1

1 దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత అతను సిక్లగుకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది.

2 మూడవ రోజున సిక్లగుకు ఒక యువసైనికుడు వచ్చాడు. ఇతడు సౌలు శిబిరము నుండి వచ్చాడు. వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి పడివుంది . అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు.

3 “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు వానిని అడిగాడు. “నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించు కొని వచ్చాను” అని దావీదుకు సమాధాన మిచ్చాడు.

4 “దయచేసి యుద్ధంలో ఎవరు గెల్చారో చెప్పు” అని దావీదు అడిగాడు. “జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక మంది హతులయ్యారు. సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా వ్యక్తి.

5 దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు.

6 అందుకు యువసైనికుడు, ఇలా చెప్పెను: “నేను ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం జరిగింది. సౌలు తన ఈటెపై ఆనుకొని వుండటం నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల మీద సౌలుకు చేరువగా వస్తూవున్నారు.

7 సౌలు వెనుదిరిగి నన్ను చూశాడు. ఆయన నన్ను పిలవగా నన్నేమి చేయమంటారు? అంటూ వెళ్లాను.

8 ‘నీవెవడవు’ అని సౌలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని చెప్పాను.

9 సౌలు నాతో, ‘దయచేసి కొంచెం ఆగి నన్ను చంపివేయుము. నేను తీవ్రంగా గాయపడ్డాను. నేను ఇంచుమించు చనిపోయినట్లే’అని చెప్పాడు.”

10 అందువల్ల నేను ఆగి, ఆయనను చంపాను. ఆయన ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. అప్పుడు నేనాయన కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, వాటిని నా యజమానివైన నీ యొద్దకు తెచ్చాను.”

11 తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యులందరూ అలానే చేశారు.

12 వారు మిక్కిలి దుఃఖించారు. సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించినందుకు వారు విలపించారు. మరణించిన యెహోవా ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని మనుష్యులు దుఃఖించారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో నరకబడి చంపబడినందుకు వారు విలపించారు.

13 సౌలు మరణవార్త తెచ్చిన ఆ యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు. “నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని ఆ యువసైనికుడు అన్నాడు.

14 “యెహోవాచే ప్రతిష్ఠింపబడిన రాజును చంపటానికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని అడిగాడు.

15 [This verse may not be a part of this translation]

16 [This verse may not be a part of this translation]

17 సౌలు, అతని కుమారుడు యోనాతానులను గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు.

18 యూదా ప్రజలకు ఈ పాట నేర్పుమని దావీదు తన మనుష్యులకు చెప్పాడు. ఈ పాట “ధనుర్గీతిక” అని పిలవబడింది: ఈ పాటయాషారు గ్రంధంలో ఇలా వ్రాయబడి వుంది.

19 ఓహో! “ఇశ్రాయేలూ నీ సౌందర్యం ఉన్నత స్థలాలపై ధ్వంసం చేయబడింది! బలాఢ్యులు పడిపోయారు!

20 ఈ విషయం గాతులో చెప్పవద్దు, అష్కెలోను వీధులలో ప్రకటించ వద్దు! ఏలయనగా ఫిలిష్తీయుల ఆడపడుచులు సంతసించ వచ్చు, సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు!

21 గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని వాన చినుకులు గాని పడకుండుగాక! ఆ పొలాలు బీడులైపోవుగాక! యోధులైన వారి డాళ్లు అక్కడ మలినమైనాయి అభిషిక్తుడైన సౌలు డాలు నూనెతో మెరుగు పెట్టబడలేదు.

22 యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారంచేసింది. సౌలు కత్తి దానివంతు శత్రువులను తుత్తునియలు చేసింది అవి శత్రురక్తాన్ని చిందించాయి యోధుల, కొవ్వును స్పృశించాయి.

23 సౌలును, యోనాతానును మేము ప్రేమించాము; వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును అనుభవించాము! మరణంలో సైతం సౌలు, యోనాతాను ఎడబాటు ఎరుగరు! వారు పక్షి రాజుల కంటె వేగం గలవారు, వారు సింహాల కంటె బలంగలవారు!

24 ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు కొరకు ఏడ్వండి! సౌలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల దుస్తులతో అలంకరించియున్నాడు; మీ దుస్తులపై బంగారు నగలు పెట్టాడు.

25 యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు! యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు.

26 యోనాతానూ, సహోదరుడా! నీ కొరకై విలపిస్తున్నాను. నీ స్నేహపు మాధుర్యాన్ని చవిచూశాను; నా పట్ల నీ ప్రేమ అద్భతం, అది స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనది!

27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! వారి ఆయుధాలు నాశనమయ్యాయి.”

2

1 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు. “వెళ్లు” అన్నాడు యెహోవా “ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడికితే, “హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.

2 కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి.

3 దావీదు తన మనుష్యులందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర ప్రాంతాలలో తన నివాసాలను ఏర్పరచుకున్నారు.

4 యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.

5 యాబేష్గిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు ఈ విధంగా చెప్పారు: “మీ రాజైన సౌలు అస్థికలను మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునాశీర్వదించు గాక!

6 దేవుడు ఇప్పుడు మీపట్ల దయగలవాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి వుంటాను.

7 మీ రాజైన సౌలు చనిపోయాడు. కనుక ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెలగండి.”

8 నేరు కుమారుడైన అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును మహనయీమునకు తీసుకొని వెళ్లాడు.

9 అక్కడ అబ్నేరు అతనిని గిలాదు, ఆషేరి, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను వారిమీద రాజుగా నియమించాడు. అనగా ఇష్బోషెతు ఇశ్రాయేలుకు రాజయ్యాడు.

10 ఇష్బోషెతు సౌలు కుమారుడు. అతడు ఇశ్రాయేలుకు రాజై పాలించేనాటికి నలుబది ఏండ్ల వయస్సువాడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని యూదా వంశంవారు దావీదును అనుసరించారు.

11 హెబ్రోనులో యూదా వంశవారికి దావీదు ఏడు సంవత్సరాల ఆరునెలలు రాజుగా ఉన్నాడు.

12 నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్బోషె నౌకరులు మహనయీము వదిలి పయనమైపోయారు. వారు గిబియోను చేరారు.

13 సెరూయా కుమారుడుగు యోవాబు, దావీదు సేవకులు కూడా గిబియోనుకు వెళ్లారు. గిబియోను మడుగువద్ద వారు అబ్నేరును, ఇష్బోషెతు సేవకులను కలిసారు. అబ్నేరు తరపువారంతా కొలనుకు ఒక పక్క కూర్చున్నారు. యోవాబు పక్షం వారు మరొక ప్రక్క కూర్చున్నారు.

14 యోవాబుతో అబ్నేరు, “మన ఇరుపక్షాల యువకులనూ ప్రోత్సహించి వారి మధ్య బలప్రదర్శన ఇక్కడ జరుపుదాము” అన్నాడు. పోటీ నిర్వహించటానికి యోవాబు ఒప్పు కున్నాడు.

15 అప్పుడు యువసైనికులు లేచారు. ఇరుపక్షాల వారూ వారి వారి యువసైనికులను పోటీకి లెక్కపెట్టారు. ఇష్బోషెతు పక్షాన బెన్యామీను వంశీయులు, దావీదు పక్షాన అతని అనుచరులు పన్నెండు మంది చొప్పున ఎంపిక చేయబడ్డారు.

16 ప్రతి ఒక్కడూ తన ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్కలలో పోడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున నేలకొరిగారు. అందువల్ల ఆ ప్రదేశం “చురకత్తుల క్షేత్రం” అని పిలవబడింది. ఆ ప్రదేశం గిబియోనులో ఉంది.

17 ఆ రోజు పోటీ ఒక భయంకర పోరాటంగా మారింది. దావీదు సైనికులు అబ్నేరును, ఇశ్రాయేలీయులను ఓడించారు.

18 యోవాబు, అబీషై, అశాహేలు అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశాహేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా వేగంగా పరుగు తీయగలవాడు.

19 అశాహేలు అబ్నేరును తరుముకుంటూ పోయాడు. అశాహేలు తిన్నగా అబ్నేరును అనుసరించి తరిమాడు.

20 అబ్నేరు వెనుదిరిగి చూసి, “నీవు అశాహేలువా?” అని అడిగాడు. “అవును నేనే” అన్నాడు అశాహేలు.

21 “(అబ్నేరు అశాహేలును గాయ పరచేందుకు ఇష్టపడలేదు) అయితే నీవు కుడి పక్కకు గాని, ఎడమ పక్కకు తిరిగి అక్కడ వున్న యువకులలో ఒకడిని పట్టుకుని వాని కవచం నీ కొరకు తీసుకో” అన్నాడు అబ్నేరు. కాని అశాహేలు అబ్నేరును వెంటాడటం మానటానికి ఒప్పుకోలేదు.

22 అబ్నేరు మళ్లీ అశాహేలుతో ఇలా అన్నాడు: “నన్ను తరమటం ఆపివేయుము. నీవు ఆపకపోతే నేను నిన్ను చంపుతాను. నేను నిన్ను చంపిన పక్షంలో నీ సోదరుడైన యోవాబు ముఖం మళ్లీ నేను చూడ లేను!”

23 కాని అశాహేలు అబ్నేరును తరమటం మానలేదు. దానితో అబ్నేరు తన ఈటె ఐనుక భాగంతో అశాహేలు పొట్టలో పాడినాడు ఈటె మడం ఎంత తీవ్రంగా దిగబడిందనగా అది పొట్టలో నుండి వీపు ద్వారా బయటికి వచ్చింది. అశాహేలు అక్కడికక్కడే మరణించాడు. అశాహేలు శవం నేలమీద పడివుంది. అతని మనుష్యులందరూ అక్కడికి వచ్చి ఆగారు. (అశాహేలును చూసేందుకు)

24 కాని యోవాబు, అబీషై లిరువురూ అబ్నేరును వెంటాడసాగారు. వారు అమ్మా కొండ చేరేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. గిబియోను ఎడారిమార్గంలో గీహ ఎదురుగా అమ్మా కొండవుంది.

25 బెన్యామీనీయులంతా అబ్నేరు వద్దకు వచ్చి కొండ మీద కూడారు.

26 అబ్నేరు యోవాబును పిలిచి, “కత్తివుంటే అది ఎల్లప్పుడూ చంపటానికేనా? నీకు తెలుసు; నిజానికి ఇది విషాదాంతమవుతుంది! తమ సోదరులనే వెంటాడటం మానివేయమని ఆ మనుష్యులకు చెప్పు” అని అన్నాడు.

27 “నీవామాట అన్నావు, మంచిదే. దేవుని జీవంతోడుగా చెపుతున్నాను. నీవు ఇప్పుడు మాట్లాడకుండా వుండివుంటే ఈ జనం వారి సోదరులను తెల్లవారేవరకు తరుముకుంటూ పోయేవారు” అని యోవాబు అన్నాడు.

28 అప్పుడు యోవాబు ఒక బూర వూదాడు. దానితో అతని మనుష్యులు ఇశ్రాయేలీయులను తరమటం మానివేశారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని వారు ఎంతమాత్రం ప్రయత్నం చేయలేదు.

29 అబ్నేరు, అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబహు మైదానం గుండా ప్రయాణం చేసి యొర్దాను నదిని దాటారు. మరునాటి పగలంతా వారు ప్రయాణం చేసి మహనయీముకు చేరారు.

30 యోవాబు అబ్నేరును తరుముట మాని, తిరిగి వచ్చాడు, యోవాబు తన జనాన్ని సమావేశ పర్చినప్పుడు దావీదు అనుచరులలో పందొమ్మిది మంది తప్పియున్నారు. అశాహేలు కూడా లేడు.

31 అబ్నేరు అనుచరులలో మూడువందల అరువది మంది బెన్యామీనీయులను దావీదు సేవకులు వధించారు.

32 దావీదు మనుష్యులు అశాహేలు శవాన్ని బేత్లెహేముకు తీసుకొని వెళ్లి, అక్కడ ఉన్న అతని తండ్రి సమాధిలోనే పాతి పెట్టారు. యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా పయనించారు. వారు హెబ్రోను చేరేసరికి సూర్యోదయమయ్యింది.

3

1 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి మధ్య దీర్ఘకాలిక యుద్ధం కొనసాగింది. దావీదు రాను రాను బాగా బలపడ్డాడు. సౌలు కుటుంబం నానాటికీ బలహీనమయింది.

2 హెబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది. మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెజ్రె యేలీయురాలగు అహీనోయము.

3 రెండవ కుమారుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు. మూడవ కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము తల్లి గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకా.

4 నాల్గవ కుమారుడు అదోనీయా. అదోనీయా తల్లి హగ్గీతు. ఐదవ కుమారుడు షెఫట్య. షెఫట్య తల్లి అబీటలు.

5 ఆరవ కుమారుడు ఇత్రెయాము. ఇత్రెయాము తల్లి దావీదు భార్యయగు ఎగ్లా. ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో దావీదుకు కలిగారు.

6 సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిన కాలంలో అబ్నేరు సౌలు సైన్యంలో బలాన్ని పుంజుకున్నాడు.

7 సౌలుకు రిస్పా అనే ఒక దాసి వుండేది. ఆమె సౌలుకు ఇంచుమించు భార్యవలె వుండేది. రిస్పా అయ్యా అనువాని కుమార్తె. ఇష్బోషెతు ఒకనాడు అబ్నేరును పిలిచి, “నా తండ్రి పనిగత్తెతో నీవు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు?” అని అడిగిగాడు.

8 ఇష్బోషెతు అన్న మాటకు అబ్నేరుకు ఎక్కడా లేని కోపం వచ్చింది. అబ్నేరు ఇలా అన్నాడు, “నేను సౌలుకు, అతని కుటుంబానికి చాలా విధేయుడనై వున్నాను! నేను నిన్ను దావీదుకు అప్పగించలేదు; (పైగా అతడు నిన్ను ఓడించేలా చేయనూ లేదు.) యూదావారి తరపున పనిచేస్తూ ఒక రాజద్రోహిగా నేను ఎన్నడూ మెలగలేదు. కాని నీవిప్పుడు నేనొక నీచకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు!

9 [This verse may not be a part of this translation]

10 నేనిప్పుడు నిశ్చియంగా చెప్తున్నాను. దేవుడు చెప్పిన విషయాలు ఇప్పుడు జరిగేలా నేను తప్పక ప్రయత్నం చేస్తాను! సౌలు వంశంనుండి రాజ్యాన్ని తీసుకొని దావీదుకు ఇస్తానని యోహోవా చెప్పాడు. దావీదును యూదా రాజ్యానికి, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా చేస్తాడు. దాను నుండి బెయేర్షబా వరకు దావీదు పరిపాలిస్తాడు! ఈ పనులన్నీ నెరవేరేలా నేను సహాయ పడకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక!”

11 ఇష్బోషెతు అబ్నేరుతో ఇంకేమీ చెప్పలేక పోయాడు. ఇష్బోషెతు అతనంటే విపరీతంగా భయపడిపోయాడు.

12 అబ్నేరు దావీదు వద్దకు దూతలను పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను నీకు సహాయపడతాను.”

13 అందుకు దావీదు, “మంచిది! నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుంటాను. కాని నిన్నొకటి అడుగుతాను; నీవు సౌలు కుమార్తె మీకాలును తీసుకొని వచ్చేవరకు నేను నిన్ను కలవను” అని చెప్పమన్నాడు.

14 సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దావీదు దూతలను పంపాడు. “నా భార్య మీకాలును తిరిగి నాకు తెచ్చి ఇవ్వు. ఆమె నాకు ప్రధానం చేయబడింది. ఆమెను వివాహమాడటానికి నేను వందమంది ఫిలిష్తియులను చంపియున్నాను” అని చెప్పి పంపాడు.

15 లాయీషు కుమారుడైన పల్తీయేలు అనే వాని నుండి మీకాలును తీసుకొని రమ్మని సౌలు కుమారుడు ఇష్బోషెతు తన మనుష్యులను పంపాడు.

16 మీకాలు భర్త పల్తీయేలు మీకాలుతో కూడా వచ్చాడు. మీకాలును అనుసరించి పల్తీయేలు బహూరీము వరకు ఏడుస్తూవచ్చాడు. కాని అబ్నేరు పల్తీయేలుతో, “ఇంటికి తిరిగి పొమ్మని” చెప్పాడు. అప్పుడు పల్తీయేలు ఇంటికి వెళ్లి పోయాడు.

17 అబ్నేరు ఇశ్రాయేలు నాయకులకు యిలా వర్తమానం పంపించాడు: “మీరు దావీదును మీ రాజుగా చేసుకోవాలని చాలా కాలంగా కోరుకుంటూ వున్నారు.

18 ఆ పని ఇప్పుడు చేయండి! ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలందరినీ ఫిలిష్తీయుల నుండి, వారి తదితర శత్రువుల నుండి రక్షిస్తాననీ; ఈ పని నా సేవకుడైన దావీదు ద్వారా నెరవేరుస్తాననీ’ యెహోవా పలికినప్పుడు ఆయన ఈ దావీదును గురించే చెప్పాడు.”

19 బ్నేరు ఈ విషయాలన్నీ దావీదుతో హెబ్రోనులో చెప్పాడు. ఈ విషయాలు బెన్యామీనీయులందరికీ కూడ చెప్పాడు. అబ్నేరు చెప్పిన విషయాలు బెన్యామీను వంశంవారికీ, ఇశ్రాయేలీయుందరికీ మంచివిగా తోచాయి.

20 అప్పుడు అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చాడు. అబ్నేరు అతనితో ఇరువది మంది మనుష్యులను తీసుకొని వచ్చాడు. అబ్నేరుకు, అతనితో వచ్చిన మనుష్యులకు దావీదు విందు ఇచ్చాడు.

21 అబ్నేరు దావీదుతో ఇలా అన్నాడు, “ప్రభువైన నా రాజా! నేను ఇశ్రాయేలీయులందరినీ నీ వద్దకు తీసుకొని వస్తాను. అప్పుడు వారంతా నీతో ఒక ఒడంబడిక చేసుకొంటారు. తరువాత నీకు నచ్చిన విధంగా ఇశ్రాయేలును పరిపాలించవచ్చు!” తరువాత దావీదు అబ్నేరును వెళ్లమని చెప్పగా, అబ్నేరు ప్రశాంతంగా వెళ్లిపోయాడు.

22 యోవాబు, దావీదు అధికారులు యుద్ధం నుండి తిరిగి వచ్చారు. వారు శత్రువుల నుండి ఎన్నో విలువైన వస్తువులను కొల్లగొట్టుకొచ్చారు. దావీదు అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు. అందువల్ల హెబ్రోనులో దావీదు వద్ద అబ్నేరు లేడు.

23 యోవాబు, అతని సైనికులంతా హెబ్రోనుకు చేరారు. సైన్యం యోవాబుతో, “నేరు కుమారుడైన అబ్నేరు దావీదు రాజు వద్దకు రాగా, ఆయన అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు” అని అన్నది.

24 యోవాబు రాజు వద్దకు వచ్చి, “ఏమిటి నీవు చేసిన పని? అబ్నేరు నీ వద్దకు వస్తే, అతనికి ఏ హాని చేయకుండా ఎందుకు పంపించివేశావు!

25 నేరు కుమారుడైన అబ్నేరును నీవెరుగుదువు! అతడు నిన్ను మోసగించటానికి వచ్చాడు! నీవు చేస్తున్నదంతా సమగ్రంగా తెలుసుకోవాలనే తలంపుతో వచ్చాడు!” అని అన్నాడు.

26 యోవాబు దావీదు వద్ద నుండి వెళ్లి, సిరా అనుబావి వద్దకు అబ్నేరు కొరకు తన దూతలను పంపాడు. దూతలు అబ్నేరును వెనుకకు తీసుకొని వచ్చారు. కాని ఇదంతా దావీదుకు తెలియదు.

27 అబ్నేరు హెబ్రోనుకు రాగానే, యోవాబు అతనిని సింహద్వారం మధ్యలో ఏదో రహస్యంగా మాట్లాడాలని ఒక పక్కకు తీసుకొని వెళ్లాడు. కాని యోవాబు తన కత్తితో అబ్నేరు పొట్టలో పొడిచాడు. అబ్నేరు చనిపోయాడు. గతంలో యోవాబు సోదరుడైన అశాహేలును అబ్నేరు చంపాడు. కావున యోవాబు అబ్నేరును చంపివేశాడు.

28 తరువాత ఈ వార్త దావీదు విన్నాడు. దావీదు ఇలా అన్నాడు; “నేను, నా రాజ్యం నేరు కుమారుడైన అబ్నేరు హత్య విషయంలో నిర్దోషులం. యెహోవాకి ఇది తెలుసు.

29 యోవాబు, అతని కుటుంబం దీనంతటికీ బాధ్యులు. అతని కుటుంబమంతా నిందితులే. యోవాబు కుటుంబానికి అనేక కష్టాలు ఎదురువుతాయని నేను నమ్ముతున్నాను. అతని కుటుంబంలో ఎప్పుడూ ఎవరో ఒకరు కుష్టువ్యాధి పీడితుడో, అంగవైకల్యంతో కర్ర పట్టుకు నడిచే వాడో, యుద్ధంలో హతుడయ్యేవాడో, లేదా ఆహారము లేనివాడో వుంటాడని కూడ నేను నమ్ముతున్నాను.”

30 యోవాబు, అతని సోదరుడు అబీషైలిరువురూ అబ్నేరును చంపిన కారణమేమనగా అబ్నేరు వారి సహోదరుడైన అశాహేలును గిబియోను వద్ద యుద్ధంలో చంపాడు.

31 [This verse may not be a part of this translation]

32 [This verse may not be a part of this translation]

33 దావీదు రాజు అబ్నేరుపై ఈ విషాద గీతిక పాడాడు: “అబ్నేరు ఒక అవివేకిలా హతుడాయెనా?

34 అతని చేతులకు బంధాలులేవు, పాదాలకు గొలుసులు వేయలేదు! అయినా క్రూరుల ముందు నీవు నేలకొరిగావు. ఒరిగి మరణించావు.” అప్పుడు ప్రజలంతా మళ్లీ అబ్నేరు కొరకు విలపించారు.

35 ఆ రోజు ఇంకా పొద్దువుండగానే దావీదును ఆహారం తీసుకోమని కోరటానికి ప్రజలు వచ్చారు. కాని దావీదు ఒక ప్రత్యేకమైన ప్రమాణం చేశాడు. “నేను రొట్టెగాని, తదితరమైన ఆహారంగాని సూర్యాస్తమయం గాకుండా తింటే దేవుడు నన్ను శిక్షించుగాక! నాకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టుగాక!” అని అన్నాడు.

36 అసలు అక్కడ ఏమి జరిగిందో ప్రజలంతా చూశారు, కనుక దావీదు రాజు చేసేవాటన్నిటినీ ప్రజలు ఒప్పుకున్నారు.

37 నేరు కుమారుడైన అబ్నేరును చంపినది దావీదు రాజు కాదని యూదా ప్రజలకీ, ఇశ్రాయేలీయులందరికీ ఆ రోజు అర్థమయ్యింది.

38 దావీదు రాజు తన సేవకులతో ఇలా అన్నాడు: “మీకు తెలుసు; ఇశ్రాయేలులో ఈ రోజు ఒక ప్రముఖ నాయకుడు చనిపోయాడు.

39 పైగా ఇదే రోజున నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఈ సెరూయా కుమారులు నాకు మిక్కిలి దుఃఖాన్ని కలుగజేశారు. యెహోవా వారికి అర్హమైన శిక్ష విధించుగాక!”

4

1 హెబ్రోనులో అబ్నేరు చనిరపోయాడని సౌలు కుమారుడు ఇష్బోషెతు విన్నాడు. ఇష్బోషెతు, అతని ప్రజలు చాలా గాభరా చెందారు.

2 సౌలు సైన్యంలో దళాధిపతులైన ఇరువురు సౌలు కుమారుడైన ఇష్బోషెతు వద్దకు వచ్చారు. ఆ ఇరువురిలో ఒకని పేరు బయనా, మరియొకని పేరు రేకాబు. బయానా, రేకాబులిద్దరూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు బెన్యామీను వంశానికి చెందిన వారు. బెయేరోతు పట్టణం బెన్యామీను వంశానికి చెందినది.

3 కాని బెయేరోతు ప్రజలు గిత్తయీముకు పారిపోయి, ఈనాటికీ వారక్కడ నివసిస్తున్నారు.

4 సౌలు కుమారుడైన యోనాతానుకు కుంటివాడైన ఒక కుమారుడున్నాడు. యెజ్రెయేలు వద్ద సౌలు, అతని కుమారుడు యోనాతాను చనిపోయారన్న వార్త వచ్చే సమయానికి యోనాతాను కుమారుడు ఐదేండ్లవాడు. అప్పుడా పిల్లవాని దాది వాని నెత్తుకొని పారి పోయినది. ఖంగారుగా పారిపోయేటప్పుడు, దాది చేతులలో నుండి యోనాతాను కుమారుడు జారికిందపడ్డాడు. అందువల్ల యోనాతాను కుమారుడు కుంటివాడయ్యాడు. వీని పేరు మెఫీబోషెతు.

5 రేకాబు, బయనాలిరువురూ బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. వారు ఇష్బోషెతు ఇంటికి మిట్ట మధ్యాహ్న సమయంలో వెళ్లారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఇష్బోషెతు విశ్రాంతి తీసుకొంటున్నాడు.

6 [This verse may not be a part of this translation]

7 [This verse may not be a part of this translation]

8 హెబ్రోనుకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదుకు ఇచ్చారు. రేకాయి, బయనాలు దావీదు రాజుతో ఇలా అన్నారు: “నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. అతడు నిన్ను చంప ప్రయత్నం చేశాడు! యెహోవా ఈ రోజు సౌలును, అతని కుటుంబాన్ని శిక్షించాడు!”

9 రేకాబు, బయనాలకు సమాధానంగా దావీదు ఇలా అన్నాడు: “యెహోవా జీవము తోడుగా, నిజానికి అతను నన్ను అనేక కష్టాల నుంచి రక్షించాడు.

10 ఒకానొకడు నాకేదో మంచివార్త చెప్పాలన్నట్లు వచ్చాడు. వాడు వచ్చి, ‘సౌలు చచ్చిపోయాడు!’ అని చెప్పాడు. ఆ వార్త నాకు అందచేసినందుకు వానికి నేను పారితోషికము ఇస్తాననుకున్నాడు. కాని నేను వానిని పట్టుకొని సిక్లగు వద్ద చంపివేశాను.

11 కావున మీ చావును కూడ నేను కోరుతున్నాను. ఎందుకనగా దుష్టులు ఒక మంచి వ్యక్తిని అతని పక్కమీదే, అతని ఇంటిలోనే హత్య చేశారు!”

12 దావీదు కొందరు యువకులను పిలిచి రేకాబు, బయనాలను చంపమన్నాడు. అప్పుడా యువకులు రేకాబు, బయనాల కాళ్లు, చేతులు నరికి, హెబ్రోను మడుగు వద్ద వేలాడ దీశారు. తరువాత ఇష్బోషెతు తలను తీసుకొని హెబ్రోనులో అబ్నేరు సమాధి వద్ద పాతి పెట్టారు.

5

1 అప్పుడు ఇశ్రాయేలు వంశాల వారందరూ హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చి ఇలా అన్నారు: “చూడండి; మనమంతా ఒకే కుటుంబం!

2 గతంలో సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల యుద్ధాలలో నీవు మమ్ములను నడిపించావు. మరియు ఇశ్రాయేలును యుద్ధము నుంచి ఇంటికి తిరిగి రప్పించావు. ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు కాపరివవుతావు. ఇశ్రాయేలుకు పాలకుడవవుతావు’ అని యెహోవా నీకు చెప్పాడు.”

3 ఇశ్రాయేలు నాయకులంతా హెబ్రోనులో ఉన్న దావీదు రాజు వద్దకు వచ్చారు. దావీదు రాజు హెబ్రోనులో ఆ వచ్చిన నాయకులతో యెహోవా సమక్షంలో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడా నాయకులంతా దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించారు.

4 పరిపాలన చేపట్టే నాటికి దావీదు ముప్పది సంవత్సరాల వాడు. అతడు నలుబది సంవత్సరాలు పాలించాడు.

5 హెబ్రోనులో వుండి యూదా రాజ్యాన్ని ఏడు సంవత్సరాల, ఆరు నెలలు పాలించాడు. పిమ్మట యెరూషలేము నుంచి ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను ముప్పదిమూడు సంవత్సరాలు పాలించాడు.

6 రాజు తన మనుష్యులతో యెబూసీయుల మీదికి దండెత్తి యెరూషలేముకు పోయెను. (యెబూసీయులు) దేశంలో నివాసం ఏర్పరచుకొని స్థిరపడిపోయారు. యెబూసీయులు దావీదుతో, “నీవు మా నగరంలోకి రాలేవు . ఒకవేళ వస్తే, కుంటి, గుడ్డివారు సహితం నిన్ను విరోధిస్తారు” అని అన్నారు.

7 కాని దావీదు సీయోను కోటను వశపర్చుకున్నాడు. తరువాత దానినే దావీదు నగరం అని పిలవటం మొదలు పెట్టారు.

8 ఆ రోజు దావీదు తన మనుష్యులతో, “మీరు యెబూసీయులను ఓడించాలంటే నీటి సొరంగం ద్వారా ఆ ‘కుంటి మరియు గ్రుడ్డి’ శత్రువుల వద్దకు వెళ్లండి” అని అన్నాడు. అందువల్లనే, “కుంటి, గుడ్డివారు ఇంట్లోకి రాలేరని” అంటారు.

9 దావీదు కోటలో నివసించి, దానిని “దావీదు నగరం” అని పిలిచాడు. మిల్లో నుండి చుట్టు పక్కల అనేక భవనాలను దావీదు కట్టించాడు. సీయోను నగరంలో కూడా అనేక కట్టడాలను చేపట్టి లోపల బాగా అభివృద్ధి చేశాడు.

10 సర్వశక్తిమంతుడైన దేవుడు అతనికి తోడైయున్నందున, దావీదు క్రమంగా బలపడి వర్థిల్లాడు.

11 తూరు రాజైన హీరాము కొందరు దూతలను దావీదు వద్దకు పంపాడు. వారితో పాటు దేవదారు కలపను, వడ్రంగులను, శిల్పులను పంపాడు. వారంతా దావీదుకు ఒక భవనం నిర్మించారు.

12 నిజంగా యెహోవా తనను ఇశ్రాయేలుకు రాజును చేసినట్లు దావీదుకు ఆ సమయంలో అర్థమయ్యింది. యెహోవా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తన రాజ్యాన్ని చాలా ముఖ్యమైనదిగా దేవుడు చేసినాడని దావీదు తెలుసుకొన్నాడు.

13 దావీదు యెరూషలేము నుండి పెక్కు మంది దాసీలను, భార్యలను స్వీకరించాడు. హెబ్రోను నుండి యెరూషలేముకు వెళ్లిన పిమ్మట దావీదు ఆ పని చేసాడు. దావీదుకు చాలా మంది కుమారులు, కుమార్తెలు కలిగారు.

14 యెరూషలేములో దావీదుకు కలిగిన కుమారుల పేర్లు: షమ్మూ, యషోబాబు, నాతాను, సొలొమోను,

15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ,

16 ఎలీషామా, ఎల్యాదా మరియు ఎలీపేలెటు.

17 ఇశ్రాయేలీయులు దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించారని ఫిలిష్తీయులు వినగానే, ఫిలిష్తీయులంతా దావీదును చంపాలని వెదకటం మొదలు పెట్టారు. కాని ఈ వార్త దావీదు విన్నాడు. అతను ఒక కోటలోకి వెళ్లాడు.

18 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగారు.

19 దావీదు ప్రార్థన చేసి, “ఫిలిష్తీయుల మీదికి యుద్దానికి వెళ్లేదా? ఫిలిష్తీయులను ఓడించటంలో నాకు సహాయపడతావా?” అని యెహోవాను అడిగాడు. “వెళ్లు. ఫిలిష్తీయులను ఓడించటంలో నీకు నేను తప్పక సహాయం చేస్తాను” అని యెహోవా చెప్పాడు.

20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి, ఫిలిష్తీయులను ఓడించాడు. “ఆనకట్ట తెగి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ప్రవహించినట్లు, యెహోవా నా శత్రువులను నాముందు చెల్లాచెదురై పారిపోయేలా చేసాడు,” అని అనుకున్నాడు దావీదు. ఆ కారణం చేత దావీదు ఆ ప్రదేశానికి బయల్పెరాజీము అని పేరుపెట్టాడు.

21 ఫిలిష్తీయులు పారిపోతూ తమ దేవుళ్ల విగ్రహాలను బయల్పెరాజీము వద్ద వదిలిపోయారు. దావీదు, అతని మనుష్యులు ఆ విగ్రహాన్నిటినీ తీసుకొని వెళ్లారు.

22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు.

23 దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఈ సారి యెహోవా దావీదుతో ఇలా అన్నాడు, “తిన్నగా అక్కడికి వెళ్లవద్దు. వాళ్లను చుట్టుముట్టి సైన్యానికి వెనుకగా వెళ్లు. గులిమిడి చెట్లవద్ద వారిని ఎదుర్కో.

24 చెట్ల మీదకు ఎక్కి కూర్చుని, ఫిలిష్తీయులు యుద్ధానికి నడిచివచ్చే శబ్దం వింటావు. అప్పుడు నీవు త్వరపడాలి. ఎందుకంటే యెహోవా అక్కడ ఫిలిష్తీయులను ఓడించటానికి నీ కొరకు ఉన్నట్లు అది సంకేతం.”

25 యెహోవా తనను ఏమి చేయమని ఆజ్ఞ ఇచ్చాడో దావీదు అదంతా చేశాడు. అతను ఫిలిష్తీయులను ఓడించాడు. అతడు వారిని గెబ నుండి గెజెరు వరకు తరుము కుంటూ పోయి చంపాడు.

6

1 దావీదు మరల ప్రత్యేకంగా ఉత్తములైన ముప్పదివేల మంది ఇశ్రాయేలు యోధులను సమకూర్చుకొన్నాడు.

2 దావీదు వారిని తీసుకొని యూదాలో ఉన్న బాలాకు ప్రయాణమై వెళ్లాడు. యూదాలోని బాలాలో ఉన్న దేవుని పవిత్ర పెట్టె తీసుకొని, దానిని యెరూషలేముకు బయలు దేర దీసినారు. ఈ పవిత్ర పెట్టె సైన్యములకు అధిపతియైన యెహోవా పరమ పవిత్ర నామంతో పిలవబడుతూ ఉంది. పవిత్ర పెట్టె పైనున్న కెరూబుల మధ్య ఆయన ఆసీనుడైయున్నాడు.

3 దావీదు మనుష్యులు యెహోవా పవిత్ర పెట్టెను ఒక కొత్త బండిపై ఉంచారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి వారా పెట్టెను తెచ్చారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహ్యో అనువారు ఆ బండిని తోలారు.

4 కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటినుండి ఉజ్జా, అహ్యోలిరువురూ ఆ బండిని బయలుదేరదీశారు. బండిపై దేవుని పవిత్ర పెట్టె వున్నది. అహ్యో బండిముందు నడుస్తూ ఉన్నాడు.

5 దావీదు, మరియు ఇశ్రాయేలీయులందరూ యెహోవా ముందు రకరకాల వాద్య విశేషాలు వాయిస్తూ ఉన్నారు. ఈ వాద్య పరికరాలు తమాల వృక్షపు కర్రతో చేయబడ్డాయి. ఆ వాద్య విశేషములలో వీణలు, విచిత్ర వీణలు, మృదంగములు, ఢమరుకములు, తాళములు మొదలగునవి ఉన్నాయి.

6 దావీదు మనుష్యులు నాకోను నూర్పిడి కళ్లం దగ్గరకు రాగానే ఎద్దులు తూలి పడబోయాయి. దానితో బండి మీదవున్న దేవుని ఒడంబడిక పెట్టె ఒరిగి కింద పడబోయింది. వెంటనే ఉజ్జా పవిత్ర పెట్టెను పట్టుకున్నాడు.

7 యెహోవాకు ఉజ్జాపై కోపం వచ్చి చంపివేశాడు . దేవుని పవిత్ర పెట్టెను తాకినప్పుడు ఉజ్జా దేవుని గౌరవించినట్లు గాదు. దేవుని పవిత్ర పెట్టెవలన ఉజ్జా చంపబడ్డాడు.

8 ఉజ్జాను యెహోవా చంపినందుకు దావీదు కలత చెందాడు. దావీదు ఆ స్థలానికి “పెరెజ్‌ - ఉజ్జా” అని పేరు పెట్టాడు. ఆ ప్రదేశం ఈనాటికీ పెరెజ్‌ - ఉజ్జా అనే పిలవబడుతూ వుంది.

9 ఆ రోజు దావీదు యెహోవా అంటే భయపడిపోయాడు. “ఇప్పుడు దేవుని పవిత్ర పెట్టె నా వద్దకు ఎలా వస్తుంది?” అని అడిగాడు.

10 దావీదు పురములోనికి తనకై తాను దేవుని పవిత్ర పెట్టెను దావీదు తీసుకొని పోవుటకు సుముఖత చూపలేదు. గాతువాడైన ఓబేదెదోము ఇంటిలో పవిత్ర పెట్టెను దావీదు వుంచాడు. బాటమీద నుంచి గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటివరకు పవిత్ర పెట్టెను దావీదు మోసాడు.

11 ఓబేదెదోము ఇంటి వద్ద యెహోవా పవిత్ర పెట్టె మూడు నెలలపాటు వుండెను. కాబట్టి ఓబేదెదోమును, అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు.

12 ప్రజలు దావీదు వద్దకు వచ్చి, “దేవుని పవిత్ర పెట్టె అక్కడున్న కారణాన యెహోవా ఓబేదెదోము కుటుంబాన్ని, అతని వస్తువాహనాలను ఆశీర్వదించాడు” అని చెప్పారు. దానితో దావీదు ఓబేదెదోము ఇంటి నుండి దేవుని ఒడంబడిక పెట్టెను ఆనందోత్సాహాలతో తేవటానికి వెళ్లాడు.

13 యెహోవా పవిత్ర పెట్టెను మోసేవారు ఆరడుగులు నడిచి ఆగగా, దావీదు ఒక ఎద్దును, ఒక బలిసిన దూడను బలియిచ్చాడు.

14 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని ధరించాడు.

15 యెహోవా పవిత్ర పెట్టెను నగరంలోకి తెస్తూవుండగా దావీదు, ఇశ్రాయేలీయులంతా సంతోషంతో కేకలు వేశారు. బూరలు ఊదారు.

16 సౌలు కుమార్తె మీకాలు ఒక కిటికీ గుండా చూస్తూ వుంది. యెహోవా పవిత్ర పెట్టె నగరంలోనికి వచ్చినప్పుడు, యెహోవా ముందు దావీదు చిందులేస్తూ, నాట్యం చేస్తూవున్నాడు. ఇదంతా మీకాలు చూసి, దావీదును తన మనసులో అవమానించింది.

17 పవిత్ర పెట్టె కొరకు దావీదు ఒక గుడారం నిర్మింపజేశాడు. ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్ర పెట్టెను గుడారంలో దాని స్థానంలో నిలిపారు. దావీదు అప్పుడు దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు సమర్పించాడు.

18 దహన బలులు, సమాధాన బలులు సమర్పించాక, సర్వశక్తిమంతుడైన యెహోవా పేరిట దావీదు ప్రజలను ఆశీర్వదించాడు.

19 నైవేద్యంగా ఉంచిన రొట్టె, ఎండిన ద్రాక్ష భక్ష్యములు, ఖర్జూరపు పండువేసి చేసిన రొట్టెలను స్త్రీ పురుషులందరికీ, ఇశ్రాయేలీయులందరికీ ప్రసాదంగా పంచి పెట్టాడు. తరువాత వారంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు.

20 దావీదు తన ఇంటి వారిని ఆశీర్వదించటానికి వెళ్లాడు. కాని సౌలు కుమార్తె మీకాలు దావీదును కలవటానికి బయటికి వచ్చింది. “ఇశ్రాయేలు రాజు ఈనాడు తనను తాను ఏమాత్రం గౌరవించుకోలేదు. నీ సేవకుల పని గత్తెల ముందు నీవు నీ బట్టలు విప్పివేశావు .సిగ్గు విడిచి బట్టలు విప్పుకునే ఒక మూర్ఖునిలా ప్రవర్తించావు!” అని బాగా అవమానించింది.

21 అందుకు దావీదు మీకాలుతో ఇలా అన్నాడు: “యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అంతేగాని నీ తండ్రనీ కాదు, లేక అతని కుటుంబంలో మరెవ్వరినీ కాదు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ నాయకునిగా యెహోవా నన్ను ఎంపిక చేశాడు. అందువల్ల యెహోవా ఎదుట నేను ఉత్సవం చేశాను.

22 బహుశః నీ దృష్టిలో నాకు గౌరవం లేకుండా పోవచ్చు. నాకు నేను ఇంకా కించ పర్చుకోవచ్చు. కాని నీవు చెప్పిన ఆ పనిగత్తెలు మాత్రం నన్ను గౌరవిస్తారు!”

23 ఈ రీతిగా దావీదును అవమానించినందున సౌలు కుమార్తె మీకాలుకు పిల్లలు కలుగలేదు. ఆమె గొడ్రాలుగానే చనిపోయింది.

7

1 దావీదు తన కొత్త ఇంటిలో నివసించుచున్న కాలంలో యెహోవా ఆయనకు చుట్టూ వున్న శత్రువుల నుండి ఏ బాధలూ లేకుండా శాంతిని సమకూర్చాడు.

2 రాజు(దావీదు) నాతాను అనే ఒక ప్రవక్త వద్దకు వెళ్లి, “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించబడిన ఒక భవంతిలో ఉంటున్నాను. కాని దేవుని పవిత్ర పెట్టె ఇంకా గుడారంలోనే ఉంచబడింది!” అన్నాడు

3 రాజుతో (దావీదు) నాతాను, “వెళ్లు. నీవు వాస్తవంగా ఏమి చేయాలని అనుకుంటున్నావో అది చేయుము. యెహోవా నీతో ఉన్నాడు” అని చెప్పాడు.

4 కాని ఆ రాత్రి యెహోవా వాక్యం నాతానుకు చేరింది.

5 యెహోవా నాతానును పిలచి ఆయన మాటగా, ఆయన సేవకుడైన దావీదుతో ఇలా చేప్పమన్నాడు: “నా కొరకు ఆలయ నిర్మాణం చేయవలసిన వ్యక్తివి నీవు కాదు.

6 ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు నేను ఆలయంలో నివసించలేదు. ఒక గుడారంలో వుంటూనే అటూ ఇటూ పయనించాను. గుడారాన్నే నివాసంగా వినియోగించుకున్నాను.

7 ఇశ్రాయేలు వంశము వారిలో ఏ ఒక్కరికీ దేవదారు కలపతో నాకు ఆలయం నిర్మించే విషయంపై ఒక్క మాటకూడ చెప్పియుండలేదు.”

8 సర్వశక్తిమంతుడైన యెహోవా నాతానును దావీదుతో ఇంకా ఇలా చెప్పమన్నాడు, “నిన్ను నేను పచ్చిక బయళ్ల నుండి పట్టుకొచ్చాను. నీవు గొర్రెలను కాస్తూ వుండగా నిన్ను పట్టుకొచ్చాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకునిగా వుండేందుకు నిన్ను తెచ్చాను.

9 నీవు ఎక్కడికి వెళితే అక్కడికల్లా నేను నీతో వచ్చాను. నీ కొరకు నీ శత్రువులందకరినీ ఓడించాను. ఇప్పుడు ఈ భూమి మీద అతి ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిన్ను నేను చేస్తాను.

10 [This verse may not be a part of this translation]

11 [This verse may not be a part of this translation]

12 “నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నీ పూర్వీకుల వద్దనే సమాధి చేయబడతావు. అప్పుడు నేను నీ స్వంత పిల్లలలో ఒకనిని రాజుగా చేస్తాను.

13 అతడు నా నామాన్ని ఘనపర్చే విధంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు. అతని రాజ్యాన్ని శాశ్వత ప్రాతిపదికపై చాలా బలమైనదిగా చేస్తాను.

14 అతనికి తండ్రిగా నేను వ్యవహరిస్తాను. అతడు నాకు కుమారుడు. అతడు పాపం చేస్తే, అతనిని శిక్షించటానికి వేరే ప్రజలను వినియోగిస్తాను. వారు దండములు ధరించి నా తరుపున పనిచేస్తారు.

15 కాని నేనతనిని ప్రేమతో చూడక మానను. నేనతనిపట్ల దాక్షిణ్యాలు కలిగి ఉంటాను. నేను నా ప్రేమను, దయను సౌలునుండి తొలగించాను. నేను నీ వైపునకు తిరిగినప్పుడు, సౌలను పక్కకు నెట్టినాను. నీ వంశానికి నేనది చేయను.

16 నీ వంశం, నీ రాజ్యం శాశ్వతంగా నా ముందు కొనసాగుతాయి.”

17 నాతాను దావీదుకు అంతా చెప్పాడు. అతను తన దర్శనంలో విన్నదంతా దావీదుకు చెప్పాడు.

18 పిమ్మట దావీదు రాజు లోనికి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ప్రార్థనా పూర్వకంగా యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు, “యెహోవా, నా దేవా, నీకు నేనెందుకంత ముఖ్యుడనయ్యాను? నా కుటుంబం ఎందుకంత ప్రాముఖ్యం గలదయ్యింది? నన్నెందుకు అంత ముఖ్యమైన వాణ్ణిచేశావు?

19 నేనొక సేవకుణ్ణి తప్ప మరేమీ కాను. కాని నీవు నా పట్ల చాలా కరుణతో వున్నావు. భవిష్యత్తులో నా కుటుంబానికి జరిగే కొన్ని మంచి విషయాలు కూడ చెప్పావు. యెహోవా, నా దేవా, నీవిలా ప్రజలతో ఎప్పుడూ మాట్లాడవు. మాట్లాడతావా?

20 నేను నీతో ఎలా ఎల్లప్పుడూ మాట్లాడగలను? యెహోవా, నా దేవా, నేను కేవలం ఒక సేవకుడినని నీకు తెలుసు;

21 ఈ అద్భుత కార్యాలన్నీ నీవు చేస్తానని అన్నావు గనుక జరిపి నిరూపించావు. పైగా నీవు చేయాలనుకున్న దానిలో ఇదొక పని! ఈ గొప్ప విషయాలన్నీ నాకు తెలపాలని నీవు నిశ్చయించావు.

22 ఈ కారణంవలన నీవు గొప్పవాడవు, ఓ నా ప్రభువైన దేవా! యెహోవా నీకు నీవే సాటి. నీవంటి దేవుడు వేరొకరు లేరు. మాకై మేము ఇదంతా విన్నాము.

23 ఇశ్రాయేలీయులైన నీ ప్రజలవలె మరో జనం ఈ భూమిమీద లేదు. ఆ ప్రజలు అసాధారణమైన వారు. వారు ఈజిప్టులో బానిసలయ్యారు. కాని నీవు వారిని విముక్తి చేసి తీసుకొని వచ్చావు. వారిని నీ ప్రజలుగా చేశావు. ఇశ్రాయేలీయుల కొరకు నీవు గొప్పవైన, అద్భుతమైన క్రియలు నెరవేర్చావు. నీ దేశంకొరకు ఆశ్చర్యకరమైన పనులు చేశావు.

24 ఇశ్రాయేలు ప్రజలను శాశ్వతంగా నీకు అతి సన్నిహితులైన స్వంత ప్రజలుగా చేసుకున్నావు. యెహోవా, నీవు వారి పవిత్ర దేవుడవు.

25 “ప్రభువైన దేవా! ఇప్పుడు నీవు నీ సేవకుడినైన నా నిమిత్తం, మరియు నా కుటుంబం నిమిత్తం ఈ సంగతులు చేసెదనని వాగ్దానము చేసియున్నావు. నీవిచ్చిన వాగ్దానాలు శాశ్వతంగా నిజమయ్యేలా చేయుము! నా కుటుంబాన్ని శాశ్వతంగా ఒక రాజ కుటుంబంగా చేయుము.

26 అప్పుడు నీ నామము మహిమాన్వితం చేయబడుతుంది. “ప్రజలంతా, “సర్వశక్తిగల యెహోవా, ఇశ్రాయేలును పరిపాలించు దేవుడు. తన సేవకుడైన దావీదు కుటుంబం ఆయన సేవలో బలముతో కొనసాగుతుంది” అని అందురు.

27 “సర్వశక్తిమంతుడవైన యెహోవా! ఇశ్రాయేలీయుల దేవా నాకు చాలా విషయాలు విశదం చేశావు. ‘నా వంశాభివృద్దికి నీ ఆశీస్సులిచ్చావు.’ నీ సేవకుడనైన నేను అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

28 హోవా, నా దేవా,! నీవే దేవునివి. నీవి సత్యవాక్కులు. నీ సేవకుడనైన నాకు ఈ మంచి విషయాలన్నీ వాగ్దానం చేశావు.

29 దయచేసి నా కుటుంబాన్ని దీవించు. నీ ముందు దానిని ఎల్లప్పుడూ వర్ధిల్లేలా చేయుము. యెహోవా, నా దేవా,! నీవీ అద్భుత విషయాలు చెప్పావు. నీ దీవెనతో నా కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడియుండు గాక!”

8

1 తరువాత దావీదు ఫిలిష్తీయులను ఓడించాడు. వారి రాజధాని నగరాన్ని స్వాధీన పర్చుకున్నాడు.

2 దావీదు మోయాబీయులను కూడ ఓడించాడు. పట్టుబడిన వారందరినీ నేల మీద పరుండేలా చేసి, వారి పొడుగు కొలవటానికి ఒక తాడు తీసుకున్నాడు. రెండు కొలతల పొడవున్న వారందరినీ చంపించాడు. ఒక కొలత పొడవున్న వారందరినీ వదిలిపెట్టాడు. దానితో మోయాబీయులంతా దావీదుకు సేవకులయ్యారు. వారంతా ఆయనకు కప్పము చెల్లించారు.

3 సోబారాజు రెహోబు కుమారుడైన హదదెజరును దావీదు ఓడించాడు. యూఫ్రటీసు నదీ తీరానగల తన ఆధిపత్యాన్ని దావీదు తిరిగి చేజిక్కించుకున్నాడు.

4 హదదెజరు నుండి పదిహేడు వందల మంది గుర్రపు దళము వారిని, ఇరవై వేలమంది కాల్బలము వారిని దావీదు పట్టుకున్నాడు. ఒక వంద మంచి గుర్రాలు మినహా మిగిలిన గుర్రాలన్నిటినీ దావీదు కుంటివానివిగా చేసాడు. ఆ వంద గుర్రాలను రథాలను లాగేందుకు రక్షించాడు.

5 సోబా రాజగు హదదెజరుకు సహయం చేయటానికి దమస్కునుండి సిరియనులు వచ్చిరి. కాని దావీదు ఇరువది రెండువేల మంది సిరియనులను ఓడించాడు.

6 తరువాత దమస్కు అధీనంలోనున్న సిరియా దేశమందు దావీదు రక్షక దళాలను నియమించాడు. సిరియనులు వచ్చి దావీదుకు కప్పము చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయ పరంపర సమకూర్చి పెట్టాడు.

7 హదదెజరు సైనికుల బంగారు డాళ్లను (రక్షకఫలకాలు) దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు.

8 బెతహు, బేరోతైలనుండి దావీదు లెక్కకు మించి ఇత్తడి సామగ్రి పట్టుకొనిపోయాడు. (బెతహు, బేరోతై అను రెండు నగరాలూ హదదెజరుకు చెందినవి).

9 హదదెజరు సైన్యాన్ని దావీదు ఓడించినట్లు హమాతు రాజైన తోయి విన్నాడు.

10 తోయి తన కుమారుడైన యోరామును దావీదు రాజువద్దకు పంపాడు. యోరాము వచ్చి దావీదును పలకరించి, హదదెజరుతో పోరాడి ఓడించినందుకు ఆయనను అభినందించాడు. (తోయిపై హదదెజరు గతంలో దండెత్తి యుద్ధాలు చేశాడు). యోరాము దావీదు వద్దకు వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా తెచ్చాడు.

11 దావీదు వాటిని తీసుకొని యెహోవాకి సమర్పించాడు. తాను ఇతర దేశములను ఓడించి తెచ్చి యెహోవాకి సమర్పించిన వెండి బంగారు వస్తువులతో పాటు ఈ సామగ్రిని కూడ ఉంచాడు.

12 తాను జయించిన దేశాలలో సిరియ, మోయాబు, అమ్నోను, ఫిలిష్తీయ, అమాలేకు ఉన్నాయి. సోబా రాజైన రెహోబు కుమారుడు హదదెజరును కూడ దావీదు ఓడించాడు.

13 దావీదు పద్దెనిమిది వేల సిరియనులను ఉప్పులోయలో ఓడించాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి మిక్కిలి కీర్తి గడించాడు.

14 ఎదోములో దావీదు సైన్యాన్ని రక్షణకై నిలిపాడు. ఎదోము రాజ్యమంతటా కాపలా దళాలను నియమించాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతనికి విజయాన్ని సమకూర్చి పెట్టాడు.

15 ఇశ్రాయేలంతటినీ దావీదు పరిపాలించాడు. దావీదు తీసుకున్న నిర్ణయాలు తన ప్రజలందరికీ నిష్పక్ష పాతంగా వుండి ఆమోదయోగ్యంగా వుండేవి.

16 సెరూయా కుమారుడైన యోవాబు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడు పత్ర లేఖకుడుగా నియమితుడయ్యాడు.

17 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా ఉన్నారు. శెరాయా అనునతను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు.

18 యెహోయాదా కుమారుడు బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి అయ్యాడు. దావీదు కుమారులు రాజకీయ సలహాదారులైన ప్రముఖ వ్యక్తులుగా నియమితులయ్యారు.

9

1 “సౌలు కుటుంబంలో ఇంకాఎవరైనా మిగిలియున్నారా? యోనాతాను కోసం ఆ వ్యక్తికి నేను కనికరం చూపదల్చుకున్నాను” అని దావీదు చెప్పాడు.

2 సౌలు కుటుంబానికి చెందిన సీబా అనే ఒక సేవకుడు ఉన్నాడు. దావీదు మనుష్యులు సీబాను దావీదు వద్దకు తీసుకొని వచ్చారు. దావీదు రాజు సీబాతో, “నీవు సీబావేనా?” అని అడిగాడు. “అవును, నీ సేవకుడనైనన సీబానే” అని అన్నాడు సీబా.

3 “అయితే సౌలు కుటుంబంలో ఎవరైనా జీవించివున్నారా? వుంటే ఆ వ్యక్తికి దేవుని కృపను చూపాలని అనుకుంటున్నాను” అని దావీదు చెప్పాడు. దావీదు రాజుతో సీబా యిలా అన్నాడు: “యోనాతాను కుమారుడొకడు ఇంకా జీవించియున్నాడు. అతని రెండు కాళ్లూ అవిటివి.”

4 “ఈ కుమారుడెక్కడున్నాడని” రాజు సీబాను అడిగాడు. “లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్నాడని” సీబా రాజుకు చెప్పాడు.

5 అప్పుడు దావీదు రాజు తన సేవకులను లోదెబారుకు పంపాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంటిలో వున్న యోనాతాను కుమారుని తీసుకొని రమ్మని చెప్పాడు.

6 యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వంగి నమస్కరించాడు. “మెఫిబోషెతూ” అని పిలిచాడు దావీదు. “అవునయ్యా! నేను నీ సేవకుడను మీ ముందు వున్నాను” అని అన్నాడు మెఫీబోషెతు.

7 మెఫీబోషెతుతో దావీదు ఇలా అన్నాడు, “భయపడకు. నేను నీపట్ల దయగలిగి ఉంటాను. నీ తండ్రియైన యోనాతాను కారణంగా నేను నీకు సహాయం చేస్తాను. నీ తాతయైన సౌలు భూమినంతా నీకు తిరిగి ఇచ్చివేస్తాను. నీవు ఎల్లప్పుడూ నాతో నా బల్ల వద్ద భోజనం చేస్తావు.”

8 మెఫీబోషెతు మరల దావీదుకు వంగి నమస్కరించాడు. మెఫీబోషెతు ఇలా అన్నాడు: “మీరు మీ సేవకుడనైన నా పట్ల చాలా దయగలిగియున్నారు! పైగా నేను చచ్చిన కుక్కకంటె హీనమైన వాడిని!”

9 [This verse may not be a part of this translation]

10 మెఫీబోషెతు కొరకు ఆ భూమిని నీవు సాగుచేయి. మెఫీబోషెతు కొరకు నీ కుమారులు, సేవకులు కలిసి చేయండి. పంట పండించండి. దానితో నీ యజమాని మనుమడు మెఫిబోషెతుకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. కాని నీ యజమాని మనుమడు నా బల్లవద్ద తినగలిగి వుంటాడు.” సీబాకు పదునైదుగురు కుమారులు, ఇరువైమంది సేవకులు వున్నారు.

11 దావీదు రాజుతో సీబా ఇలా అన్నాడు: “నేను నీ సేవకుడను. రాజైన నా ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా నేను అంతా చేస్తాను.” ఆ ప్రకారంగానే మెఫీబోషెతు దావీదు బల్లవద్ద రాజ కుమారులలో ఒకనిగా భోజనం చేశాడు.

12 మెఫీబోషెతుకు మీకా అనబడే ఒక చిన్న కుమారుడున్నాడు. సీబా కుటుంబంలోని వారంతా మెఫీబోషెతుకు సేవకులయ్యారు.

13 మెఫీబోషెతు రెండు కాళ్లూ కుంటివే. మెఫీబోషెతు యెరూషలేములోనే నివసించాడు. ప్రతిరోజూ మెఫీబోషెతు రాజు భోజనాల బల్ల వద్దనే తినేవాడు.

10

1 తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు హానూను రాజయ్యాడు.

2 మరణవార్త విన్న దావీదు “నాహాషు నాపట్ల చాలా దయగలిగియుండెను. కాబట్టి అతని కుమారుడు హానూను పట్లకూడ నేను దయగలిగి ఉంటాను,” అని అన్నాడు. ఆ ప్రకారం దావీదు తన అధికారులను తండ్రి మరణంతో విచారంలో ఉన్న హానూనును పలకరించి ఓదార్చే నిమిత్తం పంపాడు. దావీదు అధికారులు అమ్మోనీయుల దేశానికి వెళ్లారు.

3 కాని అమ్మోనీయుల నాయకులు వారి రాజైన హానూనును కలిసి, “నీ తండ్రి మరణ సందర్భంగా నిన్ను ఓదార్చటానికి తన మనుష్యులను పంపి నీ తండ్రిని గౌరవించటానికి ప్రయత్నిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా? కాదు! దావీదు తన మనుష్యులను నీ నగరాన్ని పరిశీలించి రహస్యాలను తెలసికొనే నిమిత్తం గూఢచారులుగా పంపాడు. వారు నీ మీదకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు!” అని చెప్పారు.

4 కాబట్టి హానూను దావీదు పంపిన అధికారులను పట్టుకొని, వారి గడ్డాలలో సగభాగం గొరిగించాడు. వారి దుస్తులను కూడ సగంనుంచి తొడలవరకు కత్తిరించి వేశాడు. తరువాత వారిని పంపివేశాడు.

5 ఆ అధికారులు చాలా అవమానం పొందారని విన్న దావీదు కొందరు దూతలను తన అధికారులను కలవటానికి పంపాడు. దూతల ద్వారా, “మీ గడ్డాలు బాగా పెరిగేవరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత యెరూషలేమునకు తిరిగిరండి,” అని కబురు పంపాడు దావీదు రాజు.

6 అమ్మోనీయులు దావీదు రాజుతో శతృత్వం తెచ్చి పెట్టుకున్నామని తెలుసుకున్నారు. దానితో వారు సైన్యాన్ని సమకూర్చుకొనే ప్రయత్నంలో బేత్రెహోబు, సోబాలలోవున్న సిరియనులను జీతానికి పిలిపించుకొన్నారు. సిరియను కాల్బలము ఇరువది వేల వరకు వుంది. ఒక వెయ్యిమంది సైనికులతో సహా మయకా రాజును, టోబునుండి పన్నెండు వేలమందిని జీతానికి పిలిపించుకొన్నారు.

7 ఈ విషయం దావీదు విన్నాడు. అతడు యోవాబును, అతని సైన్యంలో వీరులందరిని పంపాడు.

8 అమ్మోనీయులు బయటికి వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు నగర ద్వారం దగ్గర మోహరించారు. సోబానుండి రెహోబు నుండి వచ్చిన సిరియనులు, టోబనుండి, మయకానుండి వచ్చిన మనుష్యులందరూ అమ్మోనీయులతో కలిసి రంగంలో నిలబడలేదు.

9 అమ్మోనీయులు తనకు ముందు, వెనుక కూడ నిలబడి వున్నారని యోవాబు గమనించాడు. అందువల్ల తనతో వచ్చిన ఇశ్రాయేలీయులలో కొందరు నేర్పరులైన వారిని ఎన్నుకుని వారిని సిరియనులతో యుద్ధానికి సిద్ధం చేశాడు.

10 మిగిలిన సైన్యాన్ని అమ్మోనీయుల మీదికి పోవటానికి యోవాబు తన సోదరుడైన అబీషైకి ఇచ్చాడు.

11 యోవాబు అబీషైకి ఇలా చెప్పాడు: “సిరియనులు గనుక బలం పుంజుకొని నన్ను ఓడించేలా వుంటే నీవు వచ్చి నాకు సహాయం చేయము. అమ్మోనీయులు గనుక నీకంటె ఆధిక్యతలో వుంటే నేను వచ్చి నీకు సహాయం చేస్తాను.

12 ధైర్యంగా ఉండు. మన ప్రజలకోసం, మన దేవుని నగరాలకోసం మనమంతా వీరోచితంగా పోరాడదాం! యెహోవా దృష్టికి ఏది మంచిదనిపించుతుందో అది ఆయన చేస్తాడు.”

13 తరువాత యోవాబు, అతని మనుష్యులు సిరియనులను ఎదుర్కొన్నారు. యోవాబు యొక్క, అతని సైన్యం యొక్క ధాటికి తట్టుకోలేక సిరియనులు పారి పోయారు.

14 సిరియనులు పారిపోతున్నట్లు అమ్మోనీయులు చూశారు. దానితో వారుకూడ అబీషైకి భయపడి పారిపోయారు. వారు వారి నగరానికి పోయారు. యోవాబు అమ్మోనీయులతో యుద్ధానంతరం తిరిగి వచ్చి యెరూషలేముకు వెళ్లాడు.

15 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని సిరియనులు గుర్తించారు. వారంతా మళ్లీ సమకూడి ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చారు.

16 హదదెజరు తనదూతలను యూఫ్రటీసు నది అవతల నివసిస్తూ ఉన్న సిరియనులనందరినీ తీసుకొని రావలసినదిగా పంపాడు. ఈ సిరియనులంతా హేలాముకు వచ్చారు. వారి నాయకుడు షోబకు. ఇతడు హదదెజరు సైన్యాధిపతి.

17 దావీదు ఇదంతా విని ఇశ్రాయేలీయులనందరనీ కూడ దీశాడు. వారు యోర్దాను నదిని దాటి హేలాముకు వెళ్లారు. అక్కడ సిరియనులు యుద్ధానికి సిద్ధమై వారిని ఎదిరించారు.

18 కాని దావీదు సిరియనులను ఓడించాడు. సిరియనులు ఇశ్రాయేలీయులకు భయపడి పారిపోయారు. దావీదు సిరియను సైన్యంలో ఏడు వందల మంది రథసారధులను, నలుబది వేల మంది గుర్రపు దళం వారిని చంపివేశాడు. అంతేగాదు సిరియను సైన్యాధిపతియైన షోబకును కూడ దావీదు చంపివేశాడు.

19 హదదెజరు సామంత రాజులంతా వారి సైన్యాలను ఇశ్రాయేలీయులు ఓడించినట్లు చూశారు. కావున వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసికొని వారిని సేవిస్తూవచ్చారు. మళ్లీ అమ్మోనీయులకు సహాయం చేయటానికి సిరియనులు భయపడి పోయారు.

11

1 వసంతకాలం వచ్చింది. రాజులు యుద్ధాలకు దిగే తరుణం. దావీదు యోవాబును, ఇతర సేవకులను, ఇశ్రాయేలీయులను సిద్ధంచేసి అమ్మోనీయులను నాశనం చేయటానికి పంపాడు యోవాబు సైన్యం (అమ్మోనీయుల రాజధాని నగరమైన) రబ్బా నగరంపై కూడ దాడి చేసింది. ఈసారి దావీదు యెరూషలేములోనే వుండిపోయాడు.

2 ఆ రోజు సాయంత్రం పడకనుంచి లేచి, రాజు మేడ మీద అటు యిటు తిరుగ సాగాడు. అప్పుడతడు స్నానం చేస్తూ ఉన్న స్త్రీనొక దానిని చూసాడు. ఆమె చాలా అందంగా ఉంది.

3 దావీదు తన సేవకులను పిలువనంపాడు. ఆ స్త్రీ ఎవరని అడుగగా, ఒక సేవకుడు, “ఆమె పేరు బత్షెబ అనీ, ఆమె ఏలీయాము కుమార్తె అనీ చెప్పాడు. ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య అనికూడ చెప్పాడు.”

4 దావీదు దూతలను పంపి బత్షెబను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె దావీదు వద్దకు వచ్చినప్పుడు, ఆమెతో అతడు సంగమించాడు. ఆమె స్నానాదులు చేసి, శుచియై తన ఇంటికి వెళ్లిపోయింది.

5 కాని “బత్షెబ గర్భవతి” అయింది. ఈ విషయమై దావీదుకు వర్తమానం పంపింది.

6 దావీదు ఒక వర్తమానం యోవాబుకు పంపాడు. “హిత్తీయుడగు ఊరియాను నా వద్దకు పంపుమని” కబురు చేశాడు. అందువల్ల యోవాబు ఊరియాను దావీదు వద్దకు పంపాడు.

7 ఊరియా దావీదు వద్దకు వచ్చాడు. దావీదు అతనిని యోవాబు ఎలా ఉన్నాడనీ, సైనికులెలా వున్నారనీ, యుద్ధం ఎలా కొనసాగుతున్నదనీ అడిగాడు.

8 తరువాత “ఇంటికి పోయి విశ్రాంతి తీసుకోమని” దావీదు ఊరియాకు చెప్పాడు. ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు.

9 కాని ఊరియా ఇంటికి పోలేదు. రాజు ఇంటి ఆవరణ ద్వారం వద్ద ఊరియా నిద్రపోయాడు. మిగిలిన రాజ సేవకుల మాదిరిగా అతను కూడా అక్కడే నిద్ర పోయాడు.

10 “ఊరియా ఇంటికి పోలేదని” సేవకులు దావీదుకు చెప్పారు. అప్పుడు దావీదు ఊరియాను పిలిచి, “నీవు చాలా దూరంనుండి వచ్చావు గదా! నీవు ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.

11 దావీదుతో ఊరియా ఇలా అన్నాడు: “పవిత్ర పెట్టె, ఇశ్రాయేలు, యూదా సైనికులు అందరూ గుడారాలలో ఉంటున్నారు. నా యజమాని యోవాబు, నా ప్రభువు (దావీదు రాజు) యొక్క సేవకులందరూ బయట పొలాల్లో గుడారాలు వేసుకొనివున్నారు. కావున నేను ఇంటికి వెళ్లి తాగి, భార్యతో విలాసంగా కాలం గడపటం మంచిది కాదు!”

12 “అయితే ఈ రోజు ఇక్కడే ఉండు. రేపు నిన్ను మళ్లీ యుద్ధానికి పంపివేస్తాను” అని దావీదు ఊరియాతో అన్నాడు. ఊరియా ఆ రోజు యెరూషలేములో ఉన్నాడు. అతడు మరుసటి రోజు తెల్లవారే వరకు వున్నాడు.

13 ఊరియాను తన వద్దకు వచ్చి కన్పించమని దావీదు కబురు పంపాడు. దావీదుతో కలిసి ఊరియా బాగా తాగి, తిన్నాడు. దావీదు ఊరియాకు బాగా తాగ బోశాడు. అయినా ఊరియా ఇంటికి పోలేదు. ఆరోజు సాయంత్రం ఊరియా రాజుగారి సేవకులతో కలిసి రాజభవన ద్వారం వద్ద నిద్రపోవటానికి వెళ్లాడు.

14 మరునాటి ఉదయం దావీదు యోవాబుకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఊరియా ద్వారా పంపాడు.

15 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”

16 యెవాబు నగరాన్ని పరిశీలించి ఎక్కడ అమ్మోనీయులు ధైర్యంగా ఉన్నారో చూశాడు. అతడా ప్రదేశానికి ఊరియాను పంప నిర్ణయించాడు.

17 ఆ నగర (అమ్మోనీయుల రాజధానియగు రబ్బా) ప్రజలు యోవాబును ఎదిరించటానికి బయటికి వచ్చారు. దావీదు మనుష్యులు కొందరు చంపబడ్డారు. చంపబడిన వారిలో హిత్తీయుడైన ఊరియా ఒకడు.

18 యుద్ధ పరిణామాలపై యోవాబు దావీదుకు ఒక నివేదిక పంపాడు.

19 ఆ దూతతో యుద్ధంలో ఏమి జరిగిందో దావీదురాజుకు వివరంగా చెప్పమన్నాడు.

20 “బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేశేవారని తెలియదా?

21 ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలుకును ఎవరు చంపారో మీకు గుర్తుందా? ఆ నగర గొడపై నుండి ఒక స్త్రీ తిరుగలి పై రాయిని విసరివేయగా అబీమెలెకు చనిపోయాడు. ఆ స్త్రీ అతనిని తేబేసువద్ద చంపింది. మీరు ఆ గోడ చెంతకు ఎందుకు వెళ్లారు? అని అనవచ్చు. దావీదు రాజు గనుక అలా అంటే నీవు తప్పకుండా ‘నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని చెప్పాలి” అంటూ యోవాబు దూతను పంపాడు.

22 ఆ వచ్చిన దూత లోనికి వెళ్లి యోవాబు చెప్పమన్నట్లు దావీదుకు వివరించి చెప్పాడు.

23 దూత ఇలా చెప్పాడు: “అమ్మోనీయులు మమ్మల్ని పొలాల్లో ఎదుర్కొన్నారు. కాని మేము వారితో నగర ద్వారం వద్ధ పోరాడాము.

24 మీ సేవకులపై నగర గోడల మీద ఉన్న వారు బాణాలు వేశారు. మీ సేవకులలో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడ చనిపోయాడు.”

25 సరే ఈ విషయంపై కలతపడవద్దని యోవాబుతో చెప్పమని దూతతో దావీదు అన్నాడు. “కత్తికి వారూ, వీరూ అనీ తేడా వుండదు. అది అందరినీ చంపుతుంది. రబ్బా నగరంపై దాడి తీవ్రం చేయండి. ఆ నగరం అప్పుడు వశమవుతుంది” అని చెప్పి యోవాబును ప్రోత్సహించుమని దావీదు దూతకు చెప్పాడు.

26 తన భర్త ఊరియా చనిపోయినట్లు బత్షెబ విన్నది. తన భర్తకై విలపించింది.

27 సంతాప దినాలు గడిచాక, దావీదు తన మనుష్యులను పంపి ఆమెను తన ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. తరువాత ఆమె దావీదుకు భార్య అయింది. దావీదు వల్ల ఆమెకు కుమారుడు జన్మించాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని యోహోవ ఆమోదించలేదు.

12

1 యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు.

2 ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి.

3 కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది.

4 “ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”

5 ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే!

6 ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.

7 “ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను.

8 అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఉచ్చాను

9 కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు!

10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”

11 “నేను నీకు ఆపద తీసుకువస్తున్నాను. నీ కుటుంబంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడైన వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలియగా, అది అందరికీ తెలుస్తుంది .

12 నీవు బత్షెబతో రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుస్తుంది .”

13 నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు. అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు.

14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”

15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు.

16 దావీదు బిడ్డ కొరకు దేవుని ప్రార్థించాడు. దావీదు తినటానికి, తాగటానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండిపోయాడు.

17 దావీదు కుటుంబంలో ముఖ్యలైన వారు వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయత్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో కలిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాకరించాడు.

18 ఏడవ రోజున శిశువు మరణించింది. శిశువు మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, “చూడండి, బిడ్డ బతికివుండగా మనం ఆయనతో మాట్లాడాలని ప్రయత్నం చేశాము. కాని ఆయన మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం తెలియ జేస్తే, అతడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ఏ పనికైనా పాల్పడవచ్చు!”

19 కాని దావీదు తన సేవకులు గుసగుసలాడు కోవటం గమనించి బిడ్డ మరణించి వుండవచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” అని దావీదు సేవకులను అడిగాడు. “అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు.

20 దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెహోవాని ప్రార్థించటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు.

21 దావీదు సేవకులు ఆయనతో ఇలా చెప్పారు, “నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బిడ్డ బ్రతికి వుండగా నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని బిడ్డ చనిపోగానే, లేచి భోజనం చేశావు.”

22 అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను.

23 కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”

24 దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడామెతో కలిసి వుండి సంగమించగా, ఆమె గర్భవతి అయింది. ఆమెకు మరొక కుమారుడు జన్మించాడు. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా సొలొమోనును ప్రేమించాడు.

25 ప్రవక్త నాతాను ద్వారా యెహోవా తన సందేశం పంపాడు. నాతాను వచ్చి సొలొమోనుకు యదీద్యా అని నామకరణం చేశాడు. దేవుని ఆజ్ఞానుసారం నాతాను అలా చేశాడు.

26 యోవాబు అమ్మోనీయుల నగరంపై యుద్ధం చేశాడు. అతడు రాజధాని నగరాన్ని పట్టుకున్నాడు.

27 యోవాబు దావీదు వద్దకు దూతలను పంపి ఇలా చెప్పమన్నాడు: “నేను రబ్బాపై యుద్ధం నిర్వహించాను. నేను జలనగరాన్ని పట్టుకున్నాను.

28 ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకొని వచ్చి రబ్బానగరాన్ని ముట్టడించు. దానిని నాకై నేను వశపర్చుకునేలోగా నీవు వచ్చి పట్టుకో. నేను గనుక వశపర్చుకుంటే, ఆ నగరం నా పేరు మీదుగా పిలువబడుతుంది!”

29 9దావీదు తన సైన్యాన్ని కూడదీసికొని రబ్బా నగరానికి వెళ్లాడు. యుద్ధం చేసి ఆ నగరాన్ని వశపర్చుకున్నాడు.

30 దావీదు ఆ రాజు తలనుండి కిరీటాన్ని తీసుకున్నాడు. అది బంగారు కిరీటం. దాని బరువు సుమారు డెబ్బది అయిదు కాసులు. ఈ కిరీటంలో విలువైన వజ్రాలు పొదగబడ్డాయి. ఆ కిరీటాన్ని సైనికులు దావీదు తలపై వుంచారు. ఆ నగరం నుండి దావీదు అనేక విలువైవ వస్తువులను కొల్లగొట్టుకుపోయాడు.

31 అంతేగాదు, దావీదు రబ్బా నగర వాసులను బయటకు తీసుకొని వచ్చాడు. వారందరినీ రంపములతోను, పలుగులతోను, గొడ్డళ్లతోను పని చేయించాడు. వారందరినీ ఇటుకలతో కట్టడాలను నిర్మించేలా చేశాడు. అమ్మోనీయుల నగరాలన్నిటిలో దావీదు ఇలాగే చేయించాడు. తరువాత దావీదు తన సైన్యంతో యెరూషలేముకు వెళ్లిపోయాడు.

13

1 దావీదుకు అబ్షాలోము అను కుమారుడొకడున్నాడు. అబ్షాలోముకు ఒక సోదరివుంది. ఆమె పేరు తామారు. ఆమె బహుసౌందర్యవతి. దావీదు యొక్క మరో కుమారుడైన అమ్నోను తామారును మోహించాడు.

2 తామారు కన్యక. అందువల్ల ఆమెను తన కామవంఛ తీర్చుకోవటానికి అమ్నోను ఆమెను ఏమీ చేయలేకపోయాడు. కాని అమ్నోను ఆమెను మిక్కిలిగా మోహించాడు. ఆమెను పొందలేక ఆమె ధ్యాసతో అమ్నోను విరహంతో నీరసించిపోయాడు.

3 అమ్నోనుకు యెహోనాదాబు అనే స్నేహితుడొకడున్నాడు. అతడు షిమ్యా కుమారుడు. షిమ్యా దావీదు సోదరుడు. యెహోనాదాబు యుక్తిగల వాడు.

4 యెహోనాదాబు అమ్నోనుతో, “రోజు రోజుకీ నీవు చిక్కిపోతున్నావు! నీవు రాజ కుమారుడవు! తినటానికి కావలసినంత ఉంది. కాని ఎందుకిలా చిక్కి శల్యమై పోతున్నావు? నాతో చెప్పు” అన్నాడు. “నేను తామారును ప్రేమిస్తున్నాను. కాని ఆమె నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి” అన్నాడు అమ్నోను.

5 యెహోనాదాబు అమ్నోనుకు ఇలా సలహాయిచ్చాడు: “నీవు పోయి పండుకో, జబ్బు పడిన వానిలా నటించు. అప్పుడు నీ తండ్రి నిన్ను చూసేందుకు వస్తాడు. నీవాయనతో నీ చెల్లెలైన తామారును నీకు ఆహారాన్నిచ్చి సేవ చేయటానికి పంపమను. ఆమె నీ ఎదుట ఆహారం నీవు చూస్తూవుండగా తయారు చేసి ఆమె నీకు పెడుతుందని కూడా చెప్పు.”

6 ఆ సలహా మేరకు అమ్నోను పక్క మీద పడుకుని జబ్బు పడిన వానిలా నటించాడు. అమ్నోనును చూడటానికి దావీదు రాజు వచ్చాడు. “దయచేసి చెల్లెలు తామారును పంపించు. నేను చూస్తూవుండగా ఆమె రెండు ప్రత్యెకమైన రొట్టెలు చేసి పెడుతుంది. ఆమె చేతిమీదగా తింటాను” అని దావీదుతో అమ్నోను చెప్పాడు.

7 దావీదు తామారు ఇంటికి దూతలను పంపాడు. వారు తామారుతో ఆమె సోదరుడు, “అమ్నోను ఇంటికి వెళ్లి అతనికి కొంత ఆహారం చేసిపెట్టమని చెప్పారు.”

8 తన సోదరుడైన అమ్నోను ఇంటికి తామారు వెళ్లింది. అమ్నోను మంచంపై ఉన్నాడు తామారు కొంత పిండి తీసుకొని, దానిని ఆమె స్వయంగా కలిపింది. అమ్నోను చూస్తూవుండగా ఆమె కొన్ని రొట్టెలు చేసింది. తరువాత ఆమె రొట్టెలను కాల్చింది.

9 తామారు రొట్టెలను కాల్చిన పిమ్మట పెనంలో వాటిని తీసుకొని వెళ్లి అమ్నోను ముందు పళ్లెంలో వేసింది. కాని అమ్నోను తినటానికి అంగీకరించలేదు. అమ్నోను తన సేవకులందరినీ, “అతనిని ఒంటరిగా వదిలి వెళ్లి పొమ్మన్నాడు” అమ్నోను గదినుండి సేవకులంతా బయటికి పోయారు.

10 అమ్నోను తామారుతో, “రొట్టెలను లోపలి గది లోనికి తీసుకొనిరా. అప్పుడు నీ చేతిమీదుగా వాటిని తింటాను” అని అన్నాడు. తామారు లోపలి గదిలో వున్న తన సోదరుడైన అమ్నోను వద్దకు వెళ్లింది. ఆమె చేసిన రొట్టెలను తీసుకొని వెళ్లింది.

11 తన చేతుల మీదుగా తింటాడని ఆమె అమ్మోను వద్దకు వెళ్లింది. కాని అమ్నోను తామారును పట్టుకున్నాడు. “చెల్లీ, రా! నాతో కలిసి పడుకో!” అని అన్నాడు.

12 అందుకు తామారు అమ్నెనుతో ఇలా ప్రాధేయపడింది: “వద్దు, సోదరా! నన్ను బలవంతం చేయకు! ఇశ్రాయేలులో ఇలా ఎన్నటికీ జరుగకూడదు! ఈ అవమానకరమైన పని చేయకు!

13 నా కళంకాన్ని నేనెన్నడూ మాపుకోలేను. ఇశ్రాయేలీయులలో నీచకార్యాలు చేసే మూర్ఖులలో నీవొకడివై పోతావు. దయచేసి రాజుతో మాట్లాడు. నన్ను వివాహం చేసికోటానికి ఆయన నీకు అనుమతిస్తాడు.”

14 కాని అమ్నోను తామారు చెప్పే దానిని వినటానికి నిరాకరించాడు. అతడు తామారుకంటె బలవంతుడు. అతడామెను బలాత్కరించి సంగమించాడు.

15 దాని తరువాత అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. ముందు అతనామెనెంతగా ప్రేమించాడో, అంతకు మించి ఇప్పుడు అమ్నోను తామారును అసహ్యించుకున్నాడు. అమ్నోను తామారుతో, “మంచం మీది నుంచి లేచి బయటికి పొమ్మన్నాడు.”

16 అందుకు తామారు అమ్నోనుతో, “కాదు! నీవిప్పుడు మునుపటికంటె ఇంకా ఘోరమైన తప్పు చేస్తున్నావు. నీవు నన్ను పంపివేయటానికి ప్రయత్నిస్తున్నావు!” అనిఅన్నది. కాని అమ్నోను తామారు చెప్పేది వినలేదు.

17 అమ్నోను తన సేవకుణ్ణి లోనికి పిలిచి, “ఇప్పుడే ఈ పిల్లను గదినుండి బయటికి పంపించు! బయటకు నెట్టి తలుపుకు తాళం వేయి” అని చెప్పాడు.

18 అమ్నోను సేవకుడు తామారును బయటికి గెంటి గదికి తాళం పెట్టాడు. తామారు ఒక రంగురంగుల పొడవైన చేతులు, చాలా వదులుగా వుండే అంగీని వేసుకున్నది. ఆ రకమైన అంగీలను పెండ్లికాని రాజ కుమార్తెలు మాత్రమే వేసుకునేవారు.

19 తామారు కొద్దిగా బూడిద తీసుకొని తన నెత్తి మీద పోసుకున్నది. తన రంగు రంగుల అంగీని చింపుకొన్నది. తన చేయి నెత్తిమీద పెట్టుకుని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోయింది .

20 తామారు సోదరుడు అబ్షాలోము తామారుతో, “నీ సోదరుడు అమ్నోను నిన్ను చెరచినాడుగా ?” అన్నాడు. “అమ్నోను నీ సోదరుడు. కావున చెల్లీ, ప్రస్తుతానికి నీవు మాట్లాడక వుండు. ఇది నిన్ను విపరీతంగా సంక్షోభపెట్టకుండా చూసుకో!” అది విన్న తామారు ఇక ఏమీ మట్లాడ లేదు. నాశనమైన స్త్రీలా, అమె అబ్షాలోము ఇంటి వద్దనే ఉండసాగింది.

21 ఈ వార్త దావీదు రాజు విన్నాడు. ఆయనకు పట్టరాని కోపం వచ్చింది.

22 అబ్షాలోము అమ్నోనును అసహ్యించుకున్నాడు. అబ్షాలోము అమ్నోను నుద్దేశించి మంచిగా గాని, చెడ్డగా గాని ఏమీ అనలేదు. తన సోదరి తామారును చెరచినందుకు అమ్నోనును అసహ్యించుకున్నాడు.

23 రెండు సంవత్సరాల తరువాత అబ్షాలోము కొందరు మనుష్యులను తన గొర్రెల నుండి ఉన్ని తీయటానికి బయల్దాసోరుకు రావించాడు. ఈ కార్యక్రమం చూడటానికి రాజకుమారులందరినీ అబ్షాలోము ఆహ్వానించాడు.

24 అబ్షాలోము రాజు వద్దకు వెళ్లి, “నా గొర్రెల నుండి ఉన్ని తీయటానికి మనుష్యులను పిలిచాను. దయచేసి నీ సేవకులతో వచ్చి ఆ కార్యక్రమం తిలకించ” మని అడిగాడు.

25 “వద్దు, కుమారుడా! మేము రాము. మేమంతా వస్తే అది నీకు చాల శ్రమ అవుతుంది” అని దావీదు రాజు అబ్షాలోముతో అన్నాడు. దావీదును రమ్మని అబ్షాలోము ప్రాధేయపడ్డాడు. దావీదు వెళ్లలేదు గాని’ అతని పనిని ఆశీర్వదించాడు.

26 “నీవు రాకుంటే, దయచేసి నా సోదరుడు అమ్నోనును నాతో పంపించు” మని అబ్షాలోను అడిగాడు. “అతడు నీతో ఎందుకు రావాలి?” అని దావీదు రాజు అడిగాడు.

27 అయినా అబ్షాలోము వినిపించుకోకుండా అదే పనిగా ప్రాధేయపడి అడిగాడు. చివరికి అమ్నోను, మిగిలిన రాజకుమారులు అబ్షాలోముతో వెళ్లటానికి ఒప్పుకున్నారు.

28 అబ్షాలోము తన సేవకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “అమ్నోనును ఒక కంట కనిపెట్టి వుండండి. వాడు బాగా తాగిన పిమ్మట ‘అమ్నోనును చంపండి’ అంటాను. ఆ సమయంలో వానిని చంపండి! భయపడకండి నేను మీకు అజ్ఞ ఇస్తున్నాను! నిబ్బరంగా, ధైర్యంగా వుండండి” అని అబ్షాలోము సేవకులతో అన్నాడు.

29 అబ్షాలోము ఆజ్ఞ మేరకు అతని యువసేవకులు అమ్నోనును చంపివేశారు. కాని దావీదు మిగిలిన కుమారులంతా తప్పించుకున్నారు. వారిలో ప్రతి ఒక్కడూ తన కంచర గాడిదపై ఎక్కి తప్పించుకు పోయాడు.

30 రాజకుమారులంతా మార్గమధ్యంలో వుండగానే, ఈ వార్త దావీదుకు చేరింది. “అబ్షాలోము రాజ కుమారులందరినీ చంపివేశాడనీ; ఒక్కడు కూడా మిగల లేదనీ” ఆయనకు వర్తమానం వచ్చింది. దావీదు రాజు తన బట్టలు చింపుకొని నేలమీద పడ్డాడు. దావీదు చెంతనున్న తన సేవకులు కూడా విషాదసూచకంగా తమ బట్టలు కూడా చింపుకున్నారు.

31 [This verse may not be a part of this translation]

32 [This verse may not be a part of this translation]

33 కారణమేమనగా అమ్మోను అబ్షాలోము చెల్లెలు తామారును చెరిచాడు. కాబట్టి అమ్నోను మాత్రము చంపబడ్డాడు.

34 అబ్షాలోము పరారైనాడు. నగర ప్రహరీ గోడమీద ఒక కావలివాడు నిలబడి వున్నాడు. కొండకు అవతలి పక్కనుండి చాలా మంది రావటం చూశాడు.

35 అది చూసి యెహోనాదాబు దావీదు రాజుతో, “చూడండి, నేను చెప్పింది నిజమైనది. రాజ కుమారులంతా వస్తున్నారు!” అన్నాడు.

36 యెహోనాదాబు ఈ మాటలు అంటూ వుండగానే రాజకుమారులు వచ్చారు. వారు గగ్గోలు పడి ఏడుస్తూవున్నారు. దావీదు, అతని సేవకులందరూ కూడ విలపించసాగారు. వారంతా విపరీతంగా దుఃఖించారు.

37 దావీదు తన కుమారుడైన అమ్నోను కొరకు ప్రతి రోజూ దుఃఖించాడు. అబ్షాలోము తల్మయి రాజు వద్దకు పారిపోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి పేరు అమీహూదు.

38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడ సంవత్సరాలు ఉన్నాడు.

39 అమ్నోను మరణం గూర్చి దావీదురాజు క్రమేపీ ఓడార్చబడ్డాడు. కాని అతడు అబ్షాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడసాగాడు.

14

1 అబ్షాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి బెంగపెట్టు కున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు.

2 యోవాబు తన దూతలను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్పరియైన స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో ఉన్నట్లు నటించు. విషాదసూ చకమైన బట్టలు వేసుకో, అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు ప్రియమైన ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రవర్తించు.

3 నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను నీవు రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల స్త్రీ తో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో యోవాబు ఆమెకు వివరించాడు.

4 తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు వెళ్లి మాట్లాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, “రాజా, నాకు సహాయం చేయండి!” అని ప్రాధేయ పడింది.

5 “ఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు ప్రశ్నించాడు. ఆ స్త్రీ యిలా చెప్పింది: “నేనొక విధవ స్త్రీని! నా భర్త చినిపోయాడు.

6 నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపివేశాడు.

7 ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంపనిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడైన వాడు లేకుండా పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుకణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపోబోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, ఆస్తి నేలపాలవుతాయి.”

8 ఇది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని ఆమెతో అన్నాడు.

9 తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే పరిణామాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం ఈ విషయంలో ఏదోషమూ ఎరుగరు!” అని చెప్పింది.

10 “నిన్ను గురుంచి ఎవరైనా దీనిగూర్చి నిన్నేమైన అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు.

11 అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: “దయచేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా కుమారునికి కీడుచేయకుండా దేవుడు నివారించగలందులకు ఆయనను ప్రార్థించు.” దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు:”యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక కూడా కింద రాలదు.”

12 ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని విషయాలు చెప్పనీయండి” అని అన్నది. చెప్పమన్నాడు రాజు.

13 ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు! ఎందువల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమారుని తిరిగి తీసుకొని రాలేదు.

14 మనమంతా ఏదో ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. కాని దేవుడు ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్లనుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండి బలవంతంగా దూరం చేయబడలేదు!

15 నా ప్రభువైన రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్లాడనీయమన్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని అన్నాను.

16 రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను.

17 నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”

18 అది విని ఆశ్చర్యపడిన రాజైన దావీదు, “నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధనం చెప్పాలి” అన్నాడు. ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న అడగండి!” అన్నది.

19 “విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు. ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు.

20 యోవాబు ఇలా ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్తమైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగేదంతా నీకు తెలుసు.”

21 రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడండి. నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యుకుడైన అబ్షాలోమును దయచేసి తీసుకొని రండి.”

22 యోవాబు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, “ఈ రోజు నాపట్ల మీరు ప్రసన్నులైయున్నారని నాకు తెలుసు! ఎందువల్లనంటే నేను అడిగినదంతా నీవు చేశావు!” అని అన్నాడు.

23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు.

24 అయితే దావీదు రాజు మాత్రం, “అబ్షాలోము తప్పక తన స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి రూకూడదు” అని అన్నాడు. కావున అబ్షాలోము తన స్వంత ఇంటికి వెళ్లిపోయాడు. అబ్షాలోము రాజును చూడటానికి వెళ్లలేక పోయాడు.

25 అబ్షాలోము అందంలో అందరి ప్రశంసలూ పొందిన వాడు. అబ్షాలోమంత అందగాడు ఇశ్రాయేలంతటిలో మరొకడు లేడు. అరికాలు నుండి నడినెత్తివరకు అతనిలో రవ్వంత కూడా లోపం లేదు.

26 ప్రతి సంవత్సరాంతానా అబ్షాలోము తన తల వెండ్రుకలు కత్తిరించి తూచేవాడు. తూకం ప్రకారం రెండు వందల తులముల బరువు ఉండేవి.

27 అబ్షాలోముకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు తామారు. తామారు సౌందర్యవతి.

28 అబ్షాలోము యెరూషలేములో రెండు సంవత్సరాలున్నాడు. అయినా అతనికి రాజదర్శనం నిరాకరింపబడింది.

29 యోవాబు వద్దకు అబ్షాలోము దూతలను పంపాడు. ఈ దూతలు అబ్షాలోమును రాజు వద్దకు పంపమని అడిగారు. కాని యోవాబు అబ్షాలోము వద్దకు రాకపోయెను. రెండవసారి మరొక దూతను అబ్షాలోము పంపాడు. అయినా యోవాబు రావటానికి నిరాకరించాడు.

30 దానితో అబ్షాలోము తన సేవకులను పిలిచి ఇలా అన్నాడు: “చూడండి; యోవాబు పొలం నా పొలానికి పక్కనే వున్నది. తన పొలంలో యవల ధాన్యం పండివుంది. వెళ్లి ఆ యవలధాన్యాన్ని తగుల బెట్టండి.” ఆ మాట మీద అబ్షాలోము సేవకులు వెళ్లి యోవాబు పొలంలో పంటకు నిప్పుపెట్టారు.

31 యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవకులు నా పంటను ఎందుకు తగులబెట్టారు” అని అడిగాడు.

32 యోవాబుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “నీకు నేను వర్తమానం పంపాను. ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. నేను నిన్ను రాజు వద్దకు పంపాలని అనుకున్నాను గెషూరు నుండి నన్ను ఆయన ఎందుకు రప్పించాడో నిన్ను పంపి అడిగించాలనుకున్నాను. నేను ఆయనను చూడలేను. కావున ఈ పరిస్థితుల్లో నేను గెషూరుకు పోయి అక్కడవుండటం మంచిది! ఇప్పుడు నాకు రాజదర్శనం ఏర్పాటు చేయుము. నేను పాపం చేస్తే ఆయన నన్ను చంపవచ్చు!”

33 అప్పుడు యోవాబు రాజు వద్దకు వచ్చి అబ్షాలోము అన్న మాటలన్నీ చెప్పాడు. రాజు అబ్షాలోమును పిలిపించగా, అబ్షాలోము వచ్చాడు. అబ్షాలోము రాజు ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు.

15

1 ఇదంతా ఆయిన పిమ్మట అబ్షాలోము తనకై ప్రత్యేకంగా ఒక రథాన్ని మరియు గుర్రములను సమకూర్చుకున్నాడు. తన రథం సాగుతూ వుండగా ముందు వెళ్లటానికి ఏబది మంది సైనికులను ఏర్పాటు చేసుకున్నాడు.

2 అబ్షాలోము ఉదయం పెందలకడలేచి నగర ద్వారం వద్ద నిలబడేవాడు. అక్కడికి ఎవరైనా ఏదైనా సమస్యపై న్యాయం కోరుతూ దావీదు రాజు కొరకు వస్తే, అబ్షాలోము వారిని పిలిచేవాడు. వారిని “ఏ నగరం నుండి వచ్చినారని” అడిగేవాడు. “ఇశ్రాయేలు వంశాలలో ఒకడినని” ఆ వచ్చినవాడు చెప్పేవాడు.

3 అందుకు అబ్షాలోము “చూడు, నీవు నిజమే చెప్తున్నావు. కాని దావీదు రాజు నీవు చెప్పేదివినడు” అని అనేవాడు.

4 అబ్షాలోము ఇంకా ఇలా అనేవాడు, “ఓహో, ఈ రాజ్యంలో నన్నెవరైనా న్యాయాధిపతిగా చేయాలని నేను ఆశిస్తున్నాను. న్యాయం కోరుతూ ఎవరు ఏ సమస్యతో వచ్చినా వారికి తగిన న్యాయం నేనప్పుడు చేయగలుగుతాను. వచ్చిన వాని సమస్యకు తగిన పరిష్కారం కనుగొని సహాయం చేయగలుగుతాను.

5 ఎవరైనా అబ్షాలోము వద్దకు వచ్చి ప్రణమిల్లి నమస్కరించబోతే, అతను వాని కొరకు ముందుకు వెళ్లి, అతనిని ఆదరంగా తన వద్దకు తీసుకొనేవాడు. తరువాత ఆ వచ్చిన వానిని అతను స్నేహపూర్వకంగా ముద్దు పెట్టుకొనేవాడు.

6 దావీదు రాజు వద్దకు న్యాయం కోసం ఇశ్రాయేలు నుండి ఎవరు వచ్చినా అబ్షాలోము అలా చేసేవాడు. ఈ రకంగా ఇశ్రాయేలు ప్రజలందరి హృదయాలనూ అబ్షాలోము గెలిచాడు.

7 నాలుగేండ్ల తరువాత దావీదు రాజుతో అబ్షాలోము ఇలా అన్నాడు: “హెబ్రోనులో నేను వుండగా యెహోవాకి నేను మొక్కుకున్నాను. దయచేసి ఆ మొక్కు చెల్లించటానికి నన్ను వెళ్లనీయండి.

8 గతంలో నేను సిరియ దేశమందలి గెషూరులో వుండగా మొక్కాను. నన్ను యెహోవా మరల యెరూషలేముకు తీసుకొని వస్తే యెహోవాను ఆరాధించెదనని మొక్కుకున్నాను.”

9 “ప్రశాంతంగా వెళ్లిరా!” అని దావీదు రాజు అన్నాడు. అబ్షాలోము హెబ్రోనుకు వెళ్లాడు.

10 కాని అబ్షాలోము వేగుల వారిని ఇశ్రాయేలు వంశాల వారందరి వద్దకు పంపాడు. వారు వెళ్లి ప్రజలలో, “మీరు బాకా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో రాజయ్యాడు.!” అని కేకలు పెట్టమన్నాడు.

11 అబ్షాలోము తనతో వెళ్లటానికి రెండువందల మందిని ఆహ్వానించాడు. యెరూషలేము నుండి వారంతా అతనితో వెళ్లారు. కాని అతడు ఏమి యుక్తి పన్నుతున్నాడో వారికి తెలియదు.

12 అహీతోపెలు దావీదు సలహాదారులలో ఒకడు. అహీతోపెలు గీలో పట్టణవాసి, అబ్షాలోము బలులు సమర్పించేటప్పుడు అతడు అహీతోపెలును గీలో పట్టణం నుంచి రమ్మని కబురు పంపాడు. అబ్షాలోము పన్నినయుక్తులన్నీ సక్రమంగా సాగుతున్నాయి. ప్రజలు అబ్షాలోమును అధిక సంఖ్యలో బలపర్చ నారంభించారు.

13 ఈ వార్త దావీదుకు చెప్పటానికి ఒక వ్యక్తి వచ్చాడు. “ఇశ్రాయేలు ప్రజలు అబ్షాలోమును అనుసరించటం మొదలు పెట్టారు” అని అతడు చెప్పాడు.

14 అది విని దావీదు యెరూషలేములో తనతో ఉన్న సేవకులను పిలిచి ఇలా చెప్పాడు: “మనం ఇప్పుడు అవశ్యంగా తప్పించుకోవాలి! మనం అలా చేయకపోతే అబ్షాలోము మనల్ని వదిలిపెట్టడు. అబ్షాలోము మనల్ని పట్టుకొనే లోపు మనం త్వరపడాలి. అతడు మనందరినీ నాశనం చేస్తాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను కత్తితో నరికి చంపుతాడు.”

15 “మీరు ఏమి చేయాలని మాకు చెపుతారో మేమది చేస్తాము” అని రాజు యొక్క సేవకులు అన్నారు.

16 రాజు (దావీదు) తన ఇంటి వారందరితో కలిసి బయటికి పోయాడు. రాజు తన ఉంపుడుగత్తెలలో పది మందిని ఇంటిని చూస్తూ వుండేటందుకు వదిలి పెట్టాడు.

17 తన ప్రజలందరూ వెంటరాగా రాజు బయలుదేరి వెళ్లాడు. వారు చివరి ఇంటివద్ద ఆగారు.

18 సేవకులంతా రాజు ముందునుంచి వెళ్లారు. కెరేతీయులు, పెలేతీయులు మరియు గిత్తీయులు (ఆరు వందల మంది గాతువారు) అందరూ రాజు ముందు నుంచి నడిచి వెళ్లారు.

19 గిత్తీయుడైన ఇత్తయిని చూచి రాజు, “నీవెందుకు మాతో వస్తున్నావు? తిరిగిపోయి, కొత్త రాజుతో (అబ్షాలోము) వుండిపో. నీవు పరదేశీయుడవు. ఇది నీ స్వదేశం కాదు.

20 నిన్న మాత్రమే నీవు నన్ను కలియటానికి వచ్చావు. ఇప్పుడు నీవు నాతో కలిసి వివిధ ప్రాంతాలు తిరిగే అవసరం వుందా లేదు. తిరిగి వెళ్లిపో నీ సోదరులను కూడ నీతో తీసుకొని వెళ్లు. దయ, విశ్వాసం నీకు అండగా వుండుగాక!” అని అన్నాడు.

21 కాని ఇత్తయి రాజుకు సమాధానమిస్తూ, “యెహోవా జీవము తోడుగా, నీ జీవము తోడుగా నేను నీతోనే వుంటాను! చావుబతుకుల్లో కూడ నేను నీతోనే వుంటాను!” అని అన్నాడు.

22 “అయితే మనం కిద్రోను వాగు దాటుదాము,” అన్నాడు రాజు ఇత్తయితో. అప్పుడు గిత్తీయుడైన ఇత్తయి తన వారితోను, వారి పిల్లలతోను కిద్రోను వాగు దాటాడు.

23 ప్రజలంతా బిగ్గరగా ఏడ్వసాగారు. రాజు (దావీదు) కిద్రోనువాగు దాటాడు. అప్పుడు వారంతా ఎడారివైపు ప్రయాణం సాగించారు.

24 సాదోకు, తనతో వున్న తదితర లేవీయులందరూ దేవుని ఒడంబడిక పెట్టెను మోసుకొని వస్తూవున్నారు. వారు దేవుని పెట్టెనుదించారు. ప్రజలంతా యెరూషలేము నగరం నుండి వెళ్లిపోయే వరకు అబ్యాతారు ప్రార్థన చేస్తూవున్నాడు.

25 సాదోకుతో రాజు (దావీదు) ఈ విధంగా చెప్పాడు: “దేవుని పవిత్ర పెట్టెను యెరూషలేముకు తిరిగి తీసుకొని వెళ్లు. ఒక వేళ యెహోవా నన్ననుగ్రహించితే, ఆయన నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకొని వస్తాడు. యెహోవా మరల నన్ను యెరూషలేమును, ఆయన దేవాలయమును చూసేలా చేస్తాడు.

26 కాని దేవుడు నేనంటే ఇష్టంలేదని చెప్పితే ఆయన నాకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగలడు.”

27 యాజకుడు సాదోకుతో రాజు ఇంకా ఇలా అన్నాడు: “నీవు దీర్ఘదర్శివి . నగరానికి ప్రశాంతంగా వెళ్లు. నీ కుమారుడైన అహిమయస్సును, అబ్యాతారు కుమారు డైన యోనాతానును నీతో తీసుకొని వెళ్లు.

28 ప్రజలు ఎడారిలోకి ప్రవేశించే స్థలంలో నేను మీనుండి మళ్లీ సమాచారం వచ్చేవరకు వేచి వుంటాను.”

29 కావున సాదోకు, అబ్యాతారు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని యెరూషలేముకు తిరిగి వెళ్లి అక్కడ వుండి పోయారు.

30 దావీదు ఒలీవల పర్వతం మీదికి వెళ్లాడు. అతడు ఏడుస్తూవున్నాడు. తలమీద ముసుగు వేసికొని, చెప్పులు కూడ లేకుండా వెళ్లాడు. దావీదుతో వున్న మనుష్యులంతా కూడ తలపై ముసుగు వేసుకున్నారు. వారు ఏడుస్తూ దావీదు వెంట వెళ్లారు.

31 ఒక వ్యక్తి దావీదు వద్దకు వచ్చి, “అబ్షాలోముతో కలిసి పథకం వేసిన వారిలో అహీతోపెలు ఒకడు” అని చెప్పాడు. అది విని దావీదు యెహోవాకు “అహీతోపెలు సలహా నిరుపయోగమయ్యేలా చేయమని నిన్ను వేడుకుంటున్నాను” అని ప్రార్థన చేశాడు.

32 దావీదు పర్వతం పైకి వెళ్లాడు. తరుచూ అతను అక్కడ దేవుని ఆరాధించేవాడు. ఆ సమయంలో అర్కీయుడైన హూషై అనువాడు దావీదు వద్దకు వచ్చాడు. హూషై చొక్కా చిరిగివుంది. వాని తలపై దుమ్ము వుంది.

33 దావీదు హూషైతో ఇలా అన్నాడు: “నీవు నాతో వస్తే నేను శ్రద్ద తీసుకోవలసిన వారిలో నీవొకడివవుతావు.

34 కాని నీవు యెరూషలేము నగరానికి వెళితే, అహీతోపెలు సలహాను ఎందుకూ కొరగానిదిగా నీవు చేయగలవు. అబ్షాలోముతో: ఓ రాజా, నేను నీ సేవకుడను.నేను నీ తండ్రిని సేవించాను. కాని ఇప్పుడు నిన్ను సేవింపవచ్చాను, అని చెప్పు.

35 యాజకులైన సాదోకు, అబ్యాతారు నీకు తోడుగా వుంటారు. రాజ గృహంలో నీవు విన్నదంతా వారికి తప్పక చెప్పాలి.

36 సాదోకు కుమారుడు అహిమయస్సు, అబ్యాతారు కుమారుడు యోనాతాను వారికి తోడుగా వుంటారు. నీవు విన్నదంతా వారికి చెప్పి పంపితే, వారు వచ్చి నాకు తెలియజేస్తారు.”

37 అప్పుడు దావీదు స్నేహితుడు హూషై నగరానికి వెళ్లాడు. అబ్షాలోము కూడ నగరానికి చేరియున్నాడు.

16

1 ఒలీవల పర్వతం మీద దావీదు కొంతవరకు వెళ్లాడు. అక్కడ మెఫీబోషెతు సేవకుడైన సీబా దావీదును కలిశాడు. సీబా వెంట గంతలు కట్టిన రెండు గాడిదలున్నాయి. గాడిదల మీద రెండు వందల రొట్టెలు, ఒక వంద ఎండు ద్రాక్షాగుత్తులు, ఒక వంద అంజూరపు పండ్లు, ఒక ద్రాక్షారసపు తిత్తివున్నాయి.

2 రాజు (దావీదు) సీబాతో, “ఇవన్నీ ఎందుకు?” అని అన్నాడు. “ఈ గాడిదలు రాజకుటుంబంవారు ఎక్కటానికి. ఈ రొట్టెలు, పండ్లు సేవకులు తినటానికి. ఎడారిలో ఎవరైనా అలసిపోతే ఈ ద్రాక్షారసం తాగి సేద తీర్చుకోవచ్చు” అని సీబా అన్నాడు.

3 “మెఫీబోషెతు ఎక్కడ? అని రాజు అడిగాడు. “మెఫీబోషెతు యెరూషలేములోనే వుంటున్నాడు. ఎందువల్లనంటే ఈ రోజు ఇశ్రాయేలీయులు తన తాత ! రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చి వేస్తారని ఆశిస్తూవున్నాడు!” అని రాజుకు సీబా సమాధానం చెప్పాడు.

4 “సరే, మంచిది. మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నేను నీకు ఇస్తాను” అని రాజు సీబాతో చెప్పాడు. అది విని సీబా, “మీకు నేను సమస్కరిస్తున్నాను. మీకు నేనిలా సదా సంతృప్తిని చేకూర్చగలనని ఆశిస్తున్నాను” అని అన్నాడు.

5 దావీదు బహూరీముకు వచ్చాడు. బహూరీమునుండి సౌలు కుటుంబానికి చెందిన వాడొకడు బయటికి వచ్చాడు. వాని పేరు షిమీ. అతను గెరా అనువాని కుమారుడు. దావీదును గురించి చెడు మాటలు మాట్లాడుతూ వాడు బయటికి వచ్చాడు. అతడలా పదే పదే నిందిస్తూ వచ్చాడు.

6 దావీదు మీదికి, అతని సేవకుల మీదికి రాళ్లు విసరటం మొదలు పెట్టాడు. కాని దావీదుతో వున్న మనుష్యులు, సైనికులు దావీదు చుట్టూ చేరారు. చూట్టూ చేరి రక్షణ కల్పించారు.

7 షిమీ దావీదును తిట్టాడు. “బయటికి పో! బయటికి పో! నీవు మంచివాడవు కావు. హంతకుడవు!” అంటూ తిట్టాడు.

8 “యెహోవా నిన్ను శిక్షిస్తాడు! ఎందువలననగా నీవు సౌలు కుటుంబంలోని మనుష్యులను చంపావు! రాజైన సౌలు స్థానాన్ని నీవు సంగ్రహించావు! కాని యెహోవా ఇప్పుడు రాజ్యాన్ని నీ కుమారుడైన అబ్షాలోముకు ఇచ్చాడు! నీవు చేసిన చెడు కార్యాలన్నీ ఇప్పుడు నీకే జరుగుతున్నాయి! ఎందువల్లననగా నీవొక హంతకుడవు!”

9 సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “నా ప్రభువైన రాజును ఈ చచ్చిన కుక్క ఎందుకు తిట్టాలి? నన్ను వెళ్లి షిమీ తల నరికివేయనీయండి!” అని అన్నాడు.

10 అందుకు రాజు ఇలా అన్నాడు: “సెరూయా కుమారులారా నేనేమి చేయగలను! నిజానికి షిమీ నన్ను దూషిస్తున్నాడు! కాని యెహోవా వాని చేత నన్ను శపిస్తున్నాడు!”

11 దావీదు తన సేవకులతోను, అబీషైతోను ఇంకా ఈ విధంగా అన్నాడు, “చూడండి, నా స్వంత కుమారుడే నన్ను చంపజూస్తున్నాడు! బెన్యామీనీయుడైన ఈ మనుష్యుడు (షిమీ) నన్ను చంపటానికి ఇంకా ఎక్కువ హక్కు కలిగి వున్నాడు! అతనిని అలా వదిలి వేయండి. నన్ను గురించి చెడ్డ మాటలు వానిని చెప్పనీయండి. యెహోవాయే ఇవన్నీ వానిచేత పలికిస్తున్నాడు.

12 బహుశః యెహోవా నాకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా గమనిస్తూ వుండవచ్చు. బహుశః యెహోవాయే నాకు మేలు చేయవచ్చు. ఈ రోజు షిమీ చెప్పే చెడ్డ మాటలన్నిటికీ భిన్నంగా ఏదో ఒక మంచి నాకు జరుగువచ్చు!”

13 కావున దావీదు తన మనుష్యులతో కలిసి తన దారిన వెళ్లిపోయాడు. కాని షిమీ దావీదును అనుసరిస్తూనే ఉన్నాడు. కొండ పక్కగా దారికి ఆవలివైపున నడుస్తూ ఉన్నాడు. దారి పోడవునా షిమీ దావీదును దూషిస్తూనే ఉన్నాడు. అంతేగాకుండా దావీదు మీదకు రాళ్లు రువ్వటం, దుమ్ము జల్లటం కూడ చేస్తూనే వున్నాడు.

14 రాజైన దావీదు, అతని అనుచరులు బహూరీము అను చోటికి చేరారు. వారంతా బాగా అలసిపోయారు. వారు బహూరీము వద్ద విశ్రమించారు.

15 అబ్షాలోము, అహీతోపెలు, తదితర ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వచ్చారు.

16 అర్కీయుడు, దావీదు స్నేహితుడు అయిన హూషై అబ్షాలోము వద్దకు వచ్చి “రాజు వర్ధిల్లు గాక! రాజు వర్ధిల్లుగాక!” అని అన్నాడు.

17 “నీ స్నేహితుడు దావీదుపట్ల నీవు ఎందుకు రాజభక్తి కలిగియుండలేదు? నీ స్నేహితునితో కలిసి యెరూషలేమును విడిచి ఎందుకు పోలేదు?” అని అబ్షాలోము అడిగాడు.

18 హూషై ఇలా అన్నాడు: “యెహోవా ఎవరిని ఎన్నుకుంటాడో నేను ఆయన మనిషిని. ఈ మనుష్యులు, ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎంపికచేశారు. నేను నీతోనేవుంటాను.

19 గతంలో నేను నీ తండ్రికి సేవచేశాను. సరే, ఇప్పుడు నేను ఎవరికి సేవ చేయాలి? దావీదు కుమారునికి! అందువల్ల నేను నీకు సేవ చేస్తాను.”

20 “దయచేసి ఇప్పుడు మనం ఏమి చేయాలో చెప్పు” అని అబ్షాలోము అహీతోపెలును అడిగాడు.

21 అబ్షాలోముతో అహీతోపెలు ఇలా అన్నాడు: “నీ తండ్రి తన యొక్క దాసీలను కొంత మందిని ఇల్లు చూస్తూ ఉండమని వదిలి వెళ్లాడు. నీవు వెళ్లి వారితో సాంగత్యము చేయము. దానితో ఇశ్రాయేలీయులందరూ నీ తండ్రి నిన్నసహ్యించు కుంటున్నాడని వింటారు. అప్పుడు నీకు మద్దతు యివ్వటానికి నీ ప్రజలందరికీ తగిన ప్రోత్సాహం దొరుకుతుంది.”

22 తరువాత అబ్షాలోము కొరకు మిద్దె మీద ఒకడేరా వేశారు. అక్కడ తన తండ్రి దాసీలతో అబ్షాలోము సంగమించాడు. ఇశ్రాయేలీయులంతా ఇది చూశారు.

23 ఆ కాలంలో అహీతోపెలు సలహా దావీదు, అబ్షాలోము లిరువురూ చాలా ముఖ్యమైనదిగా భావించేవారు. ఒక వ్యక్తికి దేవుని మాట ఎంత ముఖ్యమో, అహీతోపెలు సలహా కూడా అంత విలువగలదిగా ఉండేది.

17

1 అహీతోపెలు అబ్షాలోముతో ఇంకా యిలా అన్నాడు: “ఇప్పుడు నన్ను పన్నెండు వేలమంది సైనికులను ఎంపిక చేసుకోనీయ్యి. ఈ రాత్రికి నేను దావీదును వెంటాడతాను.

2 అతడు బాగా అలసిపోయి బలహీన పడ్డాక నేనతనిని పట్టుకుంటాను. అతనిని బెదరగొడతాను. దానితో అతనితో ఉన్న వారంతా పారిపోతారు. నేను రాజైన దావీదును మాత్రమే చంపుతాను.

3 తరువాత ప్రజలందరినీ నేను నీ వద్దకు తీసుకొని వస్తాను. నీవు వెదకుతున్న వ్యక్తి (దావీదు) గనుక చనిపోతే, మిగిలిన ప్రజలంతా శాంతంగా తిరిగి వస్తారు.”

4 ఈ పథకం అబ్షాలోముకు, మిగిలిన ఇశ్రాయేలు నాయకులకు మంచిదనిపించింది.

5 అయినా అబ్షాలోము,”అర్కీయుడైన హూషైని పిలవండి. అతడేమి చెపుతాడో కూడా నేను వినదలిచాను” అని అన్నాడు.

6 అబ్షాలోము వద్దకు హూషై వచ్చాడు. అహీతోపెలు సలహాను హూషైకు అబ్షాలోము వివరించాడు. దానిని అనుసరించవచ్చా? లేదా? తెలియజెప్ప మన్నాడు.

7 హూషై ఈ విధంగా చెప్పాడు, “అహీతోపెలు ఇచ్చిన సలహా ఈ సమయంలో మంచిది కాదు.”

8 నీ తండ్రి, అతని మనుష్యులు చాలా గట్టివారని నీకు తెలుసు. పొలాల్లో తన పిల్లల్ని పొగొట్టుకున్న ఎలుగు బంటివలె వారు మహా కోపంతో వున్నారు. నీ తండ్రి బహు నేర్పరియైన యోధుడు. అతను రాత్రంతా తన మనుష్యులతో కలిసి వుండడు.

9 బహుశః ఈ పాటికి ఆయన ఏ గుహలోనో, మరొక చోటనో దాగి వుండవచ్చు. నీ తండ్రి గనుక నా మనుష్యులను ముందుగా ఎదుర్కొంటే, ప్రజలందరికీ ఆ వార్త తెలిసిపోతుంది. అబ్షాలోము అనుచరులు ఓడి పోతున్నారని వారంతా అనుకుంటారు!

10 సింహాల్లా ధైర్యంగా వుండే నీ మనుష్యులు కూడ చెదరిపోయే అవకాశం వుంది. ఎందువల్లననగా ఇశ్రాయేలీయులంతా నీ తండ్రి బలవంతుడైన యోధుడనీ, ఆయన మనుష్యులు మంచి ధైర్యవంతులనీ ఎరుగుదురు!

11 “నేను చెప్పేదేమంటే ఇప్పుడు నీవు దానునుండి బెయేర్షెబా వరకు వున్న ఇశ్రాయేలీయులనందరినీ చేరదియ్యి. సముద్ర తీరాన ఇసుక రేణువుల్లా నీ వద్ద అనేక మంది ప్రజలు వుంటారు. అప్పుడు నీకై నీవే యుద్ధానికి వెళ్ల వచ్చు.

12 అతను దాగివున్న చోటులోనే మనం దావీదును పట్టుకోవచ్చు. భూమి మీదకు మంచు పడినట్లు మనం దావీదు మీద పడవచ్చు. దావీదును, అతని మనుష్యులందరినీ మనం చంపవచ్చు. వారిలో ఏ ఒక్కడూ వదిలిపెట్టబడడు.

13 ఒకవేళ దావీదు నగరంలోకి తప్పించుకుంటే, ఇశ్రాయేలీయులంతా తాళ్లు పట్టుకు వస్తారు. ఆ నగరాన్నంతా మనం లోయలోకి లాగి వేద్దాం ఇక ఆ నగరంలో ఒక్క చిన్న రాయి కూడ మిగలదు!”

14 “అర్కీయుడైన హూషై ఇచ్చిన సలహా అహీతోపెలు సలహాకంటె చాలా బాగుందని,” అబ్షాలోము, ఇతర ఇశ్రాయేలీయులంతా అన్నారు. ఇదంతా యెహోవా ఏర్పాటు గావున, వారంతా అలా చెప్పారు. యెహోవా అహీతోపెలు ఇచ్చిన మంచి సలహాను వ్యర్థంచేయ సంకల్పించాడు. ఆ విధంగా అబ్షాలోమును శిక్షింప జూశాడు.

15 హూషై ఈ విషయాలన్నీ యాజకులైన సాదోకు మరియు అబ్యాతారుకు చెప్పాడు. అబ్షాలోముకు, ఇశ్రాయేలు నాయకులకు అహీతోపెలు యిచ్చిన సలహాను కూడ హూషై వారికి చెప్పాడు. అంతే గాకుండా తను ఏ సలహా ఇచ్చినది కూడా సాదోకు, అబ్యాతారులకు హూషై వివరించాడు. హూషై ఇలా అన్నాడు:

16 “త్వరగా దావీదుకు ఒక వర్తమానం పంపండి. ప్రజలు ఎక్కడెక్కడైతే ఎడారిలోకి ప్రవేశిస్తారో ఆయా ప్రాంతాలలో దావీదును ఈ రాత్రికి వుండవద్దని చెప్పండి. కాని యొర్దాను నదిని తక్షణమే దాటి వెళ్లమనండి. వారు నదిని గనుక దాటినట్లయితే రాజు, ఆయన అనుచరులు పట్టుబడరు.”

17 యాజకుల కుమారులైన యోనాతాను మరియు అహిమయస్సు కలిసి ఏన్ రోగేలు దగ్గర వేచివున్నారు. వాళ్లు నగరంలోకి వెళ్తున్నట్లు ఎవరూ చూడ కూడదనుకున్నారు. కావున ఒక పనిపిల్ల వారి వద్దకు వచ్చింది. ఆమె వారికి ఒక సమాచారం అందజేసింది. తరువాత యోనాతాను, అహీమయస్సులు ఇరువురూ రాజైన దావీదు వద్దకు వెళ్లి అన్ని విషయాలూ చెప్పారు.

18 అయినా ఒక బాలుడు యోనాతానును, అహిమయస్సును చూశాడు. వారు అబ్షాలోముకు చెప్పటానికి పరుగున పోయాడు. ఇది గమనించిన యోహనాతాను, అహిమయస్సు వెంటనే పారిపోయారు. వారు బహురీములో ఒకని ఇంటికి వెళ్లారు. ఆ ఇంటివాని ఆవర ణలో ఒక బావి వున్నది. యోనాతాను, అహిమయస్సు ఆ బావిలోకి దిగారు.

19 ఇంటివాని భార్య బావి మీద ఒక దుప్పటి కప్పి వేసింది. ఆమె మళ్లీ దాని మీద ధాన్యం పోసింది. అప్పుడా బావి ఒక ధాన్యపు రాశిలా కన్పించింది. అందువల్ల యోనాతాను, అహిమయస్సు అందులో దాగి వున్నారని ఎవరూ అనుకోరు.

20 అబ్షాలోము సైనికులు ఆ ఇంటి యజమానురాలి వద్దకు వచ్చి “అహిమయస్సు, యోనాతాను ఎక్కడ వున్నారు?” అని అడిగారు. వాళ్లు అప్పుడే వాగు దాటి పోయారని” ఆ స్త్రీ అబ్షాలోము మనుష్యులకు చెప్పింది. అబ్షాలోము మనుష్యులు యోనాతాను, అహిమయస్సులను వెదుక్కుంటూపోయారు. కాని వారిద్దరినీ వారు కనుగొనలేదు. అందుచే అబ్షాలోము సైనికులు యెరూషలేముకు తిరిగి వెళ్లిపోయారు.

21 అబ్షాలోము మనుష్యులు వెళ్లిపోయిన తరువాత యోనాతాను, అహిమయస్సు బావిలో నుండి బయటికి వచ్చారు. జరిగినదంతా రాజైన దావీదుకు వారు చెప్పారు. వారు దావీదుతో, “త్వరపడండి. నదిని దాటి వెళ్లండి! మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఇవన్నీ చేస్తున్నాడు” అని అన్నారు.

22 వీదు, అతని మనుష్యులు యొర్దాను నదిని దాటి వెళ్లారు. సూర్యోదయానికి ముందే దావీదు, అతని అనుచరులు యొర్దాను నదిని దాటారు.

23 ఇశ్రాయేలీయులు తన సలహా పాటించలేదని అహీతోపెలు గమనించాడు. అహీతోపెలు తన గాడిదపై గంతవేసి దానిపై తన నగరానికి వెళ్లాడు. తన కుటుంబపోషణకు తగిన ఏర్పాట్లు చేసి అహీతోపెలు ఉరిపోసుకొని చనిపోయాడు. అహీతోపెలు చనిపోయినాక అతని శవాన్ని అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు.

24 దావీదు మహనమయీముకు చేరాడు. అబ్షాలోము, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు యొర్దాను నదినిదాటారు.

25 అబ్షాలోము తన సైన్యాధి కారిగా అమాశాను నియమించాడు. అంటే యోవాబు స్థానాన్ని అమాశా ఆక్రమించాడు. ఇత్రా అనేవాని కుమారుడు అమాశా. ఇత్రా ఇష్మాయేలీయుడు అమాశా తల్లి పేరు అబీగయీలు. ఈమె సెరూయా సోదరియగు నాహాషు కుమార్తె. (సెరూయా యోవాబు తల్లి)

26 అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు రాజ్యంలో గుడారాలు వేసుకున్నారు.

27 దావీదు మహనయీముకు చేరాడు. షోబీ, మాకీరు మరియు బర్జిల్లయి అక్కడ వున్నారు. (నాహాషు కుమారుడైన షోబీ అమ్మోనీయుల రాజధానియగు రబ్బాకు చెందినవాడు. అమ్మీయేలు కుమారుడైన మాకీరు లోదెబారుకు చెందినవాడు. బర్జిల్లయి అనువాడు గిలాదులోని రోగెలీము పట్టణవాసి)

28 [This verse may not be a part of this translation]

29 [This verse may not be a part of this translation]

18

1 దావీదు తన మనుష్యులను లెక్కబెట్టాడు. సహస్ర దళాధిపతులను, శత దళాధిపతులను తన సైన్యాన్ని నడిపేందుకు ఎంపిక చేశాడు.

2 దావీదు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. తరువాత దావీదు వారిని బయలుదేరదీశాడు. మూడోవంతు సైన్యాన్ని యోవాబు నడిపించాడు. యోవాబు సోదరుడైన సెరూయా కుమారుడగు అబీషై రెండవ గుంపును, గాతువాడైన ఇత్తయి మూడవ దళాన్ని నడిపించారు. “నేను కూడ మీతో వస్తాను” అని రాజైన దావీదు ఆ జనంతో అన్నాడు.

3 కాని ప్రజలు వద్దన్నారు. “వద్దు! నీవు మాతో రాకూడదు! మేము గనుక యుద్ధరంగం నుండి పారిపోతే, అబ్షాలోము మనుష్యులు ఏమీ లెక్క చేయరు. మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు. కాని నీవు మాలాంటి పదివేల మందికి సమానం. కావున నీవు నగరంలోనే వుండటం మంచిది. మాకు సహాయం కావలసి వచ్చినప్పుడు నీవు మాకు సహాయపడవచ్చు” అని అన్నారు.

4 “సరే, మీరు ఏది మంచిదని తలిస్తే నేనది చేస్తాను” అని రాజు ప్రజలతో అన్నాడు. తరువాత రాజు నగర ద్వారం పక్కన నిలబడ్డాడు. సైన్యం బయటికి వెళ్లింది. వారంతా వందేసి, వెయ్యేసి మంది జట్లుగా బయటికి వెళ్లారు.

5 యోవాబు, అబీషై మరియు ఇత్తయికి రాజు, “నాకొరకు ఈ పని చేయండి. యువకుడైన అబ్షాలోము పట్ల ఉదారంగా ప్రవర్తించండి!” అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యాధిపతులకు రాజు యిచ్చిన ఆజ్ఞలను ఆ ప్రజలంతా విన్నారు.

6 అబ్షాలోము తరపున వచ్చిన ఇశ్రాయేలీయుల పైకి దావీదు సైన్యం రణరంగంలోకి ప్రవేశించింది. ఎఫ్రాయిము అరణ్యంలో వారు పోరాడారు.

7 దావీదు సైన్యం ఇశ్రాయేలీయులను ఓడించింది. ఆ రోజు ఇరవై వేలమంది చనిపోయారు.

8 యుద్ధం దేశవ్యాప్తంగా జరిగింది. ఆ రోజు కత్తివేటుకు చచ్చిన వారికంటే అడవిలో చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

9 అబ్షాలోము దావీదు సేవకులను కలవటం జరిగింది. అబ్షాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచరగాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర వృక్షం కొమ్మల కిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన కిందనుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్షాలోము భూమికి పైగా వేలాడుచున్నాడు.

10 ఇది జరగటం ఒక వ్యక్తి చూశాడు. అతడు పోయి యోవాబుతో, “అబ్షాలోము సింధూర వృక్షం కొమ్మల్లో చిక్కుకొని వేలాడటం నేను చూశాను!” అని చెప్పాడు.

11 “మరి నీవతనిని ఎందుకు చంపికిందపడేలా చేయలేదు? నీకు నేను ఒక నడికట్టును మరియు పది తులముల వెండి ఇచ్చివుండేవాడిని!” అని యోవాబు అన్నాడు.

12 యెవాబుతో అతడిలా అన్నాడు: “నీవు వెయ్యితులముల వెండి ఇచ్చినా నేను రాజకుమారుడిని గాయపర్చేవాడినికాను. ఎందుకనగా, రాజు నీకు, అబీషైకి, ఇత్తయికి యిచ్చిన ఆజ్ఞ మేమంతా విన్నాము. ‘చిన్నవాడైన అబ్షాలోమును గాయపర్చకుండా ఉదారంగా ప్రవర్తించండి’ అని రాజు అన్నాడు.

13 నేను గనుక అబ్షాలోమును చంపితే రాజు ఎలాగో తెలుసుకుంటాడు. మళ్లీ నీవే నన్ను శిక్షిస్తావు!”

14 “ఈ విధంగా నేను ఇక్కడ నీతో కాలం వృధాచేయను” అని యోవాబు అన్నాడు. అబ్షాలోము ఇంకా చెట్టుకు వేలాడుచూ బతికేవున్నాడు. యోవాబు మూడు ఈటెలను తీసుకున్నాడు. ఆ ఈటెలను అబ్షాలోము మీదికి విసిరాడు. ఆ ఈటెలు అబ్షాలోము గుండెను చీల్చుకుంటూ దూసుకు పోయాయి.

15 యోవాబుకు యుద్ధంలో సహాయపడుతూ అతని వెంట పది మంది యువ సైనికులున్నారు. ఆ పదిమంది అబ్షాలోము చుట్టూచేరి అతనిని చంపివేశారు.

16 యోవాబు బూర ఊది, ప్రజలను పిలిచి అబ్షాలోముతో వున్న ఇశ్రాయేలీయులను వెంటాడటం ఆపమన్నాడు.

17 యోవాబు మనుష్యులు అబ్షాలోము శవాన్నీ తీసి అరణ్యంలో ఒక పెద్ద గోతిలో పడవేశారు. ఆ పెద్ద గోతిని రాళ్లు వేసి పూడ్చి వేశారు. అబ్షాలోము అనుచరులైన ఇశ్రాయేలీయులంతా భయపడి ఇండ్లకు పారిపోయారు.

18 అబ్షాలోము బ్రతికివున్న రోజుల్లో ‘రాజు లోయలో’ ఒక స్తంభం నిర్మించాడు. అప్పుడు అబ్షాలోము ఇలా అన్నాడు: “నా పేరు చిరస్థాయిగా నిలవటానికి నాకు కుమారుడు లేడు” అందువల్ల ఆ స్తంభానికి తన పేరే పెట్టుకున్నాడు. ఆ స్తంభం ఈనాటికీ “అబ్షాలోము జ్ఞాపక చిహ్నం” అని పిలవబడుతూవుంది.

19 సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “నన్ను పరుగున పోయి ఈ వార్తను రాజైన దావీదుకు చెప్పనీయండి. నీ కొరకు శత్రువును యెహోవా నాశనం చేశాడు” అని చెపుతానన్నాడు.

20 అహిమయస్సుతో యోవాబు ఇలా అన్నాడు: “వద్దు, దావీదుకు ఈ రోజు ఈ వార్తను తీసుకొని పోవటానికి వీలులేదు. ఇంకొక రోజు ఈ వార్తను చేర వేయవచ్చు. అంతేగాని ఈ రోజు మాత్రం వద్దు. ఎందుకంటావా? రాజు యొక్క కుమారుడు చనిపోయాడు గనుక.”

21 తరువాత కూషీయుడైన ఒకనిని యోవాబు పిలిచి, “అతను చూసిన విషయాలన్నీ రాజు వద్దకు వెళ్లి చెప్పమన్నాడు.” కూషీయుడు యోవాబుకు నమస్కరించాడు. తరువాత కూషీయుడు దావీదుకు వార్త చెప్పటానికి పరుగెత్తాడు.

22 కాని సాదోకు కుమారుడైన అహిమయస్సు యోవాబుతో, “ఏమి జరిగినా పరవాలేదు. నన్ను కూడా కూషీయుని వెనుక పరుగెత్తుకు వెళ్లనీయండి!” అని ప్రాధేయపడ్డాడు. “కుమారుడా! నీవెందుకు వార్త మోసుకొని పోవాలనుకుంటున్నావు? నీవు తీసుకొని వెళ్లిన ఈ వార్తకు నీకు ఏ బహుమానమూ లభించదు!” అని యోవాబు అన్నాడు.

23 “ ఏమి జరిగినా పరవాలేదు; నేను వేగంగా వెళతాను,” అన్నాడు అహిమయస్సు. “అయితే పరుగెత్తు!” అన్నాడు యోవాబు అహిమ యస్సుతో. అప్పుడు యొర్దానులో యగుండా అహిమయస్సు పరుగెత్తాడు. అతడు కూషీయుని దాటి వెళ్లాడు.

24 నగర రెండు ద్వారాల మధ్య దావీదు కూర్చుని వున్నాడు. కావలివాడు ద్వారం మీద వున్న గోడపైకి వెళ్లి పరిశీలించాడు. దూరాన ఒకడు ఒంటరిగా పరుగెత్తుకు రావటం చూశాడు.

25 ఈ విషయం చెప్పటానికి కావలివాడు రాజును పిలిచాడు. “ఒక్కడే గనుక వస్తూవుంటే, వాడు ఏదో వార్త తెస్తూవున్నాడన్నమాట!” అని దావీదు రాజు అన్నాడు. ఆ వ్యక్తి క్రమేపీ నగరాన్ని సమీపించాడు.

26 కావాలివాడు ఇంకొక వ్యక్తి రావటం కూడా చూశాడు. పైనున్న కావలివాడు ద్వారపాలకుని పిలిచి, “చూడు! ఇంకొకడు ఒంటరిగా పరుగెత్తుకు వస్తున్నాడు!” అని చెప్పాడు. “అయితే వాడు కూడా వార్త తెస్తున్నాడు!” అని అన్నాడు రాజు.

27 “మొదటి వ్యక్తి సాదోకు కుమారుడైన అహిమయస్సులా పరుగెత్తుతున్నాడని నేను అనుకుంటున్నాను” అని కావాలివాడన్నాడు. “అహిమయస్సు మంచి వ్యక్తి. అతడేదో మంచి వార్త తెస్తూవుండవచ్చు!” అని రాజు అన్నాడు.

28 అహిమయస్సు రాజును పిలిచి, “అంతా బాగున్నది!” అన్నాడు. అహిమయస్సు సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. “ నీ ప్రభుమైన దేవునికి స్తోత్రము. నా ఏలినవాడవైన రాజుకు వ్యతిరేకంగా వున్న వారిని యెహోవా ఓడించాడు,” అని అహిమయస్సుచెప్పాడు.

29 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?” అని రాజు అడిగాడు. “యోవాబు నన్ను పంపినపుడు అక్కడ పెద్ద కోలాహలం నేను చూశాను. కాని అది ఎందుకో నాకు తెలియదు” అని అహిమయస్సు సమాధానమిచ్చాడు.

30 “ఇటు పైకి వచ్చి, ఇక్కడ వుండు” అన్నాడు. రాజు. అహిమయస్సు పైకి వెళ్లి పక్కన నిలబడి వేచి వున్నాడు.

31 తరువాత కూషీయుడు వచ్చాడు. “నా ఏలినవాడవైన రాజుకు ఒక వార్త! నీకు వ్యతిరేకులైన ప్రజలను యెహోవా ఈ రోజు శిక్షించాడు” అని చెప్పాడు.

32 “యువకుడైన అబ్షాలోము క్షేమంగా వున్నాడా?” అని రాజు కూషీయుని అడిగాడు. “నీ శత్రువులు, నిన్ను గాయపర్చాలని నీకు వ్యతిరేకంగా వచ్చే ఇతర మనుష్యులు ఆ యువకునిలా (అబ్షాలోము) అయిపోతారని నేను అనుకుంటున్నాను” అని కూషీయుడు చెప్పాడు.

33 దానితో అబ్షాలోము చనిపోయాడని రాజుకు అర్థమయింది. రాజు మిక్కిలి కలతపడిపోయాడు. నగర ద్వారం మీద వున్న గది వద్దకు వెళ్లాడు. అక్కడ బాగా విలపించాడు. గదిలోకి వెళ్లాడు. గదిలోకి పోతూ, “నా కుమారుడా, అబ్షాలోమా! నా కుమారుడా, అబ్షాలోమా! నీ బదులు నేను చనిపోయి వుండవలసింది. ఓ అబ్షాలోమా! నా కుమారుడా, నా కుమారుడా!” అని దుఃఖించాడు.

19

1 ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు.

2 ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు.

3 ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు.

4 రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు.

5 యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను - అందరినీ కాపాడారు.

6 నీ సేవకులంతా సిగ్గుతో తలవంచు కున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదయమయింది!

7 లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవను భవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్యాన్నమవుతుంది.”

8 అప్పుడు రాజు నగరద్వారం వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు. అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు.

9 ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు.

10 మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.”

11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు.

12 మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి.

13 అమాశాతో, “నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.”

14 దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.

15 అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు.

16 గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు.

17 వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు.

18 రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ ఆయన వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు.

19 రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు.

20 పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.”

21 కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.”

22 దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును - నాకును ఏమి పొందిక! ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.

23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు .

24 సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు.

25 మెఫీబోషెతు రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూషలేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో రాలేదు?” అని అడిగాడు.

26 అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా) నన్ను మోసం చేశాడు! నేను అవిటివాడిని గనుక నా సేవకుడైన సీబాను పిలిచి, ‘ఒక గాడిదపై గంత కట్టి సిద్ధం చేయమన్నాను. దానిపై రాజుతో వెళతానన్నాను.’

27 కాని నా సేవకుడు నన్ను మోసగించాడు. నా గురించి నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్రభువైన రాజు దేవ దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది చేయుము.

28 నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!”

29 “ఇక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను, అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు.

30 “సీబానే భూమినంతా తీసుకోనిమ్ము! ఎందువల్లనంటే నా ప్రభువైన రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని మెఫీబోషెతు రాజుతో అన్నాడు.

31 గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు.

32 బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు.

33 దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”

34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా?

35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు?

36 నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను.

37 తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లి దండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో.”

38 “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు.

39 రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు.

40 గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు.

41 ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు.

42 యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”

43 అప్పుడు ఇశ్రాయేలీయు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి . కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు1 ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!” కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి.

20

1 బిక్రి కుమారుడైన షెబ అనే పనికిమాలిన వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బూర వూది, “దావీదులో మనకు భాగం లేదు. యెష్షయి కుమారునితో మనకేమీ సంబంధం లేదు! కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా మన గుడారాలకు పోదాం పదండి” అని చెప్పాడు.

2 దానితో ఇశ్రాయేలీయులు దావీదును వదిలి, బిక్రి కుమారుడైన షెబను అనుసరించారు. కాని యూదా ప్రజలు మాత్రం యొర్దాను నది వద్ద నుండి యెరూషలేముకు వచ్చేవరకు దారి పొడవునా వారి రాజైన దావీదుతోనే వున్నారు.

3 దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. గతంలో దావీదు తన ఉపపత్నులను పది మందిని ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు ఈ స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ ఇంటికి సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ స్త్రీలు విధవరాండ్రవలె జీవించారు.

4 రాజు అమాశాను పిలిచి, “యూదా ప్రజలను మూడు రోజులలో నన్ను కలవమని చెప్పు. నీవు కూడా ఇక్కడ వుండాలి” అని అన్నాడు.

5 యూదా ప్రజలందరినీ పిలిచి కూడగట్టుకు రావటానికి అమాశా వెళ్లాడు. కాని రాజు పెట్టిన గడువుకంటె అమాశా ఎక్కువ కాలాన్ని తీసుకున్నాడు.

6 దావీదు అబీషైని పిలిచి, “బిక్రి కుమారుడైన షెబ మనకు అబ్షాలోముకంటె ఎక్కువ ప్రమాద కరమైన మనిషి. కావున నా సైనికులను తీసుకొని షెబను వెంటాడు. షెబ ప్రాకారాలున్న నగరాలలోనికి తప్పించుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక ప్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు మననుండి తప్పించుకున్నట్లే,” అని అన్నాడు.

7 కనుక యోవాబు మనుష్యులు, కెరేతీయులు, పెలేతీయులు, తదితర సైనికులు యెరూషలేము నుండి బయలుదేరి వెళ్లారు. బిక్రి కుమారుడైన షెబను వారు వెంటాడారు.

8 గిబియోను గుట్ట వద్దకు యోవాబు తన సైనికులతో వచ్చినప్పుడు అమాశా వారిని కలవటానికి ఎదురేగాడు. యోవాబు తన సైనిక దుస్తుల్లో వున్నాడు నడికట్టు కట్టుకున్నాడు. అతని ఒరలో కత్తి వున్నది. అమాశాను కలవటానికి యోవాబు ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన ఒరలోని కత్తి జారి కిందపడింది. యోవాబు ఆ కత్తిని తీసి చేతితో పట్టుకున్నాడు.

9 “సోదరా, నీవు క్షేమమేనా?” అని యోవాబు అమాశాను అడిగినాడు. యోవాబు తన కుడిచేతితో అమాశాను ముద్దు పెట్టుకునేందుకా అన్నట్టు గడ్డం పట్టుకున్నాడు.

10 యోవాబు చేతిలో వున్న కత్తిని అమాశా గమనించలేదు. యోవాబు తన కత్తితో అమాశా పొట్టలో పొడిచాడు. అమాశా పేగులన్నీ బైటకు వచ్చాయి. యోవాబు మళ్లీ పొడిచే అవసరం లేకుండా పోయింది - అమాశా అప్పుడే చనిపోయాడు. యోవాబు, అతని సోదరుడు అబీషై కలిసి బిక్రి కుమారుడు షెబను తరమటం కొనసాగించారు.

11 యోవాబు సైనికులలో యువకుడైన వాడొకడు అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన వారి నుద్దేశించి, “మీలో యోవాబును, దావీదును బలపర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. షెబను వెంటాడటంలో అతనికి సహాయం చేయండి!” అని అన్నాడు.

12 మార్గ మధ్యంలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు.

13 అమాశా శవం బాట మీద నుంచి తీసివేయబడిన పిమ్మట జనమంతా యోవాబును అనుసరించారు. బిక్రి కుమారుడు షెబను తరిమేందుకు వారు యోవాబుతో కలిసి వెళ్లారు.

14 బిక్రి కుమారుడు షెబ ఇశ్రాయేలు వంశపు వారు నివసించే ప్రాంతాల గుండా పోయి ఆబేలు బేత్మయకా నగరాన్ని చేరాడు. బెరీయులందరూ కూడి షెబను అనుసరించారు.

15 యోవాబు, అతని మనుష్యులు ఆబేలు బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్టూవున్న గోడకు వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్ల గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు దానిని పగులగొట్టటం మొదలుపెట్టారు.

16 ఇంతలో ఒక వివేకం గల స్త్రీ నగరంలో నుండి కేకలు పెట్టింది. “నే చెప్పేది వినండి. యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనితో నేను మాట్లాడదలిచాను!” అని అరిచింది.

17 ఆ స్త్రీ తో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా వచ్చాడు. “యోవాబువు నీవేనా?” అని ఆమె అడిగింది. “అవును. నేనే” అని యోవాబు సమాధానం చెప్పాడు.”అయితే నేను చెప్పేది విను!” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.”వింటున్నాను” అని యోవాబు అన్నాడు.

18 ఆ స్త్రీ ఇలా అన్నది, “పూర్వం ప్రజలు ‘సలహా కొరకు ఆబేలులో అడగమని అనే వారు. అప్పుడు వారి సమస్య తీరిపోయేది.

19 శాంతిని కోరే వారిలో, ఇశ్రాయేలు పట్ల విశ్వాసముగల వారిలో నేనొక దానిని. ఇశ్రాయేలులో ఒక ముఖ్యనగరాన్ని నీవు నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నావు. యెహోవాకి చెందిన దానిని నీవెందుకు నాశనం చేయ సంకల్పించావు?”

20 “లేదు! లేదు! నేను దేనినీ నాశనం చేయదల్చలేదు మీ పట్టణాన్ని నిర్మూలించను.

21 కాని ఎఫ్రాయిము కొండ ప్రాంతము వాడొకడున్నాడు. వాని పేరు షెబ. అతడు బిక్రి యొక్క కుమారుడు. వాడు దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. నీవు గనుక వానిని నా కప్పగించితే, నేను నగరాన్ని వదిలి పెడతాను,” అని యోవాబు అన్నాడు. “అయితే సరే! అతని తల గోడ మీది నుంచి మీకు విసరివేయబడుతుంది” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.

22 తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా యుక్తిగా మాట్లాడింది. అది విని ఆ నగరవాసులు బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా యోవాబుకు విసరివేశారు. అప్పుడు యోవాబు బూర వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతివాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూషలేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు.

23 ఇశ్రాయేలు రాజ్యంలో యోవాబు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. కాని కెరేతీయులకును, పెలేతీయులకును యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి.

24 వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసేదండుకు అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడుగా నియమితుడయ్యాడు.

25 షెవా ప్రధాన కార్యదర్శిగాను; సాదోకు, అబ్యాతారు యాజకులుగాను;

26 మరియు యాయీరీయుడగు ఈరా రాజుకు ప్రధానా చార్యుడుగను వున్నారు.

21

1 దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.”

2 (గిబియోనీయులు ఇశ్రాయేలు వారు కాదు. చావగా మిగిలిన అమ్మోరీయులకు చెందిన ఒక గుంపువారు. ఇశ్రాయేలీయులు వారికి కీడు చేయబోమని గిబియోనీయులకు ప్రమాణ పూర్వకంగా చెప్పియున్నారు. కాని సౌలు ఇశ్రాయేలీయుల పట్ల, యూదా వారి పట్ల ప్రేమకలవాడై గిబియోనీయులను చంపబూనాడు) దావీదు రాజు గిబియోనీయులను పిలిచాడు. అతడు వారితో మాట్లాడాడు.

3 “నేను మీకు ఏమి సహాయం చేయగలను? మీరు యెహోవా ప్రజలను దీవించేలాగున నేను ఇశ్రాయేలు వారి పాపాన్ని పోగొట్టటానికి ఏమి చేయాలి?” అని దావీదు గిబియోనీయులను అడిగాడు.

4 సౌలు, అతని కుటుంబం వారు చేసిన పాపాలకు పరిహారంగా వెండి బంగారాలు ఇవ్వాలని అడిగే హక్కుగాని, ఇశ్రాయేలులో ఎవ్వరినైనా చంపేహక్కుగాని మాకు లేదు” అని గిబియోనీయులు దావీదుతో అన్నారు. “అయితే మీకు నేనేమి చేయగలను?” అని దావీదు అడిగాడు.

5 అప్పుడు గిబియోనీయులు దావీదుతో ఇలా అన్నారు, “సౌలు మాకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. ఇశ్రాయేలులో మిగిలివున్న మా ప్రజలందరినీ సర్వనాశనం చేయాలని ప్రయత్నించాడు.

6 సౌలు యోహోవాచే ఎంపిక చేయబడిన రాజు. కావున అతని ఏడుగురు కుమారులను మా వద్దకు తీసుకొని రా. వారిని మేము సౌలు యొక్క గిబియా పర్వతం మీద యెహోవా ఎదుట ఉరితీస్తాము.” రాజైన దావీదు, “వారిని మీకు నేను అప్పగించెద”నని అన్నాడు.

7 కాని రాజు యోనాతాను కుమారుడైన మెఫిబోషెతుకు రక్షణ కల్పించాడు. (యోనాతాను సౌలు కుమారుడు) ఆ మేరకు దావీదు యెహోవా పేరు మీద యోనాతానుకు ప్రమాణం చేసియున్నాడు. అందువల్ల రాజు వారిని మెఫీబోషెతుకు హాని చేయించలేదు.

8 అయ్యా కుమార్తెయగు రిస్పాకు సౌలువలన పుట్టిన ఇద్దరు కుమారులను రాజు తీసుకున్నాడు. వారిద్దరి పేర్లు అర్మోని మరియు మెఫీబోషెతు రిస్పా కుమారులైన ఈ ఇద్దరినీ, మరియు సౌలు కుమార్తెయగు మెరాబునకు పుట్టిన ఐదుగురు కుమారులను రాజు తీసుకున్నాడు. (మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలువలన మెరాబునకు పుట్టిన వారీ ఐదుగురు పుత్రులు)

9 దావీదు ఈ ఏడుగురు కుమారులను గిబియోనీయులకు అప్పగించాడు. అప్పుడు గిబియోనీయులు ఈ ఏడుగురిని గిబియా పర్వతంమీద యెహోవా సాన్నిధ్యంలో ఉరితీశారు. ఈ ఏడుగురు కుమారులు కలిసి చనిపోయారు. యవల ధాన్యంపంట కోత ప్రారంభకాలంలో వారు చంపబడ్డారు.

10 అయ్యా కుమార్తె రిస్పా విషాద సూచకమైన ఒక వస్త్రం తీసుకొని కొండ మీద పరచింది. ఆ వస్త్రం పంట కోతలు మొదలు పెట్టినపప్పటి నుండి దానిమీద వర్షం పడే వరకు ఆ కొండ మీద పర్చబడివుంది. పగటి వేళ పక్షులు వచ్చి తన కుమారుల శవాలను ముట్టకుండా రిస్పా చూచేది. రాత్రిళ్లు పొలాల్లో నుంచి జంతువులు వచ్చి కుమారుల శవాలను ముట్టకుండగనూ కాపాడేది.

11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు.

12 అప్పుడు దావీదు యాబేష్గిలాదు వారి నుండి సౌలు యొక్కయు, యోనాతాను యొక్కయు ఎముకలను తీసుకున్నాడు. (యాబేషు వారు ఈ ఎముకలను బేత్షానులోని పధ్రాన వీధి నుండి దొంగిలించారు. బేత్షానులోని ఈ వీధిలోనే గతంలో ఫిలిష్తీయులు సౌలు, యోనాతానుల శవాలను వేలాడదీశారు. గిల్బోవ వద్ద సౌలును చంపిన తరువాత ఫిలిష్తీయులు ఆ శవాలను వేలాడదీశారు)

13 దావీదు గిలాదు నుంచి సౌలు యొక్కయు, అతని కుమారుడైన యోనాతాను యొక్కయు ఎముకలను తెచ్చనాడు. తరువాత ప్రజలు ఉరి తీయబడిన సౌలు యొక్క ఏడుగురి కమారుల శవాలను సేకరించారు.

14 బెన్యామీనులోని సేలా అనేచోట సౌలు యొక్క అతని కుమారుడు యోనాతాను యొక్క ఎముకలను వారు పాతి పెట్టారు. శవాలను మాత్రం సౌలు తండ్రి కీషు సమాధియందు వారు పాతిపెట్టారు. రాజు యొక్క ఆజ్ఞాను సారం ప్రజలు ఇవన్నీ చేశారు. రాజ్యంలోని ప్రజల ప్రార్థన దేవుడు ఆలకించాడు.

15 దావీదుతో ఫిలిష్తీయులు మరల యుద్ధానికి దిగారు. దావీదు తన సైన్యంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి తరలివెళ్లాడు. కాని దావీదు బాగా అలసిపోయి బలహీనపడిపోయాడు.

16 ఇష్బిబే నోబ అనే రెఫాయీముల సంతతి వాడొకడున్నాడు. ఇష్బిబే నోబ ఈటె మూడు వందల షెకెలుల ఇత్తడి ప్రమాణంలోవుంది. వానికొక కొత్త కత్తి కూడావున్నది. వాడు దావీదును చంపయత్నించాడు.

17 కాని సెరూయా కుమారుడైన అబీషై ఆ ఫిలిష్తీయుని చంపి, దావీదు ప్రాణం కాపాడాడు. అప్పుడు దావీదు మనుష్యులు అతనికి ఒక ప్రమాణం చేశారు. “ఇకమీదట నీవు యుద్ధాలు చేయటానికి బయటికి వెళ్లరాదు. ఒక వేళ వెళితేమాత్రం నీవు చంపబడతావు. దానితో ఇశ్రాయేలు ఒక మహానాయకుని కోల్పోతుంది,” అని చెప్పారు.

18 తరువాత గోబు వద్ద ఫిలిష్తీయులతో మరో యుద్ధం జరిగింది. అందులో హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీముల సంతతివాడగు సపును చంపాడు. సపు భయంకరాకారుడు.

19 ఫిలిష్తీయులతో గోబువద్ద మరో యుద్ధం జరిగింది. అక్కడ ఎల్హానాను అనువాడు గిత్తీయుడైన గొల్యాతును సంహరించాడు. ఎల్హానాను బేత్లెహేము వాడైన యహరేయోరెగీము అనువాని కుమారుడు. గొల్యాతు ఈటె సాలి వాని దోనెవలె మందంగా, పొడవుగావుంది.

20 గాతువద్ద మళ్లీ యుద్ధం జరిగింది. అక్కడ మహా కాయుడొకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఒక్కొక్కదానికి ఆరేసివ్రేళ్ల చొప్పున మొత్తము ఇరవై నాలుగువున్నాయి. అతడు రాక్షసాకారులగు రెఫాయీముల సంతతివాడు.

21 ఈ మనుష్యుడు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి కాలుదువ్వాడు. దావీదు సోదరుడైన షిమ్యా కుమారుడు యోనాతాను వానిని చంపివేశాడు.

22 ఈ నలుగురూ గాతుకు చెందిన భీకరుడైన రెఫా సంతతివారు. వీరంతా దావీదువలన, అతని సైనికుల వలన చంపబడ్డారు.

22

1 యెహోవా దావీదును సౌలు నుండి, తదితర శత్రువుల బారి నుండి తప్పించాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దావీదు ఈ స్తుతిగీతం ఆలపించాడు: యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు!

2 [This verse may not be a part of this translation]

3 [This verse may not be a part of this translation]

4 యెహోవా స్తుతింపబడుగాక! ఆదుకొమ్మని యెహోవాను వేడుకున్నాను దేవుడు నా శత్రువుల బారి నుండి నన్ను రక్షించును!

5 మృత్యు తరంగాలు నన్ను చుట్టుముట్టాయి, కష్టాలు ముంచుకొచ్చాయి. అవి నన్ను బెదరగొట్టాయి!

6 సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు మాయలో చిక్కుకున్నాను!

7 నేను కష్టాల ఊబిలో వున్నాను. అయినా నేను యెహోవాని అర్థించాను. అవును, నేను నా దేవుని పిలిచాను! ఆయన తన ఆలయంలో వున్నాడు, ఆయన నా మొరాలకించాడు; నా ఆక్రందన ఆయన చెవులను చేరింది.

8 భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన!

9 ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగబారింది, ఆయన నోటి నుండి అగ్ని శిఖలు వెలువడ్డాయి.

10 ఆకాశమును ఛేదించుకొని ఆయన భువికి దిగి వచ్చాడు! ఆయన ఒక కారు మేఘముపై నిలబడ్డాడు!

11 యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు!

12 యెహోవా కారుచీకటిని తన చుట్టూ డేరావలె కప్పుకున్నాడు. ఆయన వానమబ్బులను ఆకాశంలో పోగు చేస్తాడు.

13 ఆయన తేజస్సు బొగ్గులను మండింప చేసింది!

14 యెహోవా ఆకాశంలో గర్జించాడు ఆ సర్వోన్నతుడు మాట్లాడాడు!

15 యెహోవా బాణములు వేసి శత్రువులను చెల్లాచెదరు చేశాడు. యెహోవా మెరుపులను ప్రసరింప చేశాడు, వారు భయకంపితులై పారిపోయారు

16 అప్పుడు ప్రజలు సముద్రపు అడుగును చూడ గలిగారు, భూమి పునాదులు బహిర్గతమయ్యాయి.! యెహోవా గర్జించగా అవన్నియూ జరిగాయి, ఆయన నాసికారంధ్రముల నుండి వెలువడిన వేడిగాల్పులకు అలా జరిగాయి!

17 యెహోవా ఆకాశం నుండి చేయిచాచి నన్ను పట్టుకున్నాడు! అనంత జలరాసుల నుండి నన్ను వెలికి తీశాడు;

18 నాబద్ధ శత్రువు నుండి, నన్ను ద్వేషించు వారి నుండి ఆయన నన్ను కాపాడాడు. నా శత్రువులు నిజానికి నా శక్తికి మించిన వారు, కావున వారి నుండి ఆయన నన్ను కాపాడాడు!

19 నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు!

20 నాకు నిర్భయత్వమును కలుగ జేశాడు. ఆయనకు నేను ప్రీతిపాత్రుడను గనుక ఆయన నన్ను కాపాడాడు. నేను న్యాయ బద్దమైన పనులు చేయుటచే యెహోవా నన్ను సత్కరించాడు;

21 యెహోవా నన్ను సత్కరించాడంటే నా చేతులు పాపం చేయక పరిశుద్ధంగా వున్నాయి!

22 అంటే, యెహోవా యొక్క న్యాయ మార్గాన్ని నేననుసరించాను!

23 యెహోవా యొక్క తీర్పులు నిత్యం నా మదిలో మెదలుతూనే ఉంటాయి. ఆయన ఆజ్ఞలను నేనెన్నడూ విడనాడను.

24 దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి దూరంగా ఉంటాను!

25 అందువల్లనే యెహోవా నాకు ప్రతిఫలమిచ్చును. ఎందుకంటే, నేను న్యాయబద్ధంగా నివసిస్తాను! దేవుడు గమనించేలా నేను నిష్కళంక జీవితాన్ని గడుపుతాను.

26 నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు! ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు!

27 ఎవరైనా నీ పట్ల సత్ప్రవర్తనతో మెలిగితే, నీవు కూడ అతని పట్ల సద్భావం చూపిస్తావు! కాని ఎవరైనా నీకు ప్రతికూలంగా వుంటే, నీవు కూడ ప్రతికూలుడవై వుంటావు!

28 ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు!

29 యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు. యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు.

30 మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను!

31 దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.

32 యెహోవాను మించిన దేవుడు లేడు; మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు.

33 దేవుడు నా రక్షణ దుర్గం; సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు!

34 జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు.

35 దేవుడు నాకు యుద్ధానికి శిక్షణ యిస్తాడు. నా చేతులు ఇత్తడి విల్లంబును వంచి వేయగలవు.

36 డాలువలె నీవు నన్ను రక్షిస్తావు! నీ సహాయం నన్ను ఉన్నతుని చేసింది!

37 నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు.

38 నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను;

39 నేను నా శత్రువులను నాశనం చేశాను, నేను వారిని పూర్తిగా సంహరించాను! వారు మరల తలయెత్తే అవకాశం లేదు! అవును, నేను నా శత్రువులను నా కాలరాశాను!

40 ఎందువల్లననగా నీవు నన్ను యుద్ధంలో బలవంతునిగా చేశావు. నీవే నా శత్రువులను ఓడించినావు.

41 నా శత్రువులు పరుగెత్తి పోయేలా నీవు చేశావు! నన్ను అసహ్యించుకునే వారిని నేను ఓడిస్తాను!

42 నా శత్రవులు సహాయం కోసం తల్లడిల్ల గా వారిని ఆదుకొనే వారొక్కరూ లేకుండిరి!

43 నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని నా పాదములతో అణగ దొక్కాను.

44 నా ప్రజలు నన్ను వ్యతిరేకించినప్పుడు కూడా నీవు నన్ను కాపాడావు! నన్ను రాజ్యాలకు అధిపతిగా చేశావు; నాకు తెలియని ప్రజలు నన్ను సేవిస్తారు!

45 ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు.

46 అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు!

47 యెహోవా నిత్యుడు! కొండంత అండ అయిన నా దేవుని నామమును కీర్తించండి! ఆయనను సర్వోన్నతునిగా స్వీకరించండి! అయన నన్ను కాపాడే కొండ;

48 నా కొరకు నా శత్రువులను దండించే దేవుడు, ప్రజలను నా పాలనలోకి తెచ్చు వాడాయన;

49 నా శత్రువుల నుండి నన్ను విముక్తి చేయువాడు ఆయనే! అవును, నా శత్రువులకు మిన్నగా నన్ను ఉన్నతుని చేశావు! నన్ను గాయపర్చనుద్దేశించిన వాని నుండి నన్ను రక్షించావు.

50 యెహోవా! అన్ని రాజ్యాల సమక్షంలో నీకు స్తోత్రములు అర్పిస్తున్నాను!

51 ఆయన నియమించిన రాజుకు దిగ్విజయం కలిగేలా యెహోవా సహాయపడతాడు; ఆయన అభిషిక్తము చేసిన రాజైన దావీదుకు, అతని సంతతికి అనంతంగా దేవుడు తన ప్రేమానురాగాలను పంచి ఇస్తాడు!

23

1 ఇవి దేవునిచే ఉన్నతుడుగా చేయబడిన వ్యక్తి, యాకోబు దేవునిచే అభిషిక్తము చేయబడిన ాజు, ఇశ్రాయేలు మధుర గాయకుడు, యెష్షయి కుమారుడు అయిన దావీదు పలికిన తుది పలుకులు. దావీదు ఇలా అన్నాడు:

2 యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది. ఆయన పలుకే నా నోటిలో వున్నది.

3 ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు, ఇశ్రాయేలుకు, ఆశ్రయదుర్గమైన దేవుడు నాతో యిలా అన్నాడు: “ఏ వ్యక్తి ప్రజలను న్యాయమార్గాన పరిపాలిస్తాడో,” “ఏ వ్యక్తి దైవ భీతితో పరిపాలన సాగిస్తాడో”

4 “ఆ వ్యక్తి అరుణోదయ కాంతిలా ప్రకాశిస్తాడు, ఆ వ్యక్తి మబ్బులేని ప్రాతఃకాలంలా ప్రశాంత గంభీ రంగా వుంటాడు, లేతగడ్డిని చిగురింపజేయు వర్షానంతర సూర్యకాంతిలా ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.”

5 గతంలో దేవుడు నా కుటుంబాన్ని బలపర్చలేదు. తరువాత దేవుడు నాతో ఒక శాశ్వత ఒడంబడిక చేశాడు. అది సమగ్రమైన నిబంధనగా దేవుడు రూపొందించాడు. ఈ ఒడంబడికను దేవుడు బలపర్చాడు. దానిని ఆయన ఉల్లంఘించడు! ఈ ఒడంబడిక నాకు మోక్ష సాధనం; నేను కోరినదల్లా ఈ ఒడంబడికనే; ఖచ్చితంగా యెహోవా దానిని వర్ధిల్లేలాగు చేస్తాడు!

6 కాని దుష్టులు ముండ్లవంటి వారు. జనులు ముండ్లనుచేతబట్టరు. వాటిని తక్షణం విసర్జిస్తారు!

7 వాటిని ఎవరు తాకినా కర్ర, ఇనుము బల్లెములతో గుచ్చివేసినట్లవుతుంది. దుష్టులు కూడ ముండ్ల వంటి వారు వారు అగ్నిలో తోయబడి పూర్తిగా దహింపబడతారు.

8 దావీదు సైన్యంలో ప్రముఖుల పేర్లు ఇలా వున్నాయి: తక్మోనీయుడగు యోషేబెష్షెబెతు ముగ్గురు యోధుల అధిపతి. ఎస్నీయుడైన అదీనా అని కూడ ఇతడు పిలవబడేవాడు. యోషేబెష్షెబెతు ఒక్క యుద్ధంలోనే ఎనిమిది వందల మందిని చంపివేశాడు.

9 అహోహీయుడైన దోదో కుమారుడు ఎలియాజరు తరువాత ప్రముఖుడు. దావీదు ఫిలిష్తీయులను ఎదిరించిన కాలంలో అతనితో వున్న ముగ్గురు యోధులలో ఎలియాజరు ఒకడు. ఒక పర్యాయము ఫిలిష్తీయలు గుమిగూడి ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికిరాగా, ఇశ్రాయేలీయులు పారిపోయారు.

10 అప్పుడు ఎలియాజరు మాత్రము అలసిపోయేవరకు ఫిలిష్తీయులతో ఒంటరిగా పోరాడాడు. తన చెయ్యి కత్తి పిడికి అంటుకుపోయేలా గట్టిగా పట్టుకుని విడవకుండా శత్రుసంహారం చేశాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని సమకూర్చి పెట్టాడు. ఎలియాజరు యుద్ధంలో గెలిచిన తరువాత, జనంతిరిగి వచ్చారు. కాని నిజానికి వారు ఓడిపోయిన శత్రువులను దోచుకోడానికి మాత్రమే వచ్చారు.

11 హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా తరువాత ప్రముఖ సేనాని. ఒక పర్యాయం ఫిలిష్తీయులు వచ్చి నిండుగా పండిన అలసందల చేనువద్ద గుమిగూడారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను చూసి పారి పోయారు.

12 కాని షమ్మా మాత్రం చేను మధ్యలో నిలబడ్డాడు. అతడు చేనును కాపాడుతూ పోరాడాడు. అతడు ఫిలిష్తీయులను హత మార్చాడు. అప్పుడు కూడ యెహావా వారికి ఘన విజయం చేకూర్చాడు.

13 పంట కోతకాలంలో ముప్పై మంది సైనికులలో ఘటికులైన ముగ్గురు ఒక సారి దావీదు వద్దకు వచ్చారు. ఈ ముగ్గురూ అదుల్లాము గుహవద్దకు వచ్చారు. రెఫాయీము లోయలో ఫిలిష్తీయుల సైన్యం గూడారాలు వేసింది.

14 ఆ సమయంలో దావీదు కోటలో వున్నాడు. బేత్లెహేములో కొంత మంది ఫిలిష్తీయుల సైనికులున్నారు.

15 తన స్వగ్రామంలోని నీరు తాగాలనే ప్రగాఢవాంఛ దావీదుకు కలిగింది. “ఓహో, బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు ఎవరైనా తెచ్చియిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను,” అని దావీదు అన్నాడు. వాస్తవంగా దావీదు దీనిని కోరలేదు; కాని తానలా మట్లాడాడు.

16 కాని ముగ్గురు బలాఢ్యులు మాత్రం ఫిలిష్తీయుల సైనికులను ఛేధించుకుంటూ వెళ్లారు. బేత్లెహేము నగర ద్వారంవద్దగల బావి నుండి నీరు తీసుకున్నారు. దానిని వారు దావీదు వద్దకు తెచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. అతడా నీటిని యెహోవా ముందు పారబోశాడు.

17 దావీదు యెహోవాతో, “యెహోవా, నేను దీనిని తాగలేను! నా కొరకు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం తాగి నట్లుగా వుంటుంది,” అని అన్నాడు. అందువల్ల దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఈ ముగ్గురు సైనికులు అలా అనేక సాహసకృత్యాలు చేశారు.

18 సెరూయా కుమారుడైన యోవాబు సోదరుడగు అబీషై ఈ ముగ్గురు సైనికులకు నాయకుడు. అబీషై తన ఈటెనుపయోగించి మూడు వందల శత్రుసైనికులను హతమార్చాడు. అతను కూడ ఆ ముగ్గరు సైనికులంత ప్రఖ్యాతి వహించాడు.

19 వారి ముగ్గురు కంటె అబీషై మిక్కిలి ప్రశంసలు పొందాడు. అతడు వారికి నాయకుడయ్యాడు. అంతేగాని వారితో పాటు ఆ కూటమిలో ఒక సభ్యుడు కాదు.

20 యెహోయాదా కుమారుడైన బెనాయా వున్నాడు. అతడు ఒక పరాక్రమశాలి కుమారుడు. అతడు కబ్సెయేలను ఊరివాడు. బెనాయా చాలా సాహసకృత్యాలు చేశాడు. అతడు మోయాబీయుడగు అరీయేలు ఇద్దరు కుమారులను చంపివేశాడు. అంతేగాదు మంచుపడే కాలంలో బెనాయా ఒక గోతిలోదిగి అక్కడ దాగిన ఒక సింహాన్ని చంపాడు.

21 ఈజిప్టుకు చెందిన ఒక బలమైన యోధుణ్ణి చంపాడు. ఆ ఈజిప్టీయుని చేతిలో ఒక ఈటెవుంది. కాని బెనాయా చేతిలో ఒక కర్ర మాత్రమేవుంది. కాని బెనాయా వెళ్లి ఆ ఈజిప్టీయుని చేతిలోని ఈటె లాక్కున్నాడు. తరువాత బెనాయా ఆ ఈటెతోనే ఈజిప్టీయుని పొడిచి చంపాడు.

22 యెహోయాదా కుమారుడైన బెనాయా అటువంటి కార్యాలు చాలా చేశాడు. బెనాయా కూడ ఆ ముగ్గురు యోధులవలె ప్రసిద్ధి గాంచాడు.

23 ముప్పై మంది సైనికులలోను బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది; కాని ఆ ముగ్గురు యోధుల కూటమిలో సభ్యుడు కాలేదు. బెనాయాను దావీదు తన అంగరక్షకులకు నాయకునిగా చేశాడు.

24 యోవాబు సోదరుడగు అశాహేలు ఆ ముప్పై మందిలో ఒకడు. ఆ ముప్పై మందిలో మిగిలిన వారి పేర్లు: బేత్లేహేమీయుడగు దోదో కుమారుడైన ఎల్హానాను,

25 రోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,

26 పల్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడగు ఈరా,

27 అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,

28 అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహర్తె,

29 నెటోపాతీయుడగు బయానా కుమారుడైన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,

30 పిరాతోనీయుడైన బెనాయా, గాయషు సెలయేళ్ల ప్రాంతం వాడైన హిద్దయి,

31 అర్బాతీయుడైన అబీయుల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,

32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కుమారులలో

33 హరారీయుడైన షమ్మా కుమారుడు యోనాతాను, హరారీయుడైన షారారు కుమారుడగు అహీయాము,

34 మాయకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడగు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,

35 కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై,

36 సోబావాడగు నాతాను కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,

37 అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, (సెరూయా కుమారుడైన యోవాబునకు ఆయుధాలు మోసే సహాయకులు,)

38 ఇత్రీ యుడగు ఈరా, ఇత్రీయుడగు గారేబు, 39మరియు హిత్తీయుడైన ఊరియా. వీరంతా మొత్తం ముప్పది ఏడుగురు.

39 [This verse may not be a part of this translation]

24

1 యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు.

2 దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు.

3 కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?”

4 రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు.

5 వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది)

6 వారు గిలాదుకు, తహ్తింహోద్షీ దేశానికి వెళ్లారు. వారింకా దానాయానుకు, సీదోను ప్రాంతానికి వెళ్లారు.

7 వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు.

8 ఇలా దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు.

9 జనాభా పట్టికను యోవాబు రాజుకు సమర్పించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది వున్నారు.

10 జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”

11 దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహితుడు.

12 గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.”

13 దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా, లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా, లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.”

14 గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయన్నే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు.

15 అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు.

16 దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం వద్దవున్నాడు.

17 ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”

18 ఆరోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం మీద యెహోవాకి ఒక బలిపీఠం నిర్మించు మని చెప్పాడు”.

19 గాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు.

20 అరౌనా తలెత్తి చూడగా అక్కడ రాజు(దావీదు) వున్నాడు. ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి రాజుకు నమస్కరించాడు.

21 “నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా. అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు.

22 “నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి గింజలు రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి!

23 ఓ రాజా! ఇవన్నీ నీకు నేను ఇస్తాను.” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభువైన దేవుడు నీ పట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ అన్నాడు.

24 అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెప్తున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమినికొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!” కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏభైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు.

25 తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింప జేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు. దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.