1 యెహోవా సేవకుడు మోషే. నూను కుమారుడైన యెహోషువ, మోషేకు సహాయకుడు. మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు:
2 “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ఈ ప్రజలు వెళ్లి యోర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి. 3ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను.
3 [This verse may not be a part of this translation]
4 [This verse may not be a part of this translation]
5 నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను ఎడబాయను.
6 “యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ఈ ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది.
7 అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది.
8 ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు.
9 నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే? నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.”
10 కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు:
11 “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యోర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.”‘
12 తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగభాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యెహోషువ చెప్పాడు:
13 “యెహోవా సేవకుడు మోషే మీతో ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాంతి కోసం మీ దేవుడైన యెహోవా మీకు ఒక స్థలం ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యెహోవా మీకు యిస్తాడు.
14 ఇప్పుడు యోర్దాను నదికి తూర్పున ఉన్న ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివసించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా మీ సోదరులతో కలిసి యోర్దాను నది దాటాలి. మీరు యుద్ధానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సహాయపడాలి.
15 విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యోర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.”
16 అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, మేము అలా చేస్తాము. నీవు మమ్నల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తాము.
17 మేము మోషేకు పూర్తిగా విధేయులం అయ్యాము. అలాగే, నీవు చెప్పే ప్రతిదానికీ మేము విధేయులవుతాము. ఒక్క విషయం మాత్రమే మేము యెహోవాను అడుగుతాము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకునూ తోడుగా ఉండాలని అడుగుతాము. 18తర్వాత, ఎవరైనా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, లేక ఎవరైనా నీమీద తిరుగుబాటు చేసినా అలాంటివాడు చావాల్సిందే. బలంగా, ధైర్యంగా ఉండు!”
18 [This verse may not be a part of this translation]
1 నూను కుమారుడైన యెహోషువ, ప్రజలు అంతా ఆకాషియా దగ్గర గుడారాలు వేసుకొనిరి. యెహోషువ ఇద్దరు గూఢచారుల్ని పంపించాడు. వీళ్లను యెహోషువ పంపినట్టు మరెవ్వరికీ తెలియదు. “మీరు వెళ్లి ఆ దేశాన్ని చూడండి. ముఖ్యంగా యెరికో పట్టణాన్ని దగ్గరగా చూడండి” అని యెహోషువ ఆ మనుష్యులతో చెప్పాడు. కనుక ఆ మనుష్యులు యెరికో పట్టణం వెళ్లారు. వాళ్లు ఒక వేశ్య ఇంటికి వెళ్లి, అక్కడ వుండిరి. ఆ స్త్రీ పేరి రాహాబు.
2 “మన ప్రజల బలహీనత తెలుసుకొనేందుకు కొందరు ఇశ్రాయేలు మనుష్యులు వచ్చారు” అని యెరికో రాజుతో ఎవరో చెప్పారు. 3కనుక యెరికో రాజు రాహాబుకు ఇలా కబురంపాడు: “నీ ఇంటికి వచ్చిదాక్కొన్న ఆ మనుష్యుల్ని దాచిపెట్టకు. వాళ్లను బయటకు తీసుకొనిరా. వాళ్లు మన దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు.”
3 [This verse may not be a part of this translation]
4 [This verse may not be a part of this translation]
5 సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.”
6 అయితే నిజానికి వాళ్లను అటక మీద జనుపకట్టెలో దాచిపెట్టింది.
7 కనుక రాజుగారి మనుష్యులు ఇశ్రాయేలు వాళ్లిద్దరి కోసం వెదుక్కుంటూ వెళ్లిపోయారు. యోర్దాను నది రేవుల దగ్గరకు వారు వెళ్లారు. రాజుగారి మనుష్యులు పట్టణం నుండి బయటకు వెళ్లిన ఆ సమయంలోనే పట్టణ ద్వారాలు మూసివేయబడ్డాయి.
8 ఆ ఇద్దరు మనుష్యులూ అప్పుడే నిద్రకు ఉపక్రమించబోతున్నారు. అయితే ఆమె అటక పైకి వెళ్లి వాళ్లతో మాట్లాడింది.
9 రాహాబు అంది, “ఈ దేశాన్ని యెహోవా మీ ప్రజలకు ఇచ్చాడని నాకు తెలుసు. మీరంటే మాకు భయం. ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ మీరంటే భయమే.
10 యెహోవా మీకు సహాయం చేసిన విధానాల్ని గూర్చి విన్నాము గనుక మాకు భయం. మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడ ఎర్ర సముద్రం ఆరిపోయేటట్టు ఆయన చేసాడని మేము విన్నాము. అమోరీ రాజులైన సీహోను, ఓగులకు మీరు చేసినదాన్ని గూర్చి కూడ మేము విన్నాము. యెర్దాను నదికి తూర్పున ఉన్న ఆ రాజులను మీరు నాశనం చేసిన సంగతి మేము విన్నాము.
11 ఆ సంగతులు మేము విని చాల భయపడిపోయాము ఇప్పుడు మా వాళ్లెవరికీ మీతో పోరాడే ధైర్యంలేదు. ఎందు చేతనంటే పైన ఆకాశాన్ని కింద భూమిని మీ యెహోవా దేవుడే పాలిస్తున్నాడు గనుక.
12 ఇప్పుడు మీరు నాతో ఒడంబడిక చేస్తామని మాట ఇవ్వండి. నేను మీకు సహాయం చేసాను, దయ చూపించాను. కనుక మీరు నా కుటుంబానికి దయ చూపిస్తామని యెహోవా ఎదుట ప్రమాణం చేయండి. ఇలా మీరు చేస్తామని దయచేసి నాకు చెప్పండి.
13 నా తండ్రి, తల్లి, సోదరులు, సోదరీలు, వాళ్లందరి కుటుంబాల్ని, నా కుటుంబాన్ని మీరు బ్రతుకనిస్తామని నాకు మాట ఇవ్వండి. చావునుండి మీరు మమ్మల్ని రక్షిస్తామని ప్రమాణం చేయండి.”
14 ఆ మనుష్యలు ఒప్పుకున్నారు. “మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తోన్న పని గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు చెప్పారు.
15 ఆ స్త్రీ ఇల్లు పట్టణం ప్రహారీ గోడమీద కట్టబడింది. అది గోడలో ఒక భాగంగా ఉంది. కనుక ఆమె ఒక తాడు ప్రయోగించి కిటికీలోనుంచి వాళ్లిద్దర్నీ కిందికిదించింది.
16 అప్పుడు ఆమె వాళ్లతో అంది: “పొరబాటున కూడా మీరు రాజుగారి మనుష్యులకు కనపడకుండా పడమటి కొండల్లోకి వెళ్లిపోండి. మూడు రోజులు అక్కడ దాక్కోండి. రాజుగారి మనుష్యులు తిరిగి వచ్చాక, మీ దారిన మీరు వెళ్లవచ్చు.”
17 ఆ మనుష్యులు ఇద్దరూ ఆమెతో అన్నారు: “మేము నీకు వాగ్దానం చేసాము. అయితే నీవు ఒక పని చేయాలి. లేకపోతే మా వాగ్దానానికి మేము బాధ్యులంకాదు.
18 మేము తప్పించుకోనేందుకు నీవు ఈ ఎర్రటి తాడు ప్రయోగిస్తున్నావు. మేము ఈ దేశానికి తిరిగి వస్తాము. ఆ సమయంలో ఈ ఎర్రటి తాడును నీవు నీ కిటికీలో కట్టాలి. నీ తండ్రిని, తల్లిని, నీ సోదరులను, నీ కుటుంబం అంతటిని నీవు నీ ఇంట్లో చేర్చాలి.
19 ఈ ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరినీ మేము క్షేమంగా కాపాడుతాము. నీ ఇంట్లో ఉన్న వాళ్లెవరైనా దెబ్బతింటే దానికి మేము బాధ్యులము. నీ ఇంట్లోనుంచి ఎవరైనా బయటకు వెళ్లి, చంపబడితే దానికి మేము బాధ్యులము కాము. అది ఆ వ్యక్తి తప్పు అవుతుంది.
20 ఈ ఒడంబడిక మేము నీతో చేస్తున్నాము. మేము చేస్తోన్న పనిగూర్చి నీవు గనుక ఎవరితోనైనా చెప్పావు అంటే మేము ఈ ఒడంబడికకు కట్టుబడి ఉండనక్కర్లేదు.”
21 “ఇది నాకు సమ్మతమే” అని ఆ స్త్రీ జవాబిచ్చింది. ఆమె వాళ్లకు వీడ్కోలు చెప్పింది, వాళ్లు ఆమె ఇల్లు విడిచి బయల్దేరారు. అప్పుడు ఆమె ఆ ఎర్రటి తాడును కిటికీకి కట్టింది.
22 ఆ మనుష్యులు ఆమె ఇల్లు విడిచి, కొండల్లోకి వెళ్లిపోయారు. మూడు రోజులు వాళ్లు అక్కడే ఉన్నారు. రాజు మనుష్యులు మార్గం అంతా వెదికారు. మూడు రోజుల తర్వాత రాజు మనుష్యులు వెదకటం మానివేసి పట్టణానికి తిరిగి వెళ్లిపోయారు.
23 అప్పుడు ఆ మనుష్యులు ఇద్దరూ యెహోషువ దగ్గరకు ప్రయాణం మొదలుబెట్టారు. వాళ్లు కొండలు విడిచి, నది దాటారు. నూను కుమారుడైన యెహోషువ దగ్గరకు వారు వెళ్లారు. వారు తెలుసుకొన్న సమాచారం అంతా వాళ్లు యెహోషువకు చెప్పారు.
24 వారు యెహోషువతో, “నిజంగా ఆ దేశం అంతా యెహోవా మనకు ఇచ్చాడు. ఆ దేశ ప్రజలందరికీ మనమంటే భయంగా ఉంది” అని చెప్పారు.
1 మరునాడు ఉదయం పెందలాడే యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ లేచి షిత్తీము విడిచి పెట్టారు. యోర్దాను నదికి వారు ప్రయాణం చేసారు. నది దాటి అవతలికి వెళ్లకముందు వారు యెర్దాను నది దగ్గర గుడారాలు వేసారు.
2 మూడు రోజుల తర్వాత నాయకులు పాళెమునంతా తిరిగి చూసారు.
3 నాయకులు ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, “మీ యెహోవా దేవుని ఒడంబడిక పెట్టెను యాజకులు, లేవీయులు మోయటం మీరు చూస్తారు. ఆ సమయంలో మీరు ఉన్న చోటు విడిచి, వాళ్లను వెంబడించాలి.
4 కానీ మరీ సమీపంగా వెంబడి పోకూడదు. ఒక 1000 గజాలు వారికి వెనుకగా ఉండండి. ఈ మార్గంలో మీరు ఇదివరకు ఎన్నడూ ప్రయాణం చేయలేదు. అందుచేత వారిని వెంబడిస్తే, ఎక్కడికి వెళ్లాల్సిందీ మీకు తెలుస్తుంది” అని వారు చెప్పారు.
5 అప్పుడు యెహోషువ, “మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపు యెహోవా అద్భుత కార్యాలు చేయటానికి మిమ్మల్ని వాడుకొంటాడు” అని ప్రజలతో చెప్పాడు.
6 తర్వాత యెహోషువ, “ఒడంబడిక పెట్టెను తీసుకొని ప్రజలకు ముందుగా నదిని దాటండి” అని యాజకులతో చెప్పాడు. కనుక యాజకులు ఆ పెట్టెను ఎత్తుకొని, ప్రజలకు ముందు మోసు కొనిపోయారు.
7 అప్పుడు యెహోషువతో యెహోవా చెప్పాడు: “ఈ వేళ ఇశ్రాయేలీయులందరి దృష్టిలో నిన్ను ఒక గొప్పవానిగా చేస్తాను. నేను మోషేకు తోడుగా ఉన్నట్టే, నీకూ తోడుగా ఉన్నానని అప్పుడు వాళ్లు తెలుసుకొంటారు. 8యాజకులు ఒడంబడిక పెట్టె మోస్తారు. యాజకులతో ఇలా చెప్పు. యోర్దాను నదీ తీరానికి నడవండి, సరిగ్గా మీరు నీళ్లలో కాలుపెట్టే ముందు ఆగండి”‘
8 [This verse may not be a part of this translation]
9 [This verse may not be a part of this translation]
10 జీవంగల దేవుడు మీతో నిజంగా ఉన్నాడు అనేందుకు ఇదే ఋజువు. నిజంగా ఆయన మీ శత్రువుల్ని ఓడించేస్తాడు అనేందుకు ఇదే ఋజువు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, గెర్గేషీ ప్రజలు, అమోరీ ప్రజలు, యెబూసీ ప్రజలు అందరినీ ఆయన ఈ దేశంనుండి వెళ్ల గొట్టేస్తాడు.
11 ఇదే ఋజువు. మీరు యోర్దాను దాటేటప్పుడు, సర్వలోకాధిపతి ఒడంబడిక పెట్టె మీకు ముందుగా వెళ్తుంది.
12 ఇప్పుడు మీలో 12 మందిని ఏర్పాటు చేయండి. ఇశ్రాయేలీయుల 12 వంశాల్లో ఒక్కోదాని నుండి ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేసుకొనండి.
13 సర్వలోకాధికారి అయిన యెహోవా ఒడంబడిక పెట్టెను యాజకులు మోస్తారు. వారు ఆ పెట్టెను మీకు ముందు యెర్దాను నదిలోనికి మోసుకొని వెళ్తారు. వారు నీళ్లలో ప్రవేశించగానే యోర్దాను నదీ ప్రవాహం నిలిచిపోతుంది. నీరు నిలిచిపోయి, ఆ స్థలానికి వెనుక ఆనకట్టు వేసినట్టు నిలిచిపోతాయి.”
14 యాజకులు ఒడంబడిక పెట్టె మోయగా, ప్రజలుతాము గుడారాలు వేసిన చోటునుండి బయల్దేరారు. ప్రజలు యెర్దాను నది దాటడం ప్రారంభించారు.
15 (కోతకాలంలో యోర్దాను నది దాని గట్లు మీద పొర్లి పారుతుంది. అందుచేత నది పొంగుతూ ఉంది.) పెట్టెను మోస్తున్న యాజకులు నది ఒడ్డుకు వచ్చారు. నీళ్లలో వారు నిలిచిపోయారు.
16 సరిగ్గా అప్పుడే నీరు ప్రవహించటం ఆగిపోయింది. (ఆ స్థలం వెనుక నీళ్లు ఆనకట్ట కట్టినట్టు నిలిచిపోయాయి.) నది పొడవునా ఆదాం వరకు (సారెతాను దగ్గర ఒక ఊరు.) నీరు ఎత్తుగా నిలబడ్డాయి. ప్రజలు యెరికో దగ్గర నది దాటారు.
17 ఆ చోట నేల ఆరిపోయింది. యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను ఆ నది మధ్యవరకు మోసుకొని వెళ్లి, అక్కడ నిలిచిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ యెర్దాను నదిలో ఆరిన నేలమీద నడచి, ఆవలికి దాటేవరకు యాజకులు అక్కడ వేచి ఉన్నారు.
1 ప్రజలంతా యోర్దాను నది దాటడం ఆయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు:
2 “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి.
3 నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.”
4 కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు.
5 యెహోషువ వాళ్లతో చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి.
6 ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తలో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు.
7 యోర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”
8 కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యోర్దాను నది మధ్యలోనుండి పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయిఉంది. యెహోషువకు యోహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని ఉంచారు.
9 (యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యోర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోటకూడ యెహోషువ పన్నెండు రాళ్లు ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.)
10 ప్రజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. 11ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకొని వెళ్లారు.
11 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు, మిగిలిన ప్రజలకు సహాయం చేయటానికి వీరు వెళ్తున్నారు.
12 యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా ఎదుట సాగిపోయారు. యెరికో మైదానాల దిశగా వారు సాగిపోయారు.
13 ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువను ఒక మహామనిషిగా యెహోవా చేసాడు. అప్పట్నుంచి ప్రజలు యెహోషువను గౌరవించారు. మోషేను వారు గౌరవించినట్టే యెహోషువను కూడ వారు జీవితకాలమంతా గౌరవించారు.
14 ఆ పెట్టెను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో నిలబడి ఉండగానే,
15 [This verse may not be a part of this translation]
16 [This verse may not be a part of this translation]
17 కనుక యెహోషువ యాజకులకు, “యెర్దాను నదిలోనుండి బయటకు రండి” అని ఆజ్ఞాపించాడు.
18 యాజకులు యెహోషువకు విధేయులయ్యారు. వారు ఆ పెట్టెను మోసుకొని, నదిలో నుండి బయటకు వచ్చారు. యాజకుల పాదాలు, నది ఆవలి ఒడ్డున నేలను తాకగానే, నదిలో నీరు మరల ప్రవహించటం మొదలయింది. ప్రజలు నదిని దాటి వెళ్లక ముందులాగే నీరు గట్ల మీద పొర్లి పారుతున్నాయి.
19 మొదటి నెల పదో రోజున ప్రజలు యోర్దాను నది దాటారు. యెరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేసారు
20 యోర్దాను నదిలోనుంచి తీసుకొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలువ బెట్టాడు.
21 అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పడు:”‘ఈ రాళ్లు ఏమిటి?’ అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు
22 ‘ఏ విధంగాెనైతే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని ఆరిన నేలమీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్లు తోడ్పడుతాయి’ అని పిల్లలతో మీరు చెప్పాలి.
23 మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేసాడు. ప్రజలు దానిని దాటిపోయేంతవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలకు యెహోవా ఏమి చేసాడో , యోర్దాను నది దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి.
24 యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు.”
1 కనుక ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటి వెళ్లేంతవరకు యెహోవా దానిని ఎండి పోయేటట్టు చేసాడు. యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు, మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఉన్న కనానీ ప్రజలు ఇది విని చాల భయపడిపోయారు. అంతటితో ఇశ్రాయేలు ప్రజలను ఎదిరించే ధైర్యం వారికి లేక పోయింది.
2 ఆ సమయంలో యెహోవా, “మొనగల రాళ్లతో కత్తులు చేసి, ఇశ్రాయేలు ప్రజలకు మరల సున్నతి చేయు” అని యెహోషువతో చెప్పాడు.
3 కనుక యెహోషువ మొనగల రాళ్లతో కత్తులు చేసాడు. తర్వాత గిబియత్ హార్లత్ దగ్గర అతడు వారికి సున్నతి చేసాడు.
4 [This verse may not be a part of this translation]
5 [This verse may not be a part of this translation]
6 [This verse may not be a part of this translation]
7 [This verse may not be a part of this translation]
8 ప్రజలందరికీ యెహోషువ సున్నతి చేయటం ముగించాడు. తర్వాత వాళ్లంతా స్వస్థత పడేంతవరకు ఆ గుడారాలలోనే ఉండిపోయారు.
9 ఆ సమయంలో యోహోవా, “మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు అవమానం పొందారు కానీ నేడు ఆ అవమానాన్ని నేను తొలగించివేసాను” అని యెహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలానికి గిల్గాలు అని యెహోషువ పేరు పెట్టాడు. నేటికీ ఆ చోటు గిల్గాలు అనే పిలువబడుతోంది.
10 ఇశ్రాయేలు ప్రజలు యెరికో మైదానాల్లో గిల్గాలులో దిగియున్నప్పుడే వారు పస్కా విందు చేసారు. అది ఆ నెల 14వ తేదీ సాయంత్రం.
11 మరునాడు పస్కా తర్వాత ప్రజలు ఆ దేశంలో పండిన ఆహారం కొంత భోజనం చేసారు. పులుపు పదార్థం లేని రొట్టెను, వేయించిన గింజలను వారు తిన్నారు.
12 ఆ రోజు ప్రజలు ఈ ఆహారం భోజనంచేసిన తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఆగిపోయింది. ఆ తర్వాత ఆకాశంనుండి వచ్చే ప్రత్యేక ఆహారం ఇశ్రాయేలు ప్రజలకు లభించలేదు. అప్పట్నుంచి కనాను దేశంలో పండిన పంటనే వారు తిన్నారు.
13 యెహోషువ యెరికోకు సమీపంగా ఉన్నప్పుడు అతడు పైకి చూడగా అతని యెదుట ఒక మనిషినిలిచి ఉండటం కనబడింది. ఆ మనిషి చేతిలో ఒక ఖడ్గం ఉంది. యెహోషువ అతని దగ్గరకు వెళ్లి, “నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు.
14 ఆ మనిషి, “నేను శత్రువును కాను. నేను యెహోవా సైన్యములకు సేనాధిపతిని. ఇప్పుడే నేను మీ దగ్గరకు వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ, ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి. “నా యజమాని, తన సేవకుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగెను.
15 అందుకు యెహోవా సైన్యాధిపతి, “నీ చెప్పులు తీసివేయి. ఇప్పుడు నీవు నిలిచిన స్థలం పవిత్ర స్థలము” అని చెప్పాడు. కనుక యెహోషువ ఆయనకు విధేయుడయ్యాడు.
1 యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు.
2 అప్పుడు యెహోషువతో యోహోవా చెప్పాడు: “చూడు, యెరికో పట్టణాన్ని నేను నీ స్వాధీనంలో ఉంచాను. దాని రాజు, పట్టణంలోని యుద్ధ వీరులు నీ స్వాధీనంలో ఉన్నారు.
3 నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి.
4 పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలు ఊదేందుకు ఏడుగురు యాజకులను నియమించుము. పవిత్ర పెట్టెకు ముందుగా నడువుమని యాజకులతో చెప్పు. ఏడో రోజున ఏడుసార్లు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఏడోరోజున వారు ముందడుగు వేయగానే బూరలు ఊదాలని యాజకులతో చెప్పు.
5 యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.”
6 కనుక నూను కుమారుడైన యెహోషువ యాజకులందర్నీ సమావేశపర్చాడు. “యెహోవా పవిత్ర పెట్టెను మోయండి. ఏడుగురు యాజకులు బూరలు మోయాలని చెప్పండి. ఆ యాజకులు పవిత్ర పెట్టెకు ముందుగా నడవాలి” అని యెహోషువ వారితో చెప్పాడు.
7 “ఇప్పుడు బయల్దేరండి. పట్టణం చుట్టూ నడవండి. ఆయుధాలు ధరించిన సైనికులు యెహోవా పవిత్ర పెట్టె ఎదుట నడవాలి” అని యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించాడు.
8 యెహోషువ ప్రజలతో మాట్లాడటం ముగించగానే, ఏడుగురు యాజకులు యెహోవా సన్నిధిని నడవటం మొదలుబెట్టారు. ఏడు బూరలను వారు మోసుకొని వెళ్లారు. వారు నడుస్తూ ఉన్నప్పుడు బూరలు ఊదారు. యెహోవా పవిత్ర పెట్టెను మోసే వారు వారి వెనుక నడిచారు.
9 ఆయుధాలు ధరించిన సైనికులు యాజకులకు ముందుగా నడిచారు. పవిత్ర పెట్టె వెనుక నడుస్తోన్న వాళ్లు బూరలు ఊదారు.
10 అయితే యుద్ధనాదం చేయవద్దని యెహోషువ ప్రజలతో చెప్పాడు. “కేకలు వేయకండి. నేను మీతో చెప్పే రోజు వరకు ఒక్క మాటకూడ పలుకకండి. తరువాత మీరు కేకలు వేయవచ్చు” అన్నాడు యోహోషువ.
11 కనుక యెహోవా పవిత్ర పెట్టెను పట్టణంచుట్టూ ఒక్క సారి యాజకులచేత యెహోషువ మోయించాడు. తర్వాత వారు వారి బసకు వెళ్లి ఆ రాత్రి అక్కడే గడిపారు.
12 మర్నాటి ఉదయాన్నే యెహోషువ లేచాడు. యాజకులు యెహోవా పవిత్ర పెట్టెను మరలా మోసారు.
13 మరియు యాజకులు ఏడుగురు ఏడు బూరలు మోసారు. యెహోవా పవిత్ర పెట్టె ఎదుట వారు నడుస్తూ బూరలు ఊదారు. ఆయుధాలు ధరించిన సైనికులు వారికి ముందుగా నడిచారు. యెహోవా పవిత్ర పెట్టె వెనుక నడిచే యాజకులు నడుస్తూ, బూరలు ఊదారు.
14 కనుక రెండో రోజున వాళ్లంతా పట్టణం చుట్టూ ఒక మారు ప్రదక్షిణం చేసారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వారి బసకు వెళ్లిపోయారు. ఆరు రోజులపాటు వారు ఇలానే ప్రతిరోజూ చేసారు.
15 ఏడో రోజు సూర్యోదయాన్నే వారు మేల్కొన్నారు. వారు పట్టణం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసారు. అంతకు ముందు రోజులలో నడచినట్టే నడిచారు, కాని ఆ రోజు పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరిగారు.
16 పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు!
17 ఈ పట్టణం, ఇందులో ఉన్న సమస్తం యోహోవాదే . వేశ్య రాహాబు, ఆమె ఇంటిలో ఉన్న వారు మాత్రమే బ్రతకాలి. మనం పంపిన ఇద్దరికీ రాహాబు సహాయం చేసింది గనుక వారిని చంపకూడదు.
18 మరియు మిగిలిన వాటన్నింటినీ మనం నాశనం చేసివేయాలని జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని తీసుకోవద్దు. మీరు వాటిని తీసుకొని, మన పాళెములోనికి గనుక తీసుకొని వస్తే మిమ్మల్ని మీరే నాశనం చేసుకొంటారు. పైగా మీరు మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ కష్టం తెచ్చి పెడ్తారు.
19 వెండి, బంగారం మరియు ఇత్తడి, ఇనుముతో చేసిన వస్తువులన్నీ మొత్తం యోహోవాకే చెందుతాయి. వాటన్నింటినీ ఆయన కోసం దాచిపెట్టాలి.”
20 యాజకులు బూరలు ఊదారు. ప్రజలు బూరలువిని కేకలు వేయటం మొదలుబెట్టారు. గోడలు కూలి పోయాయి. ప్రజలు ఏకంగా పట్టణంలో జొరబడి పోయారు. అందుచేత ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణాన్ని ఓడించేసారు.
21 ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్ని ప్రజలు నాశనం చేసారు. అక్కడ ప్రాణంతో ఉన్న సమస్తాన్ని వాళ్లు నాశనం చేసారు. పడుచు కుర్రాళ్లను పెద్ద మగవాళ్లను, పడుచు పిల్లల్ని, స్త్రీలను పశువుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని వారు చంపేశారు.
22 ఆ దేశాన్ని చూసేందుకు తాను పంపించిన ఇద్దరు మనుష్యులతో యోహోషువ మాట్లాడాడు: “ఆ వేశ్య ఇంటికి వెళ్లండి. ఆమెను బయటకు తీసుకొని రండి. మరియు ఆమెతో ఉన్న వాళ్లందరినీ బయటకు తీసుకొని రండి. మీరు ఆమెతో చేసిన వాగ్దానం ప్రకారం మీరు ఇలా చేయండి.”
23 కనుక ఆ ఇద్దరు మనుష్యులూ ఆ ఇంట్లోకి వెళ్లి, రాహాబును బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తండ్రి, తల్లి, సోదరులు, ఆమె కుటుంబం మొత్తం, ఆమెతో ఉన్న వాళ్లందర్నీ వారు బయటకు తీసుకొనివచ్చారు. ఆ మనుష్యులందరినీ ఇశ్రాయేలీయుల పాళెము వెలుపల క్షేమకరమైన చోట వారు ఉంచారు.
24 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం మొత్తాన్ని తగులబెట్టేసారు. వెండి, బంగారం, ఇత్తడి, ఇనుముతో చేయబడినవి తప్ప ఆ పట్టణంలో ఉన్న వాటన్నింటినీ వారు కాల్చేసారు. ఇవన్నీ యెహోవా కోసం భద్రం చేయబడ్డాయి.
25 వేశ్య రాహాబును, ఆమె కుటుంబాన్ని, ఆమెతో ఉన్నవారందరినీ యెహోషువ రక్షించాడు. యెరికోను వేగు చూచేందుకు యెహోషువ పంపిన మనుష్యులకు రాహాబు సహాయం చేసింది కనుక యెహోషువ వారిని బ్రదుకనిచ్చాడు. నేటికీ రాహాబు ఇశ్రాయేలు ప్రజల్లో సజీవంగా ఉండిపోయింది.
26 ఆ సమయంలోనే ముఖ్యమైన ఈ వాగ్దానం యెహోషువ చేసాడు: “ఈ యెరికో పట్టణాన్ని మరల ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే వారు యెహోవా వలన ప్రమాదానికి గురి అవుతారు. ఈ పట్టణానికి పునాది వేసే మనిషి తన పెద్ద కుమారుణ్ణి పోగొట్టుకుంటాడు. ద్వారాలు నిలబెట్టేవాడు తన చిన్న కుమారుణ్ణి పోగొట్టుకొంటాడు.”
27 కనుక యెహోవా, యెహోషువకు తోడుగా ఉన్నాడు. మరియు యెహోషువ ఆ దేశం అంతటా ప్రసిద్ధి చెందాడు.
1 అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనుమడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది.
2 వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు.
3 తర్వాత ఆ మనుష్యులు యెహోషున దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు.
4 [This verse may not be a part of this translation]
5 [This verse may not be a part of this translation]
6 యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు.
7 అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యోర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యోర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది.
8 నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు.
9 కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలు అందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?”
10 యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు?
11 ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దొంగతనం చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు వారికోసం దాచుకొన్నారు.
12 అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్ప నేను ఇక మీదట మీకు తోడుగా ఉండును.
13 “ఇప్పుడు వెళ్లి, ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో ఇలా చెప్పు, ‘మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత మంది దాచిపెట్టుకొన్నారని ఆయన చెబుతున్నాడు. వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికీ మీ శత్రువుల్ని ఓడించలేరు.
14 “‘రేపు ఉదయం మీరంతా యెహోవా ఎదుట నిలవాలి. అన్ని గోత్రాలూ యెహోవా యెదుట నిలబడాలి. ఒక గోత్రాన్ని యెహోవా నిర్ణయం చేస్తాడు. అప్పుడు ఆ గోత్రం మాత్రమే యెహోవా యెదుట నిలబడాలి. అప్పుడు ఆ గోత్రం నుండి ఒక వంశాన్ని యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్లు మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. ఆ వంశంలో నుండి ఒక్క కుటుంబాన్ని మాత్రమే యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఒక్కొక్క పురుషుని యెహోవా చూస్తాడు.
15 మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకొన్న మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషిని అగ్నితో కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన సమస్తం అతనితో బాటు నాశనం చేయబడుతుంది. యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉల్లంఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహాఅపరాధం చేసాడు.”‘
16 మర్నాడు ఉదయం పెందలాడే ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా ఎదుటకు యోహోషువ నడిపించాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. యూదా గోత్రాన్ని యెహోవా నిర్ణయించాడు.
17 కనుక యూదా గోత్రములోని వంశాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జెరహు వంశాన్ని యెహోవా నిర్ణయం చేసాడు. అప్పుడు జెరహు వంశంలోని కుటుంబాలు అన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జబ్ది కుటుంబం నిర్ణయించబడింది.
18 అప్పుడు ఆ కుటుంబంలోని పురుషులంతా యెహోవా ఎదుటికి రావాలని యెహోషువ చెప్పాడు. కర్మీ కుమారుడైన ఆకానును యెహోవా నిర్ణయం చేసాడు. (జిర్మి కుమారుడు కర్మి, జెరహు కుమారుడు జబ్ది).
19 అప్పుడు ఆకానుతో యెహోషువ అన్నాడు: “నా కుమారుడా, (నీ ప్రార్థన చేసుకో) ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించి, నీవు ఒప్పుకో. నీవేం చేసావో నాతో చెప్పు. నా దగ్గర ఏమీ దాచేందుకు ప్రయత్నించకు!”
20 ఆకాను ఇలా జవాబిచ్చాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన మాట నిజమే. నేను చేసింది ఏమిటంటే,
21 యెరికో పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నిటినీ మనం పట్టుకొన్నాము గదా! వాటిలో అందమైన ఒక బబులోను అంగీ, రెండు వందల తులాల వెండి, యాభైతులాలకంటె ఎక్కువ బంగారం నేను చూసాను. ఇవన్నీ తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని తీసుకొన్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి మీకు కనబడుతాయి. వెండి కూడ అంగీ కిందనే ఉంది.”
22 కనుక యెహోషువ కొందరు మనుష్యుల్ని ఆ గుడారానికి పంపించాడు. వారు ఆ గుడారానికి పరుగెత్తి వెళ్లి, ఆ వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం చూసారు. వెండి కూడా అంగీ కిందనే ఉంది.
23 ఆ మనుష్యులు ఆ వస్తువుల్ని గుడారంలోనుంచి వెలుపటికి తీసుకొనివచ్చారు. వారు ఆ వస్తువుల్ని యెహోషువ దగ్గరకు, ప్రజలందరి దగ్గరకు తీసుకొని వెళ్లారు. వారు యెహోవా ఎదుట వాటిని నేలమీద పెట్టారు.
24 అప్పుడు యెహోషువ, ప్రజలు అందరూ కలిసి జెరహు కుమారుడు ఆకానును ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు. వెండి, అంగీ, బంగారం, ఆకాను కుమారులు, కూతుళ్లు, అతని పశువులు, అతని గాడిదలు, అతని గొర్రెలు, అతని గుడారం, అతనికి ఉన్న సర్వమును వారు తీసుకొని వెళ్లారు. వారు వీటన్నింటినీ ఆకానుతోబాటు ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు.
25 అప్పుడు యెహోషువ, “నీవు మాకు ఇంత కష్టం ఎందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియదు! కానీ ఇప్పుడు యెహోవా నిన్ను బాధిస్తాడు!” అన్నాడు. అప్పుడు ప్రజలు ఆకాను చచ్చేంతవరకు అతణ్ణి రాళ్లతో కొట్టారు. అతని కుటుంబాన్నికూడ వారు చంపేసారు. అప్పుడు వాళ్లందర్నీ, అతనికి ఉన్నదాన్నంతటినీ ప్రజలు కాల్చివేసారు. 26వారు ఆకానును కాల్చేసిన తర్వాత, అతని శరీరం మీద చాల రాళ్లు కుప్పగా వేసారు. ఆ రాళ్లు నేటికీ అక్కడ ఉన్నాయి. (కనుక యెహోవా ఆకానును బాధించాడు.) అందుకే ఆ స్థలం ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆ తర్వాత యెహోవా ప్రజల మీద కోపగించలేదు.
26 [This verse may not be a part of this translation]
1 అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: “భయపడకు. జడియకు. నీ యుద్ధ వీరులందరినీ హాయి మీదికి నడిపించు. హాయి రాజును ఓడిచేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను.
2 నీవు యెరికోకు, దాని రాజుకు చేసినట్టే హాయికి, దాని రాజుకుగూడ చేస్తావు. ఈసారి మాత్రమే మీరు ఐశ్వర్యాలన్నీ తీసుకొని మీకోసం దాచుకోవచ్చు. ఆ ఐశ్వర్యాలను మీరు, మీ ప్రజలు పంచుకోండి. ఇప్పుడు మీ సైనికులు కొందర్ని పట్టణం వెనుక మాటు వేయమని చెప్పు.”
3 కనుక యెహోషువ తన సైన్యం అంతటినీ హాయివైపు నడిపించాడు. తర్వాత మంచి పరాక్రమంగల ముప్పయివేలమంది శూరులను యెహోషువ ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు వీళ్లందరినీ రాత్రి పూట బయటకు పంపించాడు.
4 యెహోషువ వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కనిపెడ్తూ, సిద్ధంగా ఉండండి.
5 నేను నాతో ఉన్న మనుష్యులను పట్టణం మీదికి నడిపిస్తాను. పట్టణంలోపలి మనుష్యలు మాతో యుద్ధం చేయటానికి బయటకు వస్తారు. మేము ఇదివ రకువలెనే, వెనుదిరిగి వారి దగ్గర్నుండి పారిపోతాం.
6 ఆ మనుష్యులు పట్టణం నుండి మమ్మల్ని తరుముతారు. ఇదివరకువలెనే మేము వాళ్ల ఎదుట నుండి పారిపోతున్నామని వారు అనుకొంటారు. కనుక మేము పారిపోతాము.
7 అప్పుడు మీరు దాగుకొన్న చోటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మీ యెహోవా దేవుడు మీరు గెలిచేందుకు మీకు శక్తి ఇస్తాడు.
8 “యెహోవా చెప్పినట్టే మీరు చేయాలి. నన్ను గమనించండి. దాడి చేసేందుకు నేను మీకు ఆజ్ఞఇస్తాను. మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత మీరు దాన్ని కాల్చివేయాలి.”
9 అప్పుడు యెహోషువ, వారు దాగుకొనే చోటుకు వారిని పంపించగా, బేతేలు, హాయికి మధ్యగల ఒకచోటికి వారు వెళ్లారు. ఇది హాయికి పశ్చిమాన ఉంది. ఆ రాత్రి యెహోషువ తన మనుష్యుల దగ్గరే ఉండిపోయాడు.
10 మరునాడు ఉదయాన్నే యోహోషువ పురుషులందరినీ సమావేశం చేసాడు. అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు నాయకులు అందరినీ హాయి మీదికి నడిపించారు.
11 యెహోషునతో ఉన్న సైనికులందరూ హాయి మీద దాడి చేశారు. ఆ పట్టణం ఎదుట వాళ్లు ఆగి పోయారు. పట్టణానికి ఉత్తరాన సైన్యం బసచేసింది. సైన్యానికినీ హాయికినీ మధ్య ఒక లోయఉంది.
12 అప్పుడు యెహోషువ ఐదువేల మంది పురుషులను ఏర్పరచుకొన్నాడు. పట్టణానికి పశ్చిమంగా, బేతేలుకు, హాయికి మధ్య ప్రాంతంలో దాగి ఉండమని యెహోషువ వారిని పంపించాడు.
13 కనుక యెహోషువ తన మనుష్యుల్ని యుద్ధానికి సిద్ధం చేసాడు. పట్టణానికి ఉత్తరాన ముఖ్యమైన బస ఉంది. మిగిలిన వాళ్లు పడమటివైపు దాగుకొన్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోనికి దిగి వెళ్లాడు.
14 తర్వాత హాయి రాజు ఇశ్రాయేలు సైన్యాన్ని చూసాడు. రాజు, అతని ప్రజలు లేచి, ఇశ్రాయేలు సైన్యంతో యుద్ధం చేసేందుకు త్వరపడ్డారు. హాయి రాజు పట్టణానికి తూర్పు దిశన బయటికి వెళ్లాడు. కనుక పట్టణం వెనుకవైపు సైనికులు దాగి ఉన్న విషయం అతనికి తెలియదు.
15 యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ హాయివారి చేత వెనుకకు నెట్టబడ్డారు. యెహోషువ, అతని మనుష్యులు ఎడారివైపు తూర్పు దిశగా పారిపోవటం మొదలుబెట్టారు.
16 పట్టణంలో ఉన్న ప్రజలు కేకలు వేస్తూ, యెహోషువను, అతని మనుష్యులను తరమటం మొదలుబెట్టారు. ప్రజలంతా పట్టణం వదలిపెట్టేసారు.
17 హాయి, బేతేలు ప్రజలు అంతా ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమారు. పట్టణం బాహాటంగా తెరచి ఉంది పట్టణాన్ని కాపాడేందుకు ఎవరూ అక్కడ ఉండి పోలేదు.
18 యెహోవా “నీ ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకో. ఆ పట్టణాన్ని నేను నీకు ఇస్తాను” అని యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ తన ఈటెను హాయి పట్టణం మీదికి ఎత్తి పట్టుకొన్నాడు.
19 దాగుకొన్న ఇశ్రాయేలు మనుష్యులు ఇది చూసారు. వారు దాగుకొన్న చోటునుండి త్వరగా బయటకు వచ్చి, పట్టణంవైపు త్వరగా బయల్దేరారు. వారు పట్టణంలో ప్రవేశించి, దాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అప్పుడు సైనికులు ఆ పట్టణాన్ని కాల్చి వేసేందుకు మంటలు పెట్టడం మొదలుపెట్టారు.
20 హాయినుండి వచ్చిన మనుష్యులు వెనుకకు తిరిగి చూడగా వారి పట్టణం కాలిపోవటం కనుపించింది. పొగ ఆకాశానికి ఎక్కటం వారు చూసారు. కనుక వారి బలం, ధైర్యం క్షణించిపోయాయి. వారు ఇశ్రాయేలీయులను తర మటం మానివేసారు. ఇశ్రాయేలు మనుష్యులు పారిపోవటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యులతో పోరాటానికి దిగారు. హాయి మనుష్యులు పారిపోయేందుకు క్షేమకరమైన స్థలం ఏమీ లేకపోయింది.
21 యెహోషువ, అతని మనుష్యులు అందరూ, వారి సైన్యం ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటం చూసారు. ఆ పట్టణంనుండి పొగ లేవటంవారు చూసారు. అప్పటికే వారు పరుగెత్తటం మానివేసారు. వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద పోరాటానికి పరుగెత్తారు.
22 అప్పుడు దాగు కొనియున్న మనుష్యలు పోరాటంలో సహాయం చేసేందుకు పట్టణంలో నుండి బయటకు వచ్చారు. హాయి మనుష్యులకు రెండువైపులా ఇశ్రాయేలు సైన్యంఉంది. హాయి మనుష్యులు చిక్కులోపడ్డారు. ఇశ్రాయేలీయులు వారిని ఓడించారు. హాయి మనుష్యుల్లో ఒక్కరినిగూడ బ్రతకనీయకుండా, శత్రువు ఒక్కడూ తప్పించుకోకుండా వారు పోరాడారు.
23 అయితే హాయి రాజును ప్రాణంతో ఉండనిచ్చారు. యెహోషువ మనుష్యులు అతణ్ణి యెహోషువ దగ్గరకు తీసుకొచ్చారు.
24 యుద్ధ సమయంలో హాయి మనుష్యుల్ని ఇశ్రాయేలు సైన్యం పొలాల్లోనికి, ఎడారిలోనికి తరిమింది. కనుక హాయి మనుష్యులందరినీ ఇశ్రాయేలు సైన్యం చంపటం పూర్తి చేసింది. పొలాల్లో, ఎడారిలో ఉన్న మనుష్యులను చంపటం వారు పూర్తి చేసారు. అప్పుడు ఇశ్రేయేలు మనుష్యులంతా తిరిగి హాయి వెళ్లారు. అప్పుడు ఆ పట్టణంలో ప్రాణంతో ఇంకా బతికి ఉన్న వాళ్లందరినీ వారు చంపేసారు.
25 హాయి పట్టణ ప్రజలంతా ఆ రోజునే చనిపోయారు. పన్నెండువేల మంది పురుషులు, స్త్రీలు
26 ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు తన ప్రజలకు ఒక సంకేతంగా యెహోషువ తన ఈటెను హాయి పట్టణం వైపు ఎత్తి పట్టుకొన్నాడు. ఆ పట్టణంలోని ప్రజలు అందరూ నాశనం చేయబడేంతవరకు యెహోషువ ఆపు చేయలేదు.
27 ఆ పట్టణ ప్రజలు కలిగియున్న వస్తువులను, జంతువులను ఇశ్రాయేలు ప్రజలు తమ కోసం దాచు కొన్నారు. యెహోషువకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఇలా చేసేందుకు అనుమతి ఇచ్చాడు.
28 అప్పుడు యెహోషువ హాయి పట్టణాన్ని కాల్చివేసాడు. ఆ పట్టణం ఒక పనికిమాలిన రాళ్ల కుప్ప అయింది. నేటికీ అది అలానే ఉంది.
29 హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం వరకు అతణ్ణి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని కింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.
30 అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాడు. ఏబాలు కొండమీద ఆ బలిపీఠాన్ని అతడు కట్టాడు.
31 బలిపీఠాలు కట్టడం ఎలా అనేది యెహోవా సేవకుడు మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియ జేస్తాడు. కనుక మెషే ధర్మశాస్త్ర గ్రంథంలో వివరించబడిన ప్రకారం యెహోషువ బలిపీఠాన్ని నిర్మించాడు. చెక్కబడని రాళ్లతో బలిపీఠం కట్టబడింది. ఆ రాళ్లమీద ఎన్నడూ ఏ పనిముట్టూ ప్రయోగించబడలేదు. ఆ బలిపీఠం మీద వారు యెహోవాకు దహనబలి అర్పణలు అర్పించారు సమాధాన బలులు కూడా వారు అర్పించారు.
32 ఆ స్థలంలోనే మోషే ధర్మశాస్త్రాన్ని యెహోషువ రాళ్లమీద చెక్కాడు. ఇశ్రాయేలు ప్రజలంతా చూసేందుకు వీలుగా అతడు ఇలా చేసాడు.
33 పెద్దలు, అధికారులు, న్యాయమూర్తులు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ పవిత్ర పెట్టె చుట్టూ నిలబడ్డారు. యెహోవా ఒడంబడిక పవిత్ర పెట్టెను మోస్తున్న లేవీ యాజకుల ఎదుట వారు నిలబడ్డారు. యూదా ప్రజలు, యూదులు కానివాళ్లు అందరూ అక్కడ ఉన్నారు. సగం మంది ప్రజలు ఏబాలు కొండ ఎదుటను, మిగిలిన సగం మంది ప్రజలు గెరిజీము కొండ ఎదుటను నిలబడ్డారు యెహోవా సేవకుడు మోషే ప్రజలను ఆశీర్వదించినప్పటిలానే ఉంది ఇప్పుడు కూడ. మోషే మొదటిసారు ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఇలాగే నిలబడాలని అతడు చెప్పాడు.
34 అప్పుడు యెహోషువ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ చదివాడు. ఆశీర్వాదాలను, శాపాలను కూడ యోహోషువ చదివాడు. ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా అతడు చదివాడు.
35 ఇశ్రాయేలు ప్రజలంతా అక్కడ సమావేశం అయ్యారు. స్త్రీలు, పిల్లలు, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించిన విదేశీయులు అందరూ అక్కడ ఉన్నారు. మరియు మోషే ఇచ్చిన ప్రతి ఆజ్ఞనూ యెహోషువ చదివాడు.
1 యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులు అందరూ ఈ సంగతులు విన్నారు. హిత్తీ, అమోరీ, కనానీ, పెరిజ్జీ, హివ్వీ, యెబూసీ ప్రజలు రాజులు వీరు. వారు కొండ దేశాల్లోనూ, మైదాన దేశాల్లోనూ నివసించారు. మధ్యధరా సముద్ర తీరంలో లెబానోను వరకూ కూడ వారు నివసించారు.
2 ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వారు పథకాలు వేసారు.
3 యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు.
4 కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయాలని నిర్ణయించారు. వారి పథకం ఇలా ఉంది: పగిలిపోయి, చినిగిపోయిన పాత ద్రాక్షారసం తిత్తులను వారు పోగుచేసారు. వారి జంతువుల వీపుల మీద ఈ పాత ద్రాక్షారసపు తిత్తులను వారు వేసారు. వారు చాల దూరంనుండి ప్రయాణం చేసివచ్చి నట్టు కనబడాలని ఈ పాత తిత్తులను అలా జంతువుల మీద వేసారు.
5 ఆ మనుష్యులు పాదాలకు పాత చెప్పులు తొడుక్కొన్నారు. వాళ్లు పాత బట్టలు వేసుకొన్నారు. ఎండిపోయిన విరిగిపోతున్న పాత రొట్టె కొంత వారు సంపాదించారు. అందుచేత ఆ మనుష్యులు చాలా దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడ్డారు.
6 అప్పుడు వాళ్లు ఇశ్రాయేలీయుల బసకు వెళ్లారు. ఈ బస గిల్గాలు దగ్గర ఉంది. ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు వెళ్లి, “మేము చాల దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాము. మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నాం” అని అతనితో చెప్పారు.
7 ఇశ్రాయేలు మనుష్యులు “ఒకవేళ మీరు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మీరు ఎక్కడ్నుంచి వచ్చిందీ మేము తెలుసుకొనేంతవరకు మేము మీతో శాంతి ఒడంబడిక కుదుర్చుకోలేం” అని ఈ హివ్వీయుల వారుతో చెప్పారు.
8 హివ్వీ మనుష్యులు యెహోషువతో “మేము నీ దాసులం” అన్నారు. అయితే యెహోషువ, “మీరెవరు? మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అడిగాడు.
9 [This verse may not be a part of this translation]
10 యోర్దాను నది తూర్పు దిశనున్న అమోరీ రాజులు ఇద్దర్ని ఆయన ఓడించినట్టు మేము విన్నాము. వాళ్లు అష్టారోతు దేశంలో హెష్బాను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు.
11 “కనుక మా నాయకులు, ప్రజలు మాతో ఏమన్నారంటే, ‘మీ ప్రయాణానికి కావలనసినంత భోజనం మీతో తీసుకొని వెళ్లండి; వెళ్లి ఇశ్రాయేలు ప్రజల్ని కలువండి. మేము మీ సేవకులం, మాతో శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్లతో చెప్పండి’ అన్నారు.
12 మా రొట్టెలు చూడండీ. మేము ఇల్లు విడిచినప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను. అయితే ఇప్పుడు ఇది ఎండిపోయి, పాసిపోవటం మీరు చూడగలరు.
13 మా ద్రాక్షారసం తిత్తులను చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు, అవి కొత్తవి, ద్రాక్షారసంతో నిండి ఉండినాయి. ఇప్పుడు అవి పాతబడిపోయి, పిగిలిపోతూ ఉండటం మీకు కనబడుతూనే ఉంది. మా బట్టలు, చెప్పులు చూడండి. మా దూర ప్రయాణంవల్ల మేము ధరించినవన్నీ దాదాపు పాడైపోవటం మీరు చూస్తూనే ఉన్నారు.”
14 ఈ మనుష్యులు చెప్పేది సత్యమో కాదో తెలుసుకోవాలి అనుకొన్నారు ఇశ్రాయేలు మనుష్యులు. కనుక వాళ్లు ఆ రొట్టెను రుచి చూసారు-కాని ఏమి చేయాలనే విషయం వారు యెహోవాను అడుగలేదు.
15 వాళ్లతో శాంతి ఒడంబడిక చేసుకొనేందుకు యెహోషువ ఒప్పుకున్నాడు. వాళ్లను బతక నిచ్చేందుకు అతడు అంగీకరించాడు. ఈ ఒడంబడికకు ఇశ్రాయేలు నాయకులు ఒప్పుకున్నారు.
16 మూడు రోజుల తర్వాత, ఆ మనుష్యులు వారి గుడారాలకు చాల దగ్గర్లో నివసిస్తున్నవారేనని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకొన్నారు.
17 కనుక వాళ్లు నివసిస్తున్న చోటుకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. మూడవ నాడు ఆ ప్రజలు నివసిస్తున్న గిబియోను, కెఫిరా, బెయెరోతు, కిర్యత్యారీము పట్టణాలకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు.
18 కానీ ఇశ్రాయేలు సైన్యం ఆ పట్టణాలమీద యుద్ధం చేయోలని ప్రయత్నించలేదు. వారు ఆ ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట ఆ ప్రజలకు ప్రమాణం చేసారు. ఆ ప్రమాణం చేసిన నాయకులను ప్రజలంతా నిందించారు.
19 అయితే నాయకులు జవాబు చెప్పారు: “మేము మా వాగ్దానం చేసాము. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట మేము ప్రమాణం చేసాము. ఇప్పుడు మేము వాళ్లతో యుద్ధం చేయలేము.
20 మనము ఇలా చేయాలి. మనం వాళ్లను బతకనివ్వాలి. మనము వాళ్లకు హాని చేయకూడదు, లేదా మనం వారితో చేసిన ప్రమాణం ఉల్లంఘించిన కారణంగా యెహోవా కోపం మనమీద ఉంటుంది.
21 అందుచేత వాళ్లను బ్రతక నిద్దాం. అయితే వాళ్లు మనకు బానిసలుగా ఉంటారు. వాళ్లు మనకోసం కట్టెలు కొట్టి, మన ప్రజలందరి కోసం నీరు మోస్తారు.” అందుచేత ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ నాయకులు ఉల్లంఘించలేదు.
22 గిబియోను ప్రజలను పిలిచాడు యెహోషువ. “మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం మా పాళెము పక్కనే ఉంది. కానీ మీరు చాలా దూర దేశంనుండి వచ్చినట్టు మాతో చెప్పారు.
23 ఇప్పుడు మీ ప్రజలకు చాల కష్టాలు ఎదురవుతాయి. మీ ప్రజలంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం వాళ్లు కట్టెలు కొట్టాలి, నీరు మోయాలి” అని అతడు చెప్పాడు.
24 గిబియోనీ ప్రజలు జవాబు చెప్పాడు: “మీరు మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్ధం చెప్పాము. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యలందరినీ చంపివేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాము.
25 ఇప్పుడు మేము మీకు దాసులం మీకు సరియైనదిగా అనిపించిన ప్రకారం మీరు మాకు ఏమైనా చేయవచ్చు.”
26 కనుక గిబియోను ప్రజలు బానిసలు అయ్యారు. అయితే యోహషువ వారి ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను చంపకుండా చేసాడు యెహోషువ.
27 యెహోషువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలకోసం, యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలని యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కట్టెలు నరికి, నీరు మోసారు. ఆ ప్రజలు నేటికీ బానిసలే.
1 అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు.
2 అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీ సెదెక్, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టణమైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు.
3 యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు.
4 “మీరు నాతో కూడా గిబియోను మీద దాడి చేసేందుకు వచ్చి సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బతిమిలాడాడు.
5 అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులూ వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియ వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.
6 గిల్గాలులో తన పాళెములో ఉన్న యెహోషువ దగ్గరకు గిబియోను పట్టణం లోని ప్రజలు సందేశం పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయంచేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశంలోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకంచేసారు. మామీద వాళ్లు యుద్ధం చేస్తున్నారు” ఇదీ ఆ సందేశం.
7 కనుక యెహోషువ తన సైన్యం అంతటితో గిల్గాలునుండి బయల్దేరాడు. యెహోషువ యొక్క మంచి శూరులంతా అతనితో ఉన్నారు.
8 యెహోవా, “ఆ సైన్యాల విషయమైన భయపడకు. నీవు వాళ్లను జయించేటట్టు నేను చేస్తాను. ఆ సైన్యాల్లో ఏదీ నిన్ను జయించజాలదు” అని యెహోషువతో చెప్పాడు.
9 యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబియోనుకు ప్రయాణం చేసారు. (యెహోషువ వస్తున్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహోషువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం కలిగించాడు.
10 ఇశ్రాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీయులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు.
11 ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హారాన్ నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.
12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు: “ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు, ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”
13 కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు.
14 ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!
15 ఇది జరిగిన తర్వాత యెహోషువా, అతని సైన్యం తిరిగి గిల్గాలు దగ్గర గుడారాలకు వెళ్లిపోయారు.
16 యుద్ధ సమయంలో ఆ అయిదుగురు రాజులూ పారిపోయారు. మక్కెదా సమీపంలో ఒక గుహలో వారు దాగుకొన్నారు.
17 అయితే ఆ అయిదుగురు రాజులు ఆ గుహలో దాగుకోవటం ఎవరో కనుక్కొన్నారు. యెహోషువకు ఈ విషయం తెలిసింది.
18 యెహోషువ చెప్పాడు, “ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో మూసివేయండి. ఆ గుహకు కాపలాగా కొందరు మనుష్యుల్ని అక్కడ ఉంచండి.
19 కానీ మీరు అక్కడ ఉండొద్దు. శత్రువును తరుముతూనే ఉండండి. వెనుకనుండి వారిమీద మీ దాడి కొనసాగించండి. శత్రువుల్ని తిరిగి పట్టణాలకు క్షేమంగా వెళ్లనీయకండి. మీ యెహోవా దేవుడు వారిమీద మీకు విజయం ఇచ్చాడు.”
20 కనుక యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలూ శత్రువులను చంపేసారు. అయితే శత్రువులు కొందరు తప్పించుకొని, వారి పట్టణాలకు వెళ్లి దాగుకోగలిగారు. వీళ్లు చంపబడలేదు.
21 పోరాటం అయిపోయిన తర్వాత యెహోషువ మనుష్యులు మక్కెదా దగ్గర అతని దగ్గరకు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఒక్కమాట పలికే ధైర్యంగలవాళ్లు ఆ దేశంలో ఒక్కరూ లేకపోయారు.
22 యెహోషువ చెప్పాడు, “గుహను మూసిన బండలను తీసివేసి, ఆ అయిదుగురు రాజులనూ నా దగ్గరకు తీసుకొని రండి” అని.
23 కనుక యెహోషువ మనుష్యులు ఆ అయిదుగురు రాజులనూ గుహలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. ఈ అయిదుగురు రాజులూ యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు.
24 కనుక ఆ ఐదుగురు రాజులనూ వారు యెహోషువ దగ్గరకు తీసుకొని వచ్చారు. యెహోషువ తన మనుష్యులందరినీ ఆ చోటుకి పిలిచాడు. “ఇక్కడికి వచ్చి, ఈ రాజుల మెడలమీద మీ పాదాలు పెట్టండి” అని తన సైన్యాధికారులతో యెహోషువ చెప్పాడు. అందుచేత యెహుషువ సైన్యాధికారులు దగ్గరగా వచ్చారు. వారు ఆ రాజుల మెడలమీద తమ పాదాలు పెట్టారు.
25 అప్పుడు యెహోషువ: “బలంగా, ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మీరు యుద్ధం చేసే శత్రువులందరికీ యెహోవా ఏమి చేస్తాడో నేను మీకు చూపిస్తాను” అన్నాడు తన మనుష్యులతో.
26 అప్పుడు యెహోషువ ఆ అయిదుగురు రాజులనూ చంపేసాడు. అతడు వారి శరీరాలను ఐదు చెట్లకు వేలాడదీసాడు. యెహోషువ వాళ్లను అలానే సాయంత్రంవరకు చెట్లకు వేలాడనిచ్చాడు.
27 సూర్యాస్తమయమప్పుడు ఆ శవాలను చెట్లనుండి దించమని యెహోషువ తన మనుష్యులతో చెప్పాడు. అప్పుడు వారు ఆ శవాలను, అంతకు ముందు వారు దాగుకొన్న గుహలోనే పడవేసారు. ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో వారు మూసివేసారు. నేటికీ ఆ శవాలు ఆ గుహలోనే ఉన్నాయి.
28 ఆ రోజు యెహోషువ మక్కెదాను జయించాడు. ఆ పట్టణంలోని రాజును, ప్రజలను యెహోషువ చంపేసాడు. మనుష్యులు ఎవ్వరూ ప్రాణాలతో విడిచి పెట్టబడలేదు. యెరికో రాజుకు చేసినట్టే మక్కెదా రాజుకు యెహోషువ చేసాడు.
29 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ మక్కెదానుండి ప్రయాణం చేసారు. వారు లిబ్నా వెళ్లి ఆ పట్టణంపై దాడి చేసారు.
30 ఆ పట్టణాన్ని, దాని రాజును ఇశ్రాయేలు ప్రజలు ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మనుష్యులెవ్వరూ ప్రాణాలతో విడువబడలేదు. మరియు ప్రజలు యెరికో రాజుకు చేసినట్టే ఆ రాజుకుకూడ చేసారు.
31 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ లిబ్నా విడిచి, లాకీషుకు ప్రయాణమయ్యారు. యెహోషువ, అతని సైన్యం లిబ్నా దగ్గర్లోనే ఉండి, ఆ పట్టణం మీద దాడి చేసారు.
32 ఇశ్రాయేలు ప్రజలు లాకీషు పట్టణాన్ని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. వారు ఆ పట్టణాన్ని రెండో రోజున ఓడించారు. ఆ పట్టణంలో ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. లిబ్నాకు అతడు చేసిందికూడ ఇదే.
33 ఇదే సమయంలో గెజెరు రాజైన హోరాము, లాకీషుకు సహాయం చేసేందుకు వచ్చాడు. కానీ అతణ్ణి, అతని సైన్యాన్ని కూడ యెహోషువ ఓడించాడు. అక్కడ మనుష్యులు ఎవరూ బతికి బయటపడలేదు.
34 అప్పుడు యెహోషువ, అతని ప్రజలు అందరూ లాకీషునుండి ఎగ్లోనుకు ప్రయాణ మయ్యారు. వారు ఎగ్లోను చుట్టు పక్కల బసచేసి దానిమీద దాడిచేసారు.
35 ఆ రోజు వారు ఆ పట్టణాన్ని పట్టుకొని, ఆ పట్టణంలో ప్రజలందరినీ చంపేసారు. వారు లాకీషుకు చేసిందికూడ ఇదే.
36 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఎగ్లోను నుండి హెబ్రోనుకు ప్రయాణమయ్యారు. అప్పుడు వారు హెబ్రోను మీద దాడి చేసారు.
37 ఆ పట్టణాన్ని, హెబ్రోను చుట్టుపట్ల ఉన్న చిన్న చిన్న ఊళ్లను వారు పట్టుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. అక్కడ ఏ ఒక్కరినీ వారు బ్రతకనియ్యలేదు. వారు ఎగ్లోనుకు చేసింది కూడ ఇదే. వారు ఆ పట్టణాన్ని నాశనంచేసి, అందులోని ప్రజలందరినీ చంపివేసారు.
38 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అందరూ తిరిగి దెబీరుకు వెళ్లి, ఆ పట్టణం మీద దాడి చేసారు.
39 వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దెబీరు సమీపంలోవున్న చిన్న చిన్న పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ వారు చంపేసారు. అక్కడ ఎవరినీ బ్రతకనియ్యలేదు. హెబ్రోనుకు, దాని రాజుకు చేసినట్టే, దెబీరుకు, దాని రాజుకు ఇశ్రాయేలు ప్రజలు చేసారు. లిబ్నాకు, దాని రాజుకు కూడ వారు ఇలానే చేసారు.
40 కనుక నెగెవు, కొండ ప్రాంతపు పట్టణాల రాజులందరినీ, పడమటి కొండ చరియలనూ, తూర్పు కొండ చరియలనూ, యెహోషువ ఓడించేసాడు. ఆ ప్రజలందరినీ చంపివేయుమని ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవా యోహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలాల్లో ఎవ్వరినీ యెహోషువ ప్రాణాలతో విడిచిపెట్టలేదు.
41 కాదేషు బర్నేయనుండి గాజా వరకు గల పట్టణాలన్నింటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. గోషేను (ఈజిప్టు) దేశం నుండి గిబియోను వరకుగల పట్టణాలన్నింటినీ అతడు స్వాధీనం చేసుకొన్నాడు.
42 ఆ ప్రయాణంలో ఆ పట్టణాలన్నింటినీ, వాటి రాజులందరినీ యెహోషువ పట్టుకొన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేసినందువల్ల యెహోషువ ఇలా చేయగలిగాడు.
43 అప్పుడు యెహోషువ, ఇశ్రేయేలు ప్రజలు అందరు గిల్గాలు లోని వారి గుడారాలకు తిరిగి వెళ్లారు.
1 జరిగిన ఈ సంగతులు అన్నింటిని గూర్చి హాసోరు రాజు యాబిను విన్నాడు. అందుచేత అతడు అనేకమంది రాజుల సైన్యాలను సమకూర్చాలని నిర్ణయించాడు. మదోను రాజైన యోబాబు, షిమ్రోను రాజు, అక్షపు రాజు,
2 ఉత్తరాన కొండదేశం, ఎడారి రాజులు ఇద్దరికి యాబిను సందేశం పంపించాడు. కిన్నెరెత్, నెగెవ్, పడమటి దిగువ కొండల రాజులకు యాబిను సందేశం పంపించాడు. పడమట నఫోత్‌దార్ రాజుకుగూడ యాబిను సందేశం పంపించాడు.
3 యాబిను ఆ సందేశాన్ని తూర్పు, పడమరలలో ఉన్న కనానీ ప్రజల రాజులకు పంపించాడు. కొండ ప్రదేశాల్లో నివసిస్తున్న అమోరీ ప్రజలకు, హిత్తీ ప్రజలకు, పెరిజ్జీ ప్రజలకు, యెబూసీ ప్రజలకు పంపించాడు. మిస్పా ప్రాంతంలో హెర్మోను కొండ దిగువలో నివసిస్తున్న హివ్వీ ప్రజలకుగూడ అతడు ఆ సందేశం పంపించాడు.
4 కనుక ఈ రాజులందరి సైన్యాలు కూడి వచ్చాయి. అక్కడ ఎంతోమంది శూరులు ఉన్నారు, ఎన్నో రథాలు, ఎన్నో గుర్రాలు ఉన్నాయి. అది అతి విస్తారమైన సైన్యం. సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నట్టున్నారు.
5 ఈ రాజులంతా మెరోము అనే చిన్న నది దగ్గర సమావేశ మయ్యారు. వారు తమ సైన్యాలను ఒకే చోటచేర్చారు. ఇశ్రాయేలీయుల మీద పోరాడేందుకు వారు ఏర్పాట్లు చేసారు.
6 అప్పుడు యెహోవా, “ఆ సైన్యాన్ని చూచి భయపడకు. రేపు ఈ వేళకు మీరు ఆ సైన్యాన్ని ఓడించేటట్టు నేను చేస్తాను. వాళ్లందరినీ మీరు చంపేస్తారు. మీరు వారి గుర్రాల కుడికాళ్ల నరాలను నరికివేసి, వారి రథాలను తగులబెట్టేస్తారు” అని యెహోషువతో చెప్పాడు.
7 యెహోషువ, అతని సర్వసైన్యం శత్రువును ఆశ్చర్యచకితులుగా చేసారు. మెరోము నది వద్ద వారు శత్రువుమీద దాడి చేసారు.
8 ఇశ్రాయేలీయులు వారిని ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఇశ్రాయేలీయులు వారిని ఓడించి, మహా సీదోను, మిస్రెపోత్మాయిము, తూర్పున మిస్పాలోయ వరకు వారిని తరిమివేసారు. శత్రువులలో ఒక్కరుకూడ బతకకుండా చచ్చేవరకు ఇశ్రాయేలు సైన్యం పోరాడింది.
9 యెహోషువ ఏమి చేయాలని యెహోవా చెప్పాడో అతడు అలాగే చేసాడు-యెహోషువ వారి గుర్రాల కుడికాళ్ల నరాలను తెగగొట్టి, వారి రథాలను కాల్చివేసాడు.
10 అప్పుడు యెహోషువ వెనుకకు వెళ్లి హసోరు పట్టణాన్ని పట్టుకొన్నాడు. హసోరు రాజును యెహోషువ చంపివేసాడు. (ఇశ్రాయేలీయుల మీద యుద్ధంచేసిన రాజ్యాలన్నింటికీ హసోరు నాయకుడు)
11 ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు సైన్యం చంపేసింది. వారు ఆ ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేసారు. ప్రాణంతో ఏదీ విడువబడలేదు. అప్పుడు వారు ఆ పట్టణాన్ని కాల్చివేసారు.
12 ఈ పట్టణాలన్నింటినీ యెహోషువ పట్టుకొన్నాడు. వాటి రాజులందరినీ అతడు చంపివేసాడు. ఆ పట్టణాల్లో ఉన్న సమస్తాన్నీ పూర్తిగా యెహోషువ నాశనం చేసాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టే అతడు ఇలా చేసాడు.
13 కానీ వారి కొండలమీద కట్టబడిన పట్టణాలలోని ఒక్కటికూడ ఇశ్రాయేలు సైన్యం కాల్చివేయలేదు. వారు కాల్చివేసిన కొండ మీద పట్టణం హజోరు మాత్రమే. ఇది యెహోషువ కాల్చిన పట్టణం.
14 ఈ పట్టణాల్లో దొరికిన వాటన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు వారికోసమే ఉంచుకొన్నారు. ఆ పట్టణంలోని జంతువులన్నింటినీ వారే ఉంచుకొన్నారు. కానీ అక్కడ ప్రజలను అందరినీ చంపివేసారు. మనుష్యులు ఎవరినీ వారు బ్రతకనివ్వలేదు.
15 ఇలా చేయుమని చాలకాలం క్రితమే యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఇలా చేయుమని మోషే యెహోషువకు ఆజ్ఞాపించియున్నాడు. కనుక యెహోషువ దేవునికి విధేయుడయ్యాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యెహోషువ జరిగించాడు.
16 కనుక ఈ దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ యెహోషువ ఓడించాడు. కొండదేశం, నెగెవు ప్రాంతం, గోషెను ప్రాంతం అంతాను, పడమటి కొండల దిగువ ప్రాంతం, అరాబా ప్రాంతం, ఇశ్రాయేలు పర్వతాలు, వాటి దగ్గర్లో ఉన్న కొండలు అన్నింటిమీదా అతడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు.
17 శేయీరు దగ్గర హాలాకు కొండ నుండి హెర్మోను కొండ దిగువన లెబానోను లోయలో బయల్గాదు వరకు ఉన్న దేశం అంతా యెహోషువ స్వాధీనంలో ఉంది. ఆ దేశంలోని రాజులందరినీ యెహోషువ పట్టుకొని చంపివేసాడు.
18 యెహోషువ ఆ రాజులతో చాల సంవత్సారాలు యుద్ధం చేసాడు.
19 ఆ దేశం మొత్తంలో ఒక్క పట్టణం మాత్రమే ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొంది. గిబియోనులో నివసిస్తున్న హివ్వీ ప్రజలే వారు. మిగతా పట్టణాలన్నీ యుద్ధంలో ఓడించబడ్డాయి.
20 ఆ ప్రజలు తాము చాలా బలంగల వాళ్లమని అనుకోవాలనే యెహోవా కోరాడు. అప్పుడే వారు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తారు. ఈ విధంగా ఆయన వారిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయనిచ్చాడు. మోషే ఏమిచేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే ఆయన వారిని నాశనం చేయబడనిచ్చాడు.
21 హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా ప్రాంతాల్లోను, కొండదేశంలోను అనాకీ ప్రజల నివసించారు. ఈ అనాకీ ప్రజలతో యెహోషువ యుద్ధం చేసాడు. ఆ ప్రజలందరినీ, వారి పట్టణాలను యెహోషువ పూర్తిగా నాశనం చేసాడు.
22 ఇశ్రాయేలు దేశంలో అనాకీ ప్రజలు ఎవ్వరూ ప్రాణంతో మిగుల లేదు. మిగిలిన అనాకీ ప్రజలు గాజా, గాతు, అష్డోదులలో నివసించారు.
23 ఇశ్రాయేలు దేశం అంతటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా మోషేకు చెప్పింది ఇదే. యెహోవా వాగ్దానం చేసినందువల్ల ఆయన ఆ దేశాన్నీ ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. యెహోషువ ఆ దేశాన్ని ఇశ్రాయేలు వంశాలకు పంచిపెట్టాడు. అప్పుడు యుద్ధం ముగిసింది. చివరికి దేశంలో శాంతి నెలకొంది.
1 యోర్ధాను నదికి తూర్పున ఉన్న దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అర్నోను లోయనుండి హెర్మోను కొండవరకు, అరా బాకు తూర్పు ప్రాంతాన గల భూమి అంతా ఇప్పుడు వారిదే. ఈ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:
2 హెష్బోను పట్టణంలో నివసిస్తున్న అమోరీ ప్రజల రాజు సీహోను, అర్నోను లోయవద్ద అరోయేరు నుండి యబ్బోకు నదివరకుగల దేశం అంతా అతడు పాలించాడు. ఆ లోయ మధ్యనుండి అతడి దేశంమొదలవుతుంది. అమ్మోనీ ప్రజలకు, వారికి ఇది సరిహద్దు. గిలాదులోని సగం భూమిని సీహోను పాలించాడు.
3 అరాబా తూర్పు ప్రాంతంలో కిన్నెరెతు సముద్రంనుండి అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) వరకు అతడు పాలించాడు. బెత్ ఎషిమోతు నుండి దక్షిణాన పిస్గా కొండల వరకు అతడు పాలించాడు.
4 బాషాను రాజు ఓగు రెఫాయిము సంతతివాడు. అష్టారోతు, ఎద్రేయిలో ఓగు దేశాన్ని పాలించాడు.
5 హెర్మోను కొండ, సలెకా, బాషాను ప్రాంతం అంతా ఓగు పాలించాడు. గెషూరు, మాక ప్రజలు నివసించిన చోట అతని దేశం సరిహద్దు. గిలాదులో సగం భూభా గాన్ని కూడ ఓగు పాలించాడు. హెష్బోను రాజు సీహోను భూమికి ఈ భూమి సరిహద్దు.
6 యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రాజులందరినీ ఓడించారు. మరియు ఆ భూమిని రూబేను వంశం, గాదు వంశం మనష్షే వంశంలో సగం భాగానికి మోషే ఇచ్చాడు. ఈ భూమిని వారికి స్వంతంగా ఇచ్చేసాడు మోషే.
7 యోర్దాను నదికి పశ్చిమాన ఉన్న దేశంలోని రాజులందరినీ కూడ ఇశ్రాయేలు ప్రజలు ఓడించారు. ఈ దేశంలో ప్రజలను యెహోషువ నడిపించాడు. ఈ దేశాన్ని యెహోషువ ప్రజలకు ఇచ్చి, పన్నెండు వంశాల వారికి దీనిని పంచిపెట్టాడు. ఇది వారికి ఇస్తానని దేవునిచే వాగ్దానం చేయబడిన దేశం లెబానోను లోయలోని బయెల్‌గాదుకు శేయీరు దగ్గర హాలాకు కొండకు మధ్య ఉంది ఈ భూమి.
8 కొండ దేశం, పశ్చిమాన పడమటి కొండ దిగువ, అరాబా, పర్వతాలు, ఎడారి, నెగెవు దీనిలో ఉన్నాయి. హిత్తీ ప్రజలు, హివ్వీ ప్రజలు, అమోరీ ప్రజలు, కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసించిన దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:
9 యెరికో రాజు1 బేతేలు దగ్గరనున్న హాయి రాజు.1
10 యెరూషలేము రాజు. 1 హెబ్రోను రాజు.1
11 యార్ముతు రాజు.1 లాకీషు రాజు.1
12 ఎగ్లోను రాజు.1 గెజెరు రాజు.1
13 దెబీరు రాజు.1 గెదెరు రాజు.1
14 హోర్మా రాజు.1 అరాదు రాజు.1
15 లిబ్నా రాజు.1 అదుల్లాం రాజు.1
16 మక్కెద రాజు.1 బేతేలు రాజు.1
17 తపువ రాజు.1 హెపెరు రాజు.1
18 అఫెకు రాజు.1 లాషారోను రాజు.1
19 మదోను రాజు.1 హిజోరు రాజు.1
20 షిమ్రోన్ మెరోన్.1 అక్షపు రాజు.1
21 తానాకు రాజు.1 మెగిద్దో రాజు.1
22 కెదెషు రాజు.1 కర్మెలులోని యొకెనం రాజు.1
23 దోరు పర్వతంలో దోరు రాజు.1 గిల్గాలులోని గోయిం రాజు.1
24 తిర్సా రాజు.1 మొత్తం రాజులు (ముఫ్పై ఒకటి)31
1 యెహోషువ చాల ముసలివాడై నప్పుడు యెహోవా అతనితో చెప్పాడు: “యెహోషువా, నీవు ముసలివాడవై పోయావు. కానీ నీవు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది.
2 ఫిలిష్తీయుల దేశానన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు.
3 ఈజిప్టు దగ్గర షీహోరు నది నుండి ఉత్తరాన ఎక్రోను సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అది కనానీ ప్రజలకు చెందినది. గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోనుల ఐదుగురు ఫిలిష్తీ నాయకులను ఇంకా నీవు జయించాలి. నీవు అవ్వీతీ ప్రజలను,
4 కనాను దేశానికి దక్షిణాన ఉన్న వారిని కూడ నీవు ఓడించాలి.
5 గెబాలీ ప్రజల ప్రాంతాన్ని నీవు ఇంకా ఓడించలేదు. హెర్మోను కొండ దిగువన బయెల్‌గాదుకు తూర్పున లిబోహ-మాత్ వరకు గల లెబానోను ప్రాంతం కూడ ఉంది.
6 “లెబానోనునుండి మిశ్రేఫోత్మాయిము వరకూ గల కొండ దేశంలో సీదోను ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ నేను బయటకు వెళ్లగొట్టేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు నీవు భూమిని పంచి పెట్టేటప్పుడు ఈ భూమిని తప్పక జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలానే చేయి.
7 ఇప్పుడు తొమ్మిది వంశాలు, మనష్షే సగం వంశం వారికి ఈ భూమిని విభజించు.”
8 మనష్షే వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు వంశం వారికి నేను ఇదివరకే భూమిని ఇచ్చాను. యోర్దాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే వారికి భూమిని ఇచ్చాడు.
9 యోర్దాను నది తూర్పున మోషే వారికి ఇచ్చిన భూమి ఇదే: దీబోను వరకు గల మేదెబా మైదాన ప్రాంతం అంతా ఇందులో ఉంది. అర్నోను లోయదగ్గర అరోయేరు వద్ద ఈ భూమి మొదలవుతుంది, ఆ లోయ మధ్యలోగల పట్టణం వరకు ఆ భూమి విస్తరించి ఉంది.
10 అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది.
11 గిలాదు పట్టణం కూడ ఆ దేశంలో ఉంది. గెషూరు, మాయకా ప్రజలు నివసించిన ప్రాంతంకూడ ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం అంతా, సల్కావరకు బాషాను అంతా ఆ దేశంలో ఉంది.
12 ఓగు రాజు రాజ్యమంతా ఆ దేశంలో ఉంది. ఓగు రాజు బాషానులో పాలించాడు. గతంలో అతడు అష్టారోతు, ఎద్రేయీలో పాలించాడు. ఓగు రెఫాయిము ప్రజలనుండి వచ్చినవాడు. గతంలో మోషే ఆ ప్రజలను ఓడించి, వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
13 గెషూరు, మయకా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు బలవంతంగా బయటకు వెళ్లగొట్టలేదు. నేటికీ ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నారు.
14 లేవీ వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని కుటుంబం. దానికి బదులుగా, ఇశ్రాయేలీయుల యెహోవా దేవునికి దహన బలులుగా అర్పించబడిన జంతువులన్నీ లేవీ కుటుంబంవారు తీసుకుంటారు. అదే యెహోవా వారికి వాగ్దానం చేసింది.
15 రూబేను వంశంలో ప్రతి వంశంవారికీ మోషే కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇది:
16 అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా పట్టణంవరకు గల భూమి. ఆ లోయ మధ్యలో ఉన్న పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది.
17 హెష్బోను వరకు ఉంది ఈ భూమి. మైదానంలోని పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఆ పట్టణాలు దీబోను, బామోత్ బయలు, బేత్‌బయల్మెయోను,
18 యహజ్, కెదెమోతు, మేఫాతు,
19 కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది యెరెత్ షహిరు,
20 బెత్పెయోరు, పిస్గాకొండలు, బెత్ యెషిమోత్.
21 కనుక మైదానంలోని అన్ని పట్టణాలు, అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. ఆ రాజు హెష్బోను పట్టణం దగ్గర పాలించాడు. అయితే అతణ్ణి, మిద్యాను ప్రజానాయకులను మోషే ఓడించాడు. ఆ నాయకులు ఎవి, రెకెము, సూర్, హోరు, రెబా. (ఈ నాయకులంతా సీహోనుతో చేయి కలిపి పోరాడారు) ఈ నాయకులంతా ఆ దేశంలోనే నివసించారు.
22 బెయోరువాడైన బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపారు. (బిలాము భవిష్యత్తును గూర్చి చెప్పేందుకు మంత్రాలు వేసేవాడు) ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలమందిని చంపేసారు.
23 రూబేనుకు ఇచ్చిన భూమికి యోర్దాను నదీ తీరం సరిహద్దు. కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన భూమిలో ఈ పట్టణాలు, పొలాలు అన్నీ చేర్చబడ్డాయి.
24 గాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి ఇది. ప్రతి ఒక్క వంశానికీ ఈ భూమిని మోషే ఇచ్చాడు.
25 యాజెరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ రబ్బాతు దగ్గర అరోయేరు వరకూ గల అమ్మోనీ ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు.
26 హెష్బోను నుండి రామత్ మిస్పా, బెటోనీము వరకూ గల భూమి ఇందులో ఉంది. మహనయిము నుండి దెబీరువరకు గల ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది.
27 బేతారాము, బెత్‌నిమ్రా, సుక్కోతు, సఫోనులోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యోర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి ఉంది.
28 ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలు అన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఒక్కోవంశానికి ఆ భూమిని మోషే ఇచ్చాడు.
29 మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు ఈ భూమిని తీసుకున్నాయి.
30 ఆ భూమి మహనయిము దగ్గర మొదలవుతుంది. బాషాను అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం అంతా, బాషానులోని యాయీరు పట్టణాలన్నీ ఆ భూమిలో ఉన్నాయి. (అవి మొత్తం 60 పట్టణాలు)
31 గిలాదులో సగం, అష్టారోతు, ఎద్రేయి కూడ ఆ భూమిలో ఉన్నాయి. (గిలాదు, అష్టారోతు, ఎద్రేయి ఓగు రాజు నివసించిన పట్టణాలు) ఈ భూమి అంతా మనష్షే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఆ భూమి దొరికింది.
32 మోయాబు మైదానాల్లో ఈ వంశాలకు ఈ భూమి అంతటినీ మోషే ఇచ్చాడు. ఇది యెరికోకు తూర్పున యెర్దాను నది అవతల ఉంది.
33 అయితే లేవీ వంశం వారికి మోషే భూమి ఏమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు సాక్షాత్తు ఆయనే లేవీ వంశం వారి పరంగా ఉంటానని వాగ్దానం చేసాడు.
1 యాజకుడైన ఎలీయాజరు, నూను కూమారుడైన యోహోషువ, ఇశ్రాయేలు వంశాలు అన్నింటీ నాయకులు కలిసి ప్రజలకు ఏ భూమి ఇవ్వాలి అనే విషయం నిర్ణయం చేసారు.
2 ప్రజలు ఏ విధంగా వారి భూమిని నిర్ణయించు కోవాల్సిందీ చాలకాలం క్రితమే మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు. తొమ్మిదిన్నర వంశాల వారు ఎవరికి ఏ భూమి అనే విషయం నిర్ణయించేందుకు చీట్లు వేసారు.
3 రెండున్నర వంశాల వారికి యోర్దాను నదికి తూర్పున వారి భూమి వారికి మోషే ఇదివరకే ఇచ్చాడు. అయితే మిగదా ప్రజల్లాలేవీ వంశానికి మాత్రం భూమి ఏమీ ఇవ్వబడలేడు.
4 (పన్నెండు వంశాలకు వారి స్వంత భూమి ఇవ్వబడింది) యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము రెండు వంశాలుగా విభజించబడ్డారు. (మరియు ఒక్కో వంశానికి కొంత భూమి దొరికింది) కానీ లేవీ వంశపు ప్రజలకు భూమి ఏమీ ఇవ్వబడలేదు. వారు నివసించేందుకు కొన్ని పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి. (ఈ పట్టణాలు ప్రతి వంశంవారి భూమిలోనూ ఉన్నాయి.) వారి జంతువులకోసం వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.
5 ఇశ్రాయేలు వంశాలకు భూమిని ఇచ్చే విధానం మోషేకు యెహోవా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఆజ్ఞాపించినట్టే భూమిని పంచుకొన్నారు.
6 ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీవాడైన యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు మోషేతో మాట్లాడుతూ నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు.
7 మనం వెళ్లబోతున్న దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను.
8 అయితే నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయాలను వారితో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని యెహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా నమ్మాను.
9 కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేసాడు: ‘నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించావు గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.’
10 “ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు.
11 మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను.
12 కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇయ్యి. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.”
13 యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు.
14 ఇప్పటికీ ఆ హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి అతుడు నమ్ముకొని విధేయుడైనందువల్ల ఇప్పటికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది.
15 గతంలో ఆ పట్టణం కిర్యత్ అర్బ అని పిలువబడింది. అనాకీ ప్రజల్లోకెల్లా మహా గొప్పవాడైన అర్బ పేరు ఆ పట్టణానికి పెట్టబడింది. ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది.
1 యూదాకు ఇవ్వబడిన భూమి ఒక్కో కుటుంబాలకు పంచబడింది. ఆ భూమి ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన తేమాను చివర సీను అరణ్యం వరకు ఉంది.
2 యూదా భూమికి దక్షిణ సరిహద్దు, మృత సముద్రం దక్షిణ కొనలో మొదలవుతుంది.
3 దాని సరిహద్దు దక్షిణాన తేలు కనుమ వరకు పోయి సీనువరకు కొనసాగింది. దక్షిణాన కాదేషు బర్నేయ వరకు సరిహద్దు విస్తరించింది. హెస్రోను దాటి అద్దారు వరకు సరిహద్దు విస్తరించింది. అద్దారునుండి సరిహద్దు మలుపు తిరిగి కర్క వరకు విస్తరించింది.
4 అస్మోను, ఈజిప్టు ఏరు, మధ్యధరా సముద్రం వరకు సరిహద్దు విస్తరించింది. ఆ భూమి అంతా వారి దక్షిణ సరిహద్దు.
5 ఉప్పు సముద్రం నుండి, యోర్దాను నది సముద్రంలోపడే ప్రాంతం వరకు తూర్పు సరిహద్దు. యోర్దాను నది ఉప్పు సముద్రంలో పడే ప్రాంతంలో ఉత్తర సరిహద్దు మొదలవుతుంది.
6 ఉత్తర సరిహద్దు బేత్‌హోగ్లా వరకు విస్తరించి, ఉత్తరాన బేత్ అరాబావరకు కొనసాగింది. ఆ సరిహద్దు బోహను బండవరకు వ్యాపించింది. (రూబేను కుమారుడు బోహను)
7 ఆ తర్వాత ఉత్తర సరిహద్దు ఆకోరు లోయలోనుండి దెబీరు వరకు కొనసాగింది. అక్కడ ఆ సరిహద్దు ఉత్తరానికి, తిరిగి గిల్గాలు వరకు వ్యాపించింది. అదుమ్మీము పర్వతాల మధ్యగా పోయే మార్గం మీద ఉంది గిల్గాలు. అది ఏటికి దక్షిణాన ఉంది. ఎన్‌షెమెషు నీళ్ల వరకు సరిహద్దు వ్యాపించింది. ఎన్‌రొగెలు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది.
8 తర్వాత యెబూసు పట్టణానికి దక్షిణాన ఉన్న బెన్‌హిన్నోము లోయగుండా ఆ సరిహద్దు కొనసాగింది. (ఆ యెబూసు పట్టణం పేరు యెరూషలేము) అక్కడ సరిహద్దు కొండ శిఖరం మీదుగా హిన్నోము లోయకు పశ్చిమంగా వెళ్లింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తరపు అంచున ఉంది.
9 అక్కడ నుండి ఆ సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల పట్టణాలకు పోయింది. ఆ స్థలంలో ఆ సరిహద్దు మళ్లుకొని బాలాకు పోయింది. (బాలా కిర్యత్ యారీం అనికూడ పిలువబడింది)
10 బాలావద్ద సరిహద్దు పశ్చిమంగా మళ్లుకొని శేయీరు కొండ దేశానికి పోయింది. ఆ సరిహద్దు యారీం కొండకు (కెసలోము అని కూడ పిలువబడింది) ఉత్తర దిశగా కొనసాగి బెత్‌షెమెషు వరకు కొనసాగింది. అక్కడ్నుండి ఆ సరిహద్దు తిమ్నాదాటిపోయింది.
11 అప్పుడు ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరాన ఉన్న కొండకు చేరింది. ఆ చోటనుండి ఆ సరిహద్దు షికెరానుకు మరలి బాలా కొండను దాటిపోయింది. ఆ సరిహద్దు యబ్నేలువరకు కొనసాగి మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది.
12 యూదా దేశానికి పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. కనుక యూదా దేశం ఈ నాలుగు సరిహద్దుల లోపల ఉంది. యూదా కుటుంబాలు ఈ దేశంలో నివసించాయి.
13 యెపున్నె కుమారుడైన కాలేబుకు యూదా దేశంలో భాగం ఇవ్వాల్సిందిగా యెహోషువను యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన భూమిని కాలేబుకు యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను అనికూడ పిలువబడిన కిర్యత్ అర్బ పట్టణాన్ని యెహోషువ అతనికి ఇచ్చాడు (అనాకు తండ్రి అర్బ)
14 హెబ్రోనులో నివాసం ఉన్న అనాకీ వంశాలు మూడింటిని కాలేబు వెళ్లగొట్టేసాడు. అవి శాషాయి, అహీమాను, తల్మయి వంశాలు. వారు అనాకు కుటుంబంవారు.
15 తర్వాత దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద కాలేబు యుద్ధం చేసాడు. (గతంలో దెబీరును కిర్యత్ సెఫెర్ అనికూడ పిలిచేవాళ్లు)
16 “కిర్యత్ సెఫెర్ మీద దాడి చేసి, ఆ పట్టణాన్ని ఓడించే మగవాడెవడో అతడు నా కుమార్తె అక్సాను పెళ్లాడవచ్చు. అతనికి నా కూతుర్ని బహుమానంగా ఇస్తాను” అన్నాడు కాలేబు.
17 కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నియేలు ఆ పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు.
18 తన తండ్రి కాలేబు దగ్గర మరికొంత భూమి అడగాలని ఒత్నియేలు అక్సాను కోరాడు. (ఆక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది.) ఆమె తన గాడిద మీద నుండి దిగగానే “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.
19 “నాకు ఒక ఆశీర్వాదం కావాలి . (నీరుగల భూమి నాకు కావాలి) నీకు నాకు నెగెవులో ఇచ్చిన భూమి ఎడారి భూమి. కనుక నీటి ఊటలు గల భూమి నాకు ఇవ్వాలి” అని అక్సా జవాబిచ్చింది. కనుక మెరకలోను పల్లంలోని నీటి ఊటలు గల భూమిని కాలేబు ఆమెకు ఇచ్చాడు.
20 యూదా వంశానికి దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరికింది. ఒక్కో కుటుంబానికి ఆ భూమిలో భాగం దొరికింది.
21 నెగెవు దక్షిణాన గల పట్టణాలన్నీ యూదా వంశానికి వచ్చాయి. ఈ పట్టణాలు ఎదోము సరిహద్దు సమీపంగా ఉన్నాయి. ఆ పట్టణాల జాబితా ఇది; కబ్జీలు, ఎదెరు, యగురు,
22 కీనా, దిమోనా, అదాదా:
23 కెదేషు, హసోరు, ఇత్నాను
24 జీపు, తెలెం, బెయలోత్
25 హసొర్, హదత్తా, కెరియోతు, హెస్రొను (హసోరు అని కూడ పిలువబడుతుంది)
26 అమాము, షెమ, మొలాదా
27 హసర్‌గద్దా, హెష్మొను, బెత్‌పెలెతు,
28 హసర్‌షువలు, బెయెర్‌షెబ, బిజ్యోత్యా
29 బాలా, ఇయం, ఎజెము,
30 ఎల్తోలద్, కెసిల్, హోర్మ,
31 సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
32 లెబయొతు, ష్హిలిం, అయిన్ మరియు రిమ్మాన్. మొత్తం మీద 29 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి. పడమటి కొండ దిగువల్లోకూడ యూదా వంశం వారికి పట్టణాలు వచ్చాయి. ఆ పట్టణాల జాబితా ఇది:
33 ఎష్తాయోలు, జొర్యా, అష్నా
34 జానోహ, ఎన్‌గన్నీము, తప్పుయ, ఎనాం
35 యార్ముత్, అదుల్లాము శోకో, అజెకా
36 షరాయిం, అదితాయిము, మరియు గెదెరా (గెదెరో తాయిము అనికూడ పిలువబడింది) మొత్తం మీద 14 పట్టణాలు, వాటి పొలాలు.
37 యూదా వంశంవారికి ఇవ్వబడిన పట్టణాలు సెనాము, హదష, మిగ్దల్‌గాదు,
38 దిలాన్, మిస్సే, యొక్తయెలు
39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను
40 కబ్బోన్, లహ్మను, కిత్లషు
41 గెదెరొతు, బెత్‌దాగొను నయమా, మరియు మక్కెదా. మొత్తంమీద 16 పట్టణాలు మరియు వాటి పొలాలు.
42 యూదా ప్రజలకు లభించిన ఇతర పట్టణాలు: లిబ్నా, ఎతెరు, అషను,
43 ఇప్తా, అష్న, నెజిబు
44 కెయిలా, అక్జీబు, మారేషా. మొత్తంమీద 9 పట్టణాలు మరియు వాటి పొలాలు.
45 ఎక్రోను పట్టణం, దాని సమీపంలో గల అన్ని చిన్న పట్టణాలు, పొలాలు యూదా ప్రజలకే దొరికాయి.
46 ఎక్రోనుకు పశ్చిమాన గల ప్రాంతం, అష్డోదుకు సమీపంలో ఉన్న పట్టణాలు, పొలాలు అన్నీ కూడా వారికి లభించాయి.
47 అష్డోదు చుట్టూ ఉన్న ప్రాంతం అంతాను, అక్కడి చిన్న పట్టణాలు యూదా దేశంలో భాగమే. గాజా చుట్టూ ఉన్న ప్రాంతం, పొలాలు, పట్టణాలు కూడా యూదా ప్రజలకే వచ్చాయి. ఈజిప్టు నదివరకు వారి దేశం విస్తరించింది. మరియు వారిదేశం మధ్యధరా సముద్ర తీరం వెంబడి విస్తరించింది.
48 కొండ దేశంలోకూడా యూదా ప్రజలకు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: షామిరు, యత్తిరు, శాకొహో
49 దన్నా, కిర్యత్ సన్నా, (దెబిర్ అనికూడ పిలువబడింది)
50 అనబు, ఎష్తెమో, అనీం
51 గోషెను, హలొను, మరియు గిలో. మొత్తం మీద 11 పట్టణాలు మరియు వాటి పొలాలు.
52 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి: అరబు, దూమా, ఎషాను,
53 యనీము, బెత్ తప్పుయా, అఫెకా,
54 హుమతా, కిర్యత్ అర్బ (హెబ్రోను అని కూడ పిలువబడింది) మరియు సీయోరు. 9పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి.
55 ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వబడ్డాయి: మయోను, కర్మెలు, జీపు, యుట్ట,
56 యెజ్రెయేలు, యొకెదియము, జనోవా
57 కయిను, గిబియ మరియు తిమ్నా మొత్తం మీద 10 పట్టణాలు మరియు వాటి పొలాలు.
58 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వ బడ్డాయి: హల్‌హులు, బెత్‌జూరు, గెదొరు,
59 మారాతు, బెత్‌అనొతు మరియు ఎల్‌తెకొను. మొత్తం మీద అవి 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
60 రబ్బ, కిర్యత్‌బెతు (కిర్యత్యారీం అనికూడా పిలువ బడుతుంది) రెండు పట్టణాలు కూడ యూద ప్రజలకు ఇవ్వబడ్డాయి.
61 యూదా ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది: బెత్ అరాబా, మిద్దిను, సెకాకా
62 నిబ్షాను, ఉప్పు పట్టణం, మరియు ఎన్‌గేది. మొత్తం మీద 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.
63 యెరుషలేములో నివసిస్తున్న యెటూసీ ప్రజలను యూదా సైన్యం బయటకు వెళ్లగొట్ట లేక పోయింది. కనుక యెరుషలేములోని యూదా ప్రజల మధ్య యెబూసీ ప్రజలు నేటికీ ఇంకా నివసిస్తూనే ఉన్నారు.
1 యోసేపు కుటుంబానికి లభించిన దేశం ఇది. ఈ దేశం యెరికో సమీపాన యోర్దాను నది దగ్గర ప్రారంభమై యెరికో జలాల వరకు కొనసాగింది. (ఇది యెరికోకు సరిగ్గా తూర్పున ఉంది) ఆ సరిహద్దు యెరికోనుండి పైకి, బేతేలు కొండ ప్రాంతంవరకు వ్యాపించింది.
2 తర్వాత ఆ సరిహద్దు బేతేలు (లూజు)నుండి అతరోత్ వద్ద సరిహద్దువరకు కొనసాగింది.
3 తర్వాత ఆ సరిహద్దు అర్కీయ పశ్చిమాన యాఫ్లెతీయ ప్రజల సరిహద్దువైపు పోయింది. దిగువ బెత్‌హరను వరకూ ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు గెజెరుకు పోయి, సముద్రం వరకు వ్యాపించింది.
4 కనుక మనష్షే, ఎఫ్రాయిం ప్రజలకు వారి భూమి లభించింది. (మనష్షే, ఎఫ్రాయిము యోసేపు కుమారులు)
5 ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన భూమి ఇది: తూర్పున ఎగువ బేత్‌హోరోను సమీపంలో అతారోతు అద్దారు వద్ద వారి సరిహద్దు మొదలయింది.
6 మరియు పశ్చిమ సరిహద్దు మిస్మెతతు వద్ద మొదలయింది. ఆ సరిహద్దు తూర్పున తానతు షిలోహుకు మళ్లి, యానోయకు విస్తరించింది.
7 అప్పుడు ఆ సరిహద్దు యానోయనుండి క్రిందికి అతారోతు మరియు నారాకు వెళ్ళింది. ఆ సరిహద్దు యెరికోను తాకి, యోర్దాను నది దగ్గర నిలిచిపోయేంతవరకు కొనసాగింది.
8 ఆ సరిహద్దు తప్పూయ మొదలుకొని కానా ఏటివరకు పశ్చిమంగా వ్యాపించి, సముద్రం దగ్గర అంతమయింది. అది మొత్తం ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన దేశం. ఆ వంశంలోని ఒక్కో కుటుంబానికి ఈ దేశంలో కొంత భాగం దొరికింది.
9 ఎఫ్రాయిము వారి సరిహద్దు పట్టణాలు అనేకం నిజానికి మనష్షే వారి సరిహద్దుల్లోనే ఉన్నాయి. కానీ ఆ పట్టణాలు, ఆ పొలాలు ఎఫ్రాయిము వారికే వచ్చాయి.
10 అయితే గెజరు పట్టణంనుండి కనానీ ప్రజలను ఎఫ్రాయిము ప్రజలు వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ ఎఫ్రాయిము ప్రజల మధ్య కనానీ ప్రజలు నివసిస్తున్నారు. కానీ కనానీ ప్రజలు ఎఫ్రాయిము ప్రజలకు బానిసలుగా అయ్యారు.
1 తర్వాత మనష్షే వంశానికి భూమి ఇవ్వబడింది. యోసేపు మొదటి కుమారుడు మనష్షే. మనష్షే మొదటి కుమారుడు మాకీరు, ఇతడు గిలాదు తండ్రి . మాకీరు గొప్ప వీరుడు, కనుక గిలాదు, బాషాను ప్రాంతాలు మాకీరు వంశానికి ఇవ్వబడ్డాయి
2 మనష్షే వంశంలోని ఇతర కుటుంబాలకు కూడా భూమి యివ్వబడింది. ఆ కుటుంబాలు అబియెజెరు, హెలెకు, అజ్రియెలు, షెకెము, హెఫెరు, షెమిద. యోసేపు కుమారుడగు మనష్షే మిగిలిన కుమారులు వీరంతాను. ఈ మనుష్యుల కుటుంబాలకు కూడ కొంత భూమి లభించింది.
3 హెపెరు కుమారుడు సెలోపెహాదు. గిలాదు కుమారుడు హెపెరు. గిలాదు మాకీరు కుమారుడు, మాకీరు మనష్షే కుమారుడు. కానీ సెలోపెహాదుకు కుమారులు లేరు. అతనికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల పేర్లు మహల, నోయ, హోగ్ల, మీల్కా, తిర్సా.
4 యాజకుడైన ఎలీయాజరు, నూను కుమారుడైన యెహోషువ ఇశ్రాయేలు నాయకులందరి దగ్గరకు ఆ కుమార్తెలు వెళ్లారు. “మగవారికి ఇచ్చినట్టే మాకూ భూమి ఇవ్వాలని మోషేతో యెహోవా చెప్పాడు” అన్నారు ఆ కుమార్తెలు. కనుక ఎలీయాజరు యెహోవాకు విధేయుడై, ఆ కుమార్తెలకు కొంత భూమి యిచ్చాడు. కనుక కుమారులవలెనే ఈ కుమార్తెలకుగూడ కొంత భూమి లభించింది.
5 కనుక మనష్షే వంశానికి యోర్దాను నదికి పశ్చిమాన పది ప్రాంతాలు, యోర్దాను నది ఆవలి ప్రక్క గిలాదు, బాషాను అనే మరి రెండు ప్రాంతాలు ఉన్నాయి. 6మనష్షే కుమార్తెలకు గూడ కుమారులవలెనే భూమి లభించింది. మనష్షే మిగిలిన కుటుంబాలకు గిలాదు దేశం ఇవ్వబడింది.
6 [This verse may not be a part of this translation]
7 [This verse may not be a part of this translation]
8 తపూయ దేశం మనష్షేకు చెందినదే కాని తపూయ పట్టణం మాత్రం కాదు. తపూయా పట్టణం మనష్షే దేశ సరిహద్దు పక్కగా ఉంది, అది ఎఫ్రాయిము కుమారులకు చెందినది.
9 మనష్షే సరిహద్దు దక్షిణాన కానా ఏటివరకు వ్యాపించింది. ఈ మనష్షే ప్రాంతంలోని పట్టణాలు ఎఫ్రాయిముకు చెందినవి. నదికి ఉత్తరాన ఉంది మనష్షే సరిహద్దు మరియు అది పశ్చిమాన సముద్రం వరకు విస్తరించింది.
10 దక్షిణ దేశం ఎఫ్రాయిముకు చెందినది. ఉత్తర దేశం మనష్షేది. మధ్యధరా సముద్రం పడమటి సరిహద్దు. ఆ సరిహద్దు ఉత్తరాన ఆషేరు దేశాన్ని, తూర్పున ఇశ్శాఖారు దేశాన్ని తాకుతుంది.
11 ఇశ్శాఖారు, ఆషేరు ప్రాంతంలో బెత్‌షియాను, దాని తాలూకు చిన్న పట్టణాలు, ఇచ్చియాము, దాని తాలుకు చిన్న పట్టణాలు మనష్షే స్వంతం. దోరు పట్టణంలో, దాని తాలూకు చిన్న పట్టణాల్లో, ఎన్‌దోరు పట్టణంలో దాని తాలూకు చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం. తానాకు, దాని చిన్న పట్టణాల్లో, మెగిద్దో, దాని చిన్న పట్టణాల్లో, నాఫోతు మూడు పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం.
12 మనష్షే ప్రజలు ఆ పట్టణాలను ఓడించలేకపోయారు. కనుక కనానీ ప్రజలు అక్కడనే నివసించటం కొనసాగించారు.
13 అయితే ఇశ్రాయేలు ప్రజలు బలవంతులుగా ఎదిగారు. ఇది జరిగినప్పుడు కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కానీ ఆ దేశం విడిచి పొమ్మని మాత్రం కనానీ ప్రజలను వారు ఒత్తిడి చేయలేదు.
14 యోసేపు వంశంవారు యెహోషువతో మాట్లాడి “నీవు మాకు ఒక్క ప్రాంతం మాత్రమే ఇచ్చావు. కానీ మేము చాలమందిమి ఉన్నాము. యెహోవా తన ప్రజలకు ఇచ్చిన భూమి అంతటిలో ఒక్క భాగం మాత్రమే మాకు ఎందుకు యిచ్చావు?” అన్నారు.
15 అప్పుడు యెహోషువ, “మీరు గనుక చాలినంతమంది ఉంటే, మీరు కొండ ప్రదేశానికి వెళ్లి, మీకు నివాస స్థలాన్ని చేసుకోండి. ఇది పెరిజ్జీ ప్రజలకు, రెఫాయిము ప్రజలకు చెందిన దేశం. ఇది ఎఫ్రాయిము వారి కొండ ప్రదేశం కాదు. ఎఫ్రాయిము కొండ ప్రదేశం మీకు మరీ చిన్నది అవుతుంది” అని బదులు చెప్పాడు.
16 యోసేపు ప్రజలు, “నిజమే, ఎఫ్రాయిము కొండ దేశం మాకు చాలదు. కానీ కనానీ ప్రజలు నివసిస్తున్న ప్రదేశం ప్రమాదకరమయింది. వారు నైపుణ్యంగల యుద్ధ వీరులు. మరియు బెత్‌షియనులోను, ఆ ప్రాంతంలోని చిన్న పట్టణాలన్నింటిలోను వారికి బలమైన ఆయుధాలు, ఇనుప రథాలు ఉన్నాయి. పైగా యెజ్రెయేలు లోయలోకూడ వాళ్ళున్నారు” అని చెప్పారు.
17 అప్పుడు యోసేపు, ఎఫ్రాయిము, మనష్షే ప్రజలతో యెహోషువ ఇలా చెప్పాడు: “అయితే మీరు చాల విస్తారంగా ఉన్నారు. మీకూ మహాగొప్ప శక్తి ఉంది. మీకు చాల ఎక్కువ భూమిని ఇవ్వాలి.
18 కొండ ప్రదేశం మీదే. అది అడవి అయినా మీరు చెట్లు నరికి మంచి నివాస ప్రదేశంగా దాన్ని మార్చుకోవచ్చు. అది మొత్తం మీ స్వంతం అవుతుంది. కనానీ ప్రజలను మీరు ఆ దేశం నుండి వెళ్లగొట్టివేయాలి. వారికి బలమూ, బలమైన ఆయుధాలూ ఉన్నప్పటికీ మీరు వారిని ఓడించేస్తారు.”
1 ఇశ్రాయేలు ప్రజలంతా షిలోహు అనే ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ సన్నిధి గుడారాన్ని వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. ఆ దేశంలోని శత్రువులందరినీ వారు ఓడించారు.
2 అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు ఉన్నాయి.
3 కనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు ఇంత కాలం చూస్తూ ఊరకున్నారు. మీ తండ్రుల దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు.
4 కనుక మీ వంశాల్లో ఒక్కోదాని నుండి ముగ్గురు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని పరిశీలించి చూచేందుకు నేను ఆ మనుష్యుల్ని బయటకు పంపిస్తాను. ఆ దేశ పటాన్ని వారు తయారు చేస్తారు. తర్వాత వారు తిరిగి నా దగ్గరకు వస్తారు.
5 దేశాన్ని వారు ఏడు భాగాలుగా విభజిస్తారు. యూదా ప్రజలు వారి దేశాన్ని దక్షిణాన ఉంచుకొంటారు. యోసేపు ప్రజలు వారి దేశాన్ని ఉత్తరాన ఉంచుకొంటారు. 6అయితే మీరు పటం గీసి, దేశాన్ని ఏడు భాగాలుగా విభజించాలి. ఆ పటాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, ఏ వంశానికి ఏ భూమి రావాలో అది మనం యెహోవా దేవుడినే నిర్ణయం చేయనిద్దాం.
6 [This verse may not be a part of this translation]
7 [This verse may not be a part of this translation]
8 కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ దేశంలో ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం యొక్క వివరాలను తయారు చేసి, వాటిని యెహోషువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. కనుక యెహోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి అనేది నేను నిర్ణయించేందుకు సహాయం చేయాల్సిందిగా యెహోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు.
9 కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ దేశంలో ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారుచేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. యెహోషువ ఇంకా షిలోహులోని పాళెములోనే ఉన్నాడు.
10 ఆ సమయంలో యెహోషువ యెహోవాను సహాయం కొరకు వేడుకున్నాడు. ఒక్కో వంశానికి ఇవ్వాల్సిన దేశాలను యెహోషువ నిర్ణయించాడు.
11 యూదాకు యోసేపుకు మధ్యగల ప్రాంతంలోని దేశం బెన్యామీను వంశానికి ఇవ్వబడింది. బెన్యామీను వంశంలోని ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. బెన్యామీనుకు నిర్ణయించబడిన భూమి ఇది:
12 ఉత్తర సరిహద్దు యోర్దాను నది దగ్గర మొదలయింది. యెరికో ఉత్తరపు అంచున కొనసాగింది ఆ సరిహద్దు. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన కొండ దేశంలోనుండి వెళ్లింది. బెత్ అవెనుకు సరిగ్గా తూర్పున చేరేంతవరకు ఆ సరిహద్దు కొనసాగింది.
13 తర్వాత ఆ సరిహద్దు లూజుకు (బేతేలు) దక్షిణంగా విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు అతారోతు అద్దారుకు వెళ్లింది. దిగువ బెత్ హరానుకు దక్షిణాన కొండమీద ఉంది అతారోత్ అద్దార్.
14 బెత్‌హరానుకు దక్షిణంగా ఒక కొండ ఉంది. ఈ కొండ దగ్గర ఆ సరిహద్దు మళ్లుకొని కొండ పడమటి పక్కకు దగ్గర్లో దక్షిణంగా వెళ్లింది. ఆ సరిహద్దు కిర్యత్ బాలాకు (కిర్యత్యారం) పోయింది. ఇది యూదా ప్రజలు నివసించిన ఒక పట్టణం. ఇది పడమటి సరిహద్దు.
15 దక్షిణ సరిహద్దు కిర్యత్యారీము దగ్గర మొదలై నెఫ్తోయ నదివరకు విస్తరించింది.
16 తర్వాత బెన్‌హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు ఎన్‌రోగెలుకు విస్తరించింది.
17 అక్కడ ఆ సరిహద్దు ఉత్తరంగా మళ్లి ఎన్‌షెమెషుకు పోయింది. ఆ సరిహద్దు గెలిలోతుకు (పర్వతాల్లోని అదుమీము కనుమ దగ్గర ఉంది గెలిలోతు) కొనసాగింది. ఆ సరిహద్దు రూబేను కుమారుడు బోహను కోసం పేరుపెట్టబడిన మహాశిలవరకు కిందికి విస్తరించింది.
18 బెత్‌అరబా ఉత్తర ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు అరబాలోనికి విస్తరించింది.
19 తర్వాత ఆ సరిహద్దు బెత్‌హోగ్లా ఉత్తర ప్రాంతంవరకు వెళ్లి, ఉప్పు సముద్రపు ఉత్తర తీరాన ముగిసింది. ఇక్కడే యోర్దాను నది సముద్రంలో పడుతుంది. అది దక్షిణ సరిహద్దు.
20 తూర్పు వైపున యోర్దాను నది సరిహద్దు. కనుక బెన్యామీను వంశానికి ఇవ్వబడిన దేశం ఇది. అవే అన్ని వైపులా సరిహద్దులు.
21 కనుక బెన్యామీను కుటుంబాలు ప్రతీ ఒక్కటీ ఈ దేశాన్ని పొందాయి. మరియు వారి స్వంత పట్టణాలు ఇవి: యెరికో, బెత్‌హోగ్లా, ఎమెక్ కెజిబ్
22 బెత్ అరాబా, సెమరాయిము, బేతేలు
23 అవ్విము, పారా, ఓఫ్రా
24 కెఫెరు అమ్మోని, ఓఫ్ని, గెబ. ఇవి పన్నెండు పట్టణాలు, ఈ పట్టణాల దగ్గర ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.
25 బెన్యామీను వంశం స్వంత పట్టణాల్లో గిబియోను, రామా, బెయెరొతు
26 మిస్పే, కెఫిరా, మోసా,
27 రెకెము, ఇర్పెయెలు, తరలా
28 సేలా, ఎలెపు, యెబూసీ పట్టణం (యెరుషలేము), గిబియా, కిర్యత్ ఉన్నాయి. ఇవి పద్నాలుగు పట్టణాలు, వీటి దగ్గర్లో ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ బెన్యామీను వంశానికి లభించిన భూములు.
1 అప్పుడు షిమ్యోను వంశంవారికి, ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ వారి భూములను యెహోషువ పంచిపెట్టాడు. వారికి లభించిన భూమి యూదాకు చెందిన ప్రాంతం లోపల ఉంది.
2 వారికి లభించిన భూమి యిది; బెయెర్ షెబ (షెబ) మోలాదా,
3 హజర్‌షువలు, బాలా, ఎజెము,
4 ఎల్తోలదు, బెతులు, హొర్మా
5 సిక్లగు, బెత్ మార్కాబొదు, హజర్‌సుస
6 బెత్ లబాయొతు మరియు షారుహను. ఇవి పదమూడు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
7 అయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను పట్టణాలు కూడా వారికి లభించాయి. ఇవి నాలుగు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
8 బాలాత్ బెయెరు వరకు ప్రజలు నివసిస్తున్న అతి చిన్న ప్రాంతాలు కూడ అన్నీ వారికి లభించాయి. (ఇది నెగెవు ప్రాంతంలో ఉన్న రామా వంటిదే.) కనుక షిమ్యోనీ ప్రజల కుటుంబాలకు ఇవ్వబడిన భూములు అవి. ఒక్కో కుటుంబానికి ఈ భూములు లభించాయి.
9 షిమ్యోనీ ప్రజల భూమి యూదా భూభాగంలోనుండి తీసికోబడింది. యూదా వారికి అవసరమైన దానికంటె చాలా ఎక్కువ భూమి ఉంది. కనుక వారి భూమిలో షిమ్యోనీ ప్రజలకు కొంత భాగం లభించింది.
10 తర్వాత భూమి లభించిన వంశం జెబలూను. జెబూలూను వంశంలోని ప్రతి కుటుంబానికీ, వారికి వాగ్దానం చేయబడిన భూమి లభించింది. జెబూలూను సరిహద్దు శారీదు వరకు విస్తరించింది.
11 తర్వాత అది పశ్చిమాన మరాలా వరకు పోయి, దబ్బాషెతు ప్రాంతానికి సమీంపంగా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు యొక్నెయాము దగ్గర ప్రాంతానికి విస్తరించింది.
12 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. శారీదు నుండి అది కిస్లోత్ తాబోరు ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు దబెరాతు. యాఫియకు విస్తరించింది.
13 తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్ హెఫెరు, ఎత్‌కాసిను వరకు విస్తరించింది. ఆ సరిహద్దు రిమ్మోను వద్ద అంతమయింది. తర్వాత ఆ సరిహద్దు మళ్లుకొని నేయావరకు కొనసాగింది.
14 నేయావద్ద ఆ సరిహద్దు మరల మళ్లుకొని ఉత్తరానికి విస్తరించింది. ఆ సరిహద్దు హన్నాతొన్ వరకు విస్తరించి, ఇఫ్తాయెల్ లోయవరకు కొనసాగింది.
15 ఈ సరిహద్దు లోపల కట్టాత్, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లేహేము పట్టణాలు ఉన్నాయి. మొత్తం మీద పన్నెండు పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి.
16 కనుక జెబలూనుకు లభించిన పట్టణాలు, ప్రాంతాలు ఇవి. జెబలూను ప్రతి వంశానికీ ఈ భూమి లభించింది.
17 నాలుగవ భాగం ఇశ్శాఖారు వంశంవారికి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది.
18 ఆ కుటుంబాలకు వారికి ఇవ్వబడిన భూమి యిది; యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము,
19 హపరాయిము, షియోను, అనాహరతు
20 రబ్బితు, కిష్యోను, ఎబెజు
21 రెమెతు, ఎన్‌గన్నిము, ఎన్‌హద్దా, బెత్‌పెసెసు.
22 వారి దేశ సరిహద్దు తాబోరు, షహజును, బెత్‌షెమెషు అనే ప్రాంతాలను తాకుతుంది. ఆ సరిహద్దు యెర్దాను నది దగ్గర నిలిచిపోయింది. మొత్తం మీద 16 పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి.
23 ఈ పట్టణాలు, పురాలు ఇశ్శాఖారు వంశానికి యివ్వబడిన దేశంలోని భాగం. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.
24 దేశంలోని ఐదవ భాగం ఆషేరు వంశం వారికి ఇవ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ భూమిలో కొంత లభించింది.
25 ఆ వంశానికి ఇవ్వబడిన దేశం ఇది; హెల్కతు, హాలి బెతెను, అక్షాపు,
26 అలమ్మెల్లెకు’ అమద్, మిషల్. పడమటి సరిహద్దు కర్మెలు పర్వతం, షీహోరు లిబ్నాతు వరకు కొనసాగింది.
27 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. ఆ సరిహద్దు బెత్ దాగొనుకు విస్తరించింది. ఆ సరిహద్దు జెబలూను, ఇఫెలు లోయలను తాకింది. తర్వాత ఆ సరిహద్దు బెత్‌ఎమెక్, నెయీఎల్‌కు ఉత్తరంగా కొనసాగింది. ఆ సరిహద్దు కాబూలుకు ఉత్తరంగా దాటాపోయింది.
28 తర్వాత అబ్దోను , రెహోబు, హమ్మోను, కానా వరకు ఆ సరిహద్దు కొనసాగింది. మహాసీదోను ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది.
29 తర్వాత ఆ సరిహద్దు తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు బలమైన తుయర పట్టణంవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు మళ్లుకొని హొసాకు పోయింది. సముద్రం దగ్గర అక్జీబు ప్రాంతంలో
30 ఉమ్మా, అఫెకు, రెహోబు దగ్గర సరిహద్దు అయిపోయింది. మొత్తం మీద ఇరవై రెండు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
31 ఆషేరు వంశానికి ఇవ్వబడిన దేశంలో ఈ పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఒక భాగం. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో ఒక భాగం లభించింది.
32 నఫ్తాలి వంశం వారికి ఆరో భాగం భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది.
33 వారి దేశ సరిహద్దు జయ నన్నీములోని సింధూరవనము దగ్గర ప్రారంభమయింది. ఇది హెలెవు సమీపంలో ఉంది. తర్వాత ఆదామి, నెకెబు, యబ్నెయెలు గుండా ఆ సరిహద్దు కొనసాగింది. ఆ సరిహద్దు లక్కుం ప్రాంతం వరకు విస్తరించి, యోర్దాను నది దగ్గర ముగిసింది.
34 తర్వాత ఆ సరిహద్దు అస్నొతు తాబోరుగుండా పడమటికి వెళ్లింది. హుక్కొకు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. దక్షిణాన సరిహద్దు జెబలూను ప్రాంతం వరకు వెళ్లింది. పశ్శిమాన ఆ సరిహద్దు ఆషేరు ప్రాంతం వరకు వెళ్లింది. తూర్పున యోర్దాను నది దగ్గర ఆ సరిహద్దు యూదా వరకు వెళ్లింది.
35 ఈ సరిహద్దుల లోపల కొన్ని బలమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కాతు, కిన్నెరతు
36 అదామా, రామా, హషొరు
37 కెదెషు, ఎద్రేయి, ఎన్‌హసోరు
38 ఇరోను, మిగ్దల్ ఎల్, హోరేం, బెత్‌అనాతు, బెత్‌షెమెషు. మొత్తం మీద పంతొమ్మిది, పట్టణాలు వాటి పొలాలు మొత్తము.
39 ఆ పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పురాలు నఫ్తాలి వంశం వారికి యివ్వబడిన దేశంలో ఉన్నాయి. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది.
40 తర్వాత దాను వంశానికి భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భూమి లభించింది.
41 వారికి ఇవ్వబడిన భూమి ఇది: జొర్యా, ఎష్తాయోలు, ఇర్‌షెమెషు
42 షయల్బీను, అయ్యలోను, ఇత్లా,
43 ఎలోను, తిమ్నా, ఎక్రోను
44 ఎలైకే, గిబ్బెతాను, బాలాతా
45 యెహుదు బెనెబెరక్, గాత్ రిమ్మోను
46 మేయర్కోను రక్కోను, యొప్ప దగ్గర ప్రాంతం.
47 అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు, వారిని దాను ప్రజలు తేలికగా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లెషెము మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చి వేసారు, ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు.
48 దాను వంశానికి యివ్వబడిన దేశం ఈ పట్టణాలు, పురాలు మొత్తము. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.
49 కనుక దేశాన్ని విభజించటం, వేర్వేరు వంశాలకు దానిని పంచి ఇవ్వటం నాయకులు ముగించారు. వారు ముగించిన తర్వాత, నూను కుమారుడైన యెహోషువకు గూడ కొంత భూమి ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజలంతా నిర్ణయించారు. ఇది అతనికి వాగ్దానం చేయబడిన భూమి.
50 అతనికి ఈ భూమి రావాలని యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక ఎఫ్రాయిము కొండ దేశంలోని తిమ్నాత్ సెరహు పురమును వారు యెహోషువకు ఇచ్చారు. ఈ పట్టణమే తనకు కావాలని యెహోషువ వారితో చెప్పాడు. కనుక యెహోషువ ఆ పట్టణాన్ని మరింత గట్టిగా కట్టి, అక్కడ నివసించాడు.
51 కనుక ఇశ్రాయేలీయుల వేర్వేరు వంశాలకు ఈ భూములన్నీ ఇవ్వబడ్డాయి. ఈ దేశాన్ని విభాగించేందుకు యాజకుడైన ఎలీయేజరు, నూను కుమారుడైన యెహోషువ, ఒక్కో వంశాల నాయకులు షిలోహు అనే స్థలంలో సమావేశం అయ్యారు. సన్నిధి గుడార ప్రవేశం దగ్గర యెహోవా సన్నిధిలో వారు సమావేశమయ్యారు. ఇప్పుడు దేశాన్ని విభాగించటం వారు ముగించారు.
1 అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు:
2 “నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకొన్నాను. ప్రత్యేకమైన ఆశ్రయ పురాలను నిర్మించుమని మోషే నీతో చెప్పాడు.
3 ఎవరైనా ఒక వ్యకి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ పురానికి వెళ్ల వచ్చును.
4 “ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, ఆ పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, ఆ పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతణ్ణి ఆ పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు.
5 అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది.
6 ఆ పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు ఆ పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు ఏ పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”
7 కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. ఆ పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిలయలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్ అర్బ (హెబ్రోను.)
8 యోర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.
9 ఏ ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసిస్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే, ఆ వ్యక్తి భద్రతకోసం ఈ ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు, అతణ్ణి తరుముతున్న ఎవరిచేతగాని అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయస్థానం, ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది.
1 లేవీ వంశంపు ప్రధానులు యాజకుడైన ఎలీయాజరుతో, నూను కుమారుడు యెహోషువతో, ఇశ్రాయేలీయుల ఇతర వంశాల ప్రధానులతో మాట్లాడేందుకు వెళ్లారు.
2 ఇది కనాను దేశంలోని షిలోహు పట్టణంలో సంభవించింది. “మోషేకు యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మేము నివసించేందుకు మీరు మాకు పట్టణాలు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు. మా పశువులు మేత మేసేందుకు పొలాలుకూడ మీరు మాకు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు.” అని లేవీ ప్రధానులు వారితో చెప్పారు.
3 కనుక యెహోవా ఆజ్ఞకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. లేవీ ప్రజలకు వారు ఈ పట్టణాలు, ప్రాంతాలు ఇచ్చారు:
4 కహతు వంశంలో ఒక భాగం వారికి పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. యూదా, షిమ్యోను, బెన్యామీను వారికి చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి. (కహతు వంశం, లేవీ వంశంలో ఒక భాగం. లేవీ యాజకుడైన అహరోను సంతానము).
5 కహతు వంశంలోని మరో భాగం వారికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పది పట్టణాలు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్ధగోత్రం వారి ప్రాంతాల్లో ఉన్నాయి.
6 గెర్షోము వంశపు ప్రజలకు పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్ధ గోత్రం వారి ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.
7 మెరారీ కుటుంబం వారికి పన్నెండు పట్టణాలు ఇవ్వబడ్డాయి. రూబేను, గాదు, జెబలూనుకు చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.
8 కనుక ఈ పట్టణాలు, వీటి పరిసరాల్లోని పొలాలు లేవీ ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు విధేయులుగా వారు ఇలా చేసారు.
9 యూదా, షిమ్యోనుకు చెందిన దేశంనుండి తీసుకొనబడిన పట్టణాల పేర్లు ఇవి.
10 మొదట నిర్ణయించబడిన పట్టణాలు కహత్ కుటుంబానికి ఇవ్వబడ్డాయి (లేవీ ప్రజలు).
11 కిర్యత్ అర్బ (హెబ్రోను), దాని పొలాలు అన్నీ వారు వారికి ఇచ్చారు. ఇది యూదా కొండ దేశంలో ఉంది. (అనాకు తండ్రి అర్బ). ఆ పట్టణం దగ్గర్లో వారి పశువులు మేసేందుకు పొలాలు కూడ వారికి లభించాయి.
12 అయితే కిర్యత్ అర్బ చుట్టు ఉన్న చిన్న పట్టణాలు, పొలాలు యెపున్నె కుమారుడైన కాలేబుకు చెందినవి.
13 కనుక హెబ్రోను పట్టణాన్ని వారు అహరోను సంతతివారికి ఇచ్చారు. హెబ్రోను ఆశ్రయ పట్టణం. అహరోను సంతతివారికి లిబ్నా
14 యత్తీరు, యష్టెమోయ
15 హోలోను, దెబీరు,
16 అయ్యిను, యుట్ట, బెత్‌షెమెషు పట్టణాలను కూడ వారు ఇచ్చారు. ఈ పట్టణాల చుట్టుపక్కల ఉన్న పొలాలు అన్నింటిని కూడ వారు వీరికి ఇచ్చారు. ఈ రెండు వంశాలకు ఇవ్వబడినవి తొమ్మిది పట్టణాలు.
17 బెన్యామీను సంతతివారికి చెందిన పట్టణాలను కూడా అహరోను సంతతివారికి ఇచ్చారు. ఆ పట్టణాలు గిబియోను, గెబ,
18 అనాతోతు, అల్మాను. ఈ నాలుగు పట్టణాలను, వాటి చుట్టూ ఉన్న పొలాలు అన్నింటినీ వారు వీరికి ఇచ్చారు.
19 కనుక యాజకులకు ఇవ్వబడిన పట్టణాలు ఇవి. ఈ యాజకులు అహరోను సంతానం వారు. మొత్తం మీద అవి పదమూడు పట్టణాలు మరియు వాటి పొలాలు.
20 కొహతీ కుటుంబంలో ఇతర ప్రజలకు ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పట్టణాలు ఎఫ్రాయిము వంశంనుండి తీసుకోబడ్డాయి.
21 ఎఫ్రాయిము కొండ ప్రదేశంనుండి షెకెము పట్టణం (షెకెము ఒక ఆశ్రయ పట్టణం) వారువారికి గెజెర్
22 కిబ్సాయిము, బెత్‌హారాను కూడ ఇచ్చారు. మొత్తం మీద అవి నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.
23 దాను వంశం వారు వారికి ఎత్తేకె, గిబ్బెతాను
24 అయ్యలోను, గాత్ రిమ్మోను ఇచ్చారు. మొత్తం మీద నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.
25 మనష్షే వంశంలోని సగంమంది తానాను, గాత్ రిమ్మోను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న పొలాలు అన్నీ వారికి ఇవ్వబడ్డాయి.
26 కనుక దీనితో ఇంకా పది పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న భూమి మొత్తం కొహత్ కుటుంబం వారికి ఇవ్వబడ్డాయి.
27 లేవీ వంశంలోని గెర్షోను కుటుంబం వారికి ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి. మనష్షే వంశంలోని సగంమంది బాషానులోని గొలానును వారికి ఇచ్చారు. (గొలాను ఆశ్రయ పట్టణం) మనష్షేకూడ బెష్టెరాను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.
28 ఇశ్శాఖారు వంశంవారు వారికి కిషియొను, దబెరాతు
29 యార్ముతు, ఎన్‌గన్నీము ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు, వాటిచుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారి పశువులకోసం ఇశ్శాఖారు వంశానికి ఇచ్చారు.
30 ఆశేరు వంశం వారు వారికి మిషాలు, అబ్దోను
31 హెల్కాతు, రెహబు ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు వాటి చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారు వారి పశువుల కోసం ఇచ్చారు.
32 నఫ్తాలి వంశంవారు గలలీయలోని కెదెషును వారికి ఇచ్చారు. (కెదెషు ఆశ్రయ పట్టణం). హమ్మోత్ దోరు, కర్తానుకూడ నఫ్తాలి వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.
33 మొత్తం మీద గెర్షోను కుటుంబం వారికి పద మూడు పట్టణాలు, ఈ పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం పొలాలు లభించాయి.
34 మరో లేవీ కుటుంబం మెరారీ కుటుంబం. మెరారీ కుటుంబం వారికి ఇవ్వబడిన పట్టణాలు ఇవి: జెబలూను వంశంవారు ఇచ్చినవి: యొకెనియము, కర్తా
35 దిమ్నా, నహలాలు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ ప్రజలకే ఇవ్వబడింది.
36 రూబేను వంశంవారు వారికి ఇచ్చినవి బెసెరు, యహసు
37 కెదెమోతు, మోఫాతు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ కుటుంబానికే ఇవ్వబడింది.
38 గాదు వంశం వారు ఇచ్చినవి గిలాదులోని రామోత్. (గిలాదు ఒక ఆశ్రయ పట్టణం). వారు ఇంకా మహనయీము,
39 హెష్బోను, యాజెరు కూడ ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ గాదువారు వారికి ఇచ్చారు.
40 మొత్తం మీద మెరారీ వారికి ఇవ్వబడినవి పన్నెండు పట్టణాలు.
41 మొత్తం మీద లేవీ వంశానికి నలభై ఎనిమిది పట్టణాలు లభించాయి. ఈ పట్టణాలన్నీ ఇశ్రాయేలు ప్రజల స్వాధీనంలో ఉన్న దేశంలోనే ఉన్నాయి.
42 ఈ పట్టణాలు ప్రతిదాని చుట్టూ పశువులు బతికేందుకు గాను భూమి, పొలాలు ఉన్నాయి.
43 కనుక ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన వాగ్దానం చేసిన దేశం అంతటినీ ఆ ప్రజలకు ఆయన ఇచ్చాడు. ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని అక్కడ నివసించారు.
44 మరియు వారి దేశానికి అన్నివైపులా ఆ ప్రజలు శాంతి కలిగి ఉండేటట్లు యెహోవా చేసాడు. చాలా కాలం కిందట వారి పూర్వీకులకు ఆయన వగ్దానం చేసింది ఇదే. వారి శత్రువులు ఎవరూ వారిని ఓడించలేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రతి శత్రువును ఓడించేటట్టు యెహోవా చేసాడు.
45 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన నెరవేర్చాడు. నెరవేరని వాగ్దానాలంటూ ఏమీ లేవు. ప్రతి వాగ్దానం నిజమయింది.
1 అప్పుడు రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలో సగం మంది, అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు యెహోషువ.
2 యెహోషువ వారితో అన్నాడు: “మీరు చేయాలని మోషే చెప్పిన వాటన్నింటికీ మీరు విధేయులయ్యారు. మోషే యెహోవా సేవకుడు. మరియు, మీరు నా ఆజ్ఞలన్నింటికి కూడా విధేయులయ్యారు.
3 ఇంకను ఇన్నాళ్లూ ఇశ్రాయేలు ఇతర ప్రజలందరినీ మీరు బలపర్చారు. మీ యెహోవా దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నింటికీ మీరు జాగ్రత్తగా విధేయులయ్యారు.
4 ఇశ్రాయేలు ప్రజలకు శాంతి ఇస్తానని మీ యెహోవా దేవుడు వాగ్దానం చేసాడు. కనుక ఇప్పుడు యెహోవా తన వాగ్దానం నిలబెట్టుకొన్నాడు. ఇప్పటికి మీరు తిరిగి మీ ఇండ్లకు వెళ్లవచ్చును. మీకు ఇవ్వబడ్డ దేశానికి మీరు తిరిగి వెళ్లవచ్చును. ఇది యోర్దాను నదికి తూర్పున ఉన్న దేశం. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం ఇది.
5 అయితే మోషే మీకు ఇచ్చిన చట్టానికి లోబడుతూనే ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. మీ యెహోవా దేవుడ్ని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడటమే ఆ చట్టం. మీరు ఆయనను వెంబడిస్తూనే ఉండాలి, మీకు చేతనైనంత బాగుగా అయనను సేవిస్తూనే ఉండాలి.”
6 తర్వాత యెహోషువ వారికి వీడ్కోలు చెప్పగా, వారు వెళ్లిపోయారు. వారు వారి ఇండ్లకు వెళ్లిపోయారు.
7 బాషాను దేశాన్ని మనష్షే అర్ధ వంశం వారికి మోషే ఇచ్చాడు. మిగిలిన అర్ధం వంశంవారికి యోర్దాను నది పడమటి వైపు దేశాన్ని యెహోషువ ఇచ్చాడు. అక్కడికివారి ఇండ్లకు యోహోషువ వారిని పంపివేసాడు. యెహోషువ వారిని ఆశీర్వదించాడు.
8 “మీ ఇండ్లకు మీ ఐశ్వర్యాలకు తిరిగి వెళ్లండి. మీకు చాల పశువులు, చాల విలువైన నగలు, వెండి, బంగారం ఉన్నాయి. మీకు చాల అందమైన బట్టలు ఉన్నాయి. మరియు మీ శత్రువుల దగ్గర చాల వస్తువులు మీరు తీసుకొన్నారు. వీటన్నింటినీ మీలో మీరు పంచుకోవాలి.” అని అతడు చెప్పాడు.
9 కనుక రూబేను, గాదు, మనష్షే వంశాలవారు మిగిలిన ఇశ్రాయేలు ప్రజలను విడిచి వెళ్లారు. వారు కనానులోని షిలోహులో ఉన్నారు. ఆ స్థలం విడిచి వారు తిరిగి గిలాదు వెళ్లారు. ఇది వారి స్వంత దేశం. ఈ దేశాన్ని మోషే వారికి ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించినందువల్ల అతడు దానిని వారికి ఇచ్చాడు.
10 రూబేను, గాదు, మనష్షే ప్రజలు గెలిలోతు అనే స్థలానికి ప్రయాణం చేసారు. ఇది కనాను దేశంలో యోర్దాను నది దగ్గర ఉంది. ఆ స్థలంలో ప్రజలు ఒక చక్కని బలిపీఠం నిర్మించారు.
11 కానీ ఈ మూడు వంశాలవారు నిర్మించిన బలిపీఠం గూర్చి, ఇంకా షిలోహులోనే ఉన్న ఇతర ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. కనాను సరిహద్దులో గెలిల్‌తో అనే చోట బలిపీఠం ఉన్నదని వారు విన్నారు. అది యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయుల వైపుగా ఉంది.
12 ఈమూడు వంశాల మీద ఇశ్రాయేలు ప్రజలందరికీ చాల కోపం వచ్చింది. వారు కలుసుకొని, వాళ్లతో యుద్ధం చేయాలని నిర్ణయం చేసారు.
13 కనుక రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మాట్లాడేందుకు ఇశ్రాయేలు ప్రజలు కొందరు మనుష్యుల్ని పంపించారు. యాజకుడు ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసు ఈ మనుష్యులకు నాయకుడు.
14 వంశాల నాయకులలో పదిమందిని కూడ వారు అక్కడికి పంపించారు. షిలోహులో ఉన్న ఇశ్రాయేలు వంశాల్లో ఒక్కో దాని నుండి ఒక్కో మనిషి అందులో ఉన్నాడు.
15 కనుక ఈ పదకొండు మంది గిలాదు వెళ్లారు. రూబేను, గాదు, మనష్షే ప్రజలతో మట్లాడటానికి వారు వెళ్లారు. ఆ పదకొండు మంది వారితో అన్నారు:
16 “ఇశ్రాయేలు ప్రజలంతా మిమ్మల్ని అడిగేది ఏమిటంటే, ‘ఇశ్రాయేలీయుల దేవునికి వ్యతిరేకంగా మీరు ఈ పని ఎందుకు చేసారు? మీరెందుకు యెహోవాకు అడ్డం తిరిగారు? మీకోసం మీరెందుకు బలిపీఠం కట్టుకొన్నారు? ఇది దేవుని చట్టానికి విరుద్ధం అని మీకు తెలుసు.
17 పెయొరు అనే మనిషి జ్ఞాపకం ఉన్నాడా? అతడు ఇలాగే చేసాడు. అతడి పాపం మూలంగా నేటికీ మనం శ్రమ అనుభవిస్తున్నాం. అతడి మహా అపరాధం మూలంగా ఇశ్రాయేలు ప్రజలు అనేకమంది రోగులు అయ్యేటట్టు దేవుడు చేసాడు. ఆ రోగం మూలంగా మనం నేడు కూడ శ్రమపడుతున్నాం.
18 ఇప్పుడు మీరు మళ్లీ అలాగే చేస్తున్నారు. మీరు యెహోవాకు విరోధంగా తిరుగుతున్నారు. యెహోవాను వెంబడించటానికి మీరు నిరాకరిస్తారా? మీరు చేస్తాన్న దానిని మానివేయకపోతే ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరి మీదా యెహోవా కోపగిస్తాడు.
19 “ఆరాధించుకొనేందుకు మీ దేశం తగినట్టుగా లేకపోతే, మా దేశంలోనికి రండి. యెహోవా గుడారం మా దేశంలో ఉంది. మీరు కూడ మా దేశంలో కొంత తీసుకొని, అక్కడే నివసించవచ్చు. అంతేకాని యెహోవకు విరోధంగా తిరుగకండి. మరో బలిపీఠం నిర్మించవద్దు. మన యెహోవా దేవుని బలిపీఠం సన్నిధి గుడారంలో ఇదివరకే ఉంది.
20 “జెరహు కుమారుడు ఆకాను ఆనేవాడ్ని జ్ఞాపకం చేసుకోండి. నాశనం చేయాల్సిన వస్తువుల విషయంలో అతడు ఆజ్ఞకు లోబడేందుకు ఇష్టపడలేదు. ఆ ఒక్కడు యెహోవా ఆజ్ఞకు ఉల్లంఘించాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలంతా శిక్షపొందారు. ఆకాను అతని అపరాధం మూలంగా చనిపోయాడు. కానీ అతని వలన ఇంకా చాలమంది ప్రజలు కూడ చనిపోయారు.”
21 రూబేను, గాదు, మనష్షే వంశాల ప్రజలు ఆ పదకొండు మందికీ జవాబు చెప్పారు. వారు చెప్పింది ఇదే:
22 “యెహోవాయే మా దేవుడు. మళ్లీ చెబతున్నాము. యెహోవాయే మా దేవుడు. మేము ఎందుకు ఇలా చేసామో దేవునికి తెలుసు. మీరు కూడ తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. మేము చేసినదానికి వీరు విచారణ జరుపవచ్చు. మేము చేసింది తప్పు అనే నమ్మకం మీకు కలిగితే, మీరు మమ్మల్ని చంపవచ్చు.
23 మేము గనుక దేవుని చట్టాన్ని ఉల్లంఘించిఉంటే, మమ్ముల్ని శిక్షించుమని చెప్పి ఆ దేవుడినే మేము అడుగుతాము. ధాన్యార్పణలు, సమాధానబలులు అర్పించేందుకు, దహనబలుల కోసమూ మేము ఈ బలిపీఠం నిర్మించామని మీరు తలుస్తున్నారా? లేదు. ఆ కారణంతో మేము దీన్ని నిర్మించలేదు. మేము ఈ బలిపీఠాన్ని ఎందుకు నిర్మించాము?
24 మేము కూడ మీ దేశంలో భాగస్థులమేనని మీ ప్రజలు భవిష్యత్తులో ఒప్పుకోరేమోనని మేము భయపడ్డాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యోహోవాను మేము ఆరాధించకూడదని అప్పుడు మీ ప్రజలు అంటారు.
25 యోర్దాను నది అవతలి వైపు దేవుడు మాకు భూమి ఇచ్చాడు. అంటే యోర్దాను నది మనల్ని వేరు చేస్తుందని దీని అర్థం. మీ పిల్లలు పెద్దవారై, మీ దేశాన్ని పాలించినప్పుడు, మేమూ మీ వాళ్లమేనని వారికి జ్ఞాపకం ఉండదు. ‘రూబేను, గాదు ప్రజలారా, మీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యను చెందినవారు కారు’ అని మాతో వారు అంటారు. అందుచేత మా పిల్లలు యెహోవాను ఆరాధించకుండా మీ పిల్లలు ఆటంకపరుస్తారు.
26 “అందుచేత మేము ఈ బలిపీఠం నిర్మించాలని నిర్ణయించాం. అంతేగాని దీనిని దహనబలులకు, బలులకు ఉపయోగించాలని మేము తలచలేదు.
27 మీరు ఆరాధిస్తున్న, మీరు ఆరాధించే దేవుడినే మేమూ ఆరాధిస్తున్నామనే విషయం మా బలిపీఠం మా ప్రజలకు తెలియజేయాలనేదే అసలైన కారణం. మేము యెహోవాను ఆరాధిస్తామని మీకు, మాకు, మనభవిష్యత్ పిల్లలందరికీ ఈ బలిపీఠం ఋజువుగా ఉంటుంది. మా బలులు, ధాన్యార్పణలు, సమాధాన బలులు యెహోవాకు అర్పిస్తాము. మీ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు, మీవలెనే మేము కూడ ఇశ్రాయేలీయులం అని తెలుసుకోవాలని మా కోరిక.
28 ముందు నాటికి మేము ఇశ్రాయేలీయులకు చెందిన వాళ్లము కాదు అని మీ పిల్లలు చెప్పినట్లయితే ‘చూడండి! మాకు ముందు జీవించిన మా పితరులు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం సరిగ్గా పవిత్ర గుడారం ముందర ఉన్న బలిపీఠంలాగానే ఉంది. ఈ బలిపీఠాన్ని బలులు అర్పించేందుకు మేము ఉపయోగించము. మేమూ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక భాగమే అని ఈ బలిపీఠం తెలియజేస్తుంది’ అని మా పిల్లలు చెప్పగలుగుతారు.
29 “వాస్తవంగా మేము యోహోవాకు వ్యతిరేకంగా ఉండాలనుకోవటం లేదు. ఆయనను వెంబడించటం ఇప్పుడు మానివేయాలని కోరటం లేదు. పవిత్ర గుడారం ఎదుట ఉన్నదే సత్యమైన ఒకే బలిపీఠం అని మాకు తెలుసు. ఆ బలిపీఠం మన యోహోవా దేవునిది.”
30 రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పిన ఈ విషయాలను యాజకుడు ఫీనెహాసు, పదిమంది నాయకులు విన్నారు. ఈ మనుష్యులు సత్యమే చెబతున్నారని వారు తృప్తిపడ్డారు.
31 కనుక యాజకుడు ఫీనెహాసు, “యెహోవా మనతో ఉన్నాడని ఇప్పుడు మాకు తెలుసు. మరియు మీరు ఆయనకు విరోధంగా తిరుగలేదని కూడ ఇప్పుడు తెలుస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా చేత శిక్షించబడరు గనుక మేము సంతోషిస్తున్నాము” అన్నాడు.
32 అప్పుడు ఫీనేహాసు, తదితర నాయకులు ఆ చోటువిడిచి, ఇంటికి వెళ్లారు. రూబేను, గాదు ప్రజలను గిలాదు దేశంలో విడిచిపెట్టి, వారు కనానుకు తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వారు తిరిగి వెళ్లి జరిగినది వారికి తెలియజేసారు.
33 ఇశ్రాయేలు ప్రజలు కూడ తృప్తి చెందారు. వారు సంతోషించి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. రూబేను, గాదు, మనష్షే ప్రజల మీదికి యుద్ధానికి వెళ్లకూడదని వారు తీర్మానించారు. ఆ దేశాలను నాశనం చేయకూడదని వారు నిర్ణయించారు.
34 మరియు, “యెహోవాయే దేవుడని మేము నమ్ముతున్నట్టు ఈ బలిపీఠం ప్రజలందరికీ తెలియజేస్తుంది” అని రూబేను, గాదు, మనష్షే ప్రజలు చెప్పారు. అందుచేత వారు ఆ బలిపీఠానికి “ఋజువు” అని పేరు పెట్టారు.
1 ఇశ్రాయేలీయులకు వారి చుట్టూ ఉండే శత్రువులనుండి యెహోవా శాంతిని ఇచ్చాడు. ఇశ్రాయేలీయులను యెహోవా క్షేమంగా ఉంచాడు. చాల సంవత్సరాలు గడిచాయి, యెహోషువ వృద్దుడయ్యాడు.
2 ఈ సమయంలో ఇశ్రాయేలు నాయకులు, కుటుంబ పెద్దలు న్యాయమూర్తులు అందరినీ యెహోషువ సమావేశపర్చాడు. యెహోషువ ఇలా చెప్పాడు: “నేను చాల ముసలివాడినయ్యాను.
3 మన శత్రువులకు యోహోవా చేసిన వాటిని మీరు చూసారు. మనకు సహాయం చేసేందుకు అయన అలా చేసాడు. మీ దేవుడైన యోహోవా మీ పక్షంగా పోరాడాడు.
4 పశ్చిమాన మహా సముద్రానికి, యోర్దానుకు మధ్యగల దేశమంతా మీ ప్రజలు తీసుకోవచ్చని నేను మీతో చెప్పినది జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు ఇస్తానని చెప్పిన దేశం అది. కానీ మీరు ఇంకా దానిని స్వాధీనం చేసుకోలేదు.
5 అక్కడ నివసిస్తున్న ప్రజలకు మీ యెహోవా దేవుడు బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు. మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు, అక్కడ నివసిస్తున్న ప్రజలను యెహోవా వెళ్లగొట్టేస్తాడు. మీ దేవుడైన యోహోవా చేసిన వాగ్దానం ఇది.
6 “యెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే ధర్మశాస్రంలో రాయబడిన వాటన్నింటికీ విధేయులుగా ఉండండి. ఆ ధర్మశాస్త్రానికి విముఖులు కావద్దు.
7 ఇశ్రాయేలు ప్రజలు కానివాళ్లు ఇంకా కొంతమంది మన మధ్య నివసిస్తున్నారు. ఆ ప్రజలు వారి స్వంత దేవుళ్లను ఆరాధిస్తున్నారు. ఆ ప్రజలతో స్నేహం చేయవద్దు. వారి దేవుళ్లను సేవించవద్దు, ఆరాధించవద్దు.
8 మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు. అలాగే మీరు చేస్తూ ఉండాలి.
9 మహా బలంగల అనేక రాజ్యాలను ఓడించేందుకు యెహోవా మీకు సహాయం చేసాడు. ఆ ప్రజలను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. ఏ రాజ్యం కూడా మిమ్మల్ని ఓడించలేకపోయింది.
10 యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులలో ఒక్కడు వేయిమంది శత్రువులను ఓడించగలిగాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడటంవల్లనే ఇది జరిగింది. ఇలా చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు.
11 అందుచేత మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తూనే ఉండాలి. మీరు సంపూర్ణులుగా అయనను ప్రేమించాలి.
12 “యెహోవా మార్గంనుండి తొలగిపోవద్దు. ఇశ్రాయేలీయులకు చెందని ఏ ఇతరులతో స్నేహం చేయవద్దు. వారి మనుష్యులను ఎవరినీ పెళ్లాడకండి. అయితే మీరే గనుక ఈ మనుష్యులతో స్నేహం చేస్తే
13 మీ శత్రువులను జయించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు సహాయం చేయడు. కనుక ఈ ప్రజలు మీకు ఒక ఉచ్చుగా ఉంటారు. వారు మీ కళ్లలో పొగలా, ధూళిలా మీకు బాధ కలిగిస్తారు. మరియు ఈ మంచిదేశం నుండి మీరు వెళ్లగొట్టబడుతారు. ఇది మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశం, కానీ మీరు ఈ ఆజ్ఞకు విధేయులు కాకపోతే, దీనిని పోగొట్టు కొంటారు.
14 “ఇది దాదాపు నేను చనిపోవాల్సిన సమయం యెహోవా మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసాడని మీకు తెలుసు, మీరు వాస్తవంగా నమ్ముతున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ ఆయన తప్పలేదని మీకు తెలుసు. మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానమూ యెహోవా నెరవేర్చాడు.
15 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ప్రతి మంచి వాగ్దానం నిజంగా నెరవేరింది. అయితే అదే విధంగా యెహోవా తన ఇతర వాగ్దానాలను కూడ నెరవేరుస్తాడు. మీరు తప్పు చేస్తే మీకు కీడు కలుగుతుందని ఆయన వాగ్దానం చేసాడు. ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి బలవంతంగా మిమ్మల్ని వెళ్లగొట్టేస్తానని ఆయన వాగ్దానం చేసాడు.
16 మీ దేవుడైన యోహోవాతో మీరు చేసిన ఒడంబడికను నిలబెట్టుకొనేందుకు మీరు నిరాకరిస్తే ఇలా జరుగుతుంది. మీరు వెళ్లి ఇతర దేవుళ్లకు పూజిస్తే మీరు ఈ దేశాన్ని పోగొట్టుకొంటారు. ఆ ఇతర దేవుళ్లను మీరు పూజించకూడదు. మీరు గనుక అలా చేస్తే మీ మీద యెహోవాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంనుండి మీరు వెంటనే వెళ్లగొట్టబడతారు.”
1 అప్పుడు ఇశ్రాయేలీయుల వంశాలన్ని షెకెములో సమావేశం అయ్యాయి. వారందరినీ యెహోషువ అక్కడికి పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు నాయకులను, కుటుంబ పెద్దలను, న్యాయమూర్తులను యెహోషువ పిలిచాడు. వీళ్లంతా దేవుని ఎదుట నిలబడ్డారు.
2 అప్పుడు యెహోషువ ప్రజలందరితో మాట్లాడాడు. అతడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మీతో చెబతున్నదే నేను మీతో చెబతున్నాను. చాలకాలం కిందట మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి ఆవలిపక్క నివసించారు. అబ్రాహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గూర్చి నేను చెప్పుచున్నాను. అప్పట్లో వాళ్లు ఇతర దేవుళ్లను పూజించారు.
3 అయితే యెహోవానైన నేను మీ తండ్రి అబ్రాహామును నది ఆవలివైపు దేశంనుండి బయటకు రప్పించాను. నేను అతనిని కనాను దేశంగుండా నడిపించి, అతనికి అనేకమంది పిల్లల్ని ఇచ్చాను. అబ్రాహాముకు ఇస్సాకు అనే కొడుకును నేను ఇచ్చాను.
4 మరియు ఇస్సాకునకు యాకోబు, ఏశావు అనే ఇద్దరు కొడుకులను నేను ఇచ్చాను. శేయీరు చుట్టూరా ఉన్న పర్వతాలను నేను ఏశావుకు ఇచ్చాను. కానీ యాకోబు, అతని కొడుకులు అక్కడ నివసించలేదు. బ్రతికేందుకు వారు ఈజిప్టు వెళ్లారు.
5 అప్పుడు మోషే, అహరోనులను నేను ఈజిప్టుకు పంపించాను. నా ప్రజలను వారు ఈజిప్టునుండి బయటకు తీసుకొని రావాలని నేను కోరాను. ఈజిప్టు ప్రజలకు అనేకమైన భయంకర సంగతులు జరిగేటట్టు నేను చేసాను. అప్పుడు నేను మీ వాళ్లను ఈజిప్టునుండి బయటకు రప్పించాను.
6 కనుక నేనే మీ పూర్వీకులను ఈజిప్టునుండి బయటకు రప్పించాను. వారు ఎర్ర సముద్రం వరకు వచ్చేటప్పటికి, ఈజిప్టు మనుష్యులు వారిని తరుముతున్నారు. రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు అక్కడ.
7 కనుక యెహోవానైన నన్ను ప్రజలు సహాయం కోరారు. నేను ఈజిప్టు ప్రజల మీదికి మహాగొప్ప కష్టం వచ్చేటట్టు చేసాను. సముద్రం వాళ్లను కప్పివేసేటట్టుగా యోహోవానైన నేను చేసాను. ఈజిప్టు సైన్యానికి నేను చేసిన దీనిని మీ మట్టుకు మీరే చూసారు.” ఆ తర్వాత చాలా కాలం మీరు అరణ్యంలో నివసించారు.
8 అప్పుడు నేను అమోరీయుల దేశానికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఇది యోర్దాను నదికి తూర్పున ఉంది. ఆ ప్రజలు మీతో యుద్ధం చేసారు కాని మీరు వారిని ఓడించేటట్టు నేను చేసాను. ఆ ప్రజలను నాశనం చేసే శక్తి నేను మీకు ఇచ్చాను. అప్పుడు మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
9 అప్పుడు మోయాబు రాజు, సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజు బెయొరు కుమారుడైన బిలామును పిలిపించాడు. మిమ్మల్ని శపించమని అతడు బిలామును అడిగాడు.
10 కానీ యెహోవానైన నేను బిలాము మాట వినటానికి నిరాకరించాను. కనుక మీకు మంచి సంగతులు సంభవించాలని అర్థించాడు. అతడు మిమ్మల్ని చాలాసార్లు ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని రక్షించి, కష్టంనుండి బయటకు రప్పించాను.
11 అప్పుడు మీరు యోర్దాను నది దాటి ప్రయాణంచేసారు. మీరు యెరికో చేరుకొన్నారు. యెరికో పట్టణం ప్రజలు మీతో పోరాడారు. మరియు అమోరీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు మీతో పోరాడారు. కాని వాళ్లందరినీ మీరు ఓడించేటట్టు నేను చేసాను.
12 మీ సైన్యం ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ముందుగా కందిరీగలను నేను పంపించాను. ఆ కందిరీగలు మీ శత్రువులను పారిపోయేటట్టు చేసాయి. కనుక మీరు ఖడ్గాలు, బాణాలు ప్రయోగించకుండా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
13 యెహోవానైన నేను మీకు ఆ దేశాన్ని ఇచ్చాను. మీరు పని చేయాల్సిన అవసరం లేకుండానే ఆ దేశాన్ని నేను మీకు ఇచ్చాను. మీరు నిర్మించని పట్టణాలను నేను మీకు ఇచ్చాను. ఇప్పుడు మీరు ఆ దేశంలో, ఆ పట్టణాల్లో నివసిస్తున్నారు. మీరు నాటకుండానే ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు మీకు ఉన్నాయి.”
14 అప్పుడు యెహోషువ ప్రజలతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు మీరు యెహోవా మాటలు విన్నారు. కనుక మీరు యెహోవాను గౌరవించి, నిజంగా ఆయనను సేవించాలి. మీ పూర్వీకులు పూజించిన అసత్య దేవుళ్లను పారవేయండి. అది ఎప్పుడో చాలకాలం కిందట నదికి అవతల, ఈజిప్టులో జరిగిన విషయం. ఇప్పుడు మీరు యెహోవాను సేవించాలి.
15 “అయితే ఒకవేళ యెహోవాను సేవించటం మీకు ఇష్టం లేదేమో. అది ఈ వేళే మీరు తేల్చుకోవాలి. మీరు ఎవరిని సేవిస్తారో నేడే నిర్ణయించుకోవాలి. మీ పూర్వీకులు నదికి ఆవల నివసించినప్పుడు సేవించిన దేవుళ్లను మీరు సేవిస్తారో? లేదా ఈ దేశంలో నివసించిన అమోరీయుల దేవుళ్లను సేవిస్తారో? మీకు మీరే కోరుకోండి. అయితే, నేను, నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాము!”
16 అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము.
17 మన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించినవాడు యెహోవాయే అని మాకు తెలుసు. ఆ దేశంలో మనం బానిసలం. అయితే అక్కడ యెహోవా మనకోసం మహాగొప్ప కార్యాలు చేసాడు. ఆయనే ఆ దేశంనుండి మనల్ని బయటకు రప్పించాడు, ఇతర దేశాలగుండా మనము ప్రయాణిం చినప్పుడు ఆయనే మనలను కాపాడాడు.
18 తర్వాత ఈ దేశాల్లో నివసించే ప్రజలను ఓడించటానికి యెహోవాయే మనకు సహాయం చేసాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ దేశంలో నివసించిన అమోరీ ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేసాడు. కనుక మేము ఆయననే సేవిస్తాం. ఎందుచేతనంటే ఆయనే మన దేవుడు గనుక.”
19 అప్పుడు యెహోషువ అన్నాడు, “(అది నిజం కాదు) మీరు యెహోవాను సరిగ్గా సేవించలేరు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు. తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజిస్తే దేవునికి అసహ్యం. అలా మీరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగితే దేవుడు మిమ్మల్ని క్షమించడు.
20 మీరు యెహోవాను విడిచిపెట్టి, ఇతర దేవుళ్లను సేవిస్తారు మరియు భయంకర సంగతులను దేవుడు మీకు సంభవింపజేస్తాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవా దేవుడు మీ ఎడల దయగా ఉన్నాడు కానీ మీరు ఆయనకు విరోధంగా తిరిగితే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
21 అయితే ప్రజలు, “లేదు, మేము యోహోవానే సేవిస్తాము” అని యెహోషువతో చెప్పారు.
22 అప్పుడు యెహోషువ, “మీ చుట్టూ, ఇక్కడ మీతో ఉన్న ప్రజల చుట్టూ చూడండి. మీరు యెహోవానే సేవించేందుకు నిర్ణయం చేసారని మీకు తెలుసా, మీరు ఒప్పుకొన్నారా? దీనికి మీరంతా సాక్షులేనా?” అన్నాడు. ప్రజలు “అవును, ఇది సత్యం. మేము యెహోవానే సేవిస్తామని మేము నిర్ణయించు కొన్నట్టు మా అందరికీ తెలుసు” అని జవాబిచ్చారు.
23 అప్పుడు యెహోషువ, “అలాగైతే మీ మధ్య ఉన్న అసత్య దేవుళ్లను పారవేయండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో ప్రేమించండి” అని చెప్పాడు.
24 అప్పుడు ప్రజలు “మేము మా దేవుడైన యెహోవానే సేవిస్తాము. మేము ఆయనకే విధేయులమవుతాము” అని యెహోషువతో చెప్పారు.
25 కనుక ఆ రోజున యెహోషువ ప్రజలతో ఒక ఒడంబడిక చేసాడు. ఈ ఒడంబడికను వారు పాటించాల్సిన ఒక చట్టముగా చేసాడు యెహోషువ. షెకెము అనబడిన పట్టణంలో ఇదంతా జరిగింది.
26 దేవుని ధర్మశాస్త్రపు గ్రంథంలో యెహోషువ ఈ సంగతులన్నీ వ్రాసాడు. అప్పుడు యెహోషువ ఒక పెద్ద బండను చూసాడు. (ఈ బండ ఈ ఒడంబడికకు ఋజువు) యెహోవా పవిత్ర గుడారం దగ్గర సింధూర వృక్షం కింద ఆ బండను అతడు పెట్టాడు.
27 అప్పుడు యెహోషువ ప్రజలందరితో చెప్పాడు: “ఈనాడు మనం చేసిన సంగతులను జ్ఞాపకం చేసుకునేందుకు ఈ బండ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈనాడు యెహోవా మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బండ ఇక్కడే ఉంది. కనుక ఈ వేళ జరిగిన దానిని మనం జ్ఞాపకం చేసుకునేందుకు సహాయకరంగా ఉంటుంది ఈ బండ. మీమీద ఈ బండ సాక్షి. మీ దేవుడైన యెహోవాకు మీరు విరోధంగా తిరుగకుండా ఈ బండ మిమ్మల్ని వారిస్తుంది.”
28 అప్పుడు యెహోషువ ప్రజలందరినీ వారి ఇండ్లకు వెళ్లిపొమ్మని చెప్పాడు. ప్రతి వ్యక్తీ తన స్వంత స్థలానికి వెళ్లిపోయాడు.
29 ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ చనిపోయాడు. ఆయన వయస్సు నూటపది సంవత్సరాలు.
30 తిమ్నాత్ సెరహులోని తన స్వంత స్థలంలో యెహోషువ పాతిపెట్టబడ్డాడు. ఇది గాయషుకొండకు ఉత్తరాన ఎఫ్రాయిం దేశంలో ఉంది.
31 యెహోషువ జీవించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను సేవించారు. యెహోషువ మరణం తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవించారు. తమ నాయకులు బ్రతికి ఉన్నంతవరకు ప్రజలు యెహోవాను సేవించటం కొనసాగించారు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసినవాటిని చూసినవారు ఈ నాయకులు.
32 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచినప్పుడు, యోసేపు ఎముకలను వారితోకూడ మోసుకునివచ్చారు. కనుక యోసేవు ఎముకలను షెకెములో ప్రజలు పాతిపెట్టారు. షెకెము తండ్రి, హమోరు కుమారుల దగ్గర యాకోబు కొన్న భూమిలో వారు ఆ ఎముకలను పాతిపెట్టారు. ఆ భూమిని యాకోబవంద వెండి నాణాలకు కొన్నాడు. ఈ భూమి యోసేపు పిల్లలకు చెందినది.
33 అహరోను కుమారుడైన ఎలీయాజరు చనిపోయాడు అతడు గిబియాల్లో పాతిపెట్టబడ్డాడు. ఎఫ్రాయిము కొండ దేశంలో గిబియా ఒక పురం. ఆ పురం ఎలీయాజరు కుమారుడైన ఫీనెహాసుకు ఇవ్వబడింది.