1

1 ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల దేశమైన ఎఫ్రాయిములోని రామతయి మ్సోఫీము పట్టణవాసి. ఎల్కానా సూపు వంశస్థుడు. అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమారుడు. ఎలీహు తండ్రి తోహు. తోహు ఎఫ్రాయిము వంశపువాడైన సూపు కుమారుడు.

2 ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతానవతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు.

3 ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మ్సోఫీమునుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించేవాడు. అక్కడ ఆయన బలులు కూడ అర్పించేవాడు. షిలోహులో హొప్నీ, మరియు ఫీనెహాను అనే వారిరువురు యెహోవా యాజకులుగా ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని కుమారులు.

4 ప్రతిసారీ బలిఅర్పణలో ఒక భాగం ఎల్కానా తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు. ఆమె కుమారులకు కూడా భాగాలు ఇచ్చేవాడు.

5 యెహోవా హన్నాను గొడ్రాలుగా చేసినప్పటికీ, ఎల్కానా మాత్రం ఆమెను బాగా ప్రేమించేవాడు గనుక ఆమెకు కూడ ఎల్లప్పుడు అర్పణలో సమానభాగం ఇచ్చేవాడు.

6 పెనిన్నా అదేపనిగా హన్నాను పీడిస్తూ ఆమె మనస్సుకు ఎంతో బాధ కలిగించేది. అందుకు కారణం దేవుడు ఆమెను గొడ్రాలుగా చేయటమే.

7 ప్రతి ఏటా ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ హన్నాను పెనిన్నా కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్పించుచుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయలేదు.

8 ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నావనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటె నేను నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు.

9 హన్నా అన్న పానాలు పుచ్చుకొన్న తర్వాత, యెహోవాను ప్రార్థించటానికి వెళ్లింది. యెహోవా పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ ఆసీనుడైవున్నాడు.

10 హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది.

11 ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు” అని కోరుకున్నది.

12 ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు.

13 హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు.

14 “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు.

15 “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను.

16 నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది.

17 అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు.

18 నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు.

19 మరునాటి తెల్లవారు ఝామునే ఎల్కానా కుటుంబ సభ్యులంతా లేచి దేవుని ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి వెళ్లిపోయారు. ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు. హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు.

20 మరు సంవత్సరం సమయానికి హన్నా గర్భవతియై, ఒక కుమారుని కని తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. “వీనిపేరు సమూయేలు. ఎందుకంటే వీని కొరకు నేను యెహోవాని ప్రార్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు” అని అన్నది హన్న.

21 ఆ సంవత్సరం ఎల్కానా సకుటుంబంగా షిలోహుకు వెళ్లి యెహోవాకు బలులు సమర్చించి మొక్కిన మొక్కలు తీర్చేందుకు వెళ్లారు.

22 కాని ఈ సారి ఎల్కానాతో హన్నా వెళ్లలేదు. “బిడ్డకు ఆహారం తినే వయస్సు వచ్చిన్నపుడు షిలోహుకు తీసుకుని వెళతాను. అప్పుడతనిని దేవునికి అంకితం చేస్తాను. అతడు నాజీరు అవుతాడు. అది మొదలు శాశ్వతంగా షిలోహులో ఉండిపోతాడు,” అని హన్నా ఎల్కానాకు చెప్పింది.

23 “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. కుమారుడు స్వయంగా ఆహారం తినగలిగే వయస్సు వచ్చే వరకు ఇంటివద్దనే ఉండు. యెహోవా తన వాగ్దానం నెరవేర్చునుగాక” అని ఆమె భర్త ఎల్కానా అన్నాడు. తన కుమారుని పెంచుతూ హన్నా ఇంటి వద్దనే ఉండి పోయింది.

24 బాలునికి స్వయంగా అన్నం తినే వయస్సు వచ్చినప్పుడు హన్నా అతనిని షిలోహులోని యెహోవా ఆలయానికి తీసుకుని వెళ్లింది. తనతోపాటు మూడు సంవత్సరాల గిత్తదూడను, అరబస్తా పిండిని, ఒక ద్రాక్షారసం సీసాను తీసుకుని వెళ్లినది.

25 యెహోవా ముందరకు వెళ్లి ఎల్కానా యథావిధిగా కోడెదూడను యెహోవాకు బలిగా వధించాడు. అప్పుడు హన్నా బాలుని ఏలీ వద్దకు తీసుకుని వెళ్లింది.

26 అప్పుడామె ఏలీతో, “అయ్యా, నీ జీవము తోడుగా చెప్పుచున్నాను; నేను గతంలో నీ చెంత నిలబడి యెహోవాకి ప్రార్థించిన స్త్రీనే,

27 ఈ బిడ్డ కోసమే నేను ప్రార్థించాను. యెహోవా నా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు.

28 ఇప్పుడు ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వీడు జీవితాంతం యోహోవా సేవలో నిమగ్నమై ఉంటాడు” అని అన్నది. హన్న తన కుమారుని అక్కడ వదిలి యెహోవాను ఆరాధించింది.

2

1 హన్నా దేవుని ఇలా కీర్తించెను: “నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది. నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను నా శత్రువులను నేను పరిహసించగలను. నా విజయానికి మురిసిపోతున్నాను.

2 “యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు. నీవు తప్ప మరో దేవుడు లేడు! మన దేవుని వంటి బండ మరొకడు లేడు.

3 ఇక డంబాలు పలుకవద్దు! గర్వపు మాటలు కట్టి పెట్టండి! ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు, వారికి తీర్పు తీరుస్తాడు.

4 మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి! బలహీనులు బలవంతులవుతారు!

5 ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు. కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి ఇప్పుడు సమృద్ధిగా భోజనం! గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు! సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.

6 యెహోవా జనన మరణ కారకుడు! దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు. ఆయన వారిని మరల బతికించగలడు. యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,

7 మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు. పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.

8 మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు. యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు. యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు. యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్న తాసీనులను చేస్తాడు. పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే! యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.

9 యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు. వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు. కాని దుష్టులు నాశనం చేయబడతారు. వారు అంధకారంలో పడిపోతారు. వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు.

10 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు. సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు! యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు. ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”

11 తరువాత ఎల్కానా తన కుటుంబంతో కలిసి రామాలో తన ఇంటికి వెళ్లిపోయాడు. బాలుడు మాత్రం యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో షిలోహులో యెహోవా సేవలో వుండిపోయాడు.

12 ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు.

13 యాజకులు ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చినప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి ఇచ్చిన ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు మూడు మొనలు గల ఒక కొంకి గరిటెతో రావాలి.

14 యాజకుని సేవకుడు గరిటెను ఉడుకుతోన్న బాణలిలో గుచ్చి తీయాలి. అప్పుడా గరిటె కొనలకు పట్టుకొని ఎంత మాంసం వస్తుందో అది మాత్రం యాజకునికి చెందుతుంది. బలులు ఇవ్వటానికి షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు చేయవలసిన విధి ఇదే.

15 కాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని వంటకానికై కొంత మాంసం ఇవ్వమనీ, ఉడుకబెట్టిన మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు.”

16 అయితే బలి ఇచ్చే వ్యక్తి గనుక కొవ్వును యధావిధిగా, “ముందు దహించిన తరువాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోమని” అంటే యాజకుని సేవకుడు ఒప్పుకొనేవాడు కాదు. “అలా కాదు, ముందుగా మాంసం ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోతే, బలవంతాన తీసుకోవలసి వస్తుంది!” అని బదులు చెప్పేవాడు.

17 ఈ విధంగా, యెహోవాకు అర్పించబడిన అర్పణలను వారు లక్ష్యపెట్టలేదని హొఫ్నీ, ఫీనెహాసులు వ్యక్తం చేసారు. ఇది చాలా చెడ్డపాపం.

18 కానీ సమూయేలు యెహోవాను సేవించాడు. సమూయేలు ఏఫోదు ధరించిన ఒక బాల సహాయకుడు.

19 ప్రతి సంవత్సరం సమూయేలు తల్లి అతనికై ఒక చిన్న అంగీ తయారుచేసి, తన భర్తతో షిలోహుకు బలి అర్పించేందుకు వెళ్లినపుడు ఆ అంగీని సమూయేలు కొరకు తీసుకొని వెళ్లేది.

20 ఎల్కానాను, అతని భార్యను ఏలీ ఆశీర్వదించేవాడు: “హన్నా ప్రార్థన ఫలితంగా పుట్టిన వానిని మరల యెహోవా సేవకై ఇచ్చారు గనుక అతని స్థానాన్ని భర్తీ చేసే విధంగా హన్నాద్వారా యెహోవా మీకు పిల్లలను కలుగజేయుగాక.” తర్వాత ఎల్కానా, హన్నా ఇంటికి వెళ్లిపోయారు.

21 దేవుని అనుగ్రహం వల్ల హన్నాకు క్రమేపీ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బాలకుడైన సమూయేలు యెహోవా ఆలయములో దినదినము మంచి స్థితికి ఎదుగు చుండెను.

22 ఏలీ చాలా వృద్ధుడై పోయాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే వున్నాడు. పైగా సన్నిధి గుడారపు ద్వారం వద్ద పరిచర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు శయనిస్తున్నారని కూడా ఏలీ విన్నాడు.

23 ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యాలను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెందుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు?

24 నా కుమారులారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు.

25 ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యోహవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు. అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు.

26 బాలుడైన సమూయేలు మాత్రం దేవుని దయదయందును, మనుష్యుల దయయందును పెరుగుతూ వచ్చాడు.

27 దేవుని మనిషి ఒకడు ఏలీ వద్దకు వచ్చాడు. ఆ దేవుని మనిషి ఇలా చెప్పాడు “ఈజిప్టు దేశంలో నీ పూర్వీకులు ఫరో ఇంటిలో బానిసలుగా ఉన్నప్పుడు వారికి నేను ప్రత్యక్షమయ్యాను.

28 ఇశ్రాయేలులో వున్న నీ పూర్వీకుని కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను. వారిని యాజకులుగా నియమించాను. నా బలిపీఠం వద్దకు వెళ్లి ధూపం వేయటానికి వారు ప్రత్యేక ఏఫోదు ధరించేలా కోరుకున్నాను. నీ తండ్రి కుటుంబీకులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన బలి మాంసాన్ని తీసుకునేలాగున చేశాను.

29 అయితే నీవు బలులను, కాను కలను ఎందువలన గౌరవించుట లేదు? నీవు నాకంటే నీ కుమారులనే ఎక్కువ గౌరవిస్తున్నావు. నా కొరకు ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన మాంసాది అర్పణలలో మంచి వాటిని సంగ్రహించి క్రొవ్వెక్కి వున్నావు.”

30 ఆ దేవుని మనిషి ఇంకా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా నీ కుటుంబీకులు, నీ తండ్రి కుటుంబీకులు ఆయనను శాశ్వతంగా సేవించే విధంగా అనుగ్రహించాడు. కాని యెహోవా ఇప్పుడిలా సెలవిస్తున్నాడు: ‘అది ఇంక ఎన్నటికీ జరుగదు! నన్ను సేవించే వారినే నేను గౌరవిస్తాను. నన్ను సేవించుటకు నిరాకరించే వారికి అనేక కష్ట నష్టాలు సంభవిస్తాయి.

31 మీ సంతానమంతటినీ నేను నాశనం చేసే సమయమాసన్నమవుతూ ఉంది. అప్పుడు నీ కుటుంబంలో పెరిగి పెద్దవారై ముసలితనాన్ని చూచువాడు ఒక్కడూ ఉండడు.

32 ఇశ్రాయేలు ప్రజలకు మంచి జరుగుతూ ఉండగా, నీ ఇంటి వద్ద మాత్రం కీడు జరుగుతూ ఉంటుంది . నీ కుటుంబంలో మాత్రం ముసలి వాడొకడును ఉండడు.

33 ఒక్కడిని మాత్రం నా బలి పీఠం వద్ద యాజకునిగా సేవచేయటానికి రక్షిస్తాను. కాని, అతడు మాత్రం యాజకునిగా తన కళ్లు మందగించి, బలం ఉడిగి పోయేంత వరకు జీవిస్తాడు. నీ సంతానం వారంతా కత్తివేటుకు బలైపోతారు.

34 నేను చెప్పినవన్నీ నిజమవబోతున్నట్లుగా నీకు ఒక నిదర్శనం ఇస్తున్నాను. నీ ఇరువురు కుమారులైన హొఫ్నీ మరియు ఫీనెహాసు ఒకే రోజు మరణిస్తారు.

35 నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు.

36 నీ వంశంలో మిగిలిన వాళ్లంతా ఈ యాజకుని ఎదుట వంగి కొంచెం రొట్టె కోసం లేక కొద్దిగా డబ్బుకోసం దీనంగా ఆశిస్తారు. “మాకు భోజనానికి ఆహారం ఉండేలా మాకు యాజకులుగా ఉద్యోగం ఇప్పించమని అడుగుతారు.”

3

1 ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.

2 ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు.

3 సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది.

4 యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ

5 (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ. సమూయేలు పోయి పడుకున్నాడు.

6 దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.

7 సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు .

8 మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?”అని అన్నాడు. యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది.

9 ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే’యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’ “ అని చెప్పమన్నాడు. తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు.

10 యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు. “చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు.

11 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యాం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు .

12 నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను.

13 తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు.

14 అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.”

15 తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు

16 కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు. “ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు.

17 “యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు.

18 దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు. అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.

19 సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు.

20 అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజమైన ప్రవక్తగా గుర్తించింది.

21 షిలోహులో యెహోవా సమూయేలుకు దర్శనమిస్తూ వచ్చాడు. మాటలోనే సమూయేలుకు యెహోవా ప్రత్యక్షమయ్యేవాడు.

4

1 సమూయేలును గురించిన వార్త ఇశ్రాయేలు దేశమంతా వ్యాపించింది. ఏలీ పండుముసలి వాడయ్యాడు. ఏలీ కుమారులు యెహోవా ఎదుట దుష్ట కార్యాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఫిలిష్తీయులంతా ఏకమై ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి దిగారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ దాడిని ఎదుర్కోవటానికి కదలి వెళ్లి ఎబెనెజరు అనే చోట కాచుకొని యుండిరి. ఆఫెకు అనే చోట ఫిలిష్తీయులు బసచేశారు.

2 ఫిలిష్తీయులు దాడికి బారులుతీరి నిలువగా యుద్ధం మొదలయింది. యుద్ధంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను ఓడించి ఇశ్రాయేలు సైన్యంలో సుమారు నాలుగు వేలమంది సైనికులను చంపివేశారు.

3 ఇశ్రాయేలు సైన్యం తమ స్థలాలకు వచ్చారు. వారి నాయకులు, “యెహోవా ఎందువల్ల తమకు ఫిలిష్తీయుల చేతుల్లో ఓటమి కలిగించాడని ఆలోచించారు. వారు తమ యెహోవా ఒడంబడిక పెట్టెను షిలోహునుండి తీసుకుని రావాలని నిర్ణయించారు. ఈ విధంగా యెహోవా మనతో యుద్ధ భూమికి వస్తాడు. ఆయన మన శత్రువు లబారినుండి మనల్ని రక్షిస్తాడు” అని అనుకొన్నారు.

4 ఆ విధంగా అనుకొని షిలోహుకు మనుష్యులను పంపారు. వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఒడంబడిక పెట్టెను తీసుకుని వచ్చారు. పెట్టెపైన కెరూబులు ఉన్నారు. మరియు యెహోవా కూర్చొనే సింహాసనంలా వారు ఉన్నారు. ఏలీ కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు ఆ పెట్టెతో వున్నారు.

5 యెహోవా ఒడంబడిక పెట్టె యుద్ధస్థలంలోనికి రాగానే ఇశ్రాయేలు సేనలు పొంగివచ్చే సంతోషంతో భూమి అదిరేలా కేరింతలు పెట్టారు.

6 ఫిలిష్తీయులు ఈ కేకలు విని, “హెబ్రీయుల స్థలములో ఎందుకీ కలకలం?” అని అనుకోసాగారు. అప్పుడు వారు యెహోవా పవిత్రపెట్టె హెబ్రీయుల శిబిరములోకి వచ్చినదని కనుగొన్నారు.

7 ఫిలిష్తీయులు భీతి చెందారు. “హెబ్రీ శిబిరములోకి దేవుడు వచ్చాడు. మనకు సంకట కాలం వచ్చింది. ఇలా ఇదివరకెన్నడూ జరుగలేదు!

8 మనం వ్యాకుల పాటు చెందియున్నాము. ఆ మహా దేవుని నుండి మనలను రక్షించేవారెవరు? ఈజిప్టువాళ్లను గతంలో అనేక రోగాలకు, దారుణ శిక్షలకు గురిచేసి వారిని అష్టకష్టాలపాలు చేసినవాడు ఈ దేవుడే.

9 అయినను ఫిలిష్తీయుసోదరులారా, ధైర్యంగా ఉండండి. లెండి. వీరకిశోరాలై పోరాడండి! గతంలో హెబ్రీయులు మన బానిసలు. కాబట్టి వీరాధివీరులై పోరాడండి. లేదా మీరు హెబ్రీయులకు బానిసలై పోయే ప్రమాదం వుంది” అంటూ ఫిలిష్తీయుల నాయకులు సైనికులను ఉత్తేజపరిచారు.

10 ఫిలిష్తీయులు వీరోచితంగా పోరాడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించారు. ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కడూ తన గుడారానికి పారిపోయాడు. ఇది వారికి ఘోర పరాజయం. ముప్పది వేలమంది ఇశ్రాయేలు సైనికులు చనిపోయారు.

11 దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు పట్టుకుపోయారు. ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హొఫ్నీ మరియు ఫీనెహాసు చనిపోయారు.

12 అదేరోజు బెన్యామీను వాడొకడు యుద్ధ భూమినుండి పారిపోయాడు. సంభవించిన ఈ గొప్ప విషాదానికి సూచనగా తన బట్టలు చించుకొని, నెత్తిన దుమ్ము చల్లుకొని షిలోహుకు వెళ్లాడు.

13 ఈ బెన్యామీనీయుడు షిలోహు వెళ్లేసరికి ఏలీ నగర ద్వారం దగ్గర ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. దేవుని పవిత్ర పెట్టె విషయంలో అతను కొంత గాభరాగా వున్నాడు. అందువల్ల అతనక్కడ కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. బెన్నామీనీయుడు పట్టణంలోనికి వెళ్లి ఈ దుర్వార్తను వెల్లడిచేసాడు. షిలోహు పట్టణమంతా ఒక్కతీరున గగ్గోలుపడి ఏడ్చింది.

14 [This verse may not be a part of this translation]

15 [This verse may not be a part of this translation]

16 బెన్యామీనీయుడు తాను ఆ రోజు యుద్ధంనుండి పారిపోయి వచ్చినట్లు చెప్పాడు. “ఏమి జరిగిందో చెప్పు” అన్నాడు ఏలీ.

17 ఈ వార్త తెచ్చిన బెన్యామీనీయుడు ఏలీతో ఇలా చెప్పాడు: “ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు చిత్తుగా ఓడిపోయారు. వారిలో అనేకమంది సైనికులు చనిపోయారు. నీ ఇరువురు కుమారులూ చనిపోయారు. దేవుని పవిత్ర పెట్టెను ఫిలిష్తీయులు తీసుకునిపోయారు.”

18 ఏలీ వృద్ధుడు, స్థూలకాయుడు. బెన్యామీనీయుడు దేవుని పవిత్ర పెట్టెనుగూర్చి చెప్పగానే ఏలీ, ద్వారం దగ్గర ఉన్న తన ఆసనంనుండి వెనుకకుపడి, మెడవిరిగి, చనిపోయాడు. ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాల పాటు ఏలీ నడిపించాడు.

19 ఏలీ కోడలు (ఫీనెహాసు భార్య) గర్భవతి. నెలలు బాగా నిండాయి. దేవుని పవిత్ర పెట్టె శత్రువుల చేత పడటం, తన మామ ఏలీ మరణం, తన భర్త ఫీనెహాసు మరణవార్తలు వినగానే ఆమెకు తీవ్రంగా పురుటినొప్పులు వచ్చాయి. ఆమె వంగిపోయి ప్రసవించేసింది.

20 ఆమె చావు ఘడియల్లో ఉండగా, “చింతపడకు, నీకు కొడుకు పుట్టాడు” అంటూ అక్కడ ఉన్న స్త్రీలు ఆమెను ఓదార్చారు. కానీ ఆమె ఏమీ పట్టించుకోకుండానే, “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది!” అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది.

21 తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టటానికి కారణం ఏమంటే, దేవుని పవిత్ర పెట్టె పరుల హస్తగతమయ్యింది; దానికి తోడు తన మామ, భర్త ఇద్దరూ చనిపోయారు.

22 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను తీసుకొని పోయారు గనుకనే “ఇశ్రాయేలు నుండి మహిమ తొలగిపోయింది” అని ఆమె వాపోయింది.

5

1 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు.

2 దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు.

3 అష్డోదు ప్రజలు ఆ మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యోహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది. అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు.

4 కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయ ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది.

5 అందువల్ల ఈ నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు.

6 అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు.

7 అ ష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు.

8 అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.” అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు.

9 అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా ఆ నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు.

10 కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు. కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు.

11 వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.” ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది.

12 చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.

6

1 దేవుని పవిత్ర పెట్టెను ఏడునెలలు ఫిలిష్తీయులు తమ దేశమందు ఉంచుకున్నారు.

2 ఫిలిష్తీయులు వారి పూజారులను, మాంత్రికులను పిలిచి, “యెహోవా పవిత్ర పెట్టెను మేము ఏమి చేయాలి? ఈ పెట్టెను తిరిగి దాని స్థానానికి పంపాలంటే ఏమి చేయాల్లో మాకు చెప్పండి” అని అడిగారు.

3 “మీరు ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను తిరిగి పంపదలచుకుంటే ఊరక పంపవద్దు. ఆ దేవుడు మీ పాపాలను క్షమించే విధంగా తగిన కానుకలతో పంపాలి. అప్పుడు మీరు స్వస్థపరచబడి పవిత్రపరచబడతారు. దేవుడు మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని శిక్షించటం మానివేయాలంటే మీరు ఇలా చేయాలి” అని ఆ పూజారులు, మాంత్రికులు చెప్పారు.

4 “తమను క్షమించాలంటే ఇశ్రాయేలు దేవునికి ఏమి కానుకలు పంపాలని” ఫిలిష్తీయులు అడిగారు. “ఫిలిష్తీ నాయకులు అయిదుగురు ఉన్నారు. (ఒక్కో పట్టణానికి ఒక్కో నాయకుడు.) మీ ప్రజలందరికీ, నాయకులకు ఒకటే సమస్య ఉంది. కనుక గడ్డల్లాంటి బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు ఎలుకల్లా కనబడే బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి.

5 మరియు దేశాన్ని పాడుచేస్తోన్న ఎలుకల ప్రతిరూపాలు చేయండి. ఈ బంగారు ప్రతి రూపాలను ఇశ్రాయేలు దేవునికి వెలగా ఇవ్వండి. ఒకవేళ అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు మిమ్మల్ని, మీ దేవుళ్లను, మీ దేశాన్ని శిక్షించటం మానివేస్తాడేమో.

6 ఈజిప్టు వాళ్లలా, ఫరోలా మొండిగా ఉండవద్దు. దేవుడు ఈజిప్టు వాళ్లను శిక్షించాడు. అందుకే ఈజిప్టువాళ్లు ఇశ్రాయేలువాళ్లను ఈజిప్టు విడిచి వెళ్లనిచ్చారు.

7 “మీరు ఒక కొత్త బండిని నిర్మించి, అప్పుడే ఈనిన రెండు ఆవులను తేవాలి. ఆ రెండు ఆవులను ఇదివరలో కాడికట్టి ఉండకూడదు. వాటిని ఆ బండికి కట్టండి. దూడలను ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని గాటిలో ఉంచండి. వాటిని తల్లి ఆవుల వెనుక పోనీయవద్దు .

8 యెహోవా పవిత్ర పెట్టెను ఆ బండి మీద ఉంచండి. బంగారు ప్రతిరూపాలను ఒక సంచిలో వేసి పెట్టె పక్కన పెట్టండి. అవి దేవుడు మీ పాపాలను క్షమించగలందులకు మీరిచ్చే కానుకలు. పిమ్మట బండిని మార్గాన వెళ్లనివ్వండి.

9 బండిని కనిపెట్టి వుండండి. బండి గనుక ఇశ్రాయేలులో బేత్షెమెషు దిశగా వెళితే యెహోవా నిజంగా మనకీ భయంకర రోగం కలుగజేసినట్లు అవుతుంది. ఒకవేళ ఆవులు బేత్షెమెషువైపు పోకపోతే, మనల్ని శిక్షించింది ఇశ్రాయేలు దేవుడు కాదని మనం గ్రహించవచ్చు. మన జబ్బు మనకు ఏదో అలా వచ్చేసింది అని మనం భావించాలి” అని అన్నారు యాజకులు, మాంత్రికులు.

10 యాజకులు, మాంత్రికులు చెప్పిన రీతిగా ఫిలిష్తీయులు అంతా చేశాలు. దూడలున్న రెండు ఆవుల్ని తెచ్చి బండికి కట్టి, లేగదూడల్ని ఇంటివద్దనే వుంచారు.

11 ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను, మరియు బంగారు గడ్డలను ఎలుకల బంగారు ప్రతికూపాలను ఆ బండిమీద పెట్టారు.

12 ఆవులు తిన్నగా బేత్షెమెషువైపు వెళ్లాయి, ఆవులు అదేపనిగా అరుస్తూ బాటమీదే సాగి పోయాయి. అవి కుడికిగాని, ఎడమకిగాని తిరగలేదు. బేత్షెమెషు పొలిమేరవరకు ఫిలిష్తీయుల పాలకులు ఆవులను అనుసరించి వెళ్లారు.

13 లోయలో బేత్షెమెషు ప్రజలు ఆ సమయంలో తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు తలలు పైకెత్తి చూసినప్పుడు పవిత్ర పెట్టె కనబడింది. మరల పెట్టెను చూడగలిగినందుకు వారు ఎంతో ఆనందపడిరి.

14 బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి ఒక పెద్ద బండ వద్ద బండి ఆగింది. బేత్షెమెషు ప్రజలు బండిని నరికివేశారు. ఆవులను చంపి యెహోవాకు బలి అర్పించారు.

15 లేవీయులు యెహోవా పవిత్ర పెట్టెను కిందికిదించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ వారు దించారు. ఆ రెండింటినీ లేవీయులు ఆ పెద్ద బండమీద వుంచారు. ఆ రోజు బేత్షెమెషు ప్రజలు దహన బలులను సమర్పించారు.

16 బేత్షెమెషు ప్రజలు చేసిన ఈ సంగతులంతా ఫిలిష్తీయుల పాలకుల ఐదుగురు జాగ్రత్తగా తిలకించి ఎక్రోనునకు ఆ రోజే వెళ్లిపోయారు.

17 ఈ విధంగా వారికి లేచిన గడ్డల ప్రతిరూపాలను బంగారంతో చేయించి ఫిలిష్తీయులు తమ పాప పరిహారంగా యెహోవాకు కానుకలు పంపారు. అదేమాదిరి బంగారు బొమ్మలను ఒక్కొక్కటి చొప్పున ఫిలిష్తీయుల పట్టణాలయిన అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులనుండి పంపారు.

18 ఫిలిష్తీయులు ఎలుకల బంగారు ప్రతిరూపాలను కూడ పంపారు. ఐదుగురు ఫిలిష్తీయుల పాలకుల అధీనంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని బంగారు బొమ్మలను పంపారు ఈ ఫిలిష్తీయుల పట్టణాలలో చుట్టు ప్రాకారాలతో కట్టుదిట్టము చేయబడిన పట్టణాలు, వాటికింద ఉన్న గ్రామాలు చేర్చబడ్డాయి. ఏ బండ మీదయితే బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను ఉంచారో ఆ పెద్ద బండ బేత్షెమెషువాసి యెహోషువ పొలంలో ఈనాటికీ సాక్షిగావుంది.

19 కాని బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను చూసినప్పుడు అక్కడ యాజకులు లేరు. అందువల్ల దేవుడు బేత్షెమెషు వారిలో డెబ్బదిమందిని చంపాడు. అంత కఠినంగా తమను దేవుడు శిక్షించినందుకు బేత్షెమెషు వారు దుఃఖించారు.

20 “ఈ యెహోవా పవిత్ర దేవుని ముందర నిలబడగల యాజకుడు ఎక్కడ? ఇక్కడ నుంచి ఈ పెట్టెను ఎక్కడికి తరలించాలి?” అని వారు యోచనచేశారు.

21 బేత్షెమెషు జనం కిర్యత్యారీము ప్రజలకు వర్తమానం పంపారు. “ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను తిరిగి తెచ్చారని, వచ్చి దానిని తమ నగరానికి తీసుకుని పోవలసినదని సందేశం పంపారు.”

7

1 కిర్యత్యారీము ప్రజలు వచ్చి యెహోవా పవిత్ర పెట్టెను తీసుకొని వెళ్లారు. కొండమీద ఉన్న అబీనాదాబు ఇంటికి వారు యెహోవా పెట్టెను తీసుకొని వెళ్లారు. పెట్టె విషయంలో జాగ్రత్త పుచ్చు కొనేందుకు అబీనాదాబు కుమారుడగు ఎలియాజరును వారు ప్రత్యేక క్రమం ప్రకారం ఏర్పరిచారు.

2 కిర్యత్యారీములో ఆ పెట్టె ఇరువది సుధీర్ఘ సంవత్సరాలుండెను. ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ భక్తిశ్రద్ధలతో యెహోవా ఎదుట దుఃఖపడి ఆయనను వెదకటం మొదలు పెట్టారు.

3 ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.”

4 అది విన్న ఇశ్రాయేలీయులు బయలు , అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు.

5 “ఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమావేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను ప్రార్థిస్తాను” అని సమూయేలు వారితో చెప్పాడు.

6 ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక నయాయమూర్తిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు.

7 ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతున్నట్లు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి తరలి వచ్చారు. వారు వస్తున్నారని ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు.

8 వారు సమూయేలుతో “మా కొరకు ప్రభువైన దేవుని ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిష్తీయుల బారినుండి మమ్మును రక్షించమని యెహోవాను వేడుము!” అని విన్నవించారు.

9 అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గొర్రెపిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల కోసం యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతనికి జవాబిచ్చాడు.

10 సమూయేలు బలి పశువును దహించుచున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా ఒక భయంకర ఉరుమును ఫిలిష్తీయుల వద్ద కలిగించాడు. ఆ ఉరుము ఫిలిష్తీయులను భయపెట్టగా వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు సంభవించిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు.

11 ఇశ్రాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి ఫిలిష్తీయులను అందిన వారిని అందినట్లు చంపుతూ బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు.

12 ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకార్థంగా మిస్పాకు, షేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని నిలబెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల” అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసాడు అని చెప్పాడు.”

13 ఫిలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు బతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగానే వున్నాడు.

14 ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకుగల ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలను తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు పక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది.

15 సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయమూర్తిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు.

16 ప్రతి సంవత్సరం సమూయేలు దేశవ్యాప్తంగా సంచారం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు చెబుతూ ఒక స్థలంనుండి మరో స్థలానికి వేళ్లేవాడు. బేతేలు, గిల్గాలు, మిస్పాకు అతడు వెళ్లాడు. కనుక ఈ స్థలాలన్నింటిలో అతడు ఇశ్రాయేలీయులకు తీర్పు చెబతూ, వారిని పాలించాడు.

17 కానీ సమూయేలు తన ఇల్లు ఉన్న రామకు తిరిగి వెళ్లేవాడు. రామాలో వున్న ప్రజలను కూడ సమూయేలు పాలిస్తూ, తీర్పు చెప్పేవాడు. రామాలో యెహోవాకు ఒక బలిపీఠాన్ని సమూయేలు నిర్మించాడు.

8

1 సమూయేలు వృద్ధుడయిన పిమ్మట తన కుమారులను ఇశ్రాయేలీయులకు న్యాయాధి పతులుగా నియమించాడు.

2 సమూయేలు మొదటి కుమారుని పేరు యోవేలు. రెండవవాని పేరు అబీయా. వారిద్దరూ బెయేర్షెబాలో న్యాయాధిపతులు.

3 కాని సమూయేలు కుమారులకు తండ్రి నడవడి రాలేదు. యోవేలు, అబీయా, ఇద్దరూలంచం ద్వారా ధన సంపాదనకు పాల్పడినారు. తమ తీర్పులను తారుమారు చేయటానికి ప్రజలను మోసంచేసి రహస్యంగా లంచాలు తీసుకునేవారు.

4 కావున ఇశ్రాయేలు పెద్దలంతా (నాయకులు) సమూయేలును కలుసుకొనుటకు రామా వెళ్లారు.

5 వారు సమూయేలుతో, “నీవు వృద్ధుడవు. పైగా నీ కుమారులు నీ మాదిరిని వెంబడించుట లేదు. కాబట్టి అన్ని రాజ్యాల మాదిరిగా మమ్ములను పాలించటానికి కూడ ఒక రాజును ఇయ్యి” అని అన్నారు.

6 ఇది తప్పు అని సమూయేలు తలచాడు. కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థించాడు.

7 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “ప్రజలు ఏమి చెపితే దానిని నీవు పాటించు. వారి రాజుగా ఉండేందుకు వారు నన్ను తిరస్కరించారు గాని నిన్ను కాదు.

8 వారు ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నారు. నేను వారిని ఈజిప్టునుంచి రక్షించినప్పుడు, వారు నన్ను వదిలి ఇతర దేవుళ్లను పూజించారు. నీ పట్ల కూడా వారిప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు.

9 అయినా నీవు ప్రజలు చెప్పిన దానిని పాటించు. కాని వారికి ఒక హెచ్చరిక చెయ్యి. రాజు వారికి ఏమి చేస్తాడో ఒకసారి వివరించి చెప్పాలి.”

10 రాజుకొరకు అడుగుతున్న ప్రజలకు సమూయేలు సమాధాన మిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన విషయమంతా సమూయేలు ప్రజలకు ఇలా వివరంగా చెప్పాడు:

11 “మిమ్మల్ని పాలించేందుకు మీకు గనుక ఒక రాజు ఉంటే అతడు ఇలా చేస్తాడు: అతడు మీ కుమారులను తనకు సేవ చేసేటట్లు బలవంతంచేస్తాడు. అతడు వారిని బలవంతంగా సైనికులుగా చేస్తాడు. వారిని తన రథాలలో, అశ్వదళాలలో పని చేయిస్తాడు. మీ కుమారులు రాజు రథానికి ముందు పరుగెత్తే సంరక్షకులు అవుతారు.

12 రాజు మీ కుమారులలో కొంతమందిని వేయిమంది మీద అధికారులుగాను, ఏబదిమంది మీద అధికారులుగాను చేస్తాడు. మీ సంతతిలో మరికొంత మందిని రాజు తన భూమిని సాగు చేయుటకు, మరికొంత మందిని పంట కోయుటకు నియమిస్తాడు. ఇంకా కొంతమందిని యుద్ధ పరికరాలను, ఆయుధాలను తయారు చేసేందుకు, ఆయన రథాలకు కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చటానికి రాజు వినియోగిస్తాడు.”

13 “ఈ రాజు మీ కుమార్తెలను కూడా తీసుకుని, వారిలో కొంతమందిని అత్తరులు చేసేందుకు, మరికొంత మందిని ఆయన ఆహార పదార్థాలు తయారు చేయటానికి వినియోగిస్తాడు.

14 “ఈ రాజు మీ భూములలో శ్రేష్ఠమైన వాటిని, ద్రాక్షాతోటలను, ఒలీవ తోటలను తీసుకుంటాడు. వాటిని తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.

15 మీ పంటలోను, ద్రాక్ష దిగుబడిలోను పదవవంతు ఆయనతీసు కుంటాడు. ఈ పదవ భాగాన్ని రాజు తన అధికారులకు, సేవకులకు ఇస్తాడు.

16 ఈ రాజు మీ సేవకులను, పనిపిల్లలను కూడ తీసుకుంటాడు. మీకున్న మంచి మంచి పాడి పశువులను, గాడిదలను కూడా తీసుకుంటాడు. వారందరినీ తన స్వంత పనులకు వినియోగించుకుంటాడు.

17 ఆయన మీ గొర్రెల మందలలో పదవవంతు తీసుకుంటాడు. “అసలు మీరు కూడా ఈ రాజుకు బానిసలైపోతారు.

18 ఆ సమయం వచ్చినప్పుడు మీరెన్నుకున్న రాజు మూలంగా మీరు చాలా ఏడుస్తారు. కానీ యెహోవా మాత్రం ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు.”

19 సమూయేలు ఇంత చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా ఇలా అన్నారు: “కాదు! మమ్ములను ఏలటానికి మాకో రాజు కావాలి.

20 అప్పుడు మేము ఇతర రాజ్యాలతో సమాన ప్రతిపత్తిగల వారమవుతాము. మా రాజే మా నాయకుడు. యుద్ధంలో ఆయన మమ్మల్ని నడిపించి, మాకోసం ఆయన యుద్ధం చేస్తాడు.”

21 ప్రజలు చెప్పినదంతా విన్న సమూయేలు వారు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేసాడు.

22 “వారి మాట శిరసావహించమనీ, వారికో రాజును ఇవ్వమనీ” యెహోవా చెప్పాడు. అప్పుడు సమూయేలు అక్కడ సమావేశమైన ప్రజలకు “తమ పట్టణానికి వెళ్లిపొమ్మని చెప్పాడు.”

9

1 బెన్యామీను గోత్రమునకు చెందిన వారిలో కీషు చాలా ముఖ్యడు. అతను అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు. సెరోరు బెకోరతు పుత్రుడు. బెకోరతు బెన్యామీనీయుడైన అఫీయ కుమారుడు.

2 కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు చాలా అందగాడు. సౌలుకెంటె ఎక్కువ అందగాడు మరొకడు లేడు. ఇశ్రాయేలీయులందరి లోనూ అతడు ఆజానుబాహుడు.

3 ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక “సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవలసిందిగా” కీషు తన కుమారుడైన సౌలుతో చెప్పాడు.

4 ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వెదికారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కో లేకపోయారు. వారు షయలీము ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి దొరకలేదు.

5 చివరికి సౌలు, అతని సేవకుడు కలసి సూపు పట్టణానికి వచ్చారు. సౌలు, “ఇంటికి వెళ్లి పోదామని తన సేవకులనితో అన్నాడు. తన తండ్రి గాడిదల విషయం మర్చిపోయి తమను గురించి కంగారు (చింత) పడతాడని” అన్నాడు సౌలు.

6 “మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ ఆయన చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.

7 “సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్దాము. కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేందుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు.

8 “;చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని ఆ దైవజనుడికి ఇద్దాము. అప్పుడాయన మన ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు.

9 [This verse may not be a part of this translation]

10 [This verse may not be a part of this translation]

11 [This verse may not be a part of this translation]

12 అది విన్న యువతులు, “అవును ఆ దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ వేళే పట్టణంలోకి వచ్చాడు. వీధిలో ఉన్నాడు ఆరాధనా స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు ఈ వేళ సమావేశం అవుతున్నారు.

13 “మీరు పట్టణంలోకి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే, ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు చెప్పారు.

14 సౌలు, అతని సేవకుడు పట్టణానికి వెళ్లారు. పట్టణంలోకి వెళ్లగానే వారు సమూయేలును చూసారు. ఆరాధనకు వెళ్లే నిమిత్తం సమూయేలు పట్టణంలోనుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు.

15 ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు:

16 “రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి . నా ప్రజల బాధ నేను గమనించాను. నా ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.”

17 సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; నా ప్రజలను పాలించువాడితడే” అన్నాడు.

18 సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూయేలును అడిగాడు.

19 “నేను దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధనా స్థలానికి వెళ్లు. ఈ రోజు నీవు, నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను.

20 మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు.

21 అది విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి చెందిన వాడిని! ఇశ్రాయేలు అంతటిలో నావంశం చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు కోరుతూ వుందని ఎందుకు చెబతున్నావు?” అని అడిగాడు.

22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది మంది ఆహ్వానించబడ్డారు.

23 వంటవానితో సమూయేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యేకంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం అది” అన్నాడు.

24 వంటవాడు తొడ మాంసాన్ని తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.

25 భోజనాలు అయిన తరువాత వారు ఆరాధనా స్థలం నుండి కిందికి దిగి పట్టణంలోనకి వెళ్లారు. ఒక మిద్దెమీద సౌలుకు పడక ఏర్పాటు చేసారు. అక్కడ సౌలు నిద్రపోయాడు.

26 మరునాడు తెల్లవారుఝామున సమూయేలు లేచి మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్దేరు, నిన్ను నీ దారిని నేను పంపిస్తాను” అన్నాడు సమూయేలు. సౌలు లేచి సమూయేలుతో కలిసి బయటికి వెళ్లాడు.

27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.

10

1 సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది.

2 ఈ రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్నామీను సరిహద్దుల్లో సెల్సహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. ‘నీవు వెదకబోయిన గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి చేయాలి? అని ఆయన అంటున్నాడు” ‘ అని ఆ ఇద్దరు మనుష్యలు నీతో అంటారు.

3 “ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసు కొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది.

4 ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి నీవు తీసుకుంటావు.

5 తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు.

6 యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబతావు.

7 ఈ సూచనలన్నీ ఋజువయ్యాక, నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. దేవుడు నీకు తోడై ఉంటాడు.

8 “నాకంటె ముందుగా నీవు గిల్గాలుకు వెళ్లు. నేను తురువాత వచ్చి నిన్ను కలుస్తాను. అప్పుడు నేను దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాను. కానీ, నీవు ఏడు రోజులు ఆగవలసి వుంటుంది. అప్పుడు నిన్ను కలిసి నీవు ఏమి చేయాలో చెబతాను” అన్నాడు.

9 సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరలగానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆ రోజు నిజమయ్యాయి.

10 సౌలు, అతని సేవకుడు గిబియ-ఎలోహిం చేరగానే సౌలు కొంతమంది ప్రవక్తలను కలిసాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి అతి శక్తివంతంగా దిగెను. మిగిలిన ప్రవక్తలతో కలసి సౌలుకూడ దేవుని విషయాలు చెప్పసాగాడు.

11 ఇదివరకు సౌలును ఎరిగిన ప్రజలు అతడు ఇతర ప్రవక్తలతో కలసి ప్రవక్తలా మాట్లాడటం చూసారు. వారంతా “కీషు కొడుకు సౌలుకు ఏమయ్యిందో ఏమో! సౌలుకూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అంటూ ఆశ్చర్యపోయారు.

12 గిబియ-ఎలోహిములో నివసిస్తున్న ఒకడు, “అవును, అతడు వారి నాయకుడిలా కనబడుతున్నాడు” అన్నాడు. అందుకే, “సౌలుకూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే నానుడి ప్రసిద్ధికెక్కింది.

13 దేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత సౌలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు వచ్చాడు.

14 సౌలు తన సేవకుని కలిసి ఇంటికి వెళ్లగానే అతని పినతండ్రి, “ఎక్కడికి పోయారు” అని వారిని అడిగాడు. “గాడిదలను వెదటటానికి వెళ్లాము. అవి దొరకక పోయేసరికి సమూయేలును చూడటానికి వెళ్లాము.” అని సౌలు చెప్పాడు.

15 “సమూయేలు నీకు ఏమి చెప్పాడో దయచేసి నాకు చెప్పు” అన్నాడు సౌలు పినతండ్రి.

16 “గాడిదలు దొరికినట్లు వెల్లడి చేశాడని సౌలు అన్నాడు.” అంతేగాని రాజ్యాన్ని గురించి సమూయేలు చెప్పినదేదీ సౌలు తన పినతండ్రికి చెప్పలేదు.

17 మిస్పావద్ద యోహోవాను కలుసుకొనేందుకు ఇశ్రాయేలీయులంతా సమావేశం కావాలని సమూయేలు పిలుపునిచ్చాడు.

18 సమూయేలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని వచ్చాను. ‘నేను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నించిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను’ . అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు:

19 మళ్లీ ఇశ్రాయేలీయులతో సమూయేలు ఇలా అన్నాడు: “మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించటానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు. సరే. రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా దేవుని ముందర నిలబడండి.”

20 ఇశ్రాయేలు వంశాల వారినందరినీ సమూయేలు ఒక చోట చేర్చాడు. వారిలో బెన్యామీను వంశం ఎన్నుకోబడింది.

21 బెన్యామీను వంశంలో వున్న కుటుంబాల వారందరినీ గుంపు గుంపుగా వరుసగా నడిపించాడు. వాటిలో మథ్రీ కుటుంబం ఎన్నుకోబడింది. మరల మథ్రీ కుటుంబంలోని వారందరినీ వరుసుగా నడిపించాడు. వారిలో కీషు కుమారుడు సౌలు ఎంపిక చేయబడ్డాడు. సౌలును చూడాలని వచ్చిన ప్రజలు అతనికోసం వెదుకగా అతడు కపిరించలేదు.

22 “ఆ మనిషి ఇక్కడ ఉన్నాడా?” అని ప్రజలు అడిగారు. “సౌలు సామానుల వెనుక దాగి ఉన్నాడని” యెహోవా చెప్పాడు.

23 జనం పరుగెత్తుకుంటూ పోయి సామాన్ల వెనుక దాగుకొని ఉన్న సౌలును తీసుకుని వచ్చారు. సౌలు వారందరిలో నిలబడి ఉన్నపుడు అతను అందరికంటె ఎత్తుగా, ఆజానుబాహుడుగా కనబడ్డాడు.

24 “ఇదిగో చూడండి, యెహోవా ఎంపిక చేసిన మనిషి, ప్రజలలో సౌలువంటివాడు ఒక్కడూ లేడు.” అని సమూయేలు ప్రజలందరితో అన్నాడు. అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించునుగాక!” అని అరిచారు.

25 నూతన రాజ్యంలో నిబంధనావళిని సమూయేలు ప్రజలకు వివరించాడు. రాజ్యపరిపాలన నియమాలను, నిబంధనలను ఒక పుస్తకంలో రాసి సమూయేలు యెహోవా ముందర ఉంచాడు. అలా చేసి సమూయేలు ప్రజలను తమ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు.

26 సౌలు గిబియాలో వున్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుడు అక్కడ వున్న ధైర్యవంతుల హృదయాలను ప్రేరేపించాడు. ఈ ధీరులంతా సౌలు వెంట వెళ్లారు.

27 కాని పనికిమాలినవారు కొందరు “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు” అని అంటూ సౌలును చులకనగా చేసి ఆయనకు కానుకలను పట్టుకు వెళ్లటానికి నిరాకరించారు. సౌలు ఏమీ పలకలేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు గాదీయులను, రూబేనీయులను క్రూరంగా బాధిస్తూండేవాడు. వారిలో ప్రతి ఒక్కడి కుడి కంటినీ రాజు తీసివేస్తూండేవాడు. వారిని ఎవరైనా రక్షించటం కూడా అతడు సహించలేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు యొర్దాను నదికి కుడి వైపున ఉన్న ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరి కుడి కన్నూ తోడివేసాడు. కాని ఏడువేలమంది అమ్మో నీయుల నుండి పారిపోయి యాబేష్గిలాదుకు చేరారు.

11

1 ఒకనెల గడిచంది. తరువాత అమ్మోనీయుడైన నాహాషు తన సైన్యంతో వచ్చి యాబేష్గిలాదు నగరాన్ని ముట్టడించాడు. “నీవు మాతో ఒడంబడిక చేసుకొంటే మేము నీ సేవ చేస్తాము” అని యాబేషు ప్రజలు నాహాషుతో చెప్పారు.

2 “మీలోని ప్రతి ఒక్కని కుడి కంటినీ తోడివేయనిస్తే మీతో సంధికి ఒప్పుకుంటానన్నాడు నాహాషు.” అలా చేస్తే నేను ఇశ్రాయేలునంతటినీ అవమాన పర్చి నట్లువుతుందన్నాడు.

3 అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలుమూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగిపోతామనీ” వారు నాహాషుతో అన్నారు.

4 వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. అక్కడి ప్రజలకు ఆ వార్త అందజేశారు. ప్రజలు ఘోరంగా విలపించారు.

5 సౌలు అప్పుడే తన పొలములోని తన పశువుల దగ్గరనుండి ఇంటికి వస్తూనే ప్రజల రోదన విన్నాడు. “ప్రజలకేమయ్యింది? వారెందుకు విలపిస్తున్నారు?” అని అడిగాడు. అప్పుడు ప్రజలు యాబేషునుండి వచ్చిన దూతలు చెప్పినదంతా వినిపించారు.

6 అది వినగానే సౌలు మీదకు దేవుని ఆత్మ శక్తివంతంగా వచ్చి ఆవరించింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది.

7 సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకుని వాటిని నరికి ముక్కలు చేసి, వాటని ఆ వచ్చిన దూతలకు ఇచ్చి వాటిని ఇశ్రాయేలునలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. “వార్తహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.” యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు.

8 సౌలు బెజెకు వద్ద వారిని సమావేశపరచినప్పుడు అక్కడ మూడులక్షల మంది ఇశ్రాయేలీయులు, ముప్పదివేలమంది యూదా వారు ఉన్నారు.

9 “గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ఆ ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడుతారని ఆ ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు. సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు ఆ దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు.

10 యాబేషు ప్రజలు, “రేపు లొంగిపోతామనీ, అప్పుడు వారిని తనకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చనీ” అమ్మోనీయుడైన నాహాషుకు తెలియజేశారు.

11 అ మరునాటి ఉదయం సౌలు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. సూర్యోదయానికి సౌలు సైన్యం అమ్మోనీయుల శిబిరాన్ని చేరింది. అమ్మోనీయుల గస్తీ తిరిగే జట్టు మారుతున్నప్పుడు సౌలు వారిమీద దాడి చేసాడు. సౌలు, అతని సైనికులు అమ్మోనీయులను ఓడించారు. చావగా మిగిలిన అమ్మో నీయులు చెల్లాచెదురై పోయారు. ఏ ఇద్దరూ కూడ కలిసి ఉండే అవకాశం వారికి లేకుండా పోయింది.

12 “సౌలు రాజుగా ఉండటానకి అంగీరకించని వాళ్లెవరు? వారిని ఇక్కడకి తీసుకొని రండి. వారిని చంపేస్తాము” అని ప్రజలు సమూయేలుతో అన్నారు.

13 “వద్దు. ఈ వేళ ఇశ్రాయేలీయులను రక్షించినవాడు యెహోవా. అందుచేత ఈ వేళ ఏ ఒక్కరూ చంపబడకూడదు” అని సౌలు చెప్పాడు.

14 “గిల్గాలుకు వెళదాం రండి. అక్కడ సౌలు రాజరికాన్ని తిరిగి కొనసాగేలా చేద్దాము” అన్నాడు సమూయేలు ప్రజలతో.

15 జనమంతా గిల్గాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా ఎదుట వారు సౌలును మళ్లీ రాజుగా ఎన్నుకున్నారు. వారు యెహోవాకు సమాధాన బలులు కూడ అర్పించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం జరుపుకొన్నారు.

12

1 సమూయేలు ఇశ్రాయేలు ప్రజలనుద్దేశించి ఇలా అన్నాడు: “మీరు నన్ను కోరినదంతా చేశాను. మీకు ఒక రాజు కావాలంటే ఇచ్చాను.

2 ఇప్పుడు మీకు నాయకత్వం వహించటానికి ఒక రాజు ఉన్నాడు. నేను తల నెరసి ముసలివాడనై పోయాను. నా కుమారులు మీతోనే ఉన్నారు. నా చిన్ననాటి నుంచీ మీకు నేను ఆధిపత్యం వహించాను.

3 ఇప్పుడు నేను మీ సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి, ఆయన ఏర్పరచిన రాజుకు చెప్పండి. నేను ఎవరి ఎద్దునే గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినైనా భాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనెప్పుడైన డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులేవైనా చేసి ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు సరిదిద్దుకుంటాను.”

4 “నీవు మమ్ములను మోసం చేయలేదు; బాధపెట్టనూ లేదు. నీవు ఎవరి వద్దా లంచాలు కూడ తీసుకోలేదు” అని ఇశ్రాయేలు జనం అన్నారు.

5 “యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! ఇది సత్యం” అని చెప్పారు.

6 అప్పుడు ప్రజలనుద్దేశించి సమూయేలు, “ఆ దేవుడే సాక్షి. ఆయనే మోషేను, అహరోనును ఎంపికచేసాడు. మీ పూర్వీకులను ఈజిప్టు నుండి ఆయనే విముక్తులను చేసాడు.”

7 మీరంతా ఇప్పుడు ఇక్కడ నిలబడండి. ఆ యెహోవా మీ కోసం, మీ పూర్వీకుల సంక్షేమం కోసం చేసిన పనులను వివరిస్తాను.

8 యాకోబు వెళ్లిన తర్వాత ఈజిప్టు ప్రజలు ఆయన వంశీకుల జీవితాన్ని కష్టతరం చేశారు. కావున వారు యెహోవా సహాయం అర్థించారు. వారి మొర ఆలకించిన యెహోవా మోషేను, అహరోనును అక్కడికి పంపించాడు. వారిద్దరూ మీ పూర్వీకులను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి నడిపించారు.

9 “కానీ మీ పూర్వీకులు వారి దేవుడైన యెహోవాను మర్చిపోయారు.” అప్పుడు యెహోవా వారిని హాసోరు పట్టణ సైన్యాధిపతి సీసెరాకు బానిసలయ్యేలా చేశాడు. తరువాత ఫిలిష్తీయులకు, మోయాబు రాజుకు కూడ యెహోవా వారిని బానిసలు కానిచ్చాడు. వారంతా మీ పూర్వీకులకు వ్యతిరేకంగా పోరాడారు.

10 అయితే మీ పూర్వీకులు సహాయంకోసం యెహోవాకు మొరపెట్టారు. ‘మేము పాపం చేసాము. మేము యెహోవాను విడిచిపెట్టి బయలు, అష్ఠారోతు అనే బూటకపు దేవతలను సేవించాము. అయితే ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుండి రక్షించు. మేము నిన్ను సేవిస్తాము’ అని చెప్పారు.

11 “యెరుబ్బయలు (గిద్యోను) బెదానను (బారాకు) యెఫ్తా, సమూయేలును పంపి, మీ చుట్టూ ఉన్న శత్రువులనుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. మీరు క్షేమంగా జీవిస్తున్నారు.

12 కానీ అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీద యుద్ధానికి రావటం మీరు చుసినప్పుడు, మీకు మీ దేవుడైన యోహోవా రాజుగా ఉన్నప్పటికీ “మమ్ము పాలించటానికి మాకు ఒక రాజు కావాలని” మీరు కోరుకున్నారు!

13 మీరు ఎంపిక చేసుకొన్న రాజు మీరు కోరుకున్న రాజు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. మీమీద ఒక రాజును యెహోవా నియమించాడు.

14 మీరు యెహోవాను ఘనపరచి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు పోరాడకూడదు. మరియు మీరు , మిమ్మల్ని పాలిస్తున్న రాజు, మీ దేవుడైన యోహోవాను వెంబడించాలి. మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు.

15 కానీ మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన మీకు వ్యతిరేకి అవుతాడు. ప్రభువు మిమ్మల్ని, మీ రాజును సర్వనాశనం చేస్తాడు.

16 “ఇప్పుడు మీరు నిశ్శబ్ధంగా, నిశ్చలంగా నిలబడండి మీ కళ్లముందే యెహోవా చేసే ఒక మహిమాన్విత కార్యం చూడండి.

17 ఇప్పుడు గోధుమ పంట కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు.

18 అలా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థించాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూయేలు అనిన ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది.

19 ప్రజలు సమూయేలుతో, “నీ సేవకులమైన మాకోసం దేవుడైన యెహోవాను ప్రార్థించు. మమ్మల్ని చనిపోనీయవద్దు. మా పాపాల మూటకుతోడు రాజు కావాలని అడిగే దురాచారాన్ని కూడ సంతరించుకున్నాం” అని వాపోయారు.

20 భయపడవద్దని సమూయేలు వారికి ధైర్యం చెప్పాడు. “మీరు తప్పు చేసిన మాట నిజమే. అయినా యెహోవాకు దూరం కావద్దు. మీ హృదయ పూర్వకంగా యెహోవాకు సేవ చేయండి.

21 విగ్రహాలు వట్టి బొమ్మలే. అవి మీకు సహాయం చేయలేవు. కావున వాటిని పూజించవద్దు. విగ్రహాలు మీకు సహాయమూ చెయ్యలేవు, కాపాడనూలేవు. విగ్రహాలు కేవలం వ్యర్థము!!

22 “అయితే యెహోవా తన ప్రజలను విడిచి పెట్టడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొనేందుకు ఆనందించాడు. అందుచేత తనమంచి పేరుకోసం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు.

23 కావున మీ కోసం ప్రార్థన చేయకుండా నేను మాని వేస్తే అది నా తప్పు అవుతుంది. ఒకవేళ నేను అలా మానివేస్తే యెహోవాకు విరుద్ధంగా పాపం చేసినవాణ్ణి అవుతాను. సరైన మంచి జీవన మార్గాన్ని నేను మీకు ప్రబోధిస్తాను.

24 అయితే మీరు యెహోవా ఎడల భయభక్తులతో ఉండాలి. మీ పూర్ణ హృదయంలో మీరు వాస్తవంగా ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన ఆశ్చర్యకరమైన పనులన్నీ జ్ఞాపకం చేసుకోండి!

25 మీరు మొండి వైఖరితో చెడుచేస్తూనే ఉంటే ఆయన మిమ్మల్నీ, మీ రాజునూ చీపురుతో పాచిని ఊడ్చి పారవేసినట్లు విసిరేస్తాడు” అని సమూయేలు వారికి వివరించి చెప్పాడు.

13

1 అప్పటికి సౌలు పరిపాలించటం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవత్సరాలురు పాలించేసరికి

2 ఇశ్రాయేలునుండి మూడు వేల మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంతమైన బేతేలు పట్టణం దగ్గర మిక్మషులో అతనితోకూడ రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబియాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు.

3 యోనాతాను ఫిలిష్తీయులను గెబాలో ఉన్న వారి శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు “హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని” అరిచారు. “హెబ్రీ ప్రజలు జరిగినదంతా వినాలని” సౌలు అన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్పమని మనుష్యులను పురమాయించాడు సౌలు.

4 ఇశ్రాయేలీయులంతా ఈ వార్త విని, “సౌలు ఫిలిష్తీయులను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత అసహ్యించుకుంటారని” అన్నారు. సౌలును గిల్గాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు పిలుపు వచ్చింది.

5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది.

6 ఇశ్రాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని గుర్తించి వారంతా పారిపోయి కొండగుహల్లోను, బండ సందుల్లోను, పొదల్లోను దాక్కున్నారు. మరికొందరు రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను దాక్కున్నారు.

7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా భయంతో వణకిపోయారు.

8 సమూయేలు గిల్గాలులో సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్గాలులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం మొదలు పెట్టారు.

9 “దహన బలులను, సమాధాన బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. అవి వచ్చిన పిమ్మట సౌలు దహన బలులు అర్పించాడు.

10 సౌలు దహనబలి అర్పించి ముగించే సరికి సమూయేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు వెళ్లాడు.

11 సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని సౌలును అడిగాడు. అందుకు సౌలు, “మిక్మషు వద్ద ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సైనికులేమో నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు.

12 గిల్గాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని సహాయం అర్థించియుండలేదు. అందువల్ల నేను బలవంతంగా దహనబలి అర్పించాను” అని చెప్పాడు.

13 అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞన పాటించివుంటే, ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ కొనసాగేలా చేసేవాడు.

14 ఇప్పుడు నీ పాలన అంతం అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరేవాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని కనుగొన్నాడు. యెహోవా అతనిని తన ప్రజలకు కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు.

15 అప్పుడు సమూయేలు బయల్దేరి గిల్గాలు విడిచి వెళ్లిపోయాడు. సౌలు, అతనితో మిగిలిన సైన్యం గిల్గాలు విడిచి బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. తన వద్ద మిగిలిన సైన్యాన్ని సమీకరించుకొని చూస్తే సౌలు వద్ద ఆరువందల మంది మాత్రమే మిగిలారు.

16 సౌలు, అతని కుమారుడు యోనాతాను, మరియు సైనికులు బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. ఫిలిష్తీయులు మిక్మషులో గుడారాలు వేసుకొనియుండిరి.

17 మెరుపు దాడులు చేసే మూడు దళాలు ఫిలిష్తీయుల శిబిరంనుంచి బయలుదేరాయి. ఒక దళం ఉత్తరంగా షూయాలు ప్రాంతంలో ఓఫ్రా మార్గంలో వెళ్లింది.

18 రెండవది వాయవ్య దిశగా బేత్ హోరోనుకు పోయే మార్గంలో వెళ్లింది. మూడవ దళం తూర్పున సరిహద్దు మార్గంలో వెళ్లింది. ఆ దారి అరణ్య దిశగా జెబోయిము లోయకు సమీపంగా ఉంది.

19 ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ ఇనుముతో ఏ వస్తువూ చేయలేరు. ఇశ్రాయేలులో కమ్మరి ఒక్కడూ లేడు. “(కమ్మరివాళ్లు ఉంటే) ఇశ్రాయేలీయులు కత్తులను ఈటెలను చేయించుకొనెదరు” అని ఫిలిష్తీయులు చెప్పుకొని కమ్మరి వాళ్లు లేకుండా చేసిరి.

20 ఇనుప వస్తువులను ఫిలిష్తీయులు మాత్రమే పదును పెట్టగలరు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి నాగళ్లు, పారలు, గొడ్డళ్లు, లేక కొడవళ్లు గనుక పదును చేయాల్సివస్తే, వారు ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది.

21 నాగళ్లు, పారలు సాన బెట్టడానికి ఫిలిష్తీ కమ్మరులు 1/3 వంతు ఔన్సు వెండి పుచ్చుకొనేవారు. మరియు గునపాలు, గొడ్డళ్లు, మునికోల ఇనుప కొనలు సాన బెట్టటానికి వారు 1/6 వంతు ఔన్సు (వెండి) (అక్షరాలషెకెలులో మూడోవంతు) పుచ్చుకొనేవారు.

22 కనుక యుద్ధం రోజున సౌలు వెంట ఉన్న ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరి వద్దా (ఇనుప) ఖడ్గాలు, ఈటెలు లేవు. సౌలుకు, అతని కుమారుడు యోనాతానుకు మాత్రమే ఇనుప ఆయుధాలు ఉన్నాయి.

23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది.ొ” ౌ ో”“

14

1 సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలు మోసే యువకుని పిలిచి “లోయ ఆవలి పక్కన వున్న ఫిలిష్తీయుల గుడారాల వద్దకు వెళదాము” అన్నాడు. కాని ఈ విషయం మాత్రం తన తండ్రికి చెప్పలేదు.

2 మిగ్రోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ చెట్టు కింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు.

3 వారిలో ఒకడు అహీయా. ఈకాబోదు సోదరుడగు అహీటూబు కుమారుడు అహీయా. ఈకాబోదు ఫీనెహాసు కుమారుడు. ఫీనెహాసు ఏలీ కుమారుడు. షిలోహు పట్టణంలో యెహోవా యాజకునిగా అహీయా పని చేస్తున్నాడు. అతడు ఏఫోదు అనబడే పవిత్ర వస్త్రం ధరించాడు.

4 కనుమకు ఇరుప్రక్కలా నిటారైన బండ లున్నాయి. యోనాతాను ఆ కనుమగుండా ఫిలిష్తీయుల శిబిరమునకు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక పక్కనున్న కొండ పేరు బొస్సేసు. రెండవ పక్కనున్న నిడుపు కొండ కనుమ పేరు సెనే. 5ఒక బండ మిక్మషు వైపు ఉత్తరానికి ఉంది. మరొక బండ గిబియా వైపు దక్షిణంగా ఉంది.

5 యోనాతాను తన ఆయుధాలు మోసే యువకునితో వారి మీదికి వెళదాము రమ్మన్నాడు. “బహుశః యెహోవా మనకు సహాయం చేయవచ్చు. మనతో ఎక్కువ మంది వున్నారా, తక్కువమంది ఉన్నారా, అన్నది సమస్య కాదు. దేవుడు సంకల్పిస్తే ఇవేమీ అడ్డురావు విజయానికి” అన్నాడు యోనాతాను.

6 “మీ చిత్తమొచ్చినట్లు చేయండి. నేను ఎంతసేపూ నిన్ను కనిపెట్టుకొనే ఉంటాను” అన్నాడు ఆ యువసైనికుడు.

7 “అయితే, రా! ఫిలిష్తీయుల దగ్గరకు పోదాము. వారు మనలను చూసేలా వెళదాము.

8 [This verse may not be a part of this translation]

9 [This verse may not be a part of this translation]

10 కానీ’మా దగ్గరకు పైకి రండి’ అని ఫిలిష్తీయులు చెబితే, మనం వాళ్ల దగ్గరకు ఎక్కి పోదాము. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చే గుర్తు గనుక. మనం వారిని ఓడించేలా యెహోవా చేస్తాడని దాని అర్థం.” అని యోనాతాను తన యువ సైనికునితో చెప్పాడు.

11 ఫిలిష్తీయులు వారిని చూసేలా యోనాతాను, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి వెళ్లారు. వీరిని చూసిన ఫిలిష్తీయులు వారిలో వారు, “చూడండి! హెబ్రీ సైనికులు వారు దాగిన బొరియలనుండి బయటికి వస్తున్నారు!” అని అనుకున్నారు.

12 శిబిరంలో వున్న ఫిలిష్తీయులు వారిద్దరినీ చూసి, “మావద్దకు పైకి రండి. మీకు మంచి గుణపాఠం చెబతాము” అన్నారు. అది విన్న యోనాతాను తన సహాయకునితో, “నా వెనుకనే కొండ ఎక్కు. యెహోవా ఫిలిష్తీయులను ఇశ్రాయేలుకు అప్పగించాడు!” అని చెప్పాడు.

13 [This verse may not be a part of this translation]

14 [This verse may not be a part of this translation]

15 ఫిలిష్తీయులంతా చాలా భయపడిపోయారు. మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబిరంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకిపోయారు.

16 బెన్యామీను దేశంలోని గిబియా వద్ద ఉన్న సౌలు సైనికులు, ఫిలిష్తీ సైనికులు చెల్లాచెదురై పారిపోవటం చూశారు.

17 సౌలు తనతోకూడ ఉన్న సైన్యంతో “మనుష్యుల్ని లెక్కబెట్టండి. శిబిరాన్ని విడిచిపోయింది ఎవరో నేను తెలుసుకోవాలి” అన్నాడు. వారు లెక్క పెట్టి చూస్తే, అక్కడ లేని వారు యోనాతాను, అతని ఆయుధము మోసేవాడు.

18 “దేవుని పవిత్ర పెట్టెను తెమ్మని” యాజకుడైన అహీయతో సౌలు చెప్పాడు. (ఆ సమయంలో పవిత్ర పెట్టె ఇశ్రాయేలీయుల వద్ద ఉంది).

19 సౌలు యాజకునితో మాట్లాడుతూ వుండగానే ఫిలిష్తీయులలో అలజడి ఎక్కువయ్యింది. అప్పుడు సౌలు అసహనంతో, “నీ ప్రార్థన యిక చాలు, నీ చేతులు కిందికి దించు” అని యాజకునితో చెప్పాడు.

20 సౌలు, మరియు అతనితోవున్న సైన్యం సమకూడి యుద్ధానికి దిగారు. ఫిలిష్తీయులు గందరగోళంగా ఉన్నారని వారు గమనించారు. కొంతమంది ఫిలిష్తీయులు తమలో తామే కత్తులతో పొడుచు కొంటున్నట్టువారు చూశారు.

21 గతంలో వారి కింద పని చేసిన హెబ్రీయులు కొందరు ఫిలిష్తీయుల శిబిరంలో ఉన్నారు. ఈ హెబ్రీయులు సౌలు, యోనాతానుతో వున్న ఇశ్రాయేలీయులకు మద్దతు ఇచ్చారు.

22 ఎఫ్రాయిము కొండల దేశంలో దాగివున్న ఇశ్రాయేలీయులంతా పారిపోతున్న ఫిలిష్తీయుల గూర్చి విన్నారు. వీరంతా యుద్ధంలో చేరి ఫిలిష్తీయులను తరిమికొట్టారు.

23 ఆ విధంగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్ధం బేతావెను దాటిపోయింది. సైన్యమంతా సౌలు దగ్గర ఉంది. సుమారు పదివేల మంది అతని వద్ద ఉన్నారు. తరువాత ఎఫ్రాయిము రాజ్యంలోని ప్రతి నగరానికీ యుద్ధం వ్యాపించింది.

24 ఆరోజు సౌలు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలు సైనికులు ఆకలితో నకనకలాడి పోయారు. దీనికంతటికీ కారణం వారిని సౌలు ఒక ప్రమాణం కింద వుంచటమే! “సాయంత్రమయ్యేలోగా గాని, లేక నా శత్రువులను నేను ఓడించక ముందుగాని ఎవ్వరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు!” అని వారికి సౌలు ముందుగానే చెప్పాడు. దానితో ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరూ ఆహారం ముట్టలేదు.

25 ఆ ప్రాంతంలో ఒక తేనెతుట్ట వుంది.

26 సైనికులు దానివద్దకు వచ్చేసరికి వాళ్ల ప్రమాణం జ్ఞాపకం రావటంతో తేనె ముట్టటానికి భయపడిపోయారు.

27 అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి యోనాతానుకు తెలియదు. అతను తన చేతికర్రను తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు దానిని తాగగా అతనికి ఎంతో హాయినిచ్చింది.

28 సైనికులలో ఒకడు యోనాతానుకు “నీ తండ్రి సైనికులతో ప్రమాణము చేయించి, ఆహారము పుచ్చుకొనువాడు శపించబడును అని చెప్పాడు. అందువల్లనే ఏ ఒక్క సైనికుడు కూడా ఆ రోజు ఏమీ తినలేదని అన్నాడు. అందువల్లనే సైనికులంతా విపరీతంగా అలసిపోయారని” చెప్పాడు.

29 “మా తండ్రి దేశానికి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టాడు. చూడండి! ఈ తేనెను నేను కొంచెం రుచిచూస్తేనే నాకు చాలా హాయిగా వుంది!

30 ఈ రోజు శత్రువుల వద్ద తీసుకున్న ఆహారమంతా మన సైనికులు గనుక తినివుంటే, వారు ఎంత హాయిగా ఉండేవారు! ఇంకా చాలా మంది ఫిలిష్తీయులను కూడ చంపి ఉండే వాళ్లు!” అన్నాడు యోనాతాను.

31 ఆ రోజు మిక్మషునుండి అయ్యాలోను వరకూగల ఫిలిష్తీయులనందరినీ ఇశ్రాయేలు సైనికులు ఓడించారు. ఆ తరువాత వారు బాగా నీరసించి పోయారు.

32 వారు ఫిలిష్తీయుల గొర్రెలను, పశువులను, దూడలను పట్టుకొన్నారు. ఆకలికి తట్టుకోలేక వారు ఆ పశువులను నేలమీదే చంపి రక్తంతో నిండిన మాంసాన్నే తినివేశారు.

33 ఒక వ్యక్తి వెళ్లి సౌలుతో, “చూశావా! సైనికులంతా యెహోవా పట్ల పాపం చేస్తున్నారు. రక్తం కలసివున్న మాంసాన్నే వారు తింటున్నారు” అని చెప్పాడు. అది విని సౌలు, “మీరు పాపం చేశారు! ఒక పెద్ద బండను ఇక్కడికి దొర్లించండి” అన్నాడు.

34 “నీవు వెళ్లి ప్రతి ఒక్కడ్నీ తన ఎద్దును, గొర్రెను ఇక్కడికి తీసుకుని రమ్మను. వారు వచ్చి తమ పశువులను ఇక్కడ బండ మీద వధించాలి. దేవుని పట్లపాపం చేయవద్దు. రక్తం కలిసివున్న మాంసాన్ని తినకండి” అన్నాడు సౌలు. ఆ రాత్రి ప్రతి ఒక్కడూ తన పశువులను తెచ్చి అక్కడ వధించాడు.

35 తరువాత సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అది సౌలు తానే యెహోవాకి నిర్మించిన మొదటి బలిపీఠం.

36 “పదండి! ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముదాము. వాళ్లనందరినీ చంపివేసి వాళ్ల వస్తువులన్నీ తీసుకుందాము!” అన్నాడు సౌలు. “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి” అని సైనికులు జవాబిచ్చారు. కానీ “మనము దేవుని అడుగు దాము” అని యాజకుడు చెప్పాడు.

37 అందువల్ల సౌలు లేచి, “దేవా! నేను వెళ్లి ఫిలిష్తీయులను తరిమికొట్టనా? మేము వాళ్లను ఓడించేలా సహాయం చేస్తావా?” అని అడిగాడు. కాని ఆ రోజు సౌలుకు యెహోవా సమాధానం ఇవ్వలేదు.

38 “నాయకులందరినీ నా దగ్గరకు తీసుకుని రండి. ఈ వేళ ఎవరు పాపం చేసారో మనము తెలుసు కొందాము.

39 ఇశ్రాయేలును రక్షించే యెహోవా తోడుగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ పాపం నా స్వంత కుమారుడు యోనాతాను చేసినా, అతడు చావాల్సిందే” అని చెప్పాడు సౌలు. సైన్యంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

40 సౌలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి వారందరినీ ఒక పక్కన నిలబెట్టి, తన కుమారునితో కలిసి తానొక పక్కన నిలబడ్డాడు. “మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి” అని సైనికులంతా చెప్పారు.

41 “ఓ ఇశ్రాయేలీయుల దేవుడవై యెహోవా, నీ సేవకుడనైన నా ప్రార్థన ఈ రోజున ఎందుకు ఆలకించలేదు! నేను గాని, నా కుమారుడు యోనాతాను గాని పాపం చేస్తే మాకు ఊరీము పడేలా చేయుము. నీ ప్రజలయిన ఇశ్రాయేలీయులు పాపం చేస్తే, వారికి తుమ్మీము పడేలా చేయము” అని సౌలు ప్రార్థన చేశాడు. సౌలు యోనాతాను పాపం చేసినట్టు ఊరీము పడింది. అందుచేత ప్రజలు నిర్దోషులని తేలటంతో వారు వెళ్లిపోయారు.

42 సౌలు, యోనాతానుల మధ్య మళ్లీ వేస్తే యోనాతాను దోషి అని తేలింది.

43 “ఏమి చేసావో చెప్పు” అని సౌలు యోనాతానును అడిగాడు. “నేను కేవలం నా చేతికర్ర చివరన అంటిన తేనెనురుచి చూసాను. దానికే నేను మరణశిక్ష అనుభవించాలా?” అన్నాడు యోనాతాను.

44 సౌలు “దేవునికి నేను తీవ్రమైన ప్రమాణం చేసాను. నా ప్రమాణాన్ని గనుక నేను నిలబెట్టుకోక పోతే నాకు ఎన్నో దారుణాలు చేయుమని నేను దేవుని అడిగాను. కనుక యోనాతానూ, నీవు మరణించాల్సిందే” అన్నాడు.

45 అయితే సైనికులు, “ఈవేళ ఇశ్రాయేలీయులను మహా విజయానికి నడిపించిన వాడు యోనాతానే. అలాంటప్పుడు యోనాతాను మరణించాలా? వీల్లేదు. సజీవ దేవుని తోడు, యోనాతాను తలమీదనుండి ఒక్క వెంట్రుక నేలరాలదుగాక! ఈ వేళ ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి దేవుడే యోనాతానుకు సహాయం చేసాడు!” ఇని సౌలుతో చెప్పారు. అందుచేత సైనికులు యోనాతానును కాపాడారు. అతడు చంపబడలేదు.

46 కనుక ఫిలిష్తీయులను తరమటం సౌలుమానుకున్నాడు. ఫిలిష్తీయులు వారి స్థలానికి వెళ్లి పోయారు.

47 సౌలు పరిపాలన సాగించిన కాలంలో, ఇశ్రాయేలు చుట్టూవున్న దాని శత్రువులందరితో అతడు యుద్ధం చేశాడు. మోయాబీయులతోను అమ్మోనీయులతోను, ఎదోమీయులతోను, సోబాదేశపు రాజులతోను, ఫిలిష్తీయులతోను సౌలు యుద్ధంచేశాడు. సౌలు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులను ఓడించి విజయంసాధించాడు.

48 సౌలు చాలా ధైర్యవంతుడు. అతడు అమాలేకీయులను సహా జయించాడు. ఇశ్రాయేలును కొల్లగొట్టాలని ప్రయత్నించిన దాని శత్రువులందరినీ సౌలు చీల్చి చెండాడి ఇశ్రాయేలును రక్షించాడు.

49 యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ, ఈ ముగ్గురూ సౌలు కుమారులు. సౌలు పెద్దకుమార్తె పేరు మేరబు. ఆయన చిన్న కుమర్తె మీకాలు.

50 సౌలు భార్య పేరు అహీనోయము. ఆమె అహిమయస్సు అనే వాని కుమార్తె సౌలు సైన్యాధికారి పేరు అబ్నేరు. అతడు నేరు అనేవాని కుమారుడు. నేరు సౌలు పినతండ్రి.

51 సౌలు తండ్రి కీషు; అబ్నేరు తండ్రి నేరు-ఇద్దరూ అబీయేలు అనే వాని కుమారులు.

52 సౌలు జీవితాంతం ధైర్యశాలిగా ఉన్నాడు. ఫిలిష్తీయులతో తీవ్రంగా పోరాడాడు. సౌలు తన రాజ్యంలో ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక ధైర్యవంతుని గాని బలశాలిని గాని చూస్తే వానిని తన కోటలోని ప్రత్యేక సైనిక దళంలో చేర్చుకొనేవాడు.

15

1 సమూయేలు ఒక రోజు సౌలు వద్దకు వచ్చాడు. గతంలో అతనిని ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుని చేయటానికి యెహోవా తనను పంపిన విషయం జ్ఞాపకం చేస్తూ, మరో వర్తమానం యెహోవా దగ్గర నుండి తెచ్చినట్లు సమూయేలు చెప్పాడు.

2 సర్వశక్తి మంతుడైన యెహోవా వర్తమానం ఇది: “ఈజిప్టునుండి విముక్తి పొంది ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు వారిని కనానుకు పోకుండా ఆపాలని అమాలేకీయులు ప్రయత్నించారు. అమాలేకీయులు ఏమి చేశారో నేను స్వయంగా చూశాను.

3 నీవు ఇప్పుడు వెళ్లు. అమాలేకీయులపై యుద్ధం ప్రకటించు. నీవు అమాలేకీయులను సర్వనాశనం చేయాలి. అంతేగాదు. వారికి చెందిన ప్రతి వస్తువూ నాశనం కావాలి. దేనినీ బతకనివ్వకు. పురుషులను, స్త్రీలను, పిల్లలను పసివాళ్లను, పశువులను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను-అన్నింటినీ హతమార్చి వేయాలి.”

4 సౌలు సైన్యాన్ని పిలిచి తెలాయీము వద్ద సమీకరించాడు. సైనికులు రెండు లక్షలమంది ఉన్నారు. అందులో పదివేలమంది యూదాకు చెందినవారు.

5 సౌలు అమాలేకీయుల ఒక నగర సమీపానికి వెళ్లి లోయలో పొంచివున్నాడు.

6 ఆ ప్రాంతంలో కేనీయులు కూడా వున్నారు. సౌలు వారితో అమాలేకీయులను వదిలి వెళ్లిపొమ్మన్నాడు. అలా వెళ్తే అమాలే కీయులతో పాటు వారిని చంపనని చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీరు వారికి కనికరము చూపారు గనుక మిమ్మల్ని చంపను” అని సౌలు అన్నాడు. అది విని అమాలేకీయులనుండి విడి పోయి కేనీయులు వెళ్లిపోయారు.

7 అమాలేకీయులను సౌలు ఓడించాడు. హవీలా నుండి ఈజిప్టు సరిహద్దుల్లోని షూరు పట్టణం వరకూ సౌలు వారితో పోరాడాడు.

8 అమాలేకీయుల రాజైన అగగును మాత్రం సజీవంగా పట్టుకుని అతని సైన్యం అంతటినీ సౌలు చంపేసాడు.

9 సౌలు, మరియు ఇశ్రాయేలు సైనికులు అగగును బతకనిచ్చారు. బలంగా, ఆరోగ్యంగావున్న గొర్రెలను, పశువులను, గొర్రెపిల్లలను కూడా వారు వదిలివేశారు. ప్రయోజన కరమైన వాటన్నింటినీ చంపకుండా విడిచిపెట్టి వారికి అవసరం లేని వాటన్నింటినీ వారు చంపేసారు.

10 యెహోవా వాక్కు సమూయేలు దగ్గరకు వచ్చింది.

11 “సౌలు నన్ను అనుసరించటం మానేశాడు. కావున సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాను. అతడు నా ఆజ్ఞలను శిరసావహించలేదు.” అని యెహోవా చెప్పాడు. ఇది విన్న సమూయేలు గాభరా పడిపోయాడు. రాత్రంతా దుఃఖంతో యెహోవాని ప్రార్థించాడు.

12 మరునాటి తెల్లవారుఝామున సమూయేలు లేచి సౌలును కలుసుకొనేందుకు వెళ్లాడు. కానీ అక్కడి ప్రజలు, “సౌలు కర్మెలుకు వెళ్లాడు. తన గౌరవార్థం అక్కడ ఒక జ్ఞాపక స్తంభం నిలబెట్టడానికి సౌలు వెళ్లాడు. తర్వాత సౌలు అనేక చోట్లకు ప్రయానం చేసి, చివరికి గిల్గాలు వెళ్లాలని ఏర్పాటు చేసుకున్నాడు” అని చెప్పారు. కనుక సౌలు ఉన్న చోటికే సమూయేలు వెళ్లాడు. సౌలు అమాలేకీయుల దగ్గర తీసుకున్నవాటిలో మొదటి భాగాన్ని అప్పుడే అర్పించాడు. సౌలు వాటని దహనబలిగా యెహోవాకు అర్పిస్తున్నాడు.

13 సమూయేలు సౌలు దగ్గరకు వెళ్లాడు: “యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక! యెహోవా ఆజ్ఞలను నేను విధేయుడనయ్యాను” అని సౌలు చెప్పాడు.

14 “ఆజ్ఞ నెరవేర్చితే మరి నేను వింటున్న గొర్రెల, పశువుల అరుపులు ఏమిటి” అని సమూయేలు ప్రశ్నించాడు.

15 సౌలు ఇలా జవాబు చెప్పాడు: “సైనికులు వాటిని అమాలేకీయులనుండి తీసుకున్నారు. నీ దేవుడైన యెహోవాకు దహనబలి చేయటానికి సైనికులు మంచి గొర్రెలను పశువులను కాపాడారు. కాని మిగిలిన వాటన్నిటినీ మేము చంపేశాము.”

16 సమూయేలు, “ఇంక మాట్లాడకు. రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీవు విను” అన్నాడు సౌలుతో. సౌలు, “సరే నాకు చెప్పు” అన్నాడు.

17 సమూయేలు ఇలా చెప్పాడు: “గతంలో నీవు ప్రముఖుడవు కాదని తలచావు. కాని ఇశ్రాయేలు వంశాలన్నింటికీ నీవు నాయకుడవై నావు. ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా నిన్ను ఎంపిక చేశాడు.

18 యెహోవా నిన్ను ఒక ప్రత్యేక పనిమీద పంపించాడు. “వెళ్లి ఆ దుర్మార్గపు అమాలేకీయులనందరినీ చంపివేయి. వాళ్లను పూర్తిగా నాశనం చేయి” అని యెహోవా చెప్పాడు.

19 కానీ నీవు యెహోవా మాట వినలేదు. వాటిని నీకోసం అట్టే పెట్టుకోవాలను కున్నావు. కనుక ఏది చెడ్డదని యెహోవా చెప్పాడో అదే నీవు చేసావు.”

20 సౌలు, “నేనైతే యెహోవాకు విధేయుడనయ్యాను. యెహోవా పంపిన చోటికి నేను వెళ్లాను. అమాలేకీయులనందరినీ నేను నాశనం చేశాను. వారి రాజు అరగును మాత్రమే నేను తిరిగి తీసుకుని వచ్చాను.

21 సైనికులు మాత్రమే నీ దేవుడైన యెహోవాకు గిల్గాలువద్ద బలి అర్పించేందుకు శ్రేష్ఠమైన గొర్రెలను, పశువులను తీసుకుని వచ్చారు” అన్నాడు.

22 కానీ సమూయేలు, “యెహోవాకు ఎక్కువ ప్రీతి పాత్రమైనది ఏమిటి? దహనబలులు, బలులా? లేక యెహోవా ఆజ్ఞాపాలనయా? దేవునికి బలులు అర్పించటంకంటే, ఆయనకు విధేయుడై ఉండటం శ్రేష్ఠము. పొట్టేళ్ల కొవ్వును అర్పించేకంటే, దేవుని వాక్కు వినటం శ్రేష్ఠము.

23 అవిధేయుడవై ఉండట మంటే మంత్రం వేసే పాపం లాంటిదే. మొండి వైఖరితో నీకు తోచినదే చేయటం విగ్రహారాధనవంటి పాపమే. నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఈ కారణంగా ఇప్పుడు యెహోవా నిన్ను రాజుగా తిరస్కరిస్తున్నాడు.”

24 అప్పుడు సౌలు, “నేను పాపం చేశాను. నేను యెహోవా ఆజ్ఞలకు లోబడలేదు. నీవు చెప్పినట్లుగా నేను చేయలేదు. నేను ప్రజలకు భయపడ్డాను. వారు ఎలా చెప్పితే అలా చేశాను.

25 నా పాపం క్షమించుమని ఇప్పుడు నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను యెహోవాని ఆరాధిస్తాను, నాతో కూడ రా” అని సమూయేలుతో చెప్పాడు.

26 కానీ సమూయేలు, “నేను నీతో మళ్లీ వెనుకకురాను. నీవు యెహోవా ఆజ్ఞ తిరస్కరించావు. ఇప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా తిరస్కరిస్తున్నాడు” అని చెప్పాడు.

27 సమూయేలు వెళ్లిపోవటానికి తిరగగానే, సౌలు ఆయన అంగీ పట్టుకున్నాడు. అంగీ చిరిగిపోయింది.

28 సమూయేలు, “నీవు నా అర గీ చింపేసావు. అదే విధంగా ఈవేళ యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీనుంచి తీసేస్తాడు. నీ స్నేహితుల్లో ఒకరికి ఈ రాజ్యాన్ని యెహోవా ఇచ్చాడు. ఇతడు నీకంటే మంచివాడు.

29 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెహోవా శాశ్వతంగా జీవిస్తాడు. యెహోవా అబద్ధం చెప్పడు. తన మనస్సు మార్చుకోడు. అనుక్షణం మనస్సుమార్చుకునే మనిషిలాంటివాడు కాదు యెహోవా” అని సౌలుతో చెప్పాడు.

30 సౌలు సమాధానమిస్తూ, “సరే నేను పాపం చేశాను. కాని దయచేసి నాతోకూడ రా. కనీసం నాయకుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నాకు కొంచెం మర్యాద చూపించు. దేవుడైన యెహోవాను నేను ఆరాధించటానికి నాతోకూడ తిరిగి రా” అన్నాడు.

31 కనుక సమూయేలు సౌలుతో కలిసి వెనుకకు వెళ్లాడు. సౌలు యెహోవాను ఆరాధించాడు.

32 “అమాలేకీయుల రాజైన అగగును తన వద్దకు తీసుకుని రమ్మని” సమూయేలు చెప్పాడు. అగగుసంకెళ్లతో బంధించబడి సమూయేలు ముందుకు వచ్చాడు. “నిశ్చయంగా ఇతడు నన్ను చంపడు” అని అగగు అనుకున్నాడు.

33 కాని సమూయేలు అగగుతో, “నీ కత్తివేటుకు గురిచేసి అనేకమంది పిల్లలను తమ తల్లులకు లేకుండా చేసావు. కనుక ఇప్పుడు నీ తల్లికి పిల్లలు ఉండరు,” అంటూ గిల్గాలులో యెహోవా ఎదుట సమూయేలు అగగును ముక్కలుగా నరికి వేశాడు.

34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయాడు. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు.

35 ఆ తరువాత సమూయేలు తన జీవితాంతం సౌలును మళ్లీ ఎన్నడూ చూడలేదు. కాని సౌలు విషయంలో సమూయేలు చాలా దుఃఖించాడు. సౌలును ఇశ్రాయేలేలుకు రాజుగా చేసినందుకు యెహోవా చాలా చింతించాడు.

16

1 యెహోవా, “ఎంతకాలం ఇలా సౌలుకోసం చింతిస్తావు? ఇశ్రాయేలు రాజుగా సౌలును నేను నిరాకరించాను. నీ కొమ్ములను నూనెతో నింపుకొని వెళ్లు. యెష్షయి అనే మనిషి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. యెష్షయి బేత్లెహేములో నివసిస్తున్నాడు. అతని కుమారులలో ఒకనిని నేను రాజుగా ఎంపిక చేసాను” అని సమూయేలుతో చెప్పాడు.

2 కానీ, “నేను వెళితే ఈ వార్త సౌలు విని నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తాడు” అని సమూయేలు అన్నాడు. “నీవు ఒక కోడెదూడను తీసుకుని బెత్లెహేముకు వెళ్లు. ‘యెహోవాకు నేను ఒక బలి అర్పించటానికి వచ్చాను’ అని చెప్పు.

3 బలి కార్యక్రమానికి యెష్షయిని రమ్మని ఆహ్వానించు. అప్పుడు ఏమి చేయాలో నేను నీకు తెలియచేస్తాను. నేను నీకు చూపిన మనిషిని నీవు తప్పక అభిషేకించాలి” అని యెహోవా చెప్పాడు.

4 యెహోవా చెప్పినట్లు సమూయేలు చేసాడు. సమూయేలు బెత్లెహేముకు వెళ్లాడు. బెత్లెహేము పెద్దలు భయంతో వణకిపోయారు. వారు సమూయేలును కలుసుకొని, “నీవు సమాధానంగానే వచ్చానా?” అని అడిగారు.

5 “అవును నేను సమాధానంగానే వచ్చాను. యెహోవాకు ఒక బలి అర్పించటానికి నేను వచ్చాను. మీరంతా తయారై బలి కార్యక్రమానికి నాతోకూడ రావటానికి సిద్ధపడండి” అని సమూయేలు జవాబు చెప్పాడు. సమూయేలు యెష్షయిని, అతని కుమారులను సిద్ధంచేశాడు. బలి అర్పణలో పాలుపుచ్చుకోమని సమూయేలు వారిని ఆహ్వానించాడు.

6 యెష్షయి, అతని కుమారులు వచ్చినపుడు సమూయేలు ఏలీయాబును చూసాడు. “నిజంగా యెహోవా ఎంపిక చేసిన మనిషి ఇతడే” అని సమూయేలు తలచాడు.

7 అయితే యెహోవా, “ఏలీయాబు ఎంతో అందంగా ఎత్తుగా ఉన్నాడు. కానీ ఆ విషయాలు లక్ష్యపెట్టకు. మనుష్యులు చూసే విషయాలను కాదు దేవుడు చూసేదు. ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా హృదయం చూస్తాడు. ఏలీయాబు తగిన వాడు కాడు” అని తెలియజేసాడు.

8 అప్పుడు యెష్షయి తన కుమారుడైన అబీనాదాబును పిలిచాడు. అబీనాదాబు సమూయేలు ఎదుటనడిచాడు. కానీ సమూయేలు, “లేదు యెహోవా ఎంపిక చేసినవాడు ఇతడు కాదు” అన్నాడు.

9 తరువాత షమ్మాను సమూయేలు ఎదుట నడువుమని యెష్షయి చెప్పాడు. కానీ సమూయేలు, “లేదు, ఇతనినికూడ యెహోవా ఎంపిక చేయలేదు” అన్నాడు.

10 తన కుమారులు ఏడుగురిని యెష్షయి సమూయేలుకు చూపించాడు. కానీ, “వీరిలో ఎవ్వరినీ యెహోవా ఎంపిక చేయలేదని” సమూయేలు యెష్షయితో చెప్పాడు.

11 అప్పుడు, “నీ కుమారులంతా వీరేనా?” అని సమూయేలు యెష్షయిని అడిగాడు. “అందరికంటె చిన్నవాడు ఇంకొకడు ఉన్నాడు. కానీ వాడు గొర్రెలను మేపుతున్నాడు” అని యెష్షయి జవాబిచ్చాడు. సమూయేలు, “అతనికి కబురు చేయి. అతన్ని ఇక్కడకు తీసుకునిరా. అతడొచ్చేవరకూ మనం భోజనానికి కూర్చోము” అని చెప్పాడు.

12 యెష్షయి తన చిన్న కుమారుని తీసుకుని వచ్చేందుకు ఒకరిని పంపించాడు. ఈ కుమారుడు ఎర్రని తల వెంట్రుకలతో చక్కగా కనబడేవాడు. అతడు ఎర్రటివాడు మరియు చాలా అందగాడు. “లేచి అతనిని అభిషేకించు. అతడే సుమా!”అని యెహోవా సమూయేలుతో చెప్పాడు.

13 ప్రత్యేక నూనెతో ఉన్న కొమ్మును సమూయేలు తీసుకుని యెష్షయి చిన్న కుమారుని సోదరులందరి ఎదుటనే అతని మీద పోసాడు. ఆ రోజునుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి మహా శక్తివంతంగా వచ్చింది. తరువాత సమూయేలు రామాకు వెళ్లి పోయాడు.

14 యెహోవా ఆత్మ సౌలును విడిచి పెట్టేసాడు. యెహోవా సౌలు మీదికి ఒక దుష్టాత్మను పంపించాడు. అది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది.

15 సౌలు సేవకులు అతనితో ఇలా అన్నారు: “దేవుని వద్దనుండి వచ్చిన ఒక దుష్ట ఆత్మ వచ్చి నిన్ను బాధ పెడుతోంది.

16 మాకు ఆజ్ఞ ఇవ్వుము. సితారాను వాయించగలవాని కోసం వెదుకుతాము. యెహోవా దగ్గరనుండి ఆ దుష్ట శక్తి నీ మీదికి వస్తే ఇతడు సితారా వాయిస్తాడు. అప్పుడు ఆ దుష్ట ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తుంది. నీకు ఊరట కలుగుతుంది.”

17 “ఒక మంచి సితార వాయించువానిని చూసి నా దగ్గరకు తీసుకుని రండి” అని సౌలు తన సేవకులతో చెప్పాడు.

18 అప్పుడు నౌకర్లలో ఒకడు, “బేత్లెహేములో యెష్షయి అని ఒక మనిషి ఉన్నాడు. యెష్షయి కొడుకును నేను చూసాను. సితార వాయించటం అతనికివచ్చు. అతడు ధైర్యవంతుడు. బాగా పోరాడగలవాడు. కూడా. అతడు చాతుర్యంగలవాడు. అతడు అందగాడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.

19 కనుక సౌలు కొందరు మనుష్యులను యెష్షయి దగ్గరకు పంపించాడు. “నీకు దావీదు అనే కొడుకు ఉన్నాడు. అతడు గొర్రెలను కాస్తున్నాడు. అతనిని నా దగ్గరకు పంపించు” అని సౌలు చెప్పినదానిని వారు యెష్షయికి చెప్పారు.

20 కనుక యెష్షయి సౌలుకు కానుకలుగా కొన్ని వస్తువులు సిద్ధం చేసాడు. ఒక గాడిదను, కొంత రొట్టె, ఒక ద్రాక్షారసపు తిత్తి, ఒక మెక పిల్లను యెష్షయి సిద్ధం చేసాడు. యెష్షయి వాటిని దావీదుకు ఇచ్చి అతనిని సౌలు వద్దకు పంపించాడు.

21 కనుక దావీదు సౌలు దగ్గరకు వెళ్లి అతని ఎదుట నిలిచాడు. సౌలు దావీదును చాలా ప్రేమించాడు. దావీదు సౌలుకు ఆయుధాలు మోసే సహాయకుడయ్యాడు.

22 “దావీదును నాతో ఉండనియ్యి. నా సేవ చేయనియ్యి. అతడంటే నాకు చాలా ఇష్టం” అని యెష్షయికి ఒక సందేశం పంపాడు సౌలు.

23 దేవుడు పంపిన దురాత్మ సౌలు మీదికి వచ్చినపుడు దావీదు తన సితార తీసుకుని వాయించేవాడు. ఆ దుష్ట ఆత్మ సౌలును వదిలిపోయేది, అతనికి హాయిగా ఉండేది.

17

1 ఫిలిష్తీయులు వారి సైన్యాన్ని యుద్ధానికి సమీకరించారు. వారు యూదాలో శోకో అనేచోట సమావేశమయ్యారు. వారి శిబిరం ఏ ఫెస్దమ్మీము అనే పట్టణం వద్ద పెట్టారు. ఏఫెస్దమ్మీము అనే పట్టణం శోకోకు, అజేకాకు మధ్యగా వుంది.

2 సౌలు, మరియు ఇశ్రాయేలు సైన్యాలుకూడా సమావేశం అయ్యారు. ఏలా లోయలో వారి శిబిరం ఉంది. ఫిలిష్తీయులతో యుద్ధానికి సౌలు సైన్యం తయారయ్యింది.

3 ఫిలిష్తీయులు ఒక కొండమీద ఉన్నారు, ఇశ్రాయేలీయులు మరో కొండమీద ఉన్నారు. ఈ రెండు కొండల మధ్య లోయ ఉంది.

4 ఫిలిష్తీయులకు ఒక ప్రఖ్యాత వీరుడు ఉన్నాడు. వానిపేరు గొల్యాతు. వాడు గాతుకు చెందినవాడు. అతని ఎత్తు తొమ్మిది అడుగుల కంటె ఎక్కువ. గొల్యాతు ఫిలిష్తీయుల శిబిరంలో నుంచి బయటికి వచ్చాడు.

5 అతని తలమీద ఒక కంచుటోపీ ఉంది. కంచుతో చేసిన చేప పొలుసులవంటి కవచం అతడు ధరించాడు. ఈ కవచం కంచుతో చెయబడి నూట ఇరవై అయిదు పౌన్ల బరువు ఉంది.

6 గిల్యాతు కాళ్లకు రాగి కవచాలు ఉన్నాయి. కంచు ఈటె ఒకటి అతని మెడమీద కట్టబడి వుంది.

7 గొల్యాతు ఈటెకువున్న కర్రపిడి సాలెవాని మగ్గం వద్దవుండే దోనెలాగా వుంది. ఈటెకత్తి బరువు పది హేను “పౌన్లు .” గొల్యాతు డాలు మోసే భటుడు అతనికి ముందుగా నడిచాడు.

8 గొల్యాతు బయటకు వచ్చి ఇశ్రాయేలు సైనికులకు కేకవేసాడు: “మీ సైనికులు అందురూ యూద్ధానికి బారులు తీసారు ఎందుకు? మీరు సౌలు సేవకులు. నేను ఫిలిష్తీవాడిని. కనుక మీరు ఒకనిని ఎంపిక చేసుకొని నాతో పోరాడేందుకు వానిని పంపించండి.

9 వాడు గనుక నన్ను చంపితే ఫిలిష్తీయులందరు మీ సేవకులవుతారు. కానీ నేను గెలిచి మీవాడిని చంపితే, మీరంతా మాకు సేవకులు అవుతారు. అప్పుడు మీరు మాకు సేవ చేస్తారు!” అన్నాడు అతను.

10 “ఈ రోజు నేనిలా నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నాను! నాతో పోరాడటానికీ మీలో ఒకనిని పంపండి” అనికూడ ఆ ఫిలిష్తీయుడు అన్నాడు.

11 గొల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైనికులు విన్నారు. వారు చాలా భయపడ్డారు.

12 ఎఫాయుడైన యెష్షయి కుమారుడు దావీదు. యూదాలో ఉన్న బేత్లెహేముకు చెందినవాడు యెష్షయి. అతనికి ఎనమండుగురు కుమారులు. సౌలు కాలంలో యెష్షయి వృద్ధుడు.

13 యెష్షయి. యొక్క ముగ్గురు పెద్ద కుమారులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. పెద్ద కుమారుడు ఏలీయాబు. రెండవ కుమారుడు అబీనాదాబు. మూడవ కుమారుడు షమ్మా.

14 దావీదు అందరికంటె చిన్న కుమారుడు. పెద్ద కుమారులు ముగ్గురూ సౌలు సైన్యంలో ఉన్నారు.

15 కానీ దావీదు బేత్లెహేములోని తన తండ్రి గొర్రెలను కాసేందుకు అప్పుడప్పుడూ సౌలును వదిలి వెళ్లేవాడు.

16 ఫిలిష్తీయుడైన గొల్యాతు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బయటికి వచ్చి ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలబడేవాడు. ఇలా నలుబది రోజులు ఇశ్రాయేలీయులను గొల్యాతు ఎగతాళి చేసాడు.

17 ఒక రోజు యెష్షయి తన కుమారుడైన దావీదుతో ఇలా చెప్పాడు: “యుద్ధాల శిబిరంలో ఉన్న నీ అన్నలకు తూమెడు వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలు తీసుకుని వెళ్లు.

18 ఈ పది జున్ను ముక్కలు కూడ తీసుకుని వెళ్లి నీ సోదరులున్న వేయి మందిగల పటాలం అధికారికీ ఇయ్యి. నీ సోదరులు ఎలా వున్నారో తెలుసుకొని, వారి యోగక్షేమాలకు గుర్తుగా ఏదైనా తిరిగి తీసుకునిరా.

19 నీ సోదరులంతా ఇప్పుడు సౌలుతోనూ, ఇశ్రాయేలు సైన్యంతోనూ కలిసి ఏలా లోయలో ఉన్నారు. వారు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.”

20 దావీదు తెల్లవారు ఝామునే లేచి మరో కాపరికి మందను అప్పగించాడు. ఆహారపు మూటను తీసుకుని యెష్షయి చెప్పిన విధంగా బయలుదేరి వెళ్లాడు. దావీదు తన బండిని శిబిరం యొద్దకు తోలుకెళ్లాడు. దావీదు అక్కడికి వచ్చేటప్పటికి, సైనికులు వారి వారి యుద్ధ స్థావరాలకు వెళ్లుచూ ఉన్నారు. సైనికులు యుద్ధ నినాదాలు చేయటం మొదలుబెట్టారు.

21 ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు వారి వారి మనుష్యులను యుద్ధంలో సంధించటానికి సమీకరిస్తున్నారు.

22 ఆహార పదార్థాల అజమాయిషీ వహించే వ్యక్తివద్ద దావీదు తను తెచ్చిన ఆహార పదార్థాలను వుంచి, ఇశ్రాయేలు సైనికులు ఉన్న చోటికి పరుగెత్తాడు. తన సోదరులను గూర్చి దావీదు అడిగాడు.

23 దావీదు తన సోదరులతో సంభాషించటం మొదలుబెట్టాడు. అదే సమయానికి ఫిలిష్తీయుల పోరాట వీరుడు గాతీయుడైన గొల్యాతు ఫిలిష్తీ సైన్యంనుండి బయటకు వచ్చాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను మామూలు గానే కవ్వించే కేకలు వేసాడు. ఇది దావీదు విన్నాడు.

24 గొల్యాతును చూడగానే ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. అతడంటే వారందరికీ భయము.

25 ఇశ్రాయేలు మనుష్యుల్లో ఒకడు ఇలా అన్నాడు:”వాడిని మీరు చూసారా? చూడండి వానిని. గొల్యాతు మాటిమాటికీ బయటికి వచ్చి ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తున్నాడు. వానిని చంపినవానికి రాజు పుష్కలంగా డబ్బుఇస్తాడు. కనుక గొల్యాతును చంపినవాడు ధనవంతుడైపోతాడు; గొల్యాతును చంపినవానికి సౌలు తన కుమార్తెను కూడ ఇచ్చి వివాహము చేస్తాడు. ఇశ్రాయేలులో వాని కుటుంబాన్ని సౌలు స్వేచ్ఛగా ఉండనిస్తాడు.”

26 తన దగ్గర నిలబడిన మనుష్యులను దావీదు అడిగాడు, “ఈ ఫిలిష్తీవానిని చంపి ఇశ్రాయేలులో ఈ పరాభవాన్ని తొలగించిన వానికి బహుమానం ఏమిటి? ఇంతకూ ఈ గొల్యాతు ఎవడు? వాడు సున్నతి సంస్కారం కూడా లేనివాడు! వాడు కేవలం ఒక ఫిలిష్తీయుడే. జీవిస్తున్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అధికారం వానికి ఉందని వాడు ఎలా అనుకుంటున్నాడు?”

27 కనుక ఆ ఇశ్రాయేలువాడు, గొల్యాతును చంపినందుకు లభించే బహుమానం గూర్చి దావీదుకు చెప్పాడు.

28 దావీదు సైనికులతో మాట్లాడుతుండగా అతని పెద్ద అన్న ఏలీయాబు విన్నాడు. దావీదు మీద ఏలీయాబుకు కోపం వచ్చింది. “అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉన్న కొన్ని గొర్రెలను అరణ్యంలో ఎవరి దగ్గర వదిలి పెట్టావు? నాకు తెలుసు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో! చేయుమని చెప్పింది, చేయటం నీకు ఇష్టం లేదు. యుద్ధం చూడటానికే ఇక్కడికి రావాలనుకున్నావు” అంటూ ఏలీయాబు దావీదును నిలదీసాడు.

29 “ఇంతకూ నేనేం చేసాను? నేనేమి తప్పు చేయలేదే! నేను ఊరికే మాట్లాడుతున్నాను” అన్నాడు దావీదు.

30 దావీదు ఇంకొందరి వైపు తిరిగి మళ్లీ అవే ప్రశ్నలు వేశాడు. వారు కూడ ఇంతకు ముందు చెప్పిన సమాధానలే దావీదుకు చెప్పారు.

31 దావీదు పలికినది అంతా కొందరు సౌలుతో చెప్పారు. దావీదును తన దగ్గరకు తీసుకుని రమ్మని సౌలు వాళ్లకు ఆజ్ఞాపించాడు.

32 దావీదు, “ఎవ్వరినీ నిరుత్సాహ పడనియ్యవద్దు. నేను మీ సేవకుడిని. నేను వెళ్లి ఈ ఫిలిష్తీ వానితో పోరాడుతాను” అని సౌలుతో చెప్పాడు.

33 సౌలు, “నీవు ఈ ఫిలిష్తీ గొల్యాతును ఎదిరించి పోరాడలేవు. నీవు కనీసం ఒక సైనికుడివి కూడ కాదు. గొల్యాతు చిన్నప్పటి నుండీ యుద్ధంలో ఆరితేరిన వాడు” అని జవాబిచ్చాడు.

34 అయితే, “నీ సేవకుడనగు నేను నా తండ్రి గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా ఒక సింహంగాని, ఎలుగు బంటిగాని నా మంద మీది కొచ్చి ఒక గొర్రెను పట్టుకుంటే,

35 దానిని నేను తరిమి కొట్టేవాడిని. ఆ అడవి మృగాన్ని నేను ఎదిరించి, దాని నోటినుండి గొర్రెను రక్షించేవాడిని. ఒకవేళ అదే నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, దాన్ని చంపేసేవాడిని.

36 నేను ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటినీ చంపేసాను. అదే విధంగా సున్నతి సంస్కారం లేని ఆ పరాయి ఫిలిష్తీయుడిని నేను చంపేస్తాను. జీవిస్తున్న దేవుని సైన్యాన్ని గొల్యాతు ఎగతాళి చేసాడు గనుక వాడు చస్తాడు.

37 యెహోవా నన్ను సింహంనుండి, ఎలుగుబంటినుండి కాపాడాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతునుండి కూడ ఆ యెహోవాయే నన్ను రక్షిస్తాడు” అని దావీదు సౌలుతో చెప్పాడు. “అయితే వెళ్లు. యెహోవా నీకు తోడైయుండునుగాక!” అని దావీదుతో చెప్పాడు సౌలు.

38 సౌలు తన స్వంత వస్త్రాలను దావీదుకు ధరింపజేసాడు. దావీదు తలమీద ఒక కంచు శిరస్త్రాణం (టోపి), అతని వంటిమీద ఒక కవచం సౌలు పెట్టించాడు.

39 దావీదు ఒక కత్తి ధరించి అటు ఇటు నడవటానికి ప్రయత్నించాడు. సౌలు యుద్ధ వస్త్రాలను దావీదు ధరించటానికి ప్రయత్నించాడు. కానీ ఈ బరువులన్నీ ధరించటం దావీదుకు అలవాటు లేదు. అప్పుడు దావీదు, “ఇవన్నీ వేసుకుని నేను పోరాడలేను. వీటన్నిటికీ నేను అలవాటు పడలేదు,” అని సౌలుతో చెప్పి వాటన్నింటినీ విడిచి వేశాడు.

40 దావీదు తన చేతికర్ర తీసుకున్నాడు. లోయలో ఉన్న మంచి నునుపైన రాళ్లను ఐదింటిని దావీదు ఏరుకొన్నాడు. ఆ అయిదు రాళ్లను తన సంచిలో వేసుకున్నాడు. తన చేతిలో వడిసెలు పుచ్చుకొన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదురించేందుకు అతడు వెళ్లాడు.

41 ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచంమోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు.

42 గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు మాత్రమే.

43 గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు.

44 “ ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తాను” అంటూ దావీదు మీద కేకలు వేసాడు గొల్యాతు.

45 “నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు.

46 ఈ రోజు ఆ యెహోవా, నాచేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలానే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకొంటుంది.

47 ప్రజలను రక్షించాలంటే యోహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్కడున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు.

48 ఫిలిష్తీయుడైన గొల్యాతు దావీదు మీద పడటానికి మెల్లగా దగ్గరగా వెళ్లాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోటానికి వేగంగా పరుగెత్తాడు.

49 దావీదు తన సంచిలో నుంచి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి దానిని విసరికొట్టాడు. ఆ రాయి వడిసెల నుండి వెళ్లి గొల్యాతునుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తలలోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్క సారిగా నేలమీద బోర్ల పడిపోయాడు.

50 అలా దావీదు ఫిలిష్తీయుల యోధుణ్ణి కేవలం ఒక రాయి, వడిసెలతోనే ఓడించేసాడు. ఒక్క దెబ్బతో వానిని చంపేసాడు. దానదు చేతిలో కనిసు కత్తికూడ లేదు.

51 కనుక దావీదు పరుగున పోయి పడివున్న గొల్యాతు పక్కన నిలబడ్డాడు. తరువాత దావీదు గొల్యాతు ఒరలోవున్న కత్తిని లాగి దానితోనే గొల్యాతు తలను నరికివేశాడు. అలా దావీదు ఫిలిష్తీయుల వీరుని హతమార్చాడు. ఎప్పుడయితే తమ వీరుడు చావటం మిగతా ఫిలిష్తీయులు చూసారో అప్పుడు వెనుదిరిగి పారిపోయారు.

52 ఇశ్రాయేలు, యూదా సైనికులు జయజయధ్వనులు చేస్తూ ఫిలిష్తీయుల సైనికులను గాతు నగర సరిహద్దుల వరకు, ఎక్రోను నగర ద్వారం వరకు తరిమి తరమి కొట్టారు. చాలామంది ఫిలిష్తీయులను వారు చంపేసారు. వారి శవాలు షరాయిము బాటపైగాతు, ఎక్రోనుల వరకు అంత దూరమూ పడివున్నాయి.

53 ఫిలిష్తీయుల సైన్యాన్ని వెళ్లగొట్టి వచ్చి, ఇశ్రాయేలు సైనికులు ఫిలిష్తీయుల గుడారాల నుంచి చాలా వస్తు సంపదను తీసుకున్నారు.

54 గొల్యాతు తలను దావీదు యెరూషలేముకు తీసుకుని వెళ్లాడు. ఆ ఫిలిష్తీయుల యోధుని ఆయుధాలను కూడా దావీదు తన గుడారములో పెట్టాడు.

55 దావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును పిలిచి, “ఆ కుర్రవాని తండ్రి ఎవరని” అడిగాడు. “మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” అన్నాడు అబ్నేరు. 56సౌలు, “ఆ కుర్రవాని తండ్రి ఎవరో తెలుసుకో” అన్నాడు.

56 [This verse may not be a part of this translation]

57 [This verse may not be a part of this translation]

58 [This verse may not be a part of this translation]

18

1 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, యోనాతాను దావీదుకు చాలా సన్నిహితుడయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు.

2 సౌలు ఆ రోజు నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. దావీదును ఊరిలోవున్న తన తండ్రి వద్దకు సౌలు పోనీయలేదు.

3 యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎందువల్లనంటే, దావీదు అంటే యోనాతానుకు ఎనలేని ప్రేమ.

4 యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబలు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.

5 సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి అతనిని సైన్యాధికారిగా సౌలు నియమించాడు. దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధికారులు కూడ సంతేషించారు.

6 దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలోని వివిధ పట్టణాల స్త్రీలు అందరూ దావీదును కలుసుకొనేందుకు బయటకు వచ్చారు. వారు వీణారాగాలతోను, మృదంగతాళ ధ్వనులతోను దావీదు ఎదుట చిరునవ్వులతో నాట్యం చేసారు. ఇదంతా వారు సౌలు యెదుటనే చేసారు.

7 “సౌలు వేల కొలదిగాను హతము చేసెననియు దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు” స్త్రీలంతా జయగీతిక పాడారు.

8 స్త్రీల పాట సౌలును కలవర పెట్టింది. అతనికి చాలా కోపం వచ్చింది. “తాను వేలమందిని మాత్రమే చంపానని దావీదు పదివేల మందిని చంపాడని స్త్రీలు చెబతున్నారే” అని సౌలు పరి పరి విధాల ఆలోచనచేశాడు.

9 అప్పటినుండి సౌలు దావీదును ఒక కంట కనిపెడుతూ వచ్చాడు.

10 ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్పటిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సౌలు చేతిలో ఒక బల్లెం ఉంది.

11 “దావీదును గోడకు గుచ్చి వేయాలని సౌలు” తలచాడు. రెండుసార్లు సౌలు బల్లెం విసరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు.

12 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా సౌలును వదిలివేశాడు. అందువల్ల దావీడు అంటే సౌలుకు భయంవేసింతి

13 సౌలు తన దగ్గరనుండి దావీదును పంపివేసాడు. సౌలు దావీదును వెయ్యిమంది సైనికులకు అధిపతిగా చేసాడు. ఆ సైనికులను దావీదు యుద్ధానికి నడిపించాడు.

14 యెహోవా దావీదుతో ఉన్నాడు గనుక, దావీదు ఏది చేసినా విజయాన్నే సాధిస్తూవచ్చాడు.

15 దావీదు చాలా విజయం సాధిస్తున్నట్టు సౌలు గమనించాడు. దానితో సౌలుకు దావీదు అంటే భయం ఇంకా ఎక్కువయ్యింది.

16 కానీ ఇశ్రాయేలు, యూదా ప్రజలు అందరూ దావీదును ఎక్కువగా ప్రేమించారు. కారణం వారిని యుద్ధంలో దావీదు అతిచాకచక్యంగా నడిపించుటచేత.

17 (కానీ సౌలు దావీదును చంపాలని కోరాడు. దావీదును మోసం చేయటానికి ఒక పథకం వేసాడు). సౌలు, “ఇదిగో నా పెద్ద కుమార్తె మేరబు. నీవు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత నీవు మంచి శక్తిగల సైనికుడివి కావచ్చు. నీవు నాకు ఒక కొడుకులా ఉంటావు. అప్పుడు నీవు వెళ్లి, యెహోవా పక్షంగా యుద్ధాలు చేయి” అని దావీదుతో చెప్పాడు. (ఇది ఒక పన్నాగము). వాస్తవానికి సౌలు, “ఇప్పుడు దావీదును నేనేమీ చంపక్కర్లేదు. నా కోసం ఫిలిష్తీయులే అతనిని చంపుతారులే” అని తలచాడు.

18 అందుకు దావీదు, “మాది గొప్ప కుటుంబంకాదు, నేను గొప్ప వ్యక్తినీ కాను. కనుక నేను రాజుగారి అమ్మాయిని పెళ్లాడలేను” అని అన్నాడు.

19 అందుచేత మేరబు దావీదును పెళ్లి చేసుకొనే సమయం వచ్చేసరికి, సౌలు ఆమెను మెహోలతీవాడైన అద్రియేలు అనేవానికిచ్చి వివాహము చేసాడు.

20 సౌలు యొక్క మరో కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. మీకాలు దావీదును ప్రేమించినట్టు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని సౌలు సంతోషించాడు.

21 “మీకాలు దావీదును వివాహ మాడటానికి నేను అంగీకరిస్తాను. దావీదును ఉచ్చులో పెట్టేందుకు నేను మీకాలును వినియోగించుకుంటాను. అప్పుడు దావీదును ఫిలిష్తీయుల చేతనే చంపిస్తాను” అనుకొన్నాడు సౌలు. కనుక సౌలు రెండవ సారిగా దావీదుతో, “ఈ వేళ నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు” అని చెప్పాడు.

22 సౌలు తన అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు. “దావీదుతో ఆంతరంగికంగా,’రాజుకు నీవంటే చాలా ఇష్టం ఆయన అధికారులకు కూడా నీవంటే ఇష్టం నీవు అతని కుమార్తెను పెళ్లి చేసుకో’ అని చాటుగా దావీదుకు చెప్పండి” అని సౌలు వారితో అన్నాడు.

23 సౌలు అధికారులు అలాగే దావీదుతో చెప్పారు. అది విన్న దావీదు, “రాజుగారి అల్లుడు కావటమంటే అంత తేలికైన పని అనుకుంటున్నారా? (రాజుగారి కుమార్తెకు కట్నం ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులేదు.) నేను సామాన్య నిరుపేదను” అని దావీదు జవాబిచ్చాడు.

24 తిరిగి సౌలు అధికారులు దావీదు చెప్పినదంతా సౌలుకు వివరించారు.

25 మళ్లీ సౌలు వారితో, “దావీదు కట్నం చెల్లించనక్కరలేదనీ, కేవలం ఒక వందమంది ఫిలిష్తీయుల సున్నతి చర్మాలను తెస్తే చాలనీ చెప్పండి దానితో సౌలు తన శత్రువుల మీద పగ తీర్చుకున్నట్లవుతుందని చెప్పండి” అన్నాడు. ఈ పని చేస్తే ఫిలిష్తీయులు దావీదును చంపుతారని సౌలు రహస్య పథకం.

26 సౌలు అధికార్లు మళ్లీ దావీదుకు ఈ విషయం చెప్పారు. దావీదు సౌలు అల్లుడు కావటానికి ఇష్టపడ్డాడు. కనుక అతడు వెంటనే పనికి పూనుకున్నాడు.

27 దావీదు తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను తీసుకుని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్లుడు కావాలని కోరి దావీదు ఇలా చేసాడు. అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును పెండ్లి చేసుకోనిచ్చాడు.

28 అప్పుడు కూడా యెహోవా దావీదుతో ఉన్నాడని సౌలు అవగాహన చేసుకున్నాడు. పైగా తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమస్తూ ఉందని తెలుసుకున్నాడు.

29 దానితో సౌలుకు దావీదు అంటే భయం ఎక్కువయ్యింది. ఆ విధంగా సౌలు దావీదుకు ఎల్లప్పుడూ విరోధంగా ఉండిపోయాడు.

30 ఫిలిష్తీయుల సేనాధిపతులు మాత్రం ఇశ్రాయేలీయులపై తమ దండ్రయాత్రలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారీ దావీదు వారిని ఓడిస్తూనే ఉన్నాడు సౌలు కిందవున్న అధికారులందరిలో దావీదు చాలా ఉత్తమ అధికారి. అందువల్ల దావీదు చాలా ప్రసిద్ధిలోకి వచ్చాడు.

19

1 దావీదును చంపి వేయుమని సౌలు తన కుమారుడైన యోనాతానుకు, మిగిలిన అధికారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు.

2 యోనాతాను దావీదును హెచ్చరించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి వెళ్లి అక్కడ దాగి వుండు.

3 నేను నా తండ్రితో ఆ పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను మాట్లాడతాను. తరువాత నేను తెలుసు కున్నదంతా నీకు చెబతాను” అని యోనాతాను దావీదుతో చెప్పాడు.

4 యోనాతాను తన తండ్రి సౌలుతో మాట్లాడుతూ దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయలేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు.

5 దావీదు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. దాని ద్వారా యెహోవా ఇశ్రాయేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటువంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన కారణమే లేదు” అని అన్నాడు.

6 యోనాతాను చెప్పినదంతా విని సౌలు ఒక ప్రమాణం చేసాడు. “యెహోవా సజీవంగా ఉన్నాడు అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు సౌలు.

7 కనుక యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతా అతనితో చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి దావీదు మొదట్లోలాగే సౌలు దగ్గర ఉన్నాడు.

8 మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమికొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు.

9 కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చునివున్నాడు. సౌలు చేతిలో అతని ఈటెవుంది. దావీదు సితార వాయిస్తూ ఉన్నాడు.

10 సౌలు తన ఈటెను దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈటెను దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పిగోడలోకి దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు.

11 సౌలు తన మనుష్యులను దావీదు ఇంటికి పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయత్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉదయమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది.

12 అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారి పోయాడు.

13 మీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది.

14 దావీదును బంధించమని సౌలు తన సైనికులను పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” మీకాలు చెప్పింది.

15 ఈ విషయం తన మనుష్యులు చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” అని ఆ మనుష్యులతో సౌలు చెప్పాడు.

16 సౌలు మనుష్యులు దావీదు కోసం మళ్లీ దావీదు ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు.

17 “ఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు మీకాలును అడిగాడు. “తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” మీకాలు జవాబు ఇచ్చింది.

18 దావీదు సౌలు బారి నుండి తప్పించుకుని రామాలోవున్న సమూయేలు వద్దకు వెళ్లాడు. సౌలు తన పట్ల చేసినదంతటినీ దావీడు సమూయేలుకు చెప్పాడు. తరువాత దావీదు, సమూయేలు కలిసి ప్రవక్తల గుడారాలకు వెళ్లారు. దావీదు అక్కడే ఉండి పోయాడు.

19 రామాలో వున్న గుడారాలలో దావీదు ఉంటున్నట్లు సౌలు విన్నాడు.

20 దావీదును బంధించి తీసుకుని రావలసిందిగా సౌలు మనుష్యులను పంపాడు. కానీ వారు ఆ గుడారాలకు వచ్చేసరికి అక్కడ ప్రవక్తల గుంపు ఒకటి ప్రవచిస్తూ ఉండటం కనబడింది. సమూయేలు ఆ ప్రవక్తలకు నాయకత్వం వహించి ఉన్నాడు. దేవుని ఆత్మ సౌలు పంపిన మనుష్యుల మీదికి రాగావారు కూడ దేవుని విషయాలు చెప్పనారంభించారు.

21 ఈ వార్త సౌలు వరకూ పోయింది. అతను మరి కొంతమంది మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. కనుక మూడవసారి మళ్లీ సౌలు మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు.

22 చివరికి సౌలు స్వయంగా బయలుదేరి రామా చేరుకున్నాడు. సేఖూలో ఒక నూర్పిడి కళ్లము దగ్గరవున్న పెద్ద బావి వద్దకు సౌలు వచ్చాడు. “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారని” సౌలు అక్కడున్న వారిని అడిగాడు. “రామాదగ్గర ఉన్న నాయోతులో ఉన్నారని” వాళ్లు జవాబు చెప్పారు.

23 అప్పుడు సౌలు రామా దగ్గర్లో వున్న నాయోతుకు వెళ్లాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి కూడ రావటంతో అతను దేవుని విషయాలు చెబుతూ ముందుకు నడిచాడు. రామాలో వున్న నాయోతుకు వెళ్లేవరకు సౌలు మరింత ఎక్కువగా దేవుని విషయాలు చెబతూనే ఉన్నాడు.

24 అప్పుడు సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు. ఆ కారణం చేతనే, “సౌలుకూడ ప్రవక్తల్లో ఒకడు అయ్యాడా?” అని ప్రజలు అనుకోవటం మొదలయ్యింది.

20

1 దావీదు రామాలో వున్న నాయోతునుంచి పారిపోయాడు. తిన్నగా యోనాతాను వద్దకు వెళ్లి, “నేనేమి తప్పు చేశాను? నా నేరం ఏమిటి? నీ తండ్రి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు?” అని అడిగాడు.

2 అది విన్న యోనాతాను ఇలా అన్నాడు, “నా తండ్రి నిన్ను చంపటానికి ప్రయత్నం చేయటం లేదు. నా తండ్రి ముందుగా నాకు చెప్పకుండా ఏ పనీచేయడు. అది అతి ముఖ్యమైన పనిగాని, లేక అతి స్వల్పమైన విషయంగాని మా తండ్రి ఎప్పుడూ నాకు చెబతాడు. ఆయన నిన్ను చంపాలనే తన ఆలోచనను నాకెందుకు చెప్పకుండా ఉంటాడు? లేదు. అది నిజం కాదు!”

3 కానీ దావీదు, “నేను నీ స్నేహితుడనని నీ తండ్రికి బాగా తెలుసు. యోనాతానుకు ఈ విషయం తెలియకూడదు అతనికి తెలిస్తే దావీదుకు చెప్పేస్తాడు అని నీ తండ్రి అనుకుని ఉంటాడు. దేవుడు జీవిస్తున్నాడు అన్నంత నిజంగా, నీవు జీవుస్తున్నావన్నంత నిజంగా నేను మృత్యువుకు చాలా చేరువలో ఉన్నాను.” అని జవాబిచ్చాడు.

4 యోనాతాను, “సరే, ఇప్పుడు నీవు ఏమి చేయమంటే అది నేను చేస్తాను” అని దావీదుతో అన్నాడు.

5 అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమావాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసివుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో దాగివుండనీ.

6 నేను రాలేదని నీ తండ్రి గమనించినపుడు ‘దావీదు తన స్వగ్రామమైన బేత్లెహేముకు వెళ్లాలని కోరాడు. ఈ నెలసరి బలి అర్పణకు అతని కుటుంబంవారు స్వంతంగా విందు చేసుకోవాలని కోరారు. కనుక దావీదు తన కుటుంబంతో కలసి ఉండేందుకు తనను వెళ్లనివ్వాల్సిందిగా నన్ను అడిగాడు’ అని నీ తండ్రికి చెప్పు అన్నాడు.

7 ‘సరే మంచిది’ అని మీ తండ్రి అంటే నేను హాయిగా ఉన్నట్లే. కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం నాకు కీడు చేస్తాడని నీవు నమ్మవచ్చు.

8 యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు.

9 యోనాతాను, “లేదు ఎప్పటికీ అలా జరగదు! నా తండ్రి నీకు కీడు తలపెడితే నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు.

10 దావీదు, “నీ తండ్రి నిన్ను తిడితే అది నాకెవరు తెలియజేస్తారు?” అన్నాడు.

11 అప్పుడు యోనాతాను, “అయితే, రా! మనం పొలంలోకి వెళదాము” అని అనగా యోనాతాను, దావీదు కలిసి పొలంలోకి వెళ్లారు.

12 యెనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రి నీ విషయంలో ఏ తలంపుతో ఉన్నాడో తెలుసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ల ఆయన వైఖరి బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను.

13 నా తండ్రి గనుక నీకు కీడు తలపెడితే, అది నీకు తెలియపర్చి, నిన్ను క్షేమంగా వెళ్లిపోనిస్తాను. ఇది నేను చేయకపోతే యెహోవా నన్ను శిక్షించునుగాక! యెహోవా నా తండ్రికి తోడై యున్నట్లు, నీకు కూడ తోడైవుండునుగాక!

14 నేను జీవించినంత కాలం, నా మీద దయచూపించు. నేను మరణించాక

15 నా కుటుంబంపట్ల నీ దయాదాక్షిణ్యాలు చూపించటం ఎన్నడూ మానవద్దు. ఈ భూమి మీద నీ శత్రువుల నందరినీ యెహోవా నాశనం చేయునుగాక!

16 ఆ సమయంలో యోనాతాను కుటుంబం దావీదునుండి వేరు చేయబడాల్సి వస్తే, అలాగే జరుగనివ్వు. దావీదు శత్రువులను యెహోవా శిక్షించునుగాక!”

17 అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.

18 “రేపు అమావాస్య విందుగదా! అక్కడ నీ స్థానం ఖాళీగా వుంటుంది. కనుక నా తండ్రి నీవు రాలేదని గమనిస్తాడు.

19 ఈ కష్టాలన్నీ ప్రారంభమైనప్పుడు నీవు ముందుగా ఎక్కడ దాగివున్నావో అక్కడికే మూడవ రోజున కూడ నీవు వెళ్లు. అక్కడ కొండ పక్కన వేచివుండు.

20 మూడవ రోజున కొండ పక్కగా నేనొక గురిని బాణంతో కొడుతున్నట్టు నేను నటిస్తాను. నేను కొన్ని బాణాలు వదులుతాను.

21 అప్పుడు ఆ వదిలిన బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. వానితో నేను ‘మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు అక్కడ నాకు దగ్గర్లోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి వాటిని తీసుకొనిరా’ అని చెబతాను. నేను గనుక అలా చెబితే అప్పుడు నీవు బయటకి రావచ్చు. యెహెవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు.

22 కానీ ఒకవేళ ఏదైనా తొందర ఉంటే, ‘బాణాలు చాలా దూరంగా ఉన్నాయి. వెళ్లి వాటిని తీసుకురా’ అని ఆ కుర్రవానితో నేను అంటాను. నేను గనుక అలా చెబితే నీవు తప్పక పారిపోవల్సిందే. అంటే యెహోవా నిన్ను దూరంగా పంపుతున్నాడన్న మాట.

23 మనిద్దరి మధ్యవున్న ఈ ఒడంబడిక జ్ఞాపకం ఉంచుకో. యెహోవా మనకు శాశ్వతంగా సాక్షి” అని యోనాతాను దావీదుకు చెప్పాడు.

24 అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్య విందు సమయం వచ్చింది. రాజు భోజనం చేయటానికి కూర్చున్నాడు.

25 మామూలుగా కూర్చునే చోటులో గోడ దగ్గరగా రాజు కూర్చున్నాడు. సౌలుకు ఎదురుగా యోనాతాను కూర్చున్నాడు. సౌలుకు పక్కగా అబ్నేరు కూర్చున్నాడు. కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది.

26 ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా జరిగివుండవచ్చు; లేదా మైలపడి ఉండవచ్చు” అనుకున్నాడు.

27 కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు.

28 “బేత్లెహేము వెళ్లనిమ్మని దామీదు నన్ను అడిగాడు.

29 అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు.

30 సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు.

31 యెష్షయి కుమారుడు బతికి ఉన్నంత వరకూ నీవు రాజు కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు చచ్చిన వారితో సమానము!” అన్నాడు సౌలు.

32 “దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని అడిగాడు.

33 సౌలు తన ఈటెను యోనాతాను మీదికి విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. దానితో తన తండ్రి నిజంగానే దావీదును చంపాలని తల పెట్టాడని యోనాతానుకు అర్థమయ్యింది.

34 యోనాతానుకు విపరీతంగా కోపం వచ్చింది. భోజనాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు కూడ ఏమీ భోజనంచేయటానికి ఒప్పుకోలేదు. సౌలు తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు.”

35 ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకుని వెళ్లాడు.

36 “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకునిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు.

37 బాణాలు పడిన చోటుకి బాలడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు.

38 “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకుని తన యజమాని వద్దకు తెచ్చాడు.

39 ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు.

40 యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పొమ్మ”ని చెప్పాడు.

41 ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్కతాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు.

42 “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంతో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.

21

1 తరువాత దావీదు వెళ్లిపోయాడు. యోనాతాను తిరిగి పట్టణానికి వెళ్లాడు.

2 అహీమెలెకు అనే యాజకుని చూడటానికి దావీదు నోబు పట్టణానికి వెళ్లాడు. దావీదును చూడగానే అహీమెలెకు భయంతో వణకిపోయాడు. “నీవు ఒంటరిగా ఎందుకున్నావు? నీకు తోడుగా ఎవ్వరూ ఎందుకు లేరు?” అని అహీమెలెకు దావీదును అడిగాడు.

3 దావీదు అహీమెలెకుతో, “రాజు నాకు ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. తాను ఏ పనిమీద నన్ను పంపిస్తున్నాడో అది వేరెవ్వరికీ తెలియ కూడదన్నాడు. నన్ను ఏమి చేయమని ఆయన చెప్పాడో అది ఎవ్వరికీ తెలియకూడదని ఆయన ఆజ్ఞ. నన్ను ఎక్కడ కలవాలో నా మనుష్యులకు నేను చెప్పాను.

4 ఇప్పుడు నీవద్ద ఏమైన ఆహారం ఉన్నదా? నాకు ఐదు రొట్టెలు లేదా ఏది ఉంటే అది ఇవ్వు” అని చెప్పాడు.

5 “తనవద్ద మాములు రొట్టెలేవీ లేవనీ, కేవలం ప్రతి ష్ఠితంగా దేవుని సన్నిధిలో ఉంచిన రొట్టెలు కొంత వున్నాయనీ, తన పరివారమంతా స్త్రీలకు దూరంగా వున్న వారైతే వారు ఈ రొట్టె తినవచ్చనీ” యాజకుడు దావీదుతో అన్నాడు.

6 అది విన్న దావీదు, “మేము ఏ స్త్రీలతోను ఉండలేదు. మేము యుద్ధానికి వెళ్లినప్పుడల్లా, అలాగే మాములు పనులు చేసేటప్పుడు కూడ నా మనుష్యులు తమ శరీరాలను పవిత్రంగా ఉంచు కుంటారు. ఇప్పుడు మేము బయలుదేరిన మా పని ఎంతో పవిత్రమైనది కనుక ఈ వేళ ఇది మరింత సత్యం” అన్నాడు.

7 పవిత్ర రొట్టె తప్ప మరొకటి లేక పోవటంతో యాజకుడు దావీదుకు దానినే ఇచ్చాడు. యాజకులు యెహోవా ఎదుట పీఠంపై ఆరగింపుగా ఉంచే రొట్టె ఇది. ప్రతి రోజూ వారు ఈ రొట్టెను తీసివేసి మళ్లీ కొత్త రొట్టెను దాని స్థానంలో ఉంచుతారు.

8 సౌలు అధికారులలో ఒకడు ఆ రోజున ఇక్కడ ఉన్నాడు. వాని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. వాడు అక్కడ యెహోవా ఎదుట ఉంచబడ్డాడు. దోయేగు సౌలు యొక్క గొర్రెల కాపరులకు నాయకుడు.

9 యాజకుడైన అహీమెలెకును, “ఒక ఈటెగాని, కత్తిగాని అక్కడ ఉన్నదా అని దావీడు అడిగాడు. రాజుపని అతి ముఖ్యమైనదని, తను త్వరగా వెళ్లవలసి ఉందనీ, తాను కత్తిగాని మరి ఏ ఇతర ఆయుధంగాని తేలేదనీ చెప్పాడు.”

10 ఫిలిష్తీయుడైన గొల్యాతు ఆయుద్ధం ఒక్కటే ఇక్కడ ఉందని యాజకుడు చెప్పాడు. “ఏలా లోయలో నీవు వానిని చంపినప్పుడు వాని దగ్గర నీవు తీసుకున్న ఖడ్గం అది. ఆ ఖడ్గం ఒక బట్టలో చుట్టబడి ఏఫోదు అంగీ వెనుక ఉంచబడింది కావాలంటే అది నీవు తీసుకోవచ్చు” అని అహీమెలెకు అన్నాడు. “గొల్యాతు కత్తికి మించిన కత్తిలేదు. దానిని నాకు ఇవ్వుము” అన్నాడు దావీదు.”“‘“‘

11 ఆ రోజు సౌలు నుంచి దావీదు అలా పారిపోయాడు. గాతు రాజైన ఆకీషు వద్దకు దావీదు వెళ్లాడు.

12 కానీ ఆకీషు అధికారులకు అది నచ్చలేదు. వారు ఆయనతో ఇలా అన్నారు: “ఇతని పేరు దావీదు. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఇశ్రాయేలీయులు పాటలు పాడేది ఇతనిని గూర్చే. అతనికోసం వారు పాటలు పాడి నాట్యం చేస్తారు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఈ పాట పాడతారు: “సౌలు వేల కొలదిగా హతము చేసాడు! దావీదు పది వేల కొలదిగా హతము చేసాడు!!”

13 ఈ మాటలను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు గాతు రాజైన ఆకీషును గూర్చి దావీదు చాలా భయపడ్డాడు.

14 అందువల్ల ఆకీషు ముందు, అతని సిబ్బంది ముందు దావీదు పిచ్చి పట్టిన వానిలా నటించుట మొదలు పెట్టాడు . అక్కడున్నంత సేపూ దావీదు పిచ్చివానిలా ప్రవర్తించాడు. మార్గపు తలుపుల మీద అతడు ఉమ్మి వేశాడు. తన ఉమ్ము తన గడ్డం మీద పడేటట్టు ఉమ్మేసాడు.

15 ఆకీషు, “ వీని వైపుపు చూడండి! వీడు పిచ్చివాడు! వీడిని నా వద్దకు ఎందుకు తిసుకుని వచ్చారు?

22

1 దావీదు గాతును వదిలి అదుల్లాము గుహలలోకి పారిపోయాడు. అదుల్లాము గుహలో దావీదు ఉన్నట్లు అతని సోదరులు, బంధువులు విన్నారు. దావీదును చూడటానికి వారక్కడికి వెళ్లారు.

2 చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిసి వారు మొత్తం నాలుగు వందలమంది.

3 దావీదు అదుల్లాము గుహ వదిలి మోయాబులో ఉన్న మిస్పాకు వెళ్లాడు. “దేవుడు నాకు ఏమి చేయనున్నాడో నేను తెలుసుకునే వరకు దయచేసి నా తల్లి దండ్రులను వచ్చి నీతో ఉండనియ్యి” అని దావీదు మోయాబు రాజును అడిగాడు.

4 దావీదు తన తల్లి దండ్రులను మోయాబు రాజువద్ద వదిలి పెట్టాడు. దావీదు కొండలలో దాగి ఉన్నంత కాలం అతని తల్లిదండ్రులు మోయాబు రాజుతోనే ఉన్నారు.

5 [This verse may not be a part of this translation]

6 [This verse may not be a part of this translation]

7 సౌలు తన చుట్టూవున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యులారా వినండి! యెష్షయి కుమారుడు దావీదు మీ అందరికీ భూములు, ద్రాక్షతోటలు ఇస్తాడని మీరను కుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస్ర సైన్యాధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అని అడిగాడు.

8 “మీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనాతాను యెష్షయి కుమారునితో ఒడంబడిక చేసుకున్నట్లు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి మీలో ఒక్కనికీ శ్రద్ధలేదు! దావీదును నా కుమారుడు యోనాతాను ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” అని అన్నాడు.

9 ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలె కును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను.

10 దావీదు కొరకు అహీమెలెకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అహీమెలెకు దావీదుకు ఇవ్వటం నేను చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు.

11 అది విన్న సౌలు అహీటూబు కుమారుడు, యాజకుడైన అహీమెలెకును, అతని బంధువుల నందరినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలెకు బంధువులంతా నోబులో యాజకులు. వారంతా రాజువద్దకు వచ్చారు.

12 “అహీటూబు కుమారుడా, విను” అని సౌలు అహీమెలెకుతో అన్నాడు. “చెప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు.

13 “నీవూ, యెష్షయి కుమారుడైన దావీదూ కలిసి నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు దావీదుకు రొట్టె, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలెకుతో సౌలు.

14 అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వసంగా ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్థుడు నీ అధికారులలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్లుడు. పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సొంత కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది.

15 నేను దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటి సారికాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు” అని జవాబిచ్చాడు.

16 కానీ రాజు, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు అంతా చావాల్సిందే!” అన్నాడు.

17 అప్పుడు రాజు తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి తెలుసు. అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అని చెప్పాడు. రాజభటులు యెహోవా యాజకులకు హాని చేసేందుకు నిరాకరించారు.

18 అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. ఆ రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు.

19 నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి వశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ దోయేగు చంపేసాడు.

20 అయితే అబ్యాతారు తప్పించుకున్నాడు. ఇతడు అహీటూబు మనుమడు. అంటే అహీమెలెకు కుమారుడు. అబ్యాతారు పారిపోయి దావీదును కలుసుకొన్నాడు.

21 సౌలు, యెహోవా యాజకులనందకినీ చంపిన విధమంతా అబ్యాతారు దావీదుకు చెప్పాడు.

22 “ఎదోమీయుడగు దోయేగును ఆ రోజు నోబులో నేను చూసాను, వాడు సౌలుకు తప్పనిసరిగా చెబుతాడని నాకు తెలుసును, కాని నీ తండ్రి కుటుంబం అంతా చనిపోవటానికి నేనే కారకుడను.

23 నిన్ను చంపాలనుకొనే సౌలు నన్నూ చంపాలనుకుంటున్నాడు. నీవు నాతోనే ఉండు. భయపడవద్దు. నాతో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు” అని దావీదు అబ్యాతారుతో అన్నాడు.

23

1 అక్కడి ప్రజలు దావీదుతో, “ఫిలిష్తీయులు కెయీలా రాజ్యంపై యుద్ధం చేస్తున్నారనీ, నూర్చెడి కళ్లాలనుండి ధాన్యాన్ని కొల్ల గొడుతున్నార”నీ చెప్పారు.

2 “నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా?” అని దావీదు యెహోవాని అడిగాడు. “వెళ్లుము ఫిలిష్తీయులను ఎదుర్కొని కెయీలాను కాపాడు.” అని యెహోవా దావీదుకు సమాధాన మిచ్చాడు.

3 కాని దావీదు మనుష్యులు, “మనము యూదాలోనే ఉండి భయపడి పోతున్నాము. ఇక ఫిలిష్తీయుల సైన్యంవున్న చోటికి వెళితే మా భయానికి అంతువుండదు” అన్నారు.

4 దావీదు మళ్లీ యెహోవాను అడిగాడు. యెహోవా, “కెయీలాకు వెళ్లుము ఫిలిష్తీయులను జయించటానికి నేను నీకు సహాయం చేస్తాను” అని దావీదుకు జవాబిచ్చాడు.

5 అప్పుడు దావీదు తన మనుష్యులతో కెయీలాకు వెళ్లాడు. దావీదు మనుష్యులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారి పశువులను పట్టుకున్నారు. దావీదు ఫిలిష్తీయులను చిత్తుగా ఓడించి వారి బారినుండి కెయీలా ప్రజలను రక్షించాడు.

6 (అహీమెలెకు కుమారుడు అబ్యాతారు దావీదు వద్దకు పారిపోయినప్పుడు తనతో ఏఫోదు అనబడే యాజకుల అంగీనొక దానిని తీసుకుని వెళ్లాడు).

7 దావీదు కెయీలాలో ఉన్నట్లు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని, “దేవుడు దావీదును నాకిచ్చినట్టే! దావీదు తనకు తాను బోనులో పడ్డాడు. ఎందువల్ల నంటే అతను చుట్టూ ద్వారాలు కటకటాలు ఉన్న పట్టణంలో ప్రవేశించాడు” అన్నాడు సౌలు.

8 సౌలు తన సైన్యాన్ని సమీకరించుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదును, అతని అనుచరులను ఎదిరించటానికి సౌలు సైన్యం కెయీలాకు వెళ్లేందుకు తయారయింది.

9 తన మీద సౌలు పన్నాగం పన్నుతున్నాడని దావీదు తెలుసుకున్నాడు. “ఏఫోదు తీసుకురా” అని దావీదు అబ్యాతారుకు చెప్పాడు.

10 దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలీయుల యెహోవా దేవా! నా మూలంగా సౌలు కెయీలా పట్టణానికి వచ్చి దానిని నాశనం చేయ సంకల్పించాడని విన్నాను.

11 సౌలు కెయీలాకు వస్తాడా?కెయీలా ప్రజలు నన్ను సౌలుకు అప్పగిస్తారా? ఇశ్రాయేలీయుల యెహోవా దేవా, నేను నీ సేవకుడను! దయచేసి నాకు చెప్పు”

12 దావీదు, “కెయీలా ప్రజలు నన్ను, నా మనుష్యులను సౌలుకు అప్పగిస్తారా?” అని మళ్లీ అడిగాడు. “అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.

13 అది విన్న దావీదు తన మనుష్యులతో కెయీలా వదిలి వెళ్లిపోయాడు. దావీదుతో ఆరువందల మంది వెళ్లారు. ఒక చోటనుండి మరొక చోటికి వారు తరలిపోయారు. దావీదు కెయీలానుండి తప్పించుకున్నాడని విన్న సౌలు కెయీలా నగరానికి వెళ్లలేదు.

14 దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీఫు అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి రోజూ సౌలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయలేదు.

15 జీఫు అరణ్యంలో హోరేషు వద్ద ఉన్నాడు దావీదు. సౌలు తనను చంపటానికి వస్తున్నాడని భయపడ్డాడు.

16 కానీ సౌలు కుమారుడు యోనాతాను హోరేషులో ఉన్న దావీదును చూడటానికి వెళ్లాడు. యోనాతాను దావీదుకు యెహోవా మీద దృఢవిశ్వాసం కలిగేందుకు సహాయం చేసాడు.

17 యోనాతాను, “భయపడకు, నా తండ్రి సౌలు నిన్ను తాకలేడు. నీవు ఇశ్రాయేలుకు రాజువవుతావు. నేను నీ తరువాత స్థానంలో ఉంటాను. ఇది నా తండ్రికి కూడా తెలుసు” అన్నాడు దావీదుతో.

18 యోనాతాను, దావీదు ఇద్దరూ యెహోవా ఎదుట ఒక ఒడంబడిక చేసుకున్నారు. తరువాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు. దావీదు హోరేషులో ఉండిపోయాడు.

19 గిబియాలో ఉన్న సౌలు వద్దకు జీఫు ప్రజలువచ్చి, “తమ రాజ్యంలో దావీదు దాగియున్నట్లు చెప్పారు. యెషిమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండ మీద వున్న హోరోషు కోటలో దావీదు ఉన్నట్లు చెప్పారు.

20 ఓ రాజా! ఇప్పుడు మీరు ఏ సమయంలో వచ్చినా దావీదును మీకు పట్టి ఇచ్చే బాధ్యత మాది” అని అన్నారు.

21 అందుకు సౌలు, “నాకు సహాయం చేస్తున్నందుకు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!

22 వెళ్లండి. అతని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకొనండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో కనుగొనండి. అతనిని అక్కడ ఎవరు చూశారో కూడా తెలుసుకోండి. సౌలు కంటె దావీదు తెలివైనవాడు, కనుక తనను మోసగిస్తాడు అని అనుకున్నాడు.

23 దావీదు దాక్కొనే స్థలాలన్నీ కూడ తెలుసుకోండి. మళ్లీ నా వద్దకు వచ్చి నాకు పూర్తి సమాచారం తెలియజేయండి. అప్పుడు నేను మీతో వస్తాను. దావీదు ఆ ప్రాంతంలోనే ఉంటే నేను వానిని కనుగొంటాను. అవసరమైతే యూదాలో ప్రతి ఇంటిని శోధించైనా సరే వానిని కనుక్కుంటాను” అన్నాడు.

24 అప్పుడు జీఫువాళ్లు జీఫుకు తిరిగి వెళ్లిపోయారు. సౌలు తరువాత అక్కడికి వెళ్లాడు. దావీదు, అతని అనుచరులు మాయోను అరణ్యంలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతం.

25 సౌలు, అతని సైనికులు దావీదును వెతుక్కుంటూ వెళ్లారు. కాని సౌలు అతనికొరకు వస్తున్నాడని ప్రజలు దావీదును హెచ్చరించారు. దావీదు మాయోను అరణ్యంలోని “కొండ”కు వెళ్లాడు. ఇది సౌలు తెలుసుకున్నాడు. సౌలు దావీదును వెతుక్కుంటూ మాయోను అరణ్యానికి వెళ్లాడు.

26 పర్వతానికి ఒక పక్కన సౌలు ఉన్నాడు. దావీదు, అతని మనుష్యులు అదే పర్వతానికి మరో వైపున ఉన్నారు. సౌలునుండి దూరంగా పోవటానికి దావీదు తొందర పడుతూ ఉన్నాడు. కానీ దావీదును సపరి వారంగా పట్టుకోవాలని సౌలు, అతని సైనికుల ఆ పర్వతం చుట్టూ తిరుగుట ప్రారంభించారు.

27 ఒక సందేశకుడు సౌలు వద్దకు వచ్చి, “ఫిలిష్తీయులు తమ రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారనీ” త్వరగా రమ్మనీ చెప్పాడు.

28 అంతటితో సౌలు దావీదును వెంటాడటం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోటానికి వెళ్లాడు. అందువల్ల ప్రజలు ఈ ప్రదేశానికి, “జారుడు బండ” అని పేరు పెట్టారు. 29దావీదు మోయోను ఎడారి వదలి ఏన్గెదీ దగ్గర ఉన్న కొండస్థలాలకు వెళ్లాడు.

29 [This verse may not be a part of this translation]

24

1 సౌలు ఫిలిష్తీయులను తరిమివేసిన పిమ్మట, “దావీదు ఏన్గెదీ ఎడారిలో ఉంటున్నట్లు” ప్రజలు అతనికి చెప్పారు.

2 కనుక సౌలు ఇశ్రాయేలు అంతటినుండీ మూడువేలమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారిని తీసుకొని వెళ్లి దావీదు కొరకు, అతని అనుచరుల కొరకు వెతకటం మొదలు పెట్టాడు. అడవి మేక బండలు అనే చోట వారు వెదికారు.

3 సౌలు బాట పక్కగావున్న గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లాడు. ఆ గుహలోనే చాలా లోపల దావీదు, అతని మనుష్యులు దాగివున్నారు.

4 సౌలును చూసి దావీదు అనుచరులు అతనితో “యెహోవా చెప్పిన రోజు ఇదే. ‘నీ శత్రువును నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అని యెహోవా నీతో చెప్పాడు గదా!’ “ అన్నారు. అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ వెళ్లి, సౌలు అంగీని ఒక కొన కోసివేశాడు. సౌలు దావీదును గమనించలేదు.

5 కానీ తర్వాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు.

6 “నా యజమానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా నన్ను నివారించునుగాక! సౌలు యెహోవా నియమించిన రాజు. సౌలు యెహోవాచే అభిషేకింపబడిన రాజు గనుక సౌలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు” అని దావీదు తన మనుష్యులతో అన్నాడు.

7 కోపోద్రేకులైన తన మనుష్యులను అదుపు చేయటానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని సౌలు మీదికి పోనియ్యలేదు. సౌలు గుహ వదిలి తన దారిన వెళ్లిపోయాడు.

8 అతని వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు.

9 “దావీదు నీకు హాని చేయ చూస్తున్నాడని ప్రజలు చెబితే నీవెందుకు ఆ మాటలు వింటున్నావు?

10 యెహోవా ఈ రోజున గుహలో నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్లతో నీవే చూశావు. కానీ నిన్ను చంపటానికి నేను నిరాకరించాను. నేను నీపట్ల కనికరము చూపాను. ‘సౌలు యెహోవా చేత అభిషేకించబడిన రాజు. నా యజమానికి నేను కీడు చేయను’ అని నేననుకున్నాను.

11 ఇదిగో నీ రాజవస్త్రం ముక్క నా చేతిలో ఉంది చూడు! దీనిని నీ అంగీ నుండి ఒక మూల కోశాను. నిన్ను నేను చంపగలిగి ఉండేవాడిని కానీ చంపలేదు. ఇప్పుడైనా నీవు అర్థం చేసుకో. నేను నీకు ఏ కీడూ తలపెట్టలేదు. నేను నీ ఎడల ఏ తప్పూ చేయలేదు. కాని నీవు మాత్రం నన్ను చంపే ప్రయత్నంలో వెంటాడుతున్నావు.

12 యెహోవాయే న్యాయం తీర్చును గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో పోరాడను.

13 దుష్టులనుండి దుష్టకార్యాలే వస్తాయనే ఒక పాత సామెత ఉంది. కానీ నేను దుర్మార్గం ఏమీ చేయలేదు. నేను దుర్మార్గుడిని కాదు. నేను నీకు హాని చేయను.

14 ఇంతకూ నీవు తరుముచున్నది ఎవరిని? ఇశ్రాయేలు రాజు పోరాడేందుకు వస్తున్నది ఎవరిమీదికి? నిన్ను గాయపర్చే వారినెవరినో నీవు వెంటాడటం లేదు! ఏదో ఒక చచ్చిన కుక్కనో, లేక ఈగనో నీవు తరుము తున్నట్టుగా ఉంది.

15 యెహోవాయే న్యాయమూర్తిగా ఉండి నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చును గాక! యెహోవా నన్ను బలపర్చి నేను నిర్దోషినని నిరూపిస్తాడు. ఆయన నన్ను నీ బారినుండి రక్షిస్తాడు” అని రాజైన సౌలుతో దావీదు చెప్పాడు.

16 దావీదు తన మాట ముగించగానే, సౌలు “దావీదూ! నా కుమారుడా, అది నీ స్వరమేనా?” అంటూ ఏడ్వటం మొదలుపెట్టాడు. సౌలు చాలా ఏడ్చాడు.

17 “అవును నీవు చెప్పింది వాస్తవమే. నేను తప్పు చేశాను. నీవు నాపట్ల చాలా మంచితనం చూపించావు. కాని నేనే నీపట్ల చెడుగా ప్రవర్తించాను.

18 నీవు చేసిన మంచి పనులన్నీ నాకు నీవు చెప్పావు. యెహోవా నన్ను నీ వద్దకు తీసుకుని వచ్చాడు. అయినా నీవు నన్ను చంపలేదు.

19 ఇది నీవు నా శత్రువు కాదని నిరూపిస్తుంది. శత్రువు చేజిక్కినపుడు మంచితనంతో ఎవరూ విడిచి పెట్టరు. శత్రువుకు ఎవరూ మేలు చేయరు. ఈ రోజు నీవు నాపట్ల ఇంత మంచిగా ప్రవర్తించినందుకు యెహోవా నీకు ప్రతిఫలం దయచేయును గాక!

20 నీవు ఖచ్చితంగా రాజువు అవుతావని నాకు తెలుసు. ఇశ్రాయేలు రాజ్యాన్ని నీవు పరిపాలిస్తావు.

21 ఇప్పుడు నాకొక మాట ఇవ్వు. యెహోవా నామం పేరిట నీవు నా సంతతి వారిని హతమార్చనని మాటయివ్వు. నా తండ్రి వంశం నుంచి నా పేరు తుడిచివేయనని నీవు నాకు ప్రమాణం చేసి చెప్పు.” అన్నాడు సౌలు.

22 కనుక సౌలుకు దావీదు వాగ్దానం చేసాడు. సౌలు కుటుంబాన్ని నాశనం చేయనని దావీదు వాగ్దానంచేశాడు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వెళ్లాడు. దావీదు తన అనుచరులతో కొండ స్థలాలకు వెళ్లిపోయాడు.

25

1 సమూయేలు చనిపోయాడు. సభచేరిన ఇశ్రాయేలీయులు సమూయేలు మృతికి తమ సంతాపాన్ని వెలిబుచ్చురు. రామాలో వున్న ఇతని ఇంటివద్దనే సమూయేలు భౌతిక కాయాన్ని వారు సమాధి చేశారు. అప్పుడు దావీదు పారాను అరణ్యానికి తరలిపోయాడు.

2 మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు.

3 అతని పేరు నాబాలు . అతని భార్య పేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది, మంచి అందగత్తె, కానీ నాబాలు క్రూరుడు, నీచుడు, కాలేబు సంతతివాడు.

4 దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన గొర్రెలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు.

5 దావీదు పదిమంది యువకులను పిలిచి, “కర్మెలులో వున్న నాబాలు వద్దకు వెళ్లి అతనిని తన పక్షంగా పలుకరించమని” చెప్పాడు.

6 “నీవూ, నీ కుటుంబం బాగున్నారని ఆశిస్తున్నాను! నీకు ఉన్నదంతా క్షేమం అని కూడ నేను భావిస్తున్నాను,

7 నీవు నీ గొర్రెల నుండి ఉన్ని తీస్తున్నట్లు నేను విన్నాను. నీ గొర్రెల కాపరులన కొద్ది రోజులు మా వద్ద ఉన్నారు. అప్పుడు వారికి మేము ఏ హానీ చేయలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలం మేము వారినుండి ఏమి తీసుకోలేదు.

8 నీవు వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. అందుచేత ఈ యువకుల పట్ల నీవు కనికరం చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. నీ స్నేహితుడునైన దావీదు కోసం ఇది చేయి” అని చెప్పమన్నాడు దావీదు.

9 దావీదు మనుష్యులు నాబాలు దగ్గరకు వెళ్లారు. దావీదు సందేశాన్ని వారు నాబాలుకు అందజేశారు.

10 కాని నాబాలు చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన దావీదు సేవకులతో, “ఎవడీ దావీదు? ఎవడీ యెష్షయి కొడుకు? ఇటీవల చాలా మంది బానిసలు తమ యజమానులనుండి పారిపోతున్నారు!

11 నావద్ద రొట్టె, నీళ్లూ ఉన్నాయి. అవి, నావద్ద ఉన్న మాంసం, ఉన్ని తీసే నా సేవకులకు కావాలి. నాకు తెలియని వాళ్లెవరికీ నేను దాన్ని ఇవ్వను,” అని కసురు కున్నాడు నాబాలు.

12 నాబాలు అన్నదంతా దావీదు మనుష్యులు తిరిగి వెళ్లి దావీదుకు చెప్పారు.

13 ఇది విన్న దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు వందర మంది దావీదుతో వెళ్లారు. రెండువందల మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు.

14 నాబాలు నౌకర్లలో ఒకడు తన యజమాని భార్య అబీగయీలు వద్దకు వెళ్లి, “దావీదు అరణ్యం నుండి కొందరు దూతలను మా యజమాని నాబాలును పలకరించేందుకు పంపాడు. అయితే నాబాలు వారితో నీచంగా ప్రవర్తించాడు అని చెప్పాడు.

15 దావీదు మనుష్యులు మనపట్ల చాలా మర్యాదగా ఉన్నారు. మనకు ఏ అపకారమూ చేయలేదు. మేము గొర్రెలను పొలాలకు తోలుకు వెళ్లినప్పుడు వారు మాతోనే ఉన్నారు. వారు ఎప్పుడూ ఏమీ దొంగిలిచలేదు.

16 రాత్రింబగళ్లు దావీదు మనుష్యులు మమ్మల్ని కాపాడారు. మేము గొర్రెలను మేపుతున్న రోజుల్లో వారు మాకు పెట్టని కోటలా ఉండి మమ్మల్ని కాపాడారు.

17 ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని చెప్పాడు.

18 అబీగయీలు వెంటనే రెండువందల రొట్టెలు, రెండు నిండు ద్రాక్షారసపు తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, సుమారు ఐదు మానికల వండిన ఆహారం, ఒక మూట ఎండు ద్రాక్ష, ఎండిన అంజూరపు పండ్ల అడలు రెండు వందలు, కొన్ని గాడిదల మీద ఎత్తించింది.

19 తరువాత అబీగయీలు తన నౌకర్లతో, “వాటిని తీసుకుని వెళ్లమని, వారి వెనుక తను బయలు దేరి వస్తానని చెప్పింది.” కానీ ఆమె ఇదంతా తన భర్తకు చెప్పలేదు.

20 అబీగయీలు తన గాడిద మీద ఎక్కి పర్వతం అవతలి వైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న దావీదును, అతని మనుష్యులను ఆమె కలుసుకున్నది.

21 అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయించాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు.

22 రేపటి ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా నన్ను శిక్షించును గాక!” అన్నాడు.

23 అయితే అబీగయీలు దావీదును చూడగానే వెంటనే గాడిద మీదనుంచి దిగి దావీదుకు సాగిలపడి అభివందనం చేసింది.

24 అబీగయీలు దావీదు పాదాల మీద పడి, “అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి. నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నేనిందించు.

25 నీవు పంపిన మనుష్యుల్ని నేను చూడలేదు. ఈ పనికిమాలిన మనిషి నాబాలును నీవు లక్ష్యపెట్టకు. అతను తన పేరుకు తగినట్టే ఉన్నాడు. అతని పేరుకు ‘బుద్ధిహీనుడని’ అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు.

26 నిర్దోషులను చంపకుండా, యెహోవాయే నిన్ను దూరంగా ఉంచాడు. యోహవా జీవిస్తున్నాడు నిజంగా, నీవు జీవిస్తున్నావు నిజంగా నీ శత్రువులంతా, మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలువలె అవుదురు గాక1

27 నీ కోసం నేను ఈ కానుకలు తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుష్యులకు ఈ కానుకలనివ్వు

28 తప్పు చేసినందుకు నన్ను క్షమించు. యెహోవా నీ కుటుంబాన్ని బలపరచి నీ కుటుంబంలో అనేక మంది రాజులు పుట్టేలా చేస్తాడని నాకు తెలుసు నీవు ఆయన తరపున యుద్ధాలు చేస్తున్నావు గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించియున్నంత కాలం ప్రజలకు నీలో ఏ తప్పూ కనబడదు.

29 ఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా, నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఒడిసెలలో పెట్టి విసరిన రాయిలా యెహోవా నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు.

30 నీకు అనేక మంచి వాటిని చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. కనుక యెహోవా వాటన్నింటినీ నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలుకు నాయకునిగా చేస్తాడు.

31 అప్పుడు నీవు ఈ బోనులోపడవు. దుర్మార్గాలు చేసిన దోషం నీకు ఉండదు. నిర్దోషులను చంపావనే దోషం నీ మీద ఉండదు. ఆ మహా గొప్ప విజయం నీకు యెహోవా చేకూర్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నాది.

32 దావీదు అబీగయీలుకు సమాధానమిస్తూ, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. నన్ను కలుసుకునేందుకు దేవుడే నిన్ను పంపించాడు.

33 నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు.

34 ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా జీవిస్తున్నంత నిజంగా నీవు గనుక ఇంత త్వరగా ఈరోజు నన్ను కలుసుకొనేందుకు రాకపోతే రేపటి ఉదయం లోపల నాబాలు వంశంలో ఒక్క మగవాడు కూడా మిగిలే వాడు కాదు” అని చెప్పాడు దావీదు.

35 అప్పుడు దావీదు అబీగయీలు తెచ్చిన కానుకలు స్వీకరించి, “శాంతితో ఇంటికి వెళ్లు నీ మాటలు నేను విన్నాను, నీవు కోరినట్టు నేను చేస్తాను” అని దావీదు ఆమెతో చెప్పాడు.

36 అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు.

37 మరుసటి ఉదయం నాబాలు మామూలుగా ఉన్నాడు. కనుక అతని భార్య జరిగినదంతా అతనితో చెప్పింది. అది వినగానే అతనికి గుండెపోటు వచ్చి రాయిలా బిగుసుకుపోయాడు.

38 ఆ తరువాత పదిరోజులకు నాబాలు చచ్చేటట్టుగా చేసాడు యెహోవా.

39 నాబాలు మరణ వార్త విన్న దావీదు, “యెహోవాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. నాబాలు తప్పు చేసాడు గనుక యెహోవా వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు. అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం పంపాడు ఆమె తనకు భార్య కావాలని దావీదు అడిగాడు.

40 దావీదు సేవకులు కర్మెలుకు వెళ్లి అబీగయీలును కలిసి, “దావీదు నిన్ను తీసుకుని రమ్మని మమ్ములను పంపించాడు. నీవు అతని భార్యవు కావాలని దావీదు కోరిక” అని చెప్పారు.

41 అబీగయీలు సాగిలపడి సమస్కరించి, “నేను మీ దాసిని మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. నేను నా యజమానియైన దావీదు సేవకుల పాదప్రక్షాళనం చేయటానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.

42 అబీగయీలు వెంటనే ఒక గాడిద మీద ఎక్కి దావీదు పంపిన సేవకులతో కలిసి వెళ్లింది. ఆమెతో అయిదుగురు పనిగత్తెలను కూడ తీసుకుని వెళ్లింది. అబీగయీలు దావీదు భార్య అయింది.

43 యెజ్రెయేలీ వాసి అహీనోయమును కూడ దావీదు వివాహము చేసుకున్నాడు. అహీనోయము, అబీగయీలు ఇద్దరూ దావీదుకు భార్యలయ్యారు. 44సౌలు కుమార్తె మీకాలు కూడ దావీదుకు భార్యయే గాని, సౌలు ఆమెను గల్లీముకు చెందిన లాయీషు అనే వాని కుమారుడు పల్తీయేలుకు ఇచ్చి మళ్లీ పెళ్లి చేశాడు.

44 [This verse may not be a part of this translation]

26

1 జీఫు ప్రజలు సౌలును చూడటానికి గిబియాకు వెళ్లారు. “హకీలా కొండల్లో దావీదు దాగి ఉంటున్నాడు. ఈ కొండ యెషీమోనుకు ఎదురుగా ఉంది” అని వారు సౌలుతో చెప్పారు.

2 జీఫు అరణ్యంలోకి సౌలు వెళ్లాడు. ఇశ్రాయేలు అంతటిలో తాను ఎంపిక చేసుకొన్న మూడువేల మంది సైనికులను సౌలు తన వెంట తీసుకుని వెళ్లాడు. సౌలు, అతని మనుష్యులు దావీదును వెదుక్కుంటూ జీఫు అరణ్యంలోకి వెళ్లారు.

3 సౌలు హకీలా కొండపై గుడారాలు సిద్ధపరచుకొనెను. యెషీమోనుకు ఎదురుగా బాటపక్కలో ఈ స్థలం వుంది. దావీదు అరణ్యంలోనే వుండి, సౌలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు విన్నాడు.

4 దావీదు తన వేగుల వారిని పంపి సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు.

5 సౌలు గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, అబ్నేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు చూశాడు. (నేరు కుమారుడు అబ్నేరు సౌలు సైన్యాలకు సేనాని.) గుడారం మధ్యలో సౌలు నిద్రిస్తూవున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది.

6 హిత్తీయుడైన అహీమెలెకుతోను, సెరూయా కుమారుడయిన అబీషైతోను దావీదు మాట్లాడి, “సౌలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” అడిగాడు. (అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). “నీతో నేను వస్తా” అని అబీషై చెప్పాడు.

7 చీకటి పడ్డాక దావీదు, అబీషై కలిసి సౌలు మజిలీలోకి వెళ్లారు. సౌలు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి దిగివేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, పక్కగా అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు.

8 “నీ శత్రువును ఓడించటానికి దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఒక్క వేటుతో, అతని ఈటెతోనే సౌలును భూమిలోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీషై దావీదుతో.

9 కానీ దావీదు అబీషైతో ఇలా అన్నాడు,”సౌలును చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు హాని చేసినవాడు శిక్షించబడాలి.

10 యెహోవా జీవీస్తున్నంత నిజంగా యెహోవా తానే సౌలును శిక్షిస్తాడు. ఒకవేళ సౌలు సహజంగానే చనిపోవచ్చు. లేదా యుద్ధంలో అతడు చంపబడవచ్చు.

11 కానీ యెహోవా చేత అభిషేకించబడిన రాజును నేను మాత్రం చంపకుండా ఉండేటట్టు చేయుమని యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. కనుక సౌలు తలవద్ద ఉన్న ఈటెను, మంచినీటి కూజాను తీసుకోండి. మనము వెళ్లి పోదాము.”

12 కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి కూజాను తీసుకుని దావీదు, అబీషై సౌలు గుడారంనుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఒక్క మనిషికూడ కనీసం మేల్కోలేదు! యెహోవా సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో వారంతా అలా నిద్రపోయారు.

13 దావీదు ఆవలివైపుకు వెళ్లిపోయాడు. సౌలు గుడారాలకు దూరంగా లోయ అవతల ఉన్న పర్వతం మీద దావీదు నిలబడ్డాడు. అంటే వీరిద్దరి గుడారాలు ఒకదాని కొకటి చాలా దూరంగా ఉన్నాయి.

14 నేరు కుమారుడైన అబ్నేరును, సైన్యాన్ని ఉద్దేశించి దావీదు కేకవేసి “అబ్నేరూ నాకు జవాబు చెప్పు” అన్నాడు. “రాజును పిలుస్తోన్న నీవు ఎవరివి?” అని అబ్నేరు అడిగాడు.

15 అందుకు దావీదు, “నీవు మగావాడివి కదూ! నీవు ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యాజమానియైన రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారంలోనికి వచ్చాడు!

16 నీవు గొప్ప పొరపాటు చేసావు. యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవూ నీ సైనికులూ చావాలి. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడ్డ నా యజమానియైన రాజును కాపాడలేదు. నీవు సౌలు తలవద్దవుంచబడిన ఈటె, నీళ్లకూజా ఏమయ్యాయో చూడు. అవి ఏవి?” అని ఎదురు ప్రశ్నవేశాడు.

17 సౌలుకు దావీదు స్వరం తెలుసు. “నా కుమారుడా దావీదూ, అది నీ స్వరమే కదూ?” అన్నాడు సౌలు దావీదుతో. “అవును నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే” అన్నాడు దావీదు.

18 దావీదు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, నీవు నన్నెందుకు ఇలా తరుముతున్నావు? నేను చేసిన నేరం ఏమిటి? దేని విషయంలో నేను దోషిని?

19 రాజా, నా యజమామీ, నా మాట విను! యెహోవా గనుక నీకు నాపై కోపం వచ్చినట్లు చేసి ఉంటె ఆయనకు బలి సమర్పణ చేద్దాము. కానీ మనుష్యుల ప్రేరణవల్ల నామీద నీకు కోపం వచ్చివుంటే యెహోవా వారిని కష్టనష్టాలకు గురిచేస్తాడు. యెహోవా నాకిచ్చిన భూమిని నేను వదిలిపోయేలా మనుష్యుల చేశారు. వెళ్లి ఇతర దేవుళ్లను కొలువమని

20 పరదేశీయులతో ఉండుమని మనుష్యులు నాకు చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురుగును చంపటానికి వెతుక్కుంటూ బయటకి వచ్చాడు! కొండల్లో కౌజు పిట్టను వేటాడటానికి వచ్చినవానిలా ఉన్నావు నీవు!”

21 అప్పుడు సౌలు, “నేను పాపం చేసాను. నా కుమారుడా దావీదూ, నా దగ్గరకు తిరిగి వచ్చేయి. నా ప్రాణం నీకు ముఖ్యం అని ఈ రోజు నీవు నాకు చూపించావు. అందుచేత నేను నీకు హాని చేసేందుకు ప్రయత్నించను. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. నేను ఒక పెద్ద తప్పుచేశాను” అన్నాడు.

22 “ఇదిగో రాజు ఈటె. మీలో ఒక యువకుడు వచ్చి దీనిని తీసుకోవచ్చు.

23 మంచిచేసిన ప్రతి వానికీ యెహోవా ప్రతిఫలం ఇప్పిస్తాడు. కీడు చేసిన వానిని ఆయన శిక్షిస్తాడు. ఈ వేళ యెహోవా నేను నిన్ను ఓడించేటట్టు చేసాడు. అయినా యెహోవా చేత అభీషేకించబడిన రాజుకు నేను హాని చేయను.

24 నీ ప్రాణం నాకు ముఖ్యం అని ఈ వేళ నేను నీకు చూపించాను. యెహోవాకు నా ప్రాణం ముఖ్యం అని యెహోవా నీకు చూపిస్తాడు. ప్రతి కష్టంనుంచీ యెహోవా నన్ను రక్షిస్తాడు” అని చెప్పాడు దావీదు.

25 సౌలు, “నా కుమారుడా దావీదూ, దేవుడు నిన్నాశీర్వదించును గాక! నీవు చాలా ఉన్నతమైన కార్యాలుచేస్తావు. నీవు విజయం సాధిస్తావు” అని దావీదుతో చెప్పాడు. దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు. సౌలు తన ఇంటికి తిరిగి వెళ్లాడు.

27

1 తరువాత దావీదు, “ఏదో ఒకరోజు సౌలు నన్ను పట్టుకుంటాడు. ఈ పరిస్థితిలో నేను ఫిలిష్తీయుల రాజ్యానికి తప్పించుకోవటం ఒక్కటే ఉత్తమ మార్గం. అప్పుడు సౌలు నా కోసం ఇశ్రాయేలు రాజ్యంలో వెదకటం మానేస్తాడు. ఆ విధంగా నేను సౌలునుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.

2 అందుచేత దావీదు, తన ఆరు వందలమంది అనుచరులతో ఇశ్రాయేలును వదిలి వెళ్లాడు. వారు మాయోకుమారుడైన ఆకీషు వద్దకు వెళ్లారు. ఆకీషు గాతుకు రాజు.

3 దావీదు, అతని మనుష్యులు వారి కుటుంబాలతో సహా ఆకీషు రాజుతో పాటు గాతులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలీ వాసి అహీనోయము, మరియు, కర్మెలునివాసి, నాబాలు భార్య విధవరాలునైన అబీగయీలు అతనితో ఉన్నారు.

4 దావీదు గాతుకు పారిపోయాడని ప్రజలు సౌలుతో చెప్పగానే సౌలు అతని కొరకు వెదకటం మానేశాడు.

5 ఆకీషును దావీదు కలసి, “నా విషయమై నీవు సంతోషిస్తే బయట పట్టణంలో ఒక ఊరిలో స్థానమిస్తే అక్కడ ఉంటాను. నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే. రాజధానిలో నీతో నేను ఉండుటకంటె నేను అక్కడే ఉండటం మంచిది” అని చెప్పాడు.

6 సిక్లగు అనే ఊరిని అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున అప్పటి నుండి సిక్లగు యూదా రాజులకు చెందినదిగా ఉండిపోయింది.

7 ఫిలిష్తీయుల రాజ్యంలో దావీదు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.

8 దావీదు, అతని మనుష్యులు కలిసి అమాలేకీయులతోనూ, గెషూరులో నివసిస్తున్న ప్రజలతోనూ యుద్ధానికి వెళ్లారు. దావీదు మనుష్యులు వారిని ఓడించి వారి ఆస్తులను దోచుకున్నారు. ఆ ప్రజలంతా షూరు పట్టణం దగ్గర తెలెమునుండి మొత్తం ఈజిప్టువరకు నివసిస్తూ ఉన్నారు.

9 ఆ ప్రాంతంలో దావీదు వారితో పోరాడి వారిని ఓడించాడు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఒంటెలను, దుస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటిని ఆకీషుకు ఇచ్చాడు.

10 దావీదు ఇలా చాలాసార్లు చేసాడు. ప్రతిసారీ దావీదు ఎక్కడ యుద్ధం చేసి, సంపద అంతా తెస్తున్నాడు అనే విషయం ఆకీషు అడిగేవాడు. “యూదాకు దక్షిణ ప్రాంతంలో యుద్ధం చేసాననీ యెరహ్మెయేలుకు దక్షిణ భాగాన పోరాడాననీ, కేనీయుల దేశానికి దక్షిణాన పోరాడాను” అనీ ప్రతిసారీ ఒక పేరు చెపుతూ ఉండేవాడు దావీదు.

11 బతికి వున్న ఒక స్త్రీని గాని, పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అనుకున్నాడు.” ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అన్ని రోజులూ దావీదు ఇలాగే చేసాడు.

12 ఆకీషు మాత్రం దావీదును నమ్మటం మొదలు పెట్టాడు. “ఇప్పుడు దావీదు యొక్క స్వంత వాళ్లే అతనిని ద్వేషిస్తున్నారు. ఇశ్రాయేలీయులు దావీదును బాగా అసహ్యించుకుంటున్నారు. అందువల్ల దావీదు శాశ్వతంగా నాకు సేవచేస్తాడు” అని ఆకీషు తనలో తాను అనుకున్నాడు.

28

1 తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆకీషు దావీదుతో, “నీవూ, నీ మనుష్యులూ నాతో కలిసి ఇశ్రాయేలీయుల మీద పోరాటానికి వెళ్లాలని గ్రహించావా?” అని అన్నాడు.

2 “ఓ, తప్పకుండా. అప్పుడు నీవే చూస్తావుగా నేను ఏమి చేయగలిగిందీ” అని దావీదు జవాబిచ్చాడు. “చాలా బాగుంది. నిన్ను నా అంగరక్షకునిగా శాశ్వత నియామకం చేస్తాను” అని అన్నాడు ఆకీషు.

3 సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా అతని మరణానికి దుఃఖించారు. అతని స్వంత పట్టణమైన రామాలోనే సమూయేలు శరీరాన్ని ప్రజలు సమాధి చేశారు. అంతకు ముందే సౌలు కర్ణపిశాచముగల వారిని చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెడల గొట్టాడు.

4 ఫిలిష్తీయులంతా యుద్ధానికి సిద్ధమై షూనేము అనే చోట గుడారాలు వేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమీకరించి, గిల్బోవలో గుడారాలు వేసుకున్నాడు.

5 ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది.

6 సౌలు యెహోవాను ప్రార్థించాడు. కానీ యెహోవా అతనికి జవాబు ఇవ్వలేదు. కలలోకూడ దేవుడు సౌలుతో మాట్లాడలేదు. అతనికి జవాబు ఇచ్చేందుకు దేవుడు ఊరీము ప్రయోగించ లేదు.

7 చివరికి సౌలు తన మనుష్యులతో, “ఒక కర్ణపిశాచంగల స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతోందో ఆమెను అడుగుతాను” అని చెప్పాడు. “ఏన్దోరులో కర్ణ పిశాచం గల ఒక స్త్రీ వుందని” అతని అధికారులు అతనితో చెప్పారు.

8 అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని ఆ స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.

9 కానీ ఆ స్త్రీ, “సౌలు ఏమి చేసాడో నీకు ఖచ్చితంగా తెలుసు. కర్ణపిశాచముగలవారిని, చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెళ్లగొట్టాడు. నీవు నన్ను ఉరివేసి చంపాలని చూస్తున్నావు” అని సౌలుతో అంది.

10 సౌలు యెహోవా పేరును ప్రయోగించి ఆ స్త్రీకి ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా చెబుతున్నాను. నీవు ఈ పని చేసినందుకు శిక్షపొందవు” అన్నాడు.

11 “అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించమంటావు?” అని ఆ స్త్రీ సౌలును అడిగింది. “సమూయేలును” అన్నాడు సౌలు.

12 ఆ స్త్రీ సమూయేలును చూచి చావుకేక వేసింది. “నీవు నన్ను మాయ చేసావు, నీవు సౌలువే” అంది ఆ స్త్రీ సౌలుతో.

13 “అయినా ఏమీ భయపడకు! నీవు ఏమి చూస్తున్నావు?” అన్నాడు సౌలు ఆమెతో. “భూమిలో నుండి ఒక ఆత్మ రావటం నేను చూస్తున్నాను” అంది ఆ స్త్రీ.

14 “అయితే, వాని ఆకారం ఎలా ఉంది?” అని సౌలు అడిగాడు. “అతడు అంగీ ధరించిన ముసలివానిలా కనబడుతున్నాడు” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. అది సమూయేలు అని అప్పుడు సౌలుకు తెలిసింది. సౌలు సాష్టాంగపడి నమస్కరించాడు.

15 “నన్నెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు?” అన్నాడు సమూయేలు సౌలుతో. సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, ప్రవక్తల ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు చెప్పాలి” అన్నాడు.

16 సమూయేలు, “యెహోవా నిన్ను విసర్జించి ఇప్పుడు ఆయన నీ పొరుగువానితో ఉన్నాడు. అందు చేత నీవు నన్నెందుకు పిలిచావు?

17 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో అదే చేసాడు. ఈ విషయాలు నాద్వారా నీకు చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతులనుండి తీసివేసాడు. దానిని నీ పొరుగు వారిలో ఒకనికి ఆయన ఇచ్చాడు. ఆ పొరుగు వాడే దావీదు!

18 నీవు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. నీవు అమాలేకీయులను నాశనం చేయలేదు, వారిమీద యెహోవా ఎంత కోపగించాడో వారికి చూపించలేదు. అందుకే దేవుడు ఈ వేళ నీకు దీనిని చేసాడు.

19 యెహోవా ఇశ్రాయేలును, నిన్ను కూడ ఫిలిష్తీయులకు ఇచ్చివేసాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. రేపు నీవూ, నీ కుమారులు కూడా నాతో పాటు ఇక్కడ ఉంటారు” అని చెప్పాడు.

20 సౌలు వెంటనే నేల మీదుకి ఒరిగిపోయి, అక్కడే పడి ఉన్నాడు . సమూయేలు చెప్పిన వాటి మూలంగా సౌలు భయపడిపోయాడు. ఆ రాత్రి, పగలు సౌలు ఏమీ తినకపోవటంతో చాలా నీరసించి పోయాడు.

21 ఆ స్త్రీ సౌలు వద్దకు వచ్చి, అతను నిజంగానే చాలా భయపడి పోయినట్టు గమనించింది. “చూడు, నేను నీ సేవకురాలిని. నేను నీకు విధేయురాలి నయ్యాను. నేను నా ప్రాణానికి తెగిచి నీవు చెప్పినట్లు చేసాను.

22 దయచేసి ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు కొంత ఆహారం ఇస్తాను. నీవు అది తినాలి. అప్పుడు నీ దారిన నీవు వెళ్లటానికి సరిపడే శక్తి నీకు ఉంటుంది” అని ఆమె చెప్పింది.

23 కానీ సౌలు తిరస్కరించాడు. “నేనేమి తినను” అన్నాడు. సౌలు అధికార్లు ఆమెతో కలిసి సౌలును తినమని బతిమలాడారు. చివరకు సౌలు ఒప్పుకుని నేల మీదనుండి లేచి పక్కమీద కూర్చున్నాడు.

24 ఆ స్త్రీ ఇంటివద్ద ఒక బలిసిన ఆవుదూడ వుంది. వెంటనే ఆమె ఆ దూడను చంపింది: కొంత పిండి తీసిస్వయంగా కలిపి దానిని గొట్టకుండా రొట్టెకాల్చింది.

25 ఆ ఆహారాన్ని సాలు ముందు, అతని అధికార్ల ముందు ఆమె పెట్టింది. సౌలు, అతని అధికార్లు భోజనంచేసారు. అదే రోజు రాత్రి వారు బయలుదేరి వెళ్లిపోయారు.

29

1 ఆఫెకు వద్ద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని సమకూర్చారు. యెజ్రెయేలులో ఊట బావి వద్ద ఇశ్రాయేలు సైనికులు గుడారాలు వేసుకున్నారు.

2 ఫిలిష్తీయుల పాలకులు నూరుమంది దళాలతో, వేయిమంది దళాలతో ముందడుగు వేస్తున్నారు. దావీదు, అతని మనుష్యులు ఆకీషు వెనుక నడుస్తూఉన్నారు.

3 ఫిలిష్తీయుల దళాధిపతులు, “ఈ హెబ్రీవాళ్లు ఇక్కడ ఏమి చేస్తున్నారు” అని అడిగారు. అప్పుడు ఆకీషు ఫిలిష్తీయుల దళాధిపతులతో, “ఇతడు దావీదు. ఇతడు సౌలు అధికారుల్లో ఒకడు. దావీదు చాలా కాలంగా నాతో ఉంటున్నాడు. దావీదు సౌలును విడిచిపెట్టి వచ్చి నా దగ్గర ఉంటున్నప్పటి నుండి ఇతనిలో నాకు ఏ తప్పూ కనబడలేదు,” అని చెప్పాడు.

4 కానీ ఆకీషు మీద ఫిలిష్తీ దళాధిపతులకు చాలా కోపం వచ్చింది. “దావీదును వెనుకకు పంపించు! నీవు ఇతనికిచ్చిన ఊరికి ఇతను తిరిగి వెళ్లిపోవాలి. యుద్ధంలోకి ఇతడు మనతో రావటానికి వీల్లేదు. ఇతను ఇక్కడ ఉన్నాడంటే మన మధ్యలో శత్రువును పెట్టుకున్నట్టే అవుతుంది. ఇతను మన మనుష్యులను చంపితన రాజు సౌలును సంతోష పెడతాడు.

5 ఈ దావీదును గూర్చే ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ ‘సౌలు వేల కొలదిగా హతము చేసెననియు, దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు.’ అని పాట పాడారు” అని చెప్పారు ఆ దళాధిపతులు.

6 అందుచేత ఆకీషు దావీదును పిలిచాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా, నీవు నాకు నమ్మకంగా ఉన్నావు. నీవు నా సైన్యంలో పని చేయటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు వచ్చిన రోజునుండి నీలో ఏ తప్పూ నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల పాలకులు కూడ నీవు మంచివాడివని తలస్తున్నారు.

7 శాంతితో వెనుకకు వెళ్లిపో. ఫిలిష్తీయుల పాలకులకు విరోధంగా ఏమీ చెయ్యకు,” అని ఆకీషు చెప్పాడు.

8 దావీదు, “నేను ఏమి తప్పుచేసాను? నేను నీ దగ్గరకు వచ్చిన రోజునుండి ఈ రోజు వరకు నీవు నాలో ఏమి తప్పు కనుగొన్నావు? నా యజమానివైన రాజు యొక్క శత్రువులతో నన్నెందుకు పోరాడనివ్వవు?” అని దావీదు అడిగాడు.

9 అందుకు ఆకీషు, “నీవు మంచివాడవని నాకు తెలుసు. నీవు దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతలా ఉన్నావు. కానీ ఫిలిష్తీయుల దళాధిపతి మాత్రం, ‘దావీదు మాతో కలిసి యుద్ధానికి రాకూడదు’ అంటూనే ఉన్నాడు.

10 తెల్లవారు ఝామునే లేచి నీవూ, నీ మనుష్యులూ వెనక్కు వెళ్లిపోవాలి. నేను మీకిచ్చిన నగరానికి తిరిగి వెళ్లండి. నిన్ను గురించి దళాధిపతి చెప్పిన చెడ్డ మాటలను లెక్క చెయకు. నీవు మంచివాడివి. కనుక సూర్యోదయం కాగానే వెళ్లిపోవాలి” అన్నాడు.

11 అంతుచేత దావీదు, అతని మనుష్యులు తెల్లవారుఝామునే లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లిపోయారు. ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు సాగిపోయారు.

30

1 దావీదు, అతని మనుష్యులు మూడవ రోజుకు సిక్లగు నగరానికి చేరుకున్నారు. అమాలేకీయులు సిక్లగును ముట్టడివేయుట వారు చూశారు. అమాలేకీయులు నెగెవ్ ప్రాంతం మీద దాడి చేసారు. వారు సిక్లగు మీద దాడి చేసి, పట్టణాన్ని తగులబెట్టారు.

2 సిక్లగులో ఉన్న స్త్రీలను బందీలుగా పట్టుకున్నారు. పడుచువాళ్లను, వృద్ధులను అందరినీ వారు పట్టుకొన్నారు. వారు ఎవ్వరినీ చంపలేదు. కేవలం వారిని బందీలుగా పట్టుకొన్నారు.

3 దావీదు, అతని మనుష్యులు సిక్లగు వచ్చేసరికి పట్టణమంతా తగులబడి పోవటం వారికి కనబడింది. వారి భార్యలు, కొడుకులు, కూతుళ్లు, అంతా బందీలుగా కొనిపోబడ్డారు. అమాలేకీయులు వారిని పట్టుకొన్నారు.

4 దావీదు, అతని సైనికులు సొమ్మసిల్లి పోయేలా గట్టిగా విలపించారు.

5 దావీదు యొక్క ఇద్దరు భార్యలు (యెజ్రెయేలీ అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్య, విధవరాలు అబీగయీలు) కూడ బందీలుగా కొనిపోబడ్డారు.

6 సైన్యంలోని మగవాళ్లంతా వారి కుమారులు, కుమారైలు బందీలుగా తీసుకుని పోబడినందుకు విచారంగా, కోపంగా ఉన్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని వారు మాట్లాడుకుంటున్నారు. ఇది దావీదును చాలా తల్లడిల్ల చేసింది. కానీ దావీదు తనదేవుడైన యెహోవా నుంచి బలంపొందాడు.

7 యాజకుడైన అబ్యాతారుతో, “ఏఫోదును తెమ్మని” చెప్పాడు దావీదు.

8 అప్పుడు దావీదు యెహోవాకు ప్రార్థన చేసాడు “మా కుటుంబాలను బందీలుగా తీసుకునిపోయిన వారిని నేను వెంటాడనా? వారిని పట్టుకుంటానా?” అని అడిగాడు, “వారిని వెంటాడు, నీవు వారని పట్టుకుంటావు. మీ కుటుంబాలను రక్షించుకొంటావు” అని యెహోవా ప్రత్యుత్తర మిచ్చాడు.

9 [This verse may not be a part of this translation]

10 [This verse may not be a part of this translation]

11 ఈజిప్టు మనిషి ఒకడు పొలాల్లో దావీదు మనుష్యులకు కనబడ్డాడు. వారు ఆ ఈజిప్టు వానిని దావీదు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఆ ఈజిప్టు వానికి వారు మంచినీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చారు.

12 అంజూరపు పళ్లను, రొట్టెను, రెండు గుత్తుల ఎండు ద్రాక్షలను కూడ వారు అతనికి ఇచ్చారు. అవి తిని వాడు కొంత సేదతీరాడు, మూడు పగళ్లు, మూడు రాత్రులు అతడు ఏమీ తినిగాని, తాగిగాని ఎరుగడు.

13 “నీ యజమాని ఎవరు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు?” అని దావీదు అడిగాడు అందుకు, “నేను ఈజిప్టు వాడిని. ఒక అమాలేకీయుని బానిసను, మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. అందుచేత నా యజమాని నన్ను వదిలివేశాడు.

14 కెరేతీయులు నివసించే దక్షిణ ప్రాంతాన్ని, యూదా దేశాన్ని, కాలేబు ప్రజలు నివసించే నెగెవ్ ప్రాంతాన్ని మేము ముట్టుడించాము. మేము సిక్లగును కూడ తగులబెట్టాము” అని ఆ ఈజిప్టువాడు దావీదుకు చెప్పాడు.

15 అయితే మా భార్య పిల్లల్ని తీసుకుని పోయిన ఆ మనుష్యుల దగ్గరకు నీవు నన్ను తీసుకుని వెళతావా?” అని దావీదు ఆ ఈజిప్టు వాడిని అడిగాడు. “నన్ను చంపననీ, నా యజమానికి తిరిగి నన్ను అప్పగించననీ దేవుని ముందర నీవు మాట ఇస్తే వారిని కనుక్కొనేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు ఆ ఈజిప్టువాడు.

16 ఈజిప్టువాడు దావీదును అమాలేకీయుల దగ్గరకు నడిపించాడు. ఆ సమయంలో వారు తాగుతూ, తింటూ నేలమీద ఇక్కడా అక్కడా పండుకొనివున్నారు. ఫిలిష్తీయుల దేశం నుండి, యూదా దేశం నుండి వారు కొల్లగొట్టిన అస్తిపాస్తులను చూసు కుంటూ సంబరం జరుపు కుంటున్నారు.

17 దావీదు వారిని ఓడించి, చంపేసాడు. సూర్యోదయం నుంచి మరునాటి సాయంత్రం వరకు వారు యుద్ధం చేశారు. సుమారు నాలుగు వందల మంది అమాలేకీ యువకులు మాత్రం ఒంటెలపై దూకి పారిపోయారు వారిలో మిగిలిన వారెవ్వరూ బ్రతికి బయటపడలేదు.

18 దావీదుకు తన ఇద్దరు భార్యలు తిరిగి దొరికారు. అమాలేకీయులు కొల్లగొట్టినదంతా దావీదు తిరిగి తీసుకున్నాడు.

19 ఏమీ ఒదిలిపెట్టబడలేదు. చిన్నాపెద్దా, వారి కూతుళ్లు, కొడుకులు, అందర్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. వారి విలువైన వస్తువులన్నీ వారు తిరిగి తెచ్చుకున్నారు. అమాలేకీయులు దోచుకున్న దంతా వారు తిరిగి తెచ్చుకున్నారు. దావీదు సమస్తం మళ్లీ తెచ్చుకున్నాడు.

20 గొర్రెలన్నిటినీ, పశువులన్నింటినీ దావీదు మరల తెచ్చుకున్నాడు. దావీదు మనుష్యులు వాటిని ముందు నడుపుకుంటూ వచ్చారు. వారు “ఇది దావీదు యొక్క బహుమానం” అన్నారు.

21 అలసి నీరసించి దావీదును వెంబడించలేక బెసోరు సెలయేటి దగ్గర దిగబడిపోయిన రెండు వందలమంది సైనికుల వద్దకు దావీదు తిరిగి వచ్చాడు. వారంతా దావీదును, సైన్యాన్ని చూచి ఎదురేగి ఆహ్యానించారు.

22 అయితే దావీదు వెంట వెళ్లిన గుంపులో కొందరు చెడ్డవాళ్లు, అల్లరి మూక ఉన్నారు. వారు, “ఈ రెండు వందల మంది మనతో రాలేదు. కనుక మనము తీసుకున్న వాటిలో వారికి ఎవరికీ ఏమీ ఇవ్వం. కాకపోతే వారివారి భార్య పిల్లలను మాత్రం వారు తీసుకుని వెళ్లిపోవచ్చు” అన్నారు.

23 అది విన్న దావీదు, “కాదు, సోదరులారా! అలా చేయకండి. యెహోవా మనకు ఇచ్చిన వాటి విషయం ఆలోచించండి. మనపై దాడి చేసిన శత్రువులను యెహోవా మనచేత ఓడించాడు.

24 మీరు చెప్పే దానిని ఎవరూ వినరు. సామానుల వద్ద కాపలా వున్న వారికి, యుద్ధం చేసిన వారికి సమంగానే వాటా వస్తుంది. అందకూ సమంగానే పంచుకోవాలి” అన్నాడు.

25 దావీదు దీనిని ఇశ్రాయేలుకు ఒక నియమంగా, ఒక ఆదేశంగా చేశాడు. ఆ నియమం ఈ నాటికీ అమలులో వుంది.

26 దావీదు సిక్లగుకు వచ్చాడు. అతడు అమాలేకీయుల నుండి తెచ్చిన సంపదలో కొంత భాగాన్ని తన స్నేహితులైన యూదా నాయకులకు పంపాడు. “యెహోవా శత్రువులనుండి మేము తెచ్చిన సంపద లోనుంచి మీకో చిరుకానుక” అని చెప్పి పంపాడు దావీదు.

27 అమాలేకీయులనుంచి తాను తెచ్చిన వస్తువులలో మరికొన్నింటిని బేతేలు నాయకులకు, నెగెవులోని రామోతు, యత్తీరు,

28 అరోయేరు, షిష్మోతు, ఎష్తెమో,

29 రాకాలు మొదలగు యెరహ్మెయేలీ నగరాలకు

30 కేనీయుల, హోర్మా, కోరాషాను, అతాకు

31 మరియు హెబ్రోను నగరాల నాయకులకు దావీదు పంపించాడు. అంతేగాక, దావీదు తన మనుష్యులతో ఎక్కడెక్కడికి వెళ్లాడో ఆ ప్రాంతాల నాయకులకు కూడ వాటిలో కొన్నింటిని దావీదు పంపించాడు.

31

1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు సైన్యం చెల్లాచెదురై ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. గిల్బోవ పర్వతంవద్ద చాలా మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు.

2 ఫిలిష్తీయులు సౌలుతోను, అతని కుమారులతోను భీకరంగా పోరాడారు. సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు మరియు మెల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.

3 సౌలు మీద యుద్ధం దారుణంగా జరిగింది. విలుకాండ్రు సౌలు మీద బాణాలు వేయగా సౌలు శరీరంతూట్లు పడిపోయింది.

4 సౌలు తన ఆయుధాలు మోసేవానిని పిలిచి, “నీ కత్తి దూసి దానితో నన్ను సంహరించు. సున్నతి సంస్కారం లేని ఈ పరాయి వాళ్లు నన్ను గేలి చేయకుండా నన్ను సంహరించు” అని చెప్పాడు. కాని సౌలు సహాయకుడు నిరాకరించాడు. అతడు చాలా భయపడిపోయాడు. అందుచేత సౌలు తన కత్తినే దూసి దానితో తనను తానే చంపుకున్నాడు.

5 అలా సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూశాడు. కనుక వాడు కూడ తన కత్తితో తాను పొడుచుకొని సౌలుతో పాటు చనిపోయాడు.

6 కనుక ఆ ఒక్కరోజున సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని సహాయకుడు అందరూ చనిరపోయారు.

7 లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు.

8 ఆ మరునాడు చనిపోయిన వారివద్దనున్న విలువైన వస్తువులను తీసుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు. సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద చనిపోయి ఉన్నట్లు వారు చూశారు.

9 ఫిలిష్తీయులు సౌలు తల నరికి, అతని కవచం తీసుకున్నారు. ఈ వార్తను వారు ఫిలిష్తీయులందరికీ తెలియ జేసి, వారి బూటకపు దేవతల విగ్రహాల దేవాలయానికి కూడ ఆ వార్తను చేరవేశారు.

10 వారు సౌలు కవచాన్ని అష్ఠారోతు దేవత గుడిలో ఉంచారు. ఫిలిష్తీయులు సౌలు శవాన్ని బెత్షాను నగర గోడకు వేలాడదీసారు.

11 ఫిలిష్తీయులు సౌలుకు చేసిన వాటన్నింటిని గూర్చీ యాబేష్గిలాదు నివాసులు విన్నారు.

12 కనుక యాబేషునగరంలో వున్న సైనికులంతా, ఒక రాత్రంతా నడిచి బేత్షాను నగరానికి వెళ్లారు. సౌలు శవాన్ని బేత్షాను నగర గోడ మీదనుంచి వారు దించారు. అలాగే సౌలు కుమారుల శవాలను కూడ ఆ గోడ మీద నుంచి వారు దించారు. అప్పుడు ఆ శవాలన్నిటినీ వారు యాబేషుకు తీసుకుని వెళ్లారు. అక్కడ యాబేషు ప్రజలు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలకు దహన సంస్కారం చేశారు.

13 తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు .”