1 యాకోబు (ఇశ్రాయేలు) తన కుమారులతో పాటు ఈజిప్టు వెళ్లాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఏవంటే:
2 రూబేను, షిమ్యోను, లేవి, యూదా,
3 ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను,
4 దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ప్రతియొక్కరూ కుటుంబ సమేతంగా వచ్చారు.
5 యాకోబు సంతానం మొత్తం డెబ్బయి మంది. (12మంది కుమారుల్లో మరొకడు యోసేపు. అతను అప్పటికే ఈజిప్టులో వున్నాడు.)
6 తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు.
7 అయితే, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు చాలామంది ఉన్నారు. వారి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఆ ప్రజలు చాలా బలవంతులు కాగా ఈజిప్టు దేశం వాళ్లతోనే నిండిపోయింది.
8 అప్పుడు ఒక కొత్తరాజు ఈజిప్టును పాలించడం మొదలు పెట్టాడు. ఈ రాజుకు యోసేపు తెలియదు.
9 ఈ రాజు తన ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు జనాన్ని చూడండి. వాళ్లు చాలామంది ఉన్నారు! పైగా వాళ్లు మనకంటె చాలా బలంగా ఉన్నారు!
10 వాళ్లపైన మనం ఏదైనా పథకం వేయాలి. లేకపోతే ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మన శత్రువులతో ఏకం కావచ్చు. అల్లాంటప్పుడు వాళ్లు మనల్ని ఓడించి, మన దగ్గర్నుండి తప్పించుకొని పారిపోవచ్చు.”
11 ఈజిప్టు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు జీవితాన్ని కష్టతరం చేయాలనుకొన్నారు. అందుచేత బానిసలపైన ఉండే అధికారులను ఇశ్రాయేలీయుల మీద నియమించారు. ఆ యజమానులు ఇశ్రాయేలు ప్రజలను బలవంతం చేసి ఫరోకోసం ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేను పట్టణాలను కట్టించారు. (ధాన్యం మొదలైన వాటిని వాళ్లు ఈ పట్టణాల్లో నిల్వ చేసేవాళ్లు )
12 ఇశ్రాయేలీయులు ప్రయాసపడి పనిచేయునట్లు ఈజిప్టు వాళ్లు వారిని బలవంతపెట్టారు. కాని పనిలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బలవంతం చేయబడితే, అంతగా వాళ్లు పెరిగి విస్తరించిపోయారు. కనుక ఇశ్రాయేలు ప్రజలను చూస్తోంటే, ఈజిప్టు వాళ్లు మరింత ఎక్కువగా భయపడిపోయారు.
13 అందుచేత ఈజిప్టు వారు ఇశ్రాయేలు ప్రజల శరీర శ్రమను మునుపటికన్నా ఎక్కువగా కష్టతరం చేసి బలవంత పెట్టారు.
14 ఇశ్రాయేలీయుల జీవితాన్ని చాలా కష్టతరం చేశారు ఈజిప్టువారు. అడుసు తొక్కి ఇటుకలు చేయడంలో వాళ్లు ఇశ్రాయేలు ప్రజల్ని బలవంతం చేశారు. అలాగే పొలాల్లో పనిచేయడానికి కూడా వాళ్లను చాల బలవంత పెట్టారు. వాళ్లు చేసిన ప్రతి పనిలోనూ వాళ్లను చాల బలవంత పెట్టి ఒత్తిడి చేసారు.
15 షిఫ్రా, పూయా అను ఇద్దరు మంత్రసానులుండే వారు. వీరు ఇశ్రాయేలు స్త్రీల కాన్పు సమయాల్లో సహాయ పడేవారు. ఈజిప్టు రాజు ఈ మంత్రసానులను పిలిచి,
16 “ఈ హీబ్రూ స్త్రీలు పిల్లల్ని కనడంలో మీరు ఇలానే సహాయం చేస్తూ ఉండండి. ఒకవేళ ఆడపిల్ల పుడితే ఆ పిల్లను బ్రతకనివ్వండి, కాని శిశువు మగవాడైతే మాత్రం తప్పక చంపేయండి” అని చెప్పాడు.
17 ఆ మంత్రసానులు దైవ భక్తిగలవాళ్లు గనుక వారు రాజుగారి ఆజ్ఞకు లోబడలేదు. మగ పిల్లలందర్నీ వాళ్లు బ్రతకనిచ్చారు.
18 ఈజిప్టు రాజు ఆ మంత్రసానులను పిలిచి, “మీరు ఎందుకిలా చేసారు? ఆ మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అంటూ ప్రశ్నించాడు.
19 “ఈజిప్టు స్త్రీలకంటె హీబ్రూ స్త్రీలకు చాల బలం ఉంది. సహాయం చేసేందుకు మేము వెళ్లేలోపుగానే వాళ్లు పిల్లల్ని కనేసారు.” అంటూ మంత్రసానులు ఫరోతో చెప్పారు.
20 [This verse may not be a part of this translation]
21 [This verse may not be a part of this translation]
22 కనుక ఫరో, “మగశిశువు పుట్టినప్పుడల్లా, మీరు వాడ్ని నైలు నదిలో పడవేయండి. కాని ఆడపిల్లల్ని అందరినీ బ్రతకనియ్యండి” అని తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.
1 లేవీ వంశానికి చెందిన ఒకడు ఉన్నాడు. లేవీ వంశానికి చెందినదాన్నే ఒకామెను అతడు పెళ్లి చేసుకొన్నాడు.
2 ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కన్నది. శిశువు చాలా అందంగా ఉండడం చూసి ఆ తల్లి మూడ్నెల్లపాటు ఆ శిశువును దాచి ఉంచింది.
3 అయితే మూడు నెలలు అయ్యాక ఆ శిశువు సంగతి తెలిసిపోతుందేమోనని ఆ తల్లి భయపడింది. అలా తెలిస్తే ఆ శిశువు మగపిల్లవాడు కనుక వాడ్ని చంపేస్తారు. అందుకని ఆమె జమ్ముతో ఒక బుట్టను తయారు చేసి, అది నీళ్లలో తేలడానికిగాను దానికి తారు పూసింది. శిశువును ఆ బుట్టలో పెట్టింది. ఆమె తర్వాత నది ఒడ్డున ఏపుగా పెరిగిన జమ్ములో ఆ బుట్టను పెట్టింది.
4 ఆ పసివాడి అక్క అక్కడే వుండి గమనిస్తూవుంది. ఆమె ఆ పసివాడికి ఏమి జరుగుతుందో చూడాలని అనుకొంది.
5 సరిగ్గా అదే సమయంలో ఫరో కూతురు స్నానం చేయడానికి నది దగ్గరకు వెళ్లింది. ఆమె పని మనుషులు నది గట్టు మీద తిరుగుతూ ఉన్నారు. జమ్ములో ఉన్న బుట్టను ఆమె చూసింది. వెళ్లి ఆ బుట్టను తీసుకు రమ్మని ఆమె తన పనికత్తెల్లో ఒక దానితో చెప్పింది.
6 రాజకుమారి ఆ బుట్ట తెరచి, అందులో ఉన్న మగ పిల్లాడ్ని చూసింది. ఆ పసివాడు ఏడుస్తూ ఉండడం చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” ఆమె చెప్పింది.
7 ఇంకా అప్పటివరకు దాక్కొని ఉన్న ఆ పసివాని అక్క లేచి, “ఈ పసివాడ్ని పెంచటానికి మీకు సహాయం చేసేందుకు ఒక హీబ్రూ స్త్రీని వెదకి తీసుకొని రమ్మంటారా?” అని రాజకుమారిని అడిగింది.
8 “సరే అలాగే తీసుకురా” అంది రాజకుమారి. ఆ పిల్ల వెళ్లి ఆ పసివాడి స్వంత తల్లినే తీసుకొచ్చింది.
9 “ఈ పసివాడ్ని తీసుకొని వెళ్లి పాలిచ్చి నాకోసం పెంచు. పసివాడ్ని జాగ్రత్తగా చూడు. నీకు నేను జీతం ఇస్తాను” అంది ఆ రాజకుమారి. కనుక ఆ స్త్రీతన పసివాణ్ణి తీసుకొని జాగ్రత్తగా పెంచింది.
10 ఆ పసివాడు పెద్దవాడయ్యాడు. కొన్నాళ్లకు ఆ స్త్రీ పిల్లవాడ్ని రాజకుమారి దగ్గరకు తీసుకొచ్చింది. రాజకుమారి ఆ పిల్లవాడ్ని తన సొంత కుమారుడుగా స్వీకరించింది. ఆ పిల్లవాడ్ని నీళ్లలోంచి బయటికి తీసింది కనుక ఆమె వానికి మోషే అని పేరు పెట్టింది.
11 మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. తన ప్రజలు అంటే, హీబ్రూవారు బలవంతంగా చాలా కష్టపడి పని చేయాల్సి ఉన్నట్టు మోషే గ్రహించాడు. ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు.
12 ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు.
13 మర్నాడు హీబ్రూవాళ్లే ఇద్దరు పోట్లాడుకోవడం మోషే చూసాడు. వారిలో ఒకడిది తప్పని తెలుసుకొని “అతనితో ఎందుకిలా మీవాడ్ని కొడుతున్నావు?” అని అన్నాడు.
14 దానికి అతను జవాబిస్తూ, “మామీద నీవు అధికారివనిగాని, న్యాయమూర్తివనిగాని ఎవరయినా నియమించారా? నిన్న నీవు ఆ ఈజిప్టువాడ్ని చంపినట్టు నన్నూ చంపుతావా?” అన్నాడు. అప్పుడు మోషే భయపడిపోయాడు. “అలాగైతే నేను చేసిన ఆ పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని” మోషే తనలో తాను అనుకొన్నాడు.
15 మోషే చేసినదాన్ని గూర్చి విని ఫరో మోషేను చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గర్నుండి మోషే పారిపోయాడు. మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు.
16 మిద్యానులో ఒక యాజకునికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు వారు తమ తండ్రిగారి గొర్రెలకు నీళ్లు తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
17 కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకోనివ్వకుండా వెళ్లగొట్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.
18 తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. “ఆయన వారితో ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అని అన్నాడు.
19 “గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు.
20 అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు తన కూతుళ్లతో.
21 అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు. అతను సిప్పోర అనే తన కూతుర్ని మోషేకు భార్యగా ఇచ్చాడు.
22 సిప్పోరాకు కొడుకు పుట్టాడు. అతనికి గెర్షోము అని మోషే పేరు పెట్టాడు. మోషే తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత తన కొడుక్కు ఈ పేరు పెట్టాడు.
23 చాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చనిపోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతరమైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు.
24 దేవుడు వారి ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొన్నాడు.
25 ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు.
1 మోషే మామగారి పేరు యిత్రో (ఈయన మిద్యాను వారికి యాజకుడు). యిత్రో గొర్రెలకు మోషే కాపరి అయ్యాడు. ఒకనాడు మోషే అరణ్యానికి పశ్చిమంగా ఆ గొర్రెల్ని తోలుకుపోయాడు. అక్కడ హోరేబు అనే ఒక కొండ ఉంది. అది దేవుని కొండ.
2 ఆ కొండమీద మండుతున్న ఒక పొదలో యెహోవా దూతను మోషే చూసాడు. ఆ పొద మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు.
3 అందుచేత మోషే, “ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అనుకొన్నాడు.
4 ఆ పొదను చూచేందుకు మోషే వస్తూ ఉండటం యెహోవా చూశాడు. అందుచేత ఆ పొదలోంచే దేవుడు, “మోషే, మోషే” అని మోషేను పిల్చాడు “చిత్తం ప్రభూ” అన్నాడు మోషే.
5 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “ఇక దగ్గరకు రాకు. నీ చెప్పులు విడువు. నీవు నిలబడింది పవిత్ర స్థలం
6 నేను నీ పూర్వీకుల దేవుణ్ణి. నేను అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి.” దేవుణ్ణి చూడాలంటే, భయం వేసింది కనుక మోషే తన ముఖం కప్పుకొన్నాడు.
7 యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు
8 ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు. అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు.
9 ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను.
10 అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు.
11 అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు.
12 “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు.
13 దానికి మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని చెబితే, ‘ఆ దేవుడి పేరేమిటి’ అని వాళ్లు నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి, అని దేవుణ్ణి అడిగాడు.
14 “నేను ఉన్నవాడను” (అని వారితో చెప్పు) అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, ‘ఉన్నవాడను,’ అనువాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు మోషేతో.
15 దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే ఉంటుంది. తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకొంటారు. “యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని వాళ్లతో చెప్పు.”
16 “వెళ్లి ఇశ్రాయేలు సమాజంలోని పెద్దలందరిని సమావేశపరిచి, ‘మీ పూర్వీకుల దేవుడైన యెహోవా నాకు ప్రత్యక్షం అయ్యాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాతో మాట్లాడాడు. మిమ్మల్ని గూర్చి ఈజిప్టులో మీకు సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచించాను.
17 ఈజిప్టులో మీరు అనుభవిస్తున్న శ్రమలనుండి మిమ్మల్ని తప్పించాలనే నిర్ణయానికొచ్చాను. ప్రస్తుతం ు రగు ్లు చేది, మా మందలకు పెట్టాడు’న్నారు.ు.ళ్లారు.ట్టాడు. ట్టింది.ురు.ా మంచి మంచి వాటితో నిండిన ఒక మంచి దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తాను’ అని వాళ్లతో చెప్పు.”
18 “పెద్దలు (నాయకులు) నీ మాట వింటారు. అప్పుడు నీవు, పెద్దలు (నాయకులు) కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లాలి. హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు. మూడు రోజుల దూరము అరణ్యంలోనికి ప్రయాణం చేసి వెళ్లమని ఆయన చెప్పాడు. అక్కడ మా యెహావా దేవునికి మేము బలులు అర్పించాలి. అని నీవు అతనితో చెప్పాలి.’
19 “అయితే ఈజిప్టు రాజు మిమ్మల్ని పోనియ్యడని నాకు తెలుసు. అతడు మిమ్మల్ని పోనిచ్చేటట్టు ఒక మహాశక్తి మాత్రమే అతణ్ణి బలవంతం చేస్తుంది.
20 కనుక ఈజిప్టు మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. ఆ దేశంలో అద్భుతాలు జరిగేటట్టు చేస్తాను. నేను అలా చేసిన తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు.
21 అంతే కాదు ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజలమీద దయ చూపించేటట్టుగా చేస్తాను. అందుచేత మీరు వెళ్లిపోయేటప్పుడు నీ ప్రజలకు వాళ్లు కానుకలను ఇస్తారు.”
22 “హీబ్రూవాళ్లలో ప్రతి స్త్రీ తన పొరుగున ఉండే ఈజిప్టు వాళ్లను, ఆ ఇళ్లలో వుండే వాళ్లందర్నీ అడగ్గానే వాళ్లు ఆమెకు కానుకలు ఇస్తారు. వెండి, బంగారం, మంచి బట్టలు, కానుకలుగా మీవారికి దొరుకుతాయి. మీరు ఈజిప్టు విడిచి వెళ్లేటప్పుడు మీరు ఆ కానుకలను మీ పిల్లలకు పెట్టాలి. ఈ విధంగా ఈజిప్టు ఐశ్వర్యాన్ని మీరు తీసుకోవాలి.”
1 అప్పుడు మోషే, “నీవు నన్ను పంపించావు అని చెబితే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు గదా! ‘యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు’ అన్నాడు దేవునితో.
2 అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని మోషేను అడిగాడు. “ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు.
3 అప్పుడు దేవుడు, “నీ కర్ర కింద పడవెయ్యి” అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి దాని దగ్గర్నుండి పారిపోయాడు.
4 అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో “ అన్నాడు. మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది.
5 “ఈ కర్రను ఇలా ప్రయోగించు, అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు” అన్నాడు దేవుడు.
6 ఆ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు మోషేతో. కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్ఠు మచ్చలు కప్పేసాయి.
7 “నీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలానే ఉంది.
8 “నీకర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు.
9 నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు.
10 అయితే మోషే దేవునితో, “కానీ ప్రభూ నేను నిజం చెప్పేస్తున్నాను. నేనేమీ నైపుణ్యంగల మాటకారిని కాను. నాకు మనుష్యులతో చక్కగా మాట్లాడ్డం ఎప్పుడూ చేతకాలేదు. కనీసం ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కూడ నేను మంచి మాటకారిని కాలేదు. నా మాట నిదానం అనీ, నాకు మంచి పద ప్రయోగం రాదనీ నీకు తెలుసు” అన్నాడు.
11 “మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటివాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేటట్టు చేయగలిగింది ఎవరు? నీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను యెహోవాను,
12 అందుచేత వెళ్లు. నీవు మాట్లాడేటప్పుడు నేను నీతో ఉంటాను. చెప్పాల్సిన మాటలు నేనే నీకు చెబతాను” అని అతనితో యెహోవా అన్నాడు.
13 కానీ మోషే, “నా ప్రభువా, నన్ను విడిచిపెట్టి మరెవర్నయినా పంపించుమని బతిమాలు కొంటున్నాను” అన్నాడు.
14 యెహోవాకు మోషేమీద కోపం వచ్చింది, “లేవీ వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను వాడుకొంటాను. అతనికి మాట్లాడుటలో నైపుణ్యం ఉంది. అహరోను నీ దగ్గరకు వస్తాడు. నిన్ను చూచి సంతోషిస్తాడు,
15 అతడు నీతోకూడ ఫరో దగ్గరకు వస్తాడు. నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెబతాను, అది నీవు అహరోనుకు చెప్పాలి. ఫరోతో చెప్పటానికి అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకొంటాడు.
16 ప్రజలతో కూడ అహరోనే నీ పక్షంగా మాట్లాడుతాడు. అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు. అతనే అధికారంతో నీ తరపున మాట్లాడతాడు.
17 కనుక వెళ్లు. నీతోకూడ నీ కర్ర తీసుకొని వెళ్లు. నీకు నేను తోడుగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను, మిగతా అద్భుతాలను ప్రయోగించు” అన్నాడు దేవుడు.
18 అప్పుడు మోషే తన మామ యిత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యిత్రోతో చెప్పాడు మోషే. “నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో మోషేతో.
19 తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లడం నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు చనిపోయారు” అని చెప్పాడు.
20 కనుక మోషే తన భార్యను, తన కొడుకును బయల్దేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకొని వెళ్లాడు.
21 మోషే ఈజిప్టుకు ప్రయాణం చేస్తూండగా దేవుడు అతనితో మాట్లాడాడు: “నీవు ఫరోతో మాట్లాడేటప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు శక్తి ఇచ్చానో వాటన్నింటినీ చేయాలని జ్ఞాపకం ఉంచుకో! అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండికెత్తేటట్లు చేస్తాను. అతడు ప్రజల్ని వెళ్లనియ్యడు.
22 అప్పుడు నీవు ఫరోతో
23 ‘ఇశ్రాయేలు నా ప్రథమ సంతానంగా పుట్టిన కుమారుడు. నా కుమారుడు వెళ్లి నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబతున్నాను. నీవే గనుక ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వకపోతే, నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను.”‘ అని యెహోవా అనుచున్నాడని అతనితో చెప్పెను.
24 మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగించాడు. నిద్రపోవాలని అతడు ఒక సత్రములో ఆగాడు. అక్కడ దేవుడు మోషేను కలుసుకొని అతణ్ణి చంపదలచాడు.
25 కాని సిప్పోర పదునైన ఒక కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ చర్మం పట్టుకొని ఆమె అతని పాదాలను తాకింది. అప్పుడు ఆమె (మోషేతో) “నీవు రక్త సంబంధమైన భర్తవు అని అంది”
26 సిప్పోర తన కుమారునికి సున్నతి చేసినందువల్ల ఇలా చెప్పింది. అందుచేత దేవుడు మోషేను క్షమించాడు (అతణ్ణి చంపలేదు).
27 యెహోవా అహరోనుతో, “అరణ్యంలోకి వెళ్లి మోషేను కలుసుకో “ అని చెప్పాడు. కనుక అహరోను వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొన్నాడు. అహరోను మోషేను చూడగానే అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.
28 దేవుడు తనతో చెప్పినదంతా మోషే అహరోనుతో చెప్పాడు. దేవుడు తనను ఎందుకు పంపిందీ, అహరోనుతో చెప్పాడు మోషే. అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు, చూపాల్సిన రుజువులు అన్నింటిని మోషే అహరోనుకు వివరించాడు.
29 అందుచేత మోషే, అహరోనూ వెళ్లి ఇశ్రాయేలు పెద్దలందర్నీ సమావేశం చేసారు.
30 అప్పుడు ఆ ప్రజలతో వారు మాట్లాడారు. యెహోవా మోషేతో చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ చూచేటట్టు మోషే అద్భుతాలు చేసి రుజువు చేసాడు.
31 దేవుడు మోషేను పంపించాడని ఆ ప్రజలు నమ్మారు. ఇశ్రాయేలీయులకు సహాయం చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు దేవుని ముందర తలలు వంచుకొని ఆరాధించారు. వారి కష్టాలను దేవుడు చూసాడని తెలిసి వాళ్లు దేవుడ్ని ఆరాధించారు.
1 మోషే, అహరోనూ ప్రజలతో మాట్లాడిన తరువాత ఫరో దగ్గరికి వెళ్లారు, ‘“నా కోసం పండుగ జరుపుకొనేందుకు నా ప్రజల్ని అరణ్యంలోకి వెళ్లనివ్వు’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబతున్నాడు,” అని చెప్పారు.
2 అయితే ఫరో, “ఆ యెహోవా ఎవరు? అతనికి నేనెందుకు లోబడాలి? ఇశ్రాయేలీయులను నేనెందుకు వెళ్లనివ్వాలి? యెహోవా అని మీరు చెబతున్న వాడు నాకు తెలియదు. అందుచేత ఇశ్రాయేలీయులను నేను వెళ్లనీయను” అన్నాడు.
3 దానికి మోషే, అహరోనులు, “హీబ్రూ ప్రజల దేవుడు మాతో మాట్లాడాడు. కనుక మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్లనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అక్కడ మా యెహోవా దేవునికి ఒక బలి అర్పిస్తాము. ఇది మేము చేయకపోతే ఆయనకు కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో. ఒక రోగం ద్వారానో, కత్తి చేతనో మమ్మల్ని చంపేస్తాడేమో” అని అన్నారు.
4 కానీ ఫరో, “మోషే, అహరోనూ, ప్రజలను పని చేయనీయకుండా మీరు చేస్తున్నారు. మళ్లీ పోయి పనిచేసుకోమని ఆ బానిసలకు చెప్పండి.
5 పనివాళ్లు చాలా విస్తారంగా ఉన్నారు, మీరేమో వాళ్లను పని చెయ్యనివ్వడం లేదు” అని వాళ్లతో చెప్పాడు.
6 అదేరోజు ఇశ్రాయేలీయుల పని మరింత కష్టతరం చేయమని ఫరో ఆజ్ఞాపించాడు. బానిసలపైనున్న యజమానులతో
7 “ఈ ప్రజలు ఇటుకలు చేసేందుకు గడ్డి ఎప్పుడూ మీరే ఇచ్చారు. కాని ఇప్పుడు ఇటుకలు చేసేందుకు అవసరమైన గడ్డిని వాళ్లే పోయి తెచ్చుకోవాలని వారికి చెప్పండి.
8 అయితే వాళ్లు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే. వాళ్లు బద్ధకస్తులయి పోయారు. అందుకే వాళ్లను పోనివ్వుమని నన్ను అడుగుతున్నారు. వాళ్లు చేసేందుకు సరిపడినంత పనిలేదు. అందుకే తమ దేవునికి బలి ఇవ్వడానికి వెళ్లనిమ్మని నన్ను అడుగుతున్నారు.
9 కనుక వీళ్ల పని మరింత కష్టం అయేటట్టు చేయండి. వాళ్లకు బాగా పని చెప్పండి. అప్పుడు మోషే చెప్పే అబద్ధాలు వినేందుకు వాళ్లకు సమయం ఉండదు” అని చెప్పాడు ఫరో.
10 అందుచేత బానిసల పైనున్న ఈజిప్టు యజమానులు, హీబ్రూ ప్రజల నాయకుల దగ్గరకు వెళ్లి, “మీ ఇటుకల కోసం గడ్డి ఇవ్వకూడదని ఫరో నిర్ణయించాడు.
11 మీకు మీరే పోయి గడ్డి తెచ్చుకోవాలి. కనుక వెళ్లి గడ్డి వెదుక్కోండి. అయితే మీరు మాత్రం ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవారో ఇప్పుడు కూడా అన్ని చేయాల్సిందే” అని వాళ్లతో చెప్పారు.
12 కనుక గడ్డికోసం వెదుక్కొంటూ ఆ ప్రజలు ఈజిప్టు దేశ వ్యాప్తంగా వెళ్లిపోయారు.
13 ఆ ప్రజలు మరింత కష్టపడి పనిచేసేటట్టు బానిస యజమానులు వాళ్లని బలవంతం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రజలు అంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో అన్ని చేసేటట్టు వారు వాళ్లను బలవంతపెట్టారు.
14 బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను ఏర్పరచుకొని ప్రజలు చేసే పనికి వీళ్లను బాధ్యులుగా చేసారు, “మీరు ఇంతకు ముందు ఎన్ని ఇటుకలు చేసారో ఇప్పుడు కూడ అన్ని ఎందుకు చెయ్యడం లేదు? ఇది వరకు చేయగలిగారు అంటే, ఇప్పుడూ చేయగల్గుతారు!” అంటూ బానిసలపై ఉండే ఈజిప్టు యజమానులు హీబ్రూ నాయకులను కొట్టారు.
15 అప్పుడు హీబ్రూ నాయకులు ఫరో దగ్గరకు వెళ్లారు, “మేము నీ సేవకులము నీవు మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నావు?
16 నీవేమో మాకు గడ్డి ఇవ్వవు. కాని మేము మాత్రం ఇదివరకు ఎన్ని ఇటుకలు చేసామో అన్ని చేస్తూనే ఉండాలని ఆజ్ఞాపించావు. పైగా ఇప్పుడు ఈ యజమానులు మమ్మల్ని కొడుతున్నారు. ఇలా చేయడం నీ మనుష్యులదే తప్పు” అంటూ వారు ఫిర్యాదు చేసి చెప్పారు.
17 ఫరో జవాబిస్తూ, “మీరు సోమరులు, మీకు పని చేయడం ఇష్టంలేదు. అందుకే మిమ్మల్ని పోనివ్వమని నన్ను అడుగుతున్నారు. అందుకే మీరు ఇక్కడ్నుండి వెళ్లిపోయి యెహోవాకు బలులు అర్పించాలని అంటున్నారు.
18 ఇక వెళ్లి పనిచెయ్యండి. మేము మీకు గడ్డి ఇవ్వము కాని మీరు మాత్రం ఇది వరకు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడ అన్ని చేయాలి” అన్నాడు.
19 చిక్కుల్లో పడ్డట్టు ఇశ్రాయేలు పెద్దలకు అర్థమయింది. వారు ఇంతకు ముందు చేసినన్ని ఇటుకలు ఇప్పుడు చేయలేరని ఆ నాయకులకు తెలుసు.
20 వారు ఫరో సమావేశం నుండి వెళ్తూ మోషే, అహరోను ఉన్నచోట ఆగారు. వారికోసం మోషే అహరోనూ వేచియున్నారు.
21 వారు మోషే అహరోనులతో, “మమ్మల్ని వెళ్లనిమ్మని మీరు ఫరోతో చెప్పడం చాల తప్పు. ఫరో, అతని అధికారులు మమ్మల్ని ద్వేషించేటట్టు మీరు చేసారు కనుక యెహోవా మిమ్మల్ని శిక్షించాలి. మమ్మల్ని చంపే అవకాశం మీరే వారికి ఇచ్చారు” అని చెప్పారు.
22 అప్పుడు మోషే యెహోవాను ప్రార్థించి, “ప్రభువా, ఎందుకు ఇలా నీ ప్రజలకు నీవు కీడు చేసావు? నీవు ఇక్కడికి నన్నెందుకు పంపించావు? 23నన్ను చెప్పమని నీవు చెప్పిన సంగుతులన్నీ నేను ఫరో దగ్గరకు వెళ్లి చెప్పాను. కాని అప్పట్నుంచి నీ ప్రజల విషయంలో అతడు చాల నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు వాళ్లు సహాయం కోసం ఏమీ చేయలేదు!” అని చెప్పాడు.
23 [This verse may not be a part of this translation]
1 అందుకు యెహోవా, “ఫరోకు నేను ఏమి చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. అతని మీద నేను నా మహాశక్తిని ప్రయోగిస్తాను. దానితో అతడు నా ప్రజలను వెళ్లనిస్తాడు. వారు వెళ్లిపోవడానికి అతడు ఎంత ఇష్టపడతాడంటే, అతడే వారిని వెళ్లిపొమ్మని బలవంతం చేస్తాడు” అని మోషేతో చెప్పాడు.
2 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు,
3 “యెహోవాను నేనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ప్రత్యక్షమయ్యాను.” వాళ్లు, (ఎల్‌షద్దయి) సర్వశక్తిగల దేవుడు అని నన్ను పిలిచారు. నా పేరు ‘యెహోవా’ అని వారికి తెలియలేదు.
4 వారితో నేను ఒక ఒడంబడిక చేసాను. కనాను దేశం వారికి ఇస్తానని వాగ్దానం చేసాను. వారు ఆ దేశంలో నివసించారు గాని అది వారి స్వంత దేశం కాదు.
5 ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్లకు ఉన్న కష్టాలు నాకు తెలుసు. వారు ఈజిప్టుకు బానిసలుగా ఉన్నారని నాకు తెలుసు. నా ఒడంబడిక కూడా నాకు జ్ఞాపకం ఉంది.
6 కనుక నేను వాళ్లతో నీవు ఇలా చెప్పమన్నట్టు ప్రజలతో చెప్పు. ‘నేనే యెహోవాను, నేనే మిమ్మల్ని రక్షిస్తాను. నేను మిమ్మల్ని స్వతంత్రుల్నిగా చేస్తాను. ఈజిప్టు వాళ్లకు మీరు బానిసలుగా ఉండరు. నేను నా మహాశక్తిని ప్రయోగించి మహా భయంకర శిక్షను ఈజిప్టు వారి మీదికి రప్పిస్తాను. అప్పుడు మిమ్మల్ని నేను రక్షిస్తాను.
7 మీరు నా ప్రజలుగా ఉంటారు. నేనే మీ దేవుడిగా ఉంటాను. నేనే యెహోవాను, మీ దేవుడనని, ఈజిప్టునుండి నేనే మిమ్మల్ని విడిపించానని మీరు తెలుసుకొంటారు.
8 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు నేను ఒక గొప్ప వాగ్దానం చేసాను. అందుచేత నేనే మిమ్మల్ని ఆ దేశానికి నడిపిస్తాను. ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. అది మీదే అవుతుంది. నేను యెహోవాను.”‘
9 “అందుచేత మోషే ఇదంతా ఇశ్రాయేలు వాళ్లతో చెప్పాడు. అయితే, ప్రజలు పనిలో చాలా కష్టపడుచున్నందుచేత మోషేను వారు సహించలేదు. అతని మాట వారు వినలేదు.
10 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
11 “ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశంనుండి తప్పక వెళ్లిపోనివ్వాలని ఫరో దగ్గరకు వెళ్లి చెప్పు.”
12 అయితే మోషే, “ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినరు. అలాంటప్పుడు ఫరో అంతకంటె వినడు. అసలే నాకు మాట్లాడటం చేతకాదు.” అని అన్నాడు.
13 కాని మోషే, అహరోనులతో యెహోవా మాట్లాడాడు. వారు వెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాలని యెహోవా వారికి ఆజ్ఞాపించాడు. ఫరో దగ్గరికి వెళ్లి అతనితో కూడ మాట్లాడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు నుండి బయటకు నడిపించుమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు.
14 ఇశ్రాయేలు కుటుంబాల నాయకుల పేర్లు ఇవి - ఇశ్రాయేలు జ్యేష్ఠపుత్రుడు రూబేనుకు హనోకు, పల్లు, హెస్రోన్, కర్మి అనే నలుగురు కుమారులు గలరు.
15 యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు అనువారు షిమ్యోను కుమారులు. (షావూలు కనానీ స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు).
16 లేవీ 137సంవత్సరాలు బతికాడు. గెర్షోను, కహాతు, మెరారీ అనువారు లేవీ కుమారులు.
17 గెర్షోను కుమారులు లిబ్నీ, షిమీ.
18 కహాతు 133సంవత్సరాలు బ్రతికాడు. అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనువారు కహాతు కుమారులు.
19 మహలి, ముషి అను వారు మెరారీ కుమారులు. ఈ కుటుంబాలన్ని ఇశ్రాయేలు కుమారుడు లేవీ సంతానం.
20 అమ్రాము 137 సంవత్సరాలు బతికాడు. అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును వివాహం చేసుకొన్నాడు. ఈ అమ్రాము కుమారులే మోషే, అహరోను.
21 కోరహు, నెపెగు, జిఖ్రీ అనువారు ఇస్హారు కుమారులు.
22 మిషాయేలు, ఎల్జఫను, సిత్రీ అనువారు ఉజ్జీయేలు కుమారులు.
23 అహరోను ఎలీషెబను వివాహం చేసుకొన్నాడు. (ఎలీషెబ అమ్మినాదాబు కుమార్తె. నయసోను సోదరి) అహరోను ఎలీషెబలకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు పుట్టారు.
24 కోరహు కుమారులు అంటే, అస్సీరు, ఎల్కానా, అబియాసాపు.
25 అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెను పెండ్లాడాడు, వాళ్లు ఫీనెహాసుకు జన్మనిచ్చారు. ఈ మనుష్యులంతా ఇశ్రాయేలు కుమారుడైన లేవీ సంతానం.
26 అహరోను, మోషే ఈ వంశానికి చెందిన వాళ్లు, “ఇశ్రాయేలు ప్రజల వంశాలను నడిపించండి” అని యెహోవా చెప్పింది వీళ్లకే.
27 ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన వాళ్లు అహరోను, మోషే, ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు విడిచి పెట్టి వెళ్లనివ్వాల్సిందిగా ఫరోతో చెప్పింది వీళ్లే.
28 ఈజిప్టు దేశంలో దేవుడు మోషేతో మాట్లాడాడు.
29 “నేను యెహోవాను నేను నీతో చెప్పిందంతా ఈజిప్టు రాజుతో చెప్పు” అన్నాడు.
30 “కానీ, నేను చక్కగా మాట్లాడలేను గదా! రాజు నా మాట వినడు” అని జవాబిచ్చాడు మోషే.
1 మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “నేను నీకు తోడుగా ఉంటాను. ఫరోకు నీవు ఒక మహారాజులా ఉంటావు. అహరోను నీ పక్షంగా మాట్లాడే మాటకారిగా ఉంటాడు.
2 నీకు నేను ఆజ్ఞాపించేదంతా అహరోనుతో చెప్పు. నేను చెప్పే విషయాలన్నీ అతను రాజుతో చెబతాడు. ఇక ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఈ దేశాన్ని వదిలిపోనిస్తాడు.
3 అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు.
4 అందుచేత ఈజిప్టును నేను ఘోరంగా శిక్షిస్తాను. తర్వాత నా ప్రజలను ఆ దేశం నుండి నేను బయటకు నడిపిస్తాను.
5 అప్పుడు నేనే యెహోవాను అని ఈజిప్టు ప్రజలు తెలుసుకుంటారు. నేను వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాను. నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. అప్పుడు నేనే నా ప్రజలను ఆ దేశంనుండి బయటకు నడిపిస్తాను.”
6 మోషే, అహరోనులు యెహోవా తమతో చెప్పిన ఈ మాటలకు విధేయులయ్యారు.
7 అప్పటికి మోషే వయస్సు 80 సంవత్సరాలు అహరోను వయస్సు సంవత్సరాలు.
8 మోషే, అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు:
9 “మీ శక్తి రుజువు చేయమని ఫరో మిమ్మల్ని అడుగుతాడు. ఒక అద్భుతం చేయమని మిమ్మల్ని అడుగుతాడు. అతని కర్ర నేలమీద పడవేయమని అహరోనుతో చెప్పు. ఫరో చూస్తూ ఉండగానే ఆ కర్ర పావు అవుతుంది.”
10 కనుక మోషే, అహరోను ఫరో దగ్గరకు వెళ్లి యెహోవా చెప్పినట్టు చేసారు. అహరోను తన చేతి కర్రను కింద పడవేసాడు. ఫరో తన అధికారులతో కలసి చూస్తూ ఉండగానే ఆ కర్ర పాముగా అయింది.
11 కనుక రాజు తన విద్వాంసులను, మంత్రగాళ్లను పిలిపించాడు. వాళ్లు మంత్రాలు వేసి, అహరోను చేసినట్లే చేయగల్గారు.
12 వాళ్లు కూడా వారి కర్రలను నేల మీద పడవేసారు. ఆ కర్రలు పాములయ్యాయి, కాని అహరోను కర్ర వాళ్ల కర్రలను మింగేసింది.
13 అయినా సరే ప్రజలను వెళ్లనిచ్చేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో అలాగే ఇది జరిగింది. మోషే, అహరోనుల మాట వినేందుకు రాజు ఒప్పుకోలేదు.
14 అప్పుడు మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఫరో మొండికెత్తాడు. ప్రజల్ని పోనిచ్చేందుకు ఫరో నిరాకరిస్తున్నాడు.
15 ఉదయాన్నే ఫరో నైలు నదికి వెళ్తాడు. నది ఒడ్డున అతని దగ్గరకు వెళ్లు. పాముగా మారిన ఆ కర్రను నీ వెంట తీసుకొనివెళ్లు.
16 అతనికి ఇలా చెప్పు: ‘హీబ్రూ ప్రజల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపించాడు. ‘అరణ్యంలో నన్ను ఆరాధించటానికి నా ప్రజలను వెళ్లనివ్వు’ అని నీతో చెప్పమని యెహోవా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నీవేమో యెహోవా మాట వినలేదు.” ‘
17 “కనుక యెహోవా చెబతున్నాడు, ‘నేనే యెహోవానని చెప్పి నీవు ఇలా తెల్సుకొంటావు’ నా చేతిలో ఉన్న ఈ కర్రతో నైలు నది నీళ్లను నేను కొడతాను. నైలునది రక్తంగా మారిపోతుంది.
18 దానితో నదిలో చేపలన్నీ చస్తాయి, నది కుళ్లు కంపు కొడుతుంది. అంతటితో ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు తాగలేక పోతారు.”
19 యెహోవా మోషేకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “వారి నదులు, కాలువలు, చెరువుల మీద, వారు నీరు నిల్వ చేసే ప్రతి స్థలం మీద తన చేతి కర్ర చాపాలని అహరోనుకు చెప్పు. అతను ఇలా చెయ్యగానే నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. చెక్క పాత్రలు, రాతి పాత్రల్లో ఉన్న నీళ్లతో సహా మొత్తం నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి.
20 యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే, అహరోనులు చేసారు. అతను కర్ర పైకెత్తి నైలునది నీళ్లమీద కొట్టాడు. ఫరో, అతని అధికారులు అందరి ముందు అతడు ఇలా చేసాడు. నదిలో నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.
21 నదిలో చేపలు చచ్చాయి. నది కుళ్లు కంపు కొట్టడం మొదలయింది. అందుచేత ఈజిప్టు వాళ్లు ఆ నదిలో నీళ్లు తాగలేక పోయారు. ఈజిప్టు అంతా రక్తమయం అయిపోయింది.
22 మాంత్రికులు కూడ మాయలు చేసి అలాగే చేసారు. కనుక మోషే, అహరోనుల మాటను ఫరో లెక్కచేయలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
23 ఫరో ముఖం తిప్పుకొని తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. మోషే, అహరోనులు చేసిన దాన్ని ఫరో అలక్ష్యం చేసాడు.
24 ఈజిప్టు వాళ్లు నదిలో నీళ్లు త్రాగలేక పోయారు. అందుచేత తాగే నీళ్ల కోసం వాళ్లు ఆ నది చుట్టూ బావులు తవ్వారు.
25 [This verse may not be a part of this translation]
1 నైలు నది నీళ్లను యెహోవా మార్చేసిన తర్వాత ఏడు రోజులు గడిచాయి. మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఫరో దగ్గరకు వెళ్లి- ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు, అని యెహోవా చెబతున్నాడని అతనితో చెప్పు.
2 వారు వెళ్లడానికి ఫరో నిరాకరిస్తే నేను ఈజిప్టును కప్పలతో నింపేస్తాను
3 నైలు నది కప్పలతో నిండిపోతుంది. అవి నదిలోనుంచి వచ్చి మీ ఇళ్లలో దూరుతాయి. అవి మీ పడక గదుల్లో పడకల మీద వుంటాయి. మీ అధికారుల ఇళ్లలో, మీ వంట పాత్రల్లో, నీళ్ల బానల్లో కప్పలే ఉంటాయి.
4 నీవు, నీ ప్రజలు, నీ అధికారులు అందరి మీదికీ కప్పలు వచ్చేస్తాయి.”‘
5 అప్పుడు మోషేతో యెహోవా, “కాలువలు, నదులు, చెరువులు, అన్నింటి మీదికీ తన చేతి కర్రను ఎత్తమని అహరోనుతో చెప్పు. కప్పలు బయటకు వచ్చి ఈజిప్టు అంతటా నిండుతాయి” అని చెప్పాడు.
6 కనుక ఈజిప్టు జలాలపై అహరోను తన చేయి ఎత్తగా నీళ్లలో నుండి కప్పలు బయటకు వచ్చి, ఈజిప్టు దేశమంతా నిండిపోవటం మొదలయింది.
7 మాయలు చేసే ఈజిప్టు మాంత్రికులు కూడా అలాగే చేసారు, కనుక ఈజిప్టు మీదికి ఇంకా ఎక్కువ కప్పలు వచ్చాయి.
8 మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు, “నా దగ్గర్నుండి, నా ప్రజల దగ్గర్నుండి కప్పలను తీసివేయుమని యెహోవాను అడగండి. యెహోవాకు బలులు అర్పించేందుకు ప్రజల్ని నేను వెళ్లనిస్తాను” అన్నాడు ఫరో.
9 ఫరోతో మోషే ఇలాగు చెప్పాడు, “కప్పలు ఎప్పుడు పోవాలనుకుంటున్నావో నాతో చెప్పు, నీ కోసం, నీ ప్రజల కోసం, నీ అధికారుల కోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడే కప్పలు మిమ్మల్ని, మీ ఇళ్లను విడిచిపెట్టి నదిలోనే ఉండిపోతాయి. (కప్పలు ఎప్పుడు నిన్ను వదిలి పోవాలనుకొంటున్నావు?)”
10 “రేపే” అన్నాడు ఫరో. మోషే అన్నాడు: “నీవు చెప్పినట్టే జరుగుతుంది. మా దేవుడైన, యెహోవాలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరని నీవు తెలుసుకొంటావు.
11 నిన్ను, నీ ఇంటిని, నీ అధికారుల్ని, నీ ప్రజల్ను కప్పలు విడిచిపోతాయి. ఆ కప్పలు నదిలోనే ఉండిపోతాయి.”
12 మోషే, అహరోను ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయారు. ఫరో మీదికి ఆయన పంపిన కప్పల్నిగూర్చి మోషే యెహోవాకు మొరపెట్టాడు.
13 మోషే అడిగిన ప్రకారం దేవుడు చేసాడు. ఇళ్లలో, వాకిళ్లలో, పొలాల్లో కప్పలు చచ్చాయి.
14 అవి కుళ్లిపోయి దేశమంతా కంపు కొట్టడం మొదలయింది.
15 కప్పల బాధ వదలిపోవడం చూచి ఫరో మళ్లీ మొండికెత్తాడు. అతను ఏమి చెయ్యాలని మోషే అహరోనులు అడిగారో, అలా చేయలేదు. ఇదంతా సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు “నీ కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టు ఈజిప్టుదేశ వ్యాప్తంగా దుమ్ము పేలు అవుతాయి. అని అహరోనుతో చెప్పు.”
17 వారు అలా చేసారు. అహరోను తన చేతి కర్ర పై కెత్తి నేలమీద దుమ్మును కొట్టాడు. ఈజిప్టు అంతటా దుమ్ము పేలు అయింది. మనుష్యుల మీద జంతువుల మీద పేలు ఎక్కేసాయి.
18 ఈజిప్టు మాంత్రికులు వారి మాయల్ని ప్రయోగించి వారు కూడ అలా చేయాలని ప్రయత్నం చేసారు. కానీ దుమ్ము నుండి పేలు వచ్చేటట్టు చేయలేక పోయారు. జంతువుల మీద, మనుష్యుల మీద పేలు అలాగే ఉండిపోయాయి.
19 కనుక ఇది యెహోవా శక్తివల్లే జరిగిందని మాంత్రికులు ఫరోతో చెప్పారు. కాని ఫరో వారు చెప్పింది ఒప్పుకోలేదు. ఇదీ సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
20 యెహోవా మోషేతో ఇలా అన్నాడు, “ఉదయాన్నే లేచి ఫరో దగ్గరకు వెళ్లు. ఫరో నదికి వెళ్తాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్లనివ్వు’ అని యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు.
21 ‘నీవు నా ప్రజల్ని వెళ్లనివ్వక పోతే, నీ ఇండ్లలోకి ఈగలు వచ్చేస్తాయి, నీ మీద, నీ అధికారుల మీద ఈగలు పట్టేస్తాయి. ఈజిప్టు గృహాలన్నీ ఈగలతో నిండిపోతాయి. ఈజిప్టు దేశమంతా ఈగలతో నిండిపోతుంది.’
22 అయితే ఈజిప్టు ప్రజలను చూచినట్టు మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని నేను చూడను. నా ప్రజలు నివసిస్తున్న గోషెనులో మాత్రం ఈగలు ఉండవు. ఈ విధంగా నేను అంటే యెహోవాను ఈ భూమి మీద ఉన్నానని నీవు తెలుసుకొంటావు.
23 కనుక రేపు నా ప్రజల్ని నీ ప్రజల కంటే వేరుగా చూస్తాను. అదే నా రుజువు.”
24 అందుచేత యెహోవా అలాగే చేసాడు. ఈజిప్టు మీదికి విస్తారంగా ఈగలు వచ్చేసాయి. ఫరో ఇంట్లోను, అతని అధికారుల ఇండ్లన్నింటిలోను ఈగలు ఉన్నాయి. ఈజిప్టు అంతటా ఈగలు ముసురుకొన్నాయి. ఈగలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి.
25 కనుక మోషే అహరోనుల్ని ఫరో పిలిపించాడు. “ఈ దేశంలోనే ఇక్కడే మీ దేవునికి బలులు అర్పించండి” అని ఫరో వాళ్లతో చెప్పాడు.
26 కానీ మోషే అన్నాడు, “అలా చేయటం సరికాదు. మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించటం చాలా భయంకర విషయం అని ఈజిప్టు వాళ్లు అనుకొంటారు. ఈజిప్టు వాళ్లకు కనబడేటట్టు మేము గనుక ఇలా చేస్తే, ఈజిప్టు వాళ్లు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు.
27 మూడు రోజుల ప్రయాణమంత దూరం మమ్మల్ని అరణ్యంలోకి వెళ్లనిచ్చి, అక్కడ మా యెహోవా దేవునికి బలులు అర్పించనివ్వు. యెహోవా మమ్మల్ని ఇలాగే చేయమన్నాడు.”
28 అందుకు ఫరో, “మీరు వెళ్లి అరణ్యంలో మీ యెహోవా దేవునికి బలులు అర్పించనిస్తాను. కానీ మీరు మాత్రం మూడు రోజుల ప్రయాణమంత దూరంకంటే ఎక్కువ దూరం వెళ్లకూడదు. ఇక పోయి నాకోసం ప్రార్థించు.” అని మోషేతో అన్నాడు.
29 “సరే రేపు నీ నుండి, నీ ప్రజలనుండి, నీ అధికారుల దగ్గర్నుండి ఈగలను తొలిగించమని నేను పోయి యెహోవాను వేడుకొంటాను. కాని, ప్రజలు బలులు అర్పించకుండా నీవు మాత్రం ఆపు చేయకూడదు” అన్నాడు మోషే.
30 కనుక మోషే ఫరో దగ్గర్నుండి వెళ్లిపోయి యెహోవాకు ప్రార్థన చేసాడు.
31 మోషే కోరినట్టు యెహోవా చేసాడు. ఫరోనుండి, అతని ప్రజలనుండి అధికారుల నుండి ఈగలను యెహోవా తొలగించాడు. ఈగలు ఒక్కటి కూడా మిగుల లేదు.
32 అయితే ఫరో మళ్లీ మొండికెత్తి ప్రజలను వెళ్ల నివ్వలేదు.
1 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: ‘నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు’ అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’
2 ఇంకా నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే
3 పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు.
4 ఈజిప్టు జంతుజాలంకంటె ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యేకంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతువుల్లో ఏదీ చావదు
5 ఇదంతా జరగటానికి యెహోవా సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది జరిగేటట్టు యెహోవా చేస్తాడు.”
6 మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతువులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు.
7 ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు.
8 మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు, “మీ చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే, ఫరో ముందర గాలిలో ఈ బూడిదను వెదజల్లాలి.
9 [This verse may not be a part of this translation]
10 మోషే, అహరోనులు కొలిమి నుండి బూడిద తీసుకొన్నారు. తర్వాత వెళ్లి ఫరో ఎదుట నిలబడ్డారు. ఆ బూడిదను వారు గాలిలో వెదజల్లారు, మనుష్యుల మీద, జంతువుల మీద దద్దుర్లు పుట్టడం మొదలయింది.’
11 చివరికి మాంత్రికులకు కూడా ఆ దద్దుర్లు వచ్చినందువల్ల మోషే ఇలా చేయకుండా మాంత్రికులు కూడా ఆపలేక పోయారు. ఈజిప్టు అంతటా ఇది జరిగింది.
12 అయితే యెహోవా ఫరోను మొండి వాడిగా చేసాడు. అందుచేత మోషే, అహరోనుల మాట వినేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.
13 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఉదయాన్నే లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. ‘నన్ను ఆరాధించడానికి, నా ప్రజలను వెళ్లనివ్వు’ అని హీబ్రూ ప్రజల దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు.
14 నీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, నీ ప్రజలమీద, నీ అధికారుల మీద నా శక్తి అంతా ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడని నీకు తెలుస్తుంది.
15 నేను నా శక్తిని ప్రయోగించి, ఒక్క రోగం రప్పించానంటే, అది నిన్ను, నీ ప్రజల్ని భూమి మీద లేకుండా తుడిచి పారేస్తుంది.
16 అయితే ఒక కారణం వల్ల నేను నిన్ను ఇక్కడ ఉంచాను. నా శక్తిని నీవు చూడాలని నిన్ను ఇక్కడ ఉంచాను. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నా విషయం తెల్సుకొంటారు.
17 నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు.
18 కనుక రేపు ఈ వేళకు మహా బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు.
19 ఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టుకోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదైన ప్రతిదాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందుచేతనంటే పొలాల్లో నిలబడి ఉండే మనిషిగాని జంతువుగాని చచ్చినట్లే. ఇంట్లో చేర్చబడకుండా ఉండే ప్రతి దానిపై నా వడగళ్లు కురుస్తాయి.”‘
20 ఫరో అధికారులలో కొందరు యెహోవా మాటను గమనించారు. వాళ్లు వెంటనే వారి పశువులన్నిటినీ, బానిసలందరినీ ఇండ్లలో చేర్చారు.
21 కాని మిగతా వాళ్లు యెహోవా సందేశాన్ని లెక్క చేయలేదు. అలాంటి వారు పొలాల్లో ఉన్న తమ బానిసలందరిని, జంతువులన్నింటిని అక్కడే ఉండ నిచ్చారు.
22 నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా వడగళ్ల వాన ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువుల మీద, మనుష్యులందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో యెహోవా చెప్పాడు.
23 కనుక మోషే తన కర్రను పైకి ఎత్తాడు, ఉరుములు, మెరుపులు వచ్చేటట్టు, భూమి మీద వడగళ్లు కురిసేటట్టు యెహోవా చేసాడు. ఈజిప్టు అంతటా వడగళ్లు పడ్డాయి.
24 వడగళ్లు పడుతోంటే, ఆ వడగళ్లతో పాటు మెరుపులు మెరిసాయి. ఈజిప్టు ఒక రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి, ఈజిప్టును ఇంత దారుణంగా దెబ్బతీసిన వడగళ్ల వాన ఇదే.
25 ఈజిప్టు పొలాల్లో ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్ల వాన నాశనం చేసింది. మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్లోని చెట్లన్నీ విరిగి పోయాయి.
26 ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను ఒక్కటే వడగళ్లు పడని ఒకే ఒక చోటు.
27 మోషే అహరోనులను ఫరో పిలిపించాడు. ఫరో వారితో, “ఈ సారి నేను పాపం చేసాను. యెహోవా న్యాయమంతుడు. తప్పు నాది, నా ప్రజలది.
28 వడగళ్లు, ఉరుములు మరీ భయంకరంగా ఉన్నాయి! వాటిని ఆపేయమని దేవుణ్ణి అడుగు. నేను మిమ్మల్ని వెళ్లిపోనిస్తాను. మీరు ఇక్కడ ఉండనక్కర్లేదు.” అని చెప్పాడు.
29 మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. ఈ భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు.
30 అయినా నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.”
31 అప్పుడే జనుము గింజ పట్టింది. యవలు అప్పుడే పూత పట్టాయి. అయిననూ ఈ మొక్కలు నాశనం అయ్యాయి.
32 అయితే గోధుమలు, మిరప ఇతర ధాన్యాలకంట్టె ఆలస్యంగా పక్వానికి వస్తాయి. అందుచేత ఈ మొక్కలు నాశనం కాలేదు.
33 మోషే ఫరోను విడిచి పట్టణం బయటికి వెళ్లాడు. యెహోవా యెదుట అతడు తన చేతులు చాచాడు. ఉరుములు, వడగళ్లు ఆగిపోయాయి. నేలమీద వర్షం కురవడం కూడ ఆగిపోయింది.
34 ఎప్పుడయితే వర్షం, వడగళ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూశాడో, అప్పుడు అతను మళ్లీ తప్పు చేసాడు. అతను అతని అధికారులు మళ్లీ మొండికెత్తారు.
35 ఇశ్రాయేలు ప్రజల్ని స్వేచ్ఛగా వెళ్లనిచ్చేందుకు నిరాకరించాడు ఫరో. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఇది జరిగింది.
1 యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. నేనే అతణ్ణి అతని అధికారులని మొండిగా చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు చూపించాలని నేనే ఇలా చేసాను.
2 అలాగే ఈజిప్టులో నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని వీటిని చేసాను. అప్పుడు నేనే యెహోవానని మీరంతా తెల్సుకొంటారు” అని చెప్పాడు.
3 మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు’ అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు” అని వారు అతనితో చెప్పారు.
4 నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, రేపు నీ దేశంలోకి మిడతలను తీసుకొస్తాను.
5 నేల అంతా మిడతలతో నిండి పోతుంది. నీకు నేల కనబడనంత విస్తారంగా మిడతలు ఉంటాయి. వడగళ్ల వానలో మిగిలింది యింకేమైనా ఉంటే, దాన్ని కాస్తా మిడతలు తినేస్తాయి. పొలాల్లో చెట్ల ఆకులన్నిటినీ మిడతలు తినేస్తాయి.
6 మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు.
7 “ఇంకెన్నాళ్లు ఈ మనుష్యులు మనల్ని చిక్కుల్లో పెడతారు. మగవాళ్లందర్నీ వారి యెహోవా దేవుడ్ని ఆరాధించుకొనేందుకు వెళ్లనివ్వు. నీవు వాళ్లను వెళ్లనియ్యకపోతే, నీవు గుర్తించక ముందే, ఈజిప్టు నాశనం అయిపోతుంది” అని ఫరో అధికారులు అతనితో చెప్పారు.
8 కనుక మోషే అహరోనులను తన దగ్గరకు మళ్లీ తీసుకురమ్మని ఫరో తన అధికారులతో చెప్పాడు. “మీరు వెళ్లి మీ యెహోవా దేవుడ్ని ఆరాధించండి, అయితే ఎవరెవరు వెళ్లుచున్నది నాకు సరిగ్గా చెప్పండి?” అన్నాడు ఫరో.
9 “మా ప్రజలలో పడుచువాళ్లు, వృద్ధులు వెళ్తారు! మాతోబాటు మా కుమారులు మా కుమార్తెలను, మా గొర్రెల్ని మా పశువుల్ని కూడ తీసుకుపోతాం. ఇది మా యెహోవా పండుగ గనుక మేమంతా వెళ్తాము” అని జవాబిచ్చాడు మోషే.
10 ఫరో వాళ్లతో, “నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని వెళ్లనిచ్చే ముందు యెహోవా నిజంగా మీతో ఉండి తీరాలి. చూస్తోంటే,
11 మీరేదో దుర్మార్గం తలపెట్టి నట్లుంది. మగాళ్లు వెళ్లి యెహోవాను ఆరాధించవచ్చు. అసలు మీరడిగింది అదే. అంతేగాని మీరంతా మొత్తం వెళ్లి పోయేందుకు వీల్లేదు” అని చెప్పి మోషే, అహరోనులను ఫరో పంపించి వేసాడు.
12 యెహోవా మోషేతో “ఈజిప్టు మీద నీ చేయి ఎత్తు, మిడతలు వచ్చేస్తాయి. ఈజిప్టు మొత్తం నేలమీద మిడతలు ఆవరించేస్తాయి. వడగళ్లు నాశనం చేయకుండా మిగిలిన పంట అంతటినీ ఆ మిడతలు తినేస్తాయి” అని చెప్పాడు.
13 కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ రోజంతా, రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది ఆ గాలి.
14 మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు.
15 నేల అంతా మిడతలు కమ్మేశాయి. దేశం అంతా చీకటి అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకు గూడ మిగల్లేదు.
16 వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
17 ఈ సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో.
18 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు.
19 కనుక యెహోవా ఆ గాలిని మార్చేసాడు. పడమటినుండి గాలి బలంగా వీచేటట్టు చేసాడు. ఆ గాలి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు.
20 అయితే యెహోవా ఫరోను మాత్రం ఇంకా మొండిగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్లనివ్వలేదు.
21 అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు.
22 కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది.
23 ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది.
24 ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు.
25 “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము.
26 యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు.
27 యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు.
28 అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు.
29 “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.
1 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో మీదికి, ఈజిప్టు మీదికి నేను ఇంకా నాశనం తీసుకు రావల్సి ఉంది. దాని తర్వాత అతడు మిమ్మల్ని ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు. వాస్తవానికి మీరు ఈ దేశం వదలి వెళ్లిపోవాలని అతడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు.
2 ఇశ్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి, ‘మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టు ప్రక్కల వాళ్ల దగ్గరకు వెళ్లి, వారి వెండి, బంగారు వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి.
3 ఈజిప్టు వాళ్లకు మీపై దయ కలిగేటట్టు యెహోవా చేస్తాడు.” అప్పటికే ఈజిప్టు ప్రజలు మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక మహాత్మునిగా ఎంచుతున్నారు.
4 మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ వేళ మధ్య రాత్రి నేను ఈజిప్టులో తిరుగుతాను.
5 ఫరో పెద్ద కుమారుడు మొదలు ధాన్యం తిరుగలి విసరుతున్న బానిసయొక్క, పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు. అలాగే జంతువుల్లో మొదట పుట్టినవన్నీ చస్తాయి.
6 గతంలోకంటె, భవిష్యత్తులోకంటె, ఇప్పుడు ఈజిప్టులోవినబడే ఏడ్పులు మరీ దారుణంగా ఉంటాయి.
7 కాని ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికీ హాని కలుగదు. కనీసం వారిపై ఒక కుక్క కూడ మొరగడం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరుగాని, వారి జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధపడవు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు వాళ్లకంటె, ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసుకొంటారు.
8 అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. “మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి” అని వాళ్లే అప్పుడు చెబతారు. అప్పుడు నేను కోపంగా ఫరోను విడిచి వెళ్తాను.”
9 యెహోవా మోషేతో, “నీ మాట ఎందుచేత ఫరో వినలేదు? ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను చూపించ గలిగేందుకే” అని చెప్పాడు.
10 ఆ కారణం చేతనే ఫరో యెదుట మోషే, అహరోనులు ఈ మహా అద్భుతాలన్నీ చేసారు. అందుకే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశం నుండి వెళ్లనియ్యకుండా అంత మొండికెత్తేటట్టు యెహోవా చేసాడు.
1 మోషే, అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండగానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు:
2 “ఈనెల83 మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది.
3 ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి.
4 ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్లను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి.
5 గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును.
6 నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజలంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను చంపాలి.
7 ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. ఏ ఇండ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పైకమ్మి మీద ఆ రక్తం చల్లాలి.
8 “ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినెయ్యాలి. చేదుగా ఉండే ఆకు కూరలు, పొంగని రొట్టె కూడా మీరు తినాలి.
9 గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద పేల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి.
10 ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయాలి.
11 “మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతురంగా మీరు భోజనం చేయాలి. ఎందుచేతనంటే, ఇది యెహోవాయొక్క పస్కాబలి (యెహోవా తన ప్రజలను కాపాడి, వారిని ఈజిప్టునుండి త్వరగా బయటకు నడిపించిన సమయం.)
12 “ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణీ చంపేస్తాను. మనుష్యుల్లోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. నేనే యెహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను.
13 అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను. ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.
14 “కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి.
15 ఈ పండుగనాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసివేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు వాళ్లనుండి మీరు వేరుచేయాలి.
16 పండుగలో మొదటి రోజున, చివరి రోజున పరిశుద్ధ సమావేశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఏ పనీ చేయకూడదు. ఇలాంటి రోజుల్లో మీరు భోంచేయటానికి అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవడం ఒక్కటే మీరు చెయ్యొచ్చు.
17 పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా ఈ రోజే మీ వంశాలన్నింటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం.
18 కనుక మొదటి నెల (నిసాను) 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 21రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి.
19 ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా పులిసిన పదార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు పౌరుడేకాని, విదేశీయుడేగాని ఏ వ్యక్తిగాని ఈ సందర్భంలో పులిసిన పదార్థం తింటే, మిగిలిన ఇశ్రాయేలీయులందరినుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి.
20 ఈ పండుగ సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు. మీరు ఎక్కడ ఉన్నాసరే, పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.”
21 కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి.
22 హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు.
23 ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు.
24 ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది.
25 యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి.
26 ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు
27 ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు.
28 మోషే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు చేసారు.
29 అర్ధరాత్రి వేళ ఫరో (ఈజిప్టు రాజ్యపాలకుడు) ఇంట పెద్ద కుమారుడు మొదలుకొని చెరసాలలో కూర్చొన్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో పెద్ద కుమారులందర్నీ యెహోవా చంపేసాడు. అలాగే జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి.
30 ఆ రాత్రి ఈజిప్టులో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు చనిపోయారు. ఫరో, అతని అధికారులు, ఈజిప్టులోని ప్రజలంతా ఘోల్లున ఏడ్వడం మొదలు పెట్టారు.
31 కనుక ఆ రాత్రి మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి.
32 మీరు చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ ఆశీర్వదించండి.” అని వారితో ఫరో అన్నాడు.
33 వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడ వారిని అడిగారు ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమందరం చస్తాము” అని వాళ్లు చెప్పారు.
34 తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన వేసుకొని మోసుకుపోయారు.
35 అప్పుడు మోషే వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు.
36 ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చారు.
37 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసునుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 6,00,000 మంది. ఇందులో పిల్లల సంఖ్యలేదు.
38 గొర్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్లు ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు.
39 అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం చేసుకోలేదు. కనుక పులవని పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది.
40 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో 430 సంవత్సరాలు జీవించారు.
41 నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి.
42 కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు.
43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు.
44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు.
45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”
46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు.
47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి.
48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు.
49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”
50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు.
51 కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.
1 అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు.
2 “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”
3 మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు.
4 అబీబు మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు.
5 మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తోన్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తోన్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకు ఉండాలి.
6 “ఏడు రోజులపాటు పులియని రొట్టెలే మీరు తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది.
7 కనుక ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు.
8 ‘యెహోవా ఈజిప్టునుండి మమ్మల్ని బయటకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసుకొంటున్నాము’ అని ఈ రోజు నాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి.”
9 “మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ పడుతుంది.
10 కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి.”
11 “మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత
12 ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆయనకు ఇవ్వాలని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జంతువుల్లో ప్రథమంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ యెహోవాకు అర్పించాలి.
13 తొలి పిల్లగా పుట్టిన ప్రతి గాడిదనూ యెహోవా దగ్గర్నుండి మళ్లీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి, గాడిదను విడిపించుకోవచ్చును. యెహోవా దగ్గర్నుండి ఆ గాడిదను కొని విడిపించుకోనట్లయితే, దాన్ని చంపేయాలి. మీరు దాని మెడ విరుగగొట్టాలి. అది బలి అర్పణ అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్నీ యెహోవా దగ్గరనుండి మళ్లీ కొనుక్కోవాలి.
14 “మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. “దీనంతటికీ భావం ఏమిటి?” అని వారు అంటారు. దానికి మీరు యిలా జవాబిస్తారు. ‘ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలంగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడిపించి ఇక్కడకు తీసుకొచ్చాడు.
15 ఈజిప్టులో ఫరో మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాకరించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ఠ సంతానాన్నీ యెహోవా చంపేసాడు. (పెద్ద కుమారుల్ని, తొలి చూలు జంతువుల్ని యెహోవా చంపేసాడు) ఆ కారణంచేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ నేను యెహోవాకు అర్పిస్తున్నాను. ఆ కారణంచేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి ఒక్కరినీ నేను యెహోవా దగ్గర్నుండి కొంటున్నాను.’
16 ఇది మీ ముంజేతికి కట్టబడ్డ దారం పోగులాంటిది. అది నీ కంటికి ఒక బాసికంలాంటిది. యెహోవా తన మహత్తర శక్తిచేత మనల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయకరంగా ఉంటుంది.”
17 ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.”
18 కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్దేరారు.
19 మోషే తనతో బాటు యోసేపు ఎముకలను తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు తాను చనిపోక ముందే ఇశ్రాయేలి కుమారులతో ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులోనుంచి నా ఎముకల్ని మీతో తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను చనిపోక ముందు యోసేపు చెప్పాడు.
20 ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బసచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది.
21 యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. వాళ్లు రాత్రి సమయంలో కూడ ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురు నిచ్చింది.
22 పగటి వేళంతా ఆ ఎత్తయిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ వాళ్లతోటే ఉన్నాయి.
1 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు:
2 “ప్రజలు వెనక్కు తిరిగి పీహ హీరోతుకు ప్రయాణం కట్టమని చెప్పు. మిగ్దోలుకు, సముద్రానికి మధ్య ప్రదేశంలో రాత్రికి బసచేయాలని వారితో చెప్పు. ఇది బయల్సెఫోను దగ్గర్లో ఉంది.
3 ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తప్పిపోయి ఉంటారని ఫరో తలుస్తాడు. పైగా ప్రజలు వెళ్ల గలిగినచోటు ఇంకేమీ ఉండదు అనుకొంటాడు.
4 ఫరోను నేను ధైర్యశాలిగా చేస్తాను. అతడేమో మిమ్మల్ని తరుముతాడు. అయితే ఫరోను, అతని సైన్యాన్ని నేను ఓడిస్తాను. ఇది నాకు కీర్తి తెచ్చి పెడుతుంది. నేనే యెహోవానని ఈజిప్టు వాళ్లు అప్పుడు తెల్సుకొంటారు.” ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధేయులై ఆయన చెప్పినట్టు చేసారు.
5 ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారని ఫరోకు ఒక సమాచారం అందింది. ఎప్పుడైతే ఈ సంగతి విన్నారో అప్పుడు వెంటనే ఫరో, అతని అధికారులు తాము చేసిన దాన్ని గూర్చి తమ మనసు మార్చుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల్ని అసలు మనం ఎందుకు వెళ్లనిచ్చాం? వాళ్లను మనం ఎందుకు పారిపోనిచ్చాం? ఇప్పుడు మనం మన బానిసల్ని పోగొట్టుకొన్నాం” అన్నాడు ఫరో.
6 కనుక ఫరో తన యుద్ధరథాన్ని సిద్ధం చేసుకొని, తన మనుష్యుల్ని వెంట పెట్టుకొని వెళ్లాడు.
7 తన మనుష్యుల్లో బలవంతులయిన వాళ్లు 600 మందిని, రథాలు అన్నింటిని తనతో తీసుకొని వెళ్లాడు. ఒక్కోరథానికి ఒక్కో అధికారి ఉన్నాడు.
8 ఇశ్రాయేలీయులు విజయ సంకేతంగా చేతులు పైకెత్తి వెళ్లి పోతున్నారు. కానీ ఈజిప్టురాజైన ఫరో ఇంకా ధైర్యశాలి అయ్యేటట్టు యెహోవా చేసాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని ఇంకా తరిమాడు.
9 ఈజిప్టు సైన్యంలో అశ్వదళాలు, రథాలు చాల ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజల్ని తరిమి, వారు బయల్సెఫోనుకు తూర్పున పీహహీరోతు వద్ద ఎర్ర సముద్రానికి దగ్గర్లో బస చేస్తూ ఉండగానే వారిని సమీపించారు.
10 ఫరో, అతని సైన్యం తమవైపే రావడం ఇశ్రాయేలు ప్రజలు చూసారు. ప్రజలు చాల భయపడ్డారు. సహాయం చేయమని వారు యెహోవాకు మొరపెట్టారు.
11 మోషేతో వాళ్లు యిలా అన్నారు, “అసలు ఈజిప్టు నుండి నీవు మమ్మల్నెందుకు బయటకు తీసుకొచ్చావు? చావడానికి నీవు మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకురావడం ఎందుకు? మేము హాయిగా ఈజిప్టులోనే చచ్చేవాళ్లం అక్కడ ఈజిప్టులో కావాల్సినన్ని సమాధులున్నాయి.
12 ఇలా జరుగుతుందని మేము నీతో చెప్పాము. ‘దయచేసి మమ్మల్ని విసిగించకు. మమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చి, ఈజిప్టు వాళ్లకు సేవ చేయనియ్యి అని ఈజిప్టులోనే మేము చెప్పాము.’ ఇలా బయటకు వచ్చి ఈఎడారిలో చావడంకంటె ఈజిప్టులోనే ఉండిపోయి బానిసలంగా ఉంటేనే యింకా బాగుండేది మాకు.”
13 కానీ మోషే జవాబు ఇలా చెప్పాడు: “భయ పడకండి! పారిపోకండి! యెహోవా ఈనాడు మిమ్మల్ని రక్షించటం వేచి చూడండి. ఈ ఈజిప్టు వారిని ఈరోజు తర్వాత మళ్లీ ఎన్నడూ మీరు చూడరు!
14 మీరు ఊరకనే మౌనంగా ఉండటం తప్ప చేయాల్సిందేమీ లేదు. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు.”
15 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు, “ఇంకా నీవెందుకు నాకు మొర పెడుతున్నావు? ఇశ్రాయేలు ప్రజల్ని ముందడుగు వేయమని ఆజ్ఞాపించు
16 నీ చేతిలో కర్రను ఎర్రసముద్రం మీదకు చాపు, ఎర్రసముద్రం రెండుగా విడిపోతుంది. అప్పుడు ప్రజలు ఆరిపోయిన నేలమీద సముద్రంలోనుంచి నడిచి వెళ్లిపోవచ్చు.
17 ఈజిప్టు వాళ్లను ధైర్యంగల వాళ్లుగా నేను చేస్తాను. ఇలా చేసినందువల్ల వారు మిమ్మల్ని తరుముతారు. అయితే ఫరోకంటె, అతని అశ్వదళాలు, రథాలు, అన్నిటికంటె నేను ఎక్కువ శక్తిగలవాడ్ని అని మీకు తెలియజేస్తాను.
18 నేనే యెహోవానని ఈజిప్టు అప్పుడు తెలుసు కొంటుంది. ఫరోను, అతని అశ్వ దళాలను, రథాలను నేను ఓడించినప్పుడు వాళ్లు నన్ను గౌరవిస్తారు.”
19 ఆ సమయంలో యెహోవా దూత ప్రజల వెనక్కు వెళ్లడం జరిగింది. (సాధారణంగా యెహోవా దూత ప్రజలకు ముందర ఉండి వారిని నడిపించడం జరుగుతుంది) కనుక ఎత్తైన మేఘం ప్రజల ముందర నుండి కదలిపోయి, ప్రజల వెనక్కు వెళ్లింది
20 ఈ విధంగా ఈజిప్టు వాళ్లకు, ఇశ్రాయేలీయులకు మధ్య ఆ మేఘం నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉంది. కానీ ఈజిప్టు వారికి అంతా చీకటి. అందుచేత ఆరాత్రి ఈజిప్టు వాళ్లు ఇశ్రాయేలు ప్రజల సమీపానికి రాలేకపోయారు.
21 మోషే ఎర్ర సముద్రం మీదికి తన చేయి ఎత్తగానే తూర్పునుండి ఒక బలమైన గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ గాలి రాత్రి అంతా వీచింది. సముద్రం రెండుగా విడిపోయింది. ఆ గాలి నేలను ఆరిపోయ్యేటట్టు చేసింది.
22 ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో పొడినేల మీద వెళ్లారు. వాళ్లకు కుడిప్రక్క, ఎడమప్రక్క నీళ్లు గోడలా నిలిచాయి.
23 అప్పుడు ఫరో రథాలు, అశ్వదళాలు అన్నీ వాళ్ల వెంట సముద్రంలో ప్రవేశించాయి.
24 ఆ ఉదయం ఎత్తయిన మేఘం నుండి అగ్ని స్తంభం నుండి యెహోవా ఈజిప్టు సైన్నాన్ని చూచాడు. యెహోవా వాళ్లను ఎదుర్కొని ఓడించాడు.
25 రథచక్రాలు బిగిసిపోయి కదలడం లేదు. రథాలను అదుపుచెయ్యడం చాలా కష్టతరంగా ఉంది. “మనం ఇక్కడ్నుంచి పారిపోదాం రండి! యెహోవా మనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులకోసం యుద్ధం చేస్తున్నాడు.” అంటూ ఈజిప్టు వాళ్లు కేకలు వేసారు.
26 అప్పుడు యెహోవా మోషేతో, “నీ చేయి సముద్రం మీదికి ఎత్తు, నీళ్లు పడిపోయి ఈజిప్టు రథాలను, అశ్వదళాలను ముంచేస్తాయి.” అని చెప్పాడు.
27 కనుక తెల్లవారు ఝామున మోషే తన చేతిని సముద్రం మీదికి ఎత్తాడు. నీళ్లు యధాస్థానానికి వచ్చి పడ్డాయి. ఈజిప్టు వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈజిప్టు వాళ్లు సముద్రంలో కొట్టుకుపోయేటట్టు యెహోవా చేసాడు.
28 నీళ్లు యధాస్థానానికి మళ్లీ రావడం చేత రథాలను, అశ్వదళాలను కప్పేశాయి. ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన ఫరో సైన్యాలన్నీ నాశనం చేయబడ్డాయి. వాళ్లలో ఒక్కడూ బతకలేదు.
29 అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడినేల మీద సముద్రాన్ని దాటిపోయారు. వారి కుడి ఎడమ ప్రక్కల్లో నీళ్లు ఒక గోడలా నిలిచిపోయాయి.
30 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టువాళ్లు చేతినుండి యెహోవాయే రక్షించాడు. ఎర్రసముద్ర తీరాన ఈజిప్టువాళ్ల శవాలను ఇశ్రాయేలు ప్రజలు చూచారు.
31 యెహోవా ఈజిప్టు వాళ్లను ఓడించినప్పుడు ఆయన మహత్తర శక్తిని ఇశ్రాయేలు ప్రజలు చూశారు. అందుచేత ప్రజలు యెహోవాకు భయపడి ఆయనను ఘనపర్చారు. యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.
1 అప్పుడు మోషే, అతనితో బాటు ఇశ్రాయేలు ప్రజలూ యెహోవాకు ఈ పాట పాడటం మొదలు పెట్టారు. “యెహోవాను గూర్చి నేను గానం చేస్తాను. ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక గుర్రాలను, రౌతులను ఆయనే సముద్రంలో పడవేసాడు.
2 యెహోవా నా బలం, నన్ను రక్షించేది ఆయనే ఆయన్ను గూర్చి నేను స్తుతిగీతాలు పాడుకొంటాను. యెహోవా నా దేవుడు, ఆయన్ను నేను స్తుతిస్తాను. నా పూర్వీకుల దేవుడు యెహోవా ఆయన్ని నేను ఘనపరుస్తాను.
3 యెహోవా గొప్ప వీరుడు ఆయన పేరే యెహోవా.
4 ఫరో రథాలను అశ్వదళాలను సముద్రంలో పడవేసాడు యెహోవా ఫరో ప్రధాన అధికారులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
5 లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు.
6 “నీ కుడిచేతిలో ఆశ్చర్యం కలిగించేటంత బలం ఉంది. ప్రభూ, నీ కుడిచేయి శత్రువును పటాపంచలు చేసింది.
7 నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని నీ మహా ఘనత చేత నాశనం చేసావు గడ్డిని తగుల బెట్టినట్టు నీ కోపం వారిని నాశనం చేసింది.
8 నీవు విసరిన పెనుగాలి నీళ్లను ఉవ్వెత్తున నిలిపేసింది వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడలా అయ్యాయి సముద్రం, దాని లోపలి భాగాలవరకు గడ్డ కట్టెను.
9 శత్రువు, “నేను వాళ్లను తరిమి పట్టుకొంటాను వాళ్ల ఐశ్వర్యాలన్నీ దోచుకొంటాను నేను నా కత్తి ప్రయోగించి, వాళ్ల సర్వస్వం దోచుకొంటాను సర్వం నా కోసమే నా చేతుల్తో దోచుకొంటాను” అని అన్నాడు.
10 కానీ నీవు వాళ్లు మీదకి గాలి రేపి సముద్రంతో వాళ్లను కప్పేసావు సముద్ర అగాధంలో సీసం మునిగిపోయినట్టు వాళ్లు మునిగిపొయ్యారు.
11 “యెహోవా, నీలాంటి పరాక్రమముగల దేవుడు మరొకడు లేడు పరిశుద్ధతలో నీవు గొప్పవాడవు. స్తుతి కీర్తనలతో ఆరాధించబడుటకు యోగ్యుడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీకు సాటి వేరెవ్వరూ లేరు.
12 నీ కుడి హస్తాన్ని పైకెత్త ప్రపంచాన్నే నాశనం చేయగలవు!
13 నీవు రక్షించిన ప్రజల్ని నీ దయతో నీవు నడిపిస్తావు ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి నీ బలంతో నీవు వీళ్లను నడిపిస్తావు.
14 “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు ఎంతైనా వాళ్లు భయపడ్తారు. ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు.
15 తరువాత ఎదోము నాయకులు భయంతో వణకిపోతారు మోయాబు నాయకులు భయంతో వణకిపోతారు. కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు.
16 ఆ ప్రజలు నీ బలాన్ని చూచి భయంతో నిండిపోతారు యెహోవా ప్రజలు దాటి పొయ్యేంత వరకు ఆ ప్రజల్ని నీవు దాటించేంత వరకు వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు.
17 యెహోవా నీవు నీ సింహాసనం కోసం సిద్ధం చేసిన నీ పర్వతానికి నీ ప్రజల్ని నడిపిస్తావు ఓ ప్రభో, నీ హస్తాలతో నీ ఆలయాన్ని నిర్మించు
18 యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక!”
19 ఫరో గుర్రాలు, రౌతులు, రథాలు సముద్రంలోకి వెళ్లిపొయ్యాయి. సముద్ర జలాలతో యెహోవా వాళ్లను కప్పేసాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పొడి నేల మీద సముద్రంలో నడిచివెళ్లారు.
20 అప్పుడు అహరోను సోదరి, మహిళా ప్రవక్తి మిర్యాము తంబుర పట్టుకొంది. మిర్యాము, మిగతా స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలు పెట్టారు. మిర్యాము ఈ మాటనే మరల మరల పల్లవిగా పలికింది,
21 “ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక యెహోవాకు గానం చేయండి గుర్రాలను, దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసాడు.”
22 మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు ఏవీ దొరకలేదు.
23 మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. ఆ నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా అని పేరు.
24 ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు.
25 మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి. ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు.
26 “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.”
27 అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.
1 తర్వాత ప్రజలు ఏలీము నుండి ప్రయాణం చేసి సీనాయి ఎడారి చేరుకొన్నారు. ఈ స్థలం ఏలీముకి, సీనాయికి మధ్య ఉంది. ఈజిప్టు వదలిన తర్వాత రెండోనెల 15వ రోజున వారు ఈ స్థలానికి వచ్చారు.
2 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు.
3 “ఈజిప్టు దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో ఇక్కడే చస్తాము” అంటూ ప్రజలు మోషే అహరోనులతో చెప్పారు.
4 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, “ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు ప్రజలు చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను.
5 ఒక్క రోజుకు ఎంత భోజనం సరిపోతుందో సరిగ్గా అంతే ప్రజలు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే శుక్రవారం నాడు ప్రజలు భోజనం సిద్ధం చేసుకొనేటప్పుడు రెండు రోజులకు సరిపడే భోజనం ఉండేటట్టు వారు చూసుకోవాలి.
6 కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడని మీరు తెలుసుకొంటారు.
7 యెహోవా మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహోవాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ పాటి వారం?”
8 “మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం అంతా ప్రతి ఉదయం మీకు ఉంటుంది. నా దగ్గర, అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే.
9 ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.”
10 అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు.
11 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
12 “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.” ‘
13 ఆ రాత్రి వారి బస అంతటా పూరీళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది.
14 సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది.
15 ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది.
16 ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబతున్నాడు.”
17 కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు.
18 ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు.
19 “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు.
20 కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది.
21 ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది.
22 శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు.
23 “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో.
24 కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు.
25 శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి.
26 ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”
27 శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు.
28 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు?”
29 చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.”
30 కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.
31 ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా” అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది.
32 అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని’ యెహోవా చెప్పాడు.”
33 కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు”
34 మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె ముందర పెట్టాడు అహరోను.
35 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు
36 (మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం).
1 ఇశ్రాయేలు ప్రజలంతా కలసి సీను అరణ్యమునుండి ప్రయాణమయ్యారు. యెహోవా ఆజ్ఞాపించినట్లెల్లా ఒక తావు నుండి మరో తావుకు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలు రెఫిదీముకు ప్రయాణం చేసి అక్కడ బసచేసారు. అక్కడ ప్రజలు తాగేందుకు నీళ్లు లేవు.
2 కనుక ప్రజలు మోషే మీదికి లేచి, ఆయనతో వాదించటం మొదలు పెట్టారు. “తాగేందుకు నీళ్లు ఇమ్మని” ప్రజలు మోషేను అడిగారు. అయితే మోషే, “మీరెందుకు నామీదికి ఇలా లేచారు? మీరు యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” (యెహోవా మనతో లేడని మీరనుకొంటున్నారా?) అని వారితో అన్నాడు.
3 కాని ప్రజలు మాత్రం నీళ్ల కోసం చాల దాహంగా ఉన్నారు. అందుచేత వాళ్లు మోషేకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు, “అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అన్నారు ప్రజలు.
4 కనుక మోషే, “ఈ ప్రజల్ని నేనేమి చేయాలి? నన్ను చంపెయ్యటానకి వాళ్లు సిద్ధంగా ఉన్నారు” అంటూ యెహోవాకు మొరబెట్టాడు.
5 మోషేతో యెహోవా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల ముందుకు వెళ్లు. ప్రజల పెద్దలలో (నాయకులు) కొందర్ని నీ వెంట తీసుకొని వెళ్లు. నీ చేతి కర్రను తీసుకొని వెళ్లు. నీవు నైలునదిని కొట్టిన కర్ర యిది.
6 హోరేబులో (సీనాయి పర్వతం) నీ యెదుట ఒక బండమీద నేను నిలబడతాను. కర్రతో ఆ బండను కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి. అప్పుడు ప్రజలు తాగవచ్చు.” మోషే ఈ పనులు చేసాడు, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) అది చూచారు.
7 మెరీబా అని మస్సా అని ఆ స్థలానికి మోషే పేరు పెట్టాడు. ఎందుచేతనంటే, ప్రజలు తన మీదికి లేచి యెహోవాను పరీక్షించిన స్థలం ఇది. యెహోవా వారితో ఉన్నాడో లేదో తెల్సుకోవాలని ప్రజలు కోరారు.
8 రెఫిదీము వద్ద అమాలేకీ ప్రజలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసారు.
9 కనుక, “కొందరు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకొని రేపు వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. నేనేమో కొండ శిఖరం మీద నిన్ను గమనిస్తూంటాను. దేవుడు నాకు ఇచ్చిన కర్రను నేను పట్టుకొని ఉంటాను,” అని యెహోషువాతో మోషే చెప్పాడు.
10 మోషే మాటకు విధేయుడై యెహోవాషువ మర్నాడు అమాలేకీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మోషే, అహరోను, హూరు అనువారు కొండ శిఖరం మీదికి వెళ్లారు.
11 మోషే తన చేతి కర్రను ఎప్పుడు పైకి ఎత్తితే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం గెలుస్తున్నారు. అయితే మోషే తన చేయి కిందికి దించగానే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోవడం మొదలవుతుంది.
12 కొంచెం సేపయ్యాక, మోషే చేతులు అలసి పోయి (మోషే చేతుల్ని అలానే పైకి ఎత్తి ఉంచే మార్గం చూడాలను కొన్నారు మోషేతో ఉన్న మనుష్యులు) అందుచేత వాళ్లు ఒక పెద్ద బండ తెచ్చి మోషే కూర్చొనేందుకు వేసారు. అప్పుడు అహరోను మోషే చేతుల్ని పైకి ఎత్తి పట్టి ఉంచాడు. మోషేకు ఒకపక్క అహరోను, మరోపక్క హూరు ఉన్నారు. సూర్యుడు అస్తమించే వరకు వారు ఆయన చేతులను అలాగే పట్టి ఉంచారు.
13 కనుక యెహోషువ (అతని మనుష్యులు) అమాలేకీయులను ఆ యుద్ధంలో ఓడించారు.
14 అప్పుడు యెహోవా, “ఈ యుద్ధాన్ని గురించి వ్రాసి ఉంచు. ఇక్కడ ఏమి జరిగిందో అది ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేటట్టు ఈ సంగతులన్నీ ఒక గ్రంథంలో వ్రాసి ఉంచు. అమాలేకీయులను ఈ భూమి మీద నుండి పూర్తిగ నాశనం చేసేస్తానని యెహోవాషువతో తప్పక చెప్పు” అని మోషేతో అన్నాడు.
15 తర్వాత మోషే ఒక బలిపీఠం నిర్మించాడు, “యెహోవా నా ధ్వజం”. అని మోషే దానికి పేరు పెట్టాడు.
16 “యెహోవా సింహాసనం వైపు నేను నా చేతులు ఎత్తాను. కనుక తను ఎప్పుడూ చేసినట్టే, యెహోవా అమాలేకీయులతో పోరాడాడు,” అన్నాడు మోషే.
1 మోషే మామ యిత్రో, మిద్యానులో యాజకుడు. మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేసిన ఎన్నో విధానాల గూర్చి యిత్రో విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు నడిపించిన విషయం యిత్రో విన్నాడు.
2 దేవుని పర్వతం దగ్గర మోషే ఉన్నప్పుడు మోషే భార్య సిప్పోరాను వెంటబెట్టుకొని, యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. (సిప్పోరాను మోషే ఇంటికి పంపించినందు చేత ఆమె మోషే వద్ద లేదు)
3 మోషే ఇద్దరు కుమారులను కూడ యిత్రో తన వెంట తీసుకొని వచ్చాడు. “ఒక దేశంలో నేను పరాయివాణ్ణి అని మోషే చెప్పాడు గనుక. మొదటి కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు.” “నా తండ్రి దేవుడు నాకు సహాయం చేసాడు. ఈజిప్టు రాజు బారినుండి నన్ను రక్షించాడు” అని మోషే అన్నాడు గనుక.
4 మరో కుమారునికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు.
5 దేవుని పర్వతం దగ్గర ఎడారిలో మోషే బస చేస్తున్నప్పుడు యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. మోషే భార్య, అతని ఇద్దరు కుమారులు యిత్రోతోనే ఉన్నారు.
6 (మోషేకు యిత్రో ఒక సందేశం పంపించాడు), “నేను నీ మామ యిత్రోను. నీ భార్యను, నీ ఇద్దరు కుమారులను నేను నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను,” అన్నాడు యిత్రో.
7 కనుక మోషే తన మామగార్ని కలుసు కొనేందుకు బయటకు వెళ్లాడు. మోషే అతని ఎదుట వంగి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. వాళ్లిద్దరూ వారి వారి క్షేమాన్ని గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తర్వాత ఇంకా మాట్లాడుకొనేందుకు వాళ్లిద్దరూ మోషే గుడారంలోకి వెళ్లారు.
8 ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసినదంతా మోషే యిత్రోకు చెప్పాడు. ఫరోకు, ఈజిప్టు ప్రజలకు యెహోవా చేసిన విషయాల్ని గూర్చి మోషే అతనితో చెప్పాడు. దారిలో వారికి కలిగిన సమస్యలన్నిటిని గూర్చీ మోషే చెప్పాడు. కష్టం వచ్చినప్పుడల్లా ఆ ప్రజల్ని యెహోవా ఏ విధంగా రక్షించిందీ, మోషే తన మామగారితో చెప్పాడు.
9 ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన మంచి పనులన్నింటిని గూర్చి విన్నప్పుడు యిత్రో చాలా సంతోషించాడు. ఈజిప్టు వాళ్ల నుండి, ఇశ్రాయేలు ప్రజలను యెహోవా విడుదల చేసినందుకు యిత్రో సంతోషించాడు.
10 యిత్రో అన్నాడు: “యెహోవాను స్తుతించండి. ఈజిప్టు మనుష్యులనుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు. ఫరో బారినుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు.
11 ఈజిప్టు వాళ్లంటె నీ ప్రజలు గొప్ప వాళ్లుగా చేయబడిన విధానాన్ని బట్టి దేవుళ్లందరికంటె యెహోవా గొప్ప వాడని ఇప్పుడు నాకు తెలిసింది.”
12 అప్పుడు యిత్రో బలి అర్పణలు, కానుకలు యెహోవాకు సమర్పించాడు. తర్వాత అహరోను, అశ్రాయేలు పెద్దలు (నాయకులు) మోషే మామగారైన యిత్రోతో కలిసి భోజనం చేసేందుకు వచ్చారు. దేవుడ్ని ఆరాధించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిగా వారు ఇలా చేసారు.
13 మర్నాడు ప్రజలకు న్యాయం తీర్చాల్సిన ప్రత్యేక పని మోషేకు ఉంది. (అక్కడ చాలామంది ప్రజలున్నారు) అందుచేత ప్రజలు రోజంతా మోషే ఎదుట నిలబడాల్సి వచ్చింది.
14 ప్రజలకు మోషే న్యాయం తీర్చడం యిత్రో చూసాడు, “నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుచేత నీవు ఒక్కడివే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు రోజంతా నీ దగ్గరకు రావడం ఏమిటి?” అన్నాడు అతను.
15 అప్పుడు మోషే తన మామగారితో చెప్పాడు: “ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్ణయం ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేందుకు నా దగ్గరకు వస్తారు.
16 ఎవరిది సరిగ్గా ఉందో నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుడి చట్టాన్ని, ఆయన ప్రబోధాల్ని నేను ప్రజలకు ప్రబోధిస్తాను.”
17 అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “నీవు చేస్తోన్న ఈ పని బాగుండలేదు.
18 నీవు ఒక్కడివీ చెయ్యాలంటే, ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు అలసిపోతావు. ఇది ప్రజలు కూడ అలసిపొయ్యేటట్టు చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివీ చేయలేవు.
19 నీకు నేను సలహా ఇస్తాను, ఏమి చేయాలో నీకు చెబతాను, దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. (నీవు చేయాల్సింది ఇది) ప్రజల సమస్యలను గూర్చి నీవు వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు దేవునితో చెబుతూ ఉండాల్సిందే.
20 దేవుడి కట్టడలను, విధులను నీవు ప్రజలకు బోధించాలి. కట్టడలను ఉల్లంఘించొద్దని ప్రజలను హెచ్చరించు. సరైన జీవిత విధానం ఏమిటో ప్రజలకు చెప్పు. వాళ్లేమి చేయాలో వాళ్లకు చెప్పు.”
21 అయితే, “ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బుకోసం నిర్ణయాలు మార్చుకోనటువంటి మనుష్యుల్ని ఏర్పాటు చేసుకో.” “వీళ్లను ప్రజల మీద పరిపాలకులుగా చేయి. 1000 మంది 100 మందికి, 50 మందికి, చివరకి 10 మందికి పైన పరిపాలకులు ఉండాలి.
22 ఈ పరిపాలకుల్ని ప్రజలకు న్యాయం తీర్చనివ్వు. ముఖ్యమైన వ్యాజ్యము ఏదైనా వుంటే అప్పుడు నిర్ణయంకోసం వాళ్లు నీ దగ్గరకు రావచ్చు. అయితే మిగతా వ్యాజ్యాలను వాళ్లే నిర్ణయించవచ్చు. ఈ విధంగా నీకు తేలిక అవుతుంది. పైగా ఈ మనుష్యులు నీ పనిని నీతోబాటు పంచుకొంటారు.
23 నీవు ఈ నీ పనులు చేస్తే, యెహోవాకు ఇష్టమైతే, నీ పని నీవు కొనసాగించటానికి నీకు చేతనవుతుంది. అదే సమయంలో ప్రజలంతా వారి సమస్యలు పరిష్కారమై ఇంటికి వెళ్లగల్గుతారు.”
24 యిత్రో తనకు చెప్పినట్టు మోషే చేసాడు.
25 ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని మోషే ఏర్పాటు చేసాడు. మోషే వాళ్లను ప్రజలమీద నాయకులుగా చేసాడు. 1000 మంది ప్రజల మీద 100 మంది ప్రజలమీద 50 మంది ప్రజలమీద 10 మంది ప్రజలమీద పరిపాలకులు ఉన్నారు.
26 ఈ పరిపాలకులే ప్రజలకు న్యాయమూర్తులు. ఎప్పుడైనా సరే ప్రజలు తమ వాదాలను ఈ పరిపాలకుల దగ్గరకు తీసుకురావచ్చు. ప్రాముఖ్యమైన వ్యాఖ్యాలను మాత్రమే మోషే పరిష్కారం చేయాల్సి ఉంటుంది.
27 కొద్దికాలం తర్వాత మోషే తన మామ యిత్రోకు వీడ్కోలు చెప్పాడు. యిత్రో తన స్వగృహానికి వెళ్లిపోయాడు.
1 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణమైన మూడో నెలలో వారు సీనాయి అరణ్యము చేరుకొన్నారు.
2 ప్రజలు రెఫిదీము విడిచి, సీనాయి అరణ్యమునకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు బసచేసారు.
3 అప్పుడు మోషే పర్వతం మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు:
4 ‘నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలె నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను.
5 కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే, మీరు వా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు.
6 మీరు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు.’ మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.”
7 కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు.
8 ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు. తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు.
9 “దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు. అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.
10 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉదుక్కొని
11 మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు.
12 [This verse may not be a part of this translation]
13 [This verse may not be a part of this translation]
14 కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదుక్కొన్నారు.
15 అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.
16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు.
17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు.
18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది.
19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.
20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.
21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి, ప్రజలు నాకు సమీపంగా రాకూడదని, నావైపు చూడకూడదని వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో చాల మంది చస్తారు.
22 నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” అని చెప్పాడు.
23 కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.
24 యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతణ్ణి నీతోపాటు తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” అన్నాడు,
25 మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ సంగతులు వారితో చెప్పాడు.
1 అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:
2 “నేను మీ దేవుణ్ణి. యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి)
3 “నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు.
4 “విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు.
5 ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను. ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను.
6 అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను.
7 “మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.”
8 “సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు.
9 వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు.
10 అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను.
11 ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు.”
12 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.”
13 “నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.”
14 “వ్యభిచార పాపం నీవు చేయకూడదు.”
15 “నీవు దొంగతనం చేయకూడదు.”
16 “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు.”
17 “ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”
18 ఇంతసేపూ లోయలో ప్రజలు కొండమీది ఉరుము శబ్దం వింటూనే ఉన్నారు. మెరుపులు చూస్తునే ఉన్నారు. కొండమీద నుండి పొగ లేవడం వారు చూసారు. ప్రజలు భయపడి వణకిపోయారు. వాళ్లు కొండకు దూరంగా నిలబడి గమనించారు.
19 అప్పుడు ప్రజలు మోషేతో “నీవు మాతో మాట్లాడాలంటే మేము వింటాం. కాని దేవుణ్ణి మాత్రం మాతో మాట్లాడనివ్వకు. అలా జరిగితే మేము చస్తాము,” అని చెప్పారు.
20 అప్పుడు మోషే, “తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేయడానికే, యెహోవా వచ్చాడు. మీరు పాపం చేయకుండా ఉండేలా మీరు ఆయనను గౌరవించాలని ఆయన కోరుతున్నాడు” అని ప్రజలకు చెప్పాడు.
21 దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిలబడ్డారు.
22 అప్పుడు ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని యెహోవా మోషేతో చెప్పాడు. “ఆకాశం నుండి నేను మీతో మాట్లాడటం మీరు చూసారు.
23 కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. ఈ అబద్ధపు దేవుళ్లను మీరు చేసుకోకూడదు.
24 “నా కోసం ఒక ప్రత్యేక బలిపీఠం చేయండి. ఈ బలిపీఠం చేయడానికి మట్టి ఉపయోగించండి. ఈ బలిపీఠం మీద దహనబలులు, సమాధాన బలులు, బలిగా నాకు అర్పితం చేయండి. ఇలా చేయటానికి మీ గొర్రెల్ని, పశువుల్ని వాడుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను మీకు చెప్పే ప్రతి చోటా మీరు యిలా చేయాలి. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
25 మీరు బండలతో బలిపీఠం కడితే, చెక్కబడిన బండలతో దానిని కట్టవద్దు. ఎందుకంటే, పనిముట్లతో మీరు పని చేసినప్పుడు మీరు దానిని అపవిత్రం చేస్తారు. బండల మీద మీరు ఏవైనా పని ముట్లు ప్రయోగిస్తే, ఆ బలిపీఠాన్ని నేను అంగీకరించను.
26 బలిపీఠం మీదికి వెళ్లేందుకు మీరు మెట్లు చేయకూడదు. అలా మెట్లు ఉంటే, ప్రజలు బలిపీఠం వైపుకి చూసినప్పుడు మీ దిగంబరత్వం అంతా వారికి కనబడుతుంది.”
1 (అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు), “ఇవి నీవు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు:
2 “హీబ్రూ బానిసను కనుక నీవు కొంటే, ఆ బానిస ఆరు సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. ఆరు సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడవుతాడు. వాడు చెల్లించాల్సింది ఏమీ ఉండదు.
3 ఆ వ్యక్తి నీకు బానిస అయినప్పుడు పెళ్లిగాకుండా ఉంటే అతడు స్వతంత్రుడయినప్పుడు భార్యలేని వానిగానే నీ దగ్గర్నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయినప్పుడు పెళ్లయిన వాడైతే, అతడు విడదల చేయబడినప్పుడు తన భార్యను తనతో ఉంచుకొంటాడు.
4 బానిస బ్రహ్మచారి అయితే యజమాని అతనికి ఒక భార్యను ఇవ్వవచ్చు. ఆ భార్యకు కొడుకులు, కూతుళ్లు పుడితే, ఆ స్త్రీ, ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. ఆ బానిస సేవాకాలం తీరిపోతే, అప్పుడు అతడు విడుదల చేయబడతాడు.”
5 “అయితే ఒక వేళ ఆ యజమాని దగ్గరే ఉండిపోవాలని బానిస తీర్మానించుకొంటే, ‘నా యజమాని అంటే నాకు ప్రేమ. నా భార్య పిల్లల మీద నాకు ప్రేమ కనుక నాకు స్వతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండిపోతాను’ అని అతడు తప్పక చెప్పాలి.
6 ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకరావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.”
7 “ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మి వేయాలని నిర్ణయించవచ్చు. ఇలా కనుక జరిగితే, ఆమెను విడుదల చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బానిసలను విడుదల చేసే నియమాల్లాంటివి కావు.
8 ఆ స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకొంటానని ఆ యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు ఆ స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు.
9 ఆ యజమాని తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే, అప్పుడు ఆమె బానిసగా ఎంచబడదు. ఒక కూతురిగా ఆమె చూడబడుతుంది.”
10 “ఒకవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే, మొదటి స్త్రీకి భోజనం, బట్ట, అతడు తక్కువ చేయకూడదు. ఆమెకు ఏవేవి అనుభవించటానికి పెళ్లిద్వారా హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు ఇస్తూనే ఉండాలి.
11 ఈ మూడింటినీ మగవాడు ఆమె కోసం చేయాలి. అతడు చేయకపోతే, ఆమెకు ఏ ఖర్చూ లేకుండానే ఆమె విడుదల చేయబడుతుంది. ఆమె అతడకి డబ్బు ఏమీ రుణపడి ఉండదు.”
12 “ఒకడు ఎవరినైనా కొట్టి చంపితే, వాడిని కూడ చంపెయ్యాలి.
13 అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు.
14 ఒకడు మరొకని మీద కోపంతో, లేక ద్వేషంతో చంపడానికి పధకం వేస్తే, అలాంటి హంతకుడు శిక్షించబడాలి. వానిని నా బలిపీఠం నుండి దూరంగా తీసుక పోయి చంపేయాలి.”
15 “ఎవడైనా తన తండ్రిని గాని, తల్లినిగాని కొడితే వానిని చర పేయ్యాలి.”
16 “బానిసగా అమ్మేందుకు, లేక తనకు బానిసగా ఉండేందుకు ఎవరైనా మరొకడ్ని ఎత్తుకుపోతే, ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
17 “ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”
18 “ఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని, వారిలో ఒకడు రాతితో గాని, పిడికిలితో గాని మరొకనిని కొడితే, (అలాంటివాడిని ఎలా శిక్షిస్తావు?) దెబ్బ తగిలిన వాడు చావకపోతే, అతడ్ని దెబ్బకొట్టి వాణ్ణి చంపకూడదు.
19 అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్లపాటు పడక మీద ఉండాల్సివస్తే, అతణ్ణి కొట్టినవాడే అతణ్ణి పోషించాలి. అతణ్ణి కొట్టినవాడే అతనికి కలిగిన సమయం నష్టానికి పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యేవరకు ఆ వ్యక్తి అతణ్ణి పోషించాలి.
20 “కొన్నిసార్లు ప్రజలు తమ ఆడ లేక మగ బానిసలను కొడతారు. అలా కొట్టినతర్వాత బానిస చస్తే, హంతకుడు శిక్షించబడాలి.
21 అయితే బానిస చావకుండా, కొన్ని రొజుల తర్వాత బాగైతే, అప్పుడు ఆ వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానిసకోసం యజమాని డబ్బు చెల్లించాడు గనుక బానిస అతనికే చెందుతాడు.”
22 “ఇద్దరు మగవాళ్లు పోట్లాడుకొంటునప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ తగిలించినవాడు డబ్బు చెల్లించాలి. అతడు ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు.
23 అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ‘ ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి.
24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం,
25 వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”
26 “ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే.
27 ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,
28 “ఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు.
29 అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి.
30 అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.
31 “ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి.
32 ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది.”
33 “ఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు.
34 ఆ గుంట స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అనుమతి ఇవ్వాలి.
35 “ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసుకోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం సగం వస్తుంది.
36 అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరుగనిచ్చినందుకు అతడు నేరస్థుడు, అతడు ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.”
1 “ఒక ఎద్దును లేక గొర్రెను దొంగతనం చేసిన వాడిని నీవు ఎలా శిక్షిస్తావు? వాడు ఆ జంతువును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి ఇవ్వలేడు. కనుక వాడు దొంగిలించిన ఒక్క ఎద్దుకు బదులు అయిదు ఎడ్ల నివ్వాలి. లేక వాడు దొంగతనం చేసిన ఒక్క గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి. దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి.
2 [This verse may not be a part of this translation]
3 [This verse may not be a part of this translation]
4 “దొంగ రాత్రివేళ ఒక ఇంటికి కన్నము వేయటానికి ప్రయత్నిస్తూండగా చంపబడితే, వాణ్ణి చంపిన నేరం ఎవ్వరి మీదా ఉండదు. అయితే ఇది పగలు జరిగితే వాణ్ణి చంపిన వాడు నేరస్థుడే (దోషి).”
5 “ఒకడు తన పొలంలో లేక ద్రాక్షాతోటలో మంట రాజబెడితే, ఆ మంట పాకిపోయి, పక్కవాడి పొలాన్ని లేక ద్రాక్షా తోటను కాల్చివేస్తే అతడు తన శ్రేష్ఠమైన పంటను తన పొరుగువాడికి నష్టపరిహారంగా ఇవ్వాలి.”
6 “ఒకడు తన పొలంలో ముళ్ల పొదలను తగుల బెట్టడానికి మంట పెట్టవచ్చును. కానీ ఆ మంట పెద్దదై పొరుగువాడి పొలాన్ని లేక పొరుగువాడి పొలంలో పండుతున్న ధాన్యాన్ని కాల్చివేస్తే, అప్పుడు ఆ మంటను రాజబెట్టిన వ్యక్తి తాను కాల్చివేసిన వాటికి బదులుగా డబ్బు చెల్లించాలి.”
7 “ఒకడు తన డబ్బును లేక ఇంకేవైనా వస్తువుల్ని పొరుగువాని ఇంట్లో దాచి పెట్టమని తన పొరుగువాణ్ణి అడగవచ్చు. ఆ పొరుగువాడి ఇంట్లోనుంచి ఆ డబ్బు లేక వస్తువులు దొంగిలించబడితే, నీవేం చేయాలి? దొంగను పట్టుకొనేందుకు నీవు ప్రయత్నం చేయాలి. నీవు ఆ దొంగను పట్టుకొంటే, అప్పుడు వాడు ఆ వస్తువుల విలువకు రెండంతలు చెల్లించాలి.
8 కానీ ఆ దొంగను నీవు పట్టుకోలేక పోతే, ఆ ఇంటి యజమాని నేరస్థుడైతే, అప్పుడు దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటకి వెళ్లాలి. అతడే దొంగిలించి ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు.”
9 “పోయిన ఒక ఎద్దు లేక గాడిద, గొర్రె లేక వస్త్రం లేక ఇంక దేన్నిగూర్చిగానీ ఇద్దరు వ్యక్తులకు ఒడంబడిక కుదరకపోతే, అప్పుడు నీవేం చేయాలి? ‘ఇది నాది’ అని ఒకడంటే, లేదు, ‘ఇది నాది’ అని ఇంకొకడు అంటాడు. ఆ ఇద్దరు మనుష్యులు దేవుని ఎదుటికి వెళ్లాలి. నేరస్థుడు ఎవరో దేవుడే నిర్ణయిస్తాడు. తప్పుచేసిన వాడు ఆ వస్తువు విలువకు రెండంతలు అవతలి వానికి చెల్లించాలి.”
10 “తన జంతువు విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగు వాణ్ణి అడగవచ్చు. ఈ జంతువు గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు. అయితే ఆ జంతువు చనిపోయినా, ఆ జంతువుకు దెబ్బ తగిలినా లేక ఎవరూ చూడకుండా ఆ జంతువును ఇంకెవరైనా తీసుకొనిపోయినా నీవేం చేయాలి?
11 ఆ జంతువును తాను దొంగిలించలేదని ఆ పొరుగువాడు వివరించి చెప్పాలి. ఇదే కనుక సత్యం అయితే, తాను దొంగతనం చేయలేదని ఆ పొరుగువాడు యెహవాకు ప్రమాణం చేయాలి. జంతువు యజమాని ఈ ప్రమాణాన్ని అంగీకరించాలి. ఆ పొరుగువాడు జంతువుకోసం దాని యజమానికి ఏమీ చెల్లించనక్కర్లేదు.
12 అయితే, ఆ పొరుగు వాడు జంతువును దొంగిలిస్తే, అప్పుడు ఆ జంతువు కోసం దాని యజమానికి అతడు విలువ చెల్లించాలి.
13 ఒకవేళ అడవి మృగాలు ఆ జంతువును చంపేస్తే, ఆ పొరుగువాడు దాని శవాన్ని రుజువుగా తీసుకరావాలి. చంపబడ్డ జంతువు కోసం దాని యజమానికి ఆ పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు.
14 ఒకడు తన పొరుగు వాని దగ్గర దేన్నయినా బదులు తీసుకొంటే దానికి అతడే బాధ్యుడు. ఒకవేళ ఒక జంతువుకు దెబ్బ తగిలినా లేక ఆ జంతువు చచ్చినా, అప్పుడు ఆ పొరుగువాడు దాని యజమానికి వెల చెల్లించాలి. యజమాని స్వయంగా అక్కడ లేడు గనుక ఆ పొరుగువాడే దానికి బాధ్యుడు.
15 అయితే దాని యజమాని ఆ జంతువుతో కూడా ఉంటే, పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు. లేక, ఆ పొరుగువాడు ఆ జంతువుతో పని చేయించుకొనేందుకుగాను డబ్బు చెల్లిస్తోంటే, ఆ జంతువుకు దెబ్బ తగిలినా, అది చచ్చినా, అతడు ఏమీ చెల్లించనక్కర్లేదు. ఆ జంతువును వాడుకొనేందుకు అతడు చెల్లించిన డబ్బే సరిపోతుంది.”
16 “పెళ్లికాని పవిత్రమైన ఒక పడుచుదానితే ఒకవేళ ఒకడికి లైంగిక సంబంధం ఉంటే, అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆమె తండ్రికి అతడు నిండుగా కట్నం యివ్వాలి.
17 అతణ్ణి పెళ్లి చేసుకొనేందుకు ఆమె తండ్రి అంగీకరించకపోయినా, అతడు ఆ డబ్బు చెల్లించాల్సిందే. ఆమె కోసం పూర్తి మొత్తాన్ని అతడు చెల్లించాలి.”
18 “నీవు ఏ స్త్రీనీ కూడా మాయపనులు చెయ్యనివ్వకూడదు. ఒకవేళ ఆమె చేస్తే, అలాంటి దాన్ని నీవు బతకనివ్వకూడదు.”
19 “నీవు ఎవ్వర్నీ జంతు సంయోగం చెయ్య నియ్యాకూడదు. ఇలా కనుక జరిగితే, ఆ వ్యక్తిని చంపేయాలి.
20 “ఎవడైనా సరే దేవుడు కాని వాడికి బలి అర్పిస్తే, అలాంటివాడ్ని నాశనం చేయాలి. యెహోవా దేవుడు ఒక్కడికే నీవు బలులు అర్పించాలి.”
21 “జ్ఞాపకం ఉంచుకో ఇదివరకు మీరు ఈజిప్టు దేశంలో పరాయివాళ్లు. కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవర్నీ మీరు మోసం చేయకూడదు. కొట్టగూడదు.”
22 “విధవరాండ్రకు, అనాధలకు మీరు ఎన్నడూ ఎట్లాంటి కీడు చేయకూడదు.
23 ఆ విధవరాండ్రకు లేక అనాధలకు మీరు ఏదైనా కీడు చేస్తే అది నాకు తెలుస్తుంది. వారి శ్రమను గూర్చి నేను వింటాను.
24 అంతేకాదు, నాకు చాల కోపం వస్తుంది. కత్తితో నేను మిమ్మల్ని చంపేస్తాను. అప్పుడు మీ భార్యలు విధవరాండ్రయి పోతారు. మీ పిల్లలు అనాధలు అయిపోతారు.”
25 “నా ప్రజల్లో ఒకరు పేదవారైతే, నీవు వానికి డబ్బు అప్పిస్తే, ఆ డబ్బుకు నీవు అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఆ డబ్బు త్వరగా తిరిగి ఇచ్చి వేయమని నీవు అతణ్ణి తొందర చేయకూడదు:
26 అతడు నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చును. కాని సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి ఇచ్చివేయాలి.
27 ఒకవేళ ఆ వ్యక్తికి ఆ అంగీ లేకపోతే, తన శరీరాన్ని కప్పుకొనేందుకు అతనికి ఇంకేమీ లేకపోవచ్చును. అతను నిద్రపోయినప్పుడు చల్లబడిపోతాడు. మరి అతడు నాకు మొరబెడితే, అప్పుడు నేను అతని మొర వింటాను. నేను దయగలవాణ్ణి కనుక నేను వింటాను.”
28 “నీ దేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు దూషించగూడదు.”
29 “కోత కాలంలో నీ మొదటి గింజల్ని, నీ ఫలాల్లో మొదటి రసాన్ని నీవు నాకు ఇవ్వాలి. సంవత్సరాంతం వరకు వేచి ఉండొద్దు. “నీ పెద్దకుమారుల్ని నాకు ఇవ్వు.
30 అలాగే నీ ఆవుల్లో, గొర్రెల్లో, మొదట పుట్టిన వాటిని నాకు ఇవ్వు. అవి ఏడు రోజులు వాటి తల్లితో ఉండవచ్చు. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి.
31 మీరు నా ప్రత్యేక ప్రజలు. కనుక అడవి మృగాలు చంపిన ఏదో ఒకదాని మాంసం మీరు తినవద్దు. చచ్చిన ఆ జంతువులను కుక్కల్ని తిననివ్వండి.”
1 “ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు.
2 “మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నువ్వు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తోంటే, నువ్వు వారితో కలువ వద్దు. నువ్వు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నువ్వు చెయ్యాలి.
3 “ఒక పేదవానికి తీర్పు జరుగుతోంటే, కొన్నిసార్లు అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బలపరుస్తారు. నువ్వు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా ఉంటేనే బలపర్చు.)
4 “తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి. ఆ యజమాని నీకు శత్రువైనా సరే, నీవు ఇలా చేయాల్సిందే.
5 మోయలేనంత భారం ఉండడం చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు దానికి సహాయం చేయాలి.
6 “ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయ నివ్వకూడదు నీవు. ఇతరులు ఎవరికైనా తీర్చబడినట్టే తీర్పు తీర్చాలి.
7 “ఏదైనా విషయంలో ఒకడు నేరస్థుడు అని నీవు చెబితే, నీవు చాల జాగ్రత్తగా ఉండాలి. ఒకడి మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్దోషియైన ఒకడ్ని తాను చేయని పనికి శిక్షగా ఎన్నడూ మరణించనివ్వవద్దు. ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, ఆ మనిషిని నేను క్షమించను.
8 ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది.
9 “విదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి.” (ఒకడు తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.)
10 “విత్తనాలు చల్లి పంటకోసి, ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగుచేయండి.
11 అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి. (ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి) మీ పొలాల్లో ఏమీ నాటవద్దు. ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే, వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్షాతోటలు, ఒలీవ మొక్కలు, తోటల విషయంలో కూడ మీరు అలాగే చేయాలి.
12 “ఆరు రోజులు పని చేయండి. ఏడోరోజున విశ్రాంతి! మీ బానిసలు, ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి, మరియు విరామం లభిస్తుంది. మీ ఎడ్లు, మీ గాడిదలకు కూడ విశ్రాంతి దొరుకుతుంది.
13 “ఈ ఆజ్ఞలన్నింటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెల్సుకోండి. వేరే దేవుళ్లను పూజించకండి. చివరకి వాళ్ల పేర్లు కూడా మీరు పలుకగూడదు.
14 “ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి.
15 మొదటి పండుగ పులియని రొట్టెల విందు. ఇది నేను మీకు ఆజ్ఞాపించినట్టే ఉంటుంది. ఈ సమయంలో పులియజేసే పదార్థం వినియోగించ కుండా చేయబడ్డ రొట్టెలు మీరు తింటారు. ఇలా ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. అబీబు మాసంలో మీరు దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన సమయం యిదే. ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఒక బలి అర్పణ నాకు తీసుకురావాలి.
16 “రెండోది పెంతుకోస్తు పండగ. ఈ పండుగ వేసవి పూర్వార్ధంలో అంటే మీ పొలాల్లో మీరు నాట్లు వేసిన పంటల కోత మొదలుబెట్టే సమయంలో ఉంటుంది. మూడోది ఆశ్రయాల పండగ. “ఇది ఆకురాలు కాలంలో ఉంటుంది. ఇది మీ పొలాల్లో పంటలన్నీ కూర్చుకొనే సమయంలో ఉంటుంది.
17 “కనుక యెహోవా ప్రభువుతో ఉండేందుకు సంవత్సరానికి మూడుసార్లు పురుషులంతా ఒక ప్రత్యేక స్థలానికి వస్తారు.
18 “నీవు ఒక జంతువును చంపి దాని రక్తం బలిగా అర్పించేటప్పుడు, పులియజేసే పదార్థంతో చేయబడ్డ రొట్టెలు నీవు అర్పించకూడదు. ఈ బలి అర్పణలోని మాంసం మీరు తినేటప్పుడు ఆ మాంసం అంతా ఒక్క రోజులోనే తినెయ్యాలి. మాంసంలో ఏమీ మర్నాటికి మిగల్చకూడదు.
19 “మీరు మీ పంట కూర్చుకొనే కోత కాలంలో మీరు కోసే ప్రతి దానిలో మొదటి భాగం మీ యెహోవా దేవుని ఆలయానికి తీసుకురావాలి. “దాని తల్లి పాలతో ఉడకబెట్టబడిన మేకపిల్ల మాంసాన్ని మీరు తినకూడదు.”
20 దేవుడు యిలా చెప్పాడు: “మీకు ముందర ఒక దేవదూతను నేను పంపుతున్నాను. మీ కోసం నేను సిద్ధం చేసిన చోటుకి ఈ దేవదూత మిమ్మల్ని నడిపించటం జరుగుతుంది.
21 ఈ దేవదూతకు విధేయులుగా వెంబడించండి. ఆయన మీద తిరుగుబాటు చేయవద్దు. ఆయన విషయంలో మీరు చేసే తప్పిదాలను ఈ దేవదూత క్షమించడు. ఆయనలో నా శక్తి ఉంది.
22 ఆయన చెప్పే ప్రతి దానికీ మీరు లోబడాలి. నేను మీతో చెప్పే ప్రతీదీ మీరు చేయాలి. మీ శత్రువులందరికీ నేను వ్యతిరేకంగా ఉంటాను. మీకు వ్యతిరేకంగా ఉండే ప్రతి వ్యక్తికి నేను విరోధినే.”
23 దేవుడు చెప్పాడు: “ఈ దేశంలోనుంచి నా దూత మిమ్మల్ని నడిపిస్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వేర్వేరు ప్రజల మీదికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే వీళ్లందర్నీ నేను ఓడిస్తాను.”
24 “వాళ్ల దేవుళ్లను పూజించవద్దు. ఆ దేవుళ్లకు ఎన్నడూ సాష్టాంగపడవద్దు. వాళ్ల జీవిత విధానంలో మీరు ఎన్నడూ జీవించకూడదు. వాళ్ల విగ్రహాల్ని మీరు నాశనం చేయాలి. వాళ్ల దేవుళ్లను వాళ్లు జ్ఞాపకం చేసుకొనేందుకు వాళ్లకు తోడ్పడే వాటన్నిటినీ మీరు విరుగగొట్టాలి.
25 మీ యెహోవా దేవుణ్ణి మీరు సేవించాలి. మీరు ఇలా చేస్తే, భోజన పానీయాలు సమృద్ధిగా ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సర్వరోగాల్నీ మీలోనుండి తొలగించి వేస్తాను.
26 మీ స్త్రీలంతా పిల్లల్ని కనగల్గుతారు. వారి శిశువుల్లో ఏ ఒక్కరూ పుట్టుకలో చావరు. మిమ్మల్ని అందరినీ సుదీర్ఘ ఆయుష్షుతో బ్రతకనిస్తాను.”
27 “మీరు మీ శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు నా మహత్తర శక్తిని మీ ముందర పంపిస్తాను. మీరు మీ శత్రువులందర్నీ ఓడించటానికి నేను మీకు సహాయం చేస్తాను. మీకు వ్యతిరేకంగా ఉండే మనుష్యులు యుద్ధంలో కలవరపడిపోయి, పారిపోతారు.
28 మీకు ముందు కందిరీగలను నేను పంపిస్తాను. ఆ కందిరీగలు మీ శత్రువులు పారిపొయ్యేట్టు చేస్తాయి. హివ్వీ ప్రజలు, కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, మీ దేశాన్ని వదిలేస్తారు.
29 అయితే త్వరగా మీ దేశాన్ని విడిచి పెట్టేటట్టు నేను వాళ్లను బలవంతం చేయను. ఇదంతా నేను ఒక్క సంవత్సరంలోనే చేయను. ఆ ప్రజల్ని నేను అంత వేగంగా వెళ్లగొడితే, దేశం ఖాళీగా ఉంటుంది. అలాగైతే అడవి మృగాలు అధికమై దేశాన్ని ఆక్రమించుకొంటాయి. అవి మీకు చాల తొందర కలిగిస్తాయి.
30 కనుక ఆ ప్రజల్ని చాలా నిదానంగా బయటకు వెళ్లగొడతాను. దేశంలోనికి మీరు చొచ్చుకు పోతూనే ఉంటారు. మరి మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఇతర ప్రజలను నేను బలవంతంగా వెళ్లగొట్టేస్తాను.”
31 “ఎర్ర సముద్రం నుండి యూఫ్రటీస్ నదివరకు ఉన్న దేశం అంతా నేను మీకు యిస్తాను. ఫిలిష్తీ సముద్రం (మధ్యధరా సముద్రం) పశ్చిమాన సరిహద్దుగాను, అరేబియా ఎడారి తూర్పు సరిహద్దుగాను ఉంటాయి. అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు ఓడించేటట్టు చేస్తాను.
32 “ఆ ప్రజల్లో ఎవరితో గాని లేక వారి దేవుళ్లతోగాని మీరు ఎలాంటి ఒడంబడికలూ చేసుకోకూడదు.
33 వాళ్లను మీ దేశంలో ఉండనివ్వవద్దు. మీరు వాళ్లను ఉండనిస్తే, మీరు పాపం చేయటానికి వాళ్లు కారకులు అవుతారు. ఒకవేళ మీరు వాళ్లను ఉండనిస్తే వాళ్లు ఒక ఉరిలా ఉంటారు. మీరేమో వాళ్ల దేవుళ్లను పూజించటం మొదలు పెడతారు.”
1 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు: “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల డెబ్బయి మంది పెద్దలు (నాయకులు) పర్వతం మీదకు వచ్చి అంత దూరంలోనుంచే నన్ను ఆరాధించాలి.
2 అప్పుడు మోషే తాను మాత్రం యెహోవాకు సమీపంగా రావాలి. మిగతా పురుషులు యెహోవాకు సమీపంగా రాకూడదు. మిగతా ప్రజలు పర్వతం మీదకి కూడా రాకూడదు.”
3 కనుక యెహోవా ఇచ్చిన నియమాలు, ఆజ్ఞలు అన్నింటిని గూర్చీ మోషే ప్రజలతో చెప్పాడు. అప్పుడు ప్రజలంతా, “యెహోవా చెప్పిన ఆజ్ఞలు అన్నింటికీ మేము విధేయులమవుతాము” అన్నారు.
4 కనుక యెహోవా ఆజ్ఞలు అన్నింటినీ మోషే రాసాడు. (మర్నాటి ఉదయం పర్వతం దగ్గర మోషే ఒక బలిపీఠం నిర్మించాడు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒకటి చొప్పున పన్నెండు రాళ్లు నిలబెట్టాడు.
5 అప్పుడు బలులు అర్పించటానికి యువకులను మోషే పంపించాడు. దహన బలులుగా, సమాధాన బలులుగా ఎడ్లను ఈ మనుష్యులు అర్పించారు.
6 ఈ జంతువుల రక్తాన్ని మోషే భధ్రం చేసాడు. రక్తంలో సగాన్ని పాత్రల్లో ఉంచాడు మోషే. మిగతా సగం రక్తాన్ని బలిపీఠం మీద ఆయన పోసాడు.
7 ప్రత్యేక ఒడంబడిక రాయబడ్డ పత్రాన్ని మోషే చదివాడు. ఆయన చదువుతోంది ప్రజలంతా వినగలిగేటట్టు మోషే ఆ ఒడంబడిక పత్రం చదివాడు. అప్పుడు ప్రజలు, “యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము విన్నాము. వాటికి విధేయులం అయ్యేందుకు మేము ఒప్పుకొంటున్నాము” అన్నారు.
8 తర్వాత బలి అర్పణ రక్తంతో నిండిన పాత్రలను మోషే పట్టుకొన్నాడు. ఆ రక్తాన్ని ప్రజలమీద మోషే చిలకరించాడు “మీతో యెహోవా ఒక ప్రత్యేక ఒడంబడిక చేసాడు అని ఈ రక్తం సూచిస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈ ఒడంబడికను వివరిస్తాయి,” అని ఆయన చెప్పాడు.
9 అప్పుడు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు పెద్దలు డెబ్బయి మంది పర్వతం మీదకు వెళ్లారు.
10 పర్వతం మీద ఈ మనుష్యులు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూసారు. ఆకాశం అంత నిర్మలంగా కనబడుతున్న నీలంలాటి దేనిమీదనో దేవుడు నిలబడ్డాడు.
11 ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూచారు, కాని దేవుడు వాళ్లను నాశనం చేయలేదు. వాళ్లంతా కలిసి తిని తాగారు.
12 “పర్వతం మీద నా దగ్గరకు రా, నా ప్రబోధాలను, ఆజ్ఞలను పలకలుగా ఉన్న రెండు రాళ్ల మీద రాసాను. ఈ ప్రబోధాలు ప్రజలకోసం. ఆ రాతి పలకలను నేను నీకిస్తాను” అని యెహోవా మోషేతో చెప్పాడు.
13 కనుక మోషే, ఆయన సహాయకుడైన యెహోషువ కలసి దేవుని పర్వతం మీదకు వెళ్లారు.
14 మోషే, “మాకోసం ఇక్కడ వేచి ఉండండి. మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. నేను లేనప్పుడు అహరోను, హోరు మీ దగ్గరే ఉన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లండి,” అని ఆ పెద్దలతో (నాయకులతో) చెప్పాడు.
15 అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది.
16 సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు.
17 ఇశ్రాయేలు ప్రజలు యెహవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.
18 అప్పుడు మోషే ఆ పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.
1 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
2 “నాకు కానుకలు తీసుకు రమ్మని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. నాకు ఇవ్వాల్సింది ఏమిటి? ప్రతి మనిషి తన హృదయంలో తీర్మానించుకోవాలి. నా కోసం ఈ కానుకల్ని స్వీకరించు.
3 ప్రజల దగ్గర్నుండి నీవు స్వీకరించాల్సిన వాటి జాబితా యిది: బంగారం, వెండి, కంచు,
4 నీలం వస్త్రం, ఊదారంగు వస్త్రం, ఎరుపు వస్త్రం, మేలిమి వస్త్రం, మేక బొచ్చు,
5 గొర్రె చర్మాలు, మేలురకం తోళ్లు, తుమ్మకర్ర
6 దీపాలకు నూనె, ధూపం. ప్రత్యేక అభిషేక తైలానికి సువాసన చేకూర్చే పరిమళ వస్తువులు,
7 ఇంకా లేత పచ్చరాళ్లు, ఏఫోదు మీద లేక న్యాయ తీర్పుపై వస్త్రం మీద పొదిగించడానికి విలువైన రాళ్లు.”
8 (ఇంకా దేవుడు ఇలా అన్నాడు): “నా కోసం ప్రజలు ఒక పవిత్ర స్థలాన్ని నిర్మిస్తారు. అప్పుడు నేను వారి మధ్య నివసిస్తాను.
9 పవిత్ర గుడారం ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. దానిలో ఏమేమి వస్తువులు ఎలా ఉండాలో నేను మీకు చూపిస్తాను. సరిగ్గా నేను నీకు చూపించినట్టు ఒడంబడిక పెట్టె తయారు చెయ్యి.
10 “తుమ్మకర్ర ఉపయోగించి ఒక ప్రత్యేక పెట్టె తయారు చెయ్యి. ఈ పెట్టె పొడవు 45 అంగుళాల వెడల్పు 27 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి.
11 ఆ పెట్టెలోపల, బంగారు రేకుతో పెట్టెను కప్పాలి. ఆ పెట్టె చుట్టూ అంచుల మీద బంగారపు నగిషీబద్ద పెట్టాలి.
12 ఆ పెట్టె చుట్టూ మోసేందుకు నాలుగు బంగారు ఉంగరాలను తయారు చెయ్యాలి. ఆ పెట్టెకు ఒక్కోపక్క రెండేసి చొప్పున నాలుగు మూలలా ఆ ఉంగరాలను అమర్చాలి.
13 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను తయారు చేయాలి. ఈ కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం పొదిగించాలి.
14 ఆ పెట్టె మూలల్లో ఉన్న ఉంగరాల గుండా ఆ కర్రలను పెట్టాలి. ఆ పెట్టెను మోసేందుకు ఈ కర్రలను ఉపయోగించాలి.
15 ఈ కర్రలు ఎప్పుడూ వాటి ఉంగరాల్లోనే ఉండాలి. కర్రలను బయటికి తియ్యవద్దు.”
16 (దేవుడు అన్నాడు): “నేను ఒడంబడికను నీకు ఇస్తాను. ఆ ఒడంబడికను ఈ పెట్టెలో పెట్టు.
17 ఆ పెట్టెకు ఒక మూత చెయ్యాలి. స్వచ్ఛమైన బంగారంతో దీన్ని చెయ్యాలి. 45 అంగుళాల పొడవు 27 అంగుళాల వెడల్పుతో దీన్ని చెయ్యాలి.
18 “తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి ఆ మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో ఈ దూతల్ని చేయాలి.
19 ఆ మూతకు ఒక కొనమీద ఒక దూతను, మరో కొనమీద మరో దూతను ఉంచాలి. మూత, దూతలు అంతా ఒకే వస్తువుగా చేయాలి.
20 కెరూబులు ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉండాలి. ఆ దూతల ముఖాలు మూత వైపుకు చూస్తూ ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు మూతను అవరించి ఉండాలి. ఆ కెరూబుల రెక్కలు ఆకాశం వైపు ఎత్తబడి ఉండాలి.”
21 “ఒడంబడిక రుజువు నేనే మీకిచ్చాను. ఆ ఒడంబడికను పెట్టెలో పెట్టి, ప్రత్యేక మూతను పెట్టెమీద పెట్టాలి.
22 నేను నిన్ను కలుసుకొనేటప్పుడు ఆ ఒడంబడిక పెట్టె ప్రత్యేక మూత మీద ఉన్న కెరూబు దూతల మధ్యనుండి నేను మాట్లాడుతాను. అక్కడినుండే నేను నా ఆజ్ఞలన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలకు యిస్తాను.
23 “తుమ్మ కర్రతో ఒక బల్ల తయారు చెయ్యాలి. ఈ బల్ల పొడవు 36 అంగుళాలు వెడల్పు 18 అంగుళాలు ఎత్తు 27 అంగుళాలు ఉండాలి.
24 బల్లను స్వచ్ఛమైన బంగారంతో కప్పాలి. దాని చుట్టూ బంగారపు నగిషీబద్ద పెట్టాలి.
25 తర్వాత 4 అంగుళాల, బంగారు నగీషీ బద్దను బల్ల చుట్టూ చేయాలి. ఇది కూడ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి.
26 అప్పుడు నాలుగు బంగారు ఉంగరాలు చేసి, బల్ల నాలుగు మూలలా వాటిని ఉంచాలి. ఒక్కో కాలు దగ్గర ఒక్కో ఉంగరం పెట్టాలి.
27 బల్ల పై భాగానికి చుట్టూవున్న నగిషీ బద్దకు సమీపంగా ఉంగరాలను ఉంచాలి. బల్లను మోసే మోత కర్రలను ఈ ఉంగరాలు పట్టి ఉంచుతాయి.
28 మోత కర్రలు చేసేందుకు తుమ్మ కర్రను ఉపయోగించి వాటికి బంగారంతో తాపడం చేయాలి. వాటితో బల్లను మోయాలి.
29 బల్లమీద ఉండే ప్రతి పళ్లెము, గిన్నె స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. అర్పితాలను పోసేందుకు ఉపయోగించే పాత్రలు, గిన్నెలు స్వచ్ఛమైన బంగారంతో చెయ్యబడి ఉండాలి.
30 ప్రత్యేకమైన రొట్టెను నా యెదుట బల్ల మీద పెట్టాలి. అవి నా యెదుట ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి.
31 “అప్పుడు నీవు ఒక దీపస్తంభం చేయాలి. దీపస్తంభంలో ప్రతి భాగాన్నీ సాగకొట్టబడ్డ స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. అందంగా కనబడేటట్టు దీపానికి పూలు చేయాలి. ఈ పూలలో మొగ్గలు, రేకులు స్వచ్ఛమైన బంగారంతో చేయాలి. ఇవన్నీ దీప స్తంభంతోపాటు ఒకే వస్తువుగా కలిసి ఉండాలి.
32 “దీపస్తంభానికి ఒక పక్క మూడు కొమ్మలు మరో పక్క మూడు కొమ్మలు మొత్తం ఆరు కొమ్మలు ఉండాలి.
33 ఒక్కో కొమ్మకు మూడు పువ్వులు ఉండాలి. ఈ పువ్వులను మొగ్గలు, రేకులుగల బాదం పూలుగా చేయి.
34 దీప స్తంభానికి మరో నాలుగు పూలు చేయి మొగ్గులు, రేకులుగల బాదం పూవుల్లా చేయబడాలి.
35 కాండమునకు ఇరు ప్రక్కల మూడేసి కొమ్మల చొప్పున దీపస్తంభానికి ఆరు కొమ్మలు ఉండాలి. కొమ్మలు కాండంలో కలిసే మూడు చోట్లలో ఒక్కో దాని కింద మొగ్గలు, రేకులు గల ఒక పువ్వును చేయి.
36 పువ్వులు కొమ్మలతో సహా మొత్తం దీపస్తంభం స్వచ్ఛమైన బంగారంతో చేయబడాలి. ఈ బంగారం అంతా సాగకొట్టబడిన ఒకే ముక్కగా ఉండాలి.
37 అప్పుడు దీపస్తంభం మీదకు ఏడు దీపాలు చేయి. ఈ దీపాలు దీపస్తంభం ఉన్న చోట వెలుగునిస్తాయి.
38 ప్రమిదలు, దీపపు వత్తులను తిప్పే పిడి చేసేందుకు స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు.
39 దీపస్తంభం, దానితోబాటు ఉపయోగించే వస్తువులను చేసేందుకు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించు.
40 ప్రతీది సరిగ్గా నేను నీకు ఆ పర్వతం మీద చూపించిన ప్రకారమే చేసేందుకు చాల జాగ్రత్తపడు.”
1 “పది తెరలతో పవిత్ర గుడారం చెయ్యాలి. సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టతో ఈ తెరలు చేయాలి. రెక్కలుగల కెరూబుల చిత్ర పటాలను ఒక నిపుణుడు తెరలమీద కుట్టాలి.
2 తెరలన్నీ ఒకే కొలతలో తయారు చేయాలి. ప్రతి తెరా 14 గజాల పొడవు 2 గజాల వెడల్పు ఉండాలి.
3 తెరలను రెండు భాగాలుగా కుట్టాలి. అయిదు తెరలను ఒక విభాగానికి, అయిదు తెరలను మరో విభాగానికి కలిపి కుట్టాలి.
4 చివరి తెర అంచుకు ఉంగరాలు కుట్టాలి. ఈ ఉంగరాలు చేసేందుకు నీలము గుడ్డ ఉపయోగించాలి. తెరల రెండు విభాగాల కింది అంచులకు ఉంగరాలు ఉండాలి.
5 మొదటి విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు, రెండో విభాగంలోని చివరి తెరకు 50 ఉంగరాలు ఉండాలి.
6 ఈ ఉంగరాలను జత చేయటానికి 50 బంగారు ఉంగరాలు చెయ్యాలి. పవిత్ర గుడారం అంతా ఒక్కటిగా ఉండటానికి ఇది తెరలన్నింటినీ జత చేస్తుంది.
7 “తర్వాత పవిత్ర గుడారాన్ని కప్పేందుకు ఇంకో గుడారాన్ని నీవు చెయ్యాలి. ఈ గుడారం చేయటానికి మేక వెంట్రుకలతో చేయబడ్డ 11 తెరలను ఉపయోగించు.
8 ఈ తెరలన్నీ ఒకే కొలతలో ఉండాలి. అవి 15 గజాలు పొడవు, 2 గజాలు వెడల్పు ఉండాలి.
9 అయిదు తెరలను ఒక విభాగంగా కలిపి కుట్టాలి. తర్వాత మిగిలిన ఆరు తెరలను మరో విభాగంగా కలిపి కుట్టాలి. ఆరో తెరను గుడారం ముందటి భాగాన్ని కప్పేందుకు ఉపయోగించాలి. తలుపులా తెరచుకొనేందుకు వీలుగా దీన్ని చుట్టిపెట్టాలి.
10 ఒక భాగంలోని చివరి తెర అంచుకు 50 కొలుకులు తయారు చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి. మరో విభాగంలోని చివరి తెర కింది అంచుకు కూడ అలానే చెయ్యాలి.
11 అప్పుడు 50 ఇత్తడి ఉంగరాలు చెయ్యాలి. గుడ్డ ఉంగరాలను జతచేయటానికి ఈ ఇత్తడి ఉంగరాలను ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల తెరలన్నీ కలిసి ఒకే గుడారంగా తయారువుతాయి.
12 ఈ తెరలు పవిత్ర గుడారం కంటె పొడవుగా ఉంటాయి. కనుక తెరల్లో కొంత భాగం గుడారం వెనుకగా వేలాడుతుంటాయి.
13 తెర గుడారం ప్రక్కల్లో వేలాడుతుంటుంది. ఇది గుడారాన్ని భద్రంగా ఉంచుతుంది.
14 పవిత్ర గుడారానికి ఇంకా రెండు పైకప్పులు చేయాలి. ఒకటి ఎర్ర రంగు పూసిన పొట్టేలు చర్మంతో చేయాలి. ఇంకొకటి మేలు రకం తోలుతో చెయ్యాలి.
15 “పవిత్ర గుడారం చట్రానికి ఉపయోగించే పలకలను తుమ్మకర్రతో చెయ్యాలి.
16 చట్రాలు 15అంగుళాల పొడవు, 27 అంగుళాల వెడల్పు ఉండాలి.
17 ప్రతి చట్రం ఒకేలా ఉండాలి. ప్రతి చట్రానికి పక్క పక్కగా రెండేసి పక్కకర్రలు (దిమ్మలో అమర్చేవి) ఉండాలి.
18 పవిత్ర గుడారం దక్షిణ పక్కకు 20 చట్రాలు చేయాలి.
19 ప్రతి చట్రం కింద పెట్టడానికి రెండేసి వెండిదిమ్మలు చేయాలి. కనుక చట్రాలన్నింటికీ 40 వెండిదిమ్మలు నీవు చేయాలి.
20 పవిత్ర గుడారం ఉత్తరదిక్కుకోసం ఇంకా 20 చట్రాలు చెయ్యాలి.
21 అంటే ఒక్కో చట్రానికి రెండేసి చొప్పున చట్రాలకోసం మొత్తం 40 వెండి దిమ్మలు చెయ్యాలి.
22 గుడారం వెనుక పశ్చిమ కొనకు ఇంకా ఆరు చట్రాలు నీవు చేయాలి.
23 మూలల కోసం రెండు చట్రాలు చెయ్యాలి
24 మూలల్లో ఉండే రెండు చట్రాలు జత చేయాలి. రెండుచట్రాలు అడుగు భాగాన జతపర్చబడాలి. పైభాగంలో ఉన్న ఒక ఉంగరం రెండు చట్రాలను జత పరుస్తుంది.
25 కనుక (గుడారం చివరన) మొత్తం ఎనిమిది చట్రాలు ఉంటాయి. ఒక్కో చట్రం కింద రెండు దిమ్మల చొప్పున మొత్తం 16 వెండి దిమ్మలుంటాయి.
26 “పవిత్ర గుడారం చట్రాలకు తుమ్మ కర్రతో అడ్డకమ్ములు చేయాలి. పవిత్ర గుడారం మొదటి ప్రక్కకు అయిదు అడ్డకమ్ములు ఉండాలి.
27 పవిత్ర గుడారం పశ్చిమాన వెనుకవైపు చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. పవిత్ర గుడారం పశ్చిమ దిక్కున చట్రానికి అయిదు అడ్డకమ్ములు ఉండాలి. (అంటే పవిత్ర గుడారం వెనుక)
28 అయిదు చట్రాలకు మధ్య ఉండే అడ్డకమ్మి పైనుండి కిందికి సగం సగంగా ఉండాలి. ఈ కొననుండి ఆకొన వరకు చట్రాల గుండా ఈ అడ్డకమ్మి దూర్చబడాలి.
29 చట్రాలను బంగారంతో తాపడం చేయాలి. అడ్డకమ్ములను పట్టి ఉంచడానికి చట్రాలకు ఉంగరాలు చెయ్యాలి.
30 నేను నీకు పర్వతం మీద చూపించినట్టే, పవిత్ర గుడారం నిర్మించు.
31 “సున్నితమైన వస్త్రంతో గుడారం లోపలి భాగం కోసం ప్రత్యేకమైన ఒక తెరను తయారు చెయ్యాలి. నీలం, ఊదా, ఎరుపు రంగు బట్టతో ఈ తెరను తయారు చేయాలి. కెరూబుల చిత్రపటాలను ఈ బట్టమీద కుట్టాలి.
32 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చెయ్యి. బంగారు కొక్కేల ఆ నాలుగు స్తంభాలకు అమర్చు. స్తంభాలకు బంగారు తాపడం చెయ్యి. స్తంభాల కింద నాలుగు వెండి దిమ్మలు పెట్టు. తర్వాత తెరను బంగారు కొక్కేల మీద వ్రేలాడదీయి.
33 కొక్కేల మీద తెరను వేలాడ దీసిన తరువాత, ఒడంబడిక పెట్టెను తెర వెనుక పెట్టు. పవిత్ర స్థానాన్ని, మహా పవిత్ర స్థానాన్ని, ఈ తెర వేరుచేస్తుంది.
34 మహా పవిత్ర స్థానంలో ఒడంబడిక పెట్టె మీద మూత పెట్టు.”
35 “పవిత్ర స్థానంలో నీవు చేసిన బల్లను తెర అవతలి ప్రక్క పెట్టు. పవిత్ర గుడారంలో ఉత్తరంగా బల్ల ఉండాలి. పవిత్ర గుడారంలో దక్షిణంగా దీపం ఉండాలి. ఇది బల్ల ప్రక్క అడ్డంగా ఉండాలి.
36 “తర్వాత గుడారం ద్వారానికి ఒక తెర చెయ్యి. తెర చేయటానికి నీలం, ఊదా, ఎరుపు బట్టను సున్నితమైన బట్టను ఉపయోగించు. ఆ బట్టలో చిత్రపటాలను అల్లిక చేయాలి.
37 తలుపుపై ఉండే తెరకు బంగారు కొక్కేలు చేయాలి. బంగారు తాపడం చేయబడ్డ అయిదు తుమ్మకర్ర స్తంభాలు చెయ్యాలి. అయిదు స్తంభాలకూ అయిదు ఇత్తడిదిమ్మలు చేయాలి.
1 “తుమ్మకర్రతో ఒక బలిపీఠం నిర్మించు. బలిపీఠం చతురస్రంగా ఉండాలి. అది 71/2 అంగుళాల పొడవు 71/2 అంగుళాల వెడల్పు 4 1/2 అంగుళాల ఎత్తు ఉండాలి.
2 బలిపీఠం నలుమూలలా ఒక్కోదానికి ఒక్కో కొమ్మ చేయాలి. అంతా ఒక్క వస్తువుగా ఉండేటట్టు ఒక్కో కొమ్మును దాని మూలకు జత చేయాలి. బలిపీఠాన్ని యిత్తడితో తాపడం చేయాలి.
3 “బలిపీఠం మీద ఉపయోగించబడే పరికరాలు, పాత్రలు అన్నింటినీ ఇత్తడితో చేయాలి. బిందెలు, పారలు, పాత్రలు, పళ్లపారలు, నిప్పునెత్తే పెంకులు ఇత్తడితో చేయాలి. బలిపీఠం నుండి బూడిద ఎత్తి శుభ్రం చేయడానికి యివి ఉపయోగించబడతాయి.
4 ఒక పెద్ద యిత్తడి జల్లెడలాంటి దానిని చేయాలి. తెర నాలుగు మూలలకు నాలుగు యిత్తడి ఉంగరాలు చెయ్యాలి.
5 బలిపీఠానికి అడుగున మెట్టు కింద తెరను పెట్టాలి. కింద నుండి బలిపీఠంలో సగం పై వరకు, తెర ఉంటుంది.
6 “బలిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మకర్ర ఉపయోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి.
7 బలిపీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి ఆ కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి ఈ కర్రలను ఉపయోగించాలి.
8 బలిపీఠం గుల్లగా ఉంటుంది. దాని ప్రక్కలు పలకలతో చేయబడతాయి. నేను నీకు పర్వతం మీద చూపించినట్టే బలిపీఠాన్ని తయారు చెయ్యి.
9 “(పవిత్ర గుడారం చుట్టూ తెరలతో గోడకట్టు ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వైపున యాభై గజాల పొడవు తెరల గోడ ఉండాలి. సున్నితమైన బట్టతో ఈ తెరలు చేయబడాలి.
10 ఇరవై స్తంభాలు, ఆ స్తంభాల కింద 20 యిత్తడి దిమ్మలు ఉపయోగించాలి. స్తంభాల కొక్కేల తెరల కడ్డీలు వెండితో చేయాలి.
11 దక్షిణ వైపున ఉన్నంత పొడవే ఉత్తరం వైపున కూడా ఉండాలి. దానికి 100 తెరలు, 20 స్తంభాలు, 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. స్తంభాల కొక్కేలు తెరల కడ్డీలు వెండితోనే చేయబడాలి.
12 “ఆవరణం పడమటికొనవైపు 25 గజాల పొడవుగల తెరలతో ఒక గోడ ఉండాలి. ఆ గోడ మీద 10 స్తంభాలు, 10 దిమ్మలు ఉండాలి.
13 ఆవరణ తూర్పు వైపు కూడా 25 గజాల పొడవు ఉండాలి.
14 (ఈ తూర్పు వైపే ఆవరణకు ప్రవేశం) ప్రవేశ ద్వారానికి అన్ని వైపులా ఏడున్నర గజాల పొడవు గల తెరలు ఉండాలి. ఆ పక్క మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.
15 అవతల వైపున కూడా ఏడున్నర గజాల పొడవుగల తెరలు ఉండాలి. ఆ పక్కన మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.
16 ఆవరణ ప్రవేశాన్ని కప్పడానికి 10 అంగుళాల పొడవుగల తెర చెయ్యాలి. సున్నితమైన బట్ట నీలం, ఎరుపు, ఊదారంగు బట్టలతో ఆ తెరను చేయాలి. ఆ తెరమీద చిత్ర పటాల అల్లిక ఉండాలి. నాలుగు స్తంభాలు, నాలుగు దిమ్మలు ఉండాలి.
17 ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలన్నీ వెండి కడ్డీలతో జత కలపాలి. స్తంభాల కొక్కేలు వెండితోను, స్తంభాల దిమ్మలు యిత్తడితోను చేయాలి.
18 ఆవరణ 50 గజాల పొడవు 25 గజాల వెడల్పు ఉండాలి. ఆవరణ చుట్టు గోడ ఏడున్నర అడుగుల ఎత్తు ఉండాలి. తెరలు సున్నితమైన బట్టతో చేయాలి. స్తంభాలన్నింటి కింద ఉండే దిమ్మల్ని ఇత్తడితోనే చేయాలి.
19 అన్ని పరికరాలు, పవిత్ర గుడారం మేకులు పవిత్ర గుడారంలో ఉపయోగించే ఇతర వస్తువులు అన్నిటినీ ఇత్తడితోనే చేయాలి. మేకులు (ఆవరణ చుట్టూ తెరలకు) అన్నీ ఇత్తడితో చేయాలి.
20 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ప్రతి సాయంకాలం వెలిగించాల్సిన దీపం కోసం ఈ నూనె ఉపయోగించు.
21 దీపం విషయం అహరోను, అతని కుమారులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సన్నిధి గుడారంలో మొదటి గదిలోకి వారు వెళ్తారు. ఇది ఒడంబడిక పెట్టె ఉండే గది బయట (రెండు గదులను వేరు పరచే) తెర ముందర ఉంటుంది. ఇక్కడ సాయంత్రం నుండి తెల్లవారే వరకు యెహోవా ఎదుట దీపాలు తప్పక వెలుగుతూ ఉండేటట్టు వారు బాధ్యత వహిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు, వారి వారసులు శాశ్వతంగా ఈ ఆజ్ఞకు విధేయులు కావాలి.”
1 “నీ సోదరుడైన అహరోను, అతని కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు, ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి, నీ దగ్గరకు రావాలని చెప్పు. వీళ్లు యాజకులుగా నన్ను సేవిస్తారు.
2 “నీ సోదరుడైన అహరోనుకు ప్రత్యేక వస్త్రాలు చేయించు. ఈ వస్త్రాలు అతనికి గౌరవ మర్యాదలు కల్గిస్తాయి.
3 ఈ బట్టలు తయారుచేయగల నిపుణులు ప్రజల్లో ఉన్నారు. ఈ మనుష్యులకు ప్రత్యేక జ్ఞానం నేనిచ్చాను. అహరోనుకు బట్టలు తయారు చేయుమని వారికి చెప్పు. అతను ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నాడని ఈ బట్టలు చూపెడ్తాయి. అప్పుడు ఒక యాజకునిగా అతడు నన్ను సేవించవచ్చు.
4 ఆ మనుష్యులు చేయాల్సిన బట్టలు ఇవే: న్యాయతీర్పు వస్త్రం ఏఫోదు, చేతుల్లేని ఒక ప్రత్యేక అంగీ, తల కప్పుకొనే బట్ట, ఒక నడికట్టు పట్టి నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకోసం ఆ మనుష్యులు ఈ ప్రత్యేక దుస్తులను తయారు చేయాలి. అప్పుడు అహరోను, అతని కుమారులు యాజకులుగా నన్ను సేవించవచ్చు.”
5 “బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల బట్టలను ఉపయోగించాలని ఆ మనుష్యులకు చెప్పు.”
6 “ఏఫోదు తయారు చేయటానికి బంగారు దారాలు, సన్నని పేనిన నార బట్ట సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగుల నూలు ఉపయోగించాలి. నైపుణ్యం గల పనివారు ఈ ఏఫోదు చేస్తారు.
7 ఏఫోదు భుజాల దగ్గర ఒక్కో దాని దగ్గర ఒక్కో భుజం బట్ట వేయబడుతుంది. ఏఫోదు రెండుకొనలు ఈ భుజం బట్టలకు కట్టబడతాయి.”
8 “ఏఫోదు మీద వేసుకొనే కండువాను వారు చాల జాగ్రత్తగా వేస్తారు. ఏఫోదులో ఉండేవాటితోనే బంగారు దారాలు, సున్నితమైన బట్ట, నీలం, ఎరుపు, ఊదా రంగు బట్టతోనే ఈ కండువా తయారు చేయబడుతుంది.”
9 “నీవు రెండు లేతపచ్చ రాళ్లు తీసుకోవాలి. ఇశ్రాయేలు పండ్రెండు మంది కుమారుల పేర్లు ఈ రత్నాల మీద చెక్కాలి
10 ఒక రత్నం మీద ఆరు పేర్లు, మరో రత్నం మీద ఆరు పేర్లు రాయాలి. పెద్ద కుమారుడు మొదలుకొని చిన్న కుమారుని వరకు క్రమపద్ధతిలో పేర్లు చెక్కు.
11 ముద్రలు చేసేవాడు ఎలాగైతే చెక్కుతాడో, అలా ఇశ్రాయేలు కుమారుల పేర్లను ఈ రాళ్ల మీద చెక్కు. ఈ రత్నాలను బంగారంలో పొదుగు.
12 అప్పుడు ఏఫోదు మీద ఉండే ఒక్కో భుజం బట్ట మీద ఒక్కో రత్నాన్ని అమర్చు. అహరోను యెహోవా ఎదుట నిలబడ్డప్పుడు ప్రత్యేకమైన ఈ అంగీ ధరిస్తాడు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కబడ్డ రెండు రాళ్లు ఏఫోదు మీద ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల్ని గూర్చి తలంచేందుకు ఇది దేవునికి సహాయ పడుతుంది.
13 ఏఫోదు మీద రాళ్లు నిలబడి ఉండేటట్టు మంచి బంగారం ఉపయోగించు.
14 స్వచ్ఛమైన బంగారు గొలుసులను కలిపి తాడు పేనినట్టు మెలిపెట్టు. ఇలాంటివి రెండు బంగారు గొలుసులు చేసి, వాటిని బంగారు అల్లికలకు బిగించు.
15 “ప్రధాన యాజకుని కోసం న్యాయపతకం చేయి, ఏఫోదు చేసినట్టు నైపుణ్యం గల పనివారు ఈ పైవస్త్రం చేయాలి. బంగారు దారాలు, సున్నితమైన నారబట్ట, నీలం, ఎరుపు, ఊదారంగుబట్ట వాళ్లు ఉపయోగించాలి.
16 ఈ న్యాయతీర్పు పైవస్త్రం 9 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు ఉండాలి. అది ఒక సంచి అయ్యేటట్టుగా మడత చేయబడాలి.
17 న్యాయ పతకం మీద అందమైన రత్నాలు నాలుగు వరుసలు పెట్టాలి. ఈ రత్నాల మొదటి వరసలో పద్మరాగం, గోమేధికం, మరకతం ఉండాలి.
18 రెండో వరుసలో ఆకుపచ్చ నీలమణి, పచ్చమరకతం ఉండాలి.
19 మూడో వరుసలో ఎరుపు వన్నె మణి, ఊదారంగు మణి, వంగరంగు మణి ఉండాలి.
20 నాలుగో వరుసలో రక్తవర్ణం రాయి, లేతపచ్చ రాయి, సూర్యకాంతం ఉండాలి. న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రత్నాలన్నీ నిలబడేట్టు బంగారం ఉపయోగించాలి.
21 ఇశ్రాయేలు కుమారుల్లో ఒకొక్కరికి ఒకొక్కటి చొప్పున న్యాయ తీర్పు పైవస్త్రం మీద పన్నెండు రత్నాలు ఉంటాయి. ఈ రాళ్లలో ఒక్కొదానిమీద ఇశ్రాయేలు కుమారుల్లో ఒక్కొక్కరిది ఒక దాని మీది రాయి. ఒక్కోరాయిలో ఈ పేర్లను ముద్రించినట్టుగా చెక్కు.
22 “న్యాయతీర్పు పైవస్తానికి స్వచ్ఛమైన బంగారంతో గొలుసులు చేయాలి. ఈ గొలుసులు తాడులా ఉంటాయి.
23 బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు.
24 న్యాయతీర్పు పైవస్త్రం మూలల్లో ఉన్న రెండు ఉంగరాల్లోనుంచి ఈ బంగారు గొలుసులు రెంటిని దూర్చాలి.
25 ఆ గొలుసుల అవతలి కొనలను ఏఫోదు ముందర రెండు భుజం బట్టలమీద పెట్టు.
26 ఇంకో రెండు బంగారు ఉంగరాలు చేసి, న్యాయతీర్పు పైవస్త్రం, అవతల ఉన్న మరి రెండుమూలల్లో పెట్టాలి. ఏఫోదు దగ్గరగా ఉన్న న్యాయతీర్పు పైవస్త్రం లోపలి వైపు ఇది.
27 ఇంకా రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు ముందర భాగంలోని భుజభాగాల అడుగున పెట్టాలి ఏఫోదు దట్టీ పైభాగానికి దగ్గరగా బంగారు ఉంగరాలను ఉంచాలి.
28 న్యాయతీర్పు పైవస్త్రం ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు జత చేయాలి. నడికట్లతో వీటిని జత చేసేందుకు నీలం పతకం ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల న్యాయతీర్పు పైవస్త్రం నడికట్టును పట్టుకొని ఉంటుంది.
29 “అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఆయన గుండెమీద ఉంటాయి. న్యాయం తీర్చడానికి ఆయన ధరించే తీర్పు పతకం మీద ఈ పేర్లు ఉంటాయి. ఈ విధంగా ఇశ్రాయేలు కుమారులు పన్నెండు మందిని యెహోవా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాడు.
30 దేవుని నిర్ణయాలు తెలుసుకొనేందుకు ఊరీము, తుమ్మీములను ప్రయోగిస్తాడు. అందుచేత ఊరీము, తుమ్మీములను న్యాయతీర్పు పైవస్త్రములో ఉంచాలి. అహరోను యెహోవా ముందర ఉన్నప్పుడు ఈ విషయాలు అతని గుండెమీద ఉంటాయి. కనుక అహరోను యెహోవా యెదుట ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చే ఒక విధానాన్ని ఎల్లప్పుడూ తనతో తీసుకువెళ్తాడు.
31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి.
32 దాని మధ్యలో తల పట్టేందుకు ఒక రంధ్రం ఉండాలి. అది మెడచుట్టూ చిరిగిపోకుండా గోటు ఉండాలి.
33 నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం రంగుల బట్టతో దానిమ్మపండు చేయాలి. అంగీ కింది భాగంలో దానిమ్మ పండును వేలాడదీయాలి. దానిమ్మపండు మధ్య బంగారు గంటలు వ్రేలాడదీయాలి.
34 అంగీ అడుగున చుట్టూరా ఒక బంగారు దానిమ్మపండు ఒక గంట, మరో దానిమ్మపండు, మరో గంట ఇలా ఉండాలి.
35 అహరోను యాజకునిగా పని చేసేటప్పుడు ఈ అంగీని ధరించి, యెహోవా ఎదుట పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అతడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు గంటలు మోగుతాయి. ఈ విధంగా అహరోను మరణించడు.
36 [This verse may not be a part of this translation]
37 [This verse may not be a part of this translation]
38 అహరోను దీన్ని తన తలమీద ధరిస్తాడు. ఇశ్రాయేలీయుల కానుకల విషయంలో దోషాలు ఏమైన ఉంటే ఆ దోషాన్ని అతడు భరించినప్పుడు, ఇది అతన్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఈ కానుకలు ప్రజలు యెహోవాకు అర్పించేవి. ప్రజల కానుకలను యెహోవా స్వీకరించేటట్టు అహరోను దీనిని ఎప్పుడూ తన తలమీద ధరించాలి.
39 “అంగీని తయారు చేసేందుకు సున్నితమైన నార బట్టను ఉపయోగించాలి. తలపాగా చేసేందుకు సున్నితమైన నారబట్టను ఉపయోగించాలి. నడికట్టు మీద బుట్టా కుట్టాలి.
40 చొక్కాలు, పట్టాలు, తలపాగాలు కూడా తయారు చేయాలి. ఇవి వారికి గౌరవమర్యాదలు కలిగిస్తాయి.
41 నీ సోదరుడైన అహరోనుకు, అతని కుమారులకు ఈ బట్టలు ధరింపజేయాలి. తర్వాత వారు యాజకులని చూపెట్టేందుకుగాను వారి తలమీద ఒలీవనూనె పోయాలి. ఇది వాళ్లను యాజకులుగా చేస్తుంది. ఒక ప్రత్యేక విధానంలో వారు నన్ను సేవిస్తున్నారని ఈ విధంగా నీవు తెలియజేస్తావు. అప్పుడు వారు నన్ను యాజకులుగా సేవిస్తారు.
42 “వారి ప్రత్యేక యాజక వస్త్రాల కింద ధరించేందుకు శ్రేష్ఠమైన బట్టను ఉపయోగించాలి. లోపల ధరించే ఈ వస్త్రాలు నడుంనుండి కాళ్ల వరకు ధరించాలి.
43 అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారములో ఎప్పుడు ప్రవేశించినా, ఈ వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులుగా సేవ చేసేందుకు బలిపీఠం దగ్గరకు ఎప్పుడు వచ్చినా వారు ఈ వస్త్రాలు ధరించాలి. వారు ఈ వస్త్రాలు ధరించకపోతే, తప్పు చేసిన నేరస్థులై చావాల్సి వస్తుంది. అహరోను, అతని తర్వాత అతని కుటుంబం అంతటికీ ఇదంతా నిత్యం కొనసాగే ఒక చట్టంగా ఉండాలి.”
1 “అహరోను, అతని కుమారులు యాజకులుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని యిప్పుడు నీకు నేను చెబతాను. ఒక గిత్తను, కళంకం లేని రెండు పొట్టేళ్లను సంపాదించు.
2 తర్వాత పులియజేసే పదార్థంలేని సన్నని గోధుమ పిండితో రొట్టె చేయాలి. ఒలీవ నూనెతో కలిపి చేసే రొట్టెలకు గూడ అవే వస్తువులు ఉపయోగించాలి. నూనెతో కలిపి చిన్న చిన్న పల్చటి అప్పడాలు చేయాలి.
3 ఈ రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. ఆ బుట్టను అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమయంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి.
4 “తర్వాత అహరోనును అతని కుమారులను సన్నిధి గుడారం ముందటి ద్వారం దగ్గరకు తీసుకు రావాలి. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి.
5 అహరోనుకు అతని చొక్కా తొడిగించాలి. ప్రత్యేక ఏఫోదుతో వుండే అంగీని అతనికి ధరింపజేయాలి. అప్పుడు ఏఫోదును, న్యాయతీర్పు పైవస్త్రాన్ని అతనికి కట్టాలి. అందమైన దట్టీని అతనికి కట్టాలి.
6 తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి.
7 అభిషేక తైలము తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను ఈ పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది.
8 “తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకరావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి.
9 అప్పుడు వారి నడుములకు దట్టీలు చుట్టాలి. ధరించేందుకు ప్రత్యేక టోపీలను వారికి ఇవ్వాలి. వారు యాజకులుగా ఉండడం అప్పుడు ప్రారంభం అవుతుంది. శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక చట్టంవల్ల వారు యాజకులుగా ఉంటారు. ఈ విధంగా అహరోనును, అతని కుమారులను నీవు యాజకులుగా చేయాలి.
10 “తర్వాత సన్నిధి గుడారం ఎదుటకు గిత్తను తీసుకురావాలి. అహరోను, అతని కుమారులు ఆ గిత్త తల మీద వారి చేతులు పెట్టాలి,
11 “అప్పుడు ఆ సన్నిధి గుడారం ఎదుట ఆ గిత్తను చంపాలి. దీనిని యెహోవా చూస్తాడు.
12 అప్పుడు గిత్త రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం దగ్గరకు వెళ్లాలి. బలిపీఠం కొమ్ముల మీద నీ వేళ్లతో కొంచెం రక్తం చిలకరించాలి. మిగిలిన రక్తం అంతా బలిపీఠం అడుగున కుమ్మరించాలి.
13 తర్వాత గిత్త లోపలి కొవ్వు అంతా తీయాలి. కాలేయంలో కొవ్విన భాగాన్ని రెండు మూతగ్రంథులను వాటి చుట్టూ ఉండే కొవ్వును తీసి బలిపీఠం మీద దహించాలి.
14 తర్వాత గిత్త మాంసం, చర్మం, ఇతర భాగాలు తీసుకొని మీ పాళెము వెలుపటికి వెళ్లాలి. అక్కడ, పాళెము వెలుపల వీటిని కాల్చివేయాలి. ఇది యాజకుల పాపాలను తీసివేయు అర్పణ.
15 “తర్వాత పొట్టేళ్లలో ఒకదాని తలమీద తమ చేతులు పెట్టమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు.
16 అప్పుడ ఆ పొట్టేలును చంపి ఆ రక్తం భద్రం చేయాలి. ఆ రక్తాన్ని బలిపీఠం నలువైపుల వెదచల్లాలి.
17 అప్పుడు పొట్టేలును ముక్కలు ముక్కలుగా కోయాలి. పొట్టేలు లోపలి భాగాలను కాళ్లను కడగాలి. వీటిని పొట్టేలు తల ఇతరభాగాలతో కలిపి పెట్టాలి.
18 అప్పుడు ఆ మొత్తాన్ని బలిపీఠం మీద దహించి వేయాలి. ఇది దహించబడ్డ దహన బలి. ఇది యెహోవాకు అర్పించబడింది. యెహోవా అర్పణను వాసన చూస్తాడు. అది ఆయనకు ఎంతో ప్రీతికరంగా ఉంటుంది. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు అర్పించే అర్పణ.
19 “ఇంకో పొట్టేలు మీద వారి చేతులు వుంచమని అహరోనుకు, అతని కుమారులకు చెప్పు.
20 ఆ పొట్టేలును చంపి, దాని రక్తం భద్రం చేయాలి. అహరోనుకు, అతని కుమారులకు వారి కుడి చెవి కొనల మీద ఆ రక్తం చల్లాలి. ఇంక వారి కుడి చేతుల బొటన వేళ్ల మీద కొంత రక్తం ఉంచాలి. వారి కుడి పాదాల బొటన వేళ్లపై మరికొంత రక్తం ఉంచాలి. అప్పుడ బలిపీఠం మీద నాల్గువైపులా రక్తం చల్లాలి.
21 తర్వాత బలిపీఠం నుండి కొంత రక్తం తీసుకోవాలి. ప్రత్యేక తైలంతో దాన్ని కలిపి, అహరోను మీద, అతని బట్టల మీద దాన్ని చల్లాలి. ఆయన కుమారుల మీద, వారి బట్టల మీద దాన్ని చల్లాలి, అహరోను, అతని కుమారులు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది సూచిస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే, వారి బట్టలు ఉపయోగించబడుతాయని ఇది సూచిస్తుంది.
22 “అప్పుడు పొట్టేలు నుండి కొవ్వును తీయాలి. (అహరోనును ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించబడే పొట్టేలు ఇది). తోక చుట్టూ ఉండే క్రొవ్వును, శరీరం లోపలి భాగాలను కప్పివుండే కొవ్వును తీయాలి. కాలేయంలో క్రొవ్విన భాగాన్ని తీయాలి. మూతగ్రంధులు రెండింటిని, కుడి కాలును తీయాలి.
23 పులియని పదార్థం లేకుండా నీవు చేసిన రొట్టెలు గల బుట్టను తీసుకొని యెహోవా ముందు పెట్టాలి. బుట్టలోని రొట్టె ఒకటి, ఒలీవ నూనెతో చేసిన రొట్టె ఒకటి, పలుచని చిన్న అప్పడం ఒకటి బుట్టలో నుండి బయటికి తీయాలి.
24 అప్పుడు వీటిని అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వు. యెహోవా యెదుట వీటిని తమ చేతులతో పట్టుకొని ఉండమని వారితో చెప్పు. ఇది యెహోవాకు ప్రత్యేకమైన అర్పణ.
25 అప్పుడు అహరోను, అతని కుమారుల చేతుల్లోనుంచి వీటిని తీసుకొని, పొట్టేలుతో బాటు బలిపీఠం మీద పెట్టు. యెహోవా ఈ దహనబలి అర్పణ వాసన చూసి ఆనందిస్తాడు. ఇది నిప్పు ఉపయోగించి యెహోవాకు ఇచ్చే అర్పణ.”
26 “అప్పుడ పొట్టేలుయొక్క బోరను తీసుకోవాలి. (ఇది అహరోను ప్రధాన యాజకునిగా చేసే ఆచార క్రమంలో ఉపయోగించే పొట్టేలు). పొట్టేలు బోరను యెహోవా సన్నిధిలో ఇచ్చి పుచ్చుకొనే ప్రత్యేక అర్పణగా అర్పించాలి. జంతువుల్లోని ఈ భాగం నీది.
27 అప్పుడు అహరోనును ప్రధాన యాజకునిగా చేయుటకు ఉపయోగించి పొట్టేలు రొమ్ము, కాలు తీసుకో, వాటిని అహరోనుకు, అతని కుమారులకు ఇయ్యి. ఇది అర్పణలో ఒక ప్రత్యేక భాగం అవుతుంది.
28 ఇశ్రాయేలు ప్రజలు ఈ భాగాలను అహరోనుకు, అతని కుమారులకు ఎల్లప్పుడూ ఇస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు అర్పణ అర్పించినప్పుడల్లా ఈ భాగాలు ఎప్పుడూ యాజకులకే చెందుతాయి. ఈ భాగాలను వారు యాజకులకు ఇచ్చినప్పుడు అవి యెహోవాకు ఇచ్చినట్టే అవుతుంది.
29 “అహరోను ్ట అవుతుంతుంద ఇచ్చినప్పుడు అవి యోచందూయీగించి పొట్టేలు రొమ్ము, కాలు తు తీసుకొని యెహోవా ముందు పెట్టాలి. ప్పవుండే కొవ్వును తీయాలి. రని ఇది చగా ఉండఆరు పేతయారు చేసిన ఆ ప్రత్యేక వస్త్రాలను భద్రం చేయాలి. అతని తర్వాత జీవించే వారందరికీ ఈ వస్త్రాలు చెందుతాయి. వారు యాజకులుగా ఏర్పాటు చేయబడినప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.
30 అహరోను తర్వాత అతని కుమారుడు ప్రధాన యాజకుడు అవుతాడు. ఈ కుమారుడు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసేందుకు సన్నిధి గుడారంలోనికి వచ్చినప్పుడు ఆ వస్త్రాలు ధరిస్తాడు.
31 “అహరోనును ప్రధాన యాజకునిగా చేసేందుకు ఉపయోగించిన పొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర స్థలంలో వండాలి.
32 అప్పుడు అహరోను, అతని కుమారులు సన్నిధి గుడారం ఎదుటి ద్వారం ముందు ఆ మాంసం తినాలి. మరియు బుట్టలోని రొట్టెను కూడ వారు తినాలి.
33 వారు యాజకులుగా చేయబడ్డప్పుడు వారి పాపాలను పరిహరించేందుకు ఈ అర్పణలు ఉపయోగించబడ్డాయి. ఇప్పుడు వారు ఈ అర్పణలను తినాలి.
34 ఆ పొట్టేలు మాంసంలోగాని, ఆ రొట్టెలోగాని ఏమైనా మర్నాటి ఉదయానికి మిగిలి ఉంటే దానిని కాల్చివేయాలి. ఆ రొట్టె, మాంసం ఒక ప్రత్యేక సమయంలో, ఒక ప్రత్యేక విధానంలో మాత్రమే తినవలసినవి గనుక మీరు వాటిని తినకూడదు.
35 “అహరోను, అతని కుమారులకోసం నీవు చేయాలని నేను నీకు ఆజ్ఞాపించిన వీటన్నింటినీ నీవు చేయాలి. వీటిని ఏడురోజుల వ్యవధిలో నీవు చేయాలి.
36 రోజుకు ఒక ఎద్దు చొప్పున ఏడు రోజులు వధించాలి. ఇది అహరోను, అతని కుమారుల పాపముకోసం అర్పణగా ఉంటుంది. బలిపీఠాన్ని పవిత్రం చేసేందుకు నీవు ఈ బలులను ఉపయోగించాలి. బలిపిఠాన్ని పవిత్రం చేసేందుకు దాని మీద ఒలీవ నూనెపోయాలి.
37 ఏడురోజుల పాటు బలిపీఠాన్ని నీవు పవిత్రం చేయాలి. ఆ సమయంలో బలిపీఠం అతిపవిత్రం అవుతుంది.
38 “బలిపీఠం మీద ప్రతిరోజూ ఒక అర్పణ అర్పించాలి. ఒక సంవత్సరం వయస్సుగల రెండు గొర్రె పిల్లల్ని వధించాలి.
39 ఒక గొర్రెపిల్లను ఉదయం, మరో గొర్రెప్లిను ఉదయం, అర్పణ పవిత్రం చేయాలి. గనుక వపొట్టేలు మాంసాన్ని ఒక పవిత్ర ల్లను సాయంత్రం అర్పించాలి.
40 [This verse may not be a part of this translation]
41 [This verse may not be a part of this translation]
42 “ప్రతిరోజూ యెహోవాకు అర్పణగా వీటిని నీవు దహించాలి. సమావేశ గుడారం ముందు ద్వారం దగ్గర, యెహోవా ఎదుట వీటిని చేయాలి. ఇలానే ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. నీవు అర్పణ అర్పించునప్పుడు, యెహోవానైన నేను నిన్ను అక్కడ కలుసుకొని నీతో మాట్లాడుతాను.
43 ఆ స్థలంలో నేను ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొంటాను. నా మహిమవల్ల ఆ స్థలం పవిత్ర పర్చబడుతుంది.”
44 “కనుక సన్నిధి గుడారాన్ని నేను పవిత్రం చేస్తాను. మరియు బలిపీఠాన్ని నేను పవిత్రం చేస్తాను. అహరోను, అతని కుమారులు నాకు యాజకులుగా సేవ చేయగలిగేటట్టు నేను వారిని పవిత్రం చేస్తాను.
45 నేను ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. నేను వారికి దేవుడిగా ఉంటాను.
46 ‘నేనే యెహోవాను, వారి దేవుడ్ని’, అని ప్రజలు తెలుసుకొంటారు. నేను వారితో నివసించేందుకు వారిని ‘ఈజిప్టునుండి బయటికి రప్పించింది నేనే’ అని వారు తెలుసుకొంటారు. నేనే వారి దేవుడైన యెహోవాను.”
1 “తుమ్మ కర్రతో ఒక వేదిక చేయి. ధూపం వేసేందుకు ఈ పీఠమును నీవు ఉపయోగించాలి.
2 వేదికను 18 అంగుళాలు పొడవు, 18 అంగుళాలు వెడల్పు గల చతురస్రముగా నీవు చేయాలి. దీని ఎత్తు 36 అంగుళాలు ఉండాలి. నాలుగు మూలల కొమ్ములు ఉండాలి. ఈ కొమ్ముల్ని వేదికతో కలిపి ఒకటిగా చేయాలి.
3 బలిపీఠం పైభాగాన్ని, అన్ని ప్రక్కలను స్వచ్ఛమైన బంగారం పొదిగించాలి. బలిపీఠం చుట్టూ బంగారు నగిషిబద్ద పెట్టాలి.
4 నగిషీబద్ద అడుగు భాగాన బంగారు ఉంగరాలు నాలు ఉండాలి. ఈ బలిపీఠానికి ఎదురుగా రెండు బంగారు ఉంగరాలు ఉండాలి. బలిపీఠం మోసే కర్రలకోసం ఈ బంగారు ఉంగరాలు ఉపయోగించబడతాయి.
5 తుమ్మకర్రతోనే ఆ కర్రలు చేయాలి. కర్రలకు బంగారు తాపడం చేయాలి.
6 ప్రత్యేక తెరముందు ఈ బలిపీఠాన్ని ఉంచాలి. ఒడంబడిక పెట్టెను తెర అవతల ఉంచాలి. ఆ పెట్టె మూతకు ముందర బలిపీఠం ఉంచాలి. నేను నిన్ను కలుసుకోనే చోటు ఇదే.”
7 “ప్రతీ ఉదయం పరిమళ ద్రవ్యాల ధూపాన్ని బలిపీఠం మీద అహరోను వేయాలి. దీపాలు సరిచేసేందుకు వచ్చినప్పుడు అతడు దీనిని చేయాలి.
8 మరల సాయంత్రం అతడు ధూపం వేయాలి. ఇది అతడు సాయంత్రం దీపాలను సరిచేసే వేళ. కనుక ప్రతిరోజూ శాశ్వతంగా యెహోవా ఎదుట ధూపం వేయబడుతుంది.
9 ఇంకే విధమైన ధూపం వేసేందుకు గాని, దహన బలి కోసంగాని ఈ బలిపీఠాన్ని ఉపయోగించవద్దు. ఏ విధమైన ధాన్యార్పణగాని, పానార్పణంగాని అర్పించేదుకు బలిపీఠాన్ని ఉపయోగించవద్దు.”
10 “సంవత్సరానికి ఒక సారి అహరోను యెహోవాకు ఒక ప్రత్యేక బలి అర్పించాలి. ప్రజల పాప పరిహారం నిమిత్తం చెల్లించేందుకు పాపపరిహారార్థ బలి రక్తాన్ని అహరోను ఉపయోగించాలి. ఈ బలిపీఠపు కొమ్ముల దగ్గర అహరోను దీనిని చేయాలి. ఇది, ప్రాయశ్చిత్తార్థ దినం అని పిలువబడుతుంది. ఇది యెహవాకు అతి ప్రత్యేక దినం.”
11 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు,
12 “ఎంత మంది ప్రజలు ఉన్నారో నీకు తెలిసేటట్టు, ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కబెట్టు. ఇలా చేసినప్పుడల్లా, ప్రతి వ్యక్తీ తనకోసం యెహోవాకు పన్ను చెల్లించాలి. ప్రతి వ్యక్తీ ఇలా చేస్తే ఏ విధమైన దారుణం ప్రజలకు సంభంవిచదు.
13 లెక్కించబడ్డ ప్రతి మనిషీ అరతులం చెల్లించాలి. (ఇది అధికార పూర్వకమైన తులంలో సగం, అధికార తులం అంటే 20 గొర్రెలు). ఈ అరతులం యెహోవాకు అర్పణం
14 లెక్కించబడి, 20 సంవత్సరాలు లేక అంతకు ఎక్కువ వయసుగల ప్రతి వ్యక్తీ యెహోవాకు ఈ అర్పణ చెల్లించాలి.
15 ధనికులు అరతులం కంటె ఎక్కువ చెల్లించకూడదు. ప్రజలందరూ ఒకే అర్పణ యెహోవాకు చెల్లించాలి. ఇది మీ ప్రాణం కోసం చెల్లించే అర్పణ.
16 ఇశ్రాయేలు ప్రజల దగ్గర్నుండి ఈ సొమ్ము పోగుచేయి. సన్నిధి గుడారంలో సేవకోసం ఈ సొమ్ము ఉపయోగించు. యెహోవా తన ప్రజలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ చెల్లింపు ఒక విధానం. వారు తమ స్వంత ప్రాణాల నిమిత్తం చెల్లిస్తారు.”
17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు,
18 “ఇత్తడి గంగాళం ఒకటి చేసి ఇత్తడి పీటమీద దాన్ని పెట్టు. కడుగుకొనేందుకు నీవు దీనిని ఉపయోగించాలి. సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య దీనిని ఉంచి, నీళ్లతో నింపు.
19 ఈ గంగాళంలోని నీళ్లతో అహరోను, అతని కుమారులు వారి కాళ్లు చేతు లు కడుక్కోవాలి
20 సన్నిధి గుడారం ప్రవేశించేటప్పుడు, లేక బలిపీఠం సమీపించేటప్పుడు ప్రతిసారీ వారు నీళ్లతో కడుక్కోవాలి. ఈ విధంగా వారు మరణించరు.
21 మరియు తమ చావకుండా ఉండేందుకు వారు తమ కాళ్లు చేతులు కడుక్కోవాలి. అహరోనుకీ, అతని ప్రజలకీ ఎప్పటికీ కొనసాగే చట్టం యిది. భవిష్యత్తులో జీవించే అహరోను సంతతి వాళ్లందరికీ యిది కొనసాగుతుంది.”
22 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
23 “శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు సంపాదించు. పరిమళ ధూపం చేయడానికి 500 తులాల స్వచ్ఛమైన గోపరసం, 250 తులాల సువాసనగల లవంగపట్ట, 500 తులాల సుగంధ ద్రవ్యాలు,
24 500 తులాల లవంగపట్ట తీసుకో. వీటన్నింటినీ కొలిచేందుకు అధికారిక కొలత ఉపయోగించు. మరియు మూడు పళ్ల ఒలీవ నూనె తీసుకో.
25 “ఒక పరిమళ అభిషేక తైలంగా చేయటానికి వీటన్నింటినీ కలపాలి.
26 సన్నిధి గుడారం మీద, ఒడంబడిక పెట్టె మీద ఈ తైలం పోయి, వీటికి ఒక ప్రత్యేక ఉద్దేశం వుంది అని ఇది తెలియజేస్తుంది.
27 బల్లమీద, బల్లమీద ఉన్న పాత్రలన్నింటిమీద తైలం పోయి. దీపం మీద, దాని పరికరాలన్నింటి మీద ఈ తైలం పోయి. ధూపవేదిక మీద తైలం పోయి.
28 ఇంకా దేవునికి అర్పణలు దహనం చేసే బలిపీఠం మీద ఈ తైలం పోయి. ఆ బలిపీఠం పైన ఉండే సమస్తం మీద తైలం పోయి. గంగాళంమీద, దాని పీటమీద ఈ తైలం పోయి.
29 వీటన్నింటినీ నీవు పవిత్రం చేయాలి. అవి యెహోవాకు చాల ప్రత్యేకం. వీటిని ఏది తాకినా అది పవిత్రం అవుతుంది.
30 “అహరోను, అతని కుమారుల మీద ఈ తైలంపోయి. వారు ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని ఇది తెలియజేస్తుంది. అప్పుడు యాజకులుగా వారు నా సేవ చేయవచ్చు.
31 అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు.
32 సామాన్యమైన సుగంధ తైలంగా ఎవరూ దీనిని వాడకూడదు. ఈ ప్రత్యేక తైలం తయారు చేసిన విధానంలో సుగంధ తైలం తయారు చేయకూడదు. ఈ తైలం పవిత్రం, ఇది మీకు చాల ప్రత్యేకమైనదిగా ఉండాలి.
33 ఎవరైనా ఈ పవిత్ర తైలం వలె సుగంధ తైలం తయారు చేసి అన్యునికి యిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లో నుండి వేరు చేయబడాలి.
34 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ పరిమళ ద్రవ్యాలను తీసుకరా! జటామాంసి, గోపి చందనం, గంధపుచెక్క స్వచ్ఛమైన సాంబ్రాణి. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ సమపాళ్లలో ఉండేటట్టు తప్పక చూడాలి.
35 సుగంధ పరిమళ ధూపంగా ఉండేటట్టు ఈ పరిమళ ద్రవ్యాలన్నిటినీ కలపాలి. పరిమళ తైలం తయారుచేసే వాడు చేసినట్టే దీనిని చేయాలి. మరియు ఈ ధూపంలో ఉప్పు కలుపు. అది దీనిని స్వచ్ఛమైనదిగా, ప్రత్యేకమైనదిగా చేస్తుంది.
36 ధూప ద్రవ్యంలో కొంత మెత్తటి పొడుం అయ్యేంత వరకు నూరాలి. సన్నిధి గుడారంలో, ఒడంబడిక పెట్టె ఎదుట ఆ పొడుం ఉంచు. ఇది నేను నిన్ను కలుసుకొనే చోటు. ఈ ధూపపు పొడుంను దాని ప్రత్యేక పని కోసమే నీవు ఉపయోగించాలి.
37 యెహోవా కోసం ఈ ప్రత్యేక విధానంలో మాత్రమే నీవు ఈ ధూపాన్ని ఉపయోగించాలి. ఈ ధూపాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో నీవు తయారు చేయాలి. ఇంకే యితరమైన ధూపం చేయడానికి కూడ ఈ ప్రత్యేక పద్ధతిని వినియోగించవద్దు.
38 ఒక వ్యక్తి, తన కోసం ఈ ధూపం కొంత తయారు చేసి, దాని పరిమళాన్ని అనుభవించాలని కోరవచ్చు. అయితే, అతడు గనుక అలా చేస్తే, వాడు తన ప్రజల నుండి వేరు చేయబడాలి.”
1 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
2 “యూదా గోత్రంలో ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పరచుకొన్నాను (హూరు కుమారుడు ఊరు).
3 బెసలేలును నేను దేవుని ఆత్మతో నింపాను. అన్ని రకాల వస్తువులు చేసేందుకు జ్ఞానం, నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను.
4 నమూనాలు గీయటంలో బెసలేలు చాల ప్రజ్ఞ గలవాడు. బంగారు, వెండి, ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు.
5 బెసలేలు అందమైన నగలను చెక్కి, పొదుగగలడు. అతడు చెక్క పని చేయగలడు. బెసలేలు అన్ని రకాల పనులు చేయగలడు.
6 అతనితో పని చేయటానికి అహూలియాబును కూడ నేను ఏర్పరచుకొన్నాను. అహూలియాబు దాను గోత్రపు అహీసామాకు కుమారుడు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేయగలిగేటట్టు మిగిలిన పని వాళ్లందరికీ నేను నైపుణ్యం యిచ్చాను.”
7 “సన్నిధి గుడారం ఒడంబడిక పెట్టె పెట్టెను మూసే కరుణా పీఠము.
8 బల్ల, దానిమీద ఉండాల్సినవన్నీ ధూప వేదిక
9 దహన బలులు దహించే బలిపీఠం బలిపీఠం దగ్గర ఉపయోగించే వస్తువులు గంగాళం, దాని క్రింద పీట.
10 యాజకుడు అహరోనుకు ప్రత్యేక వస్త్రాలన్నీ, అతని కుమారులు యాజకులుగా పరిచర్య చేసేటప్పుడు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలన్నీ,
11 అభిషేకానికి పరిమళ సువాసనగల తైలం, పవిత్ర స్థలానికి అవసరమైన పరిమళ వాసనగల ధూపం. ఈ పని వాళ్లు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అన్ని వస్తువులనూ తయారు చేస్తారు.”
12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
13 “ఇశ్రాయేలు ప్రజలతో దీన్ని చెప్పు; ‘నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు పాటించాలి. రాబోయే తరాలన్నింటిలో మీకు, నాకు మధ్య అవి ఒక గురుతుగా ఉంటాయి కనుక మీరు ఇలా చేయాలి. యెహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకొన్నానని ఇది మీకు తెలియజేస్తుంది.”
14 “‘సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి. ఏ వ్యక్తి అయినా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగానే పరిగణిస్తే, ఆ వ్యక్తిని చంపేయాలి. సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి.
15 పని చేయడానికి వారంలో ఇంకా ఆరు రోజులున్నాయి. అయితే, ఏడో రోజు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. సబ్బాతు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వాణ్ణి చంపెయ్యాలి.
16 ఇశ్రాయేలు ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని, దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి. ఇది నాకూ, వారికీ మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక
17 ఇశ్రాయేలీయులకూ, నాకూ మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజే. యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని చేసాడు. ఏడోరోజున ఏ పని చేయక విశ్రాంతి తీసుకొన్నాడు.”’
18 అలా సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో మాట్లాడ్డం ముగించాడు. అప్పుడు ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలను యెహోవా మోషేకు ఇచ్చాడు. దేవుడు తన వ్రేలితో రాళ్లమీద ఈ ఆజ్ఞలు రాసాడు.
1 చాలాకాలం గడిచిపోయినా, మోషే పర్వతం దిగి రాకపోవడం ప్రజలు గమనించారు. కనుక ప్రజలు అహరోను చుట్టూ చేరారు, “చూడు, ఈజిప్టు దేశం నుండి మోషే మమ్మల్ని బయటకు నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. అందుచేత మా ముందర నడవడానికి ఒక దేవతను చేసి మమ్మల్ని నడిపించు” అని వారతినితో చెప్పారు.
2 “మీ భార్యలు, కుమారులు, కుమార్తెలకు చెందిన బంగారు వస్తువులను తీసుకురండి” అని అహరోను ప్రజలతో అన్నాడు.
3 కాబట్టి ప్రజలంతా వారి బంగారు వస్తువులను పోగుచేసి వాటిని అహరోను దగ్గరకు తెచ్చారు.
4 ప్రజల దగ్గర నుండి అహరోను బంగారం తీసుకున్నాడు. అప్పుడు వాటితో ఒక దూడ విగ్రహం చేసాడు. విగ్రహం చెక్కడానికి అహరోను ఉలి ఉపయోగించాడు. (తర్వాత దానికి బంగారం పొదిగించాడు.) అప్పుడు ప్రజలు, “ఓ ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు నడిపించింది ఈ దేవుడే” అన్నారు.
5 అహరోను వీటన్నింటినీ చూసాడు. కనుక ఆ దూడ ఎదుట ఒక బలిపీఠం నిర్మించాడు. అప్పుడు అహరోను ఒక ప్రకటన చేసాడు. “రేపు యెహోవాకు ప్రత్యేక పండుగ” అని చెప్పాడు.
6 మర్నాడు ఉదయం పెందలాడే ప్రజలు మేల్కొన్నారు. వాళ్లు జంతువులను చంపి దహన బలులుగాను, సమాధాన బలులుగాను అర్పించారు. తిని, తాగేందుకు ప్రజలు కూర్చున్నారు. అప్పుడు వాళ్లు విచ్చలవిడిగా సంబరం చేసుకున్నారు.
7 అదే సమయంలో మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఈ పర్వతం దిగి వెళ్లు. నీ ప్రజలు, ఈజిప్టు దేశం నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన ప్రజలు భయంకర పాపం చేసారు.
8 వాళ్లు చేయాలని నేను ఆజ్ఞాపించిన సంగతుల నుండి వాళ్లు చాల త్వరగా తప్పి పోయారు. కరగించిన బంగారంతో వాళ్లు ఒక దూడను చేసుకొన్నారు. వాళ్లు ఆ దూడను పూజిస్తూ దానికి బలులు చెల్లిస్తున్నారు. ‘ఇశ్రాయేలూ, ఈజిప్టు నుండి నిన్ను బయటకు రప్పించిన దేవుడు ఇదే, అని ప్రజలు చెప్పుకొనుచున్నారు.”
9 “ఈ ప్రజలను నేను చూశాను. వీళ్లు ఎప్పుడూ నన్ను వ్యతిరేకించే మొండి ప్రజలని నాకు తెలుసు.
10 కనుక కోపంతో వాళ్లను నాశనం చేయనివ్వు, అప్పుడు నీలోనుండి ఒక జనాన్ని నేను తయారు చేస్తాను” అని మోషేతో యెహోవా అన్నాడు.
11 అయితే, మోషే తన దేవుడైన యెహవాను బ్రతిమాలుకొని: “ప్రభూ! నీ కోపం చేత నీ ప్రజలను నాశనం చేయకు. నీవే నీ మహాశక్తితో బలంతో ఈ ప్రజలను ఈజిప్టు నుండి తీసుకువచ్చావు.
12 అయితే, నీవే నీ ప్రజలను నాశనం చేస్తే, ‘యెహోవా తన ప్రజలకు చెడ్డకార్యాలను చేయాలని తలపెట్టాడు. అందుకే ఆయన వాళ్లను ఈజిప్టు నుండి బయటకు రప్పించాడు. పర్వతాల్లోనే వాళ్లను చంపాలని ఆయన అనుకున్నాడు. భూమి మీద తన ప్రజల్ని నాశనం చేయాలని ఆయన అనుకొంటున్నాడు’ అని ఈజిప్టు ప్రజలు చెప్పవచ్చు. కనుక నీ ప్రజల మీద కోపగించవద్దు. నీ కోపం విడిచిపెట్టేయి. నీ ప్రజల్ని నాశనం చేయకు.
13 నిన్ను సేవించిన మనుష్యులు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును (యాకోబు) జ్ఞాపకం చేసుకో. నీవు నీ పేరు ప్రయోగించి ఆ మనుష్యులకు వాగ్దానం చేసావు. ‘నీ ప్రజలను ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతగా చేస్తాను. నేను వారికి వాగ్దానం చేసిన ఈ దేశం అంతా నీ ప్రజలకు ఇస్తాను. ఈ దేశం శాశ్వతంగా వారిదే అవుతుంది’ అని నీవు చెప్పావు.”‘
14 కనుక యెహోవా తన ప్రజలను గూర్చి సంతాపపడ్డాడు. ఆయన చేస్తానన్న కీడును వారికి చేయలేదు. అంటే, ప్రజలను ఆయన నాశనం చేయలేదు.
15 అప్పుడు మోషే పర్వతం దిగి వెళ్లాడు. ఆజ్ఞలు రాయబడ్డ రెండు రాతి పలకలు మోషే దగ్గర ఉన్నాయి. రాతికి వెనుక, ముందు రెండు వైపుల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి.
16 దేవుడు తానే ఆ రాళ్లను చేసాడు. మరియు దేవుడే ఆ రాళ్ల మీద ఆజ్ఞలు రాసాడు.
17 వారు పర్వతం దిగి వెళ్తున్నప్పుడు ప్రజలు బస చేసిన చోటు నుండి వచ్చిన శబ్ధం యెహోషువా విన్నాడు, “కింద బసలో యుద్ధధ్వని వినిపిస్తున్నట్టుంది” అని మోషేతో యెహోషువా అన్నాడు.
18 “అందుకు మోషే, అది జయధ్వనులు చేస్తున్న సైన్యం శబ్దం కాదు. ఓటమివల్ల ఒక సైన్యం ఏడుస్తున్న శబ్దమూ కాదు అది, నాకు వినబడుతోన్నది సంగీత శబ్దం” అని జవాబిచ్చాడు.
19 మోషే బసను సమీపించినప్పుడు, అతడు బంగారు దూడను, ప్రజలు నాట్యమాడటమూ చూసాడు. మోషేకు చాలా కోపం వచ్చి, ఆ ప్రత్యేక రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పర్వతం కింది భాగంలో ఆ రాతి పలకలు ముక్కలు ముక్కలయ్యాయి.
20 అప్పుడు ప్రజలు చేసిన దూడను మోషే నాశనం చేసాడు. దాన్ని మంటల్లో వేసి కరిగించేసాడు. అప్పుడు ఆ బంగారం దుమ్ము అయ్యేంత వరకు నూరేసాడు. ఆ దుమ్మును నీళ్లలో పడేసి ఇశ్రాయేలు ప్రజల చేత బలవంతంగా ఆ నీళ్లు తాగించాడు.
21 “ఈ ప్రజలు నీకేమి చేసారు? ఇలాంటి చెడ్డ పాపం చేయడానికి నీవెందుకు వాళ్లను నడిపించావు?” అని అహరోనును మోషే అడిగాడు.
22 “అయ్యా, కోపగించకు. ఈ ప్రజలు తప్పు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని నీకు తెలుసు.
23 ‘ఈజిప్టు నుండి మోషే మమ్మల్ని నడిపించాడు. అయితే అతనికి ఏమయిందో మాకు తెలియదు. కనుక మమ్మల్ని నడిపించేందుకు మా కోసం ఒక దేవతను తయారు చేయి’ అని ప్రజలు నాతో అన్నారు.
24 కనుక ‘మీవద్ద ఉన్న బంగారు నగలను నాకు ఇవ్వండి’ అని ప్రజలతో చెప్పాను. ప్రజలు వారి బంగారం నాకు ఇచ్చారు. నేను ఆ బంగారాన్ని అగ్నిలో వేసాను. అగ్నిలో నుండి ఆ దూడ బయటకు వచ్చింది” అని అహరోను జవాబిచ్చాడు.
25 అహరోను అక్కడ గలభాకు కారణమని మోషే తెలుసుకున్నాడు. శత్రువులంతా చూడుగలిగేటట్టు ప్రజలు వెర్రివాళ్లలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
26 కనుక నివాసాల ప్రవేశం దగ్గర మోషే నిలబడ్డాడు. “యెహోవాను వెంబడించాలని కోరేవారు ఎవరో వారు నా దగ్గరకు రావాలి.” అన్నాడు. లేవీ కుటుంబానికి చెందిన ప్రజలంతా మోషే దగ్గరకు పరుగెత్తారు.
27 అప్పుడు మోషే అన్నాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెబతున్నాడో నేను మీకు చెబతాను. ‘ప్రతి మనిషీ తన కత్తి తీసుకొని మన బసలో ఒక చివర నుండి మరో చివరకు వెళ్లాలి. ప్రతి మనిషి తన సోదరుణ్ణి, స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని పంపాల్సి వచ్చినా మీరు వారిని చంపాలి.”
28 లేవీ కుటుంబానికి చెందిన ప్రజలు మోషే మాటకులోబడ్డారు. ఆ రోజు ఇశ్రాయేలీయులతో సుమారు 3000 మంది చనిపోయారు.
29 అప్పుడు, “మీ కుమారులను మీ సోదరులను దీవించే వారినిగా యెహవా నేడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు” అని మోషే చెప్పాడు.
30 మర్నాటి ఉదయం ప్రజలందరికీ మోషే, “మీరు భయంకర పాపం చేసారు. అయితే ఇప్పుడు నేను యెహోవా దగ్గరకు పైకి వెళ్తాను. ఆయన మీ పాపం విషయం మిమ్మల్ని క్షమించేందుకు నేనేమైనా చేయగలనేమో” అని చెప్పాడు.
31 కనుక మోషే యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లి, “దయచేసి ఆలకించు! ఈ ప్రజలు చాలా చెడ్డ పాపం చేసి, బంగారంతో దేవుణ్ణి చేసారు.
32 ఇప్పుడు ఈ పాపం విషయం వారిని క్షమించు. నీవు గనుక వారిని క్షమించకపోతే, నీవు వ్రాసిన గ్రంథంలో నా పేరు తుడిచేయి” అన్నాడు.
33 అయితే మోషేతో యెహోవా అన్నాడు, “నాకు వ్యతిరేకంగా ఎవరు పాపం చేస్తారో ఆ ప్రజల పేర్లు మాత్రమే నా గ్రంథంలో నుండి తుడిచి వేస్తాను.
34 కనుక కిందకు వెళ్లి, నేను నీకు చెప్పిన చోటుకు ప్రజలను నడిపించు. నీకు ముందు నా దేవదూత నడుస్తూ నిన్ను నడిపిస్తాడు. పాపం చేసిన వాళ్లను శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు వాళ్లు శిక్షించబడుతారు.”
35 కనుక ఆ ప్రజలకు భయంకర వ్యాధి వచ్చేటట్టు యెహోవా చేసాడు. వారు బంగారు దూడను చేయమని అహరోనుతో చెప్పినందువల్ల ఆయన అలా చేసాడు.
1 అయితే మోషేతో యెహోవా యిలా అన్నాడు: “ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకు వచ్చిన నీ ప్రజలూ, నీవూ ఇక్కడనుండి వెళ్లిపోవాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబలకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశానికి వెళ్లండి. నేను వాళ్లకు వాగ్దానం చేసాను. మీ సంతానమునకు ఆ దేశాన్ని ఇస్తానని నేను చెప్పాను.
2 మీకు ముందు వెళ్లడానికి ఒక దూతను నేను పంపిస్తాను. కనానీయులను, అమ్మోరీయులను, హిత్తీయులను పెరిజ్జీయులను. హివ్వీయులను, యెబూసీయులను నేను ఓడిస్తాను. ఆ ప్రజలు మీ దేశాన్ని విడిచి పెట్టేసేటట్టు బలవంతం చేస్తాను.
3 కనుక అనేక మంచి వాటితో నిండిన దేశానికి వెళ్లండి. కానీ నేను మీతో రాను. మీరు చాలా మొండివారు. నేను మీతో వస్తే మార్గంలో కోపంవచ్చి మిమ్మల్ని నేను నాశనం చేయవల్సి వస్తుందేమో.”
4 ఈ దుర్వార్తను ప్రజలు విని చాలా విచారించారు. దీని తర్వాత ప్రజలు నగలు పెట్టుకోలేదు.
5 “మీరు మొండివారు నేను మీతో కొంచెంసేపు ప్రయాణం చేసినా సరే నేను మిమ్మల్ని నాశనం చేయాల్సి వస్తుంది. కనుక మీ నగలన్నీ తీసి వేయండి. అప్పుడు మీ విషయం ఏమి చేయాలో నేను ఆలోచిస్తాను” అని మోషేతో యెహోవా చెప్పినందువల్ల వారు నగలు ధరించలేదు.
6 కనుక హోరేబు కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వారి నగలన్నీ తీసి వేసారు.
7 గుడారాన్ని, నివాస డేరాలకు కొంత దూరం బయటకు జరిపాడు మోషే. “సన్నిధి గుడారం” అని మోషే దానికి పేరు పెట్టాడు. ఏ వ్యక్తిగాని యెహోవాను ఏదైనా అడగాలంటే, నివాస డేరాలకు వెలుపల ఉన్న సన్నిధి గుడారానికి వెళ్లాల్సి వచ్చింది.
8 ఎప్పుడేనా సరే, బయటకు ఆ గుడారానికి మోషే వెళ్తే ప్రజలంతా అతన్ని గమనిస్తూ ఉండేవారు. ప్రజలంతా వారి గుడారపు ద్వారం దగ్గర నిలబడి మోషే సన్నిధి గుడారంలో ప్రవేశించేవరకు అతణ్ణి గమనించి చుస్తుండేవారు.
9 మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లినప్పుడల్లా స్తంభంలా నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. ఈ విధంగా మోషేతో యెహోవా మాట్లాడతాడు.
10 సన్నిధి గుడారపు ద్వారం దగ్గర మేఘాన్ని చూడగానే ప్రజలు యెహోవాను ఆరాధించుటకు సాష్టాంగపడేవారు.
11 మోషేతో ముఖాముఖీగా యెహోవా మాట్లాడాడు. ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో యెహోవా మాట్లాడాడు. దేవునితో మాట్లాడిన తర్వాత, మోషే ఎప్పుడూ బసకు వెళ్లిపోయేవాడు. నూను కుమారుడైన యెహోషువ అనే ఒక యువకుడు మోషేకు సహాయకుడు. మోషే సన్నిధి గుడారం వదిలినప్పుడల్లా యెహోషువ సన్నిధి గుడారంలో నిలిచి ఉండేవాడు.
12 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: “ఈ ప్రజల్ని నడిపించమని నీవు చెప్పావు. నాతో ఎవర్ని నీవు పంపిస్తావో నీవు చెప్పలేదు. ‘నీవు నాకు బాగా తెలుసు. నిన్ను గూర్చి నేను ఆనందిస్తున్నాను.’ అని నీవు నాతో చెప్పావు.
13 నిజంగా నేను నీక ఆనందం కలిగించి ఉంటే, నీ మార్గాలు నాకు బోధించు. నేను నిన్ను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగైతే, నేను ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెడ్తూ ఉండగలుగుతాను. వీళ్లంతా నీ ప్రజలని జ్ఞాపకం ఉంచుకో.”
14 “నేను నీతో కూడా వస్తాను నేను మిమ్మల్ని నడిపిస్తాను” అని యెహోవా జవాబిచ్చాడు.
15 అప్పుడు మోషే ఆయనతో అన్నాడు: “నీవు మాతో రాకపోతే మాత్రం, మమ్మల్ని యిక్కడ నుండి పంపించి వేయకు.
16 మరియు నా విషయంలో, ఈ ప్రజల విషయంలో నీవు సంతోషిస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది? నీవు మాతో కూడా వస్తే, అప్పుడు మాకు తెలుస్తుంది. నీవు మాతో రాకపోతే, ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర ప్రజలకంటే నేను, ఈ ప్రజలు ప్రత్యేకం కాదు.”
17 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు అడిగినట్టు నేను చేస్తాను. నీ పట్ల నాకు ఆనందం గనుక నేను ఇలా చేస్తాను. నీవు నాకు బాగా తెలుసు.”
18 అప్పుడు మోషే, “అలాగైతే నీ మహిమ నాకు చూపించు” అన్నాడు.
19 అప్పుడు యెహోవా జవాబిచ్చాడు: “నా మంచితనం అంతా నీ ముందు నడిచేటట్లు చేస్తాను. నేను యెహోవాను. నీకు వినబడేటట్టు నా పేరు నేను ప్రకటిస్తాను. నేను ప్రకటించుకున్న వారికి ప్రేమ, దయ నేను చూపెడతాను.
20 కాని నా ముఖం నీవు చూడలేవు. ఏ మనిషీ నన్ను చూచి కూడా బ్రతకలేడు.”
21 “అక్కడ నా దగ్గర ఒక చోట ఒక బండ వుంది. నీవు ఆ బండమీద నిలబడవచ్చు.
22 నా మహిమ ఆ స్థలాన్ని దాటి వెళ్తుంది. ఆ బండలోని ఒక పెద్ద సందులో నేను నిన్ను ఉంచి, నేను దాటి వెళ్లేటప్పుడు, నా చేతితో నిన్ను కప్పుతాను.
23 అప్పుడు నేను నా చేయిని తీసివేస్తాను. నీవు నా వెనుకవైపు చూస్తావు. కాని నా ముఖం మాత్రము నీవు చూడలేవు.”
1 అప్పుడు మోషేతో యెహోవా ఇలాగు చెప్పాడు: “ముందు పగులగొట్టబడ్డ రెండు రాతి పలకల్లాంటివే మరో రెండు రాతి పలకలు తయారు చేయి. మొదటి రెండు రాళ్లమీద రాయబడ్డ మాటలే ఈ రాళ్ల మీద నేను రాస్తాను.
2 రేపు ఉదయం సిద్ధంగా ఉండు. సీనాయి కొండమీదికి రమ్ము. అక్కడ కొండ శిఖరం మీద నా ఎదుట నిలబడు.
3 నీతో ఇంక ఏ వ్యక్తీ రావడానికి వీలులేదు. కొండమీద ఎక్కడా ఏ వ్యక్తి కనబడకూడదు. కనీసం ఆ కొండ కిందకూడ నీ పశువుల మందలు కాని, గొర్రెల మందలు గాని మేత కూడ మేయకూడదు.”
4 కనుక మొదటి వాటిలాగే మరో రెండు రాతి పలకలను మోషే చేసాడు. ఆ మర్నాడు ఉదయాన్నే సీనాయి కొండ మీదికి అతడు వెళ్లాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే అంతా చేసాడు. ఆ రెండు రాతి పలకలను మోషే తీసుకొని వెళ్లాడు.
5 మోషే కొండ మీద ఉన్నప్పుడు, ఒక మేఘం మీద యెహోవా దిగి వచ్చాడు. అక్కడ మోషే దగ్గర యెహోవా నిలబడ్డాడు. అతడు యెహోవాను పేరుపెట్టి పిలిచాడు.
6 మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా ప్రేమపూర్ణుడు. యెహోవా నమ్ముకోదగినవాడు.
7 వేలాది తరాలకు దయచూపించే వాడు యెహోవా. ప్రజలు చేసే తప్పులను యెహోవా క్షమిస్తాడు. అయితే నేరస్తులను శిక్షించడం యెహోవా మరచిపోడు. నేరస్తులను యెహోవా శిక్షించడమే కాదు, వారు చేసే తప్పులవల్ల వారి పిల్లలు, మనుమళ్లు, మూడు నాలుగు తరాల వరకు శ్రమ అనుభవిస్తారు.”
8 వెంటనే మోషే సాష్టాంగపడి యెహోవాను ఆరాధించాడు. మోషే ఇలా అన్నాడు:
9 “ప్రభూ, నా విషయం నీకు ఇష్టమైతే దయచేసి మాతోకూడా రమ్ము. వీళ్లు మొండి ప్రజలని నాకు తెలుసు. అయితే మేము చేసిన తప్పుల విషయంలో మమ్మల్ని క్షమించు. మమ్మల్ని నీ ప్రజలుగా స్వీకరించు.”
10 అప్పుడు యెహోవా చెప్పాడు: “నీ ప్రజలందరితో నేను ఈ ఒడంబడికను చేస్తున్నాను. భూమి మీద ఈ జనం కోసం ఇదివరకు ఎన్నడూ చేయని అద్భుతకార్యాలు నేను చేస్తాను. యెహోవానైన నేను మహాఘనుడనని నీతో ఉన్న ప్రజలు చూస్తారు. నేను నీ కోసం చేసే అద్భుత కార్యాలను వారు చూస్తారు.
11 ఈ వేళ నీకు నేను ఆజ్ఞాపిస్తున్న విషయాలకు లోబడు, నీ శత్రువులు నీ దేశము వదలివెళ్లి పోయేటట్టు నేను వారిని బలవంతం చేస్తాను. అమోరీయులను, కనానీయలను, హిత్తీయులను, పెరిజీయులను, హివ్వీయులను, యెబసీయులను నేను బయటకు వెళ్ళగొడతాను.
12 జాగ్రత్తగా ఉండు! నీవు వెళ్తోన్న దేశంలో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకు. ఆ ప్రజలతో నీవు ఏదైనా ఒడంబడిక చేస్తే, అది నీకు చిక్కు తెచ్చిపెడుతుంది.
13 అయితే వారి బలిపీఠాలు నాశనం చేయి. వారు పూజించే రాళ్లను విరుగగొట్టు. వారి విగ్రహాలను నరికి వెయ్యి.
14 మరో దేవుడ్ని ఎవర్నీ ఆరాధించవద్దు. నేను ఎల్కానా, రోషముగల యెహోవాను. అది నా పేరు. నేను ఎల్కానా, అంటే రోషముగల దేవుడ్ని.”
15 “ఆ దేశములో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకుండా జాగ్రత్తగా ఉండు. నీవు గనుక అలా చేస్తే, వారు వారి వారి దేవతలను ఆరాధించేటప్పుడు వాళ్లతో కలవమని ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు. వాళ్ల బలుల మాంసం నీవు తినకుండ జాగ్రత్త పడుము.
16 వారి కూతుళ్లు కొందరిని మీ కుమారులకు భార్యలుగా మీరు చేసుకుంటారేమో. ఆ కూతుళ్లు తప్పుడు దేవతలను సేవిస్తారు. మీ కుమారులు కూడా అలాగే చేసేటట్టు వారు నడిపించవచ్చు.”
17 “విగ్రహాలు చేసుకోవద్దు.”
18 “పులియని రొట్టెల పండుగ ఆచరించు. నేను ఇదివరకు మీతో చెప్పిన ప్రకారము పులియచేసే పదార్థం లేకుండా తయారు చేయబడిన రొట్టెలను ఏడు రోజులపాటు తినాలి. నేను ఏర్పరచుకున్న అబీబు నెలలో దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నెల అది.”
19 “ఒక స్త్రీకి పుట్టిన ప్రథమ శిశువు ఎల్లప్పుడూ నాకే చెందుతుంది. మీ పశువులకు, గొర్రెలకు మొదటిదిగా పుట్టే పిల్లలు కూడా నాకే చెందుతాయి.
20 మొదటిదిగ పుట్టిన ఒక గాడిదను నీవు ఉంచుకోవాలంటే ఒక గొర్రె పిల్లను యిచ్చి నీవు దాన్ని కొనుక్కోవచ్చు. అయితే నీవు ఒక గొర్రె పిల్లను యిచ్చి ఆ గాడిదను కొనకపోతే, ఆ గాడిద మెడ నీవు విరుగగొట్టాలి. ప్రథమ సంతానమైన నీ కుమారులందరినీ నా దగ్గర్నుంచి నీవు కొనాలి. కానుక లేకుండా ఏ మనిషీ నా దగ్గరకు రాకూడదు.”
21 “ఆరు రోజులు నీవు పనిచేస్తావు. అయితే ఏడో రోజున నీవు విశ్రాంతి తీసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు గూడ నీవు విశ్రాంతి తీసుకోవాలి.”
22 “నీవు వారాల పండుగ ఆచరించాలి. గోధుమ కోతలో నుండి మొదటి గింజల్ని ఈ పండుగకు వినియోగించాలి. సంవత్సరాంతములో కోతకాలపు పండుగ ఆచరించాలి.”
23 “ప్రతి సంవత్సరమూ మూడుసార్లు మీ పురుషులంతా మీ యజమానీ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోఉండేందుకు వెళ్లాలి.
24 “మీరు మీ దేశంలోకి వెళ్లినప్పుడు, ఆ దేశంలో నుండి మీ శత్రువులను నేను వెళ్లగొట్టి వేస్తాను. మీ సరిహద్దులను నేను విశాలం చేస్తాను. మీకు ఇంకా భూమి లభిస్తుంది. ప్రతి సంవత్సరం మూడు సార్లు మీరు యెహోవా దేవుని ఎదుటకి వెళ్లాలి. ఆ సమయంలో ఎవ్వరూ మీ భూమిని మీ దగ్గర నుండి తీసుకునేందుకు ప్రయత్నించరు.”
25 “బలి రక్తం నీవు నాకు అర్పిస్తే పులిసిన పదార్థము ఏదీ దానితోపాటు అర్పించవద్దు.” “పస్కా భోజనంలోని మాంసం ఏ మాత్రము మరునాటి ఉదయానికి మిగులకూడదు.”
26 “మీ కోతలో నుండి మొట్టమొదటి పంట యెహోవాకు ఇవ్వాలి. మీ యెహోవా దేవుని ఆలయములోనికి వాటిని తీసుకొని రావాలి.” “మేక పిల్లను దాని తల్లి పాలతో ఎన్నడూ వండకూడదు.”
27 అప్పుడు మోషేతో యెహోవా, “నేను నీకు చెప్పిన విషయాలన్నీ రాయి. నీతోను, ఇశ్రాయేలు ప్రజలతోను నేను చేసిన ఒడంబడిక విషయాలు అవి” అన్నాడు.
28 నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు.
29 అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు.
30 మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు.
31 అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు.
32 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు.
33 మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు.
34 యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి - యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు.
35 మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుకును తీసే వాడుకాదు.
1 ఇశ్రాయేలు ప్రజలందర్నీ మోషే సమావేశ పర్చాడు. మోషే వారితో చెప్పాడు: “మీరు చేయాలని యెహోవా ఆజ్ఞాపించిన విషయాలు నేను మీకు చెబతాను.
2 “పని చేయడానికి ఆరు రోజులున్నాయి. అయితే ఏడో రోజు మీకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి రోజు. ఆ ప్రత్యేక దినాన విశ్రాంతి తీసుకోవడంవల్ల మీరు యెహోవాను ఘనపరుస్తారు. ఏడో రోజున పనిచేసే వ్యక్తిని చంపెయ్యాలి.
3 సబ్బాతు రోజున మీరు నివసించే స్థలాల్లో నిప్పు కూడ రాజబెట్టకూడదు.”
4 ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఇలా చెప్పాడు: “యెహోవా ఆజ్ఞాపించినది ఇదే.
5 యెహోవా కోసం ప్రత్యేక కానుకలు సమకూర్చండి. మీరు ఏమి ఇస్తారో మీలో ప్రతి ఒక్కరూ మీ హృదయంలో తీర్మానం చేసుకోవాలి. అప్పుడు ఆ కానుక యెహోవా కోసం తీసుకుని రావాలి. బంగారం, వెండి, ఇత్తడి.
6 నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట, శ్రేష్ఠమైన సన్నటి బట్ట, మేక బొచ్చు.
7 ఎరుపు రంగు వేసిన గొర్రె తోళ్లు, మంచి చర్మాలు, తుమ్మ కర్ర,
8 దీపాల కోసం ఒలీవ నూనె, అభిషేక తైలం కోసం పరిమళ ద్రవ్యాలు, సువాసన ధూపంకోసం పరిమళ ద్రవ్యాలు,
9 లేతపచ్చ రాళ్లు, యితర నగలు కానుకలుగా తీసుకు రావాలి. యాజకులు ధరించే ఏఫోదు, న్యాయ తీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు, నగలు అమర్చబడుతాయి.
10 నైపుణ్యంగల వాళ్లందరూ యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ చేయాలి. (యెహోవా ఆజ్ఞాపించిన వస్తువులు ఇవి):
11 పవిత్ర గుడారం, దాని బయటి గుడారం, దాని కప్పు, కొక్కీలు, చట్రాలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు,
12 ఒడంబడిక పవిత్ర పెట్టె, దాని కర్రలు, పెట్టెను మూసే దాని మూత, పెట్టె ఉండే చోటును కప్పి ఉంచే తెర
13 బల్ల, దాని కర్రలు, బల్ల మీద వస్తువులన్నీ, బల్ల మీద ఉండే ప్రత్యేక రొట్టె,
14 వెలుగు కోసం ఉపయోగించే దీప స్తంభం, దీప స్తంభానికి సంబంధించిన వస్తువులన్నీను, దీపాలు, దీపానికి నూనె,
15 ధూపం వేసేందుకు బలిపీఠం, దాని కర్రలు, అభిషేక తైలం, సువాసన గల ధూపద్రవ్యాలు, పవిత్ర గుడారం, ప్రవేశం దగ్గర ద్వారాన్ని కప్పి ఉంచే తెర,
16 అర్పణలు దహించే బలిపీఠం, దాని ఇత్తడి తెర, కర్రలు, బలిపీఠం దగ్గర ఉపయోగించే అన్ని వస్తువులు, గంగాళం, దాని పీట,
17 ఆవరణపు తెరలు, వాటి కర్రలు, దిమ్మలు, ఆవరణ ద్వారపు తెర
18 గుడారం, ఆవరణ గుడారం పట్టి ఉంచే మేకులు, మేకులకు కట్టే తాళ్లు,
19 పరిశుద్ధ స్థలంలో యాజకులు ధరించే ప్రత్యేక నేత వస్త్రాలు. యాజకుడైన అహరోను, అతని కుమారులు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలు ఇవి. వాళ్లు యాజకులుగా సేవ చేసేటప్పుడు ఈ వస్త్రాలు ధరిస్తారు.”
20 అప్పుడు ప్రజలంతా మోషే దగ్గర్నుంచి వెళ్లిపోయారు.
21 ఇవ్వాలి అనుకొన్న ప్రజలంతా వచ్చి యెహోవాకు కానుక తెచ్చారు. సన్నిధి గుడారం, గుడారంలోని సమస్త సామగ్రి, ప్రత్యేక వస్త్రాలు చేసేందుకు ఈ కానుకలు ప్రయోగించబడ్డాయి.
22 ఇవ్వాలనుకున్న స్త్రీ పురుషులంతా అన్ని రకాల బంగారు వస్త్రాలూ తెచ్చారు. పిన్నులు, చెవిపోగులు, ఉంగరాలు, ఇతర బంగారు వస్తువులు వారు తీసుకు వచ్చారు. వాళ్లంతా వారి బంగారాన్ని యెహోవాకు ఇచ్చారు. ఇది యెహోవాకు ప్రత్యేక అర్పణ.
23 నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు బట్ట ఉన్న ప్రతి వ్యక్తీ వాటిని యెహోవా కోసం తెచ్చాడు. మేక బొచ్చు, లేక ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలు లేక నాణ్యమైన తోలు ఉన్నవారు ఎవరైనా సరే వాటిని యెహోవా కోసం తెచ్చారు.
24 వెండిని లేక ఇత్తడి ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా తెచ్చారు. తుమ్మకర్ర ఉన్న ప్రతి వ్యక్తీ వచ్చి, దానిని యెహోవాకు కానుకగా ఇచ్చాడు.
25 నిపుణతగల ప్రతి స్త్రీ నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్ట తయారు చేసింది.
26 సహాయం చేయాలనుకొన్న నైపుణ్యంగల స్త్రీలంతా మేక వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేసారు.
27 పెద్దలు లేతపచ్చలు, ప్రశస్తమైన ఇతర రాళ్లు తెచ్చారు. యాజకుని ఏఫోదు, న్యాయతీర్పు పైవస్త్రం మీద ఈ రాళ్లు రత్నాలు అమర్చబడ్డాయి.
28 సుగంధ ద్రవ్యాలు, ఒలీవ నూనె కూడ ప్రజలు తెచ్చారు. సువాసనగల పరిమళ ద్రవ్యం, అభిషేక తైలం, దీపాల నూనె కోసం ఉపయోగించబడ్డాయి.
29 సహాయం చేయాలనుకొన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహవాకు కానుకలు తెచ్చారు. ఈ కానుకలు ఉచితం, మరియు ప్రజలు ఇవ్వాలనుకొన్నారు గనుక వాటిని ఇచ్చారు. మోషేకు, ప్రజలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేసేందుకు ఈ కానుకలు ఉపయోగించబడ్డాయి.
30 అప్పుడు ప్రజలతో మోషే ఇలా అన్నాడు: “చూడండి, యూదా గోత్రానికి చెందిన ఊర్ కుమారుడు బెసలేలును యెహోవా ఏర్పరచుకొన్నాడు. (హోరు కుమారుడు ఊర్).
31 బెసలేలును యెహోవా తన ఆత్మతో నింపాడు. అన్ని రకాల పనులు చేయడానికి యెహోవా అతనికి నైపుణ్యం ఇచ్చాడు.
32 అతడు నమూనాలు చేసి బంగారం, వెండి, ఇత్తడితో వస్తువులు చేయగలడు.
33 ప్రశస్తమైన రాళ్లను రత్నాలను చెక్కిసానబెట్టగలడు. బెసలేలు చెక్కపని చేసి అన్ని రకాల వస్తువులు తయారు చేయగలడు.
34 ఇతరులకు నేర్పించగల నైపుణ్యాన్ని బెసలేలుకు, అహోలీయాబుకు దేవుడు యిచ్చాడు. (దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడు అహోలియాబు).
35 అన్ని రకాల పనులు చేయటానికి ప్రత్యేక నైపుణ్యాన్ని యెహోవా వారికి ఇచ్చాడు. వడ్లవాని పనులు, లోహపు పనులు వారు చేయగలరు. నీలం, ధూమ్రవర్ణం, ఎరుపు, నాణ్యమైన బట్టల మీద బుటా పని వారు చేయగలరు. ఉన్ని వస్త్రాలను వారు నేయగలరు.”
1 “కనుక బెసలేలు, అహోలియాబు, ఇంకా నైపుణ్యంగల పురుషులందరూ యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నీ చేస్తారు. ఈ పరిశుద్ధ స్థలం నిర్మించేందుకు అవసరమైన వాటిన్నింటినీ చేయటానికి అవసరమైన జ్ఞానం, అవగాహన దేవుడు ఈ మనుష్యులకు ఇచ్చాడు.”
2 తర్వాత బెసలేలును, అహోలియాబను, యెహోవా నైపుణ్యాన్ని ఇచ్చిన ఇతర నిపుణులను మోషే పిలిచాడు. పనిలో సహాయం చేయాలని వీళ్లంతా వచ్చారు.
3 ఇశ్రాయేలు ప్రజలు కానుకగా తెచ్చిన వస్తువులన్నింటినీ మోషే ఈ మనుష్యులకు ఇచ్చాడు. పవిత్ర గుడారం నిర్మించడానికి వీటన్నింటినీ వారు ఉపయోగించారు. ప్రతి ఉదయం ప్రజలు కానుకలు తెస్తున్నారు.
4 చివరకు నిపుణలైన పని వాళ్లు ఒక్కొక్కరు, ఆ పవిత్ర స్థలంలో వారు చేస్తున్న పని విడిచి పెట్టి, మోషేతో మాట్లాడటానికి వెళ్లారు.
5 “ప్రజలు కానుకలను విపరీతంగా తెచ్చేసారు. గుడారం పని ముగించడానికి కావలసిన దానికంటే మా దగ్గర ఎక్కువే ఉంది” అన్నారు వారు.
6 అప్పుడు, “ఇంక ఏ స్త్రీగాని, పురుషుడుగాని గుడారం కోసం ఏ విధమైన కానుకా తీసుకురాకూడదు” అని బస అంతటికీ మోషే కబురు చేసాడు.
7 పవిత్ర స్థలానికి అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను ప్రజలు సిద్ధం చేసారు.
8 అప్పుడు నిపుణులు పవిత్ర గుడారం తయారు చేయటం మొదలు పెట్టారు. నీలం, ఎరుపు సన్నని నారబట్టతో పది తెరలు వారు చేసారు. రెక్కలు గల కెరూబుల చిత్రాలను ఆ బట్ట మీద వారు కుట్టి పెట్టారు.
9 ప్రతి తెరా ఒకే కొలత. అది 14 గజాలు పొడువు, 2 గజాల వెడల్పు.
10 అయిదు తెరలు కలిపి ఒక భాగంగాను మిగిలిన అయిదు ముక్కలు కలిపి మరో భాగంగాను కలపబడ్డాయి.
11 తర్వాత మొదటి అయిదు తెరల భాగానికి బట్ట అంచు వెంబడి నీలం గుడ్డతో ఉంగరాలు చేస్తారు. మరో అయిదు ముక్కల భాగానికి కూడ అలానే చేస్తారు.
12 ఒక భాగంలో చివరి తెర మీద 50 ఉంగరాలు మరో భాగంలో చివర తెర మీద 50 ఉంగరాలు ఉన్నాయి. ఈ ఉంగరాలు ఒక దానికి ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి.
13 అప్పుడు వారు 50 బంగారు ఉంగరాలు చేసారు. రెండు తెరలను ఒకటిగా కలిపేందుకు ఈ బంగారు ఉంగరాలను వారు ఉపయోగించారు. అందుచేత గుడారం మొత్తం పవిత్ర స్థలంగా కలపబడింది.
14 అప్పుడు పవిత్ర గుడారం పైకప్పు కోసం మేక వెంట్రుకలతో 11 తెరలను పనివారు తయారు చేసారు.
15 మొత్తం 11 తెరలు ఒకే కొలత గలవి. వాటి పొడువు 15 గజాలు వెడల్పు 2 గజాలు.
16 అయిదు తెరలను ఒక భాగంగా కలిపి కుట్టారు. పనివాళ్లు తర్వాత ఆరు తెరలను మరో భాగంగా కలిపి కుట్టారు.
17 మొదటి భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు. మరో భాగంలోని చివరి తెర అంచుకు 50 ఉంగరాలు అమర్చారు.
18 ఈ రెండు భాగాలను ఒక్కటిగా కలిపేందుకు 50 ఇత్తడి కొలుకులను పనివారు తయారు చేసారు.
19 తర్వాత గుడారానికి ఇంకా రెండు పై కప్పులను వారు తయారు చేసారు. ఒక పై కప్పు ఎరుపు రంగు వేసిన గొర్రె చర్మంతోను, మరొకటి నాణ్యమైన తోలుతోను చేయబడ్డాయి.
20 తర్వాత తుమ్మ కర్రతో పనివారు పలకలు చేసారు.
21 ఒక్కో పలక పొడవు 15 అడుగులు వెడల్పు 27 అంగుళాలు.
22 ఒక్కో పలక అడుగున పక్క పక్కగా రెండు కొక్కీలు ఉన్నాయి. పవిత్ర గుడారపు పలకల్లో ప్రతి ఒక్కటీ ఇలాగే చేయబడింది.
23 గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు.
24 ఆ తర్వాత ఈ 20 చట్రాల కింద పెట్టడానికి 40 వెండి దిమ్మలను వారు చేసారు. ప్రతి పలకకీ రెండేసి దిమ్మలు ఉన్నాయి. ఒక్కో బల్ల కింద ప్రతి పక్కా కర్రలు, ఒక దిమ్మ.
25 గుడారం అవతలి వైపుకు (ఉత్తరం వైపు) కూడా వారు 20 పలకలు చేసారు.
26 ఒక్కో చట్రం కిందా రెండేసి చొప్పున 40 వెండి దిమ్మలు అతడు చేసాడు.
27 పవిత్ర గుడారం వెనుక భాగానికి (పడమటి వైపున) ఆరు పలకలు అతడు చేసాడు.
28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు.
29 ఈ చట్రాలు అడుగు భాగాన కలిపి బిగించబడ్డాయి. పై భాగాన అది జతచేయబడ్డ ఉంగరంలో అమర్చబడ్డాయి. ప్రతి మూలకూ అతడు ఇలాగే చేసాడు.
30 కనుక పవిత్ర గుడారం పశ్చిమాన 8 చట్రాలు, 16 వెండి దిమ్మలు అంటే ఒక్కో చట్రం కింద రెండేసి దిమ్మలు ఉన్నాయి.
31 తర్వాత అతడు తుమ్మ కర్రతో అడ్డ కర్రలు చేసాడు - పవిత్ర గుడారం మొదటి పక్కకు 5 అడ్డ కర్రలు,
32 “పవిత్ర గుడారం రెండో పక్కకు 5 అడ్డ కర్రలు, గుడారం వెనుక పక్కకు 5 అడ్డ కర్రలు.
33 ఒక్కో చట్రంలోనుంచి దూరి అన్ని చట్రాల గుండా అమర్చబడేటట్టు మధ్య అడ్డ కర్రను అతడు చేసాడు.
34 ఈ చట్రాలను బంగారంతో అతడు తాపడం చేసాడు. అడ్డ కర్రలను పట్టి ఉంచేందుకు బంగారు ఉంగరాలను అతడు చేసాడు.
35 తర్వాత అతి పవిత్ర స్థలం యొక్క ప్రవేశ ద్వారానికి తెరను వారు చేయటానికి నాణ్యమైన సన్నని నారబట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణపు బట్ట వారు ఉపయోగించారు. నాణ్యమైన బట్టమీద కెరూబుల చిత్రాలను అతడు కుట్టాడు.
36 తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. ఆ స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. ఆ స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు.
37 తర్వాత గుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు తయారు చేసారు. నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్టను వారు ఉపయోగించారు. ఆ బట్ట మీద చిత్ర పటాల బుటాపని వారు చేసారు.
38 తర్వాత ఈ తెరకోసం అయిదు స్తంభాలు, కొక్కీలు వారు చేసారు. స్తంభాల శిఖరాలకు, తెరల కడ్డీలకు అతడు బంగారు తాపడం చేసాడు. స్తంభాలకు అయిదు ఇత్తడి దిమ్మలను వారు చేసారు.
1 తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. ఆ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు,
2 పెట్టె లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో అతడు తాపడం చేసాడు. తర్వాత పెట్టె చుట్టూ బంగారు నగిషీబద్ద కట్టాడు.
3 బంగారు ఉంగరాలు నాలుగు చేసి నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్టె మోయటానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి.
4 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో చేసి ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారం తాపడం చేసాడు.
5 పెట్టెకు ఒక్కో ప్రక్క ఉంగరాల గుండా కర్రలను దూర్చిపెట్టాడు.
6 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు.
7 తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబలను చేసాడు. ఆ కెరూబలను మూత కొనల మీద ఉంచాడు.
8 ఒక కొనమీద ఒక కెరూబను, మరో కొనమీద మరో కెరూబును ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూబులు మూతతో కలిపి చేయబడ్డాయి.
9 కెరూబుల రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల రెక్కలు పెట్టెను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురెదురుగా మూతను చూస్తూ ఉన్నాయి.
10 తర్వాత అతడు తుమ్మ కర్రతో బల్లను చేసాడు. ఆ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు.
11 అతడు ఆ బల్లను బంగారంతో తాపడం చేసాడు. బల్ల నాలుగు ప్రక్కల బంగారు నగిషీబద్ద చేసాడు.
12 అప్పుడు అతడు ఆ బల్ల చుట్టూ మూడు అంగుళాల చట్రం చేసాడు. ఆ చట్రం మీద బంగారు నగిషీబద్దను అతడు ఉంచాడు.
13 అప్పుడు అతడు ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలు చేసాడు. నాలుగు మూలలా నాలుగు బంగారు ఉంగరాలు అతడు అమర్చాడు. అక్కడే నాలుగు కాళ్లు ఉన్నాయి.
14 ఉంగరాలను బల్ల పైభాగంలో చట్రానికి దగ్గరగా అతడు పెట్టాడు. బల్లను మోసేందుకు ఉపయోగించే కర్రలను ఉంగరాలు పట్టి ఉంచుతాయి.
15 తర్వాత బల్లలను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్ర ఉపయోగించి చేసిన, ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారు పూత పూసాడు.
16 అప్పుడు బల్ల మీద ప్రయోగించే వస్తువులన్నింటినీ తయారు చేసాడు. పానార్పణము పోసేందుకు పళ్లెములు, గరిటెలు, గిన్నెలు, పాత్రలు అతడు తయారు చేసాడు. ఇవన్నీ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి.
17 తర్వాత అతడు దీపస్తంభం చేసాడు. స్వచ్ఛమైన బంగారం ఉపయోగించి, దాని దిమ్మను, స్తంభాన్ని తీర్చిదిద్దాడు. తర్వాత పువ్వుల్లా కనపడే గిన్నెలు చేసాడు. గిన్నెలకు మొగ్గలు, పువ్వులు ఉన్నాయి. అన్నీ స్వచ్ఛమైన బంగారంతోనే చేయబడ్డాయి. ఈ వస్తువులన్నీ ఒకే భాగంగా కలుపబడ్డాయి.
18 దీపస్తంభం ప్రక్కల్లో ఆరు కొమ్మలు ఉన్నాయి. ఒక పక్క మూడు కొమ్మలు, మరో పక్క మూడు కొమ్మలు ఉన్నాయి.
19 ఒక్కో కొమ్మకు మూడేసి బంగారు పూలున్నాయి. ఈ పూలు బాదం పూలవలె చేయబడ్డాయి. వాటికి మొగ్గలు, రేకులు ఉన్నాయి.
20 బంగారంతో చేయబడ్డ నాలుగు పూవులు దీపస్తంభంపు కాండానికి ఉన్నాయి. అవి కూడా మొగ్గలు, రేకులతో బాదం పూవుల్లానే ఉన్నాయి.
21 ఆరు కొమ్మలు రెండేసి చొప్పున మూడు భాగాలుగా ఉన్నాయి. ఒక్కో కొమ్మ విభాగం కింద ఒక్కో మొగ్గ ఉంది.
22 మొగ్గలు, కొమ్మలు, దీపస్తంభం అన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డాయి. ఈ బంగారం అంతా కొట్టబడి, ఒకే భాగంగా చేయబడింది.
23 ఈ దీపస్తంభానికి అతడు ఏడు దీపాలు చేసాడు. తర్వాత అతడు పళ్లెం, పట్టకారులు చేసాడు. సమస్తం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది.
24 దీపస్తంభం, దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.
25 ధూపం వేసేందుకు అతడు ధూప వేదిక చేసాడు. తుమ్మ కర్రతో అతడు దీన్ని చేసాడు. వేదిక చతురస్రాకారం. దాని పొడవు 18 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 36 అంగుళాలు. వేదిక మీద నాలుగు కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క మూలను ఒక్కొక్క కొమ్మ ఉంది. ఈ కొమ్మలు వేదికతో కలిపి ఒకే భాగంగా చేయబడ్డాయి.
26 పై భాగం, అన్ని ప్రక్కలు, కొమ్మలకీ అతడు బంగారు తాపడం చేసాడు. తర్వాత అతడు బలిపీఠం చుట్టూ బంగారు నగిషీబద్ద చేసాడు.
27 బలిపీఠానికి అతడు రెండు బంగారు ఉంగరాలు చేసాడు. బలపీఠం నగిషీబద్దకు అడుగు భాగాన ఒక్కో ప్రక్క ఒక్కోటిగా బంగారు ఉంగరాలను అమర్చాడు. వేదికను మోసే కర్రలను ఈ బంగారు ఉంగరాలు పట్టి వుంచేవి.
28 స్తంభాలను తుమ్మ కర్రతో చేసి, బంగారం తాపడం చేసాడు అతడు.
29 తర్వాత అభిషేకించే పవిత్ర తైలం చేసాడు. స్వచ్ఛమైన పరిమళ వాసనగల ధూపం కూడ అతడు చేసాడు. అత్తరు చేసే నైపుణ్యంగల ఒకని చేత ఇవన్నీ చేయబడ్డాయి.
1 తర్వాత బెసలేలు బలిపీఠం కట్టాడు. ఇది దహన బలులను దహించటానికి ఉపయోగించిన బలిపీఠం. తుమ్మ కర్రతో అతడు బలిపీఠం చేసాడు. బలిపీఠం చతురస్రం, దాని పొడువు ఏడున్నర అడుగులు, వెడల్పు ఏడున్నర అడుగులు, ఎత్తు నాలుగున్నర అడుగులు.
2 ఒక్కొక్క మూలకు ఒక కొమ్మును అతడు చేసాడు. కొమ్ములను బలిపీఠంతో ఏకభాగంగా అతడు చేసాడు. తర్వాత అతడు దాన్నంతటినీ యిత్తడితో తాపడం చేసాడు.
3 తర్వాత బలిపీఠం మీద ఉపయోగించే పరికరాలు అన్నింటినీ అతడు చేసాడు. బిందెలు, గరిటెలు, గిన్నెలు, ముల్లు గరిటెలు, నిప్పు పాత్రలు అతడు చేసాడు.
4 తర్వాత అతడు బలిపీఠం కోసం ఒక వలలాంటి ఇత్తడి జల్లెడ తయారు చేసాడు. ఈ ఇత్తడి జల్లెడ వలలా ఉంది. బలిపీఠం అడుగున అంచు కింద ఉంచబడింది. అది అడుగు భాగాన కింద నుండి బలిపీఠం లోనికి సగం వరకు వుంది.
5 తర్వాత ఇత్తడి ఉంగరాలు చేసాడు. బలిపీఠాన్ని మోసే కర్రలను పట్టి వుంచేందుకు ఈ ఉంగరాలు ఉపయోగించ బడ్డాయి. ఆ ఉంగరాలకు ఇత్తడి జల్లెడ నాలుగు మూలలను అతడు అమర్చాడు.
6 తర్వాత అతడు తుమ్మకర్రతో కర్రలు చేసి, వాటిని యిత్తడితో తాపడం చేసాడు.
7 ఆ కర్రలను ఉంగరాలలో అమర్చాడు అతడు. బలిపీఠం పక్కలో ఉన్న కర్రలు బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించబడ్డాయి. బలిపీఠం చేయడానికి అతడు తుమ్మ కర్ర పలకలను ఉపయోగించాడు. బలిపీఠం లోపల ఖాళీ
8 గంగాళం వుంది. దాని దిమ్మను అతడు ఇత్తడితో చేసాడు. స్త్రీలు ఇచ్చిన ఇత్తడి అద్దాలను అతడు ఉపయోగించాడు. సమావేశ గుడార ప్రవేశం దగ్గర పరిచర్య చేసే స్త్రీలు వీరు.
9 తర్వాత ఆవరణ చుట్టూ తెరలను అతడు చేసాడు. దక్షిణం వైపు తెరల పొడవు 50 గజాలు.
10 దక్షిణం వైపు 20 స్తంభాల ఆధారంతో తెరలు నిలబడ్డాయి. ఈ తెరలు సన్నని నారతో చేయబడ్డాయి. ఆ స్తంభాలు 20 యిత్తడి దిమ్మల మీద ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.
11 ఆవరణ ఉత్తరం వైపుకూడ దక్షిణం వైపులాగే ఉంది. 20 ఇత్తడి దిమ్మల మీద 20 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలకు, కర్రలకు కొక్కీలు వెండితో చేయబడ్డాయి.
12 ఆవరణ పడమటి వైపు తెరలు 25 గజాలు పొడవు. స్తంభాలు 10, దిమ్మలు 10 ఉన్నాయి. స్తంభాలకు కొక్కెములు బిగించే తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
13 ఆవరణ ప్రవేశం తూర్పున ఉంది. తూర్పున 25 గజాలు వెడల్పు,
14 ప్రవేశానికి ఒక ప్రక్క ఏడున్నర గజాలు పొడవు గల ఒక తెర ఉంది. ఆ తెరకు మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి.
15 ప్రవేశానికి మరో పక్క ఇంకో తెర ఉంది. దాని పొడవు కూడ ఏడున్నర గజాలు. ఆ తెరకు కూడా మూడు స్తంభాలు, మూడు దిమ్మలు ఉన్నాయి.
16 ఆవరణ చుట్టూ ఉన్న తెరలన్నీ నాణ్యమైన బట్టతో చేయబడ్డాయి.
17 స్తంభాలకు దిమ్మలు ఇత్తడితో చేయబడ్డాయి. కొక్కెములు, తెరల కడ్డీలు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు కూడ వెండితో తాపడం చేయబడ్డాయి. ఆవరణలోని స్తంభాలన్నీ తెరల వెండి కడ్డీలతో కలుపబడ్డాయి.
18 నీలం, ఎరుపు ధూమ్రవర్ణం బట్ట, నాణ్యమైన సన్నని నార బట్టతో ఆవరణ ప్రవేశానికి తెర చేయబడింది. నిపుణుడు వీటన్నింటినీ కలిపి కట్టాడు. ఆ తెర 10 గజాలు పొడవు, రెండున్నర గజాలు ఎత్తు ఉంది. ఆవరణలో తెరల వలే అవి కూడ అదే ఎత్తు ఉన్నాయి.
19 ఆ తెర నాలుగు స్తంభాలు, నాలుగు ఇత్తడి దిమ్మల మీద ఆధారపడి ఉంది.
20 స్తంభాల మీద కొక్కెములు వెండితో చేయబడ్డాయి. స్తంభాల శిఖరాలు, బిగించే కడ్డీలు వెండితో చేయబడ్డాయి.
21 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులన్నింటినీ రాసి పెట్టమని లేవీ ప్రజలకు మోషే ఆజ్ఞాపించాడు. అహరోను కుమారుడు ఈతామారు ఈ జాబితా బాధ్యత వహించాడు.
22 దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్నీ యూదా వంశాపు హూరు కుమారుడైన ఊరి కుమారుడు బెసలేలు తయారు చేసాడు.
23 ఇంకా దాను వంశాపు అహీమాసాకీ కుమారుడు అహోలీయాబు అతనికి సహాయం చేసాడు. అహోలీయాబు నిపుణుడు, నమూనాలు గీయగలడు. శ్రేష్ఠమైన నారబట్టలతో నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో బుటా పని చేయగలవాడు అతడు.
24 పవిత్ర గుడారం కోసం రెండు టన్నులకంటే ఎక్కువ బంగారం యెహోవాకు అర్పణగా ఇవ్వబడింది. (ఆలయపు అధికారిక కొలత ప్రకారం ఇది తూచబడింది).
25 ప్రజలు మూడుముప్పావు టన్నులకు మించి వెండిని యిచ్చారు. (ఇది ఆలయపు అధికారిక కొలత ప్రకారం తూచబడింది).
26 ఇరవై సంవత్సరాలు, అంతకు పైబడ్డ మగవాళ్లందరినీ లెక్కించారు. మొత్తం 6,03,550 మంది మగవారున్నారు. వారిలో ప్రతి ఒక్కడు ఒక వెండి బాకా (అరతులం వెండి) పన్ను చెల్లించాలి. (ఒక వెండి బాకా అంటే అధికారిక కొలత ప్రకారం ఒక అరతులం.)
27 అందులో మూడు ముప్పావు టన్నుల వెండి పవిత్ర గుడారపు 100 దిమ్మలు చేసేందుకు, తెరచేసేందుకు వినియోగించబడింది. ఒక్క దిమ్మకు 75 పౌన్ల వెండి వారు ఉపయోగించారు.
28 కొక్కెములు, తెరల కడ్డీలు చేయటానికి, స్తంభాలకు వెండి తాపడం చేయటానికి మరో 50 పౌన్ల వెండి ఉపయోగించబడింది.
29 ఇత్తడి ఇరవై ఆరున్నర టన్నులకు పైగా యెహోవాకు ఇవ్వబడింది.
30 0సన్నిధి గుడార ప్రవేశం దగ్గర దిమ్మలు చేయటానికి ఆ ఇత్తడి ఉపయోగించబడింది. బలిపీఠం, ఇత్తడి తెర చేసేందుకు కూడా వారు ఇత్తడి ఉపయోగించారు. బలిపీఠం కోసం పరికరాలు, పాత్రలు అన్నీ చేయటానికి కూడా ఇదే ఇత్తడి వాడబడింది.
31 ఆవరణ చుట్టూ తెరల దిమ్మలు చేసేందుకు, ప్రవేశం దగ్గర తెరల దిమ్మలు చేసేందుకు కూడా ఇదే ఇత్తడి వాడబడింది. పవిత్ర గుడారానికి, ఆవరణ చుట్టూ ఉన్న తెరలకూ కావల్సిన మేకులు చేసేందుకు కూడా ఇత్తడి ఉపయోగించబడింది.
1 పవిత్ర స్థలంలో యాజకులు పరిచర్య చేసేటప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు తయారు చేసేందుకు నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టను పనివారు ఉపయోగించారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు అహరోనుకు గూడ ప్రత్యేక వస్త్రాలు తయారు చేసారు.
2 బంగారు తీగ, శ్రేష్ఠమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం గల బట్టతో అతడు ఏఫోదును చేసాడు.
3 బంగారాన్ని సన్నని రేకులుగా వారు కొట్టారు. తర్వాత బంగారాన్ని పొడవైన తీగలుగా కోసారు. నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్ట, నాణ్యమైన బట్టతో బంగారాన్ని కలిపి కొట్టారు. ఇది చాల నైపుణ్యంగల వాని పని.
4 ఏఫోదుకు భుజభాగాలను వారు చేసారు. ఈ భాగాలు బట్ట అంచులకు బిగించబడ్డాయి. అప్పుడు అన్ని భాగాలు కలిసి కట్టబడ్డాయి.
5 దట్టి కూడ ఆలాగే చేయబడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు కలుపబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు తీగ, నాణ్యమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం బట్టలతో అది చేయబడింది.
6 రత్నాలను బంగారపు జవలలో పనివాళ్లు పొదిగించారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లను వారు రత్నాలపై చెక్కారు.
7 తర్వాత ఏఫోదు భుజ భాగాల మీద రత్నాలను వారు అమర్చారు. ఇశ్రాయేలు కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కో రత్నం సూచనగా ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయబడంది.
8 తర్వాత న్యాయతీర్పు పైవస్త్రం బెసలేలు చేసాడు. నిపుణుని పనిగా అది చేయబడింది. బంగారు దారాలు, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం బట్టలతో అది చేయబడింది.
9 న్యాయతీర్పు పైవస్త్రం చతురస్రంగా ఉంది, రెండుగా మడత చేయబడింది. దాని పొడవు 9 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు.
10 తర్వాత పనివాళ్లు అందమైన రత్నాలను నాలుగు వరుసలుగా దాని మీద పెట్టారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్నాయి.
11 రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంతమణి వున్నాయి.
12 మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి. ఇంద్రనీలం వున్నాయి.
13 నాలుగవ వరుసలో రక్తవర్ణపు రాయి, సులిమానిరాయి, సూర్యకాంతం ఉన్నాయి. ఈ రత్నాలన్నీ బంగారంలో పొదిగించబడ్డాయి.
14 ఒక పనివాడు ఒక ముద్రను చేసినట్టు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఈ పన్నెండు రాళ్లమీద చెక్కబడ్డాయి. ఇశ్రాయేలు కుమారులు ఒక్కొక్కరి పేరు ఒక్కో రాయి మీద ఉంది.
15 న్యాయతీర్పు పైవస్త్రం కోసం స్వచ్ఛమైన బంగారంతో ఒక గొలుసు చేయబడింది. అది తాడుతో అల్లిక చేయబడింది.
16 పనివాళ్లు రెండు బంగారు దిమ్మలు, రెండు బంగారు ఉంగరాలు చేసారు. న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు.
17 తర్వాత బంగారు గొలుసులు రెంటిని న్యాయతీర్పు వస్త్రానికి మూలల్లో రెండు ఉంగరాలకు కట్టారు.
18 బంగారు తాళ్ల అవతలి కొనలను రెండు జవలకు కట్టారు. తర్వాత ఏఫోదు ఎదుట భాగంలోని రెండు భుజాలకు వారు వాటిని బిగించారు.
19 తర్వాత వారు మరి రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు అడుగు భాగపు రెండు మూలల్లో పెట్టారు. ఏఫోదు దగ్గర లోపలి భాగంలో వారు ఆ ఉంగరాలను పెట్టారు.
20 భుజభాగాల ముందర అడుగు భాగంలో కూడా రెండు బంగారు ఉంగరాలను వారు పెట్టారు. ఏఫోదు దట్టీకి పైగా బిగింపు కూర్పునకు దగ్గరగా ఈ ఉంగరాలు ఉన్నాయి.
21 తర్వాత నీలి (దారంతో అల్లిన బట్ట) దట్టీతో తీర్పు పతకపు ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. ఈ విధంగా తీర్పు పతకం నడికట్టును హత్తుకొని ఉంది. అది పడిపోదు. యెహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్లు ఇవన్నీ చేసారు.
22 తర్వాత ఏఫోదు అంగీని వారు తయారు చేసారు. నీలం గుడ్డతో దాన్ని తయారు చేసారు. అది ఒక నిపుణుని పనితనం.
23 అంగీ మధ్యలో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం చుట్టూ ఒక గుడ్డ ముక్క కట్టబడింది. ఆ గుడ్డ ముక్క గోటు. ఆ రంధ్రం చినిగి పోకుండా ఉంచుతుంది.
24 తర్వాత నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు ధూమ్ర వర్ణపు నారబట్ట ఉపయోగించారు. అంగీ అడుగు భాగానికి చుట్టూరా దానిమ్మలను కట్టారు.
25 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో గంటలను వారు చేసారు. అంగీ అడుగు భాగాన దానిమ్మలకు మధ్య ఈ గంటలను వారు కట్టారు.
26 అంగీ అడుగు భాగం చుట్టూరా గంటలు, దానిమ్మలు ఉన్నాయి. ప్రతి దానిమ్మకూ మధ్య ఒక గంట వుంది సరిగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే యాజకుడు యెహోవాకు సేవ చేసేటప్పుడు ఈ అంగీని ధరించేవాడు.
27 అహరోనుకు, అతని కుమారులకు చొక్కాలను పనివారు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో ఈ చొక్కాలు చేయబడ్డాయి.
28 ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు.
29 నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో నడికట్టును వారు తయారు చేసారు. బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇవన్నీ చేయబడ్డాయి.
30 తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద తయారు చేసారు. దాన్ని స్వచ్ఛమైన బంగారంతో వాళ్లు చేసారు. బంగారం మీద వాళ్లు “యెహోవాకు పవిత్రం.” అనే మాటలు వ్రాసారు.
31 తర్వాత వాళ్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఆ బంగారు బద్దకు ఒక నీలసూత్రం కట్టి దాని తలపాగాకు కట్టారు.
32 కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపోయింది. సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు సమస్తం చేసారు.
33 తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి చూపించారు. ఉంగరాలు, చట్రాలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు.
34 ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు. పొట్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు. మరియు శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు.
35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు.
36 బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోషేకు చూపెట్టారు.
37 స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని, దాని మీద దీపాలను వారు మోషేకు చూపించారు. దీపాలకు ఉపయోగించే నూనె, ఇతర వస్తువులన్నింటిని వారు మోషేకు చూపించారు.
38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ప్రవేశాన్ని మూసి వుంచే తెరను వారు అతనికి చూపించారు.
39 ఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు.
40 ఆవరణలో స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు. తాళ్లను, పవిత్ర గుడారపు మేకలను వారు. అతనికి చూపించారు. పవిత్ర గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటినీ వారు అతనికి చూపించారు.
41 తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. యాజకుడైన అహరోను, అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు.
42 సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు ఈ పని అంతా చేసారు.
43 పని అంతటినీ మోషే చాలా సునిశితంగా పరిశీలించాడు. సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే పని జరిగినట్టు మోషే చూసాడు. కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు.
1 అప్పుడు మోషేతో యెహోవా యిలా చెప్పాడు:
2 “మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు.
3 ఒడంబడిక పెట్టెను సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో ఆ పెట్టెను కప్పివేయి.
4 తర్వాత బల్లను లోపలికి తీసుకురా. బల్లమీద ఉండాల్సిన వస్తువులను దాని మీద ఉంచు. తర్వాత దీపస్తంభాన్ని గుడారంలో ఉంచు.
5 ధూపార్పణ కోసం బంగారపు వేదికను గుడారంలో పెట్టు, ఒడంబడిక పెట్టెకు ముందర ఈ వేదికను పెట్టు. తర్వాత పవిత్ర గుడారపు ప్రవేశానికి తెరవేయి.
6 “పవిత్ర గుడారపు (సన్నిధి గుడారం) ప్రవేశానికి ముందర దహనబలి అర్పణల పీఠాన్ని ఉంచు.
7 ఈ బలిపీఠానికి, సన్నిధి గుడారానికి మధ్య గంగాళం ఉంచు. గంగాళంలో నీళ్లు పోయాలి.
8 ఆవరణ చుట్టూ తెరలు తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెరవేయాలి.
9 “అభిషేకతైలం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల మీద నీవు తైలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం చేస్తావు.
10 దహన బలులను దహించే బలిపీఠాన్ని, అభిషేకించు, బలిపీఠం మీద ఉండే సమస్తాన్నీ అభిషేకించు. ఆ బలిపీఠాన్ని నీవు పవిత్రం చేస్తావు. అది అతి పరిశుద్ధంగా ఉంటుంది.
11 తర్వాత గంగాళాన్ని, దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను పవిత్రం చేసేందుకు ఇలా చేయి.
12 “అహరోనును, అతని కుమారులను సన్నిధి గుడారం ప్రవేశం దగ్గరకు తీసుకురా. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి.
13 తర్వాత అహరోనుకు ప్రత్యేక వస్త్రాలను తొడిగించాలి. తైలంతో అతన్ని అభిషేకించి అతన్ని పవిత్రం చెయ్యి. అప్పుడే అతడు యాజకుడుగా సేవచేయగలడు.
14 తర్వాత అతని కుమారులకు వస్త్రాలు తొడిగించాలి.
15 వాళ్ల తండ్రిని నీవు అభిషేకించినట్టే కుమారులను కూడా అభిషేకించు. అప్పుడు వాళ్లు కూడా యాజకులుగా నా సేవ చేయగలరు. వాళ్లను నీవు అభిషేకించినప్పుడు వాళ్లు యాజకులవుతారు. రాబోయే కాలమంతా ఆ కుటుంబము యాజకులుగా కొనసాగుతారు.”
16 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం అతడు చేసాడు.
17 కనుక సరైన సమయంలో పవిత్రగుడారం నిలబెట్టబడింది. వారు ఈజిప్టు విడిచిన తర్వాత అది రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు.
18 యెహోవా చెప్పినట్టే పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు. అతడు దిమ్మలను ముందుగా కింద పెట్టాడు. తర్వాత ఆ దిమ్మల మీద చట్రాలను పెట్టాడు. తర్వాత అతడు కమ్ములను అమర్చి, స్తంభాలను నిలబెట్టాడు.
19 ఆ తర్వాత పవిత్ర గుడారం కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.
20 దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడంబడిక పెట్టెలో మోషే పెట్టాడు. ఆ పెట్టెకు కర్రలను మోషే పెట్టాడు. తర్వాత అతడు ఆ పెట్టెకు మూత పెట్టాడు.
21 తర్వాత ఆ పవిత్ర పెట్టెను గుడారంలోకి మోషే తీసుకు వచ్చాడు. సరైన చోట అతడు తెర వేసాడు. ఇది సన్నిధి గుడారంలో పవిత్ర పెట్టెను మరుగు చేస్తుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వీటన్నింటినీ చేసాడు.
22 తర్వాత సన్నిధి గుడారపు బల్లను మోషే పెట్టాడు. గుడారం ఉత్తరాన అతడు దీన్ని పెట్టాడు. (పవిత్ర స్థలంలో) తెరముందర అతడు దీన్ని పెట్టాడు.
23 తర్వాత యెహోవా సన్నిధిలో బల్ల మీద రొట్టెను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు అతడు దీన్ని చేసాడు.
24 తర్వాత మోషే దీపస్తంభాన్ని సన్నిధి గుడారంలో పెట్టాడు. గుడారం దక్షిణాన, బల్లకు ఎదుట అతడు దీపస్తంభం పెట్టాడు.
25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.
26 తర్వాత బంగారపు ధూపవేదికను సన్నిధి గుడారంలో మోషే పెట్టాడు. ఆ వేదికను తెరముందర అతడు పెట్టాడు.
27 తర్వాత ఆ బంగారు బలిపీఠం మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.
28 తర్వాత పవిత్ర గుడారం ప్రవేశానికి మోషే తెర వేసాడు.
29 పవిత్ర గుడారం, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర దహన బలులను దహించే బలిపీఠాన్ని మోషే పెట్టాడు. అప్పుడు ఒక దహన బలి అర్పణను ఆ బలిపీఠం మీద మోషే అర్పించాడు. యెహోవాకు ధాన్యార్పణ కూడ అతడు అర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.
30 తర్వాత మోషే సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం ఉంచాడు, కడుక్కొనేందుకు గంగాళంలో నీళ్లు పోసాడు.
31 మోషే, అహరోను, అహరోను కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కొనేందుకు ఈ గంగాళాన్ని ఉపయోగించారు.
32 వారు సన్నిధి గుడారంలో ప్రవేశించినప్పుడల్లా కాళ్లు కడుక్కొనేవారు. వాళ్లు బలిపీఠాన్ని సమీపించిన ప్రతీసారీ వాళ్లను వాళ్లు కడుక్కొనేవారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్లు ఇలా చేసారు.
33 తర్వాత గుడారపు ఆవరణలో తెరలను మోషే తగిలించాడు. మోషే గుడారపు ఆవరణలో బలిపీఠాన్ని పెట్టాడు. తర్వాత అతడు ఆవరణ ప్రవేశం దగ్గర తెరను వేసాడు. కనుక అతడు చేయాలని చెప్పి యెహోవా తనకు అప్పగించిన పని అంతా మోషే ముగించాడు.
34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది.
35 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో ప్రవేశించలేక పోయాడు.
36 (ప్రజలు ఎప్పుడు సాగిపోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి మేఘం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం మొదలు పెట్టేవారు.
37 అయితే ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు ఆ స్థలంలోనే ఉండిపోయారు.
38 కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు.