయనను వదిలారు గాని ఆయన వారిని విడిచివేయలేదు.

6 బబులోను నుంచి పారిపొండి. మీ ప్రాణ రక్షణకై పారిపొండి! మీరు ఆగకండి. బబులోను పాపాల కారణంగా మీరు చంపబడవద్దు! వారు చేసిన దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా శిక్షించవలసిన సమయం వచ్చింది. బబులోనుకు తగిన శాస్తి జరుగుతుంది.

7 యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది. బబులోను ప్రపంచాన్నంతటినీ తాగించింది. బబులోను ఇచ్చిన మధ్యాన్ని దేశాలు సేవించాయి. కావున వారికి వెర్రి పట్టింది.

8 బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలై పోతుంది. దాని కొరకు విలపించండి! దాని బాధ నివారణకు మందుతెండి! బహుశః ఆమెకు నయం కావచ్చు!

9 బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము. కాని ఆమె స్వస్థతనొందలేదు. కావున ఆమెను వదిలివేసి మనందరం మన మన దేశాలకు వెళ్లిపోదాం. వరలోకంలో దేవుడు బబులోనుకు శిక్ష నిర్ణయిస్తాడు. బబూలోనుకు ఏమి సంభవించాలో ఆయన నిర్ణయిస్తాడు.

10 యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చుకొన్నాడు. రండి! ఈ విషయం మనం సీయోనులో చెప్పుదాం. మన దేవుడైన యెహోవా చేసిన పనులను గూర్చి చెప్పుదాం.

11 మీ బాణాలకు పదును పెట్టండి. మీ డాళ్లను చేపట్టండి! యెహోవా మాదీయుల రాజును ప్రేరేపిస్తున్నాడు. ఆయన బబులోనును నాశనంచేయ సంకల్పించాడు. కావున ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు. బబులోను ప్రజలకు అర్హమైన శిక్షను యెహోవా విధిస్తాడు. బబులోను సైన్యం యెరూషలేములో యెహోవా ఆలయాన్ని నాశనం చేసింది. కావున వారికి తగిన దండన యెహోవా విధిస్తాడు.

12 బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎగురవేయండి. ఎక్కువమంది కావలివారిని నియమించండి. రక్షణ భటులను వారి వారి స్థానాలలో నిలపండి. రహస్య దాడికి సిద్ధంగా ఉండండి! యెహోవా తను యోచించిన ప్రకారం చేస్తాడు. యెహోవా బబులోనుకు వ్యతిరేకంగా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అది చేసి తీరుతాడు.

13 బబులోనూ, నీవు పుష్కలంగా నీరున్నచోట నివసిస్తున్నావు. నీవు ధనధాన్యాలతో తులతూగుతున్నావు. కాని ఒక రాజ్యంగా నీవు మనగలిగే కాలం అంతమవుతూవుంది. నీకు వినాశనకాలం దాపురించింది.

14 సర్వశక్తిమంతుడైన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాడు, “బబులోనూ, నిశ్చయముగా నిన్ను అనేక శత్రు సైనికులతో నింపుతాను. వారు మిడుతల దండులా వచ్చి పడుతారు. ఆ సైనికులు యుద్ధంలో నీ మీద గెలుస్తారు. వారు నీపై నిలబడి విజయధ్వనులు చేస్తారు.”

15 యెహోవా తన అనంత శక్తి నుపయోగించి భూమిని సృష్టించాడు. ఆయన తన జ్ఞానాన్ని వినియోగించి ప్రపంచాన్ని నిర్మించాడు. తన ప్రజ్ఞతో ఆయన ఆకాశాన్ని విస్తరించాడు.

16 ఆయన గర్జస్తే ఆకాశంలో సముద్రాలు ఘోషిస్తాయి. భూమిపైకి మేఘాలను ఆయన పంపిస్తాడు. ఉరుములు మెరుపులతో వర్షం పడేలా చేస్తాడు. తన గిడ్డంగుల నుండి ఆయన పెనుగాలులు రప్పిస్తాడు.

17 కాని ప్రజలు బహుమూర్ఖులు. దేవుడు ఏమి చేశాడో తెలిసికోలేరు. నేర్పరులైన పనివారు బూటకపు దేవతల విగ్రహాలను చేస్తారు. ఆ విగ్రహాలన్నీ బూటకపు దేవతలే. కావున ఆ పని వాడు ఎంత మూర్ఖుడో అవి చాటి చెపుతాయి. ఆ విగ్రహాలు నిర్జీవ ప్రతిమలు.

18 ఆ విగ్రహాలు నిరుపయోగం! ప్రజలు చేసిన ఆ విగ్రహాలు నవ్వులాట బొమ్మలు! వారికి తీర్పు తీర్చే కాలం వస్తుంది. అప్పుడా విగ్రహాలు నాశనం చేయబడతాయి.

19 కాని యెకోబు స్వాస్థ్యము (దేవుడు) ఆ పనికి మాలిన విగ్రహాల్లాటివాడు కాదు. ప్రజలు దేవుని చేయలేదు. దేవుడే తన ప్రజలను చేశాడు! దేవుడు సమస్తాన్నీ సృష్టించినాడు! ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.

20 యెహోవా ఈ విధంగా అంటున్నాడు: ‘బబులోనూ, నీవు నా చేతి దుడ్డుకర్రవి రాజ్యాలను మోదటానికి నిన్ను వినియోగించాను. సామ్రాజ్యాలను నాశనం చేయటానికి నిన్ను వాడాను.

21 గుర్రాన్ని, రౌతును బాదటానికి నిన్ను వాడాను. రథాన్ని, సారథిని చిదుకగొట్టటానికి నిన్నుపయోగించాను.

22 స్త్రీ పురుషులను చితుకగొట్టుటకు నిన్ను వాడాను. వృద్ధులను, యువకులను చితకగొట్టుటకు నిన్ను వాడాను. యువకులను, యువతులను చితకగొట్టుటకు నిన్ను వాడాను.

23 గొర్రెల కాపరులను, మందలను నాశనం చేయటానికి నిన్ను ఉపయోగించాను. రైతులను, ఆవులను నాశనం చేయుటకు నిన్ను ఉపయోగించాను. పాలకులను, ముఖ్య అధికారులను దండించటానికి నిన్ను వాడాను.

24 కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. కల్దీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను. యూదా, నీ కన్నుల ఎదుటనే నేను వారికి తగిన శాస్తి చేస్తాను.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

25 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోనూ, నీవొక విధ్వంసకర పర్వతానివి. నేను నీకు వ్యతిరేకిని. బబులోనూ, భూమినంతటినీ నీవు నాశనంచేశావు. నేను నీకు విరోధిని. నీ మీదికి నా చేయి చాస్తున్నాను. కొండ శిఖరాల నుంచి నిన్ను దొర్లిస్తాను. నిన్నొక కాలిపోయిన కొండలా చేస్తాను.

26 పునాది రాళ్లకు పనికివచ్చే పెద్ద బండలను ప్రజలు చూడరు. వారి భవనాల పునాదులకు ప్రజలు పెద్ద రాళ్లను బబులోను నుంచి తీసికొనిపోరు. ఎందువల్లనంటే శ్వతంగా ఈ నగరం ఒక నలిగిన రాళ్లపోగులా మారుతుంది.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

27 ‘రాజ్యంలో యుద్ధ పతాకాన్నెగుర వేయండి! దేశాలన్నిటిలో బూర వూదండి! బబులోనుతో యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి! బబులోనుతో యుద్ధానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలను పిలవండి. దాని మీదికి సైన్యాన్ని నడపటానికి ఒక అధికారిని ఎంపిక చేయండి. మిడతల దండులా దానిమీదికి ఎక్కువ గుర్రాలను పంపండి.

28 దానిమీదకి యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి. మాదీయుల రాజులను సమాయత్తపర్చండి. మాదీయుల పాలకులను, ముఖ్యాధికారులను సిద్ధంచేయండి. వారు పాలించే దేశాలన్నిటినీ బబులోను మీద యుద్ధానికి సిద్ధంచేయండి.

29 బాధలో వున్నట్లు ఆ రాజ్యం వణకిపోతుంది. యెహోవా తన పధకాన్ని అమలుపర్చటం మొదలు పెట్టినప్పుడు అది కంపించిపోతుంది. బబులోనును వట్టి ఎడారిగా మార్చటమే యెహోవా సంకల్పం. అక్కడ ఎవ్వరూ నివసించరు.

30 బబులోను సైనికులు పోరాడటం మానివేశారు. వారు తమ కోటల్లోనే ఉండిపోయారు. వారి శక్తి తరిగిపోయింది. వారు బెదరిపోయిన స్త్రీలవలె అయినారు. బబులోనులో ఇండ్లు తగులబడుతున్నాయి. దాని ద్వారాల కడ్డీలు విరిగిపోయాయి.

31 ఒక దూత మరో దూతను అనుసరిస్తాడు. దూత తరువాత దూత వస్తాడు. అతని నగరమంతా పట్టుబడిందని వారు బబులోను రాజుకు తెలియజేస్తారు.

32 మనుష్యులు నదులను దాటే స్థలాలన్నీ పట్టుబడ్డాయి. చిత్తడి నేలలు సహితం మండుతున్నాయి. బబులోను సైనికులంతా భయపడ్డారు.”

33 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను నగరం పంటకళ్లంలా ఉన్నది. పంటకోయు కాలంలో రైతులు కోసిన పైరును కొట్టి పొట్టునుండి ధాన్యాన్ని వేరుచేస్తారు. బబులోనును కొట్టే కాలం దగ్గర పడుతోంది.”

34 గతంలో బబులోను రాజు నెబుకద్నెజరు మమ్మల్ని నాశనం చేశాడు. గతంలో నెబుకద్నెజరు మమ్మల్ని గాయపర్చాడు. ఇదివరలో అతడు మా ప్రజలను చెరగొన్నాడు. మేము వట్టి జాడీల్లా అయ్యాము. అతడు మాకున్న మంచి వస్తువులన్నిటినీ తీసికొన్నాడు. కడుపు పగిలేలా అన్నీ తిన్న బ్రహ్మరాక్షసిలా అతడున్నాడు. అతడు మా మంచి వస్తువులన్నీ తీసికొని మమ్మల్ని నెట్టివేశాడు.

35 మమ్మల్ని బాధించటానికి బబులోను భయర కరమైన పనులు చేసింది. ఇప్పుడు అవన్నీ బబులోనుకు జరగాలని నేను కోరుకుంటున్నాను.” సీయోనులో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాలు చెప్పారు: “బబులోను వారు మా ప్రజలను చంపిన నేరస్థులు. వారు చేసిన దుష్ట కార్యాలకు వారిప్పుడు శిక్షింపబడతారు.” యెరూషలేము నగరం ఆ విషయాలు చెప్పింది.

36 కావున యెహోవా ఇలా చెపుతున్నాడు, “యూదా, నిన్ను రక్షిస్తాను. బబులోను తప్పక శిక్షింపబడేలా చేస్తాను. బబులోను సముద్రం ఎండిపోయేలా చేస్తాను. ఆమె ఊటలు ఎండిపోయేలా నేను చేస్తాను.

37 బబులోను కూలిపోయిన భవంతుల గుట్టలా తయారవుతుంది. బబులోను పిచ్చికుక్కలు తిరుగాడే స్థలంగా మారుతుంది. ఆ రాళ్లగుట్టను చూచిన ప్రజలు ఆశ్చర్యపోతారు. బబులోనును చూచి జనులు బాధతో తల లాడిస్తారు. బబులోను నిర్మానుష్యమై పోతుంది.

38 బబులోను ప్రజలు గర్జించు యువ సింహాల్లా ఉన్నారు. వారు పులి పిల్లల్లా గుర్రుమంటున్నారు.

39 ఆ ప్రజలు కొదమ సింహాలలా ప్రవర్తిస్తున్నారు. వారికి నేనొక విందు. ఇస్తాను. వారు బాగా మద్యం సేవించేలా చేస్తాను. వారు నవ్వుతూ విలాసంగా కాలక్షేపం చేస్తారు. తరువాత వారు శాశ్వతంగా నిద్రపోతారు. వారిక మేల్కొనరు.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

40 బబులోను ప్రజలను చంపటానికి నేను తీసికొని వెళతాను. నరకబడటానికి వేచివుండే గొర్రెల్లా, పొట్టేళ్లలా, మేకల్లా బబులోను ప్రజలుంటారు.

41 షేషకు ఓడింపబడుతుంది. అత్యుత్తమమైన, గర్వించదగిన దేశం చెరబట్టబడుతుంది. ఇతర రాజ్యాల ప్రజలు బబులోనువైపు చూస్తారు. వారు చూసే విషయాలు వారిని భయపెడతాయి.

42 బబులోను మీదికి సముద్రం పొంగివస్తుంది. ఘోషించే అలలు దానిని ముంచివేస్తాయి.

43 బబులోను పట్టణాలు పాడుపడి, ఖాళీ అవుతాయి. బబులోను భూమి ఎండి ఎడారిలా మారుతుంది. అది నిర్మానుష్యమైన భూమి అవుతుంది. కనీసం ప్రజలు బబులోను గుండానైనా పయనించరు.

44 బబులోనులో బేలు దేవతను నేను శిక్షిస్తాను. తను మింగిన మనుష్యులను అతడు కక్కేలా చేస్తాను. ఇతర రాజ్యాల వారు బబులోనుకు రారు. బబులోను నగరపు చుట్టున్న ప్రాకారం కూలిపోతుంది.

45 నా ప్రజలారా, బబులోను నగరం నుండి బయటకు రండి. మీ ప్రాణరక్షణకు పారిపొండి. యెహోవా యొక్క భయానక కోపంనుండి దూరంగా పారిపొండి.

46 నా ప్రజలారా, విచారించకండి. వదంతులు వ్యాపిస్తాయి; కాని భయపడవద్దు. ఒక వదంతి ఈ సంవత్సరం వ్యాపిస్తుంది. మరొక వదంతి మరు సంవత్సరం వస్తుంది. దేశంలో భీకరపోరాటం గురించిన వదంతులు లేస్తాయి. పాలకులు ఇతర పాలకులతో పోట్లాడుతున్నట్లు వదంతులు వస్తాయి.

47 బబులోనువారి బూటకపు దేవతలను నేను శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది. బబులోను రాజ్యం యావత్తు అవమాన పర్చబడుతుంది. అనేకమంది ప్రజలు చనిపోయి నగర వీధుల్లో పడివుంటారు.

48 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత బబులోనుకు జరిగిన దాని విషయమై సంతోషంతో కేకలు పెడతారు. శత్రు సైన్యాలు ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం చేస్తాయి గనుక వారునూ కేకలు పెడతారు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

49 “బబులోను ఇశ్రాయేలు ప్రజలను చంపింది. భూమి మీద ప్రతి ప్రాంతంనూ ప్రజలలోని బబులోను చంపింది. కావున బబులోను తప్పక పతనమవ్వాలి!

50 కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి; బబులోనును వదిలిపొండి. ఆగకండి! మీరు ఎంతో దూరానగల దేశంలో వున్నారు. కాని మీరున్న చోటనే యెహోవాను తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసికొనండి.

51 “యూదా ప్రజలమైన మేము సిగ్గుపడుతున్నాము. మేము అవమానింపబడినందున మేము సిగ్గుపడుతున్నాము. అది ఎందువల్లనంటే పరాయివాళ్లు మా దేవుని దేవాలయంలోని పవిత్ర స్థలాల్లో ప్రవేశించారు.”

52 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను విగ్రహాలను నేను శిక్షించే సమయం వస్తోంది. ఆ సమయంలో, ఆ రాజ్యంలోని ప్రతిచోటా గాయపడిన ప్రజలు బాధతో మూలుగుతారు.

53 ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు. బబులోను తన కోటలను పటిష్ఠం చేసికోవచ్చు కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని పంపుతాను. ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు. ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

54 “బబులోనులో ప్రజల ఆక్రందనలు మనంవినగలం. కల్దీయుల రాజ్యంలో ప్రజలు చేస్తున్న విధ్వంసకాండ శబ్దాలను మనం వింటాం.

55 అతి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం చేస్తాడు. నగరంలో వినవచ్చే గొప్ప సందడిని ఆయన అణచి వేస్తాడు. మహాసముద్రపు అలలు ఘోషించినట్లు శత్రువులు వచ్చిపడతారు. చుట్టు పట్లవున్న ప్రజలు ఆ గర్జన వింటారు.

56 సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది. బబులోను సైనికులు పట్టుబడతారు. వారి ధనుస్సులు విరిగిపోతాయి. ఎందువల్లనంటే, వారు చేసిన పాపాలకు యెహోవా ఆ ప్రజలను శిక్షిస్తాడు. వారికి తగిన పూర్తి దండన యెహోవా విధిస్తాడు.

57 “బబులోను యొక్క ముఖ్యమైన అధిపతులను, జ్ఞానులను మత్తిల్లజేస్తాను. దాని పాలకులను, అధికారులను, సైనికులను కూడ మత్తిల్లజేస్తాను. దానితో వారు శాశ్వతంగా నిద్రిస్తారు. వారు ఎప్పిటికీ మేల్కొనరు. “ ఈ విషయాలు రాజు చెప్పియున్నాడు. ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.

58 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను యొక్క మందమైన, బలమైన గోడ కూలగొట్టబడుతుంది. దాని ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి. బబులోను ప్రజలు కష్టపడి పనిచేస్తారు. కాని అది వారికి సహాయపడదు! నగరాన్ని రక్షించటంలో వారు మిక్కిలి అలసిపోతారు. కాని వారు ఎగసేమంటల్లో కేవలం సమిధలవుతారు!”

59 యిర్మీయా ఈ సందేశాన్ని అధికారియైన శెరాయాకు పంపాడు. శెరాయా నేరీయా కుమారుడు. నేరీయా మహసేయా కుమారుడు. యూదా రాజైన సిద్కియాతో పాటు శెరాయా బబులోనుకు వెళ్లాడు. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో అధికారి శెరాయాకు యిర్మీయా ఈ వర్తమానాన్ని పంపించాడు.

60 బబులోనుకు సంభవించే భయంకర విషయాలన్నీ యిర్మీయా ఒక పుస్తకపు చుట్టలో వ్రాశాడు:

61 శెరాయాకు యిర్మీయా ఇలా చెప్పాడు, “శెరాయా, బబులోనుకు వెళ్లు. ప్రజలంతా వినేటట్లు ఈ సమాచారం తప్పకుండా చదువు.

62 తరువాత, ‘ఓ దేవా, ఈ ప్రదేశమగు బబులోనును నీవు నాశనం చేస్తానని అన్నావు. నరులుగాని, జంతువులు గాని నివసించని విధంగా దానిని నాశనం చేస్తానని అన్నావు. ఈ చోటు శాశ్వతంగా పట్టి శిథిలాలు పోగు అవుతుంది’ అని చెప్పు.

63 నీవీ పుస్తకం చదవటం పూర్తి చేయగానే దానికి ఒక రాయి కట్టు. తరువాత దానిని యూఫ్రటీసు నదిలోకి విసురు.

64 అప్పుడు, ‘ఇదే రీతిగా బబులోను మునిగిపోతుంది. బబులోను మరి పైకి లేవద్దు! నేను ఇక్కడ కలుగజేసే భయంకరమైన పరిణామాల కారణంగా బబులోను మునిగిపోతుంది”‘ అని చెప్పు. యిర్మీయా మాటలు సమాప్త.

52

1 యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరా వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా . హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు.

2 రాజైన యెహోయాకీము మాదిరిగానే సిద్కియా కూడా దుష్ట కార్యాలు చేశాడు. సిద్కియా ఆ చెడు కార్యాలు చేయటం యెహోవాకు ఇష్టం లేదు.

3 వారి పట్ల యెహోవా కోపగించటంతో యెరూషలేములోను, యూదాలోను భయంకరమైన సంఘటనలు జరిగాయి. చివరికి యెరూషలేము, యూదా ప్రజలను తన ముందు నుంచి దూరంగా తోసివేశాడు. బబులోను రాజుమీద సిద్కియా తిరుగుబాటు చేశాడు.

4 కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవత్సరాల పది నెలలు దాటి పదవ రోజు గడుస్తూ వుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తన యెరూషలేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సైన్యం యెరూషలేము బయట దిగింది. తరువాత వారు నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ దిమ్మలు కట్టారు.

5 రాజైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం జరిగే వరకు యెరూషలేము నగరం బబులోను సైన్యం ముట్టడిలో వుంది.

6 ఆ సంవత్సరం నాల్గవ నెలలో తొమ్మిదవ రోజున నగరంలో కరువు తీవ్రమయ్యింది. నగరంలో ఆహార పదార్ధాలు అయిపోవటం కారణంగా ప్రజలకు తినటానికి తిండి కరువయ్యింది.

7 ఆ రోజున బబులోను సైన్యం యెరూషలేములోనికి ప్రవేశించింది. యెరూషలేము సైన్యం పారిపోయింది. రాత్రి సమయంలో సైనికులు నగరం వదిలి పారిపోయారు. రెండు గోడల మధ్య ద్వారం గుండా వారు బయటకి పోయారు. ఆ ద్వారం రాజు యొక్క ఉద్యానవనం వద్ద వుంది. బబులోను సైన్యం నగరాన్ని చుట్టుముట్టి ఉన్నప్పటికీ, యెరూషలేము సైనికులు పారిపోగలిగారు. వారు ఎడారివైపు పారిపోయారు.

8 కాని, కల్దీయుల సైన్యం రాజైన సిద్కియాను వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. కాని సిద్కియా సైనికులంతా పారిపోయారు.

9 బబులోను సైన్యం రాజైన సిద్కియాను చెరబట్టింది రిబ్లా నగరంలోవున్న బబలోను రాజు వద్దకు అతన్ని తీసికొని వెళ్లారు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. బబులోను రాజు రిబ్లా నగరంలో రాజైన సిద్కియాపై తీర్పు ప్రకటించాడు.

10 రిబ్లా నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను చంపివేశాడు. తన కుమారులు క్రూరంగా చంపబడటం సిద్కియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడటానికి అతనిపై వత్తిడి వచ్చింది.) యూదా అధికారులందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు.

11 పిమ్మట బబులోను రాజు సిద్కియా కండ్లు పెరికివేశాడు. అతనికి కంచు గొలుసులు వేశాడు. తరువాత సిద్కియాను అతడు బబులోనుకు తీసికొనిపోయాడు. బబులోనులో సిద్కియాను అతడు చెరసాలలో ఉంచాడు. సిద్కియా చనిపోయే వరకు చెరసాలలోనే ఉన్నాడు.

12 బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధి పతియైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు. రాజైన నెబుకద్నెజరు పాలనలో పందొమ్మిదవ సంవత్సర ఐదవనెలలో పదవ రోజున అతను వచ్చాడు. బబులోనులో నెబూజరదాను ఒక ముఖ్యమైన నాయకుడు.

13 నెబూజరదాను దేవాలయాన్ని తగులబెట్టాడు. రాజభవనాన్ని, యెరూషలేములో ఇతర గృహాలను కూడ అతడు తగులబెట్టాడు. యెరూషలేములో ప్రతి ముఖ్య భవనాన్నీ అతడు తగులబెట్టాడు.

14 కల్దీయుల సైన్యమంతా కలిసి యెరూషలేము చుట్టూవున్న గోడలను కూలగొట్టింది. రాజుయొక్క ఒక ప్రత్యేక అంగరక్షకుని కింద ఆ సైన్యం ఉంది.

15 సైనికాధికారి నెబూజరదాను ఇంకా యెరూషలేములో మిగిలిన జవాన్ని బందీలుగా పట్టుకున్నాడు . బబులోను రాజుకు ఇంతకుముందే లొంగిపోయిన వారిని కూడా చెరబట్టి తీసికొనిపోయాడు. యెరూషలేములో మిగిలిన నిపుణులైన చేతి పనివారిని కూడా అతడు తీసికొని వెళ్లాడు..

16 కాని నెబూజరదాను మిక్కిలి పేదవారిని కొందరిని రాజ్యంలో వదిలివేశాడు. వారిని ద్రాక్ష తోటలలోను, పొలాలలోను పవిచేయటానికి అతడు వదలి వెళ్లాడు.

17 ల్దీయుల సైన్యం ఆలయంలోని కంచు స్తంభాలను విరుగగొట్టింది. యెహోవాయొక్క ఆలయంలో గల స్తంభాలను, కంచు సముద్రమును (కోనేరు) కూడ ముక్కలు చేశారు . ఆ కంచునంతా వారు బబులోనుకు తీసికొని పోయారు.

18 బబులోను సైన్యం ఆలయం నుండి ఆ వస్తు సామగ్రిని కూడ తీసికొని పోయింది: కుండలు, పారవంటి గరిటెలు, వత్తులను ఎగదోసే పనిముట్లు, పెద్ద గిన్నెలు, పెనాలు, దేవాలయ అర్చనలో ఉపయెగించే కంచు సామగ్రి వంటి వాటిని కూడ బబులోను సైన్యం తీసికొనిపోయింది.

19 రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి ఈ వస్తువులు తీసుకొని వెళ్లాడు: పళ్లెములు, ధూపకలశాలు, పెద్ద పాత్రలు, కుండలు, దీపస్తంభాలు, పెనములు, పానీయాలు అర్పించే పాత్రలు వెండి, బంగారాలతో చేసిన వస్తువులన్నీ అతడు తీసికొని పోయాడు.

20 రెండు స్తంభాలు, సముద్రం (కోనేరు), దాని కింద పన్నెండు కంచు గిత్తదూడల విగ్రహాలు, తోపుడు స్థంభాలు చాలా బరువైనవి. రాజైన సొలొమోను వాటిని యెహోవా ఆలయానికి చేయించాడు. వాటి చేతకు పట్టిన కంచు ఎంత బరువైనదంటే దాన్ని తూచటం కష్టం.

21 ప్రతి కంచుస్తంభం ఇరువది ఏడు అడుగుల (పదునెనిమిది మూరలు) ఎత్తు వుంది. ప్రతి స్తంభం పద్దెనిమిది అడుగుల (పన్నెండు మూరలు) చుట్టు కొలత కలిగివుంది. ప్రతి స్తంభం బోలుగా ఉంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు.

22 మొదటి స్తంభం మీది కంచుపీట ఏడున్నర అడుగుల (ఏడు మూరలు) ఎత్తు కలిగి ఉంది. దాని చుట్టూ వలలాంటి నగిషీ పని, కంచు దానిమ్మకాయల అలంకరణ చేయబడింది. మరొక స్తంభం మీద కూడ దానిమ్మకాయల పనితనం వుంది. అదికూడ మొదటి స్తంభం మాదిరిగానే వుంది.

23 స్తంభాల పక్కల మీద తొంబది ఆరు దానిమ్మకాయలున్నాయి. స్తంభాల పైన వలవంటి నగిషీపని మీద మొత్తం వంద దానిమ్మ కాయలు వున్నాయి.

24 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి శెరాయాను, సిద్కియాను బందీలుగా తీసికొని పోయాడు. ముగ్గురు ద్వారపాలకులను కూడా బందీలుగా తీసికొనిపోయాడు. శెరాయా ప్రధాన యాజకుడు, అతని తరువాతి వాడు జెఫన్యా.

25 రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి పోరాటయోధుల దళాధిపతిని కూడా పట్టుకున్నాడు. రాజుయొక్క సలహాదారులలో ఏడుగురిని కూడా అతడు పట్టుకున్నాడు. ఆ మనుష్యులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. సైన్యంలో మనుష్యులను చేర్చుకొనే అధికారిని (లేఖరి) కూడ అతడు పట్టుకున్నాడు. నగరంలో ఉన్న అరువది మంది సామాన్య ప్రజలను కూడా అతడు పట్టుకున్నాడు.

26 [This verse may not be a part of this translation]

27 [This verse may not be a part of this translation]

28 నెబుకద్నెజరు చెరబట్టిన వారు వివరాలు ఇలా ఉన్నాయి: నెబుకద్నెజరు పాలన ఏడవ సంవత్సరం గడుస్తూ వుండగా మూడు వేల ఇరవై ముగ్గురు యూదా ప్రజలు.

29 నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరం జరుగుతూ ఉండగా ఎనిమిది వందల ముప్పది రెండు మంది యెరూషలేము నుండి బందీలుగా తీసికొని పోబడ్డారు.

30 నెబుకద్నెజరు పాలన ఇరువై మూడవ సంవత్సరంలో నెబూజరదాను ఏడువందల నలభై ఐదు మంది యూదా వారిని బందీ చేశాడు. నెబూజరదాను రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక ధళాధిపతి. మొత్తం మీద నాలుగువేల ఆరువందల మందిని బందీలుగా పట్టుకుపోయారు.

31 యూదా రాజైన యెహోయాకీను బబులోనులో ముప్పది ఏడు సంవత్సరాల పాటు చెరసాలలో ఉన్నాడు. యెహోయాకీను కారాగారవాసంలో ముప్పది ఏడవ సంవత్సరం జరుగుతూ ఉండగా బబులోను రాజైన ఎవీల్మెరోదకు అతని పట్ల మిక్కిలి కనికరం చూపాడు. ఆ సంవత్సరంలో యెహోయాకీనును అతడు చెరసాల నుండి విడుదల చేశాడు. అనగా అది ఎవీల్మెరోదకు బబులోనుకు రాజు అయిన మొదటి సంవత్సరం. ఎవీల్మెరోదకు ఆ సంవత్సరం పన్నెండవ నెలలో ఇరువై ఐదవ రోజున యెహోయాకీనును చెరసాల నుండి విడుదల చేశాడు.

32 ఎవీల్మెరోదకు మిక్కిలి దయగా యెహోయాకీనుతో మాట్లాడాడు. అప్పుడు తనతో బబులోనులో ఉన్న రాజులం దరికంటె యెహోయాకీనుకు అతడు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చాడు.

33 దానితో యెహోయాకీను తన చెరసాల బట్టలు తీసివేశాడు. మిగిలిన తన జీవిత కాలమంతా అతడు ప్రతిరోజూ రాజుయొక్క బల్లవద్దనే భోజనం చేశాడు.

34 బబులోను రాజు ప్రతిరోజూ యెహోయాకీనుకు దినభత్యం ఇచ్చేవాడు. ఇది యెహోయాకీను చనిపోయేవరకు కొనసాగింది.