1 ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన ప్రవచనాలు.
2 అన్నీ పరమ అర్థరహితాలు. ‘సమస్తం వృధా కాలయాపన!’ అంటాడు ప్రసంగి.
3 ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా ? (లేదు!)
4 ఒక తరం మారి మరొకతరం వస్తుంది.కాని, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది.
5 సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు.
6 గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తి రిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది.
7 నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు.
8 ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు . అయితేనేమి, మనుష్యులు మాట్లాడు తూనే వుంటారు . మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతునే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు.
9 అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఆ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.
10 ఎవరైనా, “చూడండి, ఇదిగో ఇది కొత్తది” అని చెప్పవచ్చుగాక. కాని, అది ఎప్పుడూ ఇక్కడ ఉన్నదే. మనం పుట్టక ముందు అది ఇక్కడ ఉన్నదే!
11 పూర్వం ఎప్పుడో జరిగిన విషయాలు మనుష్యులకి గుర్తుండవు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు భవిష్యత్తులో జనానికి గుర్తుండవు. దానికి తర్వాత, అప్పటివాళ్లకి, తమ పూర్వపు వాళ్లు చేసిన పనులు గుర్తుండవు.
12 ప్రసంగి అనే ఉపదేశకుడినైన నేను యెరూషలేములోని ఇశ్రాయేలు రాజును.
13 నేను విద్యను అభ్యసించి, దానివల్ల లభ్యమైన జ్ఞానాన్ని ఈ జీవితంలో జరిగే అన్ని విషయాలనూ అవగాహన చేసుకొనేందుకు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్రమంలో, ఇది దేవుడు మనకి అప్పగించిన చాలా కఠినమైన పని అని నేను గ్రహించాను.
14 ఈ భూమి మీద జరిగేవాటన్నింటినీ నేను పరిశీలనగా చూశాను. అవన్నీ వ్యర్థమని గ్రహించాను. అది గాలిని మూటగట్ట ప్రయత్నించడం వంటిది.
15 (వీటిని వేటినీ మనం మార్చలేము.) వంకరగా వున్నదాన్ని అది తిన్నగా వుందని మనం చెప్పలేము. ఏదైనా ఒకటి అక్కడ లేనప్పుడు అది అక్కడ వుందని మనం చెప్పలేము.
16 “నేను చాలా తెలివైనవాడిని. నాకంటె ముందు యెరూషలేమును పాలించిన రాజులందరికంటె నేను వివేకవంతుడిని. వివేకం, జ్ఞానం వీటి గూర్చి నాకు తెలుసు!” అని నాలో నేను అనుకున్నాను.
17 వివేకం, జ్ఞానం వెర్రితనం మరియు బుద్ధి తక్కువ ఆలోచనలు చెయ్యడంకంటె ఎలా మెరుగైనవో తెలుసుకోవాలని తీర్మానించుకున్నాను. కాని, ఆ క్రమంలో వివేకం సంపాదించ ప్రయత్నించడం గాలిని పోగుచేసి, మూటగట్ట ప్రయత్నించడం వంటిదేనని నేను గ్రహించాను.
18 వివేకం పెరిగే కొద్ది మనిషికి నిరాశా నిస్పృహలు పెరుగుతాయి. వివేకం పెరిగిన మనిషి మరింత దుఃఖాన్ని కూడగట్టుకుంటాడు.
1 నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను.
2 (ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు.
3 అందుకని, కడుపునిండా ద్రాక్షారసం తాగుతూ మనస్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ఖత్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితంలో జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను.
4 అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను.
5 తోటలు వేయించాను, ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల చెట్లు నాటించాను.
6 నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను.
7 నేను మగ, ఆడ బానిసలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు బానిసలు పుట్టారు. నాకు బోలెడు గొప్ప వస్తువులు ఉన్నాయి. నాకు పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి.
8 నేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. ఆయా రాజుల, రాజ్యాల సంపదలను కొల్లగొట్టాను. నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. నేను ఏ ఒకరినైన కోరుకోగలను.
9 నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుణ్ణీ అయ్యాను. యెరూషలేములో నా వెనుకటి వారందరికంటె నేను గొప్పవాడినయ్యాను. పోతే, నా జ్ఞానం వివేకం నాకు సహాయం చేశాయి.
10 నేను చూసి, కోరుకున్నదల్లా నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం నా ఈ ఆనందమే.
11 అయితే, అటు తర్వాత నేను చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. నేను పడ్డ శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది . ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం పొందే లాభం ఏమీ లేదు.
12 ఒక రాజు చేయగలినదానికంటె ఎక్కువ మరొక డెవడూ చేయలేడు. నీవీనాడు చేయాలని కోరుకో గలవాటన్నింటినీ ఏదో ఒక రాజు ఎన్నడో చేసేవున్నాడు . (రాజు చేసేపనులు సైతం కూడా వ్యర్థమేనని నేను గ్రహించాను.) అందుకని జ్ఞానార్జన గురించీ, మూర్ఖపు పనులు, మతిలేని పనులు చేయడం గురించీ నేను మరోసారి ఆలోచించ నారంభించాను.
13 చీకటి కంటే వెలుగు మెరుగైనట్లే, మూర్ఖత్వంకంటె జ్ఞానం మెరుగైనదని నేను గ్రహించాను.
14 అదెలాగంటే: తెలివైనవాడు తానెక్కడికి వెళ్తన్నది గ్రహించేందుకు తన మనస్సును కళ్లలా ఉపయోగించుకుంటాడు. కాగా, ఒక మూర్ఖుడు అంధకారంలో నడుస్తున్న వ్యక్తి వంటివాడు. అయితే, బుద్ధిమంతుడిది, బుద్ధిహీనుడిది కూడా ఒకటే గతి అని నేను గ్రహించాను. (ఇద్దరూ మరణిస్తారు)
15 నాలో నేను ఇలా అనుకున్నాను, “ఒక బుద్ధిహీనుడికి పట్టే గతే నాకూ పడుతుంది. మరి జ్ఞానార్జన కోసం నేనెందుకు అంతగా తంటాలు పడినట్లు?” నేనింకా ఇలా అనుకున్నాను: “జ్ఞానార్జనకూడా ప్రయోజనం లేనిదే.”
16 జ్ఞానవంతుడూ, అజ్ఞానీ ఇద్దరూ మరణిస్తారు! మరి జనం వివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు, అవివేకినీ శాశ్వతంగా గుర్తుంచుకోరు. భవిష్యత్తులో, వాళ్లు చేసిన పనులన్నింటినీ మరచిపోతారు. కాగా వాస్తవంలో వివేకికీ, అవివేకికీ మధ్య తేడా యేమీ లేదు.
17 దీనితో నాకు జీవితం పట్ల ద్వేషం కలిగింది. ఈ జీవితంలో అన్నీ వ్యర్థమైనవే, గాలిని మూట కట్టుకొన ప్రయత్నించడం వంటివే అనిపించి, నాకు విచారం కలిగింది.
18 దానితో, నేను వెనక చేసిన గట్టి శ్రమ అంతటినీ ద్వేషించనారంభించాను. నేను గట్టి కృషిచేశాను. అయితే, నా కృషిఫలితాలను నా తర్వాత తరాలవాళ్లు అనుభవిస్తారని గ్రహించాను. నేను వాటిని నాతో తీసుకుపోలేను.
19 నేను వేటికోసం అధ్యయనం చేశానో, వేటి కోసం పాటుపడ్డానో, వాటన్నింటిపైనా మరొకడెవడో అదుపు కలిగివుంటాడు. అతడు వివేకి అవుతాడో, అవివేకి అవుతాడో నాకు తెలియదు. ఇది కూడ తెలివి లేనిది.
20 అందుకని, నేను చేసిన శ్రమ అంతా నాకు విచారమే కలిగించింది.
21 తన వివేకం, జ్ఞానం, నైపుణ్యం వీటన్నింటనీ వినియోగించి ఒకడు బాగా కష్టించి పని చేయవచ్చు. కాని, అతను మరణిస్తాడు, అతని శ్రమ ఫలితాలన్నింటిని ఇతరులు పొందుతారు. వాళ్లు ఏ శ్రమా చెయ్యలేదు. కాని, వాళ్లకి అన్నీ లభ్యమవుతాయి. ఇది నాకు చాలా విచారం కలిగిస్తుంది. ఇది అన్యాయమే కాదు, అర్థరహితం కూడా.
22 ఒక మనిషి ఈ జీవితంలో నానా తంటాలూపడి, ఎంతో శ్రమ చేస్తాడు. చివరికి అతని చేతికి చిక్కేదేమిటి?
23 చచ్చేదాకా అతను అనుభవించేది బాధలు, నిరాశా నిస్పృహలు, చేసేది (గొడ్డు) చాకిరీ. రాత్రి పూటకూడా మనిషి మనస్సు విశ్రాంతికి నోచు కోదు. ఇది కూడా అర్థరహితమైనదే.
24 [This verse may not be a part of this translation]
25 [This verse may not be a part of this translation]
26 [This verse may not be a part of this translation]
1 ప్రతిదానికి సరైన సమయం ఒకటుంది. ఈ భూమి మీద ప్రతీది సరైన సమయంలో సంభవిస్తుంది.
2 పుట్టేందుకొక సమయం వుంది, చనిపోయేందుకొక సమయం వుంది. మొక్కలు నాటేందుకొక సమయం వుంది, మొక్కలు పెరికేందుకొక సమయం వుంది.
3 చంపేందుకొక సమయం వుంది, గాయం మాన్పేందుకొక సమయం వుంది. నిర్మూలించేందుకొక సమయం వుంది, నిర్మించేందుకొక సమయం వుంది.
4 ఏడ్చేందుకొక సమయం వుంది, నవ్వేందుకొక సమయం వుంది. దుఃఖించేందుకొక సమయం వుంది. సంతోషంతో నాట్య మాడేందుకొక సమయం వుంది.
5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది, వాటిని తిరిగి చేపట్టేందుకుకొక సమయం వుంది. ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది, ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది .
6 దేన్నయినా వెదికేందుకొక సమయం వుంది, అది పోగొట్టుకొనేందుకొక సమయం వుంది. వస్తువులు పదిల పర్చు కొనే సమయం వుంది, వాటిని పారవేసే సమయం వుంది.
7 వస్త్రం చింపేందుకొక సమయం వుంది, దాన్ని కుట్టేందుకొక సమయం వుంది. మౌనానికొక సమయం వుంది. మాట్లాడేందు కొక సమయం వుంది.
8 ప్రేమించేందుకొక సమయం వుంది, ద్వేషించేందుకొక సమయం వుంది. సమరానికొక సమయం వుంది, శాంతికొక సమయం వుంది.
9 మనిషి చేసే కష్ట భూయిష్టమైన పనికిగాను అతనికి నిజంగా ఏమైనా లభిస్తుందా? (ఉండదు!)
10 చేసేందుకు దేవుడు మనకిచ్చే కష్ట భూయిష్టమైన పనులన్నీ ఏమిటో నేను గుర్తించాను.
11 తన జగత్తును గురించి ఆలోచించే సామర్థ్యాన్ని దేవుడు మనకి యిచ్చాడు . అయితే దేవుడు చేసే వాటన్నింటినీ మనం ఎన్నడూ పూర్తిగా తెలుసు కోలేము. అయితేనేమి, దేవుడు అన్ని పనుల్నీ సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు.
12 తాము బతికినంత కాలము సంతోషంగా ఉండటం, తనివితీరా సుఖాలు అనుభవించడం ఇవి మనుష్యులు చేయవలసిన అత్యుత్తమమైన పని అన్న విషయం నేను గ్రహించాను.
13 ప్రతి మనిషి తినాలి, తాగాలి, తాను చేసే పనిని ఆహ్లాదంగా చెయ్యాలి ఇది దేవుడు కోరుకునేది. ఇవి దేవుడిచ్చిన వరాలు.
14 దేవుడు చేసేది ప్రతీది శాశ్వతంగా కొనసాగు తుందని నేను తెలుసుకున్నాను. దేవుడు చేసినదానికి మనుష్యులు దేన్నీ ఎంతమాత్రం జోడించలేరు మరియు దేవుడు చేసే పనినుండి దేనినీ తీసుకొనలేరు. మనుష్యులు తనని గౌరవించేందుకే దేవుడు ఇదంతా చేశాడు.
15 గతంలో జరిగినవేవో జరిగాయి, (మరి మనం వాటిని మార్చలేము.) భవిష్యత్తులో జరగ బోయేవేవో జరుగుతాయి. (మనం వాటిని మార్చలేము) అయితే, ఎవరైతే చెడ్డగా చూడబడ్డారో, వారికి దేవుడు మంచి చెయ్యాలని కోరుకుంటాడు .
16 ఈ ప్రపంచములో యీ విషయాలన్నీ నేను చూశాను. న్యాయ స్థానాల్లో మంచితనము, న్యాయము నిండుగా ఉండాలి, అయితే అక్కడ మనం కను గొంటుంది చెడుగు.
17 అందుకని, నాలో నేను ఇలా అనుకున్నాను: “దేవుడు ప్రతి పనికి ఒక కాలాన్ని ఎంచుకున్నాడు. అంతేకాదు, మనుష్యులు చేసే పనులన్నింటిని విచారించేందుకు దేవుడు ఒక ప్రత్యేక కాలాన్ని ఎంచుకున్నాడు. దేవుడు మంచివాళ్లని విచారిస్తాడు, చెడ్డవాళ్లని విచారిస్తాడు.”
18 మనుష్యులు ఒకరిపట్ల మరొకరు వ్యవహరించే తీరును గమనించిన నేను నాలో నేనిలా అనుకున్నాను, “తాము జంతువుల మాదిరిగా వున్నామన్న విషయాన్ని మనుష్యులు గమనించాలని దేవుడు కోరుకున్నాడు.
19 మనిషి జంతువుకంటే మెరుగైనవాడా? (కాడు) ఎందుకని? ఎందుకంటే, అన్ని నిష్ర్పయోజనం కనుక. మనుష్యులూ మరణిస్తారు. జంతువులూ మరణిస్తాయి. ఒకే “ఊపిరి “ మనుష్యుల్లోనూ, జంతువుల్లోనూ ఉన్నది. చనిపోయిన జంతువుకి, మనిషికి మధ్య తేడా ఏమైనా ఉందా?
20 అన్ని ఒక్క చోటుకే పోతాయి. అవి ఏ మట్టినుంచి పుట్టాయో చివరికి ఆ మట్టిలోకే పోతాయి.
21 మనిషి ఆత్మకి ఏమి జరుగుతుందో ఎవరికెరుక? జంతువు ఆత్మ పాతాళానికి పోతే, మనిషి ఆత్మ పైకి దేవుని దగ్గరికి వెళ్తుందేమో ఎవరికి తెలుసు?”
22 అందుకని, మనిషి తాను చేసే పనిలో ఆనందం పొందడమే అత్యుత్తమమైనదని నేను గ్రహించాను. అదే వాళ్ల భాగ్యం. (మరో విషయంయేమంటే, భవిష్యత్తు గురించి మనిషి దిగులు పెట్టుకోకూడదు.) ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు మనిషికి ఎవ్వరూ తోడ్పడలేరు.
1 నేను చూసిన మరో విషయం ఏ మిటంటే, చాలా మంది సరిగ్గా చూడరు. వాళ్లు కన్నీళ్లు పెట్టు కోవడం నేను చూశాను. ఆ విచారగ్రస్తుల్ని ఓదార్చే వాళ్లు ఎవరూ లేరన్న విషయం, క్రూరులైనవాళ్ల చేతుల్లోనే అధికారమంతా ఉందన్న విషయం కూడా నేను గమనించాను. ఆ క్రూరుల చేతుల్లో బాధలుపడేవాళ్లకు ఉపశమనం కలిగించే వాడెవడూ లేడని నేను గమనించాను.
2 ఇంకా బతికున్నవాళ్ల కంటె చనిపోయిన వాళ్ల పరిస్థితులే మెరుగ్గా ఉన్నాయని నేను తీర్మానించు కున్నాను.
3 (పురింట్లోనే చనిపోయే వాళ్ల) పరిస్థితి అంతకంటే కూడా మెరుగ్గా ఉంది! ఎందుకంటే, ఈ ప్రపంచంలో జరిగే ఏ చెడుగునూ వాళ్లెన్నడూ చూడరు.
4 తర్వాత నేనిలా అనుకున్నాను, “మనుష్యులు మరింత కష్టపడి పనిచేస్తారెందుకు?” కొందరు విజయం సాధించి ఇతరులకంటె మెరుగవాలని ప్రయత్నించడం నేను చూశాను. ఎందుకంటే, వాళ్లలో ఈర్ష్య ఉంది. తమకి ఉన్నదానికంటె ఇతరులు అధికంగా కలిగివుండటం వాళ్లకి ఇష్టం లేదు. ఇది కూడా బుధ్ది హీనత. ఇది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నం.
5 కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.”
6 బహుశాః ఈ మాట నిజమే కావచ్చు. మరికొన్ని సంపాదించు కోవాలని సదా తంటాలు పడటం కంటె, ఉన్న కొద్దివాటితో తృప్తి చెందడం మెరుగని నా ఉద్దేశం.
7 మతిమాలిన మరో విషయం నేను గమనించాను,
8 ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి కుటుంబం ఉండకపోవచ్చు. ఒక కొడుకో, ఒక సోదరుడో ఉండక పోవచ్చు. అయితేనేమి, అతను రెక్కలు విరుచుకొని అతిగా పని చేస్తూనే ఉంటాడు. తనకి ఉన్నదానితో అతను ఎన్నడూ తృప్తిచెందడు. అతను నిర్విరామంగా కష్టించి పనిచేసి, “నేనిలా ఎందుకు రెక్కలు విరుచుకొని పనిచేస్తున్నట్లు? నేను నా జీవితాన్ని హాయిగా ఎందుకు గడపకూడదు?” అని అడగడు. ఇది కూడా చెడ్డదే అర్థరహితమైనదే.
9 ఒకరికంటె ఇద్దరు మెరుగు. ఇద్దరు కలిసి పనిచేస్తే, తాము చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం పొందుతారు.
10 ఒకడు పడిపోతే రెండోవాడు అతనికి సహాయం చెయ్యగలుగుతాడు. ఒంటరిగాడు పడి పోయినప్పుడు అతను నిస్సహాయుడవుతాడు. అక్కడ అతనికి సాయిపడేవాడు ఎవడూ వుండడు.
11 ఇద్దరు జంటగా పడుకుంటే, వాళ్లకి వెచ్చగా ఉంటుంది. ఒంటిరిగా నిద్రించేవాడికి వెచ్చదనం ఉండదు.
12 ఒంటరి వ్యక్తిని శత్రువు ఓడించగలుగుతాడు. అయితే, అదే శత్రువు ఇద్దర్ని ఓడించలేడు. అదే ముగ్గురుంటే, ఇంకా ఎక్కువ బలం కలిగివుంటారు. ముప్పేట తాడును తెంచలేనట్లే, వాళ్లని దెబ్బతియ్యడం చాలా కష్టసాధ్యమవుతుంది.
13 వృద్ధుడే అయినా బుద్ధిహీనుడైన రాజుకంటె, బీదవాడే అయినా బుద్ధిశాలి అయిన యువ నాయకుడు మేలు. ఆ ముసలి రాజు హెచ్చరికలను చెవిన పెట్టడు.
14 ఆ యువ రాజు రాజ్యంలో పేదవాడై పుట్టి ఉండవచ్చు. బహుశాః అతను చెరనుండి బయటకు వచ్చిన రాజు అవ్వొచ్చు.
15 నేనీ ప్రపంచంలో మనుష్యుల్ని పరిశీలించాను. నాకీ విషయం తెలుసు: జనం ఆ యువకుణ్ణే అనుసరిస్తారు. అతనే కొత్త రాజు అవుతాడు.
16 తండోపతండాలుగా జనం అ యువకుణ్ణి అనుసరిస్తారు. అయితే, దరిమిలా, ఆ జనమే అతనంటే ఇష్టపడరు. ఇది అర్థరహితమే. ఇది గాలిని మూటగట్ట ప్రయత్నించడం లాంటిదే.
1 దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు.
2 దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి)
3 అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు, బుద్ధిహీనులు అతిగా వాగుతారు.
4 దేవునికి నువ్వేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నువ్వు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నువ్వాయనకి ఇయ్యి.
5 ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు.
6 అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు . నువ్వాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నువ్వు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు.
7 నీ పనికిమాలిన స్వప్నాలూ, బీరాలూ (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నువ్వు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.
8 ఏ దేశమైనా తీసుకో. బీదవాళ్లు రెక్కలు ముక్కలు చేసుకొని పని చేయక గత్యంతరం లేని పరిస్థితి నువ్వు చూస్తావు. బీదల విషయంలో ఇది అన్యాయ వర్తన అని, బీదల హక్కులకు ఇది విరుద్ధమని నువ్వు చూడగలుగుతావు. అయితే, నువ్విందుకు ఆశ్చర్యపడబోకు! వాళ్లచేత అలా బలవంతాన పనిచేయించే అధికారి పైన, మరో అధికారి ఉంటాడు. ఈ ఇద్దరు అధికారులపైనా పెత్తనం చలాయించి పనిచేయించే మరో పై అధికారి వుంటాడు.
9 రాజు కూడా బానిసే. అతడి రాజ్యం అతని యజమాని.
10 డబ్బు పట్ల వ్యామోహం ఉన్నవాడు తనకి ఉన్న డబ్బుతో ఎన్నడూ తృప్తి చెందడు. ఐశ్వర్యాన్ని ప్రేమించేవాడు తనికి ఇంకా ఇంకా వచ్చి పడినా తృప్తి చెందడు. ధన వ్యామోహం కూడా అర్థరహిత మైనదే.
11 ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, దాన్ని ఖర్చు పెట్టడంలో తోడ్పడే “మిత్రులు” అంత ఎక్కువ మంది ఉంటారు. దానితో, వాస్తవంలో ఆ ధనికుడు పొందే లాభమేమీ ఉండదు. అతను తన సంపదని చూసుకుని మురిసిపోగలడు. అంత మాత్రమే.
12 రోజంతా చెమటోర్చి కష్టపడేవాడు యింటికి తిరిగి వచ్చి తక్కువగా తిన్నా లేక ఎక్కువగా తిన్నా నిశ్చింతగా నిద్రపోతాడు. శ్రమజీవికి తినేందుకు కొంచెమే వున్నా, ఎక్కువ వున్నా అతనికి అదేమంత ముఖ్యంకాదు. కాని, ధనికుడికి తన సంపద విషయంలో బెంగతో నిద్రపట్టదు.
13 ఈ ప్రపంచంలో చాలా విచారకరమైన విషయం ఒకటి నేను గమనించాను. ఒకడు భవిష్యత్తు కోసం డబ్బు పొదుపు చేస్తాడు.
14 తర్వాత ఏదో విపత్తు వచ్చి, తన ఆస్తి సర్వస్వం కోల్పోతాడు. అప్పుడిక తన కొడుక్కి ఇచ్చేందుకు అతని దగ్గర గుడ్డి గవ్వకూడా మిగలదు.
15 తల్లి గర్భం నుంచి వ్యక్తి పుట్టినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తనతో తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అతను ఆయా వస్తువుల కోసం చచ్చేలా శ్రమిస్తాడు. కాని, తాను చనిపోయి నప్పుడు అతను తన వెంట తీసుకువెళ్ల గలిగింది ఏమీ ఉండదు.
16 ఇది చాలా విచారకరమైన విషయం. తను ఈ లోకంలోకి ఎలా వస్తాడో అలాగే పోతాడు. కాగా, “గాలిని మూటగట్టుకొనేందుకు చేసే ప్రయత్నం” వల్ల మనిషికి ఒరిగేదేమిటి?
17 దుఃఖంతో, విచారంతో నిండిన రోజులు. నిరాశా నిస్పృహలు అనారోగ్యాలు, చికాకులు చివరికి అతనికి మిగిలేవి ఇవే!
18 ఈ భూమిమీద ఉత్తమమైనది ఏమనగా, తనకున్న స్వల్ప జీవితకాల వ్యవధిలో మనిషి అన్న పానాలు తృప్తిగా సేవించాలి, తన పని ఫలితాన్ని సుఖంగా అనుభవించాలి. దేవుడు అతనికి ఇచ్చినది ఈ కొద్ది రోజులు మాత్రమే అన్న విషయాన్ని దృష్టిలో వుంచు కోవాలి ఇదే మనిషి చేయగలిగినదన్న విషయాన్ని నేను గమనించాను.
19 దేవుడు ఒక వ్యక్తికి సంపదని, ఆస్తిని వాటిని హాయిగా అనుభవించే శక్తినీ ఇస్తే, ఆ వ్యక్తి వాటిని అనుభవించాలి. ఆ వ్యక్తి తనకున్న వాటిని స్వీకరించాలి. దేవుని వరమైన తన పనిని సంతోషంగా చెయ్యాలి.
20 మనిషి ఆయుష్షు సుదీర్గమైనది కాదు కనుక, అతని విషయాలన్నీ తన జీవితం పొడుగునా గుర్తుంచు కోవాలి. ఆ మనిషి ఇష్టంగా చేసే పనిలో దేవుడు అతన్ని నిమగ్నుణ్ణి చేస్తాడు .
1 నేను ఈ ప్రపంచంలో అసమంజసమైన మరో విషయాన్ని గమనించాను. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
2 దేవుడు ఒక మనిషికి గొప్ప సంపద, ఆస్తి మరియు గౌరవమూ ప్రసాదిస్తాడు. అతనికి కావలసినవన్నీ, అతను కోరుకోగలిగిన సమస్తం వుంటాయి. అయితే, ఆ వ్యక్తి వాటిని అనుభవించకుండా చేస్తాడు దేవుడు. ఒక అపరిచితుడు వస్తాడు, వాటన్నింటినీ చేజిక్కించుకుంటాడు. ఇది కూడా అర్థరహితమైన చాలా చెడ్డ విషయమే.
3 ఒక వ్యక్తి దీర్ఘకాలం జీవించవచ్చు. అతనికి వంద మంది సంతానం ఉండవచ్చు. అయితే, ఈ మంచి విషయాలు అతనికి తృప్తి కలిగించలేదనీ, అతని మరణానంతరం ఏ ఒక్కరూ అతన్ని జ్ఞాపకం ఉంచుకోరనీ అనుకోండి, అప్పుడు అతనికంటె పురిట్లోనే చనిపోయే శిశువు మెరుగని నేనంటాను.
4 మృత శిశువుగా పుట్టడం నిజంగానే అర్థరహితం. పేరైనా లేని ఆ శిశువుని చటుక్కున తీసుకుపోయి సూర్యరశ్మి చొరని చీకటి సమాధిలో పూడ్చేస్తారు.
5 సూర్యరశ్మినైనా చూడని ఆ శిశువుకి బొత్తిగా ఏది ఏమాత్రం తెలియదు. కాని, దేవుడు తనకిచ్చిన మంచివాటిని అనుభవించని ఆ మనిషికంటె ఆ శిశువు ఎక్కువ ప్రశాంతిని అనుభవిస్తుంది.
6 ఆ మనిషి రెండు వేల సంవత్సరాలు బతకవచ్చుగాక. అయినా అతను తనకు ఇచ్చిన జీవితాన్ని అనుభవించక పోతే అతనికంటె గర్భంలో చనిపోయిన శిశువు సులభమయిన మార్గంతో ఆ అంత్యదశను పొందిందనవచ్చు.
7 మనిషి చచ్చేలా పాటుపడతాడు తిండి కోసం. అయితే, అతను ఎన్నడూ తృప్తి చెందడు.
8 వివేకవంతుడు అవివేకికంటె విశేషమైనవాడు కాడు. అంత కంటె, ఉన్నదున్నట్లు జీవితాన్ని స్వీకరించడం తెలిసిన బీదవాడు మేలు
9 ఉన్నదానితో తృప్తి చెంది సంతోషంగా ఉండటం ఎప్పుడూ ఇంకా ఇంకా ఏదో కావాలని అశించడం మేలు. ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని కోరుకోవడం వృధా ప్రయాసం. అది గాలిని మూట గట్టుకొనేందుకు చేసే ప్రయత్నమే.
10 [This verse may not be a part of this translation]
11 [This verse may not be a part of this translation]
12 భూమిమీద స్వల్ప కాలం జీవించే మనిషికి, ఆ స్వల్ప కాలంలో అతనికి ఏది అత్యుత్తమమైనదో ఎవరికి తెలుస్తుంది? అతని జీవితం నీడలా గడిచిపోతుంది. తర్వాత ఏమి జరుగుతుందో ఎవరూ అతనికి చెప్పలేరు.
1 మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం కంటె మరణ దినం మేలు.
2 విందుకి పోవడంకంటె, మరణించినవారి అంత్య క్రియలకి హాజరవడం మేలు. ఎందుకంటే, పుట్టిన వాళ్లెవరూ గిట్టకమానరు, బతికున్న ప్రతివాడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
3 నవ్వుకంటె దుఃఖం మరింత మేలు, ఎందుకంటే, మన ముఖం విచారగ్రస్త మైనప్పుడు, మన మనస్సు మెరుగవుతుంది.
4 అవివేకి సరదాగా హాయిగా గడపాలని మాత్రమే ఆలోచిస్తాడు, కాని, వివేకి మృత్యువు గురించి ఆలోచిస్తాడు.
5 మూర్ఖుడి పొగడ్త పొందడం కంటె, వివేకిచే విమర్శింప బడటం మేలు.
6 మూర్ఖుల ఇక ఇకలూ పకపకలూ, కుండ కింద చిటపట మండే ముళ్లలా ఉంటాయి. (కుండ వేడైనా ఎక్కకముందే, ఆ ముళ్లు చురచుర మండి పోతాయి.) ఇది కూడా నిష్ర్పయోజనమే.
7 వడైనా తగినంత డబ్బు ముట్టచెప్పితే వివేక వంతుడైనా తన వివేకాన్ని విస్మరిస్తాడు. ఆ డబ్బు అతని విచక్షణను నాశనం చేస్తుంది.
8 ఏదైనా మొదలెట్టడం కంటె దాన్ని ముగించడం మేలు. అహంభావం, అసహనం కంటె సాధుత్వం, సహనము మేలు.
9 తొందరపడి కోపం తెచ్చుకోకు ఎందుకంటే అది అవివేకం (మూర్ఖులు అవి చేస్తారు)
10 “గడిచి పోయిన రోజులే మేలు” అనబోకు. “అప్పుడు జరిగినదేమిటి?” ఇది అవివేకమైన ప్రశ్న.
11 నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు.
12 వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది.
13 దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నువ్వు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నువ్వు మార్చలేవు!
14 రోజులు బాగున్నప్పుడు, నువ్వు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు.
15 నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను.
16 [This verse may not be a part of this translation]
17 [This verse may not be a part of this translation]
18 దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు.
19 [This verse may not be a part of this translation]
20 [This verse may not be a part of this translation]
21 జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నువ్వు వినవచ్చు.
22 నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు.
23 నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం.
24 విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే.
25 నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?) చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను.
26 (కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు.
27 [This verse may not be a part of this translation]
28 [This verse may not be a part of this translation]
29 “నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.”
1 ఆయా విషయాలను ఒక జ్ఞాని అర్థం చేసుకుని, వివరించి చెప్పగలిగినట్లు మరొకరెవరూ చెయ్య లేరు. అతని జ్ఞానం అతనికి ఆనందాన్నిస్తుంది. జ్ఞానంవల్ల ముఖంలో విచారం తొలగి, ఆనందం చోటు చేసుకుంటుంది.
2 నేను చెప్పేదేమిటంటే, నువ్వు ఎల్లప్పుడూ రాజాజ్ఞను పాలించాలి. నువ్వు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కనుక నువ్వీ పని చెయ్యాలి.
3 రాజుకి సలహాలు ఇచ్చేందుకు భయపడకు. చెడ్డదాన్ని దేన్ని సమర్థించకు. కాని ఒక విషయం గుర్తుంచుకో: రాజు తనకు సంతోషం కలిగించే ఆజ్ఞలు ఇస్తాడు.
4 రాజుకి ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. రాజు ఏమి చెయ్యాలో అతనికి ఎవరూ చెప్పలేరు.
5 రాజాజ్ఞను పాటించే వ్యక్తి క్షేమంగా వుంటాడు. అయితే, వివేకవంతుడికి ఈ పని చేయవలసిన సరైన తరుణం ఏదో, ఆ సరైన పని ఎప్పుడు చెయ్యాలో తెలుస్తుంది.
6 మనిషి ఏ పనైనా చెయ్య వలసినప్పుడు, దానికి సరైన సమయం, సరైన మార్గం వుంటాయి. (ప్రతి వ్యక్తీ ప్రయత్నించి, తాను చెయ్య వలసింది ఏమిటో నిర్ణయించుకోవాలి.) తనకి అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా అతనీ పని చెయ్యాలి.
7 ఎందుకంటే, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరూ చెప్పలేరు గనుక.
8 తన ఆత్మ తొలగిపోకుండా నిలుపుకోగల శక్తి ఏ ఒక్కరికి లేదు. తన మృత్యువును ఆపు చేయగల శక్తి ఏ ఒక్కరికీ లేదు. యుద్ధ సమయంలో తన ఇష్టంవచ్చిన చోటుకి పోగల స్వేచ్ఛ సైనికుడికి ఎలా వుండదో, అలాగే ఒక వ్యక్తి పాపం చేస్తే, ఆ పాపం అతన్ని స్వేచ్ఛగా వుండనివ్వదు.
9 నేనీ విషయాలన్నీ గమనించాను. ఈ ప్రపంచంలో జరిగే విషయాలను గురించి నేను తీవ్రంగా ఆలోచించాను. మనుష్యులు ఎప్పుడూ యితరుల మీద అధికారం చలాయించే శక్తిని సంపాదించుకునేందుకు తంటాలు పడుతూ ఉంటారన్న విషయం నేను గమనించాను. ఇది వాళ్లకి చెరుపు చేస్తుంది.
10 దుర్మార్గులకి ఘనంగా అంత్యక్రియలు జరగడం కూడా నేను చూశాను అంత్యక్రియలు ముగించి, మనుష్యులు ఇళ్లకి తిరిగివెళ్లేటప్పుడు, చనిపోయిన దుర్మార్గుణ్ణి గురించి మంచి మాటలు చెప్పడం నేను విన్నాను. ఆ దుర్మార్గులు అనేకానేమైన చెడ్డ పనులు చేసిన పట్టణాల్లో కూడా అర్థరహితమైన పని జరిగింది. అది అర్థరహితమైనది.
11 కొన్ని సందర్భాల్లో, మనుష్యులు చేసిన చెడ్డ పనులకుగాను, వాళ్లు వెంటనే శిక్షింపబడరు. శిక్ష తాపీగా వస్తుంది. దానితో, యితరులకి కూడా చెడ్డ పనులు చెయ్యాలన్న కోర్కె కలుగుతుంది.
12 ఒకానొక పాపి నూరు చెడు పనులు చేసియుండవచ్చు, అతను దీర్గాయుష్షు కలిగియుండవచ్చు. అయినప్పటికీ, దేవుడిపట్ల విధేయత, గౌరవం కలిగివుండటం మేలన్న విషయం నాకు తెలుసు.
13 దుర్మార్గులు దేవుణ్ణి గౌరవించరు. అందుకని, నిజంగానే వాళ్లకి మంచి ఫలితాలు లభించవు. ఆ దుర్మార్గులు దీర్గకాలం జీవించరు. (సూర్యుడు కిందకి వాలిన కొద్ది) పొడుగయ్యే నీడల్లాగా వాళ్ల జీవితాలు దీర్గంకావు.
14 న్యాయంగా కనిపించని మరొకటి కూడా భూమి మీద సంభవిస్తూ ఉంటుంది. చెడ్డవాళ్లకి చెడు, మంచి వాళ్లకి మంచి జరగాలి. కాని, కొన్ని సందర్భాల్లో మంచి వాళ్లకి చెడు, చెడ్డవాళ్లకి మంచి జరుగుతూ ఉంటుంది. ఇది సరైనది కాదు.
15 అందుకని, జీవితాన్ని హాయిగా అనుభవించడం మరింత మెరగైనదని నేను తీర్మానించుకున్నాను. ఈ ప్రపంచంలో మనుష్యులు చెయ్య గలిగిన అత్యుత్తమమైన పనేమిటంటే, తినడం, తాగడం, జీవితాన్ని హాయిగా అనుభవించడమే. కనీసం అలా చేస్తేనైనా, తమ జీవితకాలంలో దేవుడు తమకిచ్చిన కఠిన శ్రమని మనుష్యులు సరదాగా సంతోషంగా చేసేందుకు అది తోడ్పడుతుంది.
16 ఈ ప్రపంచంలో మనుష్యులు చేసే పనులను నేను శ్రద్ధగా పరిశీలించాను. మనుష్యులు ఎంత హడావుడిగా ఉంటారో నేను చూశాను. వాళ్లు రాత్రింబగళ్లు శ్రమిస్తారు. వాళ్లు దాదాపు నిద్రేపోరు.
17 దేవుడు చేసేవాటిలో అనేకం కూడా నేను చూశాను. ఈ భూమిమీద దేవుడు చేసేదాన్నంతటినీ మనుష్యులు అర్థంచేసుకోలేరు. మనిషి వాటిని అర్థం చేసుకు నేందుకు ఎంతైనా ప్రయత్నించవచ్చు. కాని, అతను అర్థంచేసుకోలేడు. దేవుడు చేసినదాన్ని తాను అర్థం చేసుకున్నానని ఒక జ్ఞాని అనవచ్చు. కాని, అది నిజంకాదు.వాటన్నింటినీ ఏ ఒక్కడూ అర్థం చేసుకోలేడు.
1 నేనీ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించాను. సజ్జనులు, వివేకవంతులు చేసేవాటినీ, వాళ్లకి సంభవించేవాటినీ దేవుడు అదుపుచేస్తాడన్న విషయం నేను గమనించాను. తాము ప్రేమించబడతారో లేక ద్వేషింప బడతారో మనుష్యులకి తెలియదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనుష్యులకి తెలియదు.
2 అయితే, మనుష్యులందరికీ ఉమ్మడి అంశం ఒకటుంది మనుష్యులందరూ మరణించడమే అది! మంచివాళ్లూ మరణిస్తారు, చెడ్డవాళ్లూ మరణిస్తారు. చావు పరిశుద్ధులకీ వస్తుంది అపరిశుద్ధలకీ వస్తుంది. చావు బలులు ఇచ్చేవాళ్లకీ వస్తుంది, ఇవ్వనివాళ్లకీ వస్తుంది. పాపి ఎలా చనిపోతాడో, మంచివాడూ సరిగ్గా అలాగే చనిపోతాడు. దేవునికి ప్రత్యేకమైన ప్రమాణాలు చేసేవాళ్లూ ఆ ప్రమాణాలు చెయ్యనివాళ్ల మాదిరిగానే చనిపోతారు.
3 ఈ జీవితంలో సంభవించే వాటన్నింట్లోనూ పరమ దౌర్భాగ్యమైనదేమిటంటే, అందరూ ఒకేలాగ గతించడమే. అయితే, మనుష్యులు ఎల్లప్పుడూ పాపపు ఆలోచనలూ, మూర్ఖపు ఆలోచనలూ చేస్తూ వుంటారు, ఇది బాగా చెడ్డదే. ఆ ఆలోచనలు మరణానికి దారితీస్తాయి.
4 మనిషి ఇంకా బతికివుంటే, అతను ఎవరైనా, అతనికి ఆశ ఉంటుంది. అయితే, ఈ నానుడి నిజం చచ్చిన సింహం కంటె, బతికివున్న కుక్క మేలు.
5 బతికివున్న మనుష్యులకి తాము చనిపోతామన్న విషయం తెలుసు. అయితే చనిపోయిన మనుష్యులకి యేమీ తెలియదు. చనిపోయినవాళ్లకి యిక యే ప్రతిఫలము ఉండదు. జనం వాళ్లని త్వరలోనే మరచిపోతారు.
6 ఒక వ్యక్తి చనిపోయాక, అతని ప్రేమ, ద్వేషం, ఈర్ష్య అన్నీ అంతరించిపోతాయి. చనిపోయినవాళ్లు భూమిమీద జరిగే వేటిలోనూ ఏమీ, ఎన్నడు ఇక పాలుపంచుకోలేరు.
7 అందుకని, పో, పోయి తిండి తిను, దాంట్లోని ఉల్లాసాన్ని అనుభవించు. నీ ద్రాక్షారసం సేవించి, ఆనందం పొందు. ఈ పనులు దేవుని దృష్టిలో తప్పేమీ కావు.
8 చక్కటి దుస్తులు ధరించి, నిన్ను నీవు బాగా కనిపించేలా చూసుకో.
9 [This verse may not be a part of this translation]
10 నీకు పని దొరికిన ప్రతి సారి, నువ్వ దాన్ని నీ శాయశక్తులా అత్యుత్తమంగా చెయ్యి. సమాధిలో పనేమీ ఉండదు. అక్కడ ఆలోచన, జ్ఞానం, వివేకం ఏ ఒక్కటి ఉండదు. మనందరి గమ్యమూ ఆ మృత్యు స్థానమే.
11 ఈ ప్రపంచంలో నేను చూసిన సక్రమం కాని విషయాలు ఇంకా ఉన్నాయి: అతి వేగంగా పరిగెత్తేవాడు పరుగు పోటీలో ఎల్లప్పుడూ గెలవలేడు. అత్యంత బలీయమైన సైన్యమైనా యుద్ధంలో ఎల్లప్పుడూ గెలవలేదు. మిక్కిలి వివేకవంతుడు కూడా తాను సంపాదించిన ఆహారాన్ని ఎల్లప్పుడూ పొందలేడు. మిక్కిలి చురుకైనవాడు కూడా సంపదను ఎల్లప్పుడూ సాధించు కోలేడు. విద్యావంతుడికైనా ఎల్లప్పుడూ తనికి యోగ్యమైన ప్రశంస లభ్యంకాదు. చెడు కాలము దాపురించి నప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి.
12 తనకి మరు క్షణంలో ఏమి జరగనున్నదో మనిషికి ఎన్నడూ తెలియదు. మనిషి వలలో చిక్కిన చేపలాంటివాడు. ముందేమి జరగబోతున్నదీ ఆ చేపకి తెలియదు. అతను పంజరంలో చిక్కిన పక్షిలాంటివాడు, ఆ పక్షికి ముందేమి జరగనున్నది తెలియదు. అదే విధంగా, మనిషి కూడా తనకి ఆకస్మికంగా సంభవించే కీడుల బోనులో చిక్కుకుంటాడు.
13 ఈ భూమిమీద ఒక వ్యక్తి వివేకవంతమైన ఒక పని చెయ్యడం కూడా నేను చూశాను. అది చాలా ముఖ్యమైన పని అని నాకు అనిపించింది.
14 స్వల్ప జనాభా కలిగిన ఒక చిన్న పట్టణం వుంది. ఒక గొప్ప రాజు ఆ పట్టణం మీదకి దండెత్తి, దాని చుట్టూ తన సేనలను నిలిపాడు.
15 కాని, ఆ పట్టణంలో ఒక జ్ఞాని వున్నాడు. ఆ జ్ఞాని పేదవాడు. అయితే, అతను తన జ్ఞానాన్ని తన పట్టణాన్ని కాపాడేందుకు వినియోగించాడు. అన్నీ ముగిసిపోయాక, జనం అతన్ని గురించి మరచిపోయారు.
16 అయినప్పటికీ, ఆ జ్ఞానం ఆ బలం కంటె మెరుగైనదని నేనంటాను. ఆ జనం ఆ పేదవాని జ్ఞానం గురించి మరిచిపోయారు. అతని మాటలను ఆ జనం పట్టించుకోవడం మానేశారు. (అయినా కూడా ఆ జ్ఞానం మెరుగైనదని నేను నమ్ముతాను.)
17 మూర్ఖుడైన ఒక రాజు వేసే కేకల కంటె ఒక జ్ఞాని పలికే మెల్లని పలుకులు మరెంతో మెరుగైనవి .
18 యుద్ధంలో ఆయుధాల కంటె జ్ఞానం గొప్పది. అయితే ఒక్క మూర్ఖుడు ఎన్ని మంచి పనుల్నైనా పాడు చేయగలడు.
1 అత్యంత పరిమళ భరితమైన తైలాన్ని గబ్బు పట్టించేందుకు చచ్చిన కొద్దిపాటి ఈగలేచాలు. అదే విధంగా, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, మంటగలిపేందుకు కొద్దిపాటి మూర్ఖత్వం చాలు.
2 వివేకవంతుడి ఆలోచనలు అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. అయితే, అవివేకి అలోచనలు అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి.
3 మూర్ఖుడు అలా దారి వెంట పోయేటప్పుడు సైతం తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడు. దానితో, వాడొక మూర్ఖుడన్న విషయాన్ని ప్రతి ఒక్కడూ గమనిస్తాడు.
4 యజమాని కేవలం నీపట్ల కోపం ప్రదర్శించినంత మాత్రాన నువ్వు నీ కొలువు వదిలెయ్యబోకు. నువ్వు ప్రశాంతంగా, సాయంగా వుంటే, పెద్ద పెద్ద పొర పాట్లను కూడా నువ్వు సరిదిద్దవచ్చు .
5 ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు:
6 అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన సంపన్నులకు అప్రధానమైన పదవులు కట్టబెడతారు.
7 సేవకులుగా ఉండదగినవాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్లు (వాళ్ల సరసన బానిసల మాదిరిగా) నడుస్తూవుండటం నేను చూశాను.
8 గొయ్యి తవ్వే వ్యక్తి, తానే దానిలో పడవచ్చు. గోడ కూలగొట్టేవాణ్ణి పాము కాటెయ్యవచ్చు.
9 పెద్దబండలను దొర్లించేవాడికి వాటివల్లనే గాయాలు కావచ్చు. చెట్లు నరికేవాడికి కూడా ప్రమాదం లేకపోలేదు, (ఆ చెట్లు అతని మీద కూలవచ్చు.)
10 అయితే, పరిజ్ఞానంవుంటే, ఏ పనైనా సులభతరం అవుతుంది. మొండి కత్తితో కొయ్యడం చాలా కష్టం. అయితే, మనిషి దానికి పదును పెడితే, అప్పుడు పని సులభతరమవుతుంది. (జ్ఞానం అంత సున్నిత మైనది.)
11 ఒక వ్యక్తికి పాముల్ని ఎలా అదుపు చేయాలో తెలియవచ్చు. కాని, అతను అందుబాటులో లేనప్పుడు పాము ఎవరినైనా కాటేస్తే ఆ నైపుణ్యం వ్యర్థమే. (జ్ఞానం అలాంటిది.)
12 వివేకవంతుడి మాటలు ప్రశంసా పాత్రలు. అయితే అవివేకి మాటలు వినాశకరమైనవి.
13 ఆదిలోనే మూర్ఖుడు అవకతవకగా మాట్లాడతాడు. చివర్లో ఇక అతనివి ఉన్మత్త ప్రలాపాలుగా ముగుస్తాయి.
14 అజ్ఞాని ఎడతెగకుండా (తను చెయ్యబోయే వాటిని గురించి) మాట్లాడతాడు. అయితే, భవిష్యత్తులో ఏమి జరగబోయేది ఎవరికీ తెలియదు. తర్వాత ఏమి జరిగేది. ఏ ఒక్కడికి తెలియదు.
15 తన గమ్యానికి చేరుకునే మార్గం యేమిటో తెలుసుకునే నేర్పు మూర్ఖుడికి వుండదు, అందుకే అతను జీవితకాలమంతా కష్టించి పని చెయ్యాలి.
16 రాజు శిశుప్రాయుడైనా, బానిస అయినా ఆ రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదులతోనే వినియోగించేవాళ్లయితే, ఆ దేశానికి చాలా చెరుపే జరుగుతుంది.
17 ఒక దేశపు రాజు కులీనుడైతే, ఆ దేశానికి ఎంతో మంచి జరుగుతుంది . దేశాధికారులు తిండిపోతులు, తాగుబోతులు కాక, శక్తి పుంజుకు నేందుకు మాత్రమే అన్నపానాలు మితంగా సేవించే వారైతే, ఆ దేశానికి ఎంతో క్షేమం.
18 మనిషి మరి బద్ధకస్తుడైతే అతని ఇల్లు కురవనారంభిస్తుంది, ఇంటి పైకప్పు కూలి పోతుంది.
19 మనుష్యులకి తిండి సంతృప్తి నిస్తుంది, ద్రాక్షారసం వాళ్లని మరింత ఆనంద పరుస్తుంది. అయితే, డబ్బుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.
20 రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవులుంటాయి. నువ్వన్న మాటలన్నీ పిట్టలు చేర వేస్తాయి. వాళ్లకి చేరుతాయి.
1 నువ్వెక్కడకి వెళ్లినా అక్కడ మంచి పనులు చెయ్యి. కొంతకాలం గడిచాక నీ మంచి పనులనే విత్తులు మొలకలెత్తి పంట రూపంలో నీకు తిరిగి వస్తాయి .
2 నీకున్నది వేర్వేరు వాటిమీద మదుపు పెట్టు . ప్రపంచంలో ఏమి చెడుగులు సంభవించనున్నాయో నీకు తెలియదు.
3 (నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలిగిన విషయాలు కొన్ని వున్నాయి.) మేఘాలు నీళ్లతో నిండివుంటే, అవి నేలపై వర్షిస్తాయి. చెట్టు నేలపైన కూలితే కూలినది ఉత్తరానికైనా, దక్షిణానికైనా అది పడ్డచోటునే వుంటుంది.
4 (అయితే, కొన్ని విషయాలు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోలేవు. అలాంటప్పుడు, నువ్వు సాహసించి ఏదో ఒకటి చెయ్యాలి.) మంచి వాతావరణం పరిస్థితులకోసం ఎదురు చూసేవాడు ఎన్నడూ తన విత్తనాలు చల్లలేడు. ప్రతి మేఘమూ వర్షించేస్తుందని భయపడే వాడు తన పంట కుప్పలు ఎన్నడూ నూర్చుకోలేడు.
5 గాలి ఎటు వీస్తుందో నీకు తెలియదు. బిడ్డ తన తల్లి గర్భంలో ఎలా పెరుగుతుందో నీకు తెలియదు. అలాగే, దేవుడు యేమి చేస్తాడో నీకు తెలియదు, కాని, అన్నీ జరిపించేది ఆయనే.
6 అందుకని, ప్రొద్దుటే నాట్లు వెయ్యడం మొదలెట్టు. సాయంత్రమయ్యేదాకా పని చాలించకు. ఎందుకంటే, ఏవి నిన్ను సంపన్నుని చేస్తాయో నీకు తెలియదు. ఏమో, నీ పనులు అన్నీ జయప్రదమవుతాయేమో.
7 బతికి ఉండటం మంచిది! సూర్యకాంతి కళ్లకి యింపు గొలుపుతుంది.
8 నువ్వు ఎంత కాలం జీవించినా, నీ జీవితంలో ప్రతి ఒక్క రోజునూ అనుభవించు. అయితే, ఏదో ఒక రోజున నువ్వు మరణించక తప్పదని గుర్తుంచుకో. నీ జీవిత కాలంకంటె, నీ మరణానంతర కాలం చాలా ఎక్కువ. నువ్వు మరణించాక, నువ్వు చెయ్యగలిగినది శూన్యం, ఏమీ ఉండదు!.
9 అందుకని, యువజనులారా, మీ యౌవ్వన కాలంలోనే మీరు సుఖాలు అనుభవించండి. ఆనందంగా ఉండండి! మీ మనస్సుకి ఏది తోస్తే, మీరు ఏది కోరుకుంటే అది చెయ్యండి. అయితే, మీరు చేసే పనులన్నింటికీ దేవుడు మిమ్మల్ని విచారిస్తాడని మాత్రం మరిచిపోకండి.
10 మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి . ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థలుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.
1 చెడ్డకాలం దాపురించక ముందు (నీవు ముసలి వాడవు కాకముందు), “నా జీవితం వృథా చేసు కున్నాను “ అని నువ్వు వాపోయే వయస్సు రాక ముందు, నువ్వింకా యౌవ్వనావస్థలో వుండగానే నీ సృష్టికర్తని నువ్వు గుర్తుచేసుకో.
2 సూర్య చంద్రులూ, నక్షత్రాలూ నీ కంటి దృష్టికి ఆనని కాలం దాపురించక పూర్వం, (నువ్వింకా యౌవన ప్రాయంలో ఉండగానే, నీ సృష్టికర్తని నువ్వు జ్ఞాపకం చేసుకో). ఒక తుఫాను తర్వాత మరొక తుఫాను వచ్చినట్లే, (కష్టాలు పదే పదే వస్తాయి).
3 ఆ వయస్సులో నీ చేతులు శక్తి కోల్పోతాయి. నీ కాళ్లు బలము లేక వంగుతాయి. నీ పళ్లు ఊడిపోతాయి, నువ్వు నీ ఆహారం నమలలేవు. నీ కళ్లు మసకబారతాయి.
4 నీ వినికిడి శక్తి మందగిస్తుంది. వీధుల్లోని శబ్దాలు నీకు వినిపించవు. నీ గోధుమలు విసిరే తిరగలి శబ్దం కూడా నీకు వినిపించదు. స్త్రీలు పాడే పాటలు కూడా నువ్వు వినలేవు. అయితే, పక్షి చేసే కిలకిలారావానికే నీకు వేకువజామున మెలుకువ వచ్చేస్తుంది. (మరెందుకో కాదు, నీకు నిద్రరాదు, అందుకు.)
5 ఎత్తయిన ప్రదేశాలంటే నీకు భయం వేస్తుంది. నీ దోవలో ఏ చిన్న వస్తువు ఉన్నా, దానిమీద కాలువేస్తే ఎక్కడ బోల్తాపడిపోతానో అని నీకు బెదురు కలుగు తుంది. నీ జుట్టు నెరిసి, బాదం చెట్టు పూతలా కనిపిస్తుంది. నువ్వు కాళ్లీడ్చుకుంటూ మిడతలా నడుస్తావు. నువ్వు నీ కోరికను కోల్పోతావు (జీవించటానికి). అప్పుడిక నువ్వు నీ శాశ్వత నివాసానికి (సమాధిలోకి) పోతావు. (నీ శవాన్ని సమాధికి మోసుకెళ్తూ) విలాపకులు వీధుల్లో గుమిగూడి శోకనాలు పెడతారు.
6 నీ వెండి మొలతాడు తెగక ముందే, బంగారు గిన్నె నలగక ముందే. బావి దగ్గర పగిలిన మట్టి కుండలా, (నీ జీవితం వృథా కాక ముందే) పగిలి బావిలో పడిపోయిన రాతి మూతలా నీ జీవితం వృథా కాకముందే నీ యౌవనకాలంలోనే నువ్వు నీ సృష్టికర్తను స్మరించుకో.
7 మట్టిలో నుంచి పుట్టిన నీ శరీరం నువ్వు మరణించినప్పుడు తిరిగి ఆ మట్టిలోనే కలిసి పోతుంది. కానీ, దేవుని దగ్గర్నుంచి వచ్చిన నీ ఆత్మ నువ్వు మరణించినప్పుడు తిరిగి ఆ దేవుడి దగ్గరకే పోతుంది.
8 అంతా వ్యర్థం, శుద్ధ అర్థరహితం. ఇదంతా కాలాన్ని వ్యర్థం చెయ్యడం అంటాడీ ప్రసంగి!
9 ప్రసంగి గొప్ప జ్ఞాని. ఆయన తన జ్ఞానాన్ని జనానికి బోధ చేసేందుకు వినియోగించాడు. అనేక వివేకవంతమైన బోధనలను అయన ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసి, జాగ్రత్తగా విభజించాడు .
10 ప్రసంగి సరైన పదాలు ఎంచుకునేందుకు చాలా శ్రమించాడు. ఆయన యధార్థమైన, ఆధారపడదగిన ఉపదేశాలు రచించాడు.
11 జ్ఞానుల మాటలు, జనం తమ పశువులను సరైన బాటలో నడిపేందుకు ఉపయోగించే ముల్లు కర్రల వంటివి. ఆ ఉపదేశాలు విరగని గట్టి గూటాల వంటివి. (నీకు సరైన జీవన మార్గాన్ని చూపే సరైన మార్గదర్శులుగా నువ్వా బోధనల పైన ఆధారపడవచ్చు) ఆ జ్ఞానోపదేశాలన్నీ ఒకే కాపరి (దేవుని) నోట నుండి వచ్చినవి.
12 అందుకని కుమారుడా, (ఆ ఉపదేశాలను అధ్యయనం చెయ్యి) అయితే ఇతర గ్రంథాలను గురించి ఒక హెచ్చరిక. రచయితలు గ్రంథాలు ఎప్పుడూ వ్రాస్తూనే ఉన్నారు. అతిగా అధ్యయనం చేయడం నీకు చాలా అలసట కలిగిస్తుంది .
13 [This verse may not be a part of this translation]
14 [This verse may not be a part of this translation]