1 యెహోవా దేవుని కృపవున్నందువల్ల సొలొమోను చాలా శక్తిమంతుడైన రాజుగా రూపొందాడు. యెహోవా సొలొమోనును గొప్ప వ్యక్తిగా చేశాడు.
2 సొలొమోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. అతడు సైన్యాధికారులతోను, దళాధిపతులతోను, న్యాయాధిపతులతోను, ఇంకను ఇశ్రాయేలులోని ప్రతి ఒక్క నాయకునితోను, ప్రతి కుటుంబ పెద్దతోను మాట్లాడాడు.
3 పిమ్మట సొలొమోను, అతని దగ్గరికి వచ్చిన ప్రజలందరూ కలిసి గిబియోనులో వున్న గుట్టమీదికి (ఉన్నత స్థలం) వెళ్లారు. దేవుని సన్నిధి గుడారం అక్కడ ఉంది. యోహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఎడారిలో వున్నప్పుడు ఈ గుడారాన్ని నిర్మించాడు.
4 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు కిర్యత్యారీము నుండి యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. దానిని వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని ఒడంబడిక పెట్టెను వుంచటానికి దావీదు యెరూషలేములో ఒక గుడారం ఏర్పాటు చేశాడు.
5 బెసలేలు కంచుతో ఒక బలిపీఠాన్ని తయారుచేశాడు. బెసలేలు తండ్రిపేరు ఊరి ఊరి. తండ్రి పేరు హూరు. కాని ఈ కంచు పీఠం గిబియోనులో పవిత్ర గుడారం ఎదుట వుంది. అందువల్ల సొలొమోను, ప్రజలు కలిసి దేవుని సలహా పొందటానికి గిబియోనుకు వెళ్లారు.
6 సన్నిధి గుడారం వద్ద దేవుని ముందున్న కంచుపీఠం వద్దకు సొలొమోను వెళ్లాడు. బలపీఠం మీద సొలొమోను వెయ్యి దహనబలులు అర్పించాడు.
7 ఆ రోజు రాత్రి దేవుడు సొలొమోనుకు స్వప్న దర్శనమిచ్చి యిలా అన్నాడు: “సొలొమోనూ, నీకు ఏమి కావాలో కోరుకో.”
8 సొలొమోను దేవునితో యీలా అన్నాడు: “నా తండ్రి దావీదు పట్ల నీవు చాలా దయకలిగియున్నావు. నా తండ్రి స్థానంలో కొత్త రాజుగా వ్యవహరించటానికి నీవు నన్ను ఎంపిక చేశావు.
9 నా ప్రభువైన దేవా నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చు. ఒక గొప్ప రాజ్యానికి నన్ను రాజుగా ఎంపిక చేశావు. ఇక్కడి జనాభా భూమి మీద ధూళిలా విస్తారంగా వుంది.
10 ఇప్పుడు నాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించు. దానివల్ల ఈ అశేష ప్రజానీకాన్ని సన్మార్గంలో నడిపించగలను. నీ సహాయం లేకుండా ఈ ప్రజానీకాన్ని ఏ ఒక్కడూ పరిపాలించలేడు!”
11 అది విని సొలొమోనుతో దేవుడు యీలా అన్నాడు: “నీ ప్రవర్తన బాగుంది. నీవు ఐశ్వర్యాన్నిగాని, ధనికులకుండే భోగ భాగ్యాలను గాని, పేరుప్రతిష్ఠలనుగాని కోరలేదు. నీ శత్రువులంతా నాశనం కావాలని కూడా నీవు కోరలేదు. నీవు చాలాకాలం బతకాలని దీర్ఘాయుష్షూ కోరలేదు. నా ప్రజలను పాలించటానికి నీవు తెలివిని, వివేచననూ, జ్ఞానాన్ని ప్రసాదించమని కోరావు. ఈ ప్రజలకు రాజుగా నిన్ను నేను ఎంపిక చేశాను.
12 కావున నీకు నేను తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు ధనాన్ని, భోగ భాగ్యాలను, గౌరవాన్ని కూడ నేను ఇస్తున్నాను. నీకు ముందున్న రాజులెవ్వరూ ఇంతటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని పొందియుండలేదు. నీ తరువాత వచ్చే రాజులుకూడ ఇంతటి భాగ్యాన్ని, ఘనతను కలిగియుండరు.”
13 సొలొమోను గిబియోనులోని ఆరాధనా స్థలానికి వెళ్లాడు. సన్నిధి గుడారాన్ని వదిలి, ఇశ్రాయేలు రాజుగా పాలించటానికి యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
14 సొలొమోను గుర్రాలను, రథాలను సేకరించాడు. అతనికి పద్నాలుగువందల రథాలు, పన్నెండువేల గుర్రాలు వున్నాయి. సొలొమోను నగరాలలో ప్రత్యేక రథశాలలు నిర్మించి వాటిని అక్కడ వుంచాడు. యెరూషలేములో కూడా కొన్ని గుర్రాలను, రథాలను సొలొమోను వుంచాడు. యెరూషలేములోనే రాజగృహం కూడా వుంది.
15 యెరూషలేములో సొలొమోను విస్తారంగా వెండి బంగారాలను సేకరించి నిల్వచేశాడు. అతడు వెండి బంగారాలను ఎంత మేరకు సేకరించాడనగా వాటి నిల్వలు సామాన్య రాతిగుట్టల్లా వున్నాయి. సొలొమోను సరళ వృక్షాల కలపను చాలా సేకరించాడు. అతడు సరళ చెట్ల కపలను పల్లపు ప్రాంతాలలో విస్తరించి వున్న మేడి చెట్లంత ఎక్కువగా సేకరించాడు.
16 ఈజిప్టు నుంచి, కవే (సైలీషియా అనబడే దక్షిణటర్కీ ప్రాంతం) నుంచి సొలొమోను గుర్రాలను తెప్పించాడు. రాజు వర్తకులు ఈ గుర్రాలను కవేలో కొనేవారు.
17 రాజు వర్తకులు ఈజిప్టులో ఒక్కొక్క రథాన్ని ఆరువందల తులాల వెండిని, ఒక్కొక్క గుర్రాన్ని నూట యేబది తులాల వెండిని వెచ్చించి కోనేవారు, ఆ కాలంలో వర్తకులు గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు, అరాము (సిరియా) రాజులకు కూడ అమ్మేవారు.
1 యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలచాడు.
2 సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.
3 తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు: “నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు.
4 నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవదినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.
5 “మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది.
6 నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణంచేయ లేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.
7 “కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు పదార్థాలు పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు.
8 సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు.
9 సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భతమైనదిగా వుంటుంది.
10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేలగేలనుల (మూడూ వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”
11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది: “సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.”
12 హీరాము తన సందేశంలో ఇంకా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు.
13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ.
14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము - అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము - అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడమంచి నేర్పరి. పైగా హూరాము - అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.
15 “నీవు గోధుములు, యవల, నూనె ద్రాక్షారసం నాకు పంపుతానని రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు.
16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంతకలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పా పట్టణం నుండి సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు మోయించవచ్చు.”
17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు.
18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.
1 యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు.
2 తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.
3 ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు.
4 ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు.
5 పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు.
6 ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు).
7 ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.
8 తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం ఏర్పాటు చేశాడు. అవి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు).
9 బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు.
10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు.
11 ఆ కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది.
12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది.
13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగులు దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.
14 నీలం, ఊదా, ఎరుపు పదార్థలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు చేయించాడు. ఈ తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.
15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు.
16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు.
17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి పక్క, రెండవ స్తంభం ఎడమ పక్కన నిలిపారు. సొలొమోను కుడి పక్క స్తంభానికి “యాకీను” అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు” అని పేరు పెట్టాడు.
1 ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది.
2 కరిగిన కంచును వినియోగించి సొలొమోను ఒక పెద్ద కోనేరును (సముద్రం) చేయించాడు. ఆ కోనేరు (సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. దాని చుట్టు కొలత నలుబదియైదు అడుగులు.
3 కోనేరు (సముద్రం) అంచు చుట్టూ పద్దెనిమిది అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం)ను పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి.
4 ఆ పెద్ద కోనేరు (సముద్రం) పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాలపై నిలపబడింది. మూడు గిత్తలు ఉత్తరానికి తిరిగి దక్షిణానికి తిరిగి వున్నారు. మూడు గిత్తలు వున్నాయి. మూడు గిత్తలు పడమటి వైపుకు తిరిగి వున్నాయి. మూడు గిత్తలు తూర్పు వైపుకు చూస్తూవున్నాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ గిత్తలన్నీ వాటి వెనుక భాగాలు మధ్యలో ఒకదానికొకటి ఆనుకొని వుండి నిలబడి వున్నాయి.
5 కంచు కోనేరు (సముద్రం) మందం మూడు అంగుళాలు. కోనేరు సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచుతామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్లు) నీరు పడుతుంది.
6 సొలొమోను పది వెడల్పైన తొట్టెలను నిర్మించాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సముద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ ప్రక్కన వుంచాడు. ఈ తొట్లను దహన బలులుగా అర్పించే జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి వినియోగించేవారు.
7 సొలొమోను పది బంగారపు దీప స్తంభాలు చేయించాడు. ఈ దీప ఆలయ స్తంభాలు చేయటానికి, మునుపటి దీపస్తంభాల నమూనాలనే సొలొమోను అను కరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో వుంచాడు. కుడిపక్క ఐదు, ఎడమపక్క ఐదు దీప స్తంభాలను వుంచాడు.
8 సొలొమోను పది బల్లలు చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు బల్లలు కుడిపక్కన, ఐదు బల్లలు ఎడమపక్కన వుంచాడు. సొలొమోను వంద తొట్లు చేయించటానికి బంగారం వినియోగించాడు.
9 ఆలయం వెలుపల సొలొమోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయించాడు.
10 పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రం) ను ఆలయంకి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల మూల) భాగాన వుంచాడు.
11 హూరాము కుండలను, పారలను, గిన్నెలను తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజైన సొలొమోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి చేశాడు.
12 హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన వెడల్పు పళ్ళెములను చేశాడు. ఆ స్తంభాలపైనున్న వెడల్పు పళ్లెములను అలంకారంగా కప్పటానికి రెండు వలల్లాంటి అల్లికలను కూడ చేశాడు.
13 ఆ రెండు అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దానిమ్మకాయల ప్రతిమలు కూడా చేశాడు. అలంకరణగా రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టబడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళెములను వలలు కప్పివున్నాయి.
14 హూరాము తొట్లను, వాటి కింది కుదురులను కూడా చేశాడు.
15 హూరాము కంచు కోనేరను (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు.
16 హూరాము పాత్రలను, పారలను, శూలాలను, మరియు రాజైన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తుసామగ్రంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది.
17 రాజైన సొలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. ఈ మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి.
18 సొలొమోను చేయించిన ఈ రకమైన వస్తుసామగ్రి ఎంత వుందనగా వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ ప్రయత్నించియుండలేదు.
19 సొలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు కూడా చేయించాడు. సొలొమోను బంగారు బలిపీఠం చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచాటానికి తగిన బల్లలు చేయించాడు.
20 సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి.
21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు.
22 వత్తులు ఎగదోయు పని ముట్లను, తొట్లను, గిన్నెలను, సాంబ్రాణి పొగవేయు ధూప కలశాలు చేయటానికి కూడా సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం తలుపులకు, ఆలయం తలుపులకు సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు.
1 దానితో సొలొమోను యెహోవా ఆలయ నిర్మాణానికి తలపెట్టిన పనంతా పూర్తయ్యంది. తన తండ్రి దావీదు ఆలయానికిచ్చిన వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయంలోకి తెచ్చాడు. వెండి బంగారాలతో చేసిన వస్తువులను, తదితర సామానులన్నిటినీ సొలొమోను లోనికి తెచ్చాడు. ఆ వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయపు ఖజానాలో భద్రపర్చాడు.
2 ఇశ్రాయేలు పెద్దలందరిని, వంశానాయకులందరినీ ఇశ్రాయేలులో వున్న వంశపెద్దలందరినీ సొలొమోను పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో సమావేశ పర్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను దావీదు నగరం నుండి తెప్పించే ఏర్పాట్లు చేసేటందుకు సొలొమోను ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. దావీదు నగరానికే సీయోను అని పేరు.
3 ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక పర్ణశాల పండుగలో ప్రజలంతా రాజైన సొలొమోనును కలిశారు. ఆ సంవత్సరం ఏడవ నెలలో ఈ విందు ఏర్పాటు చేయబడింది.
4 ఇశ్రాయేలు పెద్దలంతా వచ్చిన పిమ్మట లేవీయులు ఒడంబడిక పెట్టెను లేవదీశారు.
5 పిమ్మట యాజకులు, లేవీయులు కలిసి ఒడంబడిక పెట్టెను యెరూషలేముకు మోశారు. .యాజకులు, లేవీయులు సన్నిధి గుడారాన్ని, దానిలో వున్న పవిత్ర వస్తువులను యెరూషలేముకు తెచ్చారు.
6 రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు ఒడంబడిక పెట్టెముందు గుమికూడారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు గొర్రెలను, గిత్తలను, బలియిచ్చారు. బలి యిచ్చిన గొర్రెలు, గిత్త దూడలు ఎవ్వరూ లెక్కపెట్టెలేనన్ని వున్నాయి.
7 తరువాత యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను, దానికై నిర్దేశించిన స్థలానికి తీసుకొని వచ్చారు. ఆ స్థలమే ఆలయంలోని అతి పవిత్ర స్థలం. ఒడంబడిక పెట్టె అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల కింద వుంచారు.
8 ఒడంబడిక పెట్టె వుంచబడిన స్థలంమీద కెరూబుల రెక్కలు విప్పివున్నాయి. కెరూబులు ఒడంబడిక పెట్టెమీద, దానిని మోసే కర్రమీద నిలబడివున్నాయి.
9 అతి పవిత్ర స్థలం ముందు నుంచి చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టెను మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట నుంచి ఎవ్వరూ ఆ కర్రలను చూడలేరు. ఈనాటికీ ఆ కర్రలు అక్కడ వున్నాయి.
10 ఒడంబడిక పెట్టెలో రెండు శిలాఫలకాలు తప్ప మరేమీ లేవు. (అవి దేవుని పది ఆజ్ఞలున్న ఫలకాలు). హూరేబు పర్వతం మీద ఆ రెండు ఫలకాలను మోషే ఒడంబడిక పెట్టెలో వుంచాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఒక ఒడంబడిక చేసికొన్న చోటే ఈ హోరేబు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి స్వతంత్రులై బయటకు వచ్చిన పిమ్మట జరిగింది.
11 పిమ్మట అతి పవిత్ర స్థలంలోనికి వెళ్లిన యాజకులంతా బయటకు వచ్చారు. వారంతా శుచిగా వున్నారు. అప్పట్లో వారు యాజకులలో ఏ వర్గానికి చెందిన వారు అన్నది ముఖ్యంగాదు. వారంతా అతి పవిత్ర స్థలంలో నుంచి బయటికి వచ్చి తమకు తాము పరిశుద్ధులైనారు.
12 బలిపీఠానికి తూర్పు దిశలో లేవీయులకు చెందిన గాయకులంతా నిలబడ్డారు. ఆసాపు, హేమాను, యెదూతూను వర్గాలకు చెందిన గాయక బృందాల వారంతా అక్కడ వున్నారు. వారి కుమారులు, బంధువులు కూడా అక్కడ వున్నారు. లేవీ గాయకులంతా సన్నని నారతో నేసిన తెల్లని వస్త్రాలు ధరించారు. వారిచేతుల్లో పెద్ద పెద్ద తాళాలు, తంబరలు, సితారలు వున్నాయి. లేవీ గాయకులతో పాటు నూటఇరవై మంది యాజకులున్నారు. ఆ నూట ఇరవై మంది యాజకులు బూరలు ఊదారు.
13 బూరలు ఊదిన వారు, పాటలు పాడినవారు, సొంపుగా ఒక్క మనిషివలె ఊది, పాడారు. వారు యెహోవాకి స్తోత్రం చేసినప్పుడు కృతజ్ఞతలు పలికినప్పుడు ఏక కంఠంగా వినిపించింది. బూరలతోను, తాళాలతోను, ఇతర వాద్య విశేషాలతోను వారు పెద్దశబ్దం వచ్చేలా చేశారు. వారు యీలా పాడారు: “ప్రభువు మంచివాడు, దేవుని కరుణ శాశ్వత మైనది!” అటు తర్వాత ఆలయాన్ని ఒక మేఘం ఆవరించింది.
14 ఆ మేఘంవల్ల యాజకులు తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దానికి కారణ మేమనగా యెహోవా యొక్క మహిమ ఆలయాన్ని నింపివేసింది.
1 తరువాత సొలొమోను యీలా అన్నాడు: “యెహోవా, నల్లని మేఘంలో నివసిస్తానని అన్నాడు.
2 ఓ ప్రభూ, నీ కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాను. అది ఒక ఉన్నతమైన ఆలయం. శాశ్వతంగా నీవు నివసించటానికి అది నిలయం!”
3 సొలొమోను వెనుదిరిగి తన ముందు నిలబడిఉన్న ప్రజలందరనీ దీవించాడు.
4 సొలొమోను యీలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి! నా తండ్రి దావీదుకు తానేమి చేస్తానని వాగ్దానం చేశాడో, యెహోవా అదంతా నెరవేర్చినాడు. యెహోవా దేవుడు యీలా చెప్పియున్నాడు:
5 ‘నా ప్రజలను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పటినుండి ఇశ్రాయేలు వంశాలవారున్న ఏ నగరాన్నీ నాకు ఒక ఆలయాన్ని కట్టించటానికి నేను కోరుకోలేదు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి నేను ఏ వ్యక్తినీ నాయకునిగా ఎంపిక చేయలేదు.
6 కాని ఇప్పుడు నా పేరు మీద యెరూషలేమును ఎన్నుకున్నాను. పైగా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించటానికి దావీదును ఎంపిక చేశాను.’
7 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు నా తండ్రియగు దావీదు ఒక ఆలయాన్ని నిర్మింప గోరాడు.
8 కాని. యెహోవా నా తండ్రితో, ‘దావీదూ, నీవు నా పేరు మీద ఒక ఆలయాన్ని నిర్మింప తలచటం బాగానే వుంది.
9 కాని, నీవు ఆలయాన్ని నిర్మించకూడదు. నా పేరు మీద నీ స్వంత కుమారుడు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు’ అని చెప్పాడు.
10 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో ఇప్పుడది చేశాడు. నా తండ్రి స్థానంలో నేను కొత్త రాజును. దావీదు నా తండ్రి. ఇప్పుడు నేను ఇశ్రాయేలుకు రాజును. అదే యెహోవా చేసిన వాగ్దానం. మరి నేను ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు ఒక ఆలయాన్ని నిర్మించాను.
11 ఒడంబడిక పెట్టెను ఆలయంలో వుంచాను! ఈ ఒడంబడిక పెట్టెలోనే దేవుని పది ఆజ్ఞల రాతిపలకలు వుంచబడినవి. దేవుడు ఈ ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలతో చేసు కొన్నాడు.”
12 సొలొమోను యెహోవా బలిపీఠానికి ఎదురుగా నిలబడ్డాడు. సమావేశమైన ఇశ్రాయేలు ప్రజల కెదురుగా అతడు నిలబడ్డాడు. పిమ్మట సొలొమోను తన రెండు చేతులూ చాచాడు.
13 సొలొమోను కంచుతో ఒక ఎత్తైన వేదిక నిర్మించాడు. దాని పొడవు ఏడున్నర అడుగులు; వెడల్పు ఏడున్నర ఆడుగులు; ఎత్తు ఎడున్నర అడుగులు అతడు దానిని బయట ఆవరణలో మధ్యగా వుంచాడు. అతడు దానిమీదకు ఎక్కి, సమావేశమైన ఇశ్రాయేలు ప్రజానీకం ముందు మోకరించాడు. సొలొమోను తన చేతులను ఆకాశంలోనికి ఎత్తాడు.
14 పిమ్మట సొలొమోను యీలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీవంటి దేవుడు భూమిమీదగాని, ఆకాశంలోగాని మరొక్కరు లేరు. ప్రేమ, కరుణతో కూడిన నీ ఒడంబడికను నీవు నిలబెట్టుకున్నావు. నీ ప్రజలంతా పూర్ణహృదయంతో సన్మార్గులై, నిన్ను అనుసరిస్తే నీ ఒడంబడిక కొనసాగిస్తావు.
15 నీ సేవకుడైన దావీదుకు నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు. దావీదు నా తండ్రి. స్వయంగా నీ నోటితో ఆ వాగ్దానం చేశావు. ఈనాడు ఆ వాగ్దానాన్ని స్వయంగా నీ చేతులతో నిజమయ్యేలా చేశావు.
16 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, ఇప్పుడు నీవు నీ సేవకుడైన దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుము. నీవిలా మాట యిచ్చావు: దావీదూ, నా సన్నిధిలో ఇశ్రాయేలు సింహాసనంపై నీ కుటుంబంలో ఒకడు తప్పక కొనసాగుతాడు. నీ కుమారులు వారు చేసే కార్యాలలో తగిన జాగ్రత్త వహిస్తేనే ఇది జరుగుతుంది. నా ధర్మాశాస్త్రాన్ని నీవు అనుసరించిన రీతిలో, నీ కుమారులు కూడ నా ధర్మాశాస్త్రాన్ని పాటించాలి.’
17 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీ వాగ్దానం నిజమగుగాక! ఈ వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు యిచ్చాయున్నావు.
18 “ఓ దేవా, నీవు నిజంగా మానవులతో కలిసి భూమి మీద నివసించవని మాకు తెలుసు. ఆకాశాలు గాని, మహా ఆకాశాలు గాని నిన్ను నిలుపజాలవు! అటువంటప్పుడు నేను నిర్మించిన ఈ చిన్న ఆలయం నిన్ను భరింపలేదని కూడా మాకు తెలుసు!
19 కానీ నీ కరుణ కొరకు నేను చేయు ప్రార్థనను, అభ్యర్థనను ఆలకించు. నా దేవుడైన ప్రభూ, నా మొరాలకించుము! నీ కొరకు నా ప్రార్థనయందు శ్రద్ధ వహించుము. నేను నీ సేవకుడను.
20 ఈ ఆలయాన్ని నీవు కన్నులార రాత్రింబవళ్లు చూడాలని నా ప్రార్థన. ఈ స్థలంలో నీ పేరును ప్రతిష్ఠిస్తావని నీవు చెప్పియున్నావు. ఈ ఆలయాన్ని చూస్తూ నేను చేసే నా ప్రార్థనను నీవు విందువుగాక!
21 నేను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేయు ప్రార్థనలను ఆలకించుము. ఈ ఆలయాన్ని చూస్తూ మేము చేయు ప్రార్థనలయందు లక్ష్యముంచుము. ఆకాశంలో నీవున్న చోటు నుంచే మా ప్రార్థన వినుము. నీవు మా ప్రార్థనలను విన్నప్పుడు మమ్మల్ని మన్నించుము.
22 “ఒక మనిషి వేరొక మనిషిపట్ల అపచారం చేసిన నేరానికి పాల్పడవచ్చు. అది జరిగినప్పుడు నిందితుడు నీపేరు మీద ఒక ప్రమాణం చేయాలి. ఆలయంలోని నీ బలిపీఠం ముందు అతడు ప్రమాణం చేయటానికి వచ్చినప్పుడు
23 నీవు ఆకాశంలోని నీ వాసము నుండి వినుము. అప్పుడు నీ సేవకులను విచారించి చర్య తీసుకొనుము. దుష్టుని శిక్షించుము. అతడు ఇతరులను బాధ పెట్టిన విధంగా తానుకూడా ఆ బాధను అనుభవించేలా చేయుము. మంచి కార్యములు చేసిన వాని నిర్దోషిత్వాన్ని నిరూపింపుము.
24 “నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీపట్ల పాపం చేసిన కారణంగా ఒక శత్రువు వారిని ఓడించవచ్చు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి నీ నామస్మరణ చేసి నిన్నాశ్రయించి ఈ ఆలయంలో నిన్ను ప్రార్థస్తూ వేడుకుంటే,
25 ఆకాశంలో వుండి నీ ఇశ్రాయేలీయుల రోదన విని వారిని క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వీకులకు ఇచ్చిన రాజ్యానికి వారిని తిరిగి తీసుకొని రమ్ము.
26 “వర్షాలు లేకుండ ఆకాశం కుంచుకపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు నీపట్ల పాపం చేసినట్లయితే ఇది జరుగుతుంది. కాని ఇశ్రాయేలీయులు నీ శిక్షకు గురియై తమ తప్పు తెలిసికొని పశ్చాత్తాపము పొంది, ఆలయం వైపు తిరిగి నీ నామస్మరణ చేసి ప్రార్థిస్తే,
27 నీవు ఆకాశంలో నుండి వారి మొరాలకించుము. వారి విన్నపము ఆలకించి వారి పాపాలను క్షమించుము. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు. వారు జీవించవలసిన సన్మార్గాన్ని వారికి బోధించుము. నీ రాజ్యంలో వర్షాలు కురిపించుము. నీవు ఈ రాజ్యాన్ని నీ ప్రజలకు ఇచ్చావు.
28 “ఈ రాజ్యంలో కరువు రావచ్చు. వ్యాధులు వ్యాపించవచ్చు. పంటలకు తెగుళ్లు సోకవచ్చు. తోటలకు తేనెమంచు వ్యాధుల, మిడతల, పురుగుల పీడ సంభవించవచ్చు. ఇశ్రాయేలీయుల నగరాలపై శత్రుదాడులు జరిగినప్పుడుగాని, ఇశ్రాయేలులో ఏ రకమైన వ్యాధులు ప్రబలినా,
29 ఇశ్రాయేలు ప్రజలు తమ బాధలు గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే, ఏ బాధితుడేగాని ఈ ఆలయాన్ని చూస్తూ చేతులెత్తి ప్రార్థిస్తే,
30 నీ నివాస స్థలమైన ఆకాశంనుండి వారి అభ్యర్థన ఆలకించుము. వారి మొరాలకించి, వారిని క్షమించుము. ప్రతి వ్యక్తికి వానికి అర్హమైన దాని నివ్వుము. ఎందువల్లననగా ప్రతివాని హృదయం నీకు తెలుసు. మానవ హృదయాలను తెలుసుకొనే శక్తి నీ వొక్కనికే వుంది.
31 అప్పుడు మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో ప్రజలు నివసించినంత కాలం నీపట్ల భయభక్తులు కలిగి వుంటారు.
32 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెందని పరదేశీయుడెవడైనా తన సుదూరదేశం నుండి ఇక్కడికి రావచ్చును. అతడు నీ మహోన్నత నామం వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే,
33 నీ ఆకాశ నివాసం నుండి వాని ప్రార్థన ఆలకించుము. ఆ పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులవలె నీ పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు మీద పిలవ బడుతూ వుందని తెలుసుకుంటారు.
34 “నీవు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవైపు, నేను నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి నిన్ను తలంచి ప్రార్థన చేసిన పక్షంలో
35 వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము.
36 “ప్రజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామాన్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వారిపై కోపం రావటం సహజం. ఒకానొక శత్రువు వచ్చి వారిని ఓడించి బందీలుగా దూరదేశానికో, దగ్గర దేశానికో తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు.
37 కాని వారు బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో పరివర్తన వచ్చి నిన్ను ప్రాధేయపడవచ్చు. ‘మేము పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మార్గంగా ప్రవర్తించాము,’ అని వారు పరితపించవచ్చు.
38 పరితపించి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు యిచ్చిన దేశంవైపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవైపు చూస్తూ ని ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి ప్రార్థించవచ్చు.
39 ఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల పాపం చేసిన నీ ప్రజలైన వారి ప్రార్థన, వారి మనవి ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము.
40 ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.
41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము. నీ యాజకులు రక్షణ పొందుదురు గాక! ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
42 ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు. నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపక ముంచు కొనుము!”
1 సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది.
2 యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు.
3 ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించిండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యీలా అన్నారు: “ప్రభువు ఉత్తముడు, ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.”
4 పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు.
5 రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి.
6 యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు.
7 ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్టంచాడు. అక్కడే సొలొమోను దహనబలులు , సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు.
8 సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఏడు రోజులపాటు పండుగ చేశారు. సొలొమోనుతో చాలా మంది జనం వున్నారు. హమాతు పట్టణద్వారం నుండి ఈజిప్టు సెలయేటి వరకు వున్న ప్రాంత మంతటి నుండి జనసమూహాలు వచ్చాయి.
9 ఏడు రోజుల పండుగ ఆచరణ ముగిశాక, ఎనిమిదవ రోజున వారు పవిత్ర సమావేశం ఏర్పాటు చేశారు. బలిపీఠాన్ని వారు పవిత్ర (శుద్ధి) చేశారు. దానిని దైవారాధనలోనే విని యోగిస్తారు. వారు ఏడు రోజులు పండుగ ఆచరించారు.
10 ఆ సంవత్సరం ఏడవ నెల ఇరవై మూడవ రోజు సొలొమోను ప్రజలందరినీ తమ తమ ఇండ్లకు పంపివేశాడు. యెహోవా దావీదుపట్ల, సొలొమోను పట్ల, ఇశ్రాయేలు ప్రజలపట్ల ఎంతో ఉదారంగా వున్నందుకు ప్రజలంతా చాలా సంతోషించారు. వారి హృదయాలు ఆనందమయమయ్యాయి.
11 సొలొమోను ఆలయాన్ని, రాజభవనాన్ని నిర్మించటం పూర్తిచేశాడు. ఆలయ నిర్మాణంలోను, తన ఇంటి నిర్మాణంలోను సొలొమోను అనుకున్న పనులన్నీ పూర్తిచేశాడు.
12 ఆ రాత్రి యెహోవా సొలొమోనుకు దర్శనమిచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు: “సొలొమోనూ, నీ ప్రార్థన నేను విన్నాను. బలులు యివ్వటానికి అనువైన ప్రదేశంగా ఈ స్థలాన్ని నేనే ఎంపిక చేశాను.
13 వర్షాలు లేకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడుగాని, దేశాన్ని నాశనం చేసే విధంగా నేను మిడతల దండులను పంపినుప్పుడుగాని, నేను నా ప్రజలకు వ్యాధులు సొకేలా చేసినప్పుడుగాని,
14 నా పేరు మీద పిలవబడే నా ప్రజలు అణకువతో వుండి నన్ను ప్రార్థిస్తే, నా కొరకు ఎదురు చూస్తే, వారు తమ చెడు మార్గాలను విడనాడితే, నేనప్పుడు ఆకాశం నుండి వారి మొర ఆలకిస్తాను. నేను వారి పాపాలను క్షమిస్తాను. నేను వారి దేశాన్ని బాగు చేస్తాను.
15 నేను నా నేత్రలను తెరచియున్నాను. నా చెవులు ఈ ప్రదేశంలో చేసిన ప్రార్థనలను వింటాయి.
16 ఇక్కడ నా పేరు శాశ్వతంగా ఉండునట్లు నేనీ ప్రదేశాన్ని ఎంపిక చేసి, దానిని పవిత్రంగా మార్చాను. అవును; నా కళ్లు, నా హృదయం ఇక్కడ ఈ ఆలయంలో ఎల్లప్పుడూ వుంటాయి.
17 సొలొమోనూ, నీవిప్పుడు నీ తండ్రి మెలగిన రీతిలో నా ముందు జీవిస్తే, నా ఆజ్ఞలన్నీ పాటిస్తే, నా ధర్మశాస్త్రాన్ని, నియమాలను అనుసరిస్తే,
18 నిన్నొక శక్తి యుక్తులుగల రాజుగా చేస్తాను. నీ రాజ్యాన్ని సుస్థిరమైనదిగా చేస్తాను. నీ తండ్రియైన దావీదుతో అదే ఒడంబడిక చేశాను. ‘దావీదూ, ఇశ్రాయేలు రాజుగా నీ కుటుంబంలో ఒకడు కొనసాగుతాడు’ అని నేను చెప్పియున్నాను.
19 “కానీ నీవు నా ధర్మాన్ని, ఆజ్ఞలను శిరసావహించనిచో, నీవు గనుక అన్యదేవతారాధనకు పాల్పడితే,
20 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నేను వారికిచ్చిన రాజ్యం నుండి బయటకు త్రోసివేస్తాను. నా నామముతో పవిత్రపర్చబడిన ఈ ఆలయాన్ని నేను వదలి వేస్తాను. ఇతర దేశాలన్నీ చెడుమాటలు పలికేలా ఈ ఆలయమును మార్చివేస్తాను.
21 అత్యున్నతంగా గౌరవింపబడిన ఈ ఆలయం ప్రక్కగా వెళ్లే వారెవరైనా చూసి ఆశ్చర్యపోతారు. ‘ఈ రాజ్యానికి, ఈ ఆలయానికి, యెహోవా ఎందుకింత భయంకర పరస్థితి కల్పించాడు?’ అని అనుకుంటారు.
22 పిమ్మట వారు ఈ రకంగా సమాధానం చెప్పుకుంటారు: ‘వారి పూర్వీకుల దేవుడైన యెహోవాను ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేదు. ఆయనే వారిని ఈజిప్టు నుండి విముక్తి చేసి బయటకు తీసుకొనివచ్చాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు అన్యదేవతలను సేవించారు. వారు విగ్రహాలను కొలిచారు. అందువల్లనే యెహోవా ఈ భయంకర పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలకు కల్పించాడు అని అనుకుంటారు.”‘
1 ఆలయ నిర్మాణానికి, తన స్వంత ఇంటి నిర్మాణానికి సొలొమోనుకు ఇరవై సంవత్సరాలు పట్టింది.
2 పిమ్మట హీరాము తనకు ఇచ్చిన పట్టణాలను తిరిగి నిర్మించాడు. ఆ పట్టణాలలో కొంత మంది ఇశ్రాయేలీయులను సొలొమోను నివసింపనిచ్చాడు.
3 దీని తరువాత సొలొమోను సోబాలోని హమాతు నగరాన్ని వశపర్చుకున్నాడు.
4 సొలొమోను తద్మోరు అనే పట్టణాన్ని కూడా ఎడారిలో నిర్మించాడు. హమాతులోని పట్టణాలన్నిటినీ వస్తుసామగ్రులను నిలవచేయటానికి నిర్మించాడు.
5 సొలొమోను ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలను కూడ కట్టించాడు. అతడీ పట్టణాలను బలమైన కోటలుగా తయారు చేశాడు. వాటి చుట్టూ గోడలు, వాటి ద్వారాలు, ద్వారాలకు కడ్డీలు ఏర్పాటు చేశాడు.
6 బయలతు పట్టణాన్ని వస్తువులు నిల్వచేసే ఇతర పట్టణాలను సొలొమోను మళ్లీ కట్టించాడు. రథశాలలున్న పట్టణాలను, గుర్రాలను నడిపే రౌతుల నగరాలన్నిటినీ సొలొమోను కట్టించాడు. యెరూషలేములోను, లెబానోనులోను, తాను రాజుగా వున్న ప్రాంతాలన్నిటిలోను సొలొమోను తనకు కావలసిన వాటినన్నిటినీ కట్టించాడు.
7 [This verse may not be a part of this translation]
8 [This verse may not be a part of this translation]
9 ఇశ్రాయేలీయులైన వారెవరినీ బానిసలుగా చేయమని సొలొమోను వత్తిడి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను యొక్క పోరాట యోధులు వారు అతని సైనికాధికారులలో ముఖ్యులుగాను, రథాలకు అధిపతులుగాను, రథసారధులకు నాయకులుగాను నియమింప బడ్డారు.
10 కొంతమంది ఇశ్రాయేలీయులు సొలొమోను ముఖ్యాధిపతులకు పైఅధికారులుగా వున్నారు. ప్రజల కార్యకలపాలు తనిఖీ చేయటానికి ఇలాంటివివారు రెండు వందల ఏబై మంది ఉన్నారు.
11 ఫరోరాజు కుమార్తెను దావీదు నగరం నుండి ఆమె కొరకు కట్టించిన భవంతికి సొలొమోను తీసుకొని వచ్చాడు. “నా భార్య రాజైన దావీదు ఇంటిలో నివసించ కూడదు. ఎందువల్లనంటే దేవుని ఒడంబడిక పెట్టె వెళ్లిన ప్రతిచోటూ పవిత్రమైనది’ అని సొలొమోను అన్నాడు.
12 యెహోవా బలిపీఠం మీద సొలొమోను దహన బలులు అర్పించాడు.
13 మోషే ఆజ్ఞాపించిన విధంగా సొలొమోను ప్రతిరోజూ బలులు అర్పించాడు. బలులు ప్రతి సబ్బాతు దినాన, ప్రతి అమావాస్య రోజున, మరియు సంవత్సరంలో వచ్చే మూడు పండుగ సెలవు రోజులలోను అర్పించేవారు. ఆ మూడు పండుగలకు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ మరియు పర్ణశాలల పండుగ అని పేర్లు.
14 తన తండ్రి దావీదు ఉపదేశాలన్నిటినీ సొలొమోను పాటించాడు. సొలొమోను వివిధ కార్యాలకు అర్హతగల యాజక వర్గాలను నియమించాడు. లేవీయులను కూడ వారికి తగిన పనులకు సొలొమోను నియమించాడు. భక్తిగీతాల కార్యక్రమ నిర్వహణ, ఆలయంలో దేవుని సేవలో నిత్యం కావలసిన వస్తువులు చేయుటలో యాజకులకు తోడ్పడటం లేవీయుల పని. ప్రతి ద్వారంవద్ద సేవ చేయటానికి తగిన విధంగా జట్లను సొలొమోను ఎంపిక చేశాడు. ఈ రకంగా చేయమని యెహోవా సేవకుడైన దావీదు ఆజ్ఞాపించాడు.
15 యాజకులకు, లేవీయులకు సొలొమోను ఇచ్చిన ఆదేశాలను ఇశ్రాయేలు ప్రజలు మార్చటంగాని, అనాదరించటంగాని చేయలేదు. కనీసం విలువైన వస్తువుల భద్రత విషయాలలో కూడ వారు ఏ ఒక్క ఆదేశాన్నీ మార్చలేదు.
16 సొలొమోను చేయవలసిన పసంతా పూర్తి అయ్యింది. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుండి అది పూర్తి అయ్యేవరకు పనియావత్తూ ఒక క్రమ పద్ధతిలో సాగింది. ఆ విధంగా ఆలయం నిర్మింపబడింది.
17 పిమ్మట సొలొమోను ఎసోన్గెబరు, ఏలతు పట్టణాలకు వెళ్లాడు. ఆ పట్టణాలు ఎదోము దేశంలో ఎర్ర సముద్ర తీరంలో వున్నాయి.
18 హీరాము ఓడలను సొలొమోను వద్దకు పంపాడు. హీరాము స్వంత మనుష్యులు ఓడలను నడిపారు. సముద్రయానంలో హీరాము మనుష్యులు ఆరితేరినవారు. హీరాము మనుషష్యులు సొలొమోను సేవకులతో కలిసి ఓఫీరుకు వెళ్లి పదిహేడు టన్నుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చారు.
1 షేబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విన్నది. కఠినమైన, చిక్కు ప్రశ్నలు వేసి సొలొమోనును పరీక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, విలువైన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంటెలు ఆమెతో వున్నాయి. ఆమె సొలమోను వద్దకు వచ్చి అతనితో మాట్లడింది. ఆమె వద్ద సొలొమోనును అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి.
2 ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్పటానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సొలొమోనుకు కష్టమైనదేదీ కన్పించలేదు.
3 సొలొమోను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన భవంతిని షేబ దేశపు రాణి స్వయంగా చూసింది.
4 సొలొమోను బల్లమీద రాజ భోజన పదార్థలను, అతని ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను ఆమె చూసింది. సొలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో సొలొమోను ఆర్పించిన దహన బలులను కూడ ఆమె చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసి నప్పుడు ఆమె ఆశ్చర్యపడింది!
5 అప్పుడామె రాజైన సొలొమోనుతో యీలా అన్నది: “నీ ఘనమైన కార్యాలను గురించి, నీ అద్భుతమైన తెలివితేటల గురించి నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసుకున్నాను.
6 నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించివున్నావు నీవు!
7 నీవు భార్యలు, అధికారులు చాలా అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన వాక్కులను వారు వినగలరు!
8 నీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ల ఆయన సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున రాజ్యమేలటానికి ఆయన సింహాసనంపై నిన్ను కూర్చోపెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమైనదో, ఏది మంచిదో అది చేయటానికి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.”
9 [This verse may not be a part of this translation]
10 హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా చందనపు కర్రను, విలవైన రత్నాలను తెచ్చారు.
11 ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణంలోను రాజైన సొలొమోను చందనపు కర్రను ఉపయోగించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబరలు, సితరాలు చేయటానికి కూడ సొలొమోను ఈ కర్రను వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ ముందెన్నడూ చూసి వుండలేదు.
12 రాజైన సొలొమోను కూడ షేబ దేశపు రాణికి ఆమెకు కావలసిన వాటిని, అడిగిన ప్రతి దానిని ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంటె ఎక్కువగానే సొలొమోను ఇచ్చాడు. తరువాత షేబ దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు.
13 ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మణుగులు) తూగింది.
14 చార వర్తకులు, వ్యాపారులు సొలొమోనుకు చాలా బంగారం తెచ్చారు. అరబీ రాజులందురూ, దేశంలో ప్రాంతీయ పాలకులూ సొలొమోనుకు వెండి బంగారాలు తెచ్చియిచ్చారు.
15 బంగారు రేకులు తాపిన రెండు వందల పెద్దడాళ్లను సొలొమోను చేయించాడు. ప్రతి డాలుకూ సుమారు ఏడున్నర పౌనుల (ఆరు వందల తులాల) సాగగొట్టిన బంగారం పట్టింది.
16 బంగారు రేకులు వేయించి మూడు వందల చిన్న డాళ్లును కూడ సొలొమోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక పౌనుల (మూడ వందల తులాల) బంగారం ఒక్కొక్క డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన భవనంలో రాజైన సొలొమోను ఈ డాళ్లను వుంచాడు.
17 ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సొలొమోను రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి తాపించాడు.
18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. బంగారంతో చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాసనానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా రెండు సింహపు విగ్రహాలున్నాయి.
19 ప్రతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహాపు విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యంలోనూ ఈ రకమైన సింహాసనం చేయించబడలేదు.
20 సొలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. లెబానోను అరణ్య భవనంలో వాడే వస్తుసామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సొలొమోను కాలంలో వెండి విలువైన లోహంగా చూడబడలేదు.
21 తర్షీషు వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.
22 భూలోకంలో వున్న రాజులందరికంటె సొలొమోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడయ్యాడు.
23 ప్రపంచ దేశాల రాజులంతా సొలొమోను వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి అతనిని దర్శించేవారు. సొలొమోనుకు ఆ తెలివితేటలను దేవుడే ప్రసాదించాడు.
24 ప్రతి సంవత్సరం సొలొమోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కాన్కలు తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలను తెచ్చేవారు.
25 సొలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచటానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు వేలమంది రథసారధులున్నారు. రథాలకు ప్రత్యేక నగరాలను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలేములో వుంచుకున్నాడు.
26 యూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ సొలొమోను రాజైయున్నాడు.
27 సొలొమోను రాజు వద్ద నిలవవున్న వెండి యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని వద్ద పల్లపు ప్రాంతంలో వున్న మేడిచెట్లంత విస్తారంగా దేవదారు చెట్ల కలపవుంది.
28 ఈజిప్టు నుండి, తదితర దేశాలనుండి ప్రజలు సొలొమోనుకు గుర్రాలను తెచ్చి యిచ్చేవారు.
29 మొదటినుండి చివరివరకు సొలొమోను చేసిన పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలోను, షిలో హువాడైన అహీయా ప్రవచనాలలోను, మరియు దీర్ఘదర్శి అయిన ఇద్దో దర్శనాలలోను పొందుపర్చబడినాయి. అహీయా షిలోనీయుడు. ఇద్దో దీర్ఘదర్శి (ప్రవక్త). ఇద్దో యరొబామును గురించి రాశాడు. యరొబాము నెబాతు కుమారుడు.
30 సొలొమోను నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటినీ పాలించాడు.
31 పిమ్మట సొలొమోను చని పోయాడు . తన తండ్రి దావీదు నగరంలో ప్రజలతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు.
1 రెహబాము షెకెము పట్టణానికి వెళ్లాడు. ఎందు వల్లననగా ఇశ్రాయేలు ప్రజలంతా రెహబామును రాజుగా అభిషిక్తుని చేయటానికి అక్కడికి వెళ్లారు.
2 యరొబాము అప్పుడు ఈజిప్టులో వున్నాడు. అతడు ఇంతకు పూర్వము సొలొమోను రాజుకు భయపడి పారిపోయి ఈజిప్టులో దాక్కన్నాడు. యరొబాము తండ్రిపేరు నెబాతు. రెహబాము కొత్త రాజు కాబోతున్నట్లు యరొబాము విన్నాడు. అందుకని యరొబాము ఈజిప్టునుండి తిరిగి వచ్చాడు.
3 ఇశ్రాయేలు ప్రజలు తమతో రమ్మని యరొబామును పిలిచారు. అప్పుడు యరొబాము, ఇశ్రాయేలు ప్రజలు అంతా కలిసి రెహబాము వద్దకు వెళ్లారు. వారతనితో యీలా అన్నారు: “రెహబామూ,
4 నీ తండ్రి మాకు జీవితం కష్టమయం చేశాడు. అది మాకు మోయలేని భారమయ్యింది. నీవు మాకాబరువును తేలిక చెయ్యి. అప్పుడు నీకు మేము సేవచేస్తాము.”
5 రెహబాము వారితో “మూడు రోజుల తరువాత మళ్లీ నా వద్దకు రండి” అని అన్నాడు. అందుకని ప్రజలు వెళ్లిపోయారు.
6 రాజైన రెహబాము గతంలో తన తండ్రిగా సొలొమోను వద్ద సేవచేసిన పెద్దలను సంప్రదించాడు. “ఆ ప్రజలకు నేనేమి సమాధానం చెప్పాలని మీరు నాకు సలహా యిస్తున్నారు?” అని అడిగాడు.
7 పెద్దలు రెహబాముతో యిలా అన్నారు: “నీవు గనుక ఆ ప్రజల పట్ల దయగలిగి వుంటే, వారిని సంతోషపెట్టి మంచిమాటలు మాట్లాడితే, వారు నీకు సదా సేవ చేస్తారు.”
8 కాని రెహబాము పెద్దల సలహా పాటించలేదు. పైగా రెహబాము తనతో పెరిగి తనకు సేవచేస్తున్న తన స్నేహితులను సంప్రదించాడు.
9 రెహబాము వారితో యీలా అన్నాడు: “మీరు నాకు ఏమి సలహాయిస్తున్నారు? ఆ ప్రజలకు మనం ఎలా సమాధానం చెప్పాలి? వారు తమ పనిని తేలిక చేయమని నన్ను అడిగారు. నా తండ్రి వారిపై వుంచిన భారాన్ని తగ్గించమని వారు నన్ను కోరుతున్నారు.”
10 అప్పుడు రెహబాముతో పెరిగిన యువకులు అతనికి యిలా సలహా యిచ్చారు: “నీతో మాట్లాడిన ప్రజలకు నీవు చెప్పవలసినది యిది: ‘నీ తండ్రి మా బ్రతుకు భారం చేశాడు. అది పెద్ద బరువు మోసినట్లుగా వుంది. కాని ఆ బరువును తగ్గించమని మేము నిన్ను కోరుతున్నాము’ అని వారన్నారు గదా. కాని రెహబామూ, నీ సమాధానం యిలా వుండాలి: ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుముకంటె లావుగా వుంటుంది!
11 నా తండ్రి మీపై చాలా భారం వేశాడు. కాని నేను ఆ బరువును మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్ముల్ని కొరడాలతో కొట్టాడు. కాని నేను లోహపు కొక్కెములున్న కొరడాలతో కొట్టిస్తాను” అని చెప్పమనిరి.
12 మూడు రోజుల తరువాత యరొబాము, ప్రజలు కలిసి రెహబాము వద్దకు వచ్చారు. “మూడు రోజులలో మీరు నా వద్దకు రండి,” అని రెహబాము చెప్పిన దానికి అనుగుణంగా వారు వెళ్లారు.
13 అప్పుడు రెహబాము రాజు వారితో అల్పబద్ధితో మాట్లాడాడు. రెహబాము రాజు పెద్దల సలహాను పెడ చెవిని పెట్టాడు.
14 యువకులు తనకు సలహా యిచ్చిన రీతిగా రెహబాము రాజు ప్రజలతో మాట్లాడాడు. “నా తండ్రి మీ బరువు ఎక్కువ చేశాడు. కాని నేను దానిని మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు. కాని నేను మిమ్మల్ని లోహపు కొక్కెములున్న కొరడాలతో శిక్షిస్తాను” అని అన్నాడు.
15 ఆ విధంగా రాజైన రెహబాము ప్రజల విన్నపాన్ని వినలేదు. ప్రజలగోడు అతడు వినని కారణమేనగా, పరిస్థితులలో ఈ మార్పు దేవుడు కల్పించటమే. దేవుడే ఇది జరిపించాడు. అహీయా ద్వారా యరొబాముకు దేవుడు చెప్పించిన దానిని నిజం చేసేలా ఇది జరిగింది. అహీయా షిలోనీయుడు. యరొబాము తండ్రి పేరు నెబాతు.
16 రెహబాము రాజు తమ మనవి ఆలకించలేదని ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకున్నారు. అప్పుడు వారు రాజుతో యిలా అన్నారు: “మేము దావీదు కుటుంబంలో భాగస్తులమా? కాదు! యెష్షయి భూముల్లో మాకేమైనా వస్తుందా? రాదు! అందుకని ఇశ్రాయేలీయులారా, మనం మన ఇండ్లకు వెళ్లిపోదాం పదండి. దావీదు సంతతి వాడిని తన ప్రజల్ని ఏలుకో నీయండి!” తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
17 ని యూదా పట్టణాలలో ఇంకా కొంతమంది ఇశ్రాయేలీయులు నివసిస్తూ వున్నారు. రెహబాము వారికి కూడ రాజుగానే వున్నాడు.
18 బలవంతంగా పని చేయించబడే జనులమీద అధికారిగా హదోరాము వున్నాడు. రెహబాము అతనిని ఇశ్రాయేలు ప్రజల వద్దకు పంపాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు హదోరామును రాళ్లతో కొట్టి చంపివేశారు. దానితో రెహబాము తన రథంలోనికి దుమికి తప్పించు కున్నాడు. అతడు యెరూషలేముకు పారిపోయాడు.
19 అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు దావీదు కుటుంబానికి వ్యతిరేకులై వున్నారు.
1 రెహబాము యెరూషలేముకు వచ్చిన పిమ్మట ఒక లక్షాఎనబై వేలమంది కాకలు తీరిన సైనికులను సమీకరించాడు. ఈ సైనికులను యూదా, బెన్యామీను వంశాల నుండే ఎంపిక చేశాడు. వీరందరినీ ఇశ్రాయేలుపై దాడి చేసి ఆ రాజ్యాన్ని తిరిగి తన ఏలుబడిలోకి తీసుకొని రావటానికి సమీకరించాడు.
2 కాని యెహోవా వాక్కు షెమయాకు వినవచ్చింది. షెమయా దైవజ్ఞుడు. యెహవా యిలా చెప్పాడు:
3 “షెమయా, నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతో మాట్లాడుము. యూదాలోను, బెన్యామీను ప్రాంతంలోను నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరితో కూడా మాట్లాడుము. వారికి యీలా చెప్పుము:
4 యెహోవా తెలియజేయునదేమనగా: ‘మీరు మీ సోదరులతో యుద్ధం చేయరాదు! ప్రతి ఒక్కడూ తన ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి. ఇదియీలా జరిగేలా నేనే చేశాను”‘ కావున రాజైన రెహబాము, అతని సైన్యం యెహోవా మాట విని వెనుకకు వెళ్లి పోయారు. వారు యరొబాముపై దాడి చేయలేదు.
5 రెహబాము యెరూషలేములో నివసించాడు. పరాయి రాజుల దండయాత్రల నుండి రక్షణగా అతడు యూదాలో బలమైన నగరాలను నిర్మించాడు.
6 బేత్లెహేము, ఏతాము, తెకోవ,
7 బేత్సూరు, శోకో, అదుల్లాము,
8 గాతు, మారేషా, జీపు,
9 అదోరయీము, లాకీషు, అజేకా,
10 జొర్యా, అయ్యాలోను, మరియు హెబ్రోనులో గల నగరాలను బాగుచేయించాడు. యూదాలోను, బెన్యామీనులోనుగల ఈ నగరాలు బలమైనవిగా తీర్చిదిద్దబడ్డాయి.
11 రెహబాము ఈ నగరాలను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, నియమించాడు. ఆ నగరాలకు ఆహార పదార్థాలు, నూనె, ద్రాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు.
12 రెహబాము ప్రతి నగరంలో డాళ్లను, ఈటెలను కూడ వుంచి వాటిని చాలా బలమైనవిగా చేశాడు. యూదా, బెన్యామీను ప్రజల, నగరాలను రెహబాము తన అధీనంలో వుంచుకున్నాడు.
13 ఇశ్రాయేలులో వున్న యాజకులు, లేవీయులు అంతా రెహబాముతో ఒక అవగాహనకు వచ్చి, అతనితో కలిశారు.
14 లేవీయులు తమ పచ్చిక బీళ్లను, వారి స్వంత పొలాలను వదిలి యూదాకు, యెరూషలేముకు వచ్చారు. లేవీయులు ఇది ఎందుకు చేశారనగా యరొబాము, అతని కుమారులు తమను యెహోవా సేవలో, యాజకులుగా పని చేయనీయటానికి తిరస్కరించారు.
15 ఉన్నత స్థలాలలో ఆరాధనలకై యరొబాము తన స్వంత యాజకులను ఎంపిక చేసుకొన్నాడు. ఆ గుట్టల మీద అతడు తాను చేసిన మేక, గిత్త దూడల విగ్రహాలను ప్రతిష్ఠించాడు.
16 లేవీయులు ఇశ్రాయేలును వదిలి పెట్టడంతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాలో విశ్వాసమున్న ఇశ్రాయేలు గోత్రాలవారంతా యెరూషలేముకు వచ్చారు. వారు తామ పూర్వీకుల దేవునికి బలులు అర్పించటానికి వచ్చారు.
17 వారంతా యూదా రాజ్యాన్ని బలమైనదిగా చేశారు. వారు సొలొమోను కుమారుడు రెహబాముకు మూడు సంవత్సరాలపాటు మద్దతు యిచ్చారు. ఆ విధంగా చేయటానికి కారణమేమనగా ఆ సమయంలో వారు దావీదు సొలొమోను నడిచిన రీతిగా నడుచు కున్నారు.
18 రెహబాము మహలతు అనే స్త్రీని వివాహం చేసికొన్నాడు. ఆమె తండ్రి పేరు యెరీమోతు. ఆమె తల్లి పేరు అబీహాయిలు. యెరీమోతు తండ్రి పేరు దావీదు. అబీహాయిలు తండ్రిపేరు ఏలీయాబు. ఏలీయాబు తండ్రిపేరు యెష్షయి.
19 రెహబాముకు మహలతు ద్వారా యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు.
20 పిమ్మట రెహబాము మయకాను వివాహం చేసి కొన్నాడు. మయకా అబ్షాలోము మనుమరాలు . రెహబాముకు మయకావల్ల అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు అనువారు పుట్టారు.
21 తన ఇతర భార్యల కన్న, దాసీల కన్న, రెహబాము మయకాను ఎక్కువగా ప్రేమించాడు. మయకా అబ్షాలోము మనుమ రాలు. రెహబాముకు పద్ధెనిమిది మంది భార్యలు, అరవై మంది దాసీలు వున్నారు. రెహబాముకు ఇరవై ఎనిమిది మంది కుమారులు, ఇరవై మంది కుమార్తెలు వున్నారు.
22 అబీయాను అతని సోదరులపై నాయకునిగా రెహబాము నియమించాడు. అబీయాను రాజుగా చేసే వుద్దేశంతోనే రెహబాము ఈ పని చేశాడు.
23 రెహబాము చాలా తెలివిగా ప్రవర్తించాడు. తన కుమారులందరినీ యూదా, బెన్యామీను ప్రాంతాలలో వున్న బలమైన నగారాలన్నిటికీ పంపాడు. రెహబాము తన కుమారులకు ఆహారాది వస్తువులను పుష్కలంగా సరఫరా చేశాడు. తన కుమారుకు భార్యలను కూడా అతడు ఎంపిక చేశాడు.
1 రెహబాము చాలా శక్తివంతుడైన రాజయ్యాడు. అతడు తన రాజ్యాన్ని కూడ చాలా బలపర్చాడు. ఆ తరువాత రెహబాము, యూదా వంశంవారు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించుటం మాని వేశారు.
2 రెహబాము రాజయ్యాక ఐదవ సంవత్సరంలో షీషకు యెరూషలేముపై దండెత్తాడు. షీషకు ఈజిప్టుకు రాజు. రెహబాము, యూదా ప్రజలు యెహోవాకు విశ్వాసపాత్రంగా లేకపోవుటచే ఇది జరిగింది.
3 షీషకు వద్ద పన్నెండువేల రథాలు, అరవై వేల మంది గుర్రపు స్వారీ చేయగలవారు, మరియు ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది సైనికులు వున్నారు. షీషకు యొక్క మహా సైన్యంలో లిబ్యా సైనికులు (లూబీయులు), సుక్కీయులు, ఇథియోఫియనులు (కూషీయులు) వున్నారు.
4 షీషకు యూదాలోని బలమైన నగరాలను ఓడించాడు. పిమ్మట షీషకు తన సైన్యాన్ని యెరూషలేముకు నడిపించాడు.
5 తరువాత ప్రవక్తయగు షెమయా రెహబాము వద్దకు, యూదా నాయకుల వద్దకు వచ్చాడు. ఆ యూదా నాయకులంతా షీషకుకి భయపడి యెరూషలేములో సమావేశమయ్యారు. షెమయా రెహబాముతోను, యూదా నాయకుల తోను యీలా చెప్పాడు, “యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ‘రెహబామూ, నీవు మరియు యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టారు. నా ధర్మశాస్త్రాన్ని పాటించటానికి నిరాకరించారు. ఇప్పుడు మిమ్మల్ని నా సహాయం లేకుండా షీషకును ఎదుర్కోటానికి వదిలి పెడుతున్నాను”‘
6 అది విన్న యూదా నాయకులు, రాజైన రెహబాము విచారించి, తమను తాము తగ్గించుకొని విధేయులయ్యారు. “యెహోవా న్యాయమైనవాడు” అని అన్నారు.
7 రాజు, యూదా పెద్దలు విధేయులైనట్లు యెహోవా గమనించాడు. పిమ్మట షెమయాకు యెహోవా వర్తమానం ఒకటి వినవచ్చింది. యెహోవా షెమయాతో యీలా చెప్పాడు: ‘రాజు, నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. కావున వారిని నేను నాశనం చేయను. పైగా వారికి వెంటనే రక్షణ కల్పిస్తాను. యెరూషలేము మీద నా కోపాగ్నిని కురిపించటానికి నేను షీషకును వినియోగించను.
8 కాని యెరూషలేము ప్రజలు మాత్రం షీషకుయొక్క సేవకు లౌతారు. నాకు సేవచేయటం ఇతర దేశాల రాజులను సేవించటంకంటె భిన్నమైనదని వారు తెలిసి కొనేటందుకే ఇది యీలా జరుగుతుంది.”
9 షీషకు యెరూషలేముపై దండెత్తి ఆలయాన్ని కొల్లగొట్టాడు. షీషకు ఈజిప్టు రాజు. అతడింకా రాజభవనంలో వున్న ఖజానాను కూడ కొల్లగొట్టాడు. షీషకు రికిన ప్రతి వస్తువును తీసుకొని, ధనరాశులను పట్టుకుపోయాడు. అతడంకా సొలొమోను చేయించిన బంగారు డాళ్లనుకూడా పట్టుకుపోయాడు.
10 రాజైన రెహబాము బంగారు డాళ్ల స్థానంలో కంచుడాళ్లను చేయించాడు. రాజభవన ప్రధాన ద్వారం వద్ద కాపలా దారుల అధిపతులకు రెహబాము కంచు డాళ్లు యిచ్చాడు.
11 రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు ద్వారపాలకులు కంచుడాళ్లను వెలికితీసి వాడేవారు. పిమ్మట వారు మళ్ళీ ఆ కంచుడాళ్లను ఆయుధాగారంలో వుంచేవారు.
12 రెహబాము తనను తాను తగ్గించుకున్న తరువాత, యెహోవా అతని పట్ల తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అందువల్ల యెహోవా రెహబామును పూర్తిగా నాశనం చేయలేదు. యూదాలో ఇంకా కొంత మంచితనం మిగిలివుంది.
13 యెరూషలేములో రెహబాము చాలా శక్తివంతమైన రాజుగా రూపొందాడు. అతడు రాజయ్యేనాటికి నలబై ఒక్క సంవత్సరాలవాడు. రెహబాము రాజుగా యెరూషలేములో పదిహేడు సంవత్సరాలు వున్నాడు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో యెహోవా తనపేరు ప్రతి ష్ఠాపనకు యెరూషలేమునే ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి పేరు నయమా. నయమా అమ్మోను దేశస్తురాలు.
14 దేవుడైన యెహోవాను అనుసరించుటం మాని రెహబాము చెడుకార్యాలకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు యెహోవాని అనుసరించాలని హృదయమందు తీర్మానించు కొనలేదు.
15 రెహబాము రాజైనప్పటి నుండి అతని పాలన అంతమయ్యేవరకు అతను చేసిన విషయాలన్నీ షెమయా రచనలలోను పొందుపర్చబడ్డాయి. షెమయా ఒక ప్రవక్త. ఇద్దో ఒక దీర్ఘదర్శి వీరిద్దరూ కుటుంబ చరిత్రలు రాశారు. రెహబాము, యరొబాము రాజులిద్దరూ పాలించిన కాలంలో వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి,
16 రెహబాము చనిపోగా అతనిని దావీదు నగరంలో సమాధిచేశారు. పిమ్మట రెహబాము కుమారుడు అబీయా కొత్తగా రాజయ్యాడు.
1 ఇశ్రాయేలు రాజుగా యరొబాము పద్దెనిమిదవ సంవత్సరంలో కొనసాగుతూ వుండగా, అబీయా యూదాకు కొత్తగా రాజయ్యాడు.
2 అబీయా యెరూషలేములో మూడేండ్లు పాలించాడు. అబీయా తల్లి పేరు మయకా . మయకా తండ్రి పేరు ఊరియేలు. ఊరియేలు గిబియా పట్టణంవాడు. అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది.
3 అబీయాకు నాలుగు లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయా ఆ సైన్యాన్ని యద్ధానికి నడిపించాడు. యరొబాముకు ఎనిమిది లక్షలమంది ధైర్యంగల సైనికులున్నారు. అబీయాతో యుద్ధానికి యరొబాము సిద్ధమయ్యాడు.
4 అప్పుడు అబీయా కొండల దేశమైన ఎఫ్రాయిములో వున్న సెమరాయిము పర్వతం మీద నిలబడి యీలా అన్నాడు: “యరొబామూ, ఇశ్రాయేలీయులందరూ నేను చెప్పేది వినండి.
5 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుకు, అతని కుమారులకు శాశ్వతంగా ఇశ్రాయేలు రాజులు కావటానికి హక్కు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలి. ఉప్పు ఒడంబడిక ద్వారా దావీదుకు దేవుడు ఈ హక్కు యిచ్చాడు.
6 కాని యరొబాము యెహోవాకు వ్యతిరేకి అయ్యాడు! యరొబాము నెబాతు కుమారుడు. నెబాతు దావీదు కుమారుడైన సొలొమోను అధికారులలో ఒకడు.
7 అయితే పనికి మాలిన, దుష్టవ్యక్తులు యరొబాముకు స్నేహితులయ్యారు. యరొబాము, ఆ చెడ్డ మనుష్యులే రెహబాముకు ఎదురు తిరిగారు అప్పుడు రెహబాము చిన్నవాడు. అనుభవంలేనివాడు. అందువల్ల యరొబామును, అతని చెడు స్నేహితులను రెహబాము అదుపులో పెట్టలేకపోయాడు.
8 “ఓ యరొబామూ! నీవు, నీతో వున్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు యెహోవా రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు యెహోవా రాజ్యం దావీదు కుమారులకు చెందుతుంది. మీరు చాలామంది వున్నారు. యరొబాము మీకు బంగారు గిత్తలను చేయించి వాటిని దేవుళ్లవలె పూజించమన్నాడు.
9 మీరు యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టారు. యాజకులు అహరోను సంతతివారు. మీ స్వంతయాజకులను మీరు ఎంపిక చేసుకున్నారు. ఇది పరదేశీయులు చేసే పద్ధతి. ఒక గిత్తను గాని, ఏడు గొర్రె పొట్టేళ్లనుగాని తీసుకొని తనను పరిశుద్ధునిగా చేసుకోవటానికి ఎవడు వచ్చినా అతడు దేవుళ్ళుకాని విగ్రహాలకు యాజకులు కావచ్చు.
10 కాని, మా విషయానికి వస్తే యెహోవాయే మా దేవుడు. యూదా ప్రజలమైన మేము దేవునిపట్ల భయభక్తులు కలిగియున్నాము. మేము ఆయనను వదిలిపెట్టలేదు! యెహోవాను సేవించే యాజకులు అహరోను సంతతివారే. యెహోవా సేవలో యాజకులకు లేవీయులు తోడ్పడతారు.
11 వారు దహనబలులు, సుగంధద్రవ్యాలతో ధూపం నిత్యం ఉదయ సాయంకాలాల్లో సమర్పిస్తారు. ఆలయంలో ప్రత్యేకమైన బల్లమీద నైవేద్యపు రొట్టెలను వారు వరుసలలో పెడతారు. వారు ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభం నిలిపి ప్రమిదలు వెలిగిస్తారు. మన దేవుడైన యెహోవా ఆజ్ఞను మేము అనుసరిస్తాము. కాని యరొబామూ, నీవు మరియు నీతోవున్న ఇశ్రాయేలీయులూ యెహోవాను లక్ష్యపెట్టడంలేదు. మీరు ఆయనను వదిలి పెట్టారు.
12 దేవుడే మాకు తోడై వున్నాడు. ఆయనే మా అధిపతి. ఆయన యాజకులు మాతో వున్నారు. మీపై యుద్ధానికి యెహోవా యాజకులు బూరలు ఊది మమ్మల్ని పిలుస్తారు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడగు యెహోవా మీదికి యుద్ధానికి పోకండి. ఎందువల్లనంటే, మీరు విజయం పొందలేరు.!”
13 కాని యరొబాము కొంతమంది సైనికులను అబీయా సైన్యం వెనుక చాటుగా పొంచి వుండటానికి పంపాడు. యరొబాము సైన్యం అబీయా సైన్యానికి ఎదురుగా వుంది. యరొబాము సైన్యం నుండి రహస్యంగా వెళ్లిన సైనికులు అబీయా సైన్యానికి వెనకగా వున్నారు.
14 యూదాకు చెందిన అబీయా సైన్యంలోని భటులు వెనుదిరిగి చూచినప్పుడు యరొబాము సై న్యం తమను ముందు నుండి, వెనుక నుండి ఎదుర్కొంటునట్లు భావించారు. యూదా సైనికులు యెహోవాను పిలిచారు. యాజకులు బూరలు ఊదారు.
15 పిమ్మట అబీయా సైన్యం కేకలు పెట్టింది. యూదా సైనికులు యుద్ధ నినాదాలు చేసినప్పుడు, దేవుడు యరొబాము సైన్యాన్ని ఓడించాడు. ఇశ్రాయేలు నుండి వచ్చిన యరొబాము సైన్యాన్ని యూదా నుంచి వచ్చిన అబీయా సైన్యం ఓడించింది.
16 యూదా సైనికుల నుండి ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేలా దేవుడు యూదా సైన్యానికి తోడ్పడ్డాడు.
17 అబీయా సైన్యం ఇశ్రాయేలు సైన్యాన్ని చిత్తుగా ఓడించింది. ఐదులక్షల మంది ఇశ్రాయేలు యోధులు చనిపోయారు.
18 ఆ విధంగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడ్డారు; యూదా ప్రజలు గెలిచారు. వారి పూర్వీకుల దేవుడైన యెహోవా మీద వారు ఆధారపడిన కారణంగా యూదా సైన్యం విజయం సాధించింది.
19 అబీయా సైన్యం యరొబాము సైన్యాన్ని తరిమి కొట్టింది. అబీయా సైన్యం యరొబాముకు చెందిన బేతేలు, యెషానా, ఎఫ్రోను పట్టణాలను పట్టుకుంది. వారు ఆ పట్టణాలతో పాటు వాటి పరిసర గ్రామాలను కూడా వశపర్చుకున్నారు.
20 అబీయా నివసించియున్నంత కాలం యరొబాము బలమైన రాజు కాలేకపోయాడు. యెహోవా యరొబామును చంపేశాడు.
21 అబీయా మిక్కిలి బలవంతుడైన రాజయ్యాడు అతడు పదునల్గురు స్త్రీలను వివాహమాడాడు. అతడు ఇరువై యిద్దరు కుమారులకు, పదహారుగురు కుమార్తెలకు తండ్రి అయ్యాడు. 22అబీయా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయగు ఇద్దో రచనల్లో పొందుపర్చబడ్డాయి.
22 [This verse may not be a part of this translation]
1 అబీయా తన పూర్వీకులతో నిద్రంచాడు. దావీదు నగరంలో ప్రజలు అతనిని సమాధి చేశారు. పిమ్మట అబీయా కుమారుడు ఆసా అతని స్థానంలో కొత్తగా రాజయ్యాడు. ఆసా పరిపాలనా కాలంలో పది సంవత్సరాలపాటు దేశంలో శాంతి నెలకొన్నది.
2 తన దేవుడైన యెహోవా దృష్టకి మంచివైన, న్యాయమైన పనులు ఆసా చేశాడు.
3 విగ్రహాలను ఆరాధించటానికి వినియోగించిన వింత బలిపీఠాలను ఆసా తొలగించాడు. ఆసా ఉన్నత స్థలాలను తీసివేసి, స్మారక శిలలను పగులగొట్టాడు. అషేరా దేవతా స్తంభాలను కూడా ఆసా విరుగగొట్టాడు.
4 యూదా ప్రజలను దేవుడైన యెహోవాను అనుసరించమని ఆసా ఆదేశించాడు. ఆయన వారి పూర్వీకులు ఆరాధించిన దైవం. అందుచే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటించమని ఆసా వారికి ఆదేశించాడు.
5 యూదా పట్టణాలన్నిటి నుండి ఆసా ఉన్నత స్థలాలను, ధూప పీఠాలను తీసివేశాడు. ఆసా రాజుగా వున్న కాలంలో రాజ్యంలో శాంతి నెలకొన్నది.
6 యూదాలో శాంతి విలసిల్లిన కాలంలోనే ఆసా బలమైన నగరాలు నిర్మించాడు. యెహోవా శాంతియుత వాతావరణం కల్పించటంతో ఆసాకు ఆ కాలంలో యుద్ధాలు లేవు.
7 ఆసా యూదా ప్రజలతో యీలా చెప్పాడు: “మనమీ పట్టణాలను నిర్మించి, వాటిచుట్టూ ప్రాకారాలు కట్టిద్దాము. మనం బురుజులను, ద్వారాలను, ద్వారాలకు కడ్డీలను ఏర్పాటు చేద్దాము. ఈ దేశంలో ఇంకను నివసిస్తూండగానే మనమీ పనులు చేద్దాము. ఈ దేశం మనది. ఎందువల్లననగా మన ప్రభువైన దేవుని మనం అనుసరించాము. మనచుట్టూ ఆయన మనకు శాంతియుత వాతావరణం కల్పించాడు.” పిమ్మట వారు నగర నిర్మాణాలు చేపట్టి విజయం సాధించారు.
8 ఆసాకు మూడు లక్షలమంది యూదా వంశాల వారున్న సైన్యం; రెండు లక్షల ఎనబై వేలమంది బెన్యామీను కుటుంబాలకు చెందిన వారు సైన్యం వున్నాయి. యూదా సైనికులు పెద్ద పెద్ద డాళ్లను, ఈటెలను ధరించారు. బెన్యామీను సైనికులు చిన్న డాళ్లను ధరించి, ధనుస్సులతో బాణాలు వేయగల నేర్పరులు. వారంతా బలమైన, ధైర్యంగల సైనికులు.
9 పిమ్మట జెరహు అనేవాడు ఆసా మీదికి దండెత్తాడు. జెరహు ఇథియోపియావాడు . జెరహు సైన్యంలో పదిలక్షలమంది సైనికులు, మూడు వందల రథాలు వున్నాయి. జెరహు సైన్యం మారేషా వరకు చొచ్చుకు వచ్చింది.
10 జెరహును ఎదుర్కోవటానికి ఆసా బయలుదేరి వెళ్లాడు. మారేషా వద్ద జెపాతా లోయలో ఆసా సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యింది.
11 ఆసా తన దేవుడైన యెహోవాకు యిలా ప్రార్థన చేశాడు “ ప్రభూ, బలవంతుల నుండి బలహీనులను రక్షించేవాడవు నీ వొక్కడివే! ఓ ప్రభూ, మా దైవమా మాకు సహాయం చేయుము! మేము నీమీద ఆధారపడి యున్నాము. ఈ మహా సైన్యాన్ని నీ పేరుతో మేము ఎదిరించబోతున్నాము. యెహోవా, నీవు మా దేవుడవు. నీమీద విజయాన్ని ఎవ్వరికీ చేకూర నీయకుము!”
12 పిమ్మట యెహోవా ఆసా వద్దవున్న యూదా సైన్యాన్ని ఇథియోపియా (కూషు) సైన్యాన్ని ఓడించటానికి వినియోగించాడు. ఇథియోపియా సైన్యం పారిపోయింది.
13 ఆసా సైన్యం ఇథియోపియా సైన్యాన్ని గెరారు పట్టణం వరకు తరుముకుంటూ పోయింది. ఇథియోపియా సైనికులు అనేకమంది చనిపోవటంతో యుద్ధం చేయటానికి మళ్లీ వారు ఒక సైన్యంగా కూడ గట్టుకోలేకపోయారు. యెహోవా చేత, ఆయన సైన్యం చేత వారు అణచివేయబడ్డారు. శత్రుసైన్యం నుండి ఆసా, మరియు అతని సైనికులు అనేక విలువైన వస్తువులను దోచుకన్నారు.
14 సా మరియు అతని సైన్యం గెరారు దగ్గరలో వున్న అన్ని పట్టణాలను ఓడించారు. ఆ పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు యెహోవాకు భయపడిపోయారు. ఆ పట్టణాలలో విలువైన వస్తు సామగ్రి విస్తారంగా వుంది. ఆ విలువైన వస్తువులన్నిటినీ ఆసా సైన్యం దోచుకుంది.
15 ఆసా సైన్యం గొర్రెల కాపరులు నివసించే ప్రాంతాల మీద కూడా దాడి చేసింది. వారు చాలా గొర్రెలను, ఒంటెలను పట్టుకుపోయారు. తరువాత ఆసా సైన్యం యెరూషలేముకు వెళ్లిపోయింది.
1 దేవుని ఆత్మ అజర్యా మీదికి వచ్చింది. అజర్యా ఓబేదు కుమారుడు.
2 ఆసాను కలుసుకోవటానికి అజర్యా వెళ్లాడు. అజర్యా యిలా అన్నాడు: “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా నేను చేప్పేది వినండి! మీరు యెహోవాను నమ్మకొని ఉన్నన్ని రోజులూ, యెహోవా మీతో వుంటాడు. మీరు యెహోవాను వెదికితే, మీరాయనను కనుగొంటారు. కాని మీరు ఆయనను వదిలివేస్తే, ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు.
3 చాలాకాలం ఇశ్రాయేలుకు ఒక నిజమైన దేవుడు లేకుండా వుండిపోయింది. వారు బోధించే యాజకుడుగాని, ధర్మశాస్త్రంగాని లేకుండా వుండి పోయారు.
4 కాని ఇశ్రాయేలు ప్రజలకు కష్టంవచ్చినప్పుడు వారు మళ్లీ దేవుడైన యెహోవాను ఆశ్రయించారు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. వారాయనను వెదకగా, యెహోవా వారికి కన్పించాడు.
5 ఆ కష్టకాలంలో ఏ ఒక్కడూ క్షేమంగా ప్రమాణం చేయగలిగేవాడు కాదు. రాజ్యాలన్నిటిలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పాడ్డాయి.
6 ఒక రాజ్యం మరో రాజ్యాన్ని, ఒక నగరం మరో నగరాన్ని నాశనం చేసికోసాగాయి. దేవుడు వాటిని సర్వవిధాలుగా కల్లోల పెట్టిన కారణంగా ఆ పరిణామాలు వచ్చాయి.
7 కావున ఆసా, నీవు మరియు యూదా, బెన్యామీను ప్రజలు బలవంతులై యుండండి. బలహీనులు కావద్దు. అధైర్యపడవద్దు. ఎందుకంటే, మీ మంచి పనులకు తగిన ఫలితం దొరుకుతుంది!”
8 ప్రవక్త ఓబేదు మాటలు, వర్తమానం విన్న ఆసాకు చాలా ధైర్యం వచ్చింది. తరువాత అతడు యూదా, బెన్యామీను ప్రాంతాలన్నిటిలో వున్న అసహ్యకరమైన విగ్రహాలను తొలగించాడు. తానువశపర్చుకున్న ఎఫ్రాయిము కొండల ప్రాంతంలోని పట్టణాలలో వున్న హేయమైన విగ్రహాలను కూడా ఆసా తొలగించాడు. ఆలయ ముఖమండపంలో వున్న దేవుని బలిపీఠాన్ని కూడా అతడు బాగు చేయించాడు.
9 పిమ్మట యూదా, బెన్యామీను ప్రజలందరినీ ఆసా సమావేశపర్చాడు. అంతేగాక ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమ్యోను కుటుంబాల వారిని కూడా పిలిచాడు. వీరు ఇశ్రాయేలునుండి వలసపోయి యూదాలో స్థిరపడినవారు. వారిలో చాలామంది యూదాకు వచ్చిన కారణమేమంటే, ఆసా దేవుడైన యెహోవా ఆసా పక్షాన వున్నట్లు వారు గమనించారు.
10 ఆసా పరిపాలనలో పదిహేను సంవత్సరాలు దాటి మూడవనెల గడుస్తూవుండగా ఆసా, అతని ప్రజలూ యెరూషలేములో సమావేశమయ్యారు.
11 ఆ సమయంలో వారు ఏడువందల గిత్త దూడలను, ఏడువేల గొర్రెలను, మేకలను యెహోవాకు బలి యిచ్చారు. ఆ జంతువులను, ఇతర విలువైన వస్తువులను ఆసా సైన్యం తమ శత్రువుల నుండి తీసుకొన్నారు.
12 తరువాత వారు తమ పూర్ణ హృదయంతోను, తమ ఆత్మసాక్షితోను యెహోవాను సేవించటానికి ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆయన వారి పూర్వీకులు సేవించిన దేవుడు.
13 ఎవ్వరైనా దేవాధి దేవుని పూజించటానికి నిరాకరిస్తే అతడు చంపబడాలి. అట్టి మనిషి ఉన్నతుడేగాని, అల్పుడేగాని, పురుషుడే గాని, స్త్రీయేగాని ఎవ్వరైనా విచారణ లేకుండా చంపబడవలసినదే.
14 అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు ఒక వారు ఏకగ్రీవంగా పెద్దగా అరిచారు. వారు బూరులు, పొట్టేలు కొమ్ములు వూదారు.
15 యూదా ప్రజలంతా వారు చేసిన ప్రమాణం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారు. గనుక వారికా సంతోషం. పూర్ణ హృదయంతో వారు దేవుని అనుసరించారు. వారు దేవుని కొరకు వెదకి, ఆయనను దర్శించారు. కావున యెహోవా వారికి దేశమంతా శాంతియుత వాతవరణం నెలకొనేలా చేశాడు.
16 ఆసా తన తల్లియైన మయకాను రాజమాత పదవినుండి తొలగించాడు. అషేరా దేవతా స్తంభాన్ని నెలకొల్పటం ద్వారా ఆమె చేయించిన హేయమైన కార్యానికి అతడాపని చేశాడు. అషేరా స్తంభాన్ని ఆసా నరికించి చిన్న చిన్న ముక్కలు చేశాడు. తరువాత అతడా ముక్కలను కిద్రోను లోయలో తగులబెట్టాడు.
17 అయితే యూదాలో వున్న ఉన్నత స్థలాలు తొలగింపబడలేదు. అయినప్పటికి ఆసా హృదయం అతని జీవితాంతం యెహోవాకు విశ్వాసపాత్రంగా వుంది.
18 ఆసా తానూ, తన తండ్రీ దేవునికి సమర్పించిన కానుకలను, ఇతర విలువైన వస్తువులను ఆలయంలో వుంచాడు. ఆ వస్తువులన్నీ వెండి, బంగారాలతో చేయించినవి.
19 ఆసా పాలనలో ముప్పైయైదవ సంవత్సరం వరకు యుద్ధాలు ఏ మాత్రం జరగలేదు.
1 ఆసా పాలనలో ముప్పై ఆరవ సంవత్సరంలో యూదా రాజ్యం మీదికి బయెషా దండెత్తాడు. బయెషా ఇశ్రాయేలు రాజు. అతడు రామా పట్టణానికి వెళ్లి దానిని కోటలా మర్చాడు. రామా పట్టణాన్ని బయెషా ఒక కీలక స్థానంగా వినియోగించి యూదా రాజు ఆసా వద్దకు వెళ్లటానికిగాని, అతని వద్ద నుండి బయటకు రావటానికి గాని ప్రజలకు ఆస్కారం లేకుండా చేశాడు.
2 ఆలయం ఖజానాలో వున్న వెండి, బంగారు నిల్వలను ఆసా తీశాడు. రాజగృహంలో వున్న వెండి, బంగారాలను కూడా అతడు తీశాడు. తరువాత ఆసా తన దూతలను బెన్హదదు వద్దకు పంపాడు. బెన్హదదు అరాము (సిరియా) రాజు. అతడు దమస్కు (డెమాస్కస్) పట్టణంలో నివసిస్తున్నాడు. ఆసా పంపిన వర్తమానం యీలా వుంది.
3 “బెన్హదదూ, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక కొనసాగేలా చూడు. అది నీ తండ్రికి, నా తండ్రికి మధ్య కొనసాగిన ఒడంబడికలా వుండాలి. చూడండి, మీకు నేను వెండి బంగారాలు పంపిస్తున్నాను. కనుక నీవిప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒడంబడికను రద్దు చేసుకోవాలి. తద్వారా అతడు నామీదకు రాకుండా, నన్ను ఒంటరిగా వదిలి, నన్ను బాధపెట్టడు.”
4 రాజైన ఆసా వర్తమానాన్ని బెన్హదదు అంగీకరించాడు. బెన్హదదు తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాలపై దాడులు జరపమని పంపాడు. ఆ అధిపతులు ఈయోను, దాను ఆబేల్మాయీము పట్టణాలపై దాడి చేశారు. నఫ్తాలి ప్రాంతంలోవున్న పట్టణాలను కూడ వారు ఎదుర్కొన్నారు. ఈ పట్టణాలలో ధనాగారాలు వున్నాయి.
5 ఇశ్రాయేలు పట్టణాలపై దాడులను గూర్చి బయెషా విన్నాడు. అది విని రామా పట్టణాన్ని దుర్గంగా మార్చే పనిని బయెషా విరమించుకున్నాడు. పనిని మధ్యలో ఆపివేశాడు.
6 ఆ తరువాత రాజైన ఆసా యూదా ప్రజలను సమావేశపర్చాడు. వారంతా రామా పట్టణానికి వెళ్లి బయెషా కోట కట్టించటానికి తెప్పించిన రాళ్లను, కలపను పట్టుకుపోయారు. ఆసా, యూదా ప్రజలు ఆ రాళ్లను, కలపను గెబ, మిస్పా పట్టణాలను బలంగా కట్టడానికి వినియోగించారు.
7 ఆ సమయంలో దీర్ఝదర్శియైన హనానీ యూదా రాజైన ఆసా వద్దకు వచ్చాడు. హనానీ యీలా అన్నాడు: “ఆసా, నీకు సహాయం చేయటానికి నీవు అరాము (సిరియా) రాజుమీద ఆధారపడ్డావు గాని, దేవుడైన యెహోవాపై ఆధారపడలేదు. నీవు దేవుని మీద ఆధారపడవలసింది. నీవు సహాయానికి యెహోవాపై ఆధారపడలేదు గనుక, అరాము రాజు సైన్యం నీ అధీనం నుండి తప్పించుకున్నది.
8 ఇథియోపియనులు లూబీయులు (లిబియావారు) చాలా శక్తివంతమైన పెద్ద సైన్యాలను కలిగియున్నారు. వారికి అనేక రథాలున్నాయి, రథసారధులు వున్నారు. కాని ఆసా, అంత పెద్ద సైన్యాన్ని ఓడించటానికి నీవు యెహోవాను నమ్ముకొని, ఆయన మీద ఆధారపడ్డావు. నీవు వారిని ఓడించేలా యెహోవా నీకు సహాయపడ్డాడు.
9 యెహోవా కండ్లు భూమి నలుమూలలా పరిశీలించి తన పట్ల భక్తి విశ్వాసాలున్న వారిని చూస్తాయి. యెహోవా వారిని బలపర్చి రక్షిస్తాడు. ఆసా, నీవొక బుద్ధిలేని పని చేశావు. అందువల్ల ఇప్పటి నుండి నీవు యుద్ధాలు చేయవలసి వస్తుంది.”
10 అతడు చెప్పిన దానికి హనానీపై ఆసాకు కోపం వచ్చింది. ఆసాకు ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే అతడు హనానీని చెరసాలలో పెట్టించాడు. అదే సమయంలో ఆసా కొంతమంది మనుష్యులతో చాలా సంకుచితంగా, కఠినంగా ప్రవర్తించాడు.
11 మొదటి నుండి చివరి వరకు ఆసా చేసిన కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
12 ఆసా రాజుగా కొనసాగిన ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో అతని పాదాలకు జబ్బు చేసింది. అతని జబ్బు చాలా ప్రమాదంగా వున్నప్పటికీ, ఆసా యెహోవా నుండి సహాయం కోరలేదు. ఆసా వైద్యుల నుండి వైద్య సహాయంకొరకు చూశాడు.
13 ఆసా తన పరిపాలనలో నలబై ఒకటవ సంవత్సరంలో చనిపోయాడు. ఆ విధంగా ఆసా తన పూర్వీకులతో నిద్రించాడు.
14 దావీదు నగరంలో తనకై తాను సిద్ధ పర్చుకున్న సమాధిలోనే ప్రజలు ఆసాను వుంచారు. ఆసాకు గౌరవ సూచకంగా సుగంధ దినుసులతోను, పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు వుంచి, అతనిని దహించారు .
1 ఆసా స్థానంలో యెహోషాపాతు యూదాకు కొత్తగా రాజయ్యాడు. యెహోషాపాతు ఆసా కుమారుడు. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని ఇశ్రాయేలుతో పోరాడగల శక్తిగలదిగా రూపొందించాడు.
2 కోటలుగా మార్చబడిన పట్టణాలన్నిటిలో అతడు సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు యూదాలోను, తన తండ్రియైన ఆసా వశపర్చుకున్న ఎఫ్రాయిము పట్టణాలలోను కోటలు నిర్మించాడు.
3 యెహోవా యెహోషాపాతు పక్షాన వున్నాడు. ఎందువల్లనంటే, యెహోషాపాతు చిన్న వాడైనప్పటికి, తన పూర్వీకుడైన దావీదు చేసిన మంచి పనులన్నీ చేశాడు. యెహోషాపాతు బయలు విగ్రహాలను పూజించలేదు.
4 తన పూర్వీకులు అనుసరించిన యెహోవా కోసమే యెహోషాపాతు నిరీక్షించాడు. అతడు దేవుని ఆజ్ఞలను పాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధంగా అతడు జీవనాన్ని గడపలేదు.
5 యూదాపై యెహోషాపాతును ఒక శక్తివంతమైన రాజుగా దేవుడు చేశాడు యూదా ప్రజలంతా యెహోషాపాతుకు కానుకులు సమర్పించారు. ఆ విధంగా యెహోషాపాతుకు ఎక్కువ ధనం, గౌరవం లభించాయి.
6 యెహోవా మార్గాల ననుసరించటానికి యెహోషాపాతు హృదయం సంతోషంతో యిష్టపడింది. అతడు ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను యూదా రాజ్యం నుండి తీసివేశాడు.
7 యెహోషాపాతు కొందరు పెద్దలను యూదా రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు పంపించాడు. అది యెహోషాపాతు పాలనలో మూడవయేట జరిగింది. ఆ పెద్దలు ఎవరంటే బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మరియు మీకాయా.
8 ఈ పెద్దలతో పాటు యెహోషాపాతు లేవీయలను కూడ పంపాడు. ఆ లేవీయులు ఎవరంటే షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, మరియు టోబీయా. యెహోషాపాతు యాజకులైన ఎలీషామా, యెహోరాములను కూడా పంపాడు.
9 ఆ పెద్దలు, లేవీయులు, యాజకులు యూదాలో ప్రజలకు బోధించారు. వారి వద్ద యెహోవా ధర్మ శాస్త్ర గ్రంథం వుంది. వారు యూదా పట్టణాలన్నిటికీ వెళ్లి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించారు.
10 యూదా పొరుగు రాజ్యాల వారు యెహోవాకు భయపడ్డారు. అందువల్ల వారు యెహోషాపాతుపై యుద్ధం ప్రకటించలేదు.
11 కొంతమంది ఫిలిష్తీయులు యెహోషాపాతుకు కానుకలు తెచ్చారు. వారు యెహోషాపాతుకు వెండిని కూడా తెచ్చారు. కారణమేమంటే యెహోషాపాతు చాలా శక్తివంతుడైన రాజని వారికి తెలియటమే. అరబీయులు కొందరు గొర్రెల మందలను యెహోషాపాతుకు కానుకలుగా తెచ్చారు. వారు ఏడువేల ఏడు వందల గొర్రెపొట్టేళ్ళను ఏడువేల ఏడు వందల మేకలను తెచ్చారు.
12 యెహోషాపాతు రాను రాను చాలా బలమైన రాజుగా రూపొందాడు. అతడు యూదా రాజ్యంలో కోటలను, గిడ్డంగుల పట్టణాలను కట్టించాడు.
13 సరుకు నిల్వచేసే ఆ పట్టణాలకు నిత్యావసర, తదితర సామగ్రిని అతడు బాగా రవాణా చేశాడు. బాగా శిక్షణ పొందిన సైనికులను యెరూషలేములో యెహోషాపాతు వుంచాడు.
14 ఈ సైనికులువారి పితరుల వంశాలలో చేర్చబడినవారు. యెరూషలేములో వున్న సైనికుల వివరాలు ఏవనగా: యూదా వంశం నుండి నియమింపబడిన వారిలో సేనాధిపతులున్నారు. అద్నా క్రింద మూడు లక్షల మంది సైనికులున్నారు.
15 యెహోహానాను రెండు లక్షల ఎనబై వేలమంది వున్న సేనకు అధిపతి.
16 అమస్యా రెండు లక్షల మంది సైనికులకు అధిపతి. అమస్యా జిఖ్రీ కుమారుడు. అతడు యెహోవా సేవకు సంతోషంతో అంకితమయ్యాడు.
17 బెన్యామీను వంశం నుండి ఎంపిక చేయబడిన సేనాధిపతుల వివరాలు. ఎల్యాదా కింద విల్లంబలు, డాళ్లు పట్టగల రెండు లక్షల మంది సైనికులున్నారు. ఎల్యాదా మిక్కిలి ధైర్యశాలియైన సేనాని.
18 యెహోజా బాదు కింద యుద్ధ సన్నద్ధులైన లక్షా నలబై వేల మంది సైనికులున్నారు.
19 ఈ సైనికులంతా రాజైన యెహోషాపాతుకు సేవ చేశారు. రాజుకు యూదాలో వున్న అన్ని కోటలలో ఇతర సైనికులున్నారు.
1 యెహోషాపాతుకు ఎక్కువగా ధనం, గౌరవం లభించాయి. రాజైన అహాబుతో అతడు వివాహం ద్వారా ఒక ఒడంబడిక ఏర్పరచుకొన్నాడు.
2 కొద్ది సంవత్సరాల తరువాత యెహోషాపాతు సమరయ (షోమ్రోను) లో అహాబును చూడటానికి వెళ్లాడు. యెహోషాపాతు, అతని పరివారం యొక్క గౌరవార్థం అహాబు అనేక గొర్రెలను, ఆవులను కోయించాడు. ఆ సమయాన రామోత్గిలాదు పట్టణంపై దాడి చేయటానికి అహాబు యెహోషాపాతును ప్రోత్సహించాడు.
3 “రామోత్గిలాదుపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?” అని అహాబు యెహోషాపాతును అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు యుదా రాజు అహాబుకు యెషాపాతు యిలా సమాధాన మిచ్చాడు: “నేను నీవంటి వాడను. నా మనుష్యులు నీ మనుష్యుల వంటి వారు. మేము యుద్ధానికి నీతో వస్తాము.
4 కాని ముందుగా మనం యెహోవా వర్తమానం ఏమైనా వుంటుందేమో చూద్దాం,” అని కూడ యెహోషాపాతు అన్నాడు.
5 అందువల్ల అహాబు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించాడు. అహాబు వారితో, “మేము రామోత్గిలాదు పట్టణం మీదికి యుద్ధానికి వెళ్లవచ్చా? లేదా?” అని అన్నాడు. అప్పుడు ప్రవక్తలు, “వెళ్లండి; ఎందువల్లనంటే దేవుడు రామోత్గిలాదును మీరు ఓడించేలా చేస్తాడు” అని అహాబుకు సమాధాన మిచ్చారు.
6 కాని యెహోషాపాతు యిలా అన్నాడు: “ఇక్కడ యెహోవా యొక్క ప్రవక్త ఎవరైనా వున్నారా? యెహోవా ప్రవక్తలలో ఒకని ద్వారా ఆయన ఏమి చెపున్నాడో తెలుసుకోవలసిన అవసరం వుంది.”
7 అప్పుడు రాజైన అహాబు యెహోషాపాతుతో యీలా అన్నాడు: “ఇక్కడ ఇంకా ఒక మనిషి వున్నాడు. మనం అతని ద్వారా యెహోవాను అడుగుదాం. కాని ఈ మనిషిని నేను అసహ్యించుకుంటాను. ఎందువల్ల నంటే అతడు యెహోవా నుండి నాకు ఒక్క మంచి వర్తమానం కూడ అందచేయడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు. ఆ వ్యక్తి పేరు మీకాయా. అతడు ఇమ్లా కుమారుడు.” కాని యెహోషాపాతు, “అహాబూ నీవు అలా అనరాదు” అని అన్నాడు.
8 అప్పుడు రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను త్వరగా తీసుకొని రమ్మని పంపాడు.”
9 ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు తమతమ రాజదుస్తులు ధరించారు. వారిద్దరు సమరయ (షోమ్రోను) నగర ముఖద్వారం దగ్గర వున్న నూర్పిడి కళ్లం వద్ద తమతమ సింహాసనాలపై కూర్చున్నారు. అక్కడకు వచ్చియున్న నాలుగువందల మంది ప్రవక్తలు రాగల సంగతుల వర్తమానాలను రాజుల ముంగిట చెప్తున్నారు.
10 కెనయనా కుమారుని పేరు సిద్కియా. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించుకు వచ్చాడు. సిద్కియా యిలా అన్నాడు: “యెహోవా ఈ రకంగా చెప్పుచున్నాడు: ‘నీవు ఈ ఇనుప కొమ్ములు విని యెగించి, అరామీయులు (సిరియనులు) నశించిపోయే వరకు వారిని పోడుస్తావు.”‘
11 ప్రవక్తలంతా అదే విషయం చెప్పారు. వారిలా అన్నారు: “రామోత్గిలాదు పట్టణానికి వెళ్లు. నీకు విజయం చేకూరుతుంది. రాజు అరాము ప్రజలను ఓడించేలా యెహోవా తోడ్పడుతాడు.”
12 మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో యీలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెప్తున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు.”
13 “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెపుతాను” అని మీకాయా అన్నాడు.
14 పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్గిలాదు పట్టణంపై దండెత్తటానికి వెళ్లవచ్చునో, లోదో తెలియజేయి” అని అన్నాడు. అందుకు మీకాయా, “వెళ్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా చేస్తాడు,” అని చెప్పాడు.
15 అహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా సార్లు నిజమే ప్రవచించేలా యెహోవా పేర నీచేత ప్రమాణం చేయించాను,” అని అన్నాడు.
16 అప్పుడు మీకాయా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా పర్వతాలపై చిందరవందరై పోయినట్లు నేను చూశాను. వారు కాపరిలేని గొర్రెల్లా వున్నారు. యెహోవా చెప్పినదేమంటే, ‘వారికి నాయకుడు లేడు. కావున ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.”‘
17 అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ చెడు వర్తమానాలే!”
18 మీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై కూర్చుని వున్నట్లు నేను చూశాను. పరమండల సైన్యమంతా ఆయన చుట్టూ చేరివుంది.
19 యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు అక్కడ చంపబడే విధంగా, యుక్తిగా రామోత్గిలాదుపై అతనిని యుద్ధానికి ఎవరు పంపగలరు?’ అని అడిగినాడు. ఆయన చుట్టూ చేరిన పలువురు పలురకాలుగా చెప్పారు.
20 పిమ్మట ఒక ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, ‘అహాబును నేను మోసపుచ్చుతాను’ అని అన్నది. ‘ఎలా?’ అని యెహోవా ఆత్మని అడిగాడు.
21 ‘నేను అసత్యలాడే ఆత్మగా మారి అహాబు ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్ధాలు పలికిస్తాను’ అని ఆత్మ చెప్పింది. అది విని ‘అహాబును మోసగించటంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి కార్యము సాధించు’ అని యెహోవా అన్నాడు.
22 “అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”
23 పిమ్మట సిద్కియా తిన్నగా మీకాయా వద్దకు వెళ్లి చెంపమీద చాచికొట్టాడు. సిద్కియా తండ్రి పేరు కెనయనా. సిద్కియా యిలా అన్నాడు: “మీకాయా, యెహోవా వద్దనుండి వచ్చిన ఆత్మ నన్ను వదిలి నిన్నావరించటానికి ఎటునుండి వచ్చింది?”
24 దానికి మీకాయా “సిద్కియా, నీవు లోపలి గదిలోకి పోయి దాగుకొనే రోజున నీవది తెలుసుకొంటావు!” అని సమాధానమిచ్చాడు.
25 పిమ్మట రాజైన అహాబు యిలా అన్నాడు: “మీకాయాను తీసుకొని వెళ్లి నగరపాలకుడైన ఆమోనుకు, రాజకుమారుడైన యెవాషుకు అప్పజెప్పండి.
26 రాజాజ్ఞగా ఆమోనుకు, యెవాషుకు యిలా చెప్పండి: ‘మీకాయాను చెరసాలలో పెట్టండి. నేను యుద్ధం నుండి తిరిగి వచ్చేవరకు అతనికి రొట్టె నీరు తప్ప ఇతర ఆహారమేదీ యివ్వవద్దు.”‘
27 మీకాయా యిలా సమాధానమిచ్చాడు: “అహాబూ, నీవు యుద్ధాన్నుండి క్షేమంగా తిరిగి వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండలేదని అర్థం. ఓ ప్రజలారా, నా మాటలు విని జ్ఞాపకం పెట్టుకోండి!”
28 పిమ్మట ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు పట్టణాన్ని ముట్టడించారు.
29 అహాబు యెహోషాపాతుతో, “యుద్ధంలోకి వెళ్లే ముందు నేను నా వేషం మార్చివేస్తాను. కాని నీవు మాత్రం నీ రాజదుస్తులే ధరించు” అని అన్నాడు. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసిన పిమ్మట రాజులిద్దరూ యుద్ధానికి వెళ్లారు.
30 అరాము (సిరియా) రాజు తన రథాల అధిపతులకు ఒక ఆజ్ఞ యిచ్చాడు. అతడు వారితో యిలా అన్నాడు: “ఎంత గొప్ప వాడేగాని, ఎంత సామాన్యుడే గాని, మీరు ఎవ్వరితోనూ పోరాడవద్దు. కాని మీరు ఇశ్రాయేలు రాజైన అహాబతోనే యుద్ధం చేయండి.”
31 రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు అతడే ఇశ్రాయేలు రాజైన అహాబు అనుకున్నారు! అతన్ని ఎదిరించటానికి వారు యెహోషాపాతు మీదికి తిరిగారు. కాని యెహోషాపాతు కేకలు పెట్టటంతో యెహోవా అతనికి సహాయపడ్డాడు. రథాధిపతులు యెహోషాపాతును వదిలి పోయేలాగు దేవుడు వారి మనస్సు మార్చాడు.
32 వారు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు కాదని తెలిసికొన్నప్పుడు వారతనిని తరమటం మానివేశారు.
33 కాని ఒక సైనికుడు దేనికీ గురిపెట్టకుండా ఒక బాణాన్ని మామూలుగా వదిలాడు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. కవచం కప్పకుండా వున్న అతని శరీర భాగంలో ఆ బాణం తగిలింది. అప్పుడు అహాబు తన రథసారధితో, “రథాన్ని వెనుకకు తిప్పి నన్ను యుద్ధరంగం నుండి బయటకు తీసుకొని వెళ్లు. నేను గాయపడ్డాను.” అని చెప్పాడు.
34 ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. అహాబు తన రథంలో ఆనుకొని సాయంత్రంమయ్యే వరకు అరామీయులను (సిరియనులు) చూస్తూ నిలబడివున్నాడు. సూర్యుడు అస్తమించే సమయంలో అహాబు చనిపోయాడు.
1 యూదా రాజైన యెహోషాపాతు యెరూషలేములోని తన యింటికి క్షేమంగా తిరిగి వచ్చాడు.
2 దీర్ఘదర్శియగు యెహూ ఎదురేగి యెహోషాపాతును కలిశాడు. యెహూ తండ్రి పేరు హనానీ. యెహోషాపాతుతో యెహో ఈ విధంగా చెప్పాడు: “నీవు దుష్టులకు ఎందుకు సహాయపడ్డావు? యెహోవాను అసహ్యించుకునే వారిని నీ వెందుకు ప్రేమిస్తున్నావు? అందువల్లనే యెహోవా నీపట్ల కోపంగా వున్నాడు.
3 కాని నీ జీవితంలో నీవు కొన్ని మంచి పనులు చేశావు. నీవు అషేరా దేవతా స్తంభాలను ఈ దేశం నుండి తొలగించావు. దేవుని అనుసరించాలని నీ హృదయంలో నిశ్చయించుకున్నావు.”
4 యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. మళ్లీ అతడు ప్రజలను కలియటానికి బెయేర్షెబా పట్టణం నుండి కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము వరకు సంచారం చేశాడు. యెహోషాపాతు ప్రజలమధ్య తిరిగి మళ్లీ వారిని తమ పూర్వీకులు ఆరాధించిన యెహోవా వైపుకు తిప్పాడు.
5 యెహోషాపాతు యూదాలో న్యాయాధిపతులను నియమించాడు. యూదాలో కోటలుగల పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను నియమించాడు.
6 యెహోషాపాతు ఆ న్యాయాధిపతులతో యిలా చెప్పాడు: “మీరు చేసే పనిలో మీరు మిక్కిలి మెళకువతో మెలగండి. ఎందువల్లనంటే మీరు తీర్పు తీర్చేది ప్రజల తరుపున కాదు. యెహోవా తరుపున మీరొక నిర్ణయం తీసుకొనేటప్పుడు యెహోవా మీతో వుంటాడు.
7 కావున మీలో ప్రతి ఒక్కడూ యెహోవాకు భయ పడాలి. మీ పనిలో మీరు జాగ్రత్త వహించండి. ఎందు వల్లనంటే మన దేవుడైన యెహోవా పక్షపాతం లేనివాడు. న్యాయశీలి. యెహోవా ఎన్నడూ కొందరిని మరికొందరికంటె ముఖ్యులుగా చూడక సమంగా చూస్తాడు. తన తీర్పును మార్చటానికి యెహోవా ధనం ఆశించడు.”
8 యెరూషలేములో కొంతమంది లేవీయులను, యాజకులను, మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను న్యాయాధిపతులుగా యెహోషాపాతు ఎంపిక చేశాడు. యెరూషలేములో వున్న ప్రజల సమస్యలను పరిష్కరించటానికి వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తారు.
9 యెహోషాపాతు యిలా కొన్ని ఆజ్ఞలను యిచ్చాడు. యెహోషాపాతు యిలా చెప్పాడు: “మీ నిండు హృదయంతో మీరు విశ్వాసపాత్రంగా సేవ చేయాలి. మీరు యెహోవాకు భయపడాలి.
10 హత్యావిషయాలు, చట్టపరమైన, ఆజ్ఞాపరమైన నియమ నిబంధనలకు సంబంధించిన నేరాలు అనేకం మీ దృష్టికి తేబడతాయి. నగరాలలో నివసించే మీ సోదరుల వద్ద నుండి ఈ విషయాలు మీ తీర్పుకు వస్తాయి. మీ వద్దకు వచ్చిన నేరస్తులను, వాదాలాడే వారిని అందరినీ యెహోవాపట్ల పాపం చేయవద్దని మీరు హెచ్చరించాలి. మీరు నమ్మకంగా పనిచేయని ఎడల మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా కోపాన్ని రప్పించిన వారవుతారు. నేను చెప్పినట్లు చేయండి. అప్పుడు తప్పు చేశామనే భావన మీకు వుండదు.
11 అమర్యా ప్రముఖ యాజకుడు. యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలలో అతడు మీమీద ఆధిపత్యం వహిస్తాడు. రాజుకు సంబంధించిన విషయాలలో మీకు మార్గదర్శకుడుగా జెబద్యావున్నాడు. జెబద్యా తండ్రి పేరు ఇష్మాయేలు. యూదా వంశంలో జెబద్యా ఒక పెద్ద. ఇంకను లేవీయులు మీకు లేఖకులుగా పని చేస్తారు. మీరు ప్రతి పనీ ధైర్యంగా చేయండి. న్యాయమార్గాన నడిచే ప్రజలకు యెహోవా అండగా వుండుగాక!”
1 తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు కలిసి యెహోషాపాతుతో యుద్ధం ప్రారంభించటానికి వచ్చారు.
2 కొందరు మనుష్యులు యెహోషాపాతు వద్దకు వచ్చి యిలా అన్నారు: “ఎదోము నుంచి ఒక పెద్ద సైన్యం నీమీదికి వస్తూ వుంది. ఆ సైన్యం మృత సముద్రానికి అవతలి పక్క నుండి వస్తూ వుంది. వారు ఇప్పటికే హససోను తామారు అనబడే ఏన్గెదీలో ఉన్నారు.”
3 యెహోషాపాతు భయపడ్డాడు. తాను ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి ఒక్కడూ ఉపవాసం చేయలని ఒక నిర్ణీత సమయాన్ని ప్రకటించాడు.
4 యూదా ప్రజలు యెహోవా సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా సహాయం కోరటానికి వచ్చారు.
5 యెహోషాపాతు ఆలయ నూతన ప్రాంగణం ముందు వున్నాడు. యూదా, యెరూషలేము ప్రజల సమావేశంలో అతడు నిలబడ్డాడు.
6 అతడు ఈ విధంగా ప్రార్థించాడు: “మా పూర్వీకుల దేవుడవైన ఓ ప్రభూ, నీవే పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు నీవే! నీకు అధికారం, బలం వున్నాయి! నిన్నెదిరించి ఎవ్వడూ నిలువలేడు!
7 నీవు మా దేవుడివి! ఈ దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తడి చేశావు. ఈ పనినీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు.
8 అబ్రహాము సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద ఒక ఆలయాన్ని కట్టించారు.
9 వారు, ‘యుద్ధాలు, శిక్ష వ్యాధులు, కరువు కాటకాలు మొదలైన ఈతి బాధలు మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి మమ్ము రక్షిస్తావు’ అని అన్నారు.
10 “కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు శేయీరు పర్వత ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు వెళ్లనీయలేదు అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు వారి జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయలేదు.
11 కాని మేము వారిని నాశనం చేయకుండా వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండి మమ్మల్ని తరిమి వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు యిచ్చి యున్నావు.
12 మా దేవా, ఆ మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం .”
13 యూదా ప్రజలంతా తమ పసిబిడ్డలు, భార్యలు, పిల్లలతో యెహోవా ముందు నిలబడ్డారు.
14 అప్పుడు యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి వచ్చింది. యహజీయేలు తండ్రి పేరు జెకర్యా. జెకర్యా తండ్రి పేరు బెనాయా. బెనాయా తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు తండ్రి పేరు మత్తన్యా. యహజీయేలు ఒక లేవీయుడు. ఆసాపు సంతతిలోనివాడు. సమావేశం మధ్యలో
15 యహజీయేలు నిలబడి యిలా అన్నాడు: “రాజైన యెహోషాపాతూ, యూదా, యెరూషలేములలో నివసిస్తున్న ప్రజలారా వినండి! యెహోవా మీకు ఈ విధంగా తెలియజెప్పుతున్నాడు: ‘ఈ మహా సైన్యాన్ని చూచి మీరు భయపడవద్దు. చింతించవద్దు. ఎందువల్లననగా ఇప్పుడు యుద్ధం మీది కాదు. ఇది దేవుని యుద్ధం.
16 రేపు మీరు అక్కడకి వెళ్లి ఆ సైన్యంతో యుద్ధం చేయండి. వారు జీజు కనుమ ద్వారా వస్తారు. యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర మీరు వారిని చూస్తారు.
17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరీ స్థానాలలో దృఢంగా నిలబడండి. యెహోవా మిమ్ముల్ని రక్షించటం మీరు చూస్తారు. యూదా, యెరూషలేము ప్రజలారా భయపడకండి! చింతించవద్దు! యెహోవా మీ పక్షాన వున్నాడు. కావున రేపు వారి మీదికి వెళ్లండి.”‘
18 యెహోషాపాతు తన శిరస్సు నేల తాకేలా సాష్టాంగపడ్డాడు. యూదా ప్రజలు, యెరూషలేములో వుంటున్న వారు యెహోవా ముందు సాష్టాంగపడ్డారు. వారంతా యెహోవాను ఆరాధించారు.
19 లేవీయులలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు.
20 తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!”
21 యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు. “యెహోవాకు భజన చేయండి; ఆయన ప్రేమ తరగనిది!” అంటూ వారు సంకీర్తన చేశారు.
22 ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు.
23 అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత ప్రాంతం వారితో యుద్ధానికి దిగారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వతప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి నొకరు చంపుకున్నారు.
24 యూదా సైనికులు ఎడారిలోని కాపలా బురుజు వద్దకు వచ్చారు. వారు శత్రుసైన్యం వైపు పరిశీలించి చూశారు. కాని వారు భూమిమీద పడివున్న శవాలను మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడా బ్రతికిలేడు.
25 శవాలపైగల విలువైన వస్తువులను తీసుకోవటానికి యెహోషాపాతు, అతని సైన్యం, వచ్చారు. వారు జంతువులను, డబ్బును, బట్టలను, ఇతర విలువైన వస్తువులను చూశారు. యెహోషాపాతు, అతని సైనికులు ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలేనన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి.
26 నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా లోయలో సమావేశమైనారు. ఆ స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు.
27 తరువాత యూదా నుండి, యెరూషలేము నుండి వచ్చిన సైనికులను యెహోషాపాతు యెరూషలేముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, యెహోవా వారిని చాలా సంతోషపర్చాడు.
28 వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు.
29 ఇశ్రాయేలు శత్రులతో యెహోవా యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ యెహోవా అంటే భయపడ్డారు.
30 అందువల్ల యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాడు.
31 యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పాలించాడు. యెహోషాపాతు పాలన మొదలయ్యే సరికి ముప్పై ఐదేండ్లవాడు. అతడు యెరూషలేములో ఇరవైయైదు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా. అజూబా తల్లిపేరు షిల్హీ.
32 తన తండ్రి ఆసా నడిచిన రీతిగా యెహోషాపాతు ఉత్తమ జీవితాన్ని గడిపాడు. యెహోషాపాతు ఆసా మార్గాన్ని అనుసరించటానికి వెనుకాడలేదు. యెహోవా దృష్టికి మంచి పనులన్నీ యెహోషాపాతు చేశాడు.
33 కాని బూటకపు దేవతల పూజలకు వినియోగించిన గుట్టలను (ఉన్నత స్థలాలను) అతడు తీసివేయలేదు. ప్రజలు కూడా తమ పూర్వీకులు ఆరాధించిన దేవుని అనుసరించటానికి తమ హృదయాలను తిప్పలేదు.
34 యెహోషాపాతు ఆదినుండి అంతంవరకు చేసిన పనులన్నీ యెహో వ్రాసిన గ్రంథాలలో పొందుపర్చబడ్డాయి. యెహో తండ్రిపేరు హనానీ. ఈ విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
35 చివరి రోజుల్లో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. అహజ్యా మిక్కిలి చెడుకార్యాలు చేశాడు.
36 తర్షీషు పట్టణానికి పయనించే ఓడలను చేయించటానికి యెహోషాపాతు అహజ్యాతో కలిశాడు. వారు ఓడలను ఎసోన్గెబెరులో నిర్మించారు.
37 అప్పుడు ఎలీయెజెరు అనే ప్రవక్త యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఎలీయెజెరు తండ్రి పేరు దోదావాహు. ఎలీయెజెరు మారేషా పట్టణానికి చెందినవాడు. అతడు ఈ రకంగా చెప్పాడు: “యెహోషాపాతూ, నీవు అహజ్యాతో కలిశావు. అందువల్ల యెహోవా నీ పనులను సర్వనాశనం చేస్తాడు.” అలానే అతని ఓడలు పగిలిపోయాయి. అందువల్ల యెహోషాపాతు, అహజ్యాలు తర్షీషుకు ఓడలను పంపలేకపోయారు.
1 యెహోషాపాతు చనిపోగా, అతనిని అతని పూర్వీకుల సరసన సమాధిఛేశారు. అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. యెహోషాపాతు స్థానంలో అతని కుమారుడు యెహోరాము కొత్త రాజయ్యాడు.
2 యెహోరాము సోదరులు అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, మరియు షెపట్య అనువారు. వీరంతా యెహోషాపాతు కుమారులు. యెహోషాపాతు యూదా రాజ్యానికిరాజు.
3 యెహోషాపాతు తన కుమారులకు వెండి బంగారు వస్తువులు, తదితర విలువైన కానులు యిచ్చాడు అతడు యూదాలో బలమైన కోటలు నిర్మించి యిచ్చాడు. కాని యెహోషాపాతు రాజ్యాన్ని యెహోరాముకు యిచ్చాడు. ఎందువల్లనంటే అతడు పెద్ద కుమారుడు.
4 యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని చేపట్టి తనను తాను పటిష్ట పర్చుకొని స్థిరపడ్డాడు. తరువాత కత్తని వినియోగించి తన సోదరులనందరినీ చంపి వేశాడు. అతడు మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను కూడా నరికివేశాడు.
5 యెహోరాము ఏల నారంభించే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు.
6 అతడు ఇశ్రాయేలు రాజులు నివసించిన రీతిలో జీవితం కొనసాగించాడు. అహాబు కుటుంబం మాదిరిగానే అతడు కూడ నివసించాడు. ఎందువల్ల నంటే అహాబు కుమార్తెనే యెహోరాము వివాహమాడాడు. యెహోరాము యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ చేశాడు.
7 కాని యెహోవా దావీదుతో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం ఆయన దావీదు కుటుంబాన్ని నాశనం చేయలేదు . దావీదు కొరకు, ఆయన సంతతివారి కొరకు యెహోవా శాశ్వతంగా ఒక జ్యోతిని వెలిగించుతానని మాట యిచ్చివున్నాడు .
8 యెహోరాము కాలంలోనే యూదా ఆధిపత్యం నుండి ఎదోము విడిపోయి, స్వతంత్ర రాజ్యమయ్యింది. ఎదోమీయులు వారి స్వంత రాజును ప్రకటించుకున్నారు.
9 అందువల్ల యెహోవారాము తన సైన్యాధిపతులతోను, రథాలతోను ఎదోము మీదికి వెళ్లాడు. ఎదోమీయుల సైన్యం యెహోరామును, అతని రథాధిపతులను చుట్టుముట్టింది. కాని యెహోరాము తీవ్రంగా యుద్ధం చేసి చీకటి పడ్డాక బయట పడ్డాడు.
10 అప్పటి నుండి ఈ నాటి వరకు ఎదోము రాజ్యం యూదాపై తిరుగబడుతూనే వుంది. లిబ్నా పట్టణవాసులు కూడా యెహోరాముకు వ్యతిరేకులైనారు. యెహోరాము యెహోవాను విడనాడినందుకు ఫలితంగా ఇదంతా జరిగింది. యెహోవా యెహోరాము పూర్వీకులు ఆరాధించిన దేవుడు.
11 యెహోరాము యూదా కొండలమీద, గుట్టలమీద క్షుద్ర దేవతల పూజలకై స్థలాలను నిర్మించాడు. దేవుడు ఆశించిన దానిని చేయకుండా యెరూషలేము ప్రజలకు యెహోరాము అడ్డుపడ్డాడు. అతడు యూదా ప్రజలను యెహోవాకు దూరం చేశాడు.
12 ప్రవక్తయైన ఏలీయా ద్వారా యెహోరాముకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం యిలా వుంది: “దేవుడైన యెహోవా తెలియజేయునదేమనగా: ఆయన మీ పూర్వీకుడైన దావీదు ఆరాధించిన దైవం. యెహోవా చెప్పుచున్నాడు: ‘యెహోరామూ, నీ తండ్రి యెహోషాపాతు నడిచిన మార్గాన్ని నీవు విడనాడినావు. యూదా రాజైన ఆసా నడిచిన మార్గాన్ని కూడ నీవు విడనాడినావు.
13 అంతేకాదు నీవు ఇశ్రాయేలు రాజులు నడచిన పెడమార్గాన్ని అనుసరించావు. దేవుడు ఆశించిన రీతిగా నడవకుండా నీవు యూదా, యెరూషలేము ప్రజలను ఆపావు. అదే నేరాన్ని అహాబు, అతని కుటుంబంవారు చేశారు. వారు దేవుని పట్ల విశ్వాస ఘాతకులైనారు. నీవు నీ సోదరులను హత్యచేశావు. నీకంటె నీ సోదరులు మంచివారు.
14 కావున త్వరలో యెహోవా నీ ప్రజలను కఠినంగా శిక్షిస్తాడు. యెహోవా నీ పిల్లలను భార్యలను శిక్షించి, నీ ఆస్తిని పాడుచేస్తాడు.
15 నీకు పేగుల్లో భయంకరమైన జబ్బు చేస్తుంది. రోజు రోజుకూ నీ జబ్బు ముదురుతుంది. ఆ భయంకరమైన వ్యాధివల్ల నీ ప్రేగులు బయటికి వచ్చేస్తాయి.”
16 యెహోవా ఫిలిష్తీయులను, ఇథియోపియునులకు (కూషీయులు) దగ్గరలో నివసిస్తున్న అరబీయులను యెహోరాము మీదికి పోయేలా ప్రేరేపించాడు.
17 ఆ ప్రజలు యూదా రాజ్యం మీదికి దండెత్తారు. వారు రాజగృహంలోని ధనాన్నంతా కొల్లగొట్టారు. వారు యెహోరాము కుమారులను, భార్యలను తీసుకొనిపోయారు. యెహోరాము చిన్న కుమారుడు మాత్రం వదిలిపెట్టబడ్డాడు. యెహోరాము చిన్న కుమారుని పేరు యెహోయాహాజు .
18 ఈ సంఘటనలు జరిగిన తరువాత యెహోవా యెహోరాముకు పేగుల్లో నయంకాని వ్యాధిని కలుగజేశాడు.
19 జబ్బు ముదిరి రెండు సంవత్సరాల తరువాత యెహోరాము పేగులు బయటికి వచ్చాయి. భరించలేని బాధతో అతడు చనిపోయాడు. తన తండ్రికి చేసినట్లు ప్రజలు యెహోరాముకు గౌరవసూచకంగా పెద్దమంట వేయలేదు.
20 యెహోరాము రాజయ్యే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ విచారించలేదు. యెహోరామును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట అతనిని సమాధి చేయలేదు.
1 యెహోరాము స్థానంలో యెరూషలేము ప్రజలు అహజ్యాను కొత్త రాజునుగా చేసారు. అహజ్యా యెహోరాము యొక్క చిన్న కుమారుడు. అరబీయులతో యెహోరాము మీదికి వచ్చిన ప్రజలు యెహోరాము కుమారులందరినీ చంపివేశారుగాని, చిన్నవానిని మాత్రం వదిలారు. అందువల్ల అహజ్యా యూదాలో పరిపాలించగలిగాడు.
2 అహజ్యా పరిపాలన ఆరంభించే నాటికి ఇరువది రెండేండ్లవాడు . యెరూషలేములో అహజ్యా ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. అతల్యా తండ్రి పేరు ఒమ్రీ.
3 అహబు కుటుంబం నివసించిన తీరునే అహజ్యా నివసించాడు. అతడలా నివసించటానికి కారణం అతని తల్లి అతనిని దుష్టకార్యాలకు ప్రేరేపించటమే.
4 యెహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం వారు సలహాదారులయ్యారు. వారు అహజ్యాకు తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని చావుకు దారితీశాయి.
5 అహాబు కుటుంబం అతని కిచ్చిన సలహనే అహజ్యా పాటించాడు. ఇశ్రాయేలు రాజైన యెరాముతో కలిసి అహజ్యా అరాము (సిరియా) రాజైన హజాయేలుపై యుద్ధానికి రామోత్గిలాదు పట్టణానికి వెళ్లాడు. యెహోరాము తండ్రి ఇశ్రాయేలు రాజైన అహాబు. కాని అరామీయులు (సిరియనులు) యుద్ధంలో యెహోరామును గాయపర్చారు.
6 యెహోరాము తన గాయాలను నయం చేసికోటానికి యెజ్రెయేలుకు తిరిగి వెళ్లాడు. అరాము రాజైన హజాయేలుతో రామోతు వద్ద పోరాడుతూండగా అతడు గాయపడ్డాడు. పిమ్మట యెహోరామును చూడటానికి అహజ్యా (యెహోయహాజు) యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు. అహజ్యా తండ్రి పేరు యూదా రాజైన యెహోరాము. యెహోరాము తండ్రి పేరు అహాబు. యెహోరాము గాయపడటంతో అతడు యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు.
7 యెహోరామును చూడటానికి అహజ్యా వెళ్లినప్పుడు దేవుడు అతనికి మరణం కలుగజేశాడు. అహజ్యా వెళ్లి యెహోరాముతో కలిసి యెహూను చూడటానికి వెళ్లాడు. యెహూ తండ్రి పేరు నింషీ. అహాబు వంశాన్ని నాశనం చేయటానికి దేవుడు యెహూను నియమించాడు.
8 అహాబు వంశాన్ని యెహూ నాశనం చేస్తూవున్నాడు. అప్పుడతడు యూదా పెద్దలను, అహజ్యా సేవలో వున్న అతని బంధువులను చూశాడు. యూదా పెద్దలను, అహజ్యా బంధువులను యెహూ చంపివేశాడు.
9 పిమ్మట అహజ్యా కొరకు యెహూ వెదికాడు. అతడు సమరయ (షోమ్రోను) పట్టణంలో దాగుకొనే ప్రయత్నం చేస్తూండగా యెహూ మనుష్యులు అతనిని పట్టుకున్నారు. వారు అహజ్యాను యెహూ వద్దకు తీసుకొని వచ్చారు. వారు అహజ్యాను చంపి, సమాధి చేశారు. “అహజ్యా యెహోషాపాతు వారసుడు. యెహోషాపాతు యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు” అని వారు అన్నారు. యూదా రాజ్యాన్ని సమైక్యంగా వుంచే శక్తి అహజ్యా కుటుంబానికి లేదు.
10 అహజ్యా తల్లి పేరు అతల్యా. తన కుమారుడు చంపబడ్డాడని తెలుసుకోగానే ఆమె యూదాలో రాజ వంశస్తుల నందరినీ చంపివేసింది.
11 కాని యెహోషెబతు అనే స్త్రీ అహజ్యా కుమారుడైన యోవాషును దాచివేసింది. యోవాషును, అతని దాదిని యెహోషెబతు లోపలి పడకగదిలో దాచింది. యెహోషెబతు రాజైన యెహోరాము కుమార్తె. ఆమె యెహోయాదా భర్యా. యెహోయాదా ఒక యాజకుడు. పైగా యెహోషెబతు అహజ్యాకు సోదరి. యెహోషెబతు దాచిన కారణంగా, యోవాషును అతల్యా చంపలేకపోయింది.
12 ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా పరిపాలన కొనసాగింది.
1 ఆరు సంవత్సరాల అనంతరం యెహోయాదా తనశక్తిని, ధైర్యాన్ని చూపించాడు. అతడు సైనికాధిపతులతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ అధిపతులు ఎవరంటే యెరోహాము కుమారుడు అజర్యా; యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలు; ఓబేదు కుమారుడైన అజర్యా; అదాయా కుమారుడైన మయశేయా; మరియు జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు.
2 వారు యూదా రాజ్యమంతా తిరిగి, యూదా పట్టణాలలో వున్న లేవీయులను కూడ గట్టారు. వారు ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలనుకూడ కలుపుకున్నారు. పిమ్మట వారు యెరూషలేముకు వెళ్లారు.
3 వీరంతా ఆలయంలో సమావేశమై రాజుతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ ప్రజలనుద్దేశించి యెహోయాదా యిలా అన్నాడు: “రాజకుమారుడు పరిపాలిస్తాడు. దావీదు సంతతి వారి విషయంలో యెహోవా ఇదే వాగ్దానం చేశాడు.
4 ఇప్పుడు మీరు చేయవలసినదేమనగా: విశ్రాంతి దినాన విధులకు వెళ్లే యాజకులు, లేవీయులలో మూడవ వంతు వారు ద్వారాల వద్ద కాపలా వుండాలి.
5 మీలో ఒక వంతు రాజు ఇంటి వద్ద వుండాలి. ఇంకొక వంతు ప్రధాన ద్వారం (పునాది ద్వారం) వద్ద నిఘావేయాలి. మిగిలిన వారంతా ఆలయ ఆవరణంలలో వుండాలి.
6 యెహోవా ఆలయంలో ఎవ్వరినీ ప్రవేశించనీయకండి. యాజకుడు, లేవీయులు పరిశుద్ధులు గనుక వారు మాత్రమే సేవ చేయటానికి లోనికి అనుమతిమంపబడాలి. వీరు మినహా, మిగిలిన వారంతా యెహోవా నిర్దేశించిన తమ తమ పనులను యధావిధిగా ఆచరించాలి.
7 లేవీయులు రాజు వద్ద నిలవాలి. ప్రతి ఒక్కడూ తన కత్తిని తప్పక ధరించి వుండాలి. ఎవ్వడేగాని ఆలయంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే వానిని చంపి వేయండి. రాజు ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడ అతనితో వెళ్లాలి.”
8 యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినదంతా లేవీయులు, యూదా ప్రజలు అంగీకరించారు. యాజకుల వర్గాలలో ఎవ్వరినీ యాజకుడైన యెహోయాదా ఉపేక్షించి ఊరు కోలేదు. విశ్రాంతి దినాన బయటకు వెళ్లిన వారితో కలిసి ప్రతి సైన్యాధిపతి, అతని మనుష్యులు లోనికి వచ్చారు.
9 యాజకుడైన యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, చిన్న పెద్ద డాళ్లను అధికారులకు ఇచ్చాడు. ఆ ఆయుధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి.
10 పిమ్మట యెహోయాదా ఎవరెక్కడ నిలబడాలో ఆ మనుష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కడూ తన ఆయుధాన్ని ధరించివున్నాడు. వారంతా ఆలయానికి కుడినుండి ఎడమ ప్రక్కకు బారులుదీరి నిలబడ్డారు. వారు బలిపీఠానికి, ఆలయానికి రాజుకు దగ్గరగా నిలబడ్డారు.
11 వారు రాజకుమారుణ్ణి బయటకు తీసికొని వచ్చి, వాని తలపై కిరీటం పెట్టారు. ఒక ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని అతనికిచ్చారు . తరువాత వారు యోవాషును రాజుగా ప్రకటించారు. యెహోయాదా, అతని కుమారులు కలిసి యోవాషును అభిషిక్తుని చేశారు. వారు “రాజు చిరంజీవియగు గాక!” అని అన్నారు.
12 ప్రజలు ఆలయానికి పరుగెత్తే శబ్దం, రాజును ప్రశంసించే ధ్వనులు అతల్యా విన్నది. ఆమె ఆలయంలో వున్న ప్రజల వద్దకు వచ్చింది.
13 ఆమె రాజును పరికించి చూపింది. ముందు ద్వారం వద్ద రాజస్తంభం దగ్గర రాజు నిలబడి ఉన్నాడు. అధికారులు, బూరలు వూదే వారు రాజుదగ్గర వున్నారు. దేశప్రజలు చాలా సంతోషంగా వున్నారు. వారు బూరలు వూదు తూవున్నారు. సంగీత వాద్య విశేషాలపై గాయకులు పాడుతున్నారు. ప్రజలందరి చేత దేవునికి స్తుతిగీతాలు గాయకులు తమతోపాటు పాడించారు. ఇదంతా చూచి కలత చెందిన అతల్యా తన బట్టలు చింపుకొని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
14 యాజకుడైన యెహోయాదా సైన్యాధిపతులను బయటకు రప్పించాడు. “అతల్యాను బయటవున్న సైన్యం వద్దకు తీసుకొని వెళ్లండి. ఆమెను ఎవరైనా అనుసరిస్తే వారిని మీ కత్తులతో నరికి వేయండి” అని వారికి చెప్పాడు. “కాని, అతల్యాను ఆలయంలో మాత్రం చంపవద్దు” అని యాజకుడు సైనికులను హెచ్చరించాడు.
15 తర్వాత అతల్యా రాజ భవనపు అశ్వద్వారం వద్దకు వచ్చినప్పుడు వారామెను పట్టుకున్నారు. ఆమెను ఆ భవనం వద్దనే వారు చంపివేశారు.
16 అప్పుడు యెహోయాదా ప్రజలతోను, రాజుతోను ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారంతా యెహోవా భక్తులై ఆయనను అనుసరించటానికి ఒప్పుకున్నారు.
17 ఆ జనమంతా బయలు విగ్రహం ఆలయంలోకి వెళ్లి దానిని నిలువునా పగులగొట్టారు. బయలు ఆలయంలో వున్న బలిపీఠాలను, ఇతర విగ్రహాలను కూడ వారు నాశనం చేశారు. బయలు పీఠాల ముగింటనే బయలు దేవత యాజకుడైన మత్తానును చంపివేశారు.
18 పిమ్మట యెహోయాదా యెహోవా ఆలయ బాధ్యతలు స్వీకరించే యాజకులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు లేవీయులు. ఆలయ యాజమాన్యం పనిని దావీదు వారికి అప్పజెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం ఆ యాజకులు యెహోవాకు దహనబలులు సమర్పిస్తారు. దావీదు ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆనందోత్సాహాలతో బలులు అర్పించారు.
19 ఏరకంగానైనా సరే అపరిశుభ్రంగా ఎవ్వరూ ఆలయంలో ప్రవేశించకుండా యెహోయాదా ఆలయ ద్వారాల వద్ద కాపలా దారులను నియమించాడు.
20 యెహోయాదా సైన్యాధిపతులను, ప్రజానాయకులను, ప్రాంతీయ పాలకులను, ఇతర ప్రజలందరినీ తనతో తీసికొని వెళ్లాడు. ఆలయం నుండి రాజును కూడ తనతో తీసుకొని పై ద్వారం గుండా రాజభవనానికి వెళ్లాడు. అక్కడ వారు రాజును సింహాససనంపై కూర్చుండబెట్టారు.
21 యూదా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. అతల్యా కత్తివేటుకు గురియై చనిపోవటంతో యెరూషలేము నగరంలో శాంతి నెలకొన్నది.
1 యోవాషు రాజయ్యేనాటికి ఏడేండ్లవాడు. అతడు యెరూషలేములో నలబై సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు జిబ్యా. జిబ్యా బెయేర్షెబా పట్టణ కాపురస్థురాలు.
2 యాజకుడైన యెహోయాదా జీవించియున్నంత కాలం యోవాషు యెహోవా సన్నిధిని అన్నీ మంచి పనులు చేశాడు.
3 యోవాషుకు ఇద్దరు భార్యలను యెహోయాదా ఎంపిక చేశాడు. యోవాషుకు కుమారులు, కుమార్తెలు కలిగారు.
4 కొంతకాలం తరువాత ఆలయాన్ని పునరుద్ధరిం చాలని యోవాషు నిర్ణయించాడు.
5 యాజకులను, లేవీయులను, యోవాషు సమావేశపర్చి, “మీరు యూదా పట్టణాలకు వెళ్లి ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలిచ్చే సొమ్మును జమచేయండి. ఆ ధనంతో మీ దేవుని ఆలయాన్ని పునరుద్ధరించండి. ఈ పని త్వరగా చేయండి” అని చెప్పాడు. కాని, లేవీయులు త్వరపడలేదు.
6 ప్రముఖ యాజకుడైన యెహోయాదాను రాజైన యోవాషు పిలిపించి, “యెహోయాదా, యూదా నుండి, యెరూషలేము నుండి లేవీయులు పన్ను వసూలు చేసి తీసుకొని వచ్చేలా నీవు ఎందుకు ఏర్పాటు చేయలేదు? యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఆ పన్ను వసూళ్లను పవిత్ర గుడారానికై వెచ్చించే వారుగదా!” అని అన్నాడు.
7 గతంలో అతల్యా కుమారులు ఆలయంలో జొరబడ్డారు. యెహోవా ఆలయంలో పవిత్ర వస్తువులన్నిటినీ వారు బయలు దేవుళ్ల ఆరాధనకు వినియోగించారు. అతల్యా ఒక దుష్ట స్త్రీ.
8 రాజైన యోవాషు ఒక పెట్టె చేయించి దానిని యెహోవా ఆలయ ద్వారం బయట పెట్టించాడు.
9 పిమ్మట లేవీయులు యూదాలోను, యెరూషలేములోను ఒక ప్రకటన చేశారు. ప్రజలందరినీ పన్ను డబ్బు యెహోవా కొరకు తెమ్మని చెప్పారు. వారు ఎడారిలో వున్నప్పుడు యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను చెల్లించమని చెప్పినదే ఈ పన్నుధనం.
10 పెద్దలు, ప్రజలు అంతా చాలా సంతోషపడ్డారు. వారు తమ వంతు ధనాన్ని తెచ్చి ఆ పెట్టెలో వుంచారు. ఆ పెట్టె నిండేవరకు ప్రజలు డబ్బు వేస్తూవచ్చారు.
11 తరువాత లేవీయులు ఆ పెట్టెను రాజాధికారుల యొద్దకు తీసుకొని వెళ్లారు. పెట్టె డబ్బుతో నిండివున్నట్లు వారు చూశారు. రాజు యొక్క కార్యదర్శి, ప్రధాన యాజకుని అధికారి వచ్చి పెట్టెలోని డబ్బును బయటికి తీశారు. మళ్లీ ఆ పెట్టెను యధాస్థానంలో వుంచారు. వారలా అనేక పర్యాయాలు చేసి ధనాన్ని విశేషంగా సేకరించారు.
12 తరువాత రాజైన యోవాషు, యెహోయాదా ఆ ధనాన్ని ఆలయ పునరుద్ధరణకు పనిచేస్తున్న పనివారికి చెల్లించారు. ఆలయపు పనిలో నిమగ్నమైన వారు నిపుణులైన కొయ్యచెక్కడపు (నగిషీ) పనివారిని, వడ్రంగులను ఆలయ పునరుద్ధరణకై కిరాయికి నియమించారు. ఆలయ పునరుద్ధరణ పనికి ఇనుము, కంచు పనులలో మంచి అనుభవం వున్నవారిని కూడా వారు కిరాయికి నియమించారు.
13 పనిమీద తనిఖీకై నియమింపబడిన వారు చాలా నమ్మకస్థులు. ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దాని పూర్వరూపం ఏమాత్రం మార్చకుండా దానిని పునరుద్ధరించి, ఇంకా బలంగా తీర్చిదిద్దారు.
14 పని పూర్తయ్యాక, మిగిలిన డబ్బును రాజైన యోవాషుకు, యెహోయాదాకు వారు తిరిగి యిచ్చి వేశారు. వారాధనాన్ని ఇంకా ఆలయానికి కావలసిన వస్తుసామగ్రికి, పరికరాలకు వినియోగించారు. ఈ వస్తు సామగ్రిని ఆలయ ఆరాధనలోను, దహన బలులు సమర్పించటంలో వినియోగించారు. వెండి బంగారాలతో వారింకా గిన్నెలను, ఇతర పరికరాలను చేయించారు. యాజకులు యెహోవా ఆలయంలో యెహోయాదా బతికివున్నంత కాలం దహనబలులు అర్పించారు.
15 యెహోయాదా వృద్ధుడయ్యాడు. అతడు దీర్ఘకాలం జీవించి పిమ్మట చనిపోయాడు. చనిపోయేనాటికి యెహోయాదా నూటముప్పై యేండ్ల వయస్సువాడు.
16 దావీదు నగరంలో రాజులను వుంచేచోట ప్రజలు యెహోయాదాను సమాధిచేశారు. ఇశ్రాయేలులో యెహోవాకు, ఆయన ఆలయానికి తన జీవిత కాలంలో ఎనలేని సేవ చేసినందువలన ప్రజల తనిని అక్కడ సమాధి చేశారు.
17 యెహోయాదా చనిపోయిన పిమ్మట, యూదా పెద్దలు వచ్చి రాజైన యోవాషుకు తలవంచి నమస్కరించారు. ఆ పెద్దల విన్నపాన్ని రాజు విన్నాడు.
18 రాజు, పెద్దలు కూడ యెహోవా ఆలయాన్ని తిరస్కరించారు. వారి పూర్వీకులు యెహోవా దేవుని ఆరాధించారు. ఇప్పుడు వీరు అషేరా దేవతా స్తంభాలను, ఇతర విగ్రహాలను పూజించటం మొదలు పెట్టారు. రాజు, ప్రజానాయకులు దుష్టనడక నడచిన కారణంగా దేవుడు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించాడు.
19 వారిని మళ్లీ సన్మార్గాన్ని అనుసరింప జేయటానికి యెహోవా వారివద్దకు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ప్రజలను హెచ్చరించాను. అయినా ప్రజలు వారి హెచ్చిరికను పెడచెవిని పెట్టారు.
20 దేవుని ఆత్మ జెకర్యా మీదికి వచ్చింది. జెకర్యా తండ్రి యాజకుడైన యెహోయాదా. జెకర్యా ప్రజలముందు నిలబడి యిలా అన్నాడు: “దేవుడు యిలా చెప్తున్నాడు. ‘ప్రజాలారా, యెహోవా ఆజ్ఞాలను మీరు ఎందుకు మీరుతున్నారు.? మీరు విజయవంతులు కాలేరు. మీరు యెహోవాని వదిలిపెట్టారు. అందువల్ల దేవుడు కూడ మిమ్మల్ని వదిలి వేస్తున్నాడు!”‘
21 కాని ప్రజలు జెకర్యాకు వ్యతిరేకంగా కుట్రపన్నారు. జెకర్యాను చంపమని రాజు ప్రజలకు ఆజ్ఞ ఇవ్వటంతో, వారతనిని రాళ్లతో కొట్టి చంపారు. ప్రజలీపని ఆలయ ఆవరణలో చేశారు.
22 రాజైన యోవాషు యెహోయాదా తన పట్ల చూపిన కనికరాన్ని గుర్తు పెట్టుకోలేదు. యెహోయాదా జెకర్యా తండ్రి. కాని యెహోయాదా కుమరుడైన జెకర్యాను యోవాషు చంపివేశాడు. తను చనిపోయేముందు జెకర్యా, “నీ వేమీ చేస్తున్నావో యెహోవా చూచి, నిన్ను శిక్షించుగాక!” అని అన్నాడు.
23 సంవత్సరాంతంలో అరాము (సిరియా) సైన్యం యోవాషు మీదికి వచ్చింది. వారు యూదా, యెరూషలేములపై దండెత్తి ప్రజానాయకులందరినీ చంపివేశారు. వారు విలువైన వస్తువులన్నీ దోచుకుని వాటిని దమస్కు (డెమాస్కస్) రాజుకు పంపించారు. యోవాషు దుర్మార్గత
24 అరాము సైన్యం ఒక చిన్న దండుగా వచ్చినప్పటికీ, యూదాకు చెందిన ఒక మహా సైన్యాన్ని ఓడించగలిగేలా యెహోవా వారికి తోడ్పడ్డాడు. వారి పూర్వీకులు ఆరాధించిన దైవాన్ని యూదా ప్రజలు వదిలి పెట్టిన కారణంగా యెహోవా ఈ పని చేశాడు. అందువల్లనే యోవాషు శిక్షింపబడ్డాడు.
25 అరామీయులు (సిరియనులు) యోవాషును వదిలి వెళ్లేటప్పటికి అతడు తీవ్రంగా గాయపడ్డాడు. యోవాషు స్వంత సేవకులే అతనిపై కుట్రపన్నారు. యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను యెవాషు చంపిన కారణంగా వారు అలా ప్రవర్తించారు. యోవాషును అతని పక్క మీదనే సేవకులు హత్యచేశారు. చనిపోయిన యోవాషును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారు. కాని రాజులను వుంచే చోట మాత్రం అతనిని వారు సమాధి చేయలేదు.
26 జాబాదు మరియు యెహోజాబాదు అనేవారు. యోవాషు మీద కుట్ర పన్నిన సేవకులు. జాబాదు తల్లి పేరు షిమాతు అమ్మోనీయురాలు. యెహోజాబాదు తల్లిపేరు షిమ్రీతు. షిమ్రీతు మోయాబు స్త్రీ.
27 యోవాషు కుమారుల గురించిన వృత్తాంతాలు, అతనిని గురించిన గొప్ప ప్రవచనాలు అతడు ఆలయాన్ని పునరుద్ధరించిన విధము మొదలైన విషయాలన్నీ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయ బడ్డాయి. అతని తరువాత అమజ్యా కొత్త రాజయ్యాడు. అమజ్యా యోవాషు కుమారుడు.
1 రాజు అయ్యేనాటికి అమజ్యా ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేము నుండి ఇరువై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. యెహోయద్దాను యెరూషలేముకు చెందిన స్త్రీ.
2 యెహోవా అతని నుండి ఆశించిన పనులన్నీ అమజ్యా నిర్వర్తించాడు. కాని అతడు ఆ పనులను తన పూర్ణ హృదయంతో చేయలేదు.
3 అమజ్యా రాజుగా బలపడ్డాడు. తరువాత రాజైన తన తండ్రిని చంపిన అధికారులను అతడు చంపివేశాడు.
4 కాని అమజ్యా ఆ అధికారుల పిల్లలను మాత్రం చంపలేదు. ఎందువల్లనంటే, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన నియమ నిబంధనలను అతడు పాటించాడు. యెహోవా యిలా ఆజ్ఞాపించాడు: “తమ పిల్లలు చేసిన నేరానికి వారి తండ్రులు చనిపోరాదు. తమ తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు చనిపోరాదు. ప్రతి వ్యక్తి తన పాపాలకు ఫలితంగా తానే చనిపోవాలి .”
5 యూదా ప్రజలందరినీ అమజ్యా సమావేశ పర్చాడు. వారందరినీ వారి వారి కుటుంబాల వారీగా విడగొట్టి, సహస్రాధిపతులను, శతాధిపతులను వారిపై నియమించాడు. ఈ అధికారులు యూదా, బెన్యామీనుకు చెందిన సైనికులపై నియమింపబడ్డారు. సైనికులుగా ఎన్నుకోబడిన వారంతా ఇరువది ఏండ్ల యువకులు, అంతకు పైబడినవారు. ఈటెలు, డాళ్లు పట్టి యుద్ధానికి సిద్ధంగా వున్న మూడు లక్షల మంది నిపుణులైన సైనికులున్నారు.
6 ఇశ్రాయేలు నుండి అమజ్యా ఒక లక్ష మంది సైనికులను కిరాయికి నియమించాడు. కిరాయి కింద వారికి రెండు వందల మణుగుల వెండిని అతడు చెల్లించాడు.
7 కాని ఒక దైవజ్ఞుడు (ప్రవక్త) అమజ్యా వద్దకు వచ్చాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “రాజా ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకొని వెళ్లవద్దు. యెహోవా ఇశ్రాయేలు పక్షానలేడు. యెహోవా ఎఫ్రాయిము ప్రజలతో లేడు.
8 “బహుశా నీవు యుద్ధానికి మంచి కట్టుదిట్టం చేసుకొని సిద్ధంగా వుండవచ్చు. కాని దేవుడు నీవు గెలిచేలా చేయవచ్చు, లేదా ఓడిపోయేలా చేయవచ్చు.”
9 అమజ్యా దైవజ్ఞునితో, “అయితే నేను ఇశ్రాయేలు సైన్యానికి ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు సంగతి ఏమిటి?” అని అన్నాడు. దానికి దైవజ్ఞుడు, “ప్రభువైన యెహోవా వద్ద చాలా వుంది. ఆయన నీకు దానికంటె చాలా ఎక్కువ యివ్వగలడు!” అని చెప్పాడు.
10 అందువల్ల అమజ్యా ఇశ్రాయేలు సైన్యాన్ని ఎఫ్రాయిముకు తిప్పి పంపివేశాడు. ఈ సైనికులకు రాజు మీద, యూదా ప్రజలమీద చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపంతో వారు ఇండ్లకు తిరిగి వెళ్లారు.
11 పిమ్మట అమాజ్యా మంచి ధైర్యం తెచ్చుకొని తన సైన్యాన్ని ఎదోము దేశంలో ఉన్న ఉప్పు లోయకు నడిపించాడు. ఆ ప్రదేశంలో శేయీరు (ఎదోము) కు చెందిన పదివేల మందిని అమజ్యా సైన్యం చంపివేసింది.
12 యూదా సైన్యం శేయీరుకు చెందిన పదివేల మందిని బందీలుగా పట్టుకున్నది. ఆ బందీలను శేయీరు నుండి ఒక కొండ శిఖరం మీదికి వారు తీసుకొని వెళ్లారు. అప్పటికి బందీలంతా బతికే వున్నారు. వారందరినీ యూదా సైన్యం కొండ శిఖరం నుండి తోసివేయగా వారి శరీరాలు కింద రాళ్ల పైబడి ముక్కలు ముక్కలై పోయాయి.
13 కాని అదే సమయంలో ఇశ్రాయేలు సైన్యం యూదాలో కొన్ని పట్టణాలపై దాడి చేస్తూ వుంది. బేత్‌హోరోను నుండి సమరయ (షోమ్రోను) వరకు వున్న పట్టణాలపై వారు దాడి జరిపారు. వారు కూడ మూడ వేల మందిని చంపి, చాలా విలువైన వస్తువులను కొల్లగొట్టారు. అమజ్యా వారిని తన సైన్యంతో కలిసి యుద్ధానికి రానివ్వక పోవటంతో ఆ సైనికులు చాలా కోపగించి వున్నారు.
14 ఎదోమీయులను (శేయీరు వారిని) ఓడించిన పిమ్మట అమజ్యా ఇంటికి తిరిగి వచ్చాడు. శేయీరు ప్రజలు పూజించే విగ్రహాలన్నిటినీ అతడు తీసుకొని వచ్చాడు. అమజ్యా ఆ విగ్రహాలనే పూజించటం మొదలు పెట్టాడు. అతడా విగ్రహాలకు సాష్టాంగపడి, వాటికి దూపం వేయసాగాడు.
15 అమజ్యా పట్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుళ్లను నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్లు వారి ప్రజలనే నీనుండి కాపాడలేక పోయారు!”
16 ప్రవక్త చెప్పటం ముగించాక, అమజ్యా ప్రవక్తతో యిలా అన్నాడు: “మేము నిన్ను రాజుకు సలహాదారుగా ఎన్నడూ నియమించలేదే! నీవు మాట్లడవద్దు! నీవు నోరు మూయకపోతే నీవు చంపబడతావు!” ప్రవక్త మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్లీ యిలా అన్నాడు: “దేవుడు నిన్ను నాశనం చేయటానికే నిశ్చయించాడు. నీవు అటువంటి నీచకార్యాలు చేయటంతో పాటు, నా సలహా కూడ పెడచెవిని పెట్టావు.”
17 యూదా రాజైన అమజ్యా తన సలహాదారులతో సంప్రదించాడు. తరువాత యెహోయాషుకు ఒక వర్తమానం పంపాడు. యెహోయాషు’ “మనం ఒకరితో ఒకరు ముఖాముఖి పోరాడదాము” అని అమజ్యా కబురు పంపాడు. యెహోయాషు తండ్రిపేరు యెహోయాహాజు. యెహోయాహాజు తండ్రి పేరు యెహూ. యెహూ ఇశ్రాయేలు రాజు.
18 పిమ్మట యెహోయాషు తన సమాధానాన్ని అమజ్యాకు పంపాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజు. అమజ్యా యూదా రాజు. యెహోయాషు ఈ కథ చెప్పి పంపాడు: “లెబనోనుకు చెందిన ఒక చిన్న ముండ్ల పొద లెబానోనులోని ఒక పెద్ద దేవదారు వృక్షానికి ఒక వర్తమానం పంపింది. ఆ చిన్న ముండ్ల పోద’ ‘నా కుమారుణ్ణి నీ కుమార్తెను వివాహం చేసుకోనియ్యి,’ అని అన్నది. కాని ఈలోపల ఒక అడవి జంతువు వచ్చి ఆ చిన్న ముండ్ల పొదను తొక్కి నాశనం చేసేసింది.
19 ‘నేను ఎదోమును ఓడించాను’ అని నీవు గర్వపడుతున్నావు. గొప్పలు చెప్పుకొంటున్నావు. ఇక నీవు ఇంటి వద్దనే వుండు. కోరి కష్టాలు తెచ్చుకోకు.నీవు నాతో యుద్ధం చేస్తే నీవు, యూదా నాశనమవ్వటం ఖాయం.”
20 కాని ఆమజ్యా ఈ సలహా వినటానికి నిరాకరించాడు. ఇదంతా దేవుని సంకల్పంతోనే జరుగుతూవుంది. ఎదోమీయులు కొలిచిన దేవుళ్లను యూదా ప్రజలు ఆరాధించిన నేరానికి, ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయేలా యెహోవా పథకం సిద్ధం చేశాడు.
21 కావున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాను బేత్షెమెషు పట్టణం వద్ద ముఖాముఖి ఎదుర్కొన్నాడు. బేత్షెమెషు పట్టణం యూదాలో వుంది.
22 ఇశ్రాయేలు యూదాను ఓడించింది. యూదా సైన్యంలో ప్రతివాడూ తన ఇంటికి పారిపోయాడు.
23 అమజ్యాను బేత్షేమెషు పట్టణం వద్ద యెహోయాషు పట్టుకుని, యెరూషలేముకు తీసుకొని పోయాడు. అమజ్యా తండ్రి పేరు యోవాషు. యోవాషు తండ్రి పేరు యెహోయాహాజు. యెహోయాషు ఆరువందల అడుగుల (నాలుగువందల మూరలు) మేరకు యెరూషలేము గోడను ఎఫ్రాయిము ద్వారం నుండి మూల ద్వారం వరకు పడగొట్టాడు.
24 పిమ్మట యెహోయాషు వెండిని, బంగారాన్ని, ఇతర పరికరాలన్నిటినీ ఆలయం నుండి పట్టుకుపోయాడు. ఆలయంలో వస్తువుల సంరక్షణ బాధ్యత ఓబేదె దోముది. యెహోయాషు రాజగృహం నుండి విలువైన వస్తువులను కూడ తీసుకొని పోయాడు. కొంతమంది మనుష్యులను బందీలుగా పట్టుకున్నాడు. పిమ్మట అతడు సమరయకు వెళ్లిపోయాడు.
25 యెహోయాషు చనిపోయిన తరువాత అమజ్యా పదిహేను సంవత్సరాలు బతికాడు. అమజ్యా తండ్రిపేరు యూదా రాజైన యోవాషు.
26 మొదటి నుండి చివరి వరకు అమజ్యా చేసిన ఇతర కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి.
27 అమజ్యా యెహోవాకు విధేయుడుగా వుండటం మానివేసినప్పటి నుండి, యెరూషలేము ప్రజలు అమజ్యాకు వ్యతిరేకంగా కుట్రచేశారు. అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని ప్రజలు కొందరు మనుష్యులను లాకీషు పట్టణానికి పంపగా వారు అమజ్యాను అక్కడ చంపివేశారు.
28 వారతని శావాన్ని గుర్రాలమీద వేసుకొని తెచ్చి యూదా నగరంలో అతని పితరుల దగ్గర సమాధి చేశారు.
1 తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు.
2 ఎలతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు.
3 తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేముకు చెందిన స్త్రీ.
4 యెహోవా అతని నుండి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలు కొనసాగించాడు. తన తండ్రి అమజ్యావలెనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు.
5 జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.
6 ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు.
7 ఫిలిష్తీయులతోను, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతో, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన యుద్ధాలలో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు.
8 అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దులవరుకు ఉజ్జియా పేరు ప్రతిష్ఠలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడగుటచే ఉజ్జియా ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు.
9 యెరూషలేములో మూలద్వారాం వద్ద, లోయ ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపర్చాడు.
10 ఎడారిలో సహితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావుల కూడా తవ్వించాడు. కొండల (మన్యం) ప్రాంతంలోను, మైదాన ప్రాంతాలలోను అతనికి పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువైన కొండలయందు, మైదానములందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్షతోటల పెంపకంలో శ్రద్ధవహించే రైతులు కూడ అతనికి వున్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు.
11 ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సైన్యం ఉంది. కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా అనేవారు సైన్యాన్ని, వివిధ భాగాలుగా విభజించారు. వారి పైఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా సైనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజించారు. హనన్యా రాజాధికారులలో ఒకడు.
12 సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు.
13 వంశాలవారీ ఎంపికైన సైన్యాధికారుల కింద మొత్తం మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో కాకలు తీరిన సైనికులున్నారు. ఆ సైనికులు శత్రువుల నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు.
14 ఉజ్జియా సైన్యానికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు కవచాలు విల్లంబలు, ఒడిసెల రాళ్లు సరఫరా చేశాడు.
15 మేధావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారుచేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసిరి వేయటం మొదలైన పనులు చేసేవి. ఉజ్జియా చాలా ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం అందటంతో అతను చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.
16 ఉజ్జియా గొప్పవాడు కావటంతో పాటు, గర్విష్ఠి కూడా అయ్యాడు. అతని గర్వమే అతని వినాశనానికి కారణమయ్యింది. అతని దేవుడైన యెహోవాకు అతడు విశ్వాసపాత్రుడు కాలేదు. బలిపీఠం మీద ధూపం వేయటానికి అతడు ఆలయంలోకి వెళ్లాడు.
17 యాజకుడైన అజర్యా, మరియు ధైర్యంగల యెహోవా సేవకులు ఎనుబది మంది ఉజ్జియాను వెంబడించి ఆలయంలోకి వెళ్లారు.
18 ఉజ్జియా తప్పు చేస్తున్నట్లు వారతనిని మందలించారు. వారు యిలా అన్నారు: “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటం నీ పనికాదు. ఈ పని చేయటం నీకు మంచిది కాదు. యాజకులైన అహరోను సంతానంవారు మాత్రమే యెహోవాకు ధూపం వేయాలి. ధూపం వేసే పవిత్ర కార్యానికి ఈ యాజకులు శిక్షణ పొందారు. ఈ అతిపవిత్ర స్థలం నుండి నీవు బయటకు పొమ్ము. నీవు విశ్వాసంగా లేవు. ప్రభువైన యెహోవా నీ ఈ ప్రవర్తనకు నిన్ను గౌరవించడు!”
19 కాని ఉజ్జియాకు కోపం వచ్చింది. అతని చేతిలో ధూపకలశం ఉంది. యాజకులపట్ల ఉజ్జియా కోపగించుకుంటూ ఉండగనే అతని నుదటిపై కుష్ఠురోగం పుట్టింది. ఆలయంలో ధూపపీఠం పక్కనేవున్న యాజకుల ముందే ఇది జరిగింది.
20 ప్రధాన యాజకుడైన అజర్యా, మరియు ఇతర యాజకులు ఉజ్జియా వైపు చూశారు. అతని నుదటి మీద కుష్ఠు రోగాన్ని వారు చూడగలిగారు. యాజకులు వెంటనే ఉజ్జియాను ఆలయం నుండి బయటికి తరిమేశారు. యెహోవా అతనిని శిక్షకు గురిచేసిన కారణంగా ఉజ్జియా తనకుతానే బయటకు వచ్చాడు.
21 రాజైన ఉజ్జియా కుష్ఠురోగి అయ్యాడు. అతడు యెహోవా ఆలయంలో మళ్లీ ప్రవేశించలేక పోయాడు. ఉజ్జియా కుమారుడు యోతాము రాజగృహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజు తరపున ప్రజాపాలకుడయ్యాడు.
22 మొదటి నుండి చివరి వరకు ఉజ్జియా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. యెషయా తండ్రిపేరు ఆమోజు.
23 ఉజ్జియా చనిపోయినప్పుడు అతనిని అతని పూర్వీకుల దగ్గరగా సమాధిచేశారు. ఉజ్జియా కుష్ఠురోగి కావటంవల్ల రాజుల శ్మశాన వాటికకు దగ్గరలోవున్న పొలంలో అతడు సమాధి చేయబడ్డాడు. పిమ్మట ఉజ్జియా స్థానంలో అతని కుమారుడు యోతాము కొత్త రాజు అయ్యాడు.
1 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు పదహారు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెరూషా. యెరూషా సాదోకు కుమార్తె.
2 యెహోవా కోరిన విధంగా యోతాము కార్యకలాపాలు నిర్వర్తించాడు. తన తండ్రి ఉజ్జియా మాదిరిగానే అతడు దేవునికి విధేయుడై వున్నాడు. కాని తన తండ్రి చేసిన విధంగా ధూపం వేయటానికి యోతాము ఆలయం ప్రవేశించలేదు. అయినా ప్రజలు మాత్రం తమ దుష్ట నడతను మానలేదు.
3 ఆలయపు పైద్వారాన్ని యోతాము తిరిగి నిర్మించాడు. ఓపెలు అనే స్థలంలో గోడమీద ఎక్కువ నిర్మాణాన్ని చేపట్టాడు.
4 యూదాలో కొండల ప్రాంతంలో యోతాము పట్టణాలను నిర్మించాడు. యోతాము అరణ్యాలలో కోటలను, బురుజులను కట్టించాడు.
5 యోతాము అమ్మోనీయుల రాజుతోను, అతని సైన్యంతోను పోరాడి వారిని ఓడించాడు. కావున మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం అమ్మోనీయులు రెండు వందల మణుగుల వెండి, పదివేల ఏదుముల గోధుమలు, పదివేల ఏదుముల యవలు కప్పంగా చెల్లించారు.
6 తన దేవుడైన యెహోవా పట్ల సత్యవర్తనుడై విధేయుడై నందున యోతాము చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.
7 యోతాము చేసిన ఇతర కార్యాలు, అతడు నిర్వహించిన యుద్ధాలగురించి ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
8 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.
9 తరువాత యోతాము చనిపోగా, అతనిని తన పూర్వీకులతో సమాధి చేశారు. ప్రజల తనిని దావీదు నగరంలో సమాధి చేశారు. యోతాము స్థానంలో ఆహాజు రాజయ్యాడు. యోతాము కుమారుడే ఆహాజు.
1 ఆహాజు రాజయ్యేనాటికి ఇరవై యేండ్లవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పాలించాడు. తన పూర్వీకుడైన దావీదువలె ఆహాజు మంచి మార్గంలో నడవలేదు. యోహోవా ఆశించిన విధంగా సత్కార్యాలు చేయలేదు.
2 ఇశ్రాయేలు రాజులు అనుసరించిన చెడుమార్గాన్నే ఆహాజు కూడ అనుసరించాడు. బయలు దేవతలను ఆరాధించటానికి అతడు విగ్రహాలను పోతపోయించాడు.
3 బెన్‌హీన్నోము లోయలో ఆహాజు ధూపం వేశాడు. అతడు తన స్వంత కుమారులనే అగ్నిలో కాల్చి దేవతలకు బలియిచ్చాడు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒడిగట్టే భయంకర పాపాలకే అతడు కూడా పాల్పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు యెహోవా బయటకు తరిమివేసిన నీచవ్యక్తులే ఈ ప్రజలు.
4 గుట్టలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కిందా ఆహాజు బలులు అర్పించి, ధూపం వేశాడు.
5 [This verse may not be a part of this translation]
6 ఆహాజు పాపం చేయటంతో అతని దేవుడైన యెహోవా అతనిని అరాము (సిరియా) రాజు చేతిలో ఓడిపోయేలా చేశాడు. అరాము రాజు, అతని సైన్యం ఆహాజును ఓడించి, అనేకమంది యూదా వారిని బందీలుగా పట్టుకున్నారు. అరాము రాజు ఆ బందీలను దమస్కు (డెమాస్కస్) నగరానికి పట్టుకుపోయాడు. ఇశ్రాయేలు రాజైన పెకహు కూడా ఆహాజును ఓడించేలా యెహోవా చేశాడు. పెకహు తండ్రి పేరు రెమల్యా. పెకహు అతని సైన్యం కలిసి ఒక్కరోజులో యూదాకు చెందిన ఒక లక్షా ఇరవై వేలమంది ధైర్యంగల సైనికులను చంపివేశారు. వారి పూర్వీకులు విధేయులైవున్న వారి దేవుడైన యెహోవాకు వారు అవిధేయులై నందువల్ల పెకహు యూదా ప్రజలను ఓడించ గలిగాడు.
7 ఎఫ్రాయిముకు చెందిన జిఖ్రి ధైర్యంగల సైనికుడు. రాజైన ఆహాజు కుమారుడు మయశేయాను, రాజగృహ నిర్వహణాధికారి అజీక్రామును, మరియు ఎల్కానాను జిఖ్రి చంపివేశాడు. రాజు తరపున అధికారం చెలాయించే వారిలో రాజు తరువాతివాడు ఎల్కానా.
8 ఇశ్రాయేలు సైన్యం యూదాలో నివసిస్తున్న తమ బంధువులైన రెండు లక్షల మందిని బందీచేశారు. వారు యూదా నుంచి స్త్రీలను, పిల్లలను, అనేక విలువైన వస్తువులను పట్టుకుపోయారు. ఇశ్రాయేలీయులు ఆ బందీలను, వస్తువులను సమరయకు (షోమ్రోను) తీసుకొనిపోయారు.
9 కాని యెహోవా ప్రవక్తలలో ఒకడు అక్కడ వున్నాడు. ఈ ప్రవక్త పేరు ఓదేదు. సమరయకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలు సైన్యాన్ని ఓదేదు కలిశాడు. ఇశ్రాయేలు సైన్యంతో ఓదేదు యిలా అన్నాడు: “మీ పూర్వీకులు ఆరాధించిన దేవుడైన యెహోవా యూదా ప్రజలపట్ల కోపంగా వున్న కారణంగా వారిని మీరు ఓడించగలిగేలా చేశాడు. మీరు యూదా ప్రజలను నీచమైన విధంగా చంపి, శిక్షించారు. ఇప్పుడు యెహోవా మీపట్ల కోపంగా వున్నాడు.
10 మీరు యూదా, యెరూషలేము ప్రజలను బానిసలుగా చేయాలని తలస్తున్నారు. మీరు మీ దేవుడైన యెహోవాపట్ల కూడా పాపం చేశారు.
11 ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు చెరపట్టిన మీ సోదరులను వెనుకకు పంపివేయండి. యెహోవా యొక్క భయం కరయైన కోపం మీమీది వుంది గనుక మీరీపని చేయండి.”
12 ఎఫ్రాయిములో కొంతమంది పెద్దలు ఇశ్రాయేలు సైనికులు యుద్ధం నుండి తిరిగి రావటం చూశారు. ఆ పెద్దలు ఇశ్రాయేలు సైనికులను కలిసి వారిని హెచ్చరించారు. ఆ పెద్దలు యెహానాను కుమారుడు అజర్యా, మెషిల్లేమోతు కుమారుడు బెరెక్యా, షల్లూము కుమారుడు యెహిజ్కియా, మరియు హద్లాయి కుమారుడు అమాశా.
13 వారు ఇశ్రాయేలు సైనికులతో యిలా చెప్పారు: “యూదా నుండి బందీలను ఇక్కడికి తీసుకొని రావద్దు. మీరాపని చేస్తే అది యెహోవా పట్ల మన పాపాన్ని, దోషాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దానితో ఇశ్రాయేలుపట్ల యెహోవా కోపం పట్టరానిదవుతుంది.”
14 అందువల్ల బందీలను, విలువైన వస్తులను సైనికులు ఆ పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు అప్పజెప్పారు.
15 ఇంతకుముందు పేర్కొన్న పెద్దలు (అజర్యా, బెరెక్యా, యెహిజ్కియా, మరియు అమాశా) నిలబడి బందీలకు సహాయపడ్డారు. ఇశ్రాయేలు సైనికులు తీసుకొన్న వారి దుస్తులను పెద్దలు తిరిగి తీసుకొని, దిగంబరంగా ఉన్న బందీలకు యిచ్చారు. పెద్దలు వారికి పాదరక్షలు కూడా యిచ్చారు. యూదా నుండి వచ్చిన బందీలకు అన్నపానాదులు కూడా పెద్దలు యిచ్చారు. సేద తీరటానికి వారికి నూనెతో కూడ వారు మర్దనా చేశారు. పిమ్మట ఆ ఎఫ్రాయిము పెద్దలు నీరసంగా వున్న బందీలను గాడిదలపై ఎక్కించి యెరికో పట్టణంలో తమ ఇండ్లకు తీసుకొని వెళ్లారు. యెరికోకు ఖర్జూర చెట్ల పట్టణమని పేరు. పిమ్మట ఆ నలుగురు పెద్దలు సమరయకు తిరిగి వెళ్లారు.
16 [This verse may not be a part of this translation]
17 [This verse may not be a part of this translation]
18 కొండప్రాంతంలోను, దక్షిణ యూదా ప్రాంతంలోనుగల పట్టణాలపై ఫిలిష్తీయులు దాడులు జరిపారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో, తిమ్నా మరియు గిమ్జో పట్టణాలను ఫిలిష్తీయులు పట్టుకున్నారు. వారా పట్టణాలకు సమీపంలో వున్న గ్రామాలను కూడా ఆక్రమించుకున్నారు. పిమ్మట ఫిలిష్తీయులు వాటిలో నివసించసాగారు.
19 యూదా రాజైన ఆహాజు యూదా ప్రజలను పాపకార్యాలకు ప్రోత్సహించిన కారణంగా యెహోవా వారికి కష్టాలు కల్పించాడు. యెహోవా పట్ల అతడు అసలు విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు.
20 అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఆహాజుకు సహాయం చేయటానికి బదులు అతనికి కష్టనష్టాలు కల్గించాడు.
21 ఆహాజు ఆలయం నుండి, రాజగృహం నుండి, యువరాజు ఆలయం నుండి విలువైన వస్తువులు కొన్ని తీశాడు. ఆహాజు వాటిని అష్షూరు రాజుకు యిచ్చాడు. అయినా ఆ పని అతనికి సహాయపడలేదు.
22 ఆహాజు తన కష్టాలతో సతమతమవుతూ మరిన్ని పాపాలు చేసి యెహోవా పట్ల మరీ విశ్వాసంలేని వాడయ్యాడు.
23 దమస్కు ప్రజలు ఆరాధించే దేవతలకు అతడు బలులు అర్పించాడు. దమస్కు ప్రజలు ఆహాజును ఓడించారు. అందువల్ల అతడిలా అనుకున్నాడు: “అరాము (సిరియా) ప్రజలు పూజించే దేవుళ్లు వారికి సహాయపడి వుండవచ్చు. కావున నేను కూడా ఆ దేవుళ్లకు బలులు అర్పిస్తే బహుశః వారు నాకు కూడా సహాయం చేయవచ్చు.” అందువల్ల ఆహాజు ఆ దేవుళ్లను ఆరాధించాడు. ఈరకంగా అతడు పాపం చేసి, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
24 ఆహాజు ఆలయంలో వున్న వస్తువులను సేకరించి వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. పిమ్మట అతడు ఆలయాన్ని మూసేశాడు. అతడు బలిపీఠాలు తయారు చేయించి, వాటిని యెరూషలేములో ప్రతివీధి చివర నెలకొల్పాడు.
25 యూదాలో ప్రతి పట్టణంలోనూ ఆహాజు ధూపాలు వేసి అన్యదేవతలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చేసి ఆహాజు తన పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు ఎక్కడలేని కోపాన్నీ కల్గించాడు.
26 మొదటి నుండి చివరి వరకు ఆహాజు చేసిన పనులన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడ్డాయి.
27 ఆహాజు చనిపోగా, అతడు అతని పూర్వీకులతోపాటు సమాధి చేయబడ్డాడు. ప్రజలు ఆహాజును యెరూషలేము నగరంలో సమాధి చేశారు. కాని ఆహాజును ఇశ్రాయేలు రాజులను సమాధిచేసే చోట మాత్రం వారు సమాధి చేయలేదు. ఆహాజు స్థానంలో అతని కుమారుడు హిజ్కియా కొత్త రాజయ్యాడు.
1 హిజ్కియా రాజయ్యేనాటికి ఇరువై యైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా. అబీయా జెకర్యా కుమార్తె.
2 ప్రభువైన యెహోవా ఆశించిన మంచి కార్యాలన్నీ హిజ్కియా చేశాడు. తన పూర్వీకుడైన దావీదులా అతడు ప్రతి మంచి పనినీ చేశాడు.
3 హిజ్కియా ఆలయానికి తలుపులు పెట్టించి, ద్వారాలను పటిష్ఠంచేశాడు. హిజ్కియా ఆలయాన్ని మరల తెరిచాడు. అతడు రాజైన మొదటి సంవత్సరం మొదటి నెలలో ఈ పని చేశాడు.
4 [This verse may not be a part of this translation]
5 [This verse may not be a part of this translation]
6 మన పూర్వీకులు యెహోవాను వదిలి పెట్టారు. యెహోవా యొక్క ఆలయాన్ని చూడకుండా వారి ముఖాలు తిప్పుకున్నారు.
7 వారు మండప ద్వారాలు మూసివేసి, ఆలయ దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవుని ఆలయపు పవిత్ర స్థానంలో ధూపం వేయటం, దహనబలులు అర్పించటం మానివేశారు.
8 కావున యెహోవా యూదా, యెరూషలేము ప్రజలపట్ల మిక్కిలి కోపంగా వున్నాడు. యెహోవా వారిని శిక్షించాడు. అన్యదేశాలవారు యెహోవా పేరు విని భయపడ్డారు. యూదా, యెరూషలేము ప్రజలను యెహోవా శిక్షించిన తీరు చూసి వారు మిక్కిలి విస్మయం చెందారు. అన్యులు యూదా ప్రజలను చూసి అస్యహించుకుని, సిగ్గుతో తలలు ఆడించారు. ఇవన్నీ నిజమైన విషయాలని మీకు తెలుసు. స్వయంగా మీ కళ్లతో మీరే చూడవచ్చు.
9 అందువల్లనే మీ పూర్వీకులు యుద్ధంలో చంపబడ్డారు. మన కుమారులు, కుమార్తెలు, భార్యలు బందీలుగా చేయబడ్డారు.
10 కావున హిజ్కియానైన నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకోదలిచాను. అప్పుడాయిన మనపట్ల ఎంతమాత్రం కోపగించడు.
11 కావున మీరు సోమరితనం మానండి. ఏమాత్రం కాలయాపన చేయవద్దు. యెహోవాకు సేవ చేయటానికి యెహోవాయే మిమ్ముల్ని ఎన్నుకున్నాడు. మీరాయనను సేవించి, ఆయనకు దూపం వేయాలి.”
12 [This verse may not be a part of this translation]
13 [This verse may not be a part of this translation]
14 [This verse may not be a part of this translation]
15 ఈ లేవీయులు తమ సోదరులనందరినీ పిలిపించి ఆలయాన్ని సంప్రోక్షించటానకి సంసిద్ధులయ్యారు. యెహోవా సంకల్పంతో వచ్చిన రాజాజ్ఞను వారు శిరసావహించారు. వారు ఆలయాన్ని శుద్ధి చేయటానికి లోనికి వెళ్లారు.
16 యాజకులు ఆలయాన్ని పవిత్ర పర్చటానికి అతి పవిత్రస్థలంలోనికి వెళ్లారు. ఆలయంలో వారు చూసిన అపవిత్రమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. నిషేధించబడిన వస్తువులన్నిటినీ ఆలయపు ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి ఆ నిషిద్ధ వస్తువులన్నిటినీ లేవీయులు కిద్రోను లోయకు తీసికొని వెళ్లి పారవేశారు.
17 మొదటి నెల మొదటి రోజున లేవీయులు పరిశుద్ధ కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు. నెలలో ఎనిమిదవ రోజున లేవీయులు ఆలయ ఆవరణలోకి వచ్చారు. అప్పటి నుంచి మరో ఎనిమిది రోజులపాటు పవిత్రారాధనకు పనికి వచ్చేలా ఆలయాన్ని శద్ధిచేశారు. మొదటి నెలలో పదహారవ రోజున పని ముగించారు.
18 పిమ్మట వారు రాజైన హిజ్కియా వద్దకు వెళ్లారు. వారు ఆయనతో, “హిజ్కియా రాజా, మేము పూర్తి ఆలయాన్ని, దహనబలుల బలిపీఠాలను ఆలయంలో ఇతర పరికరాలను శుభ్రపర్చాము. నైవేద్యపు రొట్టెను వుంచే బల్లను, ఆ బల్ల మీద ఉపయోగించే పరికరాలను శుద్ధి చేశాము.
19 రాజైన అహాబు విశ్వాసంలేనివాడై, తాను రాజుగా వున్నప్పుడు కొన్ని వస్తువులను పారవేశాడు. కాని మేము ఆ వస్తువులన్నిటినీ సేకరించి తిరిగి అక్కడ వుంచి పవిత్ర సేవకార్యక్రమానికి సిద్ధం చేసాము. అవన్నీ ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు వున్నాయి” అని చెప్పారు.
20 రాజైన హిజ్కియా నగర అధికారులను సమవేశపర్చి, మరునాటి తెల్లవారుఝామునే యెహోవా ఆలయానికి వెళ్లాడు.
21 వారు ఏడు గిత్తలను, ఏడు గొర్రె పొట్టేళ్లను, ఏడు గొర్రె పిల్లలను మరియు ఏడు చిన్న మేకపోతులను తెచ్చారు. ఇవి యూదా రాజ్యం తరుపున పాపపరిహారార్థ బలుల నిమిత్తం, పవిత్ర స్థలాన్ని శుద్ధిపర్చటానికి, మరియు యూదా ప్రజల పాపపరిహారం కొరకు తేబడ్డాయి. యెహోవా బలిపీఠం మీద ఆ పశువులను బలియిమ్ముని రాజైన హిజ్కియా అహరోను సంతతి వారైన యాజకులను ఆజ్ఞాపించాడు.
22 కావున యాజకులు గిత్త దూడలను చంపి రక్తాన్ని భద్రపర్చారు. పిమ్మట వారు గిత్త దూడల రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. తరువాత యాజకులు పొట్టేళ్లను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. ఆ తరువాత యాజకుల గొర్రెపిల్లలను చంపి, వాటి రక్తాన్ని బలిపీఠంమీద చల్లారు.
23 [This verse may not be a part of this translation]
24 [This verse may not be a part of this translation]
25 దావీదు, రాజుకు దైవజ్ఞుడైన గాదు, మరియు ప్రవక్తయైన నాతాను వీరంతా నిర్దేశించిన రీతిగా రాజైన హిజ్కియా యెహోవా ఆలయంలో తాళములు సర్వమండలములు, సితారలు వాయించటానికి లేవీయులను నియమించాడు. ఇలాగు జరుగవలెనని యెహోవా ప్రవక్తల మూలకంగా ఆజ్ఞాపించియున్నాడు.
26 కావున దావీదు చేయించిన వాద్య పరికరాలు చేతబచ్చుకొని లేవీయులు, బూరలు పుచ్చుకొని యాజకులు సిద్ధంగా నిలబడ్డారు.
27 ఆ తరువాత హిజ్కియా బలిపీఠం మీద దహనబలి అర్పించమని ఆజ్ఞాపించాడు. దహనబలి మొదలైనప్పుడు దైవప్రార్థన కూడ మొదలయ్యింది. బూరలు ఊదబడ్డాయి. ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలు వాయించబడ్డాయి.
28 దహనబలి కర్యక్రమం పూర్తయ్యే వరకు సమావేశమైన వారంతా తమ శిరస్సులు వంచారు. సంగీత విద్వాంసులు గానం చేశారు; యాజకులు బూరలుఊదారు.
29 బలులన్నీ పూర్తి అయిన పిమ్మట రాజైన హిజ్కియా, అతనితో వున్న ప్రజలంతా శిరస్సులు వంచి ఆరాధించారు.
30 రాజైన హిజ్కియా, అధికారులు యెహోవాకు స్తుతిగీతాలు పాడుమని ఆజ్ఞ యిచ్చారు. దావీదు, దైవజ్ఞుడగు ఆసాపు రచించిన భక్తిగీతాలు వారు ఆలపించారు. వారు దేవుని కీర్తించి, ఆనదించారు. వారంత శిరస్సులు వంచి దేవుని ఆరాధించారు.
31 తరువాత హిజ్కియా యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు మీ ప్రభువైన యెహోవా సేవకు పునరంకితమయ్యారు. దగ్గరకు రండి. బలులు, కృతజ్ఞతార్పణలు ఆలయానికి తిసుకొని రండి.” తరువాత ప్రజలు బలులు, కృతజ్ఞతా నైవేద్యాలు తెచ్చారు. సమర్పించాలనుకున్నవారు దహనబలులు కూడ తెచ్చారు.
32 సమావేశమైన, ప్రజలు మందిరానికి తెచ్చిన అనేక దహన బలులు యిలా వున్నాయి: డెభ్బై గిత్త దూడలు, వంద పొట్టేళ్లు, మరియు రెండు వందల గొర్రె పిల్లలు. ఈ జంతువులన్నీ యెహోవాకు దహనబలులుగా సమర్పించబడ్డాయి.
33 యెహోవాకు పరిశుద్ధ బలులుగా ఆరు వందల గిత్తలు, మరియు మూడువేల మేకలు, గొర్రెలు వున్నాయి.
34 దహన బలుల జంతువుల చర్మాలు తీయటానికి, వాటిని నరకటానికి తగినంత మంది యాజకులు లేరు. కావున వారి బంధువులగు లేవీయులు కార్యక్రమం పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు పవిత్ర సేవా కార్యక్రమానికి సిద్ధమై వచ్చేవరకు సహాయపడ్డారు. లేవీయులు మాత్రం గంభీరంగా తమ ప్రభువైన యెహోవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. వారు యాజకులకంటె ఎక్కువగా పనిమీద మనస్సు లగ్నం చేశారు.
35 అక్కడ దహనబలులు, సమాధానబలుల కొవ్వు, పానార్పణలు విస్తారంగా జరుపబడ్డాయి. ఆ విధంగా ఆలయంలో అర్చన కార్యక్రమం మళ్లీ మొదలయింది.
36 హిజ్కియా, అతని ప్రజలు దేవుడు తన ప్రజలకొరకు చేసిన ఏర్పాట్ల పట్ల సంతోషం వెలిబచ్చారు. ఈ కార్యక్రమం ఇంత త్వరగా చేయించినందుకు వారిలో ఆనందం వెల్లివిరిసింది.
1 రాజైన హజ్కియా ఇశ్రాయేలు, యూదా ప్రజలందరికీ వర్తమానం పంపించాడు. అతడు ఎఫ్రాయిము, మనష్షే ప్రజలకు కూడా లేఖలు వ్రాశాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పస్కా పండుగ జరిపేందుకు వారిందరినీ యెరూషలేములోని ఆలయానికి రమ్మని హిజ్కియా ఆహ్వానించాడు.
2 పస్కా పండుగ రెండవ నెలలో జరపటానికి అధికారులతోను, యెరూషలేము సమావేశంలోను చర్చించి రాజైన హిజ్కియా నిర్ణయించాడు.
3 పస్కా పండుగను మామూలుగా జరిగే సమయానికి వారు జరుపుకోలేక పోయారు. ఎందువల్లనంటే పవిత్ర సేవా కార్యాక్రమానికి తగినంత మంది యాజకులు సిద్ధం కాలేదు. పైగా ప్రజలందరూ యెరూషలేములో సమావేశం కాలేదు.
4 ఇప్పుడు పండుగ జరిపే తేదీ పట్ల రాజైన హిజ్కియా, సమావేశమైనవారూ సంతృప్తిని వెలిబచ్చారు.
5 పిమ్మట బెయేర్షెబా పట్టణం మొదలు దాను పట్టణం వరకు ఇశ్రాయేలంతటా వారీవిషయమై ప్రకటన చేశారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపటానికి ప్రజలంతా యెరూషలేముకు రావాలని వారు చాటించారు. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన విధంగా చాలాకాలంగా ఇశ్రాయేలు ప్రజలలో అధిక సంఖ్యాకులు పస్కా పండుగ జరుపలేదు.
6 కావున దూతలు రాజు యొక్క లేఖలను ఇశ్రాయేలు, యూదా ప్రాంతాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. ఆలేఖలలో యిలా రాయబడి వుంది: ఇశ్రాయేలు బిడ్డలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు (యాకోబు) విధేయులై వున్న దేవుడైన యెహోవా వైపు తిరగండి. అప్పుడు మీలో ఇంకా బతికివున్న వారి వద్దకు, అష్షూరు రాజు బారినుండి తప్పించుకున్న వారి వద్దకు యెహోవా వస్తాడు.
7 మీ తండ్రులవలెను, మీ సొదరులవలెను మీరు ప్రవర్తించకండి. యెహోవా వారి దేవుడు; కాని వారు ఆయనకు వ్యతిరేకులయ్యారు. అందువల్ల ప్రజలు వారిని అసహ్యించుకునేలా, వారు నిందలపాలయ్యేలా యెహోవా చేశాడు. ఇది నిజమని మీ కళ్లతో మీరే స్వయంగా చూడవచ్చు.
8 మీ ముందు తరంవారివలె మీరు మొండిగా ప్రవర్తించకండి. ఇష్ట పూర్వకమైన మీ హృదయాలతో యెహోవాకు విధేయులు కండి. అతి పరిశుద్ధ స్ధలానికి తరలిరండి. అతి పరిశుద్ద స్థలాన్ని యెహోవా శాశ్వతంగా పవిత్ర పర్చాడు. మీ దేవుడైన యెహోవాను కొలవండి. అప్పుడు యెహోవా యొక్క భయంకరమైన కోపం మీనుండి తొలగిపోతుంది.
9 మీరు తిరిగివచ్చి యెహోవాకు విధేయులైతే, బందీలైన మీ బంధువులు, పిల్లలు వారిని చెరబట్టిన శత్రువుల నుండి కనికరం పొందుతారు. మీ బంధువులు, మీ పిల్లలు మళ్లీ ఈ రాజ్యానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా దయగలవాడు; కరుణా మూర్తి. మీరాయనను ఆశ్రయిస్తే ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టడు.
10 వార్తాహరులు ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో ప్రతి పట్టణానికీ వెళ్లారు. వారు సుదూర ప్రాంతమైన జెబూలూనుకు కూడా వెళ్లారు. కాని అక్కడి ప్రజలు వార్త తెచ్చిన వారిని చూసి నవ్వి, హేళనచేశారు.
11 కాని అషేరు, మనష్షే మరియు జెబూలూను ప్రాంతాలలో కొంతమంది మాత్రం తమను తాము తగ్గించుకొని, అణకువతో యెరూషలేముకు వెళ్లారు.
12 యెహోవా తన వాక్కు ద్వారా రాజైన హిజ్కియా మరియు అతని అధికారులు ఇచ్చిన ఆజ్ఞలకు యూదా ప్రజంతా విధేయులై వుండేలా వారి మనస్సులు మార్చాడు.
13 చాలామంది ప్రజలు జట్లు జట్లుగా పులియని రొట్టెల పండుగ జరుపుకోటానికి రెండవ నెలలో యెరూషలేముకు వచ్చారు. ప్రజాసమూహం పెద్దగా వుంది.
14 యెరూషలేములో బూటకపు దేవుళ్ల ఆరాధనకు నిర్మింపబడ్డ బలిపీఠాలన్నిటినీ అక్కడ చేరిన ప్రజలు తొలగించారు. బూటకపు దేవుళ్లకు నిర్మించిన ధూప పీఠాలను కూడా వారు తీసివేశారు. ఆ బలిపీఠాలన్నిటినీ వారు కిద్రోను లోయలో పారవేశారు.
15 పిమ్మట వారు రెండవ నెల పదునాల్గవ తేదీన పస్కా గొర్రెపిల్లను చంపారు. యాజకులు, లేవీయులు సిగ్గుపడి పవిత్ర సేవా కార్యక్రమానికి పరిశుద్ధులై సిద్ధమయ్యారు. యాజకులు, లేవీయులు దహనబలులు ఆలయానికి తీసుకొనివచ్చారు.
16 యెహోవా సేవకుడైన మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారంతా ఆలయంలో తమ తమ స్థానాలను ఆక్రమించారు. లేవీయులు బలుల రక్తాన్ని యాజకులకిచ్చారు. ఆ రక్తాన్ని యాజకులు బలిపీఠం మీద చిలికించారు.
17 సమావేశమైన వారిలో శుచియై సేవా కార్యాక్రమానికి సిద్ధం కానివారు అనేకమంది వున్నారు. కావున వారు పస్కా గొర్రెపిల్లలను చంపటానికి అనుమతింపబడలేదు. ఆ కారణంగా లేవీయులు పరిశుద్ధులు కాని వారందరి తరుపునా పస్కా బలులు అర్పించవలసి వచ్చింది. లేవీయులు ప్రతి గొర్రెపిల్లను పవిత్రపర్చి బలికి సిద్ధం చేశారు.
18 [This verse may not be a part of this translation]
19 [This verse may not be a part of this translation]
20 రాజైన హిజ్కియా ప్రార్థన యెహోవా ఆలకించాడు. ఆయన ప్రజలను క్షమించాడు.
21 ఇశ్రాయేలు సంతతివారు యెరూషలేములో ఏడు రోజులపాటు పులియని రొట్టెల పండుగను జరుపుకున్నారు. వారంతా చాలా ఆనందోత్సాహాలతో వున్నారు. లేవీయులు, యాజకులు ప్రతిరోజు తమ శక్తి కొలదీ యెహోవాకు స్తోత్రం చేశారు.
22 యెహోవా సేవా కార్యాక్రమంలో పరిపూర్ణ జ్ఞానంగల లేవీయులందరినీ రాజైన హిజ్కియా ప్రోత్సహించాడు. ప్రజలు పండుగను ఏడు రోజులపాటు జరిపి సమాధన బలులు అర్పించారు. వారు తమ పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు.
23 ప్రజలంతా అక్కడా మరి ఏడు రోజులు వుండటానికి ఇష్టపడ్డారు. పస్కా పండుగను మరి ఏడు రోజులు జరుపుకున్నందుకు వారు సంతోషించారు.
24 యూదా రాజైన హిజ్కియా ఒక వెయ్యి గిత్తలను, ఏడువేల గొర్రెలను సమావేశమైన ప్రజల ఆహారం నిమిత్తం ఇచ్చాడు. పెద్దలు కూడా వెయ్యిగిత్తలను, పదివేల గొర్రెలను ప్రజలకు ఆహారంగా ఇచ్చారు. చాలామంది యాజకులు పవిత్ర కార్యక్రమానికి సంసిద్ధులయ్యారు.
25 యూదా నుండి వచ్చిన ప్రజా సమూహం, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు నుండి వచ్చిన జనం, మరియు ఇశ్రాయేలు నుండి యూదాకు వచ్చిన ఇతర యాత్రీకులు-అందరూ చాలా సంతోషపడ్డారు.
26 అందువల్ల యెరూషలేములో ఆనందం వెల్లివిరిసింది. దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కాలం తరువాత ఇప్పటివరకు ఇంత వైభవంగా ఏ ఉత్సవం నిర్వహింపబడలేదు.
27 యాజకులు, లేవీయులు లేచి నిలబడి ప్రజలను దీవించుమని యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వారి ప్రార్థన యెహోవా పరిశుద్ధ నివాసం చేరింది.
1 పస్కా పండుగ పూర్తి అయ్యింది. యెరూషలేముకు పండుగ నిమిత్తం వచ్చిన ఇశ్రాయేలీయులు యూదాలో వున్న పట్టణాలకు వెళ్లి, అక్కడ వున్న రాతి విగ్రహాలన్నిటినీ ముక్కలు చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వారు ఈ రాతి విగ్రహాలను ఉపయోగించేవారు. ప్రజలు అషేరా స్తంభాలను కూడా నరికివేశారు. యూదా, బెన్యామీను రాజ్యాలలో వున్న ఉన్నత స్థలాలను, బలిపీఠాలను కూలదోశారు. ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో కూడా ఈ ప్రజలు అదే పని చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వినియెగించే వస్తువులన్నీ నాశనమయ్యే వరకు ప్రజలీపని చేస్తూనే వున్నారు. తరువాత ఇశ్రాయేలీయలంతా తమ తమ పట్టణాలకు వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తీ తన ఇంటికి వెళ్లిపోయాడు.
2 రాజైన హిజ్కియా మళ్లీ యాజకుల, లేవీయుల వంశాలను వారివారి విధులు నిర్వర్తించటానికి ఎంపిక చేశాడు. ప్రతి గుంపుకీ ప్రత్యేకమైన పని నిర్దేశించబడింది. దహనబలులు, సమాధానబలులు యివ్వటానికి కూడ హిజ్కియా మళ్లీ యాజకులను, లేవీయులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు ఆలయంలో సేవ చేసి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చేశారు.
3 దహన బలులుగా అర్పించటానికి హిజ్కియా తన స్వంత జంతువులను కొన్నిటిని ఇచ్చాడు. ఈ దహనబలులు ఉదయ, సాయంకాల సమయాలలోను, వారం చివర సబ్బాతు దినాలలోను (శనివారం), అమావాస్యలందు, మరి ఇతర పండుగ దినాలలోను అర్పించేవారు. ఈ కార్యక్రమమంతా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది.
4 యాజకులకు, లేవీయులకు చెందిన భాగాన్ని వారికి ఇవ్వమని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు హిజ్కియా ఆజ్ఞాపించాడు. తద్వారా యాజకులు, లేవీయులు తమ పూర్తి కాలాన్ని యెహోవా సేవలో, ధర్మశాస్త్రం బోధించేందుకు వినియోగించగలరు.
5 రాజాజ్ఞ దేశమంతా ప్రచారం చేయబడిన వెంటనే, ఇశ్రాయేలు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. తమ పంటలైన ధాన్యం, ద్రాక్ష, నూనె, తేనె, ఇంకను వారి పొలాల్లో పండిన తదితర పంటల నుండి మొదటి భాగాన్ని విరాళంగా ఇచ్చారు. వారి పంటలో పదవ భాగాన్ని స్వచ్ఛందంగా తీసుకొని వచ్చారు. ఈ సేకరణే చాలా పెద్ద మొత్తమయ్యింది.
6 యూదా పట్టణాలలో నివసిస్తున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలు కూడా తమ పశుసంపదలో పదవవంతు తెచ్చారు. వారింకా యెహోవా కొరకు విడిగా ఒక చోట నిల్వచేసిన వస్తువులలో పదవవంతు తెచ్చారు. వారీ వస్తువులన్నీ తాము ఆరాధించే దేవుడైన యెహోవా నిమిత్తం తెచ్చారు. వారు తెచ్చిన పదార్థాలు, వస్తువులు అన్నీ రాశులుగా పోశారు.
7 మూడవ నెలలో (మే/జూన్) ప్రజలు నిల్వచేసిన వస్తువులన్నీ తేవటం మొదలుపెట్టి ఏడవ నెలలో (సెప్టెంబర్/అక్టోబర్) పూర్తి చేశారు.
8 హిజ్కియా, మరియు ఇతర పెద్దలు వచ్చి ప్రజలు తెచ్చిన వస్తుసంపద రాశులుగా పడివుండటం చూశారు. వారు దేవునికి స్తోత్రం చేసి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను శ్లాఘించారు.
9 అప్పుడు హిజ్కియా రాసులుగా పడివున్న వస్తు సంపద గురించి యాజకులను, లేవీయులను అడిగి తెలుసుకున్నాడు. రాజైన హిజ్కియా అభివృద్ధి కార్యక్రమం చేపట్టటంసాదోకు కుటుంబానికి చెందిన ప్రముఖ యాజకుడు అజర్యా రాజైన హిజ్కియాతో యిలా చెప్పాడు: “ప్రజలు ఆలయానికి కానుకలు తేవటం మొదలు పెట్టినప్పటి నుండి తినటానికి మాకు సమృద్ధిగా ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. అంతేగాదు, మా వద్ద ఇంకా అనేక పదార్థాలు మిగిలి వున్నాయి. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించాడు. అందుచే మావద్ద ఇదంతా మిగిలివుంది.”
10 [This verse may not be a part of this translation]
11 [This verse may not be a part of this translation]
12 తరువాత యాజకులు కానుకలను, దశమ భాగాలను, తదితర వస్తువుల్లో యెహోవాకై ప్రత్యేకించబడిన వాటిని తెచ్చారు. అలా సేకరించిన ఆ వస్తుసంపదను ఆలయ గిడ్డంగులలో భద్రపర్చారు. లేవీయుడైన కొనన్యా వీటిపై పర్యవేక్షకుడుగా నియపింపబడ్డాడు. అతని తరువాత అధికారిగా షిమీ నియమితుడయ్యాడు. కొనన్యా సోదరుడే షిమీ.
13 కొనన్యా, అతని సోదరుడు షిమీలిద్దరూ యెహీయేలు, అజజ్యాహు, నహతు, అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యాహు, మహతు మరియు బెనాయాలపై పర్యవేక్షణ అధికారులుగా నియమింపబడ్డారు. రాజైన హిజ్కియా, ఆలయపు నిర్వహణాధికారి అజర్యాలిద్దరూ ఈ మనుష్యులను ఎంపికచేశారు.
14 ప్రజలు దేవునికి ఇచ్చే ఉచిత కానుకల విషయమై శ్రద్ధ తీసుకోనే అధికారి పేరు కోరే. దేవునికి ఇవ్వబడిన కానుకల పంపిణీ విషయంలో ఇతడు శ్రద్ధ తీసుకొంటాడు. దేవునికి ఇవ్వగా పవిత్ర పర్చబడిన ధానాల పంపిణీ విషయంలో కూడా బాధ్యత ఇతనిదే. కోరే తూర్పు ద్వారపాలకుడు. ఇతని తండ్రి లేవీయుడైన ఇమ్నా.
15 ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా మరియు షెకన్యా అనేవారు కోరేకు సహాయ కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకులలో ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను వారు ఇచ్చేవారు.
16 లేవీయుల వంశ చరిత్రల్లో చేర్చబడిన మూడేండ్లు అంతకు పైబడిన వయస్సుగల మగ పిల్లలకు కూడ సేకరించిన రాశులనుండి వారు భాగాలను పంచిపెట్టేవారు. ఈ మగవారంతా నిత్యం ఆలయానికి వెళ్లి అనుదిన సేవా కార్యక్రమాలలో తమ తమ విధులు నిర్వర్తించవలిసినవారు. లేవీయులో ప్రతి వంశంవారికి ఒక బాధ్యత అప్పగించబడింది.
17 సేకరించిన వస్తుసంపద నుంచి యాజకులకు తమ భాగం యివ్వబడింది. వారి కుటుంబాల వారీగా వంశ చరిత్రలలో రాయబడిన క్రమంలో ఈ పని జరుపబడింది. సేకరించిన సంపదలో ఇరవైయేండ్లు, అంతకు పైబడిన వయస్సుగల లేవీయులకు వారి వంతు భాగాలు ఇవ్వబడ్డాయి. ఇది వారి వారి బాధ్యతలను బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి జరిగింది.
18 లేవీయుల పసిపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు సేకరించిన సంపదలో భాగస్వాములయ్యారు. వంశచరిత్రలో వ్రాయబడిన లేవీయులందరికీ యిలా భాగాలు ఇవ్వ బడ్డాయి. లేవీయులు విశ్వాస పాత్రంగా సదా పవిత్రులైవుండి, ప్రభుసేవా పరాయణులైనందువల్ల ఆ విధంగా ఏర్పాటు చేయబడింది.
19 అహరోను వంశస్థులైన కొంతమంది యాజకులు లేవీయులు నివసిస్తున్న పట్టణాలకు దగ్గర లో కొన్ని పంట భూములు కలిగియున్నారు. ఆ పట్టణాలలో అహరోను సంతతి వారు కూడ కొందరు నివసిస్తున్నారు. అట్టి అహరోను సంతతి వారికి భాగాలు యివ్వటానికి ప్రతి పట్టణంలోను నివసిస్తున్న పురుషులు పేర్ల వారీగా ఎంపిక చేయబడ్డారు. పురుషులు, లేవీయుల వంశ చరిత్రలో వ్రాయబడినవారు సేకరించిన పదార్థాలలో భాగం పొందారు.
20 రాజైన హిజ్కియా అలాంటి మంచి పనులు యూదా రాజ్యమంతటా చేశాడు. యెహోవా దృష్టికి మంచిదైన న్యాయమైన విశ్వసనీయమైన ప్రతి పనినీ అతడు చేశాడు.
21 తలపెట్టిన ప్రతి పనిలోను, ఆలయంలో సేవకార్యక్రమం పునః ప్రారంభించటంలోను; దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించటంలోను మరియు అతడు దేవుని అనుసరించటంలోడు అతను విజయం సాధించాడు. హిజ్కియా ఈ పనులన్నీ తన హృదయపూర్వకంగా చేశాడు.
1 హిజ్కియా ఈ పనులన్నీ విశ్వసనీయంగా చేసిన పిమ్మట, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. సన్హెరీబు అతని సైన్యంతో వచ్చి కోటలను మట్టడించి సైనిక స్థావరాలు ఏర్పాటు చేశాడు. అలా చేసి ఆ పట్టణాలను తాను జయించాలని అతడు పన్నాగం పన్నాడు. సన్హెరీబు ఆ పట్టణాలను తాను స్వయంగా గెలవాలని అనుకున్నాడు.
2 యెరూషలేముపై దాడిచేయాటానికే సన్హెరీబు వచ్చాడని హిజ్కియాకు తెలుసు.
3 అప్పుడు హిజ్కియా తన పరిపాలనాధికారుతోను, సైనికాధికారుతోను సంప్రదించాడు. వారు నగరం వెలుపల జలవనరుల నుండినీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. పాలనాధికారులు, సైనికాధికారులు హిజ్కియాకు తోడ్పడ్డారు.
4 అనేకమంది ప్రజలు కలిసి జలవనరులన్నీ ఆపివేశారు. దేశం మధ్యగా ప్రవహించే కాలువకు కూడ అడ్డకట్టలు వేశారు. “అష్షూరు రాజు ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి కావలసినంత నీరు ఇక్కడ దొరకదు” అని వారనుకున్నారు.
5 హిజ్కియా యెరూషలేమును బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. అతడు చేసిన పని ఏమనగా: గోడలు పడిపోయిన చోటల్లా అతడు తిరిగి కట్టించాడు. అతడు గోడలమీద బురుజుల నిర్మింపజేసాడు. మొదటి గోడకు బయటగా మరో గోడను కూడ అతడు నిర్మించాడు. పాత యెరూషలేములో తూర్పు భాగాన అతడు మళ్లీ కోటలు నిర్మించాడు. అతడు అనేక ఆయుధాలను, డాళ్లను తయారు చేయించాడు.
6 [This verse may not be a part of this translation]
7 [This verse may not be a part of this translation]
8 అష్షూరు రాజు వద్ద కేవలం మనుష్యల బలమే వుంది. కాని మనవద్ద యెహోవా దైవబలం వుంది. మన దేవుడు మనకు సహాయపడతాడు. మన యుద్ధాలు ఆయనే నిర్వహిస్తాడు!” ఆ విధంగా యూదా రాజైన హిజ్కియా ప్రజలను ఉత్సహపర్చి వారి ధైర్యాన్ని తట్టి లేపాడు.
9 అష్షూరు రాజైన సన్హెరీబు, అతని సైన్యం లాకీషు నగరం దగ్గరగా స్థావరం ఏర్పాటు చేసి దానిని ఓడించాలని వున్నారు. పిమ్మట యూదా రాజైన హిజ్కియా వద్దకు, యెరూషలేములో వున్న యూదా ప్రజల వద్దకు సన్హెరీబు తన సేవకులను పంపాడు. సన్హెరీబు సేవకులు హిజ్కియాకు, యెరూషలేము ప్రజలకు వర్తమానాన్ని పట్టుకు వెళ్లారు.
10 ఆ సేవకులు ఈ విధంగా ప్రకటించారు: “అష్షూరు రాజైన సన్హెరీబు యిలా చెప్పుచున్నాడు: యెరూషలేము ముట్టడిలో వుండగా మీరు దేనిని నమ్ముకొని ఇంకా అక్కడ వుంటున్నారు?
11 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులనుగా చేస్తున్నాడు. యెరూషలేములోనే వుండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. ‘అష్షూరు రాజు నుండి మనల్ని మన ప్రభువైన యెహోవా రక్షిస్తాడు,’ అని హిజ్కియా మీకు చెప్పుచున్నాడు.
12 హిజ్కియా తనకై తాను యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలను తొలగించి వేశాడు. కాని యూదా, యెరూషలేము ప్రజలైన మీకు ఒకే బలిపీఠం మీద పూజచేసి, ధూపం వేయండని చెప్పుచున్నాడు.
13 నిజానికి నేను, నా పూర్వీకులు ఇతర దేశాల ప్రజలకు ఏమి చేసినదీ మీయందరికీ తెలిసినదే. అన్యదేశాల దేవుళ్లు వారి ప్రజలను కాపాడలేక పోయారు. నేను వారి ప్రజలను నాశనం చేయకుండా ఆ దేవుళ్లు నన్ను ఆపలేకపోయారు.
14 నా పూర్వీకులు ఆ రాజ్యలను నాశనం చేశారు. తన ప్రజలను నాశనం చేయకుండా నన్నాపగల దేవుడెవ్వడూ లేడు. కావున మీ దేవుడు నానుండి మిమ్మల్ని కాపాడగలడని మీరనుకుంటున్నారా?
15 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులను చేయటంగాని, మోసపుచ్చటంగాని చేయనీయవద్దు. మీరతనిని నమ్మవద్దు. ఎందువల్లననగా ఏ దేశపు దేవుడే గాని, ఏ రాజ్యపు దేవుడేగాని అతని ప్రజలను నానుండి నా పూర్వీకుల నుండి సురక్షితంగా వుండేలా ఎన్నడూ కాపాడలేడు. కావున మీ దేవుడు మిమ్మల్ని నాశనం చేయకుండ నన్ను ఆపుతాడని మీరు అనుకోవద్దు.”
16 ప్రభువగు యెహోవాకు, దేవుని సేవకుడగు హిజ్కియాకు వ్యతిరేకంగా అష్షూరు రాజు సేవకులు చాలా నీచంగా మాట్లడారు.
17 ఇశ్రాయేలు దేవుడగు యెహోవాను అవమానపరుస్తూ అష్షూరు రాజు లేఖలు కూడ వ్రాశాడు. ఆ లేఖలలో అష్షూరు రాజు యిలా వ్రాశాడు: “నేను అన్యదేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు.”
18 తరువాత అష్షూరు రాజు సేవకులు నగర గోడమీద వున్న యెరూషలేము ప్రజలను చూసి కేకలు పెట్ట అరిచారు. గోడమీద జనాన్ని చూసి ఆ సేవకులు వారికి తెలిసేలా హెబ్రీ భాషలో తి ట్టి అరిచారు. అష్షూరు. అష్షూరు రాజు సేవకులు యెరూషలేము ప్రజలను భయపెట్టేటందుకే అలా చేసారు. యెరూషలేము నగరాన్ని కైవసం చేసికోవాలనే వారలా చేసారు.
19 ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల కూడ ఆ సేవకులు చెడుగా మాట్లడారు. కాని ఆ దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన బొమ్మలు. అదేరీతిలో ఆ సేవకులు యెరూషలేము దేవునిపట్ల కూడ నీచంగా మాట్లడారు.
20 రాజైన హిజ్కియా మరియు ఆమోజు కుమారుడు. ప్రవక్తయునగు యెషయా ఈ సమస్య విషయంలో దేవుని ప్రార్థించారు. వారు ఆకాశంవైపు తిరిగి దేవునికి తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు.
21 అప్పుడు యెహోవా తన దూత నొకనిని అష్షూరు రాజు ఉండే స్థలానికి పంపించినాడు. ఆ దేవదూత అష్షూరు సైన్యంలోని అందరు సైనికులను, నాయకులను, అధికారులను చంపివేశాడు. దానితో అష్షూరు రాజు పలాయనం చిత్తగించి తన దేశంలోగల తన ఇంటికి పోయాడు. ప్రజలు అతనిని చూసి సిగ్గుపడ్డారు. అతడు తన దేవుని ఆలయానికి వెళ్లగా అక్కడ తన స్వంత కుమారులలో కొందరు అతనిని కత్తులతో నరికి చంపివేశారు.
22 ఆ రకంగా యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజైన సన్హెరీబు బారినుండి, ఇతర శత్రువుల బారినుండి రక్షించాడు. యెహోవా హిజ్కియాపట్ల యెరూషలేము ప్రజలపట్ల తగిన శ్రద్ధ తీసుకొన్నాడు.
23 అనేక మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని యెరూషలేముకు వచ్చారు. యూదా రాజైన హిజ్కియాకు కూడా వారు అనేక విలువైన వస్తువులు తెచ్చియిచ్చారు. అప్పటి నుండి హిజ్కియాను అన్ని దేశాల వారు గౌరవించటం మొదలు పెట్టారు.
24 ఆ రోజులలోనే హిజ్కయాకు తీవ్రంగా జబ్బుచేసి చనిపోయే స్థితిలో వున్నాడు. అతడు దేవుని ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి, అతనికి ఒక సూచన ఇచ్చినాడు.
25 కాని హిజ్కియా హృదయం గర్విపడింది. అందువల్ల అతనికి దేవుడు చేసిన మేలుకు అతడు కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ కారణంవల్ల దేవుడు హిజ్కియా పట్ల మరియు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించినాడు.
26 కాని హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్లీ మనస్సు మార్చుకొనినవారై, తమ జీవితాలు మార్చుకున్నారు. వారు విదేయులై గర్వించటం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బ్రతికినంత కాలం దేవుని కోపం వారి మీదికి రాలేదు.
27 హిజ్కియా మహా భాగ్యవంతుడయ్యాడు. గొప్ప గౌరవం లభించింది. వెండి బంగారాలు, విలువైన ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్లు, తదితర వస్తువులు భద్రపర్చటానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు చేశాడు.
28 ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం ప్రజలు తనకు పంపిన నూనెను నిల్వచేయటానికి హిజ్కియా గిడ్డంగులు నిర్మించాడు. అన్ని రకాల పశువులశాలలు, గొఱ్ఱెలకు కొట్టములు కూడ నిర్మించాడు.
29 హిజ్కియా చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పశుసంపద గొఱ్ఱెల మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చినాడు.
30 యెరూషలేములో గిహోను ఎగువ కాలువ ప్రవాహానికి అడ్డుకట్టలు లేని నీటిని దావీదు నగరంలో పడమటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించినవాడు హిజ్కియాయే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధించాడు.
31 ఒక పర్యాయం బబులోను పెద్దలు హిజ్కియా వద్దకు దూతలను పంపారు. అప్పుడు దేశాలలో సంభవించిన ఒక అధ్బుత సంఘటన గురించి అడిగి తెలికొన్నారు. వారు వచ్చినప్పుడు హిజ్కియా మనస్సులో ఏమున్నదో పరీక్షించి పూర్తిగా తెలిసికొనటానికి అతనిని యెహోవా ఒంటరిగా వదిలినాడు.
32 హిజ్కియా పాలనలో అతడు చేసిన ఇతర కార్యములను గురించి, అతని భక్తి కార్యక్రమాల గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథం మరియు ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా దర్శనాలలో వ్రాయబడినాయి.
33 హిజ్కియా చనిపోగా అతడు తన పూర్వీకుల వద్ద సమాధి చేయబడినాడు. దావీదు పూర్వీకుల సమాధులున్న కొండమీద ప్రజలు హిజ్కియాను సమాధి చేశారు. హిజ్కియా చనిపోయినప్పుడు యూదా ప్రజలందరు, మరియు యెరూషలేములో నివసిస్తున్నవారు అతనికి ఘనంగా నివాళులర్పించారు. హిజ్కియా స్థానంలో మనష్షే కొత్త రాజయ్యాడు. మనష్షే హిజ్కియా కుమారుడు.
1 మనష్షే యూదా రాజయ్యేనాటికి పన్నెండు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబైయైదు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
2 యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ మనష్షే చేశాడు. అన్యదేశాల వారి భయంకరమైన, పాప భూయిష్టమైన ఆచారాలన్నిటినీ అతడు అనుసరించాడు. ఆ రాజ్యాల వారిని ఇశ్రాయేలీయుల ఎదుటనుండి యెహోవా బయటకు వెడల గొట్టినాడు.
3 తన తండ్రి హిజ్కియా తొలగించిన ఉన్నత స్థలాలన్నీ మనష్షే మళ్లీ నిర్మించాడు. బయలు దేవతలకు పూజా పీఠాలను, అషేరా దేవతా స్తంభాలను మనష్షే నిర్మించాడు. నక్షత్ర మండలాలకు ప్రణమిల్ల, వాటిని అతడు ఆరాధించాడు.
4 యెహోవా ఆలయంలో బూటకపు దేవతలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. కాని “నా నామము యెరూషలేములో శాశ్వతంగా వుంటుంది” అని యెహోవా తన ఆలయ విషయంలో చెప్పియున్నాడు.
5 రెండు ఆలయ ఖాళీ స్థలాలలోను ప్రతి నక్షత్ర మండలానికి ఒక్కొక్కటి చొప్పున మనష్షే బలిపీఠాలను నిర్మించాడు.
6 బెన్‌హిన్నోము లోయలో మనష్షే తన స్వంత పిల్లలను కూడ దేవతలకు బలియిచ్చాడు. మనష్షే భవిష్యత్తును తెలిసికోవటానికి మంత్రతంత్ర విద్యలను ఆశ్రయించి, సోది చెప్పు వారిని, చిల్లంగి వాండ్రను సంప్రదించాడు. కర్ణపిశాచి విద్యలను పాటించే వారిని సోదిచెప్పు వారిని ప్రోత్సహించి వారి సలహాలు తీసికొన్నాడు. దేవుని దృష్టిలో చాలా హేయమైన పనులు చేశాడు. మనష్షే పాపాలు యెహోవాకు కోపం వచ్చేటట్లు చేశాయి.
7 అతడు ఒక దేవతా విగ్రహాన్ని కూడ చేయించి దానిని ఆలయంలో నెలకొల్పాడు. ఈ ఆలయాన్ని గురించి యెహోవా దావీదుకు అతని కుమారుడు. సొలొమోనుకు యిలా చెప్పినాడు: “ఈ ఆలయంలోను, యెరూషలేములోను నా నామమును స్థిరంగా ప్రతిష్టించుతాను. ఇశ్రాయేలు కుటుంబాల వారుంటున్న స్థానములన్నిటిలోను నేను యెరూషలేమును ఎంపిక చేసికొన్నాను.
8 ఇశ్రాయేలీయుల పూర్వీకులకు యివ్వడానికి నిశ్చయించిన ఈ రాజ్యంనుండి మరెన్నడూ నేను వారిని బయటకు వెళ్ల గొట్టను. కాని వారికి నేను ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ వారు తప్పక పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు అందజేయమని నేను మోషేకు ఇచ్చిన ధర్మాశాస్త్రాన్ని, నియమ నిబంధనలను, ఆజ్ఞలను వారు తప్పక అనుపరించాలి.”
9 యూదా ప్రజలను, యెరూషలేము వాసులను తప్పుడు పనులు చేయటానికి మనష్షే ప్రోత్సహించాడు. ఇశ్రాయేలీయుల ముందు నుండి యెహోవా చేత బలవంతంగా వెళ్లగొట్టబడి నాశనం గావింపబడిన వారి కంటె వారు ఎక్కువ పాపాలు చేశారు.
10 యెహోవా మనష్షేతోను, అతని ప్రజలతోను మాట్లాడినాడుగాని, వారు దేవుని మాట వినటానికి నిరాకరించారు.
11 అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు.
12 మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు
13 మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు.
14 ఇది జరిగిన పిమ్మట మనష్షే’ దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు.
15 ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు.
16 పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు.
17 ప్రజలు ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే అర్పించారు.
18 మనష్షే చేసిన ఇతర విషయాలు, దేవునికి అతడు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు దేవుని తరపున దీర్ఘదర్శలు అతనిని గురించి చెప్పిన విషయాలు అన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి.
19 మనష్షే దేవునికి చేసిన ప్రార్థన, దేవుడు దానిని విన్న విధము, అది విని దేవుడు బాధపడిన విషయములు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడినాయి. మనష్షే తనకు తాను విధేయుడు కాక పూర్వం అతడు చేసిన పాపాలు, పొరపాట్లు, అతను ఎక్కడెక్కడ ఇతర దేవుళ్లకు ఉన్నత స్థలాలు, అషేరా దేవతా స్తంభాలు నిలిపిన విషయాలు దీర్ఘదర్శుల గ్రంథంలో రాయబడ్డాయి.
20 మనష్షే చనిపోయినప్పుడు అతనిని తన పూర్వీకులతోపాటు సమాధిచేశారు. ప్రజలతనిని తన స్వంత రాజ గృహంలోనే సమాధి చేశారు. మనష్షే స్థానంలో ఆమోను కొత్తగా రాజయ్యాడు. ఆమోను మనష్షే కుమారుడు.
21 యూదాకు రాజయ్యేనాటికి ఆమోను ఇరువదిరెండేండ్లవాడు. యెరూషలేములో అతడు రెండేండ్లపాటు రాజుగా ఉన్నాడు.
22 దేవుని సన్నిధిలో ఆమోను అన్నీ నీచకార్యాలే చేశాడు. తన తండ్రి మనష్షే చేసిన విధంగా, దేవుడు అతని నుండి ఆశించిన పవిత్ర కార్యాలేవీ ఆమోను చేయలేదు. తన తండ్రి మనష్షే చేయించి వుంచిన చెక్కడపు (నగిషీ) బొమ్మల విగ్రహాలకు ఆమోను బలులు అర్పించాడు. ఆమోను ఆ విగ్రహాలను ఆరాధించాడు.
23 తన తండ్రి మనష్షే పరివర్తన చెందినట్లు, ఆమోను దేవుని ముందు వీధేయుడై మెలగలేదు. పైగా ఆమోను రోజు రోజుకు మరింత పాపం చేయసాగాడు.
24 ఆమోను సేవకులు అతనిపై కుట్రపన్నారు. వారు ఆమోనును అతని స్వంత ఇంటిలోనే హత్యచేశారు.
25 కాని యూదా ప్రజలు రాజైన ఆమోనుపై కుట్ర పన్నిన సేవకులందరీని చంపివేశారు. తరువాత ప్రజలు కొత్త రాజుగా యోషీయాను ఎంపిక చేశారు. యోషీయా ఆమోను కుమారుడు.
1 యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు.
2 ఏది న్యాయమైనదో అది యోషీయా చేశాడు. యెహోవా చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడైన దావీదువలె అతడు మంచి కార్యాలు చేశాడు. యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ వెనుకాడలేదు.
3 యోషీయా రాజైన పిమ్మట ఎనిమిదవ సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూషలేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం చేయటం మొదలు పెట్టాడు.
4 బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు.
5 బయలు దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠాలపైనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా యోషీయా యూదాలోను, యెరూషలేములోను విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు.
6 మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాలలోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ యోషీయా ఇదేరకంగా చేశాడు. పట్టణాల పరిసరాలలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడీ పని చేశాడు.
7 యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగ్రహాలన్నిటినీ పిండి పిండిగా గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవతలకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పగులగొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
8 యోషీయా తన యూదా రాజ్యపాలనలో పదునెనిమిదవయేట షాఫాను, మయశేయా, మరియు యోవాహును పాడవుతున్న యెహోవా ఆలయాన్ని పునరుద్ధరించటానికి పంపాడు. షాఫాను తండ్రిపేరు అజల్యా. మయశేయా నగర పాలకుడు. యోవాహు తండ్రిపేరు యోహాహాజు. యోవాహు లేఖికుడు. జరిగిన వృత్తాంతములన్నిటినీ సేకరించి పుస్తకములో ఎక్కించువాడు. యోషీయా ఆలయాన్ని పునరుద్ధరించి యూదాను, యెరూషలేమును మళ్లీ పవిత్ర పర్చటానికి పూనుకొన్నాడు. ఆమేరకు ఆజ్ఞలు ఇచ్చాడు.
9 ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు వచ్చారు. ప్రజలు ఆలయానికి ఇచ్చిన కానుకల ధనాన్ని వారు హిల్కీయాకు ఇచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ఎఫ్రాయిము ప్రజల నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూషలేము ప్రజల నుండి కూడ సేకరించారు.
10 ఆలయపు పనిని పర్యవేక్షించే ఉద్యోగులకు వారు ఈ ధనాన్ని ఇచ్చారు. ఈ అధికారులు ధనాన్ని తిరిగి ఆలయాన్ని తిరిగి కడుతున్న పనివారికి చెల్లించారు.
11 ఆ ధనాన్ని వారు వడ్రంగులకు, శిల్పులకు, చెక్కిన రాళ్లను, కలపను కొనటానికి ఇచ్చారు. భవనాలను తిరిగి నిర్మించటానికి, భవనాలకు కావలసిన దూలాలు తయారు చేయటానికి, ఈ కలపను వినియోగించారు. ఆలయ భవనాల విషయంలో యూదా రాజులు గతంలో తగిన శ్రద్ధ వహించలేదు. ఆ భవనాలన్నీ పాతవై శిధిలాలవస్థలో వున్నాయి.
12 [This verse may not be a part of this translation]
13 [This verse may not be a part of this translation]
14 ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయటకు తెచ్చారు. ఆ సమయంలో యాజకుడగు హిల్కీయా ప్రభువైన యెహోవా మోషేద్వారా అందజేసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు.
15 హిల్కీయా కార్యదర్శియగు షాఫానుతో, “ఆలయంలో నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నా” నని చెప్పాడు. హిల్కీయా గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు.
16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజైన యోషీయా వద్దకు తెచ్చాడు. షాఫాను రాజు వద్దకు వచ్చి ఆలయ పనిపై తన నివేదిక ఈ విధంగా సమర్పించాడు: “మీ సేవకులు మీరు చెప్పిన విధంగా పని కొనసాగిస్తున్నారు.
17 వారు ఆలయంలోవున్న ధనాన్ని తీసి పనిమీద తనిఖీదారులకు, పనివారికి చెల్లిస్తున్నారు.”
18 తరువాత షాఫాను రాజైన యోషీయాతో, “యాజకుడగు హిల్కీయా నాకొక గ్రంథమిచ్చాడు” అని చెప్పాడు. పిమ్మట షాఫాను ఆ గ్రంథం నుండి రాజుముందు చదవటం మొదలుపెట్టాడు.
19 రాజైన యోషీయా ధర్మశాస్త్ర విషయాలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు .
20 తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్దోనుకు, కార్యదర్శి షాఫాను మరియు సేవకుడైన ఆశాయాకును ఒక ఆజ్ఞ యిచ్చాడు.
21 రాజు యిలా చెప్పాడు: “మీరు వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను మిగిలివున్న ప్రజల తరపున యెహోవాను మనకు దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ కోపంగా వున్నాడు. ఈ గ్రంథం బోధించిన విషయాలను వారు పాటించలేదు!”
22 హిల్కీయా, రాజసేవకులు కలిసి ప్రవాదినిహుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు.
23 హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము.
24 యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను.
25 ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా నా కోపం చల్లారదు!’
26 “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు:
27 ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక,
28 నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.”‘ హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు.
29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు.
30 రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది.
31 తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు.
32 పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు.
33 పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు.
1 యెరూషలేములో యెహోవాకు యోషీయా రాజు పస్కా పండుగ జరిపించాడు. మొదటి నెలలో పదునాల్గవ రోజున పస్కా గొఱెపిల్ల చంపబడింది.
2 వారివారి విధులు నిర్వర్తించటానికి యోషీయా యాజకులను ఎన్నుకొన్నాడు. ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు యాజకులను యోషీయా ఉత్సాహపర్చాడు.
3 ఇశ్రాయేలు ప్రజలకు బోధకులుగా వున్నవారితోను, ఆలయంలో సేవ చేయటానికి పవిత్రులైన లేవీయులతోను, యోషీయా మాట్లాడినాడు. ఆ లేవీయులతో అతడిలా అన్నాడు: “సొలొమోను నిర్మించిన ఆలయంలో పవిత్ర పెట్టెను వుంచండి. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు ఇశ్రాయేలు రాజు. పవిత్ర పెట్టెను ఇక మీరు మీభుజాల మీద ఒకచోటు నుండి మరియొక చోటికి మోయవద్దు. మీ దేవుడైన యెహోవాకు ఇప్పుడు మీరు సేవ చేయండి. దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు సేవ చేయండి.
4 మీమీ వంశాల ప్రకారం ఆలయంలో సేవచేయటానికి సిద్ధమవ్వండి. రాజైన దావీదు, అతని కుమారుడు రాజైన సొలొమోను మీరు చేయాలని చెప్పిన పనులను మీరు చేయండి.
5 కొంత మంది లేవీయులు పవిత్రస్థలంలో నిలబడాలి. ప్రజలలో ప్రతి వంశంవారికి సహాయపడే నిమిత్తం, మీరలా నిలబడండి.
6 పస్కా గొఱెపిల్లను వధించి యెహోవా సేవకు మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసికొనండి. మీ సోదరులైన ఇశ్రాయేలీయుల కొరకు గొఱెపిల్లలను సిద్ధం చేయండి. యెహోవా మనలను ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి. యెహోవా తన ధర్మాన్ని మోషేద్వారా మనకు ప్రసాదించాడు.”
7 పస్కా బలులుగా అర్పించేటందుకు ఇశ్రాయేలు ప్రజలకు యోషీయా ముప్పైవేల గొఱ్ఱెలను ఇచ్చాడు. ప్రజలకు అతడింకా మూడువేల పశువులను కూడా ఇచ్చాడు. ఈ జంతువులన్నీ రాజైన యోషీయా పశుసంపద నుండి ఇవ్వబడినాయి.
8 పస్కా పండుగలో వినియోగించే నిమిత్తం ప్రజలకు, యాజకులకు, లేవీయులకు జంతువులను, ఇతర వస్తువులను కూడా యోషీయా అధికారులు ఉదారంగా ఇచ్చారు. ప్రధాన యాజకుడు హిల్కీయా, జెకర్యా, యెహీయేలు అనువారు ఆలయ నిర్వహణాధికారులు. వారు యాజకులకు పస్కాబలుల నిమిత్తం రెండువేల ఆరువందల గొఱ్ఱె పిల్లలను, మేకలను, మరియు మూడువందల గిత్తలను ఇచ్చారు.
9 పైగా కొనన్యా, అతని సోదరులు షెమయా మరియు నెతనేలు, మరియు హషబ్యా, యెహీయేలు, యోజాబాదు లేవీయులకు పస్కా బలులకుగాను ఐదువందల గొఱ్ఱెలను, మేకలను, మరియు ఐదువందల కోడె దూడలను ఇచ్చారు. వారంతా లేవీయుల పెద్దలు.
10 పస్కా సేవ ప్రారంభానికి సమస్తము సిద్ధం చేయబడిన తరువాత యాజకులు, లేవీయులు వారి వారి నియమిత స్థానాలకు వెళ్లారు. రాజు ఆమేరకు వారిని ఆజ్ఞాపించాడు.
11 పస్కా గొఱ్ఱె పిల్లలు చంపబడ్డాయి. తరువాత లేవీయులు ఆ జంతువుల చర్మాలను ఒలిచి, వాటి రక్తాన్ని యాజకులకు ఇచ్చారు. యాజకులు రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.
12 పిమ్మట బలియిచ్చిన ఆ జంతువులను దహనబలులకుగాను వివిధ వంశాల వారికి యిచ్చారు. మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా దహనబలులు జరగటానికే ఇది ఈ విధంగా చేయబడింది.
13 లేవీయులు పస్కా బలుల మాంసాన్ని ధర్మశాస్త్ర ప్రకారం అగ్నిలో కాల్చారు. పవిత్ర అర్పణలను వారు కుండలలోను, పాత్రలలోను, పెనముల మీద వుడకబెట్టారు. వారు తక్షణమే ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టారు.
14 ఇది జరిగిన తరువాత లేవీయులు, అహరోను సంతతి యాజకులు తమ వంతు మంసాన్ని తీసుకున్నారు. ఆ యాజకులు చీకటి పడేవరకు పనిలో నిమగ్నమయ్యారు. దహనబలి మంసాన్ని అర్పణల కొవ్వును కాల్చడంలో వారు కష్టపడి పనిచేశారు.
15 రాజైన దావీదు నిర్ణయించిన స్థలంలో ఆసాపు వంశీయులగు లేవీ గాయకులు నిలబడ్డారు. వారు ఆసాపు, హేమాను, మరియు రాజు యొక్క ప్రవక్త యెదూతూను. ప్రతిద్వారం వద్ద నున్న ద్వారపాలకులు తమ తమ స్థానాలు వదలవలసిన అవసరం లేకుండ వారి సోదరులగు లేవీయులు అన్నీ సిద్ధంచేసి వారి పస్కా అవసరాలన్నీ తీర్చారు.
16 రాజైన యోషీయా ఆజ్ఞాపించిన విధంగా ఆరోజు యెహోవా ఆరాధనకు సమస్తం ఏర్పాటు చేయబడింది. పస్కా పండుగ జరుపబడింది. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించబడ్డాయి.
17 అక్కడున్న ఇశ్రాయేలీయులంతా పస్కాను, పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు.
18 ప్రవక్తయగు సమూయేలు జీవించియున్న కాలంనుండి ఈ రకంగా పస్కా పండుగ జరుప బడలేదు! ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు గతంలో ఇంత ఘనంగా పస్కాపండుగ జరుపలేదు. రాజైన యోషీయా, యాజకులు, లేవీయులు, అక్కడున్న యూదా మరియు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము వాసులతో కలిసి పస్కా పండుగను ఘనంగా ఒక ప్రత్యేక పద్ధతిలో జరిపారు.
19 యోషీయా రాజ్యపాలనలో పదునెనిమిదవ సంవత్సరం గడుస్తూ వున్నప్పుడు ఈ పస్కా పండుగ జరుపబడింది.
20 యోషీయా ఆలయం విషయంలో ఈ మంచి పనులన్నీ చేసిన పిమ్మట రాజైన నెకో యూఫ్రటీసు నదీతీర పట్టణమైన కర్కెమీషు మీదికి దండెత్తి వచ్చాడు. నెకో ఈజిప్టు రాజు. రాజైన యోషీయా నెకోను ఎదిరించటానికి బయలుదేరి వెళ్లాడు.
21 కాని నెకో యోషీయా వద్దకు దూతలను పంపాడు. వారు యిలా అన్నారు: “యోషీయా రాజా, ఈ యుద్ధం నీకు సంబంధించినదిగాదు. నేను నీమీద యుద్ధానికి రాలేదు. నేను నా శత్రువుతో పోరాడటానికి వచ్చాను. దేవుడు నన్ను తొందరచేసి పంపినాడు. దేవుడు నా పక్షాన వున్నాడు. కావున నీవు అనవసరమైన శ్రమ తీసుకోవద్దు. నీవు గనుక నాతో యుద్ధం చేస్తే. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు!”
22 కాని యోషీయా వెళ్లి పోలేదు. అతడు నెకోతో యుద్ధం చేయటానికే నిశ్చయించాడు. అందువల్ల అతడు తన వేషం మార్చుకొని యుద్ధానికి వెళ్లాడు. దేవుని ఆజ్ఞ విషయంలో నెకో చెప్పిన దానిని యోషీయా వినటానికి నిరాకరించాడు. మెగిద్దో మైదానంలో యుద్ధం చేయటానికి యోషీయా వెళ్లాడు.
23 రాజైన యోషీయా యుద్ధంలో వుండగా, అతడు బాణాలతో కొట్టబడ్డాడు. అతడు తన సేవకులతో, “నన్ను దూరంగా తీసుకొని వెళ్లండి. నేను తీవ్రంగా గాయపడ్డాను!” అని చెప్పాడు.
24 దానితో అతని సేవకులు యోషీయాను అతని రథం నుండి దించి తనతో యుద్ధరంగానికి తెచ్చిన మరియొక రథంలో అతనిని వుంచారు. వారు యోషీయాను యెరూషలేముకు తీసికొని వచ్చారు. రాజైన యోషీయా యెరూషలేములో చనిపోయాడు. తన పూర్వీకులు వుంచబడిన సమాధులలోనే యోషీయా సమాధి చేయబడినాడు. యోషీయా చనిపోయినందుకు యూదా, యెరూషలేము ప్రజలంతా చాలా దుఃఖించారు.
25 యోషీయాపై యిర్మీయా కొన్ని ప్రగాఢ విలాపగీతికులు వ్రాశాడు. ఆ విలాపగీతాలు ఆలపిస్తూ స్త్రీ పురుష గాయకులు ఈనాటికీ యోషీయాను తలచుకొని గౌరవిస్తారు. యోషీయాను తలుస్తూ ఒక విలాపగీతం ఆలపించటం ఇశ్రాయేలీయులకు వాడుక అయ్యింది. ఆ గీతికలు విలాప వాక్యములలో పొందుపర్చబడినాయి.
26 [This verse may not be a part of this translation]
27 [This verse may not be a part of this translation]
1 యెరూషలేములో కొత్త రాజుగా యూదా ప్రజలు యెహోయాహాజును ఎన్నుకొన్నారు. యెహోయాహాజు యోషీయా కుమారుడు.
2 యుదాకు రాజయ్యేనాటికి యెహోయాహాజు ఇరువది మూడేండ్లవాడు. అతడు యెరూషలేములో మూడు నెలలపాటు రాజుగా వున్నాడు.
3 పిమ్మట ఈజిప్టు రాజైన నెకో యెహోయాహాజును బందీగా పట్టుకున్నాడు. నెకో యూదా ప్రజలను రెండువందల మణుగుల (మూడు ముప్పావు టన్నులు) వెండిని, రెండు మణుగుల (డెబ్బదియైదు పౌనులు) బంగారాన్ని అపరాధ రుసుముగా చెల్లించేలా చేశాడు.
4 యెహోయాహాజు సోదరుని యూదా, యెరూషలేములపై నూతన రాజుగా నెకో నియమించాడు. యెహోయాహాజు సోదరుని పేరు ఎల్యాకీము. పిమ్మట ఎల్యాకీముకు నెకో ఒక క్రొత్త పేరు పెట్టాడు. అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టాడు. కాని యెహోయాహాజును నెకో ఈజిప్టుకు తీసికొని వెళ్లాడు.
5 యూదాకు కొత్త రాజయ్యేనాటికి యెహోయాకీము ఇరువదియైదేండ్లవాడు. యెహోవా కోరిన విధంగా యెహోయాకీము ధ ర్మంగా ప్రవర్తించలేదు. దేవుడైన యెహోవా పట్ల అతడు పాపం చేశాడు.
6 బబులోను (బాబిలోనియా) రాజైననెబుకద్నెజరు యూదాపై దండెత్తి వచ్చాడు. అతడు యెహోయాకీమును బందీగాచేసి అతనికి కంచు గొలుసులు తగిలించాడు. తరువాత యెహోయాకీముమును నెబుకద్నెజరు బబులోనుకు తీసికొని వెళ్లాడు.
7 యెహోవా ఆలయం నుండి నెబుకద్నెజరు కొన్ని వస్తువులను దోచుకుపోయాడు. అతడా వస్తువులను బబులోనుకు పట్టుకుపోయి వాటిని తన స్వంత ఇల్లయిన రాజగృహంలో వుంచాడు.
8 యెహోవాయాకీము చేసిన ఇతర విషయాలు, అతడు చేసిన భయంకరమైన పాపాలు, మరియు అతనిని దోషిగా నిరూపించే అతని ప్రతి కార్యం గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. యెహోయాకీము స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను కొత్తగా రాజయ్యాడు.
9 యూదాకు రాజయ్యేనాటికి యెహోయాకీను పద్దెనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు రాజుగా వున్నాడు. యెహోవా కోరిన విధంగా అతడు తన కార్యాలను నిర్వర్తించలేదు. యెహోవా పట్ల యెహోయాకీను పాపం చేశాడు.
10 వసంత ఋతువులో యెహోయాకీనును పట్టి తెమ్మని రాజైన నెబకద్నెజరు తన మనుష్యులను పంపాడు. వారు యెహోయాకీనును, యెహోవా ఆలయం నుండి కొన్ని ధనరాసులను బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు నూతన రాజుగా సిద్కియాను నెబకద్నెజరు నియమించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు బంధువు.
11 యూదాకు రాజుయ్యేనాటికి సిద్కియా ఇరువైఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు.
12 యెహోవా కోరినట్లు సిద్కియా ఉత్తమ కార్యాలు చేయలేదు. యెహోవా పట్ల సిద్కియా పాపం చేశాడు. దేవుని ముందు అతడు వినయ విధేయతలు చూపించలేదు. ప్రవక్త యిర్మీయా చెప్పిన విషయాలను పాటించలేదు. యెహోవా సందేశాన్ని యిర్మీయా ప్రవచించాడు.
13 రాజైన నెబుకద్నెజరుపై సిద్కియా తిరుగుబాటు చేశాడు. గతంలో నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియాతో బలవంతంగా నెబుకద్నెజరు ప్రమాణం చేయించాడు. నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియా దేవుని మీద ప్రమాణం చేశాడు. కాని సిద్కియా తన జీవన విధానం మార్చుకొని, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా మాటవిని, ఆయనకు విధేయుడైయుండటానికి నిరాకరించి మొండి వైఖరి దాల్చాడు.
14 యాజకుల నాయకులు, యూదా ప్రజల నాయకులంతా కూడా మరీ ఎక్కువ పాపం చేసి, యెహోవాకు విశ్వాస ఘాతకులయ్యారు. వారు అన్యదేశీయుల చెడు మార్గాన్నే అనుసరించారు. ఆ నాయకులంతా యెహోవా ఆలయాన్ని అపవిత్రపర్చి పాడుచేశారు. యెరూషలేములో ఆలయాన్ని యెహోవా పవి త్రపర్చాడు.
15 తమ పూర్వీకుల దేవుడగు యెహోవా తన ప్రజలను హెచ్చిరించటానికి అనేక పర్యాయములు ప్రవక్తలను పంపినాడు. తన ప్రజలపట్ల, తన ఆలయంపట్ల సానుభూతిగలవాడుగుటచే యెహోవా అలా చేస్తూ వచ్చాడు. యెహోవా తన ప్రజలనుగాని, తన ఆలయాన్నిగాని నాశనం చేయదల్చలేదు.
16 కాని దేవుని యొక్క ప్రజలే దేవుడు పంపిన ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారు ప్రవక్తలు చెప్పేదానిని వినలేదు. వారు దేవుని వర్తమానములను అసహ్యించుకున్నారు. ఆఖరికి దేవుడు తన కోపాన్ని ఎంత మాత్రమూ ఆపుకోలేకపోయాడు. దేవుడు తన ప్రజలపట్ల కోపపడ్డాడు. ఆ కోపాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు.
17 అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు . బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రమం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధలను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు.
18 ఆలయంలోని వస్తులన్నిటినీ నెబుకద్నెజరు బబులోనుకు పట్టుకుపోయాడు. ఆలయంలోను, రాజువద్ద, రాజు యొక్క అధికారులవద్దగల విలువైన వస్తువులన్నిటినీ అతడు పట్టుకుపోయాడు.
19 నెబుకద్నెజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, రాజాధికారులకు చెందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి విలువైన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం చేయటంగాని చేశారు.
20 చనిపోగా మిగిలిన ప్రజలను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వెళ్లి బానిసలుగా పనిచేయించాడు. పర్షియా రాజ్యం (పారసీకము) బబులోను రాజాన్ని ఓడించేవరకు ఆ ప్రజలు బబులోనులో బానిసలుగా వుండి పోయారు.
21 ప్రవక్తయగు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చెప్పిన విషయాలన్నీ ఆ విధంగా సంభవించాయి. యిర్మీయా ద్వారా యెహోవా యిలా చెప్పినాడు: “ఈ ప్రదేశం డెబ్బది యేండ్లపాటు బంజరు భూమిగా మారిపోతుంది. ప్రజలు సబ్బాతు దినాలను పాటించని కారణాన, దానికి పరిహారంగా ఇది జరుగుతుంది.”
22 పర్షియా (పారసీక) రాజు కోరెషు (సైరస్) పాలన మొదటి సంవత్సరంలో ఈ విధంగా జరిగింది. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసినాడు. యెహోవా సైరస్ హృదయాన్ని స్పందింపజేసి, అతనిచే ఒక ఆజ్ఞ వ్రాయించి దూతల ద్వారా తన రాజ్యమంతా ప్రకటింపజేసినాడు:
23 పర్షియా రాజైన కోరెషు తెలియజేయున దేమనగా: ఆకాశమందు ప్రభువైన యెహోవా నన్ను ఈ భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలేములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు అప్పజెప్పినాడు. దేవుని ప్రజలైన మీరంతా ఇప్పుడు యెరూషలేము వెళ్లటానికి స్వేచ్ఛ కలిగియున్నారు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై వుండుగాక.