1

1 మొట్ట మొదటి దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు.

2 భూమి మొత్తం శూన్యంగా ఉంది. భూమిమీద ఏమీ లేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.

3 అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది.

4 దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేసాడు.

5 వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు. అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.

6 అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం ఉండును గాక!” అన్నాడు.

7 కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు గాలికి పైగాను, కొంత నీరు గాలికి కిందను ఉంది.

8 దేవుడు ఆ అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు.

9 అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం కింద నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది.

10 ఆ పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది.

11 అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించు గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది.

12 గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.

13 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు.

14 అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి.

15 భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది.

16 కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేసాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేసాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేసాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేసాడు.

17 భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు.

18 పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేసాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది.

19 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.

20 అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అన్నాడు దేవుడు.

21 కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేసాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేసాడు. సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేసాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడ దేవుడు చేసాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది.

22 ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు.

23 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు.

24 అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు చిన్న జంతువులు ఉండును గాక! మరియు ఈ జంతువులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయుగాక” అన్నాడు దేవుడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.

25 కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేసాడు. క్రూర జంతువులను, సాధు జంతువులను, ప్రాకుచుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది.

26 అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మనుష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి మీద, గాలిలో పక్షులన్నిటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నింటి మీదను, ప్రాకు చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” అని చెప్పాడు.

27 కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు.

28 దేవుడు, వారిని “ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” అని ఆశీర్వదించాడు.

29 “ఆహార ధాన్యపు మొక్కలన్నిటిని, ఫలవృక్షాలు అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది.

30 మరియు పచ్చ మొక్కలు అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమిమీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి” అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.

31 దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.

2

1 కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది.

2 దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొన్నాడు.

3 ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేసాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేసాడు.

4 ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది.

5 భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు.

6 భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది.

7 అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు.

8 అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా నాటాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు.

9 అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేసాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి.

10 ఏదెను తోటలో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది.

11 మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది.

12 (ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి).

13 రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది.

14 మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు.

15 మనిషిని ఏదేను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని.

16 యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు:”ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు.

17 అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.”

18 అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.

19 పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేసాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు.

20 సాధు జంతువులన్నింటికీ, ఆకాశ ఫక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు.

21 అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్టు చేసాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని పక్క ఎముకలలో ఒకదాన్ని తీసాడు. పక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేసాడు.

22 స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు.

23 అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు: “ఇప్పుడు, ఇది నావంటి మనిషే అమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది. ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది. ఆమె నరుని లోనుండి తీయబడింది గనుక ఆమెను నారి అంటాను.”

24 ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు.

25 ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు.

3

1 ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినివద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా?” అంది.

2 సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము తినవచ్చు.

3 అయితే ఒక చెట్టుంది, దాని ఫలము మేము తినకూడదు. ‘తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టును మీరు ముట్టుకోకూడదు. అలాచేస్తే మీరు చస్తారు’ అని దేవుడు మాతో చెప్పాడు.”

4 అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావరు.

5 ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!’

6 ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్టు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్టు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.

7 అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపోయారు. వారి కళ్లు తెరవబడ్డట్టు, వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు నగ్నంగా ఉన్నట్లు వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు.

8 సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు.

9 అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా.

10 “నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు.

11 దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!”

12 అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు.

13 అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో. ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే ఆ పండు తినేసాను” అని చెప్పింది.

14 అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు: “ఈ మహా చెడ్డ పని నీవే చేసావు కనుక నీవు శపించబడ్డావు. జంతువులన్నీటి కంటే నీ పరిస్థితి హీనంగా ఉంటుందు. నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌవుతుంది. నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.

15 ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని విరోధుల్నిగా నేను చేస్తాను. నీ సంతానము, ఆమె సంతానము ఒకరికొకరు విరోధులవుతారు. నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు ఈ శిశువు నీ తలను చతుక కొడతాడు.”

16 అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను నీకు బహు ప్రయాస కలుగజేస్తాను. నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా గొప్ప బాధ నీకు కలుగుతుంది. నీవు నీ భర్తను వాంఛిస్తావు కాని అతడే నిన్ను ఏలుతాడు.”

17 అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు అన్నాడు: “ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను. అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు కనుక నీ మూలంగా భూమిని నేను శపిస్తాను. భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

18 పొలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అనుకొంటావు కాని ముళ్లను, పొదలను నేల నీకోసం పండిస్తుంది.

19 నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని చేస్తావు. నీ ముఖం అంతా చెమటతో నిండి పోయేంతగా నీవు పని చేస్తావు. నీవు చనిపోయే రోజు వరకు కష్టపడి పని చేస్తావు మరణించాక నీవు మరలా మట్టి అయిపోతావు. నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు.”

20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే బతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు.

21 యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేసాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు.

22 అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: “చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ వృక్షం నుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు.”

23 కనుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు.

24 తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూవుంది.

4

1 ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది.

2 ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు.

3 [This verse may not be a part of this translation]

4 [This verse may not be a part of this translation]

5 అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది.

6 యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి?

7 నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును అదుపులో పెట్టాలి.”

8 “మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేసాడు.

9 తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?” అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని” అని కయీను జవాబిచ్చాడు.

10 అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర్ర పెట్టుతూ వుంది.

11 (నీవు నీ తమ్మణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు.

12 ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.”

13 అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష!

14 చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.”

15 అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేసాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది. కయీను కుటుంబం

16 అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.

17 కయీను తన భార్యతో కలసినప్పుడు, ఆమె గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరు దానికి పెట్టాడు.

18 హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు.

19 లెమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా.

20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ, పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకొనే ప్రజలందరికి యాబాలు తండ్రి.

21 ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. (యూబాలు యాబాలు సోదరుడు). సితారాను పిల్లన గ్రోవిని ఊదేవారందరికిని యూబాలు తండ్రి.

22 సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, యినుము పనులు చేసే వాళ్లందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అని పేరు పెట్టబడింది.

23 లెమెకు తన భార్యతలో ఇలా అన్నాడు: “ఆదా, సిల్లా, నా మాట వినండి! లెమెకు భార్య లారా నేను చెప్పే సంగతులను వినండి: ఒకడు నన్ను గాయపర్చాడు కనుక వాడ్ని చంపేసాను ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేనతనిని చంపేసాను.

24 కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం! కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుందు.”

25 ఆదాము హవ్వతో కలసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ.

26 షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి, ఎనోషు అని అతడు పేరుపెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.

5

1 ఆదాము వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదాము) చేసాడు.

2 ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేసాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.

3 ఆదాముకు 130 సంవత్సరములు వయస్సు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు.

4 షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

5 కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

6 షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు.

7 ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

8 కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

9 తొంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు.

10 కేయినాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి యింకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

11 కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

12 కేయినాను 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు.

13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయినానుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

14 కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు యెరెదు అను కుమారుడు అతనికి పుట్టాడు.

16 యెరెదు పుట్టిన తర్వాత, మహలలేలు 830 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

17 కనుక మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

18 యెరెదుకు 162 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు.

19 హనోకు పుట్టిన తర్వాత, యెరెదు 800 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

20 కనుక యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

21 హనోకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు.

22 మెతూషెల పుట్టిన తర్వాత, హనోకు యింకా 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేసాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

23 కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు.

24 హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు.

25 మెతూషెలకు 187 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు.

26 లెమెకు పుట్టిన తర్వాత, మెతూషెల 782 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

27 కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మరణించాడు.

28 లెమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు.

29 లెమెకు తన కుమారునికి నోవహు అని పేరు పెట్టాడు. “దేవుడు భూమిని శపించాడు గనుక వ్యయసాయ దారులమైన మనం చాసా కష్టపడి పని చేస్తున్నాం. అయితే నోవహు మనకు నెమ్మది కలుగజేస్తాడు” అన్నాడు లెమెకు.

30 నోవహుకు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

31 కనుక లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

32 నోవహు 500 సంవత్సరములు దాటిన తర్వాత షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు.

6

1 భూమిమీద మనుష్యుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు.

2 [This verse may not be a part of this translation]

3 [This verse may not be a part of this translation]

4 [This verse may not be a part of this translation]

5 భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్టు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్టు యెహోవా చూశాడు.

6 ఈ భూమిమీద మనుష్యులను చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది.

7 కనుక యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మనుష్యుని, ప్రతి జంతువును, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.”

8 అయితే భూమిమీద యెహోవాను సంతోష పెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు.

9 ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు.

10 నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు.

11 [This verse may not be a part of this translation]

12 [This verse may not be a part of this translation]

13 కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేసారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను.

14 చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.

15 “నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు.

16 కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు.

17 “‘నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదకి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి.

18 అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి.

19 భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉంజనివ్వు.

20 భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు.

21 అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.”

22 వీటన్నింటినీ నోవహు చేసాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేసాడు.

7

1 అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచి వాడివిగా నాకు కనబడ్డావు. కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా ఓడలోపలికి వెళ్లండి.

2 శుద్ధమయిన జంతువులన్నింటిలో నుండి ఏడేసి జాతులు. (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో, భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలోనుండి ఒక్క జత (మగది ఒకటి, ఆడది ఒకటి) తీసుకో. ఈ జంతువులన్నింటిని నీతోబాటు ఓడలోనికి నడిపించు.

3 ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నుండి ఏడేసి జతలు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో. ఇలా చేయటంవల్ల మిగతా జంతువులన్ని నాశనం చేయబడిన తర్వాత కూడా ఈ జంతువులన్ని భూమిమీద జీవించడానికి వీలవుతుందు.

4 ఇంక ఏడు రోజులకు భూమిమీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమిమీద జీవించే ప్రతిప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ నశించిపోతాయి.”

5 యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి విషయంలో నోవహు విధేయుడయ్యాడు.

6 ఈ జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు.

7 వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు.

8 [This verse may not be a part of this translation]

9 [This verse may not be a part of this translation]

10 ఏడు రోజుల తర్వాత వరద రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది.

11 [This verse may not be a part of this translation]

12 [This verse may not be a part of this translation]

13 [This verse may not be a part of this translation]

14 ఆ మనుష్యులు, భూమిమీదనున్న అన్ని రకాల జంతువులు ఆ ఓడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, నేలమీద ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఆ ఓడలో ఉన్నాయి.

15 ఈ జంతువులన్నీ నోవహుతో కలిసి ఓడలోకి వెళ్లాయి. ప్రాణం ఉన్న ప్రతి రకం జంతువు రెండేసి చొప్పున వచ్చాయి.

16 సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లే ఈ జంతువులన్నీ ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తరువాత యెహోవా ఓడ తలుపులు మూసివేసాడు.

17 40 రోజుల పాటు నీళ్లు భూమిమీద వరదలై పారాయి. నీటిమట్టం పెరుగుతూ ఓడను నేలమీదనుండి పైకి లేపడం మొదలయింది.

18 నీటిమట్టం పెరగటం కొనసాగుతునే ఉంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటిమీద తేలుతొంది.

19 నీటి మట్టం చాలా పైకి లేచినందువల్ల గొప్ప ఎత్తయిన పర్వతాలు అన్నీ నీళ్లలో మునిగిపోయాయి.

20 పర్వత శిఖరాలకు పైగా నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే నీటిమట్టం ఉంది.

21 [This verse may not be a part of this translation]

22 [This verse may not be a part of this translation]

23 కనుక భూమిమీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నింటినీ దేవుడు నాశనం చేసాడు. ఇవన్నీ భూమిమీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలోవున్న నోవహు అతనితో ఉన్న మనుష్యులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు.

24 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేసాయి.

8

1 అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవహును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువులన్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. భూమిమీద గాలి వీచేటట్టు దేవుడు చేసాడు. నీళ్లన్నీ కనపడకుండా పోయాయి.

2 ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. భూమి క్రింద నుండి నీళ్లు ఉబుకుట కూడ నిలిచిపోయింది.

3 [This verse may not be a part of this translation]

4 [This verse may not be a part of this translation]

5 నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనబడ్డాయి.

6 నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు.

7 ఒక కాకిని నోవహు బయటకు పంపాడు. నీళ్లన్నీ ఇంకి పోయి, నేల ఆరిపోయేంత వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి ఎగురుతూనే ఉంది.

8 ఒక పావురాన్ని కూడా నోవహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలను కొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి ఉందేమో తెల్సుకోవాలను కొన్నాడు.

9 నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు.

10 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ బయటకి పంపించాడు.

11 ఆ మధ్యాహ్నం ఆ పావురం మళ్లీ నోవహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఓలీవ ఆకు ఆ పావురం నోటవుంది. భూమిమీద ఆరిన నేల ఉన్నట్టుగా నోవహుకు అది ఒక గుర్తు.

12 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు.

13 ఆ తర్వాత నోవహు ఓడ తలుపులు తెరిచాడు. నేల ఆరిపోయినట్టుగా నోవహు చూశాడు. అది సంవత్సరములో మొదటి నెల మొదటి రోజు. అప్పుడు నోవహు వయస్సు 601 సంవత్సరాలు.

14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది.

15 అప్పుడు యెహోవా నోవహుతో అన్నాడు:

16 “ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఇప్పుడు బయటకు వెళ్లాలి.

17 జీవమున్న ప్రతి జంతువును, పక్షులన్నింటిని, భూమిమీద ప్రాకు ప్రాణులన్నిటిని నీతోబాటు బయటకు తీసుకొనిరా. ఆ జంతువులు సంతానాభివృద్ధి చెంది, అవి మరల భూమిని నింపుతాయి.”

18 తన కుమారులు, తన భార్య, తన కోడళ్లతో నోవహు బయటకు వెళ్లాడు.

19 జంతువులన్నీ ప్రాకు ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడచి వెళ్లాయి. జంతువులన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటకు వచ్చాయి.

20 అప్పుడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నోవహు కట్టాడు. పవిత్రమైన పక్షులన్నింటిలో నుండి, పవిత్రమైన జంతువులన్నింటిలో నుండి కొన్నింటిని నోవహు తీసుకొని, దేవునికి కానుకగా బలిపీఠం మీద వాటిని దహించాడు.

21 యెహోవా ఈ బలుల సువాసనను ఆఘ్రాణించి ఆనందించాడు. యెహోవా తనలో తాను అనుకొన్నాడు, “మనుష్యుల్ని శిక్షించేందుకోసం ఒక పద్ధతిగా మరల ఎన్నడు నేను భూమిని శపించను. మనుష్యులు చిన్నప్పటి నుండే దుర్మార్గులు కనుక భూమిమీద జీవిస్తున్న వాటన్నింటిని మరల ఎన్నడును నాశనం చేయను. లేదు మరల నేను ఇలా చేయను.

22 భూమి ఉన్నంత కాలమూ, నాటుటకు, పంట కోయుటకు ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది. భూమిమీద ఎప్పటికీ, చల్లదనం, వేడి, వేసివికాలం, చలికాలం, పగలు, రాత్రిళ్లు ఉంటాయి.”

9

1 నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు.

2 భూమి మీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.”

3 “గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపై నున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను - అదంతా నీదే.

4 అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు.

5 అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే ఏ మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ మనిషి రక్తాన్ని అడుగుతాను.

6 “దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేసాడు. కనుక యింకొక మనిషిని చంపిన వాడు మరో మనిషి చేత చంపబడాలి.”

7 నోవహూ, “నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక.”

8 తర్వాత నోవహుతో అతని కుమారుతో దేవుడు ఇలా అన్నాడు:

9 [This verse may not be a part of this translation]

10 నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను, నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను.

11 ఇదే నీకు నా వాగ్దానం. వరద నీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”

12 తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్టు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేసానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు.

13 మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడం బడికకు రుజువు ఆ రంగుల ధనస్సు.

14 భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు.

15 రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది.

16 మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకు, భూమిమీద సకల ప్రాణులకు మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”

17 కనుక, “భూమిమీద సకల ప్రాణులతోని నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని నోవహుతో యెహోవా చెప్పాడు. కనుక నోవహుతో ప్రభువు, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు మేఘములోని ధనస్సు రుజువు” అని చెప్పాడు.

18 నోవహుతో కూడ అతని కుమారులు ఓడలో నుండి బయటకు వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాఫెతు. (హాము కనానుకు తండ్రి).

19 ఆ ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ఆ ముగ్గురి కుమారుల నుండి వచ్చినవాళ్లే.

20 నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు.

21 నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని తాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు.

22 కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు.

23 అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు.

24 ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసిన దాన్ని అతడు తెలుసుకొన్నాడు.

25 కనుక నోవహు అన్నాడు: “కనాను శపించబడును గాక! కనాను తన సోదరులకు బానిస అగును గాక!”

26 నోవహు ఇంకా ఇలా అన్నాడు: “షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక! కనాను షేముకు బానిస అవును గాక.”

27 యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక! షేము గుడారాలలో దేవుడు నివసించు గాక! కనాను వారికి బానిస అవును గాక!”

28 జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బతికాడు.

29 నోవహు మొత్తం 950 సంవత్సరాలు బతికాడు. తరువాత అతడు మరణించాడు.

10

1 నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:

2 యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

3 గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా

4 యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.

5 మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివశించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతుల వారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.

6 హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను.

7 కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా. రాయమా కుమారులు షేబ, దదాను.

8 కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు.

9 నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి నిమ్రోదు వలె యెహోవా యెదుట గొప్ప వేటగాడు” అంటారు.

10 షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదు అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది.

11 నిమ్రోదు అష్షూరు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె రహోబో, తీరు, కాలహు,

12 రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు మహా పట్టణానికి మధ్య రెసెను ఉంది.)

13 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, సఫ్తుహీయులు.

14 సత్రుసీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారే.)

15 సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను, హేతుకు కనాను తండ్రి.

16 యెబూసీయులు, అమోరీయులు, గీర్గాషీయులు.

17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు.

18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికి కనాను తండ్రి. కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి.

19 ఉత్తరాన సీదోను నుండి దక్షీణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొర్రా, అద్మా. సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.

20 ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారికి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయు. వారు వేరు వేరు జాతులయ్యారు.

21 యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.

22 షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.

23 అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరుమాష.

24 అర్పక్షదు షేలహుకు తండ్రి. షేలహు ఏబెరుకు తండ్రి.

25 ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.

26 యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

27 హదోరము, ఊజాలు, దిక్లాను

28 ఓబాలు, అబీమాయెలు, షేబ,

29 ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు.

30 మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.

31 వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.

32 నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.

11

1 జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు.

2 తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు.

3 “మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనికొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు గాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు గాక తారు ఉపయోగించారు.

4 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”

5 ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు.

6 యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్టు నాకు కనబడుతోంది. వారు చేయగలగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు.

7 అందుచేత మనం కిందికి వెళ్లి వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.”

8 ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్టు యెహోవా చేసాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు.

9 మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.

10 షేము కుటుంబ చరిత్ర ఇది. జలప్రళయం తర్వాత రెండు సంవత్సరాలకు, షేము 100 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు అర్పక్షదు పుట్టాడు.

11 ఆ తర్వాత షేము 700 సంవత్సరాలు జీవించాడు. అతనికి ఇంకా కుమారులు కమార్తెలు, ఉన్నారు.

12 అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు.

13 షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు కుమార్తెలు పుట్టారు.

14 షేలహుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు ఏబెరు పుట్టాడు.

15 ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు, కుమారలు కుమార్తెలు పుట్టారు.

16 ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు.

17 పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టారు.

18 పెలెగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు రయూ పుట్టాడు.

19 రయూ పుట్టిన తర్వాత, పెలెగు ఇంకా 209 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.

20 రయూకు 32 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారుడు సెరూగు పుట్టాడు.

21 సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బతికాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమార్తెలు, కుమారులు పుట్టారు.

22 సెరూగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు నాహోరు పుట్టాడు.

23 నాహోరు పుట్టిన తర్వాత, సేరూగు 200 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

24 నాహోరుకు 29 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు తెరహు పుట్టాడు.

25 తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

26 తెరహుకు 70 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారులు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.

27 తెరహు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాము, నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు హారాను తండ్రి.

28 కల్దీయుల ఊర్ అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు. తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు.

29 అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా ఇస్కాలకు హారాను తండ్రి.

30 శారయి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.

31 తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊర్ అను పట్టణమును విడచిపెట్టేసాడు. కనానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును (హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు.

32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు.

12

1 అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు, “నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించు దేశానికి వెళ్లు.

2 నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒక గొప్ప జాతిగా నేను చేస్తాను నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను. ఇతరులను ఆశీర్వదించటానికి ప్రజలు నీ పేరు ఉపయోగిస్తారు.

3 నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను శపించే వాళ్లను నేను శపిస్తాను. భూమి మీదనున్న మనుష్యులందరిని ఆశీర్వదించడానికి నేను నిన్ను ఉపయోగిస్తాను.”

4 కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు, లోతు అతనితో కూడ వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరాలు.

5 అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరి వాడు కాడు. తన భార్య శారయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకు వెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము అతని వర్గంవారు హారాను విడిచి, కనాను దేశానికి ప్రయాణం చేసారు.

6 అబ్రాము కనాను దేశం గుండా సంచారం చేసాడు. అబ్రాము షెకము పట్టణానికి పయనించి మోరేలో వున్న మహా వృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు.

7 అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యి, “ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను” అన్నాడు. ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించటానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు.

8 తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకొన్నాడు. పడమటకి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు.

9 ఆ తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలు పెట్టాడు. నెగెబు దిశగా అతడు ప్రయాణం చేసాడు.

10 ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం లేదు కనుక ఏ పంటా పెరగటం లేదు. కనుక అబ్రాము నివసించటానికి ఈజిప్టుకు వెళ్లాడు.

11 తన భార్య శారయి చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. కనుక వారు ఈజిప్టు చేరకముందే అబ్రాము శారయితో ఇలా చెప్పాడు: “నీవు చాలా అందమైన స్త్రీవని నాకు తెలుసు.

12 ఈజిప్టీయులు నిన్ను చూస్తారు. ఈ స్త్రీ అతని భార్య అని వాళ్లు అంటారు. తర్వాత వాళ్లు నిన్ను అశించి నన్ను చంపేస్తారు.

13 కనుక నీవు నా సోదరివి అని ప్రజలతో చెప్పు. అప్పుడు వాళ్లు నన్ను చంపరు. నేను నీ సోదరుణ్ణి అని అనుకొంటారు గనుక వాళ్లు నామీద దయ చూపిస్తారు. ఈ విధంగా నీవు నా ప్రాణం కాపాడుతావు.”

14 కనుక అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో ప్రవేశించారు. శారయి చాలా అందగత్తె అని ఈజిప్టు ప్రజలు చూశారు.

15 ఈజిప్టు నాయకులు కూడ కొందరు ఆమెను చూశారు. ఆమె చాలా అందగత్తె అని ఫరోతో వాళ్లు చెప్పారు. ఆ నాయకులు శారయిని ఫరో యింటికి తీసుకెళ్లారు.

16 శారయికి అబ్రాము సోదరుడు అనుకొని ఫరో అబ్రాము మీద దయ చూపించాడు. గొర్రెలు, పశువులు, గాడిదలను ఫరో అబ్రాముకు ఇచ్చాడు. సేవకులు, సేవకురాండ్రు, ఒంటెలను కూడా అబ్రాముకు ఇచ్చాడు.

17 అబ్రాము భార్యను ఫరో తీసుకొన్నాడు. కనుక ఫరోకు అతని ఇంటిలోని మనుష్యులందరికి చాలా తీవ్రమైన రోగాలు వచ్చేటట్టు యెహోవా చేసాడు.

18 అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా అన్నాడు, “నీవు నాకు చాలా అపకారం చేశావు. శారయి నీ భార్య అని నాతో ఎందుకు నీవు చెప్పలేదు?

19 ఈమె నీ సోదరి అని చెప్పావు. నీవు ఎందుకలా చెప్పావు? అమె నా భార్యగా ఉండాలని అమెను నేను తీసుకొన్నాను. అయితే ఇప్పుడు నీ భార్యను మరల నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఆమెను తీసుకొని వెళ్లిపో!”

20 తర్వాత అబ్రామును ఈజిప్టు నుండి పంపించి వేయుమని ఫరో తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడచి వెళ్లీపోయారు. వాళ్లకు ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్లిపోయారు.

13

1 కనుక అబ్రాము ఈజిప్టు విడచిపెట్టాడు. తన భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసుకొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేసాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు.

2 ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి.

3 అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబు విడచిపెట్టి మళ్లీ బేతేలు వెనుకకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది.

4 అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.

5 ఈ సమయంలో అబ్రాముతో లోతు గూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి.

6 అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఈ భూమి సరిపోలేదు.

7 అబ్రాము గొర్రెల కాపరులు లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు.

8 కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం.

9 మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో నీవు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.”

10 లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్టు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనము చేయకముందు ఆ కాలంలో సోయరు వరకు యోర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.)

11 అందుచేత యోర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు.

12 అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు.

13 సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

14 లోతు వెళ్లపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: “నీ చుట్టు చూడు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు.

15 నీవు చూస్తోన్న ఈ దేశం అంతా నీకు, నీ వారుసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది.

16 భూమిమీద ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది.

17 కనుక వెళ్లు నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను.”

18 కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, మమ్రే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించటానికి ఈ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.

14

1 షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాం రాజైన కదొర్లాయోమెరు, మరియు గోయియుల రాజైన తిదాలు.

2 ఈ రాజులంతా కలసి సొదొమ రాజు బెరాతోను, గొమొర్రా రాజు బిర్షా, అద్మా రాజు షినాబు, సెబోయీయుల రాజు షెమేబెరు, బెల రాజు (సోయరు అని కూడ బెల పిలవబడింది) లతో యుద్ధము చేసారు.

3 ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. (సిద్దీమ లోయ యిప్పుడు ఉప్పు సముద్రం)

4 ఈ రాజులు పన్నెండు సంవత్సరాల పాటు కదొర్లాయోమెరుకు సేవ చేసారు. అయితే 13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు చేసారు.

5 కనుక 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వీరిమీద యుద్ధం చేయటానికి వచ్చారు. కదొర్లొయోమెరు, అతనితో ఉన్న రాజులు అష్తారోతు కర్నాయిములో రఫాయి ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఏమీయులను వారు ఓడించారు.

6 శేయీరు కొండ ప్రదేశం నుండి ఏల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. (ఏల్పారాను ఎడారి దగ్గరగా ఉంది.)

7 తర్వాత కదొర్లాయోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు (అంటే కాదేషు) వెళ్లి, అమాలేకీ ప్రజలందర్నీ ఓడించాడు. అమోరీ ప్రజలను కూడా అతడు ఓడించాడు. హససోన్ తమారులో ఈ ప్రజలు నివసిస్తారు.

8 ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయిము రాజు, బెల రాజు (బెల అంటె సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు.

9 ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేసారు. అందుచేత ఈ నలుగురు రాజులు ఆ అయిదుగురితో యుద్ధం చేసారు.

10 సిద్దీం లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలివాళ్లు కొండల్లోకి పారిపోయారు.

11 కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు.

12 అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్లిపోయాడు.

13 పట్టుబడని లోతుయొక్క మనుష్యులలో ఒకడు అబ్రాము దగ్గరకు వెళ్లి జరిగినదాన్ని చెప్పాడు. అమ్మోరీవాడగు మమ్రే చెట్లదగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. మమ్రే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడం బడిక చేసుకొన్నారు. అబ్రాహాముకు సహాయం చేసేందుకు గూడ వారు ఒక ఒడంబడిక చేసుకొన్నారు.

14 లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. కనుక అబ్రాము తన కుటుంబం అతంటిని సమావేశ పర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. అబ్రాము తన మనుష్యులకు నాయకత్వం వహించి, దాను పట్టణం వరకు శత్రువును పూర్తిగా తరిమివేసాడు.

15 ఆ రాత్రి అతడు, అతని మనుష్యులు శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రువును ఓడించి దమస్కుకు ఉత్తరాన హూబ వరకు వారిని తరిమివేసారు.

16 అప్పుడు అబ్రాము శత్రువు దొంగిలించిన వస్తువులన్నింటిని మరల వెనుకకు తీసుకొని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, అతని ఆస్తి అంతటిని అబ్రాము వెనుకకు తీసుకొని వచ్చాడు.

17 కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)

18 షాలెము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. సర్వోన్నతుడైన దేవునికి మెల్కీసెదెకు యాజకుడు. రొట్టెను ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు.

19 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు: “అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక, దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు.

20 సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం నీ శత్రవుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేసాడు.” యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు.

21 అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు.

22 అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవా దేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను.

23 నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేసానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’

24 నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలిన వారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”

15

1 ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి “అబ్రామూ భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అన్నాడు దేవుడు.

2 అయితే అబ్రాము అన్నాడు; “యెహోవో దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి కర్త అవుతాడు.”

3 అబ్రాము: “చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు గల ఆస్తి అంతా దక్కించుకొంటాడు,”

4 అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకుగల వాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.”

5 అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”

6 అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు

7 అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేసాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.”

8 అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.

9 అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”

10 దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేసాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేసాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు.

11 తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేసాడు.

12 తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది.

13 అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు.

14 అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచి పెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు.

15 “నీ మట్టుకు నీవు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతి పెట్టబడతావు.

16 నాలుగు తరాల తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించుటానికి నీ ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు.”

17 సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక ‘ముద్ర’ లేక ‘సంతకం’. ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. ‘నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ’ అన్నది దీని అర్థం.

18 కనుక ఆనాడు, ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేసాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను.

19 కెనీయులు, కెనిజ్జీయులు, కద్మానీయులు,

20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీమీయులు,

21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యోబూషీయుల దేశమిది.”

16

1 అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు.

2 శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి నాకు పిల్లలు పుట్టకుండా చేసాడు యెహోవా. కనుక మీరు నా పని మనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు.

3 కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి)

4 అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది.

5 అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది.

6 కాని అబ్రాము, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్టు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు శారయితో. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి పారిపోయింది.

7 ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు ఆ పనిమనిషికి కనబడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది.

8 “హాగరూ, నీవు శారయి పని మనిషివి గదూ! ఇక్కడెందుకు ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆ దూత అడుగగా, “నా యజమానురాలు శారయి నుండి పారిపోతున్నాను” అని చెప్పింది హాగరు.

9 “నీ యజమానురాలి దగ్గరకు నీవు తిరిగి వెళ్లు, ఆమెకు లోబడి నడుచుకో” అని యెహోవా దూత ఆమెతో చెప్పడం జరిగింది.

10 “నీలో నుండి అనేక జనములు వస్తారు. వారు చాలామంది ఉంటారు గనుక వాళ్లను లెక్కపెట్టడం కూడ కుదరదు” అని కూడ యెహోవా దూత చెప్పడం జరిగింది.

11 ఇంకా యెహోవా దూత, “ఇప్పుడు నీవు గర్భవతివి, మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు. అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతావు. ఎందుచేతనంటే నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు.

12 “ఇష్మాయేలు అడవి గాడిదలా అదుపులేక, స్వేచ్ఛగా ఉంటాడు అతడు అందరికి వ్యతిరేకమే ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే తన సోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు కాని అతడు వారికి వ్యతిరేకంగా ఉంటాడు.” అని చెప్పాడు.

13 ఆ పనిమనిషితో యెహోవా మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక కొత్త పేరు ప్రయోగించింది. “నన్ను చూసే దేవుడవు నీవు” అని ఆయనతో చెప్పింది. “ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు” అని అనుకొన్నందువల్ల ఆమె ఇలా చెప్పింది.

14 కనుక ఆ బావి బెయేర్ లహాయిరోయి అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది ఆ బావి.

15 హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు.

16 హాగరుకు ఇష్మాయలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు.

17

1 అబ్రాముకు 99 సంవత్సారల వయస్సు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడి యిలా చెప్పాడు: “నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని నా కోసం ఈ పనులు చేయి. నాకు విధేయుడవై, సరైన జీవితం జీవించు.

2 ఇలా గనుక నీవు చేస్తే మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను.”

3 అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు.

4 “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను.

5 నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు - నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను.

6 నీకు నేను పెద్ద సంతానాన్ని ఇస్తాను. నీనుండి కొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. నీనుండి కొత్త రాజులు వస్తారు.

7 నీకు నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను.

8 నీవు పరాయివాడిగా నివసిస్తున్న ఈ దేశాన్ని అంటే కనాను దేశాన్ని నీకును, నీ సంతానపు వారందిరికిని శాశ్వతపు హక్కుగా ఇస్తాను. నేను మీకు దేవునిగా ఉంటాను.”

9 అబ్రాహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “ఇక, ఒడంబడికలో నీ భాగం యిది. ఒడంబడికను నీవు నిలబెట్టాలి నీవూ, నీ సంతానమంతా నా ఒడంబడికకు విధేయులు కావాలి.

10 మీరు విధేయులు కావాల్సిన ఒడంబడిక ఇదే. ఇది మీకు, నాకు మధ్య ఒడంబడిక. ఇది నీ సంతానము వారి కోసమూను; పుట్టిన ప్రతి పిల్లవాడికి తప్పక సున్నతి చెయ్యాలి.

11 నీకు నాకు మధ్యగల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలియ చేసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని కోయాలి.

12 నీ జనములో పుట్టిన ప్రతి బాలుడు, నీ జనమునుండి కాక, ఇతర జనములనుండి డబ్బుతో బానిసగా కొనబడిన వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకొనవలెను.

13 కనుక నీ జాతి అంతటిలో ప్రతి పిల్లవానికి సున్నతి జరుగుతున్నది. నీ వంశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి, లేక బానిసగా కొనబడిన పిల్లవాడికి సున్నతి జరుగుతుంది.

14 ఇది నా చట్టం, నీకు నాకు మధ్యనున్న ఒడంబడిక. సున్నతి చేయని ఏ మగవాడైనా సరే తన ప్రజల్లో నుండి తొలగించివేయ బడతాడు. ఎందుచేతనంటే, ఆ వ్యక్తి నా ఒడంబడికను ఉల్లంఘించాడు కనుక.”

15 అబ్రాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య శారయికి నేను ఒక కొత్త పేరు పెడ్తాను. ఆమె కొత్త పేరు శారా.

16 ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి అవుతావు. అనేక కొత్త జనాంగములకు ఆమె తల్లి అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.”

17 దేవుణ్ణి గౌరవించుటకు అబ్రాహాము ముఖం క్రిందికి దించుకొన్నాడు. అయితే అతడు నవ్వి తనలో తాను అనుకొన్నాడు: “నా వయస్సు 100 సంవత్సరాలు. నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయస్సు 90 సంవత్సరాలు. ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం.”

18 అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: “నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని అశిస్తున్నాను.”

19 దేవుడు చెప్పాడు: “లేదు! నీ భార్య శారాకు కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి ఇస్సాకు అని నీవు పేరు పెడ్తావు. అతనితో నేను నా ఒడంబడిక చేసుకొంటాను. ఆ ఒడంబడిక అతని సంతానాలన్నిటితోను శాశ్వతంగా కొనసాగే ఒడంబడికగా ఉంటుంది.

20 “ఇష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, నేను విన్నాను. అతణ్ణి నేను ఆశీర్వదిస్తాను. అతనికి చాలా మంది పిల్లలు ఉంటారు. పన్నెండు మంది మహా నాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది.

21 అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.”

22 అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత అబ్రాహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేచి అబ్రాహామును విడచి వెళ్లపోయాడు.

23 తన కుటుంబంలోని మగవాళ్లకు, బాలురకు సున్నతి చేయమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. కనుక ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన సేవకులందరిని అబ్రాహాము సమావేశపర్చాడు. డబ్బుతో కొనబడిన సేవకులను గూడ అబ్రాహాము సమావేశపర్చాడు. అబ్రాహాము ఇంటిలోని ప్రతి పురుషుడు, బాలుడు ఒక చోట సమావేశ పర్చబడ్డారు. వారందరికి సున్నతి చేయబడింది. అబ్రాహాము దేవుడు చెప్పినట్లు వారందరికి సున్నతి చేశాడు.

24 అబ్రాహాము సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు 99 సంవత్సరాలు.

25 అతని కుమారుడు ఇష్మాయేలుకి సున్నతి జరిగినప్పుడు అతడు 13 ఏండ్లవాడు.

26 అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరు ఒకే రోజున సున్నతి చేయబడ్డారు.

27 ఆ రోజునే అబ్రాహాము ఇంటిలోని మగవాళ్లందరికి గూడ సున్నతి జరిగింది. అతని ఇంట పుట్టిన సేవకులందరికి, అతడు కొన్న సేవకులందరికి సున్నతి జరిగింది.

18

1 తర్వాత మళ్లీ అబ్రాహామునకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు.

2 అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి: వారి ముందు వంగి,

3 ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి.

4 మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల కింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు.

5 మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.” “చాలా బాగుంది, అలాగే కానీయి” అన్నారు ఆ ముగ్గురు మనుష్యులు.

6 అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అన్నాడు శారాతో అబ్రాహాము.

7 తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి యవ్వనంలో ఉన్న దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయుమని అబ్రాహాము చెప్పాడు.

8 ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు కింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు.

9 “నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు. “అమె అక్కడ గుడారంలో ఉంది” అన్నాడు అబ్రాహాము.

10 అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అన్నాడు. గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది.

11 అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది.

12 అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను.

13 అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. ఆమె నవ్వింది. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా!” అంది.

14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు ఉంటాడు.

15 అయితే శారా, “నేను నవ్వలేదు” అంది. (భయపడి అమె అలా అంది.) కాని యెహోవా, “కాదు, నీవు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు. నీవు నవ్వావు” అన్నాడు.

16 అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు.

17 యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను చెప్పాలా?

18 అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది ప్రజలంతా ఆశీర్వదించబడుతారు.

19 అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్టు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని చెప్పి, నేను ఇలా చేసాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని చెప్పి నేను ఇలా చేసాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.”

20 మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొర్రాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది. అని నేను విన్నాను.

21 కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చుస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.”

22 అంచేత ఆ మనుష్యులు మళ్లీ, సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు.

23 అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచి వారిని కూడా నాశనం చేస్తావా?

24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచి వాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు.

25 ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచి వాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”

26 అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచి వాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా.

27 దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను.

28 ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మాత్రమే మంచివాళ్లు ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?” “అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా.

29 మరల అబ్రాహాము, “అక్కడు 40 మంది మాత్రమే మంచివాళ్లు నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు. “40 మంది మంచి వాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా.

30 అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మాత్రమే మంచివాళ్లు కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు. అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచి వాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు.

31 అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు. “20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా.

32 అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?” “పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అన్నాడు” యెహోవా.

33 యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం అయిపోయింది, గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి వెళ్లిపోయాడు.

19

1 ఆ సాయంకాలం, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణం వచ్చారు. పట్టణ ద్వారం దగ్గర కూర్చొని ఉన్న లోతు ఆ దేవదూతల్ని చూశాడు. లోతు లేచి, దేవదూతల దగ్గరకు వెళ్లి, సాష్టాంగ పడ్డాడు.

2 లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” “లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.

3 కాని, వారిని తన ఇంటికి రమ్మని లోతు బలవంతము చేసెను. అంచేత లోతు ఇంటికి వెళ్లడానికి దేవదూతలు ఒప్పుకొన్నారు. వారు ఇంటికి వెళ్లగానే, వారు తినేందుకు లోతు భోజనం తయారు చేసాడు, వాళ్ల కోసం రొట్టెలు చేసాడు. లోతు వండిన భోజనం దేవదూతలు తిన్నారు.

4 ఆ రాత్రి పండుకొనక ముందు, పట్టణం నలుమూలల నుండి పురుషులు చిన్నలూ, పెద్దలూ లోతు ఇంటికి వచ్చారు. సొదొమ ప్రజలు లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతును పిల్చారు.

5 “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) ఎక్కడ? వాళ్లను బయటకు మా దగ్గరకు తీసుకురా. మేము వాళ్లను సంభోగించాలి” అన్నారు.

6 లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూసాడు.

7 “వద్దు, నా సోదరులారా, దయచేసి ఈ చెడ్డపని మీరు చేయవద్దని బతిమాలాడుతున్నాను” అని ఆ మనుష్యులతో చెప్పాడు.

8 “చూడండి, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఇదివరకు ఎన్నడూ ఏ పురుషునివద్ద పడుకోలేదు. నా కూతుళ్లను మీకు ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు వాళ్లను చేసుకోండి. కాని దయచేసి ఈ మనుష్యులను మాత్రం ఏమీ చేయకండి. వీళ్లు నా ఇంటికి వచ్చారు, నేను వాళ్లను కాపాడాలి” లోతు ఆ మనుష్యులతో అన్నాడు.

9 “దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈ లోతు ఒక యాత్రికుడుగా మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు చెబుతున్నాడు” - అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పారు కనుక ఆ మనుష్యులు లోతు దగ్గరకు మరింత సమీపంగా వెళ్లి, తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు.

10 అయితే లోతు ఇంటిలో వున్న ఆ యిద్దరు మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి లాగేసారు. తర్వాత వాళ్లు తలుపు మూసేసారు.

11 ద్వారమునకు వెలుపల ఉన్న మనుష్యులు గ్రుడ్డివాళ్లు అయ్యేటట్టు ఆ దేవదూతలు చేసారు. కనుక ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించిన ఆ మనుష్యులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరు గుడ్డివాళ్లయిపోయి ద్వారం ఎక్కడుందో కనుక్కోలేక పోయారు.

12 “మీ కుటుంబాలకు చెందిన వాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబానికి చెందిన వాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే ఈ చోటు విడిచిపెట్టమని చెప్పాలి.

13 మేము ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి యెహోవా అంతా చూశాడు. కనుక ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి యెహోవా మమ్ముల్ని పంపించాడు” అని ఆ ఇద్దరు మనుష్యులు లోతుకు చెప్పారు.

14 కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను పెళ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. “త్వరగా ఈ పట్టణం వదిలిపెట్టిండి. యెహోవా దీన్ని త్వరగా నాశనం చేస్తాడు” అన్నాడు లోతు. అయితే లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు.

15 మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.”

16 కాని, లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వరపడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు, (దేవదూతలు) లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల యెహోవా దయ చూపెట్టాడు.

17 అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.”

18 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు.

19 మీ సేవకుడైన నా మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి నేను మరణిస్తాను.

20 అయితే చూడండి, ఇక్కడికి సమీపంలో ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.”

21 దేవదూత లోతుతో, “సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న ఆ ఊరిని నేను నాశనం చేయను.

22 అయితే అక్కడికి వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, సొదొమను నేను నాశనం చేయను” అనెను. (ఆ ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.)

23 సూర్యోదయం అయ్యేటప్పటికి లోతు సోయరులో ప్రవేశిస్తున్నాడు.

24 సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనం చేయటం మొదలు బెట్టాడు. ఆకాశం నుండి అగ్ని గంధక వర్షాన్ని యెహోవా పంపించాడు.

25 కనుక ఆ పట్టణాలను యెహోవా నాశనం చేసాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.

26 వారు పారిపోతూ ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి పట్టణం వైపు చూసింది. ఆమె వెనుకకు తిరిగిచూడగానే ఉప్పుస్తంభం అయిపోయింది.

27 ఆ ఉదయమే పెందలకడ అబ్రాహాము లేచి నిన్న యెహోవా ఎదుట నిలిచిన స్థలానికి వెళ్లాడు.

28 అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు కిందుగా చూశాడు. ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.

29 ఆ లోయలోని పట్టణాలను దేవుడు నాశనం చేసాడు. అయితే దేవుడు ఇది చేసినప్పుడు, అబ్రాహాము అడిగిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. లోతు ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, కాని లోతు నివసించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేసాడు.

30 సోయరులో జీవితం గడిపేందుకు లోతు భయపడ్డాడు. కనుక అతడు, అతని ఇద్దరు కుమార్తెలు వెళ్లి పర్వతాల్లో నివాసం చేశారు. అక్కడ ఒక గుహలో వారు నివసించారు.

31 ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో ఇలా చెప్పింది: “భూమిమీద అంతటా స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి ఉంటారు. కానీ మనం పెళ్లి చేసుకొని పిల్లలు కలిగేందుకు ఇక్కడ ఎవ్వరూ మగవాళ్లు లేరు. మన తండ్రి ముసలివాడు.

32 కానీ మన కుటుంబం సాగాలి గనుక మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయనతో పాటు మధుపానం చేసి, ఆయనకు మత్తు కలిగిద్దాం. అప్పుడు మనం ఆయనతో పండుకోవచ్చు.”

33 ఆ రాత్రి ఇద్దరు అమ్మాయిలో తమ తండ్రి దగ్గరకు వెళ్లి, అతనికి ద్రాక్షారసాన్ని తాగించి మత్తుగా చేశారు. అప్పుడు పెద్దమ్మాయు తన తండ్రి పడక మీదకు వెళ్లి, అతనితో లైంగికంగా కలసికొన్నది. లోతు తాగిన మత్తులో ఉన్నాడు గనుక, ఆమె ఎప్పుడు తనతో పండుకొన్నది, లేచి వెళ్లినది, అతనికి తెలియలేదు.

34 మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండుకొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్షారసముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక మీదకి వెళ్లి ఆయనతో లైంగికంగా కలసికొనవచ్చు. ఈ విధంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించుకోవచ్చు.”

35 కనుక ఆ రాత్రి తమ తండ్రికి మత్తు ఎక్కేంతవరకు ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రికి ద్రాక్షారసాన్ని తాగించారు. అప్పుడు చిన్నమ్మాయి అతని పడక మీదకి వెళ్లి అతనితో పడుకొంది. అతని కుమార్తె అతనితో పండుకొన్నట్టు లోతుకు మరల తెలియలేదు.

36 అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి వారి శిశువులకు తండ్రి.

37 పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె ఆ కుమారునికు మోయాబు అని పేరు పెట్టింది. నేటికి జీవిస్తోన్న మోయాబు ప్రజలందరికి అతడు తండ్రి.

38 చిన్న కుమార్తెకు కూడ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తన కుమారునికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. నేటికి జీవిస్తోన్న అమ్మనీ ప్రజలందిరికి బెన్నమ్మి తండ్రి.

20

1 అబ్రాహాము ఆ చోటు విడిచి నెగెబుకు ప్రయాణం కట్టాడు. కాదేషుకు, షూరుకు మధ్యనున్న గెరారుకు అబ్రాహాము వెళ్లాడు. గెరారులో ఉన్నప్పుడు

2 శారా తన సోదరి అని అబ్రాహాము ప్రజలతో చెప్పాడు. గెరారు రాజు అబీమెలెకు ఇది విన్నాడు. అబీమెలెకు శారాను ఇష్టపడి, ఆమెను తీసుకుని వచ్చేందుకు కొందరు సేవకుల్ని పంపించాడు.

3 అయితే ఆ రాత్రి దర్శనంలో అబీమెలెకుతో దేవుడు మాట్లాడి, “చూడు, నీవు చస్తావు. నీవు తెచ్చుకొన్న ఆ స్త్రీ వివాహితురాలు” అని చెప్పాడు.

4 కానీ అప్పటికి అబీమెలెకు శారాతో శయనించ లేదు. కనుక అబీమెలెకు, “ప్రభూ, నేను దోషిని కాను. నిర్దోషిని నీవు చంపుతావా?

5 ‘ఈ స్త్రీ నా సోదరి’ అని అబ్రాహాము స్వయంగా నాతో చెప్పాడు. ఆ స్త్రీ కూడా ‘ఈ పురుషుడు నా సోదరుడు’ అని చెప్పింది. నేను నిర్దోషిని. నేను చేస్తున్నది ఏమిటో నాకు తెలియలేదు” అన్నాడు.

6 ఆ దర్శనంలో అబీమెలెకుతో దేవుడు ఇలా చెప్పాడు: “అవును, నాకు తెలుసు, నీవు నిర్దోషివి. నీవు చేస్తున్నది ఏమిటో నీకు తెలియదు అని నాకు తెలుసు. నేను నిన్ను కాపాడాను. నాకు వ్యతిరేకంగా నిన్ను నేను పాపం చేయనీయలేదు. నీవు ఆమెతో శయనించకుండా చేసింది నేనే.

7 కనుక అబ్రాహాము భార్యను తిరిగి అతనికి అప్పగించు. అబ్రాహాము ఒక ప్రవక్త. అతడు నీ కోసం ప్రార్థిస్తాడు, అప్పుడు నీవు బతుకుతావు. కానీ శారాను నీవు తిరిగి అబ్రాహాముకు ఇవ్వకపోతే, నీవు మరణించడం తప్పదు. నీతోబాటు నీ కుటుంబం అంతా మరణిస్తుంది.”

8 కనుక మర్నాడు వేకువనే, అబీమెలెకు తన సేవకులందరినీ పిల్చాడు. దర్శనంలో సంభవించిన సంగతులన్నీ అబీమెలెకు వారితో చెప్పాడు. సేవకులు చాలా భయపడ్డారు.

9 అప్పుడు అబీమెలెకు అబ్రాహామును పిలిచి, అతనితో అన్నాడు: “నీవు మాకు ఎందుకు ఇలా చేసావు? నీకు నేను ఏమి అపకారం చేసాను? ఎందుకలా అబద్ధం చెప్పి, ఆమె నీ సోదరి అన్నావు? నా రాజ్యానికి నీవు చాలా చిక్కు తెచ్చిపెట్టావు. నాకు నీవు ఇలా చేయకుండా ఉండాల్సింది.

10 నీవు దేనికి ఇలా చేసావు?”

11 అందుకు అబ్రాహాము చెప్పాడు: “నేను భయపడ్డాను. దేవుడంటే ఇక్కడ ఎవరికీ భయము లేదని అనుకొన్నాను. శారాను పొందటం కోసం ఎవరైనా నన్ను చంపేస్తారు అనుకొన్నాను.

12 ఆమె నా భార్య, అయితే నా సోదరి కూడాను. ఆమె నా తండ్రి కుమార్తె గాని, నా తల్లి కుమార్తె కాదు.

13 నా తండ్రి ఇంటినుండి దేవుడు నన్ను బయటకు నడిపించాడు. అనేక చోట్ల సంచారం చేసేటట్టు దేవుడు నన్ను నడిపించాడు. అలా జరిగినప్పుడు, ‘నీవు నా సోదరివని ప్రజలతో మనం వెళ్లిన చోటల్లా చెప్పు, నాకు ఈ మేలు చేయి’ అని నేను శారాతో చెప్పాను.”

14 అప్పుడు జరిగిందేమిటో అబీమెలెకు అర్థం చేసుకొన్నాడు. కనుక శారాను అబీమెలెకు తిరిగి అబ్రాహాముకు అప్పగించేసాడు. కొన్ని గొర్రెలు, పశువులు, కొందరు ఆడ, మగ బానిసలను కూడ అబీమెలెకు అబ్రాహాముకు ఇచ్చాడు.

15 మరియు “నీ చుట్టూ చూడు. ఇది నా దేశం. నీకు ఇష్టం వచ్చిన చోట నీవు ఉండవచ్చు” అన్నాడు అబీమెలెకు.

16 “చూడు, నీ సోదరుడైన అబ్రాహాముకు 1000 వెండి నాణెములు ఇచ్చాను. జరిగిన వాటి విషయమై నా పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి యిది చేసాను. నేను సక్రమంగా జరిగించినట్టు అందరూ చూడాలని నేను కోరుతున్నాను” అని అబీమెలెకు శారాతో చెప్పాడు.

17 [This verse may not be a part of this translation]

18 [This verse may not be a part of this translation]

21

1 యెహోవా శారాకు అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేసాడు. ఆయన వాగ్దానం చేసినట్టే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు.

2 అబ్రాహాము వృద్దాప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి.

3 శారా కుమారుని కన్నది, అబ్రాహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.

4 దేవుడు ఆజ్ఞాపించినట్టు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు.

5 తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నయస్సు 100 సంవత్సరాలు.

6 “దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు.

7 నేను శారాను, అబ్రాహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక కుమారుని కన్నాను” అంది శారా.

8 ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేసాడు.

9 గతంలో ఈజిప్టు బానిసైన స్త్రీ హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా తండ్రి అబ్రాహామే. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది.

10 “కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ” శారా అబ్రాహాముతో చెప్పింది.

11 ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు.

12 కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు.

13 అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడు నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.”

14 మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లు తెచ్చాడు. అబ్రాహాము వీటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వీటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.

15 కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. తాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది.

16 హాగరు కొంచె దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తోంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.

17 ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు.

18 వెళ్లి పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి అతణ్ణి తండ్రిగా నేను చేస్తాను”

19 అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్టు చేసాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు తాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.

20 ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేయగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు.

21 అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు.

22 అంతట ఆబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫికోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు.

23 కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తావని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”

24 “నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కాడు నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము.

25 అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేసాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచి నీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేసాడు.

26 కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేసారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు.

27 కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడిక సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబీమెలెకుకు అబ్రాహాము ఇచ్చాడు.

28 ఏడు ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట ఉంచాడు అబ్రాహాము.

29 “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు.

30 “ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్టు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

31 కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు.

32 కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబెమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు.

33 బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు నాటాడు. అప్పుడు అబ్రాహాము ప్రభువు, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడైన యెహోవాకు అతడు అక్కడ ప్రార్థన చేశాడు.

34 ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.

22

1 ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాలని దేవుడు అనుకొన్నాడు. “అబ్రాహామూ” అని దేవుడు అతణ్ణి పిలిచాడు. దానికి అబ్రాహాము “చిత్తం” అన్నాడు.

2 అప్పుడు దేవుడు చెప్పాడు, “నీ కుమారుని మోరీయా దేశం తీసుకొని వెళ్లు. మోరీయాలో నీ కుమారుణ్ణి నాకు బలిగా చంపు. నీ ఒకే కుమారుడు, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడైన ఇస్సాకును ఇలా చేయాలి. అక్కడ కొండల్లో ఒక దానిమీద అతణ్ణి దహనబలిగా ఉపయోగించు. ఏ కొండ అనేదీ నేను నీతో చెబుతాను.”

3 ఉదయాన అబ్రాహాము లేచి తన గాడిదను సిద్ధం చేసాడు. ఇస్సాకును తన ఇద్దరు సేవకులను అబ్రాహాము తన వెంట తీసుకు వెళ్లాడు. బలి అర్పణ కోసం కట్టెలను అబ్రాహాము నరికాడు. తర్వాత వారు వెళ్లాలని దేవుడు అతనితో చెప్పిన చోటుకి వారు వెళ్లారు.

4 వారు మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత, అబ్రాహాము కనులెత్తి దూరంలో వారు వెళ్లవలసిన చోటును చూశాడు.

5 అప్పుడు అబ్రాహాము, “మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి. నేను నా కుమారుణ్ణి తీసుకొని, అక్కడికి వెళ్లి ఆరాధన చేస్తాం. ఆ తర్వాత మేము మీ దగ్గరకు తిరిగి వస్తాం” అని తన సేవకులతో చెప్పాడు.

6 అబ్రాహాము బలికోసం కట్టెలు తీసుకొని తన కుమారుని భుజంమీద పెట్టాడు. ఒక ప్రత్యేక ఖడ్గం, నిప్పు అబ్రాహాము పట్టుకొన్నాడు. అప్పుడు అబ్రాహాము, అతని కుమారుడు యిద్దరు కలిసి ఆరాధనా స్థలానికి వెళ్లారు.

7 ఇస్సాకు “తండ్రీ!” అని తన తండ్రి అబ్రాహామును పిలిచాడు, “ఏమిటి కొడుకా?” అని అడిగాడు అబ్రాహాము. “కట్టెలు, నిప్పు నాకు కనబడుతున్నాయి. కాని మనం బలిగా దహించే గొర్రెపిల్ల ఏది?” అని ఇస్సాకు అడిగాడు.

8 “నా కుమారుడా, బలికోసం గొర్రెపిల్లను సరైన సమయంలో దేవుడు మనకు ఇస్తాడు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. కనుక అబ్రాహాము, అతని కుమారుడు ఇద్దరూ కలిసి ఆ చోటుకి వెళ్లారు.

9 దేవుడు వారికి వెళ్లమని చెప్పిన చోటుకి వారు వెళ్లారు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను ఆ బలిపీఠం మీద పెట్టాడు. తర్వాత తన కుమారుడు ఇస్సాకును అబ్రాహాము కట్టివేసాడు. బలిపీఠం మీద కట్టెలపై ఇస్సాకును పరుండబెట్టాడు.

10 అప్పుడు అబ్రాహాము తన ఖడ్గం తీసుకొని తన కుమారుని చంపడానికి సిద్ధమయ్యాడు.

11 కాని అప్పుడు యెహోవా దూత అబ్రాహామును ఆపు చేసాడు. దేవుదూత ఆకాశం నుండి “అబ్రాహామా, అబ్రాహామా” అని పిలిచాడు. “చిత్తం” అని అబ్రాహాము జవాబిచ్చాడు.

12 “నీ కుమారుని చంపవద్దు, అతనికి ఏ హానీ చేయవద్దు. నీకు దేవుని పట్ల భయం, ఆరాధనా భావం ఉన్నాయని నాకిప్పుడు తెలుసు. నా కోసం, నీ కుమారుణ్ణి అదీ నీ ఒకే ఒక్క కుమారుణ్ణి చంపడానికి గూడా నీవు సిద్ధమేనని నేను చూశాను” అన్నాడు దేవదూత.

13 అబ్రాహాము అటు ప్రక్క చూడగా ఒక పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలు కొమ్ములు ఒక పొదలో చిక్కుకొన్నాయు. కనుక అబ్రాహాము వెళ్లి, పొట్టేలును పట్టుకొని దానిని చంపాడు. ఆ పొట్టేలును దేవునికి బలిగా అబ్రాహాము ఉపయోగించాడు. అబ్రాహాము కుమారుడు రక్షించబడ్డాడు.

14 అందుచేత ఆ స్థలానికి “యెహోవా ఈరె “ అని అబ్రాహాము పేరు పెట్టాడు. “ఈ పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు.

15 ఆకాశంనుండి యెహోవా దూత అబ్రాహామును రెండవసారి పిల్చాడు.

16 యెహోవా దూత చెప్పాడు: “నా కోసం నీ కుమారుణ్ణి చంపడానికి నీవు సిద్ధపడ్డావు. అతడు నీకు ఒక్కడే కుమారుడు. నా కోసం నీవు ఇలా చేశావు గనుక నీకు ఈ వాగ్దానం చేస్తున్నాను. యెహోవానైన నేను వాగ్దానం చేసేది ఏమిటంటే

17 నిజంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆకాశంలో అసంఖ్యాక నక్షత్రాలులాగా సముద్ర తీరంలో ఇసుకలాగా నీ సంతానమును చేస్తాను. నీ ప్రజలు వారి శత్రువులనందరినీ ఓడిస్తారు.

18 నీ సంతానం ద్వారా భూమిమీద ప్రతిజనం ఆశీర్వదించబడతారు. నీవు నాకు విధేయుడవయ్యావు కనుక నేను దీన్ని చేస్తాను.”

19 అప్పుడు అబ్రాహాము మళ్లీ తన సేవకుల దగ్గరకు వెళ్లిపోయాడు. వాళ్లంతా బెయేర్షెబాకు ప్రయాణమై వెళ్లిపోయారు, అబ్రాహాము అక్కడ నివసించాడు.

20 ఈ సంగతులన్నీ జరిగాక, అబ్రాహాముకు ఒక సందేశం పంపబడింది. ఆ సందేశం ఇది, నీ సోదరుడు నాహోరు, అతని భార్య మిల్కాకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు.

21 మొదటి కుమారుడు ఊజు. రెండవ కుమారుడు బూజు, మూడవ కుమారుడు కెమూయేలు, అతడు అరాము తండ్రి.

22 ఆ తర్వాత కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయోలు అనువారు ఉన్నారు.”

23 బెతూయేలు రిబ్కాయొక్క తండ్రి. ఈ ఎనిమిది మంది కుమారులకు తల్లి మిల్కా, తండ్రి నాహోరు. నాహోరు అబ్రాహాము సోదరుడు.

24 మరియు నాహోరు దాసియైన రయూమా ద్వారా అతనికి ఇంకా నలుగురు కుమారులు తెబహు, గహము, తహషు, మయకా కలిగారు.

23

1 శారా 127 సంవత్సరాలు జీవించింది.

2 కనాను దేశంలోని కిర్యతర్బా పట్టణంలో (అనగా హెబ్రోను) అమె మరణించింది. అబ్రాహాము చాలా దుఃఖించి, ఆమె కోసం అక్కడ ఏడ్చాడు.

3 అప్పుడు మరణించిన తన భార్యను విడచిపెట్టి, హిత్తీ ప్రజలతో మాట్లాడేందుకు అబ్రాహాము వెళ్లాడు.

4 “నేను ఈ దేశవాసిని కాను. ఇక్కడ నేను యాత్రికుడను మాత్రమే. అందుచేత నా భార్యను పాతిపెట్టుటకు నాకు స్థలము లేదు. నేను నా భార్యను పాతిపెట్టడానికి దయచేసి నాకు కొంత స్థలం ఇవ్వండి” అన్నాడు.

5 హిత్తీ ప్రజలు అబ్రాహాముకు ఇలా జవాబు చెప్పారు.

6 “అయ్యా, మా మధ్య మీరు దేవుని మహా నాయకులలో ఒకరు. చనిపోయిన మీ వాళ్లను పాతిపెట్టేందుకు మా శ్రేష్ఠమైన స్థలాన్ని మీరు తీసుకోవచ్చు. చనిపోయిన వాళ్లను పాతిపెట్టే మా స్థలాల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అక్కడ మీ భార్యను పాతిపెట్టడానికి మేము ఎవ్వరం అడ్డు చెప్పం.”

7 అబ్రాహాము లేచి ప్రజలకు నమస్కరించాడు.

8 అబ్రాహాము వాళ్లతో చెప్పాడు: “నేను నా భార్యను పాతిపెట్టడానికి మీరు నిజంగా నాకు సహాయం చేయగోరితే, సోహరు కుమారుడు ఎఫ్రోనుతో నా పక్షంగా మీరు మాట్లాడండి.

9 మక్పేలా గుహను నేను కొనాలని కోరుతున్నాను. ఇది ఎఫ్రోను స్వంతం. అది అతని పొలం చివరిలో ఉంది. దాని విలువ ఎంతో అంత మొత్తం నేను చెల్లిస్తాను. పాతిపెట్టే స్థలంగా దీనిని నేను కొంటున్నట్టు మీరంతా సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను.”

10 ఎఫ్రోను ఆ జనం మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఎఫ్రోను అబ్రాహాముకు ఇలా జవాబిచ్చాడు:

11 “లేదయ్యా, నేను ఆ స్థలం ఇక్కడ మా అందరి ప్రజల సమక్షంలో నీకిచ్చేస్తాను. ఆ గుహను నేను నీకిస్తాను. నీవు నీ భార్యను పాతిపెట్టుకొనేందుకు ఆ స్థలం నేను నీకు ఇచ్చివేస్తాను.”

12 అప్పుడు అబ్రాహాము హిత్తీయుల ముందు వంగి నమస్కారం చేసాడు.

13 అబ్రాహాము, “ఆ పొలానికి పూర్తి ధర నేను చెల్లిస్తాను. నా డబ్బు స్వీకరించి, నా మృతులను నేను పాతిపెట్టుకొంటాను” అని ప్రజలందరి ముందు ఎఫ్రోనుతో చెప్పాడు.

14 అబ్రాహాముకు ఎఫ్రోను జవాబు చెప్పాడు:

15 “అయ్యా నా మాట వినండి. 400 తులాల వెండి మీకు గాని నాకు గాని ఏపాటి? భూమిని తీసుకొని, చనిపోయిన నీ భార్యను పాతిపెట్టుకో.”

16 తనతో ఆ పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని గ్రహించి ఆ వెల 400 తులాల వెండి తూచి అబ్రాహాము అతనికి ఇచ్చాడు.

17 [This verse may not be a part of this translation]

18 [This verse may not be a part of this translation]

19 ఇది జరిగిన తర్వాత మమ్రే దగ్గర ఉన్న మక్పేలా గుహలో అబ్రాహాము తన భార్యను పాతి పెట్టాడు (అది కనానులోని హెబ్రోను)

20 ఆ పొలాన్ని, దానిలోని గుహను హిత్తీ ప్రజల దగ్గర అబ్రాహాము కొన్నాడు. ఇది అతని ఆస్తి అయ్యింది, దాన్ని అతడు పాతిపెట్టే స్థలంగా ఉపయోగించాడు.

24

1 అబ్రాహాము కురువృద్ధుడయ్యేంత వరకు జీవించాడు. అబ్రాహామును, అతడు చేసిన దాన్నంతటిని దేవుడు ఆశీర్వదించాడు.

2 అబ్రాహాము యొక్క పాత సేవకుడు ఆస్తి వ్యవహారాలన్నింటి మీద నిర్వాహకునిగా ఉన్నాడు. ఆ సేవకుణ్ణి అబ్రాహాము తన దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: “నీ చేయి నా తొడకింద పెట్టు.

3 ఇప్పుడు నీవు నాకు ఒక వాగ్దానం చేయాలి. కనాను స్త్రీలలో ఎవరినీ నా కుమారుని పెళ్లి చేసుకోనివ్వవని భూమ్యాకాశాలకు దేవుడుగు యెహోవా ఎదుట నాకు వాగ్దానం చేయి. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం గాని అతణ్ణి మాత్రం కనాను స్త్రీని వివాహం చేసుకోనివ్వవద్దు.

4 నా దేశంలోని నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్లు. అక్కడ నా కుమారుని కోసం భార్యను చూడు. అప్పుడు ఆమెను ఇక్కడికి (అతని దగ్గరకు) తీసుకురా.”

5 ఆ సేవకుడు, “ఒకవేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశం రావడానికి ఇష్టపడకపోతే, నీ కుమారుడ్ని నేను నీ స్వంత దేశానికి తీసుకొని వెళ్లవచ్చునా?” అని అడిగాడు.

6 అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా కుమారుని ఆ దేశం తీసుకు వెళ్లొద్దు.

7 పరలోక దేవుడైన యెహోవా నా స్వదేశము నుండి ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చాడు. ఆ దేశం నా తండ్రికి, నా కుటుంబానికి మాతృదేశం కాని ఈ నూతన దేశం నీ కుటుంబానికి చెందుతుందని యెహోవా వాగ్దానం చేసాడు. ప్రభువు నీకంటే ముందర తన దేవదూతను పంపిస్తాడు. మరి నీవు నా కుమారునికి వధువును అక్కడనుంచి తెస్తావు.

8 అయితే అమ్మాయి నీతో రావటానికి నిరాకరిస్తే, ఈ వాగ్దాన విషయంలో నీ బాధ్యత తీరుపోతుంది. అంతేగాని నా కుమారుని మాత్రం నీవు ఆ దేశానికి తిరిగి తీసుకువెళ్లొద్దు.”

9 కనుక ఆ సేవకుడు తన యజమాని తొడకింద తన చేయి పెట్టి వాగ్దానం చేసాడు.

10 అబ్రాహాము ఒంటెలలో పదింటిని తీసుకొని ఆ సేవకుడు ఆ చోటు విడిచి వెళ్లాడు. రకరకాల అందాల కానుకలు ఎన్నో తనతో కూడ ఆ సేవకుడు తీసుకెళ్లాడు. మెసపొతేమియాలోని నాహోరు పట్టణం వెళ్లాడు ఆ సేవకుడు.

11 పట్టణం వెలుపల ఉన్న మంచి నీళ్ల బావి దగ్గరకు ఆ సేవకుడు సాయంకాలం వెళ్లాడు. నీళ్లు తీసుకొని పోయేందుకు స్త్రీలు సాయంకాలం వస్తారు. ఆ సేవకుడు తన ఒంటెలను అక్కడ మోకరింపజేసాడు.

12 ఆ సేవకుడు చెప్పాడు: “ప్రభూ, నీవు నా యజమాని అబ్రాహాము దేవుడవు. ఈ వేళ నన్ను అతని కుమారుని కోసం భార్యను కనుగొనునట్లు చేయుము. నా యజమాని అబ్రాహాముకు దయచేసి ఈ మేలు అనుగ్రహించు.

13 ఇదిగో, మంచి నీళ్లు బావి దగ్గర నేను ఉన్నాను, పట్టణం నుండి అమ్మాయిలు నీళ్లు తోడటానికి ఇక్కడికి వస్తున్నారు.

14 ఇస్సాకు కోసం ఏ అమ్మాయి సరైనదో తెలుసుకొనేందుకు ఒక ప్రత్యేక సూచన కోసం నేను కనిపెడుతున్నాను. ఆ ప్రత్యేక సూచన ఏమిటంటే: ‘నేను నీళ్లు తాగాలి, నీ కడవ కింద పెట్టు’ అని అమ్మాయితో నేను అంటాను. ‘తాగు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను’ అని అమ్మాయి గనుక చెబితే, అప్పుడు ఆమె సరైన అమ్మాయి అని నేను తెలుసుకొంటాను. అలా జరిగితే ఆమె ఇస్సాకుకు సరైన జోడు అని నీవు రుజువు చేసినట్టే. నా యజమానికి నీవు కరుణ చూపించావని నాకు తెలుస్తుంది.”

15 అంతలో, ఆ సేవకుడు ప్రార్థన ముగించక ముందే రిబ్కా అనే ఒక అమ్మాయి తన గ్రామం నుండి బావి దగ్గరకు వచ్చింది. రిబ్కా బెతూయేలు కుమార్తె. బెతూయేలు అబ్రాహాము సోదరుడు నాహోరు, మిల్కాల కుమారుడు. రిబ్కా తన నీళ్ల కడవ తన భుజంమీద పెట్టుకొని బావి దగ్గరకు వచ్చింది.

16 ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది. ఆమె కన్య. ఆమె ఎన్నడూ పురుషునితో శయనించలేదు. ఆమె తన కడవ నింపుకోటానికి బావిలోనికి దిగింది.

17 అప్పుడు ఆ సేవకుడు ఆమె దగ్గరకు పరుగెత్తి వెళ్లి, “నాకు తాగటానికి దయచేసి నీ కడవలో కొన్ని నీళ్లు ఇస్తావా” అన్నాడు.

18 రిబ్కా త్వరగా తన భుజంమీద నుండి కడవ దించి, అతనికి నీళ్లు ఇచ్చింది. “అయ్యా, ఇదిగో తాగండి” అంది రిబ్కా.

19 అతను తాగటానికి పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు గూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా.

20 రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.

21 ఆ సేవకుడు మౌనంగా ఆమెను గమనించాడు. యెహోవా తనకు జవాబిచ్చాడని, తన ప్రయాణాన్ని విజయవంతం చేశాడని అతను రూఢిగా తెలుసుకోవాలనుకొన్నాడు.

22 ఒంటెలు నీళ్లు తాగడం అయిపోగానే, అతడు అరతులం బంగారపు ఉంగరం రిబ్కాకు ఇచ్చాడు. 5 తులాల ఎత్తుగల బంగారపు గాజులు రెండు అతడు ఆమెకు ఇచ్చాడు.

23 “నీ తండ్రి ఎవరు? మా గుంపు పండుకొనేందుకు నీ తండ్రి ఇంటిలో చోటు ఉందా?” అని ఆ సేవకుడు ఆమెను అడిగాడు.

24 “నా తండ్రి బెతూయేలు, నాహోరు మిల్కాయొక్క కుమారుడు” అని రిబ్కా జవాబిచ్చింది.

25 తర్వాత, “అవునండి, మీ ఒంటెలకు గడ్డి, మీరు పండుకొనేందుకు స్థలం మా దగ్గర ఉంది” అని ఆమె చెప్పింది.

26 ఆ సేవకుడు వంగి యెహోవాను ఆరాధించి,

27 “నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా స్తుతించబడు గాక. యెహోవా నా యజమానుని పట్ల దయ చూపాడు. నా యజమాని బంధువు యింటికి యెహోవా నన్ను నడిపించాడు” అని చెప్పాడు.

28 అప్పుడు రిబ్కా పరుగెత్తి వెళ్లి తన ఇంటివారికి ఈ సంగతులన్నీ చెప్పింది.

29 [This verse may not be a part of this translation]

30 [This verse may not be a part of this translation]

31 “అయ్యా, తమరికి లోనికి సుస్వాగతం. మీరలా ఇక్కడే బయట నిలబడి ఉండనక్కర్లేదు. మీ ఒంటెలకు స్థలం, మీరు పండుకొనేందుకు గది నేను సిద్ధం చేసాను” అని లాబాను చెప్పాడు.

32 కనుక అబ్రాహాము సేవకుడు ఆ ఇంటిలో ప్రవేశించాడు. ఒంటెల పనిలో అతనికి లాబాను సహాయం చేసి, అతని ఒంటెలకు గడ్డి వేసాడు. అతను, అతనితో ఉన్న మనుష్యులకు కాళ్లు కడుక్కొనేందుకు నీళ్లు ఇచ్చాడు.

33 తర్వాత లాబాను అతనికి భోజనం పెట్టాడు. అయితే ఆ సేవకుడు తినకుండా నిరాకరించాడు. “నేను ఎందుకు వచ్చానో మీతో చేప్పకుండా నేను భోజనం చేయను” అన్నాడు అతను. కనుక లాబాను, “అలాగైతే మాతో చెప్పు మరి” అన్నాడు.

34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను.

35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి.

36 నా యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు.

37 నేను ఒక వాగ్దానం చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేసాడు. నా యజమాని ‘నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నెవరినీ అతడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు.

38 కనుక నీవు నా తండ్రి దేశానికి వెళ్తావని వాగ్దానం చేయాలి. నా వంశం వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను కుదుర్చి అని నాతో చెప్పాడు.

39 ‘ఒక వేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశానికి రాదేమో’ అని నేను నా యజమానితో అన్నాను.

40 అయితే నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను యెహోవాను సేవిస్తాను, యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు సహాయం చేస్తాడు. అక్కడి ప్రజలలో నా కుమారుని కోసం భార్యను నీవు కనుక్కొంటావు.

41 కాని నీవు నా తండ్రి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ఈ ప్రమాణ బాధ్యత నీకు ఉండదు.”

42 “ఈ వేళ నేను ఈ బావి దగ్గరకు వచ్చి అన్నాను: ‘నా యజమాని అబ్రాహాము దేవుడైన యెహోవా, దయతో నా ప్రయాణం విజయవంతం చేయి.

43 నేను ఈ బావి దగ్గర నిలబడి, నీళ్లకోసం ఒక అమ్మాయి ఇక్కడికి రావాలని నిరీక్షిస్తాను. అప్పుడు నేను, దయచేసి తాగటానికి నీ కడవలోనుంచి నీళ్లు ఇమ్మని అడుగుతాను.

44 సరైన అమ్మాయి అయితే ఒక ప్రత్యేక విధానంలో జవాబిస్తుంది. ఈ నీళ్లు తాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను అని ఆమె అంటుంది. ఆ విధంగా, నా యజమాని కుమారుని కోసం యెహోవా ఏర్పరచిన స్త్రీ ఆమె అని నేను తెలుసుకొంటాను.’

45 “నేను ప్రార్థించటం ముగించక ముందే, నీళ్ల కోసం రిబ్కా బావి దగ్గరకు వచ్చింది. ఆమె తన నీళ్ల కడవ తన భుజం మీద పెట్టుకొంది. ఆమె వెళ్లి బావినుండి నీళ్లు తోడింది. ‘దయచేసి కొంచెం నీళ్లు ఇమ్మని’ నేను ఆమెతో అన్నాను.

46 వెంటనే ఆమె తన భుజం మీదనుండి కడవదించి, నాకు నీళ్లు పోసి, ‘ఇవి త్రాగు, నీ ఒంటెలకు గూడ నేను నీళ్లు తెస్తాను’ అంది. అందుచేత నేను నీళ్లు తాగాను, నా ఒంటెలకు కూడా ఆమె నీళ్లు పెట్టింది.

47 అప్పుడు ‘నీ తండ్రి ఎవరు?’ అని నేను ఆమెను అడిగాను. ‘మిల్కా నాహోరుల కుమారడైన బెతూయేలు నా తండ్రి’ అని ఆమె జవాబిచ్చింది. అప్పుడు ఆమె చేతికి ఉంగరం, గాజులు నేను ఇచ్చాను.

48 ఆ సమయంలో నేను నా తలవంచి యెహోవాకు వందనాలు చేశాను. నా యజమాని దేవుడైన యెహోవాను నేను స్తుతించాను. నా యజమాని సోదరుని మనుమరాలి దగ్గరకే నన్ను ఆయన తిన్నగా నడిపించినందుకు ఆయనకు వందనాలు చెప్పాను.

49 ఇప్పుడు మీరేం చేస్తారో నాకు చెప్పండి. నా యజమాని యెడల మీరు దయ, నమ్మకత్వం చూపి, మీ కుమార్తెను ఆయనకు ఇస్తారా? లేక మీ కుమార్తెను ఇవ్వటానికి నిరాకరిస్తారా? నేను ఏమి చెయ్యాలో నాకు తెలిసేటట్టు, మీరు చెప్పండి.”

50 అప్పుడు లాబాను, బెతూయేలు జవాబిచ్చారు. “ఇది యెహోవా నుండి వచ్చినట్లు మేము చూస్తున్నాము. కాబట్టి దీన్ని మార్చమని మేము చెప్పుటకు ఏమీలేదు.

51 రిబ్కా నీ ముందే వున్నది. ఆమెను తీసుకొని వెళ్లు. నీ యజమాని కుమారుణ్ణి ఆమె పెళ్లి చేసుకొంటుంది. ఇదే యెహోవా కోరేది.”

52 అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా యెదుట నేలపై సాగిలపడ్డాడు.

53 అప్పుడు ఆ సేవకుడు తాను తెచ్చిన కానుకలను రిబ్కాకు ఇచ్చాడు బంగారు వెండి నగలు, ఎన్నో అందమైన బట్టలు అతడు రిబ్కాకు యిచ్చాడు. ఆమె సోదరునికి, తల్లికి గూడ చాలా ఖరీదైన కానుకలు అతడు ఇచ్చాడు.

54 ఆ సేవకుడు, అతనితోనున్న సేవకులు తిని, తాగి అక్కడే ఉన్నారు. ఆ రాత్రి వారు అక్కడే ఉన్నారు. మర్నాడు ఉదయం వారు లేచి, “ఇప్పుడు మేం తిరిగి మా యజమాని దగ్గరకు వెళ్తాం” అన్నారు.

55 అప్పుడు రిబ్కా తల్లి, సహోదరుడు ఈ విధంగా చెప్పారు, “రిబ్కాను కొన్నాళ్లు మా దగ్గర ఉండనివ్వు. పది రోజులు ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు.”

56 కానీ ఆ సేవకుడు, “నన్ను ఇంక ఆపవద్దు. నా ప్రయాణాన్ని యెహోవా విజయవంతం చేసాడు. కనుక ఇప్పుడు నా యజమాని దగ్గరకు నన్ను వెళ్లనివ్వండి” అని వారితో చెప్పాడు.

57 “రిబ్కాను పిలిచి, ఆమె ఇష్టం ఏమీటో మేము అడుగుతాం” అన్నారు రిబ్కా అన్న, తల్లి.

58 వారు రిబ్కాను పిలిచి, “నీవు ఈ మనుష్యునితో కలిసి ఇప్పుడే వెళ్తావా?” అని అడిగారు. “అవును, నేను వెళ్తాను అంది రిబ్కా.”

59 కనుక అబ్రాహాము సేవకునితో, అతని మనుష్యులతో కలిసి రిబ్కా వెళ్లటానికి వారు అనుమతించారు. రిబ్కా దాది కూడ వారితో వెళ్లింది.

60 వారు వెళ్తున్నప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు: “మా సోదరి, వేలమందికి, పది వేలమందికి నీవు తల్లిని అవుదువు గాక. నీ సంతానము వారి శత్రువులను ఓడించి వారి పట్టణాలను స్వాధీనం చేసుకొందురు గాక!”

61 అప్పుడు రిబ్కా, ఆమె దాది ఒంటెలను ఎక్కి ఆ సేవకుని, అతని మనుష్యులను వెంబడించారు. ఆ విధంగా ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని తిరుగు ప్రయాణమయ్యాడు.

62 అప్పటికి ఇస్సాకు బెయేర్ లహాయిరోయి విడిచి, నెగెవులో నివసిస్తున్నాడు.

63 ఒక సాయంకాలం ఇస్సాకు ధ్యానించుట కోసం అలా బయటకు పోలాల్లోకి వెళ్లాడు. ఇస్సాకు తలెత్తి చూచేటప్పటికి అంత దూరంలో వస్తున్న ఒంటెలు కనిపించాయి.

64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసింది. అప్పుడామె ఒంటె మీద నుండి క్రిందికి దిగెను.

65 “మనలను కలుసుకొనేందుకు ఆ పొలాల్లో నడిచి వస్తున్న యువకుడు ఎవరు?” అంటు ఆమె సేవకుని అడిగింది. “ఆయనే నా యజమాని కుమారుడు” అని చెప్పాడు ఆ సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం మీద ముసుగు కప్పుకొంది.

66 జరిగిన సంగతులన్నీ ఇస్సాకుతో ఆ సేవకుడు చెప్పాడు.

67 అప్పుడు ఇస్సాకు ఆ అమ్మాయిని తన తల్లి గుడారంలోకి తీసుకు వచ్చాడు. ఆ రోజు రిబ్కా ఇస్సాకు భార్య అయ్యింది. ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. తన తల్లి మరణించిన తర్వాత ఇస్సాకు దుఃఖనివారణ పొందాడు.

25

1 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన కొత్త భార్య పేరు కెతూరా.

2 కెతూరాకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు పుట్టారు.

3 యొక్షాను, షేబ, దెదానులకు తండ్రి. అష్షూరు, లెయుమీ మరియు లెతూషీ ప్రజలు దెదాను సంతానము.

4 మిద్యాను కుమారులు ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. అబ్రాహాము కెతూరా, వివాహం మూలంగా ఈ కుమారులంతా పుట్టారు.

5 [This verse may not be a part of this translation]

6 [This verse may not be a part of this translation]

7 అబ్రాహాము 175 సంవత్సరాలు వయస్సు వరకు జీవించాడు.

8 అప్పుడు అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవతం అతడు జీవించాడు. అతడు మరణించి తనవారి దగ్గరకు చేర్చబడ్డాడు.

9 అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలసి మక్పేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఈ గుహ ఉంది. అది మమ్రేకు తూర్పున ఉంది.

10 హిత్తీ ప్రజల దగ్గర్నుండి అబ్రాహాము కొన్న గుహ ఇదే. అబ్రాహాము తన భార్య శారాతో అక్కడ పాతిపెట్టబడ్డాడు.

11 అబ్రాహాము చనిపోయిన తరువాత, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు బేయేర్ లహాయిలోనే నివాసం కొనసాగించాడు.

12 ఇష్మాయేలు వంశంవారి జాబితా ఇది. అబ్రాహాము హాగరుల కుమారుడు ఇష్మాయేలు. (శారాకు ఈజిప్టు దాసి హాగరు)

13 ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి: మొదటి కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు పుట్టాడు, తర్వాత అద్బయేలు, మిబాశిము,

14 మిష్మా, దమారమశ్శా,

15 హదరు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా పుట్టారు.

16 అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత శిబిరం ఉండేది, అదే ఒక చిన్న పట్టణం అయింది. పన్నెండు మంది కుమారులు, వారి స్వంత ప్రజలతో, పన్నెండు మంది యువరాజుల్లా ఉన్నారు.

17 ఇష్మాయేలు 137 సంవత్సరాలు బతికాడు. తరువాత అతను చనిపోయి, అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు.

18 ఇష్మాయేలు సంతానం వారు ఎడారి ప్రాంతమంతా బసచేసారు. ఈ ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు చివరన అష్షూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను ఎదుర్కొన్నారు.

19 ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు.

20 ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి.

21 ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతి కానిచ్చాడు.

22 రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది.

23 ఆమెతో యెహోవా చెప్పాడు: “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”

24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది.

25 మొదట శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు అని పేరు పెట్టబడింది.

26 రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.

27 అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు.

28 ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.

29 ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు.

30 కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఏదోం అని పిలిచేవాళ్లు.)

31 అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు.

32 ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యారన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.

33 కానీ యాకోబు దాన్ని, “నాకు ఇస్తావని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేసాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేసాడు.

34 అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, తాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేసాడు.

26

1 ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిష్తీ ప్రజల రాజు అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు.

2 ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఈజిప్టు వెళ్లవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలోనే నీవు నివసించాలి.

3 ఆ దేశంలోనే నీవు నివాసం ఉండు, నేను నీతో ఉంటాను. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ ఇస్తాను. నీ తండ్రి అబ్రాహాముకు నేను వాగ్దానం చేసినదంతా నీకు నేను ఇస్తాను.

4 ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమిమీద జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయి.

5 నీ తండ్రియైన అబ్రాహాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటిని చేసాడు గనుక నేను ఇది చేస్తాను. అబ్రాహాము నా ఆజ్ఞలకు చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు.”

6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు.

7 ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తె. రిబ్కాను గూర్చి అక్కడి మనుష్యులు ఇస్సాకును అడిగారు. “ఆమె నా సోదరి” అని చెప్పాడు ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందటం కోసం ఆ మనుష్యులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయపడ్డాడు.

8 ఇస్సాకు అక్కడు చాలా కాలం ఉన్న తర్వాత, ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీమెలెకు తన కిటికీ గుండా చూశాడు.

9 అబీమెలెకు ఇస్సాకును పిలిచి “ఈ స్త్రీ నీ భార్య. ఈమె నీ సోదరి అని మాతో ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. “నీవు ఈమెను పొందటం కోసం నన్ను చంపేస్తావని నేను భయపడ్డాను” అని ఇస్సాకు అతనితో చెప్పాడు.

10 “నీవు మాకు కీడు చేసావు. మా మనుష్యుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడయ్యైవాడు” అన్నాడు అబీమెలెకు.

11 అందుచేత అబీమెలెకు ప్రజలందరికి హెచ్చరిక ఇచ్చాడు. “ఈ పురుషునిగాని, ఇతని భార్యనుగాని ఎవరూ బాధించగూడదు. వారిని బాధించినవాడు ఎవరైనా సరే చంపివేయబడతాడు” అని అతడు చెప్పాడు.

12 ఆ దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. ఆ సంవత్సరం అతడు విస్తారంగా పంట కూర్చుకున్నాడు. యెహోవా అతన్ని ఎంతో అశీర్వదించాడు.

13 ఇస్సాకు ధనికుడయ్యాడు. అతడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యేవరకు మరింత విస్తారంగా ఐశ్వర్యం కూర్చుకొన్నాడు.

14 గొర్రెల మందలు, పశువుల మందలు అతనికి విస్తారంగా ఉన్నాయి. అతనికి చాలా మంది బానిసలు కూడా ఉన్నారు. ఫిలిష్తీ ప్రజలంతా అతని మీద అసూయ పడ్డారు.

15 కనుక ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము, అతని సేవకులు తవ్విన చాలా బావుల్ని ఫిలిష్తీ ప్రజలు పాడుచేశారు. ఆ బావుల్ని ఫిలిష్తీ ప్రజలు మట్టితో నింపారు.

16 అబీమెలెకు ఇస్సాకుతో, “మా దేశం వదలి పెట్టు. నీవు మాకంటే చాలా అత్యధికంగా శక్తిమంతుడవయ్యావు” అన్నాడు.

17 కనుక ఇస్సాకు ఆ స్థలం విడిచిపెట్టి, గెరారు చిన్న నదికి సమీపంలో నివాసం చేసాడు. ఇస్సాకు అక్కడ ఉండి జీవించాడు.

18 దీనికి ఎంతో ముందు అబ్రాహాము చాలా బావులు తవ్వాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీ ప్రజలు ఆ బావులను చెత్తతో నింపేసారు. కనుక ఇస్సాకు తిరిగి వెళ్లి ఆ బావులను మళ్లీ తవ్వాడు. వాటికి తన తండ్రి పెట్టిన పేర్లే ఇస్సాకు పెట్టాడు.

19 చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. ఆ బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది.

20 అయితే గెరారు లోయలో గొర్రెల మందలను కాసేవాళ్లు ఇస్సాకు పనివాళ్లతో జగడమాడారు. “ఈ నీళ్లు మావి అన్నారు వాళ్లు.” కనుక ఆ బావికి ‘ఏశెకు’ అని ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ ఆ మనుష్యులు అతనితో జగడమాడారు గనుక దానికి ఆ పేరు పెట్టాడు.

21 అప్పుడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వారు. ఆ బావి మూలంగా అక్కడి ప్రజలు కూడా జగడమాడారు. కనుక ఆ బావికి ‘శిత్నా’ అని ఇస్సాకు పేరు పెట్టాడు.

22 ఇస్సాకు అక్కడనుండి వెళ్లపోయి మరో బావి తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ రాలేదు. కనుక ఆ బావికి ‘రహెబోతు’ అని ఇస్సాకు పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపొంది సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు.

23 ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు.

24 ఆ రాత్రి ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. “నీ తండ్రి అబ్రాహాము దేవుణ్ణి నేను. భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వంశస్తులను అభివృద్ధి చేస్తాను. నా సేవకుడు అబ్రాహాము కారణంగా నేను ఇది చేస్తాను” అని చెప్పాడు యెహోవా.

25 కనుక ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కట్టించాడు. ఇస్సాకు అక్కడ నివాసం చేయగా, అతని సేవకులు ఒక బావి తవ్వారు.

26 ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. సలహాదారుడు అహుజతును సైన్యాధిపతయైన ఫీకోలును వెంటబెట్టుకొని అబీమెలెకు వచ్చాడు.

27 ఇస్సాకు వారితో, “ఇంతకుముందు నీవు నాతో స్నేహంగా లేవు గదా. నీ దేశం వదిలిపెట్టేట్టు నీవు నన్ను బలవంతం గూడా చేసావు గదా. ఇప్పుడు నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు.

28 వారు జవాబు చెప్పారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది. మనం ఒక ఒడంబడిక చేసుకోవాలని మా అభిప్రాయం. మాకు నీవు ఒక ప్రమాణం చేయాలి.

29 మేము నిన్ను బాధించలేదు. ఇప్పుడు నీవు కూడా మమ్మల్ని బాధించనని ప్రమాణం చేయాలి. నిన్ను మేము పంపించివేసినా, సమాధానంగా పంపించాం. యెహోవా నిన్ను ఆశీర్వదించాడని యిప్పుడు తేటగా తెలుస్తుంది.”

30 ఇస్సాకు వారికి విందు చేసాడు. వారు తిని తాగారు.

31 మర్నాడు ఉదయం ఒక్కొక్కరు ఒక్కో ప్రమాణం చేసారు. తర్వాత ఆ మనుష్యులు సమాధానంగా వెళ్లిపోయారు.

32 ఆ రోజున ఇస్సాకు సేవకులు వచ్చి, వారు తవ్విన బావిని గూర్చి చెప్పారు. “ఆ బావిలో నీళ్లు చూశాం” అని చెప్పారు సేవకులు.

33 కనుక ఆ బావికి ‘షేబ’ అని పేరు పెట్టాడు ఇస్సాకు. ఆ పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది.

34 ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీ స్త్రీలను ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. ఒక స్త్రీ బేయేరి కుమార్తె యహూదీతు. ఇంకొక ఆమె ఏలోను కుమార్తె బాశెమతు.

35 ఈ వివాహాలు ఇస్సాకు రిబ్కాలను చాలా బాధపెట్టాయి.

27

1 ఇస్సాకు ముసలివాడైనప్పుడు అతని చూపు సన్నగిల్లింది. ఇస్సాకు తేటగా చూడలేకపోయాడు. ఒకనాడు తన పెద్ద కుమారుని అతడు తన దగ్గరకు పిల్చాడు, “కుమారుడా” అన్నాడు. “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు ఏశావు.

2 ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో!

3 కనుక నీ విల్లు, అంబులు తీసుకొని వేటకు వెళ్లు. నేను తినటానికి ఒక జంతువును చంపు.

4 నాకు ఇష్టమైన భోజనం తయారు చేయి. అది నా దగ్గరకు తీసుకురా, నేను తింటాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను.”

5 కనుక ఏశావు వేటకు వెళ్లాడు. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఆ సంగతులు చెబతున్నప్పుడు రిబ్కా విన్నది.

6 తన కుమారుడైన యాకోబుతో రిబ్కా చెప్పింది: “విను, నీ సోదరుడు ఏశావుతో నీ తండ్రి మాట్లాడటం నేను విన్నాను.

7 ‘నేను తినటానికి ఒక జంతువును చంపి నా కోసం భోజనం సిద్ధం చేయి, నేను భోంచేస్తాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను’ అని నీ తండ్రి చెప్పాడు.

8 కనుక, కుమారుడా నేను చెప్పేది విని అలా చేయి.

9 మన మేకల మందలోనికి వెళ్లి, రెండు మేక పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నీ తండ్రికి ఇష్టమైన పద్ధతిలో నేను వాటిని సిద్ధం చేస్తాను.

10 అప్పుడు ఆ భోజనాన్ని నీవే నీ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్లు. ఆయన మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు.”

11 అయితే యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు.

12 నా తండ్రి నన్ను తాకితే నేను ఏశావును కానని ఆయన తెలుసుకొంటాడు. అప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించడు. నేను ఆయన్ను మోసం చేయటానికి ప్రయత్నించినందువల్ల ఆయన నన్ను శపిస్తాడు.”

13 కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే ఆ నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది.

14 కనుక యాకోబు వెళ్లి రెండు మేకల్ని తీసుకొని, తెచ్చి వాటిని తల్లికి ఇచ్చాడు. ఇస్సాకుకు ఇష్టమైన ఒక ప్రత్యేక విధానంలో అతని తల్లి ఆ మేకలతో వంట చేసింది.

15 తర్వాత ఆమె, తన కుమారుడు ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. ఆ బట్టలను చిన్న కుమారుడు యాకోబుకు ధరింపజేసింది.

16 ఆ మేకల చర్మాలను రిబ్కా తీసుకొని, వాటిని యాకోబు చేతుల మీద వేసింది.

17 తర్వాత రిబ్కా తాను వండిన భోజనం తెచ్చి, దానిని యాకోబుకు యిచ్చింది.

18 యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ” అని పిల్చాడు. “ఏమీ కుమారుడా, ఎవరు నీవు” అన్నాడు తండ్రి.

19 “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేసాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటిచే నీకొరకైన భోజనమును సిద్ధపరచితిని. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు.

20 అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు. ‘త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేసాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు.

21 అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబతో.

22 కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు.

23 యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు.

24 “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అన్నాడు ఇస్సాకు. “అవును, నేనే”అని యాకోబు జవాబిచ్చాడు.

25 అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను అది భోంచేసి, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేసాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు.

26 అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు.

27 కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు: “నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనా ఉంది.

28 విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్టు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.

29 మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, జనములు నీకు సాగిలపడుదురు గాక, నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడుతాడు, నిన్ను ఆశీర్వదించే ప్రతి వ్యక్తీ ఆశీర్వదించబడుతాడు.”

30 యాకోబును ఆశీర్వదించటం ముగించాడు ఇస్సాకు. అప్పుడు, తన తండ్రి ఇస్సాకును విడిచి యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి వచ్చాడు.

31 తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో భోజనం తయారు చేసాడు ఏశావు. దానిని ఏశావు తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, “నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను దీవించగలవు”.

32 అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అన్నాడు అతనితో. “నేను నీ మొదటి కుమారుణ్ణి ఏశావును” అన్నాడతను.

33 అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి నా దగ్గరకు తీసుకు వచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు.

34 ఏశావు తన తండ్రి మాటలు విన్నాడు. అతనిలో కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి “అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా’ అని తన తండ్రితో చెప్పాడు.

35 “నీ సోదరుడు నన్ను మోసం చేసాడు. అతను వచ్చి, నీ ఆశీర్వాదాలు తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు.

36 “అతని పేరే యాకోబు (మోసగాడు). అది అతనికి సరైన పేరు. రెండుసార్లు అతడు నన్ను మోసం చేసాడు. జ్యేష్ఠత్వపు హక్కు తీసువేసుకొన్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసువేసుకొన్నాడు. అని చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా మిగిల్చావా?” అని ప్రశ్నించాడు.

37 “లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు.

38 తన తండ్రిని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. “నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వదమే ఉందా? నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు ఏడ్వటం మొదలుబెట్టాడు.

39 అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు: “నీవు సారం లేని దేశంలో నివసిస్తావు నీకు వర్షపాతం ఎక్కువగా ఉండదు.

40 నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు అయితే స్వతంత్రం కోసం నీవు పోరాడతావు అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”

41 ఆ తరువాత తన తండ్రి అతణ్ణి ఆశీర్వదించడంవల్ల యాకోబును ఏశావు అసహ్యించుకొన్నాడు. ఏశావు “త్వరలోనే నా తండ్రి చనిపోతాడు, నేను అతని కోసం దుఃఖిస్తాను. కాని ఆ తర్వాత యాకోబును నేను చంపేస్తాను” అని తనలో తాను అనుకొన్నాడు.

42 ఏశావు యాకోబును చంపాలని చేస్తున్న ఆలోచనను గూర్చి రిబ్కా విన్నది. యాకోబును పిలిపించి, అతనితో ఆమె ఇలా చెప్పింది. “ఇది విను, నీ అన్న ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.

43 అందుచేత, కుమారుడా, నేను చెప్పినట్టు చేయి. హారానులో నా సోదరుడు లాబాను ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి దాగుకో.

44 కొన్నాళ్లపాటు అతని దగ్గరే ఉండు. నీ అన్న కోపం చల్లారే వరకు అతని దగ్గరే ఉండు.

45 కొన్ని రోజులు కాగానే నీవు నీ అన్నకు చేసినది అతడు మరచిపోతాడు. అప్పుడు నిన్ను వెనుకకు తీసుకొని రావటానికి నేను ఒక సేవకుని పంపిస్తాను. నా ఇద్దరు కుమారులను ఒకేనాడు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు.”

46 అప్పుడు రిబ్కా ఇస్సాకుతో, “నీ కుమారుడైన ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన ప్రజలు కారు గనుక వారితో నేను చాలా విసిగిపోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పింది.

28

1 ఇస్సాకు యాకోబును పిలిచి ఆశీర్వదించాడు. తర్వాత ఇస్సాకు అతనికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇస్సాకు ఇలా చెప్పాడు: “కనాను స్త్రీని మాత్రం నీవు వివాహం చేసుకోగూడదు.

2 కనుక ఈ చోటు విడిచి, పద్దనరాము వెళ్లు. నీ తల్లి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లు. నీ తల్లి సోదరుడు లాబాను అక్కడే నివసిస్తున్నాడు. అతని కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లాడు.

3 సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి, అధిక సంతానాన్ని నీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా. ఒక గొప్ప జనాంగానికి నీవు పితరుడవు కావాలని నా ప్రార్థన.

4 దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్టే నిన్ను, నీ పిల్లలను ఆశీర్వదించాలని నా ప్రార్థన. నీవు నివసించే దేశం నీ స్వంతం కావాలని నా ప్రార్థన. ఇది దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన దేశం.”

5 ఇస్సాకు యాకోబును పద్దనరాముకు పంపించాడు. రిబ్కా సోదరుడైన లాబాను దగ్గరకు యాకోబు వెళ్లాడు. లాబాను రిబ్కానకు తండ్రి బెతూయేలు. యాకోబు, ఏశావులకు తల్లి రిబ్కా.

6 తన తండ్రియైన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడని ఏశావుకు తెలిసింది. యాకోబు భార్యను సంపాదించు కొనేందుకు ఇస్సాకు అతణ్ణి పద్దనరాముకు పంపినట్టు ఏశావుకు తెలిసింది. యాకోబు కనాను స్త్రీని వివాహము చేసుకోగూడదని ఇస్సాకు ఆజ్ఞాపించినట్టు ఏశావుకు తెలిసింది.

7 యాకోబు తన తల్లిదండ్రుల మాటకు విధేయుడై పద్దనరాము వెళ్లినట్టు ఏశావుకు తెలిసింది.

8 తన కుమారులు కనానీ స్త్రీలను వివాహం చేసుకోవటం తండ్రికి ఇష్టం లేదని దీనిద్వారా ఏశావుకు తెలిసింది.

9 అప్పటికే ఏశావుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే అతడు ఇష్మాయేలు దగ్గరకు వెళ్లి, మరో స్త్రీని పెళ్లి చేసికొన్నాడు. ఇష్మాయేలు కుమార్తె మాహలతును అతను పెళ్లి చేసుకొన్నాడు. ఇష్మాయేలు అబ్రాహాము కుమారుడు. మాహలతు నెబాయోతు సోదరి.

10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు.

11 యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటుకి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు.

12 యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్టు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్టు యాకోబు చూశాడు.

13 అప్పుడు ఆ నిచ్చెన దగ్గర యెహోవా నిలిచినట్టు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను.

14 నేలమీద ధూళి కణముల్లాగ నీకు గూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.

15 “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్ధానం చేసినది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”

16 అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని “యెహోవా ఈ స్థలములో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్టు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.

17 యాకోబు భయపడ్డాడు. “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.

18 ఉదయం పెందలాడే లేచాడు యాకోబు. అతడు పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు యాకోబు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోసాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేసాడు.

19 ఆ స్థలం పేరు లూజు. అయితే బేతేలు అని దానికి యాకోబు పేరు పెట్టాడు.

20 అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేసాడు. “దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా దేవుడు నన్ను కాపాడుచు ఉంటే, తినుటకు భోజనం, ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే,

21 నా తండ్రి ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగలిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే, అప్పుడు యెహోవాయే నా దేవుడు.

22 నేను ఈ రాయిని యిక్కడ నిలబెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను చెప్పాడు.

29

1 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు.

2 యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు తాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది.

3 గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు తాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా తాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.

4 “సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు. “మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.

5 అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను తెలుసా మీకు?” అని అడిగాడు. “మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.

6 అప్పుడు యాకోబు “ఆయన ఎలా ఉన్నాడు?” అని అడిగాడు. “ఆయన బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది ఆయన కుమార్తె. ఆమె పేరు రాహేలు, ఆయన గొర్రెలు తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.

7 “చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనీయ్యండి” అన్నాడు యాకోబు.

8 కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు తాగుతాయి” అన్నారు.

9 కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.)

10 లాబాను కుమార్తె రాహేలు. యాకోబు తల్లి రిబ్కాకు సోదరుడు లాబాను. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు యిచ్చాడు.

11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు.

12 తను ఆమె తండ్రి బంధువు అని యాకోబు రాహేలుతో చెప్పాడు. తను రిబ్కా కుమారుడనని రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో చెప్పింది.

13 తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.

14 అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.

15 ఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు.

16 లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.

17 రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది.

18 యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు “నన్ను, నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్లాడనిస్తే, నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని లాబానుతో చెప్పాడు.

19 “మరొకర్ని చేసుకోవడం కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను.

20 కనుక యాకోబు అక్కడే ఉండి, లాబాను కోసం ఏడు సంవత్సరాలు పని చేసాడు. అయితే అతడు రాహేలును ప్రేమించాడు గనుక అది చాలా కొద్ది కాలంలాగే కనబడింది అతనికి.

21 ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.

22 కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు.

23 ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు.

24 తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు.

25 తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేసావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేసాను. ఎందుకు నన్ను నీవు మోసం చేసావు?” అన్నాడు.

26 లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు.

27 అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”

28 కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.

29 తన దాసీ బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చాడు.

30 కనుక యాకోబు రాహేలుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేసాడు.

31 లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత లేయాకు పిల్లలు పుట్టేలాగు చేసాడు యెహోవా. రాహేలుకు పిల్లలు లేరు.

32 లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.

33 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యోహోవా నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని చెప్పింది లేయా.

34 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.

35 అప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి యూదా అని ఆమె పేరు పెట్టింది. “నేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని చెప్పి అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు సంతాన ప్రాప్తి ఆగిపోయింది.

30

1 తాను యాకోబుకు పిల్లల్ని కనటం లేదని లేయాను రాహేలు తెలుసుకొంది. రాహేలు, తన సోదరి లేయాను గూర్చి అసూయపడింది. అందుచేత “నాకూ పిల్లల్ని యివ్వు, లేకపోతే నేను చస్తాను” అంది యాకోబుతో రాహేలు.

2 యాకోబుకు రాహేలు మీద కోపం వచ్చింది. “నేనేమి దేవుణ్ణి కాను. నీకు పిల్లలు పుట్టకుండా చేసింది దేవుడు” అని చెప్పాడు యాకోబు.

3 అప్పుడు రాహేలు “నా దాసిని బిల్హాను నీవు తీసుకో. ఆమెతో శయనించు. నా కోసం ఆమె బిడ్డను కంటుంది. అప్పుడు ఆమె మూలంగా నేను తల్లినవుతాను” అని చెప్పింది.

4 కనుక రాహేలు తన దాసియైన బిల్హాను యాకోబుకు ఇచ్చింది. యాకోబు బిల్హాతో సంభోగించాడు.

5 బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది.

6 “దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమారుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసాడు” అని చెప్పి, రాహేలు ఆ కుమారునికి ‘దాను’ అని పేరు పెట్టింది.

7 బిల్హా మరల గర్భవతియై, యాకోబుకు మరో కుమారుని కన్నది.

8 రాహేలు “నా అక్కతో పోటిలో చాలా కష్టపడి పోరాడాను. నేనే గెలిచాను” అని చెప్పి ఆ కుమారునికి ‘నఫ్తాలి’ అని పేరు పెట్టింది.

9 లేయా తనకు ఇక పిల్లలు పుట్టడం లేదని గ్రహించింది. అంచేత తన దాసి జిల్ఫాను ఆమె యాకోబుకు ఇచ్చింది.

10 అప్పుడు జిల్ఫాకు ఒక కొడుకు పుట్టాడు.

11 లేయా “నేను అదృష్టవంతురాలిని” అనుకొని, ఆ కుమారునికి ‘గాదు’ అని పేరు పెట్టింది.

12 జిల్ఫాకు మరో కుమారుడు పుట్టాడు.

13 “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు” అని చెప్పి లేయా ఆ కుమారునికి ‘ఆషేరు’ అని పేరు పెట్టింది.

14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాల్లోకి వెళ్లాడు. అక్కడ ప్రత్యేకమైన పూలు అతనికి కనబడ్డాయి. ఆ పూలు తెచ్చి రూబేను తన తల్లి లేయాకు ఇచ్చాడు. అయితే రాహేలు, “నీ కొడుకు తెచ్చిన పూలు దయచేసి నాకూ కొన్ని ఇవ్వవూ” అని లేయాను అడిగింది.

15 లేయా, “ఇప్పటికే నీవు నా భర్తను తీసివేసుకొన్నవు. ఇప్పుడేమో నా కొడుకు తెచ్చిన పూలను తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా” అంది. కాని రాహేలు “నీ కొడుకు తెచ్చిన పూలు గనుక నీవు నాకు ఇస్తే, ఈ వేళ రాత్రికి నీవు యాకోబుతో శయనించవచ్చు” అని జవాబిచ్చింది.

16 ఆ రాత్రి యాకోబు పొలంనుంచి వచ్చాడు. అతన్ని చూచి, అతన్ని కలుసుకోవటానికి లేయా బయటకు వెళ్లింది. “ఈ వేళ రాత్రి నీవు నాతో పండుకోవాలి. నా కొడుకు తెచ్చిన పూలతో నిన్ను నేను కొన్నాను” అని ఆమె చెప్పింది. కనుక ఆ రాత్రి యాకోబు లేయాతో పండుకొన్నాడు.

17 అప్పుడు దేవుడు లేయాను మళ్లీ గర్భవతిని కానిచ్చాడు. ఆమె అయిదవ కుమారుని కన్నది.

18 లేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందుకని చెప్పి లేయా అతనికి ఇశ్శాఖారు అని పేరు పెట్టింది.

19 లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి కన్నది.

20 లేయా అంది “ఒక చక్కని బహుమానం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు తప్పక యాకోబు నన్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకు నేను ఆరుగురు కుమారుల్ని యిచ్చాను.” కనుక జెబూలూను అని చెప్పి ఆ కుమారునికి పేరు పెట్టింది.

21 తర్వాత లేయాకు కూతురు పుట్టింది. ఆ కూతురుకు దీనా అని పేరు పెట్టింది.

22 అప్పుడు రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. రాహేలుకు పిల్లలు పుట్టేట్టుగా దేవుడు చేసాడు.

23 [This verse may not be a part of this translation]

24 [This verse may not be a part of this translation]

25 యోసేపు పుట్టిన తర్వాత లాబానుతో యాకోబు అన్నాడు: “ఇక నా మాతృదేశంలోని నా స్వంత యింటికి నన్ను వెళ్లనివ్వు.

26 నా భార్యల్ని, పిల్లలను నాకు అప్పగించు. నీ దగ్గర 14 సంవత్సరాలు పనిచేసి నేను వాళ్లను సంపాదించుకొన్నాను. నీ దగ్గర నేను మంచి పని చేసానని నీకు తెలుసు.”

27 అతనితో లాబాను అన్నాడు: “నన్ను ఒక్క మాట చెప్పనివ్వు. నీ మూలంగానే యోహోవా నన్ను ఆశీర్వదించాడని నాకు తెలుసు.

28 నీకు ఏం చెల్లించమంటావో చెప్పు, అది నీకు నేను చెల్లిస్తాను.”

29 యాకోబు జవాబిచ్చాడు: “నీ కోసం నేను కష్టపడి పని చేసానని నీకు తెలుసు. నీ గొర్రెల మందలను నేను కాస్తూ ఉండగా అవి విస్తరించాయి, క్షేమంగా ఉన్నాయి.

30 నేను వచ్చిన మొదట్లో నీకు ఉన్నది స్వల్పం. ఇప్పుడు నీకు చాలా విస్తారంగా ఉంది. నీ కోసం నేను ఏదైనా చేసినప్పుడల్లా యోహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక నా కోసం నేను పని చేసుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి.”

31 “అలాగైతే నేను నీక ఏమి ఇవ్వాలి?” అని లాబాను అడిగాడు. యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నీవు నాకు ఏమీ యివ్వక్కర్లేదు. నేను చేసిన పనికి తగినట్టుగా నీవు నాకు ఇస్తే చాలు. ఈ ఒక్క పని చేయి. నేను మళ్లీ వెళ్లి నీ గొర్రెలను కాస్తాను.

32 అయితే ఈ వేళ నీ గొర్రెల మందల్లో నన్ను నడువనియ్యి, వాటిలో మచ్చలుగాని చారలుగాని ఉన్న వాటన్నిటిని నన్ను తీసుకోనివ్వు. అలాగే నల్ల మేకపిల్లలు అన్నిటిని నన్ను తీసుకోనివ్వు. చారలు మచ్చలు ఉన్న ప్రతి ఆడ మేకను నన్ను తీసుకోనివ్వు. అదే నాకు జీతం.

33 నా నిజాయితీ ఏమిటో భవిష్యత్తులో నీవు తేలిగ్గా తెలుసుకోవచ్చు. నీవు వచ్చి నా మందల్ని చూడవచ్చు. మచ్చలేని మేకగాని, నలుపు లేని గొర్రెగాని నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించిన్నట్టు నీకు తెలుస్తుంది.”

34 “అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్టు మనం చేద్దాం” అన్నాడు లాబాను.

35 అయితే మచ్చలు ఉన్న మేకపోతులన్నింటిని ఆ రోజే లాబాను దాచిపెట్టేసాడు. మచ్చలు ఉన్న ఆడ మేకలన్నింటిని గూడ లాబాను దాచిపెట్టేసాడు. ఈ గొర్రెలను కనిపెట్టి ఉండమని లాబాను తన కుమారులతో చెప్పాడు.

36 కనుక ఆ కుమారులు మచ్చలుగల గొర్రెలలన్నింటిని మరో చోటుకు తోలుకొని వెళ్లారు. మూడు రోజుల పాటు వారు ప్రయాణం చేసారు. యాకోబు అక్కడ ఉండి, మిగిలిన జంతువులన్నింటి విషయం జాగ్రత్త పుచ్చుకొన్నాడు. అయితే అక్కడ ఉన్నవాటిలో మచ్చలు ఉన్నవి గాని చారలు ఉన్నవి గాని ఏ జంతువు లేదు.

37 కనుక బూరగ, బాదాం అను చెట్ల పచ్చటి కొమ్మలు యాకోబు నరికాడు. వాటిలో కొన్ని చువ్వల పైబెరడు యాకోబు తీసివేసినందువల్ల వాటి మీద తెల్ల చారలు కనబడుతున్నాయి.

38 నీళ్లు త్రాగే స్థలాల్లో మందల ముందు యాకోబు ఆ చువ్వలను ఉంచాడు. ఆ జంతువులు నీళ్లు త్రాగటానికి వచ్చినప్పుడు, అక్కడే అవి కలిసేవి.

39 ఆ చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు, మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి.

40 మచ్చలు, నలుపు ఉన్న జంతువులను మిగతా జంతువులనుండి యాకోబు వేరుచేసాడు. యాకోబు తన జంతువులను లాబాను జంతువులనుండి వేరుగా ఉంచాడు.

41 మందలోని బలమైన జంతువులు ఎదైనప్పుడుల్లా యాకోబు ఆ చువ్వలను వాటి కళ్లముందు ఉంచాడు. ఆ కొమ్మల దగ్గర ఆ జంతువులు చూలు కట్టేవి.

42 అయితే ఒక్కటి, బలహీనమైన జంతువులు ఎదైనప్పుడు యాకోబు ఆ కొమ్మలను అక్కడ పెట్టలేదు. కనుక బలహీనమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ లాబానువే. బలమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ యాకోబువి.

43 ఈ విధంగా యాకోబు చాలా ధనికుడయ్యాడు. పెద్ద మందలు, చాలా మంది సేవకులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉన్నాయి.

31

1 ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు.

2 అప్పుడు లాబాను ఇదివరలో ఉన్నంత స్నేహంగా తనతో యిప్పుడు లేనట్టు యాకోబు గమనించాడు.

3 అప్పుడు యెహోవా “నీ పూర్వీకుల నివాస దేశానికి నీవు తిరిగి వెళ్లిపో. నేను నీకు తోడుగా ఉంటాను” అని యాకోబుతో చెప్పాడు.

4 కనుక యాకోబు తన గొర్రెలు, మేకలు మందలను ఉంచిన పొలాల్లో తనను కలిసికోమని రాహేలు, లేయాలకు చెప్పాడు.

5 రాహేలు, లేయాలతో యాకోబు ఇలా చెప్పాడు: “మీ తండ్రి నామీద కోపంగా ఉన్నాడు. ఇది వరకు ఎప్పుడూ అతడు నాతో స్నేహంగా ఉండేవాడు, కాని ఇప్పుడు లేడు. అయితే, నా తండ్రి దేవుడు నాతో వున్నాడు.

6 నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు.

7 అయితే మీ తండ్రి నన్ను మోసం చేసాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటి నుండి దేవుడు నన్ను కాపాడాడు.”

8 “ఒకసారి లాబాను అన్నాడు: ‘మచ్చలు ఉన్న మేకలన్నీ నీవు ఉంచుకోవచ్చు. ఇది నీ జీతం.’ అతడు ఇలా చెప్పిన తర్వాత జంతువులన్నీ మచ్చలు ఉన్న పిల్లలనే కన్నాయి. కనుక అవి అన్నీ నావే. కానీ అప్పుడు లాబాను, ‘మచ్చలు గల మేకలను నేను తీసుకొంటాను, చారలున్న మేకలన్నీ నీవే. అది నీకు జీతం’ అన్నాడు. అతడు యిలా చెప్పిన తర్వాత జంతువులన్నీ చారలు గల పిల్లల్ని పెట్టాయి.

9 కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు.

10 “జంతువులు కలిసే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఎదవుతోన్న మగ మేకలన్నీ మచ్చలు, చారలు గలవేనని నేను చూశాను.

11 కలలో ఆ దేవదూత నాతో మాట్లాడాడు. ఆ దేవదూత “యాకోబూ!” అన్నాడు. ‘చిత్తం’ అన్నాను నేను.”

12 “ఆ దేవదూత అన్నాడు: “చూడు, మచ్చలు, చారలు ఉన్న మేకలు మాత్రమే ఎదవుతున్నాయి. ఇలా జరిగేటట్టు నేను చేస్తున్నాను. లాబాను నీ యెడల చేస్తోన్న అపకారం అంతా నేను చూశాను. కొత్తగా పుట్టిన మేక పిల్లలన్నీ నీకే చెందాలని నేను ఇలా చేస్తున్నాను.

13 బేతేలులో నీ దగ్గరకు వచ్చిన దేవుణ్ణి నేనే. ఆ స్థలంలో నీవు ఒక బలిపీఠం కట్టావు. ఆ బలిపీఠం మీద ఒలీవ నూనె నీవు పోసావు. అక్కడ నాకు నీవు ఒక వాగ్దానం చేసావు. నీవు తిరిగి నీ పుట్టిన స్థలానికి వెళ్లేందుకు ఇప్పుడు సిద్ధపడు.”

14 [This verse may not be a part of this translation]

15 [This verse may not be a part of this translation]

16 మా తండ్రి దగ్గర్నుండి ఈ ఆస్తి అంతా దేవుడు తీసివేసాడు, ఇప్పుడు అది మనది మన పిల్లలది. కనుక నీవు ఏం చేయాలని దేవుడు నీతో చెప్పాడో అలాగే నీవు చేయాలి!”

17 అందుచేత యాకోబు తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తన కుమారులను, భార్యలను ఒంటెల మీద ఎక్కించాడు.

18 అప్పుడు వాళ్లు, అతని తండ్రి నివసించిన కనాను దేశానికి తిరిగి ప్రయాణం మొదలుబెట్టారు. యాకోబు సంపాదించిన పశువుల మందలన్నీ వారికి ముందుగా నడిచాయి. అతడు పద్దనరాములో నివసించినప్పుడు సంపాదించుకొన్న సమస్తం అతడు తీసికొని వెళ్లాడు.

19 ఈ సమయంలో లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించటానికి వెళ్లాడు. అతడు వెళ్లిపోయాక, రాహేలు అతని ఇంటిలోకి వెళ్లి, తన తండ్రికి చెందిన విగ్రహాల్ని దొంగిలించింది.

20 సిరియావాడైన లాబానును యాకోబు మోసం చేసాడు. అతడు వెళ్లిపోతున్నట్టు లాబానుతో చెప్పలేదు.

21 యాకోబు తన కుటుంబాన్ని, తనకి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెంటనే వెళ్లిపోయాడు. వాళ్లు యూఫ్రటీసు నది దాటి గిలాదు కొండవైపు ప్రయాణం అయ్యారు.

22 యాకోబు పారిపోయినట్టు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది.

23 కనుక లాబాను తన మనుష్యుల్ని సమావేశపరచి, యాకోబును తరమటం మొదలు పెట్టాడు. ఏడు రోజుల తర్వాత గిలాదు పర్వతం దగ్గర లాబాను యాకోబును చూశాడు.

24 ఆ రాత్రి ఒక దర్శనంలో లాబానుకు దేవుడు ప్రత్యక్షమయ్యి, “నీవు యాకోబుతో చెప్పే ప్రతీ మాట గూర్చి జాగ్రత్త సుమా!” అన్నాడు దేవుడు.

25 మర్నాడు ఉదయాన్నే యాకోబును లాబాను పట్టుకొన్నాడు. కొండమీద యాకోబు గుడారం వేసికొన్నాడు. కనుక లాబాను, అతని మనుష్యులంతా గిలాదు కొండమీద గుడారాలు వేసుకొన్నారు.

26 యాకోబుతో లాబాను అన్నాడు: “నీవెందుకు నన్ను మోసం చేసావు? యుద్ధంలో చెరపట్టిన స్త్రీలవలె నా కూతుళ్లను ఎందుకు తీసుకు పోతున్నావు?

27 నాకు చెప్పకుండా నీవెందుకు పారిపోతున్నావు? నీవు నాతో చెప్పి ఉంటే నీకు నేను విందు చేసేవాణ్ణి. వాయిద్యాలతో సంగీతం, నాట్యం ఉండేవి.

28 కనీసం నా మనవళ్లను, మనవరాళ్లను ముద్దు పెట్టుకోనివ్వలేదు, నా కూతుళ్లకు వీడ్కోలు చెప్పనివ్వలేదు. నీవు ఇలా చేయటం చాలా బుద్ధి తక్కువ పని.

29 నిజంగా నిన్ను బాధించగల శక్తి నాకు ఉంది. అయితే గత రాత్రి నీ తండ్రి దేవుడు నాకు దర్శనం యిచ్చాడు. ఏ విధంగా కూడ నిన్ను బాధ పెట్టవద్దని ఆయన నన్ను హెచ్చరించాడు.

30 నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లిపోవాలన్న ఆశ నీకు ఉన్నట్టు నాకు తెలుసు. అందుకే నీవు బయల్దేరావు. కాని నా యింటి దేవతలను ఎందుకు దొంగిలించావు?”

31 యాకోబు ఇలా జవాబిచ్చాడు: “భయం చేత నీకు చెప్పకుండా బయల్దేరాను. నీ కుమార్తెలను నా దగ్గర్నుండి నీవు తీసుకొంటావేమో అనుకొన్నాను.

32 అంతేగాని నీ విగ్రహాలను మాత్రం నేను దొంగిలించలేదు. ఇక్కడ నాతో ఉన్నవాళ్లలో ఎవరి దగ్గరయినా నీ విగ్రహాలు దొరికితే, అలాంటి వ్యక్తి చంపివేయబడుగాక. నీ మనుష్యులే నాకు సాక్షులు. నీకు చెందినది ఏదైనా ఉందేమో నీవు వెదకవచ్చు. ఏదైనా సరే నీదైతే దాన్ని తీసుకో” లాబాను దేవుళ్లను రాహేలు దొంగిలించినట్లు యాకోబుకు తెలియదు.

33 కనుక లాబాను వెళ్లి యాకోబు గుడారాల్లో వెదికాడు. యాకోబు గుడారంలోను, తర్వాత లేయా గుడారంలోను అతడు వెదికాడు. ఆ తర్వాత బానిస స్త్రీలు ఇద్దరూ ఉంటున్న గుడారంలో అతడు వెదికాడు. కాని అతని నివాసంలో దేవుళ్లు కనబడలేదు. అప్పుడు లాబాను రాహేలు గుడారంలోకి వెళ్లాడు.

34 రాహేలు తన ఒంటె సామాగ్రిలో ఆ దేవుళ్లను దాచిపెట్టి, వాటి మీద కూర్చొంది. లాబాను గుడారం అంతా వెదికాడు, కాని ఆ విగ్రహాలు అతనికి దొరకలేదు.

35 “నాయనా, నా మీద కోపగించకు. నీ యెదుట నేను నిలబడలేక పోతున్నాను. నేను రుతు క్రమంలో ఉన్నాను” అని రాహేలు తన తండ్రితో చెప్పింది. కనుక లాబాను ఆ బస అంతటా వెదికాడు, కాని తన ఇంటి దేవుళ్లు అతనికి కనబడలేదు.

36 అప్పుడు యాకోబుకు చాలా కోపం వచ్చింది. యాకోబు అన్నాడు: “నేనేం తప్పు చేసాను? ఏ ఆజ్ఞను నేను ఉల్లంఘించాను? నన్ను వెంటాడే హక్కు నీకెక్కడిది?

37 నా ఆస్తి అంతా నీవు వెదికావు. నీకు చెందినది ఏమీ నీకు దొరకలేదు. నీకేమైనా దొరికి ఉంటే దాన్ని నాకు చూపించు. మన మనుష్యులకు కనబడేటట్టు దాన్ని ఇక్కడ పెట్టు. మనలో ఎవరిది సరిగా ఉందో మనవాళ్లే నిర్ణయిస్తారు.

38 ఇరవై సంవత్సరాలు నీ కోసం నేను పని చేసాను. ఆ కాలమంతటిలో గొర్రెపిల్లగాని, మేకపిల్లగాని ఒక్కటి గూడా పుట్టుకలో చావలేదు. నీ మందలోని పొట్టేళ్లలో ఒక్కటి గూడా నేను తినలేదు.

39 ఎప్పుడైనా సరే అడవి మృగాలు గొర్రెల్ని చంపితే, ఆ విలువ నేనే చెల్లించాను. చచ్చిన జంతువును ఎప్పుడూ నీకు చూపెట్టి, ఇది నా తప్పు కాదు అని నేను చెప్పలేదు. అయినా సరే రాత్రింబవళ్లు నీ మందల్ని కాపలా కాచాను.

40 పగలు ఎండకు నా బలం క్షీణించింది. రాత్రి చలి మూలంగా నా కన్నులకు నిద్ర దూరమయింది.

41 20 సంవత్సరాలు ఒక బానిసలా నేను నీకు పని చేసాను. నీ కుమార్తెలను సంపాదించుకోవటానికి మొదట 14సంవత్సరాలు నేను నీకు పని చేసాను. తర్వాత ఆరు సంవత్సరాలు నీ జంతువుల్ని సంపాదించటంకోసం పని చేసాను. ఆ కాలంలో నా జీతాన్ని నీవు పదిసార్లు మార్చావు.

42 అయితే నా పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడే గనుక నాకు తోడుగా లేకపోతే, నీను నన్ను వట్టి చేతులతో పంపి ఉండేవాడివి. కాని నా కష్టాలను దేవుడు చూశాడు. నేను చేసిన పనిని దేవుడు చూశాడు. నాదే సరి అని గతరాత్రి దేవుడు రుజువు చేసాడు.”

43 యాకోబుతో లాబాను చెప్పాడు: “ఈ అమ్మాయిలు నా కుమార్తెలు. వారి పిల్లలు నాకు చెందినవాళ్లు. ఈ జంతువులన్నీ నావే. ఇక్కడ నీకు కనబడుతోన్న సమస్తం నాదే. అయినప్పటికీ నా కుమార్తెలను, వారి పిల్లలను నా దగ్గర ఉంచుకొనేందుకు నేను చేయగలిగింది ఏమీ లేదు.

44 కనుక నీతో ఒడంబడిక చేసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మనకు ఒడంబడిక ఒకటి కుదిరిందని సూచించేందుకు మనం ఇక్కడ ఒక రాళ్ల కుప్ప వేద్దాం.”

45 కనుక యాకోబు ఒక పెద్ద బండను తెచ్చాడు, అతడు ఒక ఒడంబడిక చేసుకొన్నట్టు సూచనగా దాన్ని నిలువబెట్టాడు.

46 మరికొన్ని రాళ్లు తెచ్చి కుప్పగా వేయుమని అతడు తన సేవకులతో చెప్పాడు. అప్పుడు ఆ రాళ్ల కుప్ప ప్రక్కన వాళ్లు భోజనం చేసారు.

47 ఆ స్థలానికి యగర్ శాహదూత అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు అని పేరు పెట్టాడు.

48 “మనం ఇద్దరం మన ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప సహాయపడుతుంది” అన్నాడు లాబాను యాకోబుతో. అందుకే ఆ స్థలానికి గలేదు అని యాకోబు పేరు పెట్టాడు.

49 అప్పుడు లాబాను, “మనం ఒకరినుండి ఒకరం విడిపోయేటప్పుడు యోహోవా మనల్ని కాపాడును గాక!” అన్నాడు కనుక ఆ స్థలానికి మిస్పా అని కూడ పేరు.

50 అప్పుడు లాబాను అన్నాడు, “నా కుమార్తెలను నీవు బాధిస్తే, దేవుడు నిన్ను శిక్షిస్తాడని జ్ఞాపకం ఉంచుకో. నీవు ఇతర స్త్రీలను పెళ్లి చేసుకొంటే దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు.

51 ఇవిగో, ఇవి మన యిద్దరి మధ్య నేను ఉంచిన రాళ్లు. మనమిద్దరం ఒక ఒడంబడిక చేసుకొన్నామని సూచించేందుకు, జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప. ఇది ప్రత్యేక బండ.

52 మనం మన ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఈ రాళ్ల కుప్ప ఈ ప్రత్యేక బండ మనకు తోడ్పడుతాయి. నేనెన్నడూ ఈ రాళ్లు దాటి నీ మీదకు రాను. అలానే నీవు కూడా ఎన్నడూ ఈ రాళ్లు దాటి నామీద పోరాడటానికి రాకూడదు.

53 ఈ ఒప్పందాన్ని గనుక మనం మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వికుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్పు చెప్పును గాక.” యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయంకరుడు” అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేసాడు.

54 అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ కొండమీదనే గడిపారు.

55 మర్నాడు ఉదయాన్నే లాబాను తన కుమార్తెలకు, వారి పిల్లలకు వీడ్కోలు ముద్దు పెట్టాడు. అతడు వాళ్లను ఆశీర్వదించి తిరిగి తన యింటికి వెళ్లిపోయాడు.

32

1 యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు.

2 యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము” అని యాకోబు పేరు పెట్టాడు.

3 యాకోబు అన్న ఏశావు శేయెరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఏదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావుకు వార్తాహరులను పంపాడు.

4 “ఏశావుకు ఇలా చెప్పండి అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: “మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను.

5 పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.”

6 వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు.

7 ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు.

8 “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు.

9 యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీకు నాకు మేలు చేస్తానన్నావు.

10 నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేసావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది.

11 దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది.

12 “నేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుంబాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుంటారు” అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ.

13 యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను యాకోబు సిద్ధం చేసాడు.

14 యాకోబు 200 ఆడ మేకలను, 20 మేకపోతులను, 200 ఆడ గొర్రెలను, 20 పొట్టేళ్లను తీసుకొన్నాడు.

15 30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 మగ గాడిదలు యాకోబు తీసుకొన్నాడు.

16 “ఒక్కొక్క రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య ఎడం ఉంచండి” అన్నాడు.

17 యాకోబు వారికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి ఉన్న సేవకులతో యాకోబు “నా అన్న ఏశావు నీ దగ్గరకు వచ్చి, ‘ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడువి?’ అని అడిగితే,

18 ‘ఇవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజమాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపించాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు’ అని నీవు చె ప్పాలి” అన్నాడు.

19 అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, మూడవ సేవకునికి, మిగిలిన సేవకులందరికి యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసుకొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి.”

20 ఇది నీ కోసం కానుక, నీ సేవకుడైన యాకోబు వెనుక ఉన్నాడు’ అని మీరు చె ప్పాలి అన్నాడు యాకోబు. “ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే ఒకవేళ ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడేమో” అనుకొన్నాడు యాకోబు.

21 కనుక యాకోబు ఏశావుకు కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు.

22 ఆ రాత్రి చాలా గడిచిన తర్వాత యాకోబు లేచి బయల్దేరాడు. అతని భార్యలను, ఇద్దరు దాసీలను, తన పదకొండుమంది పిల్లలను అతడు తనతో కూడ వెంటబెట్టుకొని బయల్దేరాడు. యబ్బోకు నదిని దాటవలసిన చోట యాకోబు దాటాడు.

23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు.

24 అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. అయితే అతడు దాటక ముందు, అతడు ఇంకా ఒంటరిగా ఉండగానే, ఒక మనిషి వచ్చి అతనితో పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి అతనితో పోరాడాడు.

25 ఆ మనిషి యాకోబును ఓడించలేనట్టు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారిపోయింది.

26 అప్పుడు ఆ మనిషి, “నన్ను వెళ్లనివ్వు, సూర్యుడు వచ్చేస్తున్నాడు” అని యాకోబుతో అన్నాడు. కాని యాకోబు, “నేను నిన్ను వెళ్లనియ్యను. నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే” అన్నాడు.

27 “నీ పేరేమిటి?” ఆ మనిషి అడిగాడు. “నా పేరు యాకోబు” అన్నాడు యాకోబు.

28 అప్పుడు, “నీ పేరు ఇకమీదట యాకోబు కాదు. ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు. దేవునితోను, మనుష్యులతోను నీవు పోరాడి, ఓడిపోలేదు గనుక నీకు నేను ఈ పేరు పెడుతున్నాను” అన్నాడు ఆ మనిషి.

29 అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో చెప్పు” అని అడిగాడు. అయితే ఆ మనిషి “నీవు నా పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు.

30 అందుచేత ఆ స్థలానికి పెనూయేలు అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసాను. అయినప్పుటికి నా ప్రాణం దక్కింది” అన్నాడు యాకోబు.

31 అతడు పెనూయేలు దాటుతుండగా సూర్యుడు ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల అతడు కుంటుతున్నాడు.

32 అందుచేత తొడ గూటి మీద ఉన్న కండరమును ఇశ్రాయేలీయులు ఈ రోజువరకు తినరు, ఎందుకంటే అక్కడే యాకోబుకు దెబ్బ తగిలింది.

33

1 యాకోబు చూడగా ఏశావు రావడం కనబడింది. ఏశావు, అతనితో 400 మంది మనుష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని నాలుగు గుంపులుగా చేసాడు. లేయా, ఆమె పిల్లలు ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి రెండు గుంపుల్లో ఉన్నారు.

2 దాసీలను వారి పిల్లలను యాకోబు ముందు ఉంచాడు. తర్వాత యాకోబు లేయాను ఆమె పిల్లలను ఉంచాడు. ఆ తర్వాత, చివరగా రాహేలును, యోసేపును ఉంచాడు యాకోబు.

3 యాకోబు తానే ఏశావు వస్తున్న వైపు ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన మొదటివాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు నడుస్తూ ఏడు సార్లు నేలమీద సాగిలపడ్డాడు.

4 యాకోబును చూడగానే అతణ్ణి కలుసుకొనేందుకు ఏశావు పరుగెత్తాడు. ఏశావు అతణ్ణి కౌగిలించుకొని హత్తుకొన్నాడు. ఏశావు అతని మెడమీద ముద్దు పెట్టుకొని, వారిద్దరు సంతోషముతో ఏడ్చేసారు.

5 ఏశావు చూడగా స్త్రీలు పిల్లలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అతడు అడిగాడు. “దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు నాకు మేలు చేసాడు” అంటూ జవాబు చెప్పాడు యాకోబు.

6 తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్లంతా అతని ముందు సాష్టాంగపడ్డారు.

7 తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు.

8 “నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు. దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని చెప్పి అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.

9 కాని ఏశావు, “సోదరా, నాకు నీవు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నాకు కావాల్సినంత ఉన్నది” అన్నాడు.

10 యాకోబు అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమలాడుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు గూడా అంగికరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్టు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది.

11 అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను గూడ స్వీకరించుమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో మేలు చేసాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని చెప్పి యాకోబు ఏశావును బతిమలాడాడు. కనుక ఏశావు ఆ కానుకలను స్వీకరించాడు.

12 అప్పుడు ఏశావు, “ఇంక నీవు ప్రయాణం కొనసాగించు. నేను కూడ నీతో వస్తాను” అన్నాడు.

13 కాని యాకోబు అతనితో ఇలా చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. పైగా నా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా దూరం నడిపిస్తే అవి చస్తాయి.

14 అందుచేత నీవు ముందు వెళ్లిపో. నేను మెల్లగా నీ వెనుక వస్తా. పశువులు, మిగిలిన జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసిపోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను నిన్ను కలుసుకొంటాను.”

15 ఏశావు, “అలాగైతే నీకు సహాయంగా నా మనుష్యులను కొందర్ని నీతో ఉంచుతాను” అన్నాడు. కానీ యాకోబు, “అదంతా నీ దయ. కాని అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నాడు.

16 కనుక ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం కట్టాడు.

17 అయితే యాకోబు సుక్కోతు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు అని పేరు.

18 ఆ తర్వాత, యాకోబు పద్దనరాము నుండి కనానులో ఉన్న షెకెము పట్టణం వరకు తన ప్రయాణాన్ని క్షేమంగా ముగించాడు. ఆ పట్టణానికి సమీపంగా ఒక పొలంలో యాకోబు తన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు.

19 షెకెము తండ్రియైన హమోరు కుటుంబం దగ్గర యాకోబు ఆ పొలాన్ని కొన్నాడు. యాకోబు నూరు వెండి నాణ్యాలు చెల్లించాడు.

20 దేవుణ్ణి ఆరాధించటానికి యాకోబు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి “ఏల్, ఇశ్రాయేలీయుల దేవుడు” అని పేరు పెట్టాడు.

34

1 యాకోబు లేయాల కుమార్తె దీనా. ఒక రోజు, ఆ ఊరి స్త్రీలను చూడాలని దీనా బయటకు వెళ్లింది.

2 ఆ దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూసాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో సంభోగించాడు.

3 షెకెము దీనాను ప్రేమించాడు. ఆమె తనను పెళ్లి చేసుకునేలా ఒప్పించేందుకు ఆమెతో మాట్లాడాడు.

4 “నేను పెళ్లి చేసుకోవటానికి దయచేసి ఈ అమ్మాయినే తెచ్చి పెట్టమని” షెకెము తన తండ్రితో చెప్పాడు.

5 ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కార్యాన్ని గూర్తి యాకోబు విన్నాడు. అయితే యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు యాకోబు ఏమీ చేయలేదు.

6 అదే సమయంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడేందుకు వెళ్లాడు.

7 జరిగిన దాన్ని గూర్చి యాకోబు కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో శయనించి, షెకెము ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. షెకెము చాలా చెడ్డపని చేసాడు కనుక ఆ సోదరులంతా పొలాలనుండి వచ్చేసారు.

8 అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. “నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి.

9 మనకు ఒక ప్రత్యేక ఒడంబడిక ఉన్నట్టు ఈ వివాహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు మా మగవాళ్లు మీ అమ్మాయిలను, మీ మగవాళ్లు మా అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు.

10 ఈ దేశంలోనే మీరు కూడ మాతో కలసి ఉండవచ్చును. భూమిని స్వంతం చేసుకొనేందుకు, వ్యాపారం చేసేందుకు ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంటుంది” అన్నాడు.

11 షెకెము కూడ యాకోబుతో, అన్నదమ్ములతో మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా.

12 మీరు నన్ను దీనాను పెళ్లి చేసుకోనిస్తే, మీరు కోరిన కన్యాశుల్కం మీకు ఇస్తా. మీరు ఏమి అడిగితే అది ఇస్తా కాని దీనాను నన్ను పెళ్లాడనివ్వండి.”

13 షెకెముతో, అతని తండ్రితో అబద్ధం చె ప్పాలని యాకోబు కుమారులు నిశ్చయించుకున్నారు. వారి సోదరి షెకెము చేసిన నీచకార్యాన్ని బట్టి ఆ సోదరులు ఇంకా కోపంగానే ఉన్నారు.

14 కనుక ఆ సోదరులు, “నీకు ఇంకా సున్నతి కాలేదు గనుక నిన్ను మా సోదరిని పెళ్లి చేసుకోనివ్వం. మా సోదరి నిన్ను చేసుకోవడం తప్పు అవుతుంది.

15 అయితే నీవు ఈ ఒక్క పని చేస్తే నిన్ను ఆమెను పెళ్లి చేసుకోనిస్తాం. మీ పట్టణంలో ప్రతి పురుషుడూ మాలాగే సున్నతి చేసుకోవాలి.

16 అప్పుడు మీ పురుషులు మా స్త్రీలను, మా పురుషులు మీ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు మనమంతా ఒక్క ప్రజ అవుతాం

17 సున్నతికి మీరు నిరాకరిస్తే, దీనాను మేము తీసివేసుకొంటాం” అని అతనితో చెప్పారు.

18 ఈ ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా సంతోషం కలిగించింది.

19 దీనా సోదరులు అడిగినట్టు చేయాలంటే షెకెముకు చాలా సంతోషంగా ఉంది. షెకెము, అతని కుటుంబంలోకెల్లా చాలా గౌరవం గలవాడు.

20 హమోరు, షెకెము వారి పట్టణంలో సమావేశ స్థలానికి వెళ్లారు. ఆ పట్టణంలోని పురుషులతో వారు మాట్లాడి, అన్నారు:

21 “ఈ ఇశ్రాయేలీయులు మనతో నిజంగా స్నేహంగా ఉండాలని కోరుతున్నారు. వాళ్లను మన దేశంలోనే నివసించి వ్యాపారం చేసుకోనిద్దాం. మనందరికి సరిపోయేంత భూమి మనకు ఉంది. మనం వాళ్ల స్త్రీలను స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అలానే వారి పురుషులు వివాహం చేసుకొనేందుకు మన స్త్రీలను సంతోషంగా మనం ఇవ్వవచ్చు.

22 అయితే మన పురుషులంతా ఒక పని చేయడానికి ఒప్పకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగే మన మగవాళ్లంతా సున్నతి చేసుకొనేందుకు సమ్మతించాలి.

23 మనం ఇలా చేస్తే, వాళ్ల ఆల మందలు, జంతువులు, వస్తుజాలం అన్నీ మనకి దక్కి, మనం ధనికులం అవుతాం. కనుక మనం వాళ్లతో ఈ ఒడంబడిక చేయాల్సిందే, వాళ్లు మనతోనే ఉంటారు.”

24 సమావేశ స్థలంలో ఈ మాటను విన్న మగవాళ్లంతా షెకెము, హమోరులతో ఏకీభవించారు. ఆ సమయంలో ప్రతి పురుషునికి సున్నతి జరిగింది.

25 మూడు రోజుల తర్వాత, సున్నతి పొందిన మగవాళ్లు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఆ మనుష్యులు బలహీనంగా ఉంటారని యాకోబు ఇద్దరు కుమారులు షిమ్యోను, లేవీలకు తెలుసు. కనుక వారు పట్టణంలోకి వెళ్లి, ఆ పురుషులందర్నీ అక్కడే చంపేసారు.

26 దీనా సోదరులు షిమ్యోను, లేవీ కలిసి హమోరును, అతని కుమారుని చంపేసారు. అంతట వారు షెకెము యింటినుండి దీనాను తీసుకొని వెళ్లిపోయారు.

27 యాకోబు మిగిలిన కుమారులు ఆ పట్టణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న సమస్తం దోచుకొన్నారు. వారి సోదరికి, షెకెము చేసిన దాని విషయంలో వారు ఇంకా కోపంగా ఉన్నారు.

28 కనుక వారి జంతువులన్నింటినీ ఆ సోదరులు తీసుకుపోయారు. వారి గాడిదలను, పట్టణంలో, పొలాల్లో మిగిలినదంతా వారు దోచుకొన్నారు.

29 ప్రజలకు ఉన్నదంతా ఆ సోదరులు దోచుకుపోయారు. చివరికి వారి భార్యలను, పిల్లలను కూడా ఆ సోదరులు తీసుకొని వెళ్లిపోయారు.

30 అయితే షిమ్యోనుతోనూ, లేవీతోనూ యాకోబు అన్నాడు, “మీరు నాకు చాలా కష్టం తెచ్చి పెట్టారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా నన్ను అసహ్వించుకొంటారు. కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు అంతానాకు వ్యతిరేకంగా లేస్తారు. మనమేమో చాలా కొద్దిమందిమే ఉన్నాం. ఈ దేశంలో ఉన్నవాళ్లంతా ఏకమై మనమీద యుద్ధానికి వస్తే, నన్ను నాశనం చేస్తారు. నాతోబాటే మన ప్రజలందర్నీ నాశనం చేస్తారు.”

31 అయితే ఆ సోదరులు, “ఈ ప్రజలు మా సోదరిని ఒక వేశ్యలా చేస్తే, చూస్తూ ఊరుకోమంటావా? లేదు, మా సోదరికి అలా చేయటం వారిది తప్పు” అని చెప్పారు.

35

1 “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు.

2 కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి.

3 మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.”

4 కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేసారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేసారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం కింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు.

5 యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి, యాకోబును వెంబడించలేదు.

6 కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది.

7 అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు.

8 రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం కింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూతో అని వారు పేరు పెట్టారు.

9 పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయ్యి, యాకోబును ఆశీర్వదించాడు.

10 “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. ‘నీ కొత్త పేరు ఇశ్రాయేలు’ అని ఉంటుంది” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.

11 అతనితో దేవుడన్నాడు: నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు.

12 అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.

13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు.

14 [This verse may not be a part of this translation]

15 [This verse may not be a part of this translation]

16 యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్లెహేం) చేరుతారనగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది.

17 అయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడుతోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు పనిమనిషి ఇది చూసి, “రాహేలూ భయపడకు. నీవు మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది.

18 కుమారుని కంటూనే రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.

19 ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది (ఎఫ్రాతా అంటే బెత్లేహేం).

20 రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది.

21 అప్పుడు ఇశ్రాయేలు (యాకోబు) తన ప్రయాణం కొనసాగించాడు. ఏదెరు శిఖరానికి కొద్దిగా దక్షిణంగా అతడు శిబిరం వేసాడు.

22 ఇశ్రాయేలు అక్కడ కొన్నాళ్లపాటు ఉండిపోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు దాసి బిల్హాతో రూబేను శయనించాడు. ఇశ్రాయేలు ఇది విని చాలా కోపగించుకొన్నాడు. యాకోబుకు (ఇశ్రాయేలు) 12 మంది కుమారులు.

23 అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును.

24 అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను.

25 రాహేలు పనిమనిషి బిల్హా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాను, నఫ్తాలి.

26 లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు.

27 కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది.

28 ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు.

29 ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు.

36

1 ఏశావు కుటుంబ జాబితా ఇది: (ఎదోము అని కూడ అతనికి పేరు) ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు.

2 ఏశావు భార్యలు ఎవరంటే: ఆదా, హిత్తీవాడైన ఏలోను కుమార్తె అహోలీబామా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె,

3 బాశెమతు, ఇశ్మాయేలు కుమార్తె, నెబాయోతు సోదరి.

4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది.

5 అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు.

6 [This verse may not be a part of this translation]

7 [This verse may not be a part of this translation]

8 [This verse may not be a part of this translation]

9 ఎదోమి ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి:

10 ఏశావు కుమారులు ఎలీఫజు, ఏశావు, ఆదాలకు పుట్టిన కుమారుడు. రగూయేలు, ఏశావు, బాశెమతులకు పుట్టిన కుమారుడు.

11 ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు.

12 ఎలీఫెజుకు తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫజులకు అమాలేకు పుట్టాడు.

13 రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు.

14 అనా కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ భార్య. (అనా సిబ్యోను కుమారుడు) ఏశావు, అహోలీబామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, కోరహు.

15 ఏశావు ద్వారా వచ్చిన వంశాలు యివి: ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు.

16 కోరహు, గాతాము, అమాలేకు. ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి

17 ఏశావు కుమారుడు రగూయేలు ఈ కింది కుటుంబాలకు తండ్రి: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి ఉద్భవించాయి.

18 అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామాకు యూషు, యగ్లాము, కోరహు పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు పెద్దలు.

19 ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి.

20 ఏశావుకంటె ముందు హోరీవాడైన శేయీరు ఎదోములో నివసించాడు. శేయీరు కుమారులు వీరు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,

21 దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏశావు (ఎదోము) ప్రాంతంనుండి వచ్చిన హోరీయ కుటుంబ నాయకులు.

22 హోరీ, హేమీము. వీరికి లోతాను తండ్రి. (తిమ్నా లోతాను సోదరి.)

23 అల్వాన్, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. వీరి తండ్రి శోబాలు.

24 సిబ్యోనుకు ఇద్దరు కుమారులు. అయ్యా, అనా. (అనా తన తండ్రి గాడిదలను కాస్తూ ఉండగా ఎడారిలో ఉష్ణధారలను కనుగొన్నవాడు.)

25 దిషాను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి.

26 దిషోనుకు నలుగురు కుమారులు: హెన్దూను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.

27 ఏసెరుకు ముగ్గురు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.

28 దీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను.

29 హోరీ కుటుంబాల పెద్దల పేర్లు ఇవి: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,

30 దిషోను, ఏసెరు, దీషాను, శేయీరు (ఎదోము) దేశంలో నివసించిన కుటుంబాల పెద్దలు వీరంతాను.

31 అప్పట్లో, ఎదోములో రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల రాజులకంటె చాలా ముందే ఎదోములో రాజులు ఉన్నారు.

32 బెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు.

33 బెల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. యోబాబు బొస్రావాడైన జెరహు కుమారుడు.

34 యోబాబు చనిపోయినప్పుడు హుషాము పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి.

35 హుషాము చనిపోయాక హదదు ఆ ప్రాంతాన్ని పాలించాడు. బదదు కుమారుడు హదదు. (మోయాబు దేశంలో మిద్యానును జయించినవాడు హదదు.) హదదు అవీతు పట్టణంవాడు.

36 హదదు మరణించాక శమ్లా ఆ దేశాన్ని పాలించాడు. శమ్లా మశ్రేకనుండి వచ్చినవాడు.

37 శమ్లా మరణించాక షావూలు ఆ ప్రాంతాన్ని పాలించాడు. యూఫ్రటీసు నదీ ప్రాంతంలోని రహెబోతువాడు షావూలు.

38 షావూలు మరణానంతరం బయల్ హానాను ఆ దేశాన్ని పాలించాడు. అక్బోరు కుమారుడు బయల్ హనాను.

39 బయల్ హనాను మరణించాక హదదు (హదరు) ఆ దేశాన్ని పాలించాడు. హదదు పాపు నగరవాసి. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కుమార్తె. (మత్రేదు తండ్రి మేజాహాబు).

40 [This verse may not be a part of this translation]

41 [This verse may not be a part of this translation]

42 [This verse may not be a part of this translation]

43 [This verse may not be a part of this translation]

37

1 యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ ఒకటే దేశం.

2 ఇదీ యాకోబు కుటుంబ గాధ. యోసేపు 17సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని, మేకల్ని కాయటం అతని పని. తన సోదరులైన బిల్హా, జిల్ఫా, కుమారులతో కలిసి యోసేపు ఈ పని చేసాడు. (బిల్హా, జిల్ఫా అతని తండ్రి భార్యలు. అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు.

3 అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకతగల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది.

4 యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషంచారు. వాళ్లు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు.

5 ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు.

6 “నాకో కల వచ్చింది,

7 మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు.

8 అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువ ద్వేషిస్తున్నారు.

9 అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. “నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను చూసాను” అంటూ చెప్పాడు యోసేపు.

10 ఈ కల విషయమై యోసేపు తన తండ్రితో కూడ చెప్పాడు. కాని అతని తండ్రి అతణ్ణి విమర్శించాడు. “ఇదేం కల? నేనూ, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ముతున్నావా?” అన్నాడు అతని తండ్రి.

11 యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నింటిని గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వున్నాడు.

12 ఒకరోజు, యోసేపు సోదరులు తమ తండ్రి గొర్రెల్ని మేపుకొనేందుకు షెకెం వెళ్లారు.

13 యాకోబు, “నీ, సోదరులు షెకెంలో నా గొర్రెల్ని కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్లాలి” అని యోసేపుతో చెప్పాడు. “అలాగే నేను వెళ్తా,” అన్నాడు యోసేపు.

14 యోసేపు తండ్రి, “నీవు వెళ్లి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూచి, మళ్లీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి” అన్నాడు. అందుచేత యోసేపు తండ్రి హెబ్రోను లోయనుండి షెకెముకు అతడ్ని పంపించాడు.

15 షెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. “ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు ఆ మనిషి.

16 “నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?” అన్నాడు యోసేపు.

17 ఆ మనిషి “అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను వెంబడించి, దోతానులో వారిని చూడగలిగాడు.

18 యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుంచే చూసారు. అతణ్ణి చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకొన్నారు.

19 ఆ సోదరులు వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు.

20 ఇప్పుడు మనకు వీలైనప్పుడే మనం వాణ్ణి చంపివేయాలి. వాని శవాన్ని ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. అడవి మృగం ఏదో వాణ్ణి చంపేసిందని మన తండ్రితో మనం చెప్పొచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము లేనివని వానికి మనం చూపెట్టవచ్చు.”

21 కానీ రూబేను యోసేపును కాపాడాలి అనుకొన్నాడు, “వాణ్ణి మనం చంపొద్దు.

22 వానికి హాని చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది” అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి, అతని తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం ఇది.

23 యోసేపు తన సోదరుల దగ్గరకు వచ్చాడు. వారు అతని మీద పడి, అందమైన అతని పొడవాటి అంగీని చింపేసారు.

24 తర్వాత, ఎండిపోయి ఖాళీగా ఉన్న ఒక బావిలో అతణ్ణి పడవేసారు.

25 యోసేపు బావిలో పడి ఉంటే, అతని సోదరులు భోజనం చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా, గిలాదునుండి ఈజిప్టుకు ప్రయాణం చేస్తోన్న వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి.

26 కనుక యూదా తన సోదరులతో “మనం మనసోదరుని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం?

27 ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత సోదరుని చంపిన అపరాధం మనమీద ఉండదు” అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు.

28 మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీసారు. 20వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేసారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.

29 ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్టు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడాలేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన గుడ్డలను చింపివేసుకొన్నాడు.

30 రూబేను తన సోదరుల దగ్గరకు వెళ్లి, “పిల్లవాడు బావిలో లేడు, నేనేం చేయాలి?” అని అడిగాడు.

31 ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూసారు.

32 తర్వాత ఆ సోదరులు ఆ అంగీని తమ తండ్రికి చూపించారు. “ఈ అంగీ మాకు దొరికింది. ఇది యోసేపుదా?” అంటూ అడిగారు ఆ సోదరులు.

33 తండ్రి అంగీని చూచి, అది యోసేపుదేనని తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే, ఒకవేళ అడవి మృగం ఏదైనా అతణ్ణి చంపివేసిందేమో. నా కుమారుడు యోసెపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది!” అన్నాడు ఆ తండ్రి.

34 యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపి వేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్టు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు.

35 యాకోబు కుమారులు, కుమార్తెలు అందరూ అరణ్ణి ఓదార్చాలని ప్రయత్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ కలుగలేదు. యాకోబు “నా మరణ దినంవరకు నా కుమారుని గూర్చి దుఃఖస్తూనే ఉంటాను” అన్నాడు. అందుచేత అతని కుమారుడైన యోసేపు కోసం యోకోబు దుఃఖంలోనే కాలం గడుపుతూ ఉండిపోయాడు.

36 యోసేపును కొన్న మిద్యాని వ్యాపారవేత్తలు దరిమిలా అతణ్ణి ఈజిప్టులో ఫరో సంరక్షక సేనాధిపతి పోతీఫరుకు అమ్మివేసారు.

38

1 సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒకతని దగ్గర ఉండేందుకు వెళ్లాడు. హీరా అదుల్లాము నివాసి.

2 అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకొని ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయ.

3 ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా, వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు.

4 తర్వాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు.

5 తర్వాత షేలా అనే పేరుగల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టునప్పుడు, అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు.

6 యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేసాడు. ఆ అమ్మాయి పేరు తామారు.

7 కానీ ఏరు చాలా చెడ్డపనులు చేసాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతణ్ణి చంపేసాడు.

8 అప్పుడు యూదా అతని సోదరుడైన ఓనానుతో “పోయి, చచ్చిన నీ సోదరుని భార్యతో శయనించు. ఆమెకు భర్తలా ఉండు. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించ బడతారు” అని చెప్పాడు.

9 ఈ సంబంధంవలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణింపబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో సంభోగించి, ఇంద్రియమును బయట పడవేసాడు.

10 దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేసాడు.

11 అప్పుడు యూదా “నీవు తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి చేసుకోకు” అని తన కోడలైన తామారుతో చెప్పాడు. షేలా కూడ తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది.

12 ఆ తర్వాత షూయ కుమార్తె, యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖ కాలం తీరిపోయ్యాక, అతడు తన స్నేహితుడు, అదుల్లాము మివాసి హీరాతో కలిసి తిమ్నాతునకు వెళ్లాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూద తిమ్నాతునకు వెళ్లాడు.

13 తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతునకు వస్తున్నాడని తెలుసుకొంది.

14 తామారు ఎప్పుడు విధవరాలి గుడ్డలే ధరించేది. కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి, నెత్తిమీద ముసుగు వేసుకొంది. అప్పుడు తిమ్నాతునకు దగ్గర్లో ఎనాయిం అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చొంది. యూదా చిన్న కుమారుడు షేల ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతణ్ణి పెళ్లి చేసికొనే ఏర్పాట్లు యూదా చేయటం లేదు.

15 యూదా ఆ మార్గాన ప్రయాణం చేసాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యాలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.)

16 కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్లి, “నన్ను నీతో లైంగింకంగా కలవనీ” అని అడిగాడు. (ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు.) “అసలు నీవు ఏ మాత్రం ఇస్తావేంటి?” అంది ఆమె.

17 యూదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను పంపిస్తా” అని జవాబిచ్చాడు. “సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు యింకేమైన నాకు ఇవ్వాలి సుమా” అని జవాబు చెప్పింది ఆమె.

18 “నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమి ఇవ్వమంటావు?” అడిగాడు యూదా. తామారు, “నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతి కర్ర ఇవ్వు” అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు యూదా తామారుతో సంభోగించగా ఆమె గర్భవతి అయ్యింది.

19 తామారు ఇంటికి వెళ్లి, తన ముఖం మీద ముసుగు తీసివేసింది. మరల విధవ వస్త్రాలే ఆమె ధరించింది.

20 యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఆమె ఇంటికి పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కనబడలేదు.

21 “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా. “ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు.

22 కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు.

23 అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నంచేసాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు.

24 మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” అని యూదాతో చెప్పారు. అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు.

25 తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరిది? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?”

26 వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు.

27 తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది.

28 ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్ర దారం కట్టి, “ఈ శిశువు ముందు పుట్టాడు” అంది.

29 అయితే ఆ శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది మంత్రసాని. అంచేత వారు పెరెసు అని వానికి పేరు పెట్టారు.

30 తర్వాత రెండో శిశువు పట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే పేరు పెట్టారు.

39

1 యోసేపును కొన్న వ్యాపార వేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకు వెళ్లారు. ఫరో సంరక్షకుల అధిపతి పోతీఫరుకు వారు అతన్ని అమ్మేసారు.

2 అయితే యెహోవా యోసేపుకు సహాయం చేసాడు. యోసేపు విజయ సారధి అయ్యాడు. తన యజమాని, ఈజిప్టు వాడైన పోతీఫరు ఇంటిలో యోసేపు నివాసం ఉన్నాడు.

3 యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నట్టు పోతీఫరు తెలుసుకొన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో యెహోవా అతనికి తోడుగా ఉన్నట్టు పోతీఫరు గ్రహించాడు.

4 అందుచేత యోసేపు విషయంలో పోతీఫరు చాల సంతోషించాడు. పోతీఫరు యోసేపును తనకు సహాయం చేయనిస్తూ, తన ఇంటి వ్యవహారాలన్నీ పర్యవేక్షింపనిచ్చాడు. పోతీఫరుకు ఉన్న సమస్తంమీద యోసేపు అధికారి.

5 ఆ ఇంటిమీద యోసేపు అధికారిగా చేయబడిన తర్వాత, యెహోవా ఆ ఇంటినీ, పోతీఫరుకు ఉన్న సమస్తాన్నీ ఆశీర్వదించాడు. ఇదంతా యోసేపువల్లనే యెహోవా చేసాడు. పోతీఫరు పొలాల్లో పెరిగే వాటన్నిటినీ యెహోవా ఆశీర్వదించాడు.

6 కనుక పోతీఫరు తన ఇంటిలో అన్ని విషయాల బాధ్యత యోసేపునే తీసుకోనిచ్చాడు. పోతీఫరు తాను భుజించే భోజనం విషయం తప్ప మరి దేనిగూర్చీ చింతించలేదు. యోసేపు చాలా అందగాడు. చూడ చక్కని వాడు.

7 కొన్నాళ్ల తర్వాత యోసేపు యజమాని భార్య యోసేపు మీద మోజుపడసాగింది. ఒకనాడు ఆమె, “నాతో శయనించు” అని అతనితో అంది.

8 కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: “నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు.

9 నా యజమాని తన ఇంట నన్ను దాదాపుగా అతనికి సమానంగా ఉంచాడు. నేను అతని భార్యతో శయనించకూడదు. అది తప్పు అది దేవునికి వ్యతిరేకంగా పాపం.”

10 ఆమె ప్రతిరోజూ యోసేపుతో మాట్లాడుతున్నప్పటికీ యోసేపు ఆమెతో శయనించేందుకు నిరాకరించాడు.

11 ఒక రోజు యోసేపు తన పని చేసుకొనేందుకని ఇంటిలోనికి వెళ్లాడు. ఆ సమయంలో అతను ఒక్కడే ఇంటిలో ఉన్నాడు.

12 అతని యజమాని భార్య అతని అంగీ పట్టి లాగి, “వచ్చి నాతో శయనించు” అంది అతనితో. అయితే యోసేపు ఇంట్లోనుంచి బయటకు పారిపోయాడు. పైగా అతడు తన అంగీని ఆమె చేతిలోనే వదిలేసాడు.

13 యోసేపు అతని అంగీని తన చేతిలోనే విడిచి వెళ్లినట్టు ఆ స్త్రీ గమనించింది. జరిగిన దాని విషయమై ఆమె అబద్ధం చెప్పాలని నిర్ణయించుకొంది. బయటకు పరిగెత్తింది.

14 ఆమె తన ఇంటిలో ఉన్న పురుషులను పిలిచింది. ఆమె అంది, “చూడండి, మనలను ఆట పట్టించటానికే ఈ హెబ్రీ బానిసను తెచ్చారు. ఇతడు లోనికి వచ్చి నన్ను బలవంతం చేయటానికి ప్రయత్నించాడు. కానీ నేను గట్టిగా కేక పెట్టేసరికి

15 అతను భయపడి పారిపోయాడు. అయితే అతని అంగీ నా దగ్గరే వదిలేసిపోయాడు.”

16 తన భర్త, అంటే యోసేపు యజమాని ఇంటికి వచ్చేంత వరకు ఆమె ఆ అంగీని ఉంచింది.

17 ఆమె తన భర్తతో అదే కథ చెప్పింది. ఆమె, “నీవు ఇక్కడికి తీసుకొని వచ్చిన ఈ హెబ్రీ బానిస నామీద పడటానికి ప్రయత్నం చేసాడు.

18 అయితే అతడు నా దగ్గరకు రాగానే నేను గట్టిగా కేక వేసాను. అతను పారిపోయాడు గాని అతడు అంగీ విడిచిపెట్టేసాడు” అని చెప్పింది.

19 యోసేపు యజమాని అతని భార్య చెప్పిందంతా విన్నాడు. అతనికి చాలా కోపం వచ్చింది.

20 రాజ ద్రోహులను బంధించే ఒక చెరసాల ఉంది. కనుక యోసేపును ఆ చెరసాలలో వేసాడు పోతీఫరు. యోసేపు అందులోనే ఉన్నాడు.

21 అయితే యోసేపుకు యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా యోసేపుకు తన దయనుచూపెడ్తూనే ఉన్నాడు. కొన్నాళ్లయ్యేటప్పటికి చెరసాల కాపలాదారుల నాయకునికి యోసేపు అంటే ఇష్టం కలిగింది.

22 కాపలాదారుల అధిపతి ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా ఉంచాడు. యోసేపు వారికి నాయకుడు, అయినప్పటికీ వారి చేసిన పనులే అతడు కూడా చేసాడు.

23 చెరసాలలో ఉన్న ప్రతిదాని విషయంలోను ఆ కాపలాదారుల నాయకుడు యోసేపును నమ్మాడు. యెహోవా యోసేపుతో ఉన్నందుచేత ఇలా జరిగింది. యోసేపు చేసే ప్రతి పనిలో అతనికి కార్యసాధన కలిగేటట్టు యెహోవా యోసేపుకు సహాయం చేసాడు.

40

1 ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేసారు. ఆ సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందించేవారి పెద్ద.

2 వంటల పెద్ద, ద్రాక్షా పాత్రల, పెద్ద మీద ఫరోకు కోపం వచ్చింది.

3 కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు ఈ చెరసాల అధికారి.

4 ఈ ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతకు అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల వరకు అలా జైల్లోనే ఉన్నారు.

5 ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఆ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు - ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది.

6 మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్టు యోసేపు గమనించాడు.

7 “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్టు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు.

8 “రాత్రి మాకు కలలు వచ్చాయి కాని మేము కన్న కల మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు.

9 కనుక ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుతో తన కల చెప్పాడు. ఆ సేవకుడు ఇలా చెప్పాడు: “నా కలలో ఒక ద్రాక్షావల్లి కనబడింది.

10 ఆ ద్రాక్షావల్లికి మూడు తీగెలున్నాయి. నేను చూస్తుండగా ఆ తీగెలకు పూలు పూసి, ద్రాక్షాగెలలు అయ్యాయి.

11 నేను ఫరో పాత్ర పట్టుకొని ఉన్నాను. కనుక నేను ఆ ద్రాక్షాలను తీసుకొని ఆ పాత్రలో వాటి రసం పిండాను. అప్పుడు ఆ పాత్ర నేను ఫరోకు ఇచ్చాను.”

12 అప్పుడు యోసేపు అన్నాడు: “ఆ కలను నీకు నేను వివరిస్తాను. మూడు కొమ్మలంటే మూడు రోజులు.

13 మూడు రోజులు గతించక ముందే ఫరో నిన్ను క్షమించి, నిన్ను మళ్లీ నీ పని చేసుకోనిస్తాడు. ఇది వరకు నీవు ఫరో దగ్గర పని చేసిన పని నీవు మళ్లీ చేస్తావు.

14 నీకు విడుదల అయింతర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. నా మీద దయ ఉంచి, నాకు సహాయం చేయి. నాకుగూడ ఈ చెరసాలలో నుంచి విముక్తి కలిగేటట్టు నా గురించి ఫరోతో చెప్పు.

15 నన్ను అన్యాయంగా బలవంతంగా నా యింటినుండి నా ప్రజలైన హీబ్రూలనుండి తీసుకొనివచ్చారు. నేనేమి తప్పు చేయలేదు. అందుచేత నేను ఈ చెరసాలలో ఉండకూడదు.”

16 మరో సేవకుని కల బాగున్నట్టు రొట్టెలు కాల్చేవాడికి తోచింది. వాడు యోసేపుతో అన్నాడు, “నాకూ ఒక కల వచ్చింది. నా తలమీద రొట్టెల బుట్టలు మూడు ఉన్నట్టు నాకు కనబడింది.

17 పై బుట్టలో అన్ని రకాల కాల్చిన ఆహారాలు ఉన్నాయి. ఈ భోజనం రాజుగారి కోసం. కాని పక్షులు ఈ భోజనాన్ని తినేస్తున్నాయి.”

18 యోసేపు జవాబిచ్చాడు: “ఈ కల అర్థం ఏమిటో నీకు నేను చెబతాను. మూడు బుట్టలు అంటే మూడు రోజులు.

19 మూడు రోజులు గడవక ముందే రాజుగారు నిన్ను ఈ చెరసాలలోనుంచి విడుదల చేస్తారు. తర్వాత రాజుగారు నీ తల నరికేస్తాడు, నీ శరీరాన్ని ఒక స్తంభానికి వేలాడదీస్తాడు, పక్షులు నీ శరీరాన్ని తినివేస్తాయి.”

20 మూడు రోజుల తర్వాత రాజుగారి పుట్టిన రోజు వచ్చింది. ఫరో తన సేవకులందరికీ ఒక విందు చేసాడు. ఆ విందులో ఫరో తన రొట్టెలు కాల్చేవాడిని, ద్రాక్షా పాత్రల సేవకుణ్ణి చెరసాలలోనుంచి బయటకు రప్పించాడు.

21 ద్రాక్షాపాత్రల సేవకుడ్ని ఫరో విడుదల చేసాడు. అతని ఉద్యోగం మరల ఫరో అతనికి ఇచ్చాడు. ద్రాక్షా పాత్రల సేవకుడు ద్రాక్షారసపు పాత్ర ఒకటి ఫరో చేతికి అందించాడు.

22 కానీ ఫరో రొట్టెలు కాల్చే వాడిని చంపేసాడు. ఎలా జరుగుతుందని యోసేపు చెప్పాడో అంతా అలాగే జరిగింది.

23 అయితే ద్రాక్షా పాత్రల సేవకుడు యోసేపుకు సహాయం చెయ్యటం మరచిపోయాడు. యోసేపు విషయం ఫరోతో అతడేమీ చెప్పలేదు. ద్రాక్షాపాత్రల సేవకుడు యోసేపును గూర్చి మర్చిపోయాడు.

41

1 రెండు సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కల వచ్చింది. ఫరో నైలునది ప్రక్కగా నిలబడినట్టు అతనికి కల వచ్చింది.

2 అప్పుడు ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు రావటం ఫరో చూశాడు. ఆవులు బలిసి అందంగా ఉన్నాయి. ఆవులు అక్కడ నిలబడి గడ్డి తింటున్నాయి.

3 అప్పుడు ఇంక ఏడు ఆవులు నదిలోనుంచి బయటకు వచ్చాయి. కానీ ఈ ఆవులు చిక్కిపోయి, బక్కగా ఉన్నాయి. అందంగా ఉన్న ఏడు ఆవుల ప్రక్కగా ఈ ఏడు ఆవులు నిలబడ్డాయి.

4 అసహ్యంగా ఉన్న ఏడు ఆవులు అందంగా బలిసి ఉన్న ఏడు ఆవులను తినివేసాయి. అంతలో ఫరో మేల్కొన్నాడు.

5 ఫరో మరల నిద్రపోగా రెండవసారి కల వచ్చింది. ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం అతడు తన కలలో చూశాడు. ఆ ధాన్యపు గింజలు బలంగా, బాగుండటం అతడు చూశాడు.

6 తర్వాత అదే ధాన్యపు మొక్కకు మరో ఏడు వెన్నులు పెరగటం అతడు చూశాడు. అయితే ఈ వెన్నులు పీలగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.

7 అప్పుడు పీలగా ఉన్న వెన్నులు, బలంగా బాగున్న వెన్నులను తినివేసాయి. ఫరోకు మరల మెళుకువ వచ్చింది. అదంతా కల మాత్రమేనని ఫరో గ్రహించాడు.

8 మర్నాడు ఉదయం ఆ కలల విషయమై ఫరోకు కలవరం కలిగింది. కనుక అతడు ఈజిప్టులోని మంత్రగాళ్లందరిని పిలిపించాడు. విద్వాంసులందరిని అతడు పిలిపించాడు. ఆ కలను గూర్చి ఫరో వాళ్లతో చెప్పాడు. అయితే వాళ్లలో ఒక్కడు కూడా ఆ కలను వివరించలేక పోయారు. దాని భావం చెప్పలేకపోయారు.

9 అప్పుడు ద్రాక్షాపాత్రల సేవకునికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. ఆ సేవకుడు ఫరోతో ఇలా చెప్పాడు: “నాకు జరిగిన ఒక విషయం జ్ఞాపకం వస్తుంది.

10 నా మీద, మరో సేవకుని మీద తమరికి కోపం వచ్చింది. మీరు మమ్మల్ని చెరసాలో వేసారు.

11 చెరసాలలో మా యిద్దరికీ ఒకే రాత్రి కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంది.

12 హెబ్రీ యువకుడు ఒకడు మాతో బాటు ఆ చెరసాలలోనే ఉన్నాడు. రాజు సంరక్షక ధళాధిపతికి అతడు సేవకుడు. మేము మా కలలు అతనితో చెబితే, అతడు వాటిని మాకు వివరించాడు. ఒక్కో కల అర్థం అతడు మాకు చెప్పాడు.

13 అతడు చెప్పిన అర్థాలు సత్యం. నాకు విడుగల అవుతుందని, నా పాత ఉద్యోగం మళ్లీ నాకు లభిస్తుందని అతడు నాకు చెప్పాడు. అది సత్యమే. వంటల పెద్ద మరణిస్తాడని అతడు చెప్పాడు, అదీ సత్యమే.”

14 కనుక ఫరో చెరసాలలోనుంచి యోసేపును పిలిపించాడు. సంరక్షకులు వెంటనే యోసేపును చెరసాలలోనుంచి తీసుకొని వచ్చారు. యోసేపు క్షవరం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొన్నాడు. అప్పుడు అతడు వెళ్లి ఫరో ముందర నిలవబడ్డాడు.

15 అప్పుడు ఫరో “నాకో కల వచ్చింది, అయితే ఆ కలను నాకు వివరించగల వాళ్లు ఒక్కళ్లూ లేరు. ఎవరైనా వారి కల నీతో చెబితే నీవు వాటిని వివరించి, భావంకూడ చెప్పగలవని నేను విన్నాను” అని యోసేపుతో అన్నాడు.

16 యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. ఆ శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు గూడ ఈ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు.

17 అప్పుడు ఫరో యోసేపుతో చెప్పాడు: “నా కలలో నేను నైలునది పక్కగా నిలబడ్డాను.

18 ఆ నదిలోనుంచి ఏడు ఆవులు బయటకు వచ్చి గడ్డి మేయటం నేను చూశాను. ఈ ఆవులు బలిసి, అందంగా ఉన్నాయి.

19 అప్పుడు మరో ఏడు ఆవులు నదిలో నుంచి రావటం నేను చూశాను. ఈ ఆవులు బక్కచిక్కి రోగిష్టివిగా ఉన్నాయి. ఈజిప్టు దేశం మొత్తంలో నేను చూసిన ఆవుల్లో అవి పరమ అసహ్యంగా ఉన్నాయి.

20 అసహ్యమైన ఈ ఏడు ఆవులు ముందు వచ్చిన అందమైన ఏడు ఆవులను తినివేసాయి.

21 అయితే ఆ ఏడు ఆవులను తినివేసిన తర్వాత కూడ అవి ఇంకా బక్కచిక్కి ఉన్నాయి. వాటిని చూస్తే, అవి ఏడు ఆవులను తిన్న వాటిల్లాగ అగుపించవు. ముందు అవి ఎంత బక్కగా అసహ్యంగా ఉన్నాయో యిప్పుడూ అలానే కనబడ్డాయి. అప్పుడు నేను మేల్కొన్నాను.”

22 “తర్వాత నాకు వచ్చిన మరో కలలో ఒకే ధాన్యపు మొక్కకు ఏడు వెన్నులు పెరగటం నేను చూశాను. ఆ వెన్నులు నిండుగా, చక్కగా, అందంగా ఉన్నాయి.

23 తర్వాత వాటికి యింకా ఏడు వెన్నులు పెరిగాయి. కానీ ఆ వెన్నులు పీలగా, అసహ్యంగా ఉండి, వేడి గాడ్పులకు పాడైపోయాయి.

24 అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేసాయి. మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను ఈ కల చెప్పాను. కానీ ఎవ్వరూ ఆ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?”

25 అప్పుడు ఫరోతో యోసేపు ఇలా చెప్పాడు: “ఈ రెండు కలల భావం ఒక్కటే. ఏమి చేయనున్నాడో అది దేవుడు మీతో చెబతున్నాడు.

26 ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. ఏడు మంచి ధాన్యపు వెన్నులు ఏడు సంవత్సరాలు. రెండు కలల్లోని సంగతి ఒక్కటే.

27 బక్కచిక్కి ఉన్న ఏడు ఆవులు, పీలగా ఉన్న ఏడు ధాన్యపు వెన్నులు కూడ, ఏడు అంటే, అవి ఈ దేశంలో ఏడు ఆకలి సంవత్సరాలు. ఏడు మంచి సంవత్సరాల తర్వాత ఈ ఏడు సంవత్సరాలు వస్తాయి.

28 త్వరలో ఏమి జరుగుతుందో దాన్ని దేవుడు మీకు చూపెట్టాడు. నేను చెప్పినట్టే ఇది జరుగుతుంది.

29 ఈజిప్టు దేశమంతటా ఏడేళ్లపాటు మంచి పంటలు పండి తినటానికి సమృద్ధిగా ఉంటుంది.

30 అయితే ఆ ఏడు సంవత్సరాల తర్వాత, దేశమంతటా కరువు సంవత్సరాలు ఏడు వస్తాయి. ఈజిప్టులో పండిన పంట ఎంత ఉన్నదానిని మరచిపోతారు. ఈ ఆకలి దేశాన్ని నాశనం చేస్తుంది.

31 సమృద్ధగా భోజనం చేయటం అంటే ఏమిటో ప్రజలు మరచిపోతారు.

32 “ఫరోగారూ, ఒకే విషయాన్ని గూర్చి మీకు రెండు కలలు ఎందుకు వచ్చాయి? దేవుడు తప్పక జరిపిస్తాడని చూపించేందుకు ఇలా జరిగింది. అదీ త్వరలోనే దేవుడు జరిగిస్తాడని సూచిస్తోంది.

33 కనుక ఓ ఫరో, చాలా తెలివి, జ్ఞానం ఉన్న ఒక మనిషిని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మనిషిని ఈజిప్టు దేశం అంతటిమీద అధికారిగా మీరు నియమించాలి.

34 ఆ తర్వాత ప్రజల దగ్గర్నుండి ధాన్యం సేకరించేందుకు మరి కొందర్ని మీరు నియమించాలి. ప్రతీ వ్యక్తి ఏడు మంచి సంవత్సరాల్లో పండించే మంచి పంటలో అయిదవ భాగం ఇవ్వాలి.

35 రాబోయే మంచి సంవత్సరాల కాలంలో ఈ ధాన్యం అంతా సేకరించమని ఈ మనుష్యులకు ఆజ్ఞాపించండి. ఈ ధాన్యం పట్టణాల్లో భద్రం చేయటానికి వాళ్లకు అధికారం ఉందని ఈ మనుష్యులకు చెప్పండి. తర్వాత ఆ ధాన్యం అవసరం వచ్చేంతవరకు వారు దాన్ని కాపాడాలి. ఫరో! ఈ విధంగా ఆ ఆహారం మీ అధీనంలో ఉంటుంది.

36 ఈజిప్టు దేశంలో వచ్చే ఏడు ఆకలి సంవత్సరాల్లో ఈ ధాన్యం సహాయపడుతుంది. అప్పుడు ఈజిప్టు ప్రజలు ఆ ఏడు సంవత్సరాల్లో కరువు కారణంగా మరణించరు.”

37 ఇది చాలా చక్కని తలంపులా కనబడింది ఫరోకు. అతని సేవకులంతా ఒప్పుకొన్నారు.

38 “ఈ పని చేసేందుకు యోసేపు కంటే మంచివాడ్ని ఇంకెవరినైనా మీరు కనుగొనగలరా? దేవుని ఆత్మ మూలంగా ఇతడు నిజంగా జ్ఞాని” అని ఫరో తన సేవకులతో చెప్పాడు.

39 కనుక ఫరో, “వీటన్నింటిని దేవుడే నీకు చూపెట్టాడు కనుక నీవు అందరిలో మహా జ్ఞానివై ఉండాలి.

40 అంచేత నిన్నే ఈ దేశం మీద అధిపతిగా నేను చేస్తాను. ప్రజలు నీ ఆజ్ఞలన్నింటికి విధేయులవుతారు. ఈ దేశంలో నేను ఒక్కడ్ని మాత్రమే నీకంటె గొప్ప అధికారిగా ఉంటాను” అని యోసేపుతో చెప్పాడు.

41 (ఫరో యోసేపును రాజ్యపాలకునిగా నియమించినప్పుడు ప్రత్యేక సమావేశం మరియు ఊరేగింపు వుండినవి.) అప్పుడు ఫరో, “ఇప్పుడు ఈజిప్టు దేశం అంతటి మీద నిన్ను నేను పాలకునిగా నియమిస్తున్నాను” అని యోసేపుతో చెప్పాడు.

42 అప్పుడు ఫరో రాజముద్రగల తన ఉంగరాన్ని యోసేపుకు ఇచ్చాడు. యోసేపు ధరించటానికి నాణ్యతగల ఒక అంగీని అతడు ఇచ్చాడు. యోసేపు మెడలో ఒక బంగారు గొలుసు ఫరో వేసాడు.

43 రెండో రాజరథం మీద తిరిగమని ఫరో యోసేపుతో చెప్పాడు. ప్రత్యేక సంరక్షకులు అతని రథానికి ముందర నడిచారు. “ప్రజలారా, యోసేపుకు సాష్టాంగపడండి” అంటూ వాళ్లు ప్రజలను హెచ్చరించారు. కనుక ఈజిప్టు దేశం అంతటి మీద యోసేపు పాలకునిగా నియమించబడ్డాడు.

44 అతనితో ఫరో అన్నాడు: “నేను ఫరోను అంటే రాజును. కనుక నేను ఏమి అయినా చేయాలనుకొంటే అది చేస్తాను. కానీ, ఈజిప్టులో మరి ఏ వ్యక్తి అయినా నీవు చెప్పకుండ ఒక చేయి ఎత్తకూడదు, కాలు కదపగూడదు.”

45 యోసేపుకు జప్నత్సనేహు అనే మరో పేరు ఫరో పెట్టాడు. ఓను యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతును యోసేపుకు భార్యగా ఫరో ఇచ్చాడు. కనుక ఈజిప్టు దేశం అంతటిమీద యోసేపు పాలకుడయ్యాడు.

46 యోసేపు ఈజిప్టు రాజు కొలువులో పని చేయడం మొదలు బెట్టినప్పుడు అతని వయస్సు 30సంవత్సరాలు. యోసేపు ఈజిప్టు దేశం అంతటా సంచారం చేసాడు.

47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి.

48 ఆ ఏడు సంవత్సరాల్లో యోసేపు చాలా ధాన్యం ఈజిప్టులో పొదుపు చేసాడు. ఆహారాన్ని యోసేపు పట్టణాల్లో భద్రపరచాడు. ప్రతి పట్టణం చుట్టు ప్రక్కల పండిన పంటను ఆ పట్టణంలోనే యోసేపు భద్రపరచాడు.

49 యోసేపు విస్తారంగా ధాన్యం చేర్చి పెట్టాడు. సముద్రపు ఇసుకలా ఉంది అదంతాను. కొలిచేందుకు గూడ వీలు లేనంత విస్తారంగా ఉంది అతడు చేర్చిపెట్టిన ధాన్యం.

50 ఓను యాజకుడైన పోతీఫెర కుమార్తె అయిన ఆసెనతు యోసేపుకు భార్య. మొదటి ఆకలి సంవత్సరం రాకముందే యోసేపు ఆసెనెతులకు ఇద్దరు కుమారులు పుట్టారు.

51 మొదటి కుమారుని పేరు మనష్షే. “నా కష్టాలు అన్నింటినీ, నా ఇంటని గూర్చిన విషయాలన్నింటినీ నేను మరచిపోయేటట్టు దేవుడు చేసాడు” అని అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.

52 యోసేపు తన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. “నాకు ఎన్నో గొప్ప కష్టాలు వచ్చాయి, గాని అన్ని విషయాల్లో దేవుడు నాకు సాఫల్యాన్ని కార్యసాధనను కల్గించాడు” అని యోసేపు అనుకొన్నాడు గనుక యోసేపు అతనికి ఈ పేరు పెట్టాడు.

53 ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉంది. కానీ సంవత్సరాలన్నీ ముగిశాయి. అవసరమైనది అంతా పండింది.

54 అయితే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. సరిగ్గా యోసేపు చెప్పినట్టే ఇది జరిగింది. అన్ని దేశాలలో, అంతట ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సరిపడినంత ఉంది.

55 కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు ఈజిప్టు ప్రజలతో.

56 కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరువు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరువు చాలా భయంకరంగా ఉంది.

57 ఈజిప్టు చుట్టుపక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టు వచ్చారు. కరువు ఈజిప్టులోను, మరి యితర ప్రాంతాలలోను ఎక్కువగా ఉంది. ఈజిప్టు చుట్టుపక్కల దేశాలవారు యోసేపు దగ్గరకు వచ్చారు.

42

1 ఈ సమయంలో కనాను దేశంలోను కరువు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్టు యాకోబు తెలుసుకొన్నాడు: కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు. “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం?

2 ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్టు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బతుకుతాం.”

3 కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టు వెళ్లారు.

4 బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.

5 కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.

6 ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు.

7 యోసేపు తన సోదరులను చూసాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు. ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.

8 ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు.

9 అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు. యోసేపు తన అన్నలను గూఢచారులు అన్నాడు యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.

10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేం వచ్చాం.

11 మేమంతా అన్నదమ్మలం మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేం వచ్చాం” అని అతనితో చెప్పారు.

12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేం బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.

13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేం సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”

14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్టు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు.

15 అయితే మీరు సత్యమే చెబతున్నట్టు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలి పెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబతున్నాను మిమ్మల్ని వదలిపెట్టనని.

16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలిన వారు ఇక్కడే జైల్లో ఉండాలి. మీరు సత్యం చెబతున్నారో లేదో మేం చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.”

17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజుల పాటు చెరసాలలో పెట్టాడు.

18 మూడు రోజుల తర్వాత వారితో యోసేపు ఇలా అన్నాడు, “నేను దేవునికి భయపడేవాణ్ణి. అంచేత మీరు సత్యమే చెబతున్నారని రుజువు చేసేందుకు మీకు ఒక అవకాశం ఇస్తాను. ఇలా మీరు చేస్తే నేను మిమ్మల్ని బతకనిస్తాను.

19 మీరు నమ్మకమైన మనుష్యులైతే, మీ సోదరులలో ఒకరు ఇక్కడ జైల్లో ఉండాలి. మిగిలినవారు మీ వాళ్లకోసం ధాన్యం తీసుకొని వెళ్లవచ్చు.

20 అప్పుడు మీ చిన్న తమ్ముడ్ని ఇక్కడికి తీసుకొని రండి. ఈ విధంగా, మీరు సత్యం చెబతున్నారేమో నేను తెలుసుకొంటాను.” ఆ సోదరులు దీనకి ఒప్పుకొన్నారు.

21 మన చిన్న తమ్ముడికి మనం చేసిన కీడు మూలంగా శిక్ష అనుభవిస్తున్నాం. అతడు కష్టంతో ఉండటం మనం కళ్లారా చూశాం. రక్షించమని అతడు మనల్ని బతిమలాడాడు. కానీ వినటానికి గూడ మనం నిరాకరించాం. అందుకే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం” అని వాళ్లలో వారు చెప్పుకొన్నారు.

22 అప్పుడు రూబేను, “ఆ పిల్లవానికి మీరేమి కీడు చేయకండి అని నేను మీతో చెప్పాను కాని మీరు నా మాట వినకపోయారు. కనుక అతని మరణం మూలంగానే ఇప్పుడు మనం శిక్ష పొందుతున్నాం,” అని వాళ్లతో చెప్పాడు.

23 యోసేపు తన సోదరులతో మాట్లాడేందుకు ఒక అనువాదకుడ్ని వాడుకొన్నాడు. అందుచేత వారి భాష యోసేపు గ్రహించినట్లు ఆ సోదరులకు తెలియదు. కానీ వారు చెప్పిన ప్రతి మాటా యోసేపు విని, గ్రహించాడు.

24 వారి మాటలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి. అందుచేత యోసేపు వాళ్లను విడిచి వెళ్లి ఏడ్చేసాడు. కొంచెం సేపయ్యాక యోసేపు మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లాడు. అతడు ఆ సోదరులలో ఒకడైన షిమ్యోనును పట్టుకొని మిగిలిన సోదరులు చూస్తుండగానే కట్టివేసాడు.

25 వారి సంచులను ధాన్యంతో నింపమని కొందరు సేవకులతో యోసేపు చెప్పాడు. ఈ ధాన్యం కోసం ఆ సోదరులు యోసేపుకు సొమ్ము చెల్లించారు. కానీ యోసేపు ఆ డబ్బు ఉంచుకోలేదు. ఆ డబ్బును తిరిగి వారి సంచుల్లోనే పెట్టేసాడు యోసేపు. అప్పుడు వారి ప్రయాణానికి అవసరమైన వాటన్నింటిని యోసేపు వారికి ఇచ్చాడు.

26 కనుక ఆ సోదరులు ఆ ధాన్యం గాడిదలమీద వేసుకొని వెళ్లిపోయారు.

27 ఆ సోదరులు ఆ రాత్రి ఒకచోట బస చేసారు. ఆ సోదరులలో ఒకడు కొంచెం ధాన్యం తన గాడిద కోసమని తన సంచి తెరిచాడు. అతని డబ్బు అతని సంచిలోనే కనబడింది.

28 అతడు, “చూడండి, ధాన్యంకోసం నేను చెల్లించిన డబ్బు ఇదిగో. ఈ డబ్బును ఎవరో మళ్లీ నా సంచిలో పెట్టేసారు” అని మిగతా సోదరులతో చెప్పాడు. ఆ సోదరులకు చాలా భయం వేసింది, “దేవుడు మనకు ఏం చేస్తున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

29 ఈ సోదరులు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయాలన్నీ యాకోబుతో చెప్పారు.

30 వాళ్లు ఇలా చెప్పారు: “ఆ దేశ పాలకుడు మాతో కఠినంగా మాట్లాడాడు. మేము అక్కడి ప్రజల్ని నాశనం చేయాలనుకొనే గూఢచారులమని అనుకొన్నాడు అతడు.

31 కానీ మేము నిజాయితీపరలం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం.

32 మేము పన్నెండుమంది సోదరులం అని చెప్పాం. కనానులో ఇంటి దగ్గర మా తండ్రితో మా చిన్న తమ్ముడు ఒకడు ఉన్నాడని మరియు మా మరియొక చిన్న తమ్ముడు ఒకడు చనిపోయాడని మేము అతనితో చెప్పాం.

33 “అప్పుడు, ఆ దేశపాలకుడు మాతో ఇలా అన్నాడు: “మీరు నమ్మకమైన వాళ్లని రుజువు చేయటానికి ఇదొక మార్గం. మీ సోదరులలో ఒకడ్ని నా దగ్గర ఉంచండి. మీ ధాన్యం మీ కుటుంబాలకు తీసుకొని వెళ్లండి.

34 తర్వాత మీ కనిష్ఠ సోదరుడ్ని నా దగ్గరకు తీసుకొని రండి. అప్పుడు నిజంగా మీరు నిజాయితీపరులో, లేక మమ్మల్ని నాశనం చేసేందుకు పంపబడిన గూఢచారులో నాకు తెలుస్తుంది. మీరు చెప్పేది నిజమైతే మీ సోదరుడ్ని మళ్లీ మీకు అప్పగిస్తాను. అతణ్ణి మీకు అప్పగిస్తాను, మా దేశంలో మీరు స్వేచ్ఛగా ధాన్యం కొనుక్కోవచ్చు.”

35 అప్పుడు ఆ సోదరులు వారి సంచుల్లో నుండి ధాన్యం తీయటానికి వెళ్లగా వారిలో ప్రతి సోదరునికి తన ధాన్యపు సంచిలో తన డబ్బు సంచి కనిపించింది. ఆ సోదరులు, వారి తండ్రి కూడ ఆ డబ్బును చూచి చాలా భయపడిపోయారు.

36 యాకోబు, “నేను నా పిల్లలందర్నీ పోగొట్టకోవాలని మీరు అనుకొంటున్నారా? యోసేపు పోయాడు. షిమ్యోను పోయాడు. ఇప్పుడు బెన్యామీనును గూడ మీరు తీసుకొని పోవాలనుకొంటున్నారు” అని వాళ్లతో అన్నాడు,

37 అప్పుడు రూబేను, “నాయనా, బెన్యామీనును గనుక నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపేసేయ్. నన్ను నమ్ము. బెన్యామీనును నేను మళ్లీ నీ దగ్గరకు తీసుకొని వస్తాను” అని తన తండ్రితో చెప్పాడు.

38 అయితే యాకోబు చెప్పాడు: “బెన్యామీనును మీతో నేను వెళ్లనివ్వను. అతని సోదరుడు మరణించాడు, నా భార్య రాహేలు కుమారులలో ఇతను ఒక్కడే మిగిలాడు. ఈజిప్టు ప్రయాణంలో ఇతనికి ఏమైనా సంభవిస్తే నేను చచ్చిపోతాను. నా వృద్ధాప్యంలో దుఃఖంతోనే మీరు నన్ను సమాధికి పంపిస్తారు.”

43

1 దేశంలో కరువు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం లేదు.

2 ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ ఈజిప్టు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి” అని యాకోబు తన కుమారులతో చెప్పాడు.

3 అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను.

4 బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం.

5 కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేం వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.”

6 “మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేసారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు.

7 ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!”

8 అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము మాత్రం ఈజిప్టు వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్లకపోతే మనమూ, మన పిల్లలు అందరం చస్తాం.

9 అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని భాద్యత నాది. అతణ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు.

10 నీవు మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్లి వచ్చే వాళ్లం.”

11 అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతే తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచె మస్తకి, కొంచెం తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి.

12 ఈ సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో.

13 బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు.

14 మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.”

15 కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలసి ఈజిప్టు వెళ్లాడు.

16 ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చాశాడు. యోసేపు “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు.

17 అతను చెప్పినట్టే ఆ సేవకుడు చేసాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు.

18 వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడ్డందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు.

19 కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైన వాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు.

20 వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేం వచ్చాం.

21 [This verse may not be a part of this translation]

22 [This verse may not be a part of this translation]

23 అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయిన సారి మీరు ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్టు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు. ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు.

24 ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు.

25 ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్టు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు.

26 యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు.

27 వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు.

28 ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు.

29 అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపులు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ కనిష్ఠ సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో.

30 అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పెరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు.

31 తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు.

32 ఆ సేవకులు యోసేపు ఒక్కడికి ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం.

33 యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులు జ్యేష్ఠనితో మొదలుబెట్టి కనుష్ఠుని వరకు వరసక్రమంలో కూర్చున్నారు. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్టు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు.

34 సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని తాగారు.

44

1 అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ మనుష్యులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు.

2 అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రనుకూడ అతని సంచిలో పెట్టు.” ఆ సేవకుడు యోసేపు చెప్పినట్టు చేసాడు.

3 మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతోబాటు వారి దేశం పంపించబడ్డారు.

4 వారు పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన సేవకులతో చెప్పాడు: “నీవు వెళ్లి ఆ మనుష్యుల్ని వెంబడించు. వాళ్లను ఆపుజేసి మేము మీతో మంచిగా ఉన్నాం. అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగిలించారు?

5 ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర. రహస్య విషయాలను తెలుసుకొనేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను దొంగిలించి మీరు తప్పు చేసారు, అని వాళ్లతో చెప్పు.”

6 అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు.

7 అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? అలాంటిదేమీ మేము చేయము.

8 ఇంతకు ముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేం తెచ్చి ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటినుండి వెండి బంగారం ఏవీ మేము నిజంగా దొంగిలించం.

9 మాలో ఎవరి సంచిలోనైనా సరె ఆ వెండి పాత్ర నీకు కనబడితే, వాడు చావాల్సిందే. అతణ్ణి నీవు చంపేయి, మేము మీకు బానిసలమవుతాం.”

10 “మీరు చెప్పినట్టే చేద్దాం. కాని నేను మాత్రం ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చు” అన్నాడు ఆ సేవకుడు.

11 అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు.

12 సేవకుడు సంచుల్లో చూశాడు. అతడు జ్యేష్ఠునితో మొదలు బెట్టి కనిష్ఠునితో ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది.

13 సోదరులకు దుఃఖం వచ్చేసింది. దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకొన్నారు. వారు వారి సంచుల్ని మళ్లీ గాడిదలమీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు.

14 యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరులంతా నేలమీద సాష్టాంగపడ్డారు.

15 యోసేపు “మీరెందుకు ఇలా చేసారు? రహస్యాలు తెలుసుకొనే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? ఈ పని నాకంటె బాగగా ఇంకెవ్వరూ చేయలేరు” అన్నాడు.

16 యూదా, “అయ్యా, మేం ఇంకేమీ చెప్పలేం. వివరించే దారి యింకొకటి లేదు. మేం నేరస్థులం కాదని చూపించే విధం ఇంకొకటి లేదు. మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్థులుగా తీర్పు తీర్చాడు. కనుక మేము అందరం చివరకు బెన్యామీనుతో కూడ బానిసలవుతాం” అన్నాడు.

17 కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు.

18 అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు.

19 క్రితంసారి మేము ఇక్కడు ఉన్నప్పుడు ‘మీకు తండ్రిగాని సోదరుడు గాని ఉన్నాడా?’ అని తమరు అడిగారు.

20 దానికి మేము జవాబు చెప్పాం, మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా ఆ చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతే ప్రేమ.

21 అప్పుడు ‘ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, నేను అతడ్ని చూడాలి’ అన్నారు తమరు.

22 దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని తన తండ్రిని విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనక పోగొట్టుకొంటే, అతని తండ్రి దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం.

23 కానీ తమరేమో ‘మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు’ అన్నారు మాతో.

24 కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం.

25 “తర్వాత మా తండ్రి ‘మీరు మళ్లీ వెళ్లి మనకోసం ధాన్యం కొనండి’ అన్నాడు.

26 మేము మా తండ్రితో ‘మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడు’ అని చెప్పాం.

27 అప్పుడు మా తండ్రి మాతో అన్నాడు ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది.

28 ఒక కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతణ్ణి అడవి మృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతణ్ణి చూడలేదు.

29 రెండో కుమారునిగూడా మీరు నా దగ్గర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే!’

30 కనుక ఇప్పుడు మేము మా కనిష్ఠ సోదరుడు మాతో లేకుండా మేము ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం.

31 ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహాగొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్టు చెసిన వాళ్లమవుతాం.

32 “ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను.

33 కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను.

34 ఈ పిల్లవాడు నాతో లేకపోతే నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.”

45

1 యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేసాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేసాడు.

2 యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు.

3 యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరులు నోటమాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.

4 కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే.

5 ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్ని బట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను.

6 భయంకరమైన ఈ కరువు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి.

7 కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని చెప్పి దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు.

8 నేను యిక్కడికి పంపబడటం మీ తప్పకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేసాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికి నేను పాలకుడ్ని.”

9 “కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి” అన్నాడు యోసేపు. దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేసాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు ఇప్పుడే వచ్చేయండి.

10 గోషను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను.

11 వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.”

12 యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపు అని చూడగలుగుతున్నారు. అన్నాడు అతడు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి.

13 కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.”

14 అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు.

15 తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.

16 యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, ఆతని సేవకులు చాలా సంతోషించారు.

17 కనుక యోసేపుతో ఫరో అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు.

18 నీ తండ్రిని, వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో శ్రేష్ఠమైన భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఉన్న శ్రేష్ఠ ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.”

19 తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను వెళ్లి, మీ తండ్రిని, స్త్రీలందరిని, పిల్లలను ఆ బండ్లమీద తీసుకొని రమ్మని వారితో చెప్పు.

20 వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.”

21 కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేసారు. ఫరో వాగ్ధానం చేసినట్టే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు.

22 ఒక్కో సోదరునికి ఒక్కో జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే బెన్యామీనుకు అయిదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు. మరియు 300 వెండి నాణాలు కూడ యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు.

23 యోసేపు తన తండ్రికి కానుకలుకూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడీదల మీద అతడు పంపించాడు.

24 అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. దారిలో పోట్లాడకండి” అని వారితో చెప్పాడు.

25 కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు.

26 ఆసోదరులు “నాయనా, యోసేపు బతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు.

27 అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత అతనిని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు.

28 “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.

46

1 కనుక ఇశ్రాయేలు ఈజిప్టుకు తన ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట ఇశ్రాయేలు బెయేర్షెబాకు వెళ్లాడు. అక్కడ తన తండ్రియైన ఇస్సాకు దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధించాడు. అతడు బలులు అర్పించాడు.

2 ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు దేవుడు. “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు ఇచ్చాడు.

3 అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను.

4 నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. నీవు ఈజిప్టులో మరిణిస్తావు, కాని యోసేపు నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత చేతులే నీ కళ్లను మూస్తాయి.”

5 అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈజిప్టుకు ప్రయాణం చేసాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలందరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేసారు.

6 తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్లాడు.

7 అతని కుమారులు అతని మనుమళ్లు, అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు.

8 ఇశ్రాయేలుతో కలిసి ఈజిప్టు వెళ్లిన అతని కుమారులు, కుటుంబము వాళ్ల పేర్లు: రూబేను యాకోబయొక్క మొదటి కుమారుడు.

9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

10 షిమ్యోను కుమారులు; యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీ స్త్రీ కుమారుడు షావూలు.

11 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారీ.

12 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను కనానులో ఉన్నప్పుడే చనిపోయారు) పెరెసు కుమారులు : హెస్రోను, హామూలు,

13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్యా, యోబు, షిమ్రోను.

14 జెబలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు

15 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూనులు, యాకోబు భార్య లేయా ద్వారా అతని కుమారులు. లేయా ఆ కుమారులను పద్దనరాములో కన్నది. ఆమె కుమార్తె దీనా కూడ ఉంది. ఈ కుటుంబంలో 33 మంది ఉన్నారు.

16 గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోదీ, అరేలీ,

17 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, వారి సోదరి శెరహు, హెబెరు, మల్కీయేలు,

18 బెరీయా కుమారులు: వారంతా యాకోబుకు అతని భార్య సేవకురాలు జిల్ఫాద్వారా పుట్టిన కుమారులు. ఈ కుటుంబంలో 16 మంది ఉన్నారు.

19 మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. (యోసేపు కూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.)

20 ఈజిప్టులో యోసేపుకు ఇద్దరు కుమారులు: మనష్షే, ఎఫ్రాయిము. (ఓను పట్టణ యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతు యోసేపు భార్య).

21 బెన్యామీను కుమారులు, బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.

22 వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు.

23 దాను కుమారుడు: హుషీము

24 నఫ్తాలి కుమారులు: యహసేలు, గూనీ, యోసేరు, షల్లేము

25 వారు యాకోబు, బిల్హాలకు పుట్టిన కుమారులు (రాహేలు సేవకురాలు బిల్హా). ఈ కుటుంబంలో ఏడుగురు ఉన్నారు.

26 ఇలా యాకోబు సంతానం ఈజిప్టు వెళ్లారు. యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు).

27 మరియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు.

28 యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషేను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు.

29 యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషేనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు.

30 అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను,” అన యోసేపుతో చెప్పాడు.

31 తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్టు ఫరోతో చెబతాను. ఫరోతో నేను ఏమని చెబతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు.

32 ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’

33 ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు.

34 అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషేను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషేను దేశంలో ఉండవచ్చు.”

47

1 యోసేపు ఫరో దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు.

2 యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు.

3 “మీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను అడిగాడు. ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొర్రెల కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే” అని చెప్పారు.

4 “కనాను దేశంలో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు అవరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందుచేత ఈ దేశంలో బతుకుదామని మేము ఇక్కడికి వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” అని వారు ఫరోతో చెప్పారు.

5 అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు.

6 వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారికోసం కోరుకోవచ్చు. నీ తండ్రికి, నీ సోదరులకు శ్రేష్ఠమైన భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులకను కూడ చూసుకోవచ్చు.”

7 అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ఎదుటికి తీసుకొని వచ్చాడు. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు.

8 అప్పుడు ఫరో “నీ వయస్సెంత?” అని యాకోబును అడిగాడు.

9 “నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బతికాను. 130సంవత్సరాలే నేను బతికాను. నా తండ్రి, ఆయన పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బతికారు” అని ఫరోతో యాకోబు చెప్పాడు.

10 యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు.

11 యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు. అతడు తన తండ్రికి, తన సోదరులకు ఈజిప్టలో మంచి భూమిని సమీపంగా ఇచ్చాడు. ఈజిప్టులో రామసేసు నగరానికి దగ్గరలోవున్న ఈ భూమి అతి శ్రేష్ఠమైంది.

12 మరియు తన తండ్రికి, సోదరులకు, వారి మనుష్యులందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి ఇచ్చాడు.

13 కరువు కాలం మరీ తీవ్రం అయింది. దేశంలో ఎక్కడా ఆహారం లేదు. ఈ కష్టకాలం మూలంగా ఈజిప్టు, కనాను దరిద్రంగా తయారయ్యాయి.

14 ఆ దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు. యోసేపు ఆ ధనం ఆదా చేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు.

15 కొన్నాళ్లకు ఈజిప్టులోను కనానులోను ప్రజల దగ్గర పైకం అయిపోయింది. ధాన్యం కొనేందుకే వారి డబ్బు అంతా ఖర్చు పెట్టారు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి, “దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి. మా డబ్బు అయిపోయింది. మేము భోజనం చేయకపోతే మీరు చూస్తుండగానే మేము మరణిస్తాం” అని చెప్పారు.

16 “మీ పశువుల్ని ఇవ్వండి, నేను మీకు ఆహారం ఇస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు.

17 కనుక ప్రజలు ఆహారం కొనేందుకు వారి పశువులను, గుర్రాలను, మిగిలిన జంతువులన్నిటిని ఉపయోగించారు. ఆ సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి, వారి పశువులను తీసుకున్నాడు.

18 అయితే ఆ తర్వాత సంవత్సరం ప్రజల దగ్గర జంతువులు లేవు, ఆహారం కొనేందుకు ఉపయోగించటానికి ఏమీ లేవు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి “మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు. మా పశువులన్నీ మీవే ఇప్పుడు. మా దగ్గర నీవు చూస్తున్న మా శరీరాలు, మా భూమి తప్ప ఇంకేమి లేవు.

19 మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చనిపోతాం. కానీ, మీరు మాకు ఆహారం ఇస్తే, మేము మా భూమిని ఫరోకు ఇస్తాం, మేము ఆయన బానిసలంగా ఉంటాము. మేము నాట్లు వేయటానికి మాకు విత్తనాలు ఇవ్వండి. అప్పుడు మేము చావక బతుకుతాం. భూమి మా కోసం మరోసారి పంటను ఇస్తుంది” అని చెప్పారు.

20 కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ ఫరోకోసం కొన్నాడు. ఈజిప్టులోని ప్రజలంతా వారి భూములను యోసేపుకు అమ్మివేసారు. వారు చాలా కరువుతో ఉన్నందుచేత ఇలా చేసారు.

21 మరియు ప్రజలందకు ఫరోకు బానిసలయ్యారు. ఈజిప్టు అంతటిలో ప్రజలు ఫరోకు బానిసలు.

22 యాజకుల స్వంత భూములను మాత్రమే యోసేపు కొనలేదు. యాజకుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనుక వారు వారి భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించుకొనేవారు.

23 యోసేపు ప్రజలతో చెప్పాడు, “ఇప్పుడు మిమ్మల్ని, మీ భూముల్ని ఫరోకోసం నేను కొన్నాను. కనుక నేను విత్తనాలు ఇస్తాను, మీరు మీ భూముల్లో నాట్లు వేయవచ్చును.

24 కోతకాలంలో మీ పంటలో అయిదింట ఒక వంతు ఫరోకు ఇవ్వాలి. అయిదింట నాలుగు వంతులు మీకోసం మీరు ఉంచుకోవచ్చు. మీరు ఉంచుకొనే గింజలను మీ ఆహారం కోసమూ, వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలను, పిల్లలను పోషించుకోవచ్చు.”

25 ప్రజలు, “మీరు మా ప్రాణాలు రక్షించారు. మేము సంతోషంగా మీకు, ఫరోకు బానసలంగా ఉంటాం” అన్నారు.

26 కనుక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో చట్టం చేసాడు. ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది. భూమిలోనుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ అయిదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది ఆ చట్టం. భూములన్నీ ఫరో స్వంతం. యాజకుల భూమి మాత్రమే ఫరో స్వంతం కాలేదు.

27 ఇశ్రాయేలు (యాకోబు) ఈజిప్టులో ఉన్నాడు. గోషెను దేశంలో నివసించాడు. అతని కుటుంబం పెరిగి చాలా పెద్దది అయింది. ఈజిప్టులో వారు ఆ భూమిని సంపాదించి వర్ధిల్లారు.

28 యాకోబు ఈజిప్టులో 17 సంవత్సరాలు జీవించాడు. కనుక యాకోబు వయస్సు 147 సంవత్సరాలు.

29 తాను త్వరలో చనిపోతానని తెలిసి, ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారుడు యోసేపును తన దగ్గరకు పిల్చాడు. “నీవు నన్ను ప్రేమిస్తే, నీ చేయి నా తొడకింద పెట్టి ప్రమాణం చేయి. నేను చెప్పినట్లు నీవు చేస్తానని, నాకు నీవు నమ్మకంగా ఉంటావని వాగ్దానం చేయి. నేను మరిణించినప్పుడు నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు.

30 నా పూర్వీకులు పాతి పెట్టబడిన చోట నన్ను పాతిపెట్టు. ఈజిప్టు నుండి నన్ను తీసుకొనిపోయి, మన కుటుంబ సమాధుల స్థలంలో నన్ను పాతిపెట్టు” అన్నాడు. “నీవు చెప్పినట్టు చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నా” అని యోసేపు జవాబిచ్చాడు.

31 అప్పుడు యాకోబు, “నాకు ప్రమాణం చేయి” అన్నాడు. అందుకు యోసేపు అలా చేస్తానని ప్రమాణం చేసాడు. అంతట ఇశ్రాయేలు పడక మీద తన తల వెనుకకు వాల్చాడు.

48

1 కొంత కాలం తర్వాత, తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలిసింది. కనుక మనష్షే, ఎఫ్రాయిము అనే తన యిద్దరు కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.

2 యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడకమీద కూర్చున్నాడు.

3 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, “కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు.”

4 దేవుడు నాతో చెప్పాడు: “నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటారు.”

5 ఇప్పుడు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. ఎఫ్రాయిము, మనష్షే అనే నీ యిద్దరు కుమారులు నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యోనులు నాకెలాగో వారూకూడ నాకు అంతే.

6 కనుక ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి గూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు.

7 పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేసాను.” (ఎఫ్రాతా బెత్లెహేము)

8 అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.

9 యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు. “నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.

10 ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు.

11 అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో.

12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.

13 ఎఫ్రాయిమును అతని కుడి ప్రక్కను, మనష్షేను అతని ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు).

14 కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు.

15 మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు: “నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు. ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు.

16 అయితే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత. ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి. వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”

17 తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం గలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిం తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు.

18 యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు.

19 అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా. మనష్షే జ్యేష్ఠుడు అతడు గొప్ప వాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్ప వాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.”

20 అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు. “ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు నీ నామాన్ని ఉపయోగిస్తారు.” ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు “దేవుడు ఎఫ్రాయిము మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు” అని అతడు చెప్పాడు. ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు.

21 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు.

22 నీ సోదరలకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”

49

1 అప్పుడు యాకోబు తన కుమారులందరినీ తన దగ్గరకు పిలిచాడు. అతడు చెప్పాడు: “నా కుమారులందరూ ఇక్కడ నా దగ్గరకు రండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను మీకు చెబతాను.”

2 “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి.”

3 “రూబేనూ, నీవు మొట్టమొదటి కుమారుడవు. పురుషునిగా నా శక్తికి మొదటి ఋజువు నీవే. నా కుమారులందరిలోను గౌరవించదగిన మహా బలశాలివి నీవు. నీవు నా ప్రథమ సంతానం. నా కుమారులందరిలో నీవు మహా బలవంతుడవు, అతిశయాస్పదమైన వాడవు.

4 కానీ నీవు ఉద్రేకంతో అదుపుదప్పిన ప్రవాహం వలే ఉన్నావు. కాబట్టి నీవు ఎక్కువ గౌరవించదగిన కుమారుడవు కావు నీ తండ్రికి చెందిన స్త్రీతో నీవు శయనించావు నీ తండ్రి పడకను నీవు ఎక్కావు. నీవు నా పడకకు అవమానం తెచ్చావు”

5 “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి.

6 రహస్యమందు వారు చెడు కార్యాలను తలస్తారు. వారి పథకాలలో నా ఆత్మ భాగాన్ని కోరటం లేదు, వారి రహస్య సమావేశాలను నేను అంగీకరించను, వారు వారి పగవారిని కోపంతో చంపారు వారు కేవలం సరదాలకు పశువులకు హాని చేసారు.

7 వారి కోపం శాపం అది చాల బలీయమయింది. వారికి కోపం వచ్చినప్పుడు వారు చాలా క్రూరులు యాకోబు దేశంలో వారి వంశాలకు వారి స్వంత భూమి వారికి ఉండదు ఇశ్రాయేలు అంతటిలో వారు చెదరి ఉంటారు.”

8 “యూదా, నీ సోదరులు నిన్ను పొగడుదురు. నీవు నీ శత్రువులను ఓడిస్తావు. నీ సోదరులు నీకు సాగిలపడ్తారు.

9 యూదా సింహంలాంటివాడు. కుమారుడా, తాను చంపిన జంతువు దగ్గర నిలిచిన సింహం వంటి వాడవు నీవు. యూదా సింహంవంటి వాడు. అతడు విశ్రాంతికోసం పండుకొంటాడు. అతణ్ణి లేపుటకు ఎవరూ సాహసించరు.

10 యూదా వంశపు పురుషులు రాజులుగా ఉంటారు. అతని కుటుంబం పరిపాలిస్తుంది, అనే సూచన అసలైన రాజు వచ్చేంతవరకు అతని కుటుంబాన్ని విడువదు. అప్పుడు అనేక మంది అతనికి విధేయులై అతణ్ణి సేవిస్తారు.

11 అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.

12 ద్రాక్షారసం తాగి అతని కళ్లు ఎరుపెక్కి ఉంటాయి. పాలు తాగి అతని పళ్లు తెల్లగా ఉంటాయి.’

13 “జెబూలూను సముద్రానికి సమీపంగా జీవిస్తాడు. అతని తీరం ఓడలకు క్షేమ స్థలంగా ఉంటుంది. అతని భూమి సీదోను వరకు విస్తరిస్తుంది.”

14 “ఇశ్శాఖారు చాలా ప్రయాసపడిన గాడిదల వలె ఉంటాడు భారమైన బరువు మోసినందుచేత అతడు పండుకొని ఉంటాడు.

15 అతడు తన విశ్రాంతి స్థలం మంచిదిగా ఉండేటట్టు చూసుకొంటాడు తన భూమి రమ్యమైనదిగా ఉండేటట్టు అతడు చూసుకొంటాడు. తర్వాత అతడు బరువులు మోయుటకు ఒప్పుకొంటాడు. బానిసగా పని చేసేందుకు అతడు ఒప్పుకొంటాడు.”

16 “ఇతర ఇశ్రాయేలు వంశస్థుల్లాగే దాను తన ప్రజలకు తర్పు తీరుస్తాడు.

17 దారి ప్రక్కన ఉండే పామువలె దాను ఉండునుగాక త్రోవ దగ్గర పొంచి ఉండే కట్లపామువలె అతడు ఉండుగాక. ఆ పాము గుర్రపు మడిమెను కాటు వేస్తుంది. ఆ గుర్రంమీద స్వారీ చేసే మనిషి గుర్రం మీదనుండి పడిపోతాడు.”

18 “యెహోవా, నీ రక్షణకోసం నేను కనిపెట్టకొని ఉన్నాను”

19 “దొంగల గుంపు గాదు మీద పడ్తారు. కానీ గాదు వారిని తరిమివేస్తాడు.

20 “ఆషేరు భూమి మంచి ఆహారాన్ని సమృధ్ధిగా పండిస్తుంది ఒక రాజుకు సరిపోయేలాంటి భోజనం అతనికి ఉంటుంది”

21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు. నఫ్తాలి దాటి అందమైన పిల్లల్లా అతని మాటలు ఉంటాయి.”

22 “యోసేపు చాలా విజయశాలి నీళ్ల ఊట దగ్గర ఎదిగే ద్రాక్షావల్లిలా కంచెమీద అల్లుకొనే ద్రాక్షా తీగెలా అతడు ఫలిస్తాడు

23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు.

24 అయితే తన మహత్తర విల్లుతోను, నైపుణ్యంగల తన చేతులతోను పోరాటం గెల్చాడు అతడు తన శక్తిని యాకోబు యొక్క శక్తిమంతుని నుండి గొర్రెల కాపరినుండి ఇశ్రాయేలు బండనుండి

25 నీ తండ్రి దేవునినుండి పొందుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సర్వశక్తిమంతుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! పైన ఆకాశంనుండి ఆశార్వాదములను, అగాధ స్థలముల నుండి ఆశీర్వాదములను ఆయన నీకు అనుగ్రహించుగాక స్తనముల దీవెనలు గర్భపు దీవెనలు ఆయన నీకు ఇచ్చుగాక.

26 నా తల్లిదండ్రులకు ఎన్నెన్నో మేళ్లు జరిగాయి. మరియు నీ తండ్రినైన నేను అంతకంటె ఎక్కువగ ఆశీర్వదించబడ్డాను నీ సోదరులు నీకు ఏమీ లేకుండా నిన్ను విడిచిపెట్టి వేసేందుకు ప్రయత్నించారు అయితే ఇప్పుడు నా ఆశీర్వాదములన్నీ కొండంత ఎత్తుగా నీమీద క్రుమ్మరించబడతాయి.”

27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు ఉదయాన అతడు చంపుకొని తింటాడు మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”

28 అవి ఇశ్రాయేలు పండ్రెండు కుటుంబాలు. మరియు వారి తండ్రి వారితో చెప్పిన విషయాలు అవి. వారిలో ప్రతి కుమారునికి తగిన ఆశీర్వాదం అతడు వారికి ఇచ్చాడు.

29 తర్వాత ఇశ్రాయేలు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అతడు ఇలా చెప్పాడు, “నేను మరణించినప్పుడు నా ప్రజలతో ఉండాలని నేను కోరుచున్నాను. హిత్తీయుడగు ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకులతో బాటు పాతిపెట్టబడాలని కోరుతున్నాను.

30 ఆ గుహ మమ్రే దగ్గర మక్ఫేలా పొలంలో ఉంది. అది కనాను దేశంలో ఉంది. అబ్రాహాము తనను పాతిపెట్టేందుకు స్థలం ఉండాలని ఎఫ్రోను దగ్గర ఆ భూమి కొన్నాడు.

31 అబ్రాహాము, అతని భార్య శారా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. ఇస్సాకు, అతని భార్య రిబ్కా ఆ గుహలోనే పాతిపెట్టబడ్డారు. నా భార్య లేయాను నేను ఆ గుహలోనే పాతిపెట్టాను.

32 హిత్తీ మనుష్యుల దగ్గర కొన్న పొలంలో ఉంది ఆ గుహ.”

33 యాకోబు తన కుమారులతో మాట్లాడటం ముగించిన తర్వాత అతడు పండుకొని, పడకమీద తన కాళ్లు చాపుకొని మరణించాడు.

50

1 ఇశ్రాయేలు మరణించినప్పుడు యోసేపు చాలా విచారించాడు. అతడు తన తండ్రిని కౌగలించుకొని, అతని మీద పడి ఏడ్చి, అతనిని ముద్దు పెట్టుకొన్నాడు.

2 తన తండ్రి దేహమును సిద్ధం చేయుమని అతడు తన సేవకులకు ఆజ్ఞాపించాడు (ఆ సేవకులు వైద్యులు). యాకోబు శరీరాన్ని సమాధి చేసేందుకు వైద్యులు సిద్ధం చేసారు. ఈజిప్టువారి ప్రత్యేక పద్ధతిలో ఆ శరీరాన్ని వారు సిద్ధం చేసారు.

3 ఈజిప్టు వారు ఈ పద్ధతిలో శరీరాన్ని సిద్ధం చేయాలంటే, ఆ శరీరాన్ని సమాధి చేసేందుకు ముందు 40 రోజులు వారికి అవసరం. తర్వాత ఈజిప్టువాళ్లు యాకోబు కోసం దుఃఖించటానికి ప్రత్యేక సమయం తీసుకొన్నారు. ఆ సమయం 70 రోజులు.

4 డెబ్భైరోజుల తర్వాత దఃఖసమయం ముగిసింది. కనుక ఫరో అధికారలతో యోసేపు మాట్లాడాడు. “దయచేసి ఫరోతో ఇది చెప్పండి

5 నా తండ్రి మరణ ఘడియల్లో నేను ఆయనకు ఒక వాగ్దానం చేసాను. కనాను దేశంలోని ఒక గుహలో నేను ఆయనను సమాధి చేస్తానని నేను వాగ్దానం చేసాను. ఇది ఆయన తనకోసం సిద్ధం చేసుకొన్న గుహ. కనుక దయచేసి వెళ్లి, నా తండ్రిని సమాధి చేసుకోనివ్వండి. అప్పుడు నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను” అన్నాడు యోసేపు.

6 “నీ మాట నిలబెట్టకో, వెళ్లి నీ తండ్రిని సమాధి చేయి” అని ఫరో జవాబిచ్చాడు.

7 కనుక యోసేపు తన తండ్రిని సమాధి చేసేందుకు వెళ్లాడు. ఫరో అధికారులంతా ఫరో పెద్దలు (నాయకులు) యోసేపుతో కూడ వెళ్లారు. ఫరో నాయకులు, ఈజిప్టులోని పెద్దలందరూ యోసేపుతో వెళ్లారు.

8 యోసేపు కుటుంబంలోని వాళ్లందరూ, అతనితో వెళ్లారు. మరియు తన తండ్రి కుటుంబం అంతా యోసేపుతో వెళ్లారు. పిల్లలు, పశువులు మాత్రమే గోషెను దేశంలో విడువబడటం జరిగింది

9 యోసేపుతో వెళ్లటానికి అందరూ రథాలమీద, గుర్రాలమీద వెళ్లారు. అది చాలా పెద్ద గుంపు అయింది.

10 యోర్దాను నదికి తూర్పున గోరెన్ ఆఠదు కళ్లం దగ్గరకు వారు వెళ్లారు. ఆ స్థలంలో వారు ఇశ్రాయేలు నిమిత్తం భూస్థాపన క్రమాలు దీర్ఘంగా జరిగించారు. ఆ భూస్థాపన క్రమం ఏడు రోజులపాటు కొనసాగింది.

11 గోరెన్ ఆఠదులో జరిగిన భూస్థాపన క్రమాన్ని కనానులో నివసిస్తున్న ప్రజలు చూశారు. వారు “ఆ ఈజిప్టు వాళ్లు ఎంతగా దుఃఖిస్తున్నారో అని చెప్పుకొన్నారు” కనుక ఆ స్థలం ఇప్పుడు ఆబేల్ మిస్రాయిము అని పిలువబడుతుంది.

12 కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేసారు.

13 వారు అతని శరీరాన్ని కనానుకు తీసుకొని వెళ్లి, మక్ఫేలా గుహలో దానిని పాతిపెట్టారు. హిత్తీయుడగు ఎఫ్రోను దగ్గర అబ్రహాము కొన్న పొలంలోని మమ్రే సమీపాన ఉన్న గుహ ఇది. సమాధిస్థలంగా ఉపయోగించేందుకు అబ్రహాము ఆ గుహను కొన్నాడు.

14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత, అతనూ, అతనితో ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి ఈజిప్టు వెళ్లిపోయారు.

15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు.

16 కనుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం పంపించారు నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు.

17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం. యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేసాడు.

18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.

19 అప్పుడు యోపేసు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు.

20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు.

21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగించింది.

22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు.

23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.

24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబలకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.

25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.

26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు.