1

1 ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక మైనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు.

2 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమారైలుండిరి.

3 యోబుకు ఏడు వేల గొర్రెలు, మూడు వేల ఒంటెలు, వెయ్యి ఎద్దులు, ఐదు వందల ఆడ గాడిదలు సొంతంగా ఉన్నాయి. వీటికి తోడు అతనికి చాలా మంది పనివాళ్లు ఉన్నారు. తూర్పు ప్రాంతంలో యోబు మిక్కిలి ధనవంతుడుగా ఉండేవాడు.

4 యోబు కుమారులు వంతుల ప్రకారం వారి ఇండ్లలో విందులు చేసుకొంటూ, వారి సోదరీలను ఆహ్వానిస్తుండేవారు.

5 యోబు పిల్లలు విందు చేసు కొన్న తర్వాత, అతడు ఉదయం పెందలాడే లేచేవాడు. అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కోక్క దహనబలి అర్పించేవాడు. “ఒకవేళ నా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండి, వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశారేమో” అని అతడు తలచేవాడు. తన పిల్లలు వారి పాపాల విషయంలో క్షమించబడాలని అతడు ఎల్లప్పుడు ఇలా చేస్తూ ఉండేవాడు.

6 అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూతలతోబాటు సాతానుకూడ వచ్చాడు.

7 “ఎక్కడి నుండి వస్తున్నావు?” అని సాతానును యెహోవా అడిగాడు. “నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని యెహోవాకు సాతాను జవాబు చెప్పాడు.

8 అంతట యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు చూశావా? భూమి మీద అతనిలాంటి వారు ఎవ్వరూ లేరు. యోబు నిజంగా మంచి మనిషి మరియు నమ్మకమైనవాడు. అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. దుర్మార్గపు పనులకు అతడు దూరంగా ఉంటాడు” అని సాతానుతో అన్నాడు.

9 “ఓ తప్పకుండా! కానీ యోబు దేవుణ్ణి ఆరాధించటానికి ఒక గట్టి కారణం ఉంది!

10 అతణ్ణి, అతని కుటుంబాన్ని, అతనికి ఉన్న సర్వాన్ని నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నావు. అతడు చేసే ప్రతిపనిలో నీవు అతణ్ణి విజయుణ్ణి చేస్తున్నావు. అవును, నీవు అతణ్ణి ఆశీర్వదించావు. అతడు చాలా ధనికుడు గనుక అతని పశువుల మందలు, గొర్రెల మందలు దేశం అంతటానిండి ఉన్నాయి.

11 కానీ అతనికి ఉన్న సర్వాన్నీ నీవు గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా, నీముఖం మీదనే శపిస్తాడని ప్రమాణం చేస్తున్నాను” అని సాతాను జవాబిచ్చాడు.

12 “సరే, యోబుకు ఉన్న వాటన్నింటికీ నీవు ఏమైనా చేయి. కాని అతని శరీరానికి మాత్రం హానిచేయవద్దు” అని యెహోవా సాతానుతో చెప్పాడు. అప్పుడు సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు.

13 ఒకరోజు యోబు కుమారులు, కుమారైలు అతని జ్యేష్ఠ కుమారుని ఇంటివద్ద తినుచూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు.

14 అంతలో ఒక సందేశకుడు యోబు దగ్గరకు వచ్చి, “ఎడ్లు దున్నుతూ, ఆ దగ్గరలోనే గాడిదలు గడ్డి మేస్తూ వుండగా,

15 షెబాయీయులు మా మీద దాడి చేసి నీ జంతువులను తీసుకొనిపోయారు! నన్ను తప్ప మిగిలిన నీ సేవకులనందరినీ షెబాయీయులు చంపేశారు. నీతో చెప్పటానికే నేనొక్కడినే తప్పించుకొన్నాను” అని చెప్పాడు.

16 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరో సందేశకుడు యోబు దగ్గరకు వచ్చాడు. “ఆకాశంనుండి మెరుపుల ద్వారా అగ్నిపడి నీ గొర్రెలను, సేవకులను కాల్చివేసింది. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను!” అని రెండో సందేశకుడు చెప్పాడు.

17 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడు తూండగానే ఇంకో సందేశకుడు వచ్చాడు. “కల్దీయులు పంపిన మూడు గుంపులవారు వచ్చి మా మీద పడి ఒంటెలను తీసుకొని పోయారు. పైగా వారు సేవకులను చంపేశారు. నీతో చెప్పేందుకు నేనొక్కణ్ణి మాత్రం తప్పించుకొన్నాను” అని ఈ మూడో సందేశకుడు చెప్పాడు.

18 మూడో సందేశకుడు ఇంకా చెబుతూ ఉండగానే మరో సందేశకుడు వచ్చాడు. “నీ పెద్ద కుమారుని యింటి వద్ద నీ కుమారులు, కుమారైలు భోజనం చేస్తూ, ద్రాక్షారసం తాగుతూ ఉండగా.

19 అకస్మాత్తుగా ఎడారినుండి ఒక బలమైన గాలి వీచి ఇంటిని పడ గొట్టేసింది. ఆ ఇల్లు నీ కుమారులు, కుమారైల మీద పడగానేవారు మరణించారు. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను” అని నాలుగో సందే శకుడు చెప్పాడు.

20 యోబు ఇది వినగానే తన విచారాన్ని, కలవరాన్ని తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని, తలగుండు చేసుకొన్నాడు. తరువాత యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు.

21 అతడు ఇలా చెప్పాడు: “నేను ఈ లోకంలో పుట్టినప్పుడు నేను దిగంబరిని, నాకు ఏమీ లేదు. నేను మరణించి లోకాన్ని విడిచి పెట్టేటప్పుడు నేను దిగంబరినిగా ఉంటాను. నాకు ఏమీ ఉండదు. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామాన్ని స్తుతించండి!”

22 ఇవన్నీ సంభవించినా కానీ యోబు మాత్రం పాపం చేయలేదు. అతడు దేవుణ్ణి నిందించనూలేదు.

2

1 మరో రోజు దేవదూతలు యెహోవాను కలుసు కొనేందుకు వచ్చారు. సాతాను వారితో కూడా ఉన్నాడు. సాతాను యెహోవాను కలుసుకొనేందుకు వచ్చాడు.

2 “ఎక్కడికి వెళ్లావు?” అని సాతానును యెహోవా అడిగాడు. “నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని సాతాను యెహోవాకు జవాబు ఇచ్చాడు.

3 “నా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? భూమి మీద ఎప్వరూ అతని వంటివారు లేరు. నిజంగా అతడు మంచి మనిషి. అతడు తన దేవుడనైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు” అని సాతానుతో యెహోవా అన్నాడు.

4 “చర్మానికి చర్మం బతికి ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు.

5 అతని శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే, అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు!” అని సాతాను జవాబు ఇచ్చాడు.

6 “సరే, యోబు నీ అధికారం కింద ఉన్నాడు. కాని అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు” అని సాతానుతో యెహోవా చెప్పాడు.

7 అప్పుడు సాతాను యెహోవా దగ్గర నుండి వెళ్లిపోయి, యోబుకు బాధకరమైన పుండ్లు కలిగించాడు. యోబు అరికాలు మొదలుకొని నడి నెత్తివరకు, అతని శరీరం అంతటా బాధకరమైన పుండ్లు ఉన్నాయి.

8 కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు. అతడు తన పుండ్లను గీకుకొనేందుకు ఒక చిల్లపెంకు ఉపయోగించాడు.

9 యోబు భార్య, “ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? నీ వెందుకు దేవుణ్ణి శపించి, చావకూడదు?” అని అతనితో అంది.

10 యోబు తన భార్యతో, “నీవు తెలివి తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు! దేవుడు మనకు మంచి వాటిని ఇచ్చినప్పుడు, మనం వాటిని స్వీకరిస్తున్నాం. కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి గాని ఆరోపణ చేయకూడదు” అని జవాబిచ్చాడు. ఇవన్ని జరిగినప్పటికీ కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి విరుద్ధంగా ఏమియు మాట్లాడనూలేదు.

11 తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైన బిల్దదు, నయమాతీవాడైన జోఫరు అనే ముగ్గురు యోబుకు స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతుల నన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట సమావేశయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు.

12 కాని ఆ స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకొన్నారు.

13 తరువాత ఆ ముగ్గురు స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు.

3

1 అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు.

2 [This verse may not be a part of this translation]

3 [This verse may not be a part of this translation]

4 ఆ రోజు చీకటి అవును గాక. ఆ రోజును దేవుడులక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.

5 ఆ రోజు మరణాంధకారమవును గాక. ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక. నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక.

6 గాఢగంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక. ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక. ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు.

7 ఆ రాత్రి ఎవడును జననం కాకపోపును గాక. ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక.

8 “శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక. సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుషులు వారు.

9 ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక. ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక. కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక. ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.

10 ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు. (అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.

11 నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు? నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?

12 నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది? నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి?

13 నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి.

14 భూమి మీద బతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.

15 నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును. వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!

16 నేను పుట్టినప్పుడే చనిపోయి, మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు? ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే ఎంత బాగుండును.

17 చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర కలిగించటం మానివేస్తారు. అలసిపోయిన మనుష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది.

18 ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు. కాపలాదారుల స్వరం వారు వినరు.

19 ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల ప్రజలు సమాధిలో ఉంటారు. మరియు బానిస తన యజమాని నుండి విడుదల అవుతాడు.

20 శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బతుకుతూ ఉండనియ్యటం ఎందుకు? ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?

21 ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు. విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.

22 ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు. వారు పాతిపెట్ట బడినప్పుడు ఆనందిస్తారు.

23 దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు. వారి చుట్టూ ఒక గోడ కడతాడు.

24 నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను. కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి.

25 నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను. అలానే జరిగింది నాకు!

26 నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”

4

1 [This verse may not be a part of this translation]

2 [This verse may not be a part of this translation]

3 “యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉపదేశాన్ని చేసావు. బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు.

4 తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి. బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు.

5 కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు. కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు!

6 నీవు దేవున్ని ఆరాధిస్తూ ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు. కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి. నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక.

7 “యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు నిర్దోషియైన మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం చేయబడలేదు. మంచి మనుష్యులు ఎన్నడూ నాశనం చేయబడలేదు.

8 కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను. వారికి కూడా అవే సంభవిస్తాయి.

9 దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది. దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది.

10 దుర్మార్గులు సింహాలవలె గర్జించి గుర్రు పెడతారు. కాని దేవుడు దుర్మార్దులను నోరు మూయిస్తాడు. మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు.

11 దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు. వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు.”

12 “రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది. ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి.

13 రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా అది నా నిద్రను భంగం చేసింది.

14 నేను భయపడి వణకిపోయాను. నా ఎముకలన్నీ వణకిపోయాయి! ఎలీఫజు మాట్లాడుతున్నాడు

15 ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా నా శరీరం మీది వెంట్రుకలు వేగంగా చలించాయి!

16 ఆత్మ ఇంకా నిలిచి ఉంది. కాని అదేమిటో నేను చూడలేకపోయాను. ఒక ఆకారం నా కళ్ల ఎదుట నిలిచింది. నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పడం విన్నాను.

17 ‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు. మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు.

18 దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు. తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు

19 కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి ఎక్కవ తప్పులు పట్టుకోగలడు. మనుష్యులు మట్టి ఇండ్లలో నివసిస్తారు. ఈ మట్టి ఇండ్లవునాదులు మట్టిలో ఉన్నాయి. వారు చిమ్మెట కంటే తేలికగా చాపగొట్టబడతారు.

20 సూర్వోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మనుష్యులు మరణిస్త్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు. వారు శాశ్వతంగా నశించిపోతారు.

21 వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి, ఈ మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.’

5

1 “యోబు, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు! నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు!

2 తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది. బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది.

3 బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు). అయితే అకస్మాత్తుగా వాని ఇల్లు శపించబడింది.

4 ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు. (న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.

5 ఆ బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు. ఆకలిగొన్న ఆ మనుష్యలు ముండ్లలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా తీసుకొంటారు. ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని తీసుకొంటారు.

6 చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు. కష్టం నేలలో నుండి పెరగదు.

7 నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత నిశ్చయంగా మనిషి కష్టం కోసమే పుట్టాడు.

8 “కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి నా సమస్య ఆయనతో చెబుతాను.

9 దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు. దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.

10 దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు. ఆయన పొలాలకు నీళ్లు పంపిస్తాడు.

11 దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు. దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోష పరుస్తాడు.

12 తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను వివారిస్తాడు.

13 దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు. అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.

14 పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీక టిలో వలె తడబడుతారు. మధ్యాహ్నపు వేళల్లో సైతం రాత్రిపూటలా తడువులాడుతారు.

15 దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు. బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే రక్షిస్తాడు.

16 కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది. న్యాయంగా లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు.

17 “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు. కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను శిక్షించి నప్పుడు, దానిని తోసిపుచ్చకు.

18 దేవుడు చేసిన గాయాలకు ఆయన కట్లు కడతాడు. ఆయనే గాయపరుస్తాడు, కాని ఆయన చేతులే తిరిగి స్వస్థపరుస్తాయి.

19 ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు; అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.

20 కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను మరణంనుండి రక్షిస్తాడు. యుద్ధంలో దేవుడు నిన్ను మరణం నుండి కాపాడుతాడు.

21 మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను రక్షాస్తాడు. నాశనం వచ్చినప్పుడు నీవు భయ పడాల్సిన పనిలేదు.

22 నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు. అడవి జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు.

23 నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు. మరియు అడవి మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు.

24 నీ గుడారం క్షేమంగా ఉంది గనుక నీవు శాంతంగా జీవిస్తావు. నీవు నీ ఆస్తి లెక్కించగా ఏదీ పోయి ఉండదు.

25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు. నేలమీద గడ్డి పరకల్లా నీ పిల్లలు చాలామంది ఉంటారు.

26 కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు. అవును, నీవు పక్వమయిన వృద్ధాప్యం వరకు జీవిస్తావు.

27 “యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు. అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”

6

1 [This verse may not be a part of this translation]

2 [This verse may not be a part of this translation]

3 సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు! అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి.

4 సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి. ఈ బాణాల విషం నా ఆత్మ తాగు తుంది. దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపినాకు విరోధంగా ఉంచబడ్డాయి.

5 (ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు. ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు.

6 రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా? గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.

7 (ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకో వటానికి గూడా ఒప్పుకోను; అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.

8 “నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను. నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను.

9 దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి, నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను!

10 ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను. ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు.

11 “నా బలం క్షిణించిపోయింది, గనుక నేను ఇంకా బతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు. చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు.

12 బండలాంటి బలం నాకు లేదు. నా శరీరం కంచుతో చేయబడలేదు.

13 ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు. ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది.

14 “ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి. ఒక మనిషి, తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి.

15 కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. నేను మీ మీద ఆధారపడలేదు. ఒక్కొక్కప్పుడు ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలు వల్లా ఉన్నారు మీరు.

16 మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్నప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు.

17 కానీ ఆ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు. వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు. కాలువలు ప్రవహించవు.

18 వ్యాపారస్థుల బృందాలు వారి మార్గాలలోని మలుపులు కొసలు తిరిగి పనికిమాలిన నేల మీదకు వెళ్లి అక్కడ మరణిస్తారు.

19 తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు. షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోసం) చూస్తూరు.

20 నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు. కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు.

21 ఇప్పుడు మీరూ ఆ కాలువల్లా ఉన్నారు. మీరు సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి భయపడుతున్నారు.

22 నాకు ఏమైనా ఇవ్వండి, మీ ఐశ్వర్యంలోనుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు.

23 ‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి. మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు.

24 కనుక, ఇప్పుడు నాకు నేర్పించండి. నేను నెమ్మదిగా ఉంటాను. నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి.

25 నిజాయితీ మాటలు శక్తి గలవి. కానీ మీ వాదాలు దేనినీ రుజువు చేయవు.

26 నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా? మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా?

27 అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం మీరు జూదమైనా సరే ఆడతారు. మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకొంటారు.

28 కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి. నేను మీతో ఆబద్ధం చెప్పను.

29 కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యాయంగా ఉండవద్దు. అవును, మళ్లీ ఆలోచించండి. నేను తప్పు ఏమీ చేయలేదు.

30 నేను అబద్ధం చెప్పటం లేదు. నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.”

7

1 యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంషుర్షణ ఉంది. అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది.

2 ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి. జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి.

3 అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడు తోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి. శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి.

4 నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను, ‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ అనే రాత్రి జరుగుతూనే ఉంటుంది. సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను.

5 నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది. నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది.

6 నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి. నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది.

7 దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో. నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు.

8 నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు. నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను.

9 ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది. అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు.

10 అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు. అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు.

11 అందుచేత నేను మౌనంగా ఉండను. నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది. నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.

12 ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు? నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా?

13 నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి

14 కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపె డుతున్నావు. దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు.

15 అందుచేత బతకటం కంటె గొంతు నులుమి చంపబడటం నాకు మేలు.

16 నా బదుకు నాకు అసహ్యం. నేను శాశ్వతంగా జీవించాలని కోరను నన్ను ఒంటరిగా ఉండనివ్వు. నా జీవితానికి అర్థం శూన్యం.

17 దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి? మనిషికి నీవసలు గుర్తింవు ఎందుకు ఇవ్వాలి?

18 నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు, ప్రతిక్షణం ఎందుకు పరీక్షీస్తావు?

19 దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు? ఒక క్షణమైన నీవు నన్ను, ఒంటరిగా ఉండనియ్యవు?

20 మనుష్యులను గమనించువాడా, నేను పాపం చేశానంటావా, సరే మరి నన్నేం చేయమంటావు? దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు? నేను నీకు ఒక భారమై పోయానా?

21 నీవు నా తప్పిదాలు క్షమించి, నా పాపాలను ఎందుకు క్షమించకూడదు? త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను. అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.”

8

1 అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:

2 “ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు? నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.

3 దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు. సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వ శక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు.

4 నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు. వారు వారి పాపాలకు వెల చెల్లించారు.

5 అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు. ఆ సర్వశక్తిమంతునికి ప్రార్థించు.

6 నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు. మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు.

7 నీకు మొదట ఉన్నదానికంటె ఎక్కువగా వస్తుంది.

8 వబూ వృద్ధులను అడిగి వారుతమ పూర్వీకుల నుండి ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో.

9 ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక. మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.

10 చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు. వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.”

11 బిల్దదు చెప్పాడు,”ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా?

12 లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి. వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి.

13 దేవుణ్ణి మరచిపోయే ఏ మనిషైనా సరే ఆ రెల్లులాగానే ఉంటాడు. దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు.

14 ఆ మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది. ఆ మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.

15 ఆ మనిషి సాలెగూటిమీద ఆనుకోగా ఆ గూడు తెగిపోతుంది. అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.

16 సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు. ఆ మొక్క కొమ్ములు తోట అంతటా వ్యాపిస్తాయి.

17 అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి ఆ బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.

18 కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.’నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడ లేదు’ అని ఆ తోట అంటుంది.

19 కనుక ఆ మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే. తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.

20 నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు. చెడ్డ మనుష్యలకు ఆయన సహాయం చేయడు.

21 అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను, నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు.

22 కానీ నీ శత్రవులను దేవుడు సిగ్గుపరుస్తాడు. దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.

9

1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

2 “అవును, నీవు చెప్పేది సత్యమే అని నాకు తెలుసు. అయితే మానవుడు దేవుని దృష్టిలో ఎలా నిర్దోషిగా ఉండగలడు?

3 ఒక మనిషి దేవునితో వాదించలేడు. దేవుడు వెయ్యి ప్రశ్నలు అడుగవచ్చు. కానీ ఒక్కదానికి కూడా ఏ మనిషీ జవాబు యివ్వలేడు.

4 దేవుని జ్ఞానం లోతైనది, ఆయన శక్తి గొప్పది. దేవునితో పోరాడిన ఏ మనిషీ బాధపడకుండా తప్పించుకోలేడు.

5 దేవుడు పర్వతాలను కదిలిస్తాడు. కాని వాటికి తెలియదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు పర్వతాలను తలక్రిందులు చేస్తాడు.

6 భూమిని కంపింప చేయటానికి దేవుడు భూకంపాలను పంపిస్తాడు. భూమి పునాదులను దేవుడు కంపిపజేస్తాడు.

7 దేవుడు సూర్యునితో మాట్లాడి దానిని ఉదయించకుండా చేయగలడు. ప్రకాశించకుండా, నక్షత్రాలకు ఆయన తాళం వేసి పెట్టగలడు.

8 దేవుడే ఆకాశాలను చేశాడు. మహాసముద్ర తరంగాల మీద ఆయన నడుస్తాడు.

9 [This verse may not be a part of this translation]

10 మనుష్యులు గ్రహించలేని ఆశ్చర్యకర కార్యాలను దేవుడు చేస్తాడు. దేవుని మహా అద్భుతాలకు అంతం లేదు.

11 దేవుడు నన్ను దాటి వేళ్లేటప్పుడు నేను ఆయనను చూడలేను. దేవుడు పక్కగా వెళ్లేటప్పుడు ఆయన గొప్పతనాన్ని నేను గ్రహించలేను.

12 దేవుడు దేనినై నా తీసివేస్తే, ఏ ఒక్కరూ ఆయన్ని వారించలేరు. ‘ఏమిటి నీవు చేస్తున్నది?’ అని ఎవ్వరూ ఆయనతో అనలేరు.

13 దేవుడు తన కోపాన్ని తగ్గించుకోడు. రాహాబు సహాయకులకు కూడా దేవుడంటే భయం.”

14 యోబు ఇంకా ఇలా చెప్పాడు: “కనుక నేను దేవునితో వాదించలేను. ఆయనతో వాదించేందుకు నేను వాడాల్సిన మాటలు నాకు తెలియవు.

15 యోబు అనే నేను నిర్దోషిని. కానీ ఆయనకు నేను జవాబు ఇవ్వలేను. నా న్యాయమూర్తిని (దేవుని) ప్రాధేయపడడం మాత్రమే నేను చేయగలిగింది అంతా.

16 ఒకవేళ నేను ఆయనకు మొరపెట్టినా, ఆయన జవాబిచ్చినా, దేవుడు నా ప్రార్థన విన్నాడని నేను నమ్మను.

17 నన్ను అణచివేయటానికి దేవుడు తుఫానులు పంపిస్తాడు. ఏ కారణం లేకుండానే ఆయన నాకు ఇంకా ఎక్కువ గాయాలు కలిగిస్తాడు.

18 దేవుడు నన్ను మళ్లీ శ్వాస పీల్చనీయడు. ఆయన నన్ను ఇంకా ఎక్కువ కష్టపెడతాడు.

19 నేను దేవుణ్ణి ఓడించలేను. దేవుడు శక్తిమంతుడు. దేవుని న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం చేకూర్చేటట్టు నేను చేయలేను. దేవుణ్ణి న్యాయస్థానానికి రమ్మని ఆయనను ఎవరు బలవంతం చేస్తారు?

20 యోబు అనే నేను నిర్దోషిని, కాని నేను చెప్పే మాటలు నేను దోషిలా కనబడేటట్టు చేస్తాయి. కనుక, నేను నిర్దోషిని, కాని నా నోరు నేను దోషిని అని ప్రకటిస్తుంది.

21 నేను నిర్దోషిని, కాని నన్ను గూర్చి నేను లక్ష్య పెట్టను. నా సోంత జీవితం నాకు అసహ్యం.

22 జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కనుక ‘దేవుడు నిర్దోషులను, దుర్మార్గులను కూడా నాశనం చేస్తాడు’ అని నేను తలస్తాను.

23 ఏదో ఒక దారుణం జరిగి ఒక నిర్దోషి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు అతని శ్రమను చూసి దేవుడు నవ్వుతాడు.

24 భూమిని దుర్మార్గుడు చేజిక్కించుకున్నప్పుడు దేవుడు న్యాయమూర్తులను గుడ్డివాళ్లను చేస్తాడా? ఇది దేవుడు చేయకపోతే ఇంకెవరు చేశారు?

25 “పరుగెత్తేవాని కంటె వేగంగా నా రోజులు గడిచి పోయాయి. నా రోజులు ఎగిరిపోతున్నాయి, వాటిలో సంతోషం లేదు.

26 జమ్ము పడవలు పోయేలా నా రోజులు వేగంగా పోతున్నాయి. పక్షిరాజులు తాము పట్టుకొన్న జంతువుల మీదికి దూసుకు వచ్చినట్టుగా నా రోజులు వేగంగా గడిచి పోతున్నాయి.

27 “నేను ఆరోపణలు చేయను, నేను నా బాధ మరచిపోతాను, నా ముఖం మార్చుకొని, నవ్వుతూ ఉంటాను’ అని ఒక వేళ నేను చెప్పినా,

28 నాకు నా శ్రమ అంతటిని గూర్చి ఇంకా భయమే. ఎందుకంటే నేను దోషిని అని దేవుడు ఇంకా చెబుతున్నాడని నాకు తెలుసు గనుక.

29 నేను దోషిని అని ఇది వరకే తీర్పు తీర్చబడింది. కనుక నేను ఇంకా ఎందుకు వ్రయత్నిస్తూ ఉండాలి. పోనీ దానిని, ‘మర్చిపో’ అని అంటాను నేను.

30 మంచుతో నన్ను నేను కడుగుకొన్నా, సబ్బుతో నేను నా చేతులు కడుగుకొన్నా

31 దేవుడు నన్ను చావు గోతిలొ పడవేస్తాడు. అప్పుడు నా వస్త్రాలే నన్ను ద్వేషిస్తాయి.

32 దేవుడు నాలా మనిషి కాడు. అందుకే నేను ఆయనకు జవాబు ఇవ్వలేను. న్యాయస్థానంలో మేము ఒకరి నొకరం కలుసుకొలేం.

33 మాకు మధ్య నిలబడేందుకు ఎవరైనా ఉంటే బాగుండును. మా ఇద్దరికీ న్యాయంగా తీర్పు తీర్చేవారు ఎవరైనా ఉంటే బాగుండును.

34 దేవుని శిక్షా దండాన్ని తీసువేసుకొనే వారు ఎవరైనా ఉంటే బాగుండును. అప్పుడు దేవుడు నన్ను ఇంకెంత మాత్రము భయపెట్టడు.

35 అప్పుడు నేను దేవునికి భయపడకుండా నేను చెప్పదలచుకొన్నది చెప్పగలుగుతాను. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను.

10

1 “నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందు చేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను. నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను.

2 నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు. నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం?

3 దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా? చూస్తుంటే, నీవు చేసిన దాని గూర్చి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా?

4 దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా? మనుష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తున్నావా?

5 మా రోజుల్లాగ మీవి కొద్దిపాటి రోజులా? మా సంవత్సరాల్లా మీవి కొన్ని సంవత్సరాలేనా?

6 నీవు నా తప్పుకోసం చూస్తూ నాపాపం కోసం వెదకుతున్నావు.

7 కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు. అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు!

8 దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు.

9 దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో. కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా ఎందుకు మారుస్తున్నావు?

10 పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు. నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు.

11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు. తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు.

12 నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు. నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు.

13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు.

14 ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని నీవు నన్ను గమనిస్తూ ఉంటావు.

15 నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని. అది నాకు చాలా చెడు అవుతుంది. కానీ నేను నిర్దోషిని అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను గనుక.

16 ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు. నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు.

17 నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు. నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది. నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు.

18 అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు? నన్ను ఎవరూ చూడక ముందే నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది.

19 నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును. నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.?

20 నా జీవితం దాదాపు అయిపోయింది. కనుక నన్ను ఒంటరిగా వదిలెయ్యి. ఏదో కొద్దిపాటి వసతుల్ని అనుభవించనివ్వు.

21 ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో, అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు.

22 ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించ నివ్వు. అక్కడ వెలుగు కూడా చీకటిగా ఉండి ఉంటుంది.”

11

1 అప్పుడు నయమాతీ దేశపువాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:

2 “ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే! ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తోందా? లేదు.

3 యోబూ, నీకు చెప్పేందుకు మా పద్ద జవాబు లేదనుకొంటున్నావా? నీవు దేవునిగూర్చి నవ్వి నప్పుడు, నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?

4 యోబూ! నీవు దేవునితో, ‘నా నమ్మకాలు సరి యైనవే, కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.

5 యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి, నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.

6 అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు. ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు. అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో: దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.

7 “యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా? సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.

8 అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తయినది! ఆ హద్ధులు సమాధి లోతులకంటె లోతైనవి. కానీ, అది నీవు గ్రహించలేవు!

9 దేవుడు భూమికంటే గొప్పవాడు, సముద్రంకంటే పెద్దవాడు.

10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే, ఏ మనిషీ ఆయనను వారించలేడు.

11 నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు. దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.

12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో, అలాగే బుద్ధిహినుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.

13 “అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.

14 నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి. నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.

15 అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు. నీవు బలంగా నిలబడతావు. భయపడవు.

16 యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు. నీ కషాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.

17 అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది. జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.

18 యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు. దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.

19 నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు. మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.

20 కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు, అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు. వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”

12

1 అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు:

2 “సందేహము లేకుండ, మీరు మాత్రమే జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు. మీరు చనిపోయినప్పుడు మీతో బాటు జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు.

3 అయితే మీరు ఎంత జ్ఞాలంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని. నేను మీకంటే తక్కువేమి కాదు. ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు.

4 “ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు. వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’ “కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని. అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు.

5 కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు. అలార టి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు

6 దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు. దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు. వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.

7 “ అయితే జంతువుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి. లేక ఆకాశ పక్షుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి.

8 లేక భూమితో మాట్లాడండి, అది మీకు నేర్పిస్తుంది. లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం గూర్చి మీతో చెప్పనివ్వండి.

9 వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.

10 బతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.

11 భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో చెవులు అని వినే మాటలను పరీక్షించవా:

12 ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్షాయుష్షు అవగాహన కలిగిస్తుంది. అని మేము అన్నాము.

13 జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి. మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే.

14 ఒక వేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుష్యులు దాన్ని తిరిగి నిర్మించలేరు. ఒక వేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని విడుదల చేయలేరు.

15 ఒక వేళ దేవుడు గాని వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండి పోతుంది. ఒక వేళ దేవుడు గాని వర్షాన్నిరానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది.

16 దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు. మోసపోయిన వాడు మోసం చేసిన వారూ ఇద్దరూ దేవునికి చెందిన వారే.

17 రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు. నాయకులు వెర్రిగా వ్రవర్తించేటట్టు చేస్తాడు.

18 రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని దేవుడు వాటిని తీసివేస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు.

19 తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజకుల బలాన్ని దేవుడు అణచి, వాళ్లను క్రిందికి దిగజారేటట్లు చేస్తాడు.

20 నమ్మకమైన సలహాదారులను దేవుడు నిశ్శబ్దం చేస్తాడు. వృద్ధుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు.

21 నాయకులను అప్రముఖులనుగా చేస్తాడు. పాలకుల బలాన్ని ఆయన తీసివేస్తాడు.

22 లోతైన అంధకారంలో నుండి రహస్య సత్యాలను దేవుడు చూపిస్తాడు. మరణం లాంటి చీకటి గల స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు.

23 దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింపజేస్తాడు. అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు. ఆయన రాజ్యాలను పెద్దనిగా పెరగనిస్తాడు. అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదర గొడతాడు.

24 భూలోక నాయకులను వెర్రివార్ని గాను అర్థం చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు. మార్గం లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని పంపిస్తాడు.

25 ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. వారికి ఏ వెలుగూ లేదు. వారు తాగుబోతుల్లా నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.”

13

1 యోబు ఇలా అన్నాడు: “ఇదంతా ఇదివరకే నా కళ్లు చూశాయి. మీరు చెప్పేది అంతా నేను ఇదివరకే విన్నాను. అదంతా నేను గ్రహించాను.

2 మీకు తెలిసింది అంతా నాకు తెలుసు. నేను మీకంటే తక్కువ కాదు.

3 కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు) సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలిని నేను కోరు తున్నాను. నా కష్టాల గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను.

4 కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞానాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరినీ బాగుచేయలేని పనికిమాలిన వైద్యుల్లా మీరు ఉన్నారు.

5 మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది. అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని.

6 “ఇప్పుడు, నా వాదం వినండి. నేను నా విన్నపం చెబుతుండగా, వినండి

7 మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా? మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి మీరు చెప్పు తున్నవి అబద్ధాలే అని మీరు నిజంగా నమ్ము చున్నారా?

8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా? న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా?

9 దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఆయనకు మంచి ఏమైనా కనబడుతుందా? మీరు మనుష్యులను మోసం చేసినట్టే దేవునిని కూడా మోసం చేయగలమని నిజంగా అనుకొంటున్నారా?

10 మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు.

11 దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుది. ఆయన్ను చూచి మీరు భయపడతారు.

12 (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడు తున్నాం అనుకొంటారు). కానీ మీ మాటలు బూడిదలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీనమైనవే.

13 నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. అప్పుడు నాకు ఏం జరగాల్సి ఉందో అది జరగ నివ్వండి.

14 నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను, నా ప్రాణం నా చేతుల్లోకి తీసుకొంటున్నాను.

15 దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను. ముఖాముఖిగా, ఆయన ముందు నా విధానాలను రుజువు చేస్తాను.

16 కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో. చెడ్డ మనిషీ ఎవ్వరూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసు కోడానికి సాహసించరు.

17 నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వివరిస్తూండగా నీ చెవులను విననివ్వవు.

18 ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను జాగ్రత్తగా నా వాదనలను మీ ముందు ఉంచుతాను. నాదే సరి అని నాకు చూపించబడుతుంది అని నాకు తెలుసు.

19 నాది తప్పు అని ఏ మనిషీ రుజువు చేయలేడు. అలా ఎవరైనా చేయగలిగితే నేను మౌనంగా ఉండి మరణిస్తాను.

20 “దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయ చేయుము. అప్పుడు నేను నీవద్ద దాగుకొనను.

21 నన్ను శిక్షించడము ఆపివేయి. నీ భయాలతో నన్ను బెదిరించకు.

22 అప్పుడు నన్ను పిలువు, అప్పుడు నేను నీకు జవాబు ఇస్తాను. లేదా నన్ను నీతో మాట్లాడనివ్వు. నీవు నాకు జవాబు ఇవ్వు.

23 నేను ఎన్ని పాపాలు చేశాను? నేను ఏం తప్పు చేశాను? నా పాపాలు, నా తప్పులు నాకు చూపించు.

24 దేవా, నీవు నన్ను ఎందుకు తప్పిస్తున్నావు? నన్ను నీ శత్రువులా ఎందుకు చూస్తూన్నావు?

25 నీవు నన్ను బెదిరించటానికి ప్రయత్నిస్తున్నావా? నేను (యోబు) గాలి చెదరగొట్టే ఒక ఆకును. ఎండిపోయిన ఒక చిన్న గడ్డిపరక మీద నీవు దాడిచేస్తున్నావు.

26 దేవా, నా మీద నీవు కఠినమైన మాటలు పలుకుతున్నావు. నేను యువకునిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు నీవు నన్ను శ్రమ పెడుతున్నావు. జోఫరుకు యోబు జవాబు

27 నా సాదాలకు నీవు గొలుసులు వేశావు. నేను వేసే ప్రతి అడుగూ నీవు జాగ్రత్తగా గమనిస్తున్నావు. నా అడుగలను నీవు తక్కువ చేస్తున్నావు.

28 అందుచేత కుళ్లిపోయిన దానిలా, చిమ్మెటలు తిని వేసిన గుడ్డ పేలికలా నేను నిష్ప్రయోజనం అయిపోతున్నాను.”

14

1 యోబు ఈ విధంగా చెప్పాడు: “మనమందరం కష్టంతో నిండిన కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం.

2 మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు త్వరగా పెరిగి, తర్వత చస్తాడు. కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం.

3 దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా? నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము.

4 “మురికి దానిలొ నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు.

5 నరుని జీవితం పరిమితం. దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు. నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు.

6 కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు. అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు.

7 “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది. దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది. అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది.

8 భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును. దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును.

9 కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది. మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది.

10 అయితే మనిషి మరణిస్తాడు. అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు.

11 సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు, ఒక నది నీరు ఎండిపోయినట్టు

12 సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడు పండుకొని, మళ్లీ లేవలేడు. మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు మేల్కొనరు, నిద్రించటం మానుకోరు.

13 “మీరు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ. నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండు ననిపిస్తుంది నాకు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచు కోవచ్చు

14 ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బతుకుతాడా? నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను.

15 దేవా, నీవు నన్ను పిలుస్తావు, నేను (యోబు) నీకు జవాబు ఇస్తాను. నన్ను నీవు చేశావు, నన్ను నీవు కోరుతావు

16 అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు. కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు.

17 నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి.

18 “సరిగ్గా ఒక పర్వతం కూలిపోయినట్టు ఒక బండదాని స్థలం నుండి తొలగించబడినట్టు

19 నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు, నీళ్లు నేలమీద మట్టిని కొట్టుకుపోవునట్లు, అదే విధంగా , దేవా నీవు ఒక మనిషి ఆశను నాశనం చేస్తావు.

20 నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే మనిషి పోయినట్టే. నీవు వాని ముఖాన్ని చావు ముఖంగా మార్చివేసి శాశ్వతంగా వానిని పంపించివేస్తావు.

21 వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ అతనికి తెలియదు. అతని కుమారుడు చెడు చేస్తే అతడు ఎన్నటికీ దానిని చూడడు.

22 మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు. అతడు తన కోసమే ఎక్కువగా దుఃఖిస్తాడు.”

15

1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జనాబిచ్చాడు:

2 “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు. జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు.

3 జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా?

4 యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు.

5 నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి. యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు.

6 నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి. నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి.

7 “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా? కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా?

8 దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా? నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా?

9 యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు. నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం.

10 తల నెరసిన మనుషులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు. అవును, చివరికి నీ తండ్రీకంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు.

11 దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ నీకు అది మాత్రమే చాలాదు. సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము.

12 యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు? సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు?

13 నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు నీవు దేవునికి విరోధంగా ఉన్నావు.

14 “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు. స్త్రీనుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు.

15 దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు. దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు.

16 మనవుడు అంతకంటే దౌర్భాగ్యుడు. మానవుడు అసహ్యమైవాడు మరియు పాడైపోయాడు. అతడు మంచి నీళ్లు తాగినట్టుగా కిడును తాగు తాడు.

17 “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను. నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను.

18 జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను. ఆ జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు. ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు.

19 వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది. వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ దేశంలో లేరు.

20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు. క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు,

21 భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు.

22 దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు. అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది.

23 అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు. కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికిచావు మూడిందని అతనికి తెలుసు.

24 చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయాలు అతనిపై దాడి చేస్తాయి.

25 ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్దుడు దేవునికి విధేయుడ య్యేందుకు నిరాకరిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.

26 ఆ మనిషి చాలా మొండివాడు. దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు.

27 దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు. వాని నడుం కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు.

28 కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు. ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివసిస్తాడు. అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు.

29 దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు. అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు. అతని పంటలు ఎక్కువగా పండవు.

30 దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు. అగ్గిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు. దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది.

31 దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు. ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక.

32 దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి వచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు.

33 ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు. ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు.

34 ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము. డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి.

35 వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు. మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.”

16

1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

2 “ఈ విషయాలు నేను యిదివరకే విన్నాను. మీరు ముగ్గురూ నాకు కష్టమే కలిగిస్తున్నారు కాని ఆదరణకాదు.

3 మీ దీర్గ ఉపన్యాసాలకు అంతం లేదు. మీరెందుకు వాదము కొనసాగిస్తారు?

4 నా కష్టలే మీకు ఉంటే ఇప్పుడు మీరు చెబుతున్న మాటలు నేనూ చెప్పగలను. మీకు విరోధంగా జ్ఞానం గల మాటలు చెప్పి, మిమ్మల్ని చూచి నేను తల ఊపగలను.

5 కాని నేను చెప్పే మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహించి మీకు ఆశ ఇవ్వగలను.

6 “అయితే నేను చెప్పేది ఏదీ నా బాధ పోయేట్టుగా చేయలేదు. కానీ నేను మాట్లాడకపోతే నాకు ఆదరణ లేదు.

7 నిజంగా దేవా, నీవు నా బలం తీసివేశావు. నా కుటుంబం మొత్తాన్ని నీవు నాశనం చేశావు.

8 నీవు నన్ను కట్టివేశావు. అది ప్రతి ఒక్కరూ చూడగలరు. నా శరీరం రోగంతో ఉంది, నేను భయంకరంగా కనబడుతున్నాను. దాని అర్థం నేను దోషిని అని ప్రజలు తలస్తున్నారు.

9 “దేవుడు నా మీద దాడి చేస్తున్నాడు, ఆయన నా మీద కోపంగా ఉండి నా శరీరాన్ని చీల్చ వేస్తున్నాడు. దేవుడు నా మీద తన పళ్లు కొరుకుతున్నాడు. నా శత్రువుల కళ్లు ద్వేషంతో చూస్తున్నవి.

10 మనష్యలు నన్ను చూచి నప్వుతారు. వాళ్లంతా నా చుట్టూ చేరి నన్ను అవమానించి నా ముఖం మీద కొట్టడానికి సమ్మతిస్తారు.

11 దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు.

12 నా విషయం అంతా బాగానే ఉంది. నేను నెమ్మదిగా జీవిస్తూ వచ్చాను. కాని దేవుడు నన్ను చితుకగొట్టేశాడు. అవును ఆయన నన్ను మెడపట్టి లాగి, నన్ను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాడు. గురి చూసి కొట్టడం అభ్యసించడానికి దేవుడు నన్ను ప్రయోగిస్తున్నాడు.

13 దేవుని విలుకాండ్లు నా చుట్టూరా ఉన్నారు. నా మూత్రపిండాలలో ఆయన బాణాలు కొడుతున్నాడు. ఆయన దయ చూపించడు. ఆయన నా పైత్య రసాన్ని నేలమీద ఒలక బోస్తాడు.

14 మరల మరల దేవుడు నా మీద దాడి చేస్తాడు. యుద్ధంలో సైనికునిలా ఆయన నా మీదకు పరుగెత్తుతాడు.

15 “నేను (యోబు) చాలా విచారంగా ఉన్నాను, కనుక గోనెపట్టతో చేయబడిన బట్టలు నేను ధరిస్తాను. నేను ఇక్కడ దుమ్ములో, బూడిదలో కూర్చొని ఓడిపోయినట్టుగా భావిస్తున్నాను.

16 ఏడ్బుట మూలంగా నా ముఖం ఎర్రబడింది. ఛాయలు నా కళ్ల చుట్టూరా ఉంగరాల్లా ఉన్నాయి.

17 నేను ఎన్నడూ క్రూరమైన నేరం ఏది చేయలేదు. నా ప్రార్థన నిర్మలమయినది.

18 “భూమీ, నా రక్తాన్ని దాచి పెట్టకు. (నాకు జరిగిన చెడుగులను కప్పి పెట్టకు). న్యాయం కోసం అరిచే నా అరుపులను (ప్రార్థనలను) అగిపోనీయకు.

19 ఇప్పుడు కూడ పరలోకంలో ఎవరో ఒకరు ఉన్నారు. నా పక్షంగా (నా పక్కన) ఉండి నాకు సాక్షిగా ఉన్నాడు.

20 నా స్నేహితులు నాకు విరోధంగా ఉన్నారు. కాని నా కన్నులు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి.

21 ఒక మనిషి తన స్నేహితుని కోసం బతిమలాడి నట్టుగా, నా కోసం దేవునిని బతిమలాడే ఒక మనిషి నాకు కావాలి.

22 నేను ఏ చోట నుండి (మరణం) తిరిగి రానో ఆ చోటికి నేను వెళ్లేందుకు ఇంకా కొద్ది సంవత్సరాలే జరగాల్సి ఉంది.

17

1 నా ఆత్మ భగ్నమై పోయింది. విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం. నా జీవితం దాదాపు గతించిపోయింది, సమాధి నాకోసం నిరీక్షిస్తోంది.

2 మనుష్యలు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు. వారు నన్ను ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను.

3 “దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు, మరి ఎవ్వరూ నన్ను బలపరచరు.

4 నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు, కనుక వారు నన్ను అర్థం చేసుకోరు. దయచేసి వారిని జయించనీయకు.

5 ‘ఒకడు తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు అని ప్రజలు చెబుతారని నీకు తెలుసా? కాని ఇప్పుడు నా స్నేహితులే నాకు విరోధం అయ్యారు.

6 దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు. ప్రజలు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు.

7 నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి. నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది.

8 మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడు తున్నారు. దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవర పడుతున్నారు.

9 కాని నీతీమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు. నిర్దోషులు మరింత బలవంతులపుతారు.

10 “కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి. మీలో ఎవరూ జ్ఞానం గల వారుకారు.

11 నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి. నా ఆశ అడుగంటింది.

12 కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు. చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు.

13 నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం అయితే, అంధకార సమాధిలో నేను నా పడక వేసుకొంటే

14 సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’ పురుగులను చూసి, ‘నా తల్లివి’ లేక ‘నా సోదరివి’ అని నేను చెప్పవచ్చు

15 కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు. మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు.

16 (నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చని పోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా? మన మంతా చేరి బురదలోకి వెళ్తామా?”

18

1 అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:

2 “యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు? నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు

3 మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?

4 యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసు కొంటున్నావు. కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా? కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?

5 “అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది. అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.

6 అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది. అతని పక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.

7 ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు. అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.

8 అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి. అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.

9 ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది. ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.

10 అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది. అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.

11 అతని చుట్టూరా భయం పొంచి ఉంది. అతడు వేసే ప్రతి అడగు వెనుకా భయం ఉంటుంది.

12 చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి. అతడు పడిపోయినప్పుడు పతనం , నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.

13 భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది. అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.

14 దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు. భయాల రాజును ఎదుర్కొ నేందుకు అతడు నడిపించబడతాడు.

15 అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు. ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.

16 కింద అతని వేర్లు ఎండిపోతాయి. పైన అతని కొమ్మలు చస్తాయి.

17 భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు. ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసికోడు.

18 మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు. అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు. వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.

19 అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు. అతని కుమారుల నుండి వారసులు ఉండరు. అతనియింట యింక సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.

20 దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు. తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.

21 ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది. దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”

19

1 అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు:

2 “ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు; మాటలతో నన్ను నలుగగొడతారు?

3 ఇప్పటికి మీరు నన్ను పదిసార్లు అవమానించారు. మీరు నా మీద దాడి చేసేటప్పడు ఎలాంటి సిగ్గూ ఉండదు మీకు.

4 ఒకవేళ నేను పాపం చేసినా, అది నా సమస్య అది మిమ్మల్ని బాధించదు.

5 మీరు కేవలం నా కంటే మంచివాళ్లలా చూపించు కోవాలని కోరుతున్నారు. నా కష్టాలకు కారణం నా తప్పు మాత్రమే అని మీరు అంటారు.

6 కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు. ఆయన నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా వేశాడు.

7 ‘నాకు అపకారం జరిగింది.’ అని నేను కేకలు వేస్తాను. నాకు జవాబు ఏమీ రాదు. సహాయం కోసం నేను గట్టిగా కేకలు వేసినా న్యాయం కోసమైనా నా మొర ఎవరూ వినరు.

8 నేను ముందుకు వెళ్లలేకుండా దేవుడు నా మార్గం మూసివేశాడు. నా తోవను ఆయన చీకట్లో దాచి పెట్టేశాడు.

9 నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు. నా తలమీద కిరిటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు.

10 నేను చచ్చేంతవరకు నన్ను ఈ పక్క నుండి ఆ పక్కవరకు దేవుడు విరుగగొడతాడు. ఒక చెట్టుదాని వేళ్లతో సహా పెల్లగించబడ్డట్టు ఆయన నా ఆశ తీసివేస్తాడు

11 దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది. ఆయన నన్ను తన శత్రవు అని పిలుస్తున్నాడు.

12 నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు. వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మిస్తారు. నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు.

13 నా సోదరులు నన్ను ద్వేషించేటట్టు దేవుడు చేశాడు. నా స్నేహితులందరికీ నేను పరాయివాడను.

14 నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు. నా స్నేహితులు నన్ను మరచిపోయారు.

15 నా ఇంట్లో అతిధులు, పనికతైలు నేనేదో పరాయివాడిలా, విదేశీయునిలా నన్ను చూస్తారు.

16 నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు. సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు జవాబు ఇవ్వడు.

17 నా శ్వాస వాసన అంటే నా బార్యకు అసహ్యం. నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు.

18 చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు. నేను వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు సంగతులు మాట్లాడుతారు.

19 నాకు సన్నిహితమైన స్నేహితులు అందరూ నన్ను అనహ్యించుకొంటారు. చివరికి నేను ప్రేమించే మనుష్యలు కూడా నాకు విరోధులయ్యారు.

20 “నేను ఎంత సన్నగా ఉన్నానంటే నా ఎముకల మీద నా చర్మం వ్రేలాడుతూ ఉంది. నాలో నాకు కొద్దిపాటి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది.

21 “నన్ను దయ చూడండి, నా స్నేహితులారా, నన్ను దయ చూడండి. దేవుని హస్తం నాకు విరోధంగావుంది.

22 దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను హింసిస్తారు? నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ తృప్తి చెందటం లేదు?

23 “నేను (యోబు) చెప్పేది ఎవరో ఒకరు జ్ఞాపకం ఉంచుకొని, ఒక గ్రంథంలో వ్రాస్తే బాగుంటుందని నా ఆశ. నేను చెప్పే మాటలు ఒక గ్రంథపు చుట్టలో వ్రాయబడాలని నా ఆశ.

24 నేను చెప్పే మాటలు శాశ్వతంగా ఉండేటట్టు సీసంమీద ఇనుప పోగరతో చెక్కబడాలని లేదా ఒక బండమీద వ్రాయబడాలని నా ఆశ.

25 నన్ను ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉన్నారని నాకు తెలుసు. అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు.

26 నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా చర్మం పాడైపోయిన తర్వాత కూడా నేను దేవుణ్ణి చూస్తానని నాకు తెలుసు.

27 నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను. సాక్షాత్తూ దేవుణ్ణే, ఇంకెవరినీ కాదు. నాలో నా హృదయం బలహీనం అవుతోంది.

28 “ఒకవేళ మీరు, ‘మనం యోబును ఇబ్బంది పెడ్డాం, అతణ్ణి నిందించటానికి ఏదైనా కారణం వెదుకుదాం’ అనుకొవచ్చును.

29 కానీ మీ మట్టుకు మీరే ఖడ్గానికి భయపడాలి. ఎందుకంటే, పాపంమీద దేవుని కోపం శిక్షను రప్పిస్తుంది. మిమ్మల్ని శిక్షించేందుకు యెహోవా ఖడ్గం ప్రయోగిస్తాడు. అప్పుడు తీర్పు ఉంది అని మీరు తెలుసుకొంటారు.”

20

1 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:

2 “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి. నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి నీకు చెప్పాలి.

3 మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకంగా ఉన్నాయి. కానీ నేను జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు ెతెలుసు.

4 [This verse may not be a part of this translation]

5 [This verse may not be a part of this translation]

6 ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు. అతని తల మేఘాలను తాకవచ్చు.

7 కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు. అతన్ని ఎరిగిన ప్రజలు, ‘అతడు ఎక్కడ?’ అని అన్నారు.

8 ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు. ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు విదిలించబడతాడు.

9 అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు అతని కుటుంబం అతన్ని మరల ఎన్నడూ చూడదు.

10 దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు. దుర్మార్గుని స్వహస్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి.

11 అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంది. కాని త్వరలోనే అది మట్టి ఆవుతుంది.

12 “దుర్మార్గుని నోటిలో దుర్మార్గం తియ్యగా ఉంటుంది. అతడు దానిని తన నాలుక కింద దాచిపెడతాడు.

13 చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం. కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన నోటిలో ఉంచుకొంటాడు.

14 కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవుతుంది. అది అతని లోపల చేదు విషంలా, పాము విషంలా అవుతుంది.

15 దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు వాటిని కక్కివేస్తాడు. అవును, దుష్టుని కడుపు వాటిని కక్కివేసేట్టుగా దేవుడు చేస్తాడు.

16 దుష్టుడు పాముల విషం పీల్చుతాడు. పాము కోరలు వానిని చంపివేస్తాయి.

17 అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి దుష్టుడు ఆనందించ లేడు.

18 దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం చేయబడతాడు. అతని కష్టార్జితం అనుభవించటానికి అతనికి అనుమతి ఇవ్వబడదు.

19 దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు గనుక. అతడు వారి విషయమై పట్టించుకోలేదు, మరియు అతడు వారి వస్తువులను తీసుకొన్నాడు. ఇంకెవరో కట్టిన ఇండ్లు అతడు తీసివేసుకొన్నాడు.

20 దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు. వాని ఐశ్వర్యం వానిని రక్షించలేదు.

21 అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు. అతని విజయం కొనసాగదు:

22 దుర్మార్గునికి సమృద్ధిగా ఉన్నప్పటికీ అతడు కష్టంతో కృంగిపోతాడు. అతని సమస్యలు అతని మీదకు దిగి వస్తాయి.

23 దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన తర్వాత దేవుడు తన కోపాన్ని ఆ మనిషి మీదకి మళ్లిస్తాడు. దుర్మార్గుని మీద దేవుడు శిక్షా వర్షం కురిపిస్తాడు.

24 ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారి పోతాడేమో కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల గొడుతుంది.

25 ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చుకొని పోయి అతని వీపులో నుండి బయటకు వస్తుంది. ఆ బాణం యొక్క మెరుపు కొన అతని కాలేయంలో గుచ్చుకు పోతుంది. అతడు భయంతో అదిరిపోతాడు.

26 అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి. ఏ మనిషీ ఆరంభించని ఒక అగ్ని అతణ్ణి నాశనం చేస్తుంది. అతని ఇంటిలో మిగిలివున్నదాన్ని అగ్ని నాశనం చేస్తుంది.

27 దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది. భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది.

28 అతని ఇంట్లో ఉన్న సమస్తం దేవుని కోప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది.

29 దుర్మార్గానికి దేవుడు చేయాలని తలపెడుతోంది అదే. దేవుడు వారికి ఇవ్వాలని తలస్తోంది అదే.”

21

1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

2 “నేను చెప్పేది వినండి. మీరు వినటమే మీరు నాకు ఇచ్చే ఆదరణ.

3 నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. ఆ తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు నన్ను గేళి చేయవచ్చు.

4 “నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు. నేను ఓపికగా ఉండకపోవటానికి ఒక మంచి కారణం ఉంది.

5 నన్ను చూచి, అదరిపొండి. మీ నోటిమీద చేయి పెట్టుకొని అదురుతో నన్ను అలానే తేరి చూడండి.

6 నాకు సంభవించిన దానిని గూర్చి తలచినప్పుడు నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది.

7 దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు? వారు ముసలివాళ్లవ్వటం, విజయం పొందటం ఎందుకు?

8 దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు. దుర్మార్గులు వారి మనుమలు, మనుమ రాండ్రను చూసేంత వరకు బతుకుతారు.

9 వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు. దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన దండం ఉపయోగించడు.

10 వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. వారి ఆవులకు దూడలు ఉన్నాయి. ఆ దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు.

11 దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గొర్రె పిల్లల్లా బయటకు పంపిస్తారు. వారి పిల్లలు గంతులు వేస్తారు.

12 స్వరమండలాలు, పిల్లనగ్రోవుల ధ్వనులతోబాటు వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు.

13 దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభవిస్తారు. అనగా వారు మరణించి, శ్రమ అనుభవించకుండానే తమ సమాధికి వెళ్తారు.

14 కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, ‘మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి, మేము ఏమి చేయాలని మీరు కోరుతారో అది మాకు లెక్కలేదు’ అంటారు.

15 మరియు దుర్మార్గులు, ‘సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు? మేము ఆయనను సేవించాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రార్థన చేసిన లాభం లేదు’ అంటారు.

16 దుర్మార్గులు తమ మూలంగానే వారికి విజయం కలుగుతుందని తలస్తారు. కానీ నేను వారి తలంపును అంగీకరించను.

17 అయితే దుర్మార్గులు దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది? దుర్మార్గులకు ఎన్నిసార్లు కష్టం వస్తుంది? దేవుడు వారి మీద కోపగించి వారిని శిక్షిస్తాడా?

18 గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గావి ఊకను ఎగురగొట్టినట్లు దేవుడు దుర్మార్గులను ఎగుర గొట్టి వేస్తాడా?

19 ‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు. కాదు! ఆ దుర్మార్గుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మార్గుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడుతున్నట్టు అతనికి తెలుస్తుంది.

20 పాపి తన స్వంత శిక్షను చూడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు.

21 దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు అతడు విడిచిపెడుతున్న తన కుటుంబం విషయమై అతడు లెక్కచేయడు.

22 “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు. ఉన్నత స్థానాల్లో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్పు తీరుస్తాడు.

23 ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు. అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు.

24 అతని శరీరం బాగా పోషించబడింది, అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి

25 అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు. అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు.

26 వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు. వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి.

27 “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మరియు మీరు నాకు అపకారం చేయాలని తలపెడుతున్నారని నాకు తెలుసు.

28 యువరాజు ఇల్లు ఎక్కడ?’ దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?, అని మీరు అంటారు.

29 కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు. వారి కథలను మీరు అంగీ కరించనూ లేదు.

30 విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్ట బడుతారు. ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు.

31 దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు. అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ శిక్షించరు.

32 దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు.

33 ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది. వాని చావు ఊరేగింపులో వేలాది మంది ఉంటారు.

34 అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు. మీ జవాబులు ఇంకా అబద్ధాలే!”

22

1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు యిచ్చాడు:

2 “దేవునికి నరుడు ఉపకారికాగలడా? జ్ఞానం గల వ్యక్తి తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు.

3 ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ, సర్వ శక్తిమంతుడైన దేవునికి అది సంతోషం కలిగించదు. నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి ఏమీ లాభంలేదు.

4 యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది ఆయనను నీవు ఆరాధించినందుకా?

5 కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే. యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు.

6 యోబూ, నీ సోదరులు నీకు ఋణపడి ఉన్న ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని బలవంతం చేశావు. అది కారణం లేకుండా నీవు చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్తాలు నీవు లాగేసు కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు.

7 అలసిపోయిన మనుష్యలకు నీవు నీళ్లు ఇవ్వలేదు. ఆకలిగొన్న మనుష్యలకు నీవు అన్నం పెట్టలేదు.

8 యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవై నప్పటికీ నీవు ఆ ప్రజలకు సహాయం చేయలేదు. నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం పొందినవాడవు.

9 కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని పంపించివేశావు. యోబూ! అనాధ పిల్లలను నీవు దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవర్తించావు.

10 అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి. మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయ పెడుతుంది.

11 అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది. మరియు అందుకే నీళ్ల ప్రవాహం నిన్ను కప్పేస్తుంది.

12 ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు నివసిస్తాడు. మహా ఎత్తయిన నక్షత్రాలను దేవుడు వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీవు చూడగలవు.

13 కాని యోబూ, ‘నీవు దేవునికి ఏమీ తెలియదు! అంధకార మేఘాల్లోంచి దేవుడు మాకు ఎలా తీర్పు తీరుస్తాడు?

14 ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి. ‘ అని అంటావు.

15 “ యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే నీవు నడుస్తున్నావు.

16 దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందేవారు తీసుకోబడ్డారు. ఒక వరదలో వారు కొట్టుకొని పోయారు.

17 ‘మమ్ముల్ని ఒంటరిగా విడిచిపెట్టండి. సర్వశక్తి మంతడైన దేవుడు మమ్ముల్ని ఏమీ చేయలేడు’అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే.

18 కానీ ఆ మనుష్యలనే దేవుడు విజయం పొందిన ధనికులుగా చేశాడు. దుర్మార్గులు తలచే పద్ధతి నేను అంగీకరించలేను.

19 దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు. నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ.

20 ‘మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు. వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది’ అని అంటారు.

21 “యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది. ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు.

22 ఈ ఉపదేశము స్వీకరించి ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసికో.

23 యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది. నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి.

24 నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి, ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు.

25 సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను, వెండిగాను ఉండనియ్యి.

26 అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తి మంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు. నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు.

27 నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు.

28 నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు. నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది

29 గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు.

30 నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు. నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించ బడతాడు.”

23

1 అప్పుడు యోబూ ఇలా జవాబు ఇచ్చాడు:

2 “ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను. దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను.

3 దేవునిని ఎక్కడ వెదకాలో ఆయన యెద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ.

4 నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను. నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది.

5 నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలిని కోరుతున్నాను. అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను.

6 దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా? లేదు, ఆయన నా మాట వింటాడు!

7 అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును. అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును.

8 కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు. ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.

9 దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు. దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు.

10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు. ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్త్తాడు.

11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను. దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.

12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను. నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం.

13 కానీ దేవుడు ఎన్నటికీ మారడు. ఏ మనిషి ఆయనకు విరొధంగా నిలబడలేడు. దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు.

14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడోదాన్ని ఆయన చేస్తాడు. నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి.

15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను. వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను.

16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు. నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు.

17 కానీ చీకటి నేను మౌనంగా ఉండేటట్టు చేయదు. గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది.

24

1 “సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయవిచారణ కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర్ణయించడు? దేవునికి విధేయులయ్యే మనుష్యులు ఆ న్యాయవిచారణ నమయం కోసం అనవసరంగా ఎందుకు వేచి ఉండాలి?”

2 “మనుష్యలు తమ పొరుగు వారి భూమిని ఆక్ర మించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు. మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు.

3 అనాధల గాడిదను వారు దొంగాలిస్తారు. ఒక విధవవారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును వారు తోలుకొని పొతారు.

4 ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు. పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడుతారు.

5 “అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు ఈ పేద ప్రజలు. పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది.

6 పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని పోలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి? దుర్మార్గుల ద్రాక్షాతోటల నుండి వారు పండ్లు ఏరుకొంటారు.

7 పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి. చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు.

8 కొండల్లోని వర్షానికి వారు తడిసిపోయారు. వాతా వరణం నుండి వారిని వారు కాపాడుకొనేందుకు వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు దగ్గరలో ఉండాలి.

9 దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తల్లి దగ్గర నుండి లాగివేసుకొంటారు. పేద మనిషియొక్క బిడ్డను వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు ఆ చిన్న బిడ్డను బానిసగా చేస్తారు.

10 పేద ప్రజలకు బట్టలు లేవు, కనుక వారు దిగంబరులుగా పని చేస్తారు. దుర్మార్గుల కోసం వారు పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలి తోనే ఉంటారు.

11 పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు. వారు ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు.

12 మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమైన శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి. బాధించబడిన మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ దేవుడు వినటం లేదు.

13 వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు .వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు. వారు దేవుని మార్గంలో నడవరు.

14 సరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు. రాత్రివేళ అతడు దొంగగా మారిపోతాడు.

15 వ్యభిచారం చేసే వాడు రాత్రి కోసం వేచి ఉంటాడు. ‘నన్ను ఎవ్వరూ చూడడం లేదు’ అని అతడు అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు కొంటాడు.

16 రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు. కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించు కొంటారు.

17 ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది. చీకటి దారుణాలకు వారు స్నేహితులు.

18 కాని వరద నీటిపైనున్న నురగవలె దుర్మార్గులు తీసుకొని పోబడతారు. వారి స్వంత భూమి శపించబడింది. కనుక ద్రాక్షా తోటలలో ద్రాక్షాపండ్లు కోసే పనికి వారు వెళ్లరు.

19 వేడిగా, పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచు నీళ్లను తొలగించి వేస్తుంది. అదే విధంగా దుర్మార్గులు కూడా తీసుకొని పోబడతారు.

20 దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది. దుర్మార్గుని శరిరాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేనికోబడడు. దుర్మార్గులు పడి పోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు.

21 దుర్మార్గులు గొడ్రాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు. వారు విధవరాలికి దయ చూపెట్టరు.

22 కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. బలంగల మనుష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు.

23 ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.

24 కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. ఆ తరువాత వారు అంతమై పోతారు. మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు.

25 ఈ విషయాలు సత్యం కాకపోతే, నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు?” నా మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు?

25

1 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:

2 “దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.

3 దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు. దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.

4 కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు. స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.

5 దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు. దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.

6 మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!”

26

1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

2 “బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యలకు నిజంగా సహాయం చేయగలరు. అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు.

3 అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు. మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు.

4 ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు. ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది?

5 మరణించిన వారి ఆత్మలు భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.

6 మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం. దేవునికి మరణం మరుగు కాదు.

7 ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.

8 మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు. కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు.

9 పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు. దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు

10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు.

11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి.

12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది. దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది.

13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది. తప్పించు కోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది.

14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”

27

1 అప్పుడు యోబు మాట్లాడటం కొన సాగించాడు:

2 “ నిజంగా దేవుడు జీవిస్తున్నాడు. మరియు దేవుడు జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు అన్యాయం చేశాడు. అనటం కూడ అంతే సత్యం. అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని బాధించాడు.

3 కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు,

4 నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు. మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు.

5 మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను. నేను నిర్దోషిని అని నేను చచ్చే రోజువరకు చెబుతూనే ఉంటాను.

6 నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టు కొని ఉంటాను. సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు.

7 ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు. నా శత్రువులు దుర్మారులు శిక్షించబడినట్టు శిక్షించబడుదురు గాక.

8 దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు. అతని జీవాన్ని దేవుడు తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు.

9 ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి, దేవునికి మొరపెడితే దేవుడు వినడు.

10 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది. ఆ వ్యక్తి సదా దేవుని ప్రార్థించి ఉండాల్సింది.

11 “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను. సర్వశక్తిమంతుడైన దేవుని పథకాలను నేను దాచి పెట్టను.

12 దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు. కనుక మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతారు?

13 దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే. సర్వశక్తిమంతుడైన దేవుని నుండి కృర మానవులకు లభించేది ఇదే.

14 ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండ వచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు. దుర్మార్గుని పిల్లలు తినేందుకు సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు.

15 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది. అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు.

16 ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు. ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును.

17 దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు. దుర్మార్గుని వెండిని నిర్దోషులు పంచుకొంటారు.

18 దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు. అది సాలె గూడులా ఉంటుంది లేక కావలివాని గుడారంలా ఉంటుంది.

19 దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు. కానీ ఆ తర్వాత అతను కళ్లు తెరిచినప్పుడు అతని సంపదంతా పోయినట్లు అతనికి తెలుస్తంది.

20 ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టు కొంటాయి. రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టు కొని పోతుంది.

21 తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు. తుఫాను అతణ్ణి అతని యింటినుండి తుడుచుకుని పోతుంది.

22 తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తుఫాను అతణ్ణి నిర్దాక్షిణ్యంగా కొడుతుంది.

23 దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు. దుర్మార్గుడు తన యింటినుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు ఈల వేస్తారు.

28

1 మనుష్యులకు వెండి లభిర చే గనులు ఉన్నాయి. మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.

2 మనుష్యలు భూమినుండి ఇనుమును తవ్వుతారు. బండల నుండి రాగి కరిగించబడుతుంది.

3 పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు. ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలిచీకటిలో బండల కోసం వారు వెదుకుతారు.

4 మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు. మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు. పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు.

5 భూమిపై నుండి ఆహారం వస్తుంది. కానీ భూమి కింద, వస్తువులను మంట మార్చివేసినట్టు, అది మార్చివేయబడుతుంది.

6 నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి. నేల కింద మట్టిలో బంగారం ఉంది.

7 ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు. డేగ కూడా ఈ మార్గం చూడదు.

8 కృర మృగాలు ఈ మార్గంలో నడవలేదు. సింహాలు ఈ మార్గంలో పయనించలేదు.

9 పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు. ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు.

10 పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు. బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు.

11 నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు. దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.

12 “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?

13 జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు. భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.

14 ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.

15 అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము. జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.

16 ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని, నీలంతో గాని, అది కొనబడేది కాదు.

17 బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది. బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.

18 జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది. జ్ఞానం కెంపువకంటె ఖరీదైనది.

19 ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు. మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.

20 “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి? అవగాహన చేసికోవటం నేర్చుకోనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?

21 భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.

22 ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ అని మరణం, నాశనం చెబుతాయి.

23 “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.

24 భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు. ఆకాశాల కింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.

25 గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,

26 వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించి నప్పుడు

27 అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు దానిని పరీ క్షించిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.

28 “యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది” అని దేవుడు ప్రజలతో చెప్పాడు.

29

1 యోబు మాట్లాడటం కొనసాగించాడు. యోబు ఇలా అన్నాడు:

2 “దేవుడు నన్ను కాపాడి, నా విషయం జాగ్రత్త తీసు కొన్న ఇటీవలి మాసాల్లో ఉన్నట్టుగానే నా జీవితం ఉంటే బాగుండునని నేను ఆశిస్తున్నాను.

3 నేను చీకటిలో నడచినప్పుడు నాకు వెలుగు ఇచ్చుటకు నా తలమీద దేవుని వెలుగు ప్రకాశించే సమయం వస్తే బాగుండునని నేను ఆశిస్తున్నాను. (నేను జీవించవలసిన సరియైన మార్గాన్ని దేవుడు నాకు చూపించాడు).

4 నా జీవితం ఎంతో విజయవంతంగా ఉండి దేవుడు నాకు సన్నిహితమైన స్నేహితునిగా ఉండే రోజుల కోసం నేను ఆశిస్తున్నాను. అవి దేవుడు నా ఇంటిని ఆశీర్వదించిన రోజులు.

5 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇంకా నాతో ఉండగా నా పిల్లలు నా దగ్గర ఉన్న సమయం కోసం నేను ఆశిస్తున్నాను.

6 అది నా జీవితం ఎంతో బాగున్నప్పటి మాట. నా మార్గం అర తా మీగడతో నిండిపోయినట్టు, నా కోసం ఒలీవ నూనెను నదులుగా ప్రవహించి నట్టు అది కనబడింది.

7 “నేను పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి పట్టణ పెద్దలతో కలిసి ఆరుబయట కూర్చున్న రోజులు అవి.

8 అక్కడ ప్రజలంతా నన్ను గౌరవించేవారు. యువకులు నన్ను చూచినప్పుడు పక్కకు తప్పుకొనేవారు. పెద్దలు నా యెడల గౌరవ సూచకంగా లేచి నిలబడేవారు.

9 ప్రజానాయకులు నన్ను చూడగానే మాట్లాడటం నిలిపివేసి నోటిమీద చేయి వేసుకొనేవారు (ఇతరులను నిశ్శబ్దంగా ఉంచటానికి).

10 చాలా ప్రముఖ నాయకులు కూడా, నేను వారిని సమీపించినప్పుడు వారి స్వరాలు తగ్గించేవారు. అవును వారి నాలుకలు వారి అంగిట అంటుకొని పోయినట్లు కనిపించేది.

11 నేను మాట్లాడటం విన్నవారు ఎవరైనా సరే, నన్ను గూర్చి మంచి మాటలు చెప్పేవారు. నన్ను చూచిన వారు నన్ను పొగిడారు.

12 ఎందుకంటే, పేదవాడు ఒకడు సహాయం కోసం వేడుకొంటే, నేను సహాయం చేశాను. తల్లి దండ్రులు లేని బిడ్డ విషయం శ్రద్ధ తీసుకోనే వారు ఎవరూ లేనప్పుడు నేను సహాయం చేశాను.

13 మరణించే మనిషీ నన్ను ఆశీర్వదించాడు. అవసరంలో ఉన్న విధవలకు నేను సహాయం చేసాను.

14 సక్రమంగా జీవించటం నాకు వస్త్రం. న్యాయంనాకు అంగీలా, తలపాగాలా ఉండేది.

15 గుడ్డివారికి నా కళ్లతో నేను సహాయం చేశాను. కుంటివారికి నా పాదాలతో నేను సహాయం చేశాను.

16 పేద ప్రజలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. కష్టాలలో ఉన్న పరాయివారి పక్షం నేను వహించాను.

17 దుర్మార్గుల శక్తిని నేను నాశనం చేశాను. దుర్మార్గుల బారి నుండి నిర్దోషులను నేను రక్షించాను.

18 “ నేను ఎల్లప్పుడూ ఇలా తలచేవాణ్ణి. నేను చాలాకాలం బతుకుతాను. తర్యాత నా స్వంత ఇంటిలో మరణిస్తాను.

19 వేర్లు ఎల్లప్పుడూ నీటిని తాకుతూ ఆకులు ఎల్లప్పుడు మంచుతో తడిగా ఉండే చెట్టులా నేను ఉన్నాను.

20 నాలో నా మహిమ ఎల్లప్పుడూ కొత్తదిగా ఉంటుంది. నాచేతిలో ఒక కొత్త విల్లు ఉన్నట్టుగా నేను ఎల్లప్పుడూ బలంగా ఉంటాను.

21 నేను మాట్లాడటం చాలించిన తరువాత నా మాటలు వింటున్న ప్రజలు చెప్పాల్సింది ఇంకేమీ ఉండేది కాదు. నా మాటలు వారి చెవులకు సౌమ్యంగా వినిపించేవి.

22 ప్రజలు వర్షంకోసం వేచి ఉన్నట్టు, నేను మాట్లాడాలని వారు వేచి ఉండేవారు. నా మాట వసంతకాలపు వర్షంలా ఉండేది నా మాటల్ని వారు పానం చేసేవారు.

23 అధైర్య పడిన వారిని చూచి నేను చిరునవ్వు నవ్వే వాడిని.

24 నా ప్రసన్న ముఖం క్రుంగిన ప్రజలకు మంచి అనుభూతిని కలిగించేది.

25 ప్రజల పట్ల బాధ్యత వహించి నేను నిర్ణయాలు చేసాను. నేను నాయకుణ్ణి అయ్యాను. తన సైన్య దళాలలో ఒక రాజులా నేను జీవించాను. చాలా విచారంలో ఉన్న ప్రజలకు ఆదరణ ఇచ్చే మనిషిలా నేను ఉన్నాను.

30

1 కాని యిప్పుడు నన్ను హేళన చేసే వారు నాకంటే చిన్నావారు. ఆ యువకులకు పనికి మాలిన తండ్రులు ఉన్నారు. వారి తండ్రులను నా గొర్రెలను కాపలా కాసే కుక్కలతో కూడా నేను ఉండనివ్వను.

2 నాకు సహాయం చేసేందుకు వాళ్లకు బలం లేదు. వారు అలసిపోయిన వృద్ధులు.

3 ఆ మనుష్యులు చచ్చిన వాళ్లతో సమానం. ఎందు కంటే వారికి ఏమీ లేక ఆకలితో ఉన్నారు. ఎండి పోయిన ఖాళీ నేలను కూడా వారు తినటానికి ప్రయత్నిస్తున్నారు.

4 ఆ మనుష్యులు వారి ఎడారిలోని తుత్తి చెట్లను పెరికి వేస్తారు. తంగేడు చెట్టు వేర్లను వారు తింటారు.

5 ఆ మనుష్యులు ఇతర మనుష్యులు దగ్గర నుండి బలవంతంగా వెళ్లగొట్టబడతారు. మనుష్యులు దొంగల మీద అరచినట్టుగా వారి మీద అరుస్తారు.

6 ఎండిపోయిన నదులలోను, బండలలోను, కొండగుహలలోను, నేలలోని గుంటలలోను నివసించేందుకు వారి వృద్ధులు బలాత్కారం చేయ బడతారు.

7 వారు పొదలలో అరుస్తారు. ముళ్ల కంపల్లో వారంతా ఒక్కచోట చేరుతారు.

8 వాళ్లు పనికిమాలిన అనామకుల గుంపు. వాళ్లు వారి దేశం నుండి బలవంతంగా వెళ్లగాట్టబడిన వాళ్లు.

9 “ఇప్పుడు ఆ మనుష్యుల కొడుకులు నన్ను హేళన చేసేందుకు నన్ను గూర్చి పాటలు పాడుతారు. వాళ్లకు నా పేరు చెడ్డ మాట అయింది.

10 ఆ యువకులు నన్ను ద్వేషిస్తారు, వారు నాకు దూరంగా నిలుస్తారు, వారు నాకంటే మంచివాళ్లము అనుకొంటారు. చివరికి వాళ్లు నా ముఖం మీద ఉమ్మి కూడా వేస్తారు.

11 నా వింటి నారిని దేవుడు తీసుకొని నన్ను బలహీనుణ్ణి చేశాడు. ఆ యువకులు తమని తాము వారించుకొనక నిండు కోపంతో నాకు విరోధంగా తిరుగుతారు.

12 నా కుడి ప్రక్క ఆ యువకులు నామీద పడుతున్నారు. నేను పడిపోయేలా వాళ్లు చేస్తున్నారు. వారు నామీద దాడి చేసి, నన్ను నాశనం చేసేందుకు నా చుట్టూరా పట్టణానికి ముట్టడి దిబ్బ వేసినట్లు వేస్తున్నారు.

13 నేను పారిపోయే మార్గాన్ని ఆ యువకులు కాపలా కాస్తున్నారు. నన్ను నాశనం చేయటంలో వారువిజయం పొందుతున్నారు. వారు నన్ను నాశనం చేయటానికి వారికి ఎవరి సహాయం అవసరం లేదు.

14 గోడలోని కన్నంగుండా వెళ్లిపోయినట్టు వారు నామీద దాడి చేస్తున్నారు. వారు దూకేసి నా మీదకు విరగబడుతున్నారు.

15 భయాలు నన్ను ఆవరించేస్తున్నాయి. వస్తువులనుగాలి చెదరగొట్టినట్లు ఆ యువకులు నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు. నా భద్రత మబ్బులా మాయమవుతోంది.

16 ఇప్పుడు నా జీవితం దాదాపు అయిపోయింది. నేను త్వరలోనే మరణిస్తాను. శ్రమదినాలు నన్ను పట్టివేశాయి.

17 రాత్రివేళ నా ఎముకలు అన్నీ నొప్పెడతాయి. బాధ నన్ను నమిలివేయటం ఎన్నడూ ఆగిపోలేదు.

18 దేవుడు మహాబలంగా నా చొక్కా పట్టి లాగుతున్నాడు. ఆయన నా బట్టలను నలిపి వేస్తున్నాడు.

19 దేవుడు నన్ను బురదలో పడదోస్తున్నాడు. నేను మట్టిలా, బూడిదలా అయిపోతున్నాను.

20 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను. కానీ నీవు జవాబు ఇవ్వవు. నేను నిలబడి ప్రార్థన చెస్తాను. కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు.

21 దేవా, నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.

22 దేవా, బలమైన గాలి నన్ను కొట్టుకొని పోయేటట్టు నీవు చేస్తున్నావు. నీవు నన్ను తుఫానులో పడదోస్తున్నావు.

23 నీవు నన్ను నా మరణానికి తీసుకొని పోతున్నావని నాకు తెలుసు. మరణం ప్రతి మనిషికి ఏర్పాటు చేయబడిందే.

24 కానీ అప్పటికే నాశనమయి, సహాయంకోసం అలమటించేవాణ్ణి నిశ్చయంగా ఎవ్వరూ బాధించరు.

25 దేవా, కష్టాల్లో ఉన్న ప్రజల పక్షంగా నేను మొర్ర పెట్టానని నీకు తెలుసు. పేద ప్రజల కోసం నా హృదయం ఎంతో విచారించిందని నీకు తెలుసు.

26 కానీ నేను మంచివాటి కోసం ఎదురు చూస్తే వాటికి బదులు చెడ్డవి జరిగాయి. వెలుగుకోసం నేను చూస్తే చీకటి వచ్చింది.

27 అంతరంగంలో నేను చీల్చివేయబడ్డాను. శ్రమలు ఎన్నటికీ ఆగిపోవు. శ్రమకాలాలు నా యెదుట ఉన్నాయి.

28 నేను ఎల్లప్పుడూ ఎంతో విచారంగా ఉంటానుగాని, నాకు ఆదరణ లభ్యం కాదు. నేను సమాజంలో నిలబడి సహాయం కోసం కేకలు వేస్తాను.

29 నేను అడవి కుక్కలకు సోదరుడినయ్యాను. నిప్పుకోళ్లు నాకు జతగాళ్లు.

30 నా చర్మం చాలా నల్లబడిపోయింది. నా శరీరం జ్వరంతో వేడిగా ఉంది.

31 దుఃఖమయ గీతాలు వాయించేందుకు నా స్వర మండలములను శృతి చేయబడింది. విచారంగా ఏడుస్తున్న శబ్దాలు నా పిల్లనగ్రోవి చేస్తుంది.

31

1 “ఒక యువతిని కామవాంఛతో చూడ కూడదని నా కళ్లతో నేను ఒప్పందం చేసుకొన్నాను.

2 సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడు? దేవుడు ఉన్నతమైన తన పరలోక గృహంలో ఉండి ప్రజలకు తిరిగి ఎలా ప్రతిఫలం ఇస్తున్నాడు?

3 దుర్మార్గులకు దేవుడు కష్టాన్ని, నాశనాన్ని పంపిస్తాడు. తప్పు చేసేవారికి సర్వనాశనం కలిగిస్తాడు.

4 నేను చేసేది ప్రతిదీ దేవునికి తెలుసు. నేను వేసే ప్రతి అడుగూ ఆయన చూస్తున్నాడు.

5 నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు అబద్దాలు చెప్పి, మోసం చేసేందుకు నేను పరుగులెత్తి ఉంటే.

6 అప్పుడు నన్ను తూచేందుకు దేవుడు న్యాయపుత్రాసు వాడవచ్చును. అప్పుడు నేను నిర్దోషినని దేవునికే తెలుస్తుంది.

7 నేను సరియైన మార్గం నుండి తొలగిపోతే నా కళ్లు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే లేదా నా చేతులు పాపంతో మైలగా ఉంటే,

8 అప్పుడు నేను నాటిన పంటలను ఇతరులు తిని వేయుదురు గాక, నా పంటలు పెరికి వేయబడును గాక.

9 నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే లేదా నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపం చేయటానికి అతని ద్వారం దగ్గర వేచి ఉంటే,

10 అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక. ఇతర వురుషులు ఆమెతో పండుకొందురు గాక.

11 ఎందుకంటే లైంగిక పాపం అవమానకరం. అది శిక్షించబడాల్సిన పాపం.

12 లైంగికపాపం కాల్చివేసి, నాశనంచేసే అగ్నిలాంటిది. లైంగిక పాపంనాకు గల సర్వాన్నీ నాశనం చేస్తుంది.

13 “నా మగ సేవకులు, ఆడ సేవకులు నాకు విరోధంగా ఆరోపణ చేసినప్పుడు, ఒక వేళ నేను వారికి న్యాయం చేకూర్చేందుకు నిరాకరిస్తే,

14 నేను దేవుణ్ణి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నేను ఏమి చేస్త్తాను? నేను చేసిన దాని గూర్చి వివరించు మని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబిస్తాను?

15 దేవుడు నన్ను నా తల్లి గర్భంలోనే చేశాడు. నా సేవకులను కూడా దేవుడే చేసాడు. మమ్ముల్ని ఇద్దరినీ మా తల్లి గర్భంలో దేవుడే రూపొందిచాడు.

16 “పేద ప్రజలకు సహాయం చేసేందుకు నేను ఎన్నడూ నిరాకరించలేదు. విధవలను దిక్కుమాలిన వారిగా నేను ఎన్నడూ ఉండనియ్యలేదు.

17 నా భోజనం విషయంలో నేను ఎన్నడూ స్వార్థంతో ఉండలేదు. అనాధ పిల్లలను నేను ఎన్నడూ ఆకలితో ఉండనీయలేదు.

18 నా జీవిత కాలం అంతా తండ్రిలేని పిల్లలకు నేను ఒక తండ్రిలా ఉన్నాను. నా జీవిత కాలం అంతా విధవల పట్ల నేను శ్రద్ధ చూపాను.

19 ఎవరో ఒకరు బట్టలు లేక శ్రమపడటం నేను చూచినప్పుడు, లేక పేదవాడు చొక్కా లేకుండా ఉన్నప్పుడు,

20 “నేను ఎల్లప్పుడూ వారికి బట్టలు ఇచ్చాను. వారికి వెచ్చదనం కోసం నా గొర్రెల స్వంతబొచ్చు నేను ఉపయోగించాను. అప్పుడు వారు హృదయపూర్వకంగా నన్ను ఆశీర్వదించారు.

21 న్యాయస్థానంలో నేను గెలుస్తానని తెలిసికూడ ఒక అనాధ బిడ్డను నేను మోసం చేస్తే,

22 నేను ఒకవేళ అలాచేస్తే నా భుజం నుండి నా చేయి ఊడి పడిపోవును గాక. నా చేయి దాని కీలు నుండి పడిపోవును గాక.

23 కాని ఆ చెడ్డ పనులు ఏవీ నేను చేయలేదు. ఎందుకంటే, దేవుని శిక్షకు నేను భయపడ్డాను. ఆయన మహాత్మ్యము నన్ను బెదరగొట్టేను.

24 “నా ఐశ్వర్యాలను నేను ఎన్నడూ నమ్ముకొనలేదు. ‘నీవే నా ఆశ అని’ స్వచ్ఛమైన బంగారంతో నేను ఎన్నడూ చెప్పలేదు.

25 నేను ధనికుడను అని ఎన్నడు గర్వంతో నిండి పోలేదు. లేక నేను సంపాదించిన ఐశ్వర్యాలతో మురిసిపోలేదు.

26 నేను ఎన్నడూ ప్రకాశమైన సూర్యుణ్ణి లేక అందమైన చంద్రుణ్ణి ఆరాధించలేదు.

27 సూర్య చంద్రులకు భక్తితో పూజ చేసేందుకు నేను ఎన్నడూ మోసగించబడలేదు.

28 అలాంటిని ఏవైనా, ఎన్నడైనా నేను చేసి ఉంటే అవి నేను శిక్షించబడాల్సిన పాపాలే. ఎందుచేత నంటే ఆ చెడు కార్యాలు చేయటం మూలంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నేను అపనమ్మకమైన వాడినవుతాను.

29 “నా శత్రువులు నాశనం చేయబడినప్పుడు నేను ఎన్నడూ సంతోషించలేదు. నా శత్రువులకు కష్టాలు కలిగినప్పుడు నేను ఎన్నడూ నవ్వలేదు.

30 నా శత్రువులను శపించటం ద్వారానూ, వారుచావాలని కోరుకోవటం ద్వారానూ, నేను ఎన్నడూ నా నోటితో పాపం చేయలేదు.

31 పరాయి వాళ్లకు నేను ఎల్లప్పుడూ భోజనం పెట్టినట్లు నా ఇంట్లోని వాళ్లందరకూ తెలుసు.

32 పరాయి వాళ్లు రాత్రి పూట వీధుల్లో నిద్రపోవాల్సిన అవసరం లేకుండా నేను అలాంటి వారిని ఎల్లప్పుడూ నా ఇంటికి ఆహ్వానించేవాడను.

33 ఇతరులు తమ పాపాలు దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. కాని నేను నా దొషాన్ని దాచిపెట్టలేదు.

34 ఎందుకంటే, ప్రజలు ఏమనుకుంటారో అని నేను ఎన్నడూ భయపడలేదు. నేను ఎన్నడూ మౌనంగా ఉండలేదు. బయటకు వెళ్లకుండా ఉండలేదు. ఎందుకంటే, ప్రజలు నన్ను ద్వేషిస్తారనే భయంనాకు లేదు గనుక.

35 “ఆహా, ఎవరైనా నా మాటలు వినేవారు ఉంటే బాగుండును. ఇప్పుడు నేను నా వాదం చెబుతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు జవాబిచ్చును గాక. నన్ను నిందించే ఆయన, నేను చేశానని నిందించబడుతున్న సంగతులను రాసి పెట్టును గాక.

36 నిశ్చయంగా ఆ రాతను నేను నా భుజం మీద ధరిసాను. నేను దానిని కిరీటంలా ధరిస్తాను.

37 నేను చేసినది సమస్తం దేవునికి నేను వివరిస్తాను. నేను ఒక అధికారిలా నా తలపైకి ఎత్తుకొని దేవుని దగ్గరకు వస్తాను.

38 నేను సాగుచేస్తున్న భూమిని దాని సొంతదారుని దగ్గర దొంగిలించి తీసుకొని ఉంటే, ఆ భూమిదాని సొంత కన్నీళ్లతో తడిసి ఉంటే,

39 ఆ భూమి పండించిన వాటిని రైతులకు విలువ చెల్లించకుండానే నేను దొంగిలించి ఉంటే,

40 అవును, ఈ చెడుకార్యాలు నేను కనుక చేసి ఉంటే పొలాల్లో గోధుమకు బదులు ముండ్లు, యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక!” యోబు మాటలు సమాస్తం.

32

1 అప్పుడు యోబు స్నేహితులు ముగ్గురూ యోబుకు జవాబు ఇచ్చే ప్రయత్నం విర మించుకొన్నారు. యోబు తన మట్టుకు తాను నిర్దోషినని అనుకోవడం చేత వారు విరమించుకొన్నారు.

2 ఎలీహు అనే పేరు గల ఒకతను అక్కడ ఉన్నాడు. ఎలీహు బరకెయేలు కుమారుడు. బరకెయేలు బూజు సంతతి వాడు. ఎలీహు రాము వంశస్థుడు. ఎలీహు యోబు మీద చాలా కోపగించాడు. ఎందుకంటే యోబు తన మట్టుకుతానే మంచివాడినని చెప్పు కొంటున్నాడు. మరియు యోబు తాను దేవునికంటే నీతిమంతుణ్ణి అని చెబుతున్నాడు.

3 కాబట్టి ఎలీహు యోబు స్నేహితుల మీద కూడా కోపగించాడు. ఎందు కంటే యోబు స్నేహితులు ముగ్గురూ యోబు ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక యోబుదే తప్పు అని రుజువు చేయలేకపోయారు.

4 అక్కడ ఉన్న వారిలో ఎలీహు చాలా చిన్నవాడు. కనుక ప్రతి ఒక్కరూ మాట్లాడటం అయ్యేంత వరకు అతడు వేచి ఉన్నాడు. అప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభించవచ్చు అనుకొన్నాడు.

5 యోబు స్నేహితులు ముగ్గురూ చెప్పాల్సింది ఇంక ఏమీలేదని ఎలీహు చూచినప్పుడు అతనికి కోపం వచ్చింది.

6 కనుక ఎలీహు మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు: “నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు. అందుకే నేను అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పాడానికి భయపడుతున్నాను.

7 ‘పెద్దవాళ్లు ముందుగా మాట్లాడాలి. చాలా సంవత్సరాలు బతికిన మనుష్యులు తమ జ్ఞానాన్ని పంచి ఇవ్వాలి’ అని నాలో నేను అనుకొన్నాను.

8 కాని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుని ‘ఊపిరి’ ఆ వ్యక్తికి జ్ఞానం ప్రసాదిస్తుంది.

9 వృద్ధులు మాత్రమే జ్ఞానం గల మనుష్యులు కారు. వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సరియైన అవగాహన గలవారు కారు.

10 “అందువల్లనే ఎలీహు అనే నేను నా మాట వినమని చెబుతున్నాను. నేను తలచేదేమిటో కూడా నేను మీతో చెబుతాను.

11 మీరు మాట్లాడుతూ ఉన్నంతసేపూ నేను సహనంతో వేచి ఉన్నాను. మీరు యోబుకు చెప్పిన జవాబులు నేను విన్నాను.

12 మీరు తెలివిగల మాటలతో యోబుకు జవాబు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నంతసేపూ నేను శ్రద్ధగా విన్నాను. కాని యోబుదే తప్పు అని మీరు ముగ్గురూ రుజువు చేయలేదు. యోబు వాదాలకు మీలో ఒక్కరూ జవాబు చెప్పలేదు.

13 మీరు ముగ్గురూ జ్ఞానం కనుగొన్నట్టు చెప్పలేరు. యోబు వాదాలకు దేవుడే జవాబు చెప్పాలి కాని మనుష్యులు కాదు.

14 కాని యోబు నాతో వాదించలేదు. అందుచేత మీరు ముగ్గురూ ప్రయోగించిన వాదాలను నేను ఉపయోగించను.

15 “యోబూ, నీ ముగ్గరు స్నేహితులూ ఇబ్బంది పడిపోతున్నారు. వారు చెప్పాల్సింది ఇంక ఏమీ లేదు. వారి వద్ద జవాబులు ఇంకేమీ లేవు.

16 ఈ ముగ్గురు మనుష్యులూ మౌనంగా ఉన్నారు, అక్కడే నిలబడ్డారు, జవాబు ఏమీ లేదు. కనుక నేను ఇంకా వేచి ఉండాలా?

17 లేదు! నేను కూడా నా జవాబు చెబుతాను. నేను తలుస్తున్నది కూడ నీతో చెబుతాను.

18 ఎందుకంటే, నేను చెప్పాల్సింది చాలా ఉంది. నాలో ఉన్న ఆత్మ నన్ను మాట్లాడమని బలవంతం చేస్తోంది.

19 కొద్ది సేపట్లో పోర్లిపోయే ద్రాక్షారసంలా నా అంతరంగంలో నేను ఉన్నాను. త్వరలో పగిలిపోబో తున్న కొత్త ద్రాక్షా తిత్తిలా నేను ఉన్నాను.

20 కనుక నేను మాట్లాడాలి. అప్పుడు నాకు బాగుంటుంది. నేను నా పెదాలు తెరచి యోబు ఆరోపణలకు జవాబు చెప్పాలి.

21 ఈ వాదంలో నేను ఎవరి పక్షమూ వహించను. నేను ఎవరినీ పొగడను. నేనేమి చెప్పాలో దానిని చెబుతాను.

22 ఒక మనిషిని ఎలా పొగడాలో నాకు తెలియదు. ఒకరిని ఎలా పొగడాలో నాకు తెలిసి ఉంటే వెంటనే దేవుడు నన్ను శిక్షిస్తాడు.

33

1 అయితే యోబూ, దయచేసి నా సందేశాన్నివిను. నేను చెప్పే మాటలు గమనించు.

2 త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను.

3 నా హృదయం నిజాయితీ గలది. కనుక నిజాయితీగల మాటలను నేను చెబుతాను. నాకు తెలిసిన సంగతులను గూర్చి నేను సత్యం చెబుతాను.

4 దేవుని ఆత్మ నన్ను చేసింది. నా జీవం సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చింది.

5 యోబూ, విను. నీవు చెప్పగలవనుకొంటే నాకు జవాబు చెప్పు. నీవు నాతో వాదించగలిగేందుకు నీ జవాబులు సిద్ధం చేసుకో.

6 దేవుని ఎదుట నీవు, నేను సమానం. మన ఇద్దరిని చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు.

7 యోబూ, నన్ను గూర్చి భయపడకు. నేను నీ యెడల కఠినంగా ఉండను.

8 కాని యోబూ, నీవు చెబుతూండగా నేను విన్నది ఇదే.

9 నీవు అన్నావు: ‘యోబు అనే నేను నిర్దోషిని, నేను పాపం చేయలేదు. లేక ఏ తప్పు చేయలేదు. నేను దోషిని కాను.

10 నేను ఏ తప్పు చేయక పోయినప్పటికి దేవుడు నాలో ఏదో తప్పుకనుగొన్నాడు. యోబు అనేనేను దేవుని శత్రువును అని ఆయన తలుస్తున్నాడు.

11 కనుక దేవుడు నా పాదాలకు సంకెళ్లు వేస్తున్నాడు. నేను చేసేది సమస్తం దేవుడు గమనిస్తున్నాడు.

12 “కాని యోబూ, దీని విషయం నీది తప్పు అని నేను నీ తో చెప్పాలి. ఎందుకంటే దేవునికి అందరి కంటే ఎక్కువ తెలుసు కనుక.

13 యోబూ, నీవు ఎందుకు ఆరోపణ చేస్తూ దేవునితో వాదిస్తావు? దేవుడు చేసే ప్రతిదాని గూర్చీ ఆయన నీకు వివరించటం లేదని నీవెందుకు ఆలోచిస్తావు?

14 అయితే దేవుడు చేసే దాన్ని గూర్చి ఆయన వివరిస్తాడు. దేవుడు వేరువేరు విధానాలలో మాట్లాడతాడు. కానీ మనుష్యులు దాన్ని గ్రహించరు.

15 [This verse may not be a part of this translation]

16 [This verse may not be a part of this translation]

17 మనుష్యులు చెడు సంగతులు జరిగించటం మాని వేయాలని, గర్విష్టులు, కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు.

18 “మనుష్యులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించాలని హెచ్చరిస్తాడు. ఒక వ్యక్తి నాశనం చేయబడకుండా రక్షించటానికి దేవుడు అలా చేస్తాడు.

19 “లేక ఒక వ్యక్తి పడగ మీద ఉండి దేవుని శిక్ష అనుభవిస్తుప్పుడు దేవుని స్వరం వినవచ్చును. ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టిన ట్లు అతడు బాధ పడుతున్నాడు.

20 ఆ వ్యక్తి భోజనం చేయలేడు. శ్రేష్టమైన భోజనం కూడ అసహ్యించుకొనేంతగా అతడు బాధ పడతాడు.

21 అతని చర్మం వేలాడేటంతగా, అతని ఎముకలు పోడుచుకొని వచ్చేంతగా అతని శరీరం పాడైపోతుంది.

22 ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు. అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది.

23 “కాని ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయటానికి ఒక దేవదూత ఉండునేమో. నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి తెలియజేస్తాడు.

24 మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎడల దయగాఉంటాడు, ‘ఈ మనిషిని చావు స్థలం నుండి రక్షించండి. అతని పక్షంగా చెల్లించేందుకు నేను ఒక మార్గం కనుగొన్నాను’

25 అప్పుడు ఆ మనిషి శరీరం మరల యవ్వనాన్ని, బలాన్ని పొందుతుంది. ఆ మనిషి యువకునిగా ఉన్నప్పటివలెనే ఉంటాడు.

26 ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వింటాడు. అప్పుడు ఆ మనిషి దేవుని ఆరాధిస్తూ సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే, దేవుడు అతనికి సహజమైన మంచి జీవితాన్ని మరల ఇస్తాడు గనుక.

27 అప్పుడు ఆ మనిషి ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. అతడు చెబుతాడు, ‘నేను పాపం చేశాను. మంచిని నేను చెడుగా మార్చాను. కానీ దేవుడు శిక్షించాల్సి నంత కఠినంగా నన్ను శిక్షించలేదు.

28 నా ఆత్మ ఖనన స్థలానికి వెళ్లకుండా దేవుడు నన్ను రక్షించాడు. నేను చాలాకాలం జీవిస్తాను. నేను మరల జీవితాన్ని అనుభవిస్తాను.’

29 “ఒక మనిషికి దేవుడు ఈ సంగతులను మరల మరల చేస్తాడు.

30 ఆ మనిషిని హెచ్చరించి, అతని ఆత్మను మరణ స్థలం నుండి రక్షించేందుకు. అప్పుడు ఆ మనిషి తన జీవితాన్ని అనుభవించవచ్చు.

31 “యోబూ, నా మాట గమనించు. నా మాటవిను. మౌనంగా ఉండి, నన్ను మాట్లాడనియ్యి.

32 యోబూ, నీవు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నన్ను వినని. ఎందుకంటే, నీవు నిర్దోషిని అని రుజువు చేయగోరుతున్నాను గనుక. నీ వాదాన్ని సరిదిద్దేలాగా నాకు వినిపించు.

33 కానీ యోబూ, నీవు చెప్పాల్సింది ఏమీ లేకపోతే నా మాట విను. మౌనంగా ఉండు, జ్ఞానం గలిగి ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను.”

34

1 అప్పుడు ఎలీహు మాట్లాడటం కొన సాగించాడు:

2 “జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి. తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి.

3 చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది. అదే విధంగా నాలుక, తన తాకే వాటిని రుచి చూస్తుంది.

4 అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి. ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చు కొంటాం.

5 యోబు అంటున్నాడు, ‘యోబు అనే నేను నిర్దోషిని. కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు.

6 నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు. నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’

7 “యోబులాంటి వ్యక్తి మరొకడు లేడు. మీరు యోబును అవమానించినప్పటికి అతడు లెక్క చేయడు.

8 చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు. దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం.

9 ‘ఎందుకంటే, ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలుగదు అని యోబు చెబుతున్నాడు.

10 “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాటవినండి. దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు.

11 ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు. మనుష్యలకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు.

12 ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు. సర్వశక్తి మంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు.

13 భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు? భూభారాన్ని దేవునికి ఎవరు అప్పగించారు? (దేవుడు అన్నింటినీ పుట్టించాడు మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.)

14 దేవుడు తన ఆత్మను, తన ప్రాణవాయువును మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అనుకొంటే

15 అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చని పోతారు. అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.

16 ‘మీరు జ్ఞానంగల వారైతే, నేను చెప్పేది వినండి.

17 న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషి పరిపాలకునిగా ఉండజాలడు. యోబూ, బలమైన మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు తలుస్తున్నావా?

18 ‘మీరు పనికిమాలిన వాళ్లు’ అని రాజులతో చెప్పేవాడు దేవుడు. ‘మీరు దుర్మార్గులు’ అని నాయకులతో దేవుడు చెబుతాడు.

19 దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు. దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు. ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక.

20 ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించ వచ్చును. మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు. వారు మరణిస్తారు. ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు.

21 మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు.

22 దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొనేందుకు చీకటి చోటు ఏమీ లేదు. ఏ చోటైన చీకటిగా ఉండదు.

23 మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు. మనుష్యులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు.

24 దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు.

25 కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు. అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి, వారిని నాశనం చేస్తాడు.

26 చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఆ చెడ్డవారిని అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు

27 ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత కావటం మానివేశారు గనుక. మరియు ఆయన కొరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య పెట్టలేదు గనుక.

28 పేద ప్రజలను బాధించి, వారు సహాయం కోసం దేవునికి మొర పెట్టేలాగా ఆ చెడ్డవాళ్లు చేశారు. మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టి నప్పుడు ఆయన వింటాడు.

29 కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయ కూడదని కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ ఆయనను దోషిగా నిర్ణయించలేరు ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు. అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను పాలిస్తాడు.

30 తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని దేవుడు పాలకునిగా ఉండనివ్వడు.

31 ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును: ‘నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను.

32 దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు. నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.

33 కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ ఉండగా, నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా? యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు. నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు.

34 జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో ఏకిభవిస్తాడు. నా మాటలు వినే జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అని అంటారు,

35 ‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు. యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’

36 యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ. ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనుక.

37 యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం అదనంగా కలిపాడు. యోబు మనలను అవమానించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.”

35

1 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. అతడు అన్నాడు:

2 “ యోబూ, నీవు యోబు అనే నేను ‘దేవునికంటె ఎక్కువ సక్రమంగా ఉన్నాను’ అని చెప్పటం న్యాయం కాదు.

3 యోబూ, నీవు దేవుణ్ణి, ‘దేవా, ఒక మనిషి, దేవుని సంతోష పరచుటవలన ఏమి పొందుతాడు? నా పాపం నిన్నెలా బాధిస్తుంది? నేను పాపం చేయక పోతే నాకేం మంచి లభిస్తుంది?’ అని అడుగు.

4 “యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.

5 యోబూ, పైన ఆకాశం చూడు. పైకి చూచి, మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో.

6 యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధ పెట్టదు. ఒకవేళ నీ పాపాలు చాలా ఉంటే అవి దేవునికి ఏమీ చేయలేవు.

7 యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి సహాయం చేయదు. నీనుండి దేవునికి ఏమీ రాదు.

8 యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి వాళ్లను మాత్రమే బాధిస్తాయి. (అవి దేవునికి సహాయకారి కావు మరియు దేవుణ్ణి బాధించవు.)

9 “మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామర్శించబడితే సహాయం కోసం వారు మొరపెడతారు. శక్తివంతమైన వాళ్లు తమకు సహాయాన్ని చేయాలని వారు బతిమలాడుతారు.

10 కానీ సహాయం కోసం వారు దేవుని వేడుకోరు. ‘నన్ను తయారు చేసి, నా ఆనందం కోసం రాత్రులలో పాటలు ఇచ్చినటువంటి దేవుడెక్కడ? అని ఎవరూ అనరు.

11 సహాయం కోసం వారు దేవుని అడగరు. దేవుడే మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు. జంతువులను, పక్షులను దేవుడు జ్ఞానంగల వాటినిగా చేయలేదు.’

12 “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు. కనుక వారు సహాయం కోసం దేవునికి మొరపెడితే దేవుడు వారికి జవాబు ఇవ్వడు.

13 వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అదినిజం. సర్వశక్తిగల దేవుడు వారిపట్ల శ్రద్ధ చూపడు.

14 యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు, దేవుడు నీ మాట వినడు. దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించు కొనే అవకాశంకోసం నిరీక్షిస్తున్నానని నీవు అంటున్నావు.

15 యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ, పాపాన్ని దేవుడు లక్ష్యపెట్టడనీ నీవు తలస్తున్నావు.

16 కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు. యోబు మాట్లాడుతోంది ఏమిటో అతనికే తెలియదు.”

36

1 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు.

2 “యోబూ, నాతో ఇంకొంచెం ఓపికగా ఉండు. దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని నేను నీకు చూపిస్తాను.

3 నా జ్ఞానాన్ని అందరితోనూ పంచుకొంటాను. దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు న్యాయంగల వాడని నేను రుజువు చేస్తాను.

4 యోబూ, నేను చెప్పేది ప్రతీదీ సత్యం. నేను చెప్తున్నదేమిటో తెలిసే చెప్తున్నాను.

5 “దేవుడు శక్తివంతమైనవాడు, కానీ ఆయన మనుష్యులను ద్వేషించడు. దేవుడు మహత్తర శక్తిమంతుడు, ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి.

6 దుర్మార్గులను దేవుడు బ్రతుకనివ్వడు. పేద ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు న్యాయం జరిగిస్తాడు.

7 ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం దేవుడు శ్రద్ధ చూపిస్తాడు. మంచి వాళ్లను ఆయన పాలకులుగా ఉండనిస్తాడు. మంచి వాళ్లకు దేవుడు శాశ్వతమైన ఘనత ఇస్తాడు.

8 కానీ మనుష్యులు శిక్షించబడుతూ సంకెళ్లతో ఉంటే ఒకవేళ మనుష్యులు శ్రమపడతూ, కష్టాలు అనుభవిస్తోంటే,

9 వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబుతాడు. వారు పాపం చేశారని, వారు అతిశయించారని దేవుడు వారికి చెబుతాడు.

10 దేవుడు వాళ్ల చెవులు వినేలా తెరుస్తాడు. వారు పాపం చేయటం చాలించాలని ఆయన వారికి ఆజ్ఞ ఇస్తాడు.

11 ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు విధేయులైతే, దేవుడు వారిని విజయవంతమైన ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు.

12 కానీ ఆ మనుష్యులు దేవునికి విధేయులయ్యేందుకు నిరాకరిస్తే వారు మృతుల లోకంలో చేరిపోతారు. ఏది నిజమైన జ్ఞానమో తెలియకుండా వాళ్లు (మూర్ఖులుగా) చనిపోతారు.

13 “దేవుని గూర్చి లక్ష్యపెట్టని మనుష్యులు ఎల్లప్పుడూ కక్షతో ఉంటారు. దేవుడు వారిని శిక్షించినప్పటికీ, వారు సహాయం కోసం దేవుని ప్రార్థించ నిరాకరిస్తారు.

14 ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే మరణిస్తారు. మగ వ్యభిచారులతోబాటు వారుకూడా అవమానంతో మరణిస్తారు.

15 కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు. మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయోగిస్తాడు.

16 యోబూ, దేవుడు నీ మీద దయ చూపించి, నీ కష్టాల నుండి నిన్ను బయటకు రప్పించి నీకు సహాయం చేయాలని దేవుడు కోరుతున్నాడు.దేవుడు నీకు క్షేమకరమైన స్థలం ఇవ్వాలనీ నీ బల్లమీద సమృద్ధిగా భోజనం ఉంచాలనీ కోరుతున్నాడు.

17 కానీ యోబూ, దుర్మార్గులవలె నీవు శిక్షించబడుతున్నావు. దేవుని న్యాయం, తీర్పు నిన్ను పట్టేశాయి.

18 యోబూ, ధనం నీ చేత తప్పు చేయించనీయకుండును గాక. విస్తారమైన ధనాశ చూపించినందువల్ల మోసపోవద్దు.

19 నీ ధనం అంతా ఇప్పుడు నీకు సహాయం చేయలేదని నీకు తెలుసు. శక్తిమంతుల సహాయం కోసం మొరపెట్టినందువల్ల ఏమి లాభం లేదు.

20 ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం ఆశించకు. (వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని అనుకొంటున్నారు.)

21 యోబూ, తప్పు చేయకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే నీవు ఈ కష్టాన్ని ఎన్నుకొన్నావు.

22 “దేవునికి చాలా శక్తి ఉంది. దేవుడే అందరిలోకెల్ల గొప్ప ఉపదేశకుడు.

23 ఏమి చేయాలి అనేది దేవునికి ఎవరూ చెప్పలేరు. ‘దేవా నీవు తప్పు చేశావు’ అని ఎవరూ దేవునికి చెప్పలేరు.

24 “దేవునిని తాను చేసిన పనిని బట్టి స్తుతించటం మరువకు. మనుష్యులు దేవునిని కీర్తనలతో స్తుతించారు.

25 ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు. మనుష్యులు దేవుని పనిని దూరం నుండి చూశారు.

26 దేవుడు గొప్పవాడు. అది నిజం . ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేం. దేవునికి ఎన్ని సంవత్సరాలో ఏ మనిషీ లెక్కించలేడు.

27 “దేవుడు భూమి నుండి నీళ్లు తీసుకొని దాన్ని వర్షంగా మారుస్తాడు.

28 ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు. మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది.

29 దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి గ్రహించలేడు. దేవుడు నివసించే ఆకాశంలోనుంచి ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించలేడు.

30 అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు.

31 రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం ఇచ్చేందుకు దేవుడు ఈ మేఘాలను ప్రయోగిస్తాడు.

32 దేవుడు మెరుపులను తన చేతితో పట్టుకొంటాడు. దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు దానికి ఆజ్ఞాపిస్తాడు.

33 తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది. తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా తెలుసు.

37

1 “ఉరుములు, మెరుపులు నన్ను భయపెడతాయి. నేను ఈ విషయాలు తలచినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకొంటుంది.

2 ప్రతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా ధ్వనిస్తుంది. దేవుని నోటి నుండి వస్తోన్న ఉరుముశబ్దం వినండి

3 మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన మెరుపును పంపిస్తాడు. అది భూమి అంతట మెరిసింది.

4 మెరుపు మెరిసిన తర్వాత గర్జించే దేవుని స్వరం వినవచ్చును. దేవుడు తన ఆశ్చర్యకరమైన స్వరంతో ఉరుముతాడు. మెరుపు మెరుస్తూ ఉండగా దేవుని స్వరం ఉరుముతుంది.

5 దేవుడు ఉరిమే స్వరం అద్భుతం. మనం గ్రహించజాలని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.

6 ‘నేలమీద పడు’ అని ఆయన మంచుతో చెబుతాడు. ‘నేలమీద వర్షించు’ అని దేవుడు వర్షంతో చెబుతాడు.

7 దేవుడు ఏమి చేయగలడో అనేది అయన సృజించిన మనుష్యులంతా తెలుసుకొనేందుకు అలా చేస్తాడు.

8 మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ నివసిస్తాయి.

9 తుఫాను దక్షిణం నుండి వస్తుంది. చలి ఉత్తరం నుండి వస్తుంది.

10 దేవుని ఊపిరి మంచును చేస్తుంది. అది మహాసముద్రాలను గడ్డ కట్టిస్తుంది

11 దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు. ఆయన తన మెరుపును మేఘాల ద్వారా విస్తరింప చేస్తాడు.

12 భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏమి చెబితే అది మేఘాలు చేస్తాయి.

13 దేవుడు మనుష్యులను శిక్షించేందుకు, వరదలను లేదా తన ప్రేమ చూపుటకై వర్షం రప్పించేందుకు మేఘాలను తీసుకొని వస్తాడు.

14 “యోబూ, ఒక నిమిషం ఆగి విను. ఆగి, దేవుడు చేసే అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు.

15 యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా? దేవుడు తన మెరుపును ఎలా ప్రకాశింప చేస్తాడో నీకు తెలుసా?

16 ఆకాశంలో మేఘాలు ఎలా వేలాడుతాయో నీకు తెలుసా? దేవుని జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు.

17 లేదు, “యోబూ, ఈ సంగతులు నీకు తెలియపు. దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా ఉండటం మాత్రమే నీకు తెలుసు.

18 యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు మెరుగుదిద్దిన అద్దంలా దానిని గట్టిగా చేసేందుకు నీవు దేవునికి సహాయం చేయగలవా?

19 “యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు. మేము చీకటిలో ఉన్నందువల్ల సరియైన మా వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలే కున్నాము.(దేవుని సన్నిధిలో) ఏమి చెప్పడానికీ మాకు తెలియడంలేదు.

20 నేను దేవునితో మాట్లాడాలని నేను ఆయనతో చెప్పను. అలా చెప్పటం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది.

21 ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడలేడు. గాలి మేఘాలను తరిమి వేసిన తరువాత అది ఆకాశంలో చాలా తేజోవంతంగా ప్రకాశిస్తుంది.

22 (అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది. దేవుడు అద్భుత మహిమతో వస్తాడు.

23 సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా గొప్పవాడు. మనం దేవుని దగ్గరగా వెళ్లలేం. దేవుడు మనుష్యుల్ని ఎల్లప్పుడూ సరిగ్గాను, న్యాయంగాను చూస్తాడు.

24 అందువల్లనే మనుష్యులు దేవుని గౌరవిస్తారు. కానీ తెలివిగల వాళ్లం అనుకొనే గర్విష్ఠులను దేవుడు లక్ష్యపెట్టడు.

38

1 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు జవాబు ఇచ్చాడు. దేవుడు చెప్పాడు:

2 “నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన, తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే ఈ మనిషి ఎవరు?”

3 యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు. నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగాఉండు.

4 యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.

5 యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు? నీకు తెలిసినట్టే ఉంది! కొల బద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు.

6 భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి? భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?

7 అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసిపాడాయి. దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.

8 “యోబూ, భూమి అగాధములో నుండి సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు?

9 ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను. మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.

10 సముద్రానికి హద్దులు నేనే నియమించాను. మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను.

11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు. నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.

12 “యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో నీవు ఎప్పుడైనా చెప్పావా?

13 యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని, దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా?

14 ఉదయపు వెలుగు కొండలు, లోయలు కనబడేటట్టు చేస్తుంది. పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి. అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా ఆ స్థలాలు ఆకారాలు రూపొందు తాయి.

15 దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు. అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది.

16 “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా? మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా?

17 యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా?

18 యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా? ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు.

19 “యోబూ, వెలుగు వచ్చే దిశగా పోయేందుకు ఎటు వెళ్లాలి? చీకటి ఎక్కడ నుండి వస్తుంది?

20 యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా? అవి నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా?

21 యోబూ, నీవు చాలా ముసలివాడిని కదా? భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ?

22 యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ ఉంచే గిడ్డంగులకు నీవు ఎప్పుడైనా వెళ్లావా?

23 కష్టదినాల్లో ఉపయోగించేందుకు యుద్ధాన్ని, పోరాట దినాలకు ఉపయోగించేందుకు హిమమును, వడగండ్లను నేను దాచిపెడతాను.

24 యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పైకి వస్తాడో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా? భూమి అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడనుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా?

25 యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు? ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు?

26 యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట నీళ్లు ఉండునట్లు.

27 బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి, ఈ సంగతులను చేసిన వారు ఎవరు?

28 యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి?

29 యోబూ, హిమమునకు తల్లి ఎవరు? ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు?

30 జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి?

31 “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా? మృగశీర్షకు కట్లు నీవు విప్పగలవా?

32 యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్టు నీవు చేయగలవా? లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా?

33 యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా? భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా?

34 యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా?

35 యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా? మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’ అని అంటాయా?

36 ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు? మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు?

37 యోబూ, మేఘాలను లెక్కించుటకు, అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు?

38 ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది. ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.

39 “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా? ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?

40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో పండుకొని లేక కూర్చొని ఉంటాయి.

41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు కాకులను పోషించేది ఎవరు?

39

1 “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా? తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా?

2 యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా? అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?

3 అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి. అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.

4 తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి. అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.

5 “యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు? వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు?

6 అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను). అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను.

7 అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు. ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు.

8 అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి. అక్కడే అవి గడ్డి తింటాయి. తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.

9 “యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా? రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుందా ?

10 యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా? నీ కోసం అది లోయలను దున్నుతుందా?

11 యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు నీవు దానిమీద ఆధార పడగలవా? మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా?

12 నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?

13 నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది. (కానీ అది ఎగుర లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్కల్లాంటివి కావు.

14 నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది. ఇసుకలో అవి వెచ్చగా అవుతాయి.

15 ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని లేక ఏదైనా అడవి జంతువు వాటిని పగుల గొట్టవచ్చని నిప్పుకోడి మరచిపోతుంది.

16 “నిప్పుకోడి తన పిల్లలను చూడదు. ఆ పిల్లలు తనవి కానట్టే చూస్తూంది. దాని పిల్లలు చస్తే దాని ప్రయాస అంతా వ్యర్థం అయిందనే విషయం దానికి లక్ష్యం లేదు.

17 ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు. నిప్పుకోడి తెలివి తక్కువది. నేను దాన్ని అలాగే చేశాను.

18 కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది. ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.

19 “యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా? లేక దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు పెట్టావా?

20 యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా? గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మనుష్యుల్ని భయపెడ్తుంది.

21 గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది. అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్ధానికి వెళ్లేటప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుంది

22 భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది. అది భయపడదు. యుద్ధం నుండి అది పారిపోదు.

23 గుర్రం మీద అంబులపొది వణకుతుంది. దానిరౌతువద్ద ఉన్న బల్లెం, ఆయుధాలు సూర్యకాంతిలో తళతళలాడుతాయి.

24 గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది. బూరధ్వని వింటే గుర్రం ఇంక నిలబడలేదు.

25 బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓ హో’ అంటుంది. దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది. సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.

26 “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా?

27 యోబూ, పక్షిరాజు ఎగరాలని, పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా?

28 పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది. ఆ బండ పక్షిరాజు యొక్క కోట.

29 పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది. దూరంలో ఉన్న ఆహారాన్ని అది చూడగలదు.

30 పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి. అవి చచ్చిన శవాల చుట్టూరా చేరుతాయి.”

40

1 యోబూతో యెహోవా ఇలా చెప్పాడు:

2 “యోబూ, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు వాదించావు. తప్పు చేశానని నీవు నాకు తీర్పు చెప్పావు. ఇప్పుడు నీవు తప్పుచేశావని ఒప్పుకుంటావా? నాకు జవాబు ఇస్తావా?”

3 అప్పుడు దేవునికి యోబు ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:

4 “నేను ముఖ్యం కాదు. నీకు నేను ఏమి చెప్పగలను? నీకు నేను జవాబు ఇవ్వలేను. నా చేతితో నేను నా నోరు మూసుకొంటాను.

5 నేను ఒకసారి మాట్లాడాను కానీ నేను మరల జవాబు ఇవ్వను. నేను రెండుసార్లు మాట్లాడాను. కానీ నేను ఇంకా ఏమీ చెప్పను.”

6 అప్పుడు యెహోవా తుఫానులోంచి మరల యోబుతో ఇలా మాట్లాడాడు. యెహోవా అన్నాడు:

7 “ యోబూ, మగవాడిలా నిలబడు. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నాకు జవాబు చెప్పు.

8 యోబూ నేను న్యాయంగా లేనని నీవు తలుస్తున్నావా? నీదే సరిగ్గా ఉన్నట్లు కనబడేలా చేయాలని, నేను తప్పు చేశానని నీవు నన్ను నిందిస్తావా?

9 యోబూ, నీ చేతులు దేవుని చేతులంత బలంగా ఉన్నాయా? నీ స్వరాన్ని నా స్వరంలా ఉరిమేట్టు నీవు చేయగలవా?

10 ఒకవేళ నీవు అలా దేవునిలా చేయగలిగితే నీకు నీవే ఘనత, మహిమ, ఆపాదించుకో. మహిమ, తేజస్సును వస్త్రాల్లా ధరించు.

11 యోబూ, నీవు నావలె ఉంటే గర్విష్ఠులను తక్కువగా చూడు. యోబూ, ఆ గర్విష్ఠుల మీద నీ కోపం కుమ్మరించు. ఆ గర్విష్ఠులను దీనులుగా చేయి.

12 అవును, యోబూ, ఆ గర్విష్ఠులను చూడు. వారిని దీనులనుగా చేయి. దుర్మార్గులను వారు ఉన్న చోటనే చితుకగొట్టు.

13 గర్విష్ఠులందరినీ మట్టిలో పాతిపెట్టు. వారి శరీరాలను చుట్టేసి వారి సమాధులలో పెట్టు

14 యోబూ, నీవు గనుక వీటన్నింటినీ చేయగలిగితే అప్పుడు నిన్ను నీవే రక్షించుకొనుటకు సమర్ధుడ వని నీ దగ్గర నేను ఒప్పుకొంటాను.

15 యోబూ, నీటి గుర్రాన్ని చూడు. నేను (దేవుణ్ణి) నీటి గుర్రాన్ని చేశాను. మరియు నిన్నూ (యోబు) నేను చేశాను. నీటి గుర్రం ఆవులా గడ్డి తింటుంది.

16 నీటి గుర్రం శరీరంలో చాలా బలం ఉంది. దాని కడుపులోని కండరాలు చాలా శక్తివంతంగా ఉంటాయి.

17 నీటి గుర్రం తోక దేవదారు వృక్షంలా బలంగా నిలుస్తుంది. దాని కాలి కండరాలు చాలా బలంగా ఉంటాయి.

18 నీటి గుర్రం యొక్క ఎముకలు ఇత్తడిలా గట్టిగా ఉంటాయి. దాని కాళ్లు ఇనుప కడ్డీలా ఉంటాయి.

19 నీటి గుర్రం నేను (దేవుణ్ణి) చేసిన మహా అద్భుత జంతువు. కాని నేను దానిని ఓడించగలను.

20 అడవి జంతువులు ఆడుకొనే కొండల మీద నీటి గుర్రం తినే గడ్డి పెరుగుతుంది.

21 తామర చెట్ల కింద నీటి గుర్రం పండుకుంటుంది. జమ్ము గడ్డీ మడుగులలో నీటి గుర్రం దాక్కుంటుంది.

22 తామర మొక్కలు తమ నీడలో నీటి గుర్రాన్ని దాచిపెడతాయి. నది సమీపంగా పెరిగే నిరవంజి చెట్ల కింద అది నివసిస్తుంది.

23 నది వరదలై పొర్లినా నీటి గుర్రం పారిపోదు. యొర్దాను నది దాని ముఖం మీద చిమ్మితే అది భయపడదు.

24 నీటి గుర్రానికి కళ్లు కట్టి ఒక ఉచ్చులో దానిని ఎవరూ పట్టుకొనలేరు.

41

1 “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా? దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?

2 యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు వేయగలవా? లేక దాని దవడకు గాలపు ముల్లు ఎక్కించగలవా?

3 యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బతిమాలాడుతుందా? అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా?

4 యోబూ, మొసలి నీతో ఒడంబడిక చేసు కుంటుందా? శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం చేస్తుందా?

5 యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొన గలవా మొసలితో ఆడుకొ గలవా? నీ దాసీలు దానితో ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా?

6 యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు ప్రయత్నిస్తారా? వారు దానిని వ్యాపారులకు అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా?

7 యోబూ, మొసలి చర్మం మీదికి ఎన్నో శూలాలు నీవు విసరగలవా? లేక చేపలను వేటాడే అలుగులు అనేకం దాని తలమీద కొట్టగలవా?

8 “యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసలి మీద ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ మరచిపోలేవు. మరియు నీవు దానితో మరల ఎన్నటికీ పోరాడవు.

9 ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే అది మరచిపో! అలాంటి ఆశ ఏమీ లేదు! దాన్ని చూస్తేనే నీకు భయం పుడుతుంది.

10 మొసలికి కోపం పుట్టించగలిగినంత ధైర్యంగల మనిషి ఎవరూ లేరు. కనుక అలాంటప్పుడు యోబూ, నాకువిరోధంగా నిలువగలవాడు ఎవడు?

11 నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను. ఆకాశమంతటి క్రింద ఉన్న సర్వము నాదే.

12 “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం, దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను.

13 మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు. ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు.

14 మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు. దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి.

15 మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి.

16 గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా ఆ పొలుసులు ఉంటాయి.

17 ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి. వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి.

18 మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది. దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.

19 దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి. నిప్పు కణాలు బయటకు లేస్తాయి.

20 ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది.

21 మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది. దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి.

22 “మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది. మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.

23 మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు. అది ఇనుములా గట్టిగా ఉంటుంది.

24 మొసలి గుండె బండలా ఉంటుంది. దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి కింది రాయిలా గట్టిగా ఉంటుంది.

25 మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు. మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు.

26 ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి. ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు.

27 మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక. ఇత్తడిని కుళ్లిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక.

28 బాణలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు. దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి.

29 దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది. మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది.

30 మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది. అది నడిచి నప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది.

31 కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగల పొంగిస్తుంది. నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది.

32 మొసలి ఈ దినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది. అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.

33 భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు. అది భయం లేని జంతువుగా చేయబడింది.

34 మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది. క్రూర జంతువులన్నిటికీ అది రాజు.” మరియు మొసలిని చేసినది నేనే, యెహోవాను.

42

1 అప్పుడు యెహోవాకు యోబూ ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు:

2 “యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు. నీవు పథకాలు వేస్తావు, నీ పథకాల్లో ఏదీ మార్చబడజాలదు, నిలిపివేయబడదు.

3 ‘నా సలహాను గూర్చి ఈ వెర్రి ప్రశ్నలు అడుగుతున్న ఇతడు ఎవరు?’ అని యెహోవా, నీవు ప్రశ్నించావు. నేను (యోబును) నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను. నేను తెలిసి కోలేనంత మరీ వివరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను గూర్చి నేను మాట్లాడాను.

4 “యెహోవా, ‘నీవు నాతో యెబూ, నేను నీతో మాట్లాడుతాను. నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి’ అన్నావు.

5 యెహోవా, ఇదివరకు నిన్ను గూర్చి నేను విన్నాను. కానీ ఇప్పుడు నా స్వంత కళ్లతో నేను నిన్ను చూశాను.

6 కనుక ఇప్పుడు, నన్ను గూర్చి నేను సిగ్గుపడుతున్నాను. యెహోవా, నేను విచారిస్తున్నాను. నేను ఈ ధూళిలో, బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకొంటానని వాగ్దానం చేస్తున్నాను.”

7 యెహోవా యోబుతో మాట్లాడటం చాలించిన తర్వాత, ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు తేమాను పట్టణస్థుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు: “నీ మీద, నీ యిద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను గూర్చి సరిగా చెప్పలేదు. కానీ యోబు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు.

8 కనుక ఎలీఫజూ ఇప్పుడు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకొని వెళ్లి, మీ నిమిత్తం దహనబలిగా వాటిని అర్పించండి. నా సేవకుడు యోబు మీ కోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబు ఇస్తాను. అప్పుడు మీరు శిక్షించబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించను. మీరు చాలా అవివేకంగా ఉన్నారు గనుక మీరు శిక్షించబడాలి. మీరు నన్ను గూర్చి సరైన సంగతులు చెప్పలేదు. కానీ నా సేవుకుడు యోబు, నన్ను గూర్చి స రైన సంగతులు చెప్పాడు.”

9 కనుక తేమానువాడగు ఎలీపజు, షూహి దేశస్థుడైన బిల్దదు, నయమాతీ పట్టణస్థుడైన జోఫరు యెహోవాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పినట్లు వాళ్లు చేశారు. అప్పుడు యెహోవా యోబు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు.

10 కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించటం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరల విజయం ఇచ్చాడు. యోబుకు అంతకు ముందు ఉన్నదానికి రెండంతలుగా దేవుడు ఇచ్చాడు.

11 యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకు ముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్లంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు గనుక వాళ్లంతా అతనిని ఓదార్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకు ఇచ్చారు.

12 యోబు జీవితంలో మొదటి భాగం కంటే రెండో భాగాన్ని యెహోవా అధికంగా ఆశీర్వదించాడు. పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటేలు, రెండు వేల ఆవులు, వెయ్యి ఆడ గాడిదలు యోబుకు స్వంతం అయ్యాయి.

13 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమారైలు కూడ ఉన్నారు.

14 యోబు మొదటి కుమారైకు యెమీమా అని పేరు పెట్టాడు. యోబు రెండో కుమార్తెకు కెజీయా అని పేరు పెట్టాడు. యోబు మూడో కుమార్త్తెకు కెరెంహప్పుక్ అని పేరు పెట్టాడు.

15 దేశం అంతటిలో యోబు కుమార్త్తెలు మహాగొప్ప సౌందర్యవతులు. యోబు తన కుమార్తెలకు తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. వారి సోదరులు కూడ తమ తండ్రి ఆస్తిలో వాటా పొందారు.

16 కనుక యోబు మరో నూటనలభై సంవత్సరాలు జీవించాడు. అతడు తన పిల్లలను, మనుమలు మనుమరాండ్రను, మునిమనుమలు మనుమరాండ్రను, వారి పిల్లలను చూచేంతవరకు జీవించాడు.

17 యోబు చని చోయినప్పుడు అతడు కడువృద్ధుడు. యోబు సుదీర్గమైన కాలం జీవించాడు.