1

1

యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

2

ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹

3 మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్రమత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరునులేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹

4 నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవతయొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.౹

5 మిద్దెలమీద ఎక్కి ఆకాశసమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలుదేవత తమకు రాజను దాని నామమునుబట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.౹

6 యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.

7

ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.౹

8 యెహోవా యేర్పరచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.౹

9 మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును.౹

10 ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదనశబ్దమును, పట్టణపు దిగువభాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.౹

11 కనానీయులందరు నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.౹

12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై–యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.౹

13 వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.౹

14 యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.౹

15 ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ము దినము.౹

16 ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.౹

17 జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును.౹

18 యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.

2

1

సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది.౹

2 విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.౹

3 దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు.౹

4 గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.౹

5 సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్నుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–నీయందు ఒక కాపురస్థుడైననులేకుండ నేను నిన్ను లయముచేతును.౹

6 సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.౹

7 తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమునవారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.౹

8 మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణమాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.౹

9 నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.౹

10 వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.౹

11 జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవావారికి భయంకరుడుగా ఉండును.౹

12 కూషీయులారా, మీరును నా ఖడ్గముచేత హతులవుదురు.౹

13 ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.౹

14 దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గుంపులుగా కూడును; గూడబాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కనుపించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును.౹

15 –నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. —అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గమున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.

3

1

ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.౹

2 అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.౹

3 దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.౹

4 దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతుకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు.౹

5 అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు.౹

6 నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసియున్నాను, జనములేకుండను వాటియందెవరును కాపురముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.౹

7 దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులుకలిగి శిక్షకు లోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.౹

8 కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా — నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.౹

9 అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.౹

10 చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసికొని రాబడుదురు.౹

11 ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతోషించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు

12 దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండనిత్తును.౹

13 ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయములేకుండ విశ్రాంతిగలవారై అన్నపానములు పుచ్చుకొందురు;౹

14 సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.౹

15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.౹

16 ఆ దినమున జనులు మీతో ఇట్లందురు–యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;౹

17 నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.౹

18 నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.౹

19 ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచిపేరును కలుగజేసెదను,౹

20 ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచిపేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.