1 దావీదు రాజు బాగా ముసలివాడయ్యాడు. అందువల్ల అతను చలికి తట్టుకోలేకపోయాడు. తన సేవకులు ఎన్ని దుప్పట్లు కప్పినాగాని, అతను చలికి వణకి పోతూనే వున్నాడు.
2 కావున ఆయన సేవకులు ఆయనతో, “నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్త్తాము. ఆమె నీ పక్కలో పండుకొని నీకు తగిన వెచ్చదనం సమకూర్చుతుంది.” అని అన్నారు.
3 అలా చెప్పి రాజు సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయురాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు.
4 ఆమె చాలా అందగత్తె, ఆమె రాజుపట్ల శ్రద్ధ తీసుకొని, అతనికి సేవలు చేయనారంభించింది. కాని రాజైన దావీదు ఆమెను కూడలేదు.
5 [This verse may not be a part of this translation]
6 [This verse may not be a part of this translation]
7 సెరూయా కుమారుడైన యోవాబుతోను, యాజకుడైన అబ్యాతారుతోను అదోనీయా మాట్లాడాడు. అతడు రాజు అయ్యేలాగ వారు సహాయం చేయడానికి అంగీకరించారు.
8 కాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని వారిలో యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, మరియు దావీదు రాజుయొక్క ప్రత్యేక అంగరక్షకుడైన రేయీ వుండిరి. అందువల్ల వీరు అదోనీయాతో కలియలేదు.
9 అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. అతడు కొన్ని గొర్రెలను, ఆవులను, మరియు కొన్ని బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. అదోనీయా ఈ బలులన్నీ ఏన్‌రోగేలు దగ్గరవున్న జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమానికి అదోనీయా చాలామందిని ఆహ్వానించాడు. రాజైన దావీదుయొక్క ఇతర కుమారులను, యూదా పాలకులు, నాయకులందరినీ అదోనీయా ఆహ్వానించాడు.
10 కాని అదోనీయా ప్రవక్తయగు నాతానును గాని, బెనాయానును గాని, తన తండ్రియొక్క ప్రత్యేక అంగరక్షకుని గాని, లేక తన సోదరుడు సొలొమోనును గాని ఆహ్వానించలేదు.
11 ఇదంతా విన్న నాతాను, సొలొమోను తల్లియైన బత్షెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. మన యజమానియైన దావీదు కూడ ఈ విషయం ఎరుగడు.
12 నీ జీవితం, నీ కుమారుడైన సొలొమోను జీవితం ప్రమాదంలో పడవచ్చు. మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే నీవు ఏమి చేయాలో నేను చెపుతాను.
13 దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
14 నీవు అలా మాట్లాడుతూ వుండగా నేను లోపలికి వస్తాను. వచ్చి, నీవు అదోనీయా గురించి చెప్పినదంతా నిజమని రాజుతో నేను చెపుతాను.”
15 తరువాత బత్షెబ రాజును చూడటానికి ఆయన పడకగదిలోనికి వెళ్లింది. రాజు ముసలివాడయ్యాడు. షూనేమీయురాలగు అబీషగు అక్కడ ఆయనకు సేవచేస్తూ వున్నది.
16 బత్షెబ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసింది. “నీకు ఏమి కావాలి?” అని రాజు ప్రశ్నించాడు.
17 బత్షెబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన నీ దేవుని పేరు మీద నీవు నాకు ఒక ప్రమాణం చేశావు. ‘నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు. నా సింహసనం మీద సొలొమోను రాజ్య పాలన చేస్తాడు’ అని అన్నావు.
18 కాని ఇప్పుడు అదోనీయా రాజయ్యాడు. అయినా ఆ విషయం నీకు తెలియదు.
19 సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. మరియు నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడైన అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే నా కుమారుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించ లేదు.
20 మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నిన్ను గమనిస్తూ వున్నారు. నీ తరువాత నీవు ఎవరిని రాజుగా నియమిస్తావో? అని వారు ఎదురు చూస్తూ వున్నారు.
21 నీ మరణానంతం, నీ పితరులతో నీవు సమాధి చేయబడతావు. ప్రజలు మాత్రం నేను, సొలొమోను నేరస్థులమని భావిస్తారు.”
22 బత్షెబ ఇలా రాజుతో మాట్లాడుతూ వుండగా, ప్రవక్తయగు నాతాను రాజును చూడటానికి వచ్చాడు.
23 “ప్రవక్తయగు నాతాను ఇక్కడికి వచ్చాడు” అని సేవకులు రాజుతో చెప్పారు. నాతాను రాజువద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు.
24 నాతాను రాజుతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య పాలనకు కొత్త రాజుగా అదోనీయాను ప్రకటించావా?, నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను నియమించాలని నిర్ణయించావా?
25 ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులంనదరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు.
26 కాని అతను నన్నుగాని, యాజకుడైన సాదోకును గాని, యెహోయాదా కుమారుడైన బెనాయాను గాని, నీ కుమారుడైన సొలొమోనును గాని పిలువలేదు.
27 ఇదంతా చేసింది నీవేనా? మేము నిన్ను సేవిస్తూనీకు విధేయులమైయున్నాము కదా, అయినను నీ తరువాత నీ వారసుడుగా ఎవరిని ఎన్నుకున్నదీ మాకు ఎందుకు చెప్పలేదు?”
28 ఇది విన్న రాజు బత్షెబను పిలువనంపాడు. రాజు ముందుకు బత్షెబ వచ్చింది.
29 అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను:
30 గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెర వేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”
31 తరువాత బత్షెబ రాజుముందు సాగిలపడి, “రాజైన దావీదు వర్ధిల్లు గాక!” అని అన్నది.
32 రాజైన దావీదు అప్పుడు “యాజకుడగు సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలువనంపాడు.” వారు ముగ్గురూ రాజు వద్దకు వచ్చారు.
33 “మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ దగ్గరకు తీసుకొని వెళ్లండి.
34 అక్కడ యాజకుడైన సాదోకు, ప్రవక్తయగు నాతాను అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయాలి. బూర ఊది ‘ఇదిగో కొత్తరాజు సొలొమోను!’ అని చాటాలి.
35 తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను, “ అని రాజైన దావీదు వారితో అన్నాడు.
36 యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక!
37 యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయ పడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు.
38 కావున సాదోకు, నాతాను, బెనాయా, రాజు యొక్క సేవకులు రాజాజ్ఞ శిరసావహించారు. సొలొమోనును రాజు యొక్క కంచర గాడిదపై ఎక్కించి వారతనితో గిహోనుకు వెళ్లారు.
39 యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు.
40 ఆ ప్రజలంతా సొలొమోనుతో కలిసి నగరానికి వచ్చారు. వారు పిల్లనగ్రోవులను ఊదుతూ, జయజయ ధ్వనులు చేయసాగారు. వారు సంతోషంతో భూమి అదిరేలా కేకలేశారు.
41 ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
42 యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, లోనికి రా! నీవు చాలా మంచివాడవు . నీవు ఏదైనా మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు.
43 కాని యోనాతాను ఇలా సమాధాన మిచ్చాడు, “కాదు! ఇది నీకు శుభవార్త కాదు. మన రాజైన దావీదు సొలొమోనును రాజుగా ప్రకటించాడు.
44 రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. వారు సొలొమోనును రాజు యొక్క స్వంత కంచర గాడిదపై కూర్చుండబెట్టారు.
45 తరువాత యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సొలొమోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వారుప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప్రజలు వారిననుసరించి వెళ్లారు. కావున ఇప్పుడు నగరంలో జనంమంతా చాలా సంతోషంగా వున్నారు. ఆ శబ్ధమే మీరిప్పుడు వింటున్నారు.
46 సొలొమోను ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్నాడు.
47 రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు వద్దకు అతను మంచిపని చేసినట్లు చెప్పటానికి వచ్చారు. వారంతా, ‘దావీదు రాజా, నీవు చాలా గొప్ప రాజువి! కాని నీ దేవుడు సొలొమోనును కూడ ఒక గొప్పరాజుగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ దేవుడు సొలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు చేయునుగాక!’ అని అంటున్నారు. యోనాతాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీయాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: “తరువాత రాజైన దావీదు దేవుని ప్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ పడ్డాడు.
48 ‘ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవాకు జయమగును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది నేను చూడగలిగేలా చేశాడు’ అని దావీదు రాజు అన్నాడు.”
49 ఇది విన్న అదోనీయా, అతిథులందరూ భయపడి అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు.
50 అదోనీయా కూడ సొలొమోనుకు భయపడ్డాడు. కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు కొమ్ములను పట్టుకున్నాడు.
51 ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు.
52 అది విన్న సొలొమోను, “అదోనీయా గనుక బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క వెంట్రుక కూడ రాలదని నేను ప్రమాణం చేస్తున్నాను. కాని అతడేమైనా పొరపాటు చేస్తే, వాడు చావటం ఖాయం”అని అన్నాడు.
53 అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.
1 దావీదుకు మరణకాలం సమీపించింది. కావున దావీదు సొలొమోనును పిలిచి ఇలా అన్నాడు:
2 “నాకు మరణకాలం సమీపించింది. నీవు మంచివానిగా, సమర్థవంతమైన నాయకునిగా పేరు తెచ్చుకో.
3 దేవుని ఆజ్ఞలన్నీ శిరసావహించు. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన ఆదేశాలన్నిటినీ పాటించు. ఆయన ధర్మశాస్త్రాలను పాటిస్తూ, ఆయన మనకు చెప్పిన వన్నీచేయి. మోషే ధర్మశాస్త్రంలో నిర్దేశించిన సూత్రాలన్నిటినీ పాటించు. ఇవన్నీ నీవు పాటిస్తే, నీవు ఏది చేసినా, నీవు వెళ్లిన ప్రతి చోటా నీకు విజయం చేకూరుతుంది.
4 నీవు యెహోవాకు విధేయుడవయివుంటే, ఆయన నాగురించి చేసిన ప్రమాణం నెరవేర్చుతాడు. యెహోవా నాకు చేసిన వాగ్దానమిది: “నీవారు నా ఆదేశ సూత్రాలను అనుసరించి తీరాలి. నేను నిర్దేశించినరీతిగా జీవితం గడపాలి. నీ కుమారులు సంపూర్ణ హృదయంతో, ఆత్మసాక్షిగా నాలో విశ్వాసం కలిగివుండాలి. నీ కుమారులు ఇవన్నీ చేస్తే, నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఇశ్రాయేలు ప్రజలపై పాలకుడుగా వుంటాడు.”
5 “సెరూయా కుమారుడైన యోవాబు నాకు ఏమి చేసినదీ నీవు గుర్తు పెట్టుకోవాలి కూడ. ఇశ్రాయేలు సైన్యాల ఇద్దరు అధిపతులను అతడు చంపాడు. నేరు కుమారుడైన అబ్నేరును, యెతెరు కుమారుడైన అమాశాను అతడు చంపాడు. అతడు వారిని శాంతి నెలకొన్న రోజులలో చంపిన విషయం నీవు గుర్తుంచు కోవాలి. వారు యుద్ధ సమయంలో ప్రజలను చంపారనే కోపంతో అతడా పని చేశాడు. కాని చంపబడిన ఆ ఇద్దరు సేనాధిపతులు అమాయకులు. కావున నేనతనిని శిక్షించాలి.
6 కాని ఇప్పుడు నీవు రాజువు. నీవు ఏది మిక్కిలి తెలివైన పద్దతి అనుకుంటే దానిద్వారా అతనిని శిక్షించాలి. అంటే అతడు ఖచ్చితంగా చంపబడాలి.”
7 “గిలాదీయుడైన బర్జిల్లయి కుమారుల పట్ల నీవు దయగలిగి వుండాలి. వారిని నీ స్నేహితులుగా స్వీకరించి, వారు నీ బల్లవద్ద విందారగించేలా చూడు. నీ సోదరుడగు అబ్షాలోము నుండి నేను పారిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు.
8 “గెరా కుమారుడగు షిమీ నీవద్దనే వున్నట్లు నీవు గమనించాలి. ఇతడు బెన్యామీనీయుడు. బహూరీముపురవాసి. నేను మహనయీముకు వెళ్లిన రోజున ఇతడు నాకు వ్యతిరేకంగా చాలా చెడు మాటలు మాట్లాడాడు. ఇతడు మరల యోర్థాను నది వద్ద నన్ను కలవటానికి వచ్చాడు. నేను యెహోవా ముందు ప్రమాణం చేసిషిమీని నేను చంపనని చెప్పాను.
9 కావున నీవు వానిని శిక్షింపకుండా వదలవద్దు. నీవు తెలివిగలవాడవు. వానికి ఏమి చేయాలో నీకు తెలుసు. వాడు వృద్దాప్యంలో ప్రశాంతంగా చనిపోయేలా విడువవద్దు.”
10 ఇవన్నీ చెప్పి దావీదు చనిపోయాడు. దావీదు నగరంలో అతడు సమాధి చేయబడ్డాడు.
11 దావీదు నలభై సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పరిపాలించాడు. అతడు హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్పై మూడు సంవత్సరాలు పాలించాడు.
12 ఇప్పుడు సొలొమోను తన తండ్రియగు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతడు రాజు అని చెప్పటానికి ఏరకమైన అనుమానం లేదు .
13 ఈ సమయంలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ వద్దకు వెళ్లాడు. “నీవు సమాధానంతో వచ్చావా?”అని బత్షెబ అతనిని అడిగింది. “అవును. ఐక్యత కోసమే ఈ సందర్శనం.
14 నీకు ఒక విషయం నేను చెప్పాలి” అని అదోనీయా సమాధానం చెప్పాడు. “అయితే మాట్లాడు”అన్నది బత్షెబ.
15 అదోనీయా ఇలా చెప్పాడు: “నీకు గుర్తుండే వుంటుంది, ఈ రాజ్యం ఒకప్పుడు నాది. ఇశ్రాయేలు ప్రజలంతా నేనే వారి రాజుననుకున్నారు. కాని పరిస్థితులు తారుమారైనాయి. ఇప్పుడు నా సోదరుడు రాజైనాడు. దేవుడు అతనిని రాజుగా ఎంపిక చేశాడు.
16 కావున నిన్ను నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. దయచేసి దానిని తిరస్కరించవద్దు.” “నీకేం కావాలి?”అని బత్షెబ అడిగింది.
17 “నాకు తెలుసు, రాజైన సొలొమోను నీవు ఏది చేయమంటే అది చేస్తాడని. అందువల్ల దయచేసి షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా యివ్వమని అతనిని అడుగు” అని అదోనీయా అన్నాడు.
18 “మంచిది, నీ తరపున నేను రాజుతో మాట్లాడ తాను” అని బత్షెబ అన్నది.
19 కావున రాజైన సొలొమోనుతో మాట్లాడ్డానికి బత్షెబ అతని వద్దకు వెళ్లింది. సొలొమోను ఆమెను చూచి కలుసుకొనేందుకు నిలబడ్డాడు. ఆమెకు వందనం చేసి, సింహాసనం మీద కూర్చున్నాడు. తన తల్లి కొరకు సేవకులతో మరో ఉన్నతాసనం తెప్పించాడు. అప్పుడామె అతనికి కుడి పక్కగా కూర్చున్నది.
20 “నిన్నొక చిన్న విషయం అడగాలని వచ్చాను. దయచేసి తిరస్కరించవద్దు” అని బత్షెబ అతనితో అన్నది. “నీవు ఏది కావాలంటే అది అడగవచ్చునమ్మా! నేనెప్పుడూ తిరస్కరించను” అని రాజు అన్నాడు.
21 “అయితే షూనేమీయురాలగు అబీషగును నీ సోదరుడైన అదోనీయా వివాహమాడుటకు అనుమతి ఇవ్వు” అని బత్షెబ అన్నది.
22 అది విన్న సొలొమోను రాజు, “అబీషగును అతని కిమ్మనే ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న గనుక అతను రాజు కావటానికి కూడా అనుమతి ఇమ్మని నన్నెందుకు అడగటం లేదు? యాజకుడైన అబ్యాతారు, యోవాబు కూడా అతనికి మద్దతు ఇస్తారేమో!” అని తన తల్లితో అన్నాడు.
23 అప్పుడు సొలొమోను యెహోవాకు ఒక ప్రమాణం చేశాడు. అతనిలా అన్నాడు: “అదోనీయానన్నిది అడిగినందుకు తగిన శాస్తి జరిగేలా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను! ఇది వాని ప్రాణానికే ముప్పుతెస్తుందని ప్రమాణ వూర్వకంగా చెపుతున్నాను!
24 ఇశ్రాయేలు రాజు కావటానికి యెహోవా నాకు అనుమతి ఇచ్చాడు. నా తండ్రియైన దావీదు సింహాసనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యాన్ని నాకు, నా ప్రజలకు ఇచ్చి యెహోవా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అదోనీయా ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాడని, ఇవన్నీ నెరవేర్చిన నిత్యుడైన యోహోవా ముందు ప్రమాణం చేసి చెపుతున్నాను!”
25 రాజైన సొలొమోను బెనాయాను పిలిచి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బెనాయా బయటికి వెళ్లి అదోనీయాను చంపేశాడు.
26 రాజైన సొలొమోను యాజకుడగు అబ్యాతారును పిలిచి, “నేను నిన్ను చంపివుండే వాడిని. కాని అనాతోతులో వున్న నీ ఇంటికి తిరిగి వెళ్లటానికి అనుమతి ఇస్తున్నాను. నిన్ను ఇప్పుడు చంపను. ఎందు వల్లనంటే నా తండ్రి దావీదుతో కలిసి వెళ్లేటప్పుడు నీవు యెహోవా పవిత్ర పెట్టె మోయుటలో సహాయ పడ్డావు. పైగా నీవు నా తండ్రి కష్ట సమయాలలో నీవాయనకు తోడుగా వున్నావని కూడా నాకు తెలుసు.”
27 అయితే ఇక నుంచి యెహోవా యాజకునిగా కొనసాగటానికి వీల్లేదని అబ్యాతారుతో సొలొమోను చెప్పాడు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో ఇప్పుడిది ఆ రకంగా జరిగింది. యెహోవా ఏలీని గురించి, అతని కుటుంబం గురించి షిలోహులో చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడిది జరిగింది.
28 యోవాబు జరిగినదంతా విని భయపడి పోయాడు. అతడు అదోనీయాకు మద్దతు యిచ్చాడు గాని, అబ్షాలోముకు వ్యతిరేకి అయ్యాడు. యోవాబు దేవుని గుడారంలోకి పారిపోయి బలిపీఠపు కొమ్ములను పట్టుకొన్నాడు.
29 యోవాబు దేవుని గుడారంలో బలి పీఠం వద్ద వున్నాడని ఎవరో పోయి రాజైన సొలొమోనుకు చెప్పారు. సొలొమోను బెనాయాను పిలచి యోవాబును చంపమన్నాడు.
30 బెనాయా యెహోవా గుడారంలోనికెళ్లి యోవాబుతో, “రాజు అతనిని బయటికి రమ్మంటున్నాడని”చెప్పాడు. “వద్దు, నేనిక్కడే చనిపోతాను” అని యోవాబు అన్నాడు. కావున బెనాయా తిరిగి వెళ్లి యోవాబు అన్న మాటలు రాజుకు చెప్పాడు.
31 “అయితే అతను చెప్పినట్లే చేయుము! వానిని అక్కడే చంపివేయుము. పిమ్మట వానిని పాతిపెట్టుము. అప్పుడు యోవాబు చేసిన పనుల యొక్క దోషం నా కుటుంబానికి, నాకు తగలకుండ పోతుంది. ఈ దోషమెందుకు వచ్చిందనగా యోవాబు అమాయకులను చంపాడు.
32 తనకంటె చాలా మంచివారిద్దరిని యోవాబు హత్య చేశాడు. వారిద్దరు నేరు కుమారుడైన అబ్నేరు, మరియు యెతెరు కుమారుడైన అమాశా. అబ్నేరు ఇశ్రాయేలు సైన్యాధిపతి. అమాశా యూదావారి సైన్యాధిపతి. అతడు వారిని చంపినట్లు నా తండ్రి దావీదుకు తెలియదు. కావున యెహోవా అతనికి తగిన శాస్తి చేస్తాడు.
33 “వాళ్ల చావుకు కారణమయిన అపరాధి అతనే. తన కుటుంబం కూడా శాశ్వతంగా ఈ నేరానికి బాధ్యులు. కాని దావీదుకు, అతని సింహాసనానికి దేవుడు శాశ్వతంగా శాంతిని చేకూర్చుతాడు.”
34 కావున యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి యోవాబును చంపాడు. యోవాబు శవాన్ని ఎడారిలో అతని ఇంటి సమీపాన పాతిపెట్టారు.
35 తరువాత యోవాబు స్థానంలో యెహోయాదా కుమారుడైన బెనాయాను సైన్యాధ్యక్షునిగా సొలొమోను నియమించాడు. సొలొమోను అబ్యాతారు స్థానంలో సొదోకును కొత్త ప్రధాన యాజకునిగా కూడా నియమించాడు.
36 తరువాత, షిమీని రాజు పిలిచాడు. రాజు షిమీతో, “ఇక్కడ యెరూషలేములో నీ కొరకై ఒక ఇల్లు నిర్మించుకో. నీవు అందులో నివసిస్తూ, నగరం వదిలి వెళ్లవద్దు.
37 నీవు నగరం వదిలి కిద్రోను వాగు దాటి వెళ్లితే గనుక, ఎవరో ఒకరు నిన్ను చంపుతారు. ఆ తప్పుకు నీవే బాధ్యుడవు” అని అన్నాడు.
38 అది విని షిమీ, “నా రాజా, నీవు చెప్పినది చాలా బాగున్నది. నేను నీకు విధేయుడనై వుంటాను” అని అన్నాడు. షిమీ యెరూషలేములో చాలాకాలం నివసించాడు.
39 కాని మూడు సంవత్సరాల తరువాత షిమీ యొక్క ఇద్దరు బానిసలు పారిపోయారు. వారు గాతు రాజు వద్దకు వెళ్లారు. ఆ రాజు పేరు ఆకీషు. అతడు మయకా కుమారుడు. తన బానిసలు గాతులో వున్నట్లు షిమీ విన్నాడు.
40 తన గాడిదపై గంతవేసి, దానిమీద గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్లాడు. అతడు తన బానిసలును వెదుక్కుంటూ వెళ్లాడు. వాళ్లను అక్కడ పట్టుకుని తన ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు.
41 కాని ఎవ్వరో సొలొమోను వద్దకు వెళ్లి షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి వచ్చాడని చెప్పారు.
42 అందువల్ల సొలొమోను షిమీని పిలిపించాడు. సొలొమోను అతనితో ఇలా అన్నాడు, “యెరూషలేము విడిచి వెళ్లితే నీవు చంపబడతావని నీకు తెలిసేలా నేను నీ చేత యెహోవా పేరు మీద ప్రమాణం చేయించాను. నీవు ఇక్కడినుండి ఎక్కడికైనా వెళ్లితే తత్ఫలితంగా సంభవించే నీ మరణానికి నీవే కారకుడవవుతావని కూడా నిన్ను నేను హెచ్చరించాను. నేను చెప్పినదానికి నీవు ఒప్పుకున్నావు. నాకు విధేయుడవై వుంటానని నీవు అన్నావు.
43 మరి నీ మాటను నీవు ఎందుకు నిలబెట్టుకోలేదు? నా ఆజ్ఞను నీవెందుకు శిరసావహించలేదు?
44 నీవు నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు నీకు గుర్తుండే వుంటాయి. ఆ తప్పులన్నిటికీ యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు.
45 కాని యెహోవానన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు సింహాసనాన్ని ఆయన ఎప్పుడూ సురక్షితంగా ఉంచుతాడు.”
46 పిమ్మట రాజు షిమీని చంపమని బెనాయాకు ఆజ్ఞ యివ్వగా అతను ఆ పని పూర్తి చేశాడు. అప్పుడు సొలొమోను తన రాజ్యాన్ని పూర్తిగా తన అదుపులోకి తెచ్చెకున్నాడు.
1 సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింప చేస్తూనేవున్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడకూడా నిర్మిస్తున్నాడు.
2 దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై వున్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూండేవారు.
3 యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పింది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొన సాగించటం.
4 సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు.
5 సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా ఆయనకు స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను”అని యెహోవా అన్నాడు.
6 సొలొమోను ఇలా అన్నాడు:”నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. ఆయన నిన్ననుసరించాడు. ఆయన కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవాయన కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు ఆయనకు అపూర్వమైన కరుణ చూపావు.
7 నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పనివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది.
8 నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్క పెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకానేక నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది.
9 అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానములేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.”
10 సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు.
11 అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు.
12 కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు”
13 పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు.
14 నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.”
15 సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో కలలో మాట్లాడినట్లు తెలుసుకొన్నాడు. సొలొమోను తరువాత యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒడంబడిక పెట్టె ముందు నిల్చున్నాడు. సొలొమోను యెహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరువాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగావున్న నాయకులకు, అధికారులందరికీ విందు ఇచ్చాడు.
16 ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు.
17 ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, నేను ఒకే ఇంట్లో నివసిస్తూ వుంటాము. మేమిద్దరం గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనేవుంది.
18 మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో మరెవ్వరూ లేరు. కేవలం మేమిద్దరమే వుంటున్నాము.
19 ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది.
20 అప్పుడు ఆమె ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద వుంచింది.
21 మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్లు గమనించాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా బిడ్డ కాదని కనుగొన్నాను.”
22 కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బతికివున్న బిడ్డేనా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది. అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు పొరాపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. బతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు.
23 ఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ బతికివున్న బిడ్డ ‘నాదే’ అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని అంటున్నారు”అని అన్నాడు.
24 అప్పుడు సొలొమోను రాజు తన సేవకుడిని పంపి ఒక కత్తి తెప్పించాడు.
25 సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. బతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!”
26 ఇది విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా పోతుంది” అని అన్నది. కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి, “ అని అన్నది.
27 సొలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన తల్లి ఆమెయే!”
28 ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్పును విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయుటలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం ఉన్నట్లు వారు గమనించారు.
1 ఇశ్రాయేలు ప్రజలందరి పైన సొలొమోను రాజు పరిపాలన సాగించాడు.
2 తన పరిపాలనలో అతనికి సహాయ పడిన ప్రముఖమైన అధికారుల పేర్లు ఇవి: సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు.
3 షీషా కుమారులైన ఎలీహోరెపు మరియు అహీయా న్యాయస్థానాలలో జరిగే వాగ్వాదములు, తీర్పులు మొదలగు వాటిని గ్రంధస్థం చేసే లేఖకులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు చరిత్రకారుడు.
4 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధ్యక్షుడు. సాదోకు, అబ్యాతారు యాజకులు.
5 నాతాను కుమారుడు అజర్యా మండలాధిపతుల మీద అధికారి. నాతాను కుమారుడైన జాబూదు అంతఃపుర యాజకుడే గాక రాజైన సొలొమోనుకు సలహాదారుడు.
6 అహీషారు రాజు యొక్క ఇంటి నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవాడు. అబ్దా కుమారుడైన అదోనిరాము బానిసలకు అధిపతి.
7 ఇశ్రాయేలును పరిపాలనా సౌలభ్యం కొరకు మండలాల పేరుతో పన్నెండు ప్రాంతాలుగా విభజించారు. ప్రతి మండల పాలనకు రాజైన సొలొమోను ఒక పాలకుని ఎంపిక చేశాడు. ఈ పన్నెండుగురు మండలాధిపతులు రాజుకు, రాజ కుటుంబానికి ఆహారధాన్యాలు, తదితర తిను బండారాలు సేకరించి పంపేలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ పన్నెండుగురు పాలకులలో ఒక్కొక్కడు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహర పదార్థాలు సేకరించి రాజుకు పంపే బాధ్యత వహిస్తాడు.
8 ఆ పన్నెండుగురు మండలాధిపతుల పేర్లు ఇవి: బెన్-హూరు కొండల ప్రాంతమైన ఎఫ్రాయిమునందు పాలకుడు;
9 బెన్-దెకెరు అనునతను మాకస్సు, షయల్బీము, బేత్షెమెషులోను మరియు ఏలోన్భెధానానులోను;
10 బెన్-హెసెదు అనువాడు అరుబ్భోతు, శోకో మరియు హెపెరులోను;
11 బెన్-అబీనాదాబు నఫోతు దోరులోను (ఇతడు సొలొమోను కుమారైయగు టాపాతును వివాహ మాడాడు);
12 అహీలూదు కుమారుడైన బయనా అనువాడు తానాకు, మెగిద్దో మరియు సారెతాను పక్కనున్న బేత్షెయాను ప్రాంతమంతటికీ; (ఈ ప్రాంతం యెజ్రెయేలు దిగువ బేత్షెయాను మొదలుకొని ఆబేల్మే హోలా వరకు యొక్నెయాముకు అడ్డముగా వ్యాపించి ఉన్నది)
13 బెన్-గెబెరు అనునతను రామోత్గిలాదులోను; (ఇతడు గిలాదులోని మనష్షే కుమారుడైన యాయీరు పట్టణాలు, గ్రామాలపైన పాలకుడు. ఇతనింకా బాషానులో ఉన్న అర్గోబు మండల ప్రాంత మునకు కూడా పాలకుడుగా నియమింపబడ్డాడు. ఈ ప్రాంతంలో చుట్టూ ప్రాకారాలున్న అరువది నగరాలున్నాయి. ఈ నగరాలన్నిటికీ ద్వారాల మీద కంచు కడ్డీలు ఏర్పాటు చేయబడ్డాయి).
14 ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములోను;
15 అహీమయస్సు అనునతడు నఫ్తాలీములోను, ఇతడు సొలొమోను కుమార్తెయగు బాశెమతును వివాహమాడాడు;
16 హూషై కుమారుడగు బయనా ఆషేరులోను, ఆలోతులోను;
17 పరూయహు కుమారుడగు యెహోషాపాతు ఇశ్శాఖారు ప్రాంతంలోను;
18 ఏలా కుమారుడగు షిమీ బెన్యామీనులోను; సొలొమోను కింది అధికారులు, పాలకులు
19 ఊరి కుమారుడైన గెబెరు అనునతడు గిలాదులోను అధిపతులుగా నియమింపబడ్డారు. (గిలాదు ప్రాంతంలో అమోరీయులకు రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు నివసించేవారు). కాని ఆ ప్రాంత మంతటికీ గెబెరు ఒక్కడు మాత్రమే పాలకుడుగా నియమితుడయ్యాడు.
20 యూదాలోను, ఇశ్రాయేలులోను జనాభా విపరీతంగా పెరిగింది. సముద్రతీరాన ఇసుక రేణువులా ప్రజానీకం విస్తరించింది. ప్రజలంతా సుఖసంతోషాలతో తింటూ, తాగుతూ, విలాసంగా జీవిస్తూవున్నారు.
21 యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల రాజ్యం వరకుగల రాజ్యాలన్నిటిపైన సొలొమోను పరిపాలన సాగించాడు. అతని రాజ్యం ఈజిప్టు సరిహద్దుల వరకు వ్యాపించింది. ఈ సామ్రాజ్యాధి పతులంతా సొలొమోను ఆధిపత్యాన్ని అతని జీవితాంతంవరకు అంగీకరించి అతనికి పన్ను చెల్లిస్తూ వచ్చారు .
22 [This verse may not be a part of this translation]
23 [This verse may not be a part of this translation]
24 యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాన గల రాజ్యాలన్నిటినీ సొలొమోను పరిపాలించాడు. ఈ ప్రాంతం తిప్సహు మొదలు గాజా వరకు వ్యాపించి వున్నది. సొలొమోను సామ్రాజ్యంలో నలుమూలలా శాంతి నెలకొన్నది.
25 సొలొమోను జీవించినంత కాలం యూదాలోను, ఇశ్రాయేలులోని దాను నుండి బెయేర్షెబా వరకు ప్రజలంతా శాంతి భద్రతలతో నివసించారు. ప్రజలు తమ తమ అంజూరపు చెట్ల కింద, ద్రాక్షాలతల కిందను కూర్చుని సుఖశాంతులతో జీవితం గడిపారు.
26 సొలొమోను తన రథాలనులాగే నాలుగు వేలగుర్రాలను ఉంచుటకు తగిన శాలలు ఏర్పాటు చేశాడు. ఆయనకు పండ్రెండు వేల గుర్రాలు వున్నాయి. తన రథాశ్వములకై సొలొమోను నాలుగు వేల గుర్రపు శాలలు కలిగియున్నాడు. సొలొమోనుకు పండ్రెండు వేల మందిగల గుర్రపు దళం కూడా వున్నది.
27 ప్రతినెల పన్నెండు మంది మండలాధిపతులలో ఒక్కొక్కడు చొప్పున సొలొమోను రాజుకు కావలసిన సరుకులన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. రాజు బల్ల వద్ద తినే వారందరికీ ఇవన్నీ సరిపోయేవి.
28 రాజు యొక్క రథాశ్వములకు, స్వారి గుర్రాలకు తగినంత పచ్చగడ్డిని, యవధాన్యమును మండలాధిపతులు సేకరించి సరఫరా చేసేవారు. ప్రతి ఒక్కడూ ఈ ధాన్యాన్ని నియమిత స్థానాలకు చేరవేసేవాడు.
29 సొలొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా గమనించేవాడు. అతని జ్ఞానం ఊహ కందనిది .
30 తూర్పుదేశపు మానవులందరి వివేక జ్ఞానాలకంటె, సొలొమోను జ్ఞాన సంపద మిక్కిలి అతిశయించినది. ఈజిప్టులోనున్న వారి తెలివితేటల కంటె అతని శక్తి యుక్తులు మించినవి.
31 ఈ భూమి మీద ప్రజలందరికంటె అతను తెలివైనవాడు. అతడు ఎజ్రాహీయుడైన ఏతాను కంటె, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటె మిక్కిలి తెలివైనవాడు. రాజైన సొలొమోను కీర్తి ఇశ్రాయేలు, యూదాల చుట్టు పక్కలనున్న దేశాలకు కూడ వ్యాపించింది.
32 తన జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల సామెతలను రాశాడు . అతనింకా వెయ్యిన్ని ఐదు కీర్తనలు కూడా రచించాడు.
33 సొలొమోను ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనేక వృక్షజాతులను గూర్చి చెప్పాడు. లెబానోనులోని గొప్ప దేవదారు వృక్షములనుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల వరకు అతనికి తెలుసు. రాజైన సొలొమోను జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర పాకే క్రిమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు వాటిని గూర్చి కూడా చెప్పాడు.
34 రాజైన సొలొమోను జ్ఞానమును వినటానికి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఇతర దేశాల రాజులు తమ తమ పండితులను, శాస్త్రజ్ఞులను రాజైన సొలొమోను చెప్పే విషయాలను వినటానికి పంపేవారు.
1 హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు.
2 సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు:
3 “నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుపక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు.
4 కాని ఇప్పుడు యెహోవా దేవుడు నీ రాజ్యాం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగావున్నారు.
5 “యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను.
6 అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు సీదోను వడ్రంగులకు సాటిరారు.”
7 సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు.
8 అప్పుడు హీరాము ఒక సమాచారాన్ని సొలొమోనుకు యిలా పంపాడు: “నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను నీకు యిస్తాను.
9 నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ లెబానోను నుండి సముద్రతీరానికి చేరవేస్తారు. వాటిని నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని ఆశిస్తున్నాను.”
10 ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల కలపను సొలొమోనుకు సరఫరా చేయసాగాడు.
11 సొలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు వేల ఎనిమిది వందల పడుల స్వచ్ఛమైన ఒలీవగింజల నూనెను ప్రతియేటా పంపాడు.
12 యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశాడు. హీరాము, సొలొమోనుల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసుకున్నారు.
13 రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను ఈ పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు.
14 వీరిపై అధికారిగా అదోనీరాము అను వానిని రాజైన సొలొమోను నియమించాడు. సొలొమోను వారిని మూడు జట్లుగా విభజించాడు. ప్రతి జట్టులోను పదివేల మంది వున్నారు. ప్రతి జట్టు లెబానోనులో ఒక నెలపాటు పనిచేసి, రెండు నెలలు ఇంటివద్ద ఉండేవారు.
15 సొలొమోను ఎనుబది వేల మందిని కొండ ప్రాంతంలో పనిచేయటానికి బలవంతపర్చాడు. వీరు రాళ్లు కొట్టి చెక్కాలి. కొట్టిన రాళ్లను చేరవేయటానికి డెబ్బది వేల మంది వున్నారు.
16 ఈ పని చేసే వారిపై పర్యవేక్షణకై మూడు వేల మూడు వందల మంది నియమితులయ్యారు.
17 రాజైన సొలొమోను దేవాలయ పునాదులకు పనికి వచ్చే విలువైన పెద్ద బండలు చెక్కమని పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాళ్లు అతి నేర్పుగా కొట్టబడేవి.
18 సొలొమోను యొక్క, హీరాము యొక్క శిల్పులు, మరియు బిబ్లోసు నుండి వచ్చన వారును రాళ్లను చెక్కారు. ఈ కట్టడపు పనివారంతా రాళ్లను, దూలాలను, దేవాలయ నిర్మాణానికి తయారు చేశారు.
1 ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో నుండి వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తరువాత ఇది జరిగింది. అంతేగాకుండా ఇది రాజైన సొలొమోను ఇశ్రాయేలుపై రాజ్యాధిపత్యం వహించిన నాలుగవ సంవత్సరం. ఆ సంవత్సరంలో అది జీప్ అను రెండవ నెల.
2 దేవాలయం పొడవు తొమ్మిది అడుగులు , వెడల్పు ముప్పై అడుగులు . దాని ఎత్తు నలుబది ఐదు అడుగులు .
3 దేవాలయపు ముఖమండపం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు పదిహేను అడుగులు. ఈ మండపం ప్రధాన దేవాలయానికి ముంగిటనే వున్నది. దీని పొడవు దేవాలయం యొక్క వెడల్పుకు సమానంగా వుంది.
4 దేవాలయంలో ఇరుకైన కిటికీలు వున్నాయి. ఈ కిటికీలు చూడటానికి బయటి నుండి ఇరుకుగాను, లోపలి వైపు విశాలంగాను వున్నాయి.
5 పిమ్మట ప్రధాన దేవాలయం గోడల నానుకొని కొన్ని గదులను సొలొమోను కట్టించాడు. ఈ గదులు ఒకదాని మీద ఒకటిగా నిర్మింపబడ్డాయి.
6 కింది అంతస్తులో ఉన్న గదుల వెడల్పు ఏడున్నర అడుగులు . మధ్య అంతస్తులో గదుల వెడల్పు తొమ్మిది అడుగులు . దాని పైగదుల వెడల్పు పదిన్నర అడుగులు . గదులకు ఒక పక్క గోడగా వున్న దేవాలయం గోడ, కింద గదుల గోడకన్న మందము తక్కవ. గదులన్నీ ఆ గోడకు ఆనుకొని కట్టబడినా, వాటి ముఖ్య దూలాలు గోడలోకి చొచ్చుకొని పోకుండా ఆధార శిలలపై పెట్టబడ్డాయి.
7 ఈ దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లన్నీ అవి తీయబడిన గనుల వద్దనే కావలసిన రీతిలో శిల్పులచే చెక్కబడి, మలచబడినందున నిర్మాణ స్థలంలో సుత్తులు, గొడ్డళ్లు, తదితర పనిముట్లు వాడిన శబ్దం వినరాలేదు.
8 దేవాలయం పక్కగా కట్టిన కింది గదులకు ప్రవేశ మార్గం దక్షిణ భాగాన వున్నది. రెండవ అంతస్తుకు వెళ్లటానికి, అక్కడి నుండి మూడవ అంతస్తు గదులకు వెళ్లటానికి మెట్ల మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.
9 దేవాలయపు పైకప్పును దూలాలతోను, దేవదారు చెక్కలతోను సొలొమోను నిర్మింపజేశాడు. ఆ విధంగా సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు.
10 దేవాలయం పక్కనున్న కింది అంతస్తు పని కూడా పూర్తి చేశాడు. అది ఏడున్నర అడుగుల ఎత్తు వుంది. అది దేవదారు దూలాలతో దేవాలయానికి జత చేర్చ బడివుంది.
11 సొలొమోనుతో యెహోవా ఇలా అన్నాడు:
12 “నీవు నా న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను పాటించి నట్లయితే నీ తండ్రియగు దావీదుకు నీ గురించి నేను చేసిన వాగ్దానం నెరవేర్చుతాను.
13 నా ప్రజలైన ఇశాయేలీయుల మధ్య నీవు నిర్మించే ఈ దేవాలయంలో నేను నివసిస్తాను. నేను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నటికి విడనాడను.”
14 సొలొమోను దేవాలయ నిర్మాణం పూర్తి చేశాడు.
15 దేవాలయపు లోపలి పక్క గోడలకు దేవదారు బల్లలు అమర్చబడ్డాయి. కింది నేల భాగం సరళపు మ్రాను చెక్కలతో కప్పబడింది.
16 ముప్పై అడుగుల పొడవు గల ఒక గది దేవాలయానికి వెనుకగా కట్టబడింది. కింది నుంచి కప్పు వరకు అమర్చబడిన దేవదారు చెక్కల పనితనంతో ఈ గది దేవాలయంనుండి వేరు చేయబడింది. ఈ గదికి అతి పవిత్ర స్థలమని పేరు.
17 ఈ మిక్కిలి పరిశుద్ధ స్థలం ముందున్నగది అరువది అడుగుల పొడవు గలిగివున్నది.
18 ఆ దేవదారు చెక్కలపై వికసించిన పువ్వులు, సొర తీగలు మనోహరంగా చెక్కబడ్డాయి. ఆ గది లోపలి భాగమంతా దేవదారు పలకలతో కప్పబడింది. అందువల్ల ఎవ్వరూ గోడ రాళ్లను చూడలేరు.
19 ఆలయ ప్రాంగణానికి వెనుక వున్న ఈ అతి పరిశుద్ధ స్థలము దేవుని ఒడంబడిక పెట్టె వుంచటానికి నిర్మింపబడింది.
20 ఈ అతి పరిశుద్ధ స్థలము ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు ముప్పై అడుగుల ఎత్తు కలిగివుంది.
21 సొలొమోను ఈ అతి పరిశుద్ధ స్థలము లోపలి భాగమంతా శుద్ధ బంగారంతో పొదిగించాడు. ఈ గదికి ముందు బంగారంతో పొదగబడిన ఒక బలిపీఠం నిర్మించబడింది. దాని చుట్టూ బంగారు గొలుసులు చుట్టబడ్డాయి. కెరూబులు రెండూ బంగారు రేకులతో కప్పబడ్డాయి.
22 దేవాలయం మొత్తం బంగారంతో పొదగబడింది. అతి పరిశుద్ధ స్థలము వద్దగల పీఠం కూడా బంగారంతో పొదగబడింది.
23 పనివారు కెరూబులను రెక్కలతో తయారు చేశారు. అవి ఒలీవ కర్రతో చేయబడ్డాయి. ఈ కెరూబులను అతి పరిశుద్ధ స్థలములో వుంచారు. ప్రతి ఒక్క దేవదూత పదిహేను అడుగుల పొడవు వున్నది.
24 [This verse may not be a part of this translation]
25 [This verse may not be a part of this translation]
26 [This verse may not be a part of this translation]
27 ఈ కెరూబులు అతి పరిశుద్ధ స్థలములో పక్కపక్కన నిలబెట్టబడ్డారు. గది మధ్యలో వారి రెక్కలు ఒక దానితో ఒకటి కలిశాయి. మిగిలిన రెండు రెక్కలు ఆ పక్కగోడ నొకటి ఈ పక్క గోడ నొకటి ఆనుకొని వున్నాయి.
28 రెండు కెరూబులు బంగారంతో పొదగబడ్డాయి.
29 అతి పరిశుద్ధ స్థలము చుట్టూవున్న గోడలమీద, లోపల గదుల గొడల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పువ్వులు చిత్రీకరింపబడ్డాయి.
30 అతి పరిశుద్ధ స్థలము, దేవాలయ ప్రాంగణ గది నేలలు బంగారు రేకులతో కప్పబడ్డాయి.
31 అతి పరిశుద్ధ స్థలానికి తలుపులు ఏర్పరచ బడ్డాయి. ఆ తలుపులు ఒలీవ కర్రతో చేయబడ్డాయి. తలుపు ఐదు రకాలుగా తిరిగే విధంగా ఐదు ముఖముల నిలువు కమ్మికి అమర్చబడింది.
32 రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేయబడినవే. తలుపుల మీద కెరూబుల, తమల వృక్షాల, పువ్వుల చిత్రాలు మలచబడ్డాయి. తలుపులు బంగారంతో పొదగబడ్డాయి.
33 ప్రధాన గది ద్వారానికి ఒలీవ కర్రతో చేయబడిన చదరపు తలుపు అమర్చబడింది.
34 దాని రెండు తలుపులు సరళపు చెక్కలతో చేయబడ్డాయి.
35 ప్రతి తలుపూ రెండు భాగాలుగా చేయబడింది. దానివల్ల రెండేసి భాగాలు మూయటానికి వీలవుతుంది. తలుపుల మీద కెరూబులు, తమాల వృక్షాలు, పూవులు చెక్క బడ్డాయి. ఈ చెక్కడాలన్నిటి పైన బంగారు పూత వేయబడింది.
36 తరువాత లోపలి ఆవరణం సిద్ధం చేయబడింది. పెరడు చుట్టూ గోడ నిర్మాణం జరిగింది. ఈ గోడలు చెక్కిన మూడు రాళ్ల వరుసతో నిర్మింపబడి, వాటికి ఒక వరుసలో దేవదారు చెక్క అమర్చబడింది.
37 ఆ సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పని రెండవ నెలలో ప్రారంభించబడింది. ఆ నెల పేరు జీప్. అది సొలొమోను ఇశ్రాయేలును పాలించటం మొదలు పెట్టిన పిమ్మట నాలుగవ సంవత్సరం.
38 సొలొమోను పాలన పదకొండు సంవత్సరాలు సాగేనాటికి దేవాలయ నిర్మాణం పూర్తయింది. పూర్తి అయ్యేనాటికి ఆ సంవత్సరంలో ఎనిమిదవ నెల జరుగుతూ వుంది. దాని పేరు బూలు. దేవాలయ నిర్మాణం పథకం ప్రకారం పూర్తయింది. దేవాలయ నిర్మాణ పరిసమాప్తికి సొలొమోను ఏడు సంత్సరాలు కృషి చేశాడు.
1 రాజైన సొలొమోను తనకై ఒక రాజభవనం కట్టించాడు. సొలొమోను రాజభవన నిర్మాణానికి పదమూడు సంవత్సరాలు పట్టింది.
2 అతడింకా “లెబానోను అరణ్యపు విశ్రాంతి గృహాన్ని” కూడ ఒకటి కట్టించాడు. అది నూట ఏభై అడుగుల పొడవు, డెబ్బది ఐదు అడుగుల వెడల్పు, మరియు నలభై ఐదు అడుగలు ఎత్తు కలిగివుంది. దానికి నాలుగు వరుసల దేవదారు స్తంభాలు వున్నాయి. వాటి పైన నగిషీ పని చేసిన దేవదారు స్తంభ శీర్షాలు నిలుపబడ్డాయి.
3 స్తంభముల మీద పైకప్పుగా దేవదారు పలకలు పర్చచబడ్డాయి. కప్పు భాగానికి నలభై యైదు దూలాలను పరిచారు. నాలుగు స్తంభాల వరుసల మధ్యనున్న మూడు భాగాలకు ఒక్కొక్క దానికి పదిహేను కొయ్య కడ్డీలు చొప్పున అమర్చబడ్డాయి.
4 ఈ వరుసల మధ్య కిటికీలున్నాయి. అవి ఒకదానికొకటి ఎదురెదురుగా నిర్మింపబడ్డాయి.
5 తలుపులన్నీ చదరంగా వున్నాయి. ప్రతి వరుస చివరనున్న తలుపులు ఒకదానికొకటి ఎదురెదురుగా వున్నాయి.
6 సొలొమోను “స్తంభాలతో ఒక మండపం” నిర్మించాడు. దాని పొడవు డెభ్బై అడుగులు; వెడల్పు నలభై అడుగులు, స్తంభాల నాధారంగా చేసుకొని మండపానికి ముందు ఒక వసారా వుంది.
7 సొలొమోను తమ న్యాయ విచారణ జరుపుటకు సింహాసనమున్న ఒక గదిని కట్టించాడు. దానికి “న్యాయసభాస్థలి” అని పేరు పెట్టాడు. ఆ గదంతా కింది నేలనుండి పైకప్పు దూలాల వరకు దేవదారు చెక్కలతో కప్పబడింది.
8 సొలొమోను నివసించే ఇల్లు ఈ న్యాయ సభాస్థలానికి బాగా వెనుక భాగంలో వుంది. అదే రకమైన మరియొక ఇంటిని తన భార్యకై నిర్మింపజేశాడు. తన భార్య ఈజిప్టు రాజు కుమారై.
9 ఈ భవనాలన్నీ చాలా ఖరీదైన రాళ్లతో కట్టబడ్డాయి. ఈ రాళ్లన్నీ కావలసిన పరిమాణంలో చెక్కబడి, ప్రత్యేక రంపాలతో కోయబడ్డాయి. ఈ రాళ్లు ముందు వెనుక కోయబడ్డాయి. ఈ ఖరీదైన రాళ్లు పునాదుల నుండి పైవరుస వరకు వేయబడ్డాయి. ఆవరణ గోడలకు, ఆవరణలోను రాళ్లు వాడబడ్డాయి.
10 పునాదులకు ఖరీదైన పెద్ద బండలు వేయబడ్డాయి. కొన్ని బండలు పదిహేను అడుగుల పొడవు గలవి; మరికొన్ని పన్నెండు అడుగుల పొడవుగలవై వున్నాయి.
11 ఈ బండల మీద ఇతర ఖరీదైన రాళ్లు, దేవదారు కట్టెలు వేశారు.
12 భవనపు ఆవరణ, దేవాలయపు ఆవరణ, దేవాలయ సింహద్వారపు గోడలు మూడు వరుసల చెక్కిన రాళ్లతో నిర్మింపబడి వాటి మీద దేవదారు దూలాలు వేయబడ్డాయి.
13 రాజైన సొలొమోను తూరు పట్టణం నుండి హీరాము అను వానిని తన వద్దకు పిలిపించాడు.
14 హీరాము తల్లి నఫ్తాలి వంశానికి చెందిన స్త్రీ. మరణించిన తన తండ్రి తూరు పట్టణపువాడు. హీరాము కంచు పనిలో బహు నేర్పరి. మంచి అనుభవజ్ఞుడు. రాజైన సొలొమోను అతనిని పిలవగా హీరాము అంగీకరించి వచ్చాడు. రాజైన సొలొమోను కంచు పనులన్నిటికీ అతనిని అధిపతిగా చేశాడు. కంచుతో చేసే పనులన్నీ హీరాము నిర్వహించాడు.
15 హీరాము రెండు కంచు స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్కటి ఇరువై ఏడు అడుగుల పొడవు, పద్దెనిమిది అడుగుల చుట్టు కొలత (ఉరవు) కలిగి వున్నాయి. అయితే ఈ స్తంభాల లోపలి భాగం బోలుగా వుంది. స్తంభపు అంచు మందం నాలుగు అంగుళాలు .
16 అతడు రెండు స్తంభ శీర్షాలు కూడా తయారు చేశాడు. అవి ఒక్కొక్కటి ఏడున్నర అడుగుల పొడవున వున్నాయి. ఈ స్తంభశీర్షాలను హీరాము తాను పోతపోసిన స్తంభాలపై నిలిపాడు.
17 పిమ్మట గొలుసులతో వలలవంటి అల్లిక తయారు చేసి స్తంభాల మీద నున్న శీర్షాలను కప్పేలా పైనవేశాడు.
18 దానిమ్మకాయల ఆకారంలో వేలాడే బంతులు గల రెండు కంచు గొలుసులను అతడు తయారు చేశాడు. ఈ కంచు దానిమ్మ కాయల వరుసలను స్తంభశీర్షాల మీదనున్న లోహపు వలలమీద చుట్టాడు.
19 ఈ స్తంభశీర్షాలు ఏడున్నర అడుగుల పొడవున వికసించిన పద్మాకారంలో మలచబడ్డాయి.
20 ఈ స్తంభశీర్షాలు కంచు స్తంభాలమీద పెట్టబడ్డాయి. పాత్ర ఆకారంలో ఉన్న వలలపైన అవి పెట్టబడ్డాయి. ఆ ప్రదేశంలో స్తంభశీర్షం చుట్టూ ఇరవై దానిమ్మ కాయలు గల గొలుసు చుట్టబడింది.
21 ఈ రెండు కంచు స్తంభాలను హీరాము దేవాలయపు మండపం వద్ద నిలబెట్టాడు. ఒక స్తంభం దక్షిణ వైపున, మరొక స్తంభం ఉత్తరవైపున నిలుపబడ్డాయి. దక్షిణ స్తంభానికి యాకీను అని, ఉత్తర స్తంభానికి బోయజు అని పేర్లు పెట్టారు.
22 పుష్పాకారంలో వున్న పీటలు కంచుస్తంభాలపై ఉంచబడ్డాయి. ఆ విధంగా స్తంభ నిర్మాణం పని పూర్తయింది.
23 పిమ్మట హీరాము కంచుతో ఒక గుండ్రని కోనేరు తయారు చేశాడు. (దానిని వారు “సముద్రం” అని పిలిచారు) ఆ సముద్రం సుమారు నలభై ఐదు అడుగుల చుట్టు కొలత కలిగివుంది. ఒక అంచునుండి మరొక అంచు వరకు సముద్రం అడ్డుగా పదిహేను అడుగులు వుంది. దాని లోతు ఏడున్నర అడుగులు.
24 దాని చుట్టు బయటి అంచున ఒక కమ్మి ఉన్నది. ఈ కమ్మి కింద రెండు వరుసల కంచు సొరతీగె పొందుపర్చబడింది. అనగా ఈ కంచు సొరతీగ ఒక్క ముక్కగానే చెరువుతో పాటు ఒకే సారి మలచబడింది.
25 ఈ కోనేటిని పన్నెండు కంచు గిత్తల వీపులపై నిలిపారు. ఈ పన్నెండు గిత్తులు చెరువునుండి బయటికి చూస్తున్నాయి. మూడు ఉత్తరానికి, మూడు తూర్పుకు, మూడు దక్షిణానికి, మరి మూడు పడమరకు చూస్తున్నాయి.
26 కంచు చెరువు అంచుమందం నాలుగు అంగుళాలు. చెరువు అంచు గిన్నె అంచులా, విచ్చిన పూరేకులా వున్నది. ఆ చెరువులో సుమారు తొమ్మిది గరిసెల నీరు పట్టుతుంది.
27 హీరాము తరువాత పది కంచు తోపుడు బండ్ల వంటివి తయారుచేశాడు. ఒక్కొక్క దాని పొడవు ఆరు అడుగులు (నాలుగు మూరలు), వెడల్పు ఆరు అడుగులు, మరియు ఎత్తు నాలుగున్నర అడుగులు (మూడు మూరలు),
28 వీటి పక్కలు నాలుగు మూలలుగా వున్న కంచు పలకలతో మూయబడ్డాయి. ఆ నాలుగు మూలలుగా వున్న పలకలు చట్రాలతో బిగించబడ్డాయి.
29 అ పలకల మీద సింహాలు, గిత్త దూడలు, కెరూబులు చిత్రీకరించబడ్డాయి. ఆ సింహాల, గిత్తల బొమ్మలపై వరుస, కింది వరుసలలో పువ్వుల అలంకరణ కంచులోకి దట్టించి ముద్రించబడింది.
30 ప్రతి బండికి నాలుగు కంచు చక్రాలున్నాయి. చక్రాలకు ఇరుసులున్నాయి. మూలల మీద పెద్ద గిన్నెలు నిలపటానికి కంచు ముక్కల ఆధారం వుంది. ఆ కంచు ఆధారాల మీద పూలు చెక్కబడ్డాయి.
31 ఆ గిన్నెలకు పైన అంచు చుట్టూ చట్రముంది. గిన్నెకు పదునెనిమిది అంగుళాల ఎత్తున అదివుంది. గిన్నె మూతి గుండ్రంగా వున్నది. గిన్నెలోతు ఇరువది ఏడు అంగుళాలు. చట్రం మీద కూడ అలంకరణ చెక్కబడి వున్నది. ఈ చట్రం గుండ్రంగా గాక నాలుగు పలకలుగా వుంది.
32 అడుగు చట్రం కింద నాలుగు చక్రాలున్నాయి. చక్రాలు ఇరవై ఏడు అంగుళాల ఎత్తు వున్నాయి. చక్రాల ఇరుసులు బండితో ఒకే రీతిగా చేయబడ్డాయి.
33 వీటి చక్రాలు రథ చక్రాలను పోలి వున్నాయి. చక్రాలలో ప్రతిదీ వాటి మధ్య కడ్డీలు, అంచులు, చువ్వలు, చక్రపు నడిమి భాగం కంచుతో చేయబడింది.
34 ప్రతి బండికీ నాలుగు మూలలా నాలుగు ఆధారాలున్నాయి. అవన్నీ బండితో పాటు ఒకే రీతిగా చేయబడినవే.
35 ప్రతి బండి చుట్టూ పైభాగాన ఒక బొద్దు వంటి చట్రముంది. అది బండితో కలిసి ఏకంగా చేయబడింది.
36 బండి పక్కన గల కంచు పలకలపై కెరూబుల, సింహాల, తమాల వృక్షాల చిత్రాలు మలచబడ్డాయి. ఎక్కడెక్కడ అవకాశం వున్నదో అక్కడ చిత్రాలు, అలంకరణలు చెక్కబడ్డాయి. చుట్టూ అనేక పుష్పాలు చెక్కబడ్డాయి.
37 ఆ రకంగా హీరాము పది బండ్లను తయారు చేశాడు. ప్రతీదీ కరిగించిన కంచును మూసలో పోత పోశారు. కావున అన్ని బండ్లు ఒకే పరిమాణంలో, ఒకే ఆకారంలో ఉన్నాయి.
38 హీరాము పిమ్మట పది పెద్ద తొట్లను తయారు చేశాడు. ముందు నిర్మించిన పది బండ్ల మీదికి పది తొట్లను నిర్మించాడు. ప్రతి తొట్టి ఈ అంచు నుండి ఆ అంచు వరకు అడ్డంగా ఆరడుగులు వుంది. ప్రతి తొట్టిలోను ఏడువందల ఇరువది తూముల నీరు పట్టేది.
39 హీరాము ఐదు బండ్లను దేవాలయానికి దక్షిణాన, మిగిలిన ఐదింటిని ఉత్తర భాగాన ఉంచాడు. పెద్ద కోనేటిని దేవాలయానికి ఆగ్నేయ భాగాన నెలకొల్పాడు.
40 హీరాము ఇంకా కొన్ని కుండలను, చిన్నపాటి గరిటెలను, గిన్నెలను తయారు చేశాడు. రాజైన సొలొమోను హీరామును చేయుమని చెప్పిన వన్నీ అతడు పూర్తిచేశాడు. యెహోవా దేవాలయానికై హీరాము చేసిన వస్తువులు ఇవి:
41 రెండు స్తంభాలు; ఆ రెండు స్తంభాల మీద నున్న స్తంభశీర్షాలకు ఏర్పాటు చేసిన గిన్నెలాంటి పాత్రలు; స్తంభాల మీది రెండు శీర్షాల కొరకు ఉంచబడిన రెండు గిన్నెలను కప్పటానికి రెండు అల్లికలు;
42 ఆ అల్లికలకు నాలుగు వందల దానిమ్మకాయల బొమ్మలు; రెండు స్తంభాల మీది శీర్షాలకు అమర్చిన గిన్నెలపై గల అల్లికల మీద దానిమ్మకాయల గొలుసును రెండు వరుసల చొప్పున చుట్టారు.
43 పది బండ్లు; వాటిపైన తొట్టెలు;
44 పన్నెండు గిత్తలపై నిల్పిన ఒక పెద్ద కోనేరు;
45 కుండలు, చిన్న పాటి గరిటెలు, గిన్నెలు, యెహోవా దేవాలయానికి కావలసిన తదితర పాత్రలు; మరియు రాజు ఇంటికి నలభై ఎనిమిది స్తంభాలు; రాజైన సొలొమోను కోరినవన్నీ హీరాము తయారు చేసి పెట్టాడు. అవన్నీ మెరుగు దిద్దిన కంచుతో చేయబడ్డాయి.
46 సొలొమోను ఈ వస్తు సామగ్రిని చేయటానికి పట్టిన కంచును తూకం వేయలేదు. అది తూచటానికి అలివికానంత ఉంది. అందువల్ల వారు ఎంత కంచు వాడినది తెలియదు.
47 ఈ కంచు సామగ్రి అంతా రాజు ఆజ్ఞ ప్రకారం యొర్దాను నది దగ్గర సుక్కోతుకు, సారెతానుకు మధ్య చేయబడ్డాయి. ఈ వస్తు సామగ్రినంతా కంచు కరగించి బంక మట్టితో చేసిన మూసలలో పోసి వారు తయారుచేశారు.
48 దేవాలయం కొరకు అనేక వస్తువులు బంగారంతో చేయటానికి కూడ సొలొమోను ఆజ్ఞ ఇచ్చాడు. బంగారంతో దేవాలయానికి సొలొమోను చేయించిన వస్తువులు ఈ విధంగా వున్నాయి: బంగారు బలిపీఠం; బంగారపు బల్ల (దేవునికి అర్పించు సముఖపు రొట్టెలు ఉంచడానికి).
49 పది దీప స్తంభాలు: (అతి పరిశుద్ధ స్థలము ముందు కుడిపక్కన ఐదు, ఎడమపక్కన ఐదు ఇవి ఉంచబడ్డాయి) బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పటకారులు;
50 గిన్నెలు; దీపాలను కాంతి కొరకై ఎగ దోసేపనిముట్లు; పాత్రలు; పెనాలు; ధూపం వేయటానికి బొగ్గులు వేసే బంగారు ధూపకలశం; దేవాలయం సింహద్వారపు తలుపులు.
51 ఆ రకంగా రాజైన సొలొమోను కోరుకున్న ప్రకారం యెహోవా దేవాలయంయొక్క పని పూర్తి అయింది. అప్పడు రాజైన సొలొమోను తన తండ్రి దావీదు దేవునికి అంకితం చేసిన వస్తువులన్నీ దేవాలయానికి తెచ్చాడు. దేవాలయపు ధనాగారంలో ఆ వెండి బంగారాలు భద్రపరిచాడు.
1 రాజైన సొలొమోను తరువాత ఇశ్రాయేలు పెద్దలం దరి నీ, ఆయా వంశాల ప్రధాన పురుషులను, ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలను ఒక చోటికి పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో తన వద్దకు రమ్మని చెప్పాడు. సీయోను అనబడే దావీదుపురంనుండి దేవుని ఒడంబడిక పెట్టెను దేవాలయానికి తరలించే కార్యక్రమంలో పాల్గొనమని సొలొమోను వారిని కోరాడు.
2 కావున ఇశ్రాయేలీయులందరూ రాజైన సొలొమోను వద్దకు వచ్చారు. ఏతనీము అనబడే మాసంలో పండుగ సందర్భంగా ప్రత్యేక సెలవు రోజున (పర్ణశాలల పండుగ) సమావేశం జరిగింది. అది సంవత్సరంలో ఏడవనెల.
3 ఇశ్రాయేలు పెద్దలందరూ ఆ స్థలానికి వచ్చారు. అప్పుడు యాజకులు పవిత్ర ఒడంబడిక పెట్టె తీసుకున్నారు.
4 యెహోవా ఒడంబడిక పెట్టె సన్నిధి గుడారము, దానిలోని పవిత్ర వస్తువులతో పాటు వారు మోసుకొని వెళ్లారు. లేవీయులు కొందరు ఈ వస్తువులను మోయుటలో సహాయం చేశారు.
5 రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒడంబడిక పెట్టె ముందు సమావేశమయ్యారు. వారప్పుడు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని గొర్రెలను, పశువులను బలియిచ్చారు.
6 అప్పుడు యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టె దాని అసలైన స్థానంలో ఉంచారు. అది అతి పరిశుద్ధ స్థలము. ఒడంబడిక పెట్టె కెరూబుల రెక్కల కిందుగా ఉంచబడింది.
7 ఒడంబడిక పెట్టె ఉంచబడిన స్థానం మీదుగా కెరూబుల రెక్కలు వ్యాపించి వున్నాయి. ఆ రెక్కలు ఒడంబడిక పెట్టె, దానిని మోయుటకు ఉపయోగించే కోలలను కప్పివేశాయి.
8 ఒడంబడిక పెట్టె మోసే కోలలు (కర్రలు) చాలా పొడవైనవి. అతి పరిశుద్ధ స్థలం ముందు పవిత్ర స్థలంలో ఎవరు నిలబడి చూసినా ఆ కోలలను చివరి వరకు చూడగలరు. కాని వాటినెవరూ బయటి నుండి చూడలేరు. ఈ నాటికీ ఆ కోలలు అదే స్థానంలో వున్నాయి.
9 ఆ ఒడంబడిక పెట్టెలో వున్నవి కేవలం రెండు రాతి ఫలకాలు. ఈ రెండు ఫలకాలను హోరేబు అనే చోట మోషే ఈ ఒడంబడిక పెట్టెలో భద్రపరచాడు. ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి బయటికి వచ్చిన తరువాత హోరేబు అనే చోటనే యెహోవా వారితో తన ఒడంబడిక చేశాడు.
10 యాజకులు అతి పరిశుద్ధ స్థలాన్ని వదిలి బయటికి వచ్చిన పిమ్మట, ఒక మేఘం యెహోవా దేవాలయాన్ని కమ్మివేసింది.
11 యెహోవా మహిమతో దేవాలయం నిండిపోగా యాజకులు తమ విధులను నిర్వర్తించలేక పోయారు.
12 అప్పుడు సొలొమోను ఇలా అన్నాడు: “ఆకాశంలో ప్రకాశించటానికి యెహోవా సూర్యుడ్ని కలుగజేశాడు, కాని ఆయన మాత్రం ఒక నల్లని మేఘంలో నివసిస్తానన్నాడు.
13 నిజానికి నేకొక అద్భుతమైన దేవాలయాన్ని నీ కొరకు నిర్మించాను, అది నీవు శాశ్వతంగా నివసించే స్థలం.
14 ఇశ్రాయేలీయులందరూ అక్కడ నిలబడియున్నారు. రాజైన సొలొమోను వారి వైపు తిరిగి వారిని దీవించుమని దేవునిని అడిగాడు.
15 తరువాత రాజైన సొలొమోను దేవునికి సుధ్ఘీరమైన ప్రార్థన చేశాడు. ఆయనిలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉన్నతుడు. నా తండ్రి దావీదుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన అన్నీ నెరవేర్చాడు.
16 యెహోవా నా తండ్రితో, ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టునుండి విముక్తులను చేసి తీసుకొని వచ్చాను. కాని నా గౌరవార్థం నాకో దేవాలయం కట్టించటానికి ఇశ్రాయేలు వంశాలు నివసించే ఏ పట్టణాన్నీ నేనింకా ఎన్నుకో లేదు. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలటానికి నేనొక యువరాజును ఎంపిక చేయలేదు. కాని నేను గౌరవింపబడే చోటుగా ఇప్పుడు యెరూషలేమును ఎన్నుకున్నాను. మరియు నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించటానికి దావీదును ఎంపిక చేశాను’ అని చెప్పాడు.
17 “ఇశ్రాయేలు దేవుడై యెహోవాకు ఘనంగా ఒక దేవాలయం కట్టించాలని నా తండ్రి దావీదు మిక్కిలిగా కోరుకున్నాడు.
18 కాని యెహోవా నా తండ్రి దావీదుతో ‘నాకు తెలుసు, నీవు నాకు దేవాలయం కట్టించి గౌరవించాలని మిక్కిలి ఆసక్తితో ఉన్నావు. నాకు దేవాలయ నిర్మాణం చేయాలను కోవటం సంతోషించ తగ్గ విషయం.
19 కాని నాకు దేవాలయం కట్టించేది నీవు కాదు. నేను ఆ పనికి నిన్ను ఎంపిక చేయలేదు. నీ రక్తం పంచుకు పుట్టిన నీ కుమారుడు నాకు దేవాలయ నిర్మాణం చేయిస్తాడు,’ అని అన్నాడు.
20 “కావున యెహోవా ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. నా తండ్రి దావీదు స్థానంలో ఇప్పుడు నేను రాజును. యెహోవా కనికరించిన విధంగా ఇప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నేను దేవాలయం కట్టించాను.
21 దేవాలయంలో దేవుని ఒడంబడిక పెట్టెకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేశాను. మన పూర్వీకులతో యెహోవా చేసిన ఒక ఒడంబడిక ఆ మందసంలో వుంది. యెహోవా మన పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ఒడంబడిక చేశాడు.”
22 పిమ్మట సొలొమోను యెహోవా బలిపీఠం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా అతనికి ఎదురుగా నిలబడ్డారు. రాజైన సొలొమోను చేతులు చాపి, ఆకాశంవైపు చూశాడు.
23 అతనిలా అన్నాడు: “ఓ ప్రభూ, ఇశ్రాయేలీయుల దేవా! నీవంటి యెహోవా ఆకాశంలో గాని, భూమి మీద గాని మరొక్కడు లేడు. నీ ప్రజలను నీవు మిక్కిలిగా ప్రేమిస్తున్నావు. కావున నీవు వారితో ఒక ఒడంబడిక చేసుకున్నావు. నిన్ననుసరించే ప్రజల పట్ల నీ ఒడంబడిక తప్పక అమలు పర్చుతావు.
24 నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు ఆ వాగ్దానం చేశావు. నీవు ఆ వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే ఆ వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో ఆ వాగ్దానం ఈ రోజు నిజమయ్యేలా చేశావు.
25 ఇశ్రాయేలీయుల దేవుడవైన నా ప్రభువా, నా తండ్రియు నీ సేవకుడు అయిన దావీదుకు నీవు చేసిన ఇతర వాగ్దానాలను కూడ ఇప్పుడు నెరవేర్చు. నీవిలా అన్నావు: ‘నీవు నా ఆజ్ఞలను పాటించినట్లు నీ కుమారులు కూడా నన్ననుసరించే విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. వారు అలా చేస్తే నీవు నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఇశ్రేయేలును పాలించటానికి ఒకనిని కలిగి వుంటావు.’
26 ఇశ్రాయేలు దైవమగు ఓ నా ప్రభువా, నీవు నా తండ్రికిచ్చిన ఆ వాగ్దానం కొనసాగించుమని కూడా నేను వేడు కుంటున్నాను.
27 “కాని దేవుడు నిజంగా ఈ భూమి మీద నివసించగలడా? ఈ ఆకాశము, ఉన్నత ఆకాశాలు నిన్ను భరించ జాలవు. నేను నిర్మించిన ఈ నివాసం కూడ ఖచ్చితంగా నిన్ను ఇముడ్చుకోలేదు.
28 దయచేసి నా ప్రార్థనను, నా మనవిని ఆలకించు. నేను నీ సేవకుడను. నీవు నా ప్రభువైన దేవుడవు. నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు.
29 గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఈ ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. ఈ దేవాలయంలో నేను చేసే ఈ ప్రార్థన ఆలకించు.
30 దయచేసి నీ సేవకుడనైన నేను, ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలంలో చేసే ప్రార్థనలన్నీ ఆలకించు. మాకు తెలుసు నీవు పరలోకంలో నివసిస్తావని, అక్కడ నుండి మా ప్రార్థన ఆలకించి, మమ్మల్ని మన్నించుమని మేము నిన్ను వేడుకుంటున్నాము.
31 “ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, వాడు ఈ బలిపీఠం వద్దకు తేబడతాడు. ఆ వ్యక్తి గనుక నేరం చేయకపోతే, తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటూ ఒక ప్రమాణం చేస్తాడు.
32 పరలోకంలోనుండి నీవు అది విని, ఆ వ్యక్తి పట్ల న్యాయనిర్ణయం చెయ్యి. దోషిని శిక్షించి, అమాయకుడైన వానిని క్షమించు.
33 “కొన్నిసార్లు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ పట్ల పాపం చేయవచ్చు; మరియు వారి శత్రువులు వారిని ఓడించవచ్చు. వారు మరల నీ వద్దకు తిరిగివచ్చి నీకు స్తోత్రం చేస్తారు. ఈ దేవాలయంలో వారు నిన్ను వేడుకొంటూ ప్రార్థనలు చేస్తారు.
34 పరలోకంలో నీవు వారి ప్రార్థన దయచేసి విను. నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల పాపాలను క్షమించు. మళ్లీ వారి రాజ్యం వారికి వచ్చేలా చేయి. ఈ రాజ్యం వారి పూర్వీకులకు నీవు ఇచ్చినదే!
35 “మరి కొన్ని సార్లు వారు నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి భూముల్లో వర్షం కురియకుండా నీవు చేస్తావు. వారు మరల ఈ ప్రదేశానికి వచ్చి నిన్ను ప్రార్థించి, స్తుతిస్తారు. నీవు వారిని బాధించినప్పుడు, వారు చేసిన పాపాలకు వారు పశ్చాత్తాపం పొందుతారు.
36 ఇది జరిగినప్పుడు, పరలోకంలో నీవు వారి ప్రార్థన ఆలకించుము. నీ సేవకుడనగు నా తప్పులు, ఇశ్రాయేలు ప్రజల తప్పులను మన్నించు. పరలోకాన్నిగురించి వారికి బోధించు. యెహోవా, అప్పుడు దయచేసి రాజ్యంలో వర్షం కురిపించు. ఈ రాజ్యం వారికి నీవిచ్చినదే!
37 “ఈ నేల బాగా ఎండిపోయి, పంటలు పండక పోవచ్చు. లేక భయంకర వ్యాధి ప్రజలలో వ్యాపించవచ్చు. బహుశా పండిన పంటనంతా క్రిమికీటకాదులు నాశనం చేయవచ్చు. లేక నీ ప్రజలు వారి నగరాలలో శత్రువాత పడవచ్చు లేక నీ ప్రజలలో చాలామంది వ్యాధిగ్రస్థులు కావచ్చు.
38 వీటిలో ఏదైనా జరిగినప్పుడు, ఏ ఒక్కడైనా జరిగిన దానికి పశ్చాత్తాపపడి, చేతులు చాచి ఈ దేవాలయంలో నిలబడి నీకు ప్రార్థన చేస్తే,
39 దయచేసి అతని ప్రార్థన ఆలకించు. పరలోకంలో నీవు నీ నివాసంలో వుండగా దానిని ఆలకించు. ఆలకించి ఈ ప్రజలను మన్నించి, వారికి సహాయం చేయి. ప్రజలు నిజంగా ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోగల శక్తి నీకు తప్ప మరి ఎవ్వరికీ లేదు. కావున ప్రతి వ్యక్తికీ తీర్పు తీర్చి ఏది ఉచితమో వానికి అది చేయి.
40 నీవు అలాగున చేయి. దానివల్ల వారు నీ పట్ల భయభ్రాంతులతో, భక్తి భావంతో మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో సదా జీవిస్తారు.
41 [This verse may not be a part of this translation]
42 [This verse may not be a part of this translation]
43 నీ పరలోక నివాసంనుండి దయచేసి వారి మనవి ఆలకించు. ఇతర ప్రాంతాలవారు నిన్నడిగినదంతా దయచేసి నెరవేర్చు. ఇశ్రాయేలులో నీ ప్రజలు నీపట్ల ఎలాంటి భయభక్తులతో మెలుగుతారో, వారు కూడ అలా నీపట్ల విధేయులైయుంటారు. అప్పుడు సర్వప్రాంతాల ప్రజలంతా నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయం గురించి తెలుసుకుంటారు.
44 “కొన్ని సార్లు వారి శత్రువులతో పోరాడటానికి నీవు నీ ప్రజలకు ఆజ్ఞ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు వారు నీవు ఎన్నుకున్న ఈ నగరానికి వచ్చిగాని, నీ గౌరవార్థం నేను కట్టించిన ఈ దేవాలయానికి వచ్చిగాని ప్రార్థన చేస్తారు.
45 ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని వారికి సహాయం చేయి.
46 “నీ ప్రజలు నీ పట్ల పాపం చేస్తారు. ఇది నాకు తెలుసు. ఎందువల్లననగా పాపం చేయని వ్యక్తి లేడు. నీ ప్రజల పట్ల నీకు కోపం వస్తుంది. వారి శత్రువులు వారిని ఓడించేలా చేస్తావు. వారి శత్రువులు వారిని బందీలు చేసి దూర ప్రాంతాలకు తీసుకొని పోతారు.
47 ఆ దూర పరాయి రాజ్యంలో నీ ప్రజలు జరిగిన దానిని జ్ఞాపకం చేసుకుంటారు. వారు చేసిన పాపానికి వారు పశ్చాత్తాప పడతారు. ఆ పరాయి రాజ్యంలో బందీలుగా వుండి వారు నిన్ను ప్రార్థిస్తారు. వారు ‘మేము పాపం చేశాం; మేము తప్పుచేశాం’ అని అంటారు.
48 వారు నిజంగా ఆ పరాయి రాజ్యాలలో నిన్ను ఆశ్రయిస్తే, నీవు వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ రాజ్యంవైపుగాని, నీవు ఎన్నుకున్న ఈ నగరంవైపు గాని, నేను నీ గౌరవార్థం కట్టించిన ఈ దేవాలయమువైపు గాని తిరిగి ప్రార్థిస్తే,
49 దయచేసి పరలోకంలో వున్న నీవు వారి ప్రార్థన ఆలకించు.
50 నీ ప్రజల పాపాలన్నిటినీ క్షమించు. నీకు వ్యతిరేకంగా తిరిగినందుకు కూడా వారిని క్షమించు. వారి శత్రువులు వారిపట్ల ఉదారంగా వుండేలా చేయి.
51 వారు నీ ప్రజలే అని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకో. నీవు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చినట్లు జ్ఞాపక ముంచుకో. మండుతున్న కొలిమిలోనుండి బయటికి తీసినట్లు వారిని రక్షించావు!
52 “ప్రభువైన దేవా, నా ప్రార్థనలను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ప్రార్థనలను దయచేసి ఆలకించు. వారు ఏ సమయములో నిన్ను నీ సహాయము కోరి ప్రార్థించినా వారి ప్రార్థన విను.
53 ఈ భూలోకంలోవున్న ప్రజానీకమంతటిలో వారిని నీవు నీ ప్రజలుగా ఎంపిక చేశావు. యెహోవా మా పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చినప్పుడు, నీ సేవకుడైన మోషే ద్వారా ఈ వాగ్దానం నీవు చేశావు.”
54 ఈ విధంగా సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బలిపీఠం ముందు అతను మోకాళ్ల మీద ఉన్నాడు. తన చేతులను ఆకాశం వైవు చాచి అతడు ప్రార్థించాడు. సొలొమోను ప్రార్థన ముగించిన పిమ్మట లేచి నిలబడ్డాడు.
55 పిమ్మట, పెద్ద గొంతుతో ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించమని దేవుని అర్థించాడు. సొలొమోను ఇలా అన్నాడు:
56 “యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విశ్రాంతి ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే ఆయన మనకు విశ్రాంతి ఇచ్చాడు! తన సేవకుడైన మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనేక శుభప్రదమైన వాగ్దానాలను చేశాడు. యెహోవా ఈ వాగ్ధానాలన్నిటినీ నెరవేర్చాడు.
57 మనదేవుడైన యెహోవాను మనతో ఉండమని అడుగుతున్నాను. ఆయన మన పూర్వీకులతో ఎలావున్నాడో అలాగే మనతో కూడ ఉండమని అడుగుతున్నాను. మనలను ఎన్నడూ వదిలి వుండవద్దని వేడు కుంటున్నాను.
58 ఈ రకంగా మనం ఆయనను ఆశ్రయించి, ఆయనను అనుసరించుదాం. ఆయన మనపూర్వీకులకు ఇచ్చిన న్యాయసూత్రాలను, ఆజ్ఞలను మనము ఆచరిద్దాము.
59 నా ఈ ప్రార్థన, నేనడిగిన అన్ని విషయాలు సదా గుర్తుచుకోమని మన దేవుడైన యెహోవాను అడుగుతున్నాను. తన సేవకుడైన రాజు కొరకు, ఇశ్రాయేలు ప్రజలకొరకు ఇవన్నీ జరిపించమని వేడుకుంటున్నాను. ఇలా ప్రతి రోజూ జరిపించ మని కూడా వేడుకుంటున్నాను.
60 యెహోవా ఇవన్నీ జరిగేలా చేస్తే ప్రపంచ ప్రజలంతా మన దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకుంటారు.
61 మన దేవుడైన యెహోవాకు మీరంతా చెందియున్నారు. కావున మన దేవుడైన యెహోవాకు విధేయులై యుండాలి. ఆయన న్యాయ సూత్రాలను, ఆజ్ఞలను మీరంతా తప్పక అనుసరించాలి. మీరిప్పుడు చేస్తున్నట్లు భవిష్యత్తులో కూడ ఆయన మార్గాన్ని మీర నుసరించాలి.”
62 తరువాత రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులందరు యెహోవాకు బలులు అర్పించారు.
63 సొలొమోను ఇరువది రెండు వేల పశువులను, ఒక లక్షాఇరువది వేల గొర్రెలను బలి ఇచ్చాడు. ఇవి సమాధాన బలులుగా అర్పించారు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులు దేవాలయాన్ని దేవునికి అంకితము చేశారు.
64 రాజైన సొలొమోను ఇంకా ఆ రోజు దేవుని ఆలయము ముందున్న ఆవరణను దేవుని కార్యము కొరకు పవిత్రం చేశాడు. అతనక్కడ దహన బలులు, ధాన్యార్పణలు, జంతువుల కొవ్వును సమాధాన సూచకంగా అర్పించాడు. అతి పరిశుద్ధ స్థలము ముందున్న కంచు బలిపీఠం ఇవన్నీ అర్పించటానికి బహు చిన్నది అగుటచే, రాజైన సొలొమోను ఆవరణలో అర్పించాడు.
65 రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయులంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసుకున్నారు.
66 ఎనిమిదవ రోజు సొలొమోను వారందరినీ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు. ప్రజలంతా రాజుకు కృతజ్ఞతా వందనాలు చెప్పి తమ ఇండ్లకు వెళ్లారు. తన సేవకుడై న దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన సహాయ సంపత్తికి ప్రజలంతా చాలా సంతోషపడ్డారు.
1 సొలొమోను యెహోవా దేవాలయాన్ని, తన రాజ భవనాన్ని నిర్మించటం పూర్తి చేశాడు. తాను నిర్మించదలచుకొన్నవన్నీ పూర్తి చేశాడు.
2 తరువాత యెహోవా సొలొమోనుకు పూర్వం గిబియోను పట్టణంలో ప్రత్యక్షమైనట్లు మళ్లీ కన్పించాడు.
3 యెహోవా అతనితో ఇలా అన్నాడు; “నీ ప్రార్థన విన్నాను. నీవు నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా విన్నాను. నీవు ఈ దేవాలయము కట్టించావు. నేను దానిని పవిత్రస్థలంగా చేశాను. కావున నేనక్కడ శాశ్వతంగా ఆరాధించబడతాను. నేను దానిని కనిపెట్టుకుని ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచన చేస్తాను.
4 నీ తండ్రివలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ వుండాలి. అతడు న్యాయవర్తనుడు; నిజాయితీపరుడు. నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను నీవు పాటించాలి.
5 “నీవు ఇవన్నీ పాటిస్తే, ఇశ్రాయేలు రాజు ఎల్లప్పుడూ నీ వంశంలో నుండి వచ్చేలా చేస్తాను. ఈ వాగ్దానం నేను నీ తండ్రి దావీదుకు చేశాను. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరి పాలింపబడుతుందని నేనతనితో చెప్పాను.
6 [This verse may not be a part of this translation]
7 [This verse may not be a part of this translation]
8 ఈ దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప్రతివాడూ విస్మయము చెందుతాడు. వారంతా, ‘యెహోవా ఈ రాజ్యానికి, ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు? ‘ అని అడుగుతారు.
9 [This verse may not be a part of this translation]
10 ఇరవై సంవత్సరాల కాలవ్యవధిలో రాజైన సొలొమోను యెహోవా యొక్క దేవాలయాన్ని, తన రాజగృహాన్ని కట్టించాడు.
11 ఇరవై సంవత్సరాల తరువాత రాజైన సొలొమోను గలిలీయ దేశమందున్న ఇరవై పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇచ్చాడు. హీరాము రాజు ఆలయ నిర్ణాణంలోను, రాజ ప్రాసాద నిర్మాణంలోను సహాయపడి నందుకు, సొలొమోను ఈ పట్టణాలను ఇచ్చాడు. సొలొమోను కోరినంత దేవదారు కలపను, సరళ వృక్షాలను, బంగారాన్ని హీరాము ఇచ్చాడు.
12 కావున సొలొమోను ఇచ్చిన ఆ పట్టణాలను చూడటానికి తూరు నుండి హీరాము బయలుదేరి వెళ్లాడు. హీరాము ఆ పట్టణాలను చూచి తృప్తిపడలేదు.
13 “ఈ పనికిరాని పట్టణాలను నాకు ఎందుకిచ్చనట్లు సోదరా?” అని హీరాము రాజు అన్నాడు. హీరాము రాజు ఆ పట్టణ ప్రాంతాలకు కాబూల్ ప్రాంతమని పేరు పెట్టాడు. ఈ నాటికి ఆ ప్రాంతం కాబూల్ అని పిలవబడుతోంది.
14 హీరాము సుమారు రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు పంపాడు.
15 రాజైన సొలొమోను దేవాలయ నిర్మణానికి, రాజభవన నిర్మణానికి బానిసలను బలవంతంగా పని చేయించాడు. ఈ బానిసలను చాలా ఇతర కట్టడాల విషయంలో కూడ రాజైన సొలొమోను వినియోగించుకున్నాడు. అతడు మిల్లోను నిర్మించాడు. అతడింకా నగరానికి చుట్టూ ప్రాకారం కట్టించాడు. అతను హాసోరు, మెగిద్దో, మరియు గెజెరు నగరాలను కూడ పునర్మించాడు.
16 గతంలో ఈజిప్టు రాజు గెజెరు నగరంపై దండెత్తి దానిని తగులబెట్టాడు. అక్కడ నివసించే కనానీయులను చంపేశాడు. ఫరో కుమారైను సొలొమోను వివాహం చేసుకొన్నాడు. పెండ్లి కానుకగా ఫరో ఆ నగరాన్ని సొలొమోనుకు ఇచ్చాడు.
17 సొలొమోను ఆ నగరాన్ని తిరిగి నిర్మించాడు. సొలొమోను దిగువ బేత్ హోరోనును కూడ నిర్మించాడు.
18 రాజైన సొలొమోను బయతాతును, యూదయ అరణ్యములోనున్న తద్మోరు నగరాలను కూడా నిర్మించాడు.
19 రాజైన సొలొమోను ధాన్యాగారములు, తదితర వస్తువులు నిల్వచేయు గోదాములుండు నగరాలను కూడ కట్టించాడు. తన రథాలకు, గుర్రాలకు తగిన శాలలు కూడ నిర్మింపజేశాడు. యెరూషలేములోను, లెబానోను లోను, ఇంకా తాను రాజ్యం చేసిన ప్రాంతాలలోను సొలొమోను రాజు కావాలనుకున్న కట్టడాలను చాలా నిర్మించాడు.
20 ఇశ్రాయేలీయులు కానివారు రాజ్యంలో చాలా మంది వున్నారు. వారు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు.
21 ఇశ్రాయేలీయులు ఈ ప్రజలను నాశనం చేయలేక పోయారు. సొలొమోను వారిని బానిసలుగా పనిచేసేటందుకు బలవంతం చేశాడు. వారంతా ఈ నాటికీ బానిసలే.
22 కాని సొలొమోను ఇశ్రాయేలీయుల నెవ్వరినీ తన బానిసలు కమ్మని బలవంతం చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సైనికులుగాను, ప్రభుత్వ అధికారులుగాను, ఉద్యోగులుగాను, సైన్యాధిపతులు గాను, రథాధిపతులుగాను, రథసారథులుగాను పని చేశారు.
23 సొలొమోను చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించడానికి ఐదువందల ఏభై మంది అధికారులున్నారు. వారు పనివారి మీద అధికారులు.
24 ఫరో కుమారై దావీదు నగరం నుండి సొలొమోను ఆమెకు కట్టించిన భవనానికి వెళ్లింది. అప్పుడు సొలొమోను మిల్లోను నిర్మించాడు.
25 సంవత్సరానికి మూడుసార్లు సొలొమోను బలిపీఠం మీద దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించాడు. ఈ బలిపీఠం సొలొమోను యెహోవా కొరకు నిర్మించింది. రాజైన సొలొమోను యెహోవా ముందు ధూపం వేసేవాడు. కావున దేవాలయ నిర్వహణకు కావలసిన వస్తువులన్నీ అతడు సరఫరా చేసేవాడు.
26 ఎసోన్గెబెరు వద్ద రాజైన సొలొమోను ఓడలను కూడ నిర్మించాడు. ఈ పట్టణం ఏలతు దగ్గర వుంది. ఇది ఎదోము రాజ్యంలో ఎర్ర సముద్రపు తీరాన వుంది.
27 రాజైన హీరాము వద్ద సముద్ర విషయాలలో ఆరితేరిన మనుష్యులు కొందరున్నారు. వీరు తరచు ఓడలలో ప్రయాణం చేసేవారు.సొలొమోను మనుష్యులతో కలిసి సొలొమోను ఓడలలో పని చేయటానికి హీరాము రాజు ఆ మనుష్యులను పంపాడు.
28 సొలొమోను ఓడలు ఓఫీరను స్థలానికి వెళ్లాయి. ఆ ఓడలు ఓఫీరు నుండి ఎనిమిది వందల నలభై మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చాయి.
1 షేబ దేశపు రాణి సొలొమోను ప్రజ్ఞా విశేషాలను గూర్చి విన్నది. జటిలమైన ప్రశ్నలు వేసి అతనిని పరీక్షించాలని ఆమె వచ్చింది.
2 అనేక మంది సేవకులు వెంటరాగా, ఆమె యెరూషలేముకు ప్రయాణమై వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు, బంగారం మొదలైన వాటిని అనేక ఒంటెల మీద ఎక్కించి తనతో తీసుకొని వచ్చింది. ఆమె సొలొమోనును కలిసి, ఆమె ఆలోచించ గలిగినన్ని చిక్కు ప్రశ్నలను వేసింది.
3 సొలొమోను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పటానికి ఆమె వేసిన ప్రశ్నలలో ఏ ఒక్కటీ అతనికి కష్టమైనదిగా కన్పించలేదు.
4 షేబ దేశపు రాణి సొలొమోను చాలా తెలివైనవాడని తెలుసుకున్నది. అతను నిర్మించిన అతి సుందరమైన రాజభవనాన్ని కూడ ఆమె తిలకించింది.
5 రాజు బల్లవద్ద విలువైన భోజన పదార్థాలను ఆమె చూసింది. రాజు కింది అధికారులు సమావేశమయ్యే తీరు తెన్నులు ఆమె గమనించింది. రాజభవనంలో సేవచేయుటకు, వారు ధరించే మంచి దుస్తులను ఆమె చూసింది. రాజు ఇచ్చే విందులు, ఆయన దేవాలయంలో అర్పించే బలులు కూడా చూసింది. ఇవన్నీ ఆమెకు ఆనందము ఆశ్చర్యము కలుగజేశాయి.
6 కావున రాజుతో రాణి ఇలా అన్నది, “నీవు చేసే పనుల గురించి, నీ ప్రజ్ఞా ప్రభావాల గురించి నేను నా దేశంలో చాలా విన్నాను. నేను విన్నవన్నీ నిజమని తేలింది!
7 నేనిక్కడికి వచ్చి స్వయంగా నా కళ్లతో నేను చూచే వరకు నేను విన్నవన్నీ నిజమని నమ్మలేదు. ఇప్పుడు నేను విన్న దానికంటె ఎక్కువ ఉన్నట్లు చూశాను. నీ తెలివి తేటలు, నీ సిరిసంపదలను గురించి ప్రజలు నాకు చెప్పినదాని కంటె అవి అతిశయించి వున్నాయి.
8 నీ భార్యలు, నీ సేవకులు చాలా అదృష్టవంతులు! వారికి ఎల్లప్పుడూ నిన్ను సేవించే భాగ్యము, నీ తెలివితేటలను వినే అదృష్టము లభించింది!
9 నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక! నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్ల నిరంతర ప్రేమగలిగి వున్నాడు. కావుననే ఆయన నిన్ను రాజుగా చేశాడు; నీవు న్యాయమార్గంలో రాజ్యపాలన చేస్తున్నావు.”
10 పిమ్మట షేబ దేశపు రాణి రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని, చాలా సుగంధ ద్రవ్యాలను, రత్నాలను రాజుకు కానుకగా సమర్పించింది. ముందెన్నడూ ఎవ్వరూ ఇశ్రాయేలు రాజ్యాలలోకి తేనన్ని సుగంధ ద్రవ్యాలను షేబ దేశపు రాణి సొలొమోనుకు సమర్పించింది.
11 హీరాము యొక్క ఓడలు కూడ ఓఫీరు నుండి బంగారం తీసుకుని వచ్చాయి. ఆ ఓడలు చాలా కలప , వజ్రాలు కూడ తీసుకుని వచ్చాయి.
12 ఆ కలపను దేవాలయంలోను, రాజభవనంలోను స్తంభాలు చేయటానికి సొలొమోను ఉపయోగించాడు. గాయకులకు సితారను, స్వరమండలమును చేయటానికి కూడ ఆ కలపను అతడు ఉపయోగించాడు. ఇశ్రాయేలు లోనికి ఆ రకమైన కలపను ఎవ్వరూ తేలేదు. అప్పటినుండి మళ్లీ ఎవ్వరూ ఆ విధమైన కట్టెను చూడలేదు.
13 సాటి రాజ్యాధినేతకు ఒక రాజు ఎలాంటి కానుకలు ఇస్తాడో, ఆలాగున రాజైన సొలొమోను షేబ దేశపు రాణికి కానుకలు ఇచ్చాడు. పైగా ఆమె అడిగిన ఇతర వస్తువులను కూడా ఆమెకు సమర్పించాడు. ఆ తరువాత రాణి, ఆమె పరివారము తమ దేశానికి వెళ్లి పోయారు.
14 ప్రతి సంవత్సరం సొలొమోనుకు సుమారు ఒకవెయ్యి మూడు వందల ముప్పది రెండు మణుగుల బంగారం వచ్చేది.
15 ఇదిగాక తర్షీషునుండి వచ్చే ఓడలు బంగారం తెచ్చేవి. వ్యాపారస్తుల నుండి, అరబీ రాజులనుండి, మరియు రాజ్యంలో ఇతర ప్రాంతీయ పాలకుల నుండి కూడా రాజుకు బంగారం వచ్చేది.
16 రాజైన సొలొమోను పలకలుగా కొట్టబడిన బంగారంతో రెండు వందల పెద్ద తరహా డాళ్లను చేయించాడు. ప్రతిడాలు ఆరు వందల తులాల బంగారం కలిగి వుండేది.
17 అతడింకా మూడ వందల చిన్న తరహా డాళ్లను కూడా రేకులు గొట్టిన బంగారంతో చేయించాడు. ప్రతిడాలు నూట అరువది తులాల బంగారం కలిగివుంది. రాజు వాటిని “లెబానోను అరణ్యంలోని” విశ్రాంతి గృహములో ఉంచినాడు.
18 రాజైన సొలొమోను ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని చేయించాడు. దానికి మేలిమి బంగారు పూత పూయించాడు.
19 సింహాసనం ముందు ఆరుమెట్లు వున్నాయి. ఈ సింహాసనపు వెనుక భాగం పైన గుండ్రంగా వుంది. సింహాసనానికి ఇరువైపులా చేతులు వుంచటానికి ఆధారపు కమ్ములు వున్నాయి. సింహాసనపు చేతులు గాక సింహాల విగ్రహాలు కూడ సింహాననానికి ఇరుపక్కల వున్నాయి.
20 ఆరు మెట్లలో ప్రతి మెట్టుకు రెండు పక్కలా రెండు సింహాల బొమ్మలను పెట్టారు. ఏ ఇతర రాజ్యంలోను ఈ రకంగా సింహాలంకరణ చేసి ఉండలేదు.
21 లెబానోను అరణ్యపు భవనంలో గిన్నెలు, పాన పాత్రలు, పనిముట్లు, ఆయుధాలు, అన్నీ శుద్ధ బంగారంతో చేయబడ్డాయి. భవనంలో ఏదీ వెండితో చేయబడలేదు. సొలొమోను కాలంలో బంగారం ఎంత విరివిగా లభించేదనగా ప్రజలు వెండిని విలువైన లోహంగా అసలు పరిగణించనేలేదు!
22 వ్యాపార నిమిత్తం ఇతర దేశాలకు పంపటానికి సొలొమోనుకు చాలా ఓడలున్నాయి. ప్రతి మూడు నెలలకూ ఓడలు తిరిగి వస్తూవుండేవి. ఆ ఓడల నిండా బంగారం, వెండి, దంతం, పశువులు రాజుకొరకు తేబడేవి.
23 ఈ భూమి మీద సొలొమోను మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన రాజు. రాజులందరికంటె అతనికి ధనం, తెలివి తేటలు విశేషంగా ఉన్నాయి.
24 ప్రతి చోట ప్రజలు రాజైన సొలొమోనును చూడాలని ఆరాట పడేవారు. యెహోవా అతనికిచ్చిన మహా జ్ఞానాన్ని వారంతావిని తెలుసుకుని ఆనందించాలని కుతూహలపడేవారు.
25 ప్రతి సంవత్సరం రాజును చూడ్డానికి ప్రజలు వచ్చేవారు. వచ్చిన ప్రతివాడూ ఏదో ఒక కానుక పట్టుకు వచ్చేవాడు. వారు వెండి, బంగారు వస్తువులు, దుస్తులు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచర గాడిదలు మొదలగు వాటిని తెచ్చేవారు.
26 కావున సొలొమోను అనేక రథములను, గుర్రములను కలిగియున్నాడు. అతనికి ఒక వెయ్యి నాలుగు వందల రథములు, పన్నెండు వేల గుర్రములు వున్నాయి. సొలొమోను ప్రత్యేక నగరాలను నిర్మించి ఈ రథాలన్నిటినీ వాటిలో వుంచాడు. కాని రాజైన సొలొమోను కొన్ని రథాలను తనతో యెరూషలేములో వుంచుకున్నాడు.
27 రాజు ఇశ్రాయేలును మిక్కిలి సంపన్న దేశంగా చేశాడు. యెరూషలేము నగరంలో వెండి రాతి గుట్టల్లా, దేవదారు చెక్కల్లా, కొండల్లో, కోనల్లో కాచే మేడి పండ్లలా అతి సామాన్యమై పోయింది.
28 ఈజిప్టు నుంచి, కూషునుంచి సొలొమోను గుర్రములను తెప్పించే వాడు. అతని వర్తకులు వాటిని కూయిలో కొన్ని ఇశ్రాయేలుకు తెచ్చేవారు.
29 ఈజిప్టు నుండి తెచ్చిన రథం ఒక్కటికి ఆరు వందల తులాల వెండి, గుర్రం ఒక్కటికి నూట ఏబది తులాల వెండి చొప్పున చెల్లించేవారు. సొలొమోను గుర్రాలను, రథాలను హిత్తీయుల రాజులకు మరియు అరాము రాజులకు అమ్మెడివాడు.
1 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు కాని వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. అలాంటి స్త్రీలలో ఫరో కుమారై, మెయాబీయులు, అమ్మెనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు వున్నారు.
2 గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు. “ కాని సొలొమోను ఈ స్త్రీల వ్యామోహంలో పడ్డాడు.
3 సొలొమోనుకు ఏడు వందల మంది భార్యలున్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమారైలే) అతనికి ఇంకను మూడు వందల మంది బానిస స్త్రీలు ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పుదారి పట్టించి దేవునికి దూరం చేశారు.
4 సొలొమోను వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు సొలొమోను చూపలేకపొయాడు.
5 సొలొమోను అష్ఠారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీయుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర విగ్రహం.
6 ఈలాగున సొలొమోను యెహోవా పట్ల అపచారం చేశాడు. తన తండ్రి దావీదువలె సొలొమోను సంపూర్ణంగా యెహోవాని అనుసరించలేదు.
7 కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక విగ్రహం.
8 ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం సొలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మించాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం వేసి, బలులు సమర్పించేవారు.
9 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి సొలొమోను దూరమైనాడు. కావున యెహోవా సొలొమోను పట్ల కోపం వహించాడు. సొలొమోనుకు యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు.
10 చిల్లర దేవుళ్లను ఆరాధించరాదని యెహోవా సొలొమోనుకు చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ లేదు.
11 కావున యెహోవా సొలొమోనుతొ ఇలా అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అనుసరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాను. దానిని నీ సేవకునికి ఇస్తాను.
12 కాని నీ తండ్రి దావీదును నేను మిక్కిలి ప్రేమించియున్నాను. అందువల్ల నీవు బతికియుండగా నీ రాజ్యం నీ నుండి తీసుకొనను. నీ కుమారుడు రాజు అయ్యే వరకు నేను వేచి వుంటాను. అప్పుడు వాని నుండి దానిని నేను తీసుకుంటాను.
13 అప్పుడు కూడ, రాజ్యాన్నంతా నీ కుమారుని వద్ద నుండి తీసుకోను. అతను పరిపాలించటానికి ఒక తెగను అతనికి వదిలి వేస్తాను. ఉన్నతుడైన నా సేవకుడగు దావీదు కొరకు నేనది చేయదలిచాను. నేను ఎంపిక చేసుకున్న యెరూషలేము నగరం కొరకు నేనలా చేస్తాను.”
14 ఆ సమయంలో ఎదోమీయుడగు హదదు అను వానిని యెహోవా సొలొమోనుకు శత్రువయ్యేలా చేశాడు. అతడు ఎదోము వంశానికి చెందిన వారిలో ఒకడు.
15 అది ఇలా జరిగింది. ఇదివరలో దావీదు ఎదోము రాజ్యాన్ని ఓడించాడు. అప్పుడు దావీదు సైన్యాధిపతిగా యోవాబు వున్నాడు. చనిపోయిన వారిని పాతి పెట్టించేందుకు యోవాబు ఎదోములోకి వెళ్లాడు. కాని అతడు అక్కడవున్న మగవారినందరినీ చంపేశాడు.
16 యోవాబు, ఇశ్రాయేలీయులందరూ ఎదోములో ఆరు నెలలు వున్నారు. ఆ సమయంలోనే వారు ఎదోములో వున్న పురుషులనందరినీ చంపేశారు.
17 కాని అప్పటికి హదదు చాలా చిన్నవాడు. కావున హదదు ఈజిప్టుకు పారిపోయాడు. హదదు తండ్రి యొక్క సేవకులు కొందరు అతనితో కలిసి వెళ్లారు.
18 వారు మిద్యాను దేశము నుండి పారానుకు వెళ్లారు. పారాను దేశంలో వారితో మరి కొందరు కలిశారు. వారంతా కలిసి ఈజిప్టుకు వెళ్లారు. ఈజిప్టు రాజగు ఫరో వద్దకు వెళ్లి సహాయం అర్థించారు. హదదుకు ఒక ఇంటిని, కొంత భూమిని ఫరో ఇచ్చాడు. ఫరో అతనికి అన్ని అండ దండలు ఇచ్చి, ఆహారం కూడా ఏర్పాటు చేశాడు.
19 హదదును ఫరో మిక్కిలి అభిమానించాడు. హదదుకు ఫరో ఒక భార్యను కూడా ఇచ్చాడు. ఆమె ఫరో మరదలే! (ఫరో భార్య పేరు రాణి తహ్పెనేసు)
20 అనగా తహ్పెనేసు యొక్క సోదరి హదదును వివాహమాడింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు గెనుబతు. రాణి తెహ్పెనేను గెనుబతును తన పిల్లలతో పాటు ఫరో ఇంటిలోనే పెరగనిచ్చింది.
21 దావీదు చనిపోయినట్లు ఈజిప్టులో వున్న హదదు విన్నాడు. సైన్యాధిపతి యోవాబు కూడ చనిపోయినట్లు అతడు విన్నాడు. అందువల్ల హదదు ఫరో వద్దకు వెళ్లి, “నన్ను నా స్వదేశానికి వెళ్ల నియ్యండి” అని అడిగాడు.
22 “నీకు ఇక్కడ కావలసినవనన్నీ సమకూర్చాను! మరి నీవెందుకు నీ స్వదేశానికి వెళ్లిపోవాలను కుంటున్నావు?” అని ఫరో అన్నాడు. అయితే హదదు మాత్రం, “దయచేసి నన్ను మాత్రం ఇంటికి వెళ్లనీయండి” అని ప్రాధేయపడ్డాడు.
23 సొలొమోనుకు మరొక వ్యక్తి శత్రువయ్యేలా యెహోవా చేశాడు. అతడు ఎల్యాదా కుమారుడైన రెజోను. రెజోను తన యజమాని వద్ద నుండి పారిపోయాడు. సోబా రాజైన హదదెజరు ఇతని యజమాని.
24 దావీదు సోబా సైన్యాన్ని ఓడించిన పిమ్మట రెజోను కొంత మందిని చేరదీసి ఒక చిన్న సైన్యాన్ని తయారు చేశాడు. రెజోను దమస్కుకు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. తరువాత అతను దమస్కుకు రాజు అయ్యాడు.
25 రెజోను అరాము దేశమును పాలించాడు. రెజోను ఇశ్రాయేలును అనహ్యించు కొనేవాడు. కావున సొలొమోను బతికినంత కాలం రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగానే వున్నాడు. రెజోను, హదదు ఇశ్రాయేలులో చాలా అలజడిని సృష్టించారు.
26 నెబాతు కుమారుడైన యరొబాము సొలొమోను సేవకులలో ఒకడు. యరొబాము ఎఫ్రాయీము ప్రజలవాడు. అతడు జెరేదా పట్టణానికి చెందినవాడు. యరొబాము తల్లి పేరు జెరూహా. అతని తండ్రి మరణించాడు. అతడు రాజుకు వ్యతిరేకి అయ్యాడు.
27 యరొబాము రాజుకు వ్యతిరేకం కావటానికి ఒక కారణం వుంది. సొలొమోను మిల్లో కట్టించి, తన తండ్రి దావీదు నగర గోడను సరిచేస్తూ వున్నాడు.
28 యరొబాము చాలా బలశాలి. అతడు మంచి పనివాడని సొలొమోను గమనించాడు. అందుచే అతనిని యోసేపు వంశంవారు చేసే అతి కష్టమైన పనుల మీద అధికారిగా నియమించాడు.
29 ఒక రోజు యరొబాము యెరూషలేము నుండి ప్రయాణం చేస్తూ వున్నాడు. షిలోనీయుడైన ప్రవక్త అహీయా దారిలో యరొబామును కలిశాడు. అహీయా నూతన వస్త్రం ధరించియున్నాడు. పొలాల్లో వారిద్దరు తప్ప మరెవ్వరూ లేరు.
30 అహీయా తాను ధరించిన నూతన వస్త్రం తీసి దానిని పన్నెండు ముక్కలుగా చించాడు.
31 అప్పుడు అహీయా యరొబాముతో ఈ విధంగా చెప్పాడు: “ఈ వస్త్రంలో పది ముక్కలు నీవు తీసుకో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమి చెప్పినాడనగా: ‘ఈ రాజ్యాన్ని సొలొమోను నుండి దూరం చేస్తాను. అప్పుడు నీకు పది గోత్రాలను ఇస్తాను.
32 కాని దావీదు కుటుంబం ఒక గోత్రపువారిని ఏలటానికి అనుమతి ఇస్తాను. ఇది నా సేవకుడైన దావీదు జ్ఞాపకార్థం, యెరూషలేము నగరం కొరకు నేను దీనిని చేస్తాను. ఇశ్రాయేలు వంశాలవారుండే నగరాలన్నింటిలో యెరూషలేమును నేను ఎన్నుకున్నాను.
33 సొలొమోను నన్ననుసరించటం మానివేసినందుకు నేను ఇదంతా చేయదలిచాను. నన్ను విడిచి అతను సీదోనీయుల దేవత అష్ఠారోతును, మోయాబీయుల దేవత కెమోషును, అమ్మోనీయుల దేవత మిల్కోమును మొక్కుతున్నాడు. ఉత్తమ కార్యాలను, ధర్మ మార్గాన్ని అనుసరించటం సొలొమోను మానివేశాడు. నా న్యాయసూత్రాలను, ఆజ్ఞలను శిరసావహించటం లేదు. తన తండ్రి దావీదు నడచిన మార్గాన అతడు నడుచుట లేదు.
34 కావున అతని నుండి రాజ్యాన్నంతా తీసుకుంటాను. అయినా అతను బతికినంత కాలం తాను రాజుగా వుండేలా చూస్తాను. నా సేవకుడైన దావీదు గౌరవార్థం నేనలా చేస్తాను. నేను దావీదును ఎందుకు ఎన్నుకున్నాననగా అతడు నా ఆజ్ఞలను, నా ధర్మసూత్రాలను అన్నిటినీ పాటించాడు.
35 ఈ రాజ్యాన్ని నేనతని కుమారుని వద్ద నుండి తీసుకుంటాను. మరియు యరొబామా, పది వంశాల వారిని పరిపాలించటానికి నీకు అనుమతి ఇస్తాను.
36 సొలొమోను కుమారుడు ఒక వంశం వారిపై పాలనాధికారం కలిగి వుండేలా చేస్తాను. నా సేవకుడైన దావీదు నా ముందు యెరూషలేములో ఎల్లప్పుడూ రాజ్యం కలిగి వుండేటందుకు ఆ విధంగా చేస్తాను. యెరూషలేమును నా స్వంత నగరంగా నేను ఎన్నుకున్నాను.
37 కాని నీవు కోరినంత మట్టుకు నీవు రాజ్యం చేయగలిగేలా చేస్తాను. ఇశ్రాయేలు నంతటినీ నీవు ఏలుబడి చేస్తావు.
38 నీవు గనుక నా న్యాయ సూత్రాలను, నా ఆజ్ఞలను పాటిస్తూ సన్మార్గంలో నడిస్తే ఇవన్నీ జరిగేలా నేను చేస్తాను. దావీదు నా ధర్మ సూత్రాలను, ఆజ్ఞలను పాటించినట్లు నీవు కూడ పాటిస్తే నేను నీకు తోడైవుంటాను. దావీదుకు చేసినట్లు, నీ వంశం కూడ రాజ వంశమయ్యేలా చేస్తాను. ఇశ్రాయేలును నీకిస్తాను.
39 ఆజ్ఞాపాలన చేయకపోయిన కారణంగా దావీదు సంతానాన్ని నేను శిక్షిస్తాను. కాని వారిని నేను శాశ్వతంగా శిక్షకు గురి చేయను.”‘
40 సొలొమోను యరొబామును చంప ప్రయత్నించాడు. కాని యరొబాము ఈజిప్టుకు పారిపోయాడు. ఈజిప్టు రాజగు షీషకు వద్దకు అతను వెళ్లాడు. సొలొమోను చనిపోయేవరకు యరొబాము అక్కడేవున్నాడు.
41 తన పరిపాలనా కాలంలో సొలొమోను అనేకమైన ప్రజ్ఞాప్రాభవాలతో కూడిన పనులను చేశాడు. ఈ విషయాలన్నీ సొలొమోను చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.
42 యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటిపైన సొలొమోను నలుబది సంవత్సరాలు పరిపాలన చేశాడు.
43 తరువాత సొలొమోను చనిపోయాడు. అతడు తన పూర్వీకులతో సమాధి చేయబడ్డాడు . అతడు తన తండ్రియగు దావీదు పురములో సమాధి చేయబడ్డాడు.
1 [This verse may not be a part of this translation]
2 [This verse may not be a part of this translation]
3 ఇశ్రాయేలు ప్రజలంతా షెకెమునకు వెళ్లారు. వారంతా రెహబామును రాజుగా చేయటానికి వెళ్లారు. రెహబాము కూడా రాజు కావటానికి షెకెమునకు వెళ్లాడు.
4 ప్రజలు రెహబాముతో, “నీ తండ్రి మమ్మల్ని బలవంతంగా భరింపరాని శరీర కష్టం చేయించాడు. కాని ఇప్పుడు నీవు మాకు శ్రమ తగ్గించాలి. నీ తండ్రి మాకు విధించిన శరీరకష్టం నీవు మాన్పించాలి. అప్పుడు మేము నీకు సేవ చేస్తాము” అని అన్నారు.
5 దానికి సమాధానంగా రెహబాము, “మూడు రోజుల తరువాత నా వద్దకు రండి. అప్పుడు మీకు నేను సమాధానం చెపుతాను” అని అన్నాడు. కావున ప్రజలంతా వెళ్లిపోయారు.
6 సొలొమోను జీవించిపున్నప్పుడు అతనికి పరిపాలనలో సహాయపడిన కొందరు పెద్దలైన సలహాదారులున్నారు. కావున రాజైన రెహబాము ఈ సందర్భంలో, “ఆ ప్రజలకు ఏమి చెప్పాలని మీరను కొంటున్నారు?” అని సలహా అడిగాడు.
7 పెద్దలు ఇలా అన్నారు, “ఈ రోజు నీవు వారి సేవకునిలా మెలగితే’ రేపు వారంతా నిన్ను సేవిస్తారు. నీవు వారితో ప్రేమగా కనికరంతో మాట్లాడితే వారంతా నీ కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తారు.”
8 కాని రెహబాము వారి సలహాను పెడచెవిని పెట్టాడు. తన స్నేహితులైన యువకులను మళ్లీ సలహా అడిగాడు.
9 “నీ తండ్రి ఇచ్చిన కఠినమైన పనికంటె తక్కువ పని ఇమ్మని ప్రజలు నన్నడుగుతున్నారు. నేనేమి సమాధానం చెపితే మంచిదని మీరనుకుంటున్నారు? నన్నేమి చెప్పమంటారు?” అని రెహబాము తన స్నేహితులను అడిగాడు.
10 రాజు యొక్క యువ స్నేహితులు, “ఆ ప్రజలు నీ వద్దకు వచ్చి, ‘నీ తండ్రి మమ్మల్ని బండ చాకిరి చేయటానికి బలవంతం చేశాడు. కనుక మా పనిని ఇప్పుడు సులభం చేయుము’ అని అడిగారు కదా! అయితే నీవిప్పుడు కొన్ని డంబాలు పలికి, ‘నా చిటికెనవేలు నా తండ్రి శరీరం కంటె పెద్దదిగా వుంది.
11 నా తండ్రి మిమ్మల్ని బండ చాకిరికి గురిచేశాడు. కాని నేను మిమ్మల్ని ఇంకా కష్టపడేలా చేస్తాను! నా తండ్రి మీచేత పని చేయించటానికి కొరడాలు ఉపయోగించాడు. కాని నేను పదునైన లోహపు ముక్కలతో కూర్చబడిన కొరడాలతో, మిమ్మల్ని చీల్చునట్లుగా కొడతాను” అని సమాధానం చెప్పమన్నారు.
12 రెహబాము ప్రజలను, “మూడు రోజుల తరువాత తన వద్దకు రమ్మని” చెప్పాడు. కావున మూడు రోజుల తరువాత ఇశ్రాయేలీయులంతా రెహబాము వద్దకు వచ్చారు.
13 అప్పుడు రాజైన రెహబాము వారితో చాలా పౌరుషంగా మాట్లాడాడు. పెద్దలిచ్చిన సలహా రాజు పెడచెవిని పెట్టాడు.
14 తన యువ స్నేహితులు చెప్పినదే చేశాడు. రెహబాము వారితో, “నా తండ్రి మిమ్మల్ని హింసించి శరీర కష్టం చేయించాడు. కాని నేను మీకు ఇంకా కఠినమైన పని ఇస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టి పని చేయించాడు. కాని నేను మిమ్మల్ని ఎలా కొడతానంటే మీరు తేళ్లు కుట్టినట్లు బాధపడతారు!” అని చెప్పాడు.
15 కావున రాజు తన ప్రజలు కోరిన దానిని చేయలేదు. ఇదంతా యెహోవాయే తన చిత్తప్రకారం జరిపించాడు. తాను నెబాతు కుమారుడైన యరొబాముకు ఇచ్చిన వాగ్దాం నెరవేరేలాగున యెహోవా ఇది ఈ విధంగా జరిగేలా చేశాడు. షిలోహుకు చెందిన ప్రవక్త అహియా ద్వారా ఈ వాగ్దానం చేశాడు.
16 ఇశ్రాయేలీయులంతా కొత్త రాజు తమ అభ్యర్థన వినలేదని గమనించారు. అందువల్ల ప్రజలు ఇలా అన్నారు: “మనం దావీదు వంశానికి చెందినవారమా? కాదు, యెష్షయి రాజ్యంలో మనకేమైనా వస్తుందా? రాదు! కావున ఇశ్రాయేలు సోదరులారా, మనమంతా మన ఇండ్లకు పోదాం పదండి, దావీదు కుమారుణ్ణి తన ప్రజలను ఏలుకోనీయండి!” తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లపోయారు.
17 అయినా రెహబాము యూదా నగరాలలో ఉన్న ఇశ్రాయేలీయులందరినీ ఏలాడు.
18 కూలిపని చేసే వారిపై అదోరాము అనునతడు అధికారిగా వుండేవాడు. రాజైన రెహబాము అదోరామును ప్రజలతో మాట్లాడేటుందుకు పంపాడు. కాని ఇశ్రాయేలీయులు వానిని రాళ్లతో కొట్టి చంపేశారు. అది విని రాజైన రెహబాము తన రథమెక్కి యెరూషలేముకు తప్పించుకుపోయాడు.
19 అలా ఇశ్రాయేలీయులు దావీదు వంశంపై తిరుగుబాటు చేశారు. వారు ఈనాటికీ దావీదు వంశానికి వ్యతిరేకులుగానే వున్నారు.
20 యరొబాము తిరిగి వచ్చినట్లు ఇశ్రాయేలీయులు విన్నారు. కావున వారతనిని ఒక సభకు ఆహ్వానించి, ఇశ్రాయేలంతటికీ రాజుగా చేశాడు. యూదాగోత్రం వారొక్కరు మాత్రమే దావీదు కుటుంబాన్ని అనుసరించారు.
21 రెహబాము యెరూషలేముకు తిరిగి వెళ్లాడు. అతడు యూదా గోత్రపువారిని బెన్యామీను గోత్రపు వారిని సమావేశపరిచాడు. వారిని ఒక లక్షా ఎనుబదివేల మందిగల ఒక సైన్యంగా తయారు చేశాడు. రెహబాము ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయ సంకల్పించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని అతని కోరిక.
22 కాని యెహోవా ఒక దైవజ్ఞుని (ప్రవక్త)తో మాట్లాడాడు. అతని పేరు షెమయా. యెహోవా ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు:
23 “నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతోను, మరియు యూదా బెన్యామీను ప్రజలతోను మాట్లాడు.
24 మీ సోదరుల మీదికి మీరు యుద్ధానికి వెళ్లవద్దని నా మాటగా వారికి చెప్పు ‘మీలో ప్రతి ఒక్కడూ ఇంటికి వెళ్లాలి. ఇవన్నీ జరిగేలా నేనే చేశాను.’ ఈ విషయం యెహోవా మీకు తెలియ చేయమన్నాడని చెప్పు.” ప్రవక్త వెళ్లి చెప్పగా రెహబాము సైన్యంలోని వారంతా విని యెహోవా ఆజ్ఞ శిరసాపహించారు. వారు ఇండ్లకు వెళ్లారు.
25 యరొబాము తరువాత షెకెమును చాలా బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. ఆ నగరం ఎఫ్రాయీము కొండలలో వుంది. యరొబాము అక్కడ నివసించాడు. అతడు పెనూయేలు అను నగరానికి వెళ్లి దానిని కూడ మంచి పటిష్ఠమైన నగరంగా చేశాడు.
26 [This verse may not be a part of this translation]
27 [This verse may not be a part of this translation]
28 అందువల్ల తాను ఏమి చేయాలో తెలియజేయమని రాజు తన సలహాదారులను అడిగాడు. వారి సలహామేరకు అతడు రెండు బంగారు కోడెదూడలను చేయించాడు. రాజైన యరొబాము ప్రజలనుద్దేశించి, “మీరు దేవుని ఆరాధించేందుకు యెరూషలేముకు వెళ్లవద్దు. ఇశ్రాయేలీయులారా, ఇవిగో మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకుని వచ్చిన దేవతలు ఇవే” అని అన్నాడు.
29 అలా అని రాజైన యరొబాము ఒక బంగారు కోడెదూడ బొమ్మను బేతేలునందును, రెండవ దానిని దాను నగర మందును ప్రతిష్ఠించాడు.
30 కాని ఇది ఘోరమైన పాపం. ప్రజలు బేతేలు, దాను నగరాలకు ప్రయాణమై కోడెదూడల విగ్రహాలను ఆరాధించటం మొదలు పెట్టారు.
31 గుట్టల మీద, కొండల మీద యరొబాము ఆరాధనా స్థలాలను కట్టించాడు. వివిధ వంశాల నుండి యాజకులను ఎంపిక చేశాడు. (కేవలం లేవీయులనుండి మాత్రమే అతడు యాజకులను ఎంపిక చేయలేదు).
32 రాజైన యరొబాము ఒక కొత్త పండుగరోజు ప్రకటించాడు. ఇది పస్కా పండుగ వంటిది. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. (ఒకటవ నెల పదిహేనవ రోజున కాదు). యూదాలో బేతేలు నగరంలో వున్న పీఠం వద్ద ఆ రోజున రాజు బలులు సమర్పించాడు. తాను తయారు చేయించిన దూడల బొమ్మలకు రాజు బలులు అర్పించేవాడు. తను ఏర్పాటు చేసిన దేవాలయాలలో సేవ చేయటానికి రాజైన యరొబాము యాజకులను బేతేలు నుండి కూడ తీసుకున్నాడు.
33 కావున రాజైన యరొబాము ఇశ్రాయేలీయులకు పండుగ నిమిత్తం తనకు అనుకూలమైన రోజును మాత్రమే నిర్ణయించాడు. అది ఎనిమిదవ నెలలో పదునైదవ రోజు. ఆ సమయంలో అతను నిర్మించిన బలిపీఠాల వద్ద అతడు బలులు సమర్పించి, ధూపం వేసేవాడు. (ఈ కార్యాలు) అతను బేతేలు నగరంలో నిర్వహించేవాడు.
1 ఒక రోజు యూదా దేశపువాడైన ఒక దైవజనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం వేస్తూ వున్నాడు.
2 ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా దైవజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: “బలిపీఠమా, నీకు యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘దావీదు వంశంలో యోషీయా అనువాడొకడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉపయోగపడవు. “‘
3 ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక సూచనఇచ్చాడు. “యెహోవా ఈ సూచన నాకు తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలిపోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” అని ప్రవక్త అన్నాడు.
4 బేతేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన సమాచారాన్ని రాజైన యరొబాము విన్నాడు. అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్రవక్తవైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” అని అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్చలేక పోయాడు.
5 అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా ఆ దైవజనుడు దీనినే చెప్పాడు.
6 అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు. తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.
7 అప్పుడు రాజు ఆ దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.
8 అది విన్న ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, తాగను.
9 ఏదీ తినకూడదని తాగరాదని యెహోవా ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని అన్నాడు.
10 అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట తను తిరిగి వెళ్లలేదు.
11 ఆ రోజులలో బేతేలు నగరంలో వృద్ధుడైన ఒక ప్రవక్త నివసిస్తూ వుండేవాడు. ఆ వృద్ద ప్రవక్త యొక్క కుమారులు దైవజనుడు వచ్చి బేతేలు నగరంలో చేసినదంతా తమ తండ్రితో చెప్పారు. రాజైన యరొబాముతో ఆ దైవజనుడు చెప్పినదంతా కూడా వారు తమ తండ్రికి వివరించారు.
12 అయితే “అతడు ఏ మార్గాన వెళ్లాడని” వృద్ధ ప్రవక్త అడిగాడు. యూదానుండి వచ్చిన దైవజనుడు వెళ్లిన దారిని తమ తండ్రికి అతని కుమారులు చూపించారు.
13 వృద్ధ ప్రవక్త తన కుమారులతో అతని గాడిదపై గంత వేయమని చెప్పాడు. వారతిని గాడిదపై గంత వేయగా, దానిపై ఎక్కి ప్రవక్త ప్రయాణమై వెళ్లాడు.
14 ఆ వృద్ధ ప్రవక్త దైవజనుడిని వెతుక్కుంటూ పోయాడు. దైవజనుడు ఒక సింధూర వృక్షం కింద కూర్చుని వుండటం వృద్ద ప్రవక్త చూశాడు. “యూదానుండి వచ్చిన దైవజనుడవు నీవేనా?” అని వృద్ధ ప్రవక్త అడిగాడు. “అవును నేనే” అన్నాడు దైవజనుడు.
15 “అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.
16 కాని దైవజనుడిలా అన్నాడు: “నేను నీతో రాలేను. నీతో ఈ ప్రదేశంలో అన్నపానాదులు తీసుకోలేను.
17 ‘అక్కడ నీవేదీ తినరాదు; తాగరాదు. నీవు వెళ్లిన దారిన తిరిగి రాకూడదు; అని కూడ యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు.”
18 “కాని నేను కూడా నీలాగే ఒక ప్రవక్తను” అన్నాడు ఆ వృద్ధ ప్రవక్త. అతడు ఒక అబద్ధం కూడా చెప్పాడు. “యెహోవా యొక్క దేవదూత నావద్దకు వచ్చాడు. ఆ యెహోవా యొక్క దేవదూత నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్లమని, నాతో నీవు భోజనాదులు చేసేలా అనుమతివ్వమనీ అన్నాడు” అని చెప్పాడు.
19 ఈ మాటలు నమ్మి ఆ దైవజనుడు వృద్ధ ప్రవక్త ఇంటికి వెళ్లాడు. అతనితో కలిసి భోజనాదికములు చేశాడు.
20 వారు బల్లవద్ద కూర్చునివుండగా, యెహోవా వృద్ధ ప్రవక్తతో మాట్లాడాడు.
21 ఆ వృద్ధ ప్రవక్త యూదా దేశపు దైవజనునితో ఇలా అన్నాడు: “ప్రభువాజ్ఞ నీవు పాటించలేదని ఆయన అన్నాడు! యెహోవా ఆదేశించిన దానిని నీవు చేయలేదు.
22 ఈ ప్రదేశంలో నీవు ఏమీ తినరాదనీ, తాగరాదనీ యెహోవా ఆజ్ఞాపించాడు. కాని నీవు తిరిగి వచ్చి భోజనాదికాలు నిర్వర్తించావు. అందువల్ల నీ శవం నీ పితరుల సమాధిలో ఉంచబడదు.”
23 దైవజనుడు భోజనం ముగించాడు. వృద్ధ ప్రవక్త గాడిదపై గంత వేయగా, దైవజనుడు దానిపై వెళ్లాడు.
24 తను ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో ఒక సింహం దైవజనుని మీదపడి చంపేసింది. దైవజనుని శరీరం బాటపై పడివుంది. గాడిద, సింహం శవం పక్కన నిలబడివున్నాయి.
25 కొందరు ఆ దారిన పోతూ, శవం పక్కన సింహం నిలబడివుండటం చూశారు. వృద్ధ ప్రవక్త వున్న నగరానికి వచ్చి, వారు దారిలో చూసినదంతా చెప్పారు.
26 ఆ వృద్ధ ప్రవక్తే యూదా దేశాపు దైవజనుని వెనుకకు తీసుకొని వచ్చాడు. వృద్ధ ప్రవక్త జరిగినదంతావిని, “ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. అందువలన యెహోవా ఒక సింహాన్ని అతనిని చంపటానికి పంపాడు. ఇది చేస్తానని యెహోవా చెప్పియున్నాడు” అని అన్నాడు.
27 “తన గాడిదపై గంతవేయమని” తన కుమారులతో ప్రవక్త చెప్పాడు. తన కుమారులు గాడిదపై గంతవేశారు.
28 వృద్ధ ప్రవక్త దానిపై వెళ్లి శవం బాటపై పడివుండటం చూశాడు. గాడిద, సింహం ఇంకా శవం పక్కన నిలబడి వున్నాయి. పైగా ఆ సింహం శవాన్ని తినటం గాని, గాడిదను గాయపర్చటం గాని చేయలేదు.
29 వృద్ధ ప్రవక్త శవాన్ని తన గాడిదపై వేశాడు. దైవజనుని మృతికి సంతాపం తెలియజేయటానికి శవాన్ని ప్రవక్త వెనుకకు తీసుకుని వచ్చాడు.
30 శవాన్ని ప్రవక్త తన కుటుంబానికి సంబంధించిన సమాధిలో పెట్టాడు. వృద్ధ ప్రవక్త అతని మృతికి సంతాపం తెలియజేశాడు. ఆ ప్రవక్త, “ఓ నా సహోదరుడా, నీ మరణానికి మిక్కిలి విలపిస్తున్నాను” అని అన్నాడు.
31 వృద్ధ ప్రవక్త దైవజనుని శవాన్ని పాతిపెట్టాడు. తరువాత తన కుమారులతో ఇలా అన్నాడు: “నేను చనిపోయినప్పడు నా శవాన్ని ఇదే సమాధిలో ఉంచండి. నా ఎముకలను అతని అస్థికల పక్కనే ఉంచండి.
32 యెహోవా అతని ద్వారా చెప్పిన మాటలు నిజమయి తీరుతాయి. యెహోవా బేతేలులోని బలిపీఠానికి, సమరియ పట్టణాలలోని ఉన్నత స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి అతనిని ఉపయోగించుకున్నాడు. “
33 రాజైన యరొబాములో ఏమీ మార్పు రాలేదు. అతడు చెడ్డ పనులు చేస్తూనే వున్నాడు. వేర్వేరు వంశాల నుండి మనుష్యులను అతడు యాజకులుగా ఎంపిక చేస్తూనే వున్నాడు. ఈ యాజకులు ఉన్నత ప్రదేశాలలో పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఎవరు యాజకుడు కావాలనుకుంటే వారికా అవకాశం ఇవ్వబడింది.
34 ఇది ఒక మహా పాపమై తన రాజ్యం సర్వ నాశనం కావటానికి ప్రధాన కారాణమయ్యింది.
1 ఆ సమయంలో యరొబాము కుమారుడు అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు.
2 యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు.
3 ప్రవక్త కొరకు పదిరొట్టెలను, తీపి పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్తయైన అహీయా అంతా చెపుతాడు. “
4 అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి వాడయ్యాడు. చూపుపోయింది.
5 కాని ఈ లోపు యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూవుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరించాడు. యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది. ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె ప్రయత్నిస్తూ వుంది.
6 ఆమె ద్వారం వద్దకు వచ్చినట్లు అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను.
7 నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. యెహోవా ఇలా అంటున్నాడు: ‘యరొబామా, ఇశ్రాయేలీయులందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను.
8 దావీదు వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా సేవకుడగు దావీదువలె నీవు ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృదయంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీకరించిన వాటినే అతడు చేసేవాడు.
9 కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది.
10 కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను.
11 నగరంలో చనిపోయిన నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు పొడుచుకు తింటాయి.’ ఇదే యెహోవా వాక్కు.”
12 యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటికి వెళ్లు. నీవు నగర ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు.
13 ఇశ్రాయేలంతా వాని కొరకు విలపించి, అతనిని సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్రభువైన ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు.
14 యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది.
15 అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు.
16 యరొబాము పాపం చేశాడు. అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు.”
17 యరొబాము భార్య తిర్సాకు తిరిగి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు.
18 ఇశ్రాయేలీయులంతా అతని కొరకై విలపించి, అతనిని సమాధిచేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడైన ప్రవక్త అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు.
19 రాజైన యరొబాము అనేకమైన ఇతర పనులు చేశాడు. అతడు యుద్ధాలు చేశాడు. ప్రజాపాలన కొనసాగించాడు. అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వివరించబడ్డాయి.
20 యరొబాము రాజుగా ఇరువది రెండు సంవత్సరాలు పరి పాలించాడు. తరువాత అతడు చనిపోగా, వానిని అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని కుమారుడు నాదాబు అతని స్థానంలో రాజైనాడు.
21 యూదాకు రాజయ్యేనాటికి సొలొమోను కుమారుడు రెహబాము 41 సంవత్సరాలవాడు. యెరూషలేము నగరంలో రెహబాము పదిహేడు సంత్సరాలు పాలించాడు. ఈ నగరంలోనే యెహోవా తాను గౌరవింపబడాలని నిశ్చయించాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటిలో ఈ నగరాన్నే ఆయన ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నయమా.
22 యూదా ప్రజలు యెహోవా దృష్టిలో పాపకార్యాలు చేయటం కొనసాగించారు. వారంటే కోపగించుకొనేలా ప్రజలు యెహోవా పట్ల అనేక పాప కార్యాలు చేశారు. వారికి ముందు నివసించిన వారి పితరులకంటె ఘోరమైన పాపాలను వారు చేశారు.
23 ఆ ప్రజలు ఉన్నత స్థలాలను , స్మారకశిలను, పవిత్ర కొయ్యగుంజలను నిర్మించారు. వీటన్నిటినీవారు కొండల మీద, పచ్చని చెట్ల కింద ఏర్పాటు చేశారు.
24 దేవుని ఆరాధన పేరుతో నీచమైన లైంగిక కార్యాలకు అమ్ముడు పోయే పురుషులు కూడా అక్కడ వున్నారు. యూదా వారు కూడా చాలా చెడుకార్యలకు పాల్పడ్డారు. వారికి ముందు ఈ రాజ్యంలో నివసించిన జనులు కూడా అదే రకపు చెడుకార్యాలు చేశారు. అందుచే యెహోవా రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు.
25 రెహబాము రాజ్యానికి వచ్చిన ఐదవ సంవత్సరంలో, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము పైకిదండెత్తి వచ్చాడు.
26 షీషకు దేవాలయ ఖజానాను, రాజభవనాన్ని కొల్లగొట్టాడు. అరాము రాజైన హదదెజరు సైనికుల నుండి దావీదు తీసుకున్న బంగారు డాళ్లను కూడా అతడు ఎత్తుకొనిపోయాడు. దావీదు ఈ డాళ్లను యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. షీషకు బంగారు డాళ్లన్నీ పట్టుకు పోయాడు.
27 అందువల్ల రాజైన రెహబాము వీటికి మారుగా చాలా డాళ్లను చేయించాడు. అయితే ఈ డాళ్లన్నీ బంగారానికి బదులు కంచుతో చేయబడ్డాయి. రాజభవన ద్వార పాలకులకు అతనియొక్క డాళ్లను ఇచ్చాడు.
28 రాజు యెహోవా దేవాలయానికి వెళ్లినప్పుడల్లా తన అంగరక్షకులు వెంట వెళ్లేవారు. వారు డాళ్లను చేతబట్టుకొని వెళ్లేవారు. వారు పని ముగించిన పిమ్మట వాటిని రక్షక భటుల గదిలో గోడకు తగిలించేవారు.
29 రాజైన రెహబాము చేసిన కార్యాలన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంధంలో పొందుపర్చబడ్డాయి.
30 రెహబాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ వుండేవారు.
31 రెహబాము చనిపోగా అతను తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధి చేయబడినాడు. (అతని తల్లి అమ్మోనీయురాలగు నయమా) రెహబాము కుమారుడు అబీయాము అతని స్థానంలో రాజయ్యాడు.
1 నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలును పాలిస్తూ పుండెను. అతని పాలనలో పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీయాము యూదాకు రాజు అయ్యాడు.
2 అబీయాము మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కుమార్తె.
3 పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభవైన యెహోవాకు యథార్థుడై వున్నట్లు, అబీయాము యెహోవాకు విశ్వాసపాత్రుడై వుండలేదు.
4 యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు.
5 యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదాపాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.
6 రెహబాము, యరొబాము ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే వున్నారు .
7 అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో రాయబడ్డాయి. అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది.
8 అబీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమారుని పేరు ఆసా. అబీయాము స్థానంలో ఆసా రాజయ్యాడు.
9 యరొబాము పాలన మొదలై ఇరువైయవ సంవత్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు.
10 ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. మయకా అబ్షాలోము కుమార్తె.
11 ఆసా తన పూర్వికుడైన దావీదువలె యెహావా దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు.
12 ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు.
13 తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు.
14 కాని ఆసా ఉన్నత స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా ఆసా యెహోవాకు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు.
15 ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.
16 యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధాలు కొనసాగించాడు.
17 బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. ఆసా రాజ్యమైన యూదాకు ప్రజల రాకపోకలను నిలిపివేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామానగరాన్ని అతడు చాలా పటిష్ఠపర్చినాడు.
18 దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు.
19 అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”
20 రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు.
21 ఈ దండయాత్రలను గురించి బయెషా విన్నాడు. దానితో అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్సాకు తిరిగి వెళ్లాడు.
22 అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు.
23 ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది.
24 ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో రాజు అయ్యాడు.
25 యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవత్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పాలించాడు.
26 యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు.
27 బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు.
28 యూదాపై ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు అయ్యాడు.
29 బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు.
30 ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.
31 నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
32 బయెషా ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజైన ఆసాతో యుద్ధాలు చేస్తూనేవున్నాడు.
33 ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు సంవత్సరాలు తిర్సాలో పరిపాలించాడు.
34 కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.
1 తరువాత యెహోవా హనానీ కుమారుడైన యెహూతో మాట్లాడాడు. యెహోవా రాజైన బయెషాకు వ్యతిరేకంగా మాట్లాడాడు.
2 “నిన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నేను చేశాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలపై నిన్ను యువరాజుగా చేశాను. నీవు కూడా యరొబాము మార్గాన్నే అనుసరించావు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టేలా చేశావు. వారి పాపకార్యాలతో వారు నాకు కోపం కలుగజేశారు.
3 కావున ఓ బయెషా, నిన్ను నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి చేసినదంతా నీ కుటుంబానికి కూడా చేస్తాను.
4 నీ కుటుంబం వారు నగర వీధుల్లో పడి చనిపోతారు. వారి శవాలను కుక్కలుతింటాయి. నీ సంతతిలో కొందరు పొలాల్లో చనిపోతారు. వారి శవాలను పక్షులు తిని పోతాయి.”
5 బయెషా చేసిన ఇతర విషయాలన్నిటిని గురించి, అతని సైనిక బలం గురించి ఇశ్రాయేలు రాజుల చరితగ్రంధంలో వ్రాయబడింది.
6 బయెషా చనిపోయినప్పుడు అతనిని తిర్సాలో సమాధి చేశారు. అతని కుమారుడు ఏలా అతని స్థానంలో రాజు అయ్యాడు.
7 కావున ప్రవక్తయగు యెహోకు యెహోవా ఒక వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయెషాకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది యెహోవాకు కోపకారణమయ్యింది. అతనికి ముందు యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా కూడ చేశాడు. బయెషా యరొబాము కుటుంబం వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా కోపంగా వున్నాడు.
8 యూదా రాజుగా ఆసా పాలన ఇరువది ఆరవ సంవత్సరం గడుస్తూ వుండగా ఏలా ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఏలా అనువాడు బయెషా కుమారుడు. అతడు తిర్సాలో రెండేండ్లు పరిపాలించాడు.
9 రాజైన ఏలా కింది అధికారులలో జిమ్రీ ఒకడు. ఏలా యొక్క రథబలంలో సగానికి జిమ్రీ అధిపతి. కాని ఏలాకు వ్యతిరేకంగా జిమ్రీ కుట్ర పన్నాడు. రాజైన ఏలా తిర్సాలో ఉన్నాడు. అతడు అర్సాఇంటిలో బాగా మద్యపానం చేసి మత్తుగా ఉన్నాడు. తిర్సాలో వున్న రాజుభవన నిర్వాహకుడు అర్సా.
10 జీమ్రీ ఆ ఇంటిలో ప్రవేశించి రాజైన ఏలాను చంపేశాడు. ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా ఇది జరిగింది. తరువాత ఏలా స్థానంలో జిమ్రీ ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.
11 జిమ్రీ రాజుగా సింహాసనాన్ని అధిప్ఠించగానే, అతడు బయెషా కుటుంబం వారినందరినీ సంహరించాడు. బయెషా వంశాంలోని మగవారినెవ్వరినీ అతడు ప్రాణాలతో వదలలేదు. బయెషా స్నేహితులను కూడ జిమ్రీ చంపేశాడు.
12 జిమ్రీ ఆ విధంగా బయెషాయొక్క వంశనాశనం గావించాడు. ప్రవక్తయైన యెహూ ద్వారా బయెషాకు వ్యతిరేకంగా ఏమి జరుగుతుందని యెహోవా పలికాడో ఆ రీతిగా ఇది జరిగింది.
13 బయెషా, అతని కుమారుడు ఏలా చేసిన పాపాల ఫలితంగా ఇది జరిగింది. వారు పాపం చేయటమే కాకుండా, ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కూడా వారు కారకులయ్యారు. వారు విగ్రహాలను చేయటానికి పాల్పడినందుకు కూడా యెహోవా కోపగించాడు.
14 ఏలా చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
15 ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా, జిమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పాలించాడు. అసలు జరిగిన విషయమేమనగా: ఫిలిష్తీయుల నగరమైన గిబ్బెతోను వద్ద ఇశ్రాయేలు సైన్యం దిగియుండెను.
16 రాజుకు వ్యతిరేకంగా జిమ్రీకుట్ర పన్నుతున్నాడని సైనికులు విన్నారు. అతడు రాజును చంపివేశాడని కూడ విన్నారు. అదే రోజున ఇశ్రాయేలీయులు ఒమ్రీని రాజుగా అదే శిబరంలోనే ప్రకటించారు. ఒమ్రీ సైన్యాధ్యక్షుడు.
17 తరువాత ఒమ్రీ, ఇశ్రాయేలు సైన్యం గిబ్బెతోనును వదిలి తిర్సాపైకి దండెత్తి వెళ్లారు.
18 నగరాన్ని ముట్టడించి పట్టుకున్నారని జిమ్రీ తెలుసుకున్నాడు. అతడు రాజభవనంలోకి వెళ్లి దానికి నిప్పుపెట్టాడు. అతడు భవనంతో పాటు కాలిపోయాడు.
19 జిమ్రీ పాపం చేయబట్టి అతడు నాశనయ్యాడు. అతడు పాపం చేశాడు. యెహోవా దృష్టిలో అనేక చెడు కార్యాలు చేశాడు. యరొబాము మాదిరిగానే అతను కూడా పాపం చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
20 జిమ్రీ పన్నిన కుట్ర విషయం, అతను చేసిన తదితర కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. జిమ్రీ రాజైన ఏలీకి వ్యతిరేకంగా తిరిగి నప్పుడు జరిగిన సంఘటనలు కూడ ఆ గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.
21 ఇశ్రాయేలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం గీనతు కుమారుడైన తిబ్నీని బలపర్చి, అతనిని రాజుగా చేయ సంకల్పించింది. రెండవ వర్గం ఒమ్రీని అనుసరించింది.
22 ఒమ్రీ అనుచరులు గీనతు కుమారుడైన తిబ్నీ వర్గం వారికంటె బలంగా వున్నారు. అందువల్ల తిబ్నీ చంపబడ్డాడు. ఒమ్రీ రాజయ్యాడు.
23 ఆసా పాలన యూదాలో ముప్పదియొకటో సంవత్సరం జరుగుతూ వుండగా, ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఒమ్రీ ఇశ్రాయేలును పన్నెండు సంవత్సరాలు పాలించాడు. అందులో ఆరు సంవత్సరాలు తిర్సాలో వుండి ఏలాడు.
24 కాని ఒమ్రీ షోమ్రోను కొండను కొన్నాడు. దానిని షెమెరు అను వానియొద్ద నాలుగు మణుగుల వెండి నిచ్చి కొన్నాడు. ఆ కొండ మీద ఒమ్రీ ఒక నగరాన్ని కట్టాడు. ఆ కొండ యజమానియైన షెమెరు జ్ఞాపకార్థం ఆ నగరానికి షోమ్రోను అని పేరు పెట్టాడు.
25 కాని ఒమ్రీ యెహోవా దృష్టిలో అనేక దుష్ట కార్యాలు చేశాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అతడు ఎక్కువ పాపం చేశాడు.
26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన తప్పులన్నీ చేశాడు. ఇశ్రాయేలీయులు పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. కావున వారంతా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కలుగజేశారు. యెహోవాకు కోపం రావటానికి కారణ మేమనగా వారు పనికిమాలిన విగ్రహారాధన చేశారు.
27 ఒమ్రీ చేసిన ఇతర కార్యాలు, తన సైనికబలం మొదలగు విషయాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి.
28 ఒమ్రీ చనిపోయాడు. అతనిని షోమ్రోనులో సమాధి చేశారు. అతని కుమారుడు అహాబు అతని స్థానంలో రాజు అయ్యాడు.
29 యూదాలో ఆసా పాలన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరుగుతూండగా ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజైనాడు. షోమ్రోను నుండి ఇరువది రెండు సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పాలించాడు.
30 అహాబు యెహావా చేయవద్దన్న కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించాన వారందరికంటె అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు.
31 నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపక్రియలు అహాబుకు చాలా సామాన్యమైనవిగా కన్పించాయి. ఆ తప్పులు చాలవన్నట్లు అతడు ఎత్బయలు కుమారైయగు యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఎత్బయలు సీదోనుకు రాజు. దానితో అహాబు బయలు దేవతను కొలవటం మొదలు పెట్టాడు. అహాబు అతనిని ఆరాధించాడు.
32 షోమ్రోనులో బయలు ఆరాధనకు ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు.
33 అషేరా దేవతను ఆరాధించటానికి అహాబు ఒక ప్రత్యేక స్తంభాన్ని నిర్మించాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అహాబు ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపాన్ని కలుగజేశాడు.
34 అహాబు రాజ్యం చేసే కాలంలో బేతేలు వాడైన హీయేలు యెరికో పట్టణాన్ని పునర్‌నిర్మించాడు. హీయేలు నగర నిర్మాణపు పనిని మొదలు పెట్టగానే, అతని పెద్ద కుమారుడగు అబీరాము చనిపోయాడు. హీయేలు నగర ద్వారాలు నిర్మించేటప్పుడు అతని చిన్న కుమారుడగు సెగూబు చనిపోయాడు. నూను కుమారుడైన యెహోషువ ద్వారా ఏది ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో ఇదంతా ఆ విధంగా జరిగింది .
1 ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్బీ నగరానికి చెందినవాడు. ఏలీయా వచ్చి రాజైన అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్సరాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. నేను ఆజ్ఞ ఇస్తేగాని వర్షం పడదు.”
2 తరువాత యెహోవా ఏలీయాతో,
3 “నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. ఆ వాగు యోర్దాను నదికి తూర్పున ఉన్నది.
4 నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు.
5 కావున యెహోవా చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్దాను నదికి తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి అతడు వెళ్లాడు.
6 బొంత కాకులు ప్రతి ఉదయం రొట్టెను, ప్రతి సాయంత్రం మాంసాన్ని తెచ్చి ఇచ్చేవి. ఏలీయా వాగు నీటిని తాగేవాడు.
7 వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది.
8 అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు:
9 “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.”
10 కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లీ సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు.
11 అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకునిరా” అని ఏలీయా అన్నాడు.
12 “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెప్తున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది.
13 ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నీవు చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో.
14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది. ‘ “
15 అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు.
16 పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.
17 కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ్రయ్యింది. చివరిగా అతని శ్వాస ఆగిపోయింది.
18 ఆమె ఏలీయా వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా చేయటానికే నీవు వచ్చావా?”అని అడిగింది.
19 “నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు.
20 తరువాత ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభవైన దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద నీవు కలుగజేస్తావా? ఆమె కుమారుడు చనిపోయేలా చేస్తావా?”
21 పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! ఈ బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు.
22 యెహోవా ఏలీయా ప్రార్థన ఆలకించాడు. బాలుడు శ్వాసపీల్చటం ప్రారంభించాడు. వాడు బతికాడు.
23 ఏలీయా బాలుని కిందికి తీసుకుని వచ్చాడు. బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు బతికాడు” అని ఏలీయా అన్నాడు.
24 “నీవు నిజంగా దైవజనుడవేనని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లాడుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ స్త్రీ అన్నది.
1 వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలయ్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, “నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు.
2 కావున ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు. అప్పుడు షోమ్రోనులో క్షామం నెలకొన్నది.
3 రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు)
4 ఒకసారి యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు పెట్టింది. అప్పుడు ఓబద్యా నూరుమంది ప్రవక్తలను చేరదీసి, వారిని రెండు గుహలలో దాచాడు. ఓబద్యా ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు.)
5 రాజైన అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మనగుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువులను చంపే అవసరము వుండదు.”
6 నీటి వనరులు వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో వెళ్లాడు.
7 ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.
8 “అవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ యజమాని రాజుకు తెలియజేయి” అని ఏలీయా సమాధానం చెప్పాడు.
9 అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు?
10 నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెప్తున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు.
11 ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని చెప్పమంటున్నావా?
12 ఒకవేళ నేను పోయి రాజైన అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా బాల్యం నుండి యెహోవాను ఆశ్రయించియున్నాను.
13 నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను.
14 ఇప్పుడు నన్ను వెళ్లి నీవిక్కడ వున్నట్లు రాజుతో చెప్పమంటున్నావు. రాజు నన్ను చంపేస్తాడు!”
15 అది విన్న ఏలీయా, “సర్వశక్తిమంతుడైన యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు.
16 అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దుకు వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. రాజైన అహాబు ఏలీయాను చూడటానికి వెళ్లాడు.
17 ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని అన్నాడు.
18 ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు.
19 ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ వున్నది.”
20 పిమ్మట అహాబు ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం వద్దకు పిలువనంపాడు.
21 ఆ ప్రజలందరి వద్దకు ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుసరించండి. బయలు నిజమైన దేవత అయితే మీరా దేవతను అనుసరించండి” అని అన్నాడు. ప్రజలు ఏమీ మాట్లాడలేదు.
22 అందువల్ల ఏలీయా ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవాయొక్క వ్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని నాలుగు వందల ఏభై మంది బయలు ప్రవక్తలున్నారు.
23 కావున మీరు రెండు ఆబోతులను తీసుకునిరండి. వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోనివ్యండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను.
24 బయలు దేవత ప్రపక్తలారా! మీరు మీ దేవునికి ప్రార్థించండి. నేను నా యెహోవాను ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప చేస్తాడో అతడే నిజమైన దేవుడు.” ప్రజలంతా ఇది మంచి ఆలోచన అని ఒప్పు కున్నారు.
25 బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును ఎన్నుకుని తయారు చేయ్యండి. కాని నిప్పు మాత్రం రగల్చకండి.”
26 కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును తీసుకున్నారు. దానిని తయారు చేశారు. వారు బయలు దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు.”ఓ బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!”అని వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ నిప్పు రాజలేదు.
27 మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా వారిని హేళన చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా పని ఒత్తిడిలో ఉండవచ్చు. లేక అతను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్రపోతూ ఉండవచ్చు! బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” అంటూ అపహాస్యం చేశాడు ఏలీయా.
28 అందువల్ల ఆ ప్రవక్తలు బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారు కత్తులతోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు చీరుకున్నారు.
29 మధ్యాహ్న సమయం దాటి పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయంత్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు తమ భయానక చేష్టలు సాగించారు. బయలు వద్దనుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు .
30 అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు.
31 ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు.
32 ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది.
33 అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు.
34 తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు.
35 ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది.
36 సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి.
37 ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.”
38 అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది.
39 ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు”
40 అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.
41 ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడబోతూ వుంది” అని అన్నాడు.
42 రాజైన అహాబు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్లమధ్య తలను పెట్టాడు.
43 అప్పుడు ఏలీయా తన సేవకునితో సముద్రం చూడమన్నాడు. సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు. “నేనేమీ చూడలేడు” అని సేవకుడు తిరిగి వచ్చి చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. ఈ విధంగా ఏడుసార్లు జరిగింది.
44 ఏడవసారి నౌకరు తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని అన్నాడు. ఏలీయా తన సేవకునితో, “రాజైన అహాబు వద్దకు వెళ్లి తన రథం సిద్ధం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని ఆపేస్తుంది” అని అన్నాడు.
45 ఆ తరువాత కొద్ది సేవటికే ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన ప్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రెయేలుకు తిరుగు ప్రయాణం సాగించాడు.
46 యెహోవా శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంటె ముందుగా యెజ్రెయేలుకు పరుగెత్తికొని వెళ్లాడు.
1 ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో అహాబు ఆమెకు వివరించాడు.
2 అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”
3 ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు.
4 తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చని పోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు. ఇక నన్ను చనిపోనియ్యండి. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.”
5 ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత.
6 ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు.
7 యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు.
8 అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు.
9 అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు. అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు.
10 ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”
11 అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు.
12 ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది.
13 ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు.
14 ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పుందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”
15 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు.”
16 పిమ్మట నింషీ కుమారుడైన యెహూను ఇశ్రాయేలుపై రాజుగా అభిషిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి.
17 హజాయేలు ఖడ్గమునుండి తప్పించుకున్న ప్రతివాడినీ యెహూసంహరిస్తాడు. యెహూ కత్తి పోటునుంచి తప్పించుకున్న ప్రతివాడినీ హజాయేలు చంపేస్తాడు.
18 ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టు కోలేదు.”
19 కావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఏలీయా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్నుచుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు.
20 అప్పుడు ఎలీషా పొలంలోవున్న తన ఎద్దులను వదిలి పెట్టాడు. అతడు పరుగెత్తి ఏలీయా వద్దకు వెళ్లి, “నన్ను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారి వద్ద వీడ్కోలు తీసుకోనీయండి. తరువాత నేను మీతో వస్తాను” అని అన్నాడు. “అది చాలా మంచిది. వెళ్లు. నిన్ను నేనాపను” అని ఏలీయా అన్నాడు.
21 ఎలీషా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్రత్యేకమైన విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. ఎడ్లకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు సహాయకుడయ్యాడు.
1 బెన్హదదు సిరియా రాజు, అతడు తన సైన్యాలన్నిటినీ సమీకరించాడు. తనతో ముప్పై ఇద్దరు రాజులున్నారు. వారికి రథాలు, గుర్రాలు వున్నాయి. వారు సమరియను (షోమ్రోను) ముట్టడించి యుద్ధం చేశారు.
2 ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు సిరియా రాజు దూతలను పంపాడు.
3 వారు బెన్హదదు మాటగా అహాబుతో ఇలా అన్నారు: “నీవు నీ యొక్క వెండి బంగారాలను నాకు ఇచ్చేయాలి. అంతేగాక నీ భార్యలను, పిల్లలను కూడ తప్పక నాకు ఇచ్చేయాలి.”
4 ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నా యజమానియైన ఓ రాజా, నేను నీ వాడనని ఒప్పుకుంటాన్నాను. నాకున్నప్రతిదీ నీకు చెందినదే.”
5 దూతలు మరల అహాబు వద్దకు వచ్చారు. వారు బెన్హదదు తరుపున ఇలా అన్నారు, “నీవు నీ వెండి బంగారాలను, నీ భార్యలను, పిల్లలను నాకు ఇవ్వాలని నేనింతకు ముందే చెప్పాను.
6 నేనిప్పుడు నా మనుష్యులను పంపి నీ భవనాన్ని, నీ కింది పాలకుల ఇండ్లను వెదికించాలనుకుంటున్నాను. నా మనుష్యలకు ఏది నచ్చితే అది తీసుకుని వస్తారు.”
7 ఇది విని, రాజైన అహాబు తన దేశంలో వున్న పెద్దల (నాయకుల)తో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో ఇలా అన్నాడు: “చూడండి! బెన్హదదు కయ్యానికి సిద్దమవుతున్నాడు. నా భార్యలను, పిల్లలను, నా వెండి బంగారాలను నేనతనికి ఇవ్వాలని ముందుగా చెప్పాడు. అవన్నీ ఇవ్వటానికి నేను ఒప్పుకున్నాను. కాని ఇప్పుడతను సర్వం తీసుకోవాలని చూస్తున్నాడు.”
8 ఇది విన్న పెద్దలు (నాయకులు), ఇతర ప్రజలు “బెన్హదదును లెక్క చేయవద్దనీ, అతను చెప్పినట్లు చేయవద్దనీ” అన్నారు.
9 బెన్హదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను చేయజాలను.” రాజైన బెన్హదదు మనుష్యులు ఈ సమాచారాన్ని అతనికి అందజేశారు.
10 బెన్హదదు నుంచి మరో వర్తమానం తీసుకుని దూతలు మళ్లీ వచ్చారు. ఆ సమాచారం ఇలా వుంది, “నేను షోమ్రోనును పూర్తిగా నాశనం చేస్తాను. ఆ నగరంలో ఏదీ మిగిలి వుండదని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను! నా మనుష్యులు గుర్తుగా ఇంటికి తెచ్చుకోవటానికి కూడ అక్కడ ఏమీ మిగలదు. నేనిది చేయక పోతే దేవుడు నన్ను సర్వనాశనం చేయుగాక!”
11 రాజైన అహాబు ప్రత్యుత్తరమిస్తూ “బెన్హదదుకు ఇలా చెప్పండి. కవచాన్ని ధరించువాడు దానిని ధరించి విప్పిన వానివలె గొప్పలు చెప్పరాద ు” అని చెప్పమన్నాడు.
12 రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.
13 అదే సమయంలో ఒక ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “ఆ పెద్ద సైన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనైన యెహోవానని నీవు గుర్తిస్తావు.”
14 “వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయోగిస్తావు?” అని అహాబు అడిగాడు. “యువకులైన ప్రభుత్యాధికారులను” అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అన్నాడు. “ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని రాజు అడిగాడు. నీవే” అని ప్రవక్త అన్నాడు.
15 కావున అహాబు యువ ప్రభుత్యాధికారులను సమాయత్తపరచాడు. వారు రెండు వందల ముప్పై రెండుమంది ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ రాజు సమీకరించాడు. వారంతా ఏడు వేల మందివున్నారు.
16 మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది.
17 యువ ప్రభుత్యాధికారులు ముందుగా ఎదుర్కొన్నారు. రాజైన బెన్హదదు మనుష్యులు ఆయనతో షోమ్రోను నుండి కొందరు సైనికులు బయటికి వచ్చినట్లు చెప్పారు.
18 “అయితే వారు యుద్ధానికి వస్తూ వుండవచ్చు. లేదా వారు సంధి నిమిత్తమై వస్తూ వుండవచ్చు. ఏది ఏమైనా వారిని సజీవంగా పట్టుకోండి” అని బెన్హదదు అన్నాడు.
19 రాజైన అహాబు యొక్క యువసైనికులు దండయాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యంవారిని అనుసరిస్తూవుంది.
20 ఇశ్రాయేలు అధికారులలో ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపి వేశాడు. కావున అరామునుండి వచ్చినవారు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. రాజైన బెన్హదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించుకున్నాడు.
21 రాజైన అహాబు తన సైన్యాన్ని నడిపించి అరాము సైనికుల గుర్రాలను, రథాలను స్వాధీన పర్చుకున్నాడు. ఆ విధంగా రాజైన అహాబు చేతిలో సిరియను సైన్యం ఘోర పరాజయం పొందింది.
22 అప్పుడు ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “ఆరాము రాజైన బెన్హదదు రాబోయే వసంతకాలం నాటికి మళ్లీ నీమీదికి యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు నీవు నీ నివాసానికి వెళ్లి నీ సైన్యాన్ని బాగా బలపర్చుకో. అతని దండయాత్ర నుంచి నిన్ను నీవు రక్షించుకోవటానికి తగిన వ్యూహాలు సిద్ధం చేయి.”
23 రాజైన బెన్హదదు సేవకులు కొందరు వచ్చి ఆయనకు ఇలా సలహా ఇచ్చారు, “ఇశ్రాయేలు దేవతలు కొండ దేవతలు. మనం యుద్ధం పర్వత ప్రాంతంలో నిర్వహించాం. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. కావున ఈ సారి మనం మైదాన పాంతంలో యుద్ధం నిర్వహించాలి. అప్పుడు మనం గెలుస్తాం.
24 ఇప్పుడు నీవొకటి చేయాలి. ఈ ముప్పది యిద్దరు పాలకులను సైన్యాలను నడిపించేందుకు అనుమతించద్దు. వారి స్థానంలో దళాధిపతులను నియమించు.
25 “తర్వాత నీవు పోగొట్టుకున్నటువంటి సైన్యాన్ని మళ్లీ నీవు భర్తీ చేయాలి. పూర్వపు సైన్యంలో వున్నట్లుగా గుర్రాలను, రథాలను మళ్లీ సేకరించు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మైదాన ప్రాంతంలో మనం ఎదుర్కొందాం. అప్పుడు విజయం మనదే!” బెన్హదదు వారి సలహా పాటించాడు. వారు చెప్పిందంతా చేశాడు.
26 వసంత కాలం వచ్చే సరికి బెన్హదదు అరాము ప్రజలను సమీకరించాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి అతడు ఆఫెకు నగరానికి వెళ్లాడు.
27 ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి తయారైనారు. ఇశ్రాయేలు ప్రజలు అరాము సైన్యంతో పోరాడటానికి వెళ్లారు. అరాము సైనికులు దిగిన చోటికి ఎదురుగానే ఇశ్రాయేలు సైనికులు మకాంవేశారు. అరామీయులు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించియుండగా, ఇశ్రాయేలీయులు కేవలం రెండు మేకల మందలవలెవున్నారు.
28 ఇశ్రాయేలు రాజు వద్దకు దైవజనుడొకడు వర్తమానాన్ని తెచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: “అరాము ప్రజలు ప్రభువునైన నన్ను ఒక కొండ దేవతగా చిత్రీకరించారు. నేను లోయలకు కూడ దేవుడనేనని వారు భావించలేదు. కావున నీవు ఈ పెద్ద సైన్యాన్ని ఓడించేలా చేస్తాను. అప్పుడు సర్వత్రా నేనే ప్రభువునని నీవు తెలుసుకుంటావు.”
29 ఇరు సైన్యాలు ఎదురెదురుగా ఏడు రోజుల పాటు మోకరించి వున్నాయి. ఏడవరోజు యుద్ధం మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు ఒక్క రోజులో ఒక లక్ష మంది అరాము సైనికులను చంపేశారు.
30 మిగిలిన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. నగర ప్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై ఏడువేల మంది సైనికులు చనిపోయారు. బెన్హదదు కూడ నగరానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు.
31 ఈ లోపు కొందరు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు రాజులు కనికరం చూపనున్నట్లు మేము విన్నాం. మనం గోనెబట్టలు ధరించి, తాళ్లు తలకు చుట్టుకుని ఇశ్రాయేలు రాజు వద్దకు వెళ్దాం. బహుశః అతడు మనల్ని బతకనివ్వొచ్చు.
32 వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు. “అయితే అతడింకా బతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు.
33 బెన్హదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా దయచూపి బెన్హదదును చంపనని నిరూపించే విధంగా ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్హదదును నా సహోదరుడని అహాబు అన్నాడో, వచ్చిన మనుష్యులు వెంటనే, “ అవును! బెన్హదదు నీ సోదరుడే!” అని అన్నారు. “అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు అన్నాడు. తరువాత బెన్హదదు రాజైన అహాబు ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన రథం ఎక్కమన్నాడు.
34 బెన్హదదు అతనితో ఇలా అన్నాడు: “అహాబూ, నా తండ్రి నీ తండ్రి వద్ద నుండి తీసుకున్న పట్టణాలన్నిటినీ నేను నీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి షోమ్రోనులో చేసిన విధంగా, దమస్కులో నీవు కొన్ని వీధులను నిర్మించి, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.” అది విన్న అహాబు, “నీవు ఇందుకు ఒప్పుకుంటే నేను నిన్ను వదిలి పెడతాను” అని అన్నాడు. తరువాత ఆ రాజులిద్దరూ ఒక శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజైన అహాబు రాజైన బెన్హదదును స్వేచ్ఛగా వదిలాడు.
35 ప్రవక్తలలో ఒకడు మరో ప్రవక్తతో, “నన్ను కొట్టు!” అని అన్నాడు. యెహోవా వలన ప్రేరేపించబడి అతనలా అన్నాడు. కాని ఆ రెండవ ప్రవక్త అతనిని కొట్ట నిరాకరించాడు.
36 అందుచే మొదటి ప్రవక్త ఇలా అన్నాడు; “నీవు యెహోవా ఆజ్ఞను పాటించలేదు. నీవు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లగానే ఒక సింహం నిన్ను చంపేస్తుంది.” ఆ రెండవ ప్రవక్త ఆ ప్రదేశం వదిలి వెళ్లగానే ఒక సింహం వచ్చి అతనిని చంపేసింది.
37 మొదటి ప్రవక్త మరో వ్యక్తి వద్దకు వెళ్లి, “నన్ను కొట్టు!” అన్నాడు. ఈ వ్యక్తి వానిని కొట్టాడు. ప్రవక్తకు బాగా దెబ్బతగిలింది.
38 అందుచే ఆ ప్రవక్త ఒక బట్టతో తన ముఖం కప్పుకున్నాడు. దానివల్ల అతనెవరైనదీ ఎవ్వరూ గుర్తు పట్టలేదు. ప్రవక్త వెళ్లి రాజు కొరకు బాటపై నిలబడ్డాడు.
39 రాజు వచ్చినప్పుడు ప్రవక్త ఆయనతో ఇలా అన్నాడు: “నేను యుద్ధం చేయటానికి వెళ్లాను. మనలో ఒకడు శత్రుసైనికునొకణ్ణి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ శత్రు సైనికునికి కాపలా వుండమనీ, వాడు గనుక పారిపోతే అతని స్థానంలో నేను నా ప్రాణాలను ఇవ్వవలసి వుంటుందనీ మన సైనికుడు నాతో చెప్పాడు. లేదా రెండు మణుగుల వెండి చెల్లించవలసి వుంటుందని అన్నాడు.
40 కాని నేను వేరే పనిలో నిమగ్నమై వుండగా ఆ శత్రుసైనికుడు పారిపోయాడు.” ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నీవా సైనికుని ఒదిలిపెట్టిన నేరం చేసినట్లు ఒప్పుకున్నావు. దానికి సమాధానం కూడా నీకు తెలుసు. ఆ వ్యక్తి చెప్పినట్లే నీవు చేయాలి.
41 అప్పుడా ప్రవక్త తన ముఖము మీది బట్టను తీసేశాడు. ఇశ్రాయేలు రాజు వానిని చూచి, అతడు ప్రవక్తలలో ఒకడని తెలుసుకున్నాడు.
42 ప్రవక్త యెహోవా వర్తమానాన్ని రాజుకిలా చెప్పాడు: “చంపబడాలని నేను నిర్దేశించిన వ్యక్తిని నీవు వదిలి పెట్టావు. కావున వాని స్థానంలో నీ ప్రాణం తీసుకోబడుతుంది. అతని ప్రజల స్థానంలో నీ ప్రజలు చనిపోవలసి వుంటుంది.”
43 రాజు షోమ్రోనులో వున్న తన ఇంటికి వెళ్లి పోయాడు. అతని మనస్సు బాగా కలత పడింది. అతడు చింతాక్రాంతుడయ్యాడు.
1 రాజైన అహాబు భవనం షోమ్రోను నగరంలోవుంది. రాజభవనం దగ్గర ఒక ద్రాక్ష తోటవుంది.
2 ఒక రోజు నాబోతును పిలిచి అహాబు ఇలా అన్నాడు: “నీ పొలం నాకు ఇచ్చివేయి. నేను దానిని కూరగాయల తోటగా మార్చాలను కుంటున్నాను. నీ చేను నా భవనానికి దగ్గరగా వుంది. దానికి బదులు దానికంటె మంచి ద్రాక్షతోట నీకు మరొకటి ఇస్తాను. లేదా, నీకు కావాలంటే దాని విలువ డబ్బు రూపంలో చెల్లిస్తాను.”
3 నాబోతు అది విని, “నా భూమిని నీ కెన్నడూ ఇవ్వను. ఇది నా పిత్రార్జితం” అని అన్నాడు.
4 అహాబు ఇంటికి వెళ్లాడు. నాబోతు పట్ల కోపంగా వున్నాడు. అతని మనస్సు కలతపడింది. యెజ్రెయేలు వాడైన నాబోతు చెప్పినది అతనికి గిట్టలేదు. (“నా పిత్రార్జితమైన భూమిని నీకివ్వను” అని నాబోతు అన్నాడు.) అహాబు పక్కపై పడుకున్నాడు. ముఖం తిప్పుకుని భోజనం చేయ నిరాకరించాడు.
5 అహాబు భార్య యెజెబెలు అతని వద్దకు వెళ్లింది. “ఎందుకు నీవు కలత చెంది వున్నావు? నీవెందుకు తినటం లేదు?” అని యెజెబెలు అడిగింది.
6 అహాబు ఇలా సమాధానం చెప్పాడు: “యెజ్రెయేలువాడైన నాబోతును అతని పొలం నాకిమ్మని అడిగాను. దాని పూర్తి ఖరీదు చెల్లిస్తానన్నాను. లేదా, అతను కావాలంటే వేరే పొలం ఇస్తానన్నాను. కాని నాబోతు అతని పొలం ఇవ్వటానికి నిరాకరించాడు.”
7 అది విని యెజెబెలు, “అది సరే! ఇశ్రాయేలుకు రాజువు నీవే కదా! పక్క మీది నుండి లేచి ఆహారం తీసుకో. నీకు హాయిగా వుంటుంది. నాబోతు పొలాన్ని నీకు నేనిప్పిస్తాను” అని అన్నది.
8 తరువాత యెజెబెలు కొన్ని ఉత్తరాలను అహాబు పేరు మీద రాసింది. వాటి మీద అహాబు సంతకం ఆమె చేసింది. అహాబు రాజముద్రను వాటిపై వేసి అంటించింది. ఆమె వాటిని నాబోతు నివసించే నగరంలో వున్న పెద్దలు, నాయకులకు ఇతర ముఖ్యమైన వ్యక్తులకు పంపించింది.
9 ఆమె పంపిన లేఖలో ఇలా వుంది: ప్రజలందరికి ఉపవాస దినాన్ని ఒకటి ప్రకటించండి. తరువాత పట్టణంలోని ప్రజలందరినీ ఆ రోజు సమావేశం పర్చండి. ఆ సమావేశంలో మనం నాబోతును గురించి మాట్లాడాలి.
10 నాబోతును గురించి ప్రజలకు అబద్ధాలు చెప్పగల కొందరిని సమావేశంలో వుండేలా చూడండి. నాబోతు రాజుకు, దేవునికి వ్యతిరేకంగా దూషణ భాషణ చేయగా తాము విన్నట్లు ప్రజలకు వారు అబద్ధం చెప్పాలి. అప్పుడు నాబోతును నగరం నుండి బయటికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపాలి.
11 అది చదివిన యెజ్రెయేలు నాయకులు (పెద్దలు), ఇతర ప్రముఖులు ఆజ్ఞను శిరసావహించారు.
12 ప్రజలంతా ఉపవాసం చేయాలని ఒక రోజును నిర్ణయించి ప్రకటించారు. ఆ రోజున నియమిత స్థలంలో సమావేశం కావాలని ప్రజలందరికీ పిలుపు ఇచ్చారు. వారు నాబోతును ప్రజల ముందు ఒక ప్రత్యేక స్థానంలో కూర్చుండబెట్టారు.
13 అప్పుడు ఇద్దరు మనుష్యులు లేచి నాబోతు దేవునిని, రాజును గూర్చి దుర్భాషలాడుతూండగా తాము విన్నట్లు ప్రజలకు చెప్పారు. అందువల్ల ప్రజలు నాబోతును నగరం నుండి బయటికి లాక్కొని వెళ్లి, అతనిని రాళ్లతో కొట్టి చంపారు.
14 తరువాత నాబోతు చంపబడ్డాడన్న వర్తమానం నాయకులు యెజెబెలుకు పంపారు.
15 ఈ వార్త విన్న యెజెబెలు వెంటనే అహాబు వద్దకు వెళ్లి, “నాబోతు చనిపోయాడు. ఇప్పుడు నీవు వెళ్లి నీకు కావలసిన పొలాన్ని తీసికో” అని చెప్పింది.
16 కావున అహాబు ద్రాక్షతోటకు వెళ్లి దానిని తన వశం చేసుకున్నాడు.
17 ఇదే సమయంలో యెహావా ఏలీయాతో మాట్లాడాడు. (ఏలీయా తిష్బీయుడైన ప్రవక్త) యెహోవా ఇలా అన్నాడు:
18 “షోమ్రోనులో వున్న రాజైన అహాబు వద్దకు వెళ్లు. అతడు నాబోతుకు చెందిన ద్రాక్షతోటలో వుంటాడు. ఆ పొలాన్ని తన స్వాధీనం చేసుకొనటానికి అహాబు అక్కడికి వెళ్లాడు.
19 యెహోవా అంటున్నాడని నా మాటగా అతనికి ఈ విధంగా చెప్పు: “అహాబూ! నీవు నాబోతు అనే వానిని చంపావు. ఇప్పుడు నీవతని పొలం స్వాధీనం చేసుకుంటున్నావు. అందువల్ల నేను చెప్పేదేమనగా నాబోతు చనిపోయిన స్థలంలోనే నీవు కూడ చనిపోతావు. నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు అదే స్థలంలో నీ రక్తాన్ని కూడ నాకుతాయి!”
20 తరువాత ఏలీయా అహాబు వద్దకు వెళ్లాడు. ఏలీయాను అహాబు చూసి, “నీవు మళ్లీ నావద్దకు వచ్చావు. నీ వెప్పుడూ నాకు వ్యతిరేకివై శత్రువులా ప్రవర్తిస్తున్నావు” అని అన్నాడు. ఏలీయా ఇలా సమాధానమిచ్చాడు: “అవును, నేను మళ్లీ నిన్ను కలుసుకున్నాను. జీవితమంతా యెహోవాకు విరుద్ధగా పాపం చేస్తూనే వచ్చావు.
21 అందువల్ల యెహోవా నీతో ఇలా అంటున్నాడు, నేను నిన్ను నాశనం చేస్తాను. నేను నిన్ను, నీ ఇంటిలోని ప్రతిబాలుణ్ణి, మరియు మగవారినందరినీ చంపేస్తాను.
22 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి పట్టిన గతే నీ కుటుంబానికి కూడ పడుతుంది. రాజైన బయెషా కుటుంబంవలె నీ కుటుంబం కూడ అయిపోతుంది. ఆ రెండు కుటుంబాలూ సర్వనాశనం చేయబడ్డాయి. అదే విధంగా నీ కుటుంబానికి కూడ చేస్తాను. కారణమేమంటే నీవు నాకు కోపం కల్గించావు. ఇశ్రాయేలు ప్రజలు చెడుకార్యాలు చేసేటందుకు కూడా నీవు కారుకుడవయ్యావు.
23 ఇంకా యెహోవా చెప్పిన దేమనగా నీ భార్యయగు యెజెబెలు శవాన్ని యెజ్రెయేలు నగరంలో కుక్కలు పీక్కు తింటాయి.
24 నీ కుటుంబంలోని వాడెవడు నగరంలో చనిపోయినా వాని శవాన్ని కుక్కలు తింటాయి. వారిలో ఎవడు పొలాల్లో చనిపోయినా వానిని పక్షులు తింటాయి.”
25 అహాబువలె అన్ని తప్పుడు పనులు చేసినవాడు, అంత పాపం మూటగట్టు కున్నవాడు మరొక వ్యక్తి లేడు. అతని భార్య యెజెబెలు అతడా తప్పులు చేయటానికి కారకురాలయింది.
26 కొయ్య బొమ్మలను పూజిస్తూ, అహాబు ఘోరమైన పాపానికి ఒడిగట్టాడు. ఈ రకమైన పనినే అమోరీయులు కూడా చేశారు. అందువల్లనే యెహోవా ఆ రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
27 ఏలీయా మాట్లాడటం పూర్తి చేసిన తరువాత అహాబు చాలా ఖిన్నుడయాడు. తన విచారానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు. తరువాత విచారసూచకంగా ప్రత్యేకమైన బట్టలు ధరించాడు. అహాబు భోజనం మానేశాడు. ఆ ప్రత్యేకమైన బట్టలతోనే నిద్రపోయాడు. అహాబు బహు దుఃఖంతో మిక్కిలి కలతచెందాడు.
28 ప్రవక్తయగు ఏలీయాతో యెహోవా ఇలా అన్నాడు:
29 “అహాబు నాముందు తనను తాను తక్కువ చేసుకుని వినమ్రుడైనట్లు నేను చూస్తున్నాను. అందువల్ల అతను బతికియున్నంత కాలం నేనతనికి ఆపదలు కలుగజేయను. అతని కుమారుడు రాజు అయ్యేవరకు ఆగుతాను. అప్పుడు అహాబు కుటుంబానికి కష్టనష్టాలు కలుగజేస్తాను.”
1 తరువాత రెండు సంత్సరాల కాలంలో ఇశ్రాయేలు, అరాము దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొన్నాయి.
2 మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును చూడటానికి వెళ్లాడు.
3 అదే సమయంలో అహాబు తన అధికారులతో, “రామోత్గిలాదు పట్టణాన్ని అరాము రాజు మనవద్ద నుండి తీసుకున్న సంగతి మీకు జ్ఞాపకమున్నదా? మనం రామోత్గిలాదును తిరిగి తీసుకొని రావటానికి ఏ రకమైన చర్యనూ ఎందుకు తీసుకోలేదు? అది మన పట్టణమై తీరాలి” అని అన్నాడు.
4 అప్పుడు అహాబు తన వద్దకు వచ్చిన రాజైన యెహోషాపాతును, “రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడటానికి నీవు మాతో కలుస్తావా?” అని అడిగాడు. “అవును, నేను మీతో కలుస్తాను. నీ సైన్యంతో సహకరించటానికి నా సైనికులు, గుర్రాలు సిద్ధంగా వున్నాయి.
5 కాని ముందుగా మనం యెహోవాను మనకు సహాయం చేయమని అడగాలి” అని యెహోషాపాతు అన్నాడు.
6 అందుచేత అహాబు ప్రవక్తలందరినీ సమావేశపర్చాడు. ఆ సయయంలో అక్కడ సుమారు నాలుగువందల మంది ప్రవక్తలున్నారు. “నేను వెళ్లి అరాము సైన్యంతో రామోత్గిలాదు వద్ద యుద్ధం చేయవచ్చునా? లేక నేనింకా మరో సమయం కొరకు వేచివుండాలా?” అని అహాబు వారినడిగాడు. “నీవు వెళ్లి ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నీకు విజయం చేకూర్చుతాడు” అని ప్రవక్తలన్నారు.
7 కాని యెహోషాపాతు, “యెహోవా యొక్క ప్రవక్త మరెవరైనా ఇక్కడ వున్నారా? వుంటే అతడు అహాబు ఏమి చేయాలో దేవుని అడిగి తెలుసుకోవాలి” అని అన్నాడు.
8 “మరో ప్రవక్త వున్నాడు. అతని పేరు మీకాయా, అతడు ఇమ్లా కుమారుడు. కాని నేనతనిని అనహ్యించుకుంటాను. అతడు యెహోవా తరపున మాట్లాడినప్పుడు, అతడెప్పుడూ నాకు మంచి చెప్పడు. నాకు ఇష్టం లేని విషయాలే అతడెప్పుడూ చెపుతాడు” అని అహాబు అన్నాడు. “అహాబు రాజా, నీవు అలా అనకూడదు” అని యెహోషాపాతు అన్నాడు.
9 కావున రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి మీకాయా కొరకు వెళ్లి ఎక్కడున్నాడో చూడమన్నాడు.
10 ఆ సమయంలో ఆ రాజులిద్దరూ తమ తమ రాజ దుస్తుల్లో వున్నారు. వారు సింహాసనాల మీద కూర్చుని వున్నారు. అది షోమ్రోను నగర ద్వారం వద్దగల న్యాయస్థానం. ప్రవక్తలందరూ వారి ముందు నిలబడ్డారు. ప్రవక్తలు ప్రత్యేకమైన విషయాలనేకం యెహోవా నుండి తెలుసుకుని ప్రకటిస్తున్నారు.
11 వారిలో కెనయనా కుమారుడు సిద్కియా అను వాడొకడున్నాడు. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించి తెచ్చాడు. అతడు అహాబుతో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “అరాము సైన్యంతో పోరాడటానికి నీవు ఈ ఇనుప కొమ్ములు ఉపయోగిస్తావు. నీవు వారిని ఓడించి, సర్వనాశనం చేస్తావు.”
12 మిగిలిన ప్రవక్తలు కూడ సిద్కియా చెప్పిన దానితో ఏకీభవించారు. ఆ ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు: “నీ సైన్యం ఇప్పుడే కదిలి వెళ్లాలి. అరాము సైన్యంతో వారు రామోత్గిలాదు వద్ద పోరు సల్పాలి. నీవా పోరాటంలో గెలుస్తావు. యెహోవా నీవు గెలిచేలా చేస్తాడు.”
13 ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వుండగా ప్రభుత్వాధికారి మీకాయాకొరకు వెళ్లాడు. అతడు మీకాయాను చూసి, “ప్రవక్తలంతా రాజు గెలుస్తాడని చెపుతున్నారు. నేననేదేమంటే నీవు కూడా అదే మాదిరిగా చెపితే నీకు చాలా క్షేమకరం” అని అన్నాడు.
14 కాదు! యెహోవా ప్రసాదించిన శక్తిచేత యెహోవా నన్ను ఏది చెప్పమని ఆజ్ఞయిస్తే అదే చెపుతానని ప్రమాణం చేసియున్నాను” అని మీకాయా సమాధానం చెప్పాడు.
15 తరువాత మీకాయా వచ్చి రాజైన అహాబు ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: “మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడ వచ్చునా?” “అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడు” అని మీకాయా సమాధానం చెప్పాడు.
16 కాని ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలు యెహోవా శక్తితో చెప్పటం లేదు. ఇది నీ ఊహాగానం. అందువల్ల నాకు నిజం చెప్పు! నేనేం చేయాలో యెహోవా శక్తి ఆధారంగా నాకు తెలియజెప్పు! ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను!”
17 అందుకు మీకాయా ఇలా అన్నాడతు: “ఏమి జరుగుతుందో నేను చూడగలను. ఇశ్రాయేలు సైన్యం కొండల్లో చిందరవందరై పోతుంది. కాపరిలేని గొర్రెల్లా వారు వికలమైపోతారు. ఈ మనుష్యులకు నాయకుడులేడు. పోరుమాని వారు ఇండ్లకు పోతే మంచిది’ అని యెహోవా అంటున్నాడు.”
18 యెహోషాపాతుతో అప్పుడు అహాబు ఇలా అన్నాడు: “చూడు! నేను చెప్పాను గదా! ఈ ప్రవక్త నన్ను గురించి ఎన్నడూ మంచి చెప్పడు. ప్రతిసారీ నేను విననొల్లని మాటలే అతడు చెపుతాడు.”
19 కాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! ఇవి యెహోవా చెప్పిన మాటలు. యెహోవా పరలోకంలో సింహాసనాసీనుడై వున్నట్లు చూశాను. దేవదూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు.
20 యెహోవా వారితో ఇలా చెప్పినాడు: ‘మీలో ఎవరైనా రాజైన అహాబును మోసగించగలరా? అతడు రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడేలా చేయాలని నా వాంఛ. అప్పుడతడు చంపబడతాడు.’ దేవదూతలు తాము చేయవలసిన పనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు.
21 అప్పుడు ఒక దేవదూత యెహోవా ముందుకు వచ్చి, ‘నేనతనిని మాయ జేయగలను!’అని చెప్పాడు.
22 ‘ఎలామాయలో పడవేయగలవు? అని యెహోవా అడిగాడు. ‘అహాబు ప్రవక్తలందరినీ కలవరపెడతాను. రాజైన అహాబుతో అన్నీ అబద్ధాలు చెప్పమని ప్రవక్తలను ప్రోత్సహిస్తాను. ప్రవక్తల సమాచారాలన్నీ అబద్ధాలే’ అని దేవదూత అన్నాడు. అందుకు యెహోవా, ‘మంచిది! వెళ్లి అహాబు రాజును మాయలో పడవేయి; నీకు విజయం చేకూరుతుంది”‘ అని అన్నాడు.
23 మీకాయా తన కథనం ముగించాడు. అతనిలా అన్నాడు: “ఇదీ ఇక్కడ జరిగిన విషయం. యెహోవా నీ ప్రవక్తలను నీతో అబద్దమాడేలా చేశాడు. యెహోవా తనకు తానే నీకు కష్టనష్టాలు రావాలని కోరి నిశ్చయించాడు.”
24 తరువాత ప్రవక్తయగు సిద్కియా, మీకాయా వద్దకు వెళ్లాడు. సిద్కియా మీకాయాను చెంప మీదకొట్టి, “యెహోవా శక్తి నన్ను వదిలి నీద్వారా మాట్లాడుతున్నదని నీవు నిజంగా నమ్ముతున్నావా?” అని అడిగాడు.
25 “నీవు వెంటనే వెళ్లి ఒక చిన్న గదిలో దాగివుండు. అప్పుడు నేను నిజం చెప్తున్నట్లు నీకు తెలుస్తుంది” అన్నాడు మీకాయా.
26 మీకాయాను బంధించమని అహాబు తన అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. “ఇతనిని బంధించి నగరపాలకుడగు ఆమోను వద్దకు తీసుకుని వెళ్లండి. రాజకుమారుడైన యెవాషును ఇతనిపై తీర్పు చెప్పనీయండి.
27 మీకాయాను కారాగారంలో వుంచమని అతనికి చెప్పండి. వీనికి కేవలం రొట్టె, నీరు మాత్రం ఇవ్వండి. నేను యుద్ధంనుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు ఇతనిని అక్కడే వుంచండి” అని రాజైన అహాబు అన్నాడు.
28 అది విన్న మీకాయా ఇలా ప్రకటించాడు: “సర్వప్రజలారా, నే చెప్పేది సావధానంగా వినండి! అహాబు రాజా, యుద్ధం నుండి నీవు క్షేమంగా ఇంటికి తిరిగివస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండనట్లే.”
29 తరువాత రాజైన అహాబు, మరియు రాజైన యెహోషాపాతు కలిసి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. గిలాదు అనే ప్రాంతంలో ఇది వుంది.
30 అహాబు యెహోషాపాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్ధానికి సిద్ధమవుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం మొదలయింది.
31 అరాము రాజుకు ముప్పది యిద్దరు రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతులకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు.
32 యుద్దం సాగుతూవుంతడగా ఈ అధిపతులు రాజైన యెహోషాపాతును చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావించారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం ప్రారంభించాడు.
33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు.
34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.
35 సైన్యాలు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాయి. రాజైన ఆహాబు తన రథం మీదే వుండిపోయాడు. రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు అరాము సైన్యంవైపు చూస్తూ వుండిపోయాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. బాగా సాయంత్ర మయ్యేసరికి రాజు చనిపోయాడు.
36 సూర్యాస్తమయసమయంలో ఇశ్రాయేలు సైన్యం తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.
37 రాజైన అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని భౌతిక కాయాన్ని కొందరు షోమ్రోనుకు తీసుకొని వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు.
38 అహాబు రథాన్ని సైనికులు షోమ్రోనులో ఒక చెరువు వద్ద కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని యెహోవా చెప్పియున్నాడో అలానే జరిగాయి.
39 రాజైన అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన నగరాన్ని గూర్చి కూడా వుంది.
40 అహాబు చనిపోయిన పిమ్మట అతని కుమారుడైన అహజ్యా అతని స్థానంలో రాజు అయ్యాడు.
41 ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడి నాలుగవ సంవత్సరంలో యూదాకు రాజయ్యాడు.
42 యెహోషాపాతు రాజు అయ్యే నాటికి ఇతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. యెహోషాపాతు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. యెహోషాపాతు తల్లి షిల్హీ కుమార్తె. అతని తల్లి పేరు అజూబా.
43 యెహోషాపాతు మంచి వ్యక్తి. గతంలో తన తండ్రి నడచిన రీతినే ఇతడు కూడ నడిచాడు. యెహోవా ఆజ్ఞలను శిరసావహించాడు. కాని యెహోషాపాతు ఉన్నత స్థలాలను తీసివేయలేదు. ఆ స్థలాలలో ప్రజలు బలులు సమర్పించటం, ధూపం వేయటం వంటి ఆరాధనా కార్యక్రమాలు కొనసాగించారు.
44 యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఒక శాంతి ఒడంబడికను కుదుర్చుకున్నాడు.
45 యెహోషాపాతు మిక్కిలి ధైర్యవంతుడు. అతడు చాలా యుద్ధాలు చేశాడు. అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
46 వ్యభిచార విషయంగా తమ శరీరాలను అమ్ముకొనే స్త్రీ పురుషులను ఆరాధనా స్థలాలనుండి యెహోషాపాతు వెళ్లగొట్టాడు. తన తండ్రియగు ఆసా రాజ్యం చేసిన కాలంలో ఆ రకమైన స్త్రీ పురుషులు ఆరాధనా స్థలాలలో సేవచేస్తూ వుండేవారు.
47 ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. అది ఒక పాలనాధికారి అధీనంలో వుండేది. ఆ అధికారి యూదా రాజుచేత ఎంపిక చేయబడేవాడు.
48 రాజైన యెహోషాపాతు సముద్రయానానికి అనువైన ఓడలను నిర్మించాడు. యెహోషాపాతు ఆ ఓడలను ఓఫీరు దేశానికి పంపాడు. ఓడలు బంగారాన్ని తేవాలని అతని ఆశయం. కాని ఓడలు ఎసోన్గెబెరు వద్ద మునిగిపోయాయి. ఓడలు బంగారాన్ని అసలు తేలేక పోయాయి.
49 ఇశ్రాయేలు రాజైన అహజ్యా యెహోషాపాతుకు సహాయం చేయటానికి వెళ్లాడు. యెహోషాపాతుతో నౌకా నిర్మాణ యానాలలో సమర్థులైన వారిని తీసుకొని వస్తానని అహజ్యా అన్నాడు. కాని యెహోషాపాతు అహజ్యా మనుష్యులను వినియోగించుకోడానికి నిరాకరించాడు.
50 యెహోషాపాతు చనిపోయాడు. అతనిని తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధిచేశారు. తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
51 అహాబు కుమారుడు అహజ్యా, యెహోషాపాతు పాలన యూదాలో పదునేడవ సంవత్సరం జరుగుతుండగా అహజ్యా ఇశ్రాయేలుకు రాజైనాడు. అహజ్యా షోమ్రోనులో రెండు సంవత్సరాలు పాలించాడు.
52 అహజ్యా యెహోవా దృష్టిలో పాపం చేశాడు. తన తండ్రి అహాబు, తన తల్లి యెజెబెలు, మరియు నెబాతు కుమారుడైన యరొబాము నడచిన చెడునడతనే అహజ్యా కూడ అనుసరించాడు. ఈ పాలకులంతా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారుకులయ్యారు.
53 అహజ్యా బూటకపు దేవత బయలును ఆరాధించాడు. తనకు ముందున్న తన తండ్రి వలెనే ఆ అసత్య దేవతను కొలిచాడు. తవన ఈ చెడు నడవడితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చాలా కోపం కలిగించాడు. తనకు ముందున్న తన తండ్రిపట్ల కోపగించినట్లు యెహోవా అహజ్యా పట్ల కూడా కోపంతోపున్నాడు.